Showing posts with label Surya. Show all posts
Showing posts with label Surya. Show all posts

Sunday, December 12, 2021

పుల్లవిరుపు మాటలు భలే తీపి - సరదాకి -కర్లపాలెం హనుమంతరావు సూర్య దినపత్రిక ఆదివారం సంపాదకీయ పుట కాలమ్ ప్రచురితం )

 పుల్లవిరుపు మాటలు భలే తీపి - సరదాకి 

-కర్లపాలెం హనుమంతరావు   


 వాదన పూర్వపక్షం చేసే పాయింట్ ఓ పట్టాన దొరకనప్పుడు వాడుకొనే 'వాడి' గల ఆయుధం- కోపం. 'పేదవాడి కోపం పెదవికి చేటు' అన్న వేమన వెర్రికాలం కాదిప్పటిది. 'పేదవాడి కోపం పెద్దమనుషుల పదవికి చేటు' అన్నట్లుగా  సాగే  ప్రజాస్వామికవాదం.  ఎలక్షన్ల పీడాకారం తగులుకున్నప్పుడల్లా తలనొప్పి ఓటర్లకు దేవతాపీఠాలు దక్కడానికీ   ఈ ఆగ్రహాయుధమే ప్రధానకారణం.   

ఎన్నికలయిన తరువాత సాగే  గెలుపు బెట్టింగులంత గడబిడగా ఉండవు  ఓటర్ల బెట్టుసర్లు. కట్టుకున్నదాని కోపాన్ని ఏ రవ్వల సెట్టుతోనో, చీకట్లో కాట్లట్టుకునో పోగొట్టవచ్చు.   రాజ్యాంగం అంటే ఏదో ఆ ఆధికరణ, ఈ సవరణలంటూ ఇండియన్ ఇంకుతో గిలికేసారు, గాని ఎలక్షన్ల రంగంలో ఓటరు గొట్టంగాడు వీరంగానికి దిగితే  సాక్షాత్తూ  ఆ రాసిన పెద్దసార్లయినా సరే తట్టుకోడం కష్టం! తలట్టుకొని ఉండేవాళ్లే సజీవులై ఉండుంటే!  తిరుపతి వేంకటకవుల కృష్ణరాయబారం నాటకంలో శ్రీకృష్ణుడు ‘అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు/ అజాత శత్రుడే అలిగిన నాడు’ ఏవేవో సాగరములన్నీ ఏకమయిపోతాయని, నమ్ముకున్న కర్ణులు పదివేలమంది వచ్చినా చచ్చుట ఖాయమ’ని బెదరగొట్టేస్తాడు. దుర్యోధనుడికి దురాలోచనలే తప్ప దూరాలోచన తక్కువ కాబట్టే కథ అక్కడి నుంచి కంచిపోలేదు. కానీ ఇది కలియుగం బ్రాండు ప్రజాస్వామ్య బేండు మేళం. ఇండియన్ నేతకు ఓటరు అజాతు శత్రుత్వం మీద బొత్తిగా నమ్మకం కుదరక గందరగోళం.   తలనొప్పి తద్దినమంతా  ఎందుకని నాయకులు ఎన్నికల దుర్దినాలు గడిచే దాకా ఓటరుకు దేవతాపీఠాలు అప్పగించెయ్యడం వెనుక బోలెడంత పొలిటికల్ బ్యాగ్రౌండ్ వర్కుండేది అందుకే మరి!

'గడియలోపల తాడి కడగి ముత్తునియగా తిట్టిన మేధావిభట్టు కంటె/

రెండు గడెల బ్రహ్మదండి ముండ్లన్నియు డుల్ల దిట్టిన కవిమల్లు కంటె

మూడు గడియలకు మొనసి యత్తిన గండి పగుల దిట్టిన కవిభాను కంటె

అరజాము లోపల చెరువు నీళ్ళింకంగ దిట్టిన బడబాగ్ని భట్టు కంటె

ఉగ్రకోపి నేను ఓపుదు శపియింప క్రమ్మరింప శక్తి కలదు నాకు

వట్టి మ్రాను జిగురు బుట్టింప, గిట్టింప బిరుదు వేములాడ భీమకవిని' అంటూ వెనకటికి ఓ ముక్కోపికవి తన శాపదానుగ్రహ శక్తిని గూర్చి గొప్పలుపోయాడు.

భీమకవి బడాయి జస్ట్ ఓ మచ్చుక. తిని హరాయించుకొనే వికటరసాస్వాదులకు తెలుగు కవుల షష్ఠాష్టకాలు  అష్టాదశ పురాణాలకు మించి సుష్టైన విందు. కాసుల పురుషోత్తమం అని మరో కవి మహాశయుడు పనిమాలా ఘంటసాల దాకా వెళ్లి  శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువంతటి శ్రీవారిని పట్టుకుని దులపరించేశాడు. 'నీ పెళ్లాం భూదేవి అన్ని బరువులూ మోస్తుంటే..  ఆ నిర్వాకం నీదే అన్నట్లుగా పెద్ద బిల్డప్పులు! కోరింది ఇచ్చేది నీ కోమలి ఇందిరమ్మ అయితే, నువ్వే ఏదో  కామితార్థుడికి మల్లే వీర పోజు! కష్టమైన సృష్టి కార్యం చూసేది నీ కొడుకు బ్రహ్మాజీగారయితే  ఇంటి పెద్దగా ఆ క్రెడిటంతా నువ్వే కొట్టేసుక్కూర్చుంటివి! పొల్యూషన్ కంట్రోలు పనిలో పాపం గంగమ్మతల్లి  తలకమునకలయి ఉంటే, పని సాయానికి పోని   నీ కెందుకు పెద్దమనిషీ  పతితపావనుడువన్న   బిరుదంత బారుగా? పెళ్లాంబిడ్డల మూలకంగా వచ్చే పేరే తప్పించి మొదట్నుంచి నువ్వు వట్టి  దామోదరుడివి(పనికిమాలినవాడివి)’ అంటూటే అది  తిట్టో మెప్పో తెలీక  ఆ దేవుడే గుళ్లోని రాయికి మల్లేనే గట్టెక్కడ బయటపడుతుందోనని   గమ్మునుండిపోయాడు! 


నిజానికి దేవుళ్లతో పోల్చడమంటే ఓటరు స్థాయినో మెట్టు కిందికి దిగజార్చడవేఁ. దేవుడికి భక్తుడొక్కడే దిక్కు. భక్తులకు ముక్కోటి దేవుళ్ల ఆప్షనుంది. ఏ ఒక్క దేవుడు ముక్కోపం తెప్పించినా మరో పక్క దేవుడిదిక్కు భక్తుడికి ఠక్కున బంపర్గా  ఆఫరయే సీజనిది. 

 ఆపదమొక్కులవాడి కోపతాపాలనంటే ఏ మొక్కులు, పొర్లుగింతల ట్రిక్కుల్తోనో ఠక్కున మటుమాయం చేసెయ్యచ్చు. ఓటరుకార్డు చేత బట్టిన డిప్పకాయగాడు  మరీ పాతకాలం నాటి నాటు రథాలను మాత్రమే నమ్ముకునే ఉత్సవ విగ్రహంలా పడి ఉండటం లేదిప్పుడు! 

డెమోక్రసీ ఎదగడం మాట ఎటు పోయినా ఓటు మిషను మీట నొక్కే మనిషి ఎదుగుతున్నాడు. ఓటుకు ఓ పదినోటు ఇస్తానన్నా  పుచ్చుకునేందుకు  పది సార్లు పస్తాయించే చాదస్తం నుంచి హీనపక్షంగా పదివేలన్నా చేత పెట్టనంటే పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయే ప్రయోజకత్వం దాకా పరిపక్వత సాధించాడు. ముష్టి మున్సిపాలిటీ ఎన్నికలక్కూడా ఎస్టేట్లు అమ్ముకుని మరీ కుస్తీపట్లకు దిగే నేతలే ఓటర్ని ఈ స్టేటు దాకా ఎగదోసుకొచ్చింది. జిల్లేడుకాయకు మసిపూసి మారేడుకాయ చేసే ఇంద్రజాలం మరింకెంతకాలమంట? కడుపులో మంటలు ఎగసిపడితే  ఓటరే   నేత ముఖాన కసి కొద్దీ బుడ్ల కొద్దీ సిరాలు పూసి, బురద జల్లే క్రేజీ  రోజులు! ఎంత కేజ్రీవాల్సులోనైనా కదలికలు రాక ఛస్తాయా!

పాలిటిక్స్ అంటేనే శతకోటి దరిద్రాలకు అనంతకోటి చిట్కాల ఫీల్డు కదా! పాపిష్టి అసంతృప్తుల ముఠాల్లోకి   చొప్పించే కోపిష్టి ముఠాలను నేతలే ఇప్పుడు  స్వయంగా ఎందుకు పోషించుకుంటున్నట్లు?  కోన్ కిస్కాగొట్టంగాళ్ల కోపతాపాలన్నీ ఒకే షేపుకి మళ్ళించడం ఆ ముఠాల ఎత్తుగడ. ఎన్నికలివిగో.. ఈ ఎల్లుండి పొద్దున్నే ఆనంగానే,  చల్లంగా  వరాల జల్లులు కురిపించేస్తే సరి! చిల్లర పైసలు కొన్ని వదిలినా అల్లరీ ఆగం లేకుండా ఎన్నికల యాగం ఏకపక్షం చేసుకోవచ్చు. ఇహ  బోడి మల్లయ్యల  తిట్లంటారా? చెవుల్లో దూరకుండా  దూదుండల సదుపాయానికి సర్కారు దండం దక్కినాక ఖజానా అండ ఉండనే ఉంటుందిగ!  అయినా తిట్లకూ ఉట్లు తెగే సత్యకాలమా ఏంటిదీ   .. పిచ్చిగానీ? 

అన్ని జాతర్లలో ఉత్సవ విగ్రహాలు పూజలే అందుకుంటున్నాయా? కొన్ని సంబరాలల్లో  అంబలకు భక్తుల తిట్లు తప్పడం లేదు కదా!  ‘ఒద్దికతో లక్ష్మి  వున్నది చాలక.. భూదేవి కూడె నీ బుద్ధిశాలి!/ తన కూతురుటంచు ఎన్నక.. భారతిని కోరడే ఈ నీతికోవిదుడు!/అర్థాంగి యుండగ అవ్వ.. గంగను దాల్చె నీ నియమవరుడు!” అంటూ భక్తులు   తిట్టిపోసినా  దేవుళ్లే  కిమ్మనడంలేదిప్పుడు!  కులం వంకన దూషించారనో, మతం మిషతో అవమానించారనో,   జాతి పేరు చెప్పి నోరుజారారనో,  లైంగిక దృష్టితో వేధింపులకు దిగజారారనో    మనిషి మధనపడ్డం.. యుద్ధకాండ  మొదలెట్టడం   విలువైన ప్రజాస్వామ్యంలో  ‘దండుకోవలసిన సమయాన్ని’  శుద్ధ దండగ చేసుకోడం కదూ!  

దూర   దూరంగా తగలడితే తూలనాడుకొనే పగే ఊండదు. ఒకే చూరు కింద పది రోజులు చేసిపోయే కాపురాలల్లోనే సవతుల మధ్యన సవాలక్ష ముట  ముటలు, ముక్కు తిప్పుళ్లు! నూట ముప్పై కోట్ల మందిమి. జానా బెత్తెడు భరత భూమి మనది. మూడు వేల చిల్లర పొలిటికల్ పార్టీలు. ఎవరికీ పెత్తనం ఎకసెక్కం కాదు.  మాటా మాటా రాదా? ఏ మాటా మోటుగా రారాదంటే ఎట్లా?  రామాంజనేయయుద్ధంలో  రాముడికి..  ఆంజనేయుడికి మధ్య జరిగిన గలాటా మాటేమిటి మరి  ? 

‘ఉపకారంబు చేసినాడ కదా.. ఎన్నో రీతులన్.. నాకే నే/డపకారంబు ఘటంపజూచుటలు మేలా నీకు పార్థా! మహా/విపదబ్ధిన్ వడిదాటి నౌకన్ వెసన్ విధ్యంసమున్ జేయు నీ/ కపటాచార కృతఘ్న వర్తనల లోకంబెందు హర్షించునే?’ అంటూ గయుణ్ని శిక్షించే విషయంలో జోక్యం వద్దని గట్టిగా  కృష్ణుడు దెప్పితే.. బామ్మరిది కదా అర్జునుడేమన్నా గమ్మునుండిపోయాడా? 'ఆపదలు మేమె తరయించు అదనుజూచి/ ఉట్టిపడెదవు మమ్మెల్ల ఉద్ధరించు/ఘనుడవని కీర్తి కనెదవు గాని కృష్ణ!/ నీవు లేకున్న మేము రాణింపలేమె?' అంటూ మాటకు మాట అంటించలా? బాణప్పుల్లలు వదిలే ముందు పుల్లవిరుపు మాటలు, ఈటెలు, బాకులు విసురుకోడానికి ముందు ఈటెపోటుల్లాంటి దెప్పుళ్లు, అవాకులు చెవాకులు తప్పవు! క్లైమాక్సులో ఆ మాత్ర్రం తిట్ల వాసన కూడా తగలద్దంటే ఎంత ఎన్టీఆర్, ఎస్వీఆర్ పాండవవనవాసమైనా ఐమాక్సులో ఫ్రీగా వేసినా చూసే నాథుడుండడు! బొక్క.. భోషాణం అంటూ డైలాగులు దంచి కొట్టే    నటులూ పొలిటికల్ ఎంట్రీలిస్తున్నారిప్పుడు. పోటీగా  నలుగుర్నీ కూడేసుకోడానికి నాలిక్కి పదును పెట్టే ప్యూర్ ఫుల్ టైం పొలిటికల్  లీడర్ల  మీదనే అందరి నిందలు! 

 తిట్టించుకొనే వాడి మనసు చివుక్కుమంటుందో లేదో తెలీదు. వినే వీనులకు మాత్రం వీనులకు  భలే పసందైన విందు పరుష పురాణం. చట్టసభల్లో జుట్టూ జుట్టూ పట్టుకునే కురుక్షేత్ర సంగ్రామానికి ముందు రెండు వైపుల నుంచి లైవ్ లో వినిపించే సంస్కృతం ఎంత లవ్లీగా ఉంటుందనీ! సమయానికి ప్రసారాలు కట్ అయ్యాయని జనం సరదా కోసం  చిందులేయరు గదా? కారుకూతల వినోదవల్లరి కారుచవుకగా వినే భాగ్యం మిస్సయిపోతామనేగదా జనం బాధ !

 బాపూజీ చెప్పాడు గదా అని బుద్ధిగా ప్రజాసేవ చేసుకుని  చచ్చిపోతే నరకంలో మనకేమీ మడత మంచాలేసి హాయిగా బజ్జోమనరు కదా! దిష్టిబొమ్మల వ్యాపారాన్ని తగలేసిన పాపానికి, పాత చెప్పుల గిరాకీపై దెబ్బ కొట్టిన నేరానికి  ముళ్ళ డొంకల మీద పడేసి పడపడా ఈడుస్తారు! నొప్పితో ఏడిస్తే కర్రు కాల్చిన దండంతో మరో రెండు వడ్డిస్తారు. 

తిట్లన్నీ ఒక్క  నేతల నోళ్ల నుంచే పొంగొస్తున్నట్లు ఎందుకా తింగరి కూతలు? కట్టుకున్నోడు మందు కొట్టొచ్చినప్పుడు  తిట్టకపోతే మహా వెలితి  బోలెడంత మంది నెలతలకు. పెళ్లాలు  తిడతారో లేదో.. నిజంగా బైటికి తెలిసే అవకాశం లేని కాపురాలల్లో ఆ వంకన సానుభూతి కోసం వెంపర్లాడే మగకుంకలు.. ఇదిగో.. ఈ.. తల్లో వెంట్ర్రుకలంత మంది. తిట్టుకు వందిస్తామనండి!  తిరుపతి గుడి క్యూలకు మించి ఎగబడే ఏబ్రాసీ మందలు కొన్ని కోట్లున్నాయీ దేశంలో బైటపడుతుంది! 

రాచి రంపాన పెట్టే పై దేవుళ్లనేమీ పట్టించుకోకుండా కిందున్న సాటి నేతల మీదనే ఎందుకిన్ని సూటిపోటీ మాటలు?

 భరతుడు దక్షాధ్వరధ్వంసాన్ని అభినయించేటప్పుడు పశ్చిమ దిక్కుగా ఉన్న బ్రహ్మ ముఖం నుంచి ఆరభటీవృత్తితో కూడిన రౌద్రం ఉత్పన్నమయిందని 'భావప్రకాశం'లో శారదాతనయుడు శలవిచ్చాడు. ఆ దక్షాధ్వర ఘట్టంలో పోతనగారి హింసనచణ ధ్వంసరచనకు  మించి సాగుతుందా ఇప్పడు పొలిటికల్ ఫీల్డులో కోపతాపాల సీన్లు? ఉత్తిగా వేలెత్తి చూపమనా ఓటుకు అన్నేసి వేలిచ్చి ఎన్నికల్లో దేవులాడింది లీడర్లు?

భాగవతం వేనరాజును విశ్వనాథ  శతవిధాలా ఖూనీ చేసారు. కవిరాజు 'ఖూనీ' రాసి అదేరాజుకు మళ్లీ జీవం పోసారు. ఎవరి అవసరాలు వాళ్లవి. అవసరాలని బట్టి బట్టీలల్లో తిట్ల తయారీ! 'కఫాదిరోగముల్/దనువున నంటి మేని బిగి దప్పకమున్నె నరుండు మోక్ష సా/ధనమొనరింపగా వలయు'అంటూ సూక్తులు వల్లించేడు దాశరథీ భక్తుడు  కంచెర్ల గోపన్న. కోపం ఇసుమంతైనా మరి పాపభీతి కలిగించిందా చెరసాలలో పడినప్పుడైనా     ఆ రామదాసుగారి విచక్షణా బుద్ధికి? 'కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా/నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా!' అంటూ  దాశరథి మీదనే నేరుగా దెబ్బలాటకు ఎందుకు దిగినట్లు?  


'మాలిన్యం మనసులో ఉన్నా/ మల్లెపూవులా నవ్వగలగడం ఈ నాటి తెలివి' అంటాడు 'కొత్త సిలబస్' కవితలో బాలగంగాధర్ తిలక్. ఆ  పాత 'కొత్త సిలబస్' కు ఈ ట్వంటీ ట్వంటీస్ లో కూడా  శిల వేయద్దంటే ఎలా? కొత్త తరం నేతల్నయినా  ఫాలో అవ్వద్దంటే ఎలా? అదేం ‘లా’? నో..వే ! నేటి తరం నేతల దారి నేరుగా బూతుల భాగోతాల ‘హై వే’ పైనే!

బూతుందని దేవుడికి సుప్రభాతమూ వద్దనగలవా? అని మనగలవా? ఎంతాచారం వప్పచెప్పిన  పెద్దాయన అయినా ఆ కూటికే పోక తప్పని కాలమిది నాయనా! జనస్వామ్యం గ్రహచారం అలాగుంది మరి.  ఆగ్రహం చుట్టూతానే భూగ్రహమంతా తిరుగుతోంది. ‘నిగ్రహం.. నిగ్రహం’ అంటుండ బట్టే శనిగ్రహం అనే   ముద్ర పడింది.  ‘విగ్రహం పుష్టి.. నైవేద్యం నష్టి’ అంటూ మరో నింద పడ్డానికి సిద్ధంగా కూడా      ఉంది!  

 స్వగృహంలో పడగ్గదయినా  సరే నో ప్రాబ్లం!   చాటుగా ఓ నాలుగు బూతు సినిమా పాటలు బై హార్ట్ చేసుకునే బైటికి రమ్మనండి రాజకీయ పరమపద సోపానంలో నిచ్చెనలుండి చచ్చినా .. లేకపోయినా పైకెగబాకాలనుకునే పట్టుదల వదలని విక్రమార్కు మార్క్ నేతలందరూ!   చక్రం తిప్పాలన్న కుతి ఒక్కటుంటే చాలదు! వక్రమార్గంలో అయినా పచ్చిబూతులు నోటికి నిండుగా పుక్కిటపట్టక తప్పదు. 

  'పురాస్త్రరసగిరి రుద్రే ష్యకచటహ మాతృకా నింద్యాః' అంటే అర్థం తెలుసా? పోన్లెండి! అజ్ఞానం కూడా ఒక్కోసారి ప్రాణానికి తెరిపే. కానీ అజ్ఞాతంగా అదే ఒక్కోసారి మహా హాని. 'శ్రీవాణి గిరిజాశ్చిరాయ' అన్న ప్రార్థనా పద్యం ఏడో స్థానంలో  ఓ 'చ'కారం ఏడవబట్టే నన్నయ్యగారి మహాభారతం అరణ్యపర్వంలోనే ఇరుక్కుపోయింది. 'ఆ.. అంతా చాదస్తం' అనుకోవద్దు ప్రమాదం ! నన్నెచోడుడూ  'శ్రీవాణీం ద్రామరేం ద్రార్చిత' అంటూ 'మ'గణం తరువాత 'ర'గణం ఉండే స్రగ్ధరతో అశ్రద్ధగా కుమారసంభవం ఆరంభించి  యుద్ధంలో దారుణంగా మరణించాడు! తిట్ల వల్ల ఎదుటి త్రాష్టుడికి ఎంత నష్టమో తేలక పోవచ్చునెమో కానీ తిట్టే తిట్టు స్పష్టంగా లేకుంటే కుంటి కూత కూసిన వాడికే ముందు మూడేది. అనని ‘బాస్టార్డ్’ లాంటి పాడు కూతలు కూడా అన్నట్లు ప్రచారంలో కొచ్చేసే  సామాజిక మాధ్యమాల కాలం బాబూ ఇది   ! గాంధీజీ నీతుల మీదింకా నమ్మకమున్నది ముష్టి మూడు కోతులకే!  మిగతా జాతి  మొత్తం  తూలనాడే కొత్త నాయకత్వం వైపు ఒరుగుతున్నదిప్పుడు! 

బూత్ పాలిటిక్స్ లో బూతు వద్దనడం.. రామాయణంలో రామా అనే శబ్దం వద్దనడమంత అసంబద్ధం. అనకా తప్పదు.. అనిపించుకోకా తప్పదు.  తిడితే తప్ప నెగ్గ లేని నేతలకు ‘తిట్లు వద్దు.. కోపాన్ని ఉగ్గబట్టుకో’ మంటూ  చొప్పదంటు సుద్దులు చెప్పడమెందుకు?   ఎన్ని తట్టల నోట్ల కట్టలైనా సాధించిపెట్టలేనంత పాజిటివ్ ఇమేజ్.. తిట్టు పదాల ఎమేజింగ్ పవర్లో ఉంటున్నప్పుడు ఏ  ప్రవక్తో ఎన్నడో చెప్పిన పిచ్చి ప్రవర్తనతో   ఇప్పుడు పొడిచేదేముంది! 

తిట్టి తిట్టించుకోవడమా? తిట్టించుకుని తిట్టిపోయడమా? అని ఇంకా సందేహమా? కొందరు సీనియర్ నేతల్ని  ఎన్ని తిట్టీ   నో యూజ్! ఇంకా తిడుతూ కూర్చున్నా కాలమ్  వేస్ట్!

***

కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య దినపత్రిక ఆదివారం సంపాదకీయ పుట కాలమ్ ప్రచురితం ) 


                            


దేవుడి కథ -కర్లపాలెం హనుమంతరావు

 దేవుడి కథ

 -కర్లపాలెం హనుమంతరావు

నీతిమార్గాన్ని మాత్రమే నమ్ముకుని జీవించే ధర్మపరుల పోరాటానికి ఆయుధాలు అందించడం, అంతిమంగా దుర్మార్గంపై సత్యవంతులు మాత్రమే  విజేతలుగ నిలిచేలా చూసే బాధ్యత భగవంతుడికి అప్పగించడం  మనిషి చేసిన పనే! తనను తాను ప్రకాశవంతం, ఆనందమయంగా మలుచుకుంటూనే పరిసరాలనూ తదనుగుణంగా ప్రభావితంచేయడం  దేవుడి విశిష్ట లక్షణాలుగా భావన చేసిందీ మానవుడే. ప్రాణుల తాత్కాలిక విశ్రాంతి కోసం రాత్రిని, శాశ్వత విశ్రాంతి కోసం  ప్రళయాన్ని సృష్టించడం భగవంతుడి ఒక్కడి వల్ల మాత్రమే సాధ్యపడే కార్యమని నమ్మాడు మనిషి.   భగవంతుడిని సకల సద్గుణ సంపదల  రాశిగా   భావన చేసి ఆ సమ్మోహన  విశ్వంభర రూపాన్నే ఊహ మేరకు ‘దైవం’గా కల్పన చేసుకుని  భజించి తరించమంటూ  'క్రీడా, విజిగీషా, వ్యవహార, ద్యుతి, స్తుతి, మోద, మద, స్వప్న, కాంతి, గతిషు' అన్న ధాతువులను కలగలిపి  ‘దైవం’ అనే పదాన్ని రాబట్టడంతో దేవుడి కథ మొదలయినట్లయింది. 

ఆయుర్వేదమంత్రం(14 -20) ప్రకారం అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, ఇంద్రుడు ఇత్యాదులందర్నీ  దేవుళ్లుగానే భావించుకోమని బోధించిందది. సంస్కృత వాజ్ఞ్మయాన్ని ఓ పట్టు పట్టిన జర్మన్ పండితుడు మాక్స్ ముల్లర్ మాత్రమే భగవంతుణ్ని అత్యంత   సులువైన శైలిలో 'దేవుడు అంటే వెలుగు. వెలుగు తప్ప మరేదీ కాదు' (Deva meant originally Bright and nothing else) పొమ్మని రెండు ముక్కల్లో తేల్చేసింది. అటూ ఇటూ కాకుండా మధ్యస్థంగా మసలే    శ్రీసాయణాచార్యుడు ‘స్వర్గం’ అనే ఓ లోకాన్ని ఊహించి దాని సింహద్వారం తాళాల గుత్తి ‘దేవుడి’ చేతికి అప్పగించాడు. దేవుడే యజమాని, ఆయనను పొగడ్తలతో ముంచెత్తడమే మనిషిగా పుట్టినందుకు మనం చేయదగ్గ పని’ అన్న భావన సాయణాచార్యుడి జమానా నుంచే బలపడుతూవచ్చిందని  ప్రాచీన వాజ్ఞ్మయ పరిశోధకుల అభిప్రాయం. 

ప్రకృతి శక్తులు, వాటిలోని అంతర్భాగం సూర్య చంద్రులు వంటి గ్రహాల చలవ వల్లనే మనిషి మనుగడ సాధ్యమయింది. ప్రాణి ఉనికి కొనసాగడానికి  తోడ్పడే నేల, నీరు, ఆకాశం, కాంతి, గాలి- వంటి పంచభూతాలనూ స్థూలంగా దేవుళ్లుగా భావించుకోమంటే హేతువాదికైనా ఏ అభ్యంతరం ఉండబోదు. చెట్టూ చేమా, పుట్టా గుట్టా సైతం  దైవసమానమేనని డాక్టర్ దాశరథి రంగచార్యులు పలు సందర్భాలలో బల్లగుద్ది మరీ వాదించేవారు.  మానవజన్మకు మేలు చేకూర్చే ఏ పదార్థంలోనయినా నిస్సందేహంగా  దైవత్వం  ఉన్నట్లే లెక్క! సందిగ్ధమెందుకు?

దేవుని పుట్టుక ఎప్పటిదని ప్రశ్నిస్తే  మనిషి దగ్గర  చెప్పేందుకు సబబైన సమాధానం లేదు.  వేదకాలంలో అతగాడు ప్రకృతి క్రమాన్ని అర్థం చేసుకొనే సామర్థ్యం లేక భయం పుట్టించే శక్తులను దేవుళ్లుగా భావించి పూజాదికాలతో ఉపశమింపచేసే ప్రయత్నాలేవో  తనకు తోచినవి చేసివుండవచ్చు. పురాణకాలం నాటికి ఆ అదృశ్య శక్తుల స్థానంలో అటూ ఇటూగా మనవాకారాలను  బోలే దేవతావిగ్రహాల ప్రతిష్ఠాపనలు  ప్రారంభమవడం.. అదో విచిత్ర గాథ. దేవుళ్లకూ మన  మానవులకు మల్లేనే భావోద్వేగాలు,  సంసార లంపటాలు తగులుకున్నాయి భక్తజనుల భావనల పుణ్యమా అని! ఎంత నిరాకారుడైనా ఒక చట్రంలో ఇమడాలంటే  సృష్టించే మానవ మేధస్సు పరిమితులకు లోబడే  ఆ రూపం ఏర్పడాలి! దైవలోకాల సృష్టి కథలోనూ అదే తమాషా!  ఊహకు హద్దులు అక్కర్లేదు. కనక మానవమాత్రుడిగా తన చేతలకు సాధ్యంకాని అద్భుతాలేవైనా సరే అవలీలగా  సాధించే దివ్యశక్తులు  తాను సృష్టించిన దేవుడికి ప్రసాదించాడు మానవుడు.  రూపం, గుణం, శక్తి ఏదైతేనేమి.. ప్రేరణనిచ్చి సన్మార్గదర్శనం చేయించి మనిషిని మంచి దారికి మళ్లించే ఒక చమత్కారం.. మేలుచేసేదయితే సదా ఆహ్వానించదగ్గదే కదా! ఆ మేరకు హాని కలగనంత  వరకు దేవుడి ఉనికి పట్ల ఎవరికీ ఏ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేనే లేదు! 

భూమ్మీద దేవతలు మన కళ్లకు ఎలాగూ కనబడుతున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు. విద్యాబుద్ధులు గరిపే ఉపాధ్యాయులు భారతీయ సంస్కృతిలో దైవసమానులు. ఆపదలు దాపురించిన వేళ ఆదుకున్నవాళ్లనూ  దేవుళ్లుగా భావించడం భారతీయుల సత్సంప్రదాయం. కరోనా కాలంలో వలస కూలీల కడగండ్లకు కరగి చేతనయినంతలో  ఆర్తులకు సాయమందిస్తున్న మంచిమనుషులు ఎందరినో చూస్తున్నాం.  ఎక్కడో ముంబయ్ బాలీవుడ్ సినిమా నటుడు ఆంధ్రాకు ఈ మూలనున్న  చిత్తూరు ఇలాకా పేద రైతుకు ఓ చిన్న ట్రాక్టర్ కొని ఇస్తేనే ‘దేవుడు’ అని ఆకాశానికి ఎత్తేస్తున్నాం మనమివాళ అన్ని  సామాజిక మాధ్యమాలలో ఎడతెరిపి లేకుండా మనిషికి, మానవ సంఘానికి మేలు చేకూర్చే శక్తినైనా, వ్యక్తినైనా దేవుడిగా భావించడం మానవ ప్రవృత్తిలోనే అంతర్గతంగా ఇమిడివున్న సానుకూల దృక్పథం. అది ఆపితే ఆగేది కాదు. మొహమాట పెట్టినా  పొంగి పోటెత్తి పారేదీ కాదు.  ఎంత లౌకికలోక వ్యవహారమైనా దైవభావానికీ ఓ లెక్కంటూ ఉన్నట్లు వివరంగా చెప్పడమే భారతీయ తత్త్వశాస్త్రాలలోని  విశిష్ఠత.

స్వాతంత్ర్య  సమరం ఉధృతమయిన సమయంలో ప్రముఖమైన స్థానంలో ఉన్నందు వల్లనే గదా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ భరతజాతి మొత్తానికి, ముందు బాపూజీ ఆనక మహాత్మా ఇప్పుడు విగ్రహ రూపంలో దైవంగా మారింది! డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, మహాత్మా ఫూలేల లాగా  దళిత జాతుల ఉద్ధరణకై  జీవితాంతం పాటుబడ్డ  మహనీయులను దేవతామూర్తులుగా భావించడం సర్వసాధారణం ఈ  కర్మభూమిలో. పూజ్యభావంతో ప్రతిష్ఠించిన సుప్రసిద్ధుల విగ్రహాలను గుళ్లలోని దేవుళ్లకు మల్లే పూజించడాన్ని తార్కిక దృష్టితో చూసి కొందరు  తప్పుపడుతుంటారు. భక్తిభావనకు, తర్కానికి ఎప్పుడూ చుక్కెదురే. 'విశ్వాంసో ధర్మ మూలాంహి' అన్నది పెద్దలు అన్న వట్టిమాట కాదు. అనుభవం మీద రాబట్టిన సూక్తులవన్నీ! భక్తి అనే హార్మ్యానికి విశ్వాసమే పునాది. కాబట్టి  ఎట్టి పరిస్థితులలోనూ తర్కంతో ఆ దివ్య  భవనాల మీదకెక్కి ఆవలి పార్వ్యం చూడడం అసంభవం. 

దేవుళ్ల రూపాలు మారడం గమనిస్తున్నాం. దైవారాధనలూ కాలానికి తగ్గట్లు ఆర్భాటంగా మారడం చూస్తున్నాం. మనిషి పిచ్చి గానీ,  ఏ హడావుడీ  దైవిక శక్తుల మౌలిక స్వభావాలలో మార్పు తేలేవు. అగ్నిని దేవతే అనుకో! ఏ రూపంలో అయినా పూజించుకో! అయినా చెయ్యి పెడితే చుర్రుమని కాల్చి తీరుతుంది భావనలో దైవాలకు తరతమ భేదాలు లేకపోవచ్చును గానీ,  భౌతికరూపంలో  పారే గంగమ్మ తల్లికి ఎన్ని విధాల మొక్కినా  ముక్కుల్దాకా  మునిగితే  ప్రాణాలు గుటుక్కున పోవడం ఖాయం. దైవభావనలలో పొడగట్టే  ఏ మార్పయినా  మనిషి స్వభావంలో వచ్చే మార్పులకు మాత్రమే సంకేతమనేది మానసిక శాస్త్రవేత్తల సిద్ధాంతం. ఈ  ఇంగితం లేకనే.. దేవుళ్ల విషయమై నాడూ నేడూ మనిషికి మనిషికి మధ్యన, జాతుల పేరున, దేశాల వంకన, సంస్కృతుల మిషన ఎన్ని తరాలు గడచినా ఆగకుండా ఆధ్యాత్మిక ఘర్షణలు విశ్వమంతటా ప్రస్తుతం నిష్కారణంగా చెలరేగుతున్నాయి.  

కవులూ తమ కావ్యాలకు అవతారికలు  రాసే సందర్భంలో 'ఇష్ట'దేవతాప్రార్థనల వంకన దేవుళ్ల మధ్యన ప్రదర్శించే వలపక్షం విచిత్రం. వైదిక దేవతలు, పౌరాణిక దేవతలు, జానపద దేవతలు, ఆధునిక దేవతలు.. అంటూ  దేవజాతులను సైతం కవులు మనుషులకు  మల్లేనే వివిధ తరగతుల కింద విభజించి చూడడం, ఇష్టులైన దేవుళ్లంటూ  మళ్లా  కొన్ని అవతారాలకు ప్రత్యేక ప్రతిపత్తులు కల్పించడం! మనిషి మానసికంగా ఎదిగాడని టముకేసుకోవడమే  తప్పించి.. ఎంత ఎదిగినా వేపను వదలని చేదులా ఎంతో కొంత  వెర్రితనం  తప్పదా!

'కతివై దేవాః?' దేవుళ్లు ఎందరు? అని యాస్కుడు తనను తాను ప్రశ్నించుకుని 'త్రయం త్రింశోవైదేవాః'-ముఫ్ఫైముగ్గురు అని చెప్పుకున్నాడుట. ఆ నిరుక్తకారుడి లెక్క ప్రకారం, వసువులు ఎనిమిదిమంది, రుద్రులు పదకొండుమంది, ఆదిత్యదేవతలు డజనుమంది, ఇంద్రుడు, ప్రజాపతి– వెరసి ముచ్చటగా ముఫ్ఫైముగ్గురు. జగత్తు నివాసయోగ్యత వీటి చలవే కాబట్టి పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రజాతి వసుదేవతలయారు. దేహానికి ఆత్మ స్వస్తి చెప్పే వేళ ప్రాణులను పీడిస్తాయి కాబట్టి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, జీవాత్మ  రుద్రదేవతలుగా దూషింపబడుతున్నారు. ఏడాది మొత్తం చైత్రాది పన్నెండు మాసాల ద్వారా ఆయుష్షును హరించే సూర్యుడు, వరుణుడు, పూర్ణ, తృష్ణల వంటి పన్నెండు మంది ఆదిత్య దేవతల కోవలో చేరారు. లెక్కకే ముప్పై ముగ్గురు. భూఇ మీది  నిప్పు, మబ్బులోని గాలి.. మెరుపు, ఆకాశంలోని సూర్యుడు మనిషికి ముఖ్యమైన దేవతలని మళ్లీ యాస్కుడే లెక్క కుదించాడు!

రుగ్వేదం మొదటి మంత్రం 'ఓం అగ్నిమీళే’ అగ్నికి సంబంధించిందే! రుగ్వేద సూక్తులలోని నాలుగో వంతు ఇంద్రుడికి ధారాదత్తం. వ్యవసాయాధారిత భారతదేశంలో మేఘాలను ఛేదించి వర్షాలు కురిపించగల సత్తా  వజ్రాయుధపాణి ఇంద్రుడొక్కడి దగ్గరే ఉందని నమ్మకం. వేదపరంగా ఇంద్రుడు ఐశ్వర్యానికి ప్రతీక. పురాణాల దృష్టిలో స్వర్గాధిపతి. వైదికుల భావనలో  దేహంలోని జీవుడు. దేవతల రాజుగా, రాక్షసుల వైరిగా, తాపసుల అడ్డంకిగా ఇంద్రుడివి బహుముఖపాత్రలు. ఆకాశదేవతలలో సూర్యుడు అత్యంత ప్రముఖుడు. సౌర మండలం తాలూకు సమస్త శక్తులకూ ఉత్పత్తి కేంద్రమైన సూర్యదేవుడిని వేదాలు 10 సూక్తాలలో ప్రస్తుతించాయి. సుదూరం నుంచి చూసినా ప్రసన్న ధృక్కులతో దర్శనమిచ్చే దివ్యజన్ముడిగా, సకల లోకాలను క్రమబద్ధంగా ప్రకాశింపచేసే మహాదేవుడిగా, మానుషకార్యాలన్నిటిని యాజ్ఞిక రూపంలో స్వీకరించే ఆకాశపుత్రుడిగా' ప్రస్తుతించాయి. సూర్యుడొక్కడే నరుడికి నిత్యం ప్రత్యక్షమయే నారాయణుడు. సోముడు నుంచి వరుణుడు వరకు దేవతలు  ఇంకెందరో వేదాలలో తమ తమ యోగ్యతలను బట్టి ప్రస్తుతులు అందుకున్నారు. ఆ వివరాల జోలికి ప్రస్తుతం పోలేం.. కారణం స్థలాభావం.

వేదకాలంనాడు సోదిలో కూడా లేని ప్రజాపతి, పశుపతి వంటి దేవుళ్లకు మలివేదకాలానికి దశ తిరిగింది. విష్ణువు, అతని ప్రతిరూపాలైన కృష్ణుడు వంటి దేవతలకు ఆరాధనలు   అధికమయ్యాయి. యజ్ఞయాగాదులంటే తడిసిమోపడయ్యే ఖర్చులు. తలకు మించిన పని ఎత్తుకోవడం కన్నా నమ్మకం కుదిరిన విశ్వాసానికి సంబంధించిన ఓ దేవతాకారాన్ని కల్పించుకుని ఆరాధించడం సామాన్యుడికి సులువైన ముక్తిమార్గంగా తోచింది. తనను బోలిన ఆకారమే దేవుళ్లకూ కల్పించడం, తన ఈతి బాధలను సైతం దేవతలకు చుట్టబెట్టి కథలుగా వాటిని చెప్పుకుని విని తరించడం ఒక ముక్తిమార్గమనే భావన ప్రచారంలోనికి వచ్చినప్పటి నుంచి దేవుళ్ల వైభోగాలు, వారి వారి బంధుబలగాల వ్యవహారాలు ఆరాధనలో ప్రధాన ఆకర్షణీయ భాగాలయ్యాయి. యజ్ఞయాగాదులకు బదులుగా పూజాపునస్కారాలు ప్రారంభమైన పురాణకాలంలో లోకవ్యవహారాన్ని బట్టి ధర్మసంస్థాపన కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త దైవరూపాలు ఉనికిలోనికి రావడం సరికొత్త పరిణామం. 

జైనుడైన అమరసింహుడు తన అమరకోశం స్వర్గవర్గంలో దేవుళ్లకు ఉండే 'అమరా నిర్జరా దేవాస్త్రిదశా విబుధాః సురాః'  వంటి 26 రకాల పేర్లు చెప్పుకొచ్చాడు. జరామరణాలు లేనివాళ్లని, ఎప్పుడూ మూడుపదుల వయసులో కనిపించే యవ్వనవంతులని, మానవవాతీత శక్తులున్న అదితి కూమారులని.. ఇట్లా ప్రతి పదం వ్యుత్పత్తి అర్థం ఆ నామలింగానుశాసనమ్  వివరిస్తుంటే  ఎన్నడూ కనిపించని దేవుడి శక్తియుక్తుల మాటకు మించి ముందు కంటి ముందు తిరిగే మనిషి బుద్ధి నైశిత్యాన్ని  వేనోళ్ల పొగడబుద్ధవుతుంది.  హద్దులెరుగని కల్పన చేయగల మేధోసామర్థ్యం  సృష్టి మొత్తంలో మనిషికి మాత్రమే సాధ్యమన్న  వాదన తిరుగులేనిదనడానికి దేవతల పుట్టుకను గురించి అతగాడు చేసిన కల్పనే  ఓ గొప్ప ఉదాహరణ. 

వాల్మీకి రామాయణం 14వ సర్గలోనూ దేవతల పుట్టుకను గురించిన ప్రస్తావన ఉంది. జటాయువు తన జన్మరహస్యం రామచండ్రుడికి వివరించే సందర్భంలో సృష్టి, దాని క్రమం, దేవతల పుట్టుకల ప్రస్తావనలు వస్తాయి. ఆఖరి ప్రజాపతి కశ్యపుడికి అదితి వల్ల కలిగిన ముప్పైముగ్గురు దేవతల వివిధ రూపాలని వాల్మీకి వివరంగా చెప్పుకొస్తాడు. మలివేదకాలం నుండి ఈ పౌరాణిక దేవతలకే అగ్రతాంబూలం. 

జానపద దేవతలు ఉనికిలోనికి వచ్చినప్పటి బట్టి సమాజంలోని ఒక ప్రధానవర్గం చేసే పూజావిధానాలలో మౌలికమైన మార్పులు చాలా చోటుచేసుకున్నాయి. పౌరాణిక దేవతలది లిఖితసాహిత్య ప్రచారమైతే, జానపద దేవతల ప్రాభవానికి మౌఖిక మాధ్యమం ఆధారం. ఆధునిక కాలంలో గ్రామదేవతలకూ లిఖితసాహిత్యం ద్వారా నీరాజనాలు అందడం సర్వసాధారణమయిపోయింది. అమ్మవారు, పోతురాజుల వంటి గ్రామదేవతల ఆరాధనల్లో జానపదులు తమ అలవాట్లను ఏ దాపరికం లేకుండా పూజావిధానం ద్వారా ప్రదర్శించడం గమనార్హం. వ్యవసాయసంబంధమైన కేటగిరీలో స్త్రీ దేవతలకే అధిక ప్రాధాన్యం. జానపద దేవతలలో  ప్రధానంగా రెండు విభాగాలు.  పార్వతీదేవి తరహా శక్తిమూర్తులకు ప్రతినిధులుగా  గౌరమ్మ(బతుకమ్మ), ఆదిశక్తి వంటి అమ్మవార్లు ఒక తరగతి; ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఊరి ఆడపడుచులు రెండో తరగతి గ్రామదేవతలు.  వీరులను దేవుళ్లతో సమానంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచమంతటా  ఉన్నట్లే, భరతఖండంలోనూ ముందు నుంచి ముమ్మరంగానే ఉంది. రాముడు, కృష్ణుడు, పరశురాముడు, సమ్మక్క, సారలమ్మ, శివాజీ.. వంటి సాహసవంతులెందరో దేవతల  స్థాయికి ఎదిగి పూజలందుకోవడం ఇందుకు ఉదాహరణ. ఆధునిక కాలంలో షిర్డీ సాయిబాబా, రాఘవేంద్రస్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వంటి వ్యక్తులు వివిధ కారణాల వల్ల  దేవతలుగా పరిగణింపబడి ఆరాధనలు అందుకుంటున్నారు. 

మతాలను  గురించి ఈ కలికాలంలో మనలో మనమే ఏవేవో కారణాలు కల్పించుకుని  సతమతమవుతున్నామే తప్పించి, వేదకాలంలో ఈ వృథాప్రయాసలేవీ లేని చక్కని స్పష్టత ఉండేది. 'ఇన్ద్రమ్  మిత్రమ్ ‘  అనే  శ్లోకార్థాన్ని  బట్టి బుద్ధిబలం అధికమై ఆకారమే లేని పరమేశ్వరుడిని ఇంద్రుడని, సూర్యుడని, వరుణుడని, వాయువని భిన్నరూపాలలో భావిస్తున్నప్పటికీ వాస్తవానికి ఉన్నది ఒక్కటే దైవం. ఒక్కటే రూపం. ‘ఏకం సత్’ అన్న రుగ్వేద సూత్రం అంతరార్థం అంతుబడితేనే తప్ప ప్రస్తుతం మతం పేరుతో   పెచ్చుమీరే విద్వేషభావనలు శాశ్వతంగా మాసిపోయే  శాంతి మార్గం  మనిషి కంటబడదు. 

కంటికి కనిపించని దేవుళ్ల లెక్క  కన్నా.. కంటి ముందు కదిలే  మనుషులే మనుషులకు దేవుళ్లనే భావన బలపడితే అసలు గొడవే ఉండదు.

- కర్లపాలెం హనుమంతరావు 

- బోథెల్; యూ.ఎస్.ఎ

30 - 08-2021

***

 

 


అంతరాత్మల శిక్షణా శిబిరం ( సరదాగా ) -కర్లపాలెం హనుమంతరావు

  


'నేతలు మనకు అండగా నిలిచిన గుట్టు నేరుగా జనంలోకి  వెళ్ళిపోతోంది' అంది మద్యం బ్రాండు అంతరాత్మ.

'మరే! ఆపదల్లో ఉన్నప్పుడు ఆ సాముల్ని ఆదుకోవడం మన  ధర్మం!' అంది గోల్డు బ్రాండు అంతరాత్మ .

'పెదాల సానుభూతితో పనేమవుతుంది? పెడసరంగాళ్ల నోళ్ళు కుట్టించాలి ముందు. అందుకే  న్యాయదేవత అంతరాత్మకే టెండరు పెట్టానీసారి!’ అంది యుద్ధ విమానం మార్కు మరో అంతరాత్మ ధీమాగా. 

‘ఆ అంతరాత్మ  మనంత గట్టిగా ఉండదు. ఏ  తీర్పు ఏ భావోద్వేగంలో వస్తుందో ఊహాతీతం. గిట్టని అంతరాత్మల మధ్య పొత్తు కుదర్చడమే మెరుగు. పీ.కే ( ప్రశాంత్ కిశోర్ ) అంతరాత్మను ప్రయోగిస్తేనో!’ 

‘ఎంత ఖరీదయినా కొనడానికి ఓ.కే నే.. కానీ అదీ వెళ్ళి ఆ బురద    రాజకీయాల్లో దిగబడిందిగా .. దగా గాడిద !’  

రాజకీయ అంతరాత్మ మూలిగింది. 'మా బురదలో అందరికీ భాగముందమ్మా! ఎలాగైనా సరే లాభాల్లాగాలనే లోభం తమ వ్యాపారులది! సర్కారులెవరివైనా సరే మీకు సలాం కొట్టాలి.  జనంతో తంటాలు మావి! మిమ్మల్నీ వదులుకోలేం. ఓటర్లనీ వద్దనుకోలేం.’ 

'మా మీదేమన్నా వూరికే  కారుతోందా ప్రేమ? ఓటర్ల అంతరాత్మలను కొనిపెట్టే  సొమ్మంతా  మా  ఇనప్పెట్టెల్లోదేగా!’  బొగ్గు మార్కు అంతరాత్మ చెణుకు.

 ‘ఎంతో రిస్కుతో కుతంత్రాలు పన్ని, పన్నులు.. బ్యాంకు రుణాలు గట్రా  ఎగ్గొట్టి మా యజమానులు జమేసుకున్న సొమ్ము! మీ నేతలు కమ్మంగా అనుభవించే పదవులకిప్పుడు అదే కదమ్మా ఆధారం!’ వంత పాడింది వజ్రం మార్కు అంతరాత్మ.

'నేతలం కాదు మనం.. అంతరాత్మలం. మనలో మనకు కుమ్ములాటలొద్దు! మన ఆసాములు కష్టాల వూబిలో ఉన్నారిప్పుడు. వాళ్లని  గట్టెక్కించడం ఒక్కటే మన ధర్మం’  సర్ది చెప్పింది ఓ ముసలి అంతరాత్మ. 

‘ఆ స్కాములప్పుడేమన్నా ఆ ఆసాములు మన మాటలు విన్నారా.. ఇప్పుడు గట్టెక్కించడానికి!’ గొణికింది ఓ యువ అంతరాత్మ. 

‘అవునవును .  నసగాళ్ళని  మనకే చీవాట్లు కూడా  అదనంగా!’ నొసలు చిట్లించింది మరో కుర్రది.

‘అంతరాత్మలకి అంత ఆత్మాభిమానం చేటు! మన అసహనం, తిరుగుబాటు ఏ పంథాలో ప్రయోగిస్తే సత్ఫలితాలొస్తాయో.. ముందది ఆలోచించద్దాం! ఈ   పెద్దలతో శిక్షణా తరగతులు  నిర్వహిస్తోంది కూడా అందుకే. బుద్ధిగా వినండి!’ గద్దించింది అధ్యక్ష  స్థానంలో ఉన్న అంతరాత్మ. 

వ్యాపార అంతరాత్మ ప్రసంగం ప్రారంభయింది ‘మనం ఉన్నామన్న భరోసాతోనే పెద్దమనుషులు  స్కాములకు సిద్ధపడతారు. ఎంత  మొండిగా వాదించినా మన మాట వినరు. అందుకే మనమూ వాళ్ల బాట పట్టక తప్పదు. మన కుబేరులు  బేరుమంటే  మన అంతరాత్మలకే కదా నామర్దా? ’

'అయితే  ఏం చెయ్యాలంటా? తిట్టిపోసిన వాళ్లతోనే కూటమి కట్టాల్నా?' పెడసరంగా అడుగింది ఇందాకటి  పిల్ల అంతరాత్మ.

‘సర్కారు ఎవరిదన్నది మనకు ముఖ్యం కాదు. ఎవరు గద్దె మీదుంటే వాళ్లకే మన మద్దెల దరువు. అధికారంలో ఉన్న వాళ్లే ముందు ముందు మరెన్నో  మంచి పనులు చేస్తారని టముకేస్తే సరి. ‘వట్టి మాటలు కట్టి పెట్టోయ్.. గట్టి మేల్తలపెట్టవోయ్' అన్నాడా లేదా గిడుగు పిడుగు?’

 నవ్వొచ్చింది కుర్ర  అంతరాత్మకి 'ఆ కొటేషన్ గురజాడది’

‘తెలిసే అన్నాన్లే! గిడుగు నుంచి గురజాడ కాపీ కొట్టాడని మన  అంతరాత్మలన్నీ కలసి  ఘోషించాలి. అదే నిజమని జాతి అంతరాత్మకూ  నమ్మకం కుదరాలి. అందాకా బ్రెయిన్ వాష్ చెయ్యడమే మన పని.’

బొగ్గు అంతరాత్మ అందుకుంది ‘ ఆ గోల కవుల అంతరాత్మలేవో చూసుకుంటాయిలే! మద్యం నుంచి భూములు, మార్కెట్ బూములు, బంగారం, విమానాలు, బ్యాంకు రుణాల వరకు ఎన్నో బడా వ్యాపారాలు మన అంతరాత్మలను నమ్ముకునే పెద్దెత్తున అక్రమంగా నడుస్తున్నాయిక్కడ. ముందున్నది ముసళ్ల పండుగని ఎంతైనా మూలుగు.. ఎవరి చెవినా పడ్దంలేదు’

‘అలాంటి ఇబ్బందుల్లోనే ఈ పిల్ల అంతరాత్మలేం చెయ్యాలనేది మీ సీనియర్లు నేర్పించాలిప్పుడు’ గుర్తుచేసింది అధ్యక్ష అంతరాత్మ.

'ఈ సారి ఈ అంతరాత్మల అంశాన్నే ముందుకు  తోద్దాం! సెంటిమెంటుతో చేసే ఏ  ప్రయోగం ఇంత వరకూ విఫలం కాలేదు. ముఖ్యంగా రాజకీయాల్లో. అధికార పక్షం తరుఫు నుంచే ఈ తుర్ఫు ముక్క  తీయిస్తే సరి! తిరుగుబాటు వర్గాల్లోకి మన కోవర్టులను చొప్పించి అందరి  నొప్పులను  టోకున కొనిపిచేద్దాం!’ 

‘కొనడం అంటే మూటలతో పని. అనైతికం. ఆసాముల్నందర్నీ  సతాయించాలి?’ ముఖం చిట్లించింది మళ్ళీ మొండి అంతరాత్మ.    

‘సతాయించడానికే మనుషుల్లో మనమున్నది. వ్యాపార అంతరాత్మలుగా అది మన విధి’ 

మళ్లీ అడ్డుపడింది జిడ్డు అంతరాత్మ ‘అమ్ముడయేందుకు మీ రాజకీయ  అంతరాత్మలు  సిద్ధంగానే ఉంటాయమ్మా! కానీ కొనే సొమ్ము తమ  ఆసాములనుంచి  రాబట్టాలంటేనే గడసాములు చెయ్యాలిక్కడ పాపం వ్యాపార అంతరాత్మలు!’

‘ఏంటీ నస?’ అన్నట్లు మొండి అంతరాత్మకేసి గుడ్లురిమి చూసాయి అన్ని అంతరాత్మలూ.

‘చూడూ! మన అంతరాత్మల  ముందు ఎంత లావు బిరుసైనా తలవంచాల్సిందే! అనుభవంతో చెబుతున్నా.. ' అంతరాత్మ ప్రబోధం ' మించి ఉత్తమ చమత్కారం మరోటి లేదు  రాజకీయాల్లో. మనం ఎంటరయితే ఏ నేత వంటికీ మకిలంటదు’ కలగచేసుకుంటూ అంది అధ్యక్ష అంతరాత్మ ‘దేవుడు, రాజ్యాంగం కన్నా మన అంతరాత్మల మీదే అమాయక జనాలకు  నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకం వమ్ము కానివ్వద్దు’

‘మరి ప్రజాహితం?’ మొండి అంతరాత్మ లొంగదలుచుకోలేదు.

 ‘మేధావులకే పట్టని ప్రజాహితం మనకెందుకెందుకంట? ఎన్నికలు  తరుముకొస్తున్నాయ్  అవతల! ఎన్నికల కోడు పీడ  ఏ క్షణానైనా విరుచుకుపడచ్చు. ఎంత సొమ్ముకైనా సరే.. అమ్ముడవడానికి మీరంతా సై య్యేనా?’

‘సై’ అరిచాయి అన్ని కుర్ర అంతరాత్మలు.

‘ ఏం చేసైనా సరే మీ ఆసాముల్ని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారా  మరి?’

‘ఉన్నాం.. ఉన్నాం.. ఉన్నాం!’ పిల్ల అంతరాత్మల కేకలు మిన్ను ముట్టాయ్! 

 ‘గుడ్! అయితే.. ఏదీ.. నీ నోట్లో ఏముందో చెప్పు.. చూద్దాం?’ ఓ పెంకి ఘటం దగ్గరికొచ్చి అడిగింది అధ్యక్ష అంతరాత్మ.

‘ప్రద్దానికీ అడ్డొచ్చి ప్రశ్నిస్తోందే.. ఈ మంకు అంతరాత్మ.. దీని చూపుడు వేలు’ అంది పెంకిది.

‘వెరీ గుడ్! ఓ సారి దాన్ని కొరుకమ్మా!’

లటుక్కున కొరికి కరకరా నమిలి మింగేసింది క్షణంలో పెంకిది కసిదీరా. వేలు తెగిన మొండిది  లబోదిబమంటూ బైటికి పరుగెడుతుంటే అంతటా నవ్వులే నవ్వులు. 

‘అరెఁరెఁరెఁ! కొరకమంటే నిజంగా కొరికేయడమే!’ మందలించింది అధ్యక్ష అంతరాత్మ నవ్వులు కాస్త సద్దుమణిగాక. ‘నోట్లో వేలెట్టినా కొరకలేనంత జాణతనం చూపించాలమ్మా! ఆ మాత్రం అమాయకత్వం నటిస్తేనే అంతరాత్మల సాక్షీకంగా నడిచే నాటకాలన్నీ నిజాలేనని పిచ్చి జనాలకు నమ్మకం కలిగేది. మరీ మాజీ రిజర్వు బ్యాంకు గవర్నరంత  పారదర్శకత  పనికిరాదు అంతరాత్మలకు. నవ్వింది చాలు. ఇహ ముఖ్యమైన మూడు ముక్కలతో ఈ సమావేశం ముగిద్దాం. స్వచ్చమైన, అవినీతికి తావులేని పారదర్శక పాలనంటూ నేతలు బల్లగుద్ది లక్ష హామీలిస్తుంటారు. మీరు బెదిరిపోవద్దు. మీరు లేకుండానే  మ్యానిఫెస్టోలా అంటూ అలకలసలే వద్దు.! అంతరాత్మల ప్రమేయం కుంబకోణాలతోనే మొదలవుతుంది రాజకీయాలల్లో.   బొగ్గా.. బంగారమా, పెద్దనోటా, పెట్ఱోలు రేటా.. అన్నది మనకు  పెద్ద ముఖ్యం కాదు.  ఎగ్గొట్టేందుకు వీలుగా రుణ విధానాలున్నప్పుడు ఎవరికయినా ఎందుకు తప్పు చెయ్యబుద్ధేయదు?  మనం క్లవర్లం. కాబట్టే తెలివిగా మన సాముల్ని కవర్ చేసుకుంటున్నాం. ఎవరేడ్చిపోయినా లీస్ట్ బాదర్డ్. పిల్ల అంతరాత్మలు మీరు. ఆదర్శాల ఉచ్చులో ఇరుక్కోకండి! బడుగు ఓటరొచ్చి తడితే నిద్ర లేవద్దు. మరీ అంత కునుకు పట్టకుంటే అసమ్మతి రాగాల కోర్సుంది.. సాధన చేసుకోండి.. పెద్దమనుశులతో మన బేరసారాలో కొలిక్కొచ్చిందాకా! తతిమ్మా థియరీ రేపు! ఈ రోజుకీ ప్రాక్టికల్స్  చాలు‘ ప్రకటించి లేచింది అధ్యక్ష అంతరాత్మ,

‘ప్రాక్టికల్సా?!’ నోరెళ్లబెట్టాయ్  అంతరాత్మలన్నీ.

‘మరే! ఎంత చెప్పినా మొండికేసే అంతరాత్మలు  కొన్నుంటాయెప్పుడూ. నిజాయితీ, నిమ్మబద్దలంటూ  మేధావుల మెదళ్ళు తొలవడమే వాటి పని! ఎన్నికల్రోజు బక్క ఓటరు అంతరాత్మలను అవి తట్టి లేపేస్తే.. అమ్మో.. మన ఆసాముల పని గోవిందా!  అందుకే పద్దాకా ఎత్తి చూపించే  చూపుడు వేలును  ఎలా కత్తిరించేయచ్చో ప్రాక్టికల్ గా చేయించి చూపించా!’ అంది అధ్యక్ష స్థానంలో ఉన్న ఆ  ముసలి అంతరాత్మ! 

***

- కర్లపాలెం హనుమంతరావు 

15-03-2021

బోథెల్: యూఎస్ ఏ 



  


 


 


సరదా గల్పిక: తిట్టు!.. తిట్టించు! -కర్లపాలెం హనుమంతరావు ( సూర్య దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురితం )

  

 

తిట్టు!.. తిట్టించు!

-కర్లపాలెం హనుమంతరావు

 

వాదన పూర్వపక్షం చేసే పాయింట్ ఓ పట్టాన దొరకనప్పుడు వాడుకొనే 'వాడిగల ఆయుధం-కోపం. 'పేదవాడి కోపం పెదవికి చేటుఅన్న వేమన వెర్రికాలం కాదిప్పటిది. 'పేదవాడి కోపం పెద్దమనుషుల పదవికి చేటుఅన్నట్లుగా  సాగే  ప్రజల స్వాముల వాదం.  లక్షన్ల పీడాకారం తగులుకున్నప్పుడల్లా తలనొప్పి ఓటర్లకు దేవతాపీఠాలు దక్కడానికీ   ఈ ఆగ్రహాయుధమే ప్రధాన కారణం.   

ఎన్నికలయిన తరువాత సాగే  గెలుపు బెట్టింగులంత గడబిడలుగా ఉండవు  ఓటర్ల బెట్టుసర్లు. రాజ్యాంగం అంటే ఏదో ఆ ఆధికరణఈ సవరణలంటూ ఇండియన్ ఇంకుతో గిలికేసారు గానిఎలక్షన్ల రంగంలో ఓటరు గొట్టంగాడు వీరంగానికి దిగితే  సాక్షాత్తూ  ఆ రాసిన పెద్దసార్లయినా సరే తట్టుకోడం కష్టం

తిరుపతి వేంకటకవుల కృష్ణరాయబారం నాటకంలో శ్రీకృష్ణుడు ‘అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడుఅజాత శత్రుడే అలిగిన నాడు’ ఏవేవో సాగరములన్నీఏకమయిపోతాయని, నమ్ముకున్న కర్ణులు పదివేలమంది వచ్చినా చస్తార’ని బెదరగొట్టేస్తాడు. దుర్యోధనుడికి దూరాలోచన లేక  బాదర్ అవలేదు. కానీ ఇండియన్ నేతకు ఓటరు అజాతుశత్రుత్వం మీద ఆట్టే నమ్మకంలేదు.   తలనొప్పి తద్దినమంతా  ఎందుకులెమ్మనే నాయకులంతా ఎన్నికల తుమ్ములు వదిలే వరకూ ‘ఓటర్లే దేవుళ్లు’ అంటూ అష్టోత్తరాలు, సహస్రనామాలు  అందుకునేది! నిజానికి దేవుళ్లతో పోల్చడమంటే ఓటరు స్థాయిని ఓ మెట్టు కిందికి దిగలాగడవేఁ!

కాసుల పురుషోత్తమం అని ఓ కవి మహాశయుడు, పనిమాలా ఘంటసాల దాకా వెళ్లి  శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువును  పట్టుకుని దులిపేశాడు. 'నీ పెళ్లాం భూదేవి అన్ని బరువులూ మోస్తుంటే..  ఆ నిర్వాకం నీదే అన్నట్లుగా పెద్ద బిల్డప్పులా! కోరింది ఇచ్చేది నీ కోమలి ఇందిరమ్మో అయితేనువ్వే ఏదో  కామితార్థుడివన్నట్లు వీర పోజులా! కష్టమైన సృష్టి కార్యం చూసేది నీ కొడుకుబ్రహ్మగారయితే ఇంటి పెద్దనంటూ కుంటి సాకుతో ఆ క్రెడిటంతా నువ్వే కొట్టేసుకుంటివి కదా! పొల్యూషన్ కంట్రోలు పనిలో పాపం గంగమ్మతల్లి తలకమునకలయి ఉంటే, పని సాయానికి పోని   నీకు ఎందుకయ్యా  పతితపావనుడుల్లాంటి   బిరుదులసలు? పెళ్లాంబిడ్డల మూలకంగా వచ్చే పేరే తప్పించి మొదట్నుంచి నువ్వు పరమ  దామోదరుడివవే(పనికిమాలినవాడివి) సుమా!’ అంటూంటే.. అది తిట్టో.. మెప్పో తెలీక  ఆ దేవుడు గుళ్లోని రాయికి మల్లే  గమ్మునుండిపోయాడు! 

దేవుడికి భక్తుడొక్కడే దిక్కు. భక్తులకు ముక్కోటి దేవుళ్ల ఆప్షన్ ఉంది. ఏ ఒక్క దేవుడు ముక్కోపం తెప్పించినా మరో పక్కదేవుడి దిక్కు నుంచి భక్తుడికి ఠక్కున ఆఫరొచ్చే  జంపింగ్ జమానా ఇది మరి! 

 ఆపదమొక్కులవాడి కోపతాపాలనంటే ఏ మొక్కులుపొర్లుగింతల ట్రిక్కుల్తోనో  మటుమాయం చేసుకోవచ్చు.  ఓటరుకార్డు చేత బట్టిన డిప్పకాయలిప్పుడు మరీ పాతకాలం నాటి నాటురథాలనుమాత్రమే నమ్ముకుని ఉత్సాహపడే ఉత్సవ విగ్రహాలు కాదిప్పుడు! డెమోక్రసీ ఎదగడం మాట ఎటు పోయినా.. ఓటు మిషను మీట నొక్కే మనిషి కసి మాత్రం వామనుడు సిగ్గుపడే సైజులో పెరిగిపోతున్నది. ఓటుకు ఓ పదినోటు ఇస్తానన్నా  పుచ్చుకునేందుకు  పది సార్లు పస్తాయించే చాదస్తం నుంచి హీనపక్షంగా పది, పదిహేనువేలన్నా చేత పెట్టందే పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయే  పరిపక్వత సాధించింది. ముష్టి మున్సిపాలిటీ ఎలక్షన్లక్కూడా ఎస్టేట్లు అమ్ముకుని మరీ కుస్తీపట్లకు దిగే బస్తీనేతలే ఓటర్ని ఈ ‘స్టేటు’ దాకా ఎగదోసింది. మసిపూసి మారేడుకాయ చేసే మాయాజాలం మరి ఇంకెంతకాలమో గాని, కడుపు మండితే  ఓటరే ఉల్ఫాగా ఊరేగే నేతల ముఖాన కసి కొద్దీ బుడ్ల బుడ్ల సిరా పూసి సీన్లు ఖరాబు చేసే  రోజులు! వీధినేత కేజ్రీవాలే ఆఫీసు ఫోర్ వాల్సుకు బుద్ధిగా కట్టుబడ్డం ఓటరు సిరా బుడ్డి దెబ్బకు దడ పుట్ట బట్టే!  

పాలిటిక్స్ అంటేనే పది రకాల దరిద్రాలకు వంద వెరైటీల చిట్కాలు! షాహీన్ బాగ్ చూసాం కదా! అన్నదాతల ఆగ్రహమూ చూస్తున్నాంగా! పాపిష్టి అసంతృప్తుల ముఠాల్లోకి   చొప్పించే కోపిష్టి ముఠాను నేతలే ఇప్పుడు  స్వయంగా ఎందుకు తయారుచేసుకుంటున్నట్టు?  తిట్టి పోసిన వర్గాల మీదనే ఏ అయోథ్య రామయ్యను మించిన వరాల జల్లులు! చిల్లర పైసలు కొన్ని వదిలినా అల్లరీ ఆగం లేకుండా ఎన్నికల యాగం ఏకపక్షం చేసుకునే స్కీములు ఇట్లాంటివి లక్షా తొంభై ఇప్పుడు. ఇహ  బోడి మల్లయ్యల  తిట్లంటారా?  చెవుల్లో దూరకుండా  దూదుండల సదుపాయానికి సర్కారు అధికార దండం దక్కినాక ఖజానా అండ ఉండనే ఉంటుంది కదా!  అయినా, తిట్లక్కూడా ఉట్లు తెగే సత్యకాలమా.. మన  పిచ్చిగానీ?

అన్ని జాతర్లలో ఉత్సవ విగ్రహాలు పూజలే అందుకుంటున్నాయా? కొన్ని సంబరాలల్లో  అంబలను భక్తులు అడ్డమైన తిట్లు తిట్టడం ఆచారం!  ‘ఒద్దికతో లక్ష్మి  వున్నది చాలక.. భూదేవి కూడె నీ బుద్ధిశాలి!/ తన కూతురుటంచు ఎన్నక.. భారతిని కోరడే ఈ నీతికోవిదుడు!/అర్థాంగి యుండగ అవ్వ.. గంగను దాల్చె నీ నియమవరుడు!’ అంటూ చెడ  తిట్టిపోసినా  దేవుళ్ళకూ చీమ కుట్టినట్లైనా నొప్పుండటంలేదిప్పుడు !  కులం వంకన దూషించారనో, మతం మిషతో అవమానించారనో,   జాతి పేరుతో నోరుజారారనో,  లైంగిక దృష్టితో చూసి వేధించారనో మనిషెంత మధనపడ్డాఅ.. యుద్ధకాండ సిద్ధపడ్డా .. నో బడీ కేర్స్!  కోర్టు బోనుల్లో నిలబడాల్సినవాళ్ళే కోర్టు జోన్ల తరలింపు మీద ప్రకటనలిచ్చేస్తున్నారు! ఎక్కడైనా శాపనార్థాలు వినపడుతున్నాయా? ‘దండుకునేసమయం’ దండగ కాకూడదన్నదే ప్రజాభిప్రాయంగా కూడా  ఉంటున్నదిప్పుడు!

దూర దూరంగా తగలడితే తూలనాడుకొనేటంత పగే ఊండదు. ఒకే చూరు కింద పది పూటలు చేసిపోయే పిచ్చి కాపురాలల్లోనే సవతుల మధ్యన సవాలక్ష ముటముటలు, ముక్కు తిప్పుళ్లు! నూట ముప్పై కోట్ల మందిమి మనం. జానా బెత్తెడు భరత భూమి. మూడు వేల చిల్లర పార్టీలు. ఎవరికీ పెత్తనం ఎకసెక్కం కాదు. మరి మాటా మాటా రాదా? ఏ మాటా మోటుగా రావద్దంటే ఎట్లా?  రామాంజనేయయుద్ధంలో  రాముడికి..  ఆంజనేయుడికి మధ్యనే గలాటా జరిగి మాటలు రువ్వుకుంటే.. వింటూ ఎంజాయ్ చేసిన మనం  ఈ నేలబారు నేతల కారుకూతలు  ఏమంత ఎబ్బెట్టనిపిస్తాయనీ.. నీతిమంతుల పిచ్చి గానీ!   

ఉపకారంబు చేసినాడ కదా.. ఎన్నో రీతులన్.. నాకే నే/డపకారంబు ఘటంపజూచుటలు మేలా నీకు పార్థా! మహా/విపదబ్ధిన్ వడిదాటి నౌకన్ వెసన్ విధ్యంసమున్ జేయు నీ/ కపటాచార కృతఘ్న వర్తనల లోకంబెందు హర్షించునే?’ అంటూ గయుణ్ని శిక్షించే విషయంలో జోక్యం వద్దని గట్టిగా  కృష్ణుడు మందలిస్తే.. బామ్మరిది కదా అర్జునుడేమన్నా గమ్మునూరుకున్నాడా? 'ఆపదలు మేమె తరయించు అదనుజూచి/ ఉట్టిపడెదవు మమ్మెల్ల ఉద్ధరించు/ఘనుడవని కీర్తి కనెదవు గాని కృష్ణ!/ నీవు లేకున్న మేము రాణింపలేమె?' అంటూ మాటకు మాట ఎదురు పెట్టాడా.. లేదా? బాణప్పుల్లలు వదిలే ముందు పుల్లవిరుపు మాటలుఈటెలు గట్రా విసురుకోడానికి ముందు ఈటెపోటుల్లాంటి దెప్పుళ్లు తప్పవని అందరికీ తెలుసు! క్లైమాక్సులో కూడా ఏ మాత్ర్రం తిట్టు వాసన తగలద్దంటే ఎంత ఎన్టీఆర్ఎస్వీఆర్ పాండవవనవాసమైనా ఐమాక్సులో ఫ్రీ-షో వేసినా చూసే నాథుడుండడు! బొక్క.. భోషాణం అంటూ జుత్తెగరేసుకుంటూ తిరిగే నటులూ పొలిటికల్ ఎంట్రీలు ఇచ్చేస్తున్నారిప్పుడు. పోటీగా  నలుగుర్నీ కూడేసుకోడానికి నాయకుడూ  నాలుకకు మరికాస్త పదును నూరుకుంటే తప్పా? తొక్కలో భాషంటూ తిట్టే నేతలెవర్నీ జనం సైతం తొక్కేసే మూడులో లేరిప్పుడు.  ఈ దుస్థితికి ఎవర్నని తిట్టుకోడం?!

 తిట్టే వాడి మీద వెగటు పుట్టటం మాట అటుంచి..తిట్టించుకొనేవాడి మానసిక పరిస్థితి మీద  వెకిలిగా తయారైన నకిలీ వీడియోలు విపరీతంగా వైరలవుతున్నాయిప్పుడు!  వినే ఓటారే తిట్లు  వీనులకు విందనుకునే దశకు వచ్చేశాడు జుట్టూ జుట్టూ పట్టుకునే సీన్లుంటేనే చట్టసభలు సజావుగా సాగినట్లు లెక్క! సమయానికి   సభా ప్రసారాలు సడెన్ గా కట్ అయిపోతే సరదా కోసమా   జనం చిందులేసేదీ?! కారుకూతల వినోదవల్లరి కారుచవుకగా వినే ఛాన్స్ మిస్సవుతుందని కదా కామన్ పబ్లిక్ బాధ!

కమాన్! బాపూజీ చెప్పాడు గదా అని బుద్ధిగా ప్రజాసేవ మాత్రమే చేసుకుని పరమపదిస్తేనరకంలో కూడా ఎవరూ కనీసం మడతమంచాలవీ వేసి హాయిగా బజ్జోమనరు. దిష్టిబొమ్మల వ్యాపారాన్ని తగలేసిన పాపానికి, పాత చెప్పుల గిరాకీపై దెబ్బ కొట్టిన నేరానికి  ముళ్ళ డొంకల మీద పడేసి పడపడా ఈడుస్తారు! నొప్పెట్టి ఏడిస్తే కర్రు కాల్చిన దండంతో మరో రెండు వాతలు అదనంగా  వడ్డిస్తారేమో కూడా. 

అయినా బూతుపురాణాలన్నీ ఒక్క  నేతల నోళ్ల నుంచే పొంగొకొచ్చేస్తున్నట్లు ఎందుకా తింగరి కూతలు? కట్టుకున్నోడు మందు కొట్టొచ్చినప్పుడు  తిట్టకపోతే మహా వెలితి  బోలెడంత మంది నెలతలకు. పెళ్లాలు  తిడతారో లేదో.. నిజంగా బైటికి తెలిసే అవకాశం లేని కాపురాలల్లో ఆ వంకన సానుభూతి కోసం వెంపర్లాడే మగమహారాజులు.. ఇదిగో.. ఈ.. తల్లో వెంట్ర్రుకలంత మంది! తిట్టుకు వందిస్తామనండి!  తిరుపతి గుడి క్యూలకు మించి ఎగబడే ఏబ్రాసీ మందలు ఎన్ని కోట్లమందుంటారో  లెక్కతేలుతుంది! పాచిపోయిన లడ్డూలు మాత్రమే ప్రసాదంగా పెట్టించే  పై దేవుళ్ల మీద పెదవి విప్పకుండా    సాటి వాళ్లమనేగా మా మీదిన్ని సూటిపోటీ మాటలు?’ అని వాపోయే నేతలూ తక్కువేం లేరు మరి!

భరతుడు దక్షాధ్వరధ్వంసాన్ని అభినయించే వేళ పశ్చిమం నుంచి బ్రహ్మముఖతః రౌద్రరసం ఉత్పన్నమయిందని శారదాతనయుడి 'భావప్రకాశం' వాదం. పోతనగారి ఆ ఆరభటీవృత్తి దక్షాధ్వర ఘట్ట ధ్వంస రచనకు మించి ఉందా ఏంటి మరీ విడ్డూరం కాకపోతే   కొత్త నేతల  హింస నచణ?  ఉత్తి పుణ్యానికే వేలెత్తి చూపటానికేనా పాపం ఓటుకు అన్నేసి వేలు దోసెట్లో పోసీ ఉపరి.. ఎన్నికల్లో ఓటరుగాడిని మనసులో అడ్డగాడిదనుకుంటున్నా  ‘గాడ్..గాడ్” అంటూ కాళ్లట్టుకు వసుదేవుళ్లకు మించి  నేతలు వేళ్లాడేదీ?

భాగవతం వేనరాజును విశ్వనాథ  శతవిధాలా ఖూనీ చేసాడు. కవిరాజు 'ఖూనీ' రాసి అదేరాజుకు మళ్లీ జీవం పోసాడు. ఎవళ్ల అవసరాలు వాళ్లవి. అవసరాలని బట్టి బట్టీలల్లో తిట్ల తయారీ! 'కఫాదిరోగముల్/దనువున నంటి మేని బిగి దప్పకమున్నె నరుండు మోక్ష సా/ధనమొనరింపగా వలయు'అంటూ సూక్తులు వల్లించేడు కదా  దాశరథీ భక్తుడు  కంచెర్ల గోపన్నకోపమేమైనా ఇసుమంతైనా మరి పాపభీతి కలిగించిందా చెరసాలలో పడినప్పుడు ఆ రామదాసు మనసుకు? 'కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా/నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా!అంటూ  దాశరథి మీదనే నేరుగా దెబ్బలాటకు ఎందుకు దిగినట్లో?  

 

'మాలిన్యం మనసులో ఉన్నా/ మల్లెపూవులా నవ్వగలగడం ఈ నాటి తెలివిన్నాడు .. 'కొత్త సిలబస్' అనే కవితలో బాలగంగాధర్ తిలక్.  వింటానికి బానే ఉంటాయ్ కవిత్వాలెప్పుడూ! కానీ ఆ  'కొత్త సిలబస్' ఈ కొత్త సెంచరీలో పాతబడిపోయింది.. ఇంకా పాతరేయద్దంటే ప్రగతి ఎట్లా?
బూతు ఉందని దేవుడికి సుప్రభాతమూ వద్దనగలమా? అని మనగలవమా? ఆగ్రహం చుట్టూతానే భూగ్రహమంతా బొంగరంలా గింగుర్లు కొట్టేదిప్పుడు. ఆ గ్రహింపు లేకుండా ‘నిగ్రహం.. నిగ్రహం’ అంటేనే శనిగ్రహం  నిగ్రహం కోల్పోయేది!  స్వగృహం పడగ్గదిలోనయినా సరే చాటుగా ఓ నాలుగు మోటు మాటలు బై హార్ట్ చేసుకునే  బైటికి రావటం బుద్ధిమంతులకు  చాలా బెటర్  ఇప్పుడు! చక్రం తిప్పడమనే చాతుర్యం ఒక్క దాని  మీదే కసి పెంచుకుంటే చాలదీ అధికార కుతి కాలంలో! వక్రమార్గంలో అయినా సరే దానిని సంధించేందుకు ఒక్క క్షణం వెనుకంజ పడకూడదు. పచ్చిబూతులు నోటికి నిండుగా పుక్కిటపట్టక పోతే పుక్కిట పురాణాలలో కూడా చోటు దక్కే పరిస్థితి లేదు ఏ స్థాయి నేతకైనా!.

 ప్రార్థనా పద్యం ఏడో స్థానంలో  ఏదో ''కారం ఏడవబట్టే నన్నయ్యగారి మహాభారతం అరణ్యపర్వంలోనే అర్థాంతరంగా గండిపడిందంటారు.  నన్నెచోడుడూ కుమారసంభవం ఆరంభంలో  స్రగ్ధర గణాల మీద అశ్రద్ధ చూపించ బట్టే  యుద్ధంలో దారుణంగా దెబ్బతిన్నాడని మరో టాక్! తిట్టు వల్ల  త్రాష్టుడి ఉట్టీ పుటిక్కన తెగినట్లు లెక్కలు నిక్కచ్చిగా తేలకపోవచ్చు కానీ, తిట్టే తిట్టు  స్పష్టంగా లేకుంటే మాత్రం ఆ కుంటి కూత కూసిన వాడికే ముందు గంటె కాల్చినట్లు వాత పడేదీ కాలంలో.  



వాదన పూర్వపక్షం చేసే పాయింట్ ఓ పట్టాన దొరకనప్పుడు వాడుకొనే 'వాడి' గల ఆయుధం- కోపం. 'పేదవాడి కోపం పెదవికి చేటు' అన్న వేమన వెర్రికాలం కాదిప్పటిది. 'పేదవాడి కోపం పెద్దమనుషుల పదవికి చేటు' అన్నట్లుగా  సాగే  ప్రజల స్వాముల వాదం.  ఎలక్షన్ల పీడాకారం తగులుకున్నప్పుడల్లా తలనొప్పి ఓటర్లకు దేవతాపీఠాలు దక్కడానికీ   ఈ ఆగ్రహాయుధమే ప్రధాన కారణం.   

ఎన్నికలయిన తరువాత సాగే  గెలుపు బెట్టింగులంత గడబిడలుగా ఉండవు  ఓటర్ల బెట్టుసర్లు. రాజ్యాంగం అంటే ఏదో ఆ ఆధికరణ, ఈ సవరణలంటూ ఇండియన్ ఇంకుతో గిలికేసారు గాని ఎలక్షన్ల రంగంలో ఓటరు గొట్టంగాడు వీరంగానికి దిగితే  సాక్షాత్తూ  ఆ రాసిన పెద్దసార్లయినా సరే తట్టుకోడం కష్టం! 

తిరుపతి వేంకటకవుల కృష్ణరాయబారం నాటకంలో శ్రీకృష్ణుడు ‘అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు/ అజాత శత్రుడే అలిగిన నాడు’ ఏవేవో సాగరములన్నీ ఏకమయిపోతాయని, నమ్ముకున్న కర్ణులు పదివేలమంది వచ్చినా చస్తార’ని బెదరగొట్టేస్తాడు. దుర్యోధనుడికి దూరాలోచన లేక  బాదర్ అవలేదు. కానీ ఇండియన్ నేతకు ఓటరు అజాతుశత్రుత్వం మీద ఆట్టే నమ్మకంలేదు.   తలనొప్పి తద్దినమంతా  ఎందుకులెమ్మనే నాయకులంతా ఎన్నికల తుమ్ములు వదిలే వరకూ ‘ఓటర్లే దేవుళ్లు’ అంటూ అష్టోత్తరాలు, సహస్రనామాలు  అందుకునేది! నిజానికి దేవుళ్లతో పోల్చడమంటే ఓటరు స్థాయిని ఓ మెట్టు కిందికి దిగలాగడవేఁ!

కాసుల పురుషోత్తమం అని ఓ కవి మహాశయుడు, పనిమాలా ఘంటసాల దాకా వెళ్లి  శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువును  పట్టుకుని దులిపేశాడు. 'నీ పెళ్లాం భూదేవి అన్ని బరువులూ మోస్తుంటే..  ఆ నిర్వాకం నీదే అన్నట్లుగా పెద్ద బిల్డప్పులా! కోరింది ఇచ్చేది నీ కోమలి ఇందిరమ్మో అయితే, నువ్వే ఏదో  కామితార్థుడివన్నట్లు వీర పోజులా! కష్టమైన సృష్టి కార్యం చూసేది నీ కొడుకు బ్రహ్మగారయితే ఇంటి పెద్దనంటూ కుంటి సాకుతో ఆ క్రెడిటంతా నువ్వే కొట్టేసుకుంటివి కదా! పొల్యూషన్ కంట్రోలు పనిలో పాపం గంగమ్మతల్లి తలకమునకలయి ఉంటే, పని సాయానికి పోని   నీకు ఎందుకయ్యా  పతితపావనుడుల్లాంటి   బిరుదులసలు? పెళ్లాంబిడ్డల మూలకంగా వచ్చే పేరే తప్పించి మొదట్నుంచి నువ్వు పరమ  దామోదరుడివవే(పనికిమాలినవాడివి) సుమా!’ అంటూంటే.. అది తిట్టో.. మెప్పో తెలీక  ఆ దేవుడు గుళ్లోని రాయికి మల్లే  గమ్మునుండిపోయాడు! 

దేవుడికి భక్తుడొక్కడే దిక్కు. భక్తులకు ముక్కోటి దేవుళ్ల ఆప్షన్ ఉంది. ఏ ఒక్క దేవుడు ముక్కోపం తెప్పించినా మరో పక్కదేవుడి దిక్కు నుంచి భక్తుడికి ఠక్కున ఆఫరొచ్చే  జంపింగ్ జమానా ఇది మరి! 

 ఆపదమొక్కులవాడి కోపతాపాలనంటే ఏ మొక్కులు, పొర్లుగింతల ట్రిక్కుల్తోనో  మటుమాయం చేసుకోవచ్చు.  ఓటరుకార్డు చేత బట్టిన డిప్పకాయలిప్పుడు మరీ పాతకాలం నాటి నాటురథాలను మాత్రమే నమ్ముకుని ఉత్సాహపడే ఉత్సవ విగ్రహాలు కాదిప్పుడు! డెమోక్రసీ ఎదగడం మాట ఎటు పోయినా.. ఓటు మిషను మీట నొక్కే మనిషి కసి మాత్రం వామనుడు సిగ్గుపడే సైజులో పెరిగిపోతున్నది. ఓటుకు ఓ పదినోటు ఇస్తానన్నా  పుచ్చుకునేందుకు  పది సార్లు పస్తాయించే చాదస్తం నుంచి హీనపక్షంగా పది, పదిహేనువేలన్నా చేత పెట్టందే పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయే  పరిపక్వత సాధించింది. ముష్టి మున్సిపాలిటీ ఎలక్షన్లక్కూడా ఎస్టేట్లు అమ్ముకుని మరీ కుస్తీపట్లకు దిగే బస్తీనేతలే ఓటర్ని ఈ ‘స్టేటు’ దాకా ఎగదోసింది. మసిపూసి మారేడుకాయ చేసే మాయాజాలం మరి ఇంకెంతకాలమో గాని, కడుపు మండితే  ఓటరే ఉల్ఫాగా ఊరేగే నేతల ముఖాన కసి కొద్దీ బుడ్ల బుడ్ల సిరా పూసి సీన్లు ఖరాబు చేసే  రోజులు! వీధినేత కేజ్రీవాలే ఆఫీసు ఫోర్ వాల్సుకు బుద్ధిగా కట్టుబడ్డం ఓటరు సిరా బుడ్డి దెబ్బకు దడ పుట్ట బట్టే!  

పాలిటిక్స్ అంటేనే పది రకాల దరిద్రాలకు వంద వెరైటీల చిట్కాలు! షాహీన్ బాగ్ చూసాం కదా! అన్నదాతల ఆగ్రహమూ చూస్తున్నాంగా! పాపిష్టి అసంతృప్తుల ముఠాల్లోకి   చొప్పించే కోపిష్టి ముఠాలను నేతలే ఇప్పుడు  స్వయంగా ఎందుకు తయారుచేసుకుంటున్నట్టు?  తిట్టి పోసిన వర్గాల మీదనే ఏ అయోథ్య రామయ్యను మించిన వరాల జల్లులు! చిల్లర పైసలు కొన్ని వదిలినా అల్లరీ ఆగం లేకుండా ఎన్నికల యాగం ఏకపక్షం చేసుకునే స్కీములు ఇట్లాంటివి లక్షా తొంభై ఇప్పుడు. ఇహ  బోడి మల్లయ్యల  తిట్లంటారా?  చెవుల్లో దూరకుండా  దూదుండల సదుపాయానికి సర్కారు అధికార దండం దక్కినాక ఖజానా అండ ఉండనే ఉంటుంది కదా!  అయినా, తిట్లక్కూడా ఉట్లు తెగే సత్యకాలమా.. మన  పిచ్చిగానీ? 

అన్ని జాతర్లలో ఉత్సవ విగ్రహాలు పూజలే అందుకుంటున్నాయా? కొన్ని సంబరాలల్లో  అంబలను భక్తులు అడ్డమైన తిట్లు తిట్టడం ఆచారం!  ‘ఒద్దికతో లక్ష్మి  వున్నది చాలక.. భూదేవి కూడె నీ బుద్ధిశాలి!/ తన కూతురుటంచు ఎన్నక.. భారతిని కోరడే ఈ నీతికోవిదుడు!/అర్థాంగి యుండగ అవ్వ.. గంగను దాల్చె నీ నియమవరుడు!’ అంటూ చెడ  తిట్టిపోసినా  దేవుళ్ళకూ చీమ కుట్టినట్లైనా నొప్పుండటంలేదిప్పుడు !  కులం వంకన దూషించారనో, మతం మిషతో అవమానించారనో,   జాతి పేరుతో నోరుజారారనో,  లైంగిక దృష్టితో చూసి వేధించారనో మనిషెంత మధనపడ్డాఅ.. యుద్ధకాండ సిద్ధపడ్డా .. నో బడీ కేర్స్!  కోర్టు బోనుల్లో నిలబడాల్సినవాళ్ళే కోర్టు జోన్ల తరలింపు మీద ప్రకటనలిచ్చేస్తున్నారు! ఎక్కడైనా శాపనార్థాలు వినపడుతున్నాయా? ‘దండుకునే సమయం’ దండగ కాకూడదన్నదే ప్రజాభిప్రాయంగా కూడా  ఉంటున్నదిప్పుడు! 

దూర దూరంగా తగలడితే తూలనాడుకొనేటంత పగే ఊండదు. ఒకే చూరు కింద పది పూటలు చేసిపోయే పిచ్చి కాపురాలల్లోనే సవతుల మధ్యన సవాలక్ష ముటముటలు, ముక్కు తిప్పుళ్లు! నూట ముప్పై కోట్ల మందిమి మనం. జానా బెత్తెడు భరత భూమి. మూడు వేల చిల్లర పార్టీలు. ఎవరికీ పెత్తనం ఎకసెక్కం కాదు. మరి మాటా మాటా రాదా? ఏ మాటా మోటుగా రావద్దంటే ఎట్లా?  రామాంజనేయయుద్ధంలో  రాముడికి..  ఆంజనేయుడికి మధ్యనే గలాటా జరిగి మాటలు రువ్వుకుంటే.. వింటూ ఎంజాయ్ చేసిన మనం  ఈ నేలబారు నేతల కారుకూతలు  ఏమంత ఎబ్బెట్టనిపిస్తాయనీ.. నీతిమంతుల పిచ్చి గానీ!   

‘ఉపకారంబు చేసినాడ కదా.. ఎన్నో రీతులన్.. నాకే నే/డపకారంబు ఘటంపజూచుటలు మేలా నీకు పార్థా! మహా/విపదబ్ధిన్ వడిదాటి నౌకన్ వెసన్ విధ్యంసమున్ జేయు నీ/ కపటాచార కృతఘ్న వర్తనల లోకంబెందు హర్షించునే?’ అంటూ గయుణ్ని శిక్షించే విషయంలో జోక్యం వద్దని గట్టిగా  కృష్ణుడు మందలిస్తే.. బామ్మరిది కదా అర్జునుడేమన్నా గమ్మునూరుకున్నాడా? 'ఆపదలు మేమె తరయించు అదనుజూచి/ ఉట్టిపడెదవు మమ్మెల్ల ఉద్ధరించు/ఘనుడవని కీర్తి కనెదవు గాని కృష్ణ!/ నీవు లేకున్న మేము రాణింపలేమె?' అంటూ మాటకు మాట ఎదురు పెట్టాడా.. లేదా? బాణప్పుల్లలు వదిలే ముందు పుల్లవిరుపు మాటలు, ఈటెలు గట్రా విసురుకోడానికి ముందు ఈటెపోటుల్లాంటి దెప్పుళ్లు తప్పవని అందరికీ తెలుసు! క్లైమాక్సులో కూడా ఏ మాత్ర్రం తిట్టు వాసన తగలద్దంటే ఎంత ఎన్టీఆర్, ఎస్వీఆర్ పాండవవనవాసమైనా ఐమాక్సులో ఫ్రీ-షో వేసినా చూసే నాథుడుండడు! బొక్క.. భోషాణం అంటూ జుత్తెగరేసుకుంటూ తిరిగే నటులూ పొలిటికల్ ఎంట్రీలు ఇచ్చేస్తున్నారిప్పుడు. పోటీగా  నలుగుర్నీ కూడేసుకోడానికి నాయకుడూ  నాలుకకు మరికాస్త పదును నూరుకుంటే తప్పా? తొక్కలో భాషంటూ తిట్టే నేతలెవర్నీ జనం సైతం తొక్కేసే మూడులో లేరిప్పుడు.  ఈ దుస్థితికి ఎవర్నని తిట్టుకోడం?!

 తిట్టే వాడి మీద వెగటు పుట్టటం మాట అటుంచి..తిట్టించుకొనేవాడి మానసిక పరిస్థితి మీద  వెకిలిగా తయారైన నకిలీ వీడియోలు విపరీతంగా వైరలవుతున్నాయిప్పుడు!  వినే ఓటారే తిట్లు  వీనులకు విందనుకునే దశకు వచ్చేశాడు జుట్టూ జుట్టూ పట్టుకునే సీన్లుంటేనే చట్టసభలు సజావుగా సాగినట్లు లెక్క! సమయానికి   సభా ప్రసారాలు సడెన్ గా కట్ అయిపోతే సరదా కోసమా   జనం చిందులేసేదీ?! కారుకూతల వినోదవల్లరి కారుచవుకగా వినే ఛాన్స్ మిస్సవుతుందని కదా కామన్ పబ్లిక్ బాధ!

కమాన్! బాపూజీ చెప్పాడు గదా అని బుద్ధిగా ప్రజాసేవ మాత్రమే చేసుకుని పరమపదిస్తే నరకంలో కూడా ఎవరూ కనీసం మడతమంచాలవీ వేసి హాయిగా బజ్జోమనరు. దిష్టిబొమ్మల వ్యాపారాన్ని తగలేసిన పాపానికి, పాత చెప్పుల గిరాకీపై దెబ్బ కొట్టిన నేరానికి  ముళ్ళ డొంకల మీద పడేసి పడపడా ఈడుస్తారు! నొప్పెట్టి ఏడిస్తే కర్రు కాల్చిన దండంతో మరో రెండు వాతలు అదనంగా  వడ్డిస్తారేమో కూడా. 

అయినా బూతుపురాణాలన్నీ ఒక్క  నేతల నోళ్ల నుంచే పొంగొకొచ్చేస్తున్నట్లు ఎందుకా తింగరి కూతలు? కట్టుకున్నోడు మందు కొట్టొచ్చినప్పుడు  తిట్టకపోతే మహా వెలితి  బోలెడంత మంది నెలతలకు. పెళ్లాలు  తిడతారో లేదో.. నిజంగా బైటికి తెలిసే అవకాశం లేని కాపురాలల్లో ఆ వంకన సానుభూతి కోసం వెంపర్లాడే మగమహారాజులు.. ఇదిగో.. ఈ.. తల్లో వెంట్ర్రుకలంత మంది! తిట్టుకు వందిస్తామనండి!  తిరుపతి గుడి క్యూలకు మించి ఎగబడే ఏబ్రాసీ మందలు ఎన్ని కోట్లమందుంటారో  లెక్కతేలుతుంది! పాచిపోయిన లడ్డూలు మాత్రమే ప్రసాదంగా పెట్టించే  పై దేవుళ్ల మీద పెదవి విప్పకుండా    సాటి వాళ్లమనేగా మా మీదిన్ని సూటిపోటీ మాటలు?’ అని వాపోయే నేతలూ తక్కువేం లేరు మరి!

భరతుడు దక్షాధ్వరధ్వంసాన్ని అభినయించే వేళ పశ్చిమం నుంచి బ్రహ్మముఖతః రౌద్రరసం ఉత్పన్నమయిందని శారదాతనయుడి 'భావప్రకాశం' వాదం. పోతనగారి ఆ ఆరభటీవృత్తి దక్షాధ్వర ఘట్ట ధ్వంస రచనకు మించి ఉందా ఏంటి మరీ విడ్డూరం కాకపోతే   కొత్త నేతల  హింస నచణ?  ఉత్తి పుణ్యానికే వేలెత్తి చూపటానికేనా పాపం ఓటుకు అన్నేసి వేలు దోసెట్లో పోసీ ఉపరి.. ఎన్నికల్లో ఓటరుగాడిని మనసులో అడ్డగాడిదనుకుంటున్నా  ‘గాడ్..గాడ్” అంటూ కాళ్లట్టుకు వసుదేవుళ్లకు మించి  నేతలు వేళ్లాడేదీ?

భాగవతం వేనరాజును విశ్వనాథ  శతవిధాలా ఖూనీ చేసాడు. కవిరాజు 'ఖూనీ' రాసి అదేరాజుకు మళ్లీ జీవం పోసాడు. ఎవళ్ల అవసరాలు వాళ్లవి. అవసరాలని బట్టి బట్టీలల్లో తిట్ల తయారీ! 'కఫాదిరోగముల్/దనువున నంటి మేని బిగి దప్పకమున్నె నరుండు మోక్ష సా/ధనమొనరింపగా వలయు'అంటూ సూక్తులు వల్లించేడు కదా  దాశరథీ భక్తుడు  కంచెర్ల గోపన్న! కోపమేమైనా ఇసుమంతైనా మరి పాపభీతి కలిగించిందా చెరసాలలో పడినప్పుడు ఆ రామదాసు మనసుకు? 'కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా/నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా!' అంటూ  దాశరథి మీదనే నేరుగా దెబ్బలాటకు ఎందుకు దిగినట్లో?  


'మాలిన్యం మనసులో ఉన్నా/ మల్లెపూవులా నవ్వగలగడం ఈ నాటి తెలివి' అన్నాడు .. 'కొత్త సిలబస్' అనే కవితలో బాలగంగాధర్ తిలక్.  వింటానికి బానే ఉంటాయ్ కవిత్వాలెప్పుడూ! కానీ ఆ  'కొత్త సిలబస్' ఈ కొత్త సెంచరీలో పాతబడిపోయింది.. ఇంకా పాతరేయద్దంటే ప్రగతి ఎట్లా?

బూతు ఉందని దేవుడికి సుప్రభాతమూ వద్దనగలమా? అని మనగలవమా? ఆగ్రహం చుట్టూతానే భూగ్రహమంతా బొంగరంలా గింగుర్లు కొట్టేదిప్పుడు. ఆ గ్రహింపు లేకుండా ‘నిగ్రహం.. నిగ్రహం’ అంటేనే శనిగ్రహం  నిగ్రహం కోల్పోయేది!  స్వగృహం పడగ్గదిలోనయినా సరే చాటుగా ఓ నాలుగు మోటు మాటలు బై హార్ట్ చేసుకునే  బైటికి రావటం బుద్ధిమంతులకు  చాలా బెటర్  ఇప్పుడు! చక్రం తిప్పడమనే చాతుర్యం ఒక్క దాని  మీదే కసి పెంచుకుంటే చాలదీ అధికార కుతి కాలంలో! వక్రమార్గంలో అయినా సరే దానిని సంధించేందుకు ఒక్క క్షణం వెనుకంజ పడకూడదు. పచ్చిబూతులు నోటికి నిండుగా పుక్కిటపట్టక పోతే పుక్కిట పురాణాలలో కూడా చోటు దక్కే పరిస్థితి లేదు ఏ స్థాయి నేతకైనా!. 

 ప్రార్థనా పద్యం ఏడో స్థానంలో  ఏదో 'చ'కారం ఏడవబట్టే నన్నయ్యగారి మహాభారతం అరణ్యపర్వంలోనే అర్థాంతరంగా గండిపడిందంటారు.  నన్నెచోడుడూ కుమారసంభవం ఆరంభంలో  స్రగ్ధర గణాల మీద అశ్రద్ధ చూపించ బట్టే  యుద్ధంలో దారుణంగా దెబ్బతిన్నాడని మరో టాక్! తిట్టు వల్ల ఏ త్రాష్టుడి ఉట్టీ పుటిక్కన తెగినట్లు లెక్కలు నిక్కచ్చిగా తేలకపోవచ్చు కానీ, తిట్టే తిట్టు  స్పష్టంగా లేకుంటే మాత్రం ఆ కుంటి కూత కూసిన వాడికే ముందు గంటె కాల్చినట్లు వాత పడేదీ కాలంలో. నీతుల నెలాగైనా వెనక్కు తీసుకోవచ్చు గానీ, బూతు కూతలకా వెసులుబాటు లేదీ కాలంలో. పెదవి దాటితే పృథివి దాటినట్లే! ఆ హెచ్చరిక గుర్తున్న ఉత్తర కుమారుడెప్పుడూ  ఉత్తుత్తి బీరాల జోలికి పోడు!  ‘బాస్టార్డ్’ లాంటి పాడు కూతల్లో ‘మాస్టర్స్’ చేస్తే తప్ప సింగిల్ సీటున్న ప్రజాసేనలో అయినా టిక్కెట్ దక్కే అవకాశం నిల్!  

అన్నది అన్నట్లు అరక్షణంలో ప్రపంచం చుట్టొచ్చేసే జెట్ యుగం రోజుల్లో జాతి పిత  బాపూజీ మూడు కోతుల నీతిబోధనలు నమ్ముక్కూర్చుంటే  మాజీ ప్రధాని మన్మోహన్ జీ కెరీరుకు మల్లే చాప్టర్ పూర్తిగా పర్మినెంటుగా క్లోజ్! బూత్ పాలిటిక్స్ లో బూతు వద్దనుకోడం.. రామాయణంలో రామా అనే శబ్దం నిషిద్ధమనుకోడమంత అసంబద్ధం. 

అనకా తప్పదు.. అనిపించుకోకా తప్పదు. 

ఇంత మొత్తుకున్నా ‘తిట్టి తిట్టించుకోవడమా? తిట్టించుకుని తిట్టిపోయడమా? అని  సందిగ్ధమా? ఛఁ! కొంత మందిని ఎన్ని తిట్టీ  నో యూజ్! ఇంకా తిడుతూ కూర్చున్నా  టైం వేస్ట్!

-కర్లపాలెం హనుమంతరావు

06 -02 -2021

బోథెల్, యూఎస్ఎ



                            

నీతుల నెలాగైనా వెనక్కు తీసుకోవచ్చు గానీ, బూతు కూతలకా వెసులుబాటు లేదీ కాలంలో. పెదవి దాటితే పృథివి దాటినట్లే! ఆ హెచ్చరిక గుర్తున్న ఉత్తర కుమారుడెప్పుడూ  ఉత్తుత్తి బీరాల జోలికి పోడు!  ‘బాస్టార్డ్’ లాంటి పాడు కూతల్లో ‘మాస్టర్స్’ చేస్తే తప్ప సింగిల్ సీటున్న ప్రజాసేనలో అయినా టిక్కెట్ దక్కే అవకాశం నిల్!  

అన్నది అన్నట్లు అరక్షణంలో ప్రపంచం చుట్టొచ్చేసే జెట్ యుగం రోజుల్లో జాతి పిత  బాపూజీ మూడు కోతుల నీతిబోధనలు నమ్ముక్కూర్చుంటే  మాజీ ప్రధాని మన్మోహన్ జీ కెరీరుకు మల్లే చాప్టర్ పూర్తిగా పర్మినెంటుగా క్లోజ్! బూత్ పాలిటిక్స్ లో బూతు వద్దనుకోడం.. రామాయణంలో రామా అనే శబ్దం నిషిద్ధమనుకోడమంత అసంబద్ధం. 

అనకా తప్పదు.. అనిపించుకోకా తప్పదు

ఇంత మొత్తుకున్నా ‘తిట్టి తిట్టించుకోవడమా? తిట్టించుకుని తిట్టిపోయడమా? అని  సందిగ్ధమా? ఛఁ! కొంత మందిని ఎన్ని తిట్టీ  నో యూజ్! ఇంకా తిడుతూ కూర్చున్నా  టైం వేస్ట్!

-కర్లపాలెం హనుమంతరావు

06 -02 -2021

బోథెల్, యూఎస్ఎ

 

 

                            

తెలుగుకి ఢోకా లేదు! -కర్లపాలెం హనుమంతరావు -వ్యాసం- కర్లపాలెం హనుమంతరావు ( సూర్య - దినపత్రిక - 20 -10-2019 - ప్రచురితం )

 


సజీవ భాష అనగా నేమి? నట్టింట్లో పొద్దస్తమానం తెగ వాగే టీ.వీ, అనుక్షణం చెవిలో మోగే సెల్ జోరీగ, కంటి ముందు ఝిగేల్మని మెరిపించే వెండితెర బొమ్మ.. ఏ భాషలో సంభాషించునో  అదియే సజీవ భాష నాబరగు. ఐతే ఆ లెక్కన అచ్చు తెలుగు ఎప్పుడో చచ్చినట్లు లెక్క. అమంగళము ప్రతిహతమగు గాక.

మరి తెలుగు మృతభాషయినచో అమృతభాష యేది గురువా?

ఆంగ్లాంధ్రములు కలిపి పిసికిన  సంకర బంకరా శిష్యా!  

తలకట్టు  ఒక్క మన తెలుక్కి మాత్రమే సొంతమైనట్టు  ఆ నిక్కులు, నీలుగులు చాలించరా ఇంక!   తెలుగుతల్లి తలకు 'కట్టు'మాత్రమే మిగిలిందని తెలుసుకుంటే మేలురా కుంకా!  

బళ్లల్లో తెలుగుతల్లికి బడితెపూజలే కదా నాయనా  సదా! గుళ్లల్లో  సుప్రభాతానికి బదులుగా  'గుడ్ మాణింగ్' అంటేనే  ఆ గాడ్  ‘గుడ్ లుక్సు’లో భక్తుడు బుక్ సర్వదా! 

వచ్చినా వచ్చకున్నా ఆంగ్లంలో వాగితేనే భయ్యా.. దండాలు.. దస్కాలు.. సత్కారాలు! 'అ.. ఆ.. ఇ.. ఈ.. ఉ..ఊ' లని మూలుగుతూ కూర్చుంటే  అర దండాలు.. అరదండాలు.. ‘చీ.. పో’ అంటూ  చీత్కారాలు! తెలుగుపంతుళ్ళకే తెలుగులో సంతకాలంటే వాంతులయే వింతకాలంలో బాబూ ప్రస్తుతం  తెలుగుతల్లి బతుకీడుస్తున్నది!  ఉద్యోగం, ఉపాధి సంగతులానకరా జనకా!  మనసుపడ్డ పాపను పడెయ్యడానికైనా ప్రేమలేఖ ఆంగ్లంలోనే గిలకాలిరా మొలకా!  ఇంకేం చూసి  తెలుగుమీద మోజు పడాలిరా బళ్లకెళ్లే భడవాయలంతా? మెడల్లో పలకలు గంగడోళ్ళలా  వేలాడేసినా సరే  బిడ్డల్ని లార్డు మెకాలేకి నకిలీలుగా మార్చేసెయ్యమనే కదా   మన తెలుగయ్యల అమ్మల వేడుకోలు! పులులు, పిచ్చుకలు అంతరించిపోతున్నాయన్నంత చింతైనా లేదంటారా తెలుగు అంతర్ధానమైపోతున్న స్పీడుకు! దటీజ్  తెలుగు దుందుడుకు!

కాపాడే కంటిరెప్ప గొప్పతనం కన్ను గుర్తుపడుతుందా? ఆదరించే అమ్మభాషకు  అంతకుమించిన దశ గిడుతుందా?

క్రియాపదం తెలుగువాక్యంలో చివరకు  రావడమే అన్ని లోకువలకు అసలు కారణం స్వామీ! అదే ఆంగ్లంలోనో? కర్తా కర్మల మధ్యలోకైనా సరే వచ్చి కూర్చునే దొరతనం.. యూ నో! 'పని'కి వెనకుండే తెలుగుకి తోడుంటే   శనికి జోడవుతామని జడుపు  తెలుగోడికి!  ఎంత పద, లిపి సంపద తెలుగు నాలికచివర  పలుకుతుంటేనేమయా.. ఆంగ్లంతో  కలిపి కొట్టకపోతే ఉలిపికట్టెతో పోలికొస్తుందని ఉలుకిపాటా  భయ్యా?

గురజాడగారి గిరీశానికీనాటికీ తెలుగ్గడ్డమీదెంత గ్లామరో తెలుసా? కారణం? పూనా ఢక్కన్ కాలేజీలో మూడు ఘంటలేకబిగిన బట్లరింగ్లీషులోనైనా సరే బాదేయగల  ఘటం కావడం! 'చాట్'లతో ఫట్ ఫట్ లాడించాల్సిన లేటెస్టు సెంచరీలోనూ శ్రీనాథుడి చాటువులే వేపుకు తిందామనుకుంటే  చెవులకు చేటలు కడతారయ్యా కామయ్యా! బమ్మెర పోతనగారా కమ్మదనం భ్రమలో పడి అమ్మభాషలో కాకుండా   ఆంగ్లంలో కుమ్మేసుంటే  భాగవతం ఈపాటికి లాటిన్లో బైబిలుకి పోటీకొచ్చుండేది సుబ్బయ్యా!  

వాడుకభాషంటే వేడుక భాషా? వ్యవహార భాషయ్యా బాషా!  ఇంద్రాసూయైనా సరే..   ఆంధ్రాలోనే వ్యవహారం అని చంద్రబాబేనాడన్నా    మొండికేసాడా? కేసుంటే   అన్ని కోట్ల పెప్సీప్లాంట్లకేసు  పురిట్లోనే  సంధి కొట్టేసేదే కాదా?  కేసీఆర్ ఎంతైనా  మొనగాడవనీ ఒక్క తెలంగాణా యాసతోనే కెసి కెనాలు పనులడ్డుకోగలడా జెసీ దివాకరం?

ఆదికవి నన్నయ ఆ సోది తెలుగుక్కలా అంకితమయిపోబట్టే ఒక్క రాజమండ్రికే బైండయిపోయాడన్నా! అరసున్నాలు, బండిరాలు, కాసిని సంధులు వదిలేసినందుకే  శ్రీరంగం శ్రీనివాసరావుకా  యుగకవిగా బిరుదులు..  గౌరవాలే! అక్షరాలు, హల్లులు, వత్తులు, సంధులని  తేడా పాడా లేకుండా ఏకమొత్తంగా వర్ణమాలనుమొత్తం గంగలో కలిపే మన  గంగా విత్ కెమేరామన్ రాంబాబు మార్కు టీ. వీ యాంకర్లకు, రేడియో జాకీలకు, సినిమా రైటర్లకు, డాక్టర్లకు,  కోర్టియర్లకు, సర్కారు సర్వెంట్లకు,    ప్రజాబంట్లకు ఇంకెంత గొప్ప గౌరవం దక్కాలప్పా? డిస్సెంటు పత్రం సమర్పించిన గురజాడ అప్పారావుజీ గొప్పా? ఇండీసెంటుగా ఉంటుందని అసలు తెలుగు మొత్తాన్నేఏకమొత్తంగా  చెత్తకుప్పలో వేసిన   ప్రయివేటు బళ్ళు గొప్పా? బళ్ళకెళ్ళే మన పిడుగుల తెలుగు మాటల ముందు గిడుగు రామ్మూర్తిగారి  ప్రజ్ఞాపాటవాలెందుకు?  బుడుంగుమని మునగాల్సిందే ఎంత పెద్ద విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రులుగారైనా  సరే!

కర్ణాటక సంగీతం ఆంగ్లంలో లేదు కాబట్టే తెలుగు చెవులకంత  కర్ణకఠోరం!  ఆంగ్లవాసన సోకనందుకే  అన్నమయ్య సంకీర్తనలకా  కాలదోషం! బడేగులాం సాబ్ హీందీకి గులామైతే..  ఆంగ్లభాషకు మన తెలుగులందరం బడే బడే గులాములం బాద్షా! ఫ్రెంచివాళ్ళు కనక బాలమురళి గానానికలా  ఫిదా అయిపోయి.. కనకగండపెండేరాలు గట్రా కాలికి తొడిగారు! ఈలపాటైనా సరే ఈ నేలమీద ఇంగ్లీషు ట్యూనుంటేనే తెలుగువాడి నోట్లో ఒన్సుమోర్లు మోగేది!

తుమ్ము, దగ్గులదాకా ఎందుకు? ఆవలింతలైనా  ఆంగ్లయాసలో ఉండాలమ్మా ఇంగ్లీషు డాక్టర్లు మందులు రాసేదివ్వడానికి.

ఆర్ద్రత, సరళత తెలుగుభాష సొంతమవడమే అసలు చిక్కంతా! కాటికెళ్లే శవాలు కూడా 'క్యాచ్ మీ ఇఫ్ యూ కేన్' అంటూ లేటెస్టు ట్యూనులు కోరుకంటుంటే తెలుగు మృతభాషగానైనా  బతికి బట్టకడుతుందా అన్నది లక్షడాలర్ల  ప్రశ్న!

పొట్టకోసినా తెలుగక్షరం ముక్కొక్కటైనా  కనపించనోడే తెలుగువాడికివాళ  తలమానికంరా సోదరా! పచ్చడి లేకుండా ఎన్నిడ్లీలైనా లాగించచ్చేమో గానీ ఆంగ్లం  లేకుండా  తెలుగుముక్కంటే చచ్చే చావే తెలుగోడికి!  తెలుగిది కేవలం ప్రాచీన హాదానే సుమా! ఆంగ్లానిది అధునాతన  హోదా!

ఒకే భాషవాళ్లంతా ఎన్ని దేశాల్లో ఉన్నా.. సొంతపనులన్నీ తల్లిభాషలో చేస్తే చాలంట.. అంతర్జాతీయస్థాయికి అదే మంచి చిట్కా అని క్లేర్ మోరనే స్పానిష్ పెద్దాయాన సిద్దాంతం. తెలుగువాడు తెలివిగలవాడబ్బా!  అంత కష్టంకూడా పడ్డానికి ఇష్టపడడు.  సొంతగడ్డమీద ఉంటూనే సొంతభాషని ఆంగ్లంలా చడమడా వాడేసి  ఆటోమేటిగ్గా  అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోగలడు.. సొంత కలల్లో!

తెలుగు  ‘పుచ్చిపోయిందోచ్! చచ్చిపోతుందోచ్!’ అంటూ పద్దస్తమానం కన్నీళ్ళు పెట్టుకునే



తిక్కన్న వారసులకూ శుభవార్త!  తిట్లున్నంత కాలం తెలుగుంటుంది. ప్రజాస్వామ్యమున్నంత కాలం తిట్లూ ఉంటాయి. తెలుగు చల్లగా పదికాలాలపాటీ తెలుగ్గడ్డలమీద వర్ధిల్లాలని  ప్రార్థించే పెద్దలారా!  సదా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని మొక్కుకోండి చాలు! తెలుగూ దానితో పాటే దివ్యంగా వెలుగుతూనే ఉంటుంది చట్టసభల్లో.. కనీసం తిట్లరూపంలోనైనా!

- కర్లపాలెం హనుమంతరావు 

( సూర్య - దినపత్రిక - 20 -10-2019 - ప్రచురితం ) 

దేవుళ్ల మీదా నిందలేనా? -కర్లపాలెం హనుమంతరావు- సరదా వ్యాసం


ఒద్దికతో లక్ష్మి  వున్నది చాలక.. భూదేవి కూడె నీ బుద్ధిశాలి!/

తన కూతురుటంచు ఎన్నక.. భారతిని కోరడే ఈ నీతికోవిదుడు!/

అర్థాంగి యుండగ అవ్వ.. గంగను దాల్చె నీ నియమవరుడు!/.. 

అక్కటా! అందరందరు అందరే.. అడుగనేల కామదాసులు కారే నీ కరుణ వలన-

ఇది శ్రీరామ కథ సినిమాలో దేవుళ్ల బుద్ధిచాపల్యం మీద పెట్టిన చాకిరేవు.

 ‘ఉపకారంబు చేసినాడ కదా.. ఎన్నో రీతులన్.. నాకే నే/డపకారంబు ఘటంపజూచుటలు మేలా నీకు పార్థా! మహా/

విపదబ్ధిన్ వడిదాటి నౌకన్ వెసన్ విధ్యంసమున్ జేయు నీ / కపటాచార కృతఘ్న వర్తనల లోకంబెందు హర్షించునే?- అని కృష్ణుడు దెప్పితే.. బామ్మరిది.. ఏదో సరదా కన్నాడు లెమ్మని  అర్జునుడేమన్నా కిమ్మనకుండా ఉండిపోయాడా?

'ఆపదలు మేమె తరయించు అదనుజూచి/ ఉట్టిపడెదవు మమ్మెల్ల ఉద్ధరించు/

ఘనుడవని కీర్తి కనెదవు గాని కృష్ణ!/ నీవు లేకున్న మేము రాణింపలేమె?' అంటూ ఎదురుపెట్టాడు.  కృష్ణార్జున యుద్ధంలోని ఈ మాదిరి దెప్పుళ్లు గతంలో ప్రతీ చలనచిత్రంలో  వినిపించేవి. తగవులు వచ్చినప్పుడు భగవంతుళ్లు, భగవదంశ ఉన్నవాళ్ళు కూడా కోపతాపాలకు వశమైపోవడం విచిత్రమే.  భక్తులకు ఆదర్శమన్న స్పృహ లేకుండా దేవుళ్లు తమలో తాము తిట్టుకుంటుంటే, వారి వారి భక్త కోటి తన్మయత్మలో మునిగితేలడం ఏ తరహా సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తుందో   ఆయా సాంప్రదాయవాదులే సెలవియ్యాలి మరి.

రెండు ముక్కలు గట్టిగా తిట్టుకుంటే చాలు, ఆ పైన పదాలు తట్టక  మీద మన్ను పోసుకుంటున్నారు ఇప్పటి తరాలు.  ఆక్స్ ఫర్డ్ వర్డ్స్ విద్యాధికులూ ఈ  షష్టాకాలకేం తక్కువ కాదు. కానీ వాటి మూలార్థాలు   వంకాయలు, బీరుకాయలు అమ్ముకునే బస్తీజీవి బుద్ధికెక్కవు.  వ్రతం చెడీ ఫలం దక్కకపోతే ఎట్లా అని కాబోలు లేటెస్టుగా ఫారిన్ రిటర్న్సే కాదు.. ఫారిన్ కంట్రీసులో సెటిలయిన  మనవాళ్లు కూడా మన బస్తీ లాంగ్వేజీలోనే సామాజిక మాధ్యమాల ద్వారా కుస్తీ పట్లకు దిగిపోతున్నారు! అంతర్జాలం అభివృద్ధి ఫలాలలో అవాచ్యాలు విశ్వవ్యాప్తంగా విస్తరించడం ఒక కోణం.

 గతంలో మన తెలుగు ప్రాంతాలలో తిట్ల కవులుగా చాలా మంది చరిత్రలో ప్రసిద్ధమయారు. బడబానలం భట్టారకుడు అనే మహానుభావుడు ఉన్నాడు. చెరువులో నిలబడి సూర్యనమస్కారాలు చేస్తుంటే చేతివేలి ఉంగరం కాస్తా నీళ్లల్లో జారిపడింది. కొత్తది కొనుక్కోవచ్చు. కుదరకుంటే ఆశ వదులుకోవచ్చు. ఊరంతా తాగే నీళ్లను ఎండబెట్టి ఉంగరం దొరకబుచ్చుకొన్నాడాయన. చెరువుని అట్లా ఎండమని బెదరగొట్టడానికి ఆ పండితుడు వాడింది ఇప్పటి ప్రమాణాల ప్రకారం పచ్చి అన్ పార్లమెంటరీ లాంగ్వేజీ! ఆ  తిట్ల కవులకు కాపీ క్యాట్లే  ఈ కాలం నాటి మన  నాయకమ్మన్యులు!


క్రౌంచ పక్షుల మిథున భంగానికి అలిగి వాల్మీకి అల్లిన మహాకావ్యం రామాయణం. అలగడమే తెలీనంత ధర్మరాజు వారసులేమీ కాదు దైవభక్తులు కూడా. 'దొరతనములన్నియును దొరసినందాకా''అన్నాడు కదా అన్నమయ్య.  'కోపము పుట్టిన నెంతటి/ భూపాలుండైన చెడు' అంటాడు సానందోపాఖ్యానంలో శివరామకవి. లా మేకర్సూ వాళ్లే.. లా ఫస్ట్ బ్రేకర్సు వాళ్లే అన్న సిద్ధాంతం కలియుగం ముందు నుంచే మొదలయిందనడానికి వందలాది ఉదాహరణలు చెప్పవచ్చు. కానీ స్థలాభావం.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రాజశేఖర్ 'అంకురం' అప్పట్లో సూపర్ హిట్!అందులోని ఓ మంత్రిగారి కాన్వాయ్ సీనులో కారు మీద జాతీయజెండా తలకిందులుగా వేలాడ్డం చూసి ఓ సుకుమార దేశభక్తుడు కోర్టులో ప్రజావ్యాజ్య వేసి మరీ తన ఆగ్రహం ప్రకటించాడు. ఆ అవమానకర సన్నివేశం తొలగింపుకు ఓ ప్రేక్షకుడి ధర్మాగ్రహం కారణం. ఇప్పుడా తరహా ధర్మాగ్రహాల కన్నా నచ్చని తీర్పులు చెప్పే ధర్మస్థానాల మీదనే ఏకంగా ఆగ్రహంతో బురద జల్లే కొత్త సంప్రదాయం మొదలయిపోయింది.  

 ఇప్పటి చిత్ర కథానాయకులే వెండి తెర మీదా, బైటా నేరుగా 'బొంగు, బొక్క, తొక్క' అంటూ నోళ్ళు యధేచ్ఛగా పారేసుకుంటున్నారు. ‘అరిచే కుక్కలు కరవ్వు’ అనే సిద్ధాంతానికి కాలం చెల్లిపోయింది. కరవడం సంగతి ఎట్లా ఉన్నా ముందు అరవడం  రాజకీయనేతలకు, రాజకీయాలలో నిలబడుండాలనుకొనే ఆశావాహులకు ముందుండాల్సిన అర్హతగా మారిపోయింది. 

కోపతాపాల ప్రకటనకు నిన్న మొన్నటి వరకు కొద్దో గొప్పో ముసుగులూ గట్రా ఉండడం కద్దు! కొంపలో కొప్పట్టుకు చితక్కొట్టే కిరాతకుడూ  ఫేస్ బుక్  పోస్టుల దగ్గర కొచ్చేసరికి పురుషోత్తముడి అవతారానికి తగ్గకుండా సూక్తులు వల్లించేవాడు.  అందరూ అందరి మీదా అన్ని వేళలా అన్నిరకాల ఆగ్రహావేశాలు ప్రకటించడం వల్లవని వ్యవస్థలో  మనమున్నది.. అనుకునే వాళ్లం నిన్నటి వరకు.  ఏ కులం పేరుతోనో, మతం పెరుతోనో, లైగింగ దృష్టితోనో దూషించినట్లు ఫిర్యాదు వచ్చిన ఉత్తరక్షణంలో కనీసం ప్రాథమిక సమాచార నివేదిక సెక్షన్ల కిందయినా కొన్ని కేసులు పోలీస్టేషన్లలో బుక్కవుతుండేవి.  ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులే పూనిక వహించి ప్రత్యక్షంగా ఈ సరిహద్దులు చెరిపేసే బ్రహ్మప్రయత్నాలు చేస్తున్నారు. సభను తీరుగా నడిపించే బాధ్యత రాజ్యాంగబద్ధంగా స్వీకరించిన బుద్ధిమంతులే స్వయంగా  సాక్షాత్తూ చట్టసభల్లో జిహ్వపదును ప్రదర్శన స్పర్థల్లో ముందుంటున్నారు. కోపతాపాల బాహాట ప్రకటన కోసంగానూ స్థిరబడ్డ  వ్యవస్థ  దిష్టిబొమ్మల దగ్ధం, పాత పాదరక్షల, కలం సిరాల ప్రయోగ విధానాలు గట్రా!  వాటి మార్కెటు పుంజుకునే  కన్నా ముందే నానారకాల నోటి దూలలను రేటింగ్ రూపంలో లేటెస్టుగా టి.వి ఛానెల్స్ సొమ్ముచేసుకోవడం ఒక విపరిమాణం.  

'ఎక్కడయ్యా నీ అహింస/ఏడ నీ కరుణా రిరంస/చూడు దేశం ద్వేష భుగ్నం/క్షురత్ జిహ్వానల విభుగ్నం' అని మహాకవి మొత్తుకుని ఇప్పటికి సుమారు వందేళ్లు.  పందెంకోళ్లాటను మించి నడుస్తోంది దేశం బరిలో నేతల కారుకూతల పర్వం!

 

'ధారణిరాజ్యసంపద మదంబున కోమలి కృష్ణ జూచి రం/భోరు నిజోరుదేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ము దు/ర్వార మదీయబాహుపరివర్తితచండగదాభిఘాత భ/గ్నోరుతరోరు జేసెద సుయోధను నుగ్రరణాంతరంబునన్' అంటూ  'కురు గురు వృద్ధ బాంధవులు అనేకుల చూస్తుంండగానే నిండు సభ సాక్షిగా మదోద్ధురుడైన సుయోధనుడి సోదరుడు దుశ్శాసనుడు  పాంచాలిని పరాభవించి భీమసేనుణ్ని రెచ్చగొట్టిన మహాభారతం ఘటన మనందరికీ తెలిసిందే! అంత పట్టరాని ఆగ్రహంలో కూడా  ఆ పాండవ ద్వితీయుడు 'లోకభీకర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైలరక్తౌఘనిర్ఝరమును’ ఆస్వాదిస్తాననే భీకర ప్రతిజ్ఞ వరకే పరిమితమయాడు తప్పించి 'ఖలుడు'   అన్న ఒక్క ముక్కకు మించి ఆ దుష్ట దుశ్శాసనుణ్ణి దుర్భాషలాడనేలేదు.  అంతటి ఆగ్రహంలోనూ ఆ మాదిరి నిగ్రహం కాకతాళీయమా అంటే?  కాదనేందుకు మరో ఉదాహరణ చెప్పాలి.   విరాటుడు కొలువు కూటమిలో ఉన్నప్పుడు అక్కడికి భీత హరిణి 'కోపవేగమున కన్నుల నిప్పులు రాల నంగము/ల్గనలగ సాంద్ర ఘర్మ సలిలంబులు గ్రమ్మ, నితాంతదంతపీ/డన రట దాస్యరంగ వికటభ్రుకుటీచటుల ప్రవృత్త న/ర్తన ఘటనా ప్రకార భయదస్ఫురణా పరిణద్ధమూర్తి' గా మారాడే తప్పించి నోటితో ఒక్క ‘ఛీ’త్కార శబ్దం కూడా చేసిందిలేదు. 'నేలయు నింగియు దాళముల్ గా జేసి యేపున రేగి వాయించి యాడ,/గులపర్వతంబులు గూల్చి యొండొంటితో దాకంగ వీకమై దన్ని యాడ,/నేడు సాగరములు నిక్కడక్కడ బెట్టి పలుచని రొంపి మై నలదికొనగ,/దిక్కులు నాలుగు నొక్కచోటికి దెచ్చి పిసికి పిండలి సేసి పిడుచగొనగ,

 మిగిలి బ్రహ్మాండభాండంబు పగుల వ్రేయ/నప్పళించుచు/ బ్రళయకాలానలమున/ గండరించిన రూపంబు కరణి భీముడు భయంకరాకారత నతిశయిల్లాడినట్లు తిక్కన మాత్రమే చెప్పుకొచ్చాడు. భారతదేశ రాజకీయ సంస్కృతి, ముఖ్యంగా తెలుగురాష్ట్రాలలో మనం నేడు చూస్తున్న రాజకీయ వాతావరణం తిక్కన భారతం  మార్క్ ‘బండబూతుల’ స్థాయికి అప్డేట్ అవడం ఇప్పుడు ప్రజాస్వామ్యవాదులందరినీ విపరితంగా కలచివేస్తున్న తాజా దురవస్థ. 

సాక్షాత్తూ మంచి చెడులు అన్ని కోణాల నుంచి తరచి చూసి , సాక్ష్యాల ఆధారంగా, రాజ్యాంగ పరిథిలో నిరపేక్షతో కూడిన తీర్పులిచ్చే న్యాయవ్యవస్థ ‘న్యాయదేవత’కు ప్రతినిధిగా మనం భావిస్తూ వస్తున్నాం. న్యాయదేవత కూడా ఇప్పుడు  ఈ  వాచాలత నిందల దాడులను ఎదుర్కొంటోంది. దేవుళ్ల మీదా నిందలేనా? అంటూ నివ్వెరపోయే దుస్థితుల నుంచైనా సామాన్య పౌరుడిని బైటపడవేసే అత్యయిక పరిస్థితి వచ్చిపడింది

తగు సమయంలో ఈ తరహా దుష్టాతి దుష్ట సంస్కృతులకు అడ్డుకట్ట పడని పక్షంలో పేరుకు మాత్రమే మనది మెజారిటీ ఓటర్లు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాల నడిపే స్వచ్ఛమైన, స్వేచ్ఛాయుతమైన పాలన అని చెప్పుకోవాలి


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...