Friday, December 17, 2021

ఈనాడు - సంపాదకీయం సమజీవన సౌభాగ్యం - రచన- కర్లపాలెం హనుమంతరావు ( ప్రచురితం - 08 -07 - 2012 )

 


ఈనాడు - సంపాదకీయం 

సమజీవన సౌభాగ్యం

- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ప్రచురితం - 08 -07 - 2012 ) 


క్షీరసాగర మథనసారంగా దక్కిన మధుర రసం అసురులకు ఒక్క చుక్క దక్కకుండా మొత్తం అమరసంఘానికే ధారపోసిన హరి- ఆ 'మాయ'కోసం ఆశ్రయించిన వేషం జగన్మోహినీ అవతారం.  బొమ్మ పెళ్లిళ్లకు కూడా పోనొల్లని బేల సత్యభామ నరకాసురునితో సమరానికని 'వీర శృంగార భయరౌద్ర విస్మయములు/ గలసి భామిని యయ్యెనో కాక యనగ ' తయారయింది! ఆడామగా తేడా ఏముంది... పనులు చక్కబడటం ముఖ్యంగానీ! 'రామ' అంటే సీత అని కూడా అర్ధం. 'అన్యూహిమయా భాస్కరస్య ప్రభాయథా- సూర్యునికి వెలుగులా నాకు సీత 'వేరుకాదు' అని వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడే స్వయంగా చెప్పుకొన్నాడు. దాంపత్య ఔన్నత్యానికి ఇంత కన్నా గొప్ప వ్యాఖ్య ఇంకేముంటుంది! ఒకే పరమాత్మ తనను తాను రెండుగా విభజించుకున్నాడని అదే ప్రకృతి పురుష స్వరూపాలని వేదబోధ. భార్యాభర్తల అనుబంధాన్ని వాక్కు అర్ధాల బంధంగా సరిపోల్చాడు రఘువంశ కర్త కాళిదాసు. ఇల్లు చూస్తే ఇల్లాలిని చూడనక్కర్లేదని సామెత. అశోకవనంలో ఉన్న సీతమ్మ హనుమ కంటికి స్త్రీ వేషంతో ఉన్న రామయ్యలాగే కనిపించిందట. కైకేయి కోరింది శ్రీరాముడి వనవాసాన్నే అయినా సీతమ్మ  రామయ్యను అనుసరించింది. దుష్టరావణ సంహారంలో తనవంతు పాత్ర పోషిం చింది. నరకాసుర సంహారంలో సత్యభామ పాత్రా శ్రీకృష్ణుడితో సరిసమానం. 'నా పాపపుణ్యాలలో  నా భార్యకు వాటా ఉంటుందా? ' అన్న ధర్మసందేహం మహర్షి కాకముందు వాల్మీకి మనసును తొలిచింది. అది త్రేతాయుగంనాటి ముచ్చట.  పాపపుణ్యాల మాట పక్క నుంచి పనిపాటల్లో మాత్రం ఆలుమగల  పాత్ర సరిసమానం అంటున్నారు నేటి మగువలు.


'అలుమగలు అంటే ఒకరికొకరు పూరించుకునే ఖాళీలు' అంటారు ఆరుద్ర. తనది అనే గూడులేక ఆడది బతకలేదు. నాది అనే తోడులేక అతగాడు నిలువలేడు . 'మనువు' అంటేనే రెండు తనువులు అనువుగా మసలుకోవడం! ఇల్లాలిగా మారిన ఇంతిని ఇల వేలుపుగా భావిస్తే పతిగా మారిన పురుషుడి ప్రతి విజయానికి తానే ఒక ప్రేరణ అవుతుంది. 'చిరునవ్వుల వరమొసగే శ్రీమతి/ శుభశకునాలే వెలిగించే హారతి' అంటారు వేటూరి. ఈనాటి వనిత శతకోటి సీతల మేలి కలబోత. సరిజత కావాలంటే మరి మగడు ఎంతమంది రాముళ్ల వడపోత కావాలి! పురుషుడికి దైవమిచ్చిన స్నేహితులెవరు? ' అని యక్షుడు అడిగిన ప్రశ్నకు యుధిష్ఠిరుడు ఇచ్చిన సమాధానం 'భార్య'. .'స్నేహం సాప్తపదీనాం' అని కుమార సంభవంలో కాళిదాసు వాక్కు.  వివాహ మహోత్సవవేళ నిర్వహించే సప్తపది తంతులో కలసి  ఏడడుగులు పడినప్పటినుంచే మొగుడూ పెళ్ళాలు కడదాకా ఒకరికొకరు తోడు, నీడగా నిలబడే స్నేహితులయ్యారు. 'దంపతులారా! కలిసి వర్తించండి! సమాన ధర్మాన్ని ఆచ రించండి!' అంటుంది యజుర్వేదం. 'వృత్తిలో, ప్రవృత్తిలో భార్యాభ ర్తలు ఒకరికొకరు ఉత్ప్రేరకంగా నిలవాలి' అని బోధించడానికి వేదాలు, ఉపనిషత్తులే కావాలా? ఒంటిచేయి ఊపితే చప్పట్లు మోగవని మనకు తెలియదా! 'చెలిమి గావింపను జేరి భాషింప/కలహింస ద్రోపాడు (తోసివేయు) గలసి వర్తింప' అని ద్విపద భారతంలోనే తిమ్మయ్య సూక్తి చెప్పాడు. సంసారంలో నిన్న మొన్నటి దాకా మగవాడి దృష్టిలో  మగువ ' కార్యేషు దాసి... శయనేషు రంభ!... కాలం మారింది. ఒంటెద్దులా సంసార వాహనం  ఒక్కరే లాగడం ఇక కుదరదు అంటున్నారు కొత్తతరం భార్యలు.


వాహనం  నడక సవ్యంగా సాగాలంటే బండికి రెండు చక్రాల్లా భార్యాభర్తలిద్దరూ సమన్వయంతో సాగాల్సిందే! త్వమే వాహం- నువ్వే నేననే భావన తప్ప అహంకారానికి తావులేని వ్యవహారం సంసారం. 'కుడి యెడమ భేదమున్నది పడతికి బురు/షు నకు... కత్తి కతడర్హుడగు; సూడి గరిటెలకు సమర్హమగు నీమె' అన్నది కాలం చెల్లిన వాదన. 'ఇంటాబయటా ఇద్దరిదీ సమవాటా' అనేదే ప్రస్తుతం చెల్లుబాటయే మాట . నరకాసుర వధానంతరం పద హారు వేలమంది స్త్రీలను పరిణయమాడిన శ్రీహరి అన్ని సంసారాలను ఎలా నిభాయించుకొస్తున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు నారదుడు. 'ఒకచో సంధ్యావందనం, ఒకచో పురాణపఠనం, ఒకదెస స్నానపానాదులు, మరో దిశ భూగోదానాదులు, ఒక ఇంట ఆట పాటలు, మరో ఇంట విందు విశ్రాంతులు'గా సాగుతోందట గోవిం దుడి లీలావినోదం. 'ఎలా సాధ్యం' అన్న ముని సందేహానికి 'లోకాలకు మేలు చేకూరాలన్న సంకల్పం కలగాలేగానీ... సమయమూ, సంయమనమూ స్వయంగా సమన్వయమైపోవా!' అన్నది పరంధాముడి సమాధానం. లోకాలదాకా ఎందుకు... సొంత సంసారాన్ని చక్కబెట్టుకునేందుకు మరి నేటి మగవాడు కొంతైనా చొరవ చూపాలిగదా! 'పనిలో భర్త భాగస్వామ్యం భార్య మానసిక ఒత్తిడిని గణ నీయంగా తగ్గిస్తుంది' అంటున్నారు స్త్రీలమీద పరిశోధనలు చేసే అంతర్జాతీయ కేంద్ర పరిశోధకులు. వారి ఆసియా ప్రాంతీయ న్యూఢిల్లీ విభాగం వెల్లడించిన తాజా సర్వే గణాంకాల ప్రకారం ఇంటిపనుల్లో భార్యకు సంపూర్ణ సహకారం అందించే పురుషులు నూటికి పదహారుమంది. గృహకృత్యాల్లో తమది ఇంకెంతమాత్రం 'అతిథి పాత్ర'  కాదని గుర్తిస్తున్న భర్తల శాతమూ గణనీయంగా పెరుగుతోందంటున్నాడు సర్వే బృందనాయకుడు రవివర్మ. 'శీత గాలి వీచినప్పుడు లేత ఎండలా/ఎండ కన్ను సోకినప్పుడు మంచు కొండలా' ఒకరికొకరు అండగా ఉండే ఇల్లు ఆదిదంపతుల విలాసం కైలాసంగా మారిపోదా! సమజీవన సౌభాగ్యానికి శ్రమ విభజనే మూలమన్న సత్యాన్ని మగవారిప్పటికైనా గుర్తించడం మగువలకు మహదానందం కలిగించకుండా ఉంటుందా!


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ప్రచురితం - 08 -07 - 2012 ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...