Monday, September 7, 2015

నాదానుసంధానం- సాహిత్య వ్యాసం

శబ్దానికి అభిధ, లక్షణ, వ్యంజన అనే మూడు అర్థశక్తులు ఉన్నాయని ద్వన్యాలంకారశాస్త్రం  చెబుతోంది. శక్తులవల్ల విషయాలను, భావాలను బట్వాడా చేయవచ్చు. శ్రోతల మనసుల్లో తదనుగుణమైన వికారాలను(feelings)కలిగించవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలామందికి తెలియని విషయం ఇంకోటుంది. శబ్దంలో  మరో ముఖ్యమైన శక్తీ దాగుంది. నాదశక్తి. మిగతా అర్థశక్తులతో కలగలిపేసి దీన్ని అర్థం చేసుకునే పొరపాటు చేస్తున్నాం. కనకనే మన అవగాహనలో కావాల్సినంత అయోమయం.

యాబర్ క్రోంబీ అనే ఆంగ్ల విమర్శకుడు 'బేర్' అన్న పదం ఉచ్చారణలోనే ఒక రకమైన భీతి ఉందన్నాడు. తన వాదనకు వత్తాసుగా ఒక కట్టు కథా చెప్పాడు. ఆదాము,అవ్వ సృష్టి మొదట్లో కంటికి కనిపించే జంతుజాలాన్నింటినీ విడివిడిగా గుర్తు పెట్టుకోవటానికి వీలుగా  రకానికి ఒక పేరు పెట్టుకోవాలనుకున్నార్ట. ఆదాము  జంతువులనన్నింటినీ ఒక దొడ్లోకి తోలి ఒక్కొక్క దాన్నే బయటికి పంపిస్తుంటే అవ్వ వాటికి తోచిన పేర్లు పెట్టే కార్యక్రమం నడిపిస్తోంది. ఆవు, మేక, గేదె... ఇలా అన్నింటికీ నామకరణాలు జరిగిపోతున్నాయి. ఎలుగుబంటి వంతొచ్చింది. 'బేర్'మందిట అవ్వ్వ. 'ఎందుకలా అరిచేసావ'ని ఆదాము అడిగితే..'ఏమో..దాని మొహం చూడగానే భయం పుట్టింది. అలా అరవాలనిపించింది' అందట అవ్వ. అలా ఎలుగుబంటికి 'బేర్' అన్న పేరే స్థిరపడిపోయిందిట.

క్రిస్టఫర్ కాడ్వెల్ చెప్పేదీ అదే. శబ్దానికి ఉండే ముఖ్యగుణాల్లో మొదటిది అర్థం ఐతే.. రెండోది ఆ శబ్దోచ్చారణ వల్ల శ్రోతలో కలిగే స్పందన. ఆయన సిద్ధాంతం ప్రకారం అయ్య, నాన్న, తండ్రి, అప్ప, అబ్బ, బాబు, అమ్మమొగుడు.. అన్నీ సమానార్థకాలే ఐనా అవి పలుకుతున్నప్పుడు  మన మనసుల్లో పుట్టించే స్పందనలు మాత్రం వేరు వేరు. నాదశక్తిలోని  తారతమ్యాన్నిసరిగ్గా  అర్థం చేసుకోగలిగినవాడే షెల్లీ లాగా మంచి కవి కాగలిగేది. ఇంగ్లీషు ఒక్క ముక్కా రాని ఒక పల్లెటూరు బైతు దగ్గరికెళ్ళి
"Water water everywhere
Not a drop to drink"
 అన్న పద్యాన్నిగడగడ చదివి వినిపించి 'ఏమనిపించింద'ని అడిగాట్ట కాడ్వెల్ ఒక సారి. "దేనికో తెలీదు కానీ మొత్తానికి నువ్వు ఎందుకో బాగా ఇబ్బంది పడుతున్నావనిపిస్తోంది సామీ!"  అని బదులిచ్చాట్ట ఆ బైతు.  నాదమాహాత్మం అంటే అదే మరి. జయదేవుడి గీతగోవిందంలోని ప్రధాన ఆకర్షణ ఈ నాదశక్తే. 'సావిరహే తవ దీనా రాధా... ప్రియే! చారుశీలే! ...ధీర సమీరే యమునాతీరే' .. ఇలా అష్టపదుల్లోని పదాలన్నింటికీ మనకు అర్థం తెలీకపోయినా ఆ పాదాల్లోని  ఏదో అనిర్వచనీయ శక్తి మన మనసుల్నిఅలా అలా నీలిమేఘాల్లో తేలిపోయేటట్లు చేస్తుందా  లేదాఅదే నాదాకర్షణ. కవి అన్నవాడు ముందు చేయాల్సింది ఈ నాదోపాసనే.

అంటే జయభేరి చిత్రంలో ఎన్ టీ ఆర్ లాగా ఘంటసాల వారి కంఠంతో 'శివశంకరీ' అని జపించడం కాదు. ముందు తరాల నాద ప్రముఖుల సృజనల్లో శబ్దం ఏఏ సందర్భాల్లో ఎలా పలుకుతూ రసోద్భవానికి దోహదం చేసిందో పరిశీలన దృష్టితో అధ్యయనం చేయడం. కుండలు చేసే కుమ్మరికి మన్నులోని తేడాలు అర్థమైతేనే కదా శ్రేష్టమైన కళాఖండాలని సృష్టించటమెలాగో తెలిసేది!
తెలుగు సాహిత్యంలో  ఇలాంటి నాదోపాసన చేసి సంపూర్ణంగా విజయం సాధించిన ప్రముఖుడు  కవిబ్రహ్మ తిక్కన. నన్నయగారి  శబ్దానికి నాదశక్తి పరిమితమే అంటే ఆయన  అభిమానుల   నొచ్చుకుంటారేమో. 'అదేంటీ.. నన్నయగారి  పద్యం  నల్లేరుమీద బండిలాగా హాయిగానే నడుస్తుందికదా!' అని ఎవరైనా కన్నెర్ర చేయవచ్చు. 'సంగీతజ్ఞానంతో సంబంధం లేని నడకది'.. అనేదే సమాదానం.
అర్థాన్ని అర్ద్వాన్నపు అడవిలో వదిలేసి .. కేవలం లయ కోసమే పాకులాడాలా? అని నిలదీసేవాళ్ళకు…అలా చేస్తే కవిత్వానికి ఎలాంటి వికారపు రూపు రేఖలొస్తాయో … 'ప్రతీకవాద కవులు' 'సర్రియలిస్టు కవులు'  మనకు ప్రయోగాలు చేసి మరీ చూపించారు కదా ఇటీవలి శతాబ్దాల్లోనే!  -అని సమాధానం. నాదం ద్వారా మాత్రమే రససిద్ధిని సాధించడానికి నానారకాల శబ్దాలను సందర్భశుద్ధికి అతీతంగా పోగేస్తే.. జామ్సు జాయిస్  'యులిసిస్' కి అప్పచెల్లెళ్ళను పుట్టించవచ్చేమో తప్ప  అసలైన గొప్ప కవిత్వాన్ని సృష్టించలేం.
కవిబ్రహ్మ అర్థవంతమైన శబ్దాల నాదశక్తిని అత్యద్భుతంగా వాడతాడని చెప్పుకున్నాం గదా! ఉదాహరణగా ఇది చూడండిః
'దుర్వారోద్యమ బాహు విక్రమరసాస్తోక ప్రతాపస్ఫుర
ద్గర్వాంధప్రతివీరనిర్మచనవి- ద్యాపారగుల్ మత్పుతుల్
గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దో -ర్లీలన్ వెసంగిట్టి….'
నిండుసభామధ్యంలో పెద్దలందరి సమక్షంలో అమానుషంగా వంటిమీద బట్టల్ని వలిచేసిన  ఘాతుకానికి ఒక మానవతి తన నిరసనను అత్యంత బలంగా తెలియచేయాలంటే ఎలాంటి భాష వాడితే    వాడికి న్యాయం చేకూరుతుందీ! తిక్కన వాడిన పైపద్యంలోని పదజాలంలోని నాదశక్తిని మించిన శక్తి మనకింక్కడైనా దొరుకుతుందా! అర్థం తెలియనక్కర్లేదు. పద్యం చదువుకుని పోతుంటే చాలు ఒక సాథ్వి ఆక్రోషం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది.

విరాటపర్వంలొ గోగ్రహణం సందర్భంలో ముందుగా ప్రగల్భాలు పలికిన ఉత్తర కుమారుడు తీరా యుద్ధరంగంలో మహావాహినిని చూసి కాళ్ళు చల్లబడి బృహన్నలతో తన బేలతనాన్ని ప్రకటించుకుంటూ
'భీష్మ ద్రోణ కృపాణ ధన్వి నికరా -భీలంబు దుర్యోధన
గ్రీష్మాదిత్యపటుప్రతాప విసరా- కీర్ణంబు శస్త్రాస్త్రజా
లోష్మస్ఫారచతుర్విధోజ్జ్వలబలా- త్యుగ్రం బుదగ్రధ్వజా
ర్చిష్మత్వాకలితంబు సైన్యమిది నే- జేరంగ శక్తుండనే" అంటూ ఒక పద్యం  విసురుతాడు. పద్యంలో కవి వాడిన సామాగ్రిని చదివిన ఎవరికైనా ఉత్తర కుమారుడు ఉత్తిపుణ్యానికే జావగారి పోలేదని అర్థమవుతుంది. నాదోపాసనలో సఫలీకృతుడైన రుషికి మాత్రమే ఏ సదర్భానికి అనువుగా శబ్దం వాడితే భావం రక్తి కడుతుందో అర్థమయేది. స్తిమితంగా.. యుక్తియుక్తంగా మాట్లాడవలసిన సందర్భంలో తిక్కనగారు ఏ గడబిడలూ లేకుండా చిన్నచిన్న మాటల్తో పద్యాన్ని ఎలా నడిపిస్తారో చూడండిః
' వంశంబున కెల్ల నీవ కురు రిందెవ్వారి చందంబు లె
ట్లైవర్తిల్లిన కీడు మేలు తుది నీయం దొందెడుం గాన
ద్భావం బారసి లోనిసొత్తు వెలి వృత్తంబున్ జనస్తుత్యముల్
గావింపందగు నీక యెవ్విధమునన్ గొరవ్య వంశాగ్రణీ!'

నన్నయగారి పద్యాల్లో  వురవడి ఇలా సమయానికి అనుగుణంగా సాగదనే ఒక   అభిప్రాయం ఉంది. నిండుసభలో పాంచాలిని భంగపర్చినప్పుడు భీముడు చేసిన ప్రతిజ్ఞ సందర్భంలోని  పద్యాలనే ఉదాహరణగా తీసుకుందాం.
'ధారుణి రాజ్యసంపదమ- దంబున గోమలి గృష్ణ జూచి రం
భోరు నిజోరుదేశమున- నుండగ బిల్చిన యిద్దురాత్ము దు
ర్వార మదీయ బాహుపరి- వర్తిత దండగదాభిఘాత భ
గ్నోరుతరోరు జేయుదు సు- యోదను నుగ్ర రణాంతరంబునన్' అని భీముని శపథం.
'రంభోరు.. గదాభిఘాత భగ్నోరు' అనే పదాల్లో మినహాయించి  భీముని మాటల్లో ఉండాల్సిన  క్రౌర్యం, పదును ఏవీ!

భావానికి అనుగుణంగా పదాలని కదం తొక్కించే కవాతువిద్య  మళ్ళీ మనం మహాకవి
శ్రీశ్రీలో సంపూర్ణంగా చూడవచ్చు. మహాప్రస్థానం నిండా దీనికి ఉదాహరణలు కోకొల్లలు. కదం త్రొక్కుతూ, పదం పాడుతూ, హృదంత రాళంగర్జిస్తూ మరో ప్రపంచపు జలపాతాలను,దారి పొడుగునా తర్పణ చేసే గుండె నెత్తురులను, బాటలు  పేటలు   కోటలునదీనదాలు,  అడవులు, కొండదారులు, ఎడారుల్లాంటి అడ్డంకుల్నితోసిరాజనుకుంటూ  ముందుకు ముందుకు .. పైకి.. పై పైకి.. దూసుకుపోవాలంటే ఎముకలు కుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరుల వల్ల కాని పని  కనక.. వాళ్ళు చావాలనీ.. నెత్తురుమండే.. శక్తులు నిండే సైనికుల్లాంటి యువత మాత్రమే 'హరోం! హరోం హర!హర!హర!హర!హర!హరోం హరా!' అని నినాదాలిచ్చుకుంటూ ప్రభంజనంలా హోరెత్తిస్తూ వర్షుకాభ్రముల ప్రళయఘోషలా ఫెళ ఫెళా ఫెళ ఫెళా విరుచుకు పడగలరు కనక వాళ్ళే కావాలనీ.. మరోప్రపంచపు కణకణమండే త్రేతాగ్ని.. ఎగెరెగిరి పడే ఎనభై లక్షల మేరువులు, ప్రళయనాట్యం చేసే సప్త సముద్ర జలాలు, సలసల క్రాగే చమురు లాంటి ఉష్ణరక్త కాసారాలూ కనబట్టం లేదా!..  మరో ప్రపంచపు అంచుల్నుంచీ   విరామ మెరుక్కుండా  మ్రోగే  కంచు నగారా మ్రోతలు  వినిపట్టం లేదా!.. అంటూ శివసముద్రంలాగానో నయాగరాలాగానో ఉరకండురకండంటూ     ఆ మహాకవి చేసే అక్షరజ్వాలాక్రందనాలు.. ఈనాటికీ చదువరుల గుండెల్ని  త్రాచుల్లాగా, రేచుల్లాగా తట్టి లేపగలుగుతున్నాయంటే ఆ శక్తి మనం ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చిన నాదానిదే! శంకరభగవత్పాదులూ ఈ నాదశక్తి ప్రయోగంలో పరమ నిష్ణాతులు. దేవీస్తుతే అందుకు ప్రబలమైన సాక్ష్యం.
మనుచరిత్రలో అల్లసాని పెద్దనగారూ రెండో ఆశ్వాసంలో ప్రవరాఖ్యుడి కళ్ళతో మనకు హిమవనుల కమనీయమైన అందచందాలను.. చూపించడానికి  ఈ నాదశక్తినే తోడు తెచ్చుకునే ప్రయత్నం చేశారు.

"……………………………..-అంబరచుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠ -భంగతరంగ మృదంగ నిస్వన
స్ఫుటనట నానురూప సరి-ఫుల్లకలాప కలాపి జాలమున్-
కటకచరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్"
ఎత్తుమీదనుండి పడి రాళ్ళమీదుగా.. మధ్యగా హొయలు పోతూ ప్రవహించే సెలయేటి సోయగాలను  అల్లసానివారు అర్థశక్తితో కాకుండా నాదశక్తితో అభివ్యక్తీకరించటం ఇక్కడ చేసిన ప్రయత్నమే చెబుతుంది. శబ్దంలోని  అంతర్లీనంగా  ఒదిగున్న నాదశక్తి సామర్థ్యం ఎంత
ఎవరు ఎన్నైనా చెప్పండి.. ఎంత అద్భుతమైన భావమైనా చదువరి హృదయపీఠంమీద    పదికాలాలపాటు తిష్ఠవేసుకోవాలంటే ఆ భావానికి ఒక్క కుసుమకోమలమైన అర్థమొక్కటే సరిపోదు.. పదే పదే స్మరించుకుంటో పరవశం పొందేందుకు పరిమళ సమానమైన నాదానుభూతీ తప్పనిసరి.   భావానికుండాల్సిన  ఆ పరిమళానుభూతి  పేరే 'నాదశక్తి'.

ప్రసిద్దిపొందిన ఏ కవి కృతిని శ్రద్ధగా పరిశీలించినా .. భావానికి తగిన అర్థంతో పాటు.. హృదయానికి హత్తుకునే ఒక నాదశక్తీ అంతర్గతంగా ఏదో ఒక మోతాదులో ఉండి తీరుతుందని అర్థమవుతుంది. అలా లేని పక్షంలో ఆ పదజాలం కేవలం వచనం అవుతుందేమో కాని.. ఎన్నటికీ కవనం  మాత్రం  కానేరదు.   

ఉత్తమకవిత్వానికి  భావార్థాలే  ప్రధానమన్న వాదనకి ఎదురులేదు కానీ.. ఎంత కాదనుకున్నా భావాల వ్యక్తీకరణకి పదాలే అనివార్యమైన వాహకాలైన కారణంగా ఆ పదాల పొహళింపులోని నైపుణ్యాన్ని ఆకళింపు చేసుకొంటేనేగానీ  సందర్భోచిత శబ్దప్రయోగం అనే రసవిద్య పట్టుపడదు. నాదశక్తిని మిగతా అర్థశక్తులతో కలగలిపేసి అర్థం చేసుకునే పొరపాటును ఇప్పటికైనా గ్రహిద్దాం.  సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. కనీసం  కొత్తతరం కవులన్నాఈ నాదోపాసన వైపు దృష్టి మళ్ళించకపోతే కవిత్వంలోని ఈ అయోమయం ఇంకా ఇలాగే కొనసాగటం ఖాయం.
-కర్లపాలెం హనుమంత రావు
***




No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...