'ఇదేమి చిత్రం చిత్రగుప్తా! ఇన్ని యుగాలుగా ఈ యమధర్మం ఇంత
నిర్విఘ్నింగా నిర్వహించుకొస్తున్నామే! సమవర్తి అనే మా కీర్తికి మచ్చవచ్చే పెనుప్రమాధం ఇప్పుడిలా ఏర్పడిందేమి? ఈ అగ్నిపరీక్షనుంచి నిష్కళంకంగా బైటపడే
మార్గమేదైనా ఉందేమో వెదకవయ్యా!'
'నిజమేకానీ మహాప్రభో! జీవితంలో కనీసం ఒక్కసారైనా ఏ పాపానికీ
ఒడిగట్టని ఈ సచ్చరిత్రుణ్ణి శిక్షించే నిబంధన ఏదీ నా పరిజ్ఞానమునకు అందడం లేదు
స్వామీ!'
'అసంభవం. నాలుగు పదులైనా నిండని ఈ నగరజీవి జీవితకాలంలో ఒక్క
నేరమైనా చేయకుండా ఇలా నేరుగా మన ముందు బొందితో నిలబడడం ఎలా సంభవం? సరిగ్గా చిట్టా చూడవయ్యా! ఏ దోమనో చీమనో
అయినా చంపకుండా ఉండుటాడా?'
'ఎర్రబస్సులమీద ఏ కారణం లేకుండానే రాళ్లు వేసే దుండగులముందు ఈ
జీవి చేసిన చిరుపాపాలు ఏ మూలకు మహాప్రభూ! చీమలను, దోమలను, నల్లులను, వ్యాథికారకాలైన
ఏ క్రిమికీటకాదులని చంపినా ఏ దోషమూ
అంటరాదని ఈ మధ్యనే మన యమధర్మాంగంలో మహేశ్వరుడు సవరణలు చేయించాడుగదా మహాప్రభూ!
మర్చిపోయారా!'
''పోనీ మానవజన్మలో మరేదైనా ఇతర పాపకార్యాలకు ఒడిగట్టాడేమో ..
ఒక్కసారి తరచి చూడవయ్యా.. నన్ను చంపక!'
'రేషను కార్డుల్లో గాంధీ, గాడ్సేలనుకూడా దూర్చి పేదలకు చవకగా పంచవలసిన పంచదార, బియ్యం, రేషనుసరుకులు
పక్కదారి పట్టించే అక్రమార్కులకన్నా ఈ బక్కయ్య చేసే చిన్ననేరం ఏమంత పెద్దది
మహాప్రభూ! చిన్నచిన్న నేరాలకూ శిక్షలు అమలుచేయాలంటే మన దగ్గర తగిన సిబ్బంది
ఎక్కడుంది యమధర్మరాజా! కొత్తనియామకాలకు నిధులు లేవని నిన్ననేగదా కుబేరయ్య
మొండిచెయ్యి చూపించింది!'
'అబద్ధాలడం మహాపాపం. ఈ మనిషి వాలకం చూస్తే
సత్యహరిశ్చంద్రుడి చిన్నాన్నలాగున్నాడా?! గట్టిగా చూడు! చిట్టాలో చిట్టిదో..
పొట్టిదో ఓ పొల్లుమాటన్నట్లున్నా ఏదో చిరుశిక్ష వేసేసి దస్త్రం మూసేద్దాం'
'లాభంలేదు యమధర్మరాజా! మనం అబద్ధాన్ని ఓ కాగ్నిజబుల్
అఫెన్సుగా భావించడం మానేసి ఓ మన్వంతరం దాటిపోయింద మహాప్రభో! క్లింటన్ వంటి పెద్ద పెద్ద అగ్రదేశాధినేతలే
అబద్ధాలాడి తప్పించుకొంటున్నారు. కడుపున పుట్టిన బిడ్డల్నే చెల్లెళ్ళుగా చెప్పి
చెలామణి చేయించే భామామణులు భూలోకంలో పుట్టుకొస్తున్నారు! ఎన్నికలముందు నేతలు ఇచ్చే
హామీలముందు ఈ బక్కయ్యలాంటి కోన్కిస్కాలు ఆడే అబద్ధాలు చీమంత! యమధర్మంప్రకారం అవసలు
నేరాలుగానే పరిగణించరాదు'
'ఇహ చాలు చిత్రగుప్తా! చాలు.. చాలు!'
'అదేమి స్వామీ! ఎన్నడూ లేనిది తమరి కన్నుల్లో నీరు!'
'కరుడుగట్టిన మంచితనంతో ఈ బక్కయ్య నా గుండెల్ని
పిండేసాడయ్యా!ఇంతటి మహాత్ముణ్ణి మన
నరకలోకం తెచ్చిన యమకింకరులను తక్షణమే విధులనుంచి బహిష్కరిస్తున్నాం'
'మాట మధ్యలో అడ్డొస్తున్నందుకు మన్నించండి మహా ప్రభో! ఇందులో తమకింకరులు చేసిన తప్పిదమేమీ లేదు స్వామీ!' అంటూ
నోరు తెరిచాడు బక్కయ్య.
'మరెవరిది తప్పు?' యమధర్మరాజుల హూంకరింపు.
'నా కథ ఆసాంతం వింటే తమరికే అవగతమవుతుంది యమధర్మరాజా!నేనొక
సగటు నగరజీవిని. బతుకుతెరువుకోసం
పనివెదుక్కొనే రోజువారీ కూలీని. మొన్న కరువు. అటుమొన్న పేరు తెలియని
ప్రాణాంతక రోగం. నిన్న వరద. పెరిగిన ధరలతో రోజుగడవడమే కటకటగావుంటే గోరుచుట్టుమీద
రోకటిపోటులా బందులు. పనిదొరక్క బతుకుమీద రోతపుట్టి ప్రాణం తీసుకొందామని పురుగుమందు
తాగితే సగం ప్రాణమే పోయి చచ్చింది
మహాప్రభూ! వైద్యంకోసం ధర్మాసుపత్రికని వెళితే 'పెద్ద మనుషులకే పడకలు లేక ఇబ్బందులు పడుతుంటే.. మధ్యలో వచ్చిన బక్కోడివి
నీకు వైద్యమేంటి.. చోద్యం కాకపోతే!' అంటూ బైటకు గిరాటేసేసారు
సారూ! బతుకుమీద మళ్లీ తీపిపుట్టి బైటి దవాఖానాలో రాసిచ్చిన మందు పుచ్చుకొన్నాసామీ! మందులదుకాణం అమ్మిన గోలీల్లో ఏం గోలుమాలుందోగానీ
యమధర్మరాజా! మింగీ మింగకముందే.. ఇదిగో మిగిలిన ఆ సగం ప్రాణాన్నీ మీ కింకరులు ఇలా
ఈడుచుకొచ్చి మీముందు పెట్టారు!'
'అరె! ఎందుకు ప్రభూ! అలా.. గుక్కతిరక్కుండా నవ్వుతున్నారూ!' బక్కయ్య విచిత్రంగా చూసాడు.
'ఉసురు తీయాల్సిన పురుగులమందు ఉసురు తీయలేదా! ఊపిరి నిలపాల్సిన
మందు ఊపిరి తీసేసిందా! భళా బక్కయ్యా
భళా! నీ బతుకుభారతం బహుచిత్రముగానున్నది! నీ చరితము కడు కామెడీగానున్నది. కానీ
నాకు మరొకందులకు పరమానందంగా ఉంది. ఆత్మాహత్యా ప్రయత్నం శిక్షార్హమనిగదా
శిక్షాస్మృతులన్నియూ నొక్కి చెప్పుచున్నవి! నీ కోరిక ప్రకారమే ఇప్పుడు నీకు నరకలోక
నివాసమును ప్రసాదిస్తున్నందుకు సంతోషంగా ఉంది.'
'ధన్యుణ్ణి యమధర్మరాజా! నా కోరికకు మరో చిన్న
కొనసాగింపుకూడా ఉంది. పాపుల ప్రాణాలుతీసి విధించిన దండనలను
అమలుచేసే యమకింకర ఉద్యోగంకూడా దయవుంచి ప్రసాదించమని ప్రార్థన.'
'హాఁ!..హాఁ.. హాఁ!! అర్థమైనది.. నీ ఆవేదన! అటులనే
ప్రసాదించితిని ..పొమ్ము! మనసుతీరా నీ కసి నిన్నీ స్థితికి తెచ్చిన పాపాత్ములమీద
తీర్చుకొమ్ము!'అని లేచారు యమధర్మరాజు.
***
-కర్లపాలెం హనుమంతరావు
(25-12-2009 నాటి ఈనాడు- సంపాదకపుటలో 'పద్దులకందని పాపాలు' పేరుతో ప్రచురితం)
No comments:
Post a Comment