Wednesday, September 30, 2015

రాజకీయాల్లేని రోజు- సరదా గల్పిక


'దేవుడు కనబడి 'నీకేం కావాలో కోరుకోరా.. భడవా!' అనడిగితే తడుముకోకుండా మనమడిగే మొదటి వరమేంటో తెలుసా మాధవా?'
'ఏంటో?'
'యాంటీ పొలిటికల్ వర్ల్డ్'
'అంటే?'
'ప్రపంచంలో పాలిటిక్సు అనే మాటంటూ లేకుండా పోవడటం' అన్నాడు మా మాజీ మేజర్ పోతురాజు మామయ్య.
మంటెక్కినప్పుడల్లా ఆయనా మాటంటం  మామూలే!
రాజకీయాలంటూ లేకుంటే ఈ లీడర్లూ, ప్లీడర్లూ, పార్టీలూ, పార్లమెంటులూ.. ఎన్నికలూ హడవుడీ.. అంతా ఎమైపోయేట్లు!
ఆ మాటే అడిగా.
'పోనీ ఒక్కరోజన్నా ఈ పాడు రాజకీయాలు లేకుండా ఉండలేముట్రా?' అనడిగాడు దీనంగా.
'అపొలిటికల్ డే అసలు సాధ్యమేనా మామయ్యా?'
'గాంధీగారి జయంతికో.. వర్ధంతికో.. మా సందులోని మందుదుకాణాలన్నీ బందుచేయడంలేదుట్రా! అలాగే ఇదీ సాధ్యమే!'
'మద్యవ్యతిరేక దినోత్సవంనాడు ఎంతమంది నిజంగా  మందు మానేస్తున్నారూ? ముందురోజే పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకొంటున్నారు!' టీ తెచ్చిచ్చిన మా అత్తయ్య సందుచూసుకొని అధిక్షేపించింది.
'ధిక్కారమా!' అన్నట్లు హూంకరించాడు మామయ్య 'పాయింటిప్పుడు  లీడర్లును గురించా? లిక్కర్ని గురించా?'
మేజర్ మామయ్య మాజీ అయింతరువాత సర్కారిచ్చిన స్థలంలో ఫామ్ హౌస్ పెట్టాలని మోజు పెంచుకున్నాడు. 'రిక్షాపుల్లర్ని ముందుపెట్టుకొని 'పదేళ్లబట్టీ ఈడిక్కడే గుడిసేసుకొని కాపురముంటున్నాడు. లా  ప్రకారం పట్టా వీడిదే' అంటూ పులయ్యనొకణ్ణి అడ్డంపెటుకొని ఓ పట్టాన స్థలం ఖాళీ చేయడంలా  ఆ పేట రౌడీ. వాడికి ఏరియా ఎంఎల్యే  ఏడుకొండలుగారి అండదండలు దండిగా ఉన్నాయ్!
మామయ్య తమ్ముడు శరభరాజు సెలవమీదొచ్చినప్పుడు జిల్లామంత్రిగారిని కలిసి దండేసి దండం పెట్టుకొచ్చాడు. ప్లాన్ సాంక్షన్ దగ్గర్నుంచి, డీవియేషన్సు అప్రూవల్వరకు అన్నిపనులు దగ్గరుండి మరీ అయినాయనిపించుకొని  'ఇదిగో! ఈ బోరు పనిమాత్రం నువ్వేచూసుకోవాలన్నయ్యా! సెలవులు పొడిగించడం కుదరదు' అని తిరిగి వెళ్ళిపోయాడు.
మిలటరీ మామయ్య ముక్కుసూటి మనిషి. ఆయన భారీగా బోరుకొట్టే తీరుచూసి చుట్టుపక్కల కాలనీ జనాలు చుట్టుముట్టేసారు. వందడుగులమించి కిందకు దిగితే ఊరుకోబోమని వార్నింగ్!
 ఆ మర్నాడు మార్నింగే మామయ్య వెళ్లి ముఖ్యమంత్రిగారిని కలిస్తే 'కోడి ఎలా గుడ్డు పెట్టాలో గంటసేపు లెక్చరు దంచి.. ఆ విధంగా మనం ముందుకు పోదాం! జై జన్మభూమి' అని చక్కా లేచివెళ్ళిపోయాట్ట! అందుకే  ఇప్పుడీ  రాజకీయాలమీదిలా మా మామయ్య మండిపాట్లు! 'ప్లేటో మహాశయుడు ఏ పూట ఈ రాజకీయాలను కనిపెట్టాడోగానీ.. ప్లేటు తిప్పేవాళ్ళుమాత్రం పేట పేటకో పటాలం తయారవుతున్నదం'టూ!
ప్లేటోకన్నా ముందున్న మనపురాణాల్లో మాత్రం  రాజకీయాల్లేవా! గణాధిపత్యానికి పోటీ పెడితే వినాయకుడు అమ్మానాన్నలచూట్టూ ప్రదక్షిణాలనే ఉపాయం కనిపెట్టి మరీ కాకాయిజానికి శ్రీకారం చుట్టాడు. మహాభారతంలో శ్రీకృష్ణులవారలా నడిపించిందంతా రాజకీయం కాక మరేవిటో! వేళచూసి గోడదూకబట్టేగా విభీషణుడికి  లంకానగరం దక్కింది! తలొంచినవాణ్ణి పాతాళానికి తొక్కేసే తంత్రం బలికాలంనుంచే చలామణీలో ఉందికదా! బోళాశంకరులకు హాలాహలమే దక్కేది. సత్యహరిశ్చంద్రుళ్ళా నిష్టగా నీలిగితే  జీవితమంతా కష్టాలే కష్టాలని.. కాన్వెంట్లకెళ్లే  పిలగాళ్ళుకూడా గుర్తుపట్టే కలికాలం కదా ఇది! రాజకీయాలొద్దే వద్దని పోతురాజు మామయ్యిలా పేద్ద పేద్ద సిద్ధాంతాలు చేస్తే మాత్రం అవంత  సులువుగా రద్దపోయేవా!
పాలిటిక్సే లేకుంటే ఇరవైనాలుఘ్ఘంటల వార్తాఛానళ్లకు నోళ్ళు పడిపోవూ!  పేపర్లేమైపోతాయి!  పరగడుపునే పేపరువాసన ముక్కుకి సోకాలి.. మా పక్కింటి పాపారావుకు. లేకుంటే కక్కసుకైనా చక్కాపోలేడు!
'పాయింటిప్పుడు పేపర్లు.. టీవీలను గురించా? రాజకీయాల్ని గురించా? 'యాంటీ పొలిటిక్సు వల్ల ఏంటీ ప్రయోజనం?' అనడిగావు కదూ! బోలెడన్నిరా! ఐపిల్ మోదీ ఒక్కరోజులో దొరికిపోతాడు. రాముడు రహీము పక్కపక్కనే క్షేమంగా ఉంటారు.  నక్సలైట్లు మిగిల్చిన మందుగుండుతో దీపావళి పండగ బ్రహ్మాండంగా జరుపుకోవచ్చు. ఢిల్లీచౌకులోకూడా బంగళాలు బంగాళాదుంపలకన్నా కారుచౌకగా కొనుక్కోవచ్చు. చవితికి చందాదందాలు చేసేవాళ్ళు కలికానిక్కూడా కనిపించరు. కనిపించినా ఇచ్చిన అరకాణీకే  పడీపడీ దండాలుపెట్టి మరీ పోతారు. వెంకయ్యనాయుడింక సంపూర్ణంగా సినిమాల్లోకొచ్చేయచ్చు. ఎస్వీ రంగారావెటూ లేని లోటొకటుండేడ్చిందికదా! ఒలంపిక్సుకెళ్ళిపోయి మన వై యస్ జగన్  మారథాన్లో మంచిరికార్డు సొంతం చేసుకోవచ్చు. కరుణానిధిగారించక్కా సినిమా కథలు రాసుకోవచ్చు. పశువులకు గడ్డీ గాదం పుష్కలంగా దొరుకుతుంది. ఇసుక  నెత్తిన పోసుకొనేంతగా కుప్పలు పోగేసుకోవచ్చు. టీవీలకు కాస్తంత ఊపిరి సలిపేందుకైనా రాజకీయాలకో రోజు సెలవియ్యాల్సిందేరా అబ్బీ!'
పోతురాజు మామయ్యలా పట్టాలు తప్పిన బండిలా దూసుకుపోతుంటే.. అత్తయ్యొచ్చి భర్తకు వంతలందుకొంది 'వాజపేయిగారా రోజుల్లో ఒక్కపార్లమెంటులో మాత్రమే కవిత్వం వినిపించేవారు పాపం తీరిక దొరక్క.  పాలిటిక్సుకో పూటైనా విరామముండుంటే రంజైన  ఓ షాయిరీల సంకలనం జాతికి దక్కుండేది! అద్వానీగారి రథమీమధ్యేదో మూలబడిందని వింటున్నాం. స్వచ్చందంగా ఆయనే సెలవులు పుచ్చేసుకొని మళ్ళా రోడ్డెక్కితే అడ్డేదెవరంట! మైకు కంపెనీలన్నా మళ్లా పుంజుకొంటాయి! మెగాస్టార్లకి పక్క చూపులతో పనుండదు. ఖద్దరు కంపెనీలకు గిరాకీలసలుండవు. అటు సియం  చంద్రబాబు ఏ సింగపూరు కంపెనీకో ఇంచక్కా సిఇవో షిఫ్టైపోవచ్చు. ఒక్క ఫాం హౌసుకే మీ మామయ్య ఎన్ని పొర్లుదండాలు పెడుతున్నాడో చూస్తున్నావుగా మాధవా! ఈ వయసులో చంద్రబాబుకి కొత్త రాజధాని కట్టే నెత్తినెప్పెందుకు చెప్పు! ఫామ్ హౌసేదో కొనుక్కొని చంద్రశేఖర్రావుసారు ఆ మధ్యలో  ఎకరాకి లక్షరూపాయలు మిగులుసాగు చేసి చూపించాడు గదా! అన్నదాతలెంతోమంది కళ్ళముందే కూలిపోతున్నారు.. వాళ్ళింకా  పిట్టల్లా రాలకుండా చిట్కా ఏదైనా కనిపెట్టే సావకాశం  సారుకి దొరికుతుందబ్బాయ్ ఈ  రాజకీయాలకు  కనీసం కొన్నాళ్లైనా విరామం ప్రకటిస్తే. పాలిటిక్సుకి సెలవలవసరం ఎంతుంటుందో చిన్నాడైనా ఆ రాహుల్బాబు  పసిగట్టేసాడు. మోదీసాబులా పద్దస్తమానం క్షణం తీరికలేకుండా పరాయి దేశాలక్కూడా పోయి రాజకీయాలు చేస్తుంటే జనాలకిక గుక్కతిప్పుకొనే వ్యవధానం ఎక్కడుంటుందిరా!'
మొన్నటి సీజన్లో చట్టసభలో రెచ్చిపోయిన సుష్మాస్వరాజమ్మను మించి ధాటీగా అత్తమ్మలా పాలిటిక్సునుగూర్చి దడ్దడలాడించేస్తుంటే నోరెళ్లబెట్టడం నా వంతయింది.
'అంతెందుకబ్బాయ్ అసలు! రాజకీయాలకొక్కరోజు సెలవిచ్చేసుకొన్నా ఉగ్రవాదమిట్టే పల్చబడిపోదూ! తుపాకులన్నీ తుప్పుపట్టిపోవూ! అంతెందుకు! అసలు మీ మామయ్యలాంటి మిలటరీవాళ్లవసరమే ఉండదు. సెలవులిచ్చేసి ఇంటికెళ్లి వంటా వార్పూ చూసుకోమంటారు!' అంటూ గాలిని మామయ్యమీదకు మళ్లించేసరికి మాజీ మేజరుగారికి ఒళ్ళు మండింది.
ఆయనా ఏదో ఎదురుదాడికి దిగేవేళకి.. భగవంతుడొచ్చి కాపాడినట్లు..  బైటనుంచి ఏవో.. పెద్దపెద్ద పెడబొబ్బలు!
అందరం కంగారుగా అటువైపు పరుగులు తీసాం.
'పిల్లాడు కనబడ్డం లేద'ని పుల్లయ్యపెళ్లాం ఘొల్లుమంటోంది. తవ్వుతున్న బోరుబావిలో జారిపడటం కళ్లారా చూసామన్నారెవరో!  బోరుమన్నారు పుల్లయ్య దంపతులు.
ఎవరు పిలిచారో.. ఆగమేఘాలమీద సర్కారు రిగ్గులొచ్చి పడ్డాయి! ఊరంతా దగ్గరుండి మరీ బోరులోపలకు లోతుగా తవ్వించి మరీ చూశారు.
వందేంటి! నాలుగొందల అడుగుల లోతుకు పోయినా నరపురుగు ఆనవాలు కనబడితేనా!
జలపడిందాకా ఆగి.. 'పిల్లాడు సెల్లార్లో పడి నిద్రపోతున్నాడ'ని తెచ్చిచ్చాడు పేటరౌడీ!
సర్వే జనా సుఖినోభవన్తు!
పిల్లాడు కళ్లబడినందుకు పుల్లయ్య దంపతులు హ్యాపీ! పోతురాజు  మామయ్య సంతోషంగా ఇచ్చిన  పదివేలు పుచ్చుకొని ఆ తెల్లారే గుడిసె ఖాళీ చేసి వెళ్లిపోయాడు రిక్షాపుల్లర్ పుల్లయ్య!
రెండు మూడు  లక్షలు పోస్తేనేగాని పూర్వవని బోరుపని.. ఉచితంగా.. గంటల్లో..  అదీ కాలనీజనాల ఆమోదంతో  జరిగినందుకు పోతురాజు మామయ్యా హ్యాపీ!

'లోకల్  ఎలక్షన్లేవో వస్తున్నాయటగా! మన ఇలాకాలోని  పవిత్రమైన ఓట్లన్నీ పేటరౌడీ 'బోరుపంపు' గుర్తుకే వేయిస్తానని మాట ఇచ్చానన్నయ్యా.. ఏరియా ఎంఎల్యేగారికి. బోరు ఖర్చులో ఆదా అయిన సొమ్ములో సగం వినాయకచవితి సంబరాలకని చందాలకోసం ఆయన తాలూకు మనుషులొస్తారు.  నసగుళ్లేమీ పెట్టుకోకుండా  ఇవ్వడం మర్చిపోవద్దు!' అంటూ శరభరాజు తమ్ముడు కబురు చేసినప్పుడుగాని తెలిసిరాలేదు రాజకీయాల మహత్యం అంటే ఏమిటో పోతురాజు మామయ్యకి!
'రంగు రుచి వాసనా లేని రాజకీయాలవల్ల అన్నీ నష్టాలే' అంటూ రోజూ  తెగ తిట్టిపోసే పోతురాజు మామయ్య  ప్రస్తుతం వార్డు మెంబరుగా నిలబడితే ఎలాగుంటుందా!' అని తెగ లెక్కల్లో మునిగితేలుతున్నాడు!
-కర్లపాలెం హనుమంతరావు
(వాకిలి- అంతర్జాల పత్రిక లాఫింగ్ గ్యాస్ కాలమ్- అక్టోబర్ సంచికలో ప్రచురితం)


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...