Saturday, July 25, 2020

హేతువాదమే ప్రగతి బాటకు రహదారి! -కర్లపాలెం హనుమంతరావు = సూర్య దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం - కర్లపాలెం హనుమంత్తరావు



చదువుకున్నవాడికీ, చదువులేనివాడికీ మధ్య ఉండే తేడా మనకు విద్యాలయాల ద్వారా సాధించే పట్టాల రూపంలో మాత్రమే చూడడం అలవాటు. ఇప్పుడా విద్యారేఖా అడ్డుగా ఉండని గొడ్డుమోతురోజులు ముంచుకొచ్చేసాయి. ఆక్స్ ఫర్డ్ లో చదివినా అమ్మనా బూతులు కూస్తేనే తప్ప 'పప్పూ కాదురా సోదరా.. పొరపడ్డాం.. మగాడేరా'! నే మెప్పులు పొందే తప్పుడు సమాజంలో మనమిప్పుడు  అతి కష్టం మీద  ఎట్లాగో ఊపిరి పీలుస్తున్నాం.  హేతువును గురించి ఏమన్నా రెండు హితవైన ముక్కలు చెప్పాలన్నా జంకే! ఎక్కడ 'గిరీశం లెచ్చర్ల ' కోవలోకి జారిపోతామోనన్న బెంగతోనే నోళ్లు కుట్టేసుక్కూర్చునే మేధావులే మట్టంగా దర్శనమిస్తున్నా రిప్పుడు సర్వత్రా. విశ్వాసాలకు, మూఢవిశ్వాసాలకు.. జ్ఞానానికి, అజ్ఞానానికి మధ్య ఉండే అడ్డుగీతలు మామూలు చేతులతో స్పర్శిస్తేనో, కళ్లతో దర్శిస్తేనో నిర్ధారణ చేసుకునే వెసులుబాటు ఉండదు. వీక్షణ, ఆలోచన, విశ్లేషణ, వివేచనలతో కూడిన పని ఎవరైనా బుద్ధిశాలి కొద్దిగా ధైర్యం చేసి  కాస్త కూడబలుక్కునైనా   విడమరచి చెప్పే దుస్సాహం చేయబోతే.. ఠక్కున ఏ దిక్కు నుంచైనా పాతచెప్పులు రేకేట్లలా దూసుకొచ్చే ప్రమాదం కద్దు. 
బుద్ధి కర్మానుసారిణి, అంతా విధి చేతుల్లోనే ఉంది.. మనుషులం కేవలం నిమిత్త మాత్రులం .. లాంటి అహేతుక  భావజాలాంధకారంలో పడి విద్యలు నేర్చినవారు, రాజ్యాలు చేసేవారు, జీవితాలు తీర్చిదిద్దే బాధ్యతలు నెత్తికెత్తుకున్నవారు కూడా కొట్టుమిట్టులాడుతుంటే, పొట్ట కూటికై పాకులాడేందుకే ఎక్కడి జీవితకాలమూ చాలని బక్క మనిషి నుంచా  మనం  మంచిబుద్ధి,  సదసద్విచక్షణలు ఆశించేది?! తరతరాలుగా భావదాస్యంలో మునిగి తేలే అక్కచెల్లెళ్లు, అట్టడుగు జాతుల వంటి విస్మృతవర్గాలవారిని తప్పుపట్టి ప్రయోజనం లేదు. ఇంటా బైటా సవాలక్ష ఆంక్షలతో సతమతమయ్యే బక్కజీవి మతి కుదిరి, ఓ మూలను చేరి మంచిచెడులు తీరికగా తర్కించుకునే పాటి సావకాశం పాడు ఆధిక్యతాభావ  ప్రపంచం ఎక్కడ ఏకాలంలో పడనిచ్చింది గనక?! జీవికకు ఏ మాత్రం అక్కరకు రాని  దురభిమానాలు, హెచ్చుతగ్గులు, జాత్యహంకారాలు, కుల మత భేదాలు, అవినీతి, కాముకత్వం వంటి మానసిక జాడ్యాలు నానాటికి పెచ్చుమీరుతున్నాయంటే, అందుక్కారణం  మంచేదో, చేడేదో తర్కింఛుకోవలసిన గత్యంతరం బొత్తిగా లేని అడ్డుగోలు గొడ్డుమోతుతనమే గద్దె మీద చేరి గద్దించి మరీ పనులు సానుకూలపరుచుకునే  కువిధానాల వల్ల.  నాగరికత- పేరుకే ఇరవయ్యకటో శతాబ్దానిది. సంస్కారం- ఒకటో శతాబ్ది కాలాన్నైనా దాటి రాని దుస్థితి. సంఘంలో, ఆర్థిక రంగంలో అశాంతి, అక్రమాలు అంతకంతకు తమ రికార్డులు తామే బద్దలు కొట్టుకుంటున్నాయంటే.. అన్యాయమే రాజకీయగద్దె మీద గజ్జె కట్టి హేతువనే పదానికుండే మూలార్థాన్ని మొదలంటా పెళ్ళగించేందుకు కంకణం కట్టుకోబట్టి కాదూ!
సమాజానికి, కుటుంబానికి కూడా ఎంతో కీలకమయినవి బడుగుల పాత్ర, స్త్రీ పాత్ర. విస్మృతులకు దక్కే హోదా, స్థాయిలే ఆయా సమాజాల ప్రగతి వికాసాలకు కొలమానాలు. తక్కువవర్గాలుగా బావించుకునేవారులోని తతనాన్ని తామే స్వయంగా  గ్రహింపుకు తెచ్చుకుని కలిసొచ్చే సానుకూల శక్తులని తోడు తెచ్చుకునైనా చొరవగా ఒక అడుగు ముందుకు చొచ్చుకుపోకపోని పక్షంలో ఈ సమాజానికి ఇక సమంజసత, సున్నితత్వం, సహేతుకత, సమ్యక్ దృష్టి ఏకమొత్తంగా అలవాటు తప్పిపోయే  పరిస్థితులు దాపురించినట్లే లెక్క.. నిజం చెప్పాలంటే!
సమాజమనే కాదు, వ్యక్తి జీవితంలోనూ ప్రజాస్వామ్యం వెల్లివిరిసిన  వాతావరణం వర్ధిల్లినప్పుడే సర్వే జనా సుఖినో భవన్తు అనే  సూత్రసారం ఆసాంతం సాకారమయే సావకాశం! ఉదాత్తమైన ఆశయాలు, ఉత్తేజకరమయిన ఆలోచనలకు సహేతుకతా తోడయే తప్ప మనిషి ఆలోచనల్లో మంచి మార్పు రాదు. మంచి మార్పు వస్తేనే  ప్రపంచానికి ప్రస్తుతం దాపురించిన దుస్థితుల నుంచి విముక్తయేందుకు  మార్గం దొరికేది.  చార్వాక, కపిల, కణాదుల సిద్ధాంతలతో కూడా బాల్యం నుంచే పరిచయం పెంచుకోవాల్సిన అగత్యంలో ప్రస్తుతం మన సమాజమున్నది. అట్లాగని తిరుగుబాటే మా వేదాంతం అని నినదించాలని కాదు. విప్లవాత్మకమైన ఆలోచనా ధోరణులకు ఎల్లవేళలా స్వాగతపత్రం అందించేందుకు మనసును  సిద్ధం చేసుకొనుంచుకోవాలనేదే.. హితవు.
తిరుగుబాటు వేరు.. విప్లవం వేరు. సిపాయిల తిరుగుబాటు వంటి తిరుగుబాటులకు అన్ని వేళలా సహేతుకమైన కారణాలే ప్రేరణలవుతాయన్న హామీ ఏమీ లేదు. కానీ.. భావవిప్లవం అంటే మాత్రం కణకణ మండే  అఖండ జ్వాలామాల. దానికి ఉత్తేజమనే ఇంధనమందేది మాత్రం అన్ని వేళలా అన్ని వైపులా  హేతుబద్ధమైన వికాసాలోచనల స్రవంతుల నుంచి మాత్రమే! ఆంగ్లసీమలో 1689లో హద్దులెరుగని రాచరికానికి కళ్లెమేసిన తీరులో సాగేదీ విప్లవోద్యమం. ప్రాతినిధ్య అధికారం ఉన్నవారికే పన్నులు విధించే హక్కన్న హేతుబద్ధ ఆలోచనే 1776 నాటి అమెరికన్ ప్రజాస్వామిక విప్లవానికి దారి తీసిన  ప్రేరణ.  స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఆదర్శవంతమైన  భావజాలం బలం పుంజుకుని 1789 ప్రాంతంలో  ఫ్రెంచి విప్లవానికి ప్రోద్బలంగా నిలచిన సందర్బం గమనించినా, 'భూమి.. తిండి.. శాంతి' వంటి వాస్తవావసరాల నిమిత్తం హోరెత్తిన 1917నాటి రష్యన్ల విప్లవం పరిశీలించినా, కార్మిక, కర్షక, మధ్యతరగతి, అణగారిన వర్గాల వంటి ఇతరేతర విస్మృత శక్తులు  ఆయా దేశాలలో  సాధించిన అన్ని విజయాల వెనకున్నదల్లా హేతుబద్ధమైన ఆలోచనాక్రమ వికాససరళి వెన్నుదన్నులు మాత్రమే అని అర్థమవుతుంది. 1947 నాటి భారత స్వాత్రంత్ర్యసమరం గాని, మరో రెండు ఏళ్ల తరువాత చైనాలో చెలరేగి విజయం సాధించిన జనచైనా విప్లవం గాని.. లోతైన సునిశిత పరిశీలనకు దిగితే చివరికి తేల్చేవి..  హేతువుతో కూడిన సమ్యక్ దృష్టి సమాజం అట్టడుగు వర్గాల వరకు చేరి ప్రభావితం  చేస్తేనే తప్ప అమానుషత్వం అణగారి సమసమాజ నిర్మాణానికి సానుకూల బాటలు పడబోవని.  
సమాజ పరివర్తనకు, భావగమనానికి అవినాభావ సంబంధం ఉంది. అయితే ఆ భావాలు ఎవరి ద్వారానో ప్రతిపాదితమై ప్రభావితం చేసేవా? మన మెదడులోనే కదలడం మొదలయినప్పటి బట్టి స్వత్రంత్ర బుద్ధితో పెంపొందేవా? అన్న ప్రశ్న ఎదురైనప్పుడు విశ్వవిఖ్యాత ఆలోచనావిప్లవ మేధావి ఎమ్.ఎన్. రాయ్ రెండవదే శిరోధార్యమని బల్లగుద్ది  మరీ చెప్పిన సత్యం మనమిక్కడ స్మృతికి తెచ్చుకోవడం అవసరం.
రాయ్ ఆలోచనా సరళి ప్రకారం, వ్యక్తివాదం, హేతువాదం , మానవవాదం..  అనే మూడు గుణాలతో మనిషి ఆలోచనా క్రమం ప్రభావితం అవుతుంది. తతిమ్మా అన్ని జీవులకు మల్లేనే మనిషి పుట్టుకా ప్రకృతి నుంచే. ప్రకృతి నియమం క్రమబద్ధంగా ఉంటుంది కాబట్టి మానవ వికాసమూ, మనిషి పెరుగుదలా నియమబద్ధంగా.. అంతే హేతుబద్ధంగా సాగుతాయనేది  రాయ్ రేడికల్ హ్యూమనిజం సూత్రం. 
మానవవాదం పురాతనకాలం నుంచి సదాలోచనా పరంపరగా సమాజంలో అంతర్లీనంగా ప్రవహిస్తున్నదే! కదిలే కాలంతో కదా మనిషి సహప్రయాణం చేస్తున్నది!   పెరుగుతున్న మానవ మేధస్సు, నాగరికతల మూలకంగా సమకాలీన భావజాలం సంధించే క్లిష్టమైన ప్రశ్నలు సహజంగానే ఎన్నో పుట్టుకువస్తాయి.  ఎప్పటికప్పుడు మొలకెత్తే కొత్త కొత్త సందిగ్ధాలకు సంబద్ధమైన బదుళ్లిచ్చే క్రమంలో నవ్యమానవవాదం అనే మరో భావధారకు పురుడుపోసిన ప్రజామేధావి ఎమ్.ఎన్.రాయ్.

స్వభావసిద్ధంగా స్వేచ్ఛాపిపాసి, సత్యాన్వేషి- మనిషి. అతను తన మనుగడ సాగించుకునే క్రమంలో అంతరాత్మ చెప్పే నీతి.. (అదే ఎక్కువ మందికి భగవంతుడు చెప్పే నీతిగా అనిపించేది), ప్రయోజనం కలిగించే నీతి అనే రెండు దోవల నుంచి ప్రేరణ పొందుతాడని, ఈ రెండు దిశలకు ప్రత్యామ్నాయంగా హేతుబద్ధమయిన నీతిమార్గంమాత్రమే మనిషి నడిచే సన్మార్గంగా ఉండాలనేది రాయ్ నవ్యమానవవాద మూల సూత్రం.

రాజకీయాలలో పార్టీలు లేని వ్యవస్థను, ఆర్థికరంగంలో సహకార సంబంధమైన ప్రణాళికా రచనలు ప్రతిపాదించే తీరులోనే,  సాంస్కృతిక రంగంలోనూ స్వతంత్ర బుద్ధితో హేతుబద్ధంగా చేసే ఆలోచనాధారను ప్రోత్సహిస్తుందీ సిద్ధాంతం. సంఘపరంగా సాగే అన్ని రకాల వివక్షలను నిర్ద్వందంగా నిరసిస్తుంది కూడా. కుల, మత, వర్గ, ప్రాంత, భాష, జాతి, దేశ విభేదాల జాబితాలో లింగ విభేదమూ ఉంది. విశ్వజనీనమైన సంస్కృతికి విలువిస్తూనే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం చూడగల సత్తా ఈ మానవవాదానికి ఉంది. ఆఖరుదే  అయినప్పటికీ అత్యంత ప్రధానమైన అంశం, విశ్వాసాలు మూఢవిశ్వాసాల కిందకు దిగజారడాన్ని నిర్మొహమాటంగా నిరసించే పదునైన ఆయుధం నవ్యమానవవాదం.


ప్రకృతికి మించిన శక్తి మరేదీ లేదు. మనిషి తన మనుగడకు, తన భవిష్యత్తుకు తానే బాధ్యుడు. తన మేలుకు, సాటి మనిషి మేలుకు మధ్య ఘర్షణ లేదని.. ఉండకూడదన్న జీవన సూత్రాలను మాత్రమే సామాజిక పరిస్థితుల మెరుగుదలకు సాధనాలుగా వాడుకునే ప్రయత్నం చేయాలని నవ్యమానవవాదం హితవు చెబుతుంది.
ప్రస్తుతం ప్రపంచ మానవాళి సంస్కృతులే మహాచిక్కుల్లో నలుగుతున్నాయి. మత ప్రాబల్యం, ఫాసిజం తరహా ఎన్నో ఇతరేతర నియంత్రణ విధానాలు సర్వజనసంక్షేమ కాంక్ష మీద నిప్పులు కురిపిస్తున్నాయి. విజ్ఞానం సహేతుకమైన మార్గంలో అభివృద్ధిచెందడం, మేధస్సు కొత్త పుంతలు తొక్కే ప్రయత్నం చెయ్యడం, సృజనశక్తి సరికొత్త జవసత్తువలు పుంజుకునే నూతన తాత్విక చింతనలకు ప్రాతిపదికలుగా వాతావరణాన్ని మలుచుకోవడం తప్పనిసరి అయిన ఈ తరుణంలో, లోకం రోజురోజుకూ మూఢవిశ్వాసాలు, మూర్ఖాలోచనల రొంపి వైపుకు శరవేగంగా అంగలువేయడం  సామాజిక శ్రేయోకాముకులు ఎవరికైనా అమితాణ్దోళన కలిగించే అంశమే!
పదునెక్కిన నైతిక దృక్పథం మొక్కటే ముందుకు చొరబడి రాక తప్పని తరుణమిది. సమయానుకూలమైన మౌనభంగిమలనే హూందాతనంగా మేధావులు భావిస్తుండవచ్చు. పెద్దరికం ప్రదర్శంచడమంటే ఇతరుల హక్కులకు భంగం వాటిల్లని పద్ధతిలో స్వయం వికాసమార్గాలను అన్వేషించుకునే మార్గాలు వెతికి సూచించడం. అర్థం. క్రమశిక్షణ మిషతో మనిషిని ఒక యంత్రంలా మార్చే విధానాలకు సత్వరమే తిలోదకాలు ఇవ్వడం అవసరం. యాంత్రీకరణ మానవీయ విలువలను.. క్రమంగా మానవతను కూడా ధ్వంసం చేసే మహారక్కసి. తాత్కాలిక ప్రయోజనాల కోసం శాశ్వతమైన, సమగ్రమైన విలువలను ఫణంగా పెట్టే జీవనవిధానాలను చెత్తబుట్టలో వేసి తొక్కేస్తే తప్ప ఆ రక్కసి కర్కోటకం నుంచి నిజమైన విముక్తి అట్టడుగు జీవి వరకు  చేరే అవకాశంలేదు.
వ్యక్తి స్వేచ్ఛ ఆవశ్యకతను తక్కువ చేయలేం.. కాని సమాజశ్రేయస్సు  తరువాతనే దానికి ప్రాధాన్యత. భౌతికపరమైన అవసరాలు తీరే నిమిత్తం పరుల స్వేచ్ఛను హరాయించడం అమానుషమవుతుంది. మానసిక స్వేచ్ఛ, సామాజిక చింతన లేకుండా ప్రగతిని సాధించడం మోచేతి కింది బెల్లం నాలుకతో అందుకోవడంతో సమానం.
నిజం చెప్పాలంటే, మానవవాదంలో పిడివాదానికి, పిడిగుద్దుల సిద్ధాంతానికి  తావేలేదు.  మానవవాదం మరో పేరే వ్యక్తి స్వేచ్ఛ. మారే సమాజానికి అనుగుణంగా అభ్యుదయ పంథాలోనే విధానాల మార్పుకు సౌలభ్యం కల్పించే మౌలిక జీవనసూత్రానికి హేతువాదం కట్టుబడి ఉంటుంది. విజ్ఞాన కాంతిని ప్రపంచశాంతికి వినియోగించే సమన్వయ బుద్ధి సాధించాలన్నా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొనే సవాలక్ష సవాళ్లకు సహేతుకైన సమాధానాలు  వెతికే మనస్తత్వం బాల్యం నుంచే అలవరచుకోవడం ఒక్కటే గతి.  
-కర్లపాలెం హనుమంతరావు
(26-07 -2020 నాటి సూర్య దినపత్రిక సంపాదకీయపుట ప్రచురితం)


                                                

Friday, July 24, 2020

వేటూరి పాటలతో ఆట



వేటూరి ఓ  పాటలోని  చిత్రమైన చతురత
సినిమా పాటలంటే సాహిత్యపరంగా పల్చగా ఉంటాయన్న చులకన భావం సాహిత్యంలో ఓ మాదిరి లోతు  పాతులు తమకు తెలుసును అనుకునే వాళ్లకి మనసులోనైనా కొద్దిగా కద్దు. (నాకూ ఒకానొకప్పుడు ఆ మాద్రిరి భావం ఉండేది, రవి వీరెల్లి గారి అంతర్జాతీయ మాసపత్రికలో ఆ అంశం మీద ఒక సినీరచయిత సాగించిన చర్చలో కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించినట్లు గుర్తు. ఇప్పటికీ ఆ భావనలో మార్పు అంతగా లేదు. కానీ  గత కాలపు సినీకవులు కొసరాజు, శ్రీశ్రీ, ఆరుద్ర.. ఆత్రేయ  .. మరీ  ముఖ్యంగా వేటూరి వంటి విద్వత్ కవుల  కలంపోటుల్లో మాత్రం  తరచి చూసే ఓపిక ఉన్నవాళ్ల కళ్లకి తరచూ  మెరుపులు తటిల్లుమని మెరిసి మురిపిస్తాయి. తార్కాణానికి ఒక మచ్చు తునకః శంకరాభరణం- ఓంకార నాదానుసంధానమౌ గానమే శంకరాభరణము- అనే పాట. ఆ పాటలోని - 'రసికుల కనురాగమై, రసగంగలో తానమై(స్నానం చేసి), పల్లవించు సామవేద మంత్రము'  అనే చరణంలో   సంగీతానికి ముఖ్యప్రాణులైన రాగం, తానం, పల్లవి- అనే మూడు పదాలను(అనురాగంలోని 'రాగం'; రసగంగలో చేసిన 'తానం'- సామవేద మంత్రం పల్లవించడంలోని 'పల్లవి'- పట్టు పీతాంబరంతో చుట్టిన   చందన గంధపు చితుకుల చందంగా దాచి మరీ వాడిన చతురత సుందరమూర్తిది.!  ఈ మూడు పదాలే ఆనక మరో పాట పల్లవికి తొలి పాదంగా మారడం అదనంగా అలరించే ముక్తపదగ్రస్తమంతటి చిత్రాలంకారం కూడా కదా!
-కర్లపాలెం హనుమంతరావు

***

Monday, July 20, 2020

ఆడవాళ్లూ ! ముందు మీరు మారండి! -కర్లపాలెం హనుమంతరావు= సారంగ సాహిత్య పత్రిక ప్రచురణ





అశోకుడు తన సువిశాల సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలు చేసుకుని పరిపాలించిన సంగతి అందరికీ తెలిసిందే. దక్షిణ భాగంలోని ఆంధ్రరాష్ట్రానికి సువర్ణగిరి రాజధానిగా ఉండేది.  కాలానుగతంగా అది జొన్నగిరి అనే చిన్ని గ్రామంగా కుచించుకుపోయింది.

కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా గుత్తికి దగ్గర్లో ఉన్న ఈ జొన్నగిరికి చేయి దూరంలో   ఎఱ్ఱగుడి  రాతి బండల మీద అశోకుడు చెక్కించిన కొన్ని ధర్మలిపులు.. సుమారు రెండువేల రెండు వందల ఏళ్లపాటు ఎండకు, వానకు తడుస్తూ ఉండిపోయినవి.. భూగర్భ శాస్తజ్ఞుడు ఎస్. ఘోష్  ఖనిజాల వేటలో ఉండగా కాకతాళీయంగా బైటపడ్డాయి. పురాతత్వ శాస్త్రజ్ఞులు (దయారాం సహానీ, హరప్రసాద్ శాస్త్రి) ధృవపర్చిన మీదట 1929, జూన్ , 11 వ తేదీ నాటి పత్రికలలో అధికారికంగా  ప్రకటింపబడ్డాయి. ప్రముఖ తెలుగు చారిత్రక పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మ, నేలటూరు వేంకట రమణయ్యల పుణ్యమా అని అవి  ఎస్టాంపేజ్ పత్రాల రూపంలో గుట్టు చప్పుడుకాకుండా  చెన్నపట్నం చేరడం,  1929, సెప్టెంబర్ నాటి భారతిలో దొరికిన రెండు లఘురూపాలు, పథ్నాలుగు పెద్ద సైజు  ధర్మశాసనాల వివరాలు లోకం విశదంగా తెలుసుకోవడం సాధ్యమయింది.

ఆ శాసనాల మూలకంగా అశోకుడి కాలం నాటి రాజకీయ వ్యవస్థకు ఇప్పటి మన రాజకీయ  వ్యవస్థకు మధ్య కొన్ని పోలికలున్నట్లు అర్థమవుతుంది. పాటలీపుత్రం ప్రధాన రాజధానిగా ఉన్నప్పటికీ అశోకుడికీ  నాలుగు ప్రాంతీయ రాజధానులు  విడివిడిగా ఉండడం, రాజధానిలోని రాచరిక వ్యవస్థ తీరునే ఉన్నట్లే, ఉపరాజధానుల్లోనూ ఉపరాచకీయ వ్యవస్థ ఉండటం గమనార్హం. ఉపరాజులు రాజుకు తోబుట్టువులయి ఉండాలనేది, తతిమ్మా పరిపాలనాంగాలు సైతం రాజబంధువుల కనుసైగలలో మాత్రమే నడవాలనే  నియమమూ ఉన్నట్లనిపిస్తోంది. ఈ ఉపరాజు కుటుంబీకులంతా రాష్ట్రీయులుగా ప్రసిద్ధులని శాసనాలు తెలియచేస్తున్నాయ్.

రాజధాని దారిలోనే ఉపరాజధానిలోనూ న్యాయవ్యవస్థ ఒకటి రజ్జుకులు, మహామాత్రలు, అంత మహామాత్రలు, ఉపమాత్రల ఆధ్వర్యంలో నడవడం గమనార్హం. ఇప్పటి మహిళా కమీషన్ తరహాలోనే అశోకుడి కాలంలో కూడా స్త్రీల కొరకు స్త్రీల చేత మాత్రమే నిర్వహింప బడే మహామాత్రలు ఉండటం చెప్పుకోదగ్గ మరో గొప్ప విశేషం.

 

అశోకుని ధర్మలిపుల వల్ల రెండువేల రెండు  వందల ఏళ్ల కిందట ఆంధ్రదేశంలోని స్త్రీల జీవన స్థితిగతులు ఏ విధంగా సాగాయో రేఖామాత్రంగా తెలుసుకునే అవకాశం లుగుతుంది. పదమూడో శిలా శాననం చెప్పిన విధంగా 'ఏదో ఒక మతమును అనుసరించని జనముండు దేశమే లేదు'. అన్న తీరులోనే నేటికీ లోకతంత్రం నడుస్తున్నది కదా!

శాసనాల వల్ల నాటికాలం సమాచారం ఆనవాలు పట్టడం సులభమవుతుంది. ఈ పై అనుశాసనాల వల్ల ఆ కాలంలో జంతుబలులు, జాతర్లు జరిగేవన్న విషయం సుస్పష్టం. తెలుగు సాహిత్యం  కూడా ఇదే విషయాన్నే నొక్కిచెబుతుంది. 'అంబోధరము క్రింద నసిమాడు/నైరావతియు బోలె సిడి ప్రేలె దెఱవయోర్తు' అంటూ తెనాలి రామకృష్ణకవి పాండురంగ మహాత్యం మూడో అశ్వాసం, డెబ్భైఏడో  పద్యంలో గంగజాతర్లలో స్త్రీలు పడే హింసాకాండ సమస్తాన్ని వళ్లు గగుర్పొడిచే రీతిలో వర్ణిస్తాడు. క్రీ.శ. 15 వ శతాబ్దంలో దక్షిణ హిందూ దేశంలో పర్యటించిన పోర్చుగీసు చరిత్ర కారుడు బర్బోసా కూడా గ్రామదేవతల కొలువులలో జరిగే హింసను విశదంగా వర్ణిస్తూ 'ఈ దేశంలోని స్త్రీలు దైవారాధన దగ్గర ఎంతటి ఆత్మహింసకైనా తెగించడం విచిత్రం' అని రాసుకొచ్చాడు. తాను ఇష్టపడ్డ ప్రియుడు తననూ ఇష్టపడే విధంగా మనసు మార్చే శక్తి స్త్రీ దేవతలకు ఉంటుందన్న నమ్మకం .. స్త్రీలను ఈ తరహా దుస్సాహసాలకు పురిగొల్పుతుదన్నది మనస్తత్వవేత్తసిద్ధాంతం.

చిన్న ముల్లు  వంట్లో దిగినా ఓపలేని సుకుమారి సైతం సిడి ఉత్సవాల నెపంతో వంటి రక్తాన్ని  సిడి మాను(పెద్ద స్తంభం)కి కట్టిన ఏతం లాంటి వాసం ఇనుప కొక్కెం గాలాన్ని వీపుకు తగిలించుకుని గాలిలో గుండ్రంగా తిరగుతూ గొప్ప ఆత్మానుభూతి పొందడాన్ని ఏ విధంగా చూడాలి మనం? ఈ విధమైన హింసాకాండకు ఆ కాలంలో   అమితాదరణ ఉండబట్టే  అహింసా మూర్తి అశోక చక్రవర్తి మొదటి శిలాశాసనంలోనే

'ఇచ్చట ఏ సజీవ ప్రాణిని బలి ఇవ్వకూడదు'

'ఇచ్చట ఏ విధమయిన వేడుక సమూహము కూడా నిషేదిద్ధము'

'అట్టి సమావేశము వలన హాని కలుగునని దేవానాం ప్రియుని అభిప్రాయం' అంటూ మూడు ఆదేశాలు  జారీచేసివుంటాడు .

శాసించిన మాత్రాన జనం పాటించేదుంటే  పరిస్థితులు ఇప్పటంత అర్థ్వాన్నంగా ఎందుకుంటాయి? జాతి తన పాటికి తాను  తన ఆచారవ్యవహారాలను  కొనసాగిస్తూనే ఉంటుంది. నోములూ, వ్రతాలూ చేసుకోవడం, ఇంట్లో అనారోగ్యాలు కలిగితే  మొక్కుకోవడం, కోరిన కోరికలు తీర్చమని ఇష్టదైవాలకు మొక్కుబళ్లతో ఆశపెట్టడం  వంటివన్నీ మానసిక భావోద్వేగాలకు సంబంధించిన అంశాలు. ఎంత మహాచక్రవర్తయినా   మనసులను అదుపు చేయలేడు. కాబట్టే అశోకుని 9వ శిలాశానసంలో

1.            దేవానాం ప్రియుడు ఈ విధముగా దెల్పెను.

2.          జనులు అనారోగ్యముగా ఉన్నప్పుడు, గృహములందు వివాహాది శుభకార్యములు జరుగుచున్నప్పుడు మంగళ ప్రధానమయిన క్రతువులు చేయుచుందురు.

3.          ఆయా సందర్భాలలో శుభాకాంక్షులై పుణ్యకార్యములు చేయుట కూడా కలదు.

4.          అందు ముఖ్యముగా స్త్రీలు నిరుపయోగమైనట్టి, అర్థరహితమైనట్టి పనులెన్నో చేయుటయు కలదు.

5.          శుభప్రదమయిన కార్యములను తప్పక చేయవలసినదే.

6.          కానీ సాధారణముగ మనము చేయు కార్యములు తగినంత ప్రయోజనకరములు కావు.  అని చెప్పడం జరిగింది.

 

అశోకుడు రెండున్నర సహస్రాబ్దాల కిందట చెప్పిన మాటలు అక్షరాలా ఇప్పటికీ వర్తిస్తాయి. అశోకుడి కాలమేం ఖర్మ, అధర్వణకాలంలోనూ ఈ మంత్ర తంత్రాలు, యజ్ఞయాగాదులు దండిగా ఉన్నాయి. ఆ వేదానికి అనుబంధంగా ఉండే సర్పవేదం, పిశాచవేదం, అసురవేదం.. వగైరాలు మనిషిలోని భయాలను, ఎదుర్కొనే ప్రమాదాలను,  వాటికి  తగిన  విరుగుళ్లను తెలియచేస్తాయి. జ్వరం, వరుస జ్వరం, పసరికలు, అజీర్ణం, జలోచరం, కుష్టు, వ్రణాలు, పురుగులు పడడం, పశురోగాలు, విషప్రయోగాలు.. ఇత్యాదుల నివారణకు అధర్వణ వేదంలో మంత్రాలు కనపడ్డమే ఇందుకు ఉదాహరణ.

 

ఆరోగ్యం నిర్లక్ష్యం చేసే అంశం కాదన్న మాట అక్షరాల వేదం చెప్పే పన్నాకి సమానమైన సుభాషితమే. రోగ నిరోధానికి, వస్తే.. గిస్తే నిదానికి, శాశ్వత నివారణకు ఏ తంత్రమో, మంత్రమో శాస్త్రీయంగా(ప్రయోగ ఫలితం మీద) ఆచరించి తీరవలసిందే. ఔషధాల మీద నిషేధాలను ఎవరూ కోరుకోరు.  పెళ్లిళ్లు, పురుళ్లు వంటి శుభకార్యాలకు ఉత్సవాలు వద్దనడాన్ని ససేమిరా ఒప్పుకోరు.  అయితే, అన్నీ పద్ధతి ప్రకారం  చేసుకోవాలనుకుంటే,  ఏడాది మొత్తం ప్రతీ రోజూ     వ్రతం నిర్వహించుకునే విధంగా మన సంప్రదాయాలలో ఏదో ఒక ఏర్పాటు చేసిపెట్టారు మన పూర్వీకులు. అవన్నీ తు.చ తప్పకుండా ఆచరించడం ఈ కలికాలం, కరవుకాలం, ఏ రోజుకారోజు కడుపు నింపుకునేందుకు బతుకు తెరువు కోసం వెదుకులాడుకునే కాలంలో ఎంత వరకు ఆచరణ సాధ్యం?!

సంప్రదాయం మీద వీరాభిమానానికి తోడు, హేతువుకు అందని ఆలోచనలు సహజంగానే అధికంగా ఉండే స్గ్త్రీల చిత్త ప్రవృత్తి వల్ల  సమయం అధికంగా నిరుపయగమవుతుందనేదే ఆనాటి  అశోకుడి నుంచి నేటి అభ్యుదయవాది వరకు అందరి   అసలైన ప్రధాన బాధ,

 

వీరేశలింగంగారి మాటలే మరో సారి మననం చేసుకోదగ్గ  మంచి సందర్భం ఇది. ఆ కాలమందెల్లవారికిని దయ్యములయందలి విశ్వాసములు అధికముగా నుండెను. స్త్రీలలో నొకప్పుడును దయ్యము పట్టని వారెక్కడనో గాని లేక యుండిరి. ఎవ్వరికే వ్యాధి వచ్చినను  వైద్యుని ఇంటికి మారుగా ముందుగా భూతవైద్యుని ఇంటికో, సోది చెప్పువాని ఇంటికో  పరుగెత్తుచుండిరి'

అధర్వణవేదం కాలంలో కానీయండి, అశోకుని కాలంలో కానీయండి, తెనాలి రామకృష్ణకవి కాలంలో కానీయండి, వీరేశలింగంపంతులుగారి కాలంలో కానీయండి.. స్త్రీలందరూ ఒకే విధంగా ఉన్నారా?  అధునాతున కాలం ఇదని గొప్పలు పోతున్నాం.. పోనీ ఇప్పుడైనా  వందకు వంద శాతం స్త్రీలు మార్పు చెందారా?మారారంటున్న  ఆ కొందరిలో అయినా నూటికి నూరు శాతం  మార్పు వచ్చిందా?

నాటి  తెలుగునగరం సువర్ణగిరి దగ్గర రెండువేల రెండు వందల సంవత్సరాల కిందట 'స్త్రీలు  నిరుపయోగకరమైనట్టి, అర్థరహితమైనట్టి పనులెన్నో చేయుట కలదు' అని అశోకుడు వేయించిన శిలాశాసనంలో అక్షరాలే శిలాశాసనాలై మిగులుతాయా'అన్న ప్రశ్న వచ్చినప్పుడు..

వ్యవస్థ మారితే తప్ప స్త్రీల దురవస్థ మారదు. స్త్రీలు మారి, పురుషులను మారిస్తే  తప్ప వ్యవస్థ అవస్థలో ఏ మంచి మార్పూ రాదు.. అని సమాధానం చెప్పుకోక తప్పదు  .. ఎవరెంత నొచ్చుకున్నప్పటికీ!

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, వాషింగ్టన్ రాష్ట్రం. 

యూ.ఎస్.ఎ

***

 (సారంగ -సాహిత్య పత్రిక, జూలై 15, 2020 సంచిక ప్రచురణ)

 

 

 


Saturday, July 18, 2020

భారతదేశం హిందూదేశమా? -కర్లపాలెం హనుమంతరావు= సూర్య దిన[పత్రిక ప్వాసం



'సప్త ద్వీపా వసుంధరా'. భూమి ఏడు ద్వీపాల సంపుటం. ద్వీపం అంటే నీటి
మధ్యలో ఉండే భూభాగం. 'జంబూ ద్వీపే, భరత ఖండే, భరత వర్షే' అనే మంత్రం
పూజాదికాలలో వింటూ ఉంటాం. జంబూ అనే ఓ ద్వీపం మధ్య ఉన్న భరత ఖండంలోని ఒక
భాగం భరతవర్షం(దేశం). అంటే పురాణాల ప్రకారం చూసుకున్నా మనం ఉన్నది
హిందూదేశం కాదు. భారతదేశం. మరి ఇప్పుడు తరచూ మారుమోగే ఈ 'హిందూ' పదం
ఎక్కడ నుంచి   దిగుమతయినట్లు? కాస్త చరిత్ర తిరగేస్తే ఈ అనుమానం సులభంగా
నివృత్తి అవుతుంది.

'హిందూ' పదం నిజానికి ఒక మతాన్ని సూచించదు. అది ఒక సంస్కృతికి సూచిక.

స్వాతంత్ర్యం సాధన తరువాత లౌకిక ప్రజాతంత్ర విధానంలో పాలన జరగాలని
తీర్మానించుకున్న మనం  రాజ్యాంగంలో 'హిందూ' అన్న పదానికి పాలనాపరంగా
ప్రాధాన్యత ఇవ్వలేదు. దాని స్థానే 'భారత్' 'భారత్ దేశ్' అనే పదాలు
కనిపిస్తాయి.

యురోప్ ఖండంలో మన దేశానికి 'ఇండియా'గా గుర్తింపుంది. ఆ పాపం తెల్లవాడి
వల్ల. 'ఇండికా' 'ఇండిగో' అంటే నల్లమందు అని అర్థం. నల్లమందు కోసం
వెతుక్కుంటూ వచ్చిన తెల్లవాళ్లకు ఇక్కడ ఆ నీలిమందు పుష్కలంగా పండే భూములు
కనిపించాయి. పాడి- పంట చేసుకు బతికే అన్నదాతల చేత బలవంతంగా నీలిమందు
సాగుచేయించిన బీహార్ 'చంపారన్' కథ మనందరికీ తెలుసు. అక్కడి రైతులు బాపూజీ
ఆధ్వర్యంలో చేసిన ప్రతిఘటనతోనే మన మలిదశ స్వాతంత్ర్యపోరాటానికి బీజం
పడింది.

రాజ్యాంగం 'హిందూ' పదాన్ని గుర్తించలేదు. అటు సంస్కృతీ, ఇటు రాజ్యాంగమూ
రెండు గుర్తించని ఈ 'హిందూ' పదానికి మరి ఇప్పుడు ఇంత ప్రాధాన్యత ఎందుకు
పెరుగుతున్నట్లు? ఇంకాస్త లోతుకుపోయి తరచి చూస్తే మరిన్ని ఆసక్తికరమైన
విషయాలు వెలుగు చూస్తాయ్!

ఇప్పుడున్న భావన ప్రకారం ఈ దేశంలో అధిక సంఖ్యాకులు ఆచరిస్తున్న మతం
'హిందూ మతం'. అలాంటి ముద్ర వేసిపోయింది ఆంగ్లపాలకులు.  స్వార్థప్రయోజనాల
కోసం రాజకీయాలలోకి 'హిందూ' పదాన్ని ఒక మతరూపంలో చొప్పించి పబ్బం
గడుపుకుపోయిన మహానుభావులు ఆంగ్లేయులు.



నిజానికి భారతదేశానికి ఒక మతమంటూ పత్యేకంగా లేదు. భారతీయత ఒక తాత్వికత.
తాత్వికత అంటే ఓ ఆలోచనా రూపం. వేదాల నుంచి పుట్టిన భావుకత కూడా కాదు.
వేదాలే భారతీయనుంచి రూపు దిద్దుకొన్న వాఙ్మయం. గతాన్ని గురించి
స్మరించినా.. వర్తమానమే భారతీయతకు ప్రధానం. ఆదీ భవిష్యత్తును దృష్టిలో
ఉంచుకొని నిరంతరం కొత్త వికాసమార్గాలలో ప్రస్థానిస్తుంది భారతీయం. ఒక
ప్రాంతానికో, ప్రజలకో పరిమితం కాకుండా సమస్త మానవాళి కళ్యాణం కోసం
పరితపిస్తుందది. మానుషధర్మం నుంచి పక్కకు తొలగకపోవడం భారతీయతలోని విశిష్ట
లక్షణం. ఇందుకు చరిత్ర నుంచి ఎన్నైనా ఉదాహరణలు చూపించవచ్చు. ముందు ఈ
'హిందూ' పదం పుట్టుపూర్వోత్తరాలను గురించి కాస్త తెలుసుకొందాం.

తురుష్కులు ఈ దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు  ముందుగా వాళ్ల కంటబడ్డది
సింధునది. సింధూని వాళ్లు హిందూగా పిలుచుకున్నారు. ఈ దేశాన్ని హిందూదేశం,
ఇక్కడి జనాలను హిందువులు అన్నారు. ముసల్మానుల పెత్తనం వెయ్యేళ్లకు పైనే
సాగింది ఈ దేశం మీద. ఆ పాలకుల నోట నలిగి నలిగి చివరికి ఈ దేశం ప్రజల
నాలుకల మీదా  'హిందూస్తాన్' గా స్థిరబడింది.

ముసల్మానులతో పాటు ఇస్లామూ వారి వెంట  వచ్చింది. ఇస్తాం ఒక శుద్ధమతం. ఆ
మతం ముమ్మరంగా ప్రచారంలోకి వచ్చిన తరువాతే ఇక్కడి ముస్లిమేతరుల మీద
'హిందువులు' అనే ముద్ర స్థిరపడింది. ఆ హిందువులు ఆచరిస్తున్న ధర్మం
హిందూధర్మంగా గుర్తింపబడింది.

'హిందూ' విదేశీయుల మనకు అంటగట్టిన ఒక ‘బానిస ట్యాగ్’ అంటారు దాశరథి
రంగాచార్య ‘హిందూత్వంపై ఇస్లాం ప్రభావం’ అనే వ్యాసంలో. బానిసత్వం పోయినా
ఇంకా ఆ పరాధీన సూచిక పదాన్నే గర్వంగా చెప్పుకు తిరగడం మనకే చెల్లింది!

స్వాతంత్ర్యం రావడం వేరు. బానిసత్వం పోవడం వేరు. జాతీయభాషగా రాజ్యాంగంలో
మనం గుర్తించిన 'హిందీ' పదం అసలు జాతీయపదమే కాదు. అది విదేశీయుల నోటి
నుంచి వచ్చిన నిమ్నపదం. ఈ నిజం గుర్తించలేకపోవడానికి పన్నెండేళ్లకు పైగా
బానిసలుగా బతకేందుకు అలవాటు పడటమే కారణం కావచ్చు.

మహమ్మదు ప్రవక్త ఇస్లాం మతాన్ని ఒక సంఘటిత శక్తిగా రూపొందించారు.
రాజ్యవిస్తరణ, మతప్రచారం.. అనే రెండు ధ్యేయాలతో ఇస్లాం ఆయుధం పుచ్చుకొని
బైలుదేరింది. ఇస్లాం ఆక్రమించుకొన్నంత భూభాగాన్ని, విశ్వాసాన్ని బహుశా
చరిత్రలో అంత తక్కువ వ్యవధిలో మరే ఇతర మతం ఆక్రమించి ఉండదేమో!



ఆ ఇస్లాం వెయ్యేళ్లు పాలించిన భూభాగం భారతదేశం. ముసల్మానుల ప్రమేయం
లేకుండా భారతదేశ చరిత్ర లేదు. ఇస్లామును తుడిచి పెడతామన్న
రాజకీయాపార్టీలు సైతం  మహమ్మదీయులను సంతోషపెట్టే ఓటు రాజకీయాలు
చేస్తున్నాయిప్పుడు!

హింసతోనే ప్రచారం ప్రారంభమయినా.. కాలక్రమేణా ఈ దేశ సంస్కృతిలో
అంతర్భాగమయింది ఇస్లాం. 'స్వర్గ మన్నది ఎక్కడున్నది?' అంటే ‘ఇదిగో..
ఇదిగో.. ఇక్కడున్నది' అనే వరకు మచ్చికయింది భారతీయతకు. భారతీయ తాత్విక
చింతన ఇస్లామును అంతగా ప్రభావితం చేసింది. వెయ్యేళ్ల చరిత్రలో కొన్ని
దుర్మార్గాలకు ఒడిగట్టినా.. మొత్తం మీద భారతీయ ధర్మ, సంస్కారాల
ప్రభావానికి లొంగిపోయింది ముస్లిముల సంస్కృతి. భారతీయుల మత సహిష్ణుత
అలవడ్డం వల్లే.. మిగతా దేశాలలోని దూకుడు కాలక్రమేణా ఇక్కడ తగ్గింది.
మతమార్పిడులు జరిగినా.. ఇస్లామేతరాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం
చివరి వరకు కొనసాగలేదు. ఆదిశంకరుడి అద్వైతం, రామానుజుడి విశిష్టాద్వైతం,
వల్లభాచార్యులు, జయదేవుల మధుర భక్తి, తులసి రామాయణం, కబీర్, మీరా,
త్యాగయ్య, రామదాసు, అన్నమయ్యల భక్తివాఙ్మయం ముస్లిం పాలకుల కాలంలోనే
దేశానికి దక్కింది. ఇంత సాహిత్య, సంగీత, ఆధ్యాత్మిక భావజాలం
వర్ధిల్లనీయడానికి కారణం ముస్లిముల మీద పడిన భారతీయ తాత్విక సహిష్ణుత
ప్రభావం,

ఆరు నెలల సావాసానికి వారు వీరు అవుతారంటారు. వెయ్యేళ్ల సహజీవనంలో భారతీయత
నుంచి ఇస్లాం స్వీకరించిన  సాంస్కృతిక సంపద స్వల్పమేమీ కాదు. భారతీయ
చింతనలో వచ్చిన మార్పూ కొట్టిపారేసిది కాదు. పార్శీ ప్రభావంతోనే ఎదిగినా
ఉర్దూ షాయిరీలో సంస్కృత సాహిత్య  ఛాయలు సుస్పష్టంగా కనిపిస్తాయ్! సూఫీ
సిధ్దాంతానికి భారతీయ తాత్వికతే తల్లి. ఉత్తర భారతంలో వేషభాషల మీదే కాక,
ఆహార అలవాట్ల మీదా ముస్లిం సంస్కృతి అధికంగా కనిపిస్తుంది. ఉపనిషత్తులు
నమ్మని ఏకబ్రహ్మ సూత్రాన్ని ముస్లిం ఆధ్యాత్మికత ప్రభావం వల్ల అద్వైత,
విశిష్టాద్వైత సిధ్దాంతాలకు అంకురార్పణ జరిగింది. ఉత్తరాది దేవాలయాల్లో
నేటికీ సాగే 'ఆరతి' సంప్రదాయం ముసల్మానుల 'సామూహిక ప్రార్థన'లకు అనుకరణే.
భారతీయత  మౌలిక నిర్మాణం తీరుతెన్నులవల్ల  అనుకూలించక   ఎప్పటికప్పుడు
బెడిసిగొడుతున్నవి కానీ  భారతీయ సమాజం మొత్తాన్నీ ఒకే ఛత్రం కిందకు
తెచ్చేందుకు ఇప్పుడు హిందూత్వం చేస్తున్న ప్రయత్నాలు ముస్లిముల అఖండ మత
సిద్ధాంతంతో ప్రభావితమైనవే!

కానీ భారతీయత ‘ధర్మం వేరు.. రాజకీయం వేరు.. గా’ ఉంటుంది. లౌకికధర్మం
రాజకీయాన్ని శాసిస్తుంది.  సమాజం ఆ తరహా ధర్మాన్ని రక్షిస్తుంటుంది.
రాజకీయం ధర్మాన్ని శాసించే తత్వం  పరాయి మతప్రధానదేశలోలాగా భారతీయ
సమాజంలో చెల్లదు.



హిందూ ముస్లిముల మధ్య వ్యక్తిపరమైన వైరుధ్యాలేమైనా ఉంటే ఉండవచ్చు  కానీ
మతపరమైన ఘర్షణలు  ఉండేవి కాదు. ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించుకొనే
వరకు ఈ సహోదరభావం వర్ధిల్లింది. కాబట్టే 1857 స్వాతంత్ర్య పోరాటంలో
బహదూర్ జఫర్ షా చక్రవర్తి కావాలని  హిందూప్రభువులు సైతం
ప్రాణాలర్పించడానికి సిధ్దపడి పోరాడారు. తెల్లవాళ్లను విదేశీయులుగా
భావించి తరిమికొట్టేందుకు హిందూ ముస్లిములిద్దరూ సంఘటితంగా తిరుగుబాటు
చేసారు. మత సిధ్దాంతాల మధ్య వైరుధ్యాలను పక్కన పెట్టి హిందూ ముస్లిములు
ఒక్కటిగా ఉన్నంత వరకు తమది పై చేయి కాదన్న తత్వం తలకెక్కింది కాబట్టే
విభజించి పాలించే విధానానికి తెరలేపింది తెల్లప్రభుత.

టర్కీ సుల్తాను నుంచి మతాధికారాలని ఊడలాక్కొన్న సందర్భంలో ముస్లిముల
ఆత్మగౌరవానికి అవమానంగా భావించి కాంగ్రెస్ ఆధ్వర్యంలో హిందూ
ముస్లిములిద్దరూ కలిసే ‘ఖిలాఫత్’ ఉద్యమం నడిపించారు. బెదిరిన బ్రిటిష్
దొరలు 'హిందూ రాజ్యంలో ముస్లిములకు రక్షణ ఉండదు' అన్న దుష్ప్రచారాన్ని
ముమ్మరం చేసినప్పటి నుంచి రెండు మతాల మధ్య కనిపించని పొరపచ్చలు
మొదలయ్యాయి. జిన్నా సారధ్యంలో ఏర్పడ్డ ముస్లిం లీగ్ ‘ప్రత్యేక ఇస్లాం
రాజ్యం’ కోసం చేసిన ఉద్యమంతో ఇరు మతాల  మనోభావాలు  తిరిగి మెరుగవనంతగా
చెడిన కథంతా మనకు తెలిసిందే!

ముస్లిములలో పెద్దలు కొందరు పెద్దలు మతద్వేషాన్ని వ్యతిరేకించే ప్రయత్నం
చేస్తే,, హిందువుల్లో కొందరు మహానుభావులు మతద్వేషాన్ని రెచ్చగొట్టే
కుత్సితానికి పాల్పడ్డారు. హిందువులు ఒక తాత్విక జాతిగా స్వభావరీత్యా
పరమతాలను ద్వేషించరు. కానీ ఆ కొద్దిమంది మహానుభావులకు మరికొంతమంది
బుద్ధిమంతులు తోడవుతూ అనునిత్యమూ ప్రజల మధ్య సామాజిక శాంతిభద్రతలకు
విఘాతం కలిగించే విధంగా ద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం కొనసాగిస్తూనే
ఉన్నారు.

భారతదేశం విభిన్న విశ్వాసలకు ఆలవాలం. బౌధ్ధం, జైనం, శాక్తేయం, చార్వాకం
వంటి పరస్పర విరుధ్ద విశ్వాసాలు సయోధ్యతో సహజీవనం సాగించాయి ఇక్కడ.
స్వాతంత్ర్యం సాధించుకున్న తరువాతా సుఖజీవనానికి అవసరం లేని మతద్వేషాలు
అవసరమా? ప్రత్యేక మతరాజ్యం సాధించుకొనేందుకు అప్పట్లో ఆయుధంగా వాడిన
మతవిద్వేషాలను ఇంకా ఏం సాధించాలని ఇక్కడ కొనసాగిస్తున్నట్లు?! 'సర్వే జనా
సుఖినో భవన్తు' అన్నది భారతీయత మౌలిక ధార్మికసూత్రం. ఆ స్ఫూర్తి
సంపూర్ణంగా ధ్వంసమయేదాకా మతవాదం అతిచొరవ చూపిస్తే సమాజమే శిక్షిస్తుంది.
చరిత్ర చాలా సార్లు రుజువులతో సహా నిరూపించిన ఈ హితవును పెడచెవిన
పెడతామంటే  .. సరే,, స్వయంకృతానికి ఇక ఎవరైనా  చేసేదేముంది?

***
(సూర్య దినపత్రిక - ఆదివారం - 18 -07 -2020 ప్రచురితం) 



Saturday, July 11, 2020

మేధస్సు రాజకీయం వెంట ‘పడి’పోకూడదు! -కర్లపాలెం హనుమంతరావు - సూర్య సంపాదకీయ వ్యాసం





పశ్చిమ జర్మనీ పురాప్రాణి విజ్ఞానవేత్తలలో ప్రముఖుడైన మానసిక విజ్ఞానశాస్త్రవేత్త ప్రొఫెసర్ రూడోల్ఫ్ బిల్జ్ మనిషి చిత్త ప్రవృత్తి మీద అనేక పరిశోధనలు చేసిన అనంతరం తేల్చి చెప్పిన సారాంశం – మనిషి మనసు ఇట్లా ఉంటుంది.. అట్లా ఉంటుంది’ అని గట్టిగా స్థిరపరిచి చెప్పడానికి  ఏ మాత్రం వీలులేని బ్రహ్మపదార్థం- అని. పరిస్థితిని బట్టి ప్రవృత్తి మార్చుకోవడం మనసు బలం. అధునాతమైన ఏ విజిజ్ఞాసాపథప్రమేయ విజ్ఞానమైనా ఈ తరహాలో ఉన్నప్పుడు ఇవాళ జరిగే సంఘటనకు మనిషి రేపు ఎలా స్పందిస్తాడో అన్న ఊహ ఊసుబోకకు మాత్రమే పరిమితమవుతుంది. సాహసించి ఏ కొద్ది మంది బుద్ధిబద్ధ మేదావుల కొంత కల్పన చేసినా ఆ ఊహపోహలు వేటికీ గతకాలపు అనుభవాలను దాటి ముందు వచ్చే పాటి శక్తి చాలదు. ఆ మేధోవర్గ ప్రవచనాలను ఆధారం చేసుకుని తతిమ్మా సామాన్య జనం పడే గుంజాటనల ఫలితాంశమే  లోకంలో ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్న రాజకీయ  గందరగోళ వాతావరణం.
మేధోవర్గంగా మన్ననలు పొందిన బుద్ధిజీవులు ఈ రోజు తమకు తాముగా అస్వతంత్రులవుతున్నారు.  ప్రయోజిత  ఆలోచనాధారకు తమదైన శైలిలో ముద్రలు వేస్తూ సమాజం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.  మద్దతు  లభించని పక్షంలో  ఆకృతి లేని మాటలకు, నిరాకార భావాలకు ఏలుబడికి వచ్చే అవకాశం ఉండదని తెలిసే ఈ ప్రక్రియ కొనసాగడం ఆందోళన కలిగించే అంశమే కదా?
సమూహాలను మించి వ్యక్తులను అభ్యుదయ శక్తులుగా చూడడమూ, సముదాయాల మీద  వ్యక్తుల ఆధిపత్య ధోరణికి హారతులు పట్టడమూ.. రెండూ వాంఛనీయం కాదు. ప్రజాస్వామ్య పంథా ఏలుబడి మార్గంగా ఎంచుకోబడిన చోట అది మరీ ప్రమాదకరం.  నిబద్ధ రాజకీయాలు (కమిటెడ్ పాలిటిక్స్) అన్న అభాసాలంకారమే అసలు పుట్టేందుకు ఆస్కారం ఉండకూడని జనస్వామ్య వ్యవస్థలో ‘నిబద్ధ మేధోవర్గం’ కూడా ఒకటి పుట్టుకురావడం విషాదకర పరిణామం.
కాలగమనాన్ని, సాంకేతిక విజ్ఞాన ప్రగతిని, విజ్ఞానశాస్త్రపు మనోవేగ ప్రసరణ తీవ్రతను గమనించనివారు మాత్రమే నిబద్ధ రాజకీయం’ అనే ఆలోచన చేసి ఆనక దాని చూట్టూతా సమాజాన్ని సైతం తిప్పించాలని తాపత్రయం చూపించేది. అది వృథా ప్రయాసగా మారిందని గ్రహించే వేళకు వారి పొద్దు ఎటూ వాటారిపోతుంది. దానితో కొంత మంది స్తబ్దుగా  తెర వెనకకు మలిగిపోతారు. మరి కొద్దిమంది బుద్ధిజీవులు ఆగలేక ఆఖరి నిశ్వాసలో నిట్టూర్పు ధ్వని వినిపిస్తారు. విన్యాసం ఏదైనా కావచ్చు కానీ.. రెండు చర్యల సారాంశం మాత్రం ఒక్కటే.. ‘ఏకబద్ధ మేధోసిద్ధాంతం’ అనే ఆలోచనకు ఎప్పుడైనా చివరకు దక్కేది  వైఫల్యమేనని.
 రాజకీయాలలో మాత్రమే ఈ తరహా నాటకీయ ప్రవృత్తులు ఎక్కువగా చోటుచేసుకుంటాయి. రాజకీయవేత్తలకు ఉండే ప్రత్యేక లాభం కూడా అదే. పరార్థాన్ని స్వార్థం ఆక్రమిస్తుందో, స్వార్థం స్థానే పరార్థం రూపు దిద్దుకుంటుందో.. ఒక పట్టాన అర్థం కాని మయసభ మాదిరిది ఈ ఊసరవెల్లి క్షేత్రం. రాజకీయాలలో వ్యక్తిగతప్రయోజనం పార్టీ ప్రయోజనంగా విలసిల్లడమూ, పార్టీ ప్రయోజనం ప్రజాభీష్టంగా  ప్రదర్శించే ప్రయత్నాలు సందర్భాన్ని బట్టి ముమ్మరించడమూ మనం చూస్తుంటాం.  అందులో ఏది ఏదో చెప్పడం బ్రహ్మకైనా సాధ్యంకాదు. ప్రజాస్వామ్యం అనే పదానికి ఉండే విశాలమైన అర్థం పరిమిత ప్రయోజనాలకు కుచించుకునిపోయే సందర్భాలు అవే. ఈ వైపరీత్యానికి కారణమేంటని గాని ఆలోచించగలిగితే రాజకీయవేత్తలలో నిరంతరం గూడుకట్టుకుని ఉండే సంకోచం.. భయం అని నిస్సంశయంగా చెప్పుకోవచ్చు. బహుత్వంలో ఏకత్వం దర్శించలేక తమ అస్తిత్వం పట్ల గూడుకట్టుకునే అభద్రతాభావన అది. ఆ భావన ప్రసరణ వివిధ రూపాలే రాజకీయాలలో క్షణక్షణం సాగే రసవత్తర నాటక ప్రదర్శనలకు మాతృక.
ద్వంద్వాలను చూస్తూ, వాటికి అతీతంగా ఉంటూ,  ప్రకృతిని, దాని సృష్టిని జడం నుంచి స్థావరం వరకు, స్థావరం నుంచి జంగమం వరకు సూక్ష్మ అనుశీలన చేసి లోకానికి స్థూలం నుంచి విపులంగాను, విపులం నుంచి స్థూలం వరకు వివరించి చెప్పవలసిన బాధ్యత  మేధోసంపన్నులది. ఆ మేధోవర్గమూ రాజకీయవేత్తల పాత్రల్లో ఇమిడే ఇప్పటి ప్రయత్నాలు విచారం కలిగించే వైపరీత్య విపరిణామం.  
రాజకీయవేత్తల ప్రవృత్తి పరిశీలన పద్ధతికి, మేధావుల ప్రవృత్తి పరిశీలన పద్ధతికి విధిగా తేడా ఉంటుంది. ఉండాలి కూడా. ఆ అంతరం గుర్తెరుగకుండా మేధావిత్వం వెలగబెడుతున్నామనే మెజారిటీ  ఆలోచనాశీలులు తమ్ము తాము వంచించుకుంటున్నారు; తమను నమ్మిన  సామాన్య లోకాన్ని సైతం వంచించాలని చూస్తున్నారు.
రాజకీయవేత్త ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వార్థపు ఎల్లలు దాటి బైటికి చూడవు. మేదావికి ఆ అడ్డమాకులతో ఏం పని నిజానికి? అతని మనసు ఆకాశంలో స్వేఛ్చావిహారం చేసే విహంగంతో సమానమని కదా లోకం మన్నన! నిస్సీమమర్యాదగా సంచరించే ఆ మనసుకు హద్దులెక్కడివి? కేవలం సంకెల బద్ధం కాని బుద్ధిబలం ఒక్కటే మేధావిని కాని, రచయితను కాని, కళాకారుడిని కాని రాజకీయవేత్త నుంచి వేరు చేసి చూపించే గొప్ప లక్షణం. మేధావికీ   కమిట్ మెంటులు, కట్టుబడులు, బిగింపులు, అదుపాజ్ఞలకు లొంగుబాట్లు ఉన్న పక్షంలొ అతని ఆలోచనాధార, ప్రవాహఝరులకు అడ్డుకట్టలు డుతున్నట్లే లెక్క!
 ఇప్పుడు ఈ దేశపు మేధోలోకంలో గోచరించే ఈ సీమాయితబుద్ధిమత్వమే భయపెడుతోంది. రాజకీయవేత్తలోని రాజకీయ పదజాలాన్ని అరువు తెచ్చుకుని తమ ఆలోచనలకు తామే బందీలవుతూ.. లోకాన్ని సైతం తమ పరిమిత భావధారతో బంధించాలని చూస్తున్నారు మేధావులు! మనిషిని విశ్వరూపుణ్ణిగా మార్చవలసిన మేధావి పరిమితుణ్ని చేయాలన్న ప్రయత్నం విచారం కలిగిస్తోంది.
భూమి బంధాలను  సైతం విజ్ఞానశాస్త్ర సాధనతో ఒక వంక తెంచివేస్తోనే మరో వంక నుంచి తనలోని పెరగలేనితనం వెర్రిపిలకలు వేస్తున్నా నిర్లిప్తత పాటించడం నిజంగా ఒక వైపరీత్యమే! ఉత్తమోత్తమమైన  ఉత్ఠానమే సిద్ధాంతంగా అమలు కావాలన్న పంతంలేమి ప్రధానంగా ముందుకు రావడం.. అంటే మేదావులు తమ పాత్ర నిర్వహణలో విఫలమవుతున్నట్లే లెక్క. సంకోచం లేకుండా మేధావులు రాజకీయాలలో పడిపోతున్నారన్న మాటే.. అనుమానం లేదు!

 మహాప్రళయంలో కూడా నిర్భయుడు, నిరాసక్తుడు అయివుండవలసినవాడు, భయభ్రాంతులుగా, మమతాచిత్తులుగా మారిపోవడం దేనికి సంకేతం? అనుశీలన పరిశీలన కన్నా దిగువ స్థాయికి దిగజారిపోవడం ఏ ప్రమాదానికి ఆహ్వానం? ఏకదేశసిద్ధాంతాలకు తమను తాము బిగించుకున్న ఫలితంగా మేధావులలో వ్యుత్పన్నత పలచబారిపోతోన్నది. 'నాతనం' నావారు అనుకున్నవారి చేతకానితనాన్ని  వేలెత్తి చూపించడానికి నామోషీ పెడుతోన్న సందర్భం దశ కూడా దాటిపోయింది. ఇప్పుడు మేధావులూ బరితెగింపు మార్గం పట్టేసారని లోకం బాహాటంగానే విమర్శిస్తున్నది. ఎవరు నొచ్చుకున్నా చెప్పక తప్పని  చేదు నిజం ఇది.
గిట్టని వర్గాల చేవకు చెయ్యెత్తి జైకొట్టడం జైళ్లకు చేర్చే సాకుగా  మారడం స్వార్థరాజకీయాలకు అతుకుతుందేమో! ఆ తరహా  కుతిల(బాధామయ) స్థితులకూ ఒక అంతస్తు కల్పించే ప్రయాస మేధోలోకం నుంచీ ఔత్సాహికంగా రావడమంటే.. నిస్సందేహంగా జనస్వామ్యవ్యవస్థ సర్వవినాశనానికి నాందీ వచనం ఆరంభం అయినట్లే! చీకటిలో తచ్చాడే మనుషులకు  ఏ ఒక్క మేధోజీవీ అనధికార దీపంగా అయినా  వెలిగి రహదారికి ఎక్కే  దోవ చూపించేందుకు సిద్ధంగా లేని  దుస్థితులు మళ్లీ దాపురించాయని నిస్సందేహంగా చెప్పేయవచ్చు. 
ఇక్కడ ఇప్పుడు ఏది లేదో దాని వల్లనే అంతటా చీకటి. ఆ చీకటి పారదోలడమే పనిగా ఉండవలసిన మేధోవర్గమే జనం చీకటిపాలబడేందుకు మొదటి కారణమవుతున్నది. దో విచిత్ర పరిస్థితి.
మేస్సుకు ఎవరో భాష్యం మార్చేసినట్లుగా ప్రస్తుతం ఏ ప్రచార మాధ్యమం గమనించినా ఆలోచనాపరుడంటే ఏకదేశ రాజకీయభావవిన్యాసకుడుగా మాత్రమే దర్శనమిస్తున్నాడు!


సమాజం మహాసముద్రం. గభీరం, గంభీరమైన అగాధమొకటి ఎదు ఉండగా, దానిని వివిధ నత్తల్లో అనుశీలన చేసి వడగట్టిన ఫలితాంశాలను సమాజశ్రేయస్సుకు అంకితమిచ్చే పని మేధావిది. ఆ విధి దిక్కులేనిది అయిపోయింది.
అభివృద్ధికి అర్థం నాలుగు రాళ్లు చేతుల్లో ఆడడం కాదు. సామాజికుణ్ణి ఎంత వరకు స్వతంత్రుణ్ణి, సమగ్రుణ్ణి, సర్వతోముఖుణ్ణిగా తీర్చిదిద్దుతుందన్న దాని మీదనే దాని  ప్రకాస్తి నిలుస్తుంది. ఎటూ రాజకీయవేత్త వల్ల కాని పని ఇది. మనిషిని బంధించేందుకు మాత్రమే ఎత్తులు  వేసేది రాజకీయం. జన బంధ విముక్తి తన ఉనికికి ఇబ్బందని దానికి తెలుసు. కనుక విడిచే పరిస్థితి ఉండదు. సామాజికుడి విముక్తి, జీవన విస్త్రృతులే లక్ష్యంగా పనిచేసే మేధావి  పనివిధానం అందుకు విభిన్నం.
ప్రపంచ దేశాల  వర్తమాన పరిస్థితులతో దేశీయుడి జీవన స్థితిగతులను ఎప్పటికప్పుడు తుల్యమాన పద్ధతిలో బేరీజు వేసుకుంటూ మంచి చెడులను చర్చకు పెట్టడం, క్రియాశీలులు  తమ ఉద్యమాలకు ఉత్తమ లక్ష్యాలు సిద్దంచేసుకునేందుకు వీలుగా వేదికల కల్పనలో తమ వంతు అంకితభావంతో నిర్వహించడం  మేధోజీవి పాత్ర. మేధావి  ఎట్టి సంకటంలో కూడా ప్రతినివిష్ఠ బుద్ధి కాకూడదు.  మనసుకు సంకెళ్లను పడనీయకూడదు. బంధం ఒకరు వేసినా, తనకు తానుగా వేసుకున్నా.. ఆ క్షణం నుంచి   అతని వాణి స్తబ్దము, దభ్రమూ కాకతప్పదు.

రాజకీయం, మేధస్సుకుకానొక అంగం మాత్రమే! ఎల్లవేళలా ఒకే ఆకారంలో ఉండని రాజకీయ వ్యవహారాలను తన సర్వస్వంగా భావించిన మేధావి మేధోమధనను నమ్మలేం. కారణం, అతడూ రాజకీయవేత్తతోనే తన బాణి, వాణి మార్చుకునే వర్గంలోకి దిగజారుతాడు కనక.

రాజకీయాన్ని, దానిలోని వైవిధ్యాన్ని మేధావి ద్రష్ట బుద్ధితో అనుశీలన చేసి అందులోని ఋతానికి, ధర్మానికి మాత్రమే ఆవిష్కర్తృత్వం వహించే బాధ్యత భుజాన వేసుకోవాలి. అట్లా వేసుకోగలిగిన మేధావులే నామవాచ్యులయినట్లు చరిత్ర రుజువులు చూపిస్తోంది. ఆ విధంగా చేయలేనివారు విపరీతపు సిద్ధాంతాలను బుర్రలోకి చొప్పించుకుని మేధోమార్గాన్నే మొత్తంగా పర్యాప్తమూ, పరిమితమూ చేసుకుంటున్నారని చెప్పాలి. పరిమిత సూత్రాలకు అపరిమతమైన ధార్మికతను అంటకట్టి కోరి కోరి తమకు తామే భావనాపంజరాలలో చిలకలుగా మార్చుకుంటున్నారు తాజా మేధావులు! ఎవరి పలుకులో అస్తమానం  చిలుకల్లా వల్లించడంతో మేధస్సుకు దక్కవలసిన న్యాయమైన గౌరవం దూరమవడానికి  కారకులవుతున్నారు.
లోకంలో ఏ సిద్ధాంతమూ, ధర్మమూ సమగ్రంగా ఉండవు. ఎల్లాకాలం ఒకే రూపంలో  చెల్లుబాటవాలనుకోవడం ధర్మం కూడా కాదు.  నిన్నటి ధర్మం ఈ రోజు చద్దివాసన వేయక తప్పదు. కారణం ఏ సిద్ధాంతమైనా ఏదో ఒక  వర్గ  ప్రయోజనానికి పరిమితమయి స్థిరపరచిందవడమే! అప్పటి కాలానికి అది ఉత్తమమని తోచినా.. కాలగమనంలో అవసరాల నిమిత్తం రంగప్రవేశం చేసే నూతన సిద్ధాంతాలు దానిని నిర్వీర్యం చేయడం తప్పనిసరి. అప్పుడు రాజకీయవేత్త కన్నా ముందు దాన్ని నిర్ద్వందంగా సమర్థిస్తూ వచ్చిన మేధావి సమాజం ముందు బోనులో నిలబడే  దుస్థితి వస్తుంది. 
 మానవ చరిత్రలో ఇంత వరకు ఎన్ని రాజకీయ సూత్రాలు అవతరించలేదు! అవధులులేని అధికారాలు అనుభవించీ కాలానుగతంగా అంతరించిపోలేదు! సిద్ధాంతం ఏదైనప్పటికి, ప్రతిదీ మంచి చెడుగుల కలగలుపు నేతే. తానులోని ఏ పోగులు శాశ్వత, సర్వహిత ధర్మ  సమ్మత లక్షణ సమన్వితమైనవో అనుశీలన చేసి ప్రపంచానికి  విడదీసి చూపించడంతో మేధావి బాధ్యత సంపూర్ణమయినట్లే!
కాలం అచంచలం, పృథివి పరిమితం -అన్నట్లుగా నిత్యం ప్రజాజీవితాలతో స్వీయప్రయోజనార్థం రాజకీయవేత్తలు రూపకాలు ప్రదర్శిస్తుంటారు. మేధావులు  వాటికి సూత్రధారుల వేషం కట్టకూడదు. పాత్రధారణనయితే బొత్తిగా దూరం పెట్టడం ఉత్తమం.
బంధాలు లేని  విచారధార వల్లనే కదా విజ్ఞానశాస్త్రం మానవపురోగతికి శక్తి మేరకు సమిధలు సమర్పించ గలుగుతున్నది! ఈ ఒక్క సూత్రం పట్టుకుని మేధోవర్గమూ ముందుకు పోగలిగినప్పుడే ప్రకృతి జనిత సర్వ పదార్థాల క్రమావిష్కార రహస్యాలను   అనుశీలించ గలిగే తన ప్రత్యేక శక్తిసామర్థ్యాలను   నిలుపుకునేది. మనిషిని సర్వతోముఖమైన సర్వజన సంక్షేమంకరమైన కళ్యాణమార్గం వైపుకు మళ్లించే సంకల్పం నిలుపుకోదలుచుకుంటే .. ఇప్పటిలా  ఏదో ఓ రాజకీయ పక్షాన్నో, పంథానో అదే శాశ్వతమని నెత్తిన పెట్టుకు వూరేగే మూఢత్వం ప్రదర్శించకూడదు. ఎంత లావు మన్నన పొందిన మహామేధావికయినా ఈ నియమంలో మినహాయింపులేదు.
 ఏకసిద్ధాంతబద్ధతకు లొంగని నిబద్ధత నిలుపుకున్నంత వరకే మేధావిలోని అసలు మేధస్సుకు జవం, జీవం.. మన్ననా, మర్యాదా. మాన్యత సాధించిన మేధోవర్గం ద్వారానే సామాన్య జనానికి ఎప్పటికప్పుడు వర్తమాన సమాజంలోని రాజకీయ స్థితిగతులు, మంచి చెడ్డలు వడగట్టినట్లు బోధపడేది.
***
(11 -07 -2020 నాటి సూర్య దినపత్రికలో ప్రచురితం)



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...