ఈనాడు - గల్పిక' వూల్యం - హాస్యం
త్యాగమూర్తివమ్మా!
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - తేదీ తెలియదు )
అసమాన త్యాగ నిరతులు కోసం పోటీ పెడితే ' టాప్ ఆఫ్ ది టాప్ టె న్ ' లో ఉండాల్సిందెవరో తెలుసా? '
' తండ్రి మాటకోసం రాజ్యాన్నొదిలి అరణ్యాలకు వెళ్ళిన శ్రీరామచంద్రుడా? '
' పురాణాల కాలాన్నొదిలేయ్. శిబి, దధీచి, దానవీరకర్ణుళ్లాంటి వాళ్లు ఆ కాలాల్లో చాలా మందున్నా ర్లే! కలికాలం సంగతి చెప్పు! '
' దేశం కోసం సమస్తాన్ని వదులుకున్న గాంధీజీని మించిన వాళ్లెవరున్నారబ్బా! '
' రైటేగానీ... రైట్ టైమ్ లో ఆయనగారు నెహ్రూ ప్రధాని పదవి కావాలని పట్టుపట్టాడే!'
' అయితే మొన్నటి మన జయ్ ప్రకాష్ నారాయణ్ కరక్టయిన కేండిడేట్'
' కాదనటానికి లేదు కానీ... అంతకన్నా రెట్టింపు అర్హతలున్నవాళ్లు ఇంకోరున్నప్పుడు టాపెస్టుగా ఈ పేరు చెప్పటం బెస్టు అనిపించుకోదయ్యా'
' క్విజ్ మానేసి క్విక్ గా నీ మనసులో నలుగుతున్న ముక్కేమిటో కక్కేయరాదా! పోనీ... ప్రజలకోసం ప్రాణాలైనా తృణప్రాయంగా ఇచ్చేందుకు సదా సిద్ధమని ప్రకటనలిచ్చే వైయస్ కీ, చంద్రబాబుకూ చెరిసగం పంచేస్తే.. '
'సాటి మహిళ కేశత్యాగం చేస్తానన్నం దుకే క్లేశపడి ప్రధానమైన ప్రధాని పదవిని 'కేశవాయనమః' అని వదిలేసుకున్న ఓ త్యాగశీలి మన మానవ మాత్రులమధ్యే తిరుగుతుండటం గమనించుంటే నీకే అనుమానం వచ్చి ఉండేదే కాదుగా... మిత్రమా!'
' నిజమే సుమా! త్యాగమంటె ఆమెదే ! '
'నాకనిపిస్తోంది.. రెండుసార్లు పదవీ త్యాగాలు చేసిన ఆ భూలోక దేవత ముందు... నీ శ్రీ రామ చంద్రుల వారైనా బలాదూర్. రాజ్యం ఇలాంటి పూజ్యుల చేత పరిపాలింపబడుతున్నంత కాలం ధర్మదేవత నాలుక్కాళ్ల మీద ఏమిటి.. నలభై కాళ్లమీద పరిగెత్తుకు తీరాలి... తప్పదు'
' పరిటాల హత్యకేసులో హంతకులు క్యూలు కట్టి మరీ లొంగిపోతున్నారంటే ఇందుకేనా మరి! వర్షాలు పడటానికి ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి మేఘమధనాలు చేయటం వృథా కదా! ధర్మం మరీ ఎక్కువైతే మును పటిలాగా మళ్ళీ సునామీలు ముంచుకొస్తాయేమో! '
పూర్వం మున్యాశ్రమాల్లో పులులూ, మేకలూ ఒకే మడుగులో కలిసి ఆడుకొనేవని చందమామ కథలూ చదువుకున్నాం .. నానమ్మ తాతయ్యలు చెబితే విన్నాం. మన చల్లని తల్లి పాలనవల్ల మళ్ళీ మొన్న
మన అన్నలూ, పోలీసులూ అన్నేసి రోజులు అతిథి గృహాలలో అలా కలిసిమెలిసి ఉన్నారు... అన్నీ త్యాగ మయి మహిళామతల్లి మహిమవల్లే నంటావా!'
' సందేహమెందుకూ?... నక్సలైట్లు బేషరతుగా లొంగిపోతున్నా, వీరప్పన్ విజయ్ కుమారుకు దొరికి చచ్చినా, సానియా మీర్జా దర్జాగా టెన్నిస్ ఆడి గెలుచు కొస్తున్నా. శంకర్ దాదా వందరోజులు పైగా ఆడిందం టున్నా.. అన్నీ.. అన్నీ ఆ త్యాగమూర్తి స్ఫూర్తితో జరు గుతున్న సంఘటనలే'
' ఐసీ... ! మరి ఆమె ఏదో ఏఐసీసీకి మాత్రమే అధ్యక్షురాలని కదా టాక్! ఈ బాదరాయణ సంబంధం అర్ధం కాకుండా ఉందే !'
'జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తుంటావా! ఆదేశాలు ఇచ్చే సూపర్ బాస్ ఫేసు ఆఖరినిమిషం దాకా కనిపిస్తుందా! అయినా కథలో తిరిగే మలుపులు అన్నిం టికీ మూలం అతగాడేగా ! గాడ్ మాత్రం కనిపిస్తు న్నాడా? ఐనా ఈ సమస్త చరాచర సృష్టినంతా నడి పించేదీ అతగాడేగా ! దైవానికన్నా ఎక్కువయిన మన నాయకామణి అదృశ్యమానంగానే ప్రజాస్వామ్యాన్ని పరిర క్షిస్తున్నది. కాబట్టే ఆఖరి నిమిషంలోసోరెన్ అలా తప్పుకోవలసి వచ్చింది.'
'ఏందో..! రామనామం వినగానే ముసలి శబరికీ శక్తి కిక్కు వచ్చినట్లు... సోనిమమ్మ పేరుకే కొంతమందికి ఎక్కడ లేని పూనకాతన్నుకొచ్చేస్తుంటాయ్ . మరామె దేవతలకే దేవత కదా! రాముని మించిన దేవుడు కదా! గాంధీజీని మించింన గాంధీ గదా సోనియాగాంధీ! మరి ఎప్పటి ఉప్పు ' దండి వ్యవహారాలకో ఇప్పుడు మళ్ళీ ఈ ఉద్యమాల పేరడీలు ఎందుకంట.. దండగ!
'పథ్నాలుగేళ్ల వనవాసం. ఆనక పట్టాభిషికం. రాములవారూ జనాని కింకోమారు తన త్యాగగుణాలను గుర్తుకు తెద్దామని అలిని సైతం త్యాగం చేసి మరీ 'ఔరా' అనిపించాడు. ఔనా... కాదా! రామునికే తప్పలేదు రాజకీయం. మనలాంటి మామూలు మానవమాత్రుల మధ్య మెదులుతున్న పాపానికి పాపం, ఈ త్యాగమూర్తికీ అప్పుడప్పుడు ఈ తరహా ఉప్పు ఫీట్లు తప్పవు నాయనా! సందేహం తీరిందా ఇంక!
'ఇంకోటి మిగిలిపోయింది. అందరికీ వరాలిచ్చే తల్లి మరి అంతర్జాతీయ విమానాశ్రయానికి మాత్రం 'రాజీవ్ గాంధీ' పేరు పెట్టడంలో రాజీపడ్డం లేదు! ఎందుకనో అర్ధం కాదు '
' పదవే వదులుకున్న త్యాగమయి పేరు కోరుకుంటుందా! దేవుడు కానుక కావలని భక్తుడిని బతిమాలుకుంటాడా? తరచిన కొద్దీ లోతుల కెళ్లే రామాయణం లాంటిదే రాజకీయం కూడా. రామపాదుకలను మోసే ఆపరభరతులు అపారంగా ఉన్న భరతదేశం కదా మనది ! తమ దైవానికే దైవమయినవారిని స్మరించుకొంటే ' మోక్షం' మరింత లాభదాయకంగా ఉంటుంది. ఆ విశేషం లవలేశం తెలిసినా భక్తులెవరూ అంతర్జాతీయపు స్థాయిల్లో వచ్చిపడే ఇంతటి మగత్తరా సువర్ణావకాశాన్ని వదులుకుంటారా? '
' అర్ధమయింది. వీరచక్ర, పరమవీరచక్ర పంథాలో ఎవరైనా అసమాన త్యాగనిరతులకు బహుమానాలు ఇవ్వదలుచుకుంటే అందుకు ముందుగా తాంబూలం అందుకొనే అర్హత నిస్సందే హంగా మన నాయకురాలికే అని గాఢంగా నమ్ముతున్నా
ఇప్పుడు '
'గాడిలో పడ్డావ్ . బీహార్లో లాలూ పాలన పోయి నప్పుడు సృష్టిలో ఇంకేదీ శాశ్వతం కాదని నీరసప డ్డావు. కంచి గొడవలప్పుడు మంచికి స్థానం లేకుండా పోయిందని మధనపడ్డావు చూశావా.... కంచికైనా చిలుం పట్టక తప్పదేమో కానీ... భరతఖండం, అరేబియా సముద్రం, బంగాళాఖాతాలకు మధ్యన్ ఉన్నంత కాలం, 'గాంధీ' ఇంటి పేరుకున్నంత సెంటిమెంట్ హిమాల యాలకన్నా ఒక సెంటిమీటరు ఎక్కువే ఉంటుందన్న పాయింటు ఫస్టు వంటబట్టించుకో ! ఇహనైనా పద 'దండి' యాత్రకు... దండిగా మీ వాళ్లందర్నీ తోలుకుని.
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - తేదీ తెలియదు )
No comments:
Post a Comment