చంద్రన్నో.. కే సీ ఆరన్నో.. కేకేసి మరీ కానుకలు కుక్కేసి పండగ పండక్కీ పంచేసే సంచీలు అంటే పబ్లిక్కి
ఎప్పుడూ మా లావు కిక్కే. బళ్లకెళ్లే పిల్ల
బుడంకాయలకే బ్యాగులంటే భుజాలమీద ఏళ్లాడే బేతాళుల్ల లెక్క! ఒక్కో
బుక్కులబ్యాగు పది గాడిదలు కల్సి ముక్కి
మూలిగినా లాగలేనంత తుక్కు బరువని ఒకటి. సమాధానం తెల్సి చెప్పినా..
తెలీక గమ్మునున్నా తల వెయ్యి వక్కలయ్యే భూతాల యవ్వారమని.. ఇంకోటి! అన్నీ
పితలాటకాలే!
బ్రహ్మదేవయ్యకు బద్ధకం బలిసిందో.. చదువులమ్మకే
చతుర్లెక్కువయ్యాయో? తెలుగు రాష్ట్రాలు
రెండింటిలో బడి బుడతలిప్పుడు స్కూలుబుక్కు బ్యాగుల్ని చూస్తే చాలు.. గబుక్కుమని జడుసుకుని జొరాలు తెచ్చేసుకుంటున్నరు!
తొమ్మిది, పది తరగతుల సంచీల బరువు ఆరు కిలోలకి
మించి ఉండద్దన్నది కదా సర్కారు సార్ల హుకూం! అయినా లిఫ్టు లేకుండా మూడో అంతస్తు తరగతి కొండకు రోజూ మాదిరి గేసుబండ బరువుండే పుస్తకాల సంచి మోసుకుంటూ
ఎదురు దేకలేక .. పాపం.. ఓ లేత ప్రాణానికి
నిండా నూరేళ్లు నిండినాయంట!
అడ్డమైనోళ్ల మైల కుప్పలు.. రెండు పూటలా రేవులకీ మోసే ఓపిక లేక ‘ఓఁ..ఓఁ..’అంటా
ఓండ్ర పెట్టే అడ్డగాడిద లిప్పుడు.. పేరు గొప్ప ప్రయివేటు బళ్ల పిల్లకాయల రొప్పులు వినీ వినీ కన్నీళ్లు తెగ కార్చేస్తున్నయి! ‘అడ్డగాడిదలుగానైనా పుట్టుడుకు రడీనే! బాబ్బాబూ.. ఆ తెలుగు రాష్ట్రాల్ల బడిపిల్లకాయలకు మల్లే మాత్రం పుట్టించి మమ్మల్ని
శిక్షించకండి మహాప్రభో!’ అంటా సృష్టికర్త
కాళ్లా వేళ్లా పడి తలలు మోదుకుంటున్నాయంట.. బ్రహ్మలోకం టాకు!
సత్యకాలం కాబట్టి హిరణ్యాక్షుడు భూగోళం మొత్తాన్ని చాపలా చంకలో చుట్టేసి
చులాగ్గా తారుకున్నాడు.
ఈ కలికాలంలో ఆ ఘనకార్యం రిపీట్ చేసి చూపించమనండి! బుడ్డ వామనుడు తొక్కేసిన బలిదేవుడికి మల్లే పాతాళం అడుక్కి అణిగి పోవుడు ఖాయం!
పేటకో కార్పొ’రేటు’ బడి. బడికో పాతిక తరగతులు. తరగతికో వంద బెంచీలు.
బెంచీకో పదిమంది మందమతులు. మతులెంత మందంగా ఉంటేనేమి స్వామీ.. వీపున మోసే
పుస్తకాలు మాత్రం వందకు ఒక్కటి తగ్గినా డొక్కచీరుడు ఖాయం. చూసి రాసే బుక్కయినా సరే.. వీశకు వీసమెత్తు
తక్కువ తూగినా..
మోసే బిడ్డడి వీపు మీద విమానం మోత మోగుడు ఖాయం! ‘మోత’ మోగుళ్ళుంటేనే
చదువులు మోతెక్కేలా సాగుతున్నట్లు కన్నవారిక్కూడా అదో దిక్కుమాలిన లెక్కయిపోయిందిప్పుడు..
పిల్లకాయల ఖర్మ!
డబ్బు బళ్లు, ఉబ్బు బుక్కులూ ఉనికిలో లేవు కాబట్టే ఆదికాలంలో ఆ అట్లాసు రాక్షసుడు ఎట్లాగో
ముక్కుతూ మూలుగుతూ భూగోళాన్ని మోయగలిగాడు! అదే ఈ కలికాలంలో? గోళం మొత్తం అఖ్కర్లే! మొదటి గ్రేడు
బుడతడి బేక్-బ్యాగు ఎత్తి వీప్మీద పెట్టుకు నడ్డిమీద స్టడీగా నిలబడమనండి! చడ్డి తడుపుకోకపోతే .. నేరుగా ఒలంపిక్సు వెయిట్ లిఫ్టింగుకి పంపేసెయ్యచ్చు! వేరే శిక్షణెందుకు?
మనీ వేస్టు!
వేదాలు ఏవో నాలుగు కవిల కట్టలు కాబట్టి.. నీట్లో బుడుంగున పడ్డా.. ముట్టెతో ఎత్తి వరాహావతారం పరువు నిలిపాడు హరి నారాయణుడు. అదే ఇప్పటి ఏ ప్రీ-ఎల్కేజీ పిలగాడి
పుస్తకాల సంచీ అయితేనో? పది
కాదు మాష్టారూ.. మరో పది అవతారాలెత్తినా
బ్యాగోద్ధరణ ఆ భగవంతుడి శక్తి సామర్థ్యాలకి మించిన పెద్ద అగ్నిపరీక్షయుండేది
నిశ్చయంగా!
అప్పట్లా అష్టాంగ పంచాంగాలు.. అష్టాదశ పురాణాలా అత్యంత సునాయాసంగా అవపోసన పట్టేసేందుకు లేదు. ఇప్పటి ఫస్టు గ్రేడు సైన్సు గైడైనా చూడండి.. మంచుకొండను
మించి బరువుంటుంది! రావణాసురుడికి..
పాపం.. ఏ ప్రయివేటు బడి పుస్తకాలూ మోసే అలవాటు
లేదు. కాబట్టే సీతా స్వయంవరంలో ఆ పాత పడ్డ శివధనుస్సును సైతం రెండు చేతులు వాడినా
ఇంచైనా కదల్చ లేక కుదేలయిండు. నిండా పదహారేళ్లయినా
పండని పసి బాలుడు రాముడు. అయితేనేమి? ఆ
సామి భారీ శివధనస్సును ఎలా అంత చులాగ్గా
ఎత్తి పుసుక్కని ఇలా నడిమికి
విరిచేసాడంటారూ? బాల రాముడిది విశ్వామిత్రుడి కార్పొరేట్ స్కూలింగు మరి!
సాందీపని బడిచదువులకూ భారీ బరువుబ్యాగుల్తోనే పని! కాబట్టే గోవర్థన గిరినంత సులభంగా కొనగోటి పైన నిలబెట్ట గలిగిందా పశువుల కాపరి!
ఈ వెయిట్ లిఫ్టింగు స్టడీసుకి భయపడే
సత్యభామ అలా చిన్నబడికి పోవడానికి పాలుమాలింది పోతన్నగారి భాగోతంలో. బాల్యంలో ఏ ఎల్కేజీ బడికి పోయున్నా ఇంట్లో ఏ మూలనో ఆ పుస్తకాల సంచీ పడుండేది కదా? నగా నట్రాను మాత్రమే నమ్ముకొన్న ఆ
కొమ్మ పుస్తకాల బ్యాగు సమయానికి దగ్గర లేకే అలా భంగపడింది. బుక్కుల బ్యాగ్గాని సిబ్బెలో పడేసి
ఉంటే,,
కొండనెత్తిన గోవిందుడైతేనేమి బండబ్యాగు బరువుకి పైకి
తూగుండేవాడే.
రుక్మిణమ్మ తులసాకూ ఓ సాకనిపిస్తుంది. నిజానికది ఆ పట్టమహిషి చిన్నప్పటి బడి సంచి ఎందుక్కాకూడదూ?
అంత లావు గ్రామర్ నాలెడ్జి కెంత మందం రన్ అండ్ మార్టిన్లు అరగదీశిండో పాపం ఆంజనేయుడు! చిన్ని సంజీవని మొక్క తెమ్మంటే మొత్తం
కొండనే పెకిలించుకొచ్చాడా మహానుభావుదు. వృథా పోతుందా బాల్యమప్పటి
ఆ బండసంచులు మోసి నప్పటి అనుభవమంతా!
సతుకులెంత పెద్దవైనా సతక్కో.. మంచిదే భయ్యా! కానీ సంసారమంటూ ఒహటుండాలి.. తప్పదు గదా ఎంత లావు సన్నాసికైనా! ఇప్పుడిట్లా ఎంతలా దెప్పి దెప్పి మాట్లాడుతున్నా.. ముందు ముందు ఎలాగూ గ్యాసు బండలు మోయక తప్పనప్పుడు.. ఇదిగో.. ఇంతప్పట్నుంచే
ముందస్తుగా స్కూలుబ్యాగుమోయుడు తరహా
తర్ఫీదు లిప్పిస్తే మాత్రం తప్పేముంది తమ్ముడూ?
అందరికీ ‘ఆఛ్చే దిన్’ అందుబాటుకి వచ్చే
దిన్ .. సచ్చీ బోల్తే తోఁ.. సర్కార్ల నోట్నించే స్పష్టంగా వినబడనప్పుడు.. ముందు
ముందు ఏ జీతగాడిగా బతుకు ‘గాడీ’ నడపాలో ?
‘రేల్ గాడీ’ కాడ ఏ గాడిదగాడి గబ్బుమూటలు పది
రూపాయల కోసం పడీ పడీ మోయాలో? గాడిదమోత లెలాగూ తప్పేది లేనప్పుడు.. తమ్ముడూ!..
గ్రాండ్ లెవెల్లో ‘వెయిట్ లిఫ్టింగ్ స్కిల్స్’ కార్పొరేట్ స్టైల్లో ప్రాక్టికల్సుగ చేయిస్తే తప్పేందో
చెప్పుదూ? ఒలంపిక్కు
లెవెల్ వెయిట్-లిఫ్టింగు లిస్టుల్లో టెల్గూ పిల్లల్దే ఎప్పుడూ టాప్ టెన్ ర్యాంకులు. వై? టెల్! కమాన్! ఆ నైపుణ్యం మొత్తం ప్రయివేట్ స్కూలుబ్యాగుల
పుణ్యమే మ్యాన్!
ఒప్పుకోవాలి ముందు. అందుకే ఆడ బిడ్డలకైనా సరే ‘సిక్స్ పాక్’ కంపల్సరే కార్పొరేట్ బళ్లల్లో. ఆరు సబ్జెక్టులు.. ఇంగ్లీష్,
టెల్గు, హిందీ, గణితం,
సోషల్ అండ్ సైన్స్! ఒక్కో సబ్జెక్టుకి మళ్లా ఆరేసి బుక్కులు.. టెక్స్ట్ బుక్,
టెస్ట్ బుక్, నోట్ బుక్, గయిడ్,
హోం వర్క్, క్లాస్ వర్క్. ఇళ్లకి హోం వర్క్,,
బళ్లోకి క్లాస్ వర్క్! బ్యాలెన్సు బుక్స్ .. తరగతి గది ఆరో అంతస్తులో ఉన్నా.. సన్న సన్నటి నున్నటి జారుడు
మెట్లు ఎక్కి దిగలేక బొక్క బోర్లా పడి
ప్రాణాల మీదకి తెచ్చుకొన్నా.. అడుగు ముందుకే వేసే
ప్రాక్టీసు కోసం! పెద్దలకేనా..
పిల్లల చదువు బరువు బాధ్యతలూ? పిల్లలకూ తెలిసిరావాలి చదువు ‘బరువు’ బాధ్యతలు. అందుకే ‘బండ’ చదువులు!’
ఈ బండ చదువులు చల్లంగుండా! పిల్లకాయల
భారీ బడిసంచుల బారిన పడే భూగోళం తరచూ కక్ష్యనుంచి పక్కకు తూలుతున్నట్లు ఖగోళ
శాస్త్రజ్ఞులు గోల పెడుతున్నరు. ఏదో ఒహటి చేయాలి వెంటనే! లేకుంటే ఆ భూటాన్ భూకంపాలని
మించి ఉత్పాతాలు భూలోకం మొత్తాన్ని ముంచెత్తేసేయడం
ఖాయం. శనిగ్రహమో..
గురు గ్రహమో.. ముందో కొత్త
ఖాళీగ్రహం విశ్వాంతరాళాలలో ఎక్కడుందో కాస్త తొందరగా కనిపెట్టండయ్యా శాస్త్రజ్ఞులూ! ఈ భారీ చదువుబళ్లు ఎంత చెప్పినా తలొంచేట్లు లేవు. ఇహ కట్ట కట్టెసి ఆ కొత్త గ్రహాలమీదకి తోసేయడ
మొక్కటే మిగిలిన తొవ్వ!
కావాలంటే అక్కడీ కార్పొరేట్ స్టైలు స్కూళ్లు ఎన్నంతస్తుల భవంతుల్లోనైనా
లిఫ్ట్లు.. షిఫ్టుల్లేకుండా నిశ్చింతగా నడుపుకోవచ్చు. ఎన్నేసి రకాల ఫీజులైనా సక్రమంగానే వసూలు చేయాలన్న సర్కార్ల స్ట్రిక్టు రూళ్లు నిర్భయంగా అతిక్రమించుకోవచ్చు!
ముందీ ‘బండ’ చదువుల నుండి
మన లేత బిడ్డల్ని కాపాడుకొందాం.. రండి!
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ- సుత్తి.. మెత్తంగా- కాలమ్- 21-10-2017- ప్రచురితం)
***