ఈనాడు -హాస్యం - వ్యంగ్యం
అంతా సంతసమే
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 20 -05 - 2009 )
'ఎలాగైతేనేం... అపరాధ పరిశోధన నవల చివరి పేజీ లాగా సాగిన ఈ ఎన్నికలైపోయాయ్... అందరూ హ్యాపీ!'
' హ్యాపీనా?! రోజా వెక్కివెక్కి ఏడ్చింది. డియస్ గుండె బరువెక్కింది. గౌడు గోడు గోడుమంటున్నాడు. తెలంగాణ భవనంకి తాళాలు పడ్డాయి. నారాయణకు బీపీ పెరిగింది. నారా వారింకా నారాజ్ గానే ఉన్నారు.. '
' ఓటమిలోనే గెలుపును చూడటం ముందు మనవాళ్ళందరూ చిరంజీవి దగ్గర నేర్చుకోవాలి! అయిదు దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పన్నెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికలయ్యాయి. అధికార పార్టీకి ఇన్ని తక్కువ సీట్లు ఎన్నడూ రాలేదు. మంత్రులింతమంది ఓడిందీ లేదు . ఒకే ఒక్కశాతం ఎక్కువొచ్చి గద్దెనెక్కు తున్నందుకే 'ఓహో జనమంతా మాకే జయహో' అనేసారని వైయస్సారు సారు తెగ సంబరపడిపోతున్నారు చూడూ.... అదీ స్పిరిట్! '
నవ్వొచ్చినా రాకపోయినా నవ్వుతూనే ఉంటే చేసిన పన్లు కూడా అలాగే అచ్చొస్తాయిరా పిచ్చి నాయనా! వరుణ దేవుణ్ని తెగ మొహమాటపెట్టి తన పార్టీలోకి లాక్కు న్నాడా! కమ్యూనిస్టుల భూ పోరాటాల కన్నా... కాంగ్రెసు పెద్దల భూ ఆరాటాలే ఆయనకు ఆటొచ్చాయి. సీనియర్లెంత సీను చేసినా తెలంగాణకి చీమతలకాయంతయినా చోటు పెట్టకపోవటం చివర్లో ఎట్లా కలిసొచ్చిందో చూశావుగా! ఎంత హ్యాపీ! అబ్బాయి గెలిచాడు. అదో సంతోషం. అడొచ్చే వాళ్ళందరూ ఓడారు. అదో ఆనందం. అవే యజ్ఞాలూ పథకాలూ.... కొత్తవాటికోసం బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పనేలేదు. కేవీపీ, దేవుడే చూసుకుంటారనే ధీమా. హస్తిన హస్తంలో మూడు వేళ్ళు తనవేనని భరోసా! అందుకే చంద్ర బాబును కూడా అస్తమానం చిర్రుబుర్రు లాడకుండా 'ఛీరపుల్'గా ఉండ మనేది. నిజానికి మహాకూటమి ఓటమి చంద్రబాబు అదృష్టంరా!'
'అదెలాగ తాతయ్యా.. నువ్వస్తమానం ఇలాగే రోశయ్య లాగా విచిత్రంగా మాట్లాడతావేంటీ? '
' ఎన్నికలకు ముందే సొంత జనాలని సర్దలేక బాబుకు ఎంతిబ్బందయిందీ? నిజంగానే కూటమి గెలిచి ఉంటే తెగిందాక లాగే తెరాసా. అటూ ఇటూ తెగ లాగే కమ్యూనిస్టు లతో సీటులో ఒక సెకనైనా సుఖంగా కూర్చునే దానికుండేదా? బోలెడన్ని ఫ్రీగా ఇస్తానన్నాడు. బోడి ఫారం గేటు కోడిగుడ్డే మూడు రూపా యల ముప్పై పైసలుంది... ఎన్నని ఇస్తాడు? ఎంతమందికని ఇస్తాడు? ఈ మాంద్యం కాలంలో ఇంటింటికీ వెయ్యి రెండువేలు ఊరికే పొయ్యాలంటే రోశ య్య చెప్పినట్లు ఉద్యోగుల జీతాలన్నా కొయ్యాలి. . నకిలీ నోట్లన్నా అచ్చె య్యాలి. ఈ పాట్లు తప్పినందుకు ' హమ్మయ్య' అనుకోక మిత్రభేదం, సంధి, విగ్ర హమనుకుంటూ అందరి మీదా అలా ఆగ్రహాలెందుకూ? హాయిగా ఆనం దంగా ఉండక! కలరుటీవీలు పంచుతానన్నాడు. రోజూ ఏదో ఒక ఛానెల్లో వచ్చే చిరంజీవి సినిమాలు చూసీ, చూసీ జనాలు 'మెగాస్టారు ' వైపు మొగ్గే ప్రమాదం నుంచి ఏ దేవుడో కాపాడాడనుకోవాలి, విచారమెందుకు? సీఎం సీట్లో కూర్చున్నప్పట్నుంచీ కూలదోయాలనుకునే జనాలు క్యూలు కడతారని స్వీయా నుభవం మీద తెలిసి కుమిలిపోవటమెందుకు? దండగ! ప్రతిపక్ష నాయకుడి పోస్టుకైతే పోటీ ఉండదు. హాయిగా నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ!....నవ్వుతూ చావాలిరా!' అని పాడుకోవటం నేర్చుకోవాలి. పిక్చరు ఫ్లాపైనా ' సూపర్... హండ్రెడ్ డేస్' అంటూ మైకుల ముందు సినిమా వాళ్ళు మోసేస్తుంటారే... వాళ్ళను చూసి మార్పు తెచ్చుకోవాలి?'
అందుకేనా అత్తారూళ్ళో ఘోర పరాజయం జరిగినా మన ఘరానా అల్లుడు మర్నాడే మైకుల ముందుకొచ్చి ' అబ్బే... మాకసలేం కాలే దబ్బా! ఆటలో అరటి పండు అని ఆనందంగా బాధపడిందీ?! నేనింకా షామీర్ పేట కేంపుల ఖర్చు తప్పినందుకనుకున్నాను తాతయ్యా'
' జాతరకొచ్చే జనమంతా భక్తులు కానక్కర్లేదను సత్యం ఆల స్యంగానైనా అర్ధమైనందుకు ఆనందం. ఎన్నికల గోదారినీద టానికి గోడదూకిన పిల్లుల తోకలని నమ్ముకుంటే సగమైనా రాకుండానే బుడుంగుమని మునగటం ఖాయ మని జ్ఞానోదయమైన మోదం అది. మాస్టరుప్లాన్ మెగా ఫ్లాపయినా డష్టరు పెట్టి అంతా చెరిపేసి ఈసారి ఫస్టునుంచీ బెస్టుగా చెయ్యాలన్న మేష్టారి పాఠాలు కమ్యూనిస్టులు కూడా ఒంటపట్టించు కుంటే ఎంతానందంగా ఉంటుందీ ! అరె.. నేనేమన్నా జోకేశానా! ఎందుకా నవ్వులు..? '
'కాదు తాతయ్యా కమ్యూనిస్టుల మాటవినంగానే పొట్టచెక్కలయ్యేలాగా నవ్వొచ్చింది. అంతేలే! ఈసారీ ఎన్నికలాటలో లాస్టునుంచీ ఫస్టొచ్చింది ఆ కమ్యూనిస్టులే గదా! ఒబామానే కాదు... జనం కూడా వాళ్ళను వద్దనేశారా ? కొండనాలుక ఉన్న నాలుకక్కూ చేటయింది .. పాపం ! '
' పోనీలేరా! ఇంచక్కా మరో చారిత్రక తప్పిదం చేసే లక్కీ ఛాన్‌సొచ్చింది గదా! అక్కరకురాని పోరు, మొక్కిన వరమీని ఓటరు, తానెక్కిన జారిన సైకిలు, ఠక్కున విడువంగ వలదు బ్రదరా' అని వాళ్ళెప్పుడో ఫిక్సైపోయారు గదరా! వచ్చిన చిక్కల్లా ఇప్పుడు తెరాస పంచాయితీతోనే!'
'పోనీలే తాతయ్యా! ఆ ఎకసెక్కాలెందుగ్గానీ తెలంగాణ భవనంలో వాళ్ళు హాయిగా తాళాలేసుక్కూర్చున్నారు. ప్రస్తుతానికి ఏ బొంతపురుగునూ, కుష్ఠురో గినీ కావలించుకునే రొష్టు తప్పినందుకు లోపం గంతులు వేస్తున్నారు . ఎవ ర్నయినా సరే వంద కిలోమీటర్ల కింద బొందపెట్టాలంటే ఎంత కష్టం?! ఆ రోష్టు తప్పినందుకు తెరాసావారికి తెగ హ్యాపీగానే ఉంటుందనుకుంటా తాతయ్యా! '
'అందువల్ల... అందరూ హ్యాపీస్ అన్న మాట! దత్తన్నకి మళ్ళీ సారకాశంగా ఉత్తరాలు రాసుకునే అవకాశం వచ్చింది హ్యాపీ: జనం గెలిచినందుకు జేపీ హ్యాపీ! జేపీ గెలిచినందుకు నాలాంటి జనం హ్యాపీ ! వామపక్షాలు ఓడినందుకు ఒబామా హ్యాపీ! చిరంజీవి సగం ఓడి నందుకు జీవితా రాజశేఖర్లు సంపూర్ణంగా హ్యాపీ! డీయస్ ఓడినందుకు వైయస్ లోలోపల హ్యాపీ! డీయన్సీ అభ్యర్థులు హ్యాపీ.. రియల్ ఎస్టేటు ఓనర్లు హ్యాపీ. సెన్సెక్సు హ్యాపీ..
'అధికార పార్టీకి ఓటరు అవకాశం ఇస్తూనే దాని బలం తగ్గించి ప్రతిపక్షం బలం పెంచినందుకు అయామాల్స్ హ్యాపీనే తాతయ్యా! '
' రెండు నెలల నుంచీ స్తంభించిన పాలన ఎట్లాగో మళ్ళీ పట్టాలెక్కుతున్నందుకు అందరూ హ్యాపీసే గానీ... మొత్తానికి మేన్ ' ఆఫ్ ది మ్యాచ్' వైయస్ అయితే' మేన్ ఆఫ్ ది మిస్ మ్యాచ్ ఎవర్రా మనవడా?'
' అయితే కేసీఆర్... కాకుంటే దేవేందర్ గౌడ్'
- రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 20 -05 - 2009 )
No comments:
Post a Comment