Monday, January 9, 2017

లబలబల బలాబలాలు- ఏడుపు వల్ల ఎన్ని లాభాలో!- ఈనాడు సరదా వ్యాఖ్య


ఏడవడం గొప్ప కళ. కావాల్సొచ్చినప్పుడు కలవరపడిపోయి కడవల కొద్దీ కన్నీరు కార్చడం అందరికీ అంత సులభంగా అబ్బే విద్య కాదు. 'ఆ పిల్ల ఏవిఁటండీ బాబూ! ఎప్పుడూ నీళ్లకుండ నెత్తిమీదే పెట్టుకునుంటుందీ!' అని తిట్టిపోయడం తప్పు. ఏ ఉల్లిపాయ, గ్లిజరిన్ సీసాల సాయం లేకుండా అలా వలవలా ఏడ్వాలంటే ఎంత గుండెబలం కావాలీ?! బాలలకు, అబలలకనే కాదు.. లబలబలు నేతలందరికీ  కొండంత బలం. కాబట్టే పేదలకి అండగా ఉంటామని భరోసా ఇచ్చే  ధీశాలులూ భోరుమని కన్నీళ్ళు పెట్టుకుంటుంటారు అవసర మొచ్చినప్పుడు.
రోదన ప్రాధాన్యత రామాయణ కాలంబట్టె మహా ప్రాచుర్యంలో ఉంది. కోక తడుపుకొనైనా  కైకమ్మ కొడుక్కి పట్టం కట్టబెట్టాలనుకొన్నది. ముక్కు తిమ్మనగారి సత్యభామ ఎంత ముద్దుగా ముక్కు చీదకపోతే తిరిగి పారిజాతం దక్కించుకోగలింది?! 'ధర్మ విరుద్ధం, నరక కారకం. అపకీర్తి దాయకం.. అంటూ భగవద్గీత ఎన్ని అధ్యాయాలలో ముక్కదొబ్బులు పెట్టినా ..  ముక్కు చీదుళ్లను  చీదరించుకొంటే చివరికి విషాదయోగమే మిగులుస్తుంది.
కరుణానిధి కూతురు  తీహారు జైలు కన్నీళ్ల కథ గుర్తుందా? ఆ ఏడుపేదో ముందే  ఏడ్చుంటే ఆర్నెల్ల పాటు ఆ జైలు సిబ్బంది సెక్యూరిటీ కష్టాలు తప్పించినట్లయేది. చెరగండంనుండి గట్టెక్కాలనుంటే కల్మాడీలాగా వట్టి  'పిచ్చి' వేషాలే చాలవు. దేవుణ్నడ్డు పెట్టుకున్నా యాత్రల వరకే తాత్కాలిక ముక్తి. కన్నతల్లి సెంటిమెంటైనా పండక పోవచ్చు కానీ 'కళ్లకు ఆయింట్ మెంట్' తంత్రం ఎన్నడూ విఫలమయింది లేదిప్పటి వరకూ.. చరిత్రలో! దిక్కులేని దశలో దుఃఖమొక్కటే అక్కరకొచ్చేది.

యడ్యూరప్పకు ఏడుపు పవరేమిటో  తెలుసు. కాబట్టే పవర్లో ఉన్నంత కాలవూఁ ఏడుపు పోర్టిఫోలియోని తన దగ్గరే ఉంచుకొన్నాడు. బిక్క మొగమేయడం తప్ప  బిగ్గరగా ఏడవడం రాకే సత్యం రామలింగరాజు అన్నేళ్ళు అన్యాయంగా చిప్పకూడు తిన్నాడు. ఇనుప గనుల 'గాలి'  లక్షలు కోట్లు నిధులున్నా సాధించుకోలేని బెయిలు.. కేవలం ఓ పాతిక వేల పూచీకత్తుతో ఓ శ్రీ లక్ష్మి మ్యాడమ్ సాధించగలిగారు. ఆ ఘనత అమ్మగారిది కాదు.. అమె నెత్తిమీదున్న గంగాభవానిది
'నవ్వుకొనేందుకు  ముఫ్ఫై రెండు పళ్లు. ఏడవాలంటే కేవలం ఓ రెండు కళ్లే' అంటూ నవ్వుల సంఘం వాళ్లేవేవోఁ కుళ్లు కొటేషన్లు కొడుతుంటారు. నిజానికి నవ్వు నాలుగిందాల చేటు. మయసభా మధ్యంలో  పగలబడి నవ్వినందుకు పాంచాలికి పడ్డ గతి అందరికీ తెలుసు. కురుసభా మధ్యమంలో చిక్కడిపోయినప్పుడు 'హే కృష్ణా!' అంటూ చేసిన రోదనే కదా ఆ సాథ్వీమణి శీలాన్ని కాపాడ గలిగిందీ!
  'కలకంఠి కంట కన్నీరు ఒలికితే ఇంట సిరి నిలవదంటారు . వట్టిదే! చెరసాల చిప్పకూడు  ముప్పొఛ్చి పడ్డప్పుడు కాపాడేది  ఐయేయస్.. ఐపీయసుల్లో టాపు ర్యాంకుల యుక్తి కాదు! విరామం లేకుండా విసుగు పుట్టించే పాటి ఆరున్నొక్కరాగ  స్వరశక్తి.'ఇమ్మనుజేశ్వరాధములకు తన్నమ్మద్దని బమ్మెర వారింటి గుమంలో కూర్చుని కుమిలిపోయిన పలుకంజలి చేసిన గమ్మత్తదే కదా!
'ఏడవకు ఏడవకు వెర్రి నాగన్నా! ఏడిస్తే నీ కళ్లు నీలాలు కారు' అంటూ  తల్లులు పిల్లల్ని జోలపాటలప్పట్నుంచే తప్పుదారి పట్టించడం తప్పు. ఏమో.. ఎవరికెరుక? పెరిగి పెద్దయింతరువాత ఏ పెద్ద నోట్ల రద్దు గండంలో పడి జైలు పాలబడాల్సొస్తుందో? కీడెంచి మేలెంచమని కదా సామెత! 'కీ' ఇచ్చినట్లు రోదించడం బిడ్డకు ఉగ్గుపాలతోనే వంటబటించడం మంచిది.. బెయిళ్ల మీదన్నా జైళ్ల  బైట  మహారాజుల్లా బతికుబండి లాగేయచ్చు.
'వట్టి ఏడుపుగొట్టు' అనేదిహ ఎంత మాత్రం తిట్టుపదంగా భావించరాదు.   చంచల్ గూడా సెంట్రల్నుంచొచ్చినా  ఊటీ కెళ్లొచ్చినంత హుషారుగా ఉంచేదీ  బాష్పధారాస్త్రం!
నేరం మోపినప్పుడు మాయదారి రోగాలు కొనితెచ్చుకోడం పాతకాలంనాటి చిట్కా. రోజులు బాగా లేవు. నిజంగానే ఆరోగ్యం హరించుకు పోతున్నా అమర్ సింగతటి బుద్ధిజీవికే ఊరట దుర్లభంగా ఉందీ మధ్య కాలంలో.  ముందస్తు బెయిలు పప్పులు మునపటంతా సులభంగా ఉడకనప్పుడు.. ఆపకుండా నెత్తిమీద కుళాయి నొదిలి పెట్టి కూర్చోడ మొక్కటే ఆపదల్నుంచీ ఆదుకునే ఏకైక సాధనం. ఏమడిగినా ఏడుపొక్కటే జవాబుగా రావాలి. ఎంత గద్దిస్తే అంతగా దద్దరిల్లి పోవాలి రోదన. మౌనం అనర్థం. అర్థాంగీకారం కింద చలామణయ్యే ప్రమాదం పొచుంటుందందులో. ఆరున్నొక్క రాగం  రొదలో మనమేం చెబుతున్నామో అవతల  బుర్రకి  అర్థమై చావక  ఏడిచ్చావాలి. ఎన్ని చేతి రుమాళ్లు తడిస్తే అంత ఫలం. 'వలవలా ఏడ్చే 
బిడ్డరచేతికే  అరటి పండొచ్చి పడేద'న్నసామెత  మరిస్తే ఎలా? 
ఏడుపంటే మరీ అంత దడుపెందుకు? ఏడుస్తూనే పుడతాం. ఏడిపిస్తూ వెళ్ళిపోతాం. బతికినంత కాలం మనకు ఏడుపు.  పోయిన తరువాత మనవాళ్లకేడుపు. పుట్టినా, గిట్టినా; ఉన్నా, పోయినా తప్పించుకోలేని కన్నీటి సుళ్లనుండి వీలైనంత బెల్లంపాకం వండటమే సిసలైన స్థితప్రజ్ఞ. ఏడుపు అవసరమైనప్పుడు మొహమాటానికి పోయి   నవ్వడం కన్నాణం సరి కొత్తగా బైట పడుతున్న రోజులివి. సిబిఐ వామనుడు ముందు ఎవడెప్పుడు 'బలి' కావాల్సొస్తుందో దేవుడిక్కూడా ఉప్పందని రోజులు కూడా. 
ముందస్తు బెయిళ్లు, సెంటిమెంటు ఇళ్లు,  న్యాయదేవుళ్లకి ముడుపులు, సత్యదేవుళ్లకు సుళ్లు, మాయ రోగాలు, శాంతి పూజలు, దక్షిణ ప్రదక్షిణల్లాంటి రొటీన్ చిటుకులమీదే సంపూర్ణ ధీమాలు క్షేమకరం కాదు. ఎందుకైనా మంచిది.. ఇరవైనాలుగ్గంటలూ విరామ మెరుక్కుండా నెత్తిమీద కుండ నీళ్లు కారేట్లు  సాధన చేసుకోండి.. మంచిది*
-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు, 06-12-2011 నాటి దినపత్రిక, సంపాదకీయ పుటలో ప్రచురితం)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...