పాత బంగారం - కథ
అల్లుడి అలక
- మారుతి
( ఆంధసచిత్రవారపత్రిక 28-6-63)
సేకరణ- కర్లపాలెం హనుమంతరావు
విడిదిలో పెళ్ళికొడుకు అలిగి కూచున్నాడు. మగ పెళ్ళివారు భోజనాలకు రామని భీష్మించుకుని కూర్చున్నారు.
పెళ్ళికొడుకు తల్లి చీర చెంగుతో ముక్కు తుడుచుకుంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నది. మొహ మంతా కందగడ్డ చేసుకుని పక్కనే కూచున్న ఇద్దరు కూతుళ్ళు ఏవో చెప్పుతూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు.
ఉదయం పది గంటల ఏడు నిముషాలకు సూత్ర ధారణ జరిగింది. ఆ తర్వాత ఆరంభ మయిందీ ప్రచ్ఛన్న యుద్ధం!
వెంకయ్యవంతులుగారు కాలు కాలిన పిల్లిలాగ తిరుగుతున్నారు . . పెళ్ళివారిని శాంత పరచాలని. అయిన ఖర్చు అవుతూ ఈ అల్లరి ఏమిటని ఆయన బాధ.
పెళ్లి పందిట్లో ఎవరో అన్నారుట "అందుకే సాంప్రదాయం చూసి చేసుకోవాలని. ఒక మంచీ మర్యాదా ఏమీలేదు. మెహం వాచినట్టు ఆ ఫలహారాలకు ఎగబడడ మేమిటి- తింటూ ఆ వంకలు పెట్టడమేమిటి" అని.
'ఆడ పెళ్ళివారు ఇలాంటి మాటలతో అవమానం చేస్తారా' అని, మగ పెళ్ళివారు అలిగారు.
వెంకయ్యవంతులుగా రసలే ముక్కోపి. అయినా మనిషిలో ఎంతో మార్పు కనిపించిం దా సమయంలో! ఎర్ర పట్టుబట్ట కట్టుకుని తెల్లటి జరీ అంచు పట్టు ఉత్తరీయం మీద వేసు కుని విడిదికి బయలుదేరుతుంటే 'అసలే ఈయనది దుడుకు స్వభావం. లేనిపోని గొడవలు చేసి రసాభాసం చేస్తాడేమో'నని వెంట ఆయన తోడల్లుడు సుందరామయ్య కూడ వెళ్ళాడు.
వెంకయ్య పంతులుగారు నవ్వుముఖంతో ప్రాధేయ పూర్వకంగా వియ్యంకుడి చేతులు పట్టుకుని బ్రతిమలాడారు.' 'ఎవరో ఏదో అన్నారని ఇలా భోజనాలు చెయ్యకుండా ఉండటం న్యాయమా చెప్పండి బావగారూ! మేముగా ఏమయివా తెలియక పొరపాటున చేసి ఉంటే చెప్పండి; క్షమాపణలు కోరుకుంటాను"
ఆయనంటున్న మాటలకు వియ్యపురాలి పక్కన కూచున్న ఎవరో ఒకావిడ లోపలినుంచి అన్న మాటలు వినిపించాయి.
' ఎవరో ఏదో అంటే మా కెందు కింత బాధ ! పెళ్ళికూతురికి స్వయాన అమ్మమ్మట ఆ మాట అన్నది. మేమేమీ తిండికి మొహంవాచి రాలేదు. మా మంచీ మర్యాదా మీచేత పరీక్ష చేయించుకో టానికి రాలేదు'
'ఆవిడ పెద్దది. తొందరలో ఏదో అని ఉంటుంది. ఆమె మాటలు అంతగా పట్టించుకోవా ల్సిన పనిలేదు. ఇక భోజనాలకు లేవండి బావ గారూ ! 'విస్తళ్ళు వేశారు. వడ్డించడానికి సిద్ధంగా ఉన్నారక్కడ. మీరు లేవాలి పంతులుగారు ప్రాధేయపడ్డారు.
ఇక వెంకయ్య వెంట వచ్చిన సుందరామయ్యకు తను ఎన్నడూ చూడని సౌమ్యత ఆయనలో చూస్తుంటే ఆశ్చర్యం వేసింది.
' అనే మాటలు వేసి తొందరలో అన్నది —— పెద్దది అంటే ఎలాగండి, మా కెంత కష్టంగా ఉందో ఆలోచించారా మరి!' వరండాలో స్తంభానికి ఆనుకుని కూచుని పుగాకు చుట్ట చుట్టు కుంటున్న ఒక బంధువు ఎదురుప్రశ్న వేశాడు. ఆ విడిదిలో ఉన్నవాళ్ళు మూడు వంతు లకు పయిగా ఉదయం ఏడుగంటలనుండి అప్పటి దాకా ఆడ పెళ్ళివారికి కబుర్లు మీద కబుర్లు పెట్టి తెప్పించుకున్న ఇడ్లీ - ఉప్మా, కాఫీ నాలుగైదు సార్లయినా ఖాళీ చేశారు.
ఇదంతా చూసి ఆ ముసలావిడకు వళ్ళుమండి పోయి, ఆ మాట అన్నది, అయిదోసారి కాపీ గుండిగ పట్టించుకు పోదామని వచ్చిన ఆమె వినేట్లుగా!
విడిది ఒకవేపుగా మంచంమీద "స్నేహితులతో ముచ్చట్లాడుతున్నాడు పెళ్లి కొడుకు .
'రేడియో అడగరా మీ మామను .' 'రేడియో కమ్ ట్రాన్సిస్టరడగరా ఇప్పుడు గాకపోతే ఇంకెప్పుడిస్తాడు ?' అని సలహాలిస్తున్నారు
మిత్రులు.
' ఆయన్ని మనవేపు రానీ అసలు' పెళ్ళికొడుకు సందేహం వెళ్ళబుచ్చాడు.
'ఓరి చవటా! అప్పుడే నీరు గారి పోతావేమిరా ! ఆయన వచ్చి 'లేవోయ్ భోజనానికి' అని అనగానే లేచి ఆయన వెంట పరిగెత్తక. కొంచెం బెట్టు చెయ్యి. మిగతా సంగతి మేము పూర్తి చేస్తాము ' అని ధైర్యం చెప్పారు మిత్రులు. పెళ్ళికొడుకు అంగీకార సూచకంగా బుర్ర ఊపాడే గాని తన వయిపువాళ్ళు ఒక పట్టాన తెగనిచ్చేటట్టు కనబడలేదు వ్యవహారం.'
మామగారు ఒంటరిగాడయిపోయినాడు. బతిమలాడుతున్న కొద్దీ తీరుబడిగా విజృంభిస్తున్నారు. ఎవరికి తోచినట్లు వారు,
వెంకయ్య పంతులు గారు క్షణక్షణానికి సహనం
కోల్పోతున్నారు. అయినా తప్పదు ! ఇటు వంటి సమయాల్లోనే ఓర్పు, నేర్పు అవసరం! ఇదే తను తలపెట్టిన శుభకార్యం ! అంతా నవ్యంగా జరిగిపోయిందనుకుంటే, సరీగా భోజ వాల ముందు పేచీ వచ్చిపడింది.
అసలు వాళ్ళని మాట్లాడనివ్వకుండ ఉన్నవాళ్ళు తలా ఒక మాట విసురుతున్నారు. వియ్యంకుడు ఎటూ చెప్పలేక గుంజాటన పడుతున్నాడు. పెళ్ళి చేసి చూడు; ఇల్లు కట్టిచూడు అన్నారందుకే!
వేలకు వేలు డబ్బు ఖర్చయినా వచ్చే మాట రానేవస్తుంది. వెంకయ్య పంతులుగారి వివాహంలో తనవాళ్ళు ఇంతకన్న ఎక్కువ అల్లరే చేశారు. పాపం!
ఆయన మామగారు ఆరితేరిన అనుభవజ్ఞుడు కావడంచేత అన్నీ సునాయాసంగా సమర్థించుకుపోయాడు. ప్రతిదానికి అడుగడు గునా వంకలు పెట్టటమే మగపెళ్ళివారు. అప్పుడు జరిగిన దానికంటే ఇప్పటి పరిస్థితిలో ఎన్నో ఆ విషయం జ్ఞాపకంవచ్చి ఆయన కోపాన్నంతా దిగమింగుకుని వియ్యంకుడిని, ఆయన బంధులవును సమాధాన పరచాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు.
ఒక అరగంట జరిగిందీ వరసన. ఎంత సేవ యినా, మళ్ళీ మొదటికే వస్తున్నదీ వ్యవహారం!
భోజనాలకు లేచే వాతావరణం ఎక్కడా కనిపించనే లేదు. ఆలస్యం జరుగుతున్నకొద్దీ విడిదిలో ఏం జరుగుతున్నదో తెలుసుకుందామని పెళ్ళివారింటి నుంచి ఒకరి తర్వాత ఒకరు చేరుకుంటున్నారు.
' సరే మీరంత పట్టుదల పడితే ఏం చెయ్యగలను ?
నేనూ ఇక్కడే కూచుంటాను' అని వెంకయ్య పంతులుగారు వియ్యంకుడి పక్కనే కూచున్నారు. ఆయన తోడల్లుడు సుందరామయ్యకు మాత్రం సహనం నశించింది.
'వీళ్ళు మనుషులా లేక కారణ రాక్షసులా' అనిపించిందాయనకు.
వెంకయ్య పంతులుగారు కూచోవడం గమనించిన ఒక బంధువు 'మీరు అనే మాటలు బాగానే ఉన్నాయి గానీండి; తప్పంతా మాదే నుంటారు ఇంతకీ !' అన్నాడు అయిదోసారి పుచ్చుకున్న కాఫీ వెళ్ళి. టిఫిను పీకదాకా ఎగదన్నుతుంటే తాపీగా కంఠం సరిజేసుకుంటూ.
ఇంక లాభం లేదనుకున్నాడు సుందరామయ్య. కూచున్న వాడల్లా దిగ్గున లేచి 'అన్నమాటలేవో అన్నాము. కావాలని మేమే ఆ ముసలమ్మచేత అని పించాము. సరా !.... ఇప్పుడు మీరు భోజనాలకు పదండి లేస్తారా లేవరా ! ఒక్కటే మాట. రెండు నిము షాలే టయిము' అన్నాడు హెచ్చు స్వరంతో.
ఆయన ముఖ కవళికలు చూసి అక్కడ అందరూ హడలిపోయారు. అప్పటిదాకా ఒకళ్ళ కొకళ్ళు సంబంధం లేకుండా మాట్లాడుకుంటున్న
మాటలతో రణగొణ ధ్వనిగా ఉన్న విడిది నిశ్శబ్దంగా
అయిపోయింది.
ఆడవాళ్ళంతా గజగజలాడారు. పెళ్ళికొడుకు గుండెల్లో రాయిపడింది. వెంకయ్య పంతులుగారు పరిస్థితి అర్థం చేసుకుని నవ్వుతూనే తోడల్లుని సమీపించి 'తొందరపడకు తమ్ముడూ!' అన్నారు.
' మీరూరుకోండి అన్నగారూ ! క్షమించండి. అంతకంటే ఏమీ చెప్పలేను' అని కోపంతో వెంకయ్యవంతులుగార్ని తప్పించుకుని రెండడుగులు ముందుకు వేసి 'అందరి మర్యాదా మంట కలసిపోకముందే - భోజనాలకు నడవండి - ఏమండి వియ్యంకుడుగారూ చూస్తారేం ?... ఒరేయ్ చెంచయ్యా ! భజంత్రీలను రమ్మను— మేళం చెయ్యమను... ' ఆజ్ఞలు సుందరామయ్య. జారీచేశాడు 'లేవలేకపోతే ఏం జేస్తాడో!' అని ఒకమూల నుంచి అన్న మాటలు ఆయన చెవుల్లో పడ్డాయి. 'నేనేం చేస్తానో, చేయిస్తానో మీతో చెప్పి చేయవలసిన అవసరం నా కేమిలేదు. మూర్ఖంగా ప్రవర్తించక హృదయమున్న మనుషుల్లాగా ప్రవర్తించండి!' గర్జించాడు.
ఇంతలో చెంచయ్య అందించిన ప్రకారం బాజా భజంత్రీలు వచ్చి విడిదిముందు నిలిచారు.
ఆశ్చర్య మేమిటంటే వెంకయ్య పంతులుగారు కూడ తన తోడల్లుని వేపు చూడడానికి సాహసించలేకపోయారు.
అప్పటిదాకా కుడితిలో పడిన ఎలుకలాగా కొట్టుకుంటున్న వియ్యంకుడు లేచి లోపలికి వెళ్ళి 'నే చెబితే విన్నారుటమ్మా !.... సవ్యంగా సాగిపోతున్న దానికి ఒక మెలిక వేస్తిరి. ఇప్పుడు అవమానం పాలయ్యేది వాళ్లా మనమా! అసలే పల్లెటూరు ఇది. పదిమందిని పిలిచి మనమీదకు ఉసిగొలిపితే ఇక్కడ మన పరువేంకావాలి !.... ఆయన చూడు — వీరభద్రుడి అవతారం ఎత్తాడు !" అని మొత్తుకున్నాడు.
దానితో ఎవరి మటుకు వాళ్ళు తెలివి తెచ్చుకుని లేనిపోనిది భలానా వాళ్ళ పెళ్ళికి వెళ్ళి చావు దెబ్బలు తిని వచ్చారంటూ - కలగబోయే అపనిందకు జంకి భోజనాలకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు.
సుందరరామయ్య విడిదంతా కలియ చూశాడు. అందరూ లేచి సిద్ధ మవుతున్నారు గాని పెళ్ళి కొడుకు మాత్రం నడిమంచం మీద కూచున్నాడు తిష్ట వేసుకుని.
' ఏమిషర్లేలే! వాళ్ళంతా బయలుదేరారు. ఇప్పటికే కాలాతీత మయిపోయింది' అన్నాడు సుందరామయ్య పెళ్ళికొడుకు దగ్గరకు
వెళ్ళి.
ప్రళయం సరాసరి తవమీదికే వచ్చినందుకు ఆలోచించే వ్యవధికూడ దొరక్క ఠపీమని లేచి నుంచున్నాడు పెళ్ళికొడుకు . పక్కనున్న స్నేహితులు నొక్కి పెడుతున్నా వినకండా; వూడిపోతున్న మధుపర్కం సరిజేసుకుంటూ 'అబ్బే నాదేముంది, ' అన్నాడు.
అందరినీ కూడగట్టుకుని పెళ్ళివారింటికి చేరేలోగా ఈ వార్త పాక్కిపోయింది పెళ్ళి సందిట్లో సందరామయ్య అంతపని చెయ్యగలిగాడా! అనేదే ప్రతివారిని ఆశ్చర్యపరిచిన విషయం.
భయంతో భోజనాలకు బయలుదేరారే గాని మగ పెళ్ళివారి కిది అవమానకరంగానే తోచింది. పౌరుషం పెరిగింది. భోజనాల దగ్గర గొడవ చేసి ప్రతీకారం తీర్చుకోవాలని ఎవరి మటుకు వారు నిశ్చయించుకున్నారు. కొంతమంది బయటికే అనుకున్నారు. అవి మెల్లిగా పాకి మగ పెళ్ళివారి కంటె ముందుగానే వెంకయ్యవంతులుగారింటి చేరినయి.
ముహూర్త బలం మంచిది కాదన్నారు. అంతా సవ్యంగా అయిపోయిందని సంతోషిస్తుంటే ఈ కొసరు ఏమిటని బాధ వ్యక్తం చేశారు. సాంప్రదాయం అవీ చూడకుండ సంబంధం కలిపితే ఇట్లాగే ఉంటుందని వ్యాఖ్యానించారు కొందరు.
'ఇటువంటి వాళ్ళతో ఎట్లా నెగ్గుకు వస్తుందో పాపం జానకి!' అని పెళ్ళికుమార్తె మీద సానుభూతి చూపించారు.
సుందరామయ్య ఇంట్లో వాళ్ళందరికీ ధైర్యం చెప్పాడు: 'మీరేం భయపడద్దు మీ పని మీరు కాని
వ్వండి' అన్నాడు. వెంకయ్య పంతులుగారు మాత్రం “లేనిపోని గొడవ ఏమిటిది సుందర్రామయ్యా!” అని చేతులు పట్టుకున్నాడు ఎటూ పాలుపోక, 'మీరేం భయపడకండి. అంతా జరిగిపోయేట్లు చూచే భారం నాది' అన్నాడు సుందరరామయ్య.
అల్లరి చేద్దామనుకున్న వాళ్ళెవరూ నోరెత్త లేదు భోజనాల దగ్గర. దానికి కారణం మందరామయ్య అడుగడుగునా ప్రత్యక్షమవుతుండటమే.
అంతా సక్రమంగానే జరిగిపోయింది గాని, పెళ్లి కొడుకు కోరికే ఇంకా కొరవ ఉండిపోయింది. స్నేహితులు, అప్పచెల్లెళ్ళూ కాకుల్లా పొడవటం మొదలుపెట్టారు పెళ్ళికొడుకు రామారావును.
“వాళ్ళు అన్నమాటలకే తలవంపులుగా ఉంటే, నవ్వు చవటలాగ ఇలా వూరుకోవటం ఏమీ బాగాలేదు. ఫలానావాడి పెళ్ళికి వెళ్ళి, అవమానం పాలయి వచ్చామని మేము ఏ మొహం పెట్టుకుని చెప్పుకోము.'' ఇట్లా రామారావు చెవిని ఇల్లు గట్టుకుని పోరారు. 'ఏమయినా సరే, అలక పానుపుమీద విలువయిన వస్తువేదయినా కోరాల్సిందే!' అని రూలింగ్ ఇచ్చారు.
సాయంత్రం అయిదు గంటలయింది.
ఆడ పెళ్ళివారు ఘనంగా అయిదు వందల రూపాయలు ఖర్చుపెట్టి రకరకాలుగా అలంకరించిన కారు మాట్లాడారు ఊరేగింపుకు; ఫుల్ బ్యాండు సెట్టుకూడా ఏర్పాటు చేశారు.
కాని, పెళ్ళికొడుకు అలిగాడు! ఆరు గంటలు అయినా, పెళ్ళికొడుకు పట్టెమంచంమీద బైఠాయింపు సమ్మె చేస్తున్నాడు !
వెంకయ్య పంతులుగారు తల పెట్టినది ఇదే మొదటి శుభకార్యం, జానకి ఆయన ప్రథమ సంతానం . కలిగినంతలో గొప్ప సంబంధం తెచ్చి చెయ్యా అని రెండు సంవత్సరాలపాటు గాలించి ఆఖరికి ఈ సంబంధం స్థిరపరుచుకున్నారు అన్ని విధాలా నచ్చటంచేత.
అల్లుడు డిగ్రీ పుచ్చుకున్నవాడని, కొద్దిపాటి అదీ ఉన్నది, అత్తమామలు ఉన్న కుటుంబం గనుక అమ్మాయి సుఖపడుతుందనడంలో సందేహం లేదని వెంకయ్య అనుకుని పంతులుగారు నిశ్చయిం చుకుని ముందుగా నిర్ణయించుకున్న లోపాయికారి కట్నంలో అయిదువేలరూపాయలు లగ్నాలు పెట్టుకున్నప్పుడే ఇచ్చేశారు. అదిగాక ఆడబడుచుల లాంఛనాలకింద వెయ్యి రూపాయలు, పెళ్ళి కుమారుడికి వెండికంచం - పట్టు బట్టలకు బదులు సూటు, రిస్టువాచీ లగ్న మప్పుడు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అనుకున్న ప్రకారం అన్నీ సక్రమంగా జరిపారు.
ఇంత ఖర్చు భరించడానికి ఆయన సంతోషంతో తప్పుకోడానికి కారణం ప్రథమ సంతాన మయిన జానకి - వివాహం ఘనంగా జరిపించాలని సంకల్పించడమే ! అప్పటికే నాలుగు వేలు అప్పు తగిలింది ఆయనకు.
అల్లుడు అలిగాడనగానే పరిగెత్తుకుంటూ ఉత్తరీయం సరిజేసుకుంటూ వెళ్ళారు.
' ఏం నాయనా! ఏమిటి సంగతి' అని నవ్వు తూనే అడిగారు.
నూనె తడిలేక కళ్ళ మీదకు పడుతున్న జుట్టును చేత్తో పయికి నెట్టడానికి వృథా ప్రయత్నం చేస్తూ ముఖం చిట్లించి కోపం నటించాడు రామారావు. చేతికున్న కొత్త రిస్టువాచీకి ఉత్తుత్తి ‘కి' ఇచ్చాడు కాసేపు.
వీడెటూ చెప్పలేడని గ్రంహించిన పక్కనున్న స్నేహితుడు 'వాడు అలిగాడండీ! అడగటానికి మొహమాటపడుతున్నాడు' అన్నాడు. 'అనుకున్న ప్రకారం అన్నీ ఇచ్చాను గదుటోయ్! ఇంకా ఏమిటి అవతల ఊరేగింపుకు టయిము అయిపోతున్నది' అన్నారు వంతులుగారు బతిమాలుతున్న ధోరణిలో.
ఉదయమే, ఆడబడుచు కట్నంలో తన వాటాకు వచ్చిన రెండువందలూ పుచ్చుకుని పెట్టెలో దాచుకున్న పెళ్ళికొడుకు అప్పగారు "వేడుకలన్నీ జరిపి తీరాల్సిందే ! అదేమన్నమాటండోయ్ !" ఇవ్వాళ కాకపోతే ఇంకెప్పుడు చెల్లుతయి వాడి ముచ్చట్లు మాత్రం ! ఈ కాస్తా అయిపోతే ఆ తర్వాత మీరేం పెడతారో, వాడేం తీసుకుటాండో మే మేమన్నా చూడొచ్చామా .. అడగొచ్చామా' అన్నది తమ్ముడికి వత్తాసిగా. భళిభళి అన్నారు ఇంకో ఇద్దరు ఆమె అన్న దానికి.
కుడితిలో పడిన ఎలుకలాగ అయింది వెంకయ్య పంతులుగారి పని. చుట్టూ ఆడవాళ్ళ మెజారిటీయే ఎక్కువగా ఉంది. అప్పటికే ఖర్చులన్నీ కలిసి తలకు మోపెడయినయి. ఇంకా ఇంకా ఒక దాని కొకటి ఇట్లా పెరిగిపోతుంటే ఎట్లాగని ఆలోచిస్తున్న ఆయన చెవులకు 'అడగరా ! మళ్ళీ అవతల ఊరేగింపుకు వేళవుతున్నదని సుందర్రా మయ్యగారొచ్చి బెదిరిస్తే మళ్ళీ కష్టం' అన్న మాటలు వినిపించినయి.
'ఏమడగనూ నా మొహం ' అని జుట్టు పై కి నెట్టుకుని 'స్కూటరు' అన్నాడు రామారావు. వెంకయ్య పంతులుగారు నీళ్ళు గారిపోయారు. రెండువేల అయిదు వందల రూపాయలు ఆయన కళ్ళముందు మెదిలినయి . పసిపిల్లవాడు కారు కొని పెట్టమన్నట్టుగా ఉన్నది అల్లుడు 'స్కూటరు' కొనిపెట్ట మనటం ! అతనేమంత అజ్ఞావా! తెలివితక్కువ వాడా! అన్నీ తెలిసే అట్లా అడుగుతున్నాడు. ఆయనకు చాలా బాధ కలిగింది. పయిగా వియ్యపు రాలు, వియ్యంకుడు తమ కివేమీ పట్టనట్టు
కొంచెం దూరంగా కూచున్నారు వేడుక చూస్తూ. రాని నవ్వును బలవంతాన తెచ్చి పెట్టుకు కుని 'చూడు రామారావ్ ! కష్ట సుఖాలు తెలిసినవాడివి;
చదువుకున్నవాడివి. అందుచేత దాపరికం లేకుండా చెబుతున్నాను. 'స్కూటరు' అంటే వందా రెండు వందలకు వచ్చే వస్తువేమీకాదు. అంత పెద్దగా కోరటం బాగాలేదు. ఏదో నాకు తోచింది నేను సంతోషంగా ఇస్తాను తీసుకో !' అని వంద రూపాయల నోటు ఇవ్వబోయారు పంతులుగారు.
కళ్ళమీద పడిన జుట్టులోంచి వందరూపాయల నోటువేపు చూసి తటపటాయించాడు రామారావు, 'టు బీ ఆర్ నాట్ టు బి' అనే ముక్క జ్ఞాపకం వచ్చి.
'బాగుందిరోయ్ వరస. చావుకు పెడితే లంకణాని కన్నట్టు — ఇదేమిటి!' అన్నా డొక మిత్రుడు మెంటులాగ పళ్ళన్నీ వెళ్ళబెట్టి. ఇవేమీ వినిపించుకో
కుండ, పంతులుగారు అల్లుడిని సమాధాన పరచ డానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం మెల్లగా పాకింది పెళ్ళిఇంటికి. పందిరి చల్లదనంలో విశ్రాంతిగా పడుకుని ఆడవాళ్ళతో సరదాగా
మాట్లాడుతున్న నుందరరామయ్య గుర్రుమన్నాడు.
"వీళ్ళు మనుషులా కట్నమిచ్చి, సలక్షణ మయిన పిల్లనిచ్చి అన్ని లాంఛనాలతో పెళ్ళి చేస్తే ఇంకా గొంతెమ్మ కోరికలకు అంతెక్కడ!' అని చిందులెయ్యడం మొదలుపెట్టాడు.
మాతన వధువు జానకి కళ్ళ నీళ్ళ పర్యంత మయింది. ఇంత హృదయంలేని మనుషులు కూడ ఉంటారా లోకంలో, అనుకుంది. తన తండ్రి ఎంత సరదా పడుతున్నాడో, అంత కించ పరుస్తు న్నారు. పెళ్ళివారు వచ్చిన దగ్గర నుంచీ కోరిక కోరికలకు కూడ మితముండాలి ! ఇష్టంవచ్చినట్టు 'నాకు రైలు కావాలి, విమానం కావాలి' అంటే, ఎక్కడి మంచి తేగలరు ఎవరు మటుకు! జానకిని మూగ బాధ ఆవరించింది. ఎంతో మధురమయినదిగా ఊహించుకున్న వివాహం ఇంత జుగుప్సాకరంగా ఉంటుందమకోని జానకి బాధపడింది.
సందరామయ్య లేచి విడిదికి వెళ్ళబోతుంటే జానకి భయపడింది. 'బాబాయ్! ఒక్క మాట' అని పిలిచి గదిలో నుంచి ఇవతలకువచ్చి, సుందర్రా మయ్య దూకుడుగా వెళ్ళబోతున్న వాడల్లా వెనక్కు తిరిగి జానకి దగ్గరికి వెళ్ళి "ఏంమ్మా' అన్నాడు. జానకి మొహం చిన్నబోయి ఉన్నది.
'అంతా విన్నాను బాబాయి ! ఇటువంటి మను ష్యులనుకోలేదు' ఇప్పుడు నువ్వు వెళ్లి నోరు చేసు కుంటే, అల్లరి అవటం తప్ప మరేంలేదు' అని కాసేపు తటపటాయించి 'ఇదిగో బాబాయ్ ఎవరికీ తెలీకుండ ఈ కాగితం వారికి అందజేయి. ఇదే నిన్ను కోరేది' అన్నది జానకి కాగితం మడత ఆయన
చేతుల్లో పెడుతూ,
సుందరామయ్య ఆ కాగితం అందుకున్నాడు, ఆయనలో రేగిన కోపం చల్లారింది. ముఖం ప్రశాంత మయింది.' 'అలాగే తల్లీ " అని జానకి తల నిమిరి విడిదివేపు దారితీశాడు.
ఈయన్ని చూస్తూనే అలక పాన్పున లంక రించిన పెళ్ళికొడుకు— చుట్టూ చేరిన సగంమంది వెనక్కి తగ్గారు. ఇవ్వేమీ పట్టించుకో కుండా, 'ఏమిటి' మామా అల్లుడు మంతనా లాడుతున్నారు తీరిగ్గా' అన్నాడు సుందరామయ్య అతి ప్రశాంతంగా నవ్వుతూ.
'అబ్బే ఏముందీ !.... అల్లుడు ఏదో వేడుక కొద్దీ కోరాడు. ఆ విషయంమీదే మాట్లాడు తున్నాం' అన్నారు వెంకయ్య పంతులుగారు నుదిటి మీద పట్టిన చెమట తుడుచుకుంటూ. అప్పటికే ఆయన సహనం చచ్చిపోయింది.
సుందరామయ్య నవ్వుతూ పెళ్ళికొడుకు పక్కగా మంచంమీద కూచున్నాడు. లోపల పీచుపీచుమంటున్నా, పయికి బింకంగానే కూచు. న్నాడు రామారావు.
మంచంచుట్టూ అందరి మొహాలూ సావధానంగా చూసి, సుందరామయ్య పెళ్ళికొడుకు చెవులో రెండు మాటలు రహస్యంగా చెప్పి, కాగితం మడత అతని చేతుల్లో ఉంచాడు.
పెళ్ళికొడుకు రెండు క్షణాలు చలనం లేకుండ అట్లాగే కూర్చుని మంచంమీద నుంచి దిగి 'ఇప్పుడే
వస్తానురా' అని మిత్రులకు సంజ్ఞ చేసి, బాత్ రూమ్ లోకి వెళ్ళి కాగితం మడత విప్పి చదువు కున్నాడు. ఆ వెంటనే 'ఛీఛీ'! అనుకున్నాడు. పశ్చాత్తాప పడ్డాడు. చేదుమందు మింగినవాడిలా మెహంపెట్టి, ఆ కాగితం అతి భద్రంగా దాచు కున్నాడు.' ఎంత తప్పుపని చేశాను' అనుకున్నాడు.
సబ్బుతో కసాబిసా మొహమంతా కున్నాడు. గదిలోకి వెళ్ళి రెండు నిముషాల్లో డ్రమ్ చేసుకుని వూరేగింపుకు సిద్ధమయి బయటికి వచ్చిన పెళ్ళికొడుకుని చూసి సుందరామయ్య మినహా అందరూ ఆశ్చర్యపోయారు.
'అప్పుడే అలక తీరిందా ఏమిట్రా' అన్నారు. మిత్రులు.
'ఆ! తీరినట్టే!' అన్నాడు ముక్తసరిగా, అలంకరించిఉన్న కారువేపు నడుస్తూ. వెంకయ్యపంతులుగారు అయోమయంగా తోడల్లుని వేపు చూశారు. 'అదంతా ఉందిలేండి అన్నగారూ' అని నిండుగా నవ్వాడు సుందర్రామయ్య. అప్పుడే విడుదలయిన కొత్త సినిమాలో పాట అందుకున్నారు బ్యాండువాళ్ళు.
ఊరేగింపు కారు బయలుదేరుతున్నదన్నారు. అందరూ సంబర పడిపోయి. - పెళ్ళికూతురు సిగ్గు దొంతరలతో హంసలా నడిచివచ్చి కారులో కూర్చుంది తన హృదయేశ్వరుని పక్కన హృదయమంతా మల్లెపందిరి కాగా..
పెళ్ళికొడుకులో హఠాత్తుగా ఇంత మార్పు రావటానికి కారణం ఏమిటో ఎంత తల బద్దలు కొట్టుకున్నా, అర్థం కాలేదు ఎవరికీ.
😊😊😊
No comments:
Post a Comment