Wednesday, February 19, 2020

మహాత్ముడు మామూలు మనిషి కాదా.. మొదట్లో? -కర్లపాలెం హనుమంతరావు






గాంధీజీ పోరాటం చేసింది తెల్లవారి పాలనకు వ్యతిరేకంగా. ఆయన తపించింది తెల్లవారితో సమరం చేసే సమయంలో హింస వైపుకు మళ్లరాదనే నియమం కోసం. గాంధీజీని క్రమంగా బాపూజీగా..  మహర్షిగా మార్చివేసింది భారతీయులలో అతని పట్ల పెల్లుబుకుతూ వచ్చిన వ్యక్తిగత ఆరాధన. అదే చివరికి  దైవభావనగా మారింది. బాపూజీ బతికి ఉన్నరోజుల్లోనే ఈ తరహా  భావోద్వేగాలు పొడసూపినా తన దృష్టికి వచ్చిన ప్రతీసారీ గాంధీజీ నిర్ద్వందంగా ఖండించేవారు.   అయినా ఆయనకు మరణానంతరం ఈ దైవరూపం తప్పిందికాదు.
కానీ.. జాతికి ఇంత సేవ చేసిన గాంధీజీకి  ఇన్ని కోట్ల మంది   భారతీయులలో  కనీసం కృతజ్ఞతగా ఒక్కరికైనా  చక్కని చలనచిత్రం ద్వారా నివాళి అర్పిద్దామన్న మంచి ఆలోచన తట్టలేదు! చివరికి బాపూజీకి  వెండితెర మీద దర్శన భాగ్యం కల్పించింది ఒక తెల్లవాడే .. అటెన్ బరో! స్వదేశీ ఉద్యమాన్ని అత్యంత విజయవంతంగా నడిపించిన  గాంధీజీని ఆ పాత్రలో మెప్పించింది ఒక విదేశీయుడు.. బెన్ కిన్స్ లే! అదొక పారడాక్స్!  కాని ఒకందుకు  అదే మంచిదయిందనిపిస్తుంది.
అటెన్ బరో 'గాంధీ' చిత్రం బ్లాక్ బస్టర్ అయిన తరువాత ఆ సినామా వసూళ్లలో వచ్చిన లాభాల నుంచి కొంత మొత్తం పేద, వృద్ధ కళాకారులు ఎందరికో నెల నెలా పింఛనులా ఆర్థికసాయం అందించారు చాలా కాలం. బాపూజీ ఆదర్శాలకు అనుగుణంగా ఆయన పోయిన తరువాత కూడ కొంత మంచి పని జరిగిందన్న తృప్తికి ఆస్కారం కల్పించారు అటెన్ బరో బృందం. అదే భారతీయుల ఆధ్యర్యంలో గాని చిత్ర నిర్మాణం జరిగి వుంటే? నిర్మాతలు భారీ బడ్జెట్ అయిందన్న మిషతో వినోదప్పన్ను కోసం లాబీయింగ్ చేసుకోవడంలో బిజీగా ఉండిపోయేవారు. చిత్రం విజయవంతం అయివుంటే  ఆర్థిక లాభాలలో ఒక్క పైసా అయినా పేదవర్గాలకు నలిపి నామం పెట్టి ఉండేవాళ్ళు కాదన్న మాట గ్యారంటీ !
వీటికి మించి చెప్పవలసిన మరో ముఖ్యమైన విషయం బాపూజీని చిత్రంలో చిత్రీకరించే విధానంలోని తారతమ్యం. విదేశీయుల చేతిలో నిర్మాణం అయింది కాబట్టి పూర్తిగా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ మామూలు గాంధీగా మొదలై .. బాపూజీగా, మహర్షిగా వికాసం చెందిన క్రమాన్ని సహజ పరిణామ దశల పద్ధతిలో నప్పేలా తీసే ప్రయత్నం చేసారు. ఎక్కడా 'సూపర్ఫిషియల్' అన్న భావనకు ఆస్కారం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
గాంధీ అందరిలాంటి మనిషే. అందరిలానే చదువుకుని , పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలను కన్న తండ్రి ఆయన.  ఉపాధి కోసరంగా అందరిలానే విదేశాలలొ అవకాశాల కోసం వెదుకులాడుకుంటూ వెళ్లిన  యువకుడు. అక్కడ ఎదుర్కొన్న జాతి వివక్షకు సంబంధించిన అవమానాలను ఎదుర్కొని పోరుసలపాలన్న దీక్షతో ముందుకు వెళ్లి విజయవంతమైన తరువాతనే ఒక గౌరవప్రదమైన వ్యక్తిత్వంతో భారతదేశం తిరుగుముఖం పట్టింది.
దక్షిణాఫ్రికాలో తెల్లవారి దెబ్బలకు గాయపడ్డ పూట  గాంధీ ఇంట్లో కస్తూరి బాయితో కలసి చేసిన ఒక సన్నివేశంలో దర్శకుడు గాంధీని ఏ విధంగా చిత్రించదల్చుకున్నాడో.. స్పష్టంగా అర్థమవుతుంది. బుగ్గ మీద అంటించిన టేపు బాగా గుంజుతోంది తీయమని కస్తూరి బా ను అడుగుతాడు గాంధీ. కస్తూరి బా భర్త మంచం మీద కూర్చుని అటు తిరిగి    ఆ టేపును తీసే సందర్భంలో గాంధీజీ ఆమె వీపు మీద చేతులు వేయడం చూపిస్తాడు దర్శకుడు. ఆ సమయంలో గాంధీజీ కళ్లల్లోని ఎరుపు జీర మీద ఫోకస్ చేయడం అత్యంత సహజంగా వచ్చిన సన్నివేశం. 'బ్రహ్మచర్యం పాటిస్తానన్నారుగా?' అని అడుగుతుంది కస్తూరి బా అప్పటికీ! ఒక్క క్షణం మౌనం. (తప్పు జరిగిన తరువాత అని కాబోలు అర్థం) 'రేపు ఒక రోజుకి ఉపవాసం ఉంటానులే'అంటాడు గాంధీ. ఒక తప్పుకు ఒక రోజు ఉపవాసంతో సరి అని కాబోలు గాంధీ భావం! 'మరీ ఎక్కువ ఆనందించకండి.. రెండు రోజులు ఉపవాసం ఉండాల్సి వస్తుంది' అంటుంది కస్తూరిబా. ఆ తరువాత గాంధీ కస్తూరి బాయిని ఆనందంతో ముంచెత్తుతాడు.  ఆ సన్నివేశం మనకు భారతదేశంలొ కనిపించదు. చూడాలంటే విదేశీ వెర్షన్ చూడకతప్పదు.
మనిషి నుంచి మహాత్ముడిగా  గాంధీజీ ఎదిగిన క్రమం చూసే భాగ్యం బైటదేశాలవారికే అన్నమాట. మన వాళ్లకు బాపూజీని మానవ మాత్రుడుగా చూపించడం పెద్ద దోషం. ఆయన ఆకాశం నుంచి ఊడిపడ్డట్లు జాతి భావించాలన్నది కాబోలు.. సెన్సారు సార్ల ఉద్దేశం.
బాపూజీ కూడా కోరుకోని వీరాభిమానం ఇది. అలా దైవ భావన ఆపాదించుకునేదుంటే 'సత్యంతో నా ప్రయోగాలు' ఆత్మకథలో మరీ అన్ని పచ్చి నిజాలు దాచకుండా నిర్భీతిగా ఎందుకు పెట్టడం?!
ఈ తరహా దౌర్భాగ్యం ఒక్క బాపూజీకే కాదు..   రాముడు, సీత, ఆంజనేయుడు, అంబేద్కర్, ఫూలే వంటి ఎన్నో వ్యక్తిత్వాలకు తప్పడం లేదు. రామా అంటే బూతు కూత కూస్తున్నారంటూ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు అవడం ఈ మధ్యన మరీ ఎక్కువయింది! అందుకే ఈ ఉదాహరణను ఇక్కడ విజ్ఞుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసింది. ఆలోచించవలసిన అవసరం ఇహ పైన బుద్ధిమంతులదే! స్వస్తి!
-కర్లపాలెం హనుమంతరావు
19 -02 -2020
(ఓంకార్ ‘ఆల్ ఇన్ వన్’ ఆధారంగా)
***

Tuesday, February 18, 2020

అభినవ భీమకవిగా మహాకవి శ్రీశ్రీ! -కర్లపాలెం హనుమంతరావు





అభ్యుదయ కవిగా, ఆధునిక యుగ వైతాళికుడుగా శ్రీ శ్రీ ని అభిమానించే అనేక కోట్ల మంది తెలుగువాళ్ళల్లో నేనూ ఒకడినే. కాని మధ్య మధ్యలోఆ మహాకవి పెన్ను విదిల్చిన  వికటకవిత్వం చూసి కొద్దిగా బాధ! శ్రీ శ్రీ తిక్క రేగితే వేములవాడ భీమకవి, అడిదం సూరకవుల కోవలోకి జారిపోతూ తిట్టుకవిత్వం లంకించుకునేవారని అంటూ వుంటారు.
సినిమా పాటలకు వచ్చిన అవకాశాలు ఒకళ్లవి ఒకళ్లు గుంజేసుకున్నారన్న ఆక్రోశంతో మరో ప్రసిధ్ధ కవితో శ్రీ శ్రీ జ్యోతి మాస పత్రిక పుటల్లో కయ్యానికి కాలుదువ్వడం గుర్తుకొస్తుంది. ఆ ఇద్దరు కవులు సంచిక మార్చి సంచిక లో ఒకళ్ల మీద ఒకళ్లు దుమ్మెత్తి పోసుకున్న తీరు అప్పటి కవిత్వపాఠకులకు అదో కొత్త రకం అనుభవం. తనను 'నరసింహావతారం' అన్న అభియోగానికి ప్రతిస్పందనగా శ్రీ శ్ర్రీ 'అన్నట్టు నువ్వే నా అన్నయ్యవేమో/ఒక అవతారం ముందరివాడివి' అని బదులిచ్చారాయన. దశావతారాలలో నరసింహావతారానికి ముందొచ్చే అవతారం తమకు తెలిసిందేగా.. 'వరాహం' ! అదీ
 శ్రీ శ్రీ గారి కలం ధాటి!
1953 లో ఏర్పడ్డ  ఆంధ్రరాష్ట్రం ముఖ్యమంత్రి మంత్రి హోదాలో ప్రకాశంపంతులుగారి పాలబడ్డదన్న ఆక్రోశం ఎంచేతనో శ్రీశ్రీగారికి. ఆ కోపం అణుచుకునే సహనం లేక 'ముక్కుపచ్చలారని న/
వ్యాంధ్ర రాష్ట్ర శిశువు/
మూలుగుతూ మూలనున్న /
ముసిలాడికి వధువు' అంటూ  ఛకాల్మని పెన్ను తీసి చమత్కారమనుకుని గిలికేసేసారు  శ్రీ శ్రీ!
ఇంకో  సందర్భంలో హఠాత్తుగా కొద్ది మంది తెలుగు సుప్రసిద్ధ కవుల మీద అలిగారు శ్రీశ్రీగార్య్! ఆ క్రుద్ధత్వానికి కవితా రూపంః 'ఏరి తల్లీ నిరుడు మురిసిన/
 ఇనప రచయితలు?/
కృష్ణశాస్త్రీ టుష్ట్రపక్షీ/
దారి తప్పిన నారిబాబూ/
ప్రైజు ఫైటరు పాపరాజూ/
పలకరెంచేత?'
కృష్ణశాస్త్రి, శ్రీరంగం నారాయణబాబు, పాలగుమ్మి పద్మరాజులను ఉద్దేశించే ఆ ఆక్రోశం అని వేరే చెప్పాలా?
స్థానం నరసింహారావుగారికి పద్మశ్రీ ఇవ్వడం ఎంచేతనో శ్రీ శ్రీ గారికి అభ్యంతరం అనిపించింది. కడుపులోని కోపాన్ని కాగితం మీద పెట్టనిదే నిద్రపట్టని మనస్తత్వం గదా మహాకవిది! 'ప్రభుత్వం ముద్రించిన పద్మశ్రీలు/
ముట్లుడిగిన ముత్తవ్వలు ఛద్మస్త్రీలు' అంటూ కవిసమయం వేసేశారో కవితలో. ఛద్మం అంటే కపటం.  స్త్రీకి ఇవ్వకుండా  స్త్రీ  వేషాలు ధరించే స్థానం వారికి పద్మశ్రీ వచ్చిందనా.. ఆ దుర్భాష .. తెలియదు!
శ్రీశ్రీగారిని గురించి ఇలా రాసినందుకు అభిమానులు నా మీద ఆగ్రహిస్తారని తెలుసును. మహాకవి శ్రీ శ్రీ కవిత్వం అంటే నాకూ  మహా ఇష్టమే! ఇష్టపడని తెలుగువాడు  ఎవరు? కానీ ఈ తరహా భీమకవి దారిలో సాగడమే నా బోటి అభిమానులకు బాధ కలిగించే విషయం. నన్ను తిట్టదలిచిన వాళ్లు ముందు
శ్ర్రీ శ్రీ గారు తనను గూర్చి తానే ఏమనుకున్నారో  ఈ నాలుగు పంక్తుల కవిత చదివి అప్పుడు నిస్సందేహంగా తిట్టవచ్చు! నో ప్రాబ్లమ్!
'నేలమునగ చెట్టెక్కగ/
నిచ్చెన వేస్తావుటగా/
శ్రీశ్రీనే ఎదిరించే /
ఎత్తుకి పెరిగావటరా/
ఎడా పెడా వాయిస్తా..' అంటూ వీరంగం వేస్తారు మరి మన శ్రీరంగం శ్రినివాసరావుగారు మరో సందర్భంలో.
శ్రీ శ్రీ గారే ఒక సందర్భంలో అన్నారు కదా..'వాదాన్నెదిరించలేని వాడే తిడతాడు' అని. అక్షరాల  తన మాటలతోనే తన మాటలు ఎంత నిజమో నిరూపించిన మహానుభావుడు మహాకవి శ్రీ శ్రీగారు!
బోళాతనం అలాగే బొళబొళ మాట్లాడించేస్తుందనుకుంటా.. మహాకవులనైనా సరే .. యుగవైతాళికులనైనా సరే! అదీ సంగతి!
శ్రీ శ్రీ గారి మీద అమితమైన అభిమానం ఉన్నా  తెలిసిన నిజాలని నిర్మొహమాటంగా నలుగురితో పంచుకొనే అలవాటు వల్ల ఈ రాత. అభిమానులూ.. క్షమిస్తారుగా!
-కర్లపాలెం హనుమంతరావు
19 -02 -2020

ఇస్లాం మతం -కర్లపాలెం హనుమంతరావు


వేరే మతాలలో ఉన్నంత మాత్రాన అన్యమతాలను గురించి ఆసక్తికరమైన సమాచారం తెలుసుకోరాదని ఏమీ లేదుగా! ఆ తరహా అభిరుచి కలవారి కోసమే ఈ చిన్నవ్యాసం! ఇస్లాం మతాన్ని గురించి టూకీగా  తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవాళ్ళకు!


పుట్టింది కేవలం 1500 ఏళ్ల కిందట. కానీ ప్రపంచ జనాభాలో ఆరో శాతనికన్న కొంచెం ఎక్కువగా ఇప్పుడు విశ్వసిస్తున్నది ఇస్లాం మతం. ప్రపంచ జనాభా 652 కోట్లు అని లెక్కవేసిన 2004లో ముస్లిం మత విశ్వాసుల సంఖ్య 152 కోట్లు. ఇండొనేసియాలో మెజారిటీ మతం ఇస్లాం 21 కోట్ల 60 లక్షలు. సౌదీ అరేబియా, బహ్రేన్, వెస్ట్రన్ సహారాలలో వంద శాతం ముస్లిములే! టర్కీ, ఒమాన్, గాజా, యూ.ఎ.ఇ, సోమాలియా, ఇరాన్, అల్జీరియా, ట్యునీషియా, లిబియా, గాజాస్ట్రిప్, కతర్, సెనెగల్, సిరియా, గాంబియా, మాలి లాంటి దేశాలు ఇంకా చాలా చిన్నవి పొన్నవీ ఉన్నాయి.. వాటిలో నూటికి తొంభై మంది ముసల్మాన్ మతస్తులే! భారతదేశంలో 109 కోట్లుగా ఉన్నప్పుడు ముస్లిం జనాభా15 కోట్ల 30 లక్షలు. జనాభాలో  ఏడో వంతు. (పాకిస్తాన్ జనాభా మరో 70 లక్షలు మాత్రమే అధికం). ఇవన్నీ కొత్త శతాబ్దం తొలి దశకం అంచనాలు. తతిమ్మా అన్ని మతాల కన్నా ముస్లిం జనాభా అత్యంత వేగంగా పెరుగుతున్నట్లు అంతర్జాతీయ గణాంకాలు లెక్కలు వేసుకుని చెబుతున్నాయి.

ఇస్లాం అనే పదం అరబిక్ భాషలోని 'స్లం' అనే అక్షరం నుంచి పుట్టింది. మనసుని, బుద్ధిని భగవంతుని పరం చేసి సాధించే శాంతిని 'స్లం' అంటారు. ముస్లిం అంటే బుద్ధిని సర్వేశ్వరుని పరం చేసిన వ్యక్తి. 'ఖుర్ ఆన్' వీరి పవిత్ర గ్రంథం. ఇందులోని సూక్తులన్ని స్వయంగా భగవంతుడు ప్రవక్తకు అందించినవిగా విశ్వాసం. 
ఇస్లాం ప్రవక్త పుట్టించిన మతం కాదని.. సృష్టి ఆది నుంచి ఉన్న మతాన్నే ప్రవక్త ద్వారా ప్రపంచానికి తెలియచేసాడని మత పెద్దలు భావిస్తారు. తన ముందు వచ్చిన ప్రవక్తలకు మల్లే ఇస్లాం మత సూత్రాలని ఏ కొద్దిమందికో కాకుండా ప్రపంచమానవాళి మొత్తానికి అందించిన కారణంగానే మహమ్మద్ ప్రవక్తకు ఎక్కువ ప్రాచుర్యం లభించినట్లు ఓ అభిప్రాయం.  
తాము నమ్ముతూ వస్తున్న మత భావాలకు విరుద్ధంగా హేతుబద్ధమైన సూత్రాలతో ప్రపంచాన్ని వేగంగా ఆకర్షించే మహమ్మదు ప్రవక్త మీద ఆ మత పెద్దలకు సహజంగానే కినుక. కినుక ఎక్కువ అయితే హింసకు దారితీస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. మహమ్మదు మీదా, అతని అనుచరల మీదా హింసాకాండ పెచ్చుమీరడంతో మక్కాను వదిలి 'రెడ్ సీ' (ఎర్ర సముద్రం) మీదుగా అబిసీనియా(ఇప్పుడది ఇథియోపియా) చేరుకున్నాడు  మహమ్మద్. ప్రవక్తను అనుసరించిన నూటొక్క మంది అనుచరులలో 83 మంది పురుషులు, 18 మంది స్త్రీలు. అయినా మక్కాలో మహమ్మద్ కుటుంబాన్ని సంఘబహిష్కరణ చేసి హింసించింది మక్కా  మతపెద్దల గుంపు. ప్రవక్తకు అండగా ఉంటూ వచ్చిన పినతండ్రి  అబూ తాలిబ్, భార్య ఖదీజా మరణించిన విషాద కాలాన్ని ముసల్మానులు అముల్ హుజ్న్ (విషాద సంవత్సరం)గా పరిగణిస్తారు. ఆ తరువాతా మహమ్మద్ మీద హింస తగ్గింది కాదు. ఆ ప్రతికూల వాతావరణంలోనే మక్కావాసుల  భక్తి విశ్వాసాలను క్రమంగా చూరగొన్నాడు. సమీపంలోని  ఎస్రిబ్ నగరానికి వెళ్ళి భగవంతుని వాణిని వినిపించేందుకు సిద్ధమయాడు మహమ్మద్.  అక్కడి విరోధి వర్గాల మధ్యన సయోధ్య కుదిర్చి శాంతి వాతావరణం కలిపించి  తిరిగి మక్కా వెళ్లే సమయంలో రాత్రి వేళ హంతకుల మూఠా ఆయనను మట్టుపెట్టే ప్రయత్నం చేసింది. తన స్థానంలో ఆలీ అనే అనుయాయి ఉండిపోవడంతో మహమ్మద్ కు ప్రాణగండం తప్పింది. ప్రాణమిత్రుడు అబూ బకర్  ఒక్కడినే వెంటపెట్టుకుని మదీనా చేరడంతో ఇస్లాం చరిత్రలో కొత్త శకం 'హిజ్రీ శకం'  ఆరంభమయింది. 
ప్రవక్త మక్కా నుంచి మదీనా వలసవెళ్లడం 'హిజ్రల్'గా చరిత్రలో ప్రసిద్ధం.  ప్రవక్త రాకతో ఎస్రిబ్ 'మదీన్నతుబీ' (ప్రవక్త నగరం)గా పేరు మారిపోయింది.  ఎస్రిబ్ నగరవాసులు ఎందరో ఇస్లాం మతంలోకి మారిపోయారు. 
బహుదేవతారాధకులకు/అవిశ్వాసులకు.. ఇస్లాం మతానుయాయులకు క్రీ.శ 624 నుంచి 627 దాకా మూడు యుద్ధాలు జరిగాయి. మక్కా మదీనాలకు మధ్యన నైరుతీ దిశలో సుమారు 136 కి.మీ దూరంలో ఉన్న 'బద్ర్' అనే స్థలంలో క్రీ.శ 624లో జరిగిన యుద్ధం ఇస్లాం చరిత్ర గతిని మార్చేసిన ఘట్టం.  అది హిజ్రీ శకం ఆరంభం అయిన రెండో ఏడాది.   ముస్లిములు ఈ యుద్ధంలో ఓడిపోతే ప్రపంచంలో ఇప్పుడు ఇస్లాం అన్న ఒక మతమే ఉండేది కాదు. ఈ మాట స్వయంగా మహమ్మద్ ప్రవక్త యుద్దసమయంలో అల్లాకు చేసుకున్న విన్నపం ద్వారా తెలుస్తుంది. సంఖ్యాపరంగా తక్కువ పరిణామంలో   ఉన్నా ఇస్లాం పక్షం విజయం సాధించడానికి ఆనాడు అల్లా ఆశీర్వాదమే కారణమని  నేటికీ ముస్లిములు భావిస్తారు. తరువాతి  రెండు ఏడాళ్లూ రెండు యుద్ధాలు వెంట వెంటనే జరిగాయి.. ఉహుద్ కొండప్రాంతంలో ఒకటి, మదీనా పరిసరాల ప్రాంతంలో రెండోది. ఈ రెండు యుద్ధాలలో లభించిన   విజయాల కారణంగా  మక్కా కూడా ఇస్లాం మతం స్వీకరించడంతో విగ్రహాలు అక్కరలేని 'కాబా' పూజా విధానం ప్రపంచమంతటా ఆల్లుకునేందుకు పునాది పడినట్లయింది. ప్రపంచ ముస్లిములకంతా ఇప్పుడు 'హజ్' ను పవిత్ర స్థలంగా భావిస్తున్నారు.  జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుని తీరవలసిన పుణ్యస్థలిగా విశ్వాసం బలపడుతూ వస్తోంది. ఈ హజ్ యాతకే మన తెలుగు సర్కారులు ముస్లిములకు ఉచిత పథకాలుఉ ప్రకటించడం! 
క్రీ.శ 632, జూన్ 8 న (హిజ్రీ శకం 11 వ సంవత్సరం, రబీవుల్ అవ్వల్ నెల 11వ తేదీ) మహమ్మద్ తన 23 ఏళ్ల ప్రవక్త జీవితాన్ని చాలించుకుని బౌతికంగా కనుమరుగయినప్పటికీ.. ఆయన  ప్రసాదించిన జ్ఞాన సంపదలు ఖుర్ ఆన్, సున్నత్ ప్రపంచగతిని ప్రతీ దేశంలోనూ అనుకూలంగాగానో, ప్రతికూలంగానో ఏదో విధంగా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయ్!
ఖుర్ ఆన్ ముస్లిముల పవిత్ర గ్రంథంగా మనందరికీ తెలుసును. 'సున్నత్'- ప్రవక్త నెలకొల్పిన సంప్రదాయాల సంకలనం. ఆఖరి రోజుల వరకు ఆయన  చేసిన బోధనలు 'హదీసు' పేరుతో సుప్రసిద్ధం. సమాధులను, గోరీలను పూజాలయాలు చేయవద్దన్నది మహమ్మది ప్రధాన ఆదేశం.
అల్లా ధర్మమని భావించిన దానినే తాను 'హలాల్' గాను, అధర్మని భావించిన దానిని 'హరామ్' గాను బోధించినట్లు చెబుతూనే దేనినీ తనకు వ్యక్తిగతంగా ఆపాదించే ప్రయత్నం చేయవద్దని మహమ్మద్ ప్రవక్త  సూచిస్తారు. 

కానీ దురదృష్టం కొద్దీ ఇప్పుడు ఇస్లాం మతం పేరున చెలరేగుతున్న  అనుకూల, ప్రతికూల  సంఘటనలన్నీ మహమ్మద్ ప్రవక్త రూపంలో బోధించిన తీరుకు విరుద్ధంగానే సాగుతున్నవి. అదీ విచారకరం!
(అంతర్జాలంలో సేకరించిన సమాచారం ఆధారంగా ప్రముఖ పాత్రికేయులు శ్రీ పొత్తూరు వేంకటేశ్వరరావుగారు ప్రచురించిన 'పారమార్థిక పదకోశం.. ప్రేరణతో)
   రాసిన వ్యాసం. రచయితకు ఏ తరహా ఉద్దేశాలు ఆపాదించవద్దని ప్రార్థన.)
-కర్లపాలెం హనుమంతరావు
18 -02 -2020





Saturday, February 15, 2020

సరtదాకేః స్వర్గం- నరకం రచనః కర్లపాలెం హనుమంతరావు


ఎన్నికలైపోయాయి. ఓట్ల కౌంటింగుకి ఇంకా వారం రోజుల గడువుంది. ఎక్కడ చూసినా
టెన్షన్.. టెన్షన్! ఎవరినోటవిన్నా రాబోయే ఫలితాలను గూర్చి చర్చలే చర్చలు!
ఓటు వేసినవాడే ఇంత టెన్షన్లో ఉంటే.. ఓట్లు వేయించుకున్నవాడు ఇంకెంత
వత్తిడిలో ఉండాలి! రాంభద్రయ్యగారు ఓట్లేయించుకుని ఫలితాల కోసం నరాలుతెగే
ఉత్కంఠతో ఎదురుచూసే వేలాదిమంది అభ్యర్థుల్లో ఒకరు.
అందరి గుండెలూ ఒకేలా ఉండవు. కొందరు వత్తిళ్ళను తట్టుకుని నిలబడగలిగితే..
కొందరు ఆ వత్తిడికి లొంగి బక్కెట తన్నేస్తారు. రాంభద్రయ్యగారు ఆ సారి అదే
పని చేసి సరాసరి స్వర్గ నరక మార్గాలు చీలే కూడలి దగ్గర తేలారు.
ఆ సరికే అక్కడో మంగళగిరి చేంతాండంత క్యూ!  ఆమ్ ఆద్మీలకంటే ఈ మాదిరి
చేంతాళ్ళు అలవాటే గాని.. జనవరి ఒకటి, శనివారం కలిసొచ్చే రోజైనా  తిరుమల
శ్రీవారి సుప్రభాతసేవ దర్శనానిక్కూడా క్యూలో నిలబడే అగత్యం లేని బడేసాబ్
రాంభద్రయ్యగారిలాంటివారికీ క్యూ వరసలు పరమ చిరాకు పుట్టించే నరకాలు.
ఇదేమీ భూలోకం కాదు. లాబీయింగుకు ఇక్కడ బొత్తిగా అవకాశం లేదు. తన వంతుకోసం
ఎదురుచూడడం  రాంభద్రయ్యగారికేమో అలవాటు లేని యవ్వారం. అక్కడికీ ఎవరూ
చూడకుండా స్వర్గం క్యూలో చొరబడబోయి కింకరుడి కంట్లో పడిపోయారు పాపం.
'ఇదేం మీ భూలోకం కాదు. మీ చట్టసభల్లో మాదిరి ఇష్టారాజ్యంగా గెంతడాలు
కుదరవు.  ముందక్కడ ప్రవేశ పరీక్షకు హాజరవ్వాలి. ఆ ఫలితాన్నిబట్టే నీకు
స్వర్గమో.. నరకమో తేలేది. నువ్వొచ్చి యేడాదికూడా కాలేదు. అప్పుడే అంత
అపసోపాలా బాబయ్యా? నీ నియోజకవర్గంలో జనం పింఛను కోసం, జీతం కోసం, రేషన్
కోసం, గ్యాసుబండల కోసం, అధికారుల  దర్శనం కోసం.. ఎన్నేసి రోజులు
నిలువుకాళ్ళ కొలువు చేస్తారో నీకేమైనా అవగాహన ఉందా?' అని గదమాయించాడు
దే.దదూత (దేవుడు, దయ్యం కలగలసిన అంశ- దే.దదూత)
'ఆ భూలోక రాజకీయాలు ఇప్పుడంతవసరమా దూతయ్యా? వెనకెంత క్యూ ఉందో
చూసావా?ముందు నా స్వర్గం సంగతి తెముల్చు!' పాయింటు లేనప్పుడు టాపిక్కుని
పక్కదారి పట్టించే పాతజన్మ చిట్కా ప్రయోగించారు రాంభద్రయ్యగారు.
చిత్రగుప్తుడి దగ్గరకొచ్చింది కేసు.
సెల్లో ఆయనగారెవర్నో కాంటాక్టు చేసినట్లున్నాడు.. రాంభద్రయ్యగారిని చూసి
అన్నాడు 'ఓకే పెద్దాయనా! మీరేమో రాజకీయనేతలు! కనక ప్రత్యేక పరీక్ష
పెడుతున్నాం. మామూలు ఓటర్లకు మల్లే  మీకు పాత జీవితం తాలూకు  పాప
పుణ్యాలతో నిమిత్తం లేదు. ప్రజాస్వామ్యయుతంగా మీకు మీరే స్వర్గమో.. నరకమో
ఎన్నుకోవచ్చు..'
'నాకు స్వర్గమే కావాలయ్యా!'
'ఆ తొందరే వద్దు. ఆసాంతం వినాలి ముందు. ఎన్నుకోవడానికి ముందు ఒకరోజు
నరకంలో.. ఒకరోజు స్వర్గంలో గడపాలి..'
'ఐతే ముందు నన్ను స్వర్గానికే పంపండయ్యా!'
'సారీ! రూల్సు ఒప్పుకోవు. ముందుగా నరకానికి వెళ్ళి రావాలి.. ఆనక స్వర్గం'
అని దే.దదూత  వంక సాభిప్రాయంగా చూసాడు చిత్రగుప్తుడు. అర్థమైందన్నట్లు
రామచంద్రయ్యగారి భుజం మీద చెయ్యేసి బలంగా కిందికి నొక్కాడు దేదదూత.
కనురెప్పపడి లేచేంతలో కంటి ముందు.. నరకం!
నరకం నరకంలా లేదు! స్వర్గంలా వెలిగిపోతోంది. మెగాస్టార్ చిత్రం ఫస్ట్ షో
సందడంతా అక్కడే ఉంది. మిరిమిట్లు గొలిపే రంగురంగుల లైట్లు. మనస్సును
ఆహ్లాదపరిచే బాలీవుడ్ మిక్సుడ్ టాలీవుడ్ మ్యూజిక్కు! ఎటు చూసినా పచ్చలు,
మణిమాణిక్యాలతో  నిర్మితమైన  రమ్యహార్మ్యాలు! హరితశోభతో అలరారే సుందర
ఉద్యానవనాలు! మనోహరమైన పూలసౌరభాలతో వాతావరణమంతా గానాబజానా వాతావరణంతో
మత్తెక్కిపోతోంది. మరింత కిక్కెంకించే రంభా ఊర్వశి మేనక తీలోత్తమాదుల
అంగాంగ  శృంగార నాట్యభంగిమలు!
పాతమిత్రులందర్నీ అక్కడే చూసి అవాక్కయిపోయారు రాంభద్రయ్యగారు. అక్రమార్జన
చేసి కోట్లు వెనకేసిన  స్వార్థపరులు, వయసుతో నిమిత్తం లేకుండా ఆడది
కంటపడితే చాలు వెంటాడైనా సరే  కోరిక తీర్చుకునే కీచకాధములు, అధికారంకోసం
మనిషుల ప్రాణాల్ని  తృణప్రాయంగా తీసే పదవీలాలసులు, ఉద్యోగాలు..
ఉన్నతకళాశాలల్లో సీట్లకు బేరం పెట్టి కోట్లు కొట్టేసి ఆనక  బోర్డ్లు
తిరగేసే ఫోర్ ట్వంటీలు, పాస్ పోర్టులు,  సర్టిఫికేట్లు, కరెన్సీ నోట్లు,
మందులు, సరుకులు వేటికైనా చిటికెలో నకిలీలు తీసి మార్కెటుచేసే మాయగాళ్ళు,
నీరు, గాలి, ఇసుక, భూమిలాంటి సహజ వనరులపైనా అబ్బసొత్తులాగా  దర్జాగా
కర్రపెత్తనం చేసే దళారులు..  అంతా ఆ అందాలలోకంలో ఆనందంగా తింటూ, తాగుతూ,
తూలుతూ, పేలుతూ  యధేచ్చగా చిందులేయడం చూసి రాంభద్రయ్యగారికి మతిపోయినంత
పనయింది. సొంత ఇంటికి వచ్చినట్లుంది. అన్నిటికన్నా అబ్బురమనిపించింది..
తెలుగుచిత్రాల్లో పరమ వెకిలిగా చూపించే యమకింకరులుకూడా చాలా ఫ్రెండ్లీగా
కలగలిసిపోయి వాళ్ల మధ్య కలతిరుగుతుండటం!
అతిథుల భుజాలమీద ఆప్యాయంగా  చేతులేసి,  బలవంతంగా సుర లోటాలు లోటాలు
తాగించడం.. మిడ్ నైట్ మసాలా జోకులేస్తూ జనాలను అదే పనిగా నవ్వించడం..
ఎన్ని జన్మలెత్తినా మరువలేనిదా ఆతిథ్యం. కడుపు నింపుకునేందుకు అన్ని
రుచికరమైన పదార్థాలు సృష్టిలో ఉంటాయని అప్పటివరకు రాంభద్రయ్యగారికి
తెలియనే తెలియదు. రోజంతా ఎంతానందంగా గడిచిందో .. రోజుచివర్లో.. చీకట్లో
ఏకాంతంలో అతిలోకసుందరులెందరో   బరితెగించి మరీ  ఇచ్చిన సౌందర్య ఆతిథ్యం
ఎన్ని జన్మలెత్తినా మరువలేనిది.
ఆ క్షణంలోనే నిర్ణయించేసుకున్నారు రాంభద్రయ్యగారు ఏదేమైనా సరే  ఈ
నరకాన్ని  చచ్చినా వదులుకోరాదని.
కానీ.. షరతు ప్రకారం మర్నాడంతా స్వర్గంలోనే గడపాల్సొచ్చింది పాపం
రాంభద్రయ్యగారికి. స్వర్గం మరీ ఇంత తెలుగు ఆర్టు ఫిలింలా డల్ గా ఉంటుందని
అస్సలు అనుకోలేదు. మనశ్శాంతికోసం సాంత్వనసంగీతమంటే   ఏదో ఒక ఐదారు
నిమిషాలు  ఓకేగానీ..  మరీ   రోజుల తరబడి ఆకాశవాణి నిలయవిద్వాంసుల కచేరీ
తరహా అంటే.. మాజీ ప్రధాని మన్మోహజ్ జీ సారుకయినా తిరగబడాలనిపించదా? ఒక
వంక కడుపులో పేగులు కరకరమంటుంటే ఆ ఆకలిమంటను చల్లార్చడానికి ఏ  ప్యారడైజ్
బిర్యానీనో పడుతుంటే మజాగానీ .. అజీర్తి రోగి మాదిరి అసలాకలే లేని
హఠయోగమంటే.. ఎంత స్వర్గంలో ఉన్నా నరకంతో సమానమే గదా! దప్పికతో నిమిత్తం
లేకుండా ఏ   బాగ్ పైపరో.. ఆఫీసర్సు ఛాయస్సో.. స్థాయినిబట్టి ఆరగా ఆరగా
ద్రవం గొంతులోకి చల్లగా జారుతుంటే కదూ.. స్వర్గం జానా  బెత్తెడు దూరంలోనే
ఉన్నట్లండేది!  ఎంత అతి మధురామృతమైనా ఒక బొట్టు మొదట్లో అంటే మర్యాదకోసం’
చీర్స్’ కొట్టచ్చుగానీ.. అదే పనిగా అస్తమానం లోటాల్లో పోసి
గుటకేయాల్సిందేనంటే.. ‘ఛీ!’ అంతకన్నా నరకం మరోటుంటుందా? ఆకలిదప్పులు,
నిద్రానిప్పులు, మంచిచెడ్డలు, ఆరాటాలు.. పోరాటాలేవీ లేకుండా పద్దస్తమానం
తెలిమబ్బులమీదలా తేలుతూ పారవశ్యం నటించాలంటే రాంభద్రయ్యలాంటి ఆసులో
కండెలకు అసలు అయే పనేనా?
'ఎవర్నుద్దరించేందుకు, ఏం సాధించేందుకు స్వర్గసామ్రాజ్యంలో..
జన్మరాహిత్యం.. కోరుకోవాలి బాబూ? రమణీయ విలాసాలు, రసికజన వినోదాలు,
రత్నఖచితాడంబరాలు.. యధేఛ్చావిహారాలు.. రుచికరాహారాలు, రసరమ్య పానీయాలు,.
స్వర్గంలో దొరుకుతాయన్న మాట వట్టిబూటకమేనని ఒక్క రోజులోనే  తేలిపోయింది.
వాస్తవానికి ఇవన్నీ పుష్కలంగా దొరికే చోటు నరకమే అయినప్పుడు ఆ నరకంలోనే
స్థిరనివాసం ఏర్పరుచుకోవడమే తెలివైన పని.
మర్నాడు   చిత్రగుప్తుడిముందు ప్రవేశపెట్టబడినప్పుడు మరో ఆలోచన  లేకుండా
నరకానికే ఓటేసేసారు రాంభద్రయ్యగారు.
ఫార్మాలిటీసన్నీ పూర్తి చేసుకుని అధికారిక పత్రాలతో సహా నరకంలోకి అడుగు
పెట్టిన రాంభద్రయ్యగారికి కళ్ళు బైర్లుకమ్మే దృశ్యం కంటబడిందీసారి.
నరకం మునుపటి స్వర్గంలాగా లేదు. నరకంలాగేనే ఉంది. మూసీ వడ్డునున్న
మురికివాడకు నకలుగా ఉంది.  మొన్నటి వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి
బొత్తిగా సాపత్యమే లేదు.
మొదటి దృశ్యం- డొనాల్డ్ ట్రంప్ భారతావనికి వచ్చేముందు తీర్చిదిద్దిన
అహమ్మదాబాదునగరం.
రెండో దృశ్యం- కొత్త ప్రభుత్వం గద్దె ఎక్కిన మర్నాటి  అమరావతినగరం.
పైనుంచీ ఆగకుండా అదే పనిగా వర్షిస్తున్నది చెత్తా చెదారం. ఆగకుండా ఆ
చెత్తను  ఎతిపోస్తున్నది  వేలాదిమంది కూలీజనం. నిజానికి  వాళ్లంతా
మొన్నరాంభద్రయ్యగారు  సందర్శనార్థం విచ్చేసినప్పుడు-  పిలిచి
ఆతిథ్యమిచ్చిన నరక గేస్తులు! భూలోక నేస్తులు! వాళ్ల వంటిమీదిప్పుడు
వేళ్లాడుతున్నవి  అప్పటికి మల్లే  చీని చీనాంబరాలు కాదు. చివికి, చిరిగి,
చీలకలైన మసి పేలికలు! చేతుల్లో పెద్ద పెద్ద చెత్తబుట్టలున్న ఆ
పెద్దమనుషులంతా  భూమ్మీద పెద్ద పెద్ద పదవులు వెలగబెట్టిన
వి.వి.వి.వి.ఐ.పి లు! పనిలో ఒక్క సెకను అలసత్వం చూపించినా చాలు వాళ్ల
వీపులమీద కొరడా దెబ్బలు ఛళ్ళుమని  పడుతున్నాయి. ఆ కొరడాధరులంతా మొన్న ఇదే
చోట శిబిని, అంబరీషుణ్ణి మరిపించిన ఆతిథిమర్యాదలతో రాంభద్రయ్యగారిని
మురిపించిన  యమకింకరులే!
నోటమాట రాకా మాన్పడిపోయిన రాంభద్రయ్యగారి చేతిలో ఓ పెద్ద చెత్తబుట్ట
పెట్టి ముందుకు తోసాడో కింకరాధముడు. ఆగ్రహం పట్టలేక నరాలు చిట్లేటంత
బిగ్గరగా గావుకేక వేసారు రాంభధ్రయ్యగారు 'మోసం!.. దగా! మొన్న నరకానికి
స్వర్గధామంగా విపరీతమైన కలరింగిచ్చి.. ఇవాళీ నరకంలో పారేయడం నమ్మక
ద్రోహం.. కుట్ర!'
తాపీగా సమాధానమిచ్చాడా యమకింకరుడు 'ద్రోహానికి.. కుట్రకి.. ఇదేం మీ
భూలోకం కాదు మానవా!  నువ్వు నరకాన్ని చూసిన రోజు  మా స్వర్గ నరకాల
ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు. ఎలక్షన్లు  అయిపోయాయి. నువ్వు ఎన్నుకున్న
నరకానికే కదా నిన్ను తరలించిందిప్పుడు? ఇందులో మోసం.. దగా ఉంటే.. మీ
భూమ్మీద జనానికి మీరు చూపించే హామీలల్లోనూ మోసం.. దగా ఉన్నట్లే లెక్క!
ముందే చెప్పాం గదా!  భూమ్మీద మీలాంటి నాయకులు నడిపిస్తున్న ప్రజాస్వామ్య
విధానాలనే మేమూ ఇక్కడ మా లోకాల్లో అనుసరిస్తున్నామీ మధ్య' అన్నాడు
కింకరుడు కొరడా రాంభద్రయ్యగారి వీపుమీద ఝళిపిస్తూ!
'అబ్బా!' అని రాంభద్రయ్యగారి పెడబొబ్బ. అది కొరడా దెబ్బో.. ప్రజాస్వామ్యం
దెబ్బో ఎవరికి వారుగా  జనాలకు హామీలు గుప్పించి గద్దెనెక్కేవాళ్ళే
అర్థంచేసుకోవాలబ్బా!
స్వస్తి!
***
- కర్లపాలెం హనుమంతరావు
(సూర్య - సరదాకే  - 15 ఫిబ్రవరి 2020 ప్రచురితం)

Friday, February 14, 2020

భోజన యోగం-ఈనాడు ఆదివారం సంపాదకీయం- కర్లపాలెం హనుమంతరావు






ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. ఉదర నిమిత్తం బహుకృత వేషం. పశుపక్ష్యాదులది దొరికింది తిని కడుపు నింపుకొనే నైజం. మనిషికే బహురుచుల మోజు. 'అన్నము తిను వేళ నాత్మ రుచులు గోరు/ మదియు నాల్క జెప్ప నడగుచుండు' అన్నాడు యోగి వేమన.  వేదాల్లోను పురాణాల్లోను భోజనం భోగట్టానే ఉందని గురుజాడవారి శ్రీమాన్ గిరీశంగారు సెలవిచ్చారు కదా! 'అన్నం వ్యజానాత్.. అన్నవే బ్రహ్మ అని తెలుసుకోవోయి వెధవాయా అంది' అని దబాయింపు కూడాను! 'చమకంలో శ్యామాకాశ్చమే- చామల అన్నం మా మజాగా ఉంటుంది.. మాక్కావాలి దేవుడా!' అని ఉందని ఆ గురువు ప్రబోధించడం.. 'గేదె పెరుగు చమే.. చేగోడీ చమే!' అంటూ అతగాడి శిష్యపరమాణువు వెంకటేశం  చమకపారాయణం అందుకోవడం! 'తిండి కలిగితె కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్!' అంటూ  ఆ మహాకవే మరో చోట  నొక్కి చెప్పిన వాక్కుకి  ఈ  పచన పురాణం యావత్తూ  ఓ చక్కెర పూత. ఉదరానందమే హృదయానందానికి నాందీ. ఈ కిటుకు పసిగట్టింది కాబట్టే బసవరాజుగారి వెర్రిపిల్ల సైతం మనసైన బావగారిని గుత్తొంకాయ కూరతో పడగొట్టింది. కొనకళ్లవారి కోడలు పిల్ల 'అందముగా తీపందుకునేలా' అరిసెలు  వరసైన మావనోటికి అందించింది. చారడేసిన కళ్లను చక్కిలాలతో పోల్చడం మన  తెలుగువారికి ఆనవాయితీ. 'వంకాయవంటి కూరయు/పంకజముఖి సీత వంటి బామామణియున్/శంకరుని వంటి దైవము' లేరు' అని తెలుగువారికి గట్టినమ్మకం.   ఎంత కళాభివేశంలో సైతం కవుల కుక్షింభరత్వాన్ని నిర్లక్ష్యం చేయలేదు! 'వైశ్వానర జఠరాగ్ని రూపంలో దైవమే  జీవి శరీరంనుంచి  ఆహారం నాలుగువిధాల   జీర్ణించుకుంటుంద'ని గీతే(15-14) ప్రవచిస్తోంది.  తెలుగువారి బువ్వంపు బంతులమధ్య ప్రతిద్వనించే గోవిందనామాల అంతరార్థం తవ్వినవారికి తవ్వుకున్నంత!

'వేవురు వచ్చినా వండ నలయని'  గృహిణిని అద్భుతంగా వర్ణించాడు పెద్దన కవీంద్రుడు 'మనుచరిత్ర'లో. వండేందుకు సమయానికి సంబరాలేమీ అందుబాటులో లేనిపక్షంలో సైతం నాటి గేస్తులు ఎంత ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారో  అయ్యలరాజు నారాయణామాత్యుడు 'హంస వింశతి'లో విశదీకరిస్తాడు. మామిడికాయనుంచి మారేడుకాయ వరకు, కొండముక్కిడికాయ మొదలు కొమ్ముకాయ, కరగు కాయ, వెల్గకాయ దాకా గృహస్థుల ఇంట సదా సిద్ధంగా ఉండే ఊరుగాయల జాబితా (4-135) ఏకరవు పెడతాడు ఒక పద్యంలో. తిండి తిప్పలంటే వండుకొని ఇంత కడుపుకు వేసుకోవడంగా మన పెద్దలెప్పుడూ భావించలేదు. 'తలం జీర సుట్టియును జె/ ప్పులు దొడిగియు చేసినట్టి భోజనము ఫలం/ బలఘ చరిత బద్మజు/ డసురుల బోగంబని విధించె బ్రకట ఫణితులన్' (3-17) అంటోంది మహా భారతం. 'తడబడి తద్ప్రసాదంబు  గుడుచుచో../ రయమున గూలు నరక వార్ధి ననుచు' (41)అంటూ  పాల్కురికి సోమనాథుడి ‘పండితారాధ్య చరిత్రం’ అంటుతిండి చేటును గూర్చి 15వ శతాబ్దిలోనే హెచ్చరించింది! 'ఉదరం సగభాగం అన్నంతోను,  ఒక భాగం మంచితీర్థంతోను నింపినప్పుడే మిగతా భాగంలో గాలి ఆడి జీర్ణక్రియ సులభతరం అవుతుంద'ని(41) మంత్రి అప్పన్న ‘చారుచర్య’ హితవు చెబుతోంది. వెన్నెలకంటి సూరన్న విష్ణుపురాణం 'మునుపు మధురాన్నములు చవిగొనియనేని/ నడుమ లవణామ్ల తిక్తముల్ నంజెనేని/ పిదప కటుకార్ద్ర భోజనం బొదవెనేని/ బలము నారోగ్యము జాల గలిగియుండు' అంటూ పచన క్రమాన్ని నిర్దేశిస్తోంది. లోకహితంకోసం తపించి  అభిభాషించిన  ఆరోగ్యసూత్రాలనైనా ఆలకించికపోతే  చివరికి నష్టపోయేది ఎవరు? మనమే!

'వండడం కాదమ్మా ప్రధానం. తినాలి. తినడమూ కాదు. ఏది ఏమిటో తెలియాలి' అంటుంది శ్రీపాదవారు సృష్టించిన  'పాకశాస్త్రం'లోని ఓ పాత్ర. ‘ఓ రామ! నీ నామ మెంతో రుచిరా!' అని పరవశంతో పాడుతున్న ఓ భక్తుణ్ని 'నామం రుచి చూసానయ్యా! చప్పగా ఉంది' అని దెప్పిపోఛాడో  తిండిపోతు.  తినేవి ఏవో.. తినకూడనివి ఏవో విచక్షణ మరిస్తే కుడిచిన విస్తరే పంచకూళ్ల విషమౌతుంది- అంటున్నారు ఆహార శాస్త్రవేత్తలు. మిరియం పొడి చల్లిన తినుబండారాలనుండి, ఆవపిండిలో ఊరేసిన వడలు, ఇంగువ తాళింపులతో ఘుమాయించే  కరకర సరుకులు, చింతపండు, నిమ్మ రసాలు  పిసికి పోసిన పులుసులు, తొలిచూలు గోవుల పొదుగులనుంచి సేకరించి మధించిన వెన్నలను కాచి తీసిన నేతులలో ముంచి తేల్చిన  మధుర పాకాలు, భక్ష్య భోజ్య, లేహ్య, పానకాలలో ఏ ఒక్కటీ బీరుపోకుండా  తెలుగువాడి నిండువిస్తరి వైభోగాన్ని శ్రీనాధ కవిసార్వభౌముడు పలు సందర్బాలలో పూసగుచ్చినట్లు వర్ణించాడు. పాకశాస్త్రం భారతీయుల చతుష్షష్ఠి కళల్లో ఒకటి. సీతమ్మ సీమంతంనుంచి శ్రీకృష్ణుని చల్దులదాకా ఆడంగులు పాడుకొనే అన్ని పాటలనిండా ఎన్ని తినుబండార వైభోగాలో! సంతోషానికి సంతృప్తి దగ్గరి దారంటారు పెద్దలు. సంతృప్త అంతరంగానికి  ఆత్మారాముడి ఆశీర్వచనం తప్పని సరి. ఆరోగ్యకరమైన ఆహారం సంతృప్త భావతరంగ వ్యవస్థను తట్టి లేపుతుందని.. ఇష్టమైన పదార్థం రుచికరంగా జిహ్వకు తగలగానే కోరికను రేకెత్తించే 'డొపమైన్' ఉత్పత్తి అధికమవుతుందని, ఆ స్థితిలో జీర్ణమయే ఆహారం ఆనందకారక రసాయనాలు ఒపియేట్స్ (opiates) కెన్నబినాయిడ్స్ (cannaabinoids)  మెదడు విడుదల చేసేందుకు దోహదపడతాయని  తాజా పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. కార్డిఫ్ విశ్వవిద్యాలయానికి చెందిన యాండ్రూ స్మిత్   అనే మానసిక శాస్త్రవేత్త నిర్వహించిన పరిశోధనల్లో అనారోగ్యకరమైన ఆహారాన్ని అపరిమితంగా స్వీకరించడం వల్ల  ‘ప్రతిఫల వ్యవస్థ’ ((reward system) అస్తవ్యస్తమై  భోక్త  విపరీత భాగోద్వేగాలకు బానిసవుతాడని తేలింది.   ఉదయ అల్పాహారంగా  నిలవ ఆహారం సేవిస్తున్న వారిలో అలసట.. అహననం, ఆందోళన , కుంగుబాటు తాజా ఫలాలు సేకరించే వారిలోకన్నా మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు  తాజా పరిశోధనలు నిగ్గు తేలుస్తున్నాయి. తిండి తిప్పలు ఎన్ని రకాలో! తిండికోసం పడే తిప్పలు సరే!  తిన్న తరువాత వచ్చిపడే తిప్పల్ని  తప్పించుకోవాలంటే తినేటప్పుడే  అప్రమత్తంగా ఉండటం తప్పని సరి- అంటున్నారు ఆహారశాస్త్ర నిపుణులు. ‘భోజనం యోగంగా భావించినంత కాలమే మనిషికి భోజనం ఓ భోగం’ అన్న ‘లోలంబ రాజీయం’ సూక్తే చివరికి  శిరోధార్యమయింది. శుభం.
***
- కర్లపాలెం హనుమంతరావు 
( ఈనాడు ఆదివారం సంపాదకీయం ) 




Sunday, February 9, 2020

హేతువాదం -కర్లపాలెం హనుమంతరావు



మనిషి ఆరంభంలో హేతువాదే! తెలిసిన విషయాలతో తెలీని విషయాలను తర్కించుకుంటూ సంతృప్తికరమైన సమాధానాలు దొరికే వరకు అన్వేషణ కొనసాగించడం అతని నైజంగా ఉండేది. చేతనయింది తాను  సృష్టించుకుంటున్నట్లుగానే తనకు చేతగాని వాటిని ఎవరో తన కోసం సృష్టించి పెడుతున్నారని భావించడమూ తర్కం విభాగం కిందకే కదా వచ్చేది? ఆ అదృశ్య శక్తిని అతడు దేవుడుగా భావించాడు. ఆ దేవుడి చుట్టూతా మతం అల్లుకోవడం, అదే ఒక వ్యవస్థగా వేళ్లూనుకోవడం, క్రమంగా దానిలో మౌఢ్యం ప్రవేశించడం, దానిని ఎదుర్కొనేందుకు చైతన్యంతో ప్రతిస్పందించడం.. ఈ మొత్తాన్ని ఒక ముద్దగా చూస్తే అదే మనిషి పురోగతి అనిపిస్తుంది. మౌఢ్యాన్ని ప్రశ్నించడానికి మనిషి ఎన్నుకున్న ప్రక్రియా అనాదిలో ఆరంభంలో అనుసరించిన ప్రశ్న పధ్ధతే అని మనం మర్చిపోరాదు. 'ప్రతి వస్తువును ఎవరో ఒకరు సృష్టించాలన్న సిధ్ధాంతం ప్రకారం తనకోసం సృష్టించిన వాడినీ ఎవరో ఒకరు సృష్టించి ఉండాలి కదా?' అన్నది తర్కం కిందకే వస్తుంది కదా! ఆ ప్రశ్నకు జవాబు దొరకని మతం అలా పదే పదే ఎదురు తిరిగి ప్రశ్నించేవాళ్ల మీద 'మౌఢ్యం' ముద్ర వేయకపోతే మరింత మంది బుద్ధిమంతులు ఆ ప్రశ్ననే కొనసాగించి సమాజాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెడతారని 'మతం' బెదురు. మొదటి తర్కంలో నుంచి పుట్టిన మతాన్ని అక్కున చేర్చుకున్నవారే రెండో తర్కానికి మూఢత్వం అనే లేబుల్ అంటగట్టడం.. విచిత్రం! 'ఆస్తికత్వం' అనే పదాన్ని దేవుడు పరంగా 'ఉన్నాడు'అన్న అర్థంలో తప్ప మరో విధంగా భావించడం రాని భావదాస్యత 'ఆ ఉన్నాడు అంటున్నవాడు ఎక్కడున్నాడో.. ఎలా ఉంటాడో.. చెప్పండి.. అలా చెప్పలేక పోయినా.. పోనీ ఫలానా విధంగా ఉన్నాడన్న రుజువులైనా కొద్దిగా చూపించండ'ని ఆడుగుతుంటే సంతృప్తికరమైన జవాబు ఇచ్చే పరిస్థితుల్లో లేక  'నాస్తికత్వం' అన్న పేరు తగిలించి సంఘబహిష్కరణ చేసే విఫల ప్రయత్నాలు విశ్వవ్యాప్తంగా అన్ని కాలాల్లోనూ జరుగుతున్న అకృత్యమే!
సత్యాన్వేషణకు కట్టుబడ్డ ఎంతోమంది శాస్త్రవేత్తలు.. సామాజిక తత్వవేత్తలు తమ నిబద్ధత కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు చరిత్ర నిండా బోలెడన్ని.
జిజ్ఞాస, తర్కం సృష్టిలో మనిషి విశిష్టతలు. ఆ రెండింటినీ అణగదొక్కడమంటే మానవజాతిని జంతుప్రాయంగా జీవించమని నిర్బధించడమే!
తెలుగు సమాజంలోని అనేకమైన లోటుపాట్లను బట్టలు విప్పదీసి మరీ ప్రదర్శించిన ప్రశ్నవేత్త యోగి వేమన. కులభేదాలతో కుళ్లిన సమాజాన్ని సంస్కరించే సదుద్దేశంతో సామూహిక భోజన కార్యక్రమాన్ని సాహసంతో తలపెట్టిన గొప్ప సంస్కర్త బ్రహ్మనాయుడు. వీరిద్దరు చూపించిన వైజ్ఞానికి, సామాజిక తర్కవాదం దారిలోనే తదనంతర దశల్లో మరిన్ని అడుగులు జాతిని ముందుకు నడిపించిన హేతువాదులు.. కొమర్రాజు లక్ష్మణరావు, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావులు.. వారి అనుయాయులూ త్రిపురనేని రామస్వామి చౌదరి, గుర్రం జాషువా(భగవంతుడు ఉన్నాడన్న భావన ఉన్నా నిర్భయంగా నిలదీసిన ప్రశ్నవాది). రాజారామ్మోహన్ రాయ్  బ్రహ్మసమాజం, దయానంద సరస్వతి ఆర్యసమాజం, అనీబిసెంట్ దివ్యజ్ఞాన సమాజం, రాజకీయ, ఆర్థిక రంగాల పరంగా కమ్యూనిజం.. వంటి భావజాలాల మూలకంగా భారతదేశంలో హేతువాదానికి ఎప్పటికప్పుడు కొత్త జవసత్వాలు పుట్టుకొస్తూనే ఉన్నాయ్! ఎం.ఎన్.రాయ్ రాడికల్ హ్యూమనిజం దారిలోనే గోరా హేతువాద ఉద్యమం ముందుకు సాగింది. హేతువాదానికి మరో ఉద్యమ రూపంగా సమాజంలో తనదైన ప్రత్యేక ముద్ర వేయించుకొన్న గోరాని గురించి ఎంత చెప్పినా ఇంకొంత మిగిలే ఉంటుంది.
కాకినాడ పిఠాపురం రాజావారి కళాశాలలో  చేసే చేసే ఉద్యోగాన్నుంచి ఉద్వాసన పలకాల్సొచ్చింది గోరాగారికి 1933లో హేతువాదాన్ని విద్యార్థుల్లో ప్రచారం చేస్తున్నారన్న నెపంతో. బందరు హిందూ కళాశాలలో  ఏ ప్రతిబంధకాలు లేని కారణంగా విశాఖపట్నం హిందూ పఠన మందిరంలో ఏకంగా నాస్తికత్వం మీద బహిరంగ నిర్వహించారు. ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ ప్రకటించుకొని, కృష్ణా జిల్లాల్లో నాస్తిక కేంద్రం స్థాపించారు గోరా. 'నాస్తికత్వం లేక దేవుడు లేడు' అనే పుస్తకం ద్వారా ఆలోచనాపరులను కదిలించారు. హేతువాద దృష్టికి ఒక వ్యవస్థీకృత స్థాయి ఆంధ్రదేశంలో ఏర్పడేందుకు ఆ కాలంలోనే ఊపందుకొన్న ఎం.ఎన్.రాయ్ హ్యూమనిజం భావజాలం కూడా ఒక ముఖ్యమైన కారణమే!
స్వాతంత్రోద్యమం, తెలంగాణా విమోచనోద్యమాలలో నాస్తికుల పేరునే మేధావులు కొందరు పాలుపంచుకొన్నారు. స్వతంత్రం వచ్చిన తరువాత గోరాగారు విజయవాడలో నాస్తిక కేంద్రం ఏర్పాటు చేసుకొన్నారు. అక్కణ్నుంచే 'సంఘం' పేరుతో వారపత్రిక ప్రచురణ జరిగేది. అదే పంథాలో తెనాలి నుంచి రాడికల్ హ్యూమనిజం భావప్రచారానికి 'సమీక్ష' పేరుతో  మరో వారపత్రిక వెలువడుతుండేది.
మూఢనమ్మకాలను ప్రశ్నించడం, దైవాంశసంభూతులని డబ్బాలు కొట్టుకునేవాళ్ల మహిమలను బహిరంగా సవాలు  చెయ్యడం, బాబాల  అద్భుతాలుగా కొనియాడే గమ్మత్తులను నాస్తికకవాదులుగా తామే బహిరంగంగా ప్రదర్శించి చూపించడం.. ఆనక ఆ మహిమల వెనుక ఉన్న మర్మాలను  వివరించడం వంటి  చర్యల ద్వారా అభూత కల్పనలకు అడ్డుకునే ప్రయత్నాలు నిరంతరాయంగా కొనసాగుతుండేవిచర్చల సందర్భంలో మొహం చాటు చెసే సాధారణ పౌరులలో తార్కికమైన ఆలోచనలను రేకెత్తించడమే ఇలాంటి చర్యల ప్రధాన ప్రయోజనం. గోరాగారు ఒక వ్యక్తిగా కాకుండా సకుటుంబంగా ఈ హేతువాద ఉద్యమంలో పాలుపంచుకోవడం మరన్ని హేతువాద కుటుంబాలు ఏర్పడేందుకు దోహదపడింది.
నార్ల వేంకటేశ్వర్రావు, ఆవుల గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ త్రిపురనేని వెంకటేశ్వర్రావు, గౌరిబోయిన పోలయ్య, రావిపూడి వెంకటాద్రి, మల్లాది సుబ్బమ్మ వంటి మేధావుల కార్యకలాపాల కారణంగా హేతువాద ఉద్యమం  బహుళ వ్యాప్తిలో ఉండేది. ఉంటోంది.
గోరాగారు మహాత్మాగాంధీతో చేసిన చర్చలు 'An Athiest with Gandhi' పేరుతో పుస్తక రూపంలో వెలువడి.. తదనంతర కాలంలో ఆంగ్ల తర్జుమా కూడా సంఘం పత్రికలో  వెలువడింది. నాస్తికవాద ప్రచారానికి ప్రపంచ పర్యటనకు పూనుకున్న గోరా 1970లో ప్రపంచ నాస్తిక మహాసభలు సైతం విజయవాడలో నిర్వహించారు. అదే దశకంలో ఆంధ్రదేశంలో హేతువాద సంఘం, విశాఖ వేదికగా  మార్క్సిస్టు భావజాలంతో భారత నాస్తిక సమాజం ఎర్పడ్డాయి. శిక్షణా తరగతులు, అధ్యయన తరగతులు జిల్లాల వారీగా నిర్వహించేవారు. తెలుగునాట ఉధృతమవుతున్న హేతువాద ఉద్యమానికి ఆకర్షితులయే శ్రీ లంక ప్రొఫెసర్ డాక్టర్ కోవూర్ అబ్రహాం మూడు సార్లు ఇక్కడ పర్యటించారు. దైవాంశ సంభూతల మహిమలకు వ్యతిరేకంగా ఉద్యమించే డాక్టర్ పి. ప్రేమానంద్ ఇక్కడ అనేక శిక్షణా తరగతులు నిర్వహించారు.
గోరా మరణం తరువాత వారి కుమారుడు డాక్టర్ లవణం అంతర్జాతీయ హ్యూమనిష్టు ఉద్యమంలో అంతర్భాగమయారు.  ఎన్నో పర్యాయాలు ప్రపంచం చుట్టి రావడమే కాకుండా.. రెండవ నాస్తిక మహాసభలూ నాస్తిక కేంద్ర స్వర్ణోత్సవాల సందర్భంలో  ఘనంగా నిర్వహించారు. సర్ హార్మన్ బోండి, జాన్ ఎడ్వర్డ్స్, జిం హెర్రిక్. హేరి స్టోప్సరో, లెవీ ఫ్రాగెల్, ఫ్రాంక్ షూట్, ఎరిక్ హార్టికైనన్, డాక్టర్ నిహాల్ కరీం, రాయ్ బ్రౌన్, అజం కమ్గుయాన్.. లాంటి ఎందరో నాస్తిక ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అనేక నాస్తిక మహాసభల్లో, హేతువాద ఉద్యమాలలో పాలుపంచుకున్నారంటే.. ఆ ఘనత గోరా కుటుంబం మొత్తం  ఓ క్రతువుగా సాగించిన  హేతువాద, నాస్తికవాద  ఉద్యమాల ప్రభావం వల్లనే! ఆంధ్రదేశం నుంచి ఇతర దేశాలలో జరిగిన హేతువాద, నాస్తిక సభలు సమావేశాలకు హాజరయిన ప్రముఖులలో ఎన్. ఇన్నయ్య, రావిపూడి వెంకటాద్రి,  బాబు గోగినేని వంటి వారు ఇప్పటి తరానికీ సుపరిచితులే!
ఆంధ్రుల నాస్తిక, హేతువాద ఉద్యమాలు ప్రపంచంలోని మరే ఇతర దేశాల ఉద్యమాల ముందూ తీసిపోనంత ఉధృతంగా సాగుతున్నవే! మనిషిని ఆలోచించమని కోరడమంటే తన అనుభవాల నుంచి, అవగాహనలో నుంచి ఆలోచించమని కోరడమే! అందరి ఆలోచనలు ఒకేలా ఉండనప్పటికీ వ్యక్తి స్వేచ్ఛ, పరస్పర గౌరవం వంటి మౌలికమైన మానవ విలువులలో మార్పు ఉండదు. హేతువాదులేమీ మూసపోత ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించరు. వైరుధ్యం తలెత్తని విభిన్నత్వాన్ని, వైవిధ్యాన్నే ఆలోచనాపరులైన నాస్తికులైనా, హేతువాదులైనా ప్రోత్సహించేది.
వంద సంవత్సరాల కిందటి వరకు నాస్తికత్వం, హేతువాదం ఒక పెడవాదంగా హేళనకు గురయిందన్న వాస్తవం మనం మర్చిపోరాదు. చాలా నాగరిక దేశాలలో క అలా చెప్పుకునేవారికి ఇబ్బందులు  ఎదురయేవి. అంతటి ప్రతికూల పరిస్థితుల నుంచి నాస్తిక, హేతు భావజాలాలు ఇవాళ ఒక గౌరవనీయమైన మానవవాదాల జాబితాలో చేరి మేధావుల మన్ననలు అందుకుంటోన్నది. ఈ కృషిలో మన తెలుగువారు నిర్వహించిన పాత్రా అనల్పమైనదని మరో మారు గుర్తు చేసేటందుకే ఈ చిన్న ప్రయత్నం.
రాబోయే తరాల ప్రగతి బాట నిర్మాణంలో ఎవరు వద్దన్నా, కాదన్నా నాస్తిక, హేతు భావజాలాల పాత్రా తప్పక ప్రాముఖ్యం వహిస్తుందని జ్ఞప్తికి చేసేందుక్కూడా ఈ చిరువ్యాసం.
***
(ఆంధ్రప్రదేశ్ అవతరణ స్వర్ణోత్సవాల నేపథ్యంలో శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, శ్రి గుత్తికొండ సుబ్బారావు, డా॥జి.వి. పూర్ణచంద్ గార్ల సంపాదకత్వంలో  విక్టరీ పబ్లికేషన్స్ వారు ప్రచురించిన 'తెలుగు పసిడి'- ఆంధ్రప్రదేశ్ లో 50 సంవాత్సరాల నాస్తిక, హెతువాద ఉద్యమం - శ్రీ లవణం- పు.367 - 371)

Saturday, February 8, 2020

సరదాకేః ఆదివారం శీర్షికకు తిట్టు!.. తిట్టించు! -కర్లపాలెం హనుమంతరావు




వాదన పూర్వపక్షం చేసే పాయింట్ ఓ పట్టాన దొరకనప్పుడు వాడుకొనే 'వాడి' గల
ఆయుధం- కోపం. 'పేదవాడి కోపం పెదవికి చేటు' అన్న వేమన వెర్రికాలం

కాదిప్పటిది. 'పేదవాడి కోపం పెద్దమనుషుల పదవికి చేటు' అన్నట్లుగా  సాగే
ప్రజల స్వాముల వాదం.  ఎలక్షన్ల పీడాకారం తగులుకున్నప్పుడల్లా తలనొప్పి
ఓటర్లకు దేవతాపీఠాలు దక్కడానికీ   ఈ ఆగ్రహాయుధమే ప్రధాన కారణం.
ఎన్నికలయిన తరువాత సాగే  గెలుపు బెట్టింగులంత గడబిడలుగా ఉండవు  ఓటర్ల
బెట్టుసర్లు. రాజ్యాంగం అంటే ఏదో ఆ ఆధికరణ, ఈ సవరణలంటూ ఇండియన్ ఇంకుతో
గిలికేసారు గాని ఎలక్షన్ల రంగంలో ఓటరు గొట్టంగాడు వీరంగానికి దిగితే
సాక్షాత్తూ  ఆ రాసిన పెద్దసార్లయినా సరే తట్టుకోడం కష్టం!
తిరుపతి వేంకటకవుల కృష్ణరాయబారం నాటకంలో శ్రీకృష్ణుడు ‘అలుగుటయే యెరుంగని
మహామహితాత్ముడు/ అజాత శత్రుడే అలిగిన నాడు’ ఏవేవో సాగరములన్నీ
ఏకమయిపోతాయని, నమ్ముకున్న కర్ణులు పదివేలమంది వచ్చినా చత్తుర’ని
బెదరగొట్టేస్తాడు. దుర్యోధనుడికి దూరాలోచన లేక  బాదర్ అవలేదు. కానీ
ఇండియన్ నేతకు ఓటరు అజాతుశత్రుత్వం మీద బొత్తిగా నమ్మకంలేదు.   తలనొప్పి
తద్దినమంతా  ఎందుకని నాయకులు ఎన్నికల దుర్దినాలు గడిచే దాకా ‘ఓటర్లే
దేవుళ్లు’ అంటూ స్త్రోత్రాలు అప్పగించేసేది అందుకే! నిజానికి దేవుళ్లతో
పోల్చడమంటే ఓటరు స్థాయినో మెట్టు కిందికి దిగజార్చడవేఁ!
కాసుల పురుషోత్తమం అని కవి మహాశయుడు, పనిమాలా ఘంటసాల దాకా వెళ్లి
శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువును  పట్టుకుని దులపరించాడు. 'నీ పెళ్లాం
భూదేవి అన్ని బరువులూ మోస్తుంటే..  ఆ నిర్వాకం నీదే అన్నట్లుగా పెద్ద
బిల్డప్పులు! కోరింది ఇచ్చేది నీ కోమలి ఇందిరమ్మ అయితే, నువ్వే ఏదో
కామితార్థుడికి మల్లే వీర పోజులు! కష్టమైన సృష్టి కార్యం చూసేది నీ
కొడుకు బ్రహ్మగారయితే ఇంటి పెద్దనంటూ కుంటి సాకులతో ఆ క్రెడిటంతా నువ్వే
కొట్టేసుకుంటివి! పొల్యూషన్ కంట్రోలు పనిలో పాపం గంగమ్మతల్లి తలకమునకలయి
ఉంటే, పని సాయానికి పోని   నీ కెందుకయ్యా పతితపావనుడువన్న   బిరుదు అసలు?
పెళ్లాంబిడ్డల మూలకంగా వచ్చే పేరే తప్పించి మొదట్నుంచి నువ్వు పరమ
దామోదరుడివి(పనికిమాలినవాడివి)’ అంటూటే.. తిట్టో మెప్పో తెలీక  ఆ దేవుడు
గుళ్లోని రాయికి మల్లే  గమ్మునుండిపోయాడు!
దేవుడికి భక్తుడొక్కడే దిక్కు. భక్తులకు ముక్కోటి దేవుళ్ల ఆప్షన్ ఉంది. ఏ
ఒక్క దేవుడు ముక్కోపం తెప్పించినా మరో పక్కదేవుడి దిక్కు భక్తుడికి
ఠక్కున ఆఫరయే జంపింగ్ జమానా ఇది.
 ఆపదమొక్కులవాడి కోపతాపాలనంటే ఏ మొక్కులు, పొర్లుగింతల ట్రిక్కుల్తోనో
ఠక్కున మటుమాయం చేసెయ్యచ్చు. ఓటరుకార్డు చేత బట్టిన డిప్పకాయ మరీ పాతకాలం
నాటి నాటు రథాలను మాత్రమే నమ్ముకుని ఉత్సవానికి ఊత్సాహపడే విగ్రహం
కాదిప్పుడు! డెమోక్రసీ ఎదగడం మాట ఎటు పోయినా ఓటు మిషను మీట నొక్కే మనిషి
కసి మాత్రం వామనుడు సిగ్గుపడే సైజులో పెరిగిపోతున్నది. ఓటుకు ఓ పదినోటు
ఇస్తానన్నా  పుచ్చుకునేందుకు  పది సార్లు పస్తాయించే చాదస్తం నుంచి
హీనపక్షంగా పదివేలన్నా చేత పెట్టందే పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయే దాకా
పరిపక్వత సాధించింది. ముష్టి మున్సిపాలిటీ ఎలక్షన్లక్కూడా ఎస్టేట్లు
అమ్ముకుని మరీ కుస్తీపట్లకు దిగే బస్తీనేతలే ఓటర్ని ఈ స్టేటు దాకా
ఎగదోసింది. మసిపూసి మారేడు చేసే మాయాజాలం మరి ఇంకెంతకాలమంట? కడుపులో మంట
రేగితే  ఓటరే  ఊరేగే నేత ముఖాన కసి కొద్దీ బుడ్ల కొద్దీ సిరా పూసి, బురద
జల్లే రోజులు! వీధినేత కేజ్రీవాలే ఆఫీసు ఫోర్ వాల్సుకు బుద్ధిగా
కట్టుబడ్డం ఓటరు సిరా బుడ్డి దెబ్బకు దడవబట్టే!
పాలిటిక్స్ అంటేనే పది రకాల దరిద్రాలకు వంద వెరైటీల చిట్కాలు! షాహీన్
బాగ్ చూస్తున్నాంగా! పాపిష్టి అసంతృప్తుల ముఠాల్లోకి   చొప్పించే
కోపిష్టి ముఠాలను నేతలే ఇప్పుడు  స్వయంగా ఎందుకు తయారుచేసుకుంటున్నట్లు?
కోన్ కిస్కాగొట్టంగాళ్ల తిట్లన్నీ ఒకే దిక్కుకు మళ్ళించడం ఆ ముఠాల
టార్గెట్టు! ఎన్నికలు ఇవిగో.. ఈ ఎల్లుండి పొద్దున్నే ఆనంగానే,  చల్లంగా
తిట్టే వర్గాల మీద ఏ అయోథ్యను మించి వరాల జల్లులో కురిపించేస్తే సరి!
చిల్లర పైసలు కొన్ని వదిలినా అల్లరీ ఆగం లేకుండా ఎన్నికల యాగం ఏకపక్షం
చేసుకునే స్కీములు ఇట్లాంటివి లక్షా తొంభై ఇప్పుడు.   బోడి మల్లయ్యల
తిట్లంటారా?  చెవుల్లో దూరకుండా  దూదుండల సదుపాయానికి సర్కారు దండం
దక్కినాక ఖజానా అండ ఉండనే ఉంటుందిగా!  అయినా తిట్లక్కూడా ఉట్లు తెగే
సత్యకాలమా.. పిచ్చిగానీ?
అన్ని జాతర్లలో ఉత్సవ విగ్రహాలు పూజలే అందుకుంటున్నాయా? కొన్ని
సంబరాలల్లో  అంబలను భక్తులు అడ్డమైన తిట్లు తిట్టడం ఆచారం!  ‘ఒద్దికతో
లక్ష్మి  వున్నది చాలక.. భూదేవి కూడె నీ బుద్ధిశాలి!/ తన కూతురుటంచు
ఎన్నక.. భారతిని కోరడే ఈ నీతికోవిదుడు!/అర్థాంగి యుండగ అవ్వ.. గంగను
దాల్చె నీ నియమవరుడు!’ అంటూ  తిట్టిపోసినా  దేవుళ్ళు కూడా  కిమ్మనడంలేదే!
 కులం వంకన దూషించారనో, మతం మిషతో అవమానించారనో,   జాతి పేరు చెప్పి
నోరుజారారనో,  లైంగిక దృష్టిన వేధించారనో  మనిషి మధనపడ్డం.. యుద్ధకాండకు
దిగిపోడం.. హూ కేర్స్! శుక్రవారం కోర్టు బోను.. శనివారం కోర్టు తరలింపు
సీను! జనాలు ఎవర్నన్నా శాపనార్థాలు పెడుతున్నారా? దండుకునే సమయం దండగ
కాకూడదన్నదే ప్రజాభిప్రాయంగా  ఉన్నదిప్పుడు!
దూర దూరంగా తగలడితే తూలనాడుకొనే పగే ఊండదు. ఒకే చూరు కింద పది పూటలు
చేసిపోయే పిచ్చి కాపురాలల్లోనే సవతుల మధ్యన సవాలక్ష ముటముటలు, ముక్కు
తిప్పుళ్లు! నూట ముప్పై కోట్ల మందిమి. జానా బెత్తెడు భరత భూమి. మూడు వేల
చిల్లర పార్టీలు. ఎవరికీ పెత్తనం ఎకసెక్కం కాదు. మరి మాటా మాటా రాదా? ఏ
మాటా మోటుగా రారాదంటే ఎట్లా?  రామాంజనేయయుద్ధంలో  రాముడికి..
ఆంజనేయుడికి మధ్య జరిగే గలాటాకీ నవ్వుకొనే జనాలకు నేతల తిట్లు, సిగపట్లు
ఏమంత ఎబ్బెట్తనిపిస్తాయనీ.. నీతిమంతుల పిచ్చి గానీ!
‘ఉపకారంబు చేసినాడ కదా.. ఎన్నో రీతులన్.. నాకే నే/డపకారంబు ఘటంపజూచుటలు
మేలా నీకు పార్థా! మహా/విపదబ్ధిన్ వడిదాటి నౌకన్ వెసన్ విధ్యంసమున్ జేయు
నీ/ కపటాచార కృతఘ్న వర్తనల లోకంబెందు హర్షించునే?’ అంటూ గయుణ్ని
శిక్షించే విషయంలో జోక్యం వద్దని గట్టిగా  కృష్ణుడు దెప్పితే.. బామ్మరిది
కదా అర్జునుడేమన్నా గమ్మునున్నాడా? 'ఆపదలు మేమె తరయించు అదనుజూచి/
ఉట్టిపడెదవు మమ్మెల్ల ఉద్ధరించు/ఘనుడవని కీర్తి కనెదవు గాని కృష్ణ!/ నీవు
లేకున్న మేము రాణింపలేమె?' అంటూ మాటకు మాట పెట్టాడా.. లేదా? బాణప్పుల్లలు
వదిలే ముందు పుల్లవిరుపు మాటలు, ఈటెలు విసురుకోడానికి ముందు
ఈటెపోటుల్లాంటి దెప్పుళ్లు తప్పవని అందరికీ తెలుసు! క్లైమాక్సులో కూడా ఏ
మాత్ర్రం తిట్ల వాసన తగలద్దంటే ఎంత ఎన్టీఆర్, ఎస్వీఆర్ పాండవవనవాసమైనా
ఐమాక్సులో ఫ్రీ-షో వేసినా చూసే నాథుడుండడు! బొక్క.. భోషాణం అంటూ
జుత్తెగరేసుకుంటూ తిరిగే నటులూ పొలిటికల్ ఎంట్రీలిచ్చేస్తున్నారిప్పుడు.
పోటీగా  నలుగుర్నీ కూడేసుకోడానికి నాయకుడూ  నాలుకకు ఇంకాస్త పదును
నూరుకుంటే తప్పా? తొక్కలో భాషంటూ తిట్టే నేతలెవర్నీ జనతా సైతం తొక్కేసే
మూడులో లేదిప్పుడు.
 తిట్టించుకొనేవాడి మనసు చివుక్కుమంటుందంటే ఫక్కుమని నవ్వొస్తోంది.
వినేవాడి వీనులకు ముందు భాష పసందుగా ఉండాలి. చట్టసభల్లో జుట్టూ జుట్టూ
పట్టుకునే ముందు రెండు వైపులా  లాంగ్వేజ్  లవ్లీగా పండాలి! సమయానికి
ఠక్కని ప్రసారాలు కట్ అయిపోతే జనం సరదా కోసమా కోపంతో  చిందులేసేదీ?!
కారుకూతల వినోదవల్లరి కారు చవుకగా వినే ఛాన్స్ మిస్సవుతుందని కదా కామన్
పబ్లిక్ రుసరుసలు!
కమాన్! బాపూజీ చెప్పాడు గదా అని బుద్ధిగా ప్రజాసేవ చేసుకుని పరమపదిస్తే
నరకంలో ఎవరూ మడతమంచాలేసి హాయిగా బజ్జోమనరు. దిష్టిబొమ్మల వ్యాపారాన్ని
తగలేసిన పాపానికి, పాత చెప్పుల గిరాకీపై దెబ్బ కొట్టిన నేరానికి  ముళ్ళ
డొంకల మీద పడేసి పడపడా ఈడుస్తారు! నొప్పెట్టి ఏడిస్తే కర్రు కాల్చిన
దండంతో మరో రెండు వడ్డిస్తారు.
అయినా తిట్లన్నీ ఒక్క  నేతల నోళ్ల నుంచే పొంగొకొచ్చేస్తున్నట్లు ఎందుకా
పిచ్చి తింగరి కూతలు? కట్టుకున్నోడు మందు కొట్టొచ్చినప్పుడు  తిట్టకపోతే
మహా వెలితి  బోలెడంత మంది నెలతలకు. పెళ్లాలు  తిడతారో లేదో.. నిజంగా
బైటికి తెలిసే అవకాశం లేని కాపురాలల్లో ఆ వంకన సానుభూతి కోసం వెంపర్లాడే
మగకుంకలు.. ఇదిగో.. ఈ.. తల్లో వెంట్ర్రుకలంత మంది. తిట్టుకు
వందిస్తామనండి!  తిరుపతి గుడి క్యూలకు మించి ఎగబడే ఏబ్రాసీ మందలు ఎన్ని
కోట్లుంటాయో లెక్కతేలుతుంది! పాచిపోయిన లడ్డూలు ప్రసాదం పెట్టే పై
దేవుళ్లనేమీ పట్టించుకోకుండా కిందున్న సాటి నేతల మీదనే ఎందుకిన్ని
సూటిపోటీ మాటలు జనం అంటారు?
భరతుడు దక్షాధ్వరధ్వంసాన్ని అభినయించేటప్పుడు పశ్చిమ దిక్కుగా ఉన్న
బ్రహ్మముఖం నుంచి ఆరభటీవృత్తితో రౌద్రం ఉత్పన్నమయిందా? శారదాతనయుడి
'భావప్రకాశం'లో ఆలాగని రాసుందా? ఉన్న వెకిలి పాండిత్యం మొత్తం సందర్భ
శుద్ధి లేకుండా వెళ్లగక్కే మేధావులను  కుళ్లబొడవాలి ముందు.  ఆ దక్షాధ్వర
ఘట్టంలో పోతనగారి ధ్వంస రచనకు మించి ఉందా ఏంటి మరి ఇప్పటి  కొత్త నేతల
యాంటీ- హింస నచణ?  ఉత్తిత్తిగా వేలెత్తిచూపటానికా ఓటుకు అన్నేసి వేలు
దోసెట్లో పోసీ ఉపరి.. ఎన్నికల్లో ఓటరుగాడిదను గాడ్ అంటూ కాళ్లట్టుకు
దేవులాడింది నేతలు?
భాగవతం వేనరాజును విశ్వనాథ  శతవిధాలా ఖూనీ చేసాడు. కవిరాజు 'ఖూనీ' రాసి
అదేరాజుకు మళ్లీ జీవం పోసాడు. ఎవళ్ల అవసరాలు వాళ్లవి. అవసరాలని బట్టి
బట్టీలల్లో తిట్ల తయారీ! 'కఫాదిరోగముల్/దనువున నంటి మేని బిగి
దప్పకమున్నె నరుండు మోక్ష సా/ధనమొనరింపగా వలయు'అంటూ సూక్తులు వల్లించేడు
కదా  దాశరథీ భక్తుడు  కంచెర్ల గోపన్న! కోపమేమైనా ఇసుమంతైనా మరి పాపభీతి
కలిగించిందా చెరసాలలో పడినప్పుడు ఆ రామదాసు మనసుకు? 'కలికితురాయి నీకు
పొలుపుగ జేయిస్తి రామచంద్రా/నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని
రామచంద్రా!' అంటూ  దాశరథి మీదనే నేరుగా దెబ్బలాటకు ఎందుకు దిగినట్లో?



'మాలిన్యం మనసులో ఉన్నా/ మల్లెపూవులా నవ్వగలగడం ఈ నాటి తెలివి' అన్నాడు
.. 'కొత్త సిలబస్' కవితలో బాలగంగాధర్ తిలక్.  వింటానికి బానే ఉంటాయ్
కవితలెప్పుడూ! కానీ ఆ  పాత 'కొత్త సిలబస్' కు ఈ ట్వంటీ ట్వంటీస్ లో కూడా
శిల వేయద్దంటే ఎట్లా? కొత్త తరం నేతలూ ఆ తలపోటు కవితలే ఫాలో అవ్వాలా?
అదేం ‘లా’? నో.. వే! నేటి తరాల నేతల దారి నేరుగా బూతు భాగోతాల ‘హై వే’
మీదనే!
బూతుందని దేవుడికి సుప్రభాతమూ వద్దనగలవా? అని మనగలవా? ఎంతాచారం
వల్లించినా ఆ పెద్దాయనా ఆ కూటికే పోక తప్పని కాలమిది నాయనా! ఆగ్రహం
చుట్టూతానే భూగ్రహమంతా తిరుగుతోందిప్పుడు. ఆ గ్రహింపు లేకుండా ‘నిగ్రహం..
నిగ్రహం’ అంటుండ బట్టే శనిగ్రహం ముద్ర పెరిగిపోతుంది రోజురోజుకూ.
‘విగ్రహం పుష్టి.. నైవేద్యం నష్టి’ అంటూ మరో నింద పడ్డానికీ ప్రణాళిక
తయారవుతోంది!
 స్వగృహంలో పడగ్గదయినా సరే చాటుగా ఓ నాలుగు బూతు సినిమా పాటలు బై హార్ట్
చేసుకునే బైటికి రావటం బుద్ధిమంతులకు అవసరమిప్పుడు! చక్రం మీద కుతి
ఒక్కటే చాలదు! వక్రమార్గంలో అయినా సరే పచ్చిబూతులు నోటికి నిండుగా
పుక్కిటపట్టక తప్పదు పుక్కిట పురాణాలలో కూడా చోటు దక్కే పరిస్థితిలేదు.
 ప్రార్థనా పద్యం ఏడో స్థానంలో  ఏదో 'చ'కారం ఏడవబట్టే నన్నయ్యగారి
మహాభారతం అరణ్యపర్వంలో అర్థాంతరంగా ఆగిపోయిందంటారు.  నన్నెచోడుడూ
కుమారసంభవం ఆరంభంలో  స్రగ్ధర గణాల మీద అశ్రద్ధ చూపెట్టబట్టి  యుద్ధంలో
దారుణంగా మరణించాడని మరో టాక్! తిట్టు వల్ల ఏ త్రాష్టుడి ఉట్టీ పుటిక్కన
తెగిన లెక్కలు నిక్కచ్చిగా తేలకపోవచ్చు కానీ, తిట్టే తిట్టు  స్పష్టంగా
లేకుంటే మాత్రం కుంటి కూత కూసిన వాడికే ముందు గంటె కాల్చినట్లు వాత
పడేది.



అనకూడని ‘బాస్టార్డ్’ లాంటి పాడు కూతలు కూడా అన్నట్లు ప్రచారంలో కొచ్చేసే
 సామాజిక మాధ్యమాల  మాయాజాల కాలం బాబూ బాబూ ఇది! బాపూజీ బోధల మీదింకా
నమ్మకమున్నది ఆ పాతకాలం నాటి ముష్టి మూడు కోతి బొమ్మలకే!  మిగతా జాతి
తూగు మొత్తం  తూలనాడే కొత్త తరం నాయకత్వం వైపే! బూత్ పాలిటిక్స్ లో బూతు
వద్దనడం.. రామాయణంలో రామా అనే శబ్దం నిషిద్ధమనడమంత అసంబద్ధం. అనకా
తప్పదు.. అనిపించుకోకా తప్పదు.  తిడితే తప్ప నెగ్గ లేని నేతలకు తిట్లు
వద్దు.. కోపాన్ని ఉగ్గబట్టు.. అనడం పెద్ద తప్పు.
ఇంత మొత్తుకున్నా ‘తిట్టి తిట్టించుకోవడమా? తిట్టించుకుని తిట్టిపోయడమా?
అని ఇంకా సందిగ్ధమేనా? ఛఁ! కొంత మందిని ఎన్ని తిట్టీ  నో యూజ్! ఇంకా
తిడుతూ కూర్చున్నా  టైం వేస్ట్!
(సూర్య దినపత్రిక ఆదివారం సరదాకే శీర్షిక 9, ఫిబ్రవరి, 2020 )

***

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...