రత్నగర్భ నాదేశం
గర్భాదానమే
అక్రమంగా జరిగిపోయింది!
‘2-జీ’ ఒక ‘వేలం’ వెర్రి
‘బొగ్గు’
ఆ వేలంకూడా లేని వెర్రి
డొక్కు బస్సుల్లో రాజులు
బుగ్గ కార్లలో బంటులు
ప్రజలే కదా మరి
ప్రజాస్వామ్యంలో రాజులు!
ప్రజాప్రతినిధులు వారి బంటులు!
ప్రజాప్రతినిధులు వారి బంటులు!
బొమ్మ- న్యాయం
బొరుసు- అన్యాయం
రెండూ బొరుసులే ఉన్న నాణెం
-రాజకీయం
నల్లధనం-
ఏ కనిపించని నాలుగో
సింహం
నోట్లోనో!
మంత్రివర్యా… తిన్నంగుండు!
తప్పుతుంది
తిరుపతి గుండు!
రైతు దేశానికి
వెన్నెముక.. సరే!
ఆ వెన్నెముకలేని
పాలనా ప్రభువులది!
ఓబులాపురం గనులకేసు-
'గాలి'తోచేసే యుద్ధం!
వాన కావాలా!
వరుణయాగం ఎందుకు
ఉప్పల్ గ్రౌండ్లో
క్రికెట్ ఆడించు!
విద్యుత్
రిలయన్స్ గాలికి
పెట్టిన దీపం!
కరువు
భక్తుల రాక తగ్గింది
భగవంతుడూ వర్షాలకోసం
ప్రార్థిస్తున్నాడు!
తివిరి
ఇసుమున
‘తైలంబు’ తీయవచ్చు!
-కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment