Thursday, August 4, 2016

సరళీకర వ్యాపార విధానాలు


'ఈ మధ్య పత్రికల్లో మరీ ఎక్కువయిందేంది బాబాయ్ గోల! ఈ 'ఈజీ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్' అంటే ఏందీ?'
'పక్కనే చక్కని తెలుగు ముక్కల్లో రాసుంది.. చదువుకోవచ్చు గదరా! 'సరళతర వ్యాపార నిర్వహణ' అనీ! పనిమాలా  వచ్చి మీ బాబాయి పనిని చెడగొట్టందే నీకేం తోచదా  బాబిగా?
'బాబాయీ!.. పనీనా! బాబోయ్.. ఇదేంటి పిన్నీ కొత్తగా!'
'అట్లకు పిండి రుబ్బి పెట్టాలి. బట్టలకు సబ్బెట్టి ఉతికి ఆరబెట్టాలి.. అన్నింటికన్నా ముందు ఇప్పుడు ఈ బియ్యంలో రాళ్లు ఏరి పెట్టాలి' అదీ మీ పిన్ని నాకు జారీ చేసిన  హుకూంరా  హనుమంతూ! ఏ 'సరళతర విధానం' అవలంబించి ఈ పనులన్నీ చక చకా  తెముల్చుకుందామా! అని ఇందాకట్నుంచీ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇదిగో.. ఇంతలోనే నువ్వొచ్చేసావు! ఇంద.. నువ్వూ ఈ చేట చేత్తో పుచ్చేసుకో!'
'ఈ బియ్యంలో రాళ్లు ఏరే కన్నా.. రాళ్ళలో బియ్యం ఏరడం సులభం లాగుంది   బాబాయ్! అదే ప్రస్తుతానికి నీవు అవలంబించవలసిన 'సరళతర' విధానం కూడానూ!
'మా బాగా చెప్పావురా బుజ్జిగా! ఈ దుకాణాలవాళ్ళు బియ్యంతో వ్యాపారం చేస్తున్నారో.. రాళ్ళతో వ్యాపారం  చేస్తున్నారో బోధ పడకుండా ఉందిరా!'
'అర్థమయిందిలే బాబాయ్ ఇప్పుడు ఈ 'ఈ వే డూ బి' అంతరార్థం.  ఐ మీన్  'సరళతర వ్యాపార నిర్వహణ' మూలసూత్రం!'
'ఛ!.. చ! ప్రపంచ బ్యాంకు ఇలాంటి  చేటలో బియ్యం చెరిగే  విధానాలను గురించి  ఎందుకు నివేదికలు తయారు చేస్తుందిరా తిక్క సన్నాసీ? పెద్ద పెద్ద  వ్యాపారాలు చేసుకునేందుకు ఉన్న వెసులుబాట్లను బట్టి వివిధ దేశాలకు అది ర్యాంకులిస్తుంటుందిగానీ ప్రతి ఏటా. ఆ ర్యాంకుల్ని ఆధారం చేసుకొనే   వ్యాపారస్తులు ఏ ఏ దేశాల్లో పెట్టుబళ్ళు పెడితే గట్టి లాభాలు గుంజుకోవచ్చో  ఓ అంచనాకొస్తుంటారు'
'అట్లాగయితే .. మన దేశానికే మొదటి ర్యాంకు వస్తుండాలే!'
'వెనకనుంచి మొదటి ర్యాంకు రానందుకు సంతోషించు!   పోయినేడాది మనది  నూట ముఫ్ఫై నాలుగో ర్యాంకు ..నూట ఎనభై దేశాల పట్టికలో! ఈ సారేదో నాలుగు స్థానాలు ముందుకు జరిగాయనుకో! సింగపూర్ దే మొదటినుంచీ మొదటి స్థానం'
'అన్యాయం బాబాయ్! అంతా సింగపూరు సింగపూరు అంటూ చిందులేసే వాళ్లే కానీ.. మన దగ్గరున్నన్ని  సులువుసూత్రాలు  ప్రపంచంలో ఇంకెక్కడున్నాయి.. చెప్పు! ఈస్టిండియా కంపెనీ ఈ వెసులుబాట్లన్నీ లెక్కేసుసుకొనే కదా మన దేశాన్ని వెదుక్కుంటూ  వచ్చి మన నెత్తికెక్కిందీ!'
'ఆ పాత స్టోరీలన్నీ ప్రపంచ బ్యాంకు ముందు పరమ వేస్టురా అబ్బిగా?'
'పోనీ.. ఇప్పటి లెక్కలు చూసుకున్నా మనకే ఫస్టు ర్యాంకు రావాలి బాబాయ్ న్యాయంగా! సర్కారు భూముల్ని ఇంచక్కా ఆక్రమించి ఆకాశాన్నంటే భవంతులు లేపినా .. అడిగే నాధుడుండడు మన దగ్గర. తిక్క పుట్టి ఎవరైనా కోర్టు గడప తొక్కినా .. ఏ అపరాధ రుసుమో కట్టేస్తామని.. అఫిడవిట్టో అదేందో ఒకటి గీకి పారేస్తే సరి.. అంతా సెట్టైపోయినట్టే. ఆక్రమించిన భూములు అమ్ముకొనేటప్పుడు సెటిల్మెంటుకు ఏ ప్రజానేతో వచ్చి మోకాలడ్డినా ఓ శాతం మనది కాదనుకుంటే సరి..  అంతా ఓం శాంతిః.. శాంతిః.. శాంతిః!'
'ఆ మాటా నిజమేననుకో! వడ్డించే చేతులు మనవాళ్లవయేట్లు కాస్త అప్రమత్తంగా ఉంటే చాలు.. తట్టెడు సిమెంటన్నా తయారవకముందే పది రూపాయల షేరు పదింతలు పెంచి రాత్రికి రాత్రి రాక్ ఫెల్లర్ తాతై పోవచ్చు'
'మరే! తుక్కు తవ్వుకునేందుకని అనుమతులు తీసేసుకొని ఉక్కు తయారయే సరుకు తవ్వుకున్నా చాలుగదా.. ఏడుకొండలవాడి నెత్తికి  కిరీటాలనేంటి.. పడుకొనే గదుల్లో పక్క ఎక్కేందుకు  వాడే ఎత్తుపీటలు కూడా ఇంచక్కా మేలిమి బంగారంతో మలాములు చేయించుకోవచ్చు'
'లెక్కలడిగే నోళ్ళు నొక్కి పారేసేందుకు విందులు.. వినోదాలు..   నాలుగు నోట్ల కట్టల సందు చూసుకొని  విసిరేయడాల్లాంటి  చమత్కారాలు చచ్చేటన్ని ఎటూ మన దగ్గర ఉంటాయిగదా!'
'వేలు దూరే సందిస్తే చాలు.. కాలు బార్లా చాపుకునే వెసులుబాట్లు వేలకు వేలున్నా మన దగ్గర మరి ఎందుకు  మరీ  ఇంత దిక్కుమాలిన దిగువ ర్యాంకులో మనల్ని తొక్కేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు?'  మంచి ర్యాంకు కొట్టేయాలంటే మరేదన్నా  మతలబు ఉందంటావా బాబాయ్?'
'ఏమోరా! దమ్ముండాలే కానీ దుమ్మూ ధూళితోనైనా సరే దుమ్ములేపే వ్యాపారాలు బ్రహాండంగా చేసిపారేసే వెసులుబాట్లు మన దేశంలో వీశలకొద్దీ వాడుకలో ఉన్న మాటా వాస్తవమే! ఒప్పుకుంటాగానీ.. ప్రపంచ బ్యాంకు వ్యాపార నిర్వహణ పెరామీటర్లకీ  పక్కదారి చిట్కాలు బొత్తిగా సెట్టవవేమోరా! టర్కీలో ఎప్పుడో రద్దయిన తుక్కునోట్లనుకూడా   ఇంచక్కా  కోట్లకిందకు మార్చేసే   చురుకు బుర్రలకైతే  లెక్కలేదిక్కడ!   గాలికీ వానకీ   ఎక్కడో శేషాచలం అడవుల్లో పడి  ఎదిగేవి ఇక్కడి  చందనం మొక్కలు!  పులులూ.. చలులూ అని కూడా వెరవకుండా ప్రాణాలకు తెగబడి మరీ   రెండు  దుంగల్ని  నరికి  ఏ చైనాకో జపానుకో తరలించి  నాలుగు డబ్బులు దండుకునే  రూట్లు ఎన్ని కనిపెట్టారు మన లోకల్ కొలంబస్సులు! కొత్త మార్గాలు కనిపెట్టారన్న కనీసమైన కృతజ్ఞతైనా లేకుండా  ఎన్ని ఎన్ కౌంటర్లు జరిపారో  వాళ్లమీద  ఈ గడ్డమీద!'
'రాత్రనక పగలనక వళ్లూ కీళ్లూ ఇరగ దీసి మరీ  సాధన చేసి గెలిచినా క్రికెట్ అటగాళ్లకు  చివరికి గిట్టేది ఓ కప్పు.. అదీ పదకొండు ఆటగాళ్లకీ కలిపి ఒహటి. కనీసం కాఫీ.. టీలు  పోసుకొని తాగేందుకైనా వీలు లేకుండా పొడుగు మూతిది.  వేలంపాట విధానం కనిపెట్టి ఆటగాళ్లూ వేలంపాట సరుక్కన్నా ఏమీ తీసిపోరన్న లాభసూత్రాన్ని కనిపెట్టిన లలిత్ మోదీనైనా బిజినెస్ మోడల్ గా చూసుకోవద్దూ!  ఆ అబ్బిని  దేశం  సరిహద్దులు దాటిందాకా తరిమి  తరిమి కొడితిమి గదా మనందరం కలసి! ఏటేటా అందమైన సుందరాంగుల శృంగార భంగిమలతో గోడకేలండర్లు పంచి పెట్టే అమూల్యమైన ఆలోచన   మాల్యా జీది.   బ్యాంకులకు అతగాడేవో  ముష్ఠి మూడువేల కోట్లు బకాయి పడ్డాడని దేశం దాటి పారిపోయిందాకా నిద్రైనా పోకుండా పహరా కాస్తిమి! ఆడంగులు.. పీనాసులు  పోపు డబ్బాల్లో.. పక్కగుడ్డల కింద సందుల్లో దాచుకున్న  చిల్లర సొమ్మునంతా బైటికి తీయించడమేమన్నా  సామాన్యమైన  చమత్కారమా? స్తబ్ధుగా పడున్న  గ్రామీణ ఆర్థిక వ్యవస్థను  ఒక్కసారిగా తట్టిలేపాడన్న   విశ్వాసమైనా    లేదు అగ్రిగోల్డు పెద్దాయనమీద దేశంలోని పెద్దలెవరికీ!'
'నిజమేరా!  నాలుగు డబ్బులు దేశానికి రాబట్టే  ఉపాయాలు కనిపెట్టే వ్యాపారస్తులమీదా న్యాయస్థానాలు సైతం అట్లా  అగ్గినిప్పులు కురిపిస్తుంటే.. ఏ గుండె నిబ్బరంతో విదేశాలనుంచి బిజినెస్ మాగ్నెట్లు  సముద్రాలు దాటి వచ్చి మరీ ఇక్కడ పెట్టుబళ్ళు పెడతారు!.. మదుపుదార్లకు  డబ్బులు చెల్లించే విషయంలో విఫలమై తీహార్ జైలు ఊచలు లెక్కించే  సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ రాసిన పుస్తకం ‘లైఫ్ మంత్రాస్’ వరల్డ్ బెస్ట్ సెల్లింగ్ బుక్ గా రికార్డుకెక్కింది. అయినా  ప్రపంచ బ్యాంకు అతగాడి వ్యాపార  సులువు సూత్రాలని లెక్కలోకే తీసుకోలా! ప్రపంచ బ్యాంకు పెరామీటర్లకూ  కొన్ని పరిమితులు ఉండిపోయాయనుకుంటా!'
'అలాగని.. అన్ని రకాల వ్యాపారాలకు తరగని గని వంటి మనదేశానికి ఇంత దిక్కుమాలిన ర్యాంకు ఇచ్చి కిందకు తొక్కేస్తే.. అరటి తొక్కల వ్యాపారం కూడా ఇక్కడ ఇంక ఎక్కిరావడం కష్టం కదా!బాబాయ్! అందరూ మన ఆంధ్రపత్రిక నాగేశ్వర్రావు పంతులుగారంత చురుగ్గా ఉండరు.. తలనొప్పి మందు అమృతాంజనాన్ని కూడా ఫ్రాన్సులాంటి దేశాల ఆడపిల్లలకి సౌందర్య సాధనం కింద అమ్మి సొమ్ము చేసుకోవడానికి!'ఈ కాలం 'ఈ-కాలం' అయిపోయింది. ఈ ర్యాంకుల గొడవొకటి కొత్తగా నెత్తిమీదకొచ్చి పడింది.   ఎలాంటి వ్యాపార  వెసులుబాటులో విస్పష్టంగా  చెప్పకుండా   వట్టిగా  'సరళతర వ్యాపార నిర్వహణ' అని ఒక పేరు పెట్టి  ర్యాంకుల పట్టికలు తయారు చేసేస్తుంటే.. ఎంత   మేథస్సు పొంగిపొర్లే పుణ్యభూమి అయినా   పైసా పెట్టుబడి పెట్టేందుకు  విదేశీయులే కాదు.. స్వదేశీయులూ ఛస్తే  ముందుకు  రారు'
' అందుకే కదరా ఇందాక మీ పిన్ని రాళ్ళేరమని ఇచ్చిన బియ్యాన్ని 'ఈజీవే ఆఫ్ డూయింగ్ బిజినెన్' పద్ధతిలో  రాళ్ళకు బదులు బియ్యం గింజలేరి ఇచ్చేసింది! ఇదిగో .. దాంతో చేసిన కిచిడీ! అందుకో!  రుచి చూడు! ఫలితం పాజిటివ్ గా ఉంటే   .. 'సరళతర  వ్యాపార నిర్వహణ' ప్రాజెక్టు రిపోర్టొకటి తయారు చేసి'   ప్రపంచ బ్యాంకుకి సమర్పించేటట్లు మన ప్రభుత్వాలమీద వత్తిడి పెంచేద్దాం!'
'బాబోయ్! పన్ను విరిగింది బాబాయ్! నీ బియ్యం కిచిడీ బంగారం కానూ!'
విరగదుట్రా మరి! బియ్యం  కిచిడీలో అన్నీ రాళ్లేనాయ మరి!'
 మీ బాబాయిగారి 'సరళతర వ్యాపార నిర్వహణవిధానం అలాగా ఏడ్చింది మరి! ఆడమనిషినని తీసి పారేయకుంటే తోచిన సలహా ఒక్కటిస్తాను. వింటే వినండి! ఈ దేశంలో  అపరిమిత లాభాలు గడించి పెట్టే సరళతర వ్యాపార నిర్వహణ' విధానాలు  సక్రమంగా పనిచేసే రంగం ఒక్కటే ఒక్కటి.. రాజకీయ రంగం. అందులో మీరెలాగూ రాణించే రకం కాదు గానీ.. లోపలికి పదండి.. మీకోసం రోలు.. పొత్రం ఎదురు చూస్తున్నాయి.. అట్లకి పిండి రుబ్బి పెడుదురుగానీ ఇద్దరూ కలసి!
-కర్లపాలెం హనుమంతరావు
***
(ఈనాడు సంపాదకీయం పుటలో ప్రచురితం- ఈనాడుకి.. కార్టూనిస్ట్ శ్రీధర్ గారికి ధన్యవాదాలతో)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...