Wednesday, January 20, 2021

విశిష్ట కథకుడు పాలగుమ్మి పద్మరాజు-





ఆధునిక తెలుగు కథానిక పుట్టుక తేదీ ఇటీవలదే అయినా దాని దారుఢ్యం మాత్రం ఎన్నదగినదే. ప్రాక్ దిశలో పశ్చిమపు పోకడలతో పుట్టి ఎదిగిన కథలకు ఎన్నదగిన కథకులు ఎంతో మంది ఉన్నప్పటికీ, గత శతాబ్ది అర్థభాగంలోనే పటిష్టమైన కథానిక సృష్టించడం ద్వారా తెలుగు కథానిక చేవ ప్రపంచానికి తెలియపరిచిన విశిష్ట కథకుడిగా పాలగుమ్మి పద్మరాజును గుర్తుంచుకోక తప్పదు. మార్గం, భాష, భావం, కథావస్తువు, శిల్పం.. అన్నింటా ఒక విలక్షణత ప్రదర్శించడం పద్మరాజు కలం బలం. మానవత్వాన్ని, అతిలోక భావాన్ని, మనస్తత్వమర్మాన్ని, తాత్విక సూత్రాన్ని ఒకే పాయగా ఆల్లగల సమర్థుడు. సాధారణంగా పండితులను మెప్పించే రచనలు పామరులకు రుచించవు. పామరులకు మురిపించే రాతల పండితుల ప్రశంసలకు నోచుకోవు. పద్మరాజుగారి రచనల్లా ఇద్దరి మనసులను ఒకే విధంగా చూరగొనడం చాలా అరుదైన విశేషం తెలుగు కథానిక వరకు.. ఇప్పటి లెక్కల్లో చూసుకున్నా. రంజన, మేలుకొలుపులతో సరిపుచ్చుకోకుండా పాలగుమ్మిగారి కథలు చదివిన చాలా కాలం దాకా మనసును వదిలిపెట్టకుండా వెంటాడుతుండటం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విశేషం. వ్యక్తిగత సంస్కారం, మేథోగత ప్రతిభ, మానవత్వాన్ని సహృదయంతో అర్థం చేసుకునే ఆర్తి కలగలిస్తే రచన ఎలా పండుతుందో పద్మరాజుగారి రచనలను చూస్తే అర్థమవుతుంది. భారతీయత మీద మమకారం వదులుకోకుండానే పాశ్చాత్య సంస్కృతి పట్ల ఎట్లా అభిమానం పెంచుకోవచ్చో పద్మరాజుగారి అక్షరాన్ని చూస్తే అర్థమవుతుంది.   ప్రాచీనతను ద్వేషించకుండానే ఆధునికతను ఎట్లా ఆదరించవచ్చో ఆయన భావాలు పాఠాలులా వివరిస్తాయి. వేదాన్ని విజ్ఞాన్నశాస్త్రంలా, విజ్ఞానశాస్త్రాన్ని వేదంలా సమదృష్టితో సమన్వయించే బుద్ధి పాలగుమ్మివారి రచనలు మనకు నేర్పుతాయి. ప్రపంచ రాజకీయానికి, పంచాయితీ బోర్డు తీర్మానికి పద్మరాహుగారిలా ఒకే తరహా ప్రాథాన్యత కల్పించగలడం ఎంతో అభ్యసించి పట్టుకోవలసిన విద్య. సమాజ పరిణామాన్ని తర్కబుద్ధితో పరిశీలించి తీర్మానానికి రావడం, ఆర్థిక, సాంఘిక, కళా రంగాల సిద్ధాంతాలు ఏవైనా సామాన్య మానవుడు మాత్రమే వాటికి కేంద్రకంగా ఉండాలన్న భావన బలంగా ఉండడం సమాజాలను వ్యాఖ్యానించేందుకు కలం పట్టుకున్న ఆలోచనశీలికి అవసరం అన్న విశ్వాసం కల రచయిత పద్మరాజు. ఉద్యమాలు, నాగరికతల్లో పరిణామాలు వంటి తీవ్ర ప్రభావం చూపించే సంఘటనల వెనక మానవీయ కోణం ఎన్నడూ వీడకూడదన్న ఆలోచనాపరుడు పద్మరాజు. ఆయన కలం నుంచి జాలువారిన ఏ రచన అయినా అటు పండితులతో సమానంగా పామరులను, రసజ్ఞులతో సమంగా శాస్త్రజ్ఞులను అలరింఛడంలోని రహస్యం కూడా అదే కావచ్చు.

కళ కళ కోసమే అన్న సిద్ధాంతంలో పద్మరాజుగారికి బొత్తిగా నమ్మకం లేదు. సాహిత్యానికి ప్రయోజనం ఉండాలంటూనే ఆ ప్రయోజనం సామాన్యుడికి హితవు చేకూర్చేలా ఉండాలన్నది పద్మరాజుగారి అభిప్రాయం. ఈ హితవు అనే విషయం దగ్గరే సమాజంలో పేచీ.  సుఖభోగం ఒక స్థాయి మీరి మరిగితే ఆరోగ్యానికి హానికరమని తెలిసీ అవకాశం  అందివస్తే అనుభవించేందుకు సంకోచించని సంకుచిత మనస్తత్వం మామూలు మనిషిది. ఉప్పు కారాలు వంటికి పడవని తెలిసీ ఆ రుచుల కోసమే అర్రులుచాచే మదుమేహం, రక్తపీడనం రోగులకు వైద్యుడు మాత్రమే ఏ మోతాదులో అవి వాడితే అపాయం చెయ్యవో చెయ్యగలిగేది. ఆ వైద్యుడి పాత్ర సమాజంలో మామూలు మనిషి హితం పట్ల నెరవేర్చవలసిన బాధ్యతనే కళారంగం తరుఫు నుంచి మనం హితవుగా నిర్వచనం చెప్పుకోవచ్చు. స్వార్థప్రయోజనాల కోసమై సమాజానికి చెరుపు చేసే రచయితను పాలగుమ్మి ఏ రోజూ  ఆమోదించింది లేదు. ఏ అంశాన్నీ అంతిమ తీర్పుగా వెలువరించడం పరిణతి గలిగిన రచయిత చేసే పనికాదు. పరిణామశీలమైన సమాజంలో కాలనుగుణంగా జరిగే మార్పుల మధ్య జీవిక గడపక తప్పని సామాన్యుడి హీతాహితాలు లక్ష్యాలను బట్టి మారుతుంటాయని తెలియని రచయిత ఒక రాజకీయవేత్త తరహాలోనో, ఆధ్యాత్మిక గురువు తరహాలో బోధించడాన్ని పద్మరాజు తప్పుపడతాడు. నిష్పాక్షికమైన శాస్త్రీయ దృష్టే తప్ప అంతిమ సత్యం అంటూ ఏదో ఉండదన్న భావం బలంగా గల కళాస్రష్ట పద్మరాజు. 'రాజకీయాలలోగా సాహిత్యం పందిమంది మీద సమిష్టిగా నడుపవలసిన ఉద్యమం కాదు. ఫలానా రచన రాయాలని  పదిమంది కూర్చుని తీర్మానించిన కారణం చేత మంచి కవిత్వం రాదు. తక్కిన ఉద్యమాలకు గమ్యస్థానం ముందు నిర్ణయమవుతుంది. కాని ఒక్కొక్క రచయిత ఒక్కొక్క పద్ధతిగా రాసి పడేసిన తరువాత గాని ఒక రూపం ఏర్పడదు' అంటారు పద్మరాజు.

ఏకాలపు విశ్వాసాలను ఆ కాలపు విశ్వాసాల నుంచి విడదీసి చూడడం పొరపాటు అన్న భావనా కలవాడు పద్మరాజు. విశ్వాసాలు విలువ స్థిరంగా ఉండదు. విశ్వాసం మారినంత మాత్రాన పాత విశ్వాసం విలువలేనిది అయిపోదు. పాత కొత్తల విశ్వాసాల మధ్య గల సంబంధాన్ని గురించి వివరిస్తూ చెప్పిన ఉదాహరణ విస్మరించలేనిది.'ఒక రాజు రాజ్య  చెయ్యడమనే పద్ధితి నవీనయుగంలో వెగటుగా అనిపిస్తుంది. అతను కూడా రక్తమాంసాలతో ఉన్న మానవుడని,  దేవుడు ఎంత మాత్రం కాదని మనకు తెలిసిపోయింది. కాని, ఒకానొక కాలంలో రాజు దేవుడు అనుకోవడం సహజమని, ఆనాటి నాగరికతకు అది అవసరమని, దాని వల్ల సంఘ చరిత్రకు పునాది ఏర్పడిందని మనం గుర్తించాలి' అంటాడు. వ్యక్తిని, సంఘాన్ని, చరిత్రను పద్మరాజులా హేతువాద బుద్ధితో అవలోకించకగల పరిణతి ఉన్నప్పుడే కథా ప్రక్రియ నుంచి సంఘ సంస్కరణ వరకు ధృఢమైన సాధికార ప్రకటనలు చెయ్యగలిగే శక్తి అబ్బేది.

పద్మరాజుగారి వ్యక్తిత్వం అనేక పొరల పేర్పు. చిన్నతనంలో సంస్కృతం నేర్చుకుని ఆశుకవిత్వం చెప్పడం  మీద అనురక్తి ప్రదర్శించిన ప్రతిభ క్రమంగా రాడికల్ భావాల దిశగా ప్రస్థానించిన వైనం ఆశ్చర్య కలిగిస్తుంది. పద్మరాజు రాసిన 'పురుటిపాట; ఇప్పటికీ పండిత పామరులకు ఆశ్చర్యానందాలలో ముంచెత్తే ఆద్భుత కవిత. గొప్ప కవిత్వం రాయగలిగిన కలం గొప్ప వచనం రాసే సందర్భాలు తెలుగుసాహిత్యంలో అరుదు. ఆ అరుదైన ప్రతిభ మనం పద్మరాజుగారిలో చూస్తాం. కానీ పాలగుమ్మివారి కలం ఎక్కువ కవిత్వానికి నోచుకోలేదు. గొప్ప భావుకత కలిగివుండీ కవిత్వం మీద ఆట్టే దృష్టి పెట్టని పాలగుమ్మివారు విమర్శకుల సందేహానికి తన ఒకానొక  వ్యాసంలో  సమాధానంలా చెబుతూ 'పద్య కవిత్వంలో వ్యక్తమయ్యే వాంఛలన్నీ సామాన్య జీవితంలో పొందలేనివి.  పద్యాలలో కవి పరాయివాడి భార్యను ప్రేమించవచ్చును. నగ్న స్త్రీని వర్ణించవచ్చును.  స్వప్నానుభవానికి పద్య కవిత్వం దగ్గరగా పోలివుంటుంది. ఒక్క పద్య కవిత్వానికే కాదు, ఊహాప్రధానమైనదీ, వాస్తవికమైన భూమికను విడిచి విహరించే సాహిత్యాని కంతకీ ఇది వర్తిస్తుంది. కవిత్వం వ్యక్తిగతమైనది. ఎవరి మట్టుకు వాళ్ల అవసరాలను తీర్చడంలో కవిత్వ ప్రయోజనం ఆగిపోతుంది. కానీ వాస్తవిక రచన వస్తు స్వభావాన్ని మనకు వ్యక్తీకరిస్తుంది. విశాలమైన అనుభవాన్ని ఇస్తుంది. మనలోనూ, మనం చూసే అనేకమందిలోనూ ఏయే మూల తత్వాలు పనిచేస్తున్నాయో మనకు నిరూపిస్తుంది. వాస్తవికత ఊహా కవిత్వానికంటే ఎక్కువ పరిణతిని సూచిస్తుందని శాస్త్రజ్ఞులు అంటారు. అందుకనే ఒక మేధావి సాహసించి అన్నాడుః ముందు యుగంలో అంతకంతకు పద్యరచన పడిపోయి గద్యరచనే ప్రాధ్యాన్యత వహిస్తుంది- అని'. పద్యరచనను దాటి ఇలా గద్య రచనకు మారిన తరువాత కథలు రాయడం మొదలుపెట్టాడు. కానీ తమాషా ఏమిటంటే పద్య రచనలో పద్మరాజుకు గల అభినివేశమే ఆయన గద్యరచనకూ అమితమైన శోభ, సంస్కారాలను అలవర్చింది! ఆయన గద్యం నడకలోని తూగు, హొయలు పద్యకవిత్వం ప్రసాదించిన ప్రసాదగుణాల ఫలితమే. ప్రథమ పురుషలో రాసిన నాటికలకు అశేషమైన ఆధరణ అభించింది. అసలు పద్మరాజుగారు తెలుగుసాహిత్యంలో స్థిరపడాలనుకున్నది నాటికా రచయితగానే. కానీ విచిత్రంగా అయనను తెలుగు సాహిత్యం చివరకు గొప్ప కథారచయితగా స్థిరపరుచుకుంది!

'చెట్లు అలసటగా నిలబడి ఆకాశంలోకి చూస్తున్నాయి. లోకం ఏదో చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నట్లు దీనంగా ఉంది. అయినా చెట్ల మీద్ ఆకులు ముదురుతున్నాయి. గోధుమ రంగు పొలాల్లో అక్కడక్కడా ఆకుమళ్లు … కనబడుతున్నాయి. గాలిలో మెల్లనిదాహం ప్రాణుల్నిమత్తులో ముంచెత్తుతోంది. కావుమనలేక కాకులు ఒంటి కన్ను చూపులు అటూ ఇటూ చూస్తున్నాయి. కూలివాళ్లు  తిండి తిని మెల్లగా గిన్నెలు కడుక్కున్నారు. గట్టు మీద ఉన్న చింతచెట్టు మొదట్లో చుట్టూ కూర్చున్నారు. తలగుడ్డలలో నుంచి రొంటి నుంచి పొగాకు తీసి కొంచెం నీళ్ళతో తడిపి చుట్టలు చుట్టుకున్నారు'. 'కూలి జనం' అనే పాలగుమ్మివారి  చిన్ని కథానికలోనిది ఈ  దృశ్యం. గ్రామీణ  వాతావరణం నేపథ్యంగా రాసిన ఈ కథ తతిమ్మా భాగమంతా ఇట్లాగే సహజంగా, చెయితిరిగిన ఓ కవి రాసిన కథ మాదిరి  కళ్లకు కట్టినట్లుగా ఉంటుంది! పల్లీయుల సహజమైన జీవితాలను కళాత్మకమైన కథలుగా మలచిన అతి కొద్దిమంది ఆ నాటి  ప్రముఖ కథకులలో పాలగుమ్మి మొదటి వరసలో ఉంటారు. ఈ కథానిక ఉన్న సంకలనానికి కీ.శే బుర్రా వెంకట సుబ్రహ్మణ్యంగారు ముందుమాటా రాస్తూ 'నేనెరిగున్నంత వరకు  పల్లెజీవితం గురించి సహజంగానూ,  అభిమానంగానూ తెలుగు భాషలో వ్రాసే క్రొత్త కథకులలో పద్మరాజుగారే ముఖ్యుడని నా ఉద్దేశం. ఆయన మన కథకులలో కెల్లా శక్తిమంతుడని నేననుకుంటూ ఉంటాను'అని కితాబిచ్చారు. ఈ తరహా ప్రశంసలు పద్మరాజు ఈ ఏడు, ఎనిమిది దశాబ్దాలుగా ఎంత మంది కొత్త కథకులు వచ్చినా అందుకోవడం ఆగడమేలేదు!

పద్మరాజుగారి కథల విశిష్టతకు 'ఎదురు చూసిన ముహూర్తం' మరో మంచి ఉదాహరణ. ఆ తరహా స్త్రీలే భూమ్మీద ఈ  కాలంలో కూడా మన మధ్య మసలుతున్నారన్నట్లు సూచనప్రాయంగా కథకుడు పాత్రలను మలచిన తీరు అప్పటి కథాపాఠకులకు పరిచయం కాని అపూర్వమైన అంశం.  పద్మరాజు ఆ కథలోని  శాంత అనే ముఖ్య పాత్రను మలచేందుకు ప్రదర్శించిన సాహసం ప్రశంసనీయంగా ఉంటుంది. మనం మరచిన మనలోని మరో మనిషిని  పోతపోసి మన  కంటి ముందు నిలబెట్టిన గొప్ప పనితనం  పద్మరాజు ప్రదర్శించారా కథానికలో. రచయిత ఊహల్లో నుంచే పుట్టినా పాత్ర పాఠకుడి ఆలోచనలను కలియబెడితే.. నిస్సందేహంగా   ఆ పాత్ర ఉన్న కథానిక నాలుగు కథల నుంచి ప్రత్యేకంగా తీసి పెట్టుకోదగ్గదే అవుందంటారు ఉత్తమ కథానికకు ఉండవలసిన లక్షణాలను గురించి ప్రస్తావించే ఓ సందర్భంలో కొడవటిగంటి ఒకానొక వ్యాసంలో.  ఆ ప్రమాణాల రీత్యా పాలగుమ్మి వారి ఎదురు చూసిన ముహూర్తంలో ఏముందో ఒకసారి ముఖ్యమైన అంశాన్ని పట్టి చూస్తే గాని అనుభవానికి రాదు. కథలోని  ముఖ్య పాత్ర శాంతకు స్వతహాగా తానో అపురూపమైన స్త్రీనన్న భావన అంతర్గతంగా బలంగా ఉంటుంది. వాచ్యంగా ఆమె ఎప్పుడూ బైటకు తేలకపోయినా ఏదో ఒక ఊహించని ఘట్టం తన జీవితంలో తారసపడి తనను అతలాకుతలం చూస్తుందన్న గాఢమైన నమ్మకం మాత్రం వదులుకోలేని బలహీనత. కళాశాలలో చేరినప్పటి నుంచి చుట్టూ ఉన్న పాత్రలలో ఏదో ఒక పాత్రతో తనకు అనిర్వచనీయమైన అనుభవం కలగబోతున్నట్లు.. ఆ అనుభవం కోసం తాను ఎదురుచూస్తుంటుంది. కానీ ఏ ముఖ్యమైన సంఘటన జరగకుండానే కళాశాల జీవితం ముగిసిపోవడం, తన వివాహం వైద్యం చదువుకొనే వ్యక్తితో నిశ్చయం  కావడం జరిగిపోతుంది. భర్త మామూలు మగవాడు కాబట్టి అతని నుంచి అపూర్వానుభవం ఆమె ఏనాడూ ఆశించింది లేదు. అలాగాని సంసారంలో సుఖశాంతులకు కొరవ ఏర్పడిందనీ కాదు. ఇతమిత్థమని తెలియనై ఒకానొక అపూర్వానుభవానికి తాను ఎంతగా మానసికంగా సంసిద్ధమయి ఉన్నప్పటికి ఎన్నటికి ఆ అపూర్వ ఘట్టం సంభవించకుండానే గడచిపోతుందేమోనన్న బెంగ బయలుదేరిన సమయంలో ఊహించని పాత్ర భర్త తమ్ముడు వెంకటం రూపంలో ఆమె మానసిక ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. వెంకటం వ్యక్తిత్వం రీత్యా సక్రమమైన వాడు కాదని, అతనికి స్త్రీలతో సావాసాలు ఎక్కువని తోడికోడలు ద్వారా విన్నప్పటి బట్టి అమెలో అతని పట్ల ఒక రకమైన ఆసక్తి , అసహ్యం రెండూ కలగాపులగంగా కదలడం మొదలవుతాయి. తానిక సంభవం కాదనుకునే సంఘటన ఏదో ఈ వెంకటం ద్వారా కలగబోతుందేమోనన్న భావోద్వేగంలో నిత్యం కొట్టుమిట్టాడుతున్న దశలో అతగాడు రచయితగా సృష్టించిన కొన్ని కథల్లోని స్త్రీల వ్యక్తిత్వం పట్ల ఆమెకు జుగుప్స కలుగుతుంది. వ్యభిచారి కాని వాడు ఈ తరహా కథలను సృష్టించలేడన్న అభిప్రాయం కూడా బలమైన సందర్భంలో వెంకటం కథలను గురించి భర్తతో వాదనలకు దిగబోయి దాదాపు కయ్యానికి దిగినంత పనిచేస్తుంది. ఒకానొక్ సందర్భంలో ఆమెకు వెంకటంతోనే నేరుగా ముఖాముఖీ తలపడాల్సిన పరిస్థితి తటస్థించినప్పుడు తానింతకాలం ఎదురుచూస్తున్న ముహూర్తం ఇప్పుడు వచ్చేసినట్లే దాదాపుగా భావిస్తుంది శాంత. భర్త ఇంట లేని సమయంలో మరది పక్కగదిలో కథ రాసుకుంటూ కలం కోసం తను వంటరిగా ఉన్న గదిలోకి రాత్రివేళ రావడం.. ఆమె ఎప్పటి నుంచో ఊహిస్తూ వచ్చిన ఒకానొక రూపంలేని భావానికి రూపం వచ్చినట్లు భావించి తన వంతు పాత్ర నిరసన పాత్ర పోషించేందుకు ఆమె మానసికంగా సంసిద్ధమయిపోతుంది. కానీ వెంకటం తాను భావించినంత లాలసుడు కాదని ఆ సమయంలో అతనితో అనుకోకుండా జరిగిన సుదీర్ఘ సంభాషణ ద్వారా తేలిపోతుంది. వెంకటమే జోక్యం చేసుకుని ఈ ముడి విప్పేస్తాడు. లోకంలోని చాలా మంది స్త్రీలు అసంభవమని తెలిసుండీ సంభవమవుతున్నట్లు కొన్ని అకార్యాలు తమకు జరుగుతున్నాయని భావనాత్మకంగా నిత్యం ఆందోళన చెందుతుంటారని, నిజానికి ఎప్పుడో తప్ప ఎక్కడో తప్ప ఎవరో ఒక్క అదృష్టవంతురాలికి ఆ తరహా అనుభవం ఎదురుగాదని, ఎదురుచూసిన ముహూర్తం ఎంతకీ అనుభవానికి రాని కారణాన మానసికంగా జడత్వం ఆవహించి భాహ్యరూపంలో అది ఏ గయ్యాళితనానికో దారి తీస్తుందని వెంకటం వాదించి శాంతను కలవరపరుస్తాడు. వెంకటం తన ఒకానొక కథలో మలసిచిన విధంగా  మంచి పురుషుడితో పరిచయం కోసం వెంపర్లాడిన ఒక స్త్రీ అది సంభవం కాక,  చివరికి క్రైస్తవం స్వీకరించి నన్ గా మారి  ఒక కాన్వెంట్లో  సన్యాసినిగా చేరిపోయి పసిపిల్లల పట్ల అతి కౄరంగా ప్రవర్తించినట్లు తానూ చివరి రోజుల్లో మారిపోతుందేమోనన్న భయంతో శాంత తనను తాను సరిదిద్దుకునే ప్రయత్నంతో కథ ముగుస్తుంది.  ఎన్నెన్నో పాత్రల మధ్య కథ నడుస్తున్నా, కథ ఎక్కడా శాంత మీద నుంచి కాని, వెంకటం మీద నుంచి కాని పక్కకు పోకుండా ఉండటం, శాంత తన హృదయాన్నిఆవిష్కరించుకునే తీరులో ఎక్కడా పాఠకుడికి గందరగోళం లేకుండా ఉండడం కాని, కథను నడిపించేందుకు రచయితగా పద్మరాజు ఎన్నుకున్న సంఘటనల్లో ఆసక్తి, ఉత్కంఠ పాళ్లు తగ్గకపోవడం కాని, సంభాషణలు క్రిస్ప్ గా నడిచిన తీరు గాని, పదాలను ఎంచుకున్న భావజ్ఞత గాని, అత్యంత సంక్లిష్ణమయిన ఘట్టాలను కూడా సంక్షిప్తంగా ఉంచుతూనే అప్తత పాళ్లు తగ్గకుండా కథనం నడిచిన ధోరణ గాని.. ఇట్లా ఎన్నో కోణాలలో 'ఎదురు చూసిన ముహూర్తం' ఎంతో చెయ్యి తిరిగితే తప్ప కథకుడు కథాప్రయోజనం దెబ్బతినకుండా ఉత్తమ విధానంలో నడిపించడం సాధ్యమయే నైపుణ్యం కాదు.

 

ఇదే తరహాలో పద్మరాజుగారి కలం నుండి జాలువారిన పడవ ప్రయాణం, కుర్రతనామా? మానవ స్వభావమా? లాంటి ఎన్నో కథానికలను ఉత్తమ కథల జాబితాలోకి నిస్సందేహంగా చోటీయవచ్చు. పట్నవాసపు అల్లుడుగారు, అత్తారిల్లున్న పల్లెకు వస్తే ఎట్లాంటి విచిత్రమైన ఊహలు వస్తాయో మనస్తత్వశాస్త్ర పాఠ్యాంశంలా పద్మరాజుగారు చెప్పే విధానం విస్తుగొలిపిస్తుంది.

ప్రపంచ కథానికల పోటీలో రెండవ బహుమతి పొంది పలు భాషలలోకి అనువాదం చెందిన  'గాలివాన' ను గురించి ఇప్పటికే ఎంతో మంది ఎన్నో వేదికల మీద పొగడ్తలతో ముంచెత్తేసారు, ప్రత్యేకంగా ప్రస్తావించుకునేటంత విస్తారమైన సమాచారం ఉన్న గాలివానను గురించి అందుకే ప్రస్తుతానికి ప్రస్తావించే ప్రయత్నం చేయడం లేదు. కానీ, స్థూలంగా ఒకటి రెండు ముఖ్యాంశాలనైనా ప్రస్తావించకుండా వదిలేయడం భావ్యమూ కాదు. గాలివాన కథకు బహమతి వచ్చిన తరువాత జరిగిన ఒకానొక రచయితల సమావేశంలో 'గాలివాన కథకు బహుమతి సాధించి పెట్టిన ప్రత్యేకాంశాలు మీ దృష్టిలో ఏమిటి' అన్న ప్రశ్న ఎదురైనప్పుడు రచయిత ఇచ్చిన సమాధానం గుర్తుచేసుకుని వదిలేయడం ధర్మం. బిహేవిరియల్ కోణాన్ని ప్రధానాంశంగా తీసుకుని రాసిన కథానికకు అన్ని వడపోతల తరువాత ఎన్నో స్థాయిలు దాటి ఆఖరుకు ప్రపంచ ఉత్తమ కథానికల సరసన స్థానం చేయించుకున్న తరువాత ఆసక్తి కలవాళ్లు స్వయంగా కథను చదివి మదింపువేసుకోవడం ధర్మం అవుతుంది. సృష్టించిన రచయితను పట్టుకుని ఇప్పుడు దానికి విలువ కట్టమనడం … ఎన్నిక చేసిన విమర్శకులందరి విజ్ఞతను తిరిగి బోనులో నిలబెట్టిన చందమవుతుంద'ని సమాధానం ఇచ్చారు.

గాలివాన కథలోని ప్రధాన పాత్ర రావుగారు జీవితంలో కొన్ని నీతి నియమాలకు కట్టుబడ్డ పెద్దమనిషి. వాటిని అతిక్రమించవలసి వచ్చిన సందర్భాలు గతంలో ఎదురైనప్పుడూ అతిక్రమించకుండా కట్టుబాటును సాహసంతో అమలు జరపగల నిగ్రహం ఆయనకు ఉంది. నీతినియమాల పట్ల పిచ్చిపోకడలు లేవు.. కానీ మనిషిని సక్రమ మార్గంలో నడిపించడానికి కొన్ని  నిబంధనలు అవసరమని గట్టిగా నమ్మే వ్యక్తి. రావుగారూ మానవుడే. అతనిలోని మానవీయ కోణం అవసరమైన సందర్భాలలో కొద్దిగా చిన్ని చిన్ని కట్టుబాట్లను సడలించడానికి అభ్యంతరం ఏమీ చెప్పదు. ఉదాహరణకు పిల్లలకు చిలిపి చిలిపి కోరికలు ఉంటాయి. అవి తీరిపోతే తాత్కాలికంగా వాళ్లకు కలిగే ఆనందం అపరిమితం. ఆ తరహా సడలింపుల పట్ల రావుగారికి మూర్ఖ్యత్వం ఏమీ లేదు.  ఇట్లాంటివి కాకుండా జీవితంలోని సీరియన్ అంశాల పట్ల మాత్రం ఆయన అభిప్రాయాలు చాలా గాఢమైన పట్టుదల కలిగిఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన ఒక వేదాంతి. దానికి తోడు గొప్ప వక్త. ఆయనకొక సిద్ధాంతం ఉంది. వేదాంతం జీవితం తోటే, జీవన విధానం తోటే, వ్యక్తికీ సంఘానికి ఏర్పడే రకరకాల సంబంధాలతోటే ముడిపడివుంటుందనేది ఆయన వాదం. వేదాంతానికి, మరణానికి, నిశితమయిన అనుభవాలకి అతీతమైన విషయాలతో సంబంధం ఏమీ లేదు. ఇటువంటి అభిప్రాయాలు గల రావుగారు ఒకసారి రైలులో ప్రయాణం చేస్తున్నారు. మార్గామధ్యంలో తుఫానులాంటి గాలివాన వచ్చింది. ఏవో కౄర శక్తులు విజృంభించి మానవ నిర్మితాలు, ప్రకృతి సహజాతాలు అన్న భేదం లేకుండా భూమ్మీద ఉన్నవన్నీరూపుమాపడానికి పూనుకున్నట్లు వాతావరణం మారిపోయింది. ఆ గందరగోళంలో రావుగారు నమ్ముకున్న వేదాంతం ఏది ఆయనకు ఉపశమనం కలిగించలేకపోయింది. సరిగ్గా అటువంటి సందర్భంలో అతగాడికి ఒక ముష్టిమనిషి తటస్థపడింది. ముఫ్ఫై ఏళ్లుంటాయా మనిషికి. చాలా చిత్రమైన వేదాంతం మాట్లాడుతుంది. ఎంతటి వాళ్లనైనా సరే ఆమె తన మాటల్తో కిందా మీదా పెట్టేయగలదు. ఆమెకు మనసులో వేటి మీదా అంత లోతైన ఇష్టాఇష్టాలు ఉండవు. జరుగుతున్న క్షణంతోనే ఆమెకు సజీవమైన సంబంధం. గతకాలపు స్మృతుల బరువు గాని, భావికి సంబంధించిన ఆశల భారంగాని లేని మనసు. మనిషి నడవడికను నిర్దేశించే సూత్రాలేవి ఆమె ఏర్పరుచుకోలేదు. విధి నిషేధాలు వగైరాలు గాని, ధర్మాధర్మ చింతలతో బాధపడే అంతరాత్మగాని, నాగరికులకు సహజమైన సంక్లిష్టత గాని లేని మనస్తత్వం ఆమెది. ముఖమైనా ఎరగని మగవాడికి దేహార్పణ చేసి తేలికైన మనసుతో సుఖించగల మనస్తత్వం. ఆ మనిషికి రావుగారికి రైలులో ఓ కాని డబ్బు ఇచ్చేందుకైనా మనసొప్పింది కాదు. బిచ్చమెత్తుకుని జీవించడం మీద సదభిప్రాయం లేకపోవడమే కారణం. కానీ రైలు దిగే సమయం వచ్చేసరికి సామాను దించే సాయమవసరానికి ఆ మనిషే అవసరమయింది! రాత్రంతా ఆయన స్టేషన్ వెయిటింగ్ రూంలోనే గడపవలసి వచ్చింది. గాలివాన అంతకంతకు తీవ్రమవుతూ వచ్చింది. ముష్టి మనిషి భౌతిక దేహాన్ని చూస్తే రావుగారికి తగని అసహ్యం. కానీ ఆ భయంకరమైన రాత్రివేళ ఆమే తనకు గొప్ప తోడు అనిపించింది మొదటిసారి. గాలి విసురుకు గది తలుపు ఊడిపడేసరికి ఆ భయకంపనలో ఆమెను హఠాత్తుగా కరుచుకున్నారు రావుగారు. ఆపాదమస్తకం వణికే ఆ ప్రాణికి ఆమె కౌగిలి వెచ్చదనం గొప్ప సాంత్వన భావం కలిగించినమాట నిజం. ఆ క్షణంలో ముష్టి మని నోటితో ఒక గొప్ప మాట పలకించి భారతీయ తాత్వికతకు ఉందని చెప్పుకునే ఉదాత్తతను చాటిచెప్పారు. 'బాబుగారికి చక్కని కూతుళ్లుండుంటారు ఇంటి కాడ. బాబుగారు ఆరిని తలుచుకుంటున్నాడు' . ఈ మాటలని ఆమె తన గొడవలు కూడా చెప్పుకుంటుంది. ఒక మానవహృదయంలో నుంచి వెలువడ్డ ఆ మాటలన్నీ వింటున్నప్పుడు రావుగారు  తన చుట్టూ కట్టుకున్న గోడలన్ని మాయమవుతున్నట్లు భావిస్తారు. భయంకరమైన ఆ తుఫానులో ఇద్దరి శరీరాలు ఆలసి నిద్రలోకి జారుకుంటాయి. గాలివాన వెలసిపోయింది. నిద్ర నుంచి లేచిన రావుగారికి ఎదుట ఉండవలసిన ముష్టిమనిషి కనిపించలేదు.గదిలో నుంచి వచ్చి చూస్తే టిక్కెట్లు అమ్మే గదిలో ఆమె సామానుల కింద పడి చచ్చిపోయివుంది. రావుగారికి చిన్నపిల్లవాడికి మల్లే ఏడుపు తన్నుకురావడమే ఈ కథలో హైలైట్!

ఆమె చేతిలో తన పర్స్ ఉంది! కానీ.. కానీ బిడ్డ చేతిలో తండ్రి ఆస్తి వలె దాన్ని భావించాడేమో.. మనసులో కూడా దూషించాలన్న ఆలోచన రాలేదు. ముష్టిపిల్ల కొంటెతనాలు, చిలిపిమాటలు రావుగారిలోని ఈ మానసిక వికాసానికి దోహదాలు అయ్యాయి. ఆమె మృత్యువాత పడ్డ క్షణం గాలివాన వచ్చినప్పటి కన్నా ఎక్కువ బాధ కలిగించిందిప్పుడు రావుగారిలో. జీవిత వేదాంతంలోని నిఖర్సైన సారం అక్షరం ముక్క రాని దిక్కులేని పిల్ల ఒక మహామేధావికి ఈ విధంగా గురువై బోధించడమే ఈ కథానికను ప్రపంచ సాహిత్యంలో మన్నికయిన రచనగా ఎన్నిక చేసింది. తన ఆత్మీయురాలి దగ్గర ఆఖరి క్షణాలలో తన తాలూకు ఏదైనా ఒక గుర్తు మిగిలివుండాలన్నంత తపన రావుగారిలో ఆవేశించిన తరువాత మనీపర్స్ ను అలాగే ఉంచి.. అమె మీద ఆఖరు క్షణంలో దొంగ ముద్ర పడకూడదన్న జాగ్రత్తతో కేవలం తన తాలూకు గుర్తులున్న కాగితం మాత్రం తీసుకుని వచ్చేస్తారు రావుగారు. మానవుడు తనకు తానుగా ఏర్పరుచుకొనే నీతినియమాలకు.. వాటిని ఆచరించే సమయ సందర్భాలలో ఎదురయ్యే ద్వైదీభావానికి గాలివాన కథానిక ఒక సూచిక వంటి సృజన. ఎన్ని కట్టుబాట్లు ఏర్పరుచుకున్నప్పటికి చివరికి మనిషి అడుగుపొరలలో పడివుందే ప్రాథమిక మానవీయతదే ఆధిపత్యం అవుతుందనీ ఈ గాలివాన కథ తెలియచేసే వేదాంతం. ఒడుదుడుకులు లేనప్పుడు మనిషి పలికే నీతిపన్నాలు కాదు అసలు జీవితసారం. ఉత్పాతం ఎదురయినప్పుడు ఎదుర్కొనే సందర్భంలో అతగాడి అహాన్ని లొంగదీసుకునే అబ్సొల్యూట్ హ్యూమనిజమే నిజమైన మానవీయవాదమన్న సందేశమూ ఈ కథలో కనిపిస్తుంది. ధర్మ చింతన, వేదాంతం, సంస్కారం, మనిషి నుంచి మనిషికి పరిస్థితులు స్థాయిని బట్టి విభిన్నంగా రూపొందినప్పటికీ .. ఆఖరు ఉత్పాతంలో అందరిలో మేల్కొనేది ముడి మానవీయత మాత్రమే అనే జీవనసూత్రం వివరించేందుకు పద్మరాజు రచించిన ఈ గాలివానకు అన్నివిధాలా అన్ని వర్గాల నుంచి ఇప్పటికి ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. అతి చిన్నకథలో బహుముఖీనంగా చీలిన మానవీయత వైరుధ్యాన్ని, తిరిగి అవి సంగమించక తప్పని పరిస్థితుల వాస్తవాన్ని రావుగారు, ముష్టిపిల్ల, గాలివాన అనే మూడు కోణాల నుంచి పద్మరాజు పాశ్చాత్య ధోరణిలో ప్రాచ్య నేపథ్యం చెదరకుండా నడిపించడం వల్ల సార్వజనీనత అసంకల్పితంగా సమకూరింది. కులాసా అయిన మనిషిని ఒక వైపు, అత్యంత గంభీరమైన వ్యక్తిత్వం సంతరించుకున్న మనిషిని మరో వైపు నిలబెట్టి ఇద్దరి హృదయాలు ఒకే పాయలోకి ప్రవహించే విన్యాసాన్ని పద్మరాజు ఆద్యంతం ఎక్కడా విసుగు అనేది పుట్టకుండా, ఉత్కంఠ చెదరని వడుపుతో  నడిపించడంతో శిల్పం దృష్ట్యా కూడా కథ శిఖరాయమానంగా భాసించింది.  అత్యంత అసహజమైన సంఘటనను కల్పించుకుని, ఈ కథలో లాగా అతి సహజమైన రీతిలో కథనం చెయ్యడం సామాన్య రచయితను బోల్తాకొట్టించే విన్యాసం. సర్కస్ గుడారంలో ఇద్దరు చమత్కారులు ఆకాశంలో పల్టీలు కొడుతూ చేతుల మీద స్థలాలు మార్చుకునే దృశ్యం చూసినప్పుడు ఎంతటి సంభ్రమానందాలు కలుగుతాయో.. ఈ కథలో అతి గంభీరమైన రావుగారు.. మాటలతో ఎవరినైనా ఇట్టే బోల్తా కొట్టించేయగల ముష్టిపిల్ల మధ్యల వ్యక్తిత్వాల మార్పు అంతే సంభ్రమానందాలను కలిగిస్తుంది. వ్యక్తికి వ్యవస్థకుఅడుగున ఎక్కడో ప్రవహించే సనాతన సార్వజనీన మానవీయతను ఈ కథలో పద్మరాజుగారు నిరూపించారు.

ఆదర్శాల కోసమో, సామ్యవాద సిద్ధాంతాల విజయం నిరూపించడం కోసమో పాత్రలను సృష్టించే పద్ధతిని పద్మరాజు ఇష్టపడరు. అట్లాంటి ప్రయత్నం చెయ్యడం రచయిత బలహీనత అని ఆయనే ఒకానొక సందర్భంలో వ్యాసం ద్వారా చెప్పుకొచ్చారు.  పాత్రల పట్ల సానుభూతి కాకుండా కేవలం గౌరవ మర్యాదలు మాత్రమే చదివే పాఠకుడిలో ప్రేరేపించడం అంటే కథ బోధగురువు పాత్రను మాత్రమే పోషించిందని అర్థం. గుళ్లో పురాణం వినివచ్చే భక్తులంతా ఆ విధంగా మాత్రమే నడుచుకుంటారన్న భరోసా ఉండనట్లే, కథ బోధ గురువు పాత్ర పోషించే రచయిత పాఠకుడి చేర్చాలనుకున్న సందేశం ఉపదేశంలా నిరుపయోగమయిపోయే ప్రమాదముంది. ఆప్తుడు, స్నేహితుడు పక్కన కూర్చుని కులాసా కబుర్లతో కలిపి చెప్పాలను కున్నది చెప్పినప్పుడు వినే మనిషికి వద్దన్నా మనసుకు పట్టక తప్పదు. కథ కులాసా మిత్రుడి పాత్ర పోషించాలని పద్మరాజు భావిస్తారు. 'కథకుడు ఏ వాదీ కానక్కర్లేదు. కథలోని ధనికుడికి నిష్కారణంగా దుర్మార్గం అంటగట్టినంత మాత్రాన సామ్యవాదానికి కలిగే ప్రయోజనం  ఏముంటుంది? కథ విలువను చంపేసే ఈ తరహా కథలను గోర్కీ చాలా రాశారు. ఆదర్శాలను ఆత్మగతం చేసుకుని కూడా చనువుగా, చొరవగా మానవీయతను దర్శింపచేయగలిగినవాడే అసలైన రచయిత' అంటారు పద్మరాజు. క్లియోపాట్రాను కూడా ప్రేమించగలగడమే షేక్స్పియర్ విశిష్టత. రష్యా విప్లవం తరువాత కూడా ఆస్తి మీద వ్యామోహం వదులుకోని ధనికులను అర్థంచేసుకోవడమే గోర్కీ ఘనత.' అన్నది పద్మరాజుకు కథకుల మీద గల అభిప్రాయం.

పద్మరాజు 'వాసనలేని పూలు' ఈ అభిప్రాయాన్ని స్పష్టపరుస్తుంది. మనసుకు, శరీరానికి ఉండే సంబంధం పట్ల కూడా కొంత చర్చ చేసే ఈ కథానికలో అలౌకికుడు, కవి అయిన రాజారావు భార్య కొంత కాలం కాపురం తరువాత ఆత్మహత్మ చేసుకుంటుంది. చనిపోయిన తన భార్యను ఇంటి ముందు వాసన లేకుండా వికసించే పూలతో పోల్చుకుంటూ కొత్తగా రాసిన ఖండకావ్య సంపుటిలో మానసిక, దైహిక సంబంధాలను గురించి తన ఆలోచనలను బైటపెడతాడు రాజారావు. విశాలమైన సంస్కారాలు ల్

లేకుండా ప్రౌఢమైన గాఢవ్యక్తిత్వం కలిగి ఉంటే లౌకికలోకంలో  సహచరిస్తూ సుఖంగా కాపురం ఎవరికైనా అసాధ్యమే. నేను నా భార్యను ప్రేమించకుండాలేను. కానీ అది ఆమె అభిలషించిన రీతీలో బాహ్య సౌందర్య సౌష్టవాన్ని చూసి ఆకర్షితుడినయికాదు. ఆధ్యాత్మిక సమానత కోసం తపించే నాకు ఆర్థిక సమానత కోరుకునే నా భార్యకు సహజంగా  మనసులు కలవడం అయింది. తన ప్రౌఢత్వం నాకు ప్రతిబంధకం అయిందని నా మనసులో ఉన్న మాట తాను పసిగట్టిందో ఏమో.. ఇట్లా భౌతికంగా విడిపోయింది' అన్న అర్థంలో ఉపోద్ఘాతం రాసుకొస్తాడు. కవిజగత్తులో ఆర్థిక సమానత ఒక సమస్యగా ఉండదు. కానీ వాస్తవ జీవితంలో దాని తరువాతే అన్నీ. సామ్యవాద మిత్రులందరూ నా జీవితాన్ని ఒక పాఠంగా స్వీకరిస్తారన్న ఉద్దేశంతోనే చనిపోయిన నా భార్య మీద కూడా నిందాపూర్వకంగా మాట్లాడక తప్పడంలేదు. తన ఆత్మ వాసన లేని ఒక ఎర్రటి పుష్పంలా అనిపిస్తుంటుంది నాకు ఎల్లవేళలా. నా వల్ల తన దైహిక జీవనం ఎండిపోయిందో ఏమో తెలీదు. వెళ్లిపోయింది. ఎవరికి ఏమి కావాలో స్పష్టంగా తెలిసే అవకాశం ఈ లోకంలో ఎప్పుడూ లేదు. ఆమె వెళ్లిపోయిన తరువాత తనలో నాకు ఇప్పుడు దివ్యత్వం గోచరిస్తుంది' అని బాధను ప్రకటిస్తాడు రాజారావు. సామ్యవాదలోకంలో ఆదర్శాలను పట్టుకుని వాస్తవ జీవితాన్ని కష్టపెట్టేవాళ్లందరు గ్రహించవలసిన పాఠం నా జీవితంలో ఉంది'అన్నట్లు బాధపడతాడు రాజారావు. తన ఈ కథపై పద్మరాజు ఒక సందర్భంలో వ్యాఖ్యానిస్తూ 'ఆధ్యాత్మికవాది అయిన రాజారావు చింత అంతా అన్ని పూలకూ వాసన సమానంగా అందించే శక్తి లేదనే. వాసనా సంపద అన్ని పూలకూ అసమానంగా ఉండటం ద్వరా లోకంలోని వస్తుసంపద అసమానతను గురించి చింతించిన భావుకుడు రాజారావు.

సిద్ధాంతాల ఆధారంగా కథలు రాసినా వాటి విలువ తాత్కాలికమే. కొంత కాలం గడచిన తరువాత అవి ఆ రాసిన రచయితకే తృప్తినీయవు. ప్రచార సాహిత్యంగా మిగిలిపోయే సాహిత్య సృష్టి వల్ల రచయితకు శాశ్వతంగా కలిగే లాభం సున్నా- అన్నది పద్మరాజు అభిప్రాయం. పద్మరాజు కథలన్నీ గమనిస్తే సామాన్యంగా బైటికి తీయదగ్గ ఒక విధానం.. వస్తు వైవిధ్యంలో ఒక రెండు విరుద్ధ కొసలు అందుకొని  వాటి మధ్య సంఘర్షణను చిత్రించడం, సాధ్యమైతే సహజమైన సమన్వయం సాధించడంగా అర్థం చేసుకోవచ్చు. ఎదురు చూస్తున్న ముహూర్తం, గాలివాన ఈ కోవకు చెందిన ప్రముఖ రచనలే. కథారచనకు తనను ప్రేరేపించే వస్తువు, విధానం గురించి ఒక సందర్భంలో పద్మరాజుగారే స్వయంగా చెప్పుకొచ్చారు. 'గొప్పవిగా ఆమోదించబడిన కథలలోని సారమంతా పురాతనమైదైగానే ఉండటం గమనార్హం. అనాగరకమైన స్వభావాన్ని చిత్రించేందుకే వాటిలో ప్రాథాన్యం కల్పించబడింది. ఆ తత్వం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న విజ్ఞానప్రపంచం అడుగునా కూడా ఉంది. ఎన్ని యుగాలు గడచినా, నమ్మకాలు మారినా మనకు అర్థంకాని తత్వం ఒకటి ఎప్పుడూ ఒకటి మిగిలే ఉంటుంది. ఆ తత్వానికి మనిషి తార్కిక బుద్ధికి వ్యత్యాసం ఉండి తీరుతుంది. అటువంటి వ్యత్యాసమే నా కథలకు మూలవస్తువు. ఒక తీక్షణమయిన వ్యత్యాసాన్ని గుర్తించినప్పుడు గాని నాలో కథ రాయాలన్న తపన పుట్టదు. అభిరుచిని, విజ్ఞానాన్ని సేకరించి వాటిని వాడుకుంటూ సంఘంలో ప్రసిద్ధులయిన వారి జీవితాల నుంచి కథలు పుట్టే సావకాశం తక్కువ. వాళ్ల బుద్ధివికాసమే వాళ్ల మనఃప్రవృత్తులను అణచివుంచుతుంది. ఇక సంఘంలోని మిగిలిన వర్గాలు పెరుగుతున్న విజ్ఞానం దృష్ట్యా విపరీతమైన పెంకితత్వాన్ని చిత్త ప్రవృత్తులను ప్రదర్శిస్తాయి. మారే కాలం తాలూకు తత్వం అర్థం చేసుకోలేక మూర్ఖంగా ముందుకు సాగే వారి జీవితాల నుంచి ఆనందంగా బోలెడన్ని కథలు పుడతాయి. కథారచనకు ప్రధానమైనది కూడా పెరిగే ఈ నాగరిగత అడుగున్న అసాంస్కృతికత. ఇరువురు విభిన్నమైన వ్యక్తులలోనూ  అసాంస్కృతికతంగా మిగిలివున్న ఈ చిత్తప్రవృత్తుల మధ్య సారూప్యాన్ని కథకుడు నిరూపించగలగాలి. ఎంత చదువుకున్నా, ఎంత అనాగరిక వ్యక్తులలోనైనా మిగిలివున్న అసాంస్కృతికత మనకు వింతగా అనిపిస్తుంది.  అందుచేత కథకులు అనాగరిక లోకాన్నే పరీక్షించాలి. నాగరిక సంఘంలోని అనాగరికతను గుర్తించాలి. వాటితో తాదాత్మ్యం పొందితే మంచి కథలు అసంకల్పితంగా ఆవిర్భవిస్తాయి. పద్మరాజుగారి కథలలో కనిపించే అపురూపమయిన పాత్రల సృష్టికి  ఇదీ కారణం. పాత్రలలో ఏదో ఓ ప్రత్యేకత ఉంటే తప్ప చదువరిని కదలకుండా కూర్చోపెట్టే పట్టు దొరకదు.

ఉత్తమ కథకు ఉండవలసిన అనేక మంచి లక్షణాలలో భాష కూడా ఒకటి. భాషలోని విలక్షణత వల్ల పాఠక పపంచంలోకి వెళ్లే దారి రచయితకు సుగమం అవుతుంది. నోబెల్ బహుమతులకు దీటుగా సాహిత్యాన్ని సృష్టించిన సోమర్ సెట్ మామ్ భాషాపరంగా విమర్శలపాలయిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఎడ్మండ్ విల్సన్ అనే సాహిత్య విమర్శకుడి చేత భాష విషయంలో సెకండ్ రేటెడ్ రచయితగా నిందకు గురయిన సందర్భం గుర్తుంచుకోవాలి. వస్తువులో వైవిధ్యం ఉండి, శిల్ప పరంగా సమున్నతమైన స్థాయి కలిగిన కథలూ భాషాపరంగా పరిణతి ప్రదర్శించని పక్షంలో పాఠకహృదయాలను ఆకట్టుకోవలసినంతగా ఆకట్టుకోలేవు. ప్రతిభగల రచయితకు భాషా ఎంత ముఖ్యమైన దినుసో అర్థమయింది కాబట్టే పద్మరాజు కథనానికి వాడే బాషాలో ఎన్నో విధాల మెళుకువలు ప్రదర్శించారు. కానీ ఓం ప్రధమంలో త్రివేణి వంటి వంటి పత్రికలకు ఆంగ్లంలోనే కథలు రాసిన కారణంగా ఆ ప్రభావం అక్కడక్కడా అసంకల్పితంగా తెలుగు కథలలో కూడా కనిపిస్తుంది. ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో  రాసిన పోకడలు కనిపిస్తూనే ఉంటాయి. నిశిత పరిశీలన మీదట గాని ఎక్కడో ఒకచోట ఈ తరహా తబ్సీలు కనిపించకపోవడం పద్మరాజుగారు చేసుకున్న అదృష్టం అనుకోవాలి. వర్ణనల దగ్గర, ముఖ్యంగా ప్రకృతికి సంబంధించిన వర్ణనల దగ్గరకు వచ్చేసరికి రచయితలోని కవి నిద్ర లేచి తనలోని వ్యంజనా బలం ఏపాటిదో నిరూపించేందుకు ఉత్సాహపడతాడు. జీవితం బరువుగా  అక్కడ కూర్చుని ఆలోచించుకుంటూ  చుట్ట కాలుస్తున్నట్లుంది, రైలు వానపాములా పాకుతోంది, ఆమె పెదవులు ఇంకా విచ్చుకోని గులాబీ మొగ్గల్లా ఉంటాయి, పొద్దు గుంకిన తరువాత లోకమంతా దిగులుగా ఉంది.. ఇలాంటి వాక్యాలు లేకుండా పద్మరాజుగారి కథ నడవనే నడవదు. గాలివాన కథలో 'రావుగారికి తనకు ఆకలి వేస్తున్నట్లు జ్ఞాపకం వచ్చింది' అని రాశారు ఒకచోట పద్మరాజు 'రావుగారికి ఆకలి వేసింది' అనవచ్చు. కానీ అట్లా అనకపోవడమే పాలగుమ్మివారి పదాల నడకలోని విచిత్ర విన్యాసం. పాఠకులని తన వైపు తిప్పుకునేందుకు రచయిత చూపించే చమత్కారాలు ఇలాంటివి చాలా కనిపిస్తాయి పద్మరాజుగారి కథల నిండా. రాజుగారు కథలకు పెట్టే శీర్షికలలో కూడా విలక్షణీయతే.శబ్దాలంకార ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తుంది. సత్యము- తత్వము, ప్రకృతి- పరిష్కృతి, సామ్యవాదము- రమ్యరసామోదము.. లాంటి ఉదాహరణలు ఎన్నైనా ఇవ్వవచ్చు. శబ్దం అర్థాన్ని డామినేట్ చేస్తుందని ఎవరైనా విమర్శకు పూనుకున్నా..ధ్వనిని బట్టే కదా అర్థం అనుసరించేది? అంటూ ముందు కాళ్లకు బంధాలేసేయడం .. అదో బలమో బలహీనతో ఎవరికి వాళ్లుగా అన్వయించుకోవాల్సిందే! పాలగుమ్మివారు తన మనో పరిపాకంలో కావాత్మను విడదీయరాని పాళ్లలో రంగరించుకుని ఉన్నందున, అసంకల్పితంగా కలం ప్రకృతి ఊహల్లోకి వచ్చీరాగానే పరవశమయి చేసే కలవరింతలు ఇవన్నీ! రాజుగారి వర్ణనా వైదుష్యం, సరికొత్త వాక్య ప్రయోగ నిర్మాణ కౌశలం అనుభవానికి రావాలంటే ఆయన ప్రథమంగా వెలువరించిన 'కూలీజనం' కథల సంపుటం ముందు పెట్టుకుని కూర్చుంటే సరి.

నేటి కథానిక నడక పాశ్చాత్య సంప్రదాయాలను అనుసరించి సాగుతోందన్న వాదనతో పద్మరాజుగారికి విభేదం లేదు. కథానికా రచనకు వారిని పురికొల్పిందీ ఆ పాశ్చాత్య కథారీతులే. తన రచనలు పామరజన రంజకంగా ఉంటాయన్న పరిశీలనను ఆయన కేవలం పై పై పొగడ్త కిందే తీసుకుంటారు. బెంగాలీ రచయిత శరత్ బాబు విషయమై ప్రస్తావన కొచ్చిన ఓ సందర్భంలో 'నవభావాలు కలిగి, పతితులతో తిరిగి, చిత్రమయిన వారి ప్రవృత్తులను పట్టుకుని పామరజనులకు అందుబాటులో ఉండే పాత్రల రూపకల్పన చేసిన మహానుభావుడు ఆయన. ఆ తరహా రచనలు తెలుగులో కూడా రాసినవాళ్లని గౌరవించాలి. ఏనాటికైనా అట్టివి రాయగలిగితే చాలని ఆశిస్తాను' అనడాన్ని బట్టి తను అప్పటి వరకు పామరజనం  పాఠకులుగా చదివి అర్థంచేసుకొనే సాహిత్యం సృష్టించనే లేదని స్వయంగా ఆయనే ఒప్పుకున్నట్లు అయింది కదా!

కొత్తగా కథాలు రాయదల్చుకున్నవారిని ఉద్దేశించి తన అనుభవాల పురస్కరించుకుని పద్మరాజు రెండు మూడు విలువైన మాటలు సెలవిచ్చాడు. 'ఇంగ్లీషు కథా సాహిత్యం చదువలేని వారు ఆంగ్లసంప్రదాయంలో కథకు ప్ర్రయత్నించి ప్రయోజనం లేదు. జాతీయవిధానంలో కథానిర్మాణం ఎలా సాగతుందని తెలుసుకోవాలన్నా పరాయి భాషాజ్ఞానం తప్పనిసరి. ఇవేవీ కుదరని పక్షంలో ఇళ్లల్లో మన బామ్మలు కథలు చెప్పే పధ్ధతిని నిశితంగా గమనించండి.  మా బామ కథ చెప్పినట్లు నేను కథ రాయగలిగితే ప్రపంచాన్ని జయించినట్లుగా భావిస్తాను.  మనం కథలు రాసేటప్పుడు మన పూర్వీకులు మనకు కథలు చెప్పిన తీరును పరిశీలించాలి. ఆ కథలు, పాత్రలు, వాటిని చెప్పడంలోని సొగసు వగైరా మనసుకు పట్టించుకోవాలి.  వాటి నుంచే కదా మనం మన కథలు నిర్మించుకునే విధానం ప్రారంభించాలి? ఆ పాత్ర సంప్రదాయమే మనకు విశిష్టమైన కథానిర్మాణ కౌశలాన్ని అందించేది. ఇతర భాషలను గుడ్డిగా అనుకరించినందువల్ల ప్రయోజనం లేదు. మన నాగరికతకు చరిత్ర ఉంది. దానిని విడిచి సాము చెయ్యలేము. మనం వదుల్చుకోలేని విశ్వాసాలు మనల్ని వెంటాడుతున్నాయి. వాటిని ఏవగించుకుని మనం మన సంప్రదాయాన్ని సృష్టించుకోలేం.

విశ్వసాహిత్యంలో తెలుగు కథానికను తలెత్తుకు నిలబడేలా చెయ్యాలంటే విశ్వకథకుడు పాలగుమ్మి పద్మరాజు పలికిన హిత్తోక్తులు అవశ్యం అనుసరణీయం.

(స్రవంతి మాసపత్రిక - అక్టోబర్, 1955-శ్రీ డి. రామలింగం విశిష్ట వ్యక్తిత్వంగల కథకుడు పద్మరాజు- ప్రేరణ)

తెలుగుతక్కువతనం -కర్లపాలెం హనుమంతరావు

 





అచ్చుతప్పుల నుంచి అనవసర ఆంగ్ల పదాల చొరబాటు దాకా, సంకర వంకర భాష నుంచి అశ్లీల విశృంఖల వర్ణనల వరకు ఎన్ని తలబొప్పులు పాపం నేటి తెలుగుతల్లికి? పిచ్చి పిచ్చి పదప్రయోగాల పరంగా ప్రసార, ప్రచురణ మాధ్యమాల మధ్య ప్రస్తుతం పిచ్చపోటీ! ఒకటి కృతకమయితే, మరోటి వికృతం. జంటగా పుట్టిన పిచ్చి పదాలనే పాపాయిలను ఎట్లా పెంచి పోషించడమో దిక్కుతోచని తాజా దుస్థితి నేటి తెలుగుతల్లిది. అసుంటా పెట్టవలసిన జాడ్యాలన్నింటిని పిలిచి మరీ అంటించుకుంటున్న వెర్రి మొర్రి భాషకు ఏ మందు వేసి మళ్లీ మంచి దారికి మళ్లించుకోవాలో దారి తోచని  దయనీయ స్థితి కూడా తెలుగు భాషామతల్లిదే!

అభివృద్ధి కోసమై మంచి దారిన ప్రయాణించే కన్నబిడ్డ కడుపు మధ్యదారిలో కూడా ఎన్నడూ నకనకలాడకూడదు అన్నది తల్లిభాష ఆరాటం. అందుకోసం గాను మూట కట్టి ఇచ్చిన మంచి మాటల మూటను మురిక్కాలవలో విసిరి డొక్కుపదార్థాలతో డొక్కను నింపుకునే బిడ్డను చూస్తే ఏ తల్లి కడుపు తరుక్కుపోదు? అమ్మభాషను కాదని అన్యభాషను ఆశించే బిడ్డను చూసి ఎంత వద్దన్నా  కన్నతల్లి  తల్లడిల్లక మానదు.  బిడ్డను సంస్కారవంతుడిగా తీర్చిదిద్ది, సభ్యసమాజంలో గర్వంగా తలెత్తుకు తిరిగేందుగ్గాను అంతర్గంతంగా ఆరాటపడుతూ పరాయి భాషాపదాల నుండే  ఎంతో ఓపికగా ఇంటి రుచి తగ్గకుండా వండి వారుస్తుంది అమ్మభాషఅయినా,  తల్లి మాట అల్లంలా బిడ్డకు తోచడం.. ఏంటో తెలుగు నాలుక కెప్పుడూ ఈ దౌర్భాగ్యం! మంచి బిడ్డకు  అమ్మమాటే పరమావధిగా ఉంటుందంటారుపొరుగింటి తల్లి అవసరానికి మాత్రమే ఆదుకునే ఆసరా. ఇంటి చూరును వదిలేసి పద్దాకా ఆ చూరూ ఈ చూరూ పట్టుకు వేళ్లాడే బిడ్డలో ఇంకేం మంచిని చూడాలి? ఈనాటి  తెలుగుపిల్లడి జోరు ఆ తీరులోనే సాగుతున్నది మరి! సబబైన దారికి బాబును తిరిగి తెచ్చే ధ్యాసే లేదు బాధ్యులైన పెద్దలకు! అది కదా మరీ విచారకరం! తల్లిభాషకు పట్టుకొమ్మలుగా ఉండవలసిన తెలుగు పత్రికలు, ప్రసార మాధ్యమాల  పద విన్యాసం చూస్తే తెలుగు తల్లి మనసు ఎంతలా క్షోభిస్తుందో? 

తతిమ్మా రంగాల సంగతులు ఆనక, ముందు బిడ్డకు ఓనమాలు దిద్దించవలసిన విద్యారంగంలో తల్లి భాష స్థితి ఎంత దయనీయంగా మారుతోందో చూస్తున్నాంగా! ఎన్నేళ్లాయ మనం స్వతంత్రులమయి? భావపరంపరగాత సంస్కృతి సంగతి ఆనక, ముందు భాషాపరంగా అయినా స్వతంత్రులమవుతున్నామా? ఆ ప్రయాస చెయ్యాలన్న ప్రయత్నమయినా చేస్తున్నామా? సొమ్ములూ సోకులూ ఎలాగూ లేవుకనీసం అమ్మ కాలికి కట్టే మువ్వల్లోనైనా తెలుగు సవ్వళ్లు  వినిపడుతున్నాయా?  ఏదో  అవసరార్థంగాను ప్రవేశించిన ఆంగ్లభాషకే ఇప్పుడు అంతటా  పట్టాభిషేకం! ఆ మిడిమేళపు దొరతనం  కొలువులో  కనీసం నిలబడేందుకైనా అంగుళం చోటయినా తెలుగమ్మకు లేకుండా చెయ్యాలని ఎందుకు పన్నాగం!  తెలుగమ్మ కళ్లల్లో నీళ్లు చిప్పిల్లుతున్నా   చీమ కుట్టినట్లయినా లేదు ప్రభుత్వాలకు, ప్రజలకు.. అదీ విచిత్రం! తెలుగువాడి తోలుమందానికి ముందు మందేదయినా దొరికితే బావుణ్ణు.

ఏడాదికో సారి, అదీ మరే ఇతర ముఖ్యమైన రాజకీయ ప్రాధాన్యతలవీ ఇవీ పెట్టుకునే అగత్యం లేని సందులో,    సారస్వత పరిషత్సభా సమావేశమో,  ప్రపంచ మహా సభ పేరునో హంగామా ఉత్సవాలో జరిపించేస్తే.. కోల్పోయే  కళావైభవం మళ్లీ అమాంతం  తెలుగుతల్లికి  వచ్చేసినట్లేనా?  ప్రభుత్వాలను కాదనుకునే  ప్రయివేట్ వ్యక్తులదీ అదే తీరు!  పుబ్బకో, మాఘానికో వెలవరించే ప్రత్యేక సంచికల్లో ఘనంగా వ్యాసాలు రాసులు పోసుకుంటే మాత్రం  అమ్మభాష తలరాత గమ్మున మారిపోతుందా? అమ్మభాషంటే అన్ని జాతులవారి  దృష్టి నిరంతరం నిరంతరాయంగా  ఉంచవలసిన ప్రత్యేకాంశమని పదే పదే  నచ్చచెప్పివలసిరావాడమే  అసలు పెద్ద దౌర్భాగ్యం అమ్మభాషకు.

 

ఆంగ్లంతోనే భవిష్యత్తంతా. ఆ జ్ఞానం శూన్యమయితే అంధకారమే  జీవితమంతా!- అనే భావన ఎవరు, ఎందుకు, ఎక్కడ, ఎవరి ప్రయోజనాలు నెరవేరడం కోసం ఆరంభించారో? మురికివాడల్లో  బతుకులు  భారంగా ఈడుస్తూ రోజు గడవడమే పెద్ద పండుగులా సంబరపడిపోయే బడుగువర్గాలకూ  ఇవాళ ఈ ఆంగ్లవ్యామోహం సత్యయుగంలో జగన్మోహిన పంచడంలో  మోసం చేసిన అమృతభాండంలా ఊరిస్తున్నది! 

కారణాలు ఏమైతేనేమిలే గాని, మొత్తానికి ఇవాళ ఇచ్ఛాపూర్వకంగా పెద్దలు, పిన్నలు, ఉన్నత వర్గాలు, నిమ్నజాతుల పేరుతో  నిర్లక్ష్యం చేయబడ్డ అన్ని  వర్గాల వారి దృష్టిలో కూడా నిర్లక్ష్యానికి గురువుతున్న ముఖ్యాంశాలలో అమ్మభాష జాతకానిదే అగ్రస్థానం.  

పేరుకే విద్యాహక్కు చట్టం. కాలం గడుస్తున్న కొద్దీ ప్రభుత్వ పాఠశాలలు కూడా క్రమంగా ఆంగ్లమాధ్యమం కౌగిళ్లలో చిక్కుకుపొవడం ఇవాళ్టి చోద్యం. పది జిల్లాల తెలంగాణా లెక్కలు చూసుకున్నా నాలుగేళ్ల  కిందట(2016-17)ఒక్క విద్యాసంవత్సరంలోనే దాదాపు 4,951 ప్రభుత్వ పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంలోకి మారడాన్ని మనం  ఎలా అర్థం చేసుకోవాలి? ఇంగ్లీషు మీడియం నూతిలోకి  తోసేయబడ్డ  విద్యార్థుల సంఖ్య 82,512. ఇదే వరస ఇక ముందు కొనసాగితే,   రాబోయే కాలాల్లో ఏడాదికి సుమారు లక్షమంది తెలుగుబిడ్డలు, ఓనమాల స్థాయిలోనే తెలుగుతల్లి ఒడిలో నుంచి ఆంగ్లమనే ఊబిలోకి జారిపడబోతున్నట్లు లెక్క.  

ఆంగ్ల మాధ్యమంలో జ్ఞానార్జన తప్పని చెప్పడం కాదీ టపా పరమార్థం. ప్ర్రాథమిక దశ నుంచే బిడ్డను పరిసరాలతో  సంబంధంలేని వాతావరణంలోకి నెట్టేస్తే కష్టమని చెప్పడమే ఉద్దేశం. ఆ కారణంగా అయోమయంలో పడే బిడ్డ మెదడు ఎదగవలసినంత ఎదగకుండా పోతుందన్నదే దడ!  అపరిపక్వ స్థితిలో గిడసబారిన మెదడు సరిఅయిన ఆలోచనలు చేయలేవు. ఆ కారణంగానే..   బిడ్డలు గోరంత సమస్యను ఢీకొనలేనంత కొండగా ఊహించుకుని ఉత్తిపుణ్యానికే అటు అస్త్రసన్యాసం చేసేయడమో, ఇటు ఆటగా చూడవలసిన జీవితాన్నుంచి ఓటమి భయంతో నిస్సహాయంగా నిష్క్రియాపరత్వంతో నిష్క్రమించేయడమో జరిగేది! తల్లిభాష నుంచి చిన్ననాటనే దూరమయిన పిల్లల  విపరీత,  విపత్కర మానసిక పరిస్థితుల గురించి  సామాజికశాస్త్ర వేత్తలు వెలిబుచ్చే ఆందోళనలు జనాలకు ఎలాగు పట్టేటట్లు లేవు. మరి ప్రజాప్రభుత్వాలదీ అదే దారి అయితే ఒక్క తల్లిభాషకే కాదు, దానితో  సహా జాతికి మొత్తం  ముంచుకురాక తప్పదు.   కనీసం ప్రాధమిక దశ దాకా అయినా బిడ్డను ఇంటి భాష నుంచి వేరు చేయకండయ్యా అంటూ తల్లిభాష అంతలా వేడుకుంటున్నదే! అయినా వచ్చీ రాని ఆంగ్లం వాడకం మీదనే తగని మోజు! అదేం వేడుకో!

-కర్లపాలెం హనుమంతరావు

20 -01 -2020


 

Tuesday, January 19, 2021

తిట్టుకోడం మనకు కొత్తేమీ కాదు -కర్లపాలెం హనుమంతరావు

 



అచ్చు తెనుగులో అధిక్షేపం అంటే తిట్టు. తిట్లు తెలుగువాళ్లకు కొత్త విద్యేం కాదు. బాధ, కష్టం, పగ, అసూయ, అసహ్యం లాంటి వికారాలు కలియబెడితే బండరాయిలా పడుంటాడా మనసున్న ఏ మనిషైనా! మామూలు మనుషులైతే ఏ నీళ్ల పంపు దగ్గరో తంపులు పెట్టుకుంటారు. అదే నాలుగు అక్షరమ్ముక్కలు ముక్కుకు బట్టిన పెద్దమనిషైతే ?

పద్యాలు, పాటల రూపంలో తిట్ల దండకం కురిపిస్తాడు. గొడ్డుకో దెబ్బలాగా మనిషికో మాట. ఆ మాటను తూటాలాగా వదలడం తేలికేమోగాని, నాలుగు కాలాలపాటు నలుగురూ చెప్పుకునేలా  వదరడం సులభం కాదు. రెండర్థాలు, గూఢార్థాలు, పెడసరప్పోకడలు పోయినప్పుడే  పదిమంది నోట్లో తిరిగి తిరిగి పలకగలిగేది. కష్టపడి కావ్యాలు రాస్తే మెచ్చుకోడం మాట అటు పక్కనుంచి, పనిగట్టుకుని వంకలు పెట్టే ప్రబుద్ధులు కొంతమంది ఎప్పుడూ ఉంటారు. అట్లాంటి వాళ్లని గురించి పూర్వం మన ప్రబంధాలు రాసే కవులు 'కుకవినింద' వంకన కావ్యంలోనే తమ కడుపుబ్బరం తీర్చుకొనేవాళ్లు. నన్నచోడుడు అనే కవిగారు కుమారసంభవం అనే కావ్యం రాస్తూ  ఈ తరహా కుకవులను 'దొంతులు దొర్లించే కుక్కలతో పోల్చి మరీ తన కడుపుబ్బరం తీర్చుకున్నాడు. మంచి గుణాలను దోషాలుగా ఎత్తి చూపించి ఎద్దేవా చేసే ఈ తరహా పెద్దమనుషులు ఒక్క సాహిత్యరంగంలో ఏం ఖర్మ.. అన్నింటా.. అన్ని కాలాలలో తారసపడుతుంటారు. కాబట్టే నన్నయగారంతటి మహానుభావుడిక్కూడా తన వంతు  మహాభారతంలో ఈ తరహా నిక్షేపరాయుళ్లను గురించి 'శిశుపాలుడు' పాత్రను అడ్డం పెట్టుకుని ప్రస్తావించక తప్పింది కాదు. భీష్ముడు చెప్పాడని చెప్పి ధర్మారాజు శ్రీకృష్ణుడికి రాజసూయ యాగం చేసే సందర్భంలో ఆర్ఘ్యమిస్తాడు. సాటి యాదవరాజుకు అంత లావు గౌరవం దక్కడంతో కడుపు మండిన శిశుపాలుడు, 'వసుదేవుడు అంతటి ముసిలాయన ఉన్న సభలో వాసుదేవుడికే ఎందుకు ఈ సత్కారం? ధర్మయుక్తులు తెలిసిన ద్వైపాయనుడున్న చోట ఋత్విజుడనా కృష్ణుడికి ఈ  గౌరవం?ద్రోణుడు, కృపాచార్యులు వంటి గొప్ప గురువులు ఎదుటనే ఏ గురుభావం చూసి నల్లనయ్య పట్ల ఇంత వినయం? యాదవరాజులు ఎంతో మంది అవని మీద ఘనంగా ఏలుతుండగా ఏ భూనాథుడన్న బుద్ధితో ఓ గొల్లకాపరికీ పెద్దరికం?పూజనీయులైన పురుషులింత మంది సమక్షంలో ఏ దీక్షాదక్షతలున్నాయనయ్యా ధర్మరాజా, భీష్మాచార్యుల మాట విని ఈ గొడ్లుకాచుకునేవానికి ఇంత గొప్ప పురస్కారమిచ్చింది?' అని రొష్టు పడతాడు శిశుపాలుడు.

ఇహ తెలుగు మాటకు వెటకారం నేర్పిన తిక్కనగారి కలం పోట్లను గురించి ఎంత చెప్పినా ఇంకొంత మిగిలే ఉంటుంది. విరాటపర్వంలో తాను కీచుకుడి భయాన అనాచ్ఛిదితగా  నిండు సభామధ్యమంలోకి నాటకీయంగా జొరబడటాన్ని కంకుభట్టు వేషంలో ఉన్న మొగుడు ధర్మరాజు తప్పుపట్టడం చూసి మనసు దెబ్బతిన్న ద్రౌపది ' నా మొగుడూ నాటకాలరాయుడే! పెద్దాళ్లను బట్టే కదా చిన్నవాళ్లు నడుచుకొనేదీ?' అని ఎదురు దెబ్బకొట్టేస్తుంది. అహం మీద దెబ్బ పడితే చిన్నా పెద్దా అన్న తారతమ్యం చూడనీయదు బుద్ధి. భాగవతంలో హిరణ్యకశిపుడు వంశాచారానికి విరుద్ధంగా విష్ణుభక్తుడవుతున్నందున కన్నకొడుకు ప్రహ్లాదుణ్ణి సైతం తన అసురవంశం అనే శరీరంలో పెరిగే 'దుష్టాంగం'గా తిట్టిపోస్తాడు. మిగిలిన అంగాలను రక్షించుకునే నిమిత్తం చికిత్స కింద ఆ 'కులద్రోహి' ని అధముడిగా భావించి శిక్షించడానికైనా వెనుకాడడు. అసురలదేముంది? ఆ దేవుళ్లకే కోపాలు అదుపులో లేని సందర్భాలు బోలెడన్ని తెలుగుసాహిత్యంలో. శ్రీనాథుని భీమేశ్వర పురాణంలో కాశీని శపించిన వ్యాసులవారి మీద పట్టరాని కోపంతో తిట్లకు లంకించుకుంటాడు సాక్షాత్తూ విశ్వేశ్వరుడు. 'ఓరి దురాత్మ నీవారముష్టిం పచాభాస యోజన గంధి ప్రథమ పుత్ర/దేవరన్యాయ దుర్భావనా పరతంత్ర, బహుసంహితా వృథా పాఠపఠన.. ' అని తిట్టిపోసినా ఆవేశం చల్లారని ఆ ఈశుడు అంత గొప్ప పంచమవేదం మహాభారతం రచించిన మహాపండితుడు వ్యాసుడిని పట్టుకుని చివరకు 'భారత గ్రంథ పండితమ్మన్య'గా తేల్చేశాడు. 'పండితమ్మన్య' అంటే పండితుడు కాని పండితుడు అని  శ్లేషార్థం.

ధూర్జటి మహాశివభక్తుడు. కానీ ఏ కారణం చేతనో రాజులు పేరు వింటే చాలు మహా రాజుకుంటుంది ఆ శైవుడి మనసు. ఒకానొక సందర్భంలో 'రాజుల్మత్తులు వారిసేవ నరకప్రాయంబు వారిచ్చునం/భోజాక్షీ చతురంతయానతురగీభూషాదు లాత్మవృథా/బీజమబుల్' అని తిట్టిపోసిన సందర్భం అందుకు ఉదాహరణ. కారణం, కర్జం ఉండి తిడితే అదో రకం. 'తగుపాటి కవులకియ్యని మొగముండల కేలగలిగె మూతిన్ మీసల్' అంటూ 'ఇయ్యగ నిప్పించగల యయ్యలకేగాక మీసమందరికేలా?' అన్న భావం గల కవిచౌడప్పల తరహా ఘంటా ఘోషంగా దాతృత్వగుణం లేనివారిని తగులుకున్న కవులూ మనకేమీ తక్కువగా లేరు. 'ఊరక సజ్జనుండొదిగి యుండిననైన దురాత్మకుండు ని/ష్కారణమోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా ' అభ్యసించే అల్పులను, లోభులను భాస్కర శతకకారుడు తరహాలో 'నూరు టంకాలు ఖరీదు చేసే చీరలు పెట్టెకు నిండుగా ఉన్నప్పుడు అవి చినిగిపోయే వరకు కొరికే చిమ్మట పురుగులతో పోల్చి  తిట్టిన కవులూ లేకపోలేదు. నిష్కారణంగా పరులకు కీడుచేసే పెడబుద్ధులను తిట్టిపోసిన కవులను లెక్కించడానికి చేతివేళ్లు, కాలివేళ్లు మనకు ఇంకెన్ని వందలున్నా చాలవు. 'అల్పుడైన వానికి అధికారమిచ్చిన,/ దొడ్డవారినెల్ల తొలగగొట్టు' అంటూ నిత్యం లోకంలో జరుగుతున్న అక్రమాలను కళ్లారా చూస్తూ కూడా వాళ్లని మన వేమన తరహాలో ఏ 'చెప్పు తినే కుక్కలతో' పోల్చి తిట్టుకోకుండా ఎలా ఉండగలం? పది నీతులతో పాటు పది బూతులనూ పద్యంతో కలిపి సభలో  ధైర్యంగా చదివినవాడే ఘనుడైన కవి అని చౌడప్పలాంటి కవులు ఎప్పుడూ వచ్చిపోతూనే ఉంటారనడానికి వెల్లువలా కురిసి వెలసిన దిగంబర కవిత ఉద్యమ ఉధృతే ఒక ఉదాహరణ. నీతి ఉపదేశం కోసమూ బూతును ఆశ్రయించడం ఒక విచిత్రమైన సిద్ధాంతంలా కనిపిస్తుంది. కాని ఆ ఉపదేశం లక్ష్యం సంపూర్ణంగా నెరవేరడం ఆలకించే నాథుడిలో వివేచన మేల్కొన్నప్పుడే. అందరూ వందిమాగదులే పోగయిన చోట  ఒక మాట ప్రత్యేకంగా వినిపించడానికి కొద్దిమంది బుద్ధిమంతులు తొక్కే  బాటను అర్థంచేసుకోవచ్చు. 'కోకిలేన కృతం మౌనం ప్రావృట్కాలే సమాగతే/ యత్రభేకపతిర్వక్తా తత్రాస్మాకం కుతో వచః'(వర్షాకాలం రాగనే కోకిల మౌనం వహించింది.మండూక రాజు ఎక్కడైతే వక్తగా వ్యవహరిస్తాడో, అక్కడ మా వంటివారికేమి మాటలుంటాయి?) అన్న18 వ శతాబ్ది నాటి వాంఛానాథుడి మహిష శతకంలోని బాధ అన్నికాలాలకూ వర్తించేదే! పశుజాతి మొత్తంలోకి అతి  నీచమైనదని భావించే దున్నపోతును  దుష్టరాజుకు ప్రతినిధిగా చూపెట్టి స్తుతించే నెపంతో  వాంఛానాథుడు  దూషించిన ఎత్తిపొడుపు శతకానిదీ ఇదే దారి మరి. తిట్టడం కోసమే రాసే రాతలను కాలం ఆట్టే కాలం పట్టించుకోదు. పద్దస్తమానం ఎవరినో ఒకరిని ఎత్తిపొడవనిదే కల ముడవని శ్రీనాథుడిని, అతగాడి మిత్రుడు అవచి తిప్పయ్యసెట్టిని మనసులో పెట్టుకుని వినుకొండ వల్లభరాయడు అనే కవి క్రీడాభిరామం పేరుతో ఒక కావ్యం సృష్టించాడు. చాలావరకు శ్రీనాథుడి పోకడలు పోతూనే కాకతీయుల నాటి ఓరుగల్లు పురవీధుల్లో తిప్పుతూ మంచనశర్మ, టిట్టిభసెట్టి అనే రెండు పాత్రల ద్వారా అన్ని కులాల, తెగల స్త్రీలను పచ్చిగా వర్ణించేశాడు. ఇప్పుడా పద్యాలన్నీ చెప్పుకుంటూ పోతే పెద్ద రసాభసా కావడం ఖాయం.  బూతు భావాలను సైతం అన్యాపదేశంగా ఎట్లా చెప్పవచ్చో ఉదాహరణగా సూచించడానికి వల్లభరాయుడు తొలిఝామున తన మానాన తాను కూసే కోడిని అడ్డం పెట్టుకుని ఎట్లా పద్యం చెప్పాడో ఈ పద్యంలో చూడవచ్చుః రాత్రంతా సంభోగ విహారంలో సంరంభంగా ఉన్న జంటలోని ఒక ప్రియుడు తొలిఝామున గొంతెత్తి కూసిన పాపానికి కోడిని ఎంతలా పడతిన్నాడో! 'ఎట్టకేలకు నలుక రేయల్ల దీర్చి యువిద/యధరామృతమ్ముగ్రోలుచున్న నాకు

/పాన విఘ్నంబుగా  మ్రోసె పాపజాతి,/జాతి ఛండాలమైన వేసడపు కోడి'.

ఇట్లా ఏదో ఒక వింతో, చమత్కారమో ఉన్నా కొంత నయం, తిట్టడం కోసమే కవిమహానుభావులు  వెలువరించిన తిట్టుకావ్యాలు మాత్రం మనకు కొదువా?తెనాలి రామలింగకవి శేషప్పవిజయం,  చిత్రకవి వెంకటరమణకవి సకల వర్ణనా పూర్ణరామాయణం, కూచిమంధి జగ్గకవి చంద్రరేఖా విలాసం, పిండిప్రోలు లక్ష్మణకవి రావణదమ్మీయం, రేకపల్లి మహాదేవకవి చిన్ని వెంకట నరసీయం.. సర్వసభ్యతలను తోసిరాజనేసిన  బూతుబుంగలు. కూచిమంచి జగ్గకవి సాధారణంగా భగవన్నామ స్మరణతో ప్రారంభమయే  మంగళాశాసనంలోనే పోయిన పోకడ ఇందుకు ఒక చిన్న ఉదాహరణ,  తన కావ్య కృతిపతి నీలాద్రిరాజును 'శ్రీకంఠుండు భుజంగభూషణుడు భస్మీభూత పంచాస్త్రు డ/ స్తోకాటోపబల ప్రతాప పురరక్షోదక్ష సంశిక్షణుం/ డాకా శోజ్జ్వల కేశపాశుడు త్రిశూలాంకుండు తా/ నీకం జింతలపాటి నీలన్పతిన్ వీక్షించు నేత్రత్రయిన్' శివుడు నీలాద్రి రాజును మూడో కన్నుతో చూడాలన్నంత(బూడిద చెయ్యాలన్నంత) కసి అన్నమాట కవికి! పూర్వకవి స్తుతిలో కూడ బీరుపోకుండా జగ్గకవి కేవలం వేములవాడ భీమకవి, తెనాలి రామకృష్ణకవి, శ్రీనాథకవి, తురగా రామకవి వంటి తిట్టుకవులను మాత్రమే స్మరించుకోవడం మరో విశిష్టత.

మాట పట్టింపు దగ్గర నుంచి మత విశ్వాసం దగ్గరి దాకా అణుమాత్రం తేడా వచ్చినా అనుమానం లేకుండా చంపమనో, నరకమనో ప్రబోధించిన సాహిత్యం సంస్కృత వాజ్ఞ్మయం నుంచి రెండాకులు ఎక్కువ నేర్చిన వాక్శూరత్వం తెలుగుపలుకుది ఒకానొకప్పుడు. 'ప్రాజ్ఞులు వేదజ్ఞులు, లో/కజ్ఞులు చేగొండ్రె గతశిఖాగాయత్రీ/యజ్ఞోపవీతనాస్తికు,/లజ్ఞులు చేగొండ్రుగాక యద్వైతమజా' అనడంతో సరిపుచ్చుకుందా .. 'శివనిందావిషయంబగు,/నవమానము సెప్పునట్టి యప్పుస్తకముల్/అవిచారంబున గాల్పగ,/నవుచెప్పెడి వానిజంపనగునీశానా!' అంటూ అద్వైతం పుచ్చకున్నవాళ్లందర్నీ, శైవం వద్దన్నవాళ్లతో ఏకంగా చంపెసెయ్యమనే దారుణం అధిక్షేపాత్మక సాహిత్య రూపంలో మల్లికార్జున పండితారాధ్యుల శివతత్వసారంలో దర్శనమిస్తుంది మరి!

కనకపు సింహాసనమున/శునకమును కూర్చుండబెడితే ఏమవుతుందో సుమతీ శతకం ఆనాడే అధిక్షేప రూపంలో బుద్ధిమంతులను హెచ్చైరించింది. పామరుడు తగిన రక్షణ లేకుండా హేమం కూడబెడితే అన్యాయంగా అది ఏ విధంగా భూమీశుల పాలవుతుందో చీమలు, పాముల దృష్టాంతంతో సవివరంగా చెప్పిన అధిక్షేప సాహిత్యం సమాజం పట్ల మొదటి నుంచి తన వంతు అప్రమత్తత బాధ్యతను  సక్రమంగానే నిర్వర్తించింది. కుమారీ, కుమార శతకాలనో, వేమన, భాస్కర, సుమతుల వంటి మకుటాలతో వెలువడ్డ వేలాది శతకాల  శ్రేణులన్నీ, కేవలం పేరులోనే కాకుండా.. చెప్పే తీరులలో కూడా నీతులను అవసరార్థం బూతుల రూపంలో కొంత ఘాటుగానే చెప్పిన మాట నిజం. నులిమితేనే నుసి తొలగి పత్తి వత్తి  మరింత ఉజ్వలంగా వెలుగుతుందన్న సద్భావనతో నాలుగు పిచ్చి మాటలతో నలుగుపెట్టి బుద్ధులు నేర్పించే అధిక్షేపం నిక్షేపంగా సదా ఆదరణియమే! అర్థ శతాబ్దం కిందట ఆంధ్రదేశంలో వీధిబళ్లల్లో చదువుకున్న బడిపిల్లలో ఎక్కువ మంది దసరా పండుగ పదిరోజులూ ఇంటింటికీ పప్పుబెల్లాల కోసం తిరిగే సమయంలో పాడుకొనే పాటలు కొన్ని ప్రసిద్ధమైనవి ఉండేవి. అందులో శేషప్పకవి విరచిత నరసింహ శతకంలోని 'మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు- మాన్యముల్ జెరుప సమర్థులంత/ యెండిన యూళ్లగోడెరిగింపడెవ్వడు-పండిన ఊళ్లకు ప్రభువులంత/యితడు పేద యటంచు నెరిగింపడెవ్వడు-కలవారి సిరులెన్నగలరు చాల.. ' అంటూ పెట్టే దెప్పుళ్లు చాలక' యిట్టి దుష్టుల కధికార మిచ్చినట్టి,/ప్రభువు తప్పులటంచును బలుకవలెను' అంటూ చిన్నిబిడ్డల నోట వినిపించే అధిక్షేపాలు అన్ని కాలాలకూ వర్తించే నిష్టూరాలే కదా!

శేషప్ప కవి నరసింహ శతకంలో మొరపెట్టుకున్న చందాన  'ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు - ద్రవ్య మిమ్మని వెంటఁ దగులలేదు/కనక మిమ్మని చాల గష్టపెట్టగలేదు - పల్ల కిమ్మని నోట బలుకలేదు/సొమ్ము లిమ్మని నిన్నునమ్మి కొల్వగలేదు - భూము లిమ్మని పేరు పొగడలేదు/బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగాలేదు - పసుల నిమ్మని పట్టుపట్టలేదు' అంటూనే 'నేను గోరిన దొక్కటే నీలవర్ణ - చయ్యనను మోక్షమిచ్చిన జాలు నాకు' అన్న స్వార్థంతో

 నమ్ముకున్న దైవాన్ని ఏ భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర' అనో పొగిడే భక్తశిఖామణులూ కద్దు లోకంలో. సొంతానికి ఆశించిన కోరికలు నెరవేరలేదన్న ఉక్రోషంతో తిట్టిపోసే లక్షణం కొందరికి మల్లే గాక, ఆరాధించేవారికి అన్నీ సమకూరడం లేదన్న చింతతో అందుకు ఆ ఆరాధ్యులనే బాధ్యులని చేస్తూ ఎత్తిపొడిచే బాధ ఈ భక్తశిఖామణులది. కాసుల పురుషోత్తమకవి శ్రీకాకుళాంధ్ర మహాకవిని ఈ రకంగానే  దెప్పుతూ చెప్పిన కీర్తి నింద పద్యాలు పరమ ప్రసిద్ధం. విధర్మీయుల బలగాలు సింహాచలాన్ని, ఆ ప్రాంత ప్రజాసమూహాన్ని చెండాడుతున్నా.. గుళ్లో రాయిలా నిమ్మళంగా పడున్నందుకు ఉక్రోషంతో తాను ఆరాధించే నరసింహావతారుని మరో అవతారం  శ్రీకృష్ణుని లీలలను గుర్తుకు తెస్తూ గోగులపాటి  కూర్మనాథకవి పెట్టిన గోడంతా ఈ అధిక్షేప సాహిత్యం కిందనే జమ. 'పాలీయ వచ్చిన భామిని ప్రాణంబు-లపహరించి చెలంగినట్లుగాదు/యాగోత్సవంబున కతిమోదమున బిల్వనంపు మామను ద్రుంచినట్లుగాదు/చేతగాక నరుచేత చుట్టంబుల నందర జంపించినట్లుగాదు/తుంగ గల్పించి యుత్తుంగ వంశద్రోహ-మాచరించి చెలంగినట్లుగాదు' పరంబలంబిది నీ ప్రజ్ఞ పనికి రాదు,/లెమ్మికను మీనమేషమ్ముల్లెక్క యిడక/ చొరవ తురకలు గొట్టగా చుక్క యెదురె,'   

    అంటూ  వైరిహరరంహ సింహాద్రి నారసింహ' అంటూ సాక్షాత్ స్వామి నరహర మూర్తినే నిర్భీతిగా ఎత్తిపొడిచే వ్యాజనింద రివాజే ఇక్కడ.

అధిక్షేప సాహిత్యానికి వేములవాడ భీమకవి నుంచి లెక్క పెట్టుకుంటూ పోతే మేధావిభట్టు, బడబాగ్నిభట్టు, శ్రీనాథ మహాకవి, ప్రౌఢకవి మల్లన, తెనాలి రామలింగడు, అల్లసాని పెద్దన, భట్టుమూర్తి, కందుకూరి రుద్రయ్య, ఎర్రవల్లి పర్వతన్న, బొడ్డుచెర్ల వెంగన్న, రాళ్లబండి పట్టాభిరామరాజు, మోచెర్ల వెంకన్న, అడిదం సూరకవి, రేకపల్లి సోమనాథుడు, అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి వంటి కవులెంతో మంది వేటుకూరి ప్రభాకరశాస్త్రిగారి చాటుపద్యమణిమంజరి చాటున  చటుక్కున మెరిసి మురిపిస్తారు. అందుకే 

చూసింది చూసినట్లు, తనకు తోచింది తోచినట్లు స్పష్టంగా, సూటిగా చెప్పేసే బలహీనత నుంచి బయటకు రాని మహాకవి శ్రీనాథుడు మామూలు మనిషి కానివ్వండి, మహారాజాధిరాజు కానివ్వండి, ఆఖరుకు ఆ మహాదేవదేవుడే దిగిరానివ్వండి, వాళ్ళని కడిగెయ్యటానికి అవకాశం దక్కితే ఒక్కడుగయినా  వెనకాడని  మనస్తత్వం కలవాడు కనకనే ఆధునిక కవి ఆరుద్ర నోట ప్రశంసలు పొందిన ''కొంటె పిల్లకాయలు లేని కన్నతండ్రి-గోదావరి పొంగులేని రాజమండ్రి' - హంసీయానకు గామికి న్నధమ రోమాళుల్‌ నభఃపుష్పముల్‌/సంసారద్రుమ మూల పల్లవ గుళుచ్ఛంబైన యచ్చోట వి/

ద్వాంసుల్‌ రాజమహేంద్ర పట్టణమునన్‌ ధర్మాసనంబుండి ప్ర/

ధ్వంసాభావము ప్రాగభావ మనుచున్‌ దర్కింత్రు రాత్రైకమున్‌' అన్న  అభిశంసనకు  గురయింది అన్యాయంగా. తమ కవిత్వంలో తప్పులు వెదికేవాళ్లనో, సత్కారాలు అందివచ్చే సూచనలు అందుకుంటూ అడ్డుపుల్లలు వెసేవాళ్ల పుణ్యం వల్ల ఆ అవకాశాలు తప్పిపోయినప్పుడో, నిష్కారణంగా అపాయం తలపెట్టి వినోదించే దుష్టులు తారసపడినప్పుడో, ఎన్ని వినతులు సమర్పించినా చిన్నమెత్తు సాయం అందనప్పుడో, సాటివారినైతే నోటి దూల తీరేదాకా ఎన్నైనా పడతిట్టిపోసుకోవచ్చు. బలహీనుడు బలవంతుడిని ఎదుర్కొనే సందర్భం తటస్థించినప్పుడు నేరుగా ఎదుర్కొనే సామర్థ్యం కరవైనప్పుడు నోరూ వాయా లేని  ఏ పిల్లినో, ఎలుకనో అడ్డుపెట్టుకుని అడ్డమైన తిట్లు తిట్టిపొయ్యడమో, అదీ ప్రమాదకరమని తోచినప్పుడు కనీసం దెప్పిపొడుపులతో అయినా సరిపెట్టుకుపోవడమో అత్యంత సహజం.  అదే కాస్త హస్త లాఘవం ముదిరిన సరుకైతే కలం పట్టి మరీ రమణీయార్థంలోనో, అలంకార భరితంగానో, శ్లేషార్థంతోనో, రెండర్థాల పదాలతోనో.. సరసమాడుతున్నట్లుగానే విరసాలడేయడం.. అధిక్షేప ప్రక్రియలో అదో  విధానం. నేరుగా తిట్టినవాళ్లు, నేరకపోయి వీడితో ఎందుకు పెట్టుకున్నామా అని తలపట్టుకునేటట్లు నాలుగు పెట్టేవాళ్లు, మోజు మాటలతోనే మొరటుతనం ప్రదర్శించే ఘనులు, బండబూతుల నుండి, దండకాలు.. స్తోత్రపాఠాల రూపంలో  చెండాడుకునే దుందుడుకుగాళ్లు, చాటువులలో పెట్టి చాటుమాటు మాటలతో చాకిరేవు పెట్టేవాళ్లు, శతకాల రూపంలో సహస్రం పెట్టేవాళ్లు, కావ్యాల వంకన కడుపుబ్బరం తీర్చుకునే కవిరాయుళ్లు.. అబ్బో! అధిక్షేపానికి ఎంత పెద్ద కథ ఉందో ఇంత చిన్న వ్యాసంలో ఆ వివరాలన్నీ పరామర్శించుకోవడం కుదిరే వ్యవహారం కాదు. నిద్రపోయే ఉపపాండవులను మధ్యరాత్రిలో దాడిచేసి మట్టుపెట్టిన అశ్వత్థామను ద్రౌపది వంటి కన్నతల్లి చేత కడు సభ్యంగా తిట్టించాడు బమ్మెర పోతన్నగారు తన భాగవతంలో! 'ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు కిం/చిద్ద్రోహంబును నీకు జేయరు బలోత్సేకంబుతో చీకటిన్/భద్రాకారుల పిన్నపాపల రణ ప్రౌఢ క్రియా హీనులన్/ నిద్రాసక్తుల సంహరింప నకటా నీ చేతులెట్లాడెనో!' అంటూ పాంచాలిలోని కన్నతల్లి హృదయం పరిపరి విధాల రోదిస్తుంది. కానీ కాలం మారిందిప్పుడు. హింసన చణకు పాపపుణ్యాల ప్రస్తావన పట్టని కాలం నడుస్తున్నది ప్రస్తుతం. మితి మీరిన ఆశల ఆబోతులు కుమ్ములాటకై కొమ్ములు ఝాడిస్తూ ముందుకు ఉరికొస్తుంటే చేత ఏ ఆయుధం సమయానికి లేని అర్బకుడు అఖరుకు నోటి నాలుకనే ఆయుధంగా సానబట్టి బరుతెగించి పోరాడక తప్పని పరిస్థితులు ప్రస్తుతానివి. తిట్టిన ప్రతీ వాడి మాడుపై మొట్టవలసిన అగత్యం లేదు కానీ.. అసందర్భంగా, స్వార్థపూరితంగా, స్వలాభం మీద మాత్రమే ఆపేక్ష ప్రదర్శించే క్రమంలో ఎవరెట్లా గోదాట్లో కొట్టుకుపోయినా ఫరవాలేదన్నట్లుగా కుపరిపాలన సాగించే ప్రభువుల మనసుల్లో కదలిక తెప్పించేపాటి పాటవం కాస్తో కూస్తో కలిగించలేని పక్షంలో ఏ అధిక్షేపమయినా ఎంత అలంకారప్రాయంగా ఉన్నా వాంఛనీయం కానేకాదు.

భాషాకాలుష్యానికి దోహదపడే తిట్టుసాహిత్యం ఎంత రమణీయకమైన పదాలతో పొదిగినా  సదా నిరాదరణీయం.   

-కర్లపాలెం హనుమంతరావు

19 -01 -2020

 

 

 

 

నాస్తికుడికే రాజకీయం కావాలి -కర్లపాలెం హనుమంతరావు

 



ఆస్తికుడికి ఏ రాముడో, దైవదూతో, అల్లా పురుషుడు ఉంటాడు.. విన్నా వినకున్నా మొరపెట్టుకోవడానికి! దేవుడి ఉనికిని కొట్టిపారేసే నాస్తికుడి నసకు చెవి ఇచ్చే నాథుడు ఎక్కడుంటాడు? ఎవడి గోల వాడిదే.. ఎవడి బతుకు బండికి వాడే సారథి.. అని విశ్వసించే నాస్తికుడి ఈతి బాధల పరిష్కారానికి రాజకీయాలే గతి. ఒక చెంప రాముడో, రహీమో, క్రైస్తవమో  మన దుఃఖ జీవన సాగరం ఆవలి తీరానికి దారి చూపించే మార్గదర్శకులు అంటూ అనునిత్యం ఘోషిస్తూనే, మళ్లా ఆ రాముళ్లను, రహీములను, క్రీస్తూదేవుళ్లను దిక్కులేని వాళ్లుగా చేసేస్తున్నారని ఒకళ్ల మీద ఒకళ్లు నిప్పులు చల్లుకుంటున్నారు ఆస్తికులు. దేవుడు మనిషిని కాపాడుతున్నట్లా, మనిషే దేవుడి రక్షణకు కంచెగా నిలబడ్డట్లా అని అడిగే నిజాయితీ ప్రశ్నకు సజావుగా బదులు ఇవ్వకుండా ముక్కు చుట్టుడు మొక్కుబడి స్పందనేదో వెలిబుచ్చేసి ఆనక దేవుణ్ణి చిన్నబుచ్చేశాడని ఆగడాలకు దిగవచ్చు, అల్లర్లు ఎన్ని ఏళ్లయినా ఎడతెరిపిలేకుండా సందు దొరికినప్పుడల్లా చేసుకొనే సౌకర్యం ఆస్తికులకు కద్దు. నిజాన్ని నిజంగా తప్ప అబద్ధంగా అంగీకరించలేని అర్భకుడు నాస్తికుడికి.. ఏ దేవుడైనా ఎందుకు సాయపదతాడు? ఆ కారణం చేత కూడా నాస్తికుడు స్వంత బాధల పరిష్కారానికి స్వంతంగానే పూనుకోవాలి. పూనుకోవడం అంటే రాజకియం చేయడం అన్న మాటకు ప్రత్యామ్నాయ పదం. ఏతావాతా   నాస్తికులు ఈ భూప్రపంచం మీద రాజకీయాలు ఒక్కటే  నమ్ముకునేందుకు వీలైన దిక్కు. కాకపోతే అతగాడి పొలిటికల్ 'ఔట్ లుక్'.. ఆస్తికుడి 'ఇన్ సైడర్ వేదాంతం' కన్నా విభిన్నంగా , రుజుప్రవర్తనతో కూడుకుని ఉంటుంది. నాస్తికుడుకి  రాజకీయాలెందుకు? అని పెడసరంగా ఆడిగే ప్రబుద్ధులకు 'ఆస్తికుడికి మించి నాస్తికుడికే రాజకీయాలతో  ఎక్కువ సంపర్కం ఉండితీరాలి. ర్రాజకీయం అన్నమాటకు అర్థం రాజ్యానికి సంబంధించి నడిచే వ్యవహారం యావత్తూ.. అయినప్పుడు ఇహలోకం జీవనం మీద చులకన భావం ఉండే ఆస్తికుడికే అవసరమైన రాజకీయం ఈ లోకమే తన అసలు లోకం అని మనసా వాచా కర్మణా నమ్మే నాస్తికుడికి అక్కర్లేదా? ఏం వింత వాదన?

రాజకీయం అంటే మనుషుల సంక్షేమం కన్నా ముందు దేవుడి బాగోగులు చూడాలన్న వాదన కాదు. దేవుడు మనుషుల్ని సృష్టించాదన్నది కేవలం ఏ ఆధారం లేని పరంపరగా వస్తోన్న ఓ విశ్వాసం మాత్రమే. తాము చేసే ఏ ప్రకటనకు నమ్మదగ్గ రుజువులు చూపించలేని ఆస్తికుడి మల్లే కాదు నాస్తికుడు. దేవుణ్ని మనిషే సృష్టించాడన్న వాదానికి సవాలక్ష ఉదాహరణలు చూపించగలడు. అన్నీసజీవమైనవి, మన కళ్ల ముందు కళకళలాడుతో కనిపించవి. నిజ జీవితంలో నిజంగా ఏదన్నా  కష్టమొచ్చి నమ్ముకున్న దేవుడు ఎలా కాపాడతాడో తరుణోపాయం చెప్పమంటే అమాయకమైన భక్తుడిని అదే  పనిగా అన్నహారాలు గట్రా మానేసి (ఉపవాసాలు) భజనలు, సంకీర్తంలు, ప్రార్థనలు, నమాజులు చేసుకోమని చెప్పుకొస్తారు ఆయా మతపెద్దలు. ఈ తరహా పలాయనవాదాన్ని ప్రోత్సహించే జిత్తులు కాకుండా నాస్తికుడు 'నీ కష్టాలకు మూలం కూడా నువ్వే. నీ పిరికితనమో, లొంగుబాటో, అత్యాశో, తాహతకు మించిన కోరికో, సమాజం ఒప్పని నీతో, నిష్కారణమైన కడుపుమంటో, ఏ ప్రయోజనమూ సాధించలేని నిరాశో, పని చేసేందుకు బుద్ధిపుట్టని బద్ధకమో, తేరగా లబకం ఊడిపడలేదన్న దుఃఖమో, అర్హత లేని గౌరవం దక్కడం లేదన్న ఉక్రోషమో, చులకనగా చూసే వస్తువు శక్తివంతంగా మారి నిలదీస్తుందన్న కసో, పక్క శాల్టీ పైకి ఎదుగుతుందన్న కుళ్లుబుద్ధో.. ఏదో అయివుంటుంది. తీరికగా కూర్చుని, ఓపికగా తరచి చూసుకుని ఆ లోపాన్ని సరిచేసుకుంటే ఏ కష్టమూ నిన్ను బాధించదు. నీవు కొని తెచ్చుకున్న రొచ్చులోకి లేని దేవుడిని  లాక్కువస్తే నీ సమస్య ఎన్నడికీ తీరదు. అంతా ఆ పైనున్న వాడే చూసుకుంటాడని  నీకు మెట్టవేదాంతం బోధించే స్వాములవారు కడుపునొప్పి వస్తే ఆ భారం భగవంతుడి ఒక్క డి మీదనే ఒదిలేయటం లేదు కదా! భక్తుల ఖర్చు మీదనో, ప్రభుత్వ పెద్దల సహకారంతోనో ఏ అమెరికా వంటి పెద్ద దేశాలకు వెళ్లి భారీ బిల్లులు చెల్లించి నయంచేయించుకుంటున్నారు కదా! ఈ లోకం కష్టాలకు ఇక్కడే పరిష్కారం అని చేతలతో చూపించే స్వాములార్ల డొల్ల వేదాంతపు మాటలు నమ్మి కాళ్లుజాపుకు కూర్చోబట్టే కష్టాలు ఎన్నటికీ తీరడం లేదు.

రాజకీయాలంటే నిజానికి ఏమిటీ? రాజ్యానికి సంబంధించిన వ్యవహారాలు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. అంటే మనమే రాజులం. మనకు చెందిన సంగతులన్నీ రాజకీయాలకు అవసరమే. ఆలాంటి నేపథ్యంలో 'దేవుడు లేడు. అదంతా నీ ఊహ' అన్నవాస్తవం చెప్పిన పాపానికి రాజకీయాలకు దూరంగా ఉండాలా నాస్తికుడు?  ఎంత 'నాస్ సెన్స్' గా ఉంది వాదన! వాస్తవానికి అన్నీ దేవుడు చూసుకుంటాడన్న బీరాలు పలికే ఆస్తికులే రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఏ దండకారణ్యాలకో వెళ్లి ముక్కు మూసుకుని తాము పరితపిస్తున్నట్లు నటించే మోక్షం కోసం నిక్షేపంగా అన్నహారాలు మానేసి జపతపాలు చేసుకోవాలి. నగరం నడిబొడ్డున ప్రభుత్వాలు దయచేసే అత్యంత ఖరీదైన భూముల్లో భక్తుల సొమ్ముతో విలాసవంతమైన వైభోగం తాము ఆనుభవిస్తూ అడుగడుగునా రాజకియాలలో జోక్యం జనాలకు అన్యాయం చేస్తున్నది ఎవరు?

నాస్తికులందరిదీ ఒకే అభిప్రాయం .. ఎప్పుడైనా.. ఎక్కడైనా!

'నీ జీవితానికి నీవే కర్తవు.. కర్మవు. కనక క్రియా పరంగా కూడా నీ చర్యలే సమస్యలకు పరిష్కారాలు అవుతాయన్నది ఆ  అభిప్రాయం. ఆస్తికుల మధ్యనే సవాలక్ష అభిప్రాయ భేదాలు. 'నా దేవుడు గొప్ప' అని ఒకడంటే.. 'నా దైవం అధీనమే ఈ జగత్ సర్వం' ఇంకొకడి వాదన. మా భగవంతుడికి అపచారం కలిగితే లోకాలన్నీ భగభగమని మండిపోవాల్సిందే!'అని ఒక ఆస్తికుడు బెదిరిస్తే.. మా మూలపురుషుడు లేచి వచ్చేస్తే సర్వం అనంతంలో బుడుంగుమని మునిగిపోవాల్సిందే!' అని సవాళ్లు! నిరాకారుడని చెప్పుకునే దేవుడికి కోపతాపాలు ఎందుకు వస్తాయో,  శాంతి కాముకుడని కోసే భగవంతుడు ఊచకోతలు ఎందుకు ప్రోత్సహిస్తాడో? నిరంజనుడైన ఆదిదేవుడికి అన్నేసి వేల మంది స్త్రీలతో సరసాలా? తృణప్రాయమైన జీవితాలకు బంగారు గొడుగులు, హంగు ఆర్భాటాలతో ఊరేగింపులా? నిజం చెబితే నిష్ఠురం గానీ.. దైవం పేరుతో దుష్ప్రచారమయ్యే  మత విబేధాలు, కులవివక్షల వల్ల కాదూ  మనిషి బతుకు  అవుతున్నది ఇవాళ వల్లకాడు?

రాజకీయాలంటే ఉన్న దూరూహవల్లనే ఇవాళ నాస్తికుడికి రాజకీయాలతో ఉండే సంబంధం ప్రశ్నకు గురవుతున్నది. వాస్తవానికి రాజకీయం అంటే రాజ్య పాలనా నిర్వహణ. ఈ ప్రభుత్వ నిర్వహణ మూడు దశలుగా సాగడం చరిత్రలో మనం చూస్తున్నాం. రాజపాలన,  నియంతృత్వం, ప్రజలు నిజమైన పెత్తందారులుగా నడిచే ప్రజాస్వామ్యం.

రాజరికంలో ప్ర్రజలు ఎలా నడుచుకోవాలో శాసించేది శాసనాల ద్వారా రాజు. నియంతల పాలనలో ఆ పని నియంతది. ఇక్కడ ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకపోయినా పాలకులు పెద్ద నష్టమేమీ లేదు. ఎదురుతిరిగిన బలహీనుణ్ణి, బలమైన వాడైతే బలహీనుణ్ణి చేసి ఆనక ఆడ్డు తొలగించుకొనేందుకు బోలెడంత సాధన సంపత్తి, మందీ మార్బలంతో సిద్ధంగా ఉంటాడు. ఈ రెండు వ్యవస్థలల్లో సామాన్యుడి గతి బ్రహ్మాస్త్రాన్ని చూసి అణిగుండే పిచ్చుక తీరే. రాజకు రాజ వంశంలో వాడే ప్రత్యామ్నాయం. నియంతకు తాను అనుకున్న మరో నియంత ఆ లోటు భర్తీ చేస్తాడు. ప్రజాస్వామ్యంలో నిజానికి నిర్వచనం ప్రకారం ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన సాధ్యమయ్యే పాలన- అనే కాని.. నిజానికి ఆ ప్రజలు ఎవరు అన్నదే కీలకమైన ప్రశ్న. డబ్బు ఉన్నవాడు, మతం మీద పెత్తనం కలవాడు, జబ్బసత్తువ ఉన్నవాడు .. ఇలా ఎవరికి వాళ్లు తామే అసలైన ప్రజలం అని ప్రచారం చేసుకుంటూ తమకు సానుకూల పడే పనులు మాత్రమే ముందుకు సాగేందుకు దోహదపడుతుంటారు. విచిత్రమేమంటే.. ఏ సమాజంలో అయినా అత్యధిక శాతంగా ఉండేది ఆర్థికంగా అంత వెసులుబాటు లేనివాళ్లే! అయినా వాళ్ల ప్రయోజనాలు, జీవితాల అభివృద్ధి ఎవరికీపట్టవు. అందుకు వేరెవరినో నిందించాలని పనిలేదు. తమ లోపల ఉండే ఎన్నో బలహీనతలు, చాపల్యాలు, కల్పనలు, మూఢవిశ్వాసాలు, అనైతిక బంధాల పట్ల మోజు వంటి దుర్గుణాల సంకెళ్లయి ముందుకు కదలనీయవు. ఇట్లాంటి బంధనాలను అన్నింటినీ ఛేదించుకుని స్వంత జీవితాలలో ఎవరికీ అభ్యంతరకరం కాని పద్ధతిలో సుఖంగా జీవించే శక్తి నాస్తికుడికి ఉంటుంది. రాజకీయాలతో సంబంధమే కాదు.. రాజకీయాలను శాసించగల శక్తీ నిజానికి నాస్తికుడికే.

లొంగుబాటు ఆస్తికుడి తత్వం. బానిస ప్రవృత్తికి ఎక్కువ ఆస్కారం కల్పించే ఆస్తికులకు అందుకే రాజరికపాలన మీద, నియంతల కర్రపెత్తనం మీద మనసులో ఉండే  మోజు అప్పుడప్పుడు మాటల్లో వెల్లడవుతుంటుంది. 'ఎవరన్నా నియంత వస్తే గాని మన బతుకులు బాగుపడవు' అని ప్రకటించే ఆస్తికవాదిని చూడవచ్చును గాని ఆ పంథాలో ఆలోచించే నాస్తికుడిని ఎక్కడా చూడబోం. నాస్తికుడు అంటేనే స్వీయ శక్తి మీదనే అపారమైన విశ్వాసం కలవాడు. వాడి వల్ల కాకపోతే మరి ఆస్తికుల వల్ల మేలైన  ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందా? ఆస్తికుడి రాజకీయాలు స్వార్థప్రయోజనాలు సిద్ధింపచేసుకోవడం కోసం. నాస్తికుడి రాజకీయాలు ఖాయంగా జనహితంగా ఉండేటందుకు మాత్రమే సాగే వ్యూహాలు. నాస్తికత్వం అంటేనే స్వతంత్ర బుద్ధి.  లొంగుబాటుకు ఛస్తే లొంగని మనస్తత్వం. రాజరికం, నియంతృత్వం అంటే అసహనం ఉంటుంది కనక.. అతగాడి రాజకియాలు ఎప్పుడూ ప్రజాస్వామ్య వికాసానికి మాత్రమే తోడుపదేవి.

పుర్వకాలపు రాజరికాలు, నియంతల రాజాలు ఇప్పుడు ఎక్కువగా కనిపించవు. ఆ కారణం చేత సమాజంలో నాస్తికుల సంఖ్య గణనీయంగా పెరిగిందనడానికి నిదర్శనం అనుకుంటే పప్పులో కాలేసినట్లే! ఆస్తిక లక్షణం లొంగుబాటు తత్వమే అయినా ప్రజలలో క్రమేపీ పెరుగుతున్న నాస్తిక భావనలు మెల్లగా రాజరికపాలనలు అంతమవడానికి దోహదపడుతున్నాయి. అయినా ప్రజాస్వామ్య దేశంలో ఉన్న ప్రజలలో అధికశాతం నాస్తికులన్న నిర్ణయానికి రాకూడదు. ప్రభుత్వ నిర్మాణంలో ప్రధాన భూమిక వహించే సామాన్యుడు ఈ ఆస్తిక, నాస్తిక ద్వైధీభావజాలం మధ్య  ఊగిసలాదుతున్నాడని మాత్రమే మనం చెప్పగలం. మనసులో నాస్తిక భావనలు ముప్పిరిగొంటున్నా బహిరంగా అంగీకరించేందుకు సిద్ధపడని హిపోక్రసీనే ప్రస్తుతమున్న ప్రపంచవ్యాప్త రాజకీయ వాతావరణం.

మన దేశంలోని పరిస్థితి ఈ  మూడ్(mood)కి ముమ్మూర్తులా అద్దం పడుతుంది. పేరుకే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పటికి, వాస్తవంగా సామాన్యుడు తన జీవితాన్ని తానే సరిదిద్దుకునే స్థితిలో లేడు. ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఏదో ప్రజాస్వామ్య వాతావరణంలో ఉన్నట్లు ఊరట కలిగినా, ఒకసారి ఫలితాలు వచ్చి ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత ఓటరు మహాశయుడు నేరుగా రాజకీయ జోక్యం చేసుకొనే పరిస్థితి బొత్తిగా లేదు. కోరుకున్న పార్టీలకు తట్టుకుని నిలబడే శక్తి ఉండదు. బరిలో నిలబడిన పార్టీలలో అయినా జనం కోరుకోని వ్యక్తులే అధికంగా కనిపించే దుస్థితి. ఎవరో ఒకరు గెలవాలి కనుక గెలుస్తారు. ఒకసారి గెలుపొందిన తరువాత  విజేతకు ఇక మళ్లీ ఎన్నికలొచ్చిపడే వరకు జనంతో సంపర్కం ఉండనక్కర్లేని వ్యవస్థలు ఇప్పటివి.

నిజమైన నాస్తికవాది నిజమైన ప్రజాస్వామ్యప్ర్రేమిగా ఉండటం తప్పనిసరి. దిగాలుబడి కార్యంలేదు. నిందిస్తూ కూర్చున్నా  శౌర్యం అనిపించుకోదు. ఎవరూ కలసిరావడం లేదన్న నిరాశ నాస్తికుని మనస్తత్వానికి సరిపడదు. సమస్య ఏదైనా వర్ణిస్తూ కూర్చున్నందువల్ల తెమిలే వ్యవహారం కాదు. పరిష్కరించే దిశగా చర్యకు పూనుకోవాలి. అదీ తక్షణమే. ఆ భారం మరెవరి మీదనో వేసి నిబ్బరంగా ఉండకుండా మొదటి అడుగు తనదిగా ఉండేలా చూసుకోవడమే ఆసలైన నాస్తికుడి ప్రజాస్వామిక రాజకీయం.

నిజానికి నాడు స్వాతంత్ర్య సాధన దీక్ష దైవసంకల్పంతో సాగింది కాదు. మనం ఒప్పుకోం కానీ.. ఆసేతు హిమాచలం  కులమతాల తారతమ్యాలన్నింటిని తోసిరాజని మానవ సంకల్పంతో సాధించింది మాత్రమే దేశస్వాతంత్రం. స్వాతంత్ర్యం సిద్దించగానే అలవాటు బడ్ద ఆస్తికత్వంలోకి మళ్లీ తిరిగొచ్చేశాడు భారతీయుడు. బానిసత్వ లక్షణాలు తిరిగి పొడగట్టేసరికి  సరికొత్త నియంతలు ప్రజాప్రతినిధులపేరున  నెత్తికెక్కారు.  నిజమైన ప్రజాస్వామిక ప్రభుత్వాలనే మనం కోరుకుంటే ఆస్తికత్వ భావనలను పూజగది గడప దాటి రానీయవద్దు.

ప్రతి వయోజనుడి దగ్గర ఓటు అనే ఆయుధం ఒకటి ఉన్నా.. పేదరికం, బానిసత్వం వారసత్వపు ఆస్తులుగా వస్తూ ఉన్నాయి. చేతిలోఉన్న ఓటుతో కోరుకున్న జీవితం సాధించుకునే వీలున్నా దృష్టిని మళ్లించే ఆస్తికభావాలు నిత్యావసరాల జాబితోలో లేని కులాల, మతాల  మీదకు మళ్లిపోతున్నాయి.. మళ్లీ మళ్లీ! పేద జీవి ఓటు నిరుపయోగం చేసే బానిస భావాలను తొలగదోసుకుంటే తప్ప  సుఖమయ జీవితానికి అతి ప్రధానమైన విద్య, ఉపాధులు, సంక్షేమం, సౌభాగ్యం స్థానే కులం, మతం, వర్గం, వర్ణం, జాతి, నీతి వంటి అడ్డుగోడలు కూలిపోవు. చేతిలో అధిక ఓట్లు కలిగివుండీ పేరుకు పరిపాలకులే అయినా పేదలు తరాల తరబడి బానిసలుగా సమసిపోవడం, ఆస్తికవాదం బోధించినట్లు  తలరాతల వల్ల కాదు, పూర్వజన్మల ప్రారబ్దం వల్ల అంతకన్నా కాదు. గోరంతైనా ఆధారం చూపించ సాధ్యం కాని మాయామిథ్యావాదాలు కూరుతూ   చలనశీల మేధస్సును చక్కభజనల పాల్చేసుకోవడం వల్ల. పరలోక పథం పట్టిపోయిన ప్ర్రజాస్వామిక రథాన్నిప్పుడు ప్రజాకోటి భుజం మీదుగా  భూమార్గం పట్టించడమే అసలు సిసలు నాస్తిక రాజకీయ దృక్పథం. నాస్తికుల  ప్రజాస్వామికమే నిజమైన ప్రజాస్వామికం. సర్వ  మానవ సమానత్వం స్వేచ్ఛగామి ప్రజాప్రభుతకు మచ్చఅంటని  అద్దం. బానిసలు కనబడని ప్రజారాజ్యం నాస్తికుల భావజాలంతో మాత్రమే అందుకు సాధ్యం. సమానత, ప్రజాస్వామికత కలసి రావాలంతే నాస్తికుల భావ దృష్టి  పౌరలందరికీ ముందు అలవడాలి.

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూ ఎస్ ఎ

19 -01 -2020

 

 

 

పెద్దల జీతభత్యాలు -కర్లపాలెం హనుమంతరావు


 

సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థలో ప్రధాని అత్యంత శక్తివంతమైన వ్యక్తి. అదే విధంగా ముఖ్యమంత్రి తన రాష్ట్రానికి  శక్తివంతమైన నాయకుడై ఉంటాడు. దేశంలో అత్యధిక వేతనం రాష్ట్రపతికి,  ఆ తర్వాత  ప్రధానమంత్రికి.. అని ప్రజలు సాధారణంగా నమ్ముతుంటారు. వాస్తవంలో అట్లాలేదు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రుల జీతాలు ప్రధాని జీతం కన్నా ఎక్కువ.

దేశం స్వతంత్రమయే సందర్భంలో ప్రధాని జీతం నిర్ణయం కాలేదు. దేశ ప్రథమ ప్రధానిగా ఎన్నికయినా జవహర్ లాల్ నెహ్ర్రూ  ఈ జీతబత్తేల మీద మనసు పెట్టలేదు. బ్రిటిష్ వారి పాలన కాలంలో  ప్రధాని జీతం అతని  క్యాబినెట్ మంత్రుల  జీతం కంటే రెట్టింపు ఉండేది. ఇక  ఇతర ప్రయోజనాలు సరే సరి.  స్వతంత్ర  భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగి ఉండాలి న్యాయంగా అయితే. ఆ సమయంలో కేంద్ర కేబినెట్ మంత్రుల జీతం నెలకు రూ .3,000 గా అనుకున్నారు. అయినా నెహ్రూజీ తను ప్రధానిగా రెట్టింపు జీతం తీసుకొనేందుకు ఇష్టపడలేదు. తన మంత్రులతో సమానంగా మాత్రమే జీతం తీసుకునేందుకు మొగ్గుచూపారు. ఇక ప్రస్తుతానికి వస్తేః

ఇప్పటి ముఖ్య మంత్రులందరిలో తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట చంద్రశేఖరరావు నెలకు 4 లక్షల 10 వేల రూపాయలు జీతం కింద పుచ్చుకుంటున్నారు. దేశంలోని ముఖ్యమంత్రుల జీతాలన్నింటిలో ఇదే ఎక్కువ.  ఆ తరువాతి స్థానం దిల్లీ సి.యం ది. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ సి.యం గా అందుకుంటున్న జీతం 3 లక్ష 90 వేల రూపాయలు. గుజరాత్ సిఎం జీతం రూ.3.21 లక్షలు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రుల జీతాలు నెలకు రూ.3 లక్షలు.

రూ.2 లక్షలకు పైగా సంపాదించే ముఖ్యమంత్రుల జాబితాలో హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, గోవా, బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు ఉన్నారు.

ఒక లక్ష 5 వేల రూపాయలు తీసుకునే త్రిపుర సిఎం అతి తక్కువ ముఖ్యమంత్రి జీతగాడు.

 

దేశంలో అత్యధిక జీతం ఇచ్చే జీతం ప్రయివేట్ కంపెనీలలో టెక్ మహీంద్రాది మొదటి స్థానం. ఆ కంపెనీ  సీఈఓ జి.పి.గుర్నాని  ప్రస్తుతం రూ.165 కోట్ల వార్షిక వేతనంతో పుచ్చుకుంటున్నారు. చీఫ్ లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు రూ.15 కోట్ల నుంచి రూ.165 కోట్ల వరకు జీతాలు ఇచ్చే కంపెనీలు మనదేశంలో చాలా ఉన్నాయి.

-కర్లపాలెం హనుమంతరావు

(27 -09 -2020 నాటి ఒక వ్యాసంలో)

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...