Monday, September 7, 2015

నాదానుసంధానం- సాహిత్య వ్యాసం

శబ్దానికి అభిధ, లక్షణ, వ్యంజన అనే మూడు అర్థశక్తులు ఉన్నాయని ద్వన్యాలంకారశాస్త్రం  చెబుతోంది. శక్తులవల్ల విషయాలను, భావాలను బట్వాడా చేయవచ్చు. శ్రోతల మనసుల్లో తదనుగుణమైన వికారాలను(feelings)కలిగించవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలామందికి తెలియని విషయం ఇంకోటుంది. శబ్దంలో  మరో ముఖ్యమైన శక్తీ దాగుంది. నాదశక్తి. మిగతా అర్థశక్తులతో కలగలిపేసి దీన్ని అర్థం చేసుకునే పొరపాటు చేస్తున్నాం. కనకనే మన అవగాహనలో కావాల్సినంత అయోమయం.

యాబర్ క్రోంబీ అనే ఆంగ్ల విమర్శకుడు 'బేర్' అన్న పదం ఉచ్చారణలోనే ఒక రకమైన భీతి ఉందన్నాడు. తన వాదనకు వత్తాసుగా ఒక కట్టు కథా చెప్పాడు. ఆదాము,అవ్వ సృష్టి మొదట్లో కంటికి కనిపించే జంతుజాలాన్నింటినీ విడివిడిగా గుర్తు పెట్టుకోవటానికి వీలుగా  రకానికి ఒక పేరు పెట్టుకోవాలనుకున్నార్ట. ఆదాము  జంతువులనన్నింటినీ ఒక దొడ్లోకి తోలి ఒక్కొక్క దాన్నే బయటికి పంపిస్తుంటే అవ్వ వాటికి తోచిన పేర్లు పెట్టే కార్యక్రమం నడిపిస్తోంది. ఆవు, మేక, గేదె... ఇలా అన్నింటికీ నామకరణాలు జరిగిపోతున్నాయి. ఎలుగుబంటి వంతొచ్చింది. 'బేర్'మందిట అవ్వ్వ. 'ఎందుకలా అరిచేసావ'ని ఆదాము అడిగితే..'ఏమో..దాని మొహం చూడగానే భయం పుట్టింది. అలా అరవాలనిపించింది' అందట అవ్వ. అలా ఎలుగుబంటికి 'బేర్' అన్న పేరే స్థిరపడిపోయిందిట.

క్రిస్టఫర్ కాడ్వెల్ చెప్పేదీ అదే. శబ్దానికి ఉండే ముఖ్యగుణాల్లో మొదటిది అర్థం ఐతే.. రెండోది ఆ శబ్దోచ్చారణ వల్ల శ్రోతలో కలిగే స్పందన. ఆయన సిద్ధాంతం ప్రకారం అయ్య, నాన్న, తండ్రి, అప్ప, అబ్బ, బాబు, అమ్మమొగుడు.. అన్నీ సమానార్థకాలే ఐనా అవి పలుకుతున్నప్పుడు  మన మనసుల్లో పుట్టించే స్పందనలు మాత్రం వేరు వేరు. నాదశక్తిలోని  తారతమ్యాన్నిసరిగ్గా  అర్థం చేసుకోగలిగినవాడే షెల్లీ లాగా మంచి కవి కాగలిగేది. ఇంగ్లీషు ఒక్క ముక్కా రాని ఒక పల్లెటూరు బైతు దగ్గరికెళ్ళి
"Water water everywhere
Not a drop to drink"
 అన్న పద్యాన్నిగడగడ చదివి వినిపించి 'ఏమనిపించింద'ని అడిగాట్ట కాడ్వెల్ ఒక సారి. "దేనికో తెలీదు కానీ మొత్తానికి నువ్వు ఎందుకో బాగా ఇబ్బంది పడుతున్నావనిపిస్తోంది సామీ!"  అని బదులిచ్చాట్ట ఆ బైతు.  నాదమాహాత్మం అంటే అదే మరి. జయదేవుడి గీతగోవిందంలోని ప్రధాన ఆకర్షణ ఈ నాదశక్తే. 'సావిరహే తవ దీనా రాధా... ప్రియే! చారుశీలే! ...ధీర సమీరే యమునాతీరే' .. ఇలా అష్టపదుల్లోని పదాలన్నింటికీ మనకు అర్థం తెలీకపోయినా ఆ పాదాల్లోని  ఏదో అనిర్వచనీయ శక్తి మన మనసుల్నిఅలా అలా నీలిమేఘాల్లో తేలిపోయేటట్లు చేస్తుందా  లేదాఅదే నాదాకర్షణ. కవి అన్నవాడు ముందు చేయాల్సింది ఈ నాదోపాసనే.

అంటే జయభేరి చిత్రంలో ఎన్ టీ ఆర్ లాగా ఘంటసాల వారి కంఠంతో 'శివశంకరీ' అని జపించడం కాదు. ముందు తరాల నాద ప్రముఖుల సృజనల్లో శబ్దం ఏఏ సందర్భాల్లో ఎలా పలుకుతూ రసోద్భవానికి దోహదం చేసిందో పరిశీలన దృష్టితో అధ్యయనం చేయడం. కుండలు చేసే కుమ్మరికి మన్నులోని తేడాలు అర్థమైతేనే కదా శ్రేష్టమైన కళాఖండాలని సృష్టించటమెలాగో తెలిసేది!
తెలుగు సాహిత్యంలో  ఇలాంటి నాదోపాసన చేసి సంపూర్ణంగా విజయం సాధించిన ప్రముఖుడు  కవిబ్రహ్మ తిక్కన. నన్నయగారి  శబ్దానికి నాదశక్తి పరిమితమే అంటే ఆయన  అభిమానుల   నొచ్చుకుంటారేమో. 'అదేంటీ.. నన్నయగారి  పద్యం  నల్లేరుమీద బండిలాగా హాయిగానే నడుస్తుందికదా!' అని ఎవరైనా కన్నెర్ర చేయవచ్చు. 'సంగీతజ్ఞానంతో సంబంధం లేని నడకది'.. అనేదే సమాదానం.
అర్థాన్ని అర్ద్వాన్నపు అడవిలో వదిలేసి .. కేవలం లయ కోసమే పాకులాడాలా? అని నిలదీసేవాళ్ళకు…అలా చేస్తే కవిత్వానికి ఎలాంటి వికారపు రూపు రేఖలొస్తాయో … 'ప్రతీకవాద కవులు' 'సర్రియలిస్టు కవులు'  మనకు ప్రయోగాలు చేసి మరీ చూపించారు కదా ఇటీవలి శతాబ్దాల్లోనే!  -అని సమాధానం. నాదం ద్వారా మాత్రమే రససిద్ధిని సాధించడానికి నానారకాల శబ్దాలను సందర్భశుద్ధికి అతీతంగా పోగేస్తే.. జామ్సు జాయిస్  'యులిసిస్' కి అప్పచెల్లెళ్ళను పుట్టించవచ్చేమో తప్ప  అసలైన గొప్ప కవిత్వాన్ని సృష్టించలేం.
కవిబ్రహ్మ అర్థవంతమైన శబ్దాల నాదశక్తిని అత్యద్భుతంగా వాడతాడని చెప్పుకున్నాం గదా! ఉదాహరణగా ఇది చూడండిః
'దుర్వారోద్యమ బాహు విక్రమరసాస్తోక ప్రతాపస్ఫుర
ద్గర్వాంధప్రతివీరనిర్మచనవి- ద్యాపారగుల్ మత్పుతుల్
గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దో -ర్లీలన్ వెసంగిట్టి….'
నిండుసభామధ్యంలో పెద్దలందరి సమక్షంలో అమానుషంగా వంటిమీద బట్టల్ని వలిచేసిన  ఘాతుకానికి ఒక మానవతి తన నిరసనను అత్యంత బలంగా తెలియచేయాలంటే ఎలాంటి భాష వాడితే    వాడికి న్యాయం చేకూరుతుందీ! తిక్కన వాడిన పైపద్యంలోని పదజాలంలోని నాదశక్తిని మించిన శక్తి మనకింక్కడైనా దొరుకుతుందా! అర్థం తెలియనక్కర్లేదు. పద్యం చదువుకుని పోతుంటే చాలు ఒక సాథ్వి ఆక్రోషం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది.

విరాటపర్వంలొ గోగ్రహణం సందర్భంలో ముందుగా ప్రగల్భాలు పలికిన ఉత్తర కుమారుడు తీరా యుద్ధరంగంలో మహావాహినిని చూసి కాళ్ళు చల్లబడి బృహన్నలతో తన బేలతనాన్ని ప్రకటించుకుంటూ
'భీష్మ ద్రోణ కృపాణ ధన్వి నికరా -భీలంబు దుర్యోధన
గ్రీష్మాదిత్యపటుప్రతాప విసరా- కీర్ణంబు శస్త్రాస్త్రజా
లోష్మస్ఫారచతుర్విధోజ్జ్వలబలా- త్యుగ్రం బుదగ్రధ్వజా
ర్చిష్మత్వాకలితంబు సైన్యమిది నే- జేరంగ శక్తుండనే" అంటూ ఒక పద్యం  విసురుతాడు. పద్యంలో కవి వాడిన సామాగ్రిని చదివిన ఎవరికైనా ఉత్తర కుమారుడు ఉత్తిపుణ్యానికే జావగారి పోలేదని అర్థమవుతుంది. నాదోపాసనలో సఫలీకృతుడైన రుషికి మాత్రమే ఏ సదర్భానికి అనువుగా శబ్దం వాడితే భావం రక్తి కడుతుందో అర్థమయేది. స్తిమితంగా.. యుక్తియుక్తంగా మాట్లాడవలసిన సందర్భంలో తిక్కనగారు ఏ గడబిడలూ లేకుండా చిన్నచిన్న మాటల్తో పద్యాన్ని ఎలా నడిపిస్తారో చూడండిః
' వంశంబున కెల్ల నీవ కురు రిందెవ్వారి చందంబు లె
ట్లైవర్తిల్లిన కీడు మేలు తుది నీయం దొందెడుం గాన
ద్భావం బారసి లోనిసొత్తు వెలి వృత్తంబున్ జనస్తుత్యముల్
గావింపందగు నీక యెవ్విధమునన్ గొరవ్య వంశాగ్రణీ!'

నన్నయగారి పద్యాల్లో  వురవడి ఇలా సమయానికి అనుగుణంగా సాగదనే ఒక   అభిప్రాయం ఉంది. నిండుసభలో పాంచాలిని భంగపర్చినప్పుడు భీముడు చేసిన ప్రతిజ్ఞ సందర్భంలోని  పద్యాలనే ఉదాహరణగా తీసుకుందాం.
'ధారుణి రాజ్యసంపదమ- దంబున గోమలి గృష్ణ జూచి రం
భోరు నిజోరుదేశమున- నుండగ బిల్చిన యిద్దురాత్ము దు
ర్వార మదీయ బాహుపరి- వర్తిత దండగదాభిఘాత భ
గ్నోరుతరోరు జేయుదు సు- యోదను నుగ్ర రణాంతరంబునన్' అని భీముని శపథం.
'రంభోరు.. గదాభిఘాత భగ్నోరు' అనే పదాల్లో మినహాయించి  భీముని మాటల్లో ఉండాల్సిన  క్రౌర్యం, పదును ఏవీ!

భావానికి అనుగుణంగా పదాలని కదం తొక్కించే కవాతువిద్య  మళ్ళీ మనం మహాకవి
శ్రీశ్రీలో సంపూర్ణంగా చూడవచ్చు. మహాప్రస్థానం నిండా దీనికి ఉదాహరణలు కోకొల్లలు. కదం త్రొక్కుతూ, పదం పాడుతూ, హృదంత రాళంగర్జిస్తూ మరో ప్రపంచపు జలపాతాలను,దారి పొడుగునా తర్పణ చేసే గుండె నెత్తురులను, బాటలు  పేటలు   కోటలునదీనదాలు,  అడవులు, కొండదారులు, ఎడారుల్లాంటి అడ్డంకుల్నితోసిరాజనుకుంటూ  ముందుకు ముందుకు .. పైకి.. పై పైకి.. దూసుకుపోవాలంటే ఎముకలు కుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరుల వల్ల కాని పని  కనక.. వాళ్ళు చావాలనీ.. నెత్తురుమండే.. శక్తులు నిండే సైనికుల్లాంటి యువత మాత్రమే 'హరోం! హరోం హర!హర!హర!హర!హర!హరోం హరా!' అని నినాదాలిచ్చుకుంటూ ప్రభంజనంలా హోరెత్తిస్తూ వర్షుకాభ్రముల ప్రళయఘోషలా ఫెళ ఫెళా ఫెళ ఫెళా విరుచుకు పడగలరు కనక వాళ్ళే కావాలనీ.. మరోప్రపంచపు కణకణమండే త్రేతాగ్ని.. ఎగెరెగిరి పడే ఎనభై లక్షల మేరువులు, ప్రళయనాట్యం చేసే సప్త సముద్ర జలాలు, సలసల క్రాగే చమురు లాంటి ఉష్ణరక్త కాసారాలూ కనబట్టం లేదా!..  మరో ప్రపంచపు అంచుల్నుంచీ   విరామ మెరుక్కుండా  మ్రోగే  కంచు నగారా మ్రోతలు  వినిపట్టం లేదా!.. అంటూ శివసముద్రంలాగానో నయాగరాలాగానో ఉరకండురకండంటూ     ఆ మహాకవి చేసే అక్షరజ్వాలాక్రందనాలు.. ఈనాటికీ చదువరుల గుండెల్ని  త్రాచుల్లాగా, రేచుల్లాగా తట్టి లేపగలుగుతున్నాయంటే ఆ శక్తి మనం ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చిన నాదానిదే! శంకరభగవత్పాదులూ ఈ నాదశక్తి ప్రయోగంలో పరమ నిష్ణాతులు. దేవీస్తుతే అందుకు ప్రబలమైన సాక్ష్యం.
మనుచరిత్రలో అల్లసాని పెద్దనగారూ రెండో ఆశ్వాసంలో ప్రవరాఖ్యుడి కళ్ళతో మనకు హిమవనుల కమనీయమైన అందచందాలను.. చూపించడానికి  ఈ నాదశక్తినే తోడు తెచ్చుకునే ప్రయత్నం చేశారు.

"……………………………..-అంబరచుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠ -భంగతరంగ మృదంగ నిస్వన
స్ఫుటనట నానురూప సరి-ఫుల్లకలాప కలాపి జాలమున్-
కటకచరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్"
ఎత్తుమీదనుండి పడి రాళ్ళమీదుగా.. మధ్యగా హొయలు పోతూ ప్రవహించే సెలయేటి సోయగాలను  అల్లసానివారు అర్థశక్తితో కాకుండా నాదశక్తితో అభివ్యక్తీకరించటం ఇక్కడ చేసిన ప్రయత్నమే చెబుతుంది. శబ్దంలోని  అంతర్లీనంగా  ఒదిగున్న నాదశక్తి సామర్థ్యం ఎంత
ఎవరు ఎన్నైనా చెప్పండి.. ఎంత అద్భుతమైన భావమైనా చదువరి హృదయపీఠంమీద    పదికాలాలపాటు తిష్ఠవేసుకోవాలంటే ఆ భావానికి ఒక్క కుసుమకోమలమైన అర్థమొక్కటే సరిపోదు.. పదే పదే స్మరించుకుంటో పరవశం పొందేందుకు పరిమళ సమానమైన నాదానుభూతీ తప్పనిసరి.   భావానికుండాల్సిన  ఆ పరిమళానుభూతి  పేరే 'నాదశక్తి'.

ప్రసిద్దిపొందిన ఏ కవి కృతిని శ్రద్ధగా పరిశీలించినా .. భావానికి తగిన అర్థంతో పాటు.. హృదయానికి హత్తుకునే ఒక నాదశక్తీ అంతర్గతంగా ఏదో ఒక మోతాదులో ఉండి తీరుతుందని అర్థమవుతుంది. అలా లేని పక్షంలో ఆ పదజాలం కేవలం వచనం అవుతుందేమో కాని.. ఎన్నటికీ కవనం  మాత్రం  కానేరదు.   

ఉత్తమకవిత్వానికి  భావార్థాలే  ప్రధానమన్న వాదనకి ఎదురులేదు కానీ.. ఎంత కాదనుకున్నా భావాల వ్యక్తీకరణకి పదాలే అనివార్యమైన వాహకాలైన కారణంగా ఆ పదాల పొహళింపులోని నైపుణ్యాన్ని ఆకళింపు చేసుకొంటేనేగానీ  సందర్భోచిత శబ్దప్రయోగం అనే రసవిద్య పట్టుపడదు. నాదశక్తిని మిగతా అర్థశక్తులతో కలగలిపేసి అర్థం చేసుకునే పొరపాటును ఇప్పటికైనా గ్రహిద్దాం.  సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. కనీసం  కొత్తతరం కవులన్నాఈ నాదోపాసన వైపు దృష్టి మళ్ళించకపోతే కవిత్వంలోని ఈ అయోమయం ఇంకా ఇలాగే కొనసాగటం ఖాయం.
-కర్లపాలెం హనుమంత రావు
***




Sunday, September 6, 2015

(ఇం)ప్యూర్లీ పాలిటిక్స్!- కొన్ని చురకలు






రత్నగర్భ నాదేశం
గర్భాదానమే
అక్రమంగా జరిగిపోయింది!
*
‘2-జీఒక వేలం’ వెర్రి
బొగ్గు’
ఆ వేలంకూడా లేని వెర్రి
*

డొక్కు బస్సుల్లో రాజులు
బుగ్గ కార్లలో బంటులు
ప్రజలే కదా మరి
ప్రజాస్వామ్యంలో రాజులు!
ప్రజాప్రతినిధులు వారి బంటులు!
*
బొమ్మ- న్యాయం
బొరుసు- అన్యాయం
రెండూ బొరుసులే ఉన్న నాణెం
-రాజకీయం
*
నల్లధనం-
ఏ కనిపించని  నాలుగో సింహం
నోట్లోనో!
*
మంత్రివర్యా… తిన్నంగుండు!
తప్పుతుంది
తిరుపతి గుండు!
*
రైతు దేశానికి
వెన్నెముక.. సరే!
ఆ వెన్నెముకలేని
పాలనా  ప్రభువులది!
*
ఓబులాపురం గనులకేసు-
'గాలి'తోచేసే యుద్ధం!
*
వాన కావాలా!
వరుణయాగం ఎందుకు
ఉప్పల్ గ్రౌండ్లో
క్రికెట్ ఆడించు!
*
విద్యుత్
రిలయన్స్ గాలికి
పెట్టిన దీపం!
*
కరువు
భక్తుల రాక తగ్గింది
భగవంతుడూ వర్షాలకోసం
ప్రార్థిస్తున్నాడు!
*
తివిరి
ఇసుమున
తైలంబు’ తీయవచ్చు!

-కర్లపాలెం హనుమంతరావు

Saturday, September 5, 2015

కర్పూరం- కథానిక- ఆంధ్రభూమి- వారపత్రిక- 17 సెప్టెంబరు 2015

 కథానిక : 

కర్పూరం 

రచనః కర్లపాలెం హనుమంతరావు

 

(ఆంధ్రభూమివారపత్రిక- 17 సెప్టెంబరు 2015 నాటి సంచికలో ప్రచురితం)

 

 

అయినవాళ్ళందరికి కబుర్లు వెళ్ళాయికొడుకులూ కోడళ్ళూకూతుళ్ళూ అల్లుళ్ళూసంతానంతోసహా అంతా వచ్చేసారుఇంట్లో ఒహటేహడావుడి.

సుందరమూర్తే బెడ్ మీద పడున్నాడు అచేతనంగాకానీ అతని మనసుమాత్రం  పనిచేస్తోంది..  ఎప్పటికన్నా చురుకుగా!

 

పక్కగదిలో అందరూ ఏదో 'పారాయణం'లో ఉన్నట్లున్నారునవ్వులుచలోక్తులు జోరుగా వినపడుతున్నాయి.

'అయితే ఓడిన పార్టీ గెలిచిన పార్టీని సినిమాకు తీసుకెళ్ళాలిరా.. అదీ పందెం అంటున్నాడు పెద్దకొడుకు.

'వట్టి సినిమానేనాడిన్నరుకూడా ఉండాలి.. అప్పుడే మజా'  పెద్దల్లుడి వంత.

'బావగారి చూపెప్పుడూ మీల్సుప్లేటుమీదే!' చిన్నకూతురు కౌంటరుఅందరూ విరగబడి నవ్వుకోవడాలు.

ఇవతల గదిలో సుందరమూర్తి మాత్రం మూతిమీద వాలిన ఈగను తోలుకోలేక తంటాలు పడుతున్నాడుఒహటే దురదతోలుకొనేందుకుచేతులు లేవుఅవి రెండువారాల కిందట జరిగిన బండిప్రమాదంలో నజ్జునజ్జయిపోయాయి.

అసలు ప్రాణానికే ప్రమాదం అన్నారు ముందు పెద్దాసుపత్రి వైద్యులుఆనక 'చేతుల వరకు  తీసేస్తే ప్రాణానికి కొంతవరకు భరోసాఇవ్వచ్చుఅని తేల్చారు. ‘యాంప్యుటేషన్ అంటే మాటలామూటలతో పనికానీ!

సుందరమూర్తి చేసేదేమీ సర్కారుద్యోగం కాదుఏదో ప్రైవేట్ పుగాకు కంపెనీలో అకౌంటెంటు. ‘యాక్సిడెంటయింది ఆదివారం డ్యూటీ-ఆఫ్లో ఉన్నప్పుడు కాబట్టి  రూల్సు ప్రకారం  ముట్టేదేమీ లేదు పొమ్మన్నారు కంపెనీవాళ్ళునెలనెలా

 

జీతంలోనుంచి దాచుకొంటున్న పిఎఫ్ కూడా ఆడపిల్లల పెళ్ళిళ్ళకని చేసిన అప్పులకే చెల్లిపోతోందిపెళ్లాం మెళ్ళో వేళ్ళాడే పుస్తెలుమినహా మరేమీ మిగల్లేదు ఇంట్లో.. ఇన్నాళ్ల పిల్లల చదువులుపెళ్ళిళ్ల తంతులన్నీ ముగిసాక.

అప్పట్లో సుందరమూర్తి అన్ని పాట్లు అట్లా పడబట్టే.. ఇవాళ పెద్దాడు ఇన్ కమ్ టాక్సు ఆఫీసురుగా  కుదురుకొన్నదిచిన్నాడుబ్యాంకాఫీసరు కాగలిగిందిఉండటానికి సొంత నీడంటూ ప్రస్తుతానికి మిగలక పోతేనేమి.. ఇద్దరు కూతుళ్ళకూ కుదురైన అత్తారిళ్ళుకుదిరిపోయాయి. ‘ఆఖరివాడి విషయంలోనే కాస్త అన్యాయం జరిగిందిటొబోకో బోర్డులో వేయించగలిగాడుగానీ.. అది అన్నలకు మల్లేఅధికార హోదాకలది కాదు.  నాలుగు డబ్బులు చేతుల్లో ఆడుతుంటే చివరాడికి మాత్రం  చిన్నగుమాస్తాగిరీతో సరిపెట్టేవాడినా!' అనిమధన పడుతుంటాడెప్పుడూ సుందరమూర్తి ఒంటరిగా ఉన్నప్పుడు కారణంగా వాడికి తనమేదెంత కోపమో తలుచుకునితలుచుకొని అపరాథభావంతో కుంగిపోవడం సుందరమూర్తి బలహీనత.

తండ్రీ బిడ్డలకీ విషయం మూలకంగా అంతగా మాటలు  లేవు.

తనకిలా యాక్సిడెంటయిందని అందరితో పాటూ కబురెళ్ళినా..  చివరోడు తీరిగ్గా ఆఖర్లో మాత్రమే  ఎందుకొచ్చాడో తనకు తెలుసువచ్చిఒక్కరోజైనా కాకుండానే 'సెలవుల్లేవు.. అర్జంటు పన్లున్నాయ'ని పెట్టేబేడా ఎందుకు సర్దుకుంటున్నాడో కూడా తనకు తెలుసు దీర్ఘంగానిటూర్చాడు సుందరమూర్తి.

గంటక్రితం అదే గదిలో కుటంబసభ్యులమధ్య జరిగిన సంభాషణలు గుర్తుకొచ్చాయి సుందరమూర్తికి.

'నాన్నగారి ఆపరేషనుకి తలా కొంత ఇచ్చుకోవాలిరా!' అని అడిగింది సుందరమూర్తి భార్య సుగుణమ్మ.. అందరికీ కాఫీలు అందిస్తూ.

అరె సంగతి ముందే చెప్పాలి కదమ్మాపోయిన్నెల్లోనే పెద్దాడి కాలేజీ సీటుకోసమని ఐదు లక్షలు అప్పు తీసుకొచ్చాను బ్యాంకునుంచిమళ్లీ అంత సొమ్మంటే మా ఆఫీసురూల్సు ఒప్పుకోవుఅనేసాడు పెద్దాడు వెంటనేముం'దే తయారు చేసిపెట్టుకున్నట్లుంది అతగాడా  స్పందించిన తీరు చూస్తుంటే!

సుందరమూర్తికి నవ్వొంచ్చింది అంత బాధలోనూ. 'నాన్నా!పోయిన్నెల్లోనే నువ్వెందుకు చేతులు పోగొట్టుకోలేదు?' అనిఆడిగినట్లనిపించిందిఅయినా పెద్దాడి తత్వం తనకేమన్నా కొత్తా! 'వాడిప్పుడు అచ్చంగా వాళ్ల మామగారి అడుగుజాడల్లోనే కదానడుస్తున్నదీమామగారి దయవల్లే తనకు ప్రమోషనొచ్చింద'ని ఎన్ని వందల సార్లు తనముందు అనివుంటాడో!

అయినా సుగుణకు వాడిమీదే ప్రేమ జాస్తి. 'మీకులాగా కాదునా పెద్దకొడుకు బతకనేర్చినవాడుఅని గర్వంగాచెప్పుకుంటుంటుందెప్పుడూ. 'తగిన శాస్తి చేసాడు తనకిప్పుడుఅనుకున్నాడు సుందరమూర్తి మనసులో చిన్నగా నవ్వుకొంటూ.

సుగుణమ్మ వెర్రిమొహమేసుకొని రెండోవాడివంక చూసినప్పుడు వాడూ అంతకుమించిన  మహానాటకానికే తెరతీసాడుమొహంవేలాడేసుకొని 'ఇంతర్థాంతరంగా లక్షలంటే నా వల్లవుతుందానా వంతుగా  పదో.. పాతికో అంటే ఎలాగో తంటాలు పడతాగానీ!దానికీ టైము కావాలమ్మాలోనుకి అప్లై చేసిన వెంటనే సాంక్షనంటే అయే రోజులా ఇవి?' అని ముక్తాయించేసాడుఅదీ పెళ్లాం వంకబితుకు బితుకుమని చూస్తూపదికీ పాతిక్కీ కమిటయినందుకు అర్థాంగిగారు ఆనక గదిలో ఏం క్లాసు పీకుతుందోనన్న భయంకొట్టొచ్చినట్లు కనిపిస్తూనే వుంది వాడి కళ్ళల్లో.

పెద్దల్లుడే నయం. 'కొడుకులు మీరట్లా అనడం ఏం బాగోలేదోయ్మరీ అంత ఇబ్బందయితే చెప్పండిసర్దడానికి నేను రెడీఆనకమీదగ్గరున్నప్పుడే ఇద్దురుగానీఅన్నాడుకానీ వెంటనే పెద్దకూతురు అందుకోనే అందుకందిగాఅవ్వబావమరదులకుఅప్పిస్తానంటారాలోకం వింటే నవ్విపోతుందిఅయినా మీదగ్గర అంత సొమ్ము మూలుగుతున్నట్లు నాకూ తెలీదేకాలేజీకెళ్లే పిల్ల మెడబోసిగా ఉంది.. కనీసం ఒక చిన్నగొలుసైనా చేయిద్దామని ఎంతకాలంబట్టీ మొత్తుకుంటున్నానుఆప్పుడు లేదన్న డబ్బు ఇప్పుడు కొత్తగాఎక్కణ్ణుంచి పుట్టుకొచ్చిందో?!  పెళ్ళికి చెల్లాయికి అమ్మ మంచి గొలుసు చేయించి ఇచ్చిందిగదాఏమే!  అది బ్యాంకులో పెట్టినా నాన్నఅవసరాలు తీరిపోతాయిగదా .. ఇలా అమ్మావాళ్ళు అందరి కాళ్ళు..  గడ్డాలు పట్టుకొని బతిమాలేబదులు!' అంటూ సన్నాయినొక్కులుమొదలుపెట్టింది.

అనుకోకుండా గాలి తనవేపుకి తిరగడంతో వెంటనే ఎలా స్పందించాలో తోచక బిక్కమొగమేసుకుంది చిన్నకూతురుసుగుణమ్మేకలగజేసుకొని అనాల్సొచ్చింది 'కొత్తగా పెళ్లయిన పిల్లవంటిమీదకని ఇచ్చిన సొమ్మును ఎంతవసరమొస్తేమాత్రం తిరిగి తీసుకుంటామావదిలేయండింకా  టాపిక్కుని ఇక్కడితో!' అనడంతో అమ్మగన్న సంతానమంతా గమ్మునయిపోయారు. 'అమ్మయ్య పూటకీ గండంఎలాగో గడిచిపోయిందన్నసంబరమే అందరి కళ్ళల్లో కనిపిస్తున్నదిఅనుకున్నాడు సుందరమూర్తివాతావరణాన్ని తేలిక పరచడానికనితనే కలగజేసుకొన్నాడు చివరికి 'మీ ఆమ్మ పిచ్చిది.  పాతకాలం మనిషిఆమె మాటల్నేమీ పట్టించుకోకండర్రాఇక్కడున్న నాలుగురోజులుసంతోషంగా గడిపిపోండంతామళ్ళా ఎప్పుడు కలుస్తారో  ఏమో ఇట్లా అందరూపిల్లాపాపలతో మీరంతా చల్లంగా ఉండటమే మాకుకావాల్సిందిఅన్నాడు.

తరువాత తనగదిలోకి వచ్చినప్పుడు సుగుణమ్మ కన్నబిడ్డల మాటల్ని తలుచుకొని తలుచుకొని గుడ్లనీరు కుక్కుకుంటుంటే సుందరమూర్తేసర్దిచెప్పాల్సి వచ్చింది. 'వూరికే అనవసరంగా  వాళ్లని బాధ పెట్ట

దమెందుకునువ్వూ బాధ పడ్డమెందుకుఇప్పుడంత అర్జంటుగా నేనీచేతులు బాగుచేయించుకొని వరగబెట్టేది మాత్రం ఏముందిచెప్పుఎలాగూ  రిటైరవబోతుంటినిఆర్నెల్లకు  ముందే పదవీవిరమణ చేసానని సర్దిచెప్పుకొంటే సరిపోదా సుగుణా!' అంటూ.

ఎప్పుడు వచ్చాడో లక్ష్మీనారాయణ.. అంతా అప్పుడే  విన్నాడో.. సుగుణమ్మ అంతకుముందే చెప్పుకుందో.. లోపలికొచ్చి కూర్చున్నాడు. 'చూసావుగా సుందరంనేనాడే హెచ్చరించాను కాలం కుర్రసజ్జే అంతపిలల్ని మనం 'బంగారు కొండల'నుకుంటాం కొండలే విరిగినెత్తిమీద పడితే?  అయ్యో.. మన త్యాగమంతా వృథా అయిపోయిందిగదా అనుకుంటూ అల్లాడిపోతుంటాం.. ఇలాగా!' అంటూవేదాంతం మొదలుపెట్టాడు.

'పోనీలేరాకన్నందుకు పిల్లల్ని వృద్ధిలోకి తేవడంకూడా  గొప్పత్యాగమేనాపుట్టీపుట్టంగానే డొక్కల్లో తంతూ నడక నేర్పించడానికిమనమేమీ ఒంటెలం కాదుజిరాఫీలం అంతకన్నా కాదురెక్కలిరిగినప్పుడు ఆదుకుంటాయనేనా పిట్టలు గువ్వలకి నోళ్ళు పగలదీసి మరీబువ్వ పెట్టేదిమన రక్తసంబధాలు విచిత్రంగా ఉంటాయిరాకనకనే మనం మనుషులంఎవరి అదృష్టాలనిబట్టి వాళ్లకవిలభ్యమవుతాయినా అదృష్టం ఇదీదానికింకెవర్నోనిందిస్తూ కూర్చుంటే మనశ్శాంతి తిరిగొస్తుందా!. వస్తుందంటే చెప్పు.. నీ మాటేవింటాను

'సరేలేనీ వెర్రివేదాంతం నాకింతప్పట్నుంచీ తెలుసిందేగానువ్వెలాగూ వృద్ధాప్యంలో కష్టమొచ్చినప్పుడు ఇలాంటి గోతిలోనే పడతావని  ముందే తెలుసుఏడేళ్లకిందట ఇల్లు కట్టేటప్పుడు నీ దగ్గర అప్పు తీసుకున్నానుగుర్తుందా మూడు లక్షలు ఎప్పుడుతిరిగిస్తానన్నా'ఫ్రెండు దగ్గర బాకీ వసూలు చేసుకునే ద్రోహినా?' అంటూ సినిమా డైలాగులు కొట్టేవాడివి. 'కనీసం వడ్డీలేకుండానైనాతీసుకోరా దేవుడా!' అని ఎంత బ్రతిమిలాడానునీ  డబ్బుమొత్తం   రోజుల్లోనే  బ్యాంకులో వేసేసానబ్బాయ్ రికరింగ్ డిపాజిట్టుగానిన్ననేమెచూరయింది.. అదిచ్చిపోదామనే వచ్చిందిఅని డబ్బున్న సంచీ అక్కడేవున్న సుగుణమ్మ చేతిలో పెట్టేసి  'లెక్క పెట్టించు తల్లీ!మొత్తంఆరున్నర లక్ష ఉండాలిఅన్నాడు లక్ష్మీనారాయణ. 'లక్ష్మీ!ఈకెందుకురా నామీద అంత ప్రేమ?'

'నేను నీ బాల్యస్నేహితుణ్ణి కనకమరీ ముఖ్యంగా నువ్వు నా కన్నతండ్రివి కాదు కనకఅని నవ్వాడు లక్ష్మీనారాయణభోరున ఏడ్చేసాడుసుందరమూర్తిఅప్పటిదాకా అదిమిపెట్టుకొనున్న ఉద్వేగమంతా ఒక్కసారిగా కట్టలు తెంచుకొన్నట్లయింది

కాఫీ తాగి లేచివెళ్ళే సమయంలో  లక్ష్మీనారాయణని దగ్గరికి పిలిచి చెప్పాడు సందరమూర్తి 'సుగుణదగ్గరున్న  క్యాష్  మా మూడోవాడురాజుకాతాలో వేసెయ్యరావాడు చాలా రోజులబట్టీ డబ్బుకావాలని ఒహటే గోలపెడుతున్నాడుఏదో బండికొంటాట్టఅదికొనిస్తేగానివాళ్లబాసు ప్రసన్నం కాడనీ.. పైపోస్టుకి తన పేరు క్లియర్ కాదనీ మొత్తుకుంటున్నాడు చాలా రోజులబట్టీ.. పాపంతప్పేముందిలేవాడికిమాత్రం వాడి అన్నల్లకు మల్లే పెద్ద హోదాలో ఉండాలని ఎందుకుండ కూడదు మొండిచేతులు పెట్టుకొని ఇహముందుమాత్రం వాడికినేను చేసేది ఏముంటుందిప్రైవేట్ కంపెనీలో  బోడి గుమస్తాపోస్టు ఇప్పించానని కదా ఇంతకాలం  వాడికి నామీదా గుర్రు!!' అన్నాడుభార్యవైపు తిరిగి.

'మరి మీ సంగతేమిటండీ?' అని లబలబలాడింది అప్పుడే హారతిపళ్లెంతో లోపలికొచ్చిన సుగుణమ్మ.

'సుగుణా లక్ష్మీగాడు  నీకు చెప్పడానికి జంకుతున్నాడునిన్న వాడే డాక్టరుదగ్గరికి వెళ్ళొచ్చాడు 'సమయం చాలా మించిపోయిందని..ఇప్పుడు యాంప్యుటేషనంటే అసలు ప్రాణానికే ముప్పుఅని డాక్టర్లు చెబుతున్నార్టఏరా!?' అని గద్దించి అడిగాడు మిత్రుణ్ణిసుందరమూర్తి.

'అవున'నాలో.. 'కాద'నాలోతేల్చుకోలేక నీళ్ళునిండిన కళ్ళతో అలాగే నిలబడిపోతయున్నాడు లక్ష్మీనారాయణ.

సుగుణమ్మ చేతిలో వెలుగుతున్న  హారతికర్పూరం  వాసన గుప్పున అతగాడి   ముక్కుపుటాలకు సోకింది.

-రచనః కర్లపాలెం హనుమంతరావు

***

(ఆంధ్రభూమివారపత్రిక- 17 సెప్టెంబరు 2015 నాటి సంచికలో 


ప్రచురితం)







 

 

 

 

 

 

 

 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...