ఒంటిగంట కావస్తోంది.
సోమవారాల్లో సాధారణంగా రద్దీ ఉంటుంది. పేరుకి అది కో-ఆపరేటివ్ బ్యాంకే అయినా.. మంచి
బిజినెస్ సెంటర్లో ఉన్నందువల్ల దానికీ ఆని బ్యాంకుల మల్లేనే ఆ వేళ కస్టమర్స్ తాకిడి
ఎప్పటికన్నా ఎక్కువగానే ఉంది.
లంచ్ టైముకి
ఇంకో పావుగంట ఉందనగానే.. అయ్యర్ మెల్లిగా బ్యాంక్ మేనేజర్ క్యాబిన్లోకి వచ్చి కూర్చున్నాడు.
బ్రీఫ్ కేసులోంచి ఓ ఫిక్సుడ్ డిపాజిట్ బాండు తీసి బ్యాంకు మేనేజర్ ముందు పెట్టి అన్నాడు
'సార్! ఈ బాండ్ ఇవాళ మెచ్యూర్ అవుతుంది. కాస్త తొందరగా డబ్బిప్పించరా! రెండు గంటల బండికి
చెన్నై పోవాలి. ఇవాళ ఈవెనింగే నా వైఫ్ కి ఆపరేషన్. ఈ మనీ చాలా అర్జంట్!'
మేనేజరుగారా
బాండందుకొని చూసి 'మీరేనా అయ్యర్?' అనడిగాడు.
'అవును సార్!'
అంటూ ఐడీ తీసి చూపించాడు అయ్యర్.
బాండు వెనక
సంతకం తీసుకొని కంప్యూటర్ తెరమీద వెరిఫై చేసుకొని తృప్తి పడిన తరువాత 'ఓకె! ఒక్క హావెనవర్
వైట్ చేయండి! క్యాషియర్ లంచికి వెళ్లినట్లున్నాడు. రాగానే అరేంజ్ చేస్తాను' అంటూ బాండుతో
సహా బ్యాంకు హాల్లోకి వెళ్ళి పోయాడు మేనేజర్.
అద్దాల్లోంచి
ఆయన ఎవరో ఆఫీసరుకి ఐడి చూపించి మాట్లాడుతుండటం.. ఆ ఆఫీసరు మధ్య మధ్యలో తలిటు తిప్పి
చూస్తూ ఉండటమూ కనిపిస్తూనే ఉంది అయ్యరుకి.
మేనేజరుగారు
ఎటో వెళ్లిపోయాడు.. బహుశా లంచికేమో!ఇంకో ముప్పావు గంట తరువాత అటెండర్ వచ్చి 'సార్!
క్యాష్ రెడీగా ఉంది. అటొచ్చి తీసుకోండి1' అన్నాడు.
అయ్యర్ బ్రీఫ్
కేస్ తో సహా వెళ్లి క్యాష్ కౌంటర్ ముందుకెళ్లి నిలబడ్డాడు. లంచవర్ జస్ట్ అప్పుడే అయిపోవడం
వల్లనేమో హాల్లోనూ బైటా జనమాట్టే లేరు.
ముందే అరేంజి
చేసినట్లున్నాడు.. వందనోట్లు రెండు బండిల్స్, చిల్లర పన్నెండు వేలూ కౌంటర్ మీద పరిచి
చూపించాడు క్యాషియర్. 'సారీ సర్! మండే కదా! హెవీ పేమెంట్స్ వచ్చాయి. పెద్ద డినామినేషన్
అరేంజ్ చేయలేకపోయాం' అని నొచ్చుకున్నాడు కూడా.
బండిల్ అంటే
పది ప్యాకెట్లు. మొత్తం ఇరవై ప్యాకెట్లు. పదులు పది ప్యాకెట్ల మీద రెండూ! చిన్న సూట్
కేసులో సర్దుకోడం కుదరక సతమతమవుతున్న అయ్యర్ని చూసాడు మేనేజర్ గారు 'బాలప్పా! ఊరికే
అట్లా చూస్తూ నిలబదక పోతే సారుకి మన దగ్గరున్న బ్యాగేదన్నా ఇవ్వచ్చు కదా!' అని అరిచాడు.
బాలప్ప లోపలికి
తెచ్చిన బ్యాగులో డబ్బు సర్దుతుంటే.. అయ్యర్ మేనేజరుగారి దగ్గరికెళ్లి 'థేంక్స్!' చెప్పాడు. 'ఇట్సాల్ రైట్! ఇందులో నేను
చేసింది మాత్రం ఏముంది. ఎవరి మనీ వాళ్లకి సేఫ్ గా చేర్చేట్లు చూడ్డమే కదా.. యాజే మేనేజర్
నా ప్రైమరీ డ్యూటీ!ఆల్రెడీ టూ ఓ క్లాకయింది. ఈ టైములో ఆటోలు దొరకడం కూడా కష్టమేనే!
బాలప్పా! బైట మన రెడ్డి ఆటో స్టాండులో ఉందేమో చూడు! సార్ ని స్టేషన్లో దిగబెట్టి రమ్మను!'
అంటూ తన క్యాబిన్లోకి వెళ్లిపోయాడు మేనేజర్ గారు.
అయ్యర్ బ్యాంకు
బైటికొచ్చి రెడీగా ఉన్న ఆటో ఎక్కి కూర్చున్నాడు. బాలప్ప ముందే చెప్పి పెట్టిన ఆటో అదే
లాగుంది.. బాలప్ప అందించిన అయ్యర్ బ్యాగ్ లోపల పెట్టుకొని బాణంలాగా ముందుకు దూసుకు
పోయింది.
ఆటో వేగంగా
కన్నా ఎక్కువ వేగంగా కొట్టుకుంటున్నాయి అయ్యర్ గుండెలు! 'ఒకటా.. రెండా? రెండు లక్షల
చిల్లర! ఇంత ఈజీగా పనయిపోతుందనుకోలేదు. ఒక్కో సారంతే! వెంటనే అయిపోతాయనుకొన్న పనులు
ఏళ్లూ పూళ్లూ గడిచినా ఒక పట్టాన తెగవు. అసలు తెమలనే తెమలవనుకోనే పనులు .. ఎవరో తరుముతున్నట్లు..
ఇదిగో.. ఇలా.. చక చకా జరిగిపోతుంటాయి! లేచిన వేళా విశేషం. ఎన్నేళ్ళు కష్టపడితే ఇంత
డబ్బొచ్చి వళ్లో బడుతుంది!' వళ్లోని క్యాష్ బ్యాగుని మరింత ఆబగా దగ్గరికి తీసుకున్నాడు
అయ్యరు.
అప్పుడు చూసాడు
బ్యాగుమీది ఆ అమ్మాయి బొమ్మని. ఎక్కడో చూసినట్లుంది ఆ పాప ఫోటో! ఆఁ! గుర్తుకొస్తోంది
గోవింద రెడ్డి కూతురు ఫోటో కదూ అది? రెడ్డికి ఆ పాపంటే ప్రాణం. లాడ్జికొచ్చినప్పుడు
చాలా అల్లరి చేస్తుండేది. లాడ్జిక్కూడా ఆ కూతురు పేరే పెట్టుకున్నాడు రెడ్డి.. 'మంగతాయారు
లాడ్జి'
అలివేలు మంగనుకుంటా
ఆ పాప పేరు.
తను ఈ బ్యాగులో
తెచ్చిన లాడ్జి డబ్బే అప్పుడు బ్యాంకులో డిపాజిట్
చేసింది. అప్పటి బ్యాగింకా బ్యాంకులో భద్రంగా ఉందా?!
'నిజానికీ
సొమ్ము దక్కాల్సింది సాంబశివుడికి. చచ్చి ఏ లోకాన ఉన్నాడో పుణ్యాత్ముడు?' అయ్యర్ ఆలోచనలు
ఒక్కసారి పదేళ్లు వెనక్కి మళ్లాయి.
మంగతాయారు
లాడ్జిలో ఆ రోజు అట్టహాసంగా దిగిన చెన్నయ్ చెట్టియార్ తెల్లారే సరికల్లా బెడ్డుమీద
శవంగా మారాడు! తెల్లారు ఝామున బెడ్ కాఫీ ఇవ్వడానికని వెళ్లిన తనే ఆ దృశ్యం అందరికన్నా
ముందు చూసింది. కేష్ కౌంటర్లో పడి నిద్రపోతున్న సాంబశివుణ్ని నిద్రలేపి తీసుకొచ్చి
చూపించింది కూడా తనే! ఆ తరువాత .. పోలీసులు రావడం.. విచారణలు.. సాంబశివుణ్ని గుచ్చి గుచ్చి అడగడం.. అన్నీ తాను
అక్కడక్కడే తచ్చర్లాడుతూ గమనిస్తూనే ఉన్నాడు. అంత గందరగోళంలోనూ సాంబశివుడు తన పేరు
బైట పెట్టలేదు! ఎందుకో.. ఆ మధ్యాహ్నం తెలిసింది.
లంచ్ సప్లై
చేయడానికని వెళ్లిన తనను టాయిలెట్లోకి లాక్కెళ్లి ఈ బ్యాగే చేతిలో పెట్టి చెప్పాడు
'ఇందులో యాభై వేలున్నాయ్! ఇప్పుడే పోయి పండ్ల బజారులో ఉన్న కో-ఆపరేటివ్ బ్యాంకులో డిపాజిట్
చెయ్.. నీ పేరున! ఈ హడావుడంతా తగ్గింతరువాత ఆలోచిద్దాం ఏం చేయాలో!'
ఆ సాయంకాలమే
గోవింద రెడ్డిని పోలీసులు పట్టుకుపోయారు. సాంబశివుడు గాయబ్! భయమేసి తనూ చెన్నయ్ పారిపోయాడు.
కేసునుంచి
బైట పడ్డానికి రెడ్డి చాలా కష్టపడ్డాడని విన్నాడు తను. ఏడేళ్ల కిందట సాంబశివుడూ ఏదో
రోగమొచ్చి పోవడంతో డిపాజిట్ రహస్యం అతగాడితోనే సమాధి అయిపోయింది.
మధ్యలో రెండు
మూడు సార్లొచ్చి బ్యాండును గడువు కన్నా ముందే తీసుకోవాలనుకొన్నా ధైర్యం చాలలేదు. ఇవాళకూడా
బ్యాంకులో ఉన్నంత సేపూ ప్రాణాలు పింజం పింజం అంటూనే ఉన్నాయ్! ఆ ఏడుకొండలవాడి దయవల్ల
ఏ ఇబ్బందీ లేకుండానే పెద్ద మొత్తం చేతిలోకొచ్చి పడింది. ఈ చిల్లర పన్నెండు వేలూ మందు
తిరుపతి వెళ్లి ఏడుకొండలవాడి హుండీలో వేస్తే గానీ మనశ్శాంతి లేదు.
ఆటో ఠకాల్మని
ఆగిపోయింది. డ్రైవర్ సెల్లో మాట్లాట్టానికి ఆపినట్లున్నాడు. మళ్లా స్టార్ట్ చేయబోతే
ఒక పట్టాన స్టార్ట్ కాలేదు.
డ్రైవర్ బండిని
ఓ వారకు లాక్కెళ్లి ఆపి 'ఆయిల్ అయిపోయినట్లుంది. ఇక్కడే పెట్రోలు బంక్. ఒన్ మినిట్
సార్!'అంటో ఓ బాటిల్ తీసుకొని మాయమై పోయాడు.
తిరిగి వస్తూ
ఓ పోలీసాయన్ని వెంట బెట్టుకొచ్చాడు! ఆ కానిస్టేబులు కూడా ఎక్కంగానే బండి స్టార్టయింది..
ఏ ఆయిల్ పోయకుండానే!
ఆటో రైల్వేస్టేషను
ముందు కాకుండా పోలీస్ స్టేషన్ ముందు ఆగడంతో అయ్యరుకి సీన్ అర్థమై పోయింది. పారిపోవడానిక్కూడా
లేదు. క్యాష్ బ్యాగే కాదు.. తన చెయ్యీ కానిస్టేబుల్ చేతిలో ఉంది. మారు మాట్లాడకుండా
కానిస్టేబుల్తో పాటు స్టేషన్లోకొచ్చాడు అయ్యర్. బ్యాంకు మేనేజరూ అక్కడే ఉన్నాడు!
'నిన్నెందుకు
అరెస్ట్ చేసామో తెలుసా?' అనడిగాడు స్టేషనాఫీసరు.
'పదేళ్ళ కిందట
గోవిందు లాడ్జిలో చెట్టియారుకు కాఫీలో విషమిచ్చి చంపినందుకు.' చెప్పాడు సి.ఐ.
'నో! అబద్ధం!'
పెద్దగా అరిచాడు అయ్యర్. 'తననింకా బ్యాంకులో దొంగతనంగా డబ్బు డిపాజిట్ చేసినందుకు..
అనుకుంటున్నాడు అయ్యరు ఇప్పటి దాకా.
'మర్డర్ కేసా?
యావజ్జీవమో!.. ఉరిశిక్షో!' పెళ్ళాం పిల్లలు గుర్తుకొచ్చారు. 'చెట్టియార్ చావుకీ నాకూ
ఏ సంబంధం లేదు సార్!' బావురుమన్నాడు అయ్యరు.
'ఏ సంబంధమూ
లేకపోతే ఎందుకురా అట్లా పారిపోయావూ?' అంటూ ఠప్పుమని లాఠీ ఝళిపించాడు సి.ఐ. 'ఇంత డబ్బు
నీ కెక్కడిది బే! ఏం పని చేస్తే ఇంతొచ్చింది? దీనికోసమె నువ్వా చెట్టియార్ని చంపావని సాంబశివుడు చచ్చేముందు స్టేట్మెంటిచ్చాడురా
బెవకూఫ్!'
ఠపా ఠపా పడుతున్న
లాఠీ దెబ్బలకు అయ్యరు కళ్లు బైర్లుకమ్మాయి. పోలీసువాళ్ల మర్యాదలెలా ఉంటాయో మొదటిసారి
తెలిసొచ్చింది అయ్యరుకి. అట్లా ఎందుకన్నాడో తెలియదు 'సార్! సత్య ప్రమాణకంగా చెబుతున్నా.
చెట్టియారు చావుకీ నాకూ ఎలాంటి లింకూ లేదు సార్! నా పిల్లలమీద ఒట్టేసి చెబుతున్నా.
కావాలంటే ఈ డబ్బంతా తీసేసుకోండి! నన్నీ ఒక్కసారికీ ఒదిలేయండి సార్!'
'అట్లా రాసిస్తావు
బే!' అనడిగాడు సి.ఐ. సీరియస్ గా మరో దెబ్బేస్తో.
తలూపాడు అయ్యర్. బ్యాంకు మేనేజరు తయారు చేసుంచిన పేపర్లమీద గుడ్డిగా
సంతకం చేసేసాడు కూడా.
అయ్యరుని బైటికి
తీసుకు పోయి వచ్చిన ఆటోలోనే కుదేసిపోయాడు కానిస్టేబుల్.
దారిలో అన్నాడు
ఆటో డ్రైవర్ 'అయ్యరంకుల్! నన్ను గుర్తు పట్టారా? నేను.. సాంబశివుడి కొడుకుని శ్రీనివాసుని.
గోవింద రెడ్డి కూతురుతో కలసి లాడ్జిలో ఆడుకోడానికి వస్తుండేవాణ్ని. మా అయ్యా, నువ్వూ
కల్సి చేసిన వెధవ పని నాకు తెలుసు. అయ్యే చెప్పేడు పొయేముందు. మీరిద్దరూ చేసిన వెధవ
పనికి గోవింద రెడ్డి జైలు పాలయ్యాడు. కేసునుంచి బైటపడ్డానికి బోలెడంత ఖర్చయింది. ఆ
అవమానంతో ఎక్కువ కాలం బతకలా!' అంటూండంగానే ఓ పాతకాలం బిల్డింగుముందు ఆటో ఆగింది. 'రెడ్డి
కూతురు మంగతాయారుండేది ఈ అనాథ శరణాలయంలోనే. దానికి తండ్రినెట్లాగూ తెచ్చియ్యలేం. వాళ్ల
నాయన సొమ్ములో కొంతైనా ఇప్పిస్తే ఏదో మంచి కాలేజీలో చేరి ఓ దారి చూసుకొంటుందని..నేనే
ఈ ఎత్తు ఎత్తా.. స్నేహితుడిగా! ఇవాళ డిపాజిట్ మెచ్యూరవుతందని నాకు తెలుసు. బ్యాంకు
సారు, సి.ఐ సార్ కో అపరేషన్ ఇవ్వబట్టి ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. దిగంకుల్! నీ చేత్తోనే
మన తాయారుకి ఈ డబ్బిచ్చి 'సారీ!' చెబితే బాగుంటుంది' అంటూ సి. ఐ. సారిచ్చిన డబ్బు సంచీని
తీసుకొని బండి దిగాడు ఆటో డ్రావర్ శ్రీనివాసులు.
***
-కర్లపాలెం
హనుమంతరావు
(చిత్ర సకుటుంబ
సచిత్ర మాస పత్రిక 2011 లో నిర్వహించిన క్రైమ్
కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథానికి. జూన్- 2011 అనుబంధ సంచికలో ప్రచురితం)
No comments:
Post a Comment