Showing posts with label Stories. Show all posts
Showing posts with label Stories. Show all posts

Thursday, December 23, 2021

కథ పగ రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఆంధ్రప్రభ వారపత్రిక - 31 - 12 - 1977 సంచికలో ప్రచురితం )





 




కథ

పగ 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఆంధ్రప్రభ వారపత్రిక - 31 - 12 - 1977 సంచికలో ప్రచురితం ) 


“ప్రపంచంలో ఇలా ఇంకెక్కడున్నా జరిగిందేమో నాకు తెలీదు. కాని, నా జీవితంలో మాత్రం జరిగిపోయింది....'


"ఎవరికైనా చెప్పుకుని భోరువ ఏడవాలనిపిస్తుంది. కానీ ఎవరికి చెప్పు కోను ! ఎలా చెప్పుకోను ! విన్న వాళ్ళెవరైనా  నా మొహాని ఉమ్మేస్తారే!...”


"నాకు పిచ్చెత్తి నా బావుణ్ణు . కానీ, పిచ్చెత్తదు. . ఈ బడబాగ్ని గుండెల్లో దాచుకుని ఇలా ఉండిపోవాల్సిందే,”


“దేవుణ్ణి నే వంత పిచ్చిగా ఎందుకు ప్రేమించాను: ఏమో!... నాకే తెలీడు. అతనిలో ఏదో చిత్రమైన ఆకర్షణ  ఉంది. దాని ప్రభావానికే మంత్రముగ్ధనై  ఆంతధైర్యంగా అందర్నీ విడిచి వచ్చి అతన్ని పెళ్ళాడింది...” 


"ఇప్పుడు నా కెవ్వరూ లేరు  అతను తప్ప...." 


"అతమా నాకు దూరమయితే!... ఓహ్! ఆ ఊహకే తన గుండె దడ దడలాడిపోతుందే!... బహుశా ఈ బలహీనతే తన జీవితం మీద ఇంత పెద్ద దెబ్బ తీసిందేమో!... 


' ఏమో!... అంతా ఆయిపోయింది... ఇప్పుడుకొని ప్రయోజన మేముంది!... నిప్పులాంటి ఈ తప్పును గుప్పెట్లో పెట్టుకుని  తిరగటం తప్ప.... 


“నిప్పు గుప్పెటను కాలుస్తుంది.


ఆ సంగతి తెలుసు. నిజం ఎప్పటికైనా బయటపడి తీరుతుంది. ఆ సంగతీ  తెలుసు... దేవుడి కెప్పుడో ఈ విష యం తెలిసే తీరుతుంది... అప్పుడు తనేం చేస్తాడు!.... 


ఏమయినా చేయనీ!  ఇప్పుడు మాత్రం తనీ విషయం  చెప్పదు .... చెప్పి చేజేతులా తన సంసారంలో  నిప్పులు కుమ్మరించుకోదు ... చూస్తూ చూస్తూ దేవుడి పొందును  తనెలాంటి పరిస్థితుల్లోనూ వదులుకో లేదు... 


అతని విూద తన కంత లాలప ఉండబట్టేనా ఇంత పెద్ద ఘోరాన్ని కిమ్మవకుండా తన గుండెల్లో దాచుకు తిరుగుతోంది! 


“దేవుడికి మాత్రం తన మీదంత  ప్రేమలేదూ! ఎంత ప్రేమ లేక పోతే కులం కూడా చూడకుండా అంతమంది  నెదిరించి నా మెళ్ళో తాళికడతాడు! అందుకేగా వాళ్ళందరికీ అతను  దూరమయింది! ఇప్పుడు అతనికి మాత్రం ఎవరున్నారు. . నేను  తప్ప..."


"నే నతనికి .. నాకతనూ!...”


" ఈ అలుసు చూసుకొనేనేమో  శేషు తన జీవితంలో ఇలా నిప్పులు కురి పించిందీ!....”


"ఏంత వద్దనుకున్నా అతను గుర్తుకొస్తూవే ఉన్నాడు....”


"వాడు గురుకొస్తే చాలు ఒళ్ళంతా కంపరమెత్తి పోతుంది... 


ఏమయితేనేమి... ఆ దుర్మార్గుడిపల్లే తన జీవితమిలా కళంకితమయిపోయింది.” 


ఏమాత్రం పసి గట్టినా ఎప్పుడో ఆ నాగుపాము  పడగ నీడ నుండి తప్పుకోనుండేది. 


ఇప్పుడంతా అయిపోయింది.. తన బ్రతుకు సర్వనాశనం అయిపోయింది...” 


" పూర్తిగా వాడిననీ ప్రయోజనం లేదేమో! తన తలరాతే అలా ఉందేమో!... కాకపోతే ఇదంతా ఏమిటి? 


 కమ్మగా తిని, తిరిగే దేవుడు మంచమెందుకెక్కాలి? ..... ఒక్క నెలరోజులు డ్యూటీకి హాజరు కాలేక పోయినందుకే  పగ బట్టినట్లు మేనేజ్ మెంట్  అతన్ని  ఎందుకు టెర్మినేట్ చేమాలి? అక్కడికీ  వ్యక్తిగతంగా ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోయిందే!... 


ఆరో గ్యం చెడిపోయి, ఉన్న ఆ ఒక్క చిన్న ఉద్యోగం ఊడిపోయే సరికి అతను బెంబేలు పడిపోయి  తననెందుకు అంతలా  కంగారు పెట్టాలి? అప్పటికీ తనెంతో ధైర్యం  చెప్పిందతనికి! '' వెధవ ఉద్యోగం! పోతేపోయింది. ముందారోగ్యం కుదుట పడనీయండి . . తరువాత చూసుకుందామని... " 


తను మాత్రం బింకం  కొద్ది అలాగ అంది కాని రోజు రోజుకీ క్షీణిస్తున్న అతని ఆరోగ్యాన్ని చూసి ఎంత కుమిలిపోయేది!... 


అక్కడికీ తను తన తండ్రికి  ఉత్తరం రాసింది.  నా కూతురెప్పుడో చచ్చిపాయిందని సమాధానం వ్రాసాడా పెద్దమనిషి! .... 


అత్తగారింటికి  స్వయంగా వెళ్ళి వచ్చింది . తనెవరాలా తెలిసే సరికి తెరిచిన తలుపులు  కూడా మూసుకున్నారు! 


 వంటిమీది  సొమ్ము  ఒక్కొక్కటే తాకట్టు కొట్టు కెళ్లిపోయింది   కూర్చుని తింటే అంటే కొండలైనా కరిగిపోవా! ... 


 ఉన్నవన్నీ హరించుకుపోతుంటే  బాధ పడలేదు.. విధి ఎంచుకిట్లా పగ పట్టినట్లు   తమ జీవితాలతో  చెలగాట మాడుతుందొ తెలీదు !  


ఉన్నట్లుండి ఆయన రక్షం కక్కుకుంటే ..బేజారెత్తిన తను డాక్టరు కోసం పరుగెత్తింది. అప్పపుడు  దొరికిన వాడొక్క శేషునే. 

ఆ స్థితిలో  తానేమీ ఆలోచించుకోలేక పోయింది . టెస్టులు చేయించి తరువాత చివరకు  క్షయ_గా తేలింది. 


శేషు రికమెండేషన్ మీదటనే  దేవుడు హాస్పిటల్లో జాయినవ్వడం .. కొన్ని రోజులు తరువాత డిశ్చార్జ్ అవడమూ సాధ్యమయాయి.  


ఆ తరువాత కూడా రోజూ వచ్చి దేవుణ్ణి చూసిపోయేవాడు శేషు. 


వైద్యం ఖర్చుల గురించి అడిగినప్పుడు " మీరు వాటిని గురించి ఆలోచిస్తూ వర్రీ అవకండి" అని నవ్వేవాడు. 


అంతా ఉదార బుద్ధి అనుకొనేది తాను  అప్పుడు. శేషు అంతగా మారిపోయినందుకు తనెంతో  సంషించింది కూడా. 


.. కానీ వాడు మార లేదనీ .. ఆ ఉదారమంతా వట్టి  బూటకమని..... కడుపులో  కుత్సితపు టాలోచనలు పెట్టు కునే ఈ సహాయం చేస్తున్నాడని  తెలుసుకోలేక పోయింది .... 


.. అన్నీ  తెలిపే వేళకి నిలువులోతు  రొంపిలో కూ రుకుపోయినట్లు తెలిసిపోయింది.    


నిస్సహాయంగా ఆ దుర్మార్గుడి వత్తిడికె బలైపోయింది . 


"ఆ దురదృష్టకరమైన రోజు తనకింకా  బాగా గుర్తే! ...”


"బయట భోరున  వర్షం. చలిగాలికి దేవుడికి తిరిగి దగ్గు ఆరంభమయింది . ఆ బాధచూడలేక కబురంపితే శేషు ప్రత్యక్షమయాడు.


ఇంజెక్షన్ ఇచ్చిన తరువాత మత్తుగా పడుకొన్నాడాయన .


"చలి గాలి తగలకూడదు . తలుపులేసి రమ్మన్నాడు శేషు.


వేసి వస్తుంటే హఠాత్తుగా  చేయి పట్టుకున్నాడు.... అసహ్యంతో తన ఒళ్ళంతా కంపించింది... ! కోపంగా చేయి విసిరికొట్టింది .


" నీ దేవదాసు నీకు  దక్కాలంటే నా కోరిక మన్నించాలి" అని చిన్నగా నవ్వాడతను . "నీ మొగుడిప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు, నే నిప్పుడిచ్చిందిమామూలు మత్తు  ఇంజెక్షన్ కాదు . ఆ ప్రత్యేకమైన మందు ప్రభావంతో ఒక్క గంటదాకా ఆతనికిక్కడ జరిగేదీ తెలిసే అవకాశం లేదు.తరువాత ట్రీట్ మెంట్ సాగకపోతే మాత్రం ఇంజెక్షన్ ప్రభావంవల్ల మరింత బాధపడుతాడు.  ఇదే అతని చివరి రాత్రి అవుతుంది . నీకు భర్త కావాలో..  నీ శీలమే కావాలో తేల్చుకో."


"నువ్వేమనుకొన్నా ఫర్వాలేదు.. నువ్వీ రాత్రికి నాకు కావాలి. కాదంటావా! నా ఫీజు నాకు పారేయి.. వెళ్ళిపోతా.." 


" ఎక్కడ నుంచి  తేగలదంత  డబ్బు ఆక్షణంలో! ఇంకో గంటలో  స్పృహ  వచ్చి బాధతో ఈయన మెలికలు తిరిగిపోతూ మెల్ల మెల్లగా మృత్యు ముఖంలోకి జారి పోతుంటే నిస్సహాయంగా ఎలా ఊరుకోగలదు ! ఎక్కడికని పోగలదీ అర్ధరాత్రి? .... ఎవరినని  యాచించగలదు మాంగల్యం  కాపాడమని!...


" భగవాన్! ఏ ఆడదానికీ ఎదురవ్వ రాని  దౌర్భాగ్యపు పరీక్ష! ఇంత లోకంలో ఒంటరిగా ఒక ఆడది దిక్కులేక భర్త ప్రాణం కోసం తనను తాను అర్పించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు కల్పించావ్!.....


తాను నమ్మిన భూమే తన కాళ్ళకింద తొలుచుకుపోతుంటే, 


తానేదో అంతు లేని అగాథాలలోకి అణగివేయబడుతున్న  చప్పుళ్లు ! 


... ఆ చీకటిరాత్రి... చిన్న గదిలో ... భర్త ఎదుటే... మరో మగాడి కామానికి బలయిపోయిన ఆ దౌర్భాగ్యపు క్షణాలు తనా జీవితంలో మాయని మచ్చ! 

చచ్చిపోదామన్న పిచ్చి  కోరిక చాలా సార్లు కలిగింది.  కాని... దేవుడిని అల్లాంటి  స్థితిలో వదిలిపోలేని బలహీనత! ... బలవంతాన తననిలా   కట్టి పడేస్తుంది...


మధ్య మధ్య  జరిగిందంతా అతనికి చెప్పేయాలన్ని పిచ్చి ఉద్రేకం ముంచు కొస్తుంది... కాని... చెప్పి... చే జేతులా అతని ప్రేమను దూరం చేసుకోలేదు ... 


అదేనేమో తనలోని   బలహీనత .. 


అందుకే... ఇలా... అందర్నీ దగా చేస్తూ... తనను తాను దగా చేసుకుంటూ బతుకు ఈడ్చుకొస్తున్నది. .......! 


శేషు: 


"మనిషి మనసు మహాచిత్రమైంది. అదెంత స్వచ్ఛమయిందో అంత స్వేచ్ఛకలది  కూడా. 


దానికి వావివరుసలు, నీతి నియమాలు, న్యాయాన్యాయాలు, కట్టు బాట్లు ఏవీ. . పట్టవు. బుద్ధి బలమైనదైతే తప్ప మనసు వెర్రి పోకడకు అడ్డుకట్ట పడటం  కష్టం.


"నా మనసు చాలా సున్నితమైంది. ఒకసారి వోడిపోతే జీవితాంతం మరిచి పోలేని నైజంనాది. పగబట్టి కసి తీర్చుకుంటే గాని  మనసు తృప్తి పడదు, మనసుకు బావిసను నేను . అందుకే విధి ఆడించిన ఆ విషాద నాటకంలో నేను విలన్ పాత్రనే పోషించానేమో..  నాకు తెలీదు.


జీవితంలో మళ్ళీ కవించదనుకున్న శారద ఆరోజు తిరిగి తటస్థ పడింది. 

అదీ... నా కంటి ముందు... నా అనుగ్రహం  కోసం పరితపిస్తూ .. 


ఒకప్పుడు తన కోసమే నేను రాత్రింబవళ్ళు పరితపించి పోయింది ... ఆమె ప్రేమమ పొందాలని... ఆమె అందాలనన్నింటిని అందుకోవాలని వెర్రెత్తి  పోయాను ...


 కాని అప్పుడు ఎంత కర్కశంగా తిరస్క రించిందీ! ....


 'ఛీ ! నీ మొహానికి తోడు ప్రేమొకటే తక్కువ..." అని ఎద్దేవా కూడా చేసింది.  నేను ఆర్తిలో రాసినా ప్రేమలేఖను  చించి నా కళ్లెదుటే చెత్తబుట్టలోకి విసిరేసింది! 


ఆ సంఘటన నేను జన్మలో మర్చి పోగలనా? 


" ఆదంతా ఈ దేవదాసు అండ చూసుకునే అని అప్పట్లో నాకు తెలీనేలేదు....”


మళ్ళీ శారద రాకతో ప్రశాంతంగా సాగుతున్న నా జీవితంలో తుఫాను చెలరేగింది. 


' ఎంత వద్దనుకున్నా గతం ముల్లులా  గుండెల్ని కెలకసాగింది. వచ్చిన ఆ అవకాశాన్ని వదులుకో దలుచుకో 

లేదు.' 


నిజానికి శారద భర్తదంత సీరి యస్ కేసేమీ కాదు. ప్రథమస్థాయిలో ఉన్న క్షయ మాత్రమే. చాలా తేలికగా నయం చేయవచ్చుకూడా. 

కానీ, ఓ నెలరోజుల పాటు అతన్ని మా హాస్పిటల్ లో అడ్మిట్ చేయించుకొని  దాన్ని బాగా ముదరనిచ్చాను. అదే మరో రోగినైనా , మరో డాక్టరయినా నెల  రోజుల్లో మామూలు మనిషిని చేయవచ్చు. కాని, శారద ఆర్థిక స్థితి చాలా హీనంగా ఉందని గ్రహించాను. 


ఇద్దరూ పెద్ద వాళ్ళను  కాదని ప్రేమ వివాహం చేసుకుని అందరికీ దూరమయి అల్లాడుతున్నారని తెలుసు కోవడానికి ఆట్టే సమయం పట్టింది కాదు.  


శారద నిస్సహాయ స్థితి చుట్టూ నా వలను మరింత నేర్పుగా బిగించాను. నెలరోజుల ట్రీట్ మెంట్ కు  ఒక్క పైసా అయినా తీసుకోకుండా ఎంతో ఉదార బుద్ధి నటించాను. నా ఉచిత సహాయానికి పాపం, దేవదాసెంత కుచించుకు పోయేవాడో! 


"మీ ఋణం ఎన్ని జన్మలెత్తినా ఎలా తీర్చుకోగలను డాక్టర్!" అని అతనెన్ని సార్లన్నాడో! 


అప్పట్లో శారదను అనాథను చేయటమే తన లక్ష్యం. కానీ క్రమంగా శారద  ప్రవర్తన నాలోని అహాన్ని మరింత రెచ్చ గొట్టింది. 


గతాన్ని మర్చిపోయినట్లు లేదావిడ. నా మంచి తనాన్ని నమ్మినట్లు కూడా లేదు. నా మనసు తెలిసినట్లు నాకు దూర దూరంగా తప్పుకు తిరిగేది.  తప్పని సరి   పరిస్థితుల్లో నా సహాయాన్ని స్వీకరించాల్సి వచ్చినట్లు ప్రవర్తించటం నన్ను  మరింత కవ్వించింది. 


" అందుకే క్రమ క్రమంగా నా పథకంమార్చేశాను . మరింత క్రూరమైన పద్ధతి ద్వారా శారద జీవితాన్ని ఛిన్నా భిన్నం  చెయ్యనిదే నా పగ చల్లారదు . 


అందుకే ఆ రాత్రి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నది ....


 తప్పో ఒప్పో నాకు తెలీదు. నా పగ తీరి అహం తృప్తి చెందడం ప్రధానం.... “


అందుకే ఆ వర్షం రాత్రి శారద పిలిచినప్పుడు  మెడిషన్ లో  పాత మార్ఫియా కూడా తీసుకువెళ్లాను, 


బాధతో మెలికలు తిరుగుతుతున్న దేవదాసుకు ప్రమాదకరమైన మందు  ఇంజెక్షన్ లా  ఇచ్చాను


నిజానికి ఆ డోసుకు మనిషి పూర్తిగా మగతలో  వెళ్ళలేడు . పరిసరాలలో ఏమి జరుగుతుందో  తెలుస్తూనే ఉంటుంది. కాని, ఏమీ చేయలేనంత అశక్తుడవుతాడు ... 


కావాలనే నా పని చేశాను... శారదకు, నాకు  మధ్య జరిగే వ్యవహారంతా ప్రత్యక్షంగా విని అతని మనసు విరిగి  పోవాలనే ఆ పని చేశాను . 


తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన  భార్య  తన కళ్ళెదుటే మరో మగాడికి త్య శీలాన్ని  సమర్పిస్తుంటే ఏమొగాడికైనా మనసు విరిగి ముక్కలు చెక్కలవుతుంది.

తరువాత  ఆ భార్యతో మనసారా సంసారం చేయలేడు, 

నేను కోరుకున్నదీ అదే. బ్రతికినంత కాలం వాళ్ళిద్దరి మధ్య పెద్ద  అగాధం సృష్టించడం. 


శారదను G పరిస్థితుల్లో లొంగ దీసుకోవటమంత కష్టమయిన పనేమీ  కాదు. 


బలవంతంగానైనానేనాపనిచేసి ఉండే వాడినే. 


కాని, దేవదాసు చివరి ఘుడియల్లో ఉన్నాడనీ సింపుల్ గా  చిన్న అబద్దమాడి  ఆవిడ బలహీనత మీద దెబ్బకొట్టి చివరికామె తనకు తానే  లొంగిపోయేటట్లు చేయగలిగాడు...” 


" శారదమీద నాకు అప్పుడు ఎలాంటి మోజూ లేదు. ఉన్నదల్లా కేవలం పగ... కసి... ! ఏ మనిషి అండ చూసుకుని నా స్వచ్ఛమయిన ప్రేమను తిరస్క రించి నా గుండెను  గాయపరచిందో ఛీ! అని ఆ మనిషి చేతనే తిఁస్కరింపబడేటట్లు చేయడమే  నా లక్ష్యం.. దాన్ని సాధించటానికి నేనెన్ని మెట్లు దిగజారినా లెక్క పెట్ట లేదు.... 


దేవదాసు: 


"శీలం అంటే నా దృష్టిలో మానాసిక మైనది. 

శారీరకంగా పవిత్రంగా ఉండి మానసిక వ్యభిచారం చేసే వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నాను. వాళ్ళంటేనే నాకు అసహ్యం . 


 శారద మీద నాకున్న అభిమారం ఇప్పుడు  కూడా రవంత తగ్గలేదు. 


నాకే అంత నరకయాతనగా ఉంటే .. ఆ క్షణాలలో ఆమె ఎంత  క్షోభకు గురయివుంటుందో ఊహించగలను. 


శీలాన్ని గురించి ఆడవాళ్ళకుండే అభిప్రాయం .. సర్వస్యంగా  భావించడం! అది ఆత్మాభిమానానికీ సంబంధించిన సంస్కారంగా భావిస్తారు. స్వంత ప్రమేయం లేకుండా యాదృచ్ఛికంగా మగాడు చేసే అఘయిత్రయంలో తాను పాపపంకిలం అయినట్లు కాదు . స్త్రీలను ఆవిధంగా ట్యూన్ చేసినవాడు మగవాడే . స్త్రీకి విధిగా ఉండాలని నిర్దేశించే ఆ సోకాల్డ్ ' శీలం ' తనకు మాత్రం ఉండనవసరం లేదా?  


తాము చేయని  తప్పులకు అమాయకంగా తమకు తామే శిక్షలు విధించుకోవడం!  .. కుదరని పక్షంలో  కుమిలిపోవడం ! ఎప్పుడు ఇది సరైన పద్ధతి కాదని అర్థమవుతుందో అప్పటి వరకు ఆ మిషతో మగఓాతి వికృత చర్యల కింద అణగారి పోవడం తప్ప మరో వికాసం ఉండదు. 


శారద అదే కోవలో ఆలోచిస్తోంది . అదే నాభయం ఎక్కడ ఏ అఘా త్యానికి పాల్పడుతుందో!  


ఏది ఏమయినా నేను త్వరగా కోలుకోవాలి . శారద కోసమైనా మళ్లా మనుషుల్లో  పడాలి . జీవితాంతం నేను తనను ప్రేమిస్తూనే ఉంటానని భరోసా కలిపించడం భర్తాగా స్నేహితుడుగా, ప్రేలుకుడుగా తన తక్షణ కర్తవ్యం కూడా! 

శారదను అపరాధ భావన నుంచి విముక్తి చేసేందుకు నేను త్వరగా కోలుకుని తీరుతాను . నాకా నమ్మకం ఉంది. నేను ఆశాశీవిని 

***


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఆంధ్రప్రభ వారపత్రిక - 31 - 12 - 1977 సంచికలో ప్రచురితం ) 




Wednesday, December 22, 2021

కథానిక పనికిరానివాడు - కర్లపాలెం హనుమంతరావు ( ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక- 03-07- 1985 సంచికలో ప్రచురితం )



కథానిక 

పనికిరానివాడు  

- కర్లపాలెం హనుమంతరావు 

( ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక- 03-07- 1985 సంచికలో ప్రచురితం ) 


తాగబోతున్న టీని తిరిగి ఇచ్చే సి వాప సిచ్చిన చెత్త నోటును పట్టుకుని బయలుదేరాను. 


ఈ నోటును మార్చట మెలా? అదీ సమస్య 


కొండపల్లి పోయిందాకా తెలిసిన మొహం లేదే! 


చీరాల బస్సు స్టాండులో చిల్లర కోసం పత్రిక కొనాల్సి వచ్చింది. 


బస్సు బయలుదేరే హడావుడిలో నోటు చూసుకోలేదు. టిక్కెట్టు ఖరీదు ప్లస్ సాదర ఖర్చులు పోనూ మిగిలిందీ నోటు మాత్రమే.


పది పైసలతో  కొండపల్లి చేరటం ఇంపాజి బుల్. 


ఊరుకాని ఊరు. ఈ బెజవాడలో చిక్కడిపో యాను. వెనక్కు పోవటానికి లేదు. ముందుకు సాగటానికి లేదు. 


ఏదో విధంగా ఈ పదిరూపా యల నోటుని మార్చాలి . 


బ్యాంకుల టైము కాదు. సాయంత్రం అయిదున్నరయింది.


(కొన్ని బాంకులు ఉంటాయి గాని, ముక్కూ మొగం తెలీనివాళ్ళ దగ్గర చెత్త నోట్లు ఎక్స్ఛేంజ్ చేస్తాయన్న నమ్మకం లేదు).


చూపు ఉన్న  ఏ సన్నాసీ ఈ నోటును చస్తే తీసుకోడు. పోనీ డిస్కౌంటు రేటుకు ట్రై చేస్తేనో! 


ఎలా అడగటం? ఎవరిని అడగటం? 


విజయ వాడలో నోట్ల ఆసుపత్రి ఉందని విన్నాను. ఎక్క డుందో తెలీదు. ఎవరి నడిగినా ఫలితం లేకపో యింది.


ఎనిమిది గంటల లోపు నేను కొండవల్లి చేరుకో లేకపోతే నా ఈ ప్రయాణం వృథా.


'నువ్వు ప్రయోజకుడివిరా. పైకొస్తావు. డబ్బు సాయం నేను చేస్తాను. బి.ఎ. పరీక్షకు కట్టు' అన్న మేనమాడు ఈ రాత్రే పనిమీద హైద్రాబాదు వెళుతున్నాడు. నెల రోజుల దాకా తిరిగి రాడు. 


పరీక్ష ఫీజు కట్టే సమయం దాటి పోతుందప్పటికైతే. అందుకే హడావుడిగా దొరికిన డబ్బు చేత పుచ్చుకుని కొండపల్లి బయలుదేరాను సాయంత్రం.


'ఈ పది రూపాయల నోటు మార్చలేకపోతే ప్రాక్టికల్ గా  నేను పనికిరాని వాడి కిందే లెక్క. 


ఇంటర్లో సంపాదించుకున్న ఫస్ట్ క్లాసు ఇందుకు ఉపయోగిస్తుందా?' 


రకరకాల ఆలోచనలు... కొన్ని ఆచరించలేనివి.

కొన్ని ఆచరించగలిగినా అంతరాత్మ ఒప్పుకోనివి. 'రిక్షా బేరం చేసుకొని కొంత దూరం పోయి ఈ నోటు ఇస్తేనో ? 


తీసుకోక చస్తాడా? పాపం! కష్టజీవి!


గుడ్డివాడి బొచ్చెలోవేసి చిల్లర తీసుకుంటేనో! 


పదిరూపాయల చిల్లర బొచ్చెలో ఉండదు. అలా తీసుకోవడం ద్రోహం' కూడా! 


ఆలోచనలతో బుర్ర వేడెక్కడమే కాని, ఫలితం లేదు. 


ఎదురుగా లీలా మహల్లో ఏదో ఇంగ్లీషు సినిమా.  రష్ గా ఉంది. 'పోనీ అక్కడ కౌంటర్‌ లో ట్రై చేసి చూస్తేనో! ఆ హడావుడిలో వాడు నోటు చూడవచ్చాడా!' 


రు. 20 కౌంటర్ లో అరగంట నిలబడిన తరువాత కౌంటరు ముందు కొచ్చాను. నోటు తీసి కౌంటర్లోకి తోస్తుంటే గుండె గుబగుబలా ఉంది.


ఇందాక టీ స్టాలు ముందు ఏమీ అనిపించలేదు. అప్పుడు నోటు సంగతి తెలీదు. 


ఇప్పుడు తెలుసు. మోసం... మోసం ... అని అంతరాత్మ ఘోషిస్తూనే ఉంది.


'ఇందులో మోసం ఏముంది? దొంగనోటు కాదు గదా నేనిచ్చేది!' అని మరో వైపునుండి సమర్థన. 


' ఈ నోటు పోదు' అనేశాడు కౌంటర్లో మనిషి కర్కశంగా


గభాలున  చెయ్యి బయటకు తీసేసుకుని మొహం చూపకుండా హాలు బయటకు వచ్చేశాను. 


'ఇంక ఈ నోటును మార్చటం నా వల్ల కాదు. కొండపల్లిదాకా నడిచి పోవడమొక్కటే మార్గం. లేదా.... బెగ్గింగ్...' 


' ఛీ...చీ... ! నా మీద నాకే చచ్చే చిరాకుగా ఉంది.


'టికెట్ కావాలా సార్!' అని పక్క కొచ్చినిలబడ్డాడు ఓ కుర్రాడు. 


పదిహేనేళ్ళుంటాయి. వాడు వేసుకొన్న పట్టీ బనీను మాసి , చినిగి, ముడతలు  పడి అచ్చు నా వదిరూపాయల నోటు లాగే ఉంది.


' 2 - 20 .. ఫోర్ రుపీస్...2-20 . ఫోర్ రుపీ స్ . అని మెల్లగా గొణుగుతున్నాడు.


బ్లాకులో టిక్కెట్లు అమ్ముతున్నాడని తెలుస్తూనే ఉంది' 


' పోనీ నాలుగు రూపాయలకు టిక్కెట్టు కొంటే ! ఆరు రూపాయలన్నా మంచివి వస్తాయి. కొండపల్లిదాకా వెళ్ళవచ్చు. ఎందుకైనా మంచిది ముందే నోటు సంగతి చెప్పి ఇవ్వటం....'


నోటును చూసి ' అయిదు రూపాయ లిస్తాను. సార్!' అన్నాడు ఆ కుర్రాడు. 


నా అవసరాన్ని కనిపెట్టాడు-అవకాశాన్ని ఉపయో

గించుకుంటున్నాడు. అసాధ్యుడు! 


జంకూ గొంకూ లేకుండా తెలిసి తెలిసి ఇలాంటి పరమ చెత్త నోటును తీసుకోవటానికి చాలా సాహనం కావాలి. అందులోనూ ఒక రూపాయి కాదు, రెండు రూపాయలు కాదు... పది రూపాయలు... అతని స్తోమతకు అది చాలా ఎక్కువ. 


టికెట్ ప్లస్ అయిదు రూపాయలు ఇచ్చాడు. వది

రూపాయల నోటు అందుకొని. 


అడగకుండా ఉండలేకపోయాను.' ఈ నోటును నువ్వెలా మారుస్తావోయ్?' 


' అదంతా ట్రేడ్ సెక్రెట్, సార్!' అని నవ్వా డు. 


' చెబితే రూపాయి ఇస్తా!' 


' అయితే, చెప్పను. మీ కంటిముందే మార్చి చూపిస్తా... రెండు రూపాయ లిస్తారా?' అన్నాడు. సవాల్ గా . 


ఎలాగూ నాకీ అయిదు రూపాయలు తిరిగి చీరాల పోను సరిపోవు. కొండపల్లిలో ఎలాగూ తంటాలు పడాల్సిందే. సరే. మరో రూపాయి పారేసి ప్రపంచజ్ఞానం నేర్చుకుంటే పోయేదే ముంది.. ఆ జ్ఞానం  నాకు లేనప్పుడు!


ఒప్పుకున్నాను. 


ఫుట్ పాత్ మీద అడుక్కునే గుడ్డి తాత దగ్గర పాత నోటు మదుపు పెట్టి ఎనిమిది రూపాయలు తెచ్చాడు. 


నన్ను కూడా వెనక నిలబెట్టి రెండు సినిమా టిక్కెట్లు కొన్నాడు. 


చూస్తుండగానే పది నిముషాల్లో ఆ టికెట్లను రెట్టింపు రేటుకు గిట్టించేశాడు. పావు గంటలో అరు రూపాయలు లాభం... అదీ పాత పనికిరాని నోటు పెట్టుబడితో! ....


' అడుక్కునే తాతకు ఆ నోటు మారదు. నువ్వు

పాపం గుడ్డి తాతను మోసం చేశావు' అన్నాను.


' అందరి విషయం మన కనవసరం, సార్! మన పనేదో మనం చూసుకోవాలి. అడిగారు గనుక చెబుతున్నా. తాతకు బాంకులో అకౌంటుంది. ఏ నోటు ఇచ్చినా తీసుకుంటారు. వాడికి రెండు రూపాయలు లాభం. నాకు అయిదు రూపాయలు లాభం... మీకు పని జరిగింది...' 


' ఇంత తెలివైన వాడివి మరెందుక నిలా రోడ్లు పట్టావు! ? ' 


అని అడగకుండా ఉండలేకపోయాను బెట్ పెట్టిన రెండు రూపాయలు అందిస్తూ ఒక రకమైన అడ్మిరేషన్‌ తో. 


వాడు నవ్వాడు మిస్టీరియస్ గా.  'మా అయ్య నన్ను తన్ని తగలేశాడు చదూకోటల్లేదని, ఎందుకూ పనికిరానని...' 


ఉలిక్కిపడ్డాను నేను. 


పనికిరాని వాడు.... అతనా?...నేనా??...


ఎవరు? వాడు చదువుకోలేదు. కనక భేషజం లేదు. 


నేను చదువుకున్నాను. కనక భేషజం నన్ను చొరవ చెయ్యనియ్యలేదు. .


మంచికీ చెడుకూ కూడా పనికిరాని ఈ చదువు పనికిరాని వాడుగా తయారు చేస్తుంది నన్నే...


ఇంకా నాలాంటి వాళ్లు ఎందరో...! 


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఆంధ్రప్రభ వారపత్రిక - 03 -07 - 1985 సంచికలో ప్రచురితం ) 

సేకరణ పాత బంగారం - కథ ఇల్లాలు రచన - వై.ఎస్. ప్రకాశరావు ( ఆంధ్రపత్రిక - వారపత్రిక - సెప్టెంబర్ 29 - 1964 సంచిక )

 పాత బంగారం - కథ 

ఇల్లాలు 

రచన - వై.ఎస్. ప్రకాశరావు 

( ఆంధ్రపత్రిక - వారపత్రిక - సెప్టెంబర్ 29 - 1964 సంచిక ) 


ಆ ఆదివారం . క్రితం రోజు నే జీతాలు ముటాయి. 


అకస్మాత్తుగా పుట్టింది కోరిక . . ఎక్కడికైనా ప్రయాణం చేసిరావాలని. వెంటనే బయలు దేరాను. 


 మెయిల్ లో కాకినాడ వెళ్ళి తిరిగి సాయం కాలానికి వచ్చేదామని. 


నీటుగా కటకప్ చేసుకొని కళ్లకు గాగుల్స్ పెట్టి రిక్షాలో రాజమండ్రి టవున్ స్టేషన్ చేరాను. తీరా వెళ్లేటప్పటికి మెయిల్ గంటలేటు అని తెలుసుకొని ప్రయాణంమీద నిరాశపడ్డాను. 


తిరిగి వెళ్ళిపోదామా అనిపించింది . . పనిలేక ప్రయాణం చేసే నాలాటి ప్రయాణీకుడు పనిపైన ప్రయాణం చేసే ఇతర ప్రయాణీకులను అవస్థ పెట్టటాని కిష్టం లేక. 


కాని ప్రయాణం చెయ్యాలని కోరుతున్న మనస్సును నిరాశ పెట్టడాని కిష్టం లేక వెనుదిరిగి వెళ్ల లేకపోయాను. 


ప్లాట్ ఫారమ్మీద కొంత సేపు తిరిగాను. కాలం గడవటం బహుకష్ట మెంది. ఇంతిలో రోడ్ మీ ద కాఫీ 'కేంటీన్' వైపు దృష్టి మరలింది. 


కేంటీన్ లోకిపోయి కాఫీ తీసుకున్నట్లయితే కొంత కాలం గడుస్తుందికదా అని బయలు దేరి వెళ్ళి 'స్పెషల్ సెక్షన్'లో పంకా క్రింద కూర్చు న్నాను. సర్వర్ కు  కాఫీకి ఆర్డర్ ఇచ్చి గాగుల్సతీసి ముఖంమీది చమటను చేతి రుమాలుతో తుడుచుకుంటుండగా ఆ బల్లకు ఎదురుగా  కూర్చున్న ఓ పెదమనిషి 'ఎక్క డకు వెళ్ళాలి, నాయనా?' అని ప్రశ్నిం చాడు. 


'కాకినాడ వెళ్ళాలి' అని సమాధాన మిచ్చాను.


ఆయన వాలకంచూస్తేనే గవర్నమెంటు ఆఫీసర్ లా కనుపిస్తు న్నాడు. తెల్లని సగం చేతుల చొక్కా, రంగువెలిసిన కాకీ ఫుల్ పేంటులో 'టకప్’ చేసి కళ్ళకు చత్వారంజోడు పెట్టాడు. ఆయన్ను చూడగానే కొంతసేపు ఆయనతో సంభాషణ చేయాలని మనస్సు పుట్టింది. '


' చదువుకుంటున్నావా?' అని మరల ప్రశ్నించాడాయన. '


' లేదు, ఉద్యోగం చేస్తున్నా' నని సమా ధానమిచ్చాను. 


సంతోషమన్నట్లుగా ఆయన ముఖసూచన చేసి మళ్ళీ ప్రశ్నించాడు. 


' ఏడిపార్టుమెంటులో పనిచేస్తున్నావు? ' 


ఆయన వేసే ప్రశ్నలధోరణిచూచి, ఇంకా వివరాలన్నీ కనుక్కుంటాడని ముందుగానే గ్రహించి, ఆయన అడగబోయే వివరాలన్నీ చెప్పేసేను. 


నామాటలు వింటూనే ఆయన ఏదో ఆలోచనలో పడ్డాడు.


'ఏమండీ అలా ఆలోచిస్తున్నారు? నేనేమైనా మీకు తెలుసా?' అని అడిగాను. 


ఆ, ఏమీలేదు, నీవు చెప్పింది వింటూంటే నాకేదో చిన్న నాటి సంఘటన జ్ఞాపకమొస్తున్నది' అన్నా డు గొంతుక సవరించుకుంటూ. 


రైలు కింకా చాల టైమున్నది కదా - ఆయనదగ్గరనుండి తెలుసుకోవాలను కునే లోపు సర్వర్ కాఫీ తీసుకొచ్చి ఇంతలో నాముందు పెట్టాడు. 


ఆ కాఫీ ఆయన కందిస్తూ, మరో కప్పు తీసుకురమ్మని సర్వర్ తో చెప్పాను. 


' నేనిప్పుడే తీసుకున్నా, ఫరవాలే, నీవు తీసుకో! '  అన్నాడాయన. 


కాఫీ ముగించి ఇరువురం బయటకు వచ్చాం. నేను రెండు కిళ్ళీలుకొని ఒకటి ఆయనకిచ్చి రెండవది నేను వేసుకున్నా. నేరుగా స్టేషన్ కు పోయి ప్లాట్ ఫారం చివర్న  ఒక పెద్ద చెట్టు క్రింద ట్రాలీమీద కూర్చున్నాం.


'రిటైరైనారండీ? ' అని ప్రశ్నించాను, విషయ మేమిటో తెలుసుకుందామని.


"

'రేడిపార్టుమెంటులో పనిచేసి రిటైరయ్యానని  ఆయన చెప్పాడు. 


ప్రభుత్వోద్యోగంలో రిటైర్ అయ్యాడు.


' నా విషయం వింటే మీ చిన్న నాటి సంఘటన జ్ఞాపకమొచ్చిం దన్నారు?' అన్నాను.


' అవును. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది. నేను చేసిన పాపం చెప్పుకుంటే నాకూ కొంత మనస్థిమితం కలుగుతుంది. నీకూ ఒక ఉదాహరణగా ఉంటుంది, విను నాయనా! ' అన్నా డాయన. 


ఇంచుమించు ముప్పై సంవత్సరా లుండవచ్చు. ఒకరోజున ఆఫీసు పనిపైన ఒక పల్లెటూరు వెళ్ళా. అప్పటికి సాయంత్రం అయిదుగంటలు కావస్తోంది. గ్రామమునసబు గారింటికి వెళ్ళి నా హోదా చెప్పుకుని నాకు భోజన -పానాదులు సమకూర్చుకున్నా. 


గృహస్థు నలభైయేళ్లు పైబడిన మనిషి. ఇంట్లో ఆయన భార్య, మూడునాలుగేళ్ల ఆడపిల్ల తప్ప మరెవ్వరూ లేరు. 


ఆయన భార్య పెద్ద అందగత్తె కాకపోయినా కురూపి మాత్రం కాదు. ఇరవై సంవత్సరాలు పైబడిఉండవు. ద్వితీయవివాహమనుకోవచ్చు. 


నా స్నాన మైన తరువాత  గృహస్థుతో కలిసి భోజనం ముగించాను. ఆరుబయట వసారాలో నాకు మునసబు గారికి వేర్వేరు మంచాలు వేసి ఆయన భార్య వసారా సనుసరించి మంచం మీద పిల్లను  వేసుకొని పడుకొంది. 


నాకు కావలసిన సౌకర్యా లన్నీ కూడ మునసబుగారు భార్య చేతనే ఏర్పాటు చేయించారు. ఆమెకూడా అరమరిక లేక చాల చనువుగా మసిలింది. 


ఆమె నడవడికనుచూచి నే నామెను తప్పు అర్థం చేసుకున్నాను. 


రాత్రి సరిగా పన్నెండు గంటలు దాటి  ఉంటుందేమో. నాకు మాత్రం నిద్రపట్టలేదు. ప్రక్కను గృహస్థు గాఢనిద్రలో ఉన్నాడు. 


నాకు కలిగిన భావములు నన్ను ఆమెగురించి కలవరపరిచాయి. 


నే నెటువంటి ఉద్రేకానికి గురి అవుతున్నానో నా కప్పటి పరిస్థితులలో తెలియలేదు. నెమ్మదిగా లేచి చూచాను. గృహస్థు గాఢనిద్రలో వున్నా డని నిశ్చయపర్చుకొని, నెమ్మదిగా తడబడు తున్న అడుగులతో గదిలోకి వెళ్ళాను. ఆమె పిల్లపక్కన పడుకుని గాఢం గా నిద్రపోతోంది. నేను వెళ్ళి ఒణకుతున్నా..  ఆమెను తట్టాను . 


ఆమె ఆ నిద్రలో కళ్లు తెరచిరూచి కలవరపడింది. నే నామె చేయి పట్టుకో ప్ర యత్ని చేశాను. ఆమె వొణికిపోతూ "వస్తానుంఉండ ”ని చెప్పి పిల్లతో సహా బయటకు వెళ్ళి తలుపు గొళ్ళెం పెట్టింది .


ఆ రాత్రి నేను పడ్డ అవస్థ భగవంతునికే తెలుసు. మనస్సులో ఏదోభీతి దృఢంగా నాటుకుంది. నేను చేసిన తుచ్ఛమైన పని కి నన్ను నేనే నిందించుకున్నా. 


స్త్రీ మనస్తత్వ మెరక్కుండా ప్రవర్తించి నందుకు నన్ను నేనే తిట్టిపోసుకున్నా. ఆగదిలో నే తెల్లవారేలోగా ప్రాణం విడిచేద్దామా అనిపించింది. 


కాని మళ్ళీతట్టింది. నేను చేసినపని తిన్న ఇంటి వాసాలు లెఖ్క పెట్టటం. వారింట ప్రాణం తీసుకోటం మర్యాదస్తుడైన గృహస్థుకు ప్రాణాపాయం తెచ్చి పెట్టడమే కాక, వారి వంశమర్యాదను భంగపర్చటమని  భావించి వెనుదీశాను. 


గ్రామస్థుల ఎదుట నన్ను నిలదీయగలరని దృఢంగానమ్మాను.  దానితో శరీరం కంపించింది. 


తెల్లవారేలోగా ఇంచు మించు ఇరవై ముప్ఫై సార్లు తలుపులాగి చూచాను, కాని రాలేదు. దానితో మరింత భయపడ్డాను. 


తెల్లవారింది.  వారింట్లో కోడి ఎలుగెత్తి ‘కొక్కురోకో' అని చూసింది. 


అదిరిపడి మళ్ళీ వెళ్ళి తలుపులాగి చూచాను. తలుపు గొళ్లెం  తీసివుంది. 


మునసబు గారు మంచంమీది ఇంకా నిద్రపోతున్నారు. 


ఇలాలు దొడ్లో ఏ దో ఇంటిపని చేసు కుంటోంది. 


నేను గాభరాపడుతూ  సామాన్లు సర్దుకొని  అక్కడ ఉండడానికి ఇష్టం లేక వెంటనే బయలు దేరాను. 


అది గమనించి ఇల్లాలు వెంటనే భర్తను లేపింది. ఆయన లేవటంతో నాకు మరింత గాభరా ఎక్కు వైంది. 


ఆయన మరో గదిలోనికి వెళ్ళి బట్టల సవరించువచ్చి 'ఏమండీ అంత కంగారు పఉతారెందుకు? తాపీగా స్నానంచేసి కాఫీ వెళ్ళండి. అది గృహస్థధర్మం. అన్నాడు . కాని ప్రేమపూర్వకంగా  ఆయన అన్న ఆమాటలతో నాకు  శరీరం దహించుకు పోతున్నట్లయింది. 


ఎట్లాగో ముళ్ళమీద నుంచున్నట్లు వారికోరికను మన్నించి తరువాత వెళ్తూ ' వెళ్ళొస్తాను చెల్లెమ్మా' అన్నాను. 


' వెళ్లి రాండి అన్నయ్య గారూ! ' అందిఇల్లాలు. నాకామాట బల్లెంతో పొడిచినట్లయింది.


వెళ్ళి వెంటనే ఆత్మహత్య చేసుకోవడం మంచిదనిపించింది. 


స్త్రీ మనస్తత్వం నీకు తెలియంది కాదు, నాయనా. సంవత్సరాలనుండి ఈ విషయం జ్ఞాపకమొచ్చినప్పుడల్లా నేను చేసినతప్పు   ఎవరికి  చెప్పి పశ్చాత్తాపం పొంది దాని ద్వారా కొంత మనఃస్తిమితం కలుగ చేసుకుంటున్నాను'  అని ఆయన కథ ముగించాడు. 


అప్పట్లో ఆయన ముఖం చూస్తే నాకే జాలి వేసింది. 


ఓ విధంగా ఓదార్చకపోతే బాగుండదని మొదలు పెట్టా.

' తప్పు మానవుడు చెయ్యకపోతే పశువు  చేస్తుందిటండీ? చేసిందానికి మీరు పశ్చా త్తాపం చెప్పుకోనే చెప్పుకుంటున్నారు. చేసిన తప్పు ఈ రోజుల్లో ఎవరు చెప్పు కుంటారండీ? మీరు చేసినపాపం చెప్పు కున్నందువల్ల అప్పుడే పోయింది. ' అని సముదాయించేప్పటికి ఆయనముఖంలో కొంత వికాసం కన్పించింది. . ' 


' నాయనా!  యువకుడవు. నాకథ జ్ఞాపకముంచుకోవడం  నీకు మంచిది  నాయనా.; . అని తలవంచుకుని మౌనంగా కూర్చున్నాడు. 


నేను ఆలోచనలో పడ్డాను, ఆయన చెప్పిన సంఘటనలో ఆయన పడ్డ అవస్థకన్న ఆ ఇల్లాలి తెలివి తేటలు, సహనం ఆలోచనలు ప్రథమ స్థానం  పొందాయి. ఎంతో  నేర్పరితనంగా తన మానం  రక్షించుకొని అతిథిని అగౌరవపర్చ కుండా పంపింది! 


ఆడవాళ్ళందరూ అంత తెలివిగా ఉంటే ప్రపంచ మే బాగుపడి పోను- అనిపించింది.


రచన - వై.ఎస్. ప్రకాశరావు 

( ఆంధ్రపత్రిక - వారపత్రిక - సెప్టెంబర్ 29 - 1964 సంచిక ) 


Sunday, December 19, 2021

వెల్లుల్లి .. నీరుల్లి - కథలు - కర్లపాలెం హనుమంతరావు ( ఒక జానపద కథ ఆధారంగా )

వెల్లుల్లి .. నీరుల్లి - కథలు 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఒక జానపద కథ ఆధారంగా ) 



పూర్వం మన దేశంలో అవుమాంసం తినేవారు. మన కనేక విధాల సహాయపడే ఆవును చంపి తినడం న్యాయమేనా అని ఒక రోజున రాజు గారు ఆలోచించారు. ఆవును చంపడం చాలా తప్పని తోచింది రాజుగారికి, తక్షణమే మంత్రిని పిలిచి గోమాంస మెవరూ తినకూడదనీ, తినిన వారికి ఉరి శిక్ష విధించబడుననీ దండోరా వేయించమని ఆజ్ఞాపించారు.


ప్రజలందరికీ రాజాజ్ఞ ప్రకటితమైంది. అందరూ గోవును చంపడం మానేశారు. కాని ఒకాయన గోమాంసం తినకుండా ఉండలేకపోయాడు. ఎవరూ చూడకుండా రహస్యంగా ఆవును చంపేసి దాని గిట్టలు భూమిలో పాతేశాడు. ఆయన గిట్టలు పాతిపెట్టిన చోటునుండి, ఒక మొలక వచ్చింది.

ఆడే వెల్లుల్లి, ఆవు గిట్టలనుండి పుట్టింది. కనక వాటిలాగా వెలుల్లి  నాలుపాయలుగా ఉంటుంది. ఇదీ వెల్లుల్లి జీవిత రహస్యం.


ఇంక నీరుల్లి సంగతి: 


ఒకరోజున కాయగూరలన్నీ సభ చేశాయి. 

వంకాయ లేచి సభికులనందరినీ ఉద్దే శిస్తూ ఇలా అంది.


"స్నేహితులారా ! ఇవాళ మన మందరం ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషం. అన్ని దేశాలకీ రాజు మానవలోకంలోనూ, దేవలోకంలోనూ కూడా ఉన్నారు. ఒక్క మనలోనే లేరు. అన్ని దేశాల వలె మనకికూడా రాజుంటే బాగుం టుంది.”


అందరూ వంకాయఅభిప్రాయానికి సంతోషించారు. గుమ్మడి, పొట్ల కాయలు వచ్చి వంకాయ ఉద్దేశాన్ని బలపరిచాయి.


మిరపకాయ లేచి, “వంకాయగారు చెప్పినది, సత్యమే. మనకికూడా రాజు కావాలి. ఈ విష యం అందరూ గుర్తించి ఒప్పుకొన్నందుకు చాలా సంతోషం. కాని రా జెవరిని చెయ్యాలో చర్చించాల్సిన విషయం.” అని చెప్పి కూర్చుంది.


మిరపకాయ తెలివితేటల కందరూ మెచ్చుకున్నారు. తర్వాత వంకాయ, "భగవంతుడు పుట్టుకతో టే నాకు కిరీట మిచ్చాడు. మీ అందరికన్న నాలో సార మెక్కువ. రుచి అధికము. వంకాయ ఇష్టము లేనివా రెవరైనా ఉన్నారా? కనక నేను రాజపదవి కర్హుడనని తలచుచున్నాను” అని పలికింది.


పొట్లకాయ వెంటనే లేచి, “వంకా యగారు పొరబడినారు. నేను చాలా భారీగా ఉంటాను. అందంగా ఉంటాను. నన్ను మర్చిపోయి, తనకు రాజలక్షణా లున్నా యనుకుని అలా చెప్పి ఉంటా రు” అని యథాస్థానంలో కూర్చుంది.


రాజెవరో తేలలేదు. ఎవరికివారే తాము రాజపదవికితగుదు మని వాదించారు. గుమ్మిడికాయ, “సోదరులా రా మన మిట్లు వాదించుకోవడం అనవసరంగా  దెబ్బలాట?  మనని పుట్టించిన బ్రహ్మ దేవుణ్ణి నిర్ణయించమందాం,' అంది. దానికి అందరూ అంగీకరించారు.


బ్రహ్మ దేవునివద్దకుపయాణమైవెళ్లారు. మార్గమధ్యంలోనే దొండకాయ పండిపోయింది. పొట్లకాయ కుళ్లి పోయింది. మిరపకాయ, వంకాయ  ఒడిలిపోయాయి. అలాగే అన్నీ కలిసి బ్రహ్మదేవుడిదగ్గర కెళ్లాయి.


బ్రహ్మ దేవుడు వారి తగవు విని, "మీకూ పుట్టిందీ ఈ జబ్బు! పదవీవ్యా మోహం, మానవులకే అనుకున్నా; నిద్రకళ్లతో సృష్టించి ఉంటా మిమ్మల్ని" అని నసుక్కున్నాడు. 


బ్రహ్మదేవుడు గుమ్మడిని   రాజు చేద్దా మనుకున్నాడు. కాని తనయెదుట నిర్లక్ష్యంగా అంతఠీవిగా కూర్చున్నందుకాయనకి కోపం వచ్చింది. నలుగురి మధ్యనూ ఒదిగిఉన్న ఉల్లిపాయని ఆయన చూశాడు. దానిని వినమ్రతకి బ్రహ్మదేవుడెంతో సంతోషించాడు. ఉల్లిపాయని నిర్ణయించాడు. అందరికీ కోపం వచ్చింది. 'ఛీ ఇదా మా రాజ'ని అన్నీ చీదరించుకున్నాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ఉల్లికి పల్చటి రేకులాటి వస్త్రాలిచ్చాడు. శంఖచక్రా లిచ్చాడు. అందుకనే ఉల్లి నడ్డంగా తరిగితే చక్రం, నిలువుగా తరిగితే శంఖం కనిపిస్తాయి.


***

- కర్లపాలెం హనుమంతరావు 

( ఒక జానపద కథ ఆధారంగా ) 

Saturday, December 18, 2021

పాత బంగారం - కథ అల్లుడి అలక - మారుతి ( ఆంధసచిత్రవారపత్రిక 28-6-63) సేకరణ- కర్లపాలెం హనుమంతరావు





పాత బంగారం - కథ 

అల్లుడి అలక 

- మారుతి 

( ఆంధసచిత్రవారపత్రిక 28-6-63) 

సేకరణ- కర్లపాలెం హనుమంతరావు 


విడిదిలో పెళ్ళికొడుకు అలిగి కూచున్నాడు. మగ పెళ్ళివారు భోజనాలకు రామని భీష్మించుకుని కూర్చున్నారు. 


పెళ్ళికొడుకు తల్లి చీర చెంగుతో ముక్కు తుడుచుకుంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నది. మొహ మంతా కందగడ్డ చేసుకుని పక్కనే కూచున్న ఇద్దరు కూతుళ్ళు ఏవో చెప్పుతూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు.


ఉదయం పది గంటల ఏడు నిముషాలకు సూత్ర ధారణ జరిగింది.  ఆ తర్వాత ఆరంభ మయిందీ ప్రచ్ఛన్న యుద్ధం!


వెంకయ్యవంతులుగారు కాలు కాలిన పిల్లిలాగ తిరుగుతున్నారు . . పెళ్ళివారిని శాంత పరచాలని. అయిన ఖర్చు అవుతూ ఈ అల్లరి ఏమిటని ఆయన బాధ.


పెళ్లి పందిట్లో ఎవరో అన్నారుట "అందుకే సాంప్రదాయం చూసి చేసుకోవాలని. ఒక మంచీ మర్యాదా ఏమీలేదు. మెహం వాచినట్టు ఆ ఫలహారాలకు ఎగబడడ మేమిటి- తింటూ ఆ వంకలు పెట్టడమేమిటి" అని.


'ఆడ పెళ్ళివారు ఇలాంటి మాటలతో అవమానం చేస్తారా' అని, మగ పెళ్ళివారు అలిగారు. 


వెంకయ్యవంతులుగా రసలే ముక్కోపి.  అయినా మనిషిలో ఎంతో మార్పు కనిపించిం దా సమయంలో! ఎర్ర పట్టుబట్ట కట్టుకుని తెల్లటి జరీ అంచు పట్టు ఉత్తరీయం మీద వేసు కుని విడిదికి బయలుదేరుతుంటే 'అసలే ఈయనది దుడుకు స్వభావం. లేనిపోని గొడవలు చేసి రసాభాసం చేస్తాడేమో'నని వెంట ఆయన తోడల్లుడు సుందరామయ్య కూడ వెళ్ళాడు.


వెంకయ్య పంతులుగారు నవ్వుముఖంతో ప్రాధేయ పూర్వకంగా వియ్యంకుడి చేతులు పట్టుకుని బ్రతిమలాడారు.' 'ఎవరో ఏదో అన్నారని ఇలా భోజనాలు చెయ్యకుండా ఉండటం న్యాయమా చెప్పండి బావగారూ! మేముగా ఏమయివా తెలియక పొరపాటున చేసి ఉంటే చెప్పండి; క్షమాపణలు కోరుకుంటాను"    


ఆయనంటున్న మాటలకు వియ్యపురాలి పక్కన కూచున్న ఎవరో ఒకావిడ లోపలినుంచి అన్న మాటలు వినిపించాయి. 


' ఎవరో ఏదో అంటే మా కెందు కింత బాధ ! పెళ్ళికూతురికి స్వయాన అమ్మమ్మట ఆ మాట అన్నది. మేమేమీ తిండికి మొహంవాచి రాలేదు.  మా మంచీ మర్యాదా మీచేత పరీక్ష చేయించుకో టానికి రాలేదు'


'ఆవిడ పెద్దది. తొందరలో ఏదో అని ఉంటుంది. ఆమె మాటలు అంతగా పట్టించుకోవా ల్సిన పనిలేదు. ఇక భోజనాలకు లేవండి బావ గారూ ! 'విస్తళ్ళు వేశారు. వడ్డించడానికి సిద్ధంగా ఉన్నారక్కడ. మీరు లేవాలి పంతులుగారు ప్రాధేయపడ్డారు. 


ఇక వెంకయ్య వెంట వచ్చిన సుందరామయ్యకు తను ఎన్నడూ చూడని సౌమ్యత ఆయనలో చూస్తుంటే ఆశ్చర్యం వేసింది.


' అనే మాటలు వేసి తొందరలో అన్నది —— పెద్దది అంటే ఎలాగండి, మా కెంత కష్టంగా ఉందో ఆలోచించారా మరి!' వరండాలో స్తంభానికి ఆనుకుని కూచుని పుగాకు చుట్ట చుట్టు కుంటున్న ఒక బంధువు ఎదురుప్రశ్న వేశాడు. ఆ విడిదిలో ఉన్నవాళ్ళు మూడు వంతు లకు పయిగా ఉదయం ఏడుగంటలనుండి అప్పటి దాకా ఆడ పెళ్ళివారికి కబుర్లు మీద కబుర్లు పెట్టి తెప్పించుకున్న ఇడ్లీ - ఉప్మా, కాఫీ నాలుగైదు సార్లయినా ఖాళీ చేశారు.


ఇదంతా చూసి ఆ ముసలావిడకు వళ్ళుమండి పోయి, ఆ మాట అన్నది, అయిదోసారి కాపీ గుండిగ పట్టించుకు పోదామని వచ్చిన ఆమె వినేట్లుగా! 


విడిది ఒకవేపుగా మంచంమీద "స్నేహితులతో ముచ్చట్లాడుతున్నాడు పెళ్లి కొడుకు . 


'రేడియో అడగరా మీ మామను .' 'రేడియో కమ్   ట్రాన్సిస్టరడగరా ఇప్పుడు గాకపోతే ఇంకెప్పుడిస్తాడు ?' అని సలహాలిస్తున్నారు

మిత్రులు. 


' ఆయన్ని మనవేపు రానీ అసలు' పెళ్ళికొడుకు సందేహం వెళ్ళబుచ్చాడు.


'ఓరి చవటా! అప్పుడే నీరు గారి  పోతావేమిరా ! ఆయన వచ్చి 'లేవోయ్ భోజనానికి' అని అనగానే లేచి ఆయన వెంట పరిగెత్తక. కొంచెం బెట్టు చెయ్యి. మిగతా సంగతి మేము పూర్తి చేస్తాము ' అని ధైర్యం చెప్పారు మిత్రులు. పెళ్ళికొడుకు అంగీకార సూచకంగా బుర్ర ఊపాడే గాని తన వయిపువాళ్ళు ఒక పట్టాన తెగనిచ్చేటట్టు కనబడలేదు వ్యవహారం.'


మామగారు ఒంటరిగాడయిపోయినాడు. బతిమలాడుతున్న కొద్దీ తీరుబడిగా విజృంభిస్తున్నారు. ఎవరికి తోచినట్లు వారు, 


వెంకయ్య పంతులు గారు క్షణక్షణానికి సహనం

కోల్పోతున్నారు. అయినా తప్పదు ! ఇటు వంటి సమయాల్లోనే ఓర్పు, నేర్పు అవసరం! ఇదే తను తలపెట్టిన శుభకార్యం ! అంతా నవ్యంగా జరిగిపోయిందనుకుంటే, సరీగా భోజ వాల ముందు పేచీ వచ్చిపడింది. 


అసలు వాళ్ళని మాట్లాడనివ్వకుండ ఉన్నవాళ్ళు తలా ఒక మాట విసురుతున్నారు. వియ్యంకుడు ఎటూ చెప్పలేక గుంజాటన పడుతున్నాడు. పెళ్ళి చేసి చూడు; ఇల్లు కట్టిచూడు అన్నారందుకే! 


వేలకు వేలు డబ్బు ఖర్చయినా వచ్చే మాట రానేవస్తుంది. వెంకయ్య పంతులుగారి వివాహంలో తనవాళ్ళు ఇంతకన్న ఎక్కువ అల్లరే చేశారు. పాపం! 

ఆయన మామగారు ఆరితేరిన అనుభవజ్ఞుడు కావడంచేత అన్నీ సునాయాసంగా సమర్థించుకుపోయాడు. ప్రతిదానికి అడుగడు గునా వంకలు పెట్టటమే మగపెళ్ళివారు. అప్పుడు జరిగిన దానికంటే ఇప్పటి పరిస్థితిలో ఎన్నో ఆ విషయం జ్ఞాపకంవచ్చి ఆయన కోపాన్నంతా దిగమింగుకుని వియ్యంకుడిని, ఆయన బంధులవును సమాధాన పరచాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. 


ఒక అరగంట జరిగిందీ వరసన. ఎంత సేవ యినా, మళ్ళీ మొదటికే వస్తున్నదీ వ్యవహారం!


భోజనాలకు లేచే  వాతావరణం ఎక్కడా కనిపించనే  లేదు. ఆలస్యం జరుగుతున్నకొద్దీ విడిదిలో ఏం జరుగుతున్నదో తెలుసుకుందామని పెళ్ళివారింటి నుంచి ఒకరి తర్వాత ఒకరు చేరుకుంటున్నారు. 


' సరే మీరంత పట్టుదల పడితే ఏం చెయ్యగలను ? 

నేనూ ఇక్కడే కూచుంటాను' అని వెంకయ్య పంతులుగారు వియ్యంకుడి పక్కనే కూచున్నారు. ఆయన తోడల్లుడు సుందరామయ్యకు మాత్రం సహనం నశించింది. 


 'వీళ్ళు మనుషులా లేక కారణ రాక్షసులా' అనిపించిందాయనకు. 


వెంకయ్య పంతులుగారు కూచోవడం గమనించిన ఒక బంధువు 'మీరు అనే మాటలు బాగానే ఉన్నాయి గానీండి; తప్పంతా మాదే నుంటారు  ఇంతకీ !' అన్నాడు అయిదోసారి పుచ్చుకున్న కాఫీ వెళ్ళి. టిఫిను పీకదాకా ఎగదన్నుతుంటే తాపీగా కంఠం సరిజేసుకుంటూ.


ఇంక లాభం లేదనుకున్నాడు సుందరామయ్య. కూచున్న వాడల్లా దిగ్గున లేచి 'అన్నమాటలేవో  అన్నాము. కావాలని మేమే ఆ ముసలమ్మచేత అని పించాము. సరా !.... ఇప్పుడు మీరు భోజనాలకు పదండి లేస్తారా లేవరా ! ఒక్కటే మాట. రెండు నిము షాలే టయిము' అన్నాడు హెచ్చు స్వరంతో.


ఆయన ముఖ కవళికలు చూసి అక్కడ అందరూ హడలిపోయారు. అప్పటిదాకా ఒకళ్ళ కొకళ్ళు సంబంధం లేకుండా మాట్లాడుకుంటున్న

మాటలతో రణగొణ ధ్వనిగా ఉన్న విడిది నిశ్శబ్దంగా

అయిపోయింది.


ఆడవాళ్ళంతా గజగజలాడారు. పెళ్ళికొడుకు గుండెల్లో రాయిపడింది. వెంకయ్య పంతులుగారు పరిస్థితి అర్థం చేసుకుని నవ్వుతూనే తోడల్లుని సమీపించి 'తొందరపడకు తమ్ముడూ!' అన్నారు.


' మీరూరుకోండి అన్నగారూ ! క్షమించండి. అంతకంటే ఏమీ చెప్పలేను' అని కోపంతో వెంకయ్యవంతులుగార్ని తప్పించుకుని రెండడుగులు ముందుకు వేసి 'అందరి మర్యాదా మంట కలసిపోకముందే - భోజనాలకు నడవండి - ఏమండి వియ్యంకుడుగారూ చూస్తారేం ?...  ఒరేయ్ చెంచయ్యా ! భజంత్రీలను  రమ్మను— మేళం చెయ్యమను... ' ఆజ్ఞలు సుందరామయ్య. జారీచేశాడు 'లేవలేకపోతే ఏం జేస్తాడో!' అని ఒకమూల నుంచి అన్న మాటలు ఆయన చెవుల్లో పడ్డాయి. 'నేనేం చేస్తానో, చేయిస్తానో మీతో చెప్పి చేయవలసిన అవసరం నా కేమిలేదు. మూర్ఖంగా ప్రవర్తించక హృదయమున్న మనుషుల్లాగా  ప్రవర్తించండి!' గర్జించాడు. 

 ఇంతలో చెంచయ్య అందించిన ప్రకారం బాజా భజంత్రీలు వచ్చి విడిదిముందు నిలిచారు. 


ఆశ్చర్య మేమిటంటే వెంకయ్య పంతులుగారు కూడ తన తోడల్లుని వేపు చూడడానికి సాహసించలేకపోయారు. 


అప్పటిదాకా కుడితిలో పడిన ఎలుకలాగా కొట్టుకుంటున్న వియ్యంకుడు లేచి లోపలికి వెళ్ళి 'నే చెబితే విన్నారుటమ్మా !.... సవ్యంగా సాగిపోతున్న దానికి ఒక మెలిక వేస్తిరి. ఇప్పుడు అవమానం పాలయ్యేది వాళ్లా మనమా! అసలే పల్లెటూరు ఇది. పదిమందిని పిలిచి మనమీదకు ఉసిగొలిపితే ఇక్కడ మన పరువేంకావాలి !.... ఆయన చూడు — వీరభద్రుడి అవతారం ఎత్తాడు !" అని మొత్తుకున్నాడు. 


దానితో ఎవరి మటుకు వాళ్ళు తెలివి తెచ్చుకుని లేనిపోనిది భలానా వాళ్ళ పెళ్ళికి వెళ్ళి చావు దెబ్బలు తిని వచ్చారంటూ - కలగబోయే అపనిందకు జంకి భోజనాలకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. 


సుందరరామయ్య  విడిదంతా కలియ చూశాడు. అందరూ లేచి సిద్ధ మవుతున్నారు గాని పెళ్ళి కొడుకు మాత్రం నడిమంచం మీద కూచున్నాడు తిష్ట  వేసుకుని.

' ఏమిషర్లేలే! వాళ్ళంతా బయలుదేరారు. ఇప్పటికే కాలాతీత మయిపోయింది' అన్నాడు సుందరామయ్య పెళ్ళికొడుకు దగ్గరకు

వెళ్ళి.

ప్రళయం సరాసరి తవమీదికే వచ్చినందుకు ఆలోచించే వ్యవధికూడ దొరక్క ఠపీమని లేచి నుంచున్నాడు పెళ్ళికొడుకు . పక్కనున్న స్నేహితులు నొక్కి పెడుతున్నా వినకండా; వూడిపోతున్న మధుపర్కం సరిజేసుకుంటూ 'అబ్బే నాదేముంది, ' అన్నాడు.


అందరినీ కూడగట్టుకుని పెళ్ళివారింటికి చేరేలోగా ఈ వార్త పాక్కిపోయింది పెళ్ళి సందిట్లో సందరామయ్య అంతపని చెయ్యగలిగాడా! అనేదే ప్రతివారిని ఆశ్చర్యపరిచిన విషయం.


భయంతో భోజనాలకు బయలుదేరారే గాని మగ పెళ్ళివారి కిది అవమానకరంగానే తోచింది. పౌరుషం పెరిగింది. భోజనాల దగ్గర గొడవ చేసి ప్రతీకారం తీర్చుకోవాలని ఎవరి మటుకు వారు నిశ్చయించుకున్నారు. కొంతమంది బయటికే అనుకున్నారు. అవి మెల్లిగా పాకి మగ పెళ్ళివారి కంటె ముందుగానే వెంకయ్యవంతులుగారింటి చేరినయి.


ముహూర్త బలం మంచిది కాదన్నారు. అంతా సవ్యంగా అయిపోయిందని సంతోషిస్తుంటే ఈ కొసరు ఏమిటని బాధ వ్యక్తం చేశారు. సాంప్రదాయం అవీ చూడకుండ సంబంధం కలిపితే ఇట్లాగే ఉంటుందని వ్యాఖ్యానించారు కొందరు.


'ఇటువంటి వాళ్ళతో ఎట్లా నెగ్గుకు వస్తుందో పాపం జానకి!' అని పెళ్ళికుమార్తె మీద సానుభూతి చూపించారు.


సుందరామయ్య ఇంట్లో వాళ్ళందరికీ ధైర్యం చెప్పాడు: 'మీరేం భయపడద్దు మీ పని మీరు కాని

వ్వండి' అన్నాడు. వెంకయ్య పంతులుగారు మాత్రం “లేనిపోని గొడవ ఏమిటిది సుందర్రామయ్యా!” అని చేతులు పట్టుకున్నాడు ఎటూ పాలుపోక, 'మీరేం భయపడకండి. అంతా జరిగిపోయేట్లు చూచే భారం నాది' అన్నాడు సుందరరామయ్య. 


అల్లరి చేద్దామనుకున్న వాళ్ళెవరూ నోరెత్త లేదు భోజనాల దగ్గర. దానికి కారణం మందరామయ్య అడుగడుగునా ప్రత్యక్షమవుతుండటమే.


అంతా సక్రమంగానే జరిగిపోయింది గాని, పెళ్లి కొడుకు కోరికే ఇంకా కొరవ ఉండిపోయింది. స్నేహితులు, అప్పచెల్లెళ్ళూ కాకుల్లా పొడవటం మొదలుపెట్టారు పెళ్ళికొడుకు రామారావును.


“వాళ్ళు అన్నమాటలకే తలవంపులుగా ఉంటే, నవ్వు చవటలాగ ఇలా వూరుకోవటం ఏమీ బాగాలేదు. ఫలానావాడి పెళ్ళికి వెళ్ళి, అవమానం పాలయి వచ్చామని మేము ఏ మొహం పెట్టుకుని చెప్పుకోము.'' ఇట్లా రామారావు చెవిని ఇల్లు గట్టుకుని పోరారు. 'ఏమయినా సరే, అలక పానుపుమీద విలువయిన వస్తువేదయినా కోరాల్సిందే!' అని రూలింగ్ ఇచ్చారు.


సాయంత్రం అయిదు గంటలయింది.


ఆడ పెళ్ళివారు ఘనంగా అయిదు వందల రూపాయలు ఖర్చుపెట్టి రకరకాలుగా అలంకరించిన కారు మాట్లాడారు ఊరేగింపుకు; ఫుల్ బ్యాండు సెట్టుకూడా ఏర్పాటు చేశారు.


కాని, పెళ్ళికొడుకు అలిగాడు! ఆరు గంటలు అయినా, పెళ్ళికొడుకు పట్టెమంచంమీద బైఠాయింపు సమ్మె చేస్తున్నాడు !


వెంకయ్య పంతులుగారు తల పెట్టినది ఇదే మొదటి శుభకార్యం, జానకి ఆయన ప్రథమ సంతానం . కలిగినంతలో గొప్ప సంబంధం తెచ్చి చెయ్యా అని రెండు సంవత్సరాలపాటు గాలించి ఆఖరికి ఈ సంబంధం స్థిరపరుచుకున్నారు అన్ని విధాలా నచ్చటంచేత.


అల్లుడు డిగ్రీ పుచ్చుకున్నవాడని, కొద్దిపాటి అదీ ఉన్నది, అత్తమామలు ఉన్న కుటుంబం గనుక అమ్మాయి సుఖపడుతుందనడంలో సందేహం లేదని వెంకయ్య అనుకుని పంతులుగారు నిశ్చయిం చుకుని ముందుగా నిర్ణయించుకున్న లోపాయికారి కట్నంలో అయిదువేలరూపాయలు లగ్నాలు పెట్టుకున్నప్పుడే ఇచ్చేశారు. అదిగాక ఆడబడుచుల లాంఛనాలకింద వెయ్యి రూపాయలు, పెళ్ళి కుమారుడికి వెండికంచం - పట్టు బట్టలకు బదులు సూటు, రిస్టువాచీ  లగ్న మప్పుడు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అనుకున్న ప్రకారం అన్నీ సక్రమంగా జరిపారు.


ఇంత ఖర్చు భరించడానికి ఆయన సంతోషంతో తప్పుకోడానికి కారణం ప్రథమ సంతాన మయిన జానకి - వివాహం ఘనంగా జరిపించాలని సంకల్పించడమే ! అప్పటికే నాలుగు వేలు అప్పు  తగిలింది ఆయనకు.

అల్లుడు అలిగాడనగానే  పరిగెత్తుకుంటూ ఉత్తరీయం సరిజేసుకుంటూ వెళ్ళారు.

' ఏం నాయనా! ఏమిటి సంగతి' అని నవ్వు తూనే అడిగారు.

నూనె తడిలేక కళ్ళ మీదకు పడుతున్న జుట్టును చేత్తో పయికి నెట్టడానికి వృథా ప్రయత్నం చేస్తూ ముఖం చిట్లించి  కోపం నటించాడు రామారావు. చేతికున్న కొత్త రిస్టువాచీకి ఉత్తుత్తి ‘కి' ఇచ్చాడు కాసేపు.


వీడెటూ చెప్పలేడని  గ్రంహించిన పక్కనున్న స్నేహితుడు 'వాడు అలిగాడండీ! అడగటానికి మొహమాటపడుతున్నాడు' అన్నాడు. 'అనుకున్న ప్రకారం అన్నీ ఇచ్చాను గదుటోయ్! ఇంకా ఏమిటి అవతల ఊరేగింపుకు టయిము అయిపోతున్నది' అన్నారు వంతులుగారు బతిమాలుతున్న ధోరణిలో.


ఉదయమే, ఆడబడుచు కట్నంలో తన వాటాకు వచ్చిన రెండువందలూ పుచ్చుకుని పెట్టెలో దాచుకున్న పెళ్ళికొడుకు అప్పగారు "వేడుకలన్నీ జరిపి తీరాల్సిందే ! అదేమన్నమాటండోయ్ !" ఇవ్వాళ కాకపోతే ఇంకెప్పుడు చెల్లుతయి వాడి ముచ్చట్లు మాత్రం ! ఈ కాస్తా అయిపోతే ఆ తర్వాత మీరేం పెడతారో, వాడేం తీసుకుటాండో మే మేమన్నా చూడొచ్చామా .. అడగొచ్చామా' అన్నది తమ్ముడికి వత్తాసిగా. భళిభళి అన్నారు ఇంకో ఇద్దరు ఆమె అన్న దానికి.


కుడితిలో పడిన ఎలుకలాగ అయింది వెంకయ్య పంతులుగారి పని. చుట్టూ ఆడవాళ్ళ మెజారిటీయే ఎక్కువగా ఉంది. అప్పటికే ఖర్చులన్నీ కలిసి తలకు మోపెడయినయి. ఇంకా ఇంకా ఒక దాని కొకటి ఇట్లా పెరిగిపోతుంటే ఎట్లాగని ఆలోచిస్తున్న ఆయన చెవులకు 'అడగరా ! మళ్ళీ అవతల ఊరేగింపుకు వేళవుతున్నదని సుందర్రా మయ్యగారొచ్చి  బెదిరిస్తే మళ్ళీ కష్టం' అన్న మాటలు వినిపించినయి.


'ఏమడగనూ నా మొహం ' అని జుట్టు పై కి నెట్టుకుని 'స్కూటరు' అన్నాడు రామారావు. వెంకయ్య పంతులుగారు నీళ్ళు గారిపోయారు. రెండువేల అయిదు వందల రూపాయలు ఆయన కళ్ళముందు మెదిలినయి . పసిపిల్లవాడు కారు కొని పెట్టమన్నట్టుగా ఉన్నది అల్లుడు 'స్కూటరు' కొనిపెట్ట మనటం ! అతనేమంత అజ్ఞావా! తెలివితక్కువ వాడా! అన్నీ తెలిసే అట్లా అడుగుతున్నాడు. ఆయనకు చాలా బాధ కలిగింది. పయిగా వియ్యపు రాలు, వియ్యంకుడు తమ కివేమీ పట్టనట్టు

కొంచెం దూరంగా కూచున్నారు వేడుక చూస్తూ. రాని  నవ్వును బలవంతాన తెచ్చి పెట్టుకు కుని 'చూడు రామారావ్ ! కష్ట సుఖాలు తెలిసినవాడివి;

చదువుకున్నవాడివి. అందుచేత దాపరికం లేకుండా చెబుతున్నాను. 'స్కూటరు' అంటే వందా రెండు వందలకు వచ్చే వస్తువేమీకాదు. అంత పెద్దగా కోరటం బాగాలేదు. ఏదో నాకు తోచింది నేను సంతోషంగా ఇస్తాను తీసుకో !' అని వంద రూపాయల నోటు ఇవ్వబోయారు పంతులుగారు.


కళ్ళమీద పడిన జుట్టులోంచి వందరూపాయల నోటువేపు చూసి తటపటాయించాడు రామారావు, 'టు బీ ఆర్ నాట్ టు బి' అనే ముక్క జ్ఞాపకం వచ్చి.


'బాగుందిరోయ్ వరస.  చావుకు పెడితే లంకణాని కన్నట్టు — ఇదేమిటి!' అన్నా డొక మిత్రుడు మెంటులాగ పళ్ళన్నీ వెళ్ళబెట్టి. ఇవేమీ వినిపించుకో 

కుండ, పంతులుగారు అల్లుడిని సమాధాన పరచ డానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం మెల్లగా  పాకింది పెళ్ళిఇంటికి. పందిరి చల్లదనంలో  విశ్రాంతిగా  పడుకుని ఆడవాళ్ళతో సరదాగా

మాట్లాడుతున్న నుందరరామయ్య గుర్రుమన్నాడు. 

"వీళ్ళు మనుషులా కట్నమిచ్చి, సలక్షణ మయిన పిల్లనిచ్చి అన్ని లాంఛనాలతో పెళ్ళి చేస్తే ఇంకా గొంతెమ్మ కోరికలకు అంతెక్కడ!' అని చిందులెయ్యడం మొదలుపెట్టాడు.


మాతన వధువు జానకి కళ్ళ నీళ్ళ పర్యంత మయింది. ఇంత హృదయంలేని మనుషులు కూడ ఉంటారా లోకంలో, అనుకుంది. తన తండ్రి ఎంత సరదా పడుతున్నాడో, అంత కించ పరుస్తు న్నారు.  పెళ్ళివారు వచ్చిన దగ్గర నుంచీ కోరిక  కోరికలకు కూడ మితముండాలి ! ఇష్టంవచ్చినట్టు 'నాకు రైలు కావాలి, విమానం కావాలి' అంటే, ఎక్కడి మంచి తేగలరు ఎవరు మటుకు! జానకిని మూగ బాధ ఆవరించింది. ఎంతో మధురమయినదిగా ఊహించుకున్న వివాహం ఇంత జుగుప్సాకరంగా ఉంటుందమకోని జానకి బాధపడింది.


సందరామయ్య లేచి విడిదికి వెళ్ళబోతుంటే జానకి భయపడింది. 'బాబాయ్! ఒక్క మాట' అని పిలిచి గదిలో నుంచి ఇవతలకువచ్చి, సుందర్రా మయ్య దూకుడుగా వెళ్ళబోతున్న వాడల్లా  వెనక్కు తిరిగి జానకి దగ్గరికి వెళ్ళి "ఏంమ్మా'  అన్నాడు. జానకి మొహం చిన్నబోయి ఉన్నది.


'అంతా విన్నాను బాబాయి ! ఇటువంటి మను ష్యులనుకోలేదు' ఇప్పుడు నువ్వు వెళ్లి నోరు చేసు కుంటే, అల్లరి అవటం తప్ప మరేంలేదు' అని కాసేపు తటపటాయించి 'ఇదిగో బాబాయ్ ఎవరికీ తెలీకుండ ఈ కాగితం వారికి అందజేయి. ఇదే నిన్ను కోరేది' అన్నది జానకి కాగితం మడత ఆయన

చేతుల్లో పెడుతూ,


సుందరామయ్య ఆ కాగితం అందుకున్నాడు, ఆయనలో రేగిన కోపం చల్లారింది. ముఖం ప్రశాంత మయింది.' 'అలాగే తల్లీ " అని జానకి తల నిమిరి విడిదివేపు దారితీశాడు.


ఈయన్ని చూస్తూనే అలక పాన్పున లంక రించిన పెళ్ళికొడుకు— చుట్టూ చేరిన సగంమంది వెనక్కి తగ్గారు.  ఇవ్వేమీ పట్టించుకో కుండా, 'ఏమిటి' మామా అల్లుడు మంతనా లాడుతున్నారు తీరిగ్గా' అన్నాడు సుందరామయ్య అతి ప్రశాంతంగా నవ్వుతూ.


'అబ్బే ఏముందీ !.... అల్లుడు ఏదో వేడుక కొద్దీ కోరాడు. ఆ విషయంమీదే మాట్లాడు తున్నాం' అన్నారు వెంకయ్య పంతులుగారు నుదిటి మీద పట్టిన చెమట తుడుచుకుంటూ. అప్పటికే ఆయన సహనం చచ్చిపోయింది.


సుందరామయ్య నవ్వుతూ పెళ్ళికొడుకు పక్కగా మంచంమీద కూచున్నాడు. లోపల పీచుపీచుమంటున్నా, పయికి బింకంగానే కూచు. న్నాడు రామారావు.


మంచంచుట్టూ అందరి మొహాలూ సావధానంగా చూసి, సుందరామయ్య పెళ్ళికొడుకు చెవులో రెండు మాటలు రహస్యంగా చెప్పి, కాగితం మడత అతని చేతుల్లో ఉంచాడు.


పెళ్ళికొడుకు రెండు క్షణాలు చలనం లేకుండ అట్లాగే కూర్చుని మంచంమీద నుంచి దిగి 'ఇప్పుడే

వస్తానురా' అని మిత్రులకు సంజ్ఞ చేసి, బాత్ రూమ్ లోకి వెళ్ళి కాగితం మడత విప్పి చదువు కున్నాడు. ఆ వెంటనే 'ఛీఛీ'! అనుకున్నాడు. పశ్చాత్తాప పడ్డాడు. చేదుమందు మింగినవాడిలా మెహంపెట్టి, ఆ కాగితం అతి భద్రంగా దాచు కున్నాడు.' ఎంత తప్పుపని చేశాను' అనుకున్నాడు.


సబ్బుతో కసాబిసా మొహమంతా కున్నాడు. గదిలోకి వెళ్ళి రెండు నిముషాల్లో డ్రమ్ చేసుకుని వూరేగింపుకు సిద్ధమయి బయటికి వచ్చిన పెళ్ళికొడుకుని చూసి సుందరామయ్య మినహా అందరూ ఆశ్చర్యపోయారు.


'అప్పుడే అలక తీరిందా ఏమిట్రా' అన్నారు. మిత్రులు.


'ఆ! తీరినట్టే!' అన్నాడు ముక్తసరిగా, అలంకరించిఉన్న కారువేపు నడుస్తూ. వెంకయ్యపంతులుగారు అయోమయంగా తోడల్లుని వేపు చూశారు. 'అదంతా ఉందిలేండి అన్నగారూ' అని నిండుగా నవ్వాడు సుందర్రామయ్య. అప్పుడే విడుదలయిన కొత్త సినిమాలో పాట అందుకున్నారు బ్యాండువాళ్ళు.


ఊరేగింపు కారు బయలుదేరుతున్నదన్నారు. అందరూ సంబర పడిపోయి. - పెళ్ళికూతురు సిగ్గు దొంతరలతో హంసలా నడిచివచ్చి కారులో కూర్చుంది తన హృదయేశ్వరుని పక్కన హృదయమంతా మల్లెపందిరి కాగా..


పెళ్ళికొడుకులో హఠాత్తుగా ఇంత మార్పు రావటానికి కారణం ఏమిటో ఎంత తల బద్దలు కొట్టుకున్నా, అర్థం కాలేదు ఎవరికీ.


😊😊😊


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...