సర్కారు ఉద్యోగం చేజిక్కించుకొంటే జీవితం ఇహ
చక్కబడినట్లేనని ఓ లెక్క. పిల్లనిచ్చేవాళ్లూ 'అబ్బాయిది గవర్నమెంటు ఉద్యోగమయివుంటే చాలు.. ఆ పైన ఏదన్నా ముట్టే సీట్లో
ఉంటే మరీ మంచిది..' అనే ధోరణిలో బేరసారాలు జరుపుతుంటారు.
తెల్లవాడు పోతూ పోతూ మనకూ అంటించిపోయిన మకిలి ఈ 'సర్కారు ఉద్యోగ భేషజం'. గురజాడవారి కన్యాశుల్కంలో వెంకటేశం తల్లి పిల్లాడికి
కలెక్టరీ అయితే చాలు.. పరగణాల భూవులన్నీక్షణాల్లో
కొనేస్తాడ'ని కలలు గంటుంది! శతాబ్దకాలం గడిచిపోయినా సగటు భారతీయుడి ఈ
మానసిక భావనలో ఇసుమంతైనా మార్పులేదు.
సరికదా.. ప్రభుత్వోద్యోగాలమీద మోజు పదింతలు పెరిగింది! గతంలో రాజస్తాన్ లో గుజ్జర్లు, జాట్ లు.. ప్రస్తుతం గుజరాత్ లో
పటేళ్లుకూడా ప్రభుత్వోద్యోగాలలో రిజర్వేషాలకోసం ఆందోళనలు చేసే దశకు చేరుకోవడమే
ఇందుకు నిదర్శనం.
ప్రభుత్వోద్యోగంమీద మోజుకు చాలా కారణాలే కనిపిస్తున్నాయి.
పరిమితమైన పనిగంటలు, ప్రత్యక్షంగా జవాబుదారీతనం లేకపోవడం, గుర్రమే
రౌతును అదుపుచేసే విచిత్ర పరిస్థితులు సర్కారుద్యోగరంగంలో వేళ్ళూనుకొని ఉన్నాయి.
ప్రభుత్వరంగ ఉద్యోగుల జీతభత్యాలుకూడా ప్రయివేట్ సెక్టర్ ఉద్యోగుల వేతనాలతో చూసుకొంటే దాదాపు 11% అధికం!
న్యూడిల్లీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఆఫ్ ఇన్డస్ట్రియల్ డెవలప్మెంట్
వారి అధ్యయనంలో తేలిన నిజం ఇది. వేతనాలతోపాటు 'ఆమ్యామ్యా'లూ సర్కారు ఉద్యోగాలకు పెద్ద ఆకర్షణగా ఉంది. ప్రజలకు సేవచేస్తామని
ప్రమాణపత్రంమీద హామీసంతంకం చేసి మరీ విధుల్లో చేరిన ఉద్యోగులు.. ప్రజలే తమకు
సేవచేసేందుకు పుట్టినట్లు
ప్రవర్తించడం సర్వసాధారణమై పోయింది. క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు
సైతం నిమ్మకునీరెత్తినట్ట్లో, తూతూ
మంత్రంగానో కథ నడిపించడానికి కారణం ప్రభుత్వోద్యోగుల్లోని సుసంఘటిత ప్రతిఘటనా శక్తిసామర్థ్యాలు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో
పసివాడిని ఎలుకలు కొరికి చంపేసిన దుర్ఘటనే తాజా ఉదాహరణ. తెగించి ప్రభుత్వం
చిన్నపాటి చక్కదిద్దే చర్యలకు సాహసించినా.. ప్రభుత్వోద్యోగులనుంచి పెద్ద ఎత్తున
నిరసనలు ఎదుర్కోవాల్సిన సంకటం! పేరుకి పెత్తనం ప్రభుత్వానిదే అయినా.. వాస్తవంలో దాన్ని నడిపించే పార్టీల మనుగడ తాత్కాలికం.
సమగ్ర అవగాహనకు, శాఖల నిర్వహణకు పాలకులు
ప్రభుత్వోద్యోగులమీదనే ఆధార పడక తప్పదు. గతజ్ఞానం, వర్తమాన
వ్యవహారాలమీద పూర్తి పట్టున్న ఉద్యోగులతో
పెట్టుకొంటే భవిష్యత్తులో ఎంత కష్టమో తెలీనంత అమాయకులు కాదుగదా
రాజకీయనాయకులు! ఉద్యోగులపైన బహిరంగంగా విరుచుకుపడటాలు.. హెచ్చరికలు జారీ చేయడాలు
వగైరాలన్నీ అధికశాతం లాలుచీ కోపతాపాలు! జనంముందు కంటితుడుపు నాటకాలు! గతంలొ సర్కారుద్యోగులతో సున్నం
పెట్టుకొన్న చంద్రబాబులో ప్రస్తుతం పొడసూపుతున్న ప్రాప్తకాలజ్ఞత చాలు సర్కారు
ఉద్యోగుల హవాకు ఏ పాలనలోనైనా ఎదురుండదని తేలడానికి. దివంగత వైయస్సార్ సరిగ్గా ఈ కారణం చేతనే ముందు
సర్కారు ఉద్యోగులను మచ్చిక చేసుకొన్నది. అడిగిన 42% ఫిట్మెంటుకు
చంద్రబాబు వెంటనే ఓకే అన్నా, మరో 1% జోడించి మరీ కెసిఆర్
మెహర్బానీ చేసినా.. అదంతా సర్కారుద్యోగులను మంచిచేసుకొనే పాలకుల
ఎత్తుగడలో భాగమే!
సర్కారు ఉద్యోగస్తులు మనుగుడుపు అల్లుళ్ళు మాదిరి
చలాయిస్తుంటే అందుకు పూర్తిగా విరుధ్దమైన పనివాతావరణం ప్రయివేటు సెక్టరులో నెలకొని
ఉందని పలు అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. పరిమితిలేని పనిగంటలు, శక్తికిమించిన పనిభారం, కనీససౌకర్యాల లేమి, అనారోగ్య పరిస్థితులు, మితిమీరిన అజమాయిషీ.. మరీ
ముఖ్యంగా అరకొర జీతభత్యాలు.. అనేకమైన
ప్రతికూలతలలో కొన్ని మాత్రమే! లాస్ ఏంజల్సు రీజన్ ఫౌండేషన్ వారి గణాంకాల ప్రకారం
విశ్వవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల.. ప్రయివేట్ రంగ ఉద్యోగుల జీతభత్యాలలోని అంతరం
11.4% .
భారతదేశంలో ఇంతకన్నా ఎక్కువ! చదువుకొన్న యువత ప్రభుత్వోద్యోగాలమీద
మోజుపడుతున్నది ఇందుకే. గవర్నమెంటు బంట్రోతు ఉద్యోగాలకు పోటీప్రకటన వచ్చినా
చాలు.. పట్టభద్రులుసైతం వేలలో
దరఖాస్తు చేసుకోవడం సర్వసాధారణమై పోయింది! ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సాగుతున్న రిజర్వేషను ఆందోళనలను
అర్థం చేసుకొవాల్సుంది.
కులాల ప్రాతిపదికన ఉద్యోగాలలో రిజర్వేషనులకోసం మొదట డిమాండు
చేసినవాడు మహాత్మాజ్యోతిరావు పూలే.. 1882లో.. హంటర్ కమీషను ఎదుట! సరిగ్గా మరో
రెండు దశాబ్దాల అనంతరం 1902లో కొల్హాపూరు సంస్థానంలో 50% రిజర్వేషన్లు అమలు
జరిగాయి. తదాది ప్రభుత్వోద్యోగాలలో కులాల
దామాషా ప్రకారం రిజర్వేషన్లకోసం
పలువర్గాలవారినుంచి వత్తిళ్ళు కొనసాగుతున్నాయి. మండల్
కమీషన్ మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాలయాలలో వెనకబడిన కులాలవారికి రిజర్వేషన్ల దిశగా కృషిచేస్తే.. అధిక జీతాభత్యాలు రాబడుతున్న ప్రయివేట్
సాంకేతిక రంగాలలోసైతం రిజర్వేషన్లకోసం డిమాండ్లు తలెత్తడం కొత్త పరిణామం. కులాలకు
బదులుగా ఆర్థికస్థాయి మాత్రమే రిజర్వేషన్లకు ప్రాతిపదిక కావాలని అగ్రవర్ణాలలోని
ఆర్థిక బలహీనులు ఆందోళన చేయడం మరో పార్శ్వం.
కులాలా?.. ఆర్థిక
స్తోమతా?.. రిజర్వేషన్లకు
ఏది ప్రాతిపదికగా ఉండాలన్న చర్చ ఇక్కడ చేయడం లేదు. ప్రభుత్వోద్యోగుల,
ప్రయివేట్ రంగ ఉద్యోగుల జీతభత్యాలు,
పనిపరిస్థితుల్లోని పెనుఅంతరాయమే రిజర్వేషను అంశం ప్రారంభంనుంచి ఆందోళనరూపం తీసుకోవడానికి
మూలకారణమని చెప్పడమే ప్రస్తుత వ్యాస ఉద్దేశం.
ప్రయివేటు ఉద్యోగుల వేతనాలను, పని పరిస్థితులను మెరుగుపరిచే
ఆవకాశం ప్రభుత్వాల చేతుల్లో ఉండవుకదా!
కనీసం తన అధీనంలోని
ఉద్యోగాలమీదున్న అధికాకర్షణ అయినా క్రమేపీ తగ్గించగలిగితే రిజర్వేషనులకొక
పరిష్కారమార్గం లభించవచ్చు. అగ్రగామి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో
ప్రభుత్వోద్యోగులకు ప్రయివేటు ఉద్యోగులకన్నా
పది శాతం తక్కువగా వేతనాలు లభిస్తున్నాయి.
ప్రజలు కట్టే పన్నులలో సింహంపాలు ఉద్యోగుల జీతభత్యాలకే
సరిపోతున్న మనదేశంలో ప్రజాసంక్షేమ సూత్రం సక్రమంగా అమలుకావాలంటే సర్కారు ఉద్యోగులను మనుగుడుపు అల్లుళ్ళ మాదిరి
ఆదరించే ప్రభుత్వవిధానంలో మార్పు రావాలి. 'అవినీతి అంతానికి జీతభత్యాలను పెంచడం' అనేది తప్పుడు
సూత్రం అని ఇప్పుడు జరుగుతున్న తంతును చూసైనా గ్రహింపుకి రావాలి.
అంగీకరించిన పని పరిస్థితులకు లోబడి సర్కారు ఉద్యోగులు
సక్రమంగా, నాణ్యమైన ప్రజాసేవలు అందించేలా
అజమాయిషీ చేయడం ప్రభుత్వాల కర్తవ్యం.
విధినిర్వహణలో ఐచ్చిక నిర్లక్ష్యకారణంగా
జరిగే తప్పిదాలకు నిష్పక్షపాతంగా సత్వరమే విచారణ సాగించి సత్ఫలితాలను రాబట్టే
క్రమశిక్షణా చర్యలు చిత్తశుద్ధితో తీసుకుంటే సర్కారు నౌఖరీలంటే ఉన్న అక్కర్లేని
మోజు కొంతైనా తగ్గించవచ్చు. 'బాధ్యతారాహిత్యమే ప్రధాన ఆకర్షణగా మారిన ప్రభుతోద్యోగాలను
ప్రక్షాళించే ప్రణాళికల అమలు ఎలా?' అన్నదే ఏడవ ప్రణాళికా సంఘం ప్రధాన లక్ష్యంగా సాగాలి.
లేనిపక్షంలో ముందు ముందు మరిన్ని 'పటేలు' వర్గాలు
సర్కారు మనుగుడుపు అల్లుడి హోదాలు కోరుకోవచ్చు! తస్మాత్ జాగ్రత్త!
-కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment