Saturday, February 6, 2016

పాడు రాజకీయాలు- సరదా గల్పిక


ఆహారభద్రత సోనియాజీ మానస పుత్రిక. చట్టసభలో దాని గతి ఏమవుతుందోనన్న దుగ్ధతోనే  ఆతల్లి ఆరోగ్యంపాడయిందని అప్పట్లో  వార్త. రాజకీయ నేతలను వూరికే ఆడిపోసుకుంటాంగానీ రాజకీయాలంటే ఆట కాదు. ప్రాణాలతో చెలగాటం.

లక్షలకోట్ల  అక్రమార్జన కేసులో ఏడాదికిపైగా
  జైల్లో మగ్గాడు.. పాపం! పాడు రాజకీయాల జోలికి వెళ్ళకుండా వుంటే ఇంచక్కా లోటస్ పాండు ప్యాలెస్ లో కాలుమీద కాలేసుకుని  చెలాయించాల్సిన దొరబాబు కాదూ జగన్ బాబు!  ఇంటికూటిక్కూడా కొర్ట్లెంటబడి దేబిరించాల్సిన దుస్థితి. బెయిలైనా రాకుండా బెడిసికొట్టడానికి పీడాకారం పాలిటిక్సే కారణం. బ్యాడ్ పాలిటిక్స్! బెయిలుమీద వచ్చి బైట చెడతిరుగున్నా.. ఏ నిమిషంలో ఈ. డీ .. సి బి ఐ మళ్లా పిల్చి చేతులకు బేడీలేస్తారోనన్న దిగులు  ఆ మొగంలో దాచుకోడం ఎంత దయనీయమైన దుస్థితి!

పనికిమాలిన  రాజకీయాల్లోకి రాకుండా వుండుంటే ఈ పాటికి ఎంచక్కా ఏ ప్రపంచబ్యాంకు చీఫుగానో పదవీ విరమణ చేసుండాల్సిన పెద్దమనిషి చంద్రబాబు. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన పాపానికి పదేళ్ళుగా పడరాని పాట్లు పడ్డాడు! ఎప్పుడు చూసినా ఏవో యాత్రలు..జాతర్లు. పుళ్ళుపడ్డ కాళ్ళకు చెప్పులైనా లేకుండా పాపం గట్టిరోడ్డుమీద గట్టిగా నాలుగడుకుగులైనా పడని పరిస్థితి. దేశాన్ని నడిపించాల్సిన దీర్ఘదర్శి స్వయంగా నడవలేని స్థితి పాడురాజకీయాల జోళ్ళల్లో కాళ్ళు పెట్టడం వల్ల కాదూ! ఇంత చేసీ చీలికలైపోయిన పదమూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అయిన తరువాతైనా సుఖపడుతున్నాడా! సుఖంగా నిద్రపోతున్నాడా!

ఓ పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రైనా    'కర్రీ-పాయింట్' పెట్టుకోమని ఎద్దేవా
చేసేవాళ్ళు! 'సభాపతిగా పదిమందిచేత 'శభాష'నిపించుకున్నానన్నతృప్తి రెండ్రోజులైనా మిగ లేదు.  పైన అక్కడ అధిష్టానానికీ గులాం.. కిందిక్కడ అడ్డమైనవాళ్ళకీ సలాం! క్రికెట్టాటను నమ్ముకున్నా ఈ పాటికి  ఏ పెద్ద స్టారుహోదాలోనో వెలుగుతుండాల్సింది మన కిరణ్    సారు. క్షణభంగురమైన రాజకీయాలనిలా నమ్ముకున్నందువల్లే కదా ఇన్నేసి భంగపాట్లు కుమార్ సారుకి!

తోటి ఆడపిల్లలు హాయిగా కాపురాలు చేసుకుంటుంటే.. షర్మిలమ్మకే పాపం యాత్రలెంట యాత్రల తిప్పట. పుట్టింటివాళ్ళు పుట్టెడు రాజకీయ దుఃఖంలో కొట్టుమిట్టాడుతుండబట్టి కాదూ అన్న విడిచిన బాణంలా అన్నేసి ఊళ్ళ సంచారం లేతవయసులో ఆ పిల్లకు! పగవాడిక్కూడా రావాలని కోరుకోరానిది బాబూ పాలిటిక్సు కుటుంబంలో ఆడపిల్ల పుట్టుక!

అన్నెం పున్నెం ఎరక్కపోయినా అటు కట్టుకున్న మనిషి .. ఇటు కన్నపేగు
పాలిటిక్సుని పట్టుకుని వేళ్ళాడబట్టేగా.. బైబిల్ చేతబట్టి కన్నీళ్ళు పెట్టుకుంటో దీక్షలు చేపట్టాల్సొ చ్చింది విజయలక్ష్మమ్మతల్లికి పెద్దవయసులో! ఐనా రాజకీయాలింకా లాభసాటి బేరమేనంటే.. ఇహ  చెప్పేందుకేముంది.. చెప్పుతో చెంపలు పగిలేట్లు కొట్టుకోడం తప్పించి!

తప్పు చేసిన వాణ్ని తన్ని ఊరుబౖటికి తరిమేసే శిక్ష అమల్లో ఉండేది ఒకానొకప్పుడు. నిండా పబ్లిక్కుని ముంచిన గూండాభాయీలుకూడా గుండీలిప్పుకుని మరీ నడిబజారులో ఊరేగే రోజుల్లో.. పాడు పాలిటిక్సులో దూరి పులిమీద స్వారీ ఏ శనిముహూర్తంలో 'తూచ్' మని తుమ్మి ఆరంభించాడో కానీ కె సి ఆర్ సార్.. సెల్ఫ్ఎగ్జైల్ మోడల్లో ఏడాదిలో సగం  ఫాం-హౌసులోనే మంత్రాంగం. వయసు ముదరక ముందే వానప్రస్థమంటే.. మరి సన్నాసి  రాజకీయాల పుణ్యఫలమా కాదా? సరే.. ఇప్పుడు కొత్తగా తెలంగాణా అంటూ రాష్ట్రం  చేతికొచ్చినాక జనంలో కాక ఉన్నంతా కాలం రాజ్య  చెల్లుతుందనుకో! అయినా.. ఆ నడినెత్తిమీద ఎల్లకాలం ఓ పిడిబాకు వేలాడుతూనే ఉంటుంది కదా.. పాడు పాలిటిక్సు మూలకంగా ఎవర్ని ఎప్పుడు ఎంతమేర నమ్మాలో కొలుచుకుంటూ కూర్చోవాల్సిందేగదా కుర్చీమీద మమకారం పోనంతకాలం!  

డాలర్లు డ్రాచేస్తూ డాబుగా తిరిగేటి  తారకబాబుకు ఎవరు నూరిపోసారోగాని
పాపం.. రొచ్చుగుంట రాజకీయాలలోకొచ్చి పడ్డాడు చివరికి! యునైటెడ్ స్టేటులో ఎస్టేటులు కొని సెటిలయ్యే సుఖమెక్కాడా ? సెటిల్మెంటారోపణల్ని ఖండించుకుంటూ దినాం స్టేట్ మెంటులిచ్చుకోవాల్సిన దుఃఖమెక్కడా? చాయిస్సులో చెత్త రాజకీయాలకు టిక్కు పెట్టబట్టేగా ఇన్ని ఇక్కట్లు వచ్చి పడేది!

సభల రభస ఇహ చెప్పనలవి కాని అడవిగోస. ఆ కంఠసోషకు అంతే
ఉండదు. ఎప్పుడే మూలనుంచి చెప్పులొచ్చి పడతాయో తెలీదు. చప్పున వగదిగించుకు దిగిపోదామంటే  పక్కమనిషి ఎక్కడెక్కుతాడోనని అదో దిగులు. ముక్కూమొగం తెలీని వాడితో కలిసి దిగే ఫొటోలతో ఎప్పుడే చిక్కో.. అదో మిస్టరీ. ఖర్మ.. అడ్డమైనవాడి చేతులు గాట్టిగా  పట్టుకుని గాల్లోకి వూపుతూనే ఉండాలి. వూపి వూపి వేళ్ళు వాచిపోతే రెండు ముద్దలు కడుపునిండా తింటానికైనా ఉండదుఎవరెవరితోనో కావలింపులు. నెత్తిమీదకి కొమ్ముల తలపాగాలు. భుజంమీదకి నల్లమేకలు. తప్పనిసరి ఈ  తలనొప్పంతా రాజకీయాల వల్లొచ్చిన తిప్పలవల్లేనంటే కాదంటావా? అనగలవా!

వచ్చినా రాకపోయినా  పిచ్చిచిందులు. ఇంట్లో బిడ్డనుకూడా మనసారా ఎత్తుకునాడించేందుకు పెళ్లంటూ ముందొకటి ముగించుకోవాలి కదా! దానికి సమయం దొరకదు కానీ.. ఎవరెవరో కన్నబిడ్డల్ని గారాబం చేసేందుకు సమయం దొరకబుచ్చుకోవాలి. కారే ముక్కూమూతుల్ని ఆప్యాయంగా తుడవాలి. ఈ రోతంతా రోజంతా నటించే దౌర్భాగ్యం కేవలం రాజకీయాలని ఓ కెరీరు కింద తీసుకోక తప్పని కుటుంబంలో పుట్టిన ఖర్మాన కదా పాపం రాహుల్ బాబుకి!

చిత్రాల్లో చేస్తే  చచ్చే పేరొచ్చే నటనంతా చచ్చినట్లు చేసినా చివరికి మిగిలేది
  'చీ' 'చా' అనే చీదరలే రాజకీయాల్లో! మెగాస్టారు  చిరంజీవిని ఆడిగి చూడు ..ఈ రాజకీయజీవితం అంటే ఎంత వెగటో తెలుస్తుంది!

ప్రైవేట్ లైఫంతా పబ్లిక్కేనాయ. చట్టసభలో కాస్తంత  కంటిరెప్ప కిందకి వాలితే .. కుంభకర్ణుడుతో పోలిక! సరదా పడి వీడియో చూసినా దసరాబుల్లోడు తొడుగులు. పండగనాడైనా నిండాసంతోషంతో పేకాటా, పందేలని పబ్లిగ్గా కనపడేందుకు లేదు. పడగ్గదిక్కూడా ఎవడో కెమేరా అమర్చిపెట్టుంటాడని డౌటు. వంటినొప్పులకని  కంటికి నదురైన పాపచేత కాస్త కాపడం పెట్టించుకున్నా..   ఇహ చూడు.. నిన్నా పరమేశ్వరుడైనా  కాపాడలేడు. కోరి తెచ్చుకునే కొరివి కాదని ఎవరనగలరీ రాజకీయాలని!
కడుపు కాలుతున్నా దీక్షలు చేపట్టాలి. దిష్టిబొమ్మలవతారాల్లో లక్షలసార్లు  తగలబడాలి. ఇహ సిబిఐ మొగుడు.. ఉండనే ఉన్నాడు. మీడియా ఎప్పుడే కూర వండుతుందో తెలీదు. నానాయాగీ చేస్తే నాలుగు డబ్బులు కూడినా.. లెక్కలు అడిగే యముళ్ళే దిక్కునుంచొచ్చి పడునో.. యూ నో.. చెప్పడం కాదు.. ఆ ముదనష్టం లెక్కలు  ఎక్కడా దొరక్కుండా నచ్చచెప్పడంలోనే ఉంది అసలు కష్టమంతా! ఇంత గడించినా  గదిలోపల గడియేసుకుని  చూసుకుని మురుసుకోవాల్సిందే గాని  అనుభవించే యోగం నుదుట రాసున్న నేత ఎక్కడున్నాడురా ఈ కాలంలో! పైవాడి హుండీలో అజ్ఞాత దాతగా  తోయడానికి, కిందివాడి చేతిలో ఎన్నికలవేళ పోయడానికే ఇన్నేసి కోట్లు.. ఆ ముదనష్టాన్ని సంపాదించడానికి  పడరాని పాట్లు. ఏ కాస్త బుర్రా బుద్ధి వున్నా  ఈ బురదగంటలోకి చూస్తూ చూస్తూ ఎవరూ కాలెయ్యరు."
"ఇదంతా ఇప్పుడు నాకెందుకన్నా చెబుతున్నావూ?!"
"రేపొచ్చే ఎన్నికల్లో మన నియోజకవర్గాన్నుంచి పోటీ చేసే ఆలోచన నువ్విప్పుడైనా మానుకుంటావని! కాలరు మాయని పనులు సవాలక్ష రకాలున్నాయిరా నీకు.  ఈ మాయదారి రాజకీయాలు దేనిగ్గానీ నీకు..  దేనికీ పనికి రాక బేవార్సుగా తిరిగే మా పెద్దబ్బాయున్నాడు..  చూడు.. వాణ్ని నిలబెడదామా  ఈ సారికి"
-కర్లపాలెం హనుమంతరావు


***

Thursday, February 4, 2016

చేలాంచలము- చిన్నకథ- కౌముది మరీ చి.క కాలమ్ ప్రచురితం


అనగనగా ఓ అబ్బాయి. ఓ రోజున అతనికి ఓ అందమైన కల వచ్చింది.అందులోని సుందరాంగి చేతులుచాచి మరీ తనలోకి చేరమని ప్రాథేయపడింది.
'అప్పుడేనా! నాకింకా నిండా పదహారేళ్లైనా నిండలేదు. ఇది తరుణంకాదుఅని తిరస్కరించాడు అబ్బాయి.
అబ్బాయికి యవ్వనం వచ్చింది. ఓ రోజు కలలో మళ్లీ మునపటి స్వప్నసుందరే  ప్రత్యక్షమయి 'తరుణం వచ్చింది కదా! తరిద్దాము రారాదా!' అని సిగ్గువిడిచి మరీ బ్రతిమాలింది.
'వయస్సు వస్తే సరిపోతుందా! నా స్వంతకాళ్లమీద నేను నిలబడవద్దా! అప్పుడూ ఈ తరించడాలు.. తడిసిపోవడాలు!' అని అప్పటికి తప్పుకొన్నాడు అబ్బాయి.
అబ్బాయి సంపాదన పరుడైన వెంటనే మళ్లా కల్లో కనిపించి కాళ్ళావేళ్లాబడినంత పని చేసింది స్వప్నసుందరి.
'పిల్లా పీచూ సంగతి చూడాలి ముందు. ఆ తరువాతే ఈ గెంతులూ.. చిందులూ!' అని సుందరిని కర్కశంగా పక్కకు తోసాసాడు ఈసారి కూడా ఆ అబ్బాయి.
అబ్బాయిగారి చివరికూతురు పెళ్ళిచేసుకొని అత్తారింటికి తరలిపోయింది.
'ఇప్పుడైనా కనికరిస్తావా మహానుభావా!' అని అడిగింది స్వప్నసుందరి పట్టువదలకుండా మళ్లా కల్లోకొచ్చి.
'పట్టినంత కాలం ఓపిక పట్టావు. మనుమలు.. మనుమరాళ్లు పుట్టుకొచ్చే సమయం. వాళ్లతోకూడా కాస్త ముద్దూ ముచ్చట్లు తీర్చుకోనీయవోయి  సుందరీ!' అంటూ వచ్చినదారే చూపించాడు ఆ సుందరికి  బడుద్దాయి అబ్బాయి.
మనమలు.. మనమరాళ్లతో ముద్దుముచ్చట్లు ముగిసిపోయాయి. చేసే ఉద్యోగానికి విరమణ అయిపోయింది. కాలసినంత తీరిక. బోలెడంత సమయం. కూర్చొని కూర్చొని విసుగొచ్చిన అబ్బాయిగారికి అప్పుడు గుర్తుకొచ్చింది స్వప్నసుందరి.
కానీ.. స్వప్నసుందరిజాడే ఇప్పుడు  కానరావడం లేదు!
స్వప్నసుందరి దర్శనం కలగాలంటే ముందు నిద్రాసౌభ్యాగ్యం అబ్బాలి. బిపి.. షుగరు.. కాళ్లతీపులు.. అజీర్తి.. అతిమూత్రవ్యాధి.. మతిమరుపు రోగం.. నరాల బలహీనత! ఇన్ని ఇబ్బందులున్నవాడికి నిద్ర పట్టేది ఎలా! స్వప్నసుందరి సందర్శనం ఇహ తీరని కలా! అయినా.. అంతలా నరాల బలహీనతలున్న అబ్బాయిగారు  కలలరాణితో కలసి చేసేదిమాత్రం ఏముంది?
స్వప్నసుందరి మరే అబ్బాయి కలలోనో బిజీగా ఉండి ఉంటుంది.
ఆ పిల్లగాడన్నా తాను చేసిన పొరపాటు చేయకూడదని గొణుక్కున్నాడు    మగతనిద్రలోనే అబ్బాయిగారు!

***
-కర్లపాలెం హనుమంతరావు 
(కౌముది- ఫిబ్రవరి 2016- మరీ చి.క కాలమ్ లో ప్రచురితం)

Wednesday, February 3, 2016

పోతన హాలివుడ్ టెక్నిక్- ఓ సాహిత్య గల్పిక


కాలం  తెలుగుపిల్లసజ్జుకి ఏ బి సి డి.. అంటూ అమ్మ కడుపునుంచి ఊడిపడ్డ మరుక్షణంనుంచి అర్థమయీ అర్థంకానీ ఆంగ్లాక్షరాలు బట్టీయం వెయ్యడం మినహా.. - అమ్మ.. - ఆవు.. - ఇల్లు.. - ఈశ్వరుడు.. అంటూ తనకు పరిచితమయిన పరిసరాలనుంచి ప్రాపంచిక జ్ఞానాన్ని అలవర్చుకొనే అవకాశం బొత్తిగా సన్నిగిల్లిపోతోంది! ప్రపంచీకరణ ప్రభావంతో పాశ్చాత్యలోకంవైపుకి, డాలర్లమీదకి, పడమటి డాబు-దర్పంమీదకి శృతిమించిన ఆకర్షణ పెంచుకొన్న తల్లిదండుల పెంపకంలో పెరిగే పిల్లలకు ప్రాథమికదశలో అందవలసిన మౌలిక జ్ఞానం అందడం లేదు!
పసితనంలో  పుష్టికరమైన ఆహారం లభించని బాలలకు ఎదిగివచ్చిన తరువాత అణిగివున్న రోగాలు అమాంతం  కమ్ముకొంటాయని ఆరోగ్యనిపుణుల అభిప్రాయం. విజ్ఞానమూ ఆహారం వంటిదే!మెదడుకు మేత! బాల్యదశలో అందవలసిన మాతృసంబంధమైన  పౌష్టికవిజ్ఞానం మేథోవ్యవస్థకు  సరైన పాళ్లలో అందని వారందరూ   ఎదిగి వచ్చిన తరువాత    ఆత్మన్యూనతనే రుగ్మత పాలవుతారు.   పరాయితనంమీద  అపరిమితమైన మోజు.. సొంతతనంమీద విపరీతమైన  చులకన ఈ రుగ్మత లక్షణాలు. వెరసి వెన్నెముక బలంగా లేని పై మెరుగుల డొల్లయువతతో తెలుగునేలలు రెండూ నిండిపోయే  ప్రమాదం ముందు పొంచి ఉంది.
ఇదంతా ఇప్పుడు అనుకోవడానికి ఒక కారణం ఉందిమా టీవీలో
చిత్రనటుడు   నాగార్జున నిర్వహిస్తున్న  'మీలో కోటీశ్వరుడు ఎవరు?' కార్యక్రమంలో తెలుగు సంస్కృతికి సంబంధిచిన చిన్నపాటి ప్రశ్నలు ఎదురైనప్పుడు  బి.టెక్కులవంటి పెద్ద చదువులు పూర్తి చేసిన అభ్యర్థులుకూడా సరైన సమాధానాలు గుర్తించలేకపోతున్నారు! భారతం రచించిన కవిత్రయం వరసను సరిన క్రమంలో గుర్తించింది ఏడుగురిలో కేవలం ఇద్దరుబమ్మెర ఇంటిపేరుగాగల కవి రాసిన కావ్యం  ఏమిటి?' అన్న ప్రశ్నకు 'శ్రీ మదాంధ్ర మహాభాగవతం' అన్న సమాధానం చెప్పగలవారు ఎందరుంటారో ఎవరికి వారే ఊహించుకోవాలి
తేటతెలుగులో బమ్మెర పోతన అత్యంత అద్భుతమైన ప్రతిభా వ్యుత్పత్తులతో సంస్కృత భాగవతాన్ని అనువదించిన సంగతి నేటి తరానికి ఎవరైనా చెబితేనేగదా తెలిసేది! పేరుకే   అనువాదం కానీ..  ఆ రచన  అక్షరమక్షరంలో  ఆంధ్రుల మహాభాగవతమేనని, బమ్మెర గ్రామంలో పుట్టి పెరిగిన పోతన తన సహజ ప్రతిబా సామార్థ్యాలతో దాదాపుగా ఒక  స్వతంత్ర రచనలాగా సాగించిన  ఆ భాగవతంలోని ప్రతి పద్యమూ.. దేనికదే  ఓ రసధుని మాదిరి  చదువరుల చవులూరిస్తుంటుందని పెద్దలకు తెలిస్తేనే గదా పిన్నలకు నూరిపోసేది!
పోతన భాగవతం చదివి సంబరపడేందుకు  దైవభక్తే ఉండనవసరం లేదు. భగవంతునిమీద విశ్వాసంతో నిమిత్తం లేకుండా ఆ పురాణంలోని ప్రతి పద్యాన్ని తుదికంటా ఆస్వాదించే నాస్తికులు ఎందరో ఉన్నారు.   ఉండవలసింది రసహృదయం! ఇప్పుడే ఏదో ఓ వ్యాసానికి సమాచారం సేకరించే పనిలో ఉన్నప్పుడు  అనుకోకుండా పోతన భాగవతంలోని వామనావతార ఘట్టంలోని రెండు పద్యాలు కంటబడ్డాయి! మనసు నిండింది.
'ఇంతింతై వటుడింతయై , మరియు దా నింతై , నభో వీధిపై
నంతై , తోయదమండలాగ్రమున కంతై , ప్రభారాసిపై
నంతై , చంద్రునికంతయై , ధ్రువునిపై నంతై , మహర్వాటిపై
నంతై , సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాడాంత సంవర్ధియై'
ఒక పద్యమైతే
'రవిబింబం బుపమింప బాత్రమగు ఛత్రంబై , శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్'
అనేది రెండో పద్యం.
మొదటి పద్యం ఎక్కడో ఓ చోట ఏడో ఓ సందర్భంలో  అరకొరగానైనా చెవినబడని తెలుగువాడు ఉండడనే అనుకుంటున్నాను. వాటి అర్థ తాత్పర్యాలువివరాల జోలికి  వెళ్లడం ఇప్పుడు నా ఉద్దేశం కాదునా విస్మయమంతా రెండో పద్యం టెక్నిక్కుని గురించే!

సూర్యబింబం ఆకాశంలో అక్కడే ధగధగా వెలుగుతోంది. దానికి అడ్డుగా  భూమ్మీద నిలబడి  ఉన్న వటుడు బలిముందు  క్రమంగా పెరిగే విధానం పద్యాంశం. From Bali  point  of view..  అవతారమూర్తి ఎదుగుదలను వివరించాలన్న ఆలోచన పోతనామాత్యుడికి రావడం ఆశ్చర్యం
సూర్యుడు ఓంప్రథమంగా వటుడి  నెత్తిమీది గొడుగులాగా, తరువాత నెత్తిన మెరిసే మణిలాగా.. ఆ తరువాత తళుకులీనే చెవిపోగులాగా, ఆ తరువాత మెడలో ధగధగలాడే ఆభరణంలాగా.. అదే క్రమంలో వరుసగా  చమక్కుమనే భుజకీర్తిలాగా, ముంజేతి కంకణంలాగా, నడుముకు చుట్టుకునే వస్త్రం  మెరుపంచులాగా.. అలా కాలిఅందెలా   మెరుపులీనుతూ  చివరికి  పాదపీఠం స్థాయికి సూర్యభగవానుడు దిగివచ్చే 'సాపేక్ష సిద్ధాంతంఊహించాడు  మహానుభావుడు బమ్మెర పోతనామాత్యుడు!
ఒక  కదలనివస్తువు పరంగా   దానిముందు కదిలే   మరోవస్తువు కదలికలను వర్ణించవచ్చన్న ఆలోచన ఆ పల్లెటూరి కవిరైతు బుర్రలోకి  15వ శతాబ్దంలోనే రావడం ఒక అద్భుతమైతే.. దానిని  హాలివుడ్ చిత్రాల  సాంకేతిక స్థాయితో పోల్చదగ్గ చమత్కార పంథాలో  తెలుగుదనం పరిమళం చెదిరిపోకుండా   రసజ్ఞులైన చదువరులకు  కిక్కొచ్చే విధంగా అందమైన ఛందో పదబంధాలలో బందించి మరీ అద్భుత పదచిత్ర విన్యాసం చేయడం మరో అద్భుతం!
ఇవాళ స్పీల్ బర్గ్ హాలివుడ్ చిత్రాల్లో చూపింఛే పనితనం ఆరు శతాబ్దాల కిందటే  ఆంధ్రదేశంలోని ఓ మారుమూల పల్లెలో  హాలికవృత్తి చేసుకొనే కవిపోతనకు ఎలా అబ్బిందో?!  అద్భుతం అనిపించదా ఆలోచిస్తున్న కొద్దీ!
 పోతన తెలుగువాడు అవడం.. తెలుగులో భాగవతం రాయాలన్న సంకల్పం ఆ మహానుభావుడికి  కలగడం.. తెలుగుభాష చేసుకొన్న అదృష్టంఆ అదృష్టం అందుకోలేని వాతావరణంలో నేటి బాలబాలికలు పెరగడం వారి దురదృష్టం!
-కర్లపాలెం హనుమంతరావు

Tuesday, February 2, 2016

గురక- మరీ చిన్నకథ- కౌముది


పద్మావతి అందం చూస్తుంటే  ప్రబంధకవులకు మాట పడిపోయుండేది. మహారాజులకైతే మతి తిరగబడుండేది. మామూలు మాచవరం నాగేశ్వర్రావు సంగతి ఇహ చెప్పాలా.. పెళ్ళిచూపులప్పుడే ఫ్లాటయిపోయాడని!
బి.కాం రెండుసార్లకు ముక్కి, అడ్డమైన దేవుళ్లకు అడ్డదిడ్డంగా మొక్కి.. సాధించిన బోడి ఏ.జీ ఆఫీసు ఎల్డీసిగాడు నాగేశ్వర్రావు. కాకి ముక్కుకు దొండపండులా దొరికిందని పెళ్ళికొచ్చి అక్షింతలు వేసినోళ్ళందరూ నోళ్ళు నొక్కుకొన్నారు. కుర్రకారైతే కుళ్ళుకొని చచ్చారు.
పద్మావతి నాయన బడిపంతులు కావడం.. మరో ముగ్గురు ఆడపిల్లలక్కూడా పెళ్లి పేరంటాలు చేయవలసిన తండ్రి కావడం.. నాగేశ్వర్రావుకి కలిసొచ్చింది. సరే.. ఇప్పటి మన కథ అది కాదు.
మొదటి రాత్రి మాటా మంచీ అయింతరువాత పుస్తకంలా పడి నిద్రపోతున్నప్పుడు నాగేశ్వర్రావు చెవిలో ఏదో నాగుపాము బుస వినిపించింది ఆగకుండా! చీమ చిటుక్కుమన్నా లేచిపోయే దౌర్భాగ్యం అతగాడిది. లేచి లైటు వేసీ వేయంగానే బుస ఆగి పోయింది! లైటు తీసిన రెండు నిమిషాలకే మళ్లీ మొదలయింది!రాత్రంతా ఇదే కథ!
మర్నాడా విచిత్రం కొత్తల్లుడు బైటకు చెప్పినా అత్తారింట్లో ఎవరూ కిక్కురుమననే లేదు. రెండో రాత్రి పద్మావతే మిస్టరీ విడదీసింది.  ‘చిన్నతనంనుంచి నాకు నిద్రలో గురక పెట్టే జబ్బు. ఎన్ని మందులు మింగినా లాభం లేకపోయింది. ఈ సంగతి  ముందే మీకు చెప్పమని మా వాళ్లతో శతపోరాను. చెప్పినట్లు లేరు' అని వెక్కి వెక్కి ఏడ్చింది.
కొత్తపెళ్లాం కొత్త బెల్లం. పద్మావతితోపాటు పద్మావతి గురకనూ మనస్ఫూర్తిగా జీవితంలోకి ఆహ్వానించేందుకే గుండెను రాయి చేసుకొన్నాడా క్షణంలోనే నాగేశ్వర్రావు.
కాలం గడిచి.. పుట్టుకొచ్చిన ఇద్దరు పిల్లలు పెరిగి.. పెద్దయి.. వేరే దేశాలకని ఎగిరి వెళ్ళిపోయినదాకా.. పద్మావతి గురక రహస్యం ఆ ఇంటి నాలుగ్గోడల మధ్య మాత్రమే మిగిలిపోయి గుట్టు. భారతీయులం కనక కుటుంబ బాంధవ్యాలు అంత బలంగా ఉంచుకొంటాంగానీ.. వేరే దేశంలోకి సీను మారంగానే  మన మనస్తత్వాలనూ అంతే వేగంగా  మార్చేసుకొంటాం.
కూతురు కాన్పుకోసమని ఆర్నెల్లకు అమెరికా వెళ్లిన పద్మావతి.. మూణ్నెల్లు తిరక్కుండానే  ఇండియా తిరిగొచ్చేసిందికొడుకు పిలిచాడని పడుతూ లేస్తూ వెళ్ళిన నాగేశ్వర్రావు దంపతులు.. మూడునెల్లు కూడా ఉండలేక మళ్లా అలాగే  తిరిగొచ్చేసారు.
కొడుకు కూతురులాగా.. అల్లుడు కోడలులాగా.. అత్తగారి గురకకు  అడ్జస్టవాలని లేదుగా!
గుట్టు చప్పుడు కాకుండా ఇండియా వచ్చి పడినా భగవంతుడి పరీక్షలు ఆగలేదు. ఉన్నట్ట్లుండి పద్మావతి గుండెనొప్పితో పెద్దాసుపత్రిలో చేరడం,, చూడ్డానికొచ్చిన బిడ్డలిద్దరి చేతుల్లో భర్తను పెట్టి కన్నుమూయడం! లఘుచిత్రం చూసేంత  సమయంకూడా పట్టలేదు కథ ముగింపుకి రావడానికి!
ఫ్లాప్ పిక్చర్ ఆడే డొక్కు థియేటరులాగా నిర్మానుష్యంగా ఉందిప్పుడు నాగేశ్వర్రావు కొంప. తమ దగ్గరికి పిలిపించుకోడానికి సమయం పట్టేట్లుందని మధ్యంతర ఏర్పాట్లంటూ ఓ కొత్త పద్ధతి కనిపెట్టి ఓల్డేజి హోముకు తండ్రి బాధ్యతలు అప్పగించిపోయారు బిడ్డలిద్దరు.
అంతా బాగానే ఉంది. వేళకు తిండి.. వ్యాయామం.. తనలాంటి ఇరుగుపొరుగుతో మాటా మంతీ! చీకటి బడటంతోనే  దిగులు మొదలవుతున్నది నాగేశ్వర్రావుకి. కంటినిండా నిద్ర పోయింది పద్మావతి పక్కలో పక్కనున్నరోజుల్లోనే.
ఎన్ని మందులు మింగించినా.. ఎన్ని కొత్త  వైద్యాలు ప్రయోగించినా నాగేశ్వర్రావుమీద ఫలితం చూపించలేక పోయేసరికి చేతులెత్తేసారు ఓల్డేజి నిర్వాహకులు.
సొంత వైద్యం ఆలోచన అప్పుడొచ్చింది నాగేశ్వర్రావుకి. భార్య ఫొటో పక్కనుంచుకొని.. ఆమె గురక రికార్డు ప్లేయర్లో ఆన్ చేసుకొంటే కంటిరెప్పలు కిందికి వాలుతున్నాయిప్పుడు!
పెళ్లయిన కొత్తల్లో పెళ్లాన్ని టపట్టించేందుకు దొంగచాటుగా రికార్డు చేసిన గురక కేసెట్ ది!

***
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది- ఫిబ్రవరి 2016 సంచిక 'మరీ చి.క' కాలమ్ ప్రచురితం)

Monday, February 1, 2016

సంక్రాంతి సంబరాల్లో.. శంకరం పెళ్లి- వాకిలి ‘లాఫింగ్ గ్యాస్’ కాలమ్ సరదా కథ

సంకురుమయ్య ఈ సంక్రంతికి ఏమెక్కి వచ్చాడంకుల్?' అని అడిగాడు శంకరం.
'విమానాలెక్కయితే రావట్లేదురా! ప్రధానితో పోటీ. తట్టుకోలేక పోయుంటాడు పాపం.. సంక్రాంతి పురుషుడు!' అంటూ పంచ్ ఒహటి విసిరేసారు.. మా వారు  పంచాంగం చూసుకొంటూ కూడా!
శంకరం అంటే మా ఆడపడుచుగారి  పెద్దబ్బాయి. పదహారణాల తెలుగు బాలుడు.   'ఒహ అణా తక్కువైనా ఫరవాలేదు.. వయినమయిన తెలుగు పిల్లే కావాల'న్న పీకులాట  పిల్లోడికి.. వాడి తల్లికి!
'పెద్ద పండుగయ్యే లోపల పిల్లనెతుక్కురమ్మ'ని పిల్లాడిని ఇండియామీదకు తోలింది ఆ అమెరికా తెలుగుతల్లి.
పిల్లోడి వరాన్వేషణలో ఓ మజిలీ మా ఇల్లు ఈ సారి పండక్కి!
'సంక్రాంతి అంటే నాకు మహా ఇష్టం ఆంటీ! భోగిమంటలు, భోగిపళ్ళు, రంగవల్లులు, రంగు రంగుల గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, గుళ్ళో చెక్కర పొంగలి, గాలిపటాలు, బొమ్మల కొలువులు, కోడిపందేలు.. ఓహో.. చిన్నప్పుడు అంకుల్ వాళ్ల ఊళ్లో మా మజాగా ఉండేందంటగా.. మామ్ చెబుతుంటుంది పద్దస్తమానం!.. అ లైక్ దట్ లైఫ్.. ఐ లవ్ దట్ తెలుగుదనమ్' అంటూ శంకరం ట్రాన్సులోకి వెళ్ళిపోయి ఊగిపోతుంటే 'పాపం పిల్లోడు!’ అనిపించింది ఆ  అమాయకత్వం చూసి!
తర్పణాల దగ్గర్నుంచీ అన్నీ చక్కంగా చెప్పుకొస్తున్నాడు! పండగంటే పిండివంటలు.. టీవీలో కొత్త సినిమాలు' అని తప్ప ఇంకేమీ తెలీని మా సజ్జుకన్నా వెయ్యి రెట్లు నయమేగానీ.. వీడి అమ్మ వీడిని మరీ ఇంతగా చెడగొట్టాలా! పిటీ! వీడి పిల్ల ఉబలాటం ఇహ ఈ జన్మకీడేరేనా!' అనిపించింది నాకు.
మూడు కర్రముగ్గులేద్దామంటేనే జానెడు జాగా దొరకదీ టిక్కీ అపార్టుమెంట్లలో! ఇహ గొబ్బెమ్మలంటే గోమయ మెక్కడినుండి దిగుమతవాలి!
'సెల్లార్లోని మనవంతు  నేలమీద స్టిక్కరుముగ్గు అతికించి ప్లాస్టిక్ గొబ్బెమ్మలన్నా పెడదామే పాపం బావ ముచ్చట తీర్చడానికి!' అని తగులుకున్నాడు మా సుపుత్రుడు సుందరం. వాడివన్నీ మన ఆంధ్రా సి.యం హైటెక్ బుద్ధులే!
ఆ మాట శంకరం చెవినబడింది. ఇహ ఊరుకుంటాడా!' మన తెలుగుముగ్గుల్లో బేసిగ్గా గ్రాఫిక్ ఎలిమెంట్సు బోలెడున్నాయత్తా!, ఈ మధ్యనే చదివానేదో పత్రికలో.. గొబ్బెమ్మల్లోని గోబర్ ఎలిమెంటు యాంటీ-వైరస్  పనిచేస్తుందంట  ఎన్విరాన్మెంటుమీద! సో.. నో స్టిక్కర్ ముగ్గులు.. నో ప్లాస్టిక్ గొబ్బెమ్మలు! ఒన్లీ రియల్ ఆవుపేడతో గొబ్బెమ్మలు.. బియ్యప్పిండితో ముగ్గులు!’
'సిటీలో దూధ్ పేడా దొరుకుతుందిగానీ.. ఆవు పేడ ఎక్కడ దొరుకుతుంది బావా.. నువ్ మరీనూ!’ అంటూ మా సుందరం  మొత్తుకోలు.
పంతానికని  బావమరిదిని వెంటేసుకొని కార్లో ఎర్లీఅవర్ సిటీటూరుకి బైలుదేరాడు అమెరికా తెలుగుబాలుడు శంకరం!
గోశాలయితే డిస్కరయిందికానీ.. 'పొంగల్ సీజన్ కదా! ఔటాఫ్ స్టాక్! ఆన్లైన్ ఆర్డర్సే   గండంగా ఉంది1  కౌంటర్ సేల్సుకూడానా.. పదండిహ!' అంటూ  బైటికి గెంటేశార్ట ఈ బాలకులిద్దర్నీ గోశాల పాలకులు! బికమొగాలేసుకు చక్కా వెనక్కొచ్చేశారు శూరులు!
'పోనీ! మనకు తెలిసిన మినిష్టరున్నాడు. ఆ సోర్సేమన్నా ట్రై చేయమంటావేంట్రా! ఒహ వంద డాలర్లు మనవి కాదనుకున్నాసరే..  తట్టెడు పేడతెచ్చి గుమ్మంలో పోసి పోతారు గ్రేటరుఉద్యోగులుఅంటూ మేనల్లుడి సాయానికి వెళ్లబోయారు మా శ్రీవారు. ఎంతయినా ముద్దుల చెల్లాయి ఒక్కగానొక్క కొడుక్కదా!
'బ్రైబింగా?.. లాబీయింగా? నో వే మావయ్యా!' అని తలడ్డంగా ఆడించేసాడు ఈ అమెరికా అల్లుడు.
మధ్యాహ్నం కాలేజీనుంచి కంగారుగా తిరిగొచ్చేసి 'కంగ్రాట్సు రా శంకరం బావా! సోమాజిగూడ సెంటర్లో బోలెడన్ని ఆవులున్నాయ్రోడ్డుకడ్డంగా పడుకొని పోస్టర్లు మేస్తున్నాయ్! ఆ ట్రాఫిక్ ఈదుకెళ్ళి ట్రై చేస్తే నీ కోరిక తప్పక తీరవచ్చురా! పోరా!' అని మా కిలాడి పిల్ల కబురందించంగానే చెరో తట్టా పట్టుకొని మారథాన్ మొదలు పెట్టేసారు.. పట్టువదలని భట్టి, విక్రమార్కుల్లా బావా, బావమరుదులిద్దరు!
పోస్టర్లుతినే పశువుకి మూడెప్పుడొస్తుందో భగవంతుడికే తెలియాలి! మూడు గంటలపాటు చలి చెమటలతో వాటి వెనకాలెనకాలే పిల్లజంట  వెయిటింగు! తీరా నిరీక్షణ ఫలించి తట్ట పట్టుకొనే టయానికి బస్తీదాదా ఎవడో ప్రత్యక్షమై 'తీయరా! రౌడీ సుంకం' అంటూ డిమాండుకు దిగేసాట్టవట్టి తట్టల్తో చిందులేసుకొంటూ తిరిగొచ్చి  'పోలీస్టేషనుకెళ్ళి  ఫిర్యాదిద్దా'మని పేచీక్కూర్చున్నాడు పిచ్చిశకరం, రెండువేలపదహారు!
'సుబ్బరంగా గొబ్బెమ్మలుకూడా పెట్టుకోలేని పండక్కి ఇక్కడెందుకు..  దండగ! గ్రాండ్ మాఁ గారూళ్లో గ్రాండుగా జరుపుకొంటార్రా! అంకుల్ ఫ్యామ్లీ మొత్తాన్నీ వెంటేసుకెళ్ళు!' అంటూ హ్యూస్టన్నుంచి వాడిమామ్ హుకుం!
అప్పటికప్పుడే అందర్నీ కార్లెక్కించేశాడు తిక్కశంకరం!'
'నిజమేరా! మా చీరాల్లో అయితే ఇంచక్కా  చక్కెర పొంగలి, దద్దోజనం దండిగా దొరుకుతుందిరా! మా రెండో చెల్లెలు రేవతి ఏటా పిల్లలచేత బొమ్మల కొలువుకూడా పెట్టిస్తుంటుది..' అంటూ దారిపోడుగూతా మా వారి దంపుడు పాటలు!
మాటి మాటికీ శంకరం ముక్కుపుటాలు ఎగరేస్తుంటే మామగారి మాటకి ఎంకరేజ్మెంటేమన్నా ఇస్తున్నాడేమో అనుకొన్నాను. పొరపాటు. ఆయనగారు ముక్కుపొడుం పీల్చేటప్పుడూ  ముక్కుపుటాలెగరేయడం మానలేదు ఈ అర్భకుడు!
'ఎక్కడో ఏదో దుర్వాసన! మీకెవరికీ ఏమీ అనిపించడం లేదా!' అని ఆ పిల్లాడు ఒహటే గుండెబాదుళ్ళు!
అమెరికన్ గాలి అలవాటయిన నాసిక్కి  ఇక్కడిగాలిట్లాగే కంపు కొట్టడం కామన్! పొల్యూషనుమీద లెక్చర్లు దంచుడేగాని.. ప్రాక్టికల్ కాలుష్యంఘాటు  బిడ్డకింకా అలవడ్డట్లు లేదు!
'పండగలు సంస్కృతికి సంకేతాలు. మొనాటనీనుంచి మనల్ని కాపాడే టానిక్కులు.' అంటూ పండగలమీదతగాడు థీరీ దంచుతుంటే.. పోనీలే.. ఆవిధంగానైనా ఆ బాబు  ద్యాస సంప్రదాయాలమీదకు మళ్ళడం మంచిదేననిపించింది. మౌనంగా ఆ రంపపుకోతకు తలొగ్గి ఉండిపోయాం ఫ్యామిలీ అందరం.. ఒక్క మా వారు మినహా!
రంపం రెండో కొస ఆయనగారు అందిపుచ్చుకొన్నారిహ 'అవున్రా అల్లుడూ! మా బాగా చెప్పావు కానీ పండగ పరమార్థమంతా ఇప్పుడు పూర్తిగా మారిపొయిందోయ్ శంకరం! గొబ్బెమ్మలంటే పేడముద్దలని.. గంగిరెద్దులంటే బక్క ఎద్దులని  మా పిల్లదానికి చీదర.. చులకన! హరిదాసుకీ ముష్టోడికీ తేడా తెలీని  తెలివితక్కువతనం మా పిల్లోడికి!..'
పిల్లల్ని కాపాడడం కన్నతల్లిగా నా కర్తవ్యం అనిపించింది. 'పండగలకి.. ప్రస్తుతానికి రెలవెన్సేంటో చెప్పరాదా.. తెలిస్తే! విని పిల్లలు నేర్చుకోమన్నారా  చెప్పాల్సొన రీతిలో చెబితే! అస్తమానం ఆ కంపుపొడి దోపుకొని ముక్కులు నులుముకోడమేగాని.. నోరు తెరిచి ఏనాడైనా ఓ మంచిముక్క చెవినేశారా!' ఆవటా అని నేనూ నోరు చేసుకొన్నానిహ వింటూ కూర్చునే ఓపిక సంపూర్ణంగా నశించి!
'రెలవెన్సా.. బోలెడంతుందోయ్ భామామణీ! ఉదాహరణకి ఇప్పుడీ సంక్రాంతినే తీసుకోండి! రకరకాల సోషల్ ఫోరమ్సునుంచి..  సైన్సు ఎగ్జిబిషన్లదాకా.. వేదిక ఏదైనా సరె .. మన  నేతలు వేసే చిందులు పండక్కి వచ్చే పగటివేషాలని మరిపిస్తున్నాయా లేవా! కోడిపుంజుల్లాగా సినిమాహీరోల అభిమానులు కొట్టుకొంటున్నారు. నీళ్లకోసం కొట్లాట.. రాబోయే ఎన్నికల్లో కాబోయే సి.యం పదవికోసం కాట్లాట! పొట్టేళ్ల ఢీఢిక్కులకన్నా ఎందులో తక్కువ మన యూనివర్శిటీల కుమ్ములాటలు! పిట్టలదొరల్లా మనల్ని మాటల్తో బోల్తాకొట్టించే నేతాగణం.. పథకాల పేరుతో అశ్సరభ శరభయ్యలను మించి కనికట్టు విద్యలను ప్రదర్శించే ప్రభుత్వం.. ఇవన్నీఈ పండుగ   రెలెవెన్సులేనే పిచ్చిదానా! కైట్ ఫ్లయింగని కామర్సులో ఓ తమాషా పదముంది. సరుకులేమీ లేకుండానే సొమ్ములటూ ఇటూ చేతులు మారుతుంటాయి. అదో రకం ఫోర్ట్వంటీ తతంగం. అధికారంలొ ఉన్న పెద్దలు అస్తమానం ఎగరేసేదీరకం పతంగుల్నే! ఇది రెలెవెన్సు కాదా లోలాక్షీ ! భిక్షాపాత్ర నెత్తిమీదెట్టుకొని చిడతలు కొట్టుకుంటూ 'రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా!' అంటూ గడప గడపా తడివే హరిదాసుల ప్రేరణే కదా  మన ముఖ్య మంత్రులిద్దరి పెటుబళ్లకోసం దేశదేశాలు
చక్కర్లు! ఫండ్సన్నీ కృష్ణార్పణమైపోతున్నాయని అప్పోజిషను వాళ్ళట్లా  ఆపసోపాలు పడిపోతున్నది..  గంగిరెద్దుల్లా హై కమాండు పాటలకు వంతలేస్తున్నదంతా సంక్రాంతి రెలెవెన్సు పద్దులోకే జమేసె తంతులేనే తల్లీ! అయ్యగారికో.. అమ్మగారికో దణ్నం పెట్టకపోతే పొద్దుగడవని దుస్థితి అన్ని పార్టీల్లోనూ ఉన్నది. ఇదీ పండగ రెలెవెన్సేనే పంకజాక్షీ! బొమ్మలకొలువుల్లో బారులు తీరి నిలబడ్డ బొమ్మల్లకు మల్లే..  ఎవరెవరో ఎన్నికల వేదికలమీద వరసల్లో నిలబడి చేతులూపేస్తున్నారు. ఇది పండగ రెలెవెన్సు కాదంటావా కాదంబరీ!’
మా వారి గోలలో పడి కారు ఊర్లోకి ఎప్పుడొచ్చిందో తెలీలేదుఏ ఇంట చూసినా ఏడుపులూ.. పెడబొబ్బలూ! పండగ పూటకూడా ఇంత విచారాలెందుకో!
'హాయ్! హ్యాపీ పొంగల్! హ్యాపీ బైశాఖీ.. హ్యాపీ గుడిపడ్వా!' అంటూ ఎదురొచ్చింది  మా తోడికోడలు చిన్నకూతురు మంగతాయారు. సిక్స్టీన్ డాలర్స్ సెక్స్తీడాల్లా వంకర్లు పోయే ఆ కుంకనుచూసి నాకే చచ్చే సిగ్గేసింది. ఇహ ఈ శంకరం కొంకర్లు వేరే చెప్పాలా?
'ఇంట్లో ఎవరూ లేరా.. ఏంటీ! ఊళ్లో కర్ఫ్యూనా? ఆ ఏడుపులేమిటి? పెడబొబ్బలెవరిమీద?' అని బిక్కు బిక్కుమంటూ లోపలికి చుట్టూ చూసాడు శంకరం.
'టీవీలో సీరియల్ నడుస్తోంది బ్రూ ఇన్ లా! 'కాపురం నాది.. కన్నీళ్లు నీవి!' కోటి పదకొండో ఎపిసోడు! ఆ ఏడుపులయితేగాని జనసంచారం  మళ్లీ మొదలవదు మా ఊళ్లో! ఈ బోరు భరించలేకే బాబూ.. బాబరుతో కలిసి టౌన్లో షికారుకెళ్లేది. వస్తా! క్యాబ్ వాడు ఒహటే రింగులిస్తున్నాడు' అంటూ కంగారుగా తుర్రుమందా  గడుసుపిండం!  
తోడికోడలొక్కతే నట్టింట్లో కూర్చుని కన్నీళ్ళు పెట్టుకొంటోందిసీరియల్ సీరియస్గా చూసేస్తూ!
'అన్నయ్యగారేరీ?' అనడిగితే  'కోళ్లపందేల కెళ్లా'రంది.
'పిల్లాడేడీ?' అనడిగితే 'ఇంటర్నెట్ సెంటర్లో ఉన్నాడంది.  'అత్తయ్యగారన్నా కనపడాలి కదా! గుడికెళ్లారా?' అనడిగితే
'గుడా! గుడెసా! ఈ అమెరికా మనవడు అదేదో ఐ-పాడో.. పాడో కొనిపంపించాడుగా ఆ మధ్య! పెరట్లో కూర్చుని ఎవర్తోనో చాటింగు చేస్తోంటోంది పొద్దస్తమానంఅంది రేవతి.
ఒక్కక్కరే మెల్లిగా గూటికి చేరడం మొదలు పెట్టారు. సాయంచీకట్లు  చిక్కపడ్డాయి.
తెల్లారి బారెడు పొద్దెక్కినా ఇంట్లో పండగ కళేం కనిపించలేదు.  పొయ్యిలో పిల్లే కళ్లు తెరవలేదుమా సిటీ అపార్టుమెంటుల  కాపురమే బెటరు!
'బారెడు పొద్దెక్కింది. బైట పండగ ముగ్గేమీ వెయ్యలేదేంటి ఆంటీ! గొబ్బెమ్మలుకూడా కనిపించలేదే!' శంకరం ఒహటే గొణుకుడు!
'రాత్రి సినిమా చూస్తూ ఆలస్యంగా పడుకుండి పోయానయ్యా! మద్యాహ్నం పనిమనిషి వస్తుందిగా! ఆ ఆవుపేడేదో తెప్పించి దానిచేతే  తోచిన ముగ్గేదో గీయిస్తాలే!’ అంది బద్ధకంగా మళ్ళీ టీవీముందు చతికిలబడుతూ మా ఆడపడుచు.
'! పండక్కి అమెరికాలోనే ఉండుండాల్సింది. అక్కడైతే అట్లతద్దెకూడా అట్టహాసంగా చేసుకొంటాం అందరం కలసి. మా అమ్మ మాటలు నమ్మి ఇంత దూరమొచ్చాను చూడు.. నా చెప్పుజోడుతో నా దవడ నేనే దడదడా కొట్టుకోవాలి!' అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ పంచులోకెళ్ళి కూర్చున్నాడు శంకరం.
'గొబ్బెమ్మలేగా  సాబ్ మీకు కావాల్సింది.. ఇంద!' అంటూ కారు డిక్కీనుంచి ఇంత పేడకడి.. ప్లాస్టిక్ పొట్లాంలో చుట్టి ఉన్నది.. బైటికి తీసి గుమ్మంముందు పడేసాడు కారు డ్రైవరు.. సలీం!
ఆశ్చర్యంతో మాకెవరికీ నోట మాట రాలేదు.
శంకరం అయితే ఆనందోద్వేగభావాలతో కన్నీళ్ల పర్యంతమయిపోయాడు!  సలీంని గట్టిగా గుండెలకి  హత్తుకుంటూ  ఊపేసాడు 'ఇంత పేడ.. ఇంత కుప్ప.. ఈ పండగ సీజన్లో నీకెక్కడ దొరికింది.. మియా!'
'దార్లో ఇంజనుకి నీళ్ళకోసం దిగినప్పుడు దొరికింది సాబ్! కొత్త సినిమాలేవో రెండు రిలీజయినట్లున్నాయ్  ఆ పలెటూళ్ళో! గోడలనిండా  సినిమా పోస్టర్లు!  పోస్టర్లనిండా పేడకడులు!   మీరు కలవరిస్తున్నారుకదా అని కాస్త తీసి దాచుంచా!' అన్నాడు. మాకు మా పండగలెంత ముఖ్యమో.. మీకీ మీ పండగలంతే ముఖ్యం కదా!’ అన్నాడు సలీం వినయంగా!
శంకరం సెల్లో వాళ్ల మామ్ తో చెబుతున్నాడు  జరిగిందంతా  ఆ సాయంత్రం ఓ ఉద్వేగంతో '.. యెస్.. మమ్మీ! స్యూర్! అడుగుతా! లకీగా సలీంసాబ్ కి పెళ్లీడు కూతురుండాలే గానీ.. నా వరాన్వేషణకు.. ఇహ 'శుభం' కార్డు పడ్డట్లే..!'
***
-కర్లపాలెం హనుమంతరావు
(వాకిలి- లాఫింగ్ గ్యాస్- ఫిబ్రవరి 2016 సంచికలో ప్రచురితం)
'

'

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...