'న్యూస్ పేపరు చూస్తూకూడా ఆ నవ్వులేంట్రా? శ్రీధర్
గారి కార్టూనా?'
'అదెలాగూ బాగుంటుందిలే బాబాయ్!
నయీం బేగం నయా చాయాచిత్రం కూడా అలాగే నవ్వు తెప్పిస్తోంది! ఆ
మీసాల మధ్య ముక్కుకి బులాకీ.. చెవులకు బుట్ట కమ్మలు.. బొట్టూ.. కాటుక.. చీరె కుచ్చెళ్ళు
జారి పోకండా తమలపాకు వంటి పాదాల పైకి సుతారంగా ఎత్తి పట్టుకోడం..'
' ఆపుతావా.. పిచ్చి కపిత్వం! పులిలాంటి
నయీం భాయీని.. ఇలా నారీమణి
గెటప్పులో చూస్తే ' పాపం' అనిపించాలిగాని..
ఆ గేలిచేయడం.. అదీ.. టూ బ్యాడ్!'
'బాబాయ్! 'పాపాల పుట్టం'టూ వారం
బట్టీ లోకంమొత్తం కోడై కూస్తుంటే.. నీ మొహమేంటీ.. అలా.. పులి .. జాలీ.. ' అంటూ పాలిపోయుందీ! కొంపదీసి నువ్వూ..'
'నయం! ఉన్నమాటనుకోడానికి భయమెందుగ్గానీ.. నయీంలా వేషాలు వేయడం.. ఇవాళే ఏమన్నా కొత్తగా పుట్టుకొచ్చిన కళా?
అమృతం పంచేటప్పుడు జగన్నాథుడు వేసిందీ జగన్మోహినీ గెటప్పే గదా!
గిట్టినవాళ్ళు ఏ వేషం వేసినా..ఆహాఁ.. లీలలు.. ఓహోఁ..మాహాత్మ్యాలంటూ.. ఈలలూ..
చప్పట్లా? గిట్టకపోతే ఇట్లా పిల్లికూతలూ.. పిచ్చి వాగుళ్ళూనా!
ఉదర నిమిత్తం..'
'.. బహుత కృత వేషం- కడుపు నింపుకోడం కోసం కడు కృతక వేషాలు! తెలుసులే బాబాయ్ మాకూ సామెతలు!
కానీ నువ్వే ఇలా.. నయీంలాంటి నయవంచకులమీదా ఉదారవాదాలెందుకు ప్రకటిస్తున్నది!.. విచిత్రంగా
ఉంది.. తమరి తరహా!'
'కృతయుగంలోనే తప్పింది కాదురా వేషాలు వేయడం! కలియుగం కాబట్టి.. కలికి
కామాక్షి వేషం వేసినా .. చిలికి చిలికి ఇలా గాలివానై పోతుంది కానీ! ధర్మ
సంస్థాపనార్థం ప్రతీ యుగంలోనూ అవతారమెత్తుతానని పరమాత్ముడంతటి వాడే సెలవిచ్చాడు.
అవతారం అంటే మారువేషం
కాదా?'
'ధర్మసంస్థాపనకు.. అధర్మ పీడనకు.. తేడా పాడా చూడద్దనా నీ ఉద్దేశం! హత్యలు..
అత్యాచారాలు.. కుట్రలు.. కుతంత్రాలు..
బలవంతపు..’
‘ఆపాపు..’
‘అహల్యకోసం దేవేంద్రుడు చాటుగా గుడిసెలో దూరిన కోడి వేషానికి..
సీతమ్మతల్లికోసం రహస్యంగా హనుమంతుడు వేసిన బుల్లి కోతి వేషానిక్కూడా తేడా
లేదనేట్లున్నావే? రావణాసురుడేసిన సన్యాసి వేషానికి నకలు
బాబాయ్ తమరి నయీం భాయీసాబ్ వేసిన నయగారి ఆడంగి వేషం'
'ప్రపంచమే ఓ నాటక రంగం' అన్నాడ్రా పెద్దాయన షేక్స్పియర్. ఆ రంగంమీద ఎవరే
వీరంగం వేసినా అవన్నీ మారువేషాల కిందే లెక్క. డార్విన్ పరిమాణ సిద్ధాంత ప్రకారం
మనమంతా సురులం కానీ..అసురులం కానీ.. నరుల మేకప్పులో ఉన్న వానరులం.. ప్రపంచ సుందరి
ఐశ్వర్యా రాయితో సహా!'
'పరాయి ఆడకూతుళ్ల జోలి మనకెందుగ్గానీ.. అవతలోళ్ళ మనీ గట్రా కాజేసేందుకు
వేసే 'షి' వేషానికి.. మంచి వేషానికి
మధ్య తేడానే లేదంటే మాత్రం నే చస్తే ఒప్పుకోను'
'మనిషి'లోనే
రెండొంతుల మనీ ఉంది
చూసావా.. తమాషా! కాబట్టి దాని రాబట్టడంకోసం మనిషి వేసే 'షి'
వేషాన్ని అమానుషమంటే నేనూ ఊరుకోను. పళ్ళు నూరుకోనంటే ఓ మంచి మాట
చెనుతా వినుకో! ఆ తరువాత గమ్మున వెళ్ళిపో! మంచికో చెడుకో సమయ
సందర్భాలను బట్టి మనిషి ఏ వేషాలైనా వేయడం తప్పని సరి! ఆ లౌక్యం వంట బట్టకే.. మానవావతారం
ఎత్తినా శ్రీరామచంద్రుడు ఏ మారువేషాల జోలికీ పోకుడా
రామాయణం ఆసాంతం కన్నీళ్ల పర్యంతంగా కాలం గడిపింది. తప్పు
తెలుసుకొన్నాడు కాబట్టే తరువాతి కృష్టావతారంలో అడుగడుక్కీ న్నేసి రకాల మాయవేషాలేసి
లీలామానుషుడనిపించుకొన్నాడు. దేవుడికే లేని పట్టింపులు మానవమాత్రులం మనకెందుకురా? ఓ నమస్కారం పారేసి ముందు నువ్విక్కణ్ణుంచి
బైలుదేరు! ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోకుంటే ఎట్లారా నీతో?’
'తమరి సలహాకో పెద్ద నమస్కారం!'
'ఆ వెటకారాలే వద్దనేది. 'షాట్ గన్ సిన్హా’ వేషమేసేస్తేగానీ పార్లమెంటు ఆవరణలోనైనా సెక్యూర్టీ చెకప్పుల్లేకుండా చెప్పులు విడవనీయరీ దేశంలో! ఒక్క అయ్యప్ప గుళ్లో
ధర్మదర్శనానికి తప్ప
ఆడపిల్ల ఆహార్యం అన్ని వేళలా.. మహా
సౌకర్యంగా ఉంటుందబ్బీ మన దేశంలో. ఎర్రబుగ్గ కార్లకన్నా ఎర్రటి బుగ్గలున్న పిల్లకు ముందు లైన్ క్లియరవుతున్నప్పుడు.. ఎంత వెర్రినాగన్నకైనా ఎర్రటోపీల
కన్ను కప్పేందుకు ముందు తోచే ఉపాయం ఆడపిల్ల వేషమే కదరా!
'బుర్ర తిరిగిపోతోంది బాబాయిక్కడ నీ తిరుగులేని వాదానికి'
'మరే! పరీక్షాపత్రాలు సెట్ చేసే పెద్దతలకాయలే పెద్ద పెద్ద పేపర్లీకువీరులు వేషాలేసేస్తున్నారు. పొట్టకోసినా అక్షరమ్ముక్క బైటకు రాని
నిరక్షరకుక్షులేమో పెద్ద పెద్ద విశ్వవిధ్యాలయల్లోకూడా కూడబలుక్కొనైనా సరే పట్టుభద్రులకు పాఠాలు చెబుతామని పట్టుబడుతున్నారు!
పాపుల మెళ్లకు పాశాలేసి ఈడ్చుకెళ్లాల్సిన యమకింకర్లు ఎలా జొరబడ్డారో
ధర్మాసుపత్రుల్లోకి.. . మెళ్లల్లో స్టెతోస్కోపులూపుకుంటూ వైద్యనారాయణుల
వేషాలేసేస్తున్నారు! గురజాడగారి గిరీశానిక్కూడా
కళ్ళు బైర్లు మారు వేషాల్తో చెదలు.. జలగలు.. గద్దలు.. రాబందులు.. కథలు నడిపించేస్తున్నపుడు పాపం
ఒక్క నయీంభాయీ ఒక్క పూటేదో ఆడవేషమేసినందుకుట్రా
మీకందరికీ కుట్ర.. కుతంత్రాల్లాగా గంగవెర్రులెత్తుతోంది! వెర్రినవ్వులు
తెప్పిస్తోంది!' మారువేషమనంగానే మాయలేడి మార్కు మారీచుళ్లనేనా పెడర్థం?’
'అలాగని కాదూ! దేశస్వాతంత్ర్యం కోసం ఎన్నో వేషాలేసి దేశాలు పట్టుకు తిరిగిన
మహానుభావుడు నేతాజీ
ఉన్నాడని తెలుసూ. ఎన్నికల ముందొక వేషంలో
జనం మధ్య కనిపించి.. గెల్చినాక.. మరో వేషంలో చట్టసభలో కునుకే
నేతాశ్రీలూ ఉన్నారని తెలుసు. ఇద్దరి వేషాల్లోనూ తేడా బొత్తిగా లేదనేటంత మొద్దునైతే కాన్లే బాబాయ్ నేను! ఆశారాం బాపూలు.. నిత్యానంద
స్వాములు.. కాషాయాల గెటప్పులేసుకొని ఆడపిల్లల్తో స్టెప్పులేస్తున్నారు! అగ్రిగోల్డు పెద్దలు.. సహారా సుభ్రతోలు.. వ్యాపారస్తుల ముసుగులో అమాయకుల
పర్సులు దులిపేస్తున్నారు. ఫోర్ ట్వంటీగాళ్లందర్నీనువ్వే ఇలా ట్వంటీ ఫోర్ కేరెట్ల గోల్డన్నట్లు సర్టిఫెకేట్లిస్తున్నావని బాధ!'
'బంగి అనంతయ్య చిందువేషాలేసినప్పుడు ఒంగొంగి నమస్కారాలు చేసిందెవర్రా?
పార్లమెంటు సార్లు పార్లమెంటు ముందు బుడబుక్కలోడినుంచి..
బుర్రకథ చెప్పేవోడివరకు రోజుకో పేషమేసినా విసుగేయదు? అవసరానికని
ఏదో అమావాస్యకోసారి ముక్కుసూటి తిక్క పోలీసుల్నుంచి తప్పించుకోడానికని నయీంసార్ లేడీస్ కాస్మొటిక్ కిట్టు వాడితే మాత్రం కితకితలొస్తాయేం
మీకు?’
'బాబాయ్! గురజాడగారి కన్యాశుల్కంలో మహిళల్లో మాణిక్యం మధురవాణికూడా మగవాడి వేషంమీద తెగమోజు పడింది.
కాకపోతే అదంతా ఓ అమాయకబాలను
ముసలి పెళ్ళికొడుకునుంచి తప్పించేందుకు పన్నాగం. తమరి నయీం భాయో! సరే..
నాకెందుగ్గానీ నీ నయీం
భజన నువ్వు చేసుకో.. నమస్కారం,, వెళ్ళొస్తా!'
'అమ్మయ్య! ఎప్పుడెంత తొందరగా దయచేస్తావా అని ఎదురు చూపులిక్కడ!. విగ్గు వాడ్డానికి సిగ్గు పడే వర్గానికి ఈ వీధిలో చోటు లేదు.. వెంటనే వెళ్ళిపో!’
***
'అబ్బాయ్! ఇల్లు చేరావా? ఇందాక ఆ మారువేషాలమీద
నేనన్నదంతా మనసులో పెట్టుకోకబ్బీ! నీ వాగుడు కవర్ చేయడానికి నే పడ్డ తంటాలవన్నీ! నయీం పోయాడు సరే! అతగాడి
అనుచరులంతా ఇంకా మా వీధి చుట్టూతానే తిరుగుతున్నార్రా!
నిన్ను, నన్ను రక్షించుకొనేందుకు వేసిన మారువేషంలో భాగంరా అబ్బీ ఈ నయా నయీం భక్తి!'
కర్లపాలెం హనుమంతరావు
***
(వాకిలి- అంతర్జాల పత్రిక- సెప్టెంబరు 2016 సంచిక 'లాఫింగ్ గ్యాస్ ' లో ప్రచురితం)