'ఇవాళ ప్రపంచ
నవ్వుల దినం.. బాబాయ్!'
''దినం' అనద్దురా!
ఏదో గుర్తొచ్చి దిగులవుతోంది!'
'ఈ వెటకారాలెప్పుడూ
ఉండేవేగా! నవ్వులన్నా నీకు చేదేనా బాబాయ్.. విడ్డూరం కాకపోతే?'
'ఈ ఒక్క రోజు
నవ్వేసి ఏడాది పొడుగూతా ఏడిస్తే మాత్రం ఏం లాభంరా బాబిగా? ఏడుస్తూ పుడతాం. ఏడిపిస్తూ
పోతాం. మధ్యలో మళ్లా ఈ నవ్వుల తంటా ఏంటంట? నవ్వితే నాలుగిందాల చేటు..'
'ఆ చేట భారతం
ఇప్పుడు తిరగేయద్దు ప్లీజ్! పాత పడ్డ సామెతల్ని
పట్టుకుని పండుగ పూట ఉత్సాహంమీద నీళ్లు పోయద్దు! నవ్వితే రక్తపీడనం పది టు ఇరవై మిల్లిమీటర్లదాకా 'ఠ'పీమని
పడిపోతుందట'
'రాజకీయాల్లేవట్రా
ఇరవై టు అరవై మిల్లిమీటర్లు 'ఢ'మాల్మని పెంచడానికి! ప్రయోజనమేముందంట?'
'అందుకే బాబాయ్
మానవ సంబంధాలు మెరుగు పరుచుకోమని సామాజిక వేత్తలు మొత్తుకొనేది. అందుకు నవ్వే చవకైన
మంచి మందు. లాంగ్ లైఫ్ కి లైఫ్ లాంగ్ లాఫే .. బఫే.. బాబాయ్!'
'అబ్బో ..
ఇంగిలి పింగిలీసు దంచుకొచ్చేస్తుందే అబ్బాయిగారికి. ఏ.పి ఇంగ్లీషు మీడియం జీ.వో ప్రభావమా బాబూ?'
'బాబోయ్! ఏ
మాటన్నా వెటకారమే? పరిశోధకులు చెప్పిన మాటకు
తెలుగు కుదరక యథాతధంగా చెప్పా. తప్పా?'
'పనిగట్టు
కొనొచ్చి భలే జోకులేస్తున్నావురా బాబూ పొద్దున్నే! పరిశోధకులకు గంటకో మాట గంట బజాయించి
మరీ చెబుతుంటారు. ఏడిస్తే గుండె బరువు తీరిపోతుందని ఒహడు. నవ్వితే నలభై నాలుగు కండరాలు
ఉపశమిస్తాయని ఇంకొహడు. 'నవ్వైనా.. పువ్వైనా.. నీ కోసం వికసించద'ని పాత సినిమా పాట.
ఎందుకీ నిదుల వృథా పరిశోధనలు? నిష్కారణంగా నవ్వితే చెంపలు రెండూ బద్దలవుతాయి. మొన్నా
మధ్య చెన్నయ్ విమానాశ్రయంలో అన్నా డి.ఎం.కె తంబికొకడికి ఓ ఎంపి అక్క చేసిన సన్మానం
గుర్తుందా?'
'వెతికి వెతికి
పటుకొస్తావేంది బాబాయ్ ఎక్కళ్లేని వెతలు.. కతలు? నవ్వమంటే నీకెందుకిట్లా ముళ్లు గుచ్చుకొన్నట్లుంటుందో
చస్తే అర్థం కాదు. దేవుడు నవ్వడు. జంతువులు నవ్వవు. చెట్లకూ పుట్లకూ పొట్టలూ గట్రాలుండవు
పగలబడి నవ్వాలన్న కోరికలు పుట్లకొద్దీ ఉన్నా. నవ్వే సౌకర్యం ఒక్క మనిషికే సొంతం. ఐదు
వేల హావభావాలున్నా మనిషి మొహంలో .. ఒక్క హాసవిలాసనమే నవరత్నాలు కురిపించే అవకాశం'
'రత్నాలూ..
రవ్వలూ ఎవరికిరా కావాలీ కాలంలో? రెండు రాళ్ల పొడలు అదనంగా మెరిసినా
బోలెడన్ని కిరికిరీలు పన్నుశాఖగాళ్లతో!
నగదుతో వ్యవహారాలు.. గట్రా తగ్గించుకోమని
మోదీలాంటి మహానుభావుడే తల మోదుకొంటుంటే.. ఇహ రాళ్లు రవ్వలతో రచ్చ చేసుకొనేదెవరబ్బా?
ఎక్కడ వజ్ర వైఢూర్యాలు రాలి పడతాయోనన్న బెంగతో ఈ మధ్య పెద్దోళ్లంతా నవ్వడం బాగా తగ్గించేసారు'
'ఎక్కణ్నుంచీ
ఎక్కడ కీడ్చుకుపోయావ్ బాబోయ్.. మేటరు?! నగదు రహిత లావాదేవీలు దివ్యంగా ఉంటాయెమో గానీ..
'నవ్వి పోతార్రా
ఆ మాట పైగ్గాని అంటే! నిత్యానంద స్వామి పళ్లికిలిస్తూ విడియోల పడి పరువు పోగొట్టుకుంటే.. ఎడ్యూరప్ప ఏడ్చి..
పోయిన పదవుల్ని మళ్లీ సాధించాడు. నవ్వుకే అన్ని
లాభాలుంటే పదేళ్లపాటు మన్మోహన్ సింగెందుకు ఎప్పుడూ మాడు మొహంతోనే దర్శనిమిస్తాడు? గిట్టుబాటయితే సింగపూరు బాటయినా వదిలి పెట్టడు మన ఏపి సియం చంద్రబాబు. మనవడు దగ్గరున్నప్పుడు తప్పించి
ఆయనెప్పుడూ నవ్వినట్లు కనిపించడు!'
'నలుగుర్లో
నవ్వితే అలుసు. పులుసులో ముక్కలా తీసేస్తారని తెలుసు. రోజుకో వందకు తక్కువ కాకుండా
చిర్నవ్వులు చిందిసుండే తప్ప అప్పు వాయిదాలు వేళకి విడుదలవవని నాబార్డు నిబంధనలు సవరించండి.
బ్రహ్మానందం ట్యూషన్ పెట్టుకొనైనా నవ్వులు సాధన చేస్తాడు. హాస ప్రయోజనాలు తెలీని జనాలెవరు
బాబాయ్ ఈ రోజుల్లో?'
' ఏం ప్రయోజనాల్లేరా?
ఇన్నేసి హాస్య చిత్రాలు చిత్రరంగాన్ని ముంచెత్తేస్తున్నాయౕ అన్నీ నిర్మాతను ముంచేసేవే?
పటాస్ కార్యక్రమంకన్నా టీ.వీ లో 'టియర్ గ్యాస్' ధారావాహికాలకే టి ఆర్ పి రేటింగెక్కువగా
తగలడింది. అయినా నువ్విట్లా పరగడుపునే 'పక పకా నవ్వమ'ని పని గట్టుకు కొంప కొంపకీ తిరగడమెందుకురా..
పరగడుపునే?కోట్లక్కోట్లు కుంభకోణాల్లో కుమ్మేసిన బాబులు కేవలం రెండు వేల కొత్త నోటుకోసం
బ్యాంకు క్యూలో గంటల కొద్దీ నిలబడినప్పుడే
పొట్ట పగిలింది దేశం మొత్తానికి. పరగడుపునే బహిష్కరణ.. మిట్ట మధ్యాహ్నం ఆలింగనం, రాత్రి భోజనం బల్ల ముందు రాజీ! ములాయంజీ పస్తాయింపుల్చూస్తూ
నవ్వాపుకోగల సత్తా బహుకొద్దిమందికే ఉంటుంది. హస్తిన ప్రధాని పీఠాన్ని కూలదోయాలని దీదీ
పదే పదే కర్రుచ్చుకొని చేసే చిందు భాగోతం నవ్వు తెప్పించదెవరికి? తెనాలి రామలింగడే అక్కర్లేదు..
ఢిల్లీ మార్కు కేజ్రీవాల్లాంటి విదూకషుడొక్కడున్నా చాలు.. నేటి రాజకీయాలు డొక్కలు నొప్పుట్టించే
నవ్వుల తూటాలే!'
'అవన్నీ రాజకీయాల్లో
బాబాయ్! రోజువారీ బతుకుల చీకాకులతో చిరాకెక్కే
సామాన్యుడుకి సవ్యంగా నవ్వుకొనేందుకు
నాలుగు సెకన్లైనా కావాలి గదా?'
'రోజువారీ
అవసరాలకు సరిపడా చిల్లర వాడి చేతుల్లో పొయ్యి! ఏ టి యం మీటలు నొక్కంగానే 'నగదు లేదు'
చీటీకి బదులు నగదు సరిపడినంతగా వచ్చే ఏర్పాటు చెయ్యి! బ్యాంకు చెక్కులకి చిక్కుముళ్లేవీ
పడకుండా చటుక్కున రొక్కం వచ్చేట్లు మార్పులు చెయ్యి! గీకే యంత్రాలు గీరబోకుండా కార్డు
లాగంగానే పని పూర్తయే ఏ తారక మంత్రం కనిపెడతావో? జనం పెదాలమీద చిర్నవ్వులు పూయాలంటే
ఇలాగే ఇంకా ఎన్నో చెయ్యాలి ముందు. ఏడాదికో
సారి ప్రపంచంతో పాటు 'నవ్వుల దినోత్సవాలు' ఎంత ఘనంగానైనా నిర్వహించుకోరా! తప్పేంలేదుగాని.. ఈ రెండు వేల పదిహేడులో ఏ రెండు వేల నోటు కంటబడ్డా
కేవలం ఓ 'పది' మంది మాత్రమే గుర్తుకొచ్చే సంకట స్థితినుంచి మాత్రం దేశమంతా బైటపడాలిరా ముందు!'
'నిజమే బాబాయ్!
అప్పుడే ఇవాళ్టి 'ప్రపంచ నవ్వుల దినా'నికి 'దినం' అనే అర్థం కాకుండా 'దినోత్సవం' అన్న అర్థం సార్థకమయ్యేది! అందకా మన
వంతు ప్రయత్నం కూడా కొంత ఉండాలి గదా! ఈ సారి ఖైరతాబాద్ ట్రాఫిక్ మధ్యలో ఇరుక్కున్న
శాల్తీలక్కూడా విసుక్కి బదులు కిసుక్కుమని నవ్వే ఓపిక సాధన చేయిస్తున్నాం.. మూసీ పక్కన
ఖాళీ స్థలం వేదిక. రోజూ నువ్వటే గదా పోయి..
అక్కడే ఇరుక్కుని ప్రపంచాన్నంతా పడ తిట్టేది! వెటకారాలు నూరుతుండేది! ఒకళ్ల మీద ఒకళ్లు చక్కటి
ఛలోక్తులు ఎలా విసురుకొంటారో.. విసుగు ప్రదర్శించకుండా క్రీడాస్ఫూర్తితో ఎంత ఉల్లాసంగా
కాలక్షేపం చేస్తారో చూద్దువుగానీ ఒకసారి పద బాబాయ్! నవ్వడానికి ఏదైనా కారణం తప్పని
సరిగా ఉండాలని భావించే నీలాంటి వాళ్లు తప్పకుండా దర్శించవలసిన పురుషార్థ క్షేత్రం అనుకో!
ఎన్నో ఏళ్ల కిందట ఎక్కడో ముంబయి రేసుకోర్సులో అనుకోకుండా కలసిని పెద్దలు కొందరు మానసికోల్లాసానికని
కనిపెట్టిన మంచి మందు ఈ సామూహిక హాస్య ప్రయోగం. నువ్వూ కాస్త పుచ్చుకుని చూడు బాబాయ్!
‘ఏడిపించే
వాళ్లే ఎక్కువవుతున్న ఈ కలి కాలంలో నవ్విస్తాం రమ్మని పిల్చేవాళ్లు దొరకడం నిజంగా అదృష్టమేగా! ఛలోరా అబ్బాయ్.. మీ చలాకీ సభాస్థలికి!
-కర్లపాలెం హనుమంతరావు
***
No comments:
Post a Comment