రామసుబ్బు చేసేది విప్రోలో పెద్ద
ఉద్యోగమే అయినా బామ్మగీసే గీటు దాటేరకం బొత్తిగా కాదు. ఒక్క పెళ్ళి అనేమిటి! పెళ్ళిచూపులుకూడా శుద్ధసాంప్రదాయఫక్కీలో
సాగితీరాలన్న బామ్మగారి ఆంక్ష. అందుకు ఒప్పుకున్న తరువాతే సుబ్బురామమ్మను
చూసేందుకు రామసుబ్బు స్నేహితుడితోసహా తరలి వచ్చింది.
పాతకాలం మోడల్లో ఫలహారాలు సుష్టుగా
లాగించిన తరువాత పిల్లను తెచ్చి చాపమీద కూర్చోపెట్టారు. మగపెళ్ళివారి తరుఫునుంచి ప్రశ్నలవర్షం ప్రారంభమయింది.
'సంగీతం వచ్చా?
'రామలాలీ మేఘ శ్యామలాలీ..'
'గొంతులు బాగున్నాయి
సరే ఆమెతో పాటు ఆ పక్క జంటస్వరం ఎందుకు?'
'మొదట్నుంచీ మాకిద్దరికీ
కలిసి పాడటమే అలవాటండీ!'
'సంగీతానిదేముందిలేండి!
సంసారం చేసుకోవడానికి కావాల్సింది వంటా వార్పూ! వంటచేయడం వచ్చా.. రాదా.. మీ స్నేహితురాలికి?'
'వంకాయకూర బ్రహ్మాండంగా
చేస్తుందండీ!'
'వంకాయకూర ఒక్కటేనా వచ్చు?!'
'కాలేజీకెళ్లి చదువులు
సాగించడంచేత ఇంట్లో వంటచేసే తీరిక లేదండీ! కావాలంటే రెండునెల్లలో
అన్నీ నేనే దగ్గరుండి నేర్పిస్తానండీ! నాకు అన్ని రకాల వంటలూ
చేయడం వచ్చు'
'బాగుంది! రేపు మీ స్నేహితురాలికి ఒంట్లో ఓపికలేదు పొమ్మన్నా మీరే ఆపద్ధర్మంగా ఆమెకు సాయం పట్టేటట్టున్నారే!
మరి మీరు ఏమీ చదువుకోవడం లేదా
ఏమిటీ?'
'ఇద్దరం కలిసే చదువుకొన్నామండీ
ఇంటరుదాకా! మెడిసన్లో నాకు సీటు వచ్చినప్పట్నుంచే విడివిడిగా
వెళ్ళి చదువుకోవాల్సి వస్తోంది'
'సరే! కాస్త మీ స్నేహితురాలిని అసుంటా నడిచి
చూపించమనండి! లేకుంటే కాలో చెయ్యో వంకరుంటే ఎలా తెలిసేదీ!'
సుభద్ర పక్కనుండి సుబ్బరామమ్మచేత
నడిపించింది.
కట్నకానుకలదాకా రాకుండానే ఆ సంబంధం రద్దయిపోయిందని వేరే చెప్పాలా!
సడేలే! మరి ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్ దేనికంటారా!
అక్కడే ఉందండీ అసలు ట్విస్టంతా. సంబంధం రద్ధయిందన్నానేగాని.. బాజాభంత్రీలు మోగలేదని అన్నానా!
ఈ పెళ్లిచూపులు అయిన రెండునెల్లకు
భాజాభంత్రీలు మోగాయి.. రామసుబ్బు స్నేహితుడు సుబ్రహ్మణ్యం పెళ్లికొడుకైతే..
సుబ్బరామమ్మ స్నేహితురాలు సుభద్ర పెళ్ళికూతురు!
వాళ్ళిద్దరూ ఒకళ్లకొకళ్ళు తెగనచ్చేసుకొన్నారు
రామసుబ్బు పెళ్ళిచూపుల్లో.
బామ్మగారి పనుపుమీద పెళ్లికూతుర్ని
అడ్డమైన ప్రశ్నలు వేసినందుకు ఆనక సుబ్బరామమ్మకు సుబ్రహ్మణ్యం ప్రయివేటుగా ‘సారీ’ చెప్పడం సుభద్రకు తెగనచ్చేసింది. స్నేహితురాలికోసం పెళ్ళిచూపుల్లో
సుభద్ర అన్నిరకాల మాటలు చిరునవ్వుతో ఎదుర్కోవడం సుబ్రహ్మణ్యానికీ బాగా నచ్చేసింది.
పెళ్ళిచూపులు కాని పెళ్ళిచూపుల్లో
నిజమైన పెళ్లిచూపులు జరగడమే ఈ కథలో విశేషం
-కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment