రోజూ ఒకే మాదిరి
రాజకీయాలంటే మజా ఏముంటుంది? చట్టసభలు నడిచే సమయలో అంటే అదో రకం వినోదమైనా దొరిదేది.
సభాసమయాలూ సినీతారల వస్త్రవిశేషాలకు మల్లే దినం దినం కురచనై పోతున్నప్పుడు ఓట్లేసి
గెలిపించిన జనాలను ఏం చేసి మెప్పించేట్లు ప్రజాప్రతినిధులు?
మామూలుగా అయితే
మామూలు జనం వినోదార్థం చలన చిత్రాలాడించే థియే'టర్లను నమ్ముకోడం ఆచారం. బోలెడంత సొమ్ము.. విలువైన సమమం రెండూ వెచ్చించి టిక్కెట్లు కోయించి
హాల్లో కెళ్ళి కూలబడ్డా మూడుగంటల్లో కనీసం ఒక్క సెకనైనా గాట్టిగా ఈలేసే పాటగానీ.. కేకేసే
కామెడీగానీ కరవవుతున్నప్పుడు .. ఇహ నటించి అలరించే బాద్యత ప్రజాప్రతినిధులదే అవుతుంది
కదా! కుదరదంటే వచ్చే ఎన్నికల మాటా?!
నిమ్మళంగా
ఊరుకొంటే పక్క రంగాల పోటీకూడా ఎక్కువై పోవచ్చు. ఆశారాం బాపూజీ జాతిపిత బాపూకన్నా పాప్యులరై
పోవచ్చు. నిత్యానందుల ప్రియసఖి నిత్యా మీనన్
కన్నా గ్లామరు గార్ల్ గా పేరు కొట్టేయచ్చు. జనం వినోదం కోసం వెంపర్లాడే అదను చూసి నయీం మార్కు భాయీలు సతీ సక్కుబాయి డ్రస్సుల్లో కనిపిసే
ప్రజాప్రతినిధుల గతేంటీ?!
బంగారక్క..
కేతిగాడు, పిట్టల దొర, కట్టె తుపాకీ రాముడు, గడ కర్ర నడక, గంగిరెద్దు పాట, చిందు భాగోతం, భామా కలాపం.. అంటూ ఏ మూలనుంచి ఏ నటనా దురంధరులో నటనా రంగంలోకి
దూకేస్తే ప్రజానాయకుల కార్యరంగం కబ్జా అయిపోయినట్లే! కోలాటం కర్రలొకసారి పక్క చేతుల్లోకి
మారితే.. ఇక్కడ చెక్క భజనెంత చక్కగా చేసినా
జనాలకిక పట్టి చావదు.
అక్కడికీ ఓటర్ల
నమ్మకం వమ్ముకాకుండా ఆమరణ నిరాహారానికి బదులు
ఆమరణ రిలే నిరాహార దీక్షలు.. నీళ్లు లేని నదుల్లో దిగి ముక్కుమూసుకు నిలబడ్డాలు, విజయరథాల్లో నిలబడి పాదయాత్రలు చేయడంలాంటి చిత్ర విచిత్రాలతో చపలచిత్త జనాల చిత్తాలని చిత్తు చేసే విన్యాసాల జోరు పెంచుతూనే ఉన్నారు.
అయినా ఆశించిన ఫలితాలు ఏ ఎన్నికల్లోనూ ప్రజలు ప్రసాదించడం లేదు!
పసికూనలమీద
అఘాయిత్యాలు జరిగి వాతావరణం వేడెక్కినప్పుడుకూడా జనవినోదం సంగతి మన నేతాజీలు పక్కన
పెట్టడం లేదు. 'మగకుంకలు కదా! వయసు కాక మీదున్నప్పుడు
దున్నపోతుల్లాకాక ధర్మరాజుల్లా ప్రవర్తిస్తారా! ఆడపిల్లలే కాస్త చూసీ చూడకుండా సహకరించాలి..
కానీ' అంటూ నవ్వించే కాకాజీలక్ కొదవుండటం లేదు.
'పశు మూత్రం ఫినాయిల్ లాంటిది. ఆసుపత్రుల పరిశుభ్రతకు ఆ ద్రావకం ఉపయోగిస్తే ఫినాయిల్
ఖర్చు బొక్కసానికి ఆదా అవుతుంద'ని మరో ప్రజానేత సెలవివ్వడం.. జనాలు కష్టాలు మరిపించి
నవ్వించేందుకు చేసే బృహత్ప్రయత్నమే! స్వీయ మూత్రంతో పెరటి సాగును దివ్యంగా సాగించొచ్చని
సాక్షాత్తూ ఓ కేంద్రమంత్రులే ఉధ్భోధించారంటే..
ప్రజావళిని కన్నీళ్ల సాగరంనుంచి గట్టెంక్కించేందుకు హోదాలతోకూడా నిమిత్తం పెట్టుకోకుండా హాస్యరస పోషణ చేసేస్తున్నారనేగా అర్థం!
ఒక్క అమాత్యులనేమిటి
కర్మభూమిలో పుట్టిన ఖర్మానికి పశుపక్ష్యాదులు సైతం ప్రజల వినోదార్థం తమ వంతు పాత్ర
నిస్వార్థంగా పోషిస్తున్నాయి. ఆ మధ్య జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పాలిటెక్నిక్కు ప్రవేశ
పరీక్షల్లో గోమాతలు కూడా పరీక్షలు రాసి ప్రజలను నోటమాట లేకుండా చేసాయి. వత్తిళ్లల్లో
ఉన్న సరిహద్దు ప్ర్రాంతానికి గోమాత పుణ్యామా
అని ఒకపూట ఉపశమనం.
'దేవుడున్నాడా?
ఉంటే గింటే ఏ రాజకీయ పక్షం? మూడు సింహాల అశోకచక్రంమీద కనువిందు చేసే 'సత్యం' ప్రస్తుత
నివాసం ఏదీ?'అంటూ సమాచార చట్టం కింద యోగాచార్యులొకరు సత్యాన్వేషణకు పూనుకున్నారు. దేవుళ్లమీద
జోకులేస్తే ఏమవుతుందో ఫ్రాన్స్ దేశం మనకు ముందే ఉదాహరణగా ఉంది. అయినా ప్రజా వినోదంలో
తనవంతు హాస్యపాత్ర నిర్వహించేందుకు అంతలా దుస్సాహం చేసారా ఆ చార్యులవారు. ఆధ్యాత్మిక రంగం సైతం పోటీకి వస్తున్న సందర్భంలో
ప్రజల మధ్య నిత్యం నలిగే ప్రజానాయాకుడు నిమ్మకు నీరెత్తినట్లు ఎట్లా ఉండిపోగలడు?
అందుకే 'దడా
దడా పడే వడగళ్లను దారి మళ్ళించి అన్నదాతను ఆదుకోకుంటే భూవిజ్ఞాన శాస్త్రవేత్తల ఇళ్లముందు ఆమరణ నిరాహార
చేస్తా'నంటూ ఓ ప్రజానాయకుడు ఆందోళనలు లేవదీసాడీ మధ్య. దిగజారుడు రాజకీయంగా చీదర పుట్టించ
వచ్చేమో గానీ.. చట్టసభల సమావేశాలు సరిగ్గా సాగని కాలంలో ఓట్లేసి గెలిపించిన జనాలను
ఏదో విధంగా వినోదపర్చక తప్పుతుందా మరి! అందులో తప్పు మాత్రం ఏముంది?
ప్రతిపక్షంలో
ఉండీ చట్టసభలకు హాజరవలేని కష్టకాలంలో ప్రశ్నలేసి ప్రజాసమస్యలు వెలుగులోకి తెచ్చే సావకాశం
తక్కువ. ఆ కొరత తీర్చేందుకే నవ్వు పుట్టించే చురకలిలా సర్కార్లమీద
వరసబెట్టి పడుతున్నాయని అర్థం చేసుకోవాలి.
వినోదానికి
ఉన్నంత గుర్తింపు వ్యాపార రంగానికి లేదు. ఆధ్యాత్మిక రంగానికి రాదు. న్యాయరంగానికి
నవ్వులాట అసలు పొసగదు. ఉద్యోగ రంగానికది పెద్ద చేటు. రాజకీయరంగమొక్కటే మినహాయింపు.
కనకనే ఎన్నికల్లో జనం చీదరించి అవతల పారేసిన చేదు మాత్రనే చక్కర బిళ్లగా చప్పరిస్తూ
.. జనాల చేత ఎలాగైనా చప్పట్లు కొట్టించుకోవాలని ప్రజానేతలు తిప్పలు పడుతున్నారు.
నేపాల్ భూకంప
బాధితుల పరామర్శకు వెళ్లిన విషాదఘట్టంలో కూడా రాహుల్ బాబు వినోదానికే ప్రధమ ప్రాధాన్యత
ఇవ్వడం మనం మర్చిపోకూడదు. సంతాప సందేశాన్ని కావాలనే కెమేరాలముందు జాతికంతటికీ కనిపించే
విధంగా కాపీ కొడుతూ నవ్వు తెప్పించేసాడు. ప్రధాన సమస్యలు చట్టసభలో చర్చకు వచ్చిన సందర్భంలో
కూడా బల్లమీద గుర్రు కొడుతూ భలే వినోదం కలిగించాడు. నిద్రలో సైతం జనవినోదం సంగతి మరచిపోలేని
మంచిబాలుడన్న జాలైనా లేకుండా మనమే మొన్నటి ఎన్నికల్లో బాబును నిర్దాక్షిణ్యంగా 'ఎడం'
చేసుకున్నాం.
అవేమీ మనసులో
పెట్టుకోకుండా మళ్లీ ఓటర్ల మనసులు ఆకట్టుకొనేందుకు కిసాన్ యాత్రంటూ యూపీమీదకొచ్చి పడ్డాడా! ఈ సారైనా ఎలాంటి పరిస్థితుల్లో
కూడా అధికారం 'చేయి' జారిపోరాదనే. మోదీజీ
'చాయ్ పే చర్చా'కి పోటీ.. 'కాట్ పే చర్చా' భేటీ! ఎవరికీ తట్టని ఈ కొత్త వినోదంతో జనాల మధ్యెలా చెలరేగి
పోయాడో ఆ మధ్య!
కెమేరాల సాక్షిగా
కడుపుబ్బే కామెడీ షో. కుర్చీ మళ్లీ సంపాదించాలంటే 'మంచమే' మంచి ఆయుదమని ఎలా తట్టిందో
మరి! మోదీజీ మీద అతగాడు రువ్వే నిప్పు రవ్వల్లాంటి మాటలు జనాలకు ఎలాగూ జోలపాటల్లాగుంటాయని కాబోలు..
ప్రశాంత్ కిశోర్ సాబు.. బాబు సభల్లో నులక మంచాల
డాబు.. సందర్భోచితంగా ప్రవేశ పెట్టేయించింది . సమావేశాల అనంతరం కనిపించిన
'మంచాల' సమరావేశాల దృశ్యం ఆసేతు హిమాచల పర్యంతం రాహులుకి అశేషమైన గుర్తింపు తెచ్చి పెట్టింది. సైకిలు అఖిలేషు బాబుతో కలిసి పోటీచేస్తున్నాడుగా
ఉత్తర ప్రదేశులో! చూద్దాం! నిజంగానే ఈ నయా గాంధీ
వర్గానికి అధికార పగ్గాలందితే ఇంకెన్ని
వినోద వల్లరులు చెలరేగిపోతాయో దేశం నిండా?!
-కర్లపాలెం హనుమంతరావు