Sunday, January 15, 2017

'ముగ్గు'గుమ్మలు


‘రాచవీధులన్నీ రంగు రంగుల రంగువల్లికలతో పెళ్లివారికి పరిచిన ‘పంచవర్ణ’ పాద వస్త్రాలవలె  శొభిల్లుతాయ’ని వాల్మీకి వర్ణన రామాయణంలో.  విడిది గృహానికి విచ్చేసే వాసుదేవుడికీ విదురుడిచేత  సప్తవర్ణ సంశోభాయమానంగా వివిధ ప్రాంతాల రంగవల్లికలతో స్వాగత సత్కారాలు జరిపిస్తాడు బమ్మెర పోతన భాగవతంలో. భారతీయ సంస్కృతిలో స్వాగతం, సంబరం, సంతోషం, ఆడంబరం..  సహృద్భావం ఏదైనా  సంకేతం రంగవల్లికే. సాదర స్వాగత సత్కారాలకే కాక..  ఆ అల్లిక  సుదతి   తన ఆంతరంగిక ప్రతీకగా సైతం భావించడమే  భారతీయ సంస్కృతి విశిష్ట లక్షణం. పుష్యమాసారంభంలో పౌష్యలక్ష్మికి, సంక్రాంతి పండుగ సందర్భంలో సూర్యదేవునికి, కృష్ణాష్టమినాడు చిన్నికన్నయ్యకి, నాగపంచమినాడు నాగేంద్రుడికి.. సందర్భానికి అనుగుణంగా ముగ్గులు తీర్చడంలో మగువలకుండే శ్రద్ధాసక్తులు అపరిమితం. మరీ ముఖ్యంగా ధనుర్మాసారంభంలో.. పెద్ద పండుగకి ముందు పట్టే నెల ముప్పై  దినాలూ ముద్దుగుమ్మలకు పొద్దంతా   ముగ్గుల ముచ్చట్లే! తొలి సంజె చలి పులి సైతం భయపెట్టలేదీ బేల మగువల తెగువలను. ‘ ‘ఇంత యోపిక గడించుకొన్న / దానవే తల్లి, యీ చిన్నితనమునందు?/  పిట్టలే లెక్క లల్లార్చి విడిచిపెట్ట/ బోవు మనికీ పట్టీ ముని ప్రొద్దు వేళ!’ అంటూ ‘తెలుగు కన్నె’ కర్త  బొడ్డు బాపిరాజుగారికి అంతలా ఆశ్చర్యం!  ‘కదిలి వచ్చుచున్న సంక్రాంతి రమకు/ తీపులూరించు మేటి యాతిథ్యం’ అందిచాలని తెలుగు  మిఠారీ పంతం. అందుకోసమే  ఆ భామ నరకాసుర సమరసమయ సందర్భ   సత్యభామలా కొంగు బిగించి.. ముందు వెనుకలకు వంగి.. మునిగాళ్లమీద  నిలబడి.. కదులుతూ.. ఇంటి ముంగిలి ముందు  నింగి సూర్య చంద్రులను తారా మేఘమాలికలతో సహా రేఖల సాయంతో కిందికి దించి ఏకంగా ఓ సౌందర్య సామ్రాజ్యమే సృష్టించేస్తుందట!’.. ‘సంక్రాంతి సంబరాల’ వంకన ఓ ప్రాచీన కవిగారి కల్పన.   పూర్ణ కలశం పట్టిన తెలుగు తల్లిలా, అమృతభాండమందుకొన్న జగన్మోహినిలా.. ముగ్గు గిన్నెతో కదిలే ఆ సుందరాంగి భంగిమలను దొంగచాటుగా అయినా ఆ  కవి  చూసుండాలి. తొలిజాము కలనయినా అలా గిలిగింతలు పెట్టుండాలి!
రమణులు రంగువల్లికలు  తీర్చిదిద్దే దృశ్యమాలికలు  ఎన్ని కమనీయ శృంగార ప్రబంధాలకు ప్రాణ ప్రతిష్టలు చేసుంటాయో!  ‘రంగవల్లిక అల్లికలొక స్త్రీ సంబధిత  కళాత్మక ఆభివ్యక్తీకరణం’ అంటాడు ‘కామశాస్త్రం’లో వాత్సాయనుడు.  ‘ఎక్కడ తప్పునో యని యొకించుక ఏమరపాటు లేకయే/ చుక్కలు లెక్క  పెట్టు కొనుచుండగ శ్రద్ధగ గల్పుచుండ నే/ దిక్కునుండి వచ్చెనొ అదే పనిగా తిలకించి భర్త ఓ/ ‘చక్కదనాల  చుక్క!’యన జవ్వని సిగ్గున నాపెముగ్గులన్’ అంటారు శ్రీపాద లక్ష్మీనారాయణ మూర్తి ‘సంక్రాతి ముగ్గుల’లో. నిత్యోత్సవ కళాత్మక జీవితానికి అరవై నాలుగు కళలూ ఆధారమేనన్న వాత్సాయనుడు రంగవల్లికలనూ ఆ జాబితాలో అందుకే చేర్చినట్లుంది.
‘ఆవు పేద తెచ్చి అయినిళ్లు అలికి/ గోవు పేడ తెచ్చి గోపురాలు అలికి/ ముత్యాలు చెడగొట్టి ముగ్గులేయించి/ పగడాలు చెడగొట్టి పట్టిలేయించి’.. ముగ్గుల ప్రాధాన్యతని ముచ్చటైన  మాటలలో కళ్లకు కట్టించే పల్లెపాటలు ఇలాంటివి ఇంకెన్నో! ముగ్గు కళ విశ్వవ్యాప్తం. దేశ కాల సంస్కృతుల ఆధారంగానే మార్పులు. నాగకుండలి బంధంలోని మెలికలు చలికాలంనాటి ప్రజల బాధలకు దర్పణం. రాధాకృష్ణల ముగ్గు లౌకిక సంసార యోగ రహస్యం. పుష్పాలంకృత రంగవల్లికలు జనజీవనంలోని సంతోష భావాల సంకేతాలు.  దుష్ట శక్తుల కట్టడికి ముగ్గులను ఒక కట్టడిగా ఆటవికుల కాలం నాటినుంచే భావించినట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యజ్ఞయాగాదుల్లోని ముగ్గులను గురించి రుగ్వేదం ప్రస్తావించింది. అల్పాయుష్కుడైన బిడ్డ చిరాయస్సుకోసం ఓ రాజవైద్యుడు చేసిన కఠోర దీక్షకు మెచ్చి వచ్చిన విధాత- బాలుణ్ని  పోలిన ముగ్గు వేయిస్తే.. ప్రాణ ప్రతిష్ట చేస్తాన’ని అభయమిస్తాడు. ముమ్మూర్తులా చిరంజీవిని పోలిన ముగ్గు వేయించి బిడ్డను కాపాడుకొన్న ఆ ప్రాచీన ‘సులక్షణ గ్రంథం’ కథ ముగ్గు మనిషి జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేయగలదో వివరించేందుకు పనికొచ్చే   చక్కని తార్కాణం. సింధు ప్రాంతంలోని తవ్వకాలలో బైటపడ్డ స్వస్తిక్ మార్కు ముగ్గులనుంచి.. శృంగార ప్రధాన  కళ్యాణ ఘట్టాలలో  వధూవరులు అధిష్ఠించే పీటలకింది పెళ్లి పట్టీల వరకు.. ‘ఎందెందు చూసిన అందందే కలదు’  కనువిందు చేసే అందాల ముగ్గు. మలి సంజె వేళ గడపకు అడ్డంగా గీసే రెండు  కర్రల  ముగ్గు అదృష్ట లక్ష్మినయినా గుమ్మం దాటి పోనీతదని తెలుగింటి అమ్మళ్ళ ధీమా.. విశ్వాసం!

విశ్వాసాల  నిజానిజాలు ఎలాగైనా ఉండనీయండి.. మనసు సున్నిత  భావావేశాలను  సుకుమార శైలిలో వెలిబుచ్చుకొనేందుకు వెలదికి తనకంటూ దొరికే ఆ పది నిమిషాలే రోజుమొత్తంలో ఆమెకు నిజమైన విలువైన క్షణాలు. ముగ్గులు వేయడం మగువకు మంచి వ్యాయామం- అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తొలి సంజెనే లేచి కళ్లాపి కలిపి.. ఆవరణలో చల్లడం కండరాలకు మంచి  వ్యాయమం! ఆసనాలు, యోగా.. అన్నీ   అతివలకు ఆ  ముగ్గులద్దే కొద్ది క్షణాలలోనే.    స్టీవ్ జాబ్స్ ‘కనెక్టింగ్ ది డాట్స్’  చదివే పాటి పరిజ్ఞానం లేకపోవచ్చు. చుక్కల లెక్కలు మహిళ బుద్ధికి చురుకు పుట్టించే మానసిక వ్యాపారం! వేలి కొసలనుంచి ముగ్గుపిండి సమంగా జాలువార్చడమంటే భావోద్వేగాలను స్వీయాధీనంలోకి తెచ్చుకుంటో వాటితో సక్రమంగా పనిచేయింధుకొనే సాధన. గీతలను కలపడం సమన్యయ సామర్థ్యాన్ని మెరుగుపెరుచుకొనే అభ్యాసం. ‘రంగవల్లికలు అర్థవంతమయిన  మనో వికాస పాఠాలు’ అంటారు మానసిక తత్వవేత రవిశంకర్.  పండుగరోజుల్లో ముగ్గు పోటీలు మగువ మనసులోని పోటీ తత్వ పటిమను గట్టిపరుస్తుంది. పండుగయిన మర్నాటినుంచి అంతా ఆటల్లో అరటి పండనే నైజం  అలవడుతుంది. ఆఖరి క్షణాల్లో హఠాత్తుగా ఏ భారీ వర్షమో కురవడం మొదలవచ్చు. ఆకతాయి వాహనాలేవైనా మీదనుంచి పోవచ్చు. ముగ్గు అందం పాడయిందని ముఖం ముడవ కూడదు. మునుపటి అనుభవంతో మరింత అందమైన ముగ్గు తీర్చిదిద్దు కోవచ్చన్న పంతం బలపడితే క్రీడాస్ఫూర్తి అలవడినట్లే. ‘తోడి కన్నె పడుచులతో గూడి పోయి/  గోమయము, బంతి పూలేరి కోరితెచ్చి/ దిద్దితీర్చివెట్టిన గొబ్బిముద్దలకును/ కొలువు పీఠమీ రంగవల్లులె  అగునగు’ అంటారొక ఆధునిక కవి. వారాలు తరబడి  నేర్చి ఎంతో శ్రమకోర్చి ముంగిలి ముందు తీర్చిన  ముగ్గయినా ఆయుష్షు ఒక రోజే! ‘నేర్చిన మరో కొత్త రతనాల రంగవల్లిక గుమ్మం ముందు కొలువు తీరాలంటే నిన్నటి ముత్యాల ముగ్గుకు సెలవు ఇవ్వాల్సిందే!’ నని  జీవిత పాఠం నేర్పించే రంగవల్లికను మించిన వికాస గురువు నెలతకు మరేమీ ఉండదు. నేలమీద చోటు కరువు. నింగికి ఆ  రంగవల్లికలు అమరవు. ఎంత ఆధునికత సంతరించుకున్నా మగువ మనసు ముగ్గుల్ని వరువవు.  అత్యాధునిక మాధ్యమం అంతర్జాలమే సాధనంగా ఇంతి ఖండాతరాలను సైతం సరకు చేయకుండా తన ముగ్గుల సామ్రాజ్యాన్ని   విస్తరించుకుంటూ పోతోంది. పుట్టింటినుంచి పసుపు కొమ్ములతో పాటు పట్టుకొచ్చిన సొమ్ములీ ముగ్గులమీది ప్రేమాభిమానాలు. మళ్లీ తన చిన్నారి చిట్టి తల్లికి ఆ ‘స్త్రీ ధనం’ పదిలంగా అప్పగిస్తేనే భారతీయ మహిళకు సంతృప్తి!  
-కర్లపాలెం హనుమంతరావు

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...