Saturday, December 11, 2021

కవితా కల్పకం - విద్వాన్ విశ్వం ప్రస్థానము

 కవితా కల్పకం - విద్వాన్ విశ్వం 

ప్రస్థానము 


కవితా కల్పకం - విద్వాన్ విశ్వం 

ప్రస్థానము 


మాలిన్యము నుండి నన్ను 

మంచి వేపు నడిపించుము 

కారుచీకటి లో నుంచి 

కాంతి వేపు నడిపించుము 

చావు నుండి అమృతత్వపు 

చాయలకై నడిపించుము 

( వైదికం - బృహదారణ్యకం - ఉపనిషత్ 


***

తపస్సు 


అల నయోధ్యాపురీ 

కలభాషిణుల మోము, 

చెలువమ్ము నందుకొన

జలజము లెల్లన్‌ 

కొలను నడుమను నీటి 

మొలబంటిగా నిలచి 

కలకాలము తపము 

సలుపు నట్లుండెన్‌ 

( లౌకికం - అమృతానందయోగి ) 

 ***

దయ 


దిశమొలతో జడలు దాల్చి 

దిశాంతముల జరియించిన  

ఆకులతో, నారలతో 

నంబరములు నేసికొన్న 

బూది, మన్ను, దుమ్ము వంటి 

మీద పూత పూసికొన్న 

బండలపై, గుండ్లపై 

దిండు  లేక పండుకొన్న 

మనసులోని మాలిన్యము 

చనుట కెట్లు తోడుపడును ? 


జీవుల వేధించక, జన

జేత వగుటకు ఏడ్వక,

లోకమ్మును దయతో నా 

లోకించినపుడు గదా 

నీ మనసు నిర్మలమై 

కోమలమై శాంతువగుట! 


( పాళీ - దమ్మపదం)  


అనురాగం 


అగమ్యమైనది 

అనుపమమైనది 

అమితమైన దా 

అనురాగాంబుధి 

దాని దాపులకు 

దరిసిన వాడిక 

ద్వంద దుఃఖ జల

ధానము  జేరడు

( హిందీ - రసభాలి)  


అనేకుల కది! 

- రవీంద్రనాథ్ ఠాగోర్

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 


క్రొవ్విరులను గూర్చిన 

నీ మువ్వపు  మాలికను

కంఠమందు వైతువా 

పువ్వుంబోణీ!    అయినచో 

ని వ్విరి సరమునకు 

బదులు నే నేమిత్తున్ ? 


నే గట్టిన తో మాలను 

నీ కొక్కర్తుక కె 

యొసగ నెట్లు పొసగు? 

నో రాకా  హిమకర వదన! 

అనేకుల కిది

వారి నెల్ల నెటు వర్జింతున్ ? 


ఉన్నారు భావుకులు : 

మన కన్నుల కగపడని 

చోట్ల గలవారెవరో 

ఉన్నారు; కవుల పాట 

సన్నిహితులు ఉన్నవారు 

చాలమందియె

ఇందరికై ఈ మాలిక 

నందమ్ములు జిలుక కట్టినాడ

గావునన్‌; 

కుందరసమదన ! 

నీకే చెందించుట 

నెట్లు పడును? 

చెప్పుము నీవే. 


నీ యడదకు   

నా  యడద నుపాయనముగ 

నడుగు  సమయ మది 

గతియించెన్; 

తోయజ నయనా 

ఎపుడో పోయిన దా   

కాలమెల్ల  గతియించెన్ 

పూర్వగాథయై.


పరిమళమంతయు 

లోపలి యరలోనె 

దాచు కొన్నయట్టి

మొగ్గతో సరియై , 

నా జీవిత - 

మొక పరియై యుండెను-  

పోయె నట్టి ప్రాప్తము 

పడతీ!  


ఉండిన తావిని 

దిక్కుల నిండా 

వెదజల్లి వేసి

నే  నుంటిని; 

ఏ పండితు డెరుగును 

పోయినదండి వలపు 

మరల చేర్చి, దాచు 

మంత్రమున్ . 

సారస నయనా 

నీ హృన్నీ రేజాతమ్ము 

నొకరి నెయ్యమునుకే

ధారాదత్తము సేయగ నేర! 

ననేకులకు 

దాని నియ్యగ వలయున్ . 

- బెంగాలీ - రవీంద్రుడు 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

07 - 10 - 2021 

బోథెల్ ; యూ. ఎస్. ఎ 


మేల్కొలువు


మేల్కొనండి జనుల్‌

మేల్కొనండి  నరుల్

మన  జీవ రక్షకుడు 

చనుదెంచుచున్నాడు 

చీకటులు విచ్చినవి 

వేకువలు విరిసనవి 

రవి వచ్చు మార్గమును

సవరించెను దుషస్సు 

ఎచట నన్నము దొరకు 

అచట కేగెదము నింక 

మేల్కొనుడు మేల్కొనుడు 

మేల్కొ నుండిక జనుల్ ! 

( వైదికం- రుగ్వేదం ) 


జిలుగు

వాచ్యభిన్నమై 

మరియొక సూచ్యమైన 

వస్తువుండు 

మహాకవి వాక్యములను; 

వెలికి కనిపించు 

నవయవమ్ములకు 

కట్టువడని 

వనితల జిలుగు  

లావణ్య మట్లు 

- ఆనందవర్ధనుడు - ధ్వన్యాలోకము 


మిటుకులాడి 


కోపించిన 

ననురాగము  చూపించిన

కంటనీరు తొలకించిన 

సల్లాపించిన - 

చొక్కించు ( పరవశింపచేయు) నదే పనిగ 

మిటుకులాడి తెరవ( ఆడుది )  

 నీ మదిన్ 

( ప్రాకృతం - సత్తసయీ ) 



మా కోనకు... 


కడవ  ముంచు కొనవలెనా 

కలికి రమ్ము మా కోనకు 

నీరు నీ పదాల చుట్టు చేరి 

నీ గుట్టు చెప్పగలవు 

సారజాక్షి! వాననీడ  

లూరుచుండె సైకతముల 

ఫాలమందు వ్రేలు కుంత 

లాలవోలె మబ్బులెల్ల 

నీలి చెట్ల కొమ్మలు ను 

య్యాలలూగుచున్నవి 

నీ యాడుగుల చవి 

నో యువిద నే నెరుగుదును

నా యండందలో నది 

పాయక నిరంతరము నినదించుచుండె

కడవ ముంచుకొన వలెనా

కలికి రమ్ము మా కోనకు 

కాలహరణ కావలెనా 

కాంత రమ్ము మా కోనకు

కడవ  నీటి పైన వదిలి యుండి 

చడి చప్పుడు గాక యుండ 

గడప వచ్చు నీ కాలము 

తడబడ నక్కర లేదిక

కసము మొలిచె దరువులలోన 

పసరు మూసుకొని వచ్చెను

కోసరి కోయవచ్చును గగన

కుసుమమ్ముల నెన్నియైన

నీలి కనుల వల చీల్చి   

ఓ లలనా తలపు పులుగు 

లోలి యెగిరి పోవు చుండ 

చాల సేపుగడప వచ్చు

కాల హరణ కావలెలా 

కాంత రమ్ము మా కోనకు 

--- 

జలక మాడవలెనా 

ఓ జలజాక్షీ రమ్మిచటికి 

నీలిచీరెవిడిచి వేసి 

కూలమ్ముననే యుంచుము

నీలి చీరె నిన్ను గప్పి

గోలా దాచును లెమ్మ

అలలు తము కంఠంబును కౌ

గిలిలో బిగియంగబట్టి  

చెలియా! నీ చెవిలో మ 

త్తిలి యాడును మంతనాలు

 జలక మాడవలెనా ఓ 

జలజాక్షీ! రమ్మిచటికి! 

--- 

నీట మునిగి పోవలెనా 

బోటి రమ్ము మా కోనకు 

శీతలమ్ము నీరు ఇచట 

లోతు కూడ చాలినంత 

నాతి! గాఢ నిద్రవోలె 

నీ తిమిరమ్ము గ్రమ్మె నిచట 

కోన లోతు లోతులలో

చానా గానమ్ము మౌ నమ్ము నొకటై 

జ్ఞాన ముద్ర భాసిల్లును 

నీట మునిగి పోవలనా 

భామ రమ్ము మా కోనకు!

- బెంగాలీ - రవీంద్రుడు 






 




 



 









 

ఈనాడు - సంపాదకీయం - రచన - కర్లపాలెం హనుమంతరావు హర్షరుతువు

 


ఈనాడు - సంపాదకీయం 

- రచన - కర్లపాలెం హనుమంతరావు 

హర్షరుతువు 

( ఈనాడు - ప్రచురితం - 29-07-2012 ) 

హర్షరుతువు


'ముసుగు వేసిన చందాన మొగులుగప్పి కడవల నుదకంబు ముంచి తెచ్చి కుమ్మరించిన గతి' వాన కురిసిందని 'రామాయణం' రచయిత్రి మొల్ల వర్ణించింది. సుగ్రీవ పట్టాభిషేకం అనంతరం ముంచుకొచ్చిన వర్షరుతువు మూలంగా సీతాన్వేషణ వాయిదాపడి శ్రీరామచంద్రుడి విరహబాధ హెచ్చింది. మాధవుడిని ప్రతిగా కోరి గోవర్ధనగిరి సమీపాన రుణ విమోచనా తీర్ధంలో రాధాదేవి తపమాచరించే వేళ వానలుపడటం మొదలు పెట్టాయి. 'ఇంద్ర చాపంబు గాదిది మౌళి తలమున సవరించు బరి(నెమలి) పింఛంబు గాని/ బిదుర ఘోషంబు(పిడుగు ధ్వని) గాదిది పాంచజన్య సంజాత గంభీర 'ఘోషంబు గాని' అంటూ కుంభవృష్టిని ముకుందుని సృష్టిగా భావించి హర్ష పులకితాంతరంగిత అయింది తెనాలి రామకృష్ణ కవి శ్రీ పాండు రంగమాహాత్మ్యంలోని రాధాదేవి. విరహమైనా, వివశమైనా ఆధారపడేది మన మానసిక పరిస్థితిమీదే. మబ్బుపట్టడాన్ని ఎందుకో చాలా మంది అశుభ సూచనగా భావిస్తూ ఉంటారు. వానలేనిదే జీవంలేదు. 'శర్మిష్టి'లో కృష్ణశాస్త్రివారు అన్నట్లు ఇది 'మధుమాసమ్ము, ఇది వాన కారు/ ఇది వెన్నెలలవేళ, ఇది సీతుకారు' అటూ కాలచక్రం రుతుషట్కంగా విభజన జరగకపోతే జీవనవైవిధ్యానికి తావేది! జ్యోతిషం ప్రకారం చూసినా- 'వకార ఆరంభ నామధేయాల నక్షత్రం రోహిణి. రోహిణిది వృషభరాశి.  దానినుంచి మూడోది కర్కాటకం . సూర్యభగ వానుడి ఆ కర్కాటక ఆగమనం 'వనతతి(అడవులు), వరాహ, వాహా రి(నెమలి), వారణ(ఏనుగు),వర్షాభుల(కప్పలు) మనోవ్యాధులకు మహత్తరమైన ఔషధమ' ని  ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయల చమ త్కారం. దేవరాయలవారి దాకా దేనికి.. వానంటే ప్రాణం లేచిరాని దెవరికి? ఎవరు వద్దన్నా, ఎవరు కావాలన్నా కాలం పట్టించుకోదు. తన మానాన తాను క్రమం తప్పకుండా కాలచక్రాన్ని తిప్పుతుండటమే దానికి తెలిసిన పని. జ్వలిస్తే గ్రీష్మం, కురిస్తే వర్షం, చలిస్తే శిశిరు, విరిస్తే వసంతం... అంతే!


ఆచార్య గోపి అన్నట్లు 'మనిషికి ప్రకృతికీ తేడాలేని/ రుతు ప్రకో పంలో/ సమన్వయ సమ్మేళనంలా వికసించిన ప్రేమే వర్షం. వాన కురిస్తే మనసుకు కుట్టిన దుస్తులు తడిసి ముద్దవుతాయి. తుడిచిపెట్టుకుపోయిన ఆలోచనలు మళ్లీ గడ్డిలా మొలుచుకొస్తాయి. బాల్యంలో చూరునీళ్ల దుప్పట్లో దూరి అమ్మమ్మ చెప్పిన కాకమ్మ- పిచ్చుకమ్మ కథలను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకొంటే- నెగడు ముందుచేరి చలి కాచుకుంటున్నంత వెచ్చగా ఉంటుంది! నిజానికి, వర్షం మనసును ఆరబె ట్టుకునే వస్త్రం.  చిటపట చినుకులు పడుతూ ఉంటే... చెలికాడో చెలికత్తో  సరసన ఉంటే... చెట్టాపట్టగ చేతులుపట్టి ఏ చెట్టు నీడకో పరిగెడుతున్నట్లు ముచ్చట్లు ఊహించుకోండి... ముదితనం కూడా హర్షరుతువు ఆనవాళ్లు వెతుక్కుంటుంది. మామూలు మనుషులకే మతులు పోగొట్టే వర్షరుతువు మరి కవి హృదయాలను కుదురుగా ఉండనిస్తుందా! మహాకవి కాళిదాసు ' మేఘ సందేశం' మిషతో ఆషాఢమాస లీలా విలాసాలను తనివితీరా వర్ణించాడు. పాండ్యరాజు దిగ్విజయ యాత్రను ఒక్య పద్యంలో ముగించిన రాయలవారు వర్షరుతువు వర్ణనలతో ఆముక్తమాల్యద చతుర్ధాశ్వాసాన్ని ఆసాంతం తడిపివేశాడు. విశ్వనాథ, శ్రీశ్రీలనుంచి తిలక్, పులిపాటివంటి ఆధునికుల దాకా వర్షంలో తడవని వారెవరు! 'ఆకాశపు రహదారులలో/ అదిగో మెయిళ్ల తేరు' అంటూ, వానూరు దొరగారి జోరులో కృష్ణశాస్త్రి హోరె త్తిస్తే... కుందుర్తివారు నగరంలో కురిసే వాన గురించి ఓ వచన గీతమే రాసేశారు. పైలోకాన లేదు ఈ వాన సౌభాగ్యం. వర్ష తప్త  అనిర్వచనీయ అనుభవం కోసమేనేమో వటపత్రశాయి అవతారమెత్తాడు  అశేష తల్పశాయి! పోతన తన భాగవతం దశమ స్కంధంలో సోదర సమేతంగా గోపబాలురతో అడవి అంచుల్లో ఆవులను మేపుతూ గోపాలబాలుడు ఆడి పాడిన వానా వానా వల్లప్పులను పరమాద్భుతంగా వర్ణించాడు. ఏడు రాత్రులూ పగళ్లూ ఎడతెరిపి లేకుండా లోకం సమస్తాన్ని ఏకార్ణవంగా మార్చిన సంవర్తక మేఘగణ విజృంభణనూ అంతే బీభత్సంగా అభివర్ణించాడు. వృష్టి ఉండాలి నిజమే... అతివృష్టి అయినా అనావృష్టి అయినా అనర్థమే.


'అన్నమో రామచంద్రా!' అని అలమటించే చోట బీటలు వారిన పెదవులమీద నవ్వుల పువ్వుల్ని పూయించగలిగే శక్తి ఒక్క నీటిబిందువుకే సొంతం. క్షామగ్రస్త భూమాతకు ఊరట కలిగించేది అదనులో వరుణుడు చూపించే కరుణా కటాక్షాలే. అణువును ఛేదించే మనిషి చినుకును కురిపించగలడా! వివిధ ముద్రలతో నాట్య వేదిక మీద నృత్యమొనరించే నర్తకీమణుల్లాగా జీమూతగణాలు నీలాంబరంలో కదలివస్తుంటే మయూర తతులమాదిరి మనసు పురులు విప్పని మనిషి ఉంటాడా! వర్ష హర్షాన్ని అక్షరం మడుల్లోకి మళ్లించి సుసంపన్న సాహిత్యాన్ని పండించిన మహానుభావులు ఎందరో! నీరు లేనిదే బతుకే లేదు. ప్రకృతికి పచ్చదనాన్ని వాగ్దానం చేసిన సూర్యుడు మండే నిప్పుగోళమైనప్పుడు కన్నొక్కటే కురిసే మేఘమవుతుంది! వర్షాలు కురవడానికి ప్రత్యేక ప్రార్థన ఏమన్నా  ఉందేమో తెలీదు... వర్షంకోసం నాట్యం చేయడానికైనా మేము సిద్ధం:- ప్రపం చాన్ని మునివేళ్లమీద నాట్యమాడించాలని ఉవ్విళ్లూరే అగ్రరాజ్యం గుక్కెడు నీళ్లకోసం చేస్తున్న వేడుకోలు అది. పాలపుంతల్లోకి మనిషి ఎగబాకగలడేమోగాని కోరినంతనే, సమయానికి జలధరాన్నుంచి ఒక్క నీటి చుక్కను నేలకు దించలేరు.  జలధరం వేరు. జలదం వేరు. అదనుకు కురిసే మనసున్న మేఘం నేటి అవసరం.  రాయలవారు  'ఆముక్తమాల్యద'లో ఊహించినట్లు మాగాణుల్లో సాగు సాగించే రైతు పాదాలకు గండపెండేరాలు తొడిగినట్లు నీటిపాములు చుట్టుకొనేటంత వర్షధారలు కావాలి నేల తల్లికి ఇప్పుడు. 


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 29-07-2012 ) 

Friday, December 10, 2021

ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం ఓటేసి చెబుతాను రచన-కర్లపాలెం హమమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 26 - 04 - 2009 )






ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 

ఓటేసి చెబుతాను
రచన-కర్లపాలెం హమమంతరావు 
( ఈనాడు - ప్రచురితం - 26 - 04 - 2009 ) 

గదిలో ఎవరూ లేరు... కవి, కాగితమూ కలమూ తప్ప.. '

' మన స్వాతంత్య్రం గొంగళి వయస్సు అరవై రెండేళ్లు.  శిశువుకు దక్కని స్తన్యంలాగా ప్రవహిస్తున్నాయి నీళ్లు.  బద్దలైన గుండెల్లాగా బీటలు వేశాయి పొలాలు. ఎన్నికలొస్తే చాలు ఎన్నెన్ని కొత్త కొత్త నినాదాలు ! ఉపన్యాసాలూ .. ఉపవాసాలూ .. కండువాలూ .. కేకలూ! అంతా గజీతగాళ్లే ! అయినా  అరగజం పురోగమనం లేదు' ... కవి రాసుకుపోతున్నాడు కసి  కసిగా . 
నవ్వు .. 
ఆ అలికిడికి కలం ఆగింది . తలెత్తి చూశాడు కవి. ఎదురుగా అద్దంలో కవి ప్రతిబింబం.

'ఎవరు నువ్వు? ' అడిగాడు  కవి 

'పాత సినిమాలలో  కథానాయకపాత్ర బాధపడుతుంటే బైటకొచ్చి నిలబడుతుందే, అలాంటి నీ అంతరాత్మను' అని ఇప్పటి సీఎంలాగా చప్పుడు లేని నవ్వు మళ్లీ నవ్వింది అంతరాత్మ. 

'నాతో నీకేంపని? నేను రమ్మని పిలవలేదే!  నా మానాన 'నన్ను రాసుకోనీయ్! ' గసిరాడు కవి విసుగ్గా. 

' నువ్వు పిలిస్తేనే రావటానికి నువ్వేమన్నా నా ఢిల్లీ హైకమాండువా? నువ్విలా వూరికే లోలోపల ఉడు క్కుంటుంటే ఆ ఉక్కపోతకు తట్టుకోలేక బైటికొచ్చాను. ఒక్కముక్క చెబుతాను. విను!'

' చెప్పింది వినకపోతే చెప్పులు విసిరే కాలం కదా! చెప్పు! ' 

' కవి అంటే ఎవరు? కట్టేసి వినిపించేవాడా?' 

' కాదు. కష్టజీవికి ముందూ వెనకా ఉండేవాడని అన్నాడు యుగకవి శ్రీశ్రీ' 

' కదా! కదిలేది కదిలించేది . . మారేది  మార్పించేది.. పెను నిద్దర వదిలించేది..  మునుముందుకు సాగించేది.. పరిపూర్ణపు  బ్రతుకిచ్చేది..  కావాలోయ్ నవకవనానికి | అని అన్నది  కూడా ఆయనేకదా మరి ? నవీన విశ్వవిద్యాలయాల్లో పురాణ పఠనం మాదిరి నీ ఈ రాతలేమిటి? అన్యాపదేశంగానో, అర్ధాంతరన్యాసంగానో నీ సొంత కోపాలేవిటో పెట్టుకుని రాజకీయనేతల్లాగా ఎవరెవరినో ఇందులో ఇరికించాలనుకోవడం భావ్యమా? బొమ్మలాంతరు పేరు విన్నాదా? ' 

' గ్యాస్ స్టౌ తెలుసు గానీ- ఈ బొమ్మలాంతరు తెలీదు.' 

'గ్యాస్ ని మరిచిపోరు గదా మీ కవులు ? పేకాటలో ముందు పంచిన ఓకుల్లో  పొడిముక్కలు. . తప్ప ఒక్క బొమ్మయినా  లేక పోతే ' బొమ్మ లాంతరు' అంటారు. ఆ ముక్కలు చెల్లవు. మళ్ళీ ఆడాలి. అట్లాగే ఎన్ని కల్లో గెలిచినవాళ్ళు అంతా పొడిముక్కల్లాంటి  వాళ్ళే అయితే, మళ్లీ బొమ్మల కోసం ఆడేందుకు అయిదేళ్ళకోసారి అవకాశం వస్తుంది గదా! మరిదేనికోసమీ అలజడి, ఆందోళన కళారవీ.. పవీ.. కవీ! ' 

కవి నిశబ్దంతో వక్త అంతరాత్మ ముదిరి ప్రవక్తగా మారింది . 

' నీ చిన్నతనం గుర్తుందా? మీ దొడ్డమ్మ   పొంగరాలు   పోస్తూ ఉంటే నువ్వు ఆమె దగ్గర కూర్చుని తినేందుకు  ధ్యానం చేస్తూ ఉండేవాడివి.  కొన్ని చెడిపోయేవి. కొన్ని రుచిగా ఉండేవి. ఎప్పు డోగాని అసలైన పొంగరం  కుదిరేది కాదు . సిసలైన నాయకుడు రావటం కూడా అసలైన పొంగరం కుదరడం లాంటిదే. మంచి పొంగరం రాలేదని నువ్వు పొయ్యి దగ్గర నుంచీ లేచిపోయావా? లేదు కదా? అట్లాగే మంచి నాయకుడు వచ్చిన దాకా ఓపికగా ఉండాలా .. వద్దా ? కెరటాలు ఆగినదాకా సముద్రంలో స్నానం చేయనంటే నష్టం ఎవరికి?  ఈత నేర్చుకోవటానికి దుస్సాహసమొకటే మార్గం . చెట్టును చూడు .. నిశ్చలంగా ఉన్నట్లే ఉంటుంది. వేళ్ళతో బండరాళ్ళను బద్దలు చేసుకుని పెరుగుతుంది. మనిషీ  చెట్టు మల్లేనే  ఉండాలి. బండలాగా పడి ఉండద్దని  నీలాంటివాడు చెప్పొద్దా?' 

కవికి మండింది . ఎదురు దాడికి దిగాడు.

'లోపల కూర్చుని నా లోపాలు చూపటంకాదు. బైటికి వెళ్ళి చూడు!  విలువలను ఎలా పాతరేస్తున్నారో తెలుస్తుంది.' 

' మంచిదేగా! వానపడితే బోలెడంత పంట! ' 

' ఎన్నికలు జనాలకు టైఫాయిడ్ జ్వరంలాగా పట్టు కొన్నాయి' 

' శుభం ! జ్వరం తగ్గితే కొత్త శక్తి వస్తుంది. ఇది సంధి కాలం అని సరిపెట్టుకోరాదా మేధావీ ! ' 

'అంటే పార్టీలు అధికారం  కోసం సంధి చేసుకొనే కాలమనా!

'అదే. ఆ వెటకారమే వద్దనేది! సమాజం దారులు మారే కూడలి దగ్గర నిలబడిందని నా అర్ధం ! దిక్కూ మొక్కూలేని వాడు కూడా దిగ్గజాల్లాంటి వాళ్ళకు దిక్కయి వాళ్లకు మొక్కే కాలం ఇది కవీ! అతి సామాన్యుడిలో కూడా కదలిక వచ్చే సమయం సుమా!'

'ఔను నిజం ! నీవన్నది నిజం .. నిజం ! అన్ని సభలకూ ఆ సామాన్యుడినే కదా కదిలిస్తున్నది ! 

కవి ఆలోచనలో పడ్డాడు.

అదనుచూసి అంతరాత్మ చెలరేగిపోయిందీ సారి మరింతగా.

కాలం అమూల్యమైన ఆస్తి. వినియోగానికి మనిషికి అమమతి పరిమితమే  . దిగాలుపడుతూ కూర్చుంటే తరవాతి తరాల తలరాత కూడా మారదు. ఓటు వేయటం రెండో ఎక్క మంత తేలికే కానీ, మంచివాడిని ఎంచుకొని వేయటం రెండో ప్రపంచయుద్ధమంత కష్టం. సెలవురోజైనా ' రజనీ' సినిమా విడుదలవుతున్నా, ఎన్ని పనులున్నా ఎన్నికల రోజున ఓ గంట క్యూలో నిలబడి ఓటు వేయి  ! ' అని రాయి! అదీ కవిగా నీధర్మం!  కవీ ఈ విసుర్లు విసరటం ఇక మానేయి' అంది అంతరాత్మ.

కవి కాగితం చించి  కొత్త కాగితం అందుకొన్నాడు.  పౌరుడిగా నా బాధ్యత నెరవేరుస్తానని ఒట్టేసి చెప్పను . ఓటేసి చెబుతాను' అన్నాడు. 

అంతరాత్మ సంతోషంగా  స్వస్థలం కవి గుండెల్లోకి వెళ్లి పోయింది. 

ప్రజాస్వామ్యం కథ కొత్త దిశకు మళ్లనున్నది. 

రచన-కర్లపాలెం హమమంతరావు 
( ఈనాడు - ప్రచురితం - 26 - 04 - 2009 ) 

ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం మరింత దిగువకు రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురణ తేదీ - 05 -01-2011 )


ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 

మరింత దిగువకు 


రచన -  కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురణ తేదీ - 05 -01-2011 ) 



రైళ్ళలోనే కాదు నీళ్ళలో కూడా మనకు అన్యాయమే జరిగింది. అడగందే అమ్మ యినా పెట్టదంటారు.అరిచి గీపెట్టినా గీకి కూడా పెట్టలేదు...మ


'ఆ నీటి ట్రైబ్యునల్ గురించేనా నీ ఘోష ? నిజమే మామా! కొత్త సంవత్సరం మనకు మొద ట్లోనే రెండు నామాలు పెట్టేసింది. ఒకటి కన్నడంవాళ్ళు పెట్టింది. ఇంకోటి మనకు మనం పెట్టుకున్నది.


మన గొడవల్లో మనం ఉంటే- పట్టుకుపోయేవాళ్ళు నీళ్లు పట్టుకుపోతున్నారు. కొట్టుకుపోయేవాళ్ళు ప్రాజె క్తులు కొట్టుకుపోతున్నారు. పదవులు, ప్రధాన శాఖల కోసం ఆరాటమే తప్పించి , సాగుకింద నీరు అదనులో అన్న దాతకు అందించాలన్న ధ్యాసే లేకుండాపోయిందీ పాలకులకు. అలమట్టి చివరికి మనకాలవల్లో వట్టిమట్టే మిగిల్చే టట్లుంది.


ట్రైబ్యునల్ని ఎందుకంటావులే. దేవుడే మనరాష్ట్రాన్ని దిగువన ఏర్పాటుచేసి అన్యాయం చేశాడు. ఎగువ రాష్ట్రాల మోచేతి నీళ్ళు తాగాలని రాసి పెట్టాడు. నారుపోసి నవాడు నీరుపోస్తాడన్న గ్యారంటీ లేకుండా చేశాడు.


మన మిగులు జలాలను  వదులు కోవాలని ఆ పరమాత్ముడేమన్నా పురమాయించాడా? పక్క రాష్ట్రాల వాళ్ళు ఎగువన ఎడా పెడా డ్యాములు కట్టిపారేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నది మనమేగదా! పోనీ ట్రైబ్యునల్ ముందైనా బల మైన వాదనలు వినిపించామా? ఇప్పుడిలా ఊరికే దగా దగా అంటా లబలబలాడితే ఉపయోగముంటుందా ? మన తాగునీటి అవసరాల కోసం తయారు చేసుకున్న నివేదికల పైనా వేళకు ట్రైబ్యునల్ ముందుంచామా? లాయర్ల ఎంపికనుంచీ, అంచనాలు తయారుదాకా అన్నింటిలోనూ లాలూచీలే ! ఆషామాషీ వాదనలతో మన నీళ్ళకు నీళ్లొదులుకున్నది  మనమే.


నిజమే మామా... బీరు మీదున్న శ్రద్ధ మనవాళ్ళకు నీరు మీద లేదు! అలమట్టి ఆ నిజాం కాలంనాటిదని కన్నడం వాళ్లు  దబాయిస్తున్నా మనకు చీమ కుట్టినట్లయి లేదు.  ఇక ఇంటికొచ్చినవాళ్ళకు కాళ్ళు కడుక్కోమని ఇన్ని నీళ్ళిద్దామన్నా ఒకటికి మూడుసార్లు ఆలోచించుకునే  రోజులొచ్చేస్తున్నాయి. 


నువ్వలా గుర్తు చేయొద్దు అల్లుడూ...

భయంగా ఉంది. ఈ లెక్కన నీళ్లు లేకుండా స్నానాలు చేస్తే కొత్త విధానమేమన్నా కనిపెట్టాలేమో ! దాహం తీరేందుకు నీటికి ప్రత్యామ్నాయం ఏదన్నా పరిశోధించాలేమో! 


ఇదీ ఒకందుకు మంచిదేకదా మావయ్యా ! నీటి కటక మూలాన్  కరెంటు కోతలు ఎక్కువైపోతే చీకటిపడక ముందే జనాలు కొంపలకు చేరుకుంటారు. క్లబ్బులు, పబ్బులు, సినిమాల గోల తగ్గుముఖం పడుతుంది. చీకట్లో కూడా పనులు చక్కబెట్టుకునే విద్య 'శబ్దభేది'అని ఒకటుంది . మన శాస్త్రాల్లో దాన్ని మళ్లీ పాఠ్యప్రణాళి కల్లో పెట్టి పిల్లకాయలచేత సాధన చేయించే సువర్ణావకాశం వచ్చింది . డబ్బును నీళ్ళలాగా వృథా చేయడం ఇక తగ్గుముఖం పడుతుంది . నీళ్లను డబ్బులాగా పొదుపుగా వాడుకోవాలని ప్రచారాలు మొదలవుతాయి గదా! .


'ఇంద్రజాలికులు వాటరాఫ్ ఇండియా అని ఓ వినోదం చేస్తారు. అబ్రకదబ్ర అనగానే చెంబులోనుంచి అదేపనిగా నీరు ధారగా పడిపోతుంటుంది. అలాంటి మాయా వినో దానికేమన్నా మనవాళ్ళు మళ్ళా ఓ ప్రత్యేక విద్యాలయం ప్రారంభిస్తారేమో చూడాలి.


'మరి... కట్టి కట్టని  ఈ భారీ ఆనకట్టలన్నీ ఏమవుతాయి? 


ఏం చేసుకొంటున్నాం? కులీకుతుబ్షాహి సమాధుల్లాగా చక్కగా తీర్చిదిద్దిపెడితే విదేశీ యాత్రికుల నుంచైనా నాలుగు డాలర్లు రాలతాయి  గదా! 


ఏమైనా సర్కారు మందబుద్ధికి మనకిక ఏటేటా వరదల బెడదన్నా తప్పుతుందేమో! అంతెత్తు ఆనకట్టలు కట్టినాక దిగువకు ఒక్కబొట్టు నీటి చుక్కయినా  దిగుతుందా? వేసవి వచ్చిందాకా చూసిచూసి కరవు మండలాలు ప్రకటిం చుకోవాల్సిన గత్తర ఇక  ఉండదు. ఏటికి ఏటా నీటి కటకట అయినప్పుడు ప్రత్యేకంగా ఇవీ కరవు ప్రాంతాలని ప్రకటించటాలెందుకటా ?


ఇంకో అర్ధశతాబ్దందాకా ఇదే పరిస్థితి అంటున్నారు పెద్దలు. కరెంటుకోసం మరాఠీలకు, తాగునీటికోసం  తమిళనాడుకు దయ తలిచినంత కూడా మనకు నీరు విదలకపోవడమే దురదృష్టం . ట్రై బ్యునల్ చూపించింది మొండిచేయి . 


ట్రైబ్యునల్ మరీ అంత నిర్దయగా లేదులే మామా ! తొందర్లోనే వర్కింగు టేబిలూ  తయారు చేయి స్తానని అంటున్నది గదా! 


'ఎందుకూ మన నిద్ర ఎక్కువ సర్కారు తల కింద పెట్టుకుని గురకపెట్టు కొనేటందుకా?


నువ్వు మరీ చెబుతావు. అన్నీ నష్టాలన్నా నేనూ నమ్మును.  ఆద నంగా దాదాపు రెండు వందల శతకోటి ఘనపుటడుగుల నీటిని అధికారికంగా రాబట్టినా, సర్కారు ఆ  సంగతి బైట పెట్టదేమిటి? కేంద్ర జలసంఘం అనుమతులు ఇన్ చిడెకలో వస్తాయంటే నమ్మనా? అరె! ఎందుకా నవ్వు మామా? 


నీ అమాయకత్వం చూస్తే నవ్వు రాక ఏడుపొ 

స్తుందా అల్లుడూ ? ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తే ప్రభుత్వానికి గొప్ప సన్మానం చేస్తామని ప్రధాన ప్రతిపక్షం బెదిరించిన సంగతి మరిచిపోయావా?  ప్రజాస్వామ్యంలో ఏ సర్కారు అయినా ప్రతిపక్షాలవారి సన్మానాన్ని సహిస్తుందా?  ఇంక అనుమతులు అంటావా! ఏ  యజ్ఞానికైనా కావాల్సింది అందరికీ సరిపడా నిధులు కాని- వట్టొట్టి అనుమతులెందుకు?


రచన -  కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురణ తేదీ - 05 -01-2011

ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం ఓటరుకు పొంగలి - రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 14 -01 - 2009 )


ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 


ఓటరుకు పొంగలి 

- రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 14 -01 - 2009 ) 



మన సంక్రాంతికి, ప్రజాస్వామ్యా నికీ బోలెడన్ని సామ్యాలు. 


పండ గల్లో సంక్రాంతి పెద్ద పండుగ. పర్వాలలో  ఎన్నికలది పెద్దపర్వం. 

రెండూ ఒక్కరోజులో వచ్చిపోయేవి కాదు. సంక్రాంతికి నెల పడతారు. ఎలక్షన్లకు ఏడాది ముందునుంచే హడావుడి పడతారు. 


పడిన కష్టానికి పంట చేతికి వచ్చేది... గాదెలు నిండేదీ ఈ పండగలప్పుడే కదా! తుఫానుకు  ముందే వాతా వరణంలో తేడా పొడగట్టినట్లు- ఈ రెండు పండ గలకు చాలాముందునుంచే సందడి మొదలవు తుంది. 


ఈసారి పర్వాలు రెండూ కూడబలుక్కు న్నట్లు వెంటవెంట రావటమే విశేషం.


పండుగ  రోజుల్లో పేడ కుప్పలకు  గొబ్బి గౌరవం దక్కి నట్లే- ఎన్నికల కాలంలో పేరిగాడికి అవమానం కన్నా రాజపూజ్యం అధికం. 


గొబ్బిచుట్టూ చేరి జనం భజనలు చేసినట్లు అన్ని పార్టీలు తెల్లకార్డువాడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేది ఒక్క ఎలక్షన్ సీజన్లోనే కదా! 


అత్తా రింట్లో కొత్తల్లుడిలాగా ఓటరు వెలి గిపోయేది ఈ నాలుగు రోజులే. వాడి మాడుకు తలంటే తతంగం దగ్గ ర్నుంచీ నెత్తిన భోగిపళ్లు పోసే  కార్యక్రమందాకా రాజకీయపార్టీలు పోటీలు అనీ ఇన్నీ కావు . 


ముగ్గులపో టీని మించి ఉంటుంది హేమాహే మీల హామీలపోటీ. మల్లయ్యను ఎలాగైనా తమ ముగ్గులోకే లాగాలని అన్ని వర్గాలు  రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దేస్తుంటాయి. 


ముగ్గేసుకుంటూ ఊళ్లూపూళ్లూ తిరిగొచ్చే అమ్మలనూ, అక్కలనూ, చెల్లెళ్లనూ చూసే నేతలు  పాదయాత్రలు చేసి అధిపతులు అయ్యారని   అనుమానం. రథంముగ్గు స్ఫూర్తితోనే రథయాత్రలు చేసుకుంటూ చంద్రబాబు అలా ముందుకుపోయి  సర్కారు రథానికి సారథిగా మారడమే ఇందుకుదాహరణ. 


ఆడపిల్లలు ముగ్గులేస్తున్నంత చులాగ్గా నేతలు కొందరు   పిల్లిమొగ్గలే సీజన్ ఇదే. 


రాబోయే ఎన్నికల్లో ఏ ముగ్గువైపు ఓటరు మొగ్గు చూపుతాడో! 


ధనుర్మాసం సందర్భమా అని పులి హోర, బొబ్బట్లు, పానకం, పరమాన్నం, చక్కెర పొంగలి దేవుడి ప్రసాదం   తేరగా దొరుకుతుంది.  ఈ ఎన్నికల నాలుగు రోజులూ రెండు రూపాయాలకు కిలో బియ్యం, పది రూపాయలకే కందిపప్పూ, ఉప్పూ, కారం, ఉల్లీ, నూనె... సర్కారువారి ప్రసాదంలాగా లక్కీగా దక్కుతాయి. 


సంక్రాంతంటే బొమ్మల కొలువు. ఎన్నికలంటే కొలువు తీరబోయ్ బొమ్మలు. 


రాశులు చూసుకుని సూర్యుడు అయనాలు మారేది ఈ ధనుర్మాసంలోనే. వాటం చూసుకుని లీడర్లు గోడలు దూకేదీ ఈ సీట్ల పంపకాల రోజుల్లోనే . 


పితృపార్టీలకు తర్పణాలొదిలేందుకు తిలోద కాలు పట్టుకు తిరిగే అసంతృప్తులకు ఎలక్షణాయనమే సలక్షణమైన సమయం. 


పండుగ ఎన్నికల ముందొచ్చినందువల్ల పోటీదారు

డికి సున్నం లాభం. శుభ్రంగా వెల్లవేసుకుని వున్న  గోడల మీద శుద్ధంగా ఏ రాత్రి చీకట్ల  చాటుగానా  'పవిత్రమైన ఓటు వేయండి' అంటూ చవగ్గా రాసుకుపోవచ్చు. ఇంటావిడ తెల్లారి ' వేయండి . చివరి అక్షరం మీదో  పిడక కొడితే మాత్రం అదో అశుభసూచకం.


రాబోయే ఎన్నికల్లో కాబోయే ఎమ్మెల్యేలు, ఎంపీలూ గడపగడపకీ హరిదాసులకు మల్లే చిడతలు ఆడించుకుంటూ తిరుగుతుంటారు . ఎవరు ఎవరెవరికి  దాసో సరిగా పోలిక పట్టకపోతే అక్షయపాత్రలో వేసిన భిక్షలాగా పవిత్రమైన ఓటు సైతం 'శ్రీమద్రమారమణగోవిందో హరీ!' 


'అయ్యగారికి దండం... అమ్మగారికీ దండం అంటూ సన్నాయి నొక్కులు నొక్కు కొంటూ గుమ్మాల  ముందుకు వచ్చేవాడు అసలు గంగిరెద్దులవాడో! అయిదేళ్ల కిందట అమూల్యమైన ఓటు  వాడ లాక్కెళ్లినవాడో..  తేడా తెలుసుకోవాలి.  లేకుంటే  నిలదీసేందుకు మరో ఐదేళ్ల ఎన్నికం పండక్కి గానీ అవకాశం రాదు. 


 'అంబ పలకు... జగదంబ పలుకు' అంటూ డుబుడుక్కు లాడించుకుంటూ వస్తాడు బుడబుక్కలవాడు. ఇదివరకు కూడా ఇల్లాగే  వసపిట్టలాగా వాగి మసిపూసి మారేడు చేసినవాడేమో సరి  చూసుకోవాలి. 


కాశీ బ్రాహ్మణుడి కావడిలోని దశావతారాలకన్నా ఘనంగా వేషాలేసేవాడు, కాటికాపరికన్నా చిత్ర విచి త్రంగా కనికట్టు చేసేవాడు కచ్చితంగా మన నియో జకవర్గం ప్రజాప్రతినిధి కాకుండా చూడాలి  కదా!


పండగంటే కోళ్ల పందేలు. బెట్లూ పైబెట్లూ అంటూ రాబట్టుకొనేదంతా  పైనున్న వాళ్లు . కాళ్లూ తలలూ పోగొట్టుకునేది కోళ్లు మాలం కిందుండే కార్యకర్తలు. ఓడినా గెలిచినా కోడి, కనుమనాడు కైమా కొట్టు నుంచి  పలావులోకి కూర కావటం ఖాయం. 

కాడి లాగే ఎద్దులాగా కార్యకర్త ఖర్మ కూడాఏ పండగకైనా  ఇదే. 


కాకపోతే పశువుల పండగ నాడు వాటి మొఖానికింత పసుపూ కుంకుమ ఉండ... మె డపట్టకుండా దండ! 'ఓడేది వీడూ... గెలిచేది వాడూ' అంటూ గాలిపటాలెగరేసి పిల్లకాయల  మాదిరి సందడి చేసేది మాత్రం పత్రికలు, ఛానెళ్లు. 


మీడియా హడావుడే లేకుంటే  ఊళ్లో పెళ్లయినా వెలతెలాపోవాల్సిందే! ఛానెళ్లునోళ్లు మూసేసుకుంటే  పండుగైనా  - పోలింగుఅయా కళ తప్పి పోవాల్సిందే.


కొత్త సంవత్సరం ఒత్తిడిలో 'హ్యాపీ న్యూఇయర్' చెప్పటం మరిచిపోయుంటే  సంక్రాంతికి ఆ వాయనం ఇచ్చిపుచ్చుకోవటం ఆనవాయితీ. 


ఈసారి పొంగళ్ల పండుగ  వెంబడి 'పోలింగు పండుగా అనుసరిస్తోంది . కాబట్టి  రెండు పండుగలకీ కలిపి మన తెలుగువాడికి ఉమ్మడి శుభాకాంక్షలు.  

అమెరికా ఆర్థిక మాంద్యం నుంచి గాడిలో పడాలి. తెలుగు సినిమాలు బాగుపడాలి. యాంకర్ల తెలుగు తేటపడాలి. టీవీల  రెండు సీరియల్సయినా ఈ సీజనుకు మాదిగితే అదే పెద్ద పండుగ.  రైల్ల వేళకి నడవాలి . బాంబు బెదిరింపలు.  బాంబుదాడులు ఉండకూడదు . యాసిడ్ దాడులసలే వద్దు . ధరలు తగ్గాలి. 


మళ్లీ ఎన్నికలు అయిదేళ్ల దాకా రాకూడదు... విష్ మీ హ్యాపీ ఎన్నికల సంక్రాంతి! 


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 14 -01 - 2009 ) 

ఈనాడు- సంపాదకీయం నిద్ర ప్రాథమిక హక్కు రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 25 -03 -2012 )


ఈనాడు-  సంపాదకీయం 

నిద్ర ప్రాథమిక హక్కు

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 25 -03 -2012 ) 



'అశ్వినీ దేవతలు అత్యంత అప్రమత్తంగా నిన్ను గమనిస్తున్నా నా కంటిమీద వాలిన ఓ నిద్రాదేవతా! నీకు నమస్కారం' అంటుంది అధర్వణ వేదం. నిద్రావస్థలు ద్రష్టల దృష్టిని వేదకాలంనాడే ఆకర్షిం చాయనడానికి - స్వప్నయోని, స్వప్న జన్మభూమి - సిద్ధాంతాలే దృష్టాంతాలు. నిద్రస్థితిలో ప్రత్యగాత్మ బుద్ధి అంతఃకరణలో చైతన్యవంతమై ప్రకాశిస్తుంటుందని భారతీయ తత్వశాస్త్ర సిద్ధాంతం. 'నిద్రలో మేలుకొని ఉండేదే బ్రహ్మం' అని కఠోపనిషత్ వాక్యం! జగత్ కారకుడైన విష్ణువు శరత్ కాలారంభంలో గాఢనిద్రనుంచి మేల్కొన్న తరువాత పునఃసృష్టి ప్రారంభించాడంటున్నాయి పురా ణాలు. జగజ్జేత అలెగ్జాండర్ పర్షియా దేశం మీద ప్రచండ యుద్ధం ప్రారంభించే ముందు సుదీర్ఘనిద్రలోకి వెళ్ళినట్లు గ్రీసు చరిత్ర చెబు తోంది. 'నిద్రాదేవత నిన్ను పూనెగదరా నిర్భాగ్య దామోదరా!' అని మనకో నానుడి కద్దు . దామోదరుడిది యోగనిద్ర. మన్ను తిన్నందుకు శిక్షగా బాలకృష్ణుడి నడుమును తల్లి యశోదమ్మ తాడుతో బంధించి దామోదరుడిగా మార్చిన కథ భాగవతంలో ఉంది. నిద్ర కూడా మనకో దేవతా స్వరూపమే. జ్యేదేవి ఆ దేవత పేరు. జగన్మాతకు జ్యేష్ఠ భగిని. ఫిన్నిష్ జాతివారి నిద్రాదేవత 'ఉని' . 'శృంగార చతుష్షష్టి'లో శయన సందేశనం అత్యంత సుఖదాయకమని 'నాగరక వృత్తం' అభివ్యక్తీకరిస్తోంది. విశ్వవిఖ్యాత శిల్పకారుల్ని సైతం 'యోగనిద్ర' ఆపరిమితంగా ఆకర్షించింది. జ్ఞానీ బుద్ధ, ప్రజ్ఞాపారమిత, ప్రతిమా శిల్పరీతులే అందుకు ఉదాహరణలు. లీచ్ ఫీల్డ్ కెథడ్రాల్ లో  కనువిందుచేసే నిద్రాదంపతుల ఫలకాలు నిద్రా దేవతకు శిల్పకళ అర్పించే ప్రజ్ఞా నివాళులు.


వేకువజామునే మేలుకొలిపే వైతాళికులు, సుఖశయ్యను గురించి విచారించే సౌఖ శాయనికులు- ప్రాచీనకాల రాచరిక మర్యాదల్లో అని వార్యంగా కనిపించే సపర్యక బృందాలు. దేశాక్షి, భూపాల, మలయ మారుతాది ఉదయరాగాల్లో ఇష్ట దేవతలను మేలుకొలిపే వైతాళిక సాహిత్యం భారతీయ భాషల్లో బోలెడంత . యుగాల కిందట కౌసల్యా సుప్రజా రాముణ్ని పూర్వసంధ్యలో మేల్కొలిపే నిమిత్తం  విశ్వామిత్రుని నోట వాల్మీకి పలికించిన 'ఉత్తిష్ఠ' అనే మాట నేటికీ కోట్లాది భారతీ యులను నిద్రమత్తునుంచి తట్టిలేపుతూనే ఉంది . నిద్ర ఒక సృష్టి వింత. ఆకురాలే కాలం మొదలు కాగానే దీర్ఘనిద్రకు జారుకునే జీవజాతుల  జాబితా సుదీర్ఘమైనది . గాఢనిద్రలో ఉన్న గుడ్లగూబను నీటముంచినా చావదంటారు. చలికాలపు పెనునిద్రలోని చుంచుల్ని చావమోదినా చలించకపోవడం గమనించదగ్గ విశేషం . ఈజిప్టు నత్తల నిద్ర ఐదారేళ్లు! జీవ ప్రతికూల వాతావరణంనుంచి సంతానాన్ని సంరక్షించుకొనే ప్రకృతి మాత తంత్రం- నిద్ర.  పూర్వరాత్రి నిద్ర నొక సౌందర్య సంవర్ధకంగా పాశ్చాత్యులు భావిస్తారు. పురాణ కవులకు ఇష్టదైవాలు ప్రత్యక్షమై కావ్యకర్తృత్వాన్ని పురమాయించింది నిద్రావస్థలలోనే . జోల, లాలి వంటి నిద్ర సాహిత్యం ప్రతి భాషలోనూ ప్రత్యేకత సంతరించుకోవడం గమనించాలి. ఆరునెలల పాటు ఏకబిగిన నిద్రపోయే జాతిని  స్వయంగా చూసినట్లు గ్రీకు చరిత్రకారుడు హెరడోటస్ చెప్పుకొన్నాడు. సెక్టస్ పాపే ను  ఎదుర్కొనే వేళ సముద్ర మధ్యంలోనే గాఢనిద్రలోకి వెళ్ళిపోయాడు ఆగస్టస్ సీజర్. వాటర్లూ యుద్ధానంతరం రోజులో మూడొంతులు పడకలో ఉంటేగాని పోయిన శక్తి పుంజుకోలేకపోయాడు నెపోలి యన్. 'లోకంలోని సమస్త సింహాసనాలను బహుమానంగా ధార పోసినా శయ్యాసౌఖ్యాన్ని వదులుకోలేనని స్వయంగా ఆ జగజ్జెతే ఒప్పుకొన్నప్పుడు - నిద్రాదేవి శక్తికి మరో తార్కాణమవసరమా ?! 


' సుప్తి బోలంగ/ సుఖమెందు గలదు!' అంటాడు విక్రమార్క చరిత్రంలో జక్కన కవి. 'నిద్ర సుఖమెరుగదు' అన్న నానుడి మనకు ఉండనే ఉంది. 'నిద్ర దురదృష్ట హేతువుల్లో ఒకటి' అని పెద్దలన్నది పొద్దస్తమానం పడకమీదే పొద్దుపుచ్చే  నిద్రబోతులనుద్దేశించి. నిజానికి మొద్దులాగా నిద్రిస్తేనే ఎద్దులాగా పనిచేసేది. నిద్ర ప్రాణావసరం. 'నిద్రాలేమి ఆరోగ్యానికి హాని' అన్నది  ఆనాటి ఆర్య క్షేమేశ్వరుడి నుంచి నేటి ఆరోగ్యశాస్త్రవేత్తల దాకా అందరి అభిప్రాయం. నిద్ర మనో మాలిన్యాన్ని కడిగిపారేసే క్షారం. అవయవాలను ఉత్తేజపరిచే ఔషధం. 'శారీరక, మానసిక లోపాలను సర్దుబాటు చేసి ధాతువులను సుస్థితిలో నిలపడంలో నిద్రకు ప్రత్యామ్నాయం లేదు' అంటాడు విద్వ ద్వరేణ్యుడు. శయ్య మీదకొరిగి సున్నితంగా సుఖనిద్ర పొందే అదృ ష్టవంతులను తలచుకొని కుమిలిపోతాడో సంస్కృతకవి. లంక కంపి స్తున్నంత కోలాహలం సైతం  కుంభకర్ణుడి నిద్రను భంగపర్చలేకపోయింది  నిద్రాభంగం కాల. ప్రాణేశ్వరుడి ఎడబాటు దుఃఖం  నుంచి  నిద్రాదేవతను ఆశ్రయించి ఊర్మిళాదేవి ఊరడింపు పొందగలిగింది. 'అలుక యెత్తిన వానికి, నర్థచింతకునకు, నాతురునకు గాను గోచరాత్మకునకు వచ్చునే ఎన్నబడి జనులెరింగిన యిన్నాలుగు తెరగులందు నెయ్యదియైన నన్ను మొగుడ నీదట, నాకన్నియు గలుగంగ నిద్రయేటికి వచ్చున్? - అంటూ తిక్కన మహాభారతం సౌప్తిక వధోద్యోగ పూర్వరంగంలో నాటి అశ్వత్థామ పడిన  వ్యధే నిద్రాదేవి సాంగత్యానికి దూరమైన వారందరిదీ. ఇరుగుపొరుగుల సొద , వాహనాల రొద, శ్రుతిమించిన ఉత్సవాల ఉత్సాహం, గూబలదిరే నేతల ప్రసంగాలు... కర్ణభేరికి ముప్పుగా దాపురించే ఇత్యాదుల  జాబితా ముందు ఆంజనేయుని వాలం చాలా చిన్నది. నిద్ర ప్రకృతిసిద్ధంగా జీవికి దక్కే ప్రాథమిక హక్కు.  దువ్వూ రివారు అన్నట్లు 'కాలమున దక్క మరియేమి కార్యమందు! మరణ మునకును నిద్రకును అంతరము కలదు! ' మానసిక సామర్థ్యాలు అచేతనంగా ఉండే ఈ అర్ధమరణ స్థితిలో ఉన్నవారి మీద జరిగే దాడులు అమానుషం. గత ఏడాది ఢిల్లీ రామ్ లీలా  మైదానంలో రామ్ దేవ్ బాబా దీక్షకు మద్దతుగా చేరినవారిమీద పోలీసు యంత్రాంగం అర్ధ రాత్రి నిద్రవేళ విరుచుకుపడ్డ తీరును రాజ్యాంగ విరుద్ధ చర్యగా సర్వో న్నత ధర్మాసనం దుయ్యబట్టడం ముదావహం. నిద్రాభంగం కలిగించే అనాగరిక చేష్టమీద న్యాయపరమైన చర్యలు తీసుకొనేటందుకు దోహదం చేసే తీర్పు ఇవ్వడం అభినందనీయం.


- రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 25 -03 -2012 ) 


సాహిత్య వ్యాసం నివేదనం - కాటూరి వేంకటేశ్వరరావు సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

 


సాహిత్య వ్యాసం 

నివేదనం


- కాటూరి వేంకటేశ్వరరావు

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు




భావము కుదిరి, ఉపక్రమోపసంహారాలతో, రమణీయార్ధములతో, సంవాద చతురతతో నడచిన ఈ కావ్యానికి ప్రబంధ మనే నూతన' సంకేతం ఏర్పడింది. వలసినంత భావనాసమృద్ధితో, అలంకారశిల్పముతో, రసభావనిరంతరంగా, గద్యపద్యాత్మకంగా రచితమైన ప్రబంధ మనే ఈ కావ్య పరిషియ ఆంధ్ర సాహితికి సొంతమని చెప్పదగును. ఆవేలమైన భావనకు రాయల ఆముక్తమాల్యదా, అద్భుతకథాకల్పనకు సూరన కళాపూర్ణోదయం నిదానములు. కావ్యానికి కావలసిన సకలలక్షణాలు సంపాదించుకొను టేకాక, శ్రవ్యరూపాన ఉన్న ప్రథమాంధ్రదృశ్య కావ్యమని పేరుగన్నది ప్రభావతీ ప్రద్యుమ్నం. కవిరాజ శిఖామణి నన్నెచోడుడు, ఎఱన, శ్రీనాథుడు, పినవీరభద్రుడు మున్నగువా రీ స్వతంత్ర కావ్యావిర్భూతికి బీజావాపం చేసినా, దీనికి ప్రత్యేక నామరూపాలు కల్పించిన మాన్యుడు అల్లసాని పెద్దన.


భారతాదులయందువలె కథాకథనము, ధర్మోపదేశము ఈ కావ్యములందు ప్రధానము కాదు. విభావాను భావాదులచే పరిపుష్టమగు రసనిష్పత్తియే ఇందు ప్రాధాన్యము వహించును. ఈ కాలపుగ వీశ్వరులు తమయెదుట కన్పట్టు మహా రాజ్యవిభవాన్నీ, అప్పటి రాగభోగాలను, నడతనాగరీశాలను మనసులందు నిల్పికొని వానికి రూపాంతరాలు కల్పించి, రసమయమైన గంధర్వలోకాన్ని సృష్టించారు. భువనవిజయం సుధర్మగాను, తుంగభద్ర మం దాకీని గాను, విద్యానగరళ్ళం గారవతులే కథానాయికలుగాను, ఆనాటి సాహసరనికులే నాయకులు గాను వీరి కావ్యాలలో అందందు రూపాంతరం పొందిరేమో ! ఆనాటి కవులకు, ప్రజలకు హస్తప్రాప్యములైన రసభోగాలనుండి వంచితులమైన మనకు నే డా కావ్యసృష్టి వింతగా, విపరీతంగా కన్పించినా సర్వర్తుధర్మసంశోభిత మై, అద్భుతర సస్యందియైన ఆరామంవంటిది ఆనాటి సాహిత్యం.


ఈ ప్రబంధకవులలో సహజశ్లేషలకు శయ్యాసౌభాగ్యానికి రామరాజ భూషణుడు, భక్తిపారమ్యానికి ధూర్జటి, ముద్దులొలుకు పలుకుబళ్ళకు తిమ్మన, అర్థభరితమైన పదబంధానికి రామకృష్ణుడూ — ఇలా ఒకరొకరే పేరుగాంచిరి. ఆంధ్రమున మొదటి ద్వ్యర్థి కావ్యమూ, యక్ష గానమూ ఈ కాలంలో నే పుట్టినవి. ఆత్మపరము, భక్తిభరితము అయిన శతకరచనం వెనుకటికాలంలోనే ఆరంభ మైనా ధూర్జటి కాళహస్తీశ్వరశతకం అట్టిరచనలకు మకుటాయమానమయింది. మెట్ట వేదాంతులను, దాంభికులను, మూఢమానవులను ఆధిక్షేపించి, పరిహసిస్తూ వేమయోగి అలవోకగా చెప్పిన ఆటవెలదులకు లోకుల నాలుకలే ఆకులైనవి.


విజయనగర సామ్రాజ్యం తల్లికోట యుద్ధంతో స్తమించిన పిమ్మట చోళ పాండ్య దేశాలలో రాజ్య స్థాపనం చేసికొన్న నాయక రాజులు ఆంధ్ర సాహిత్యానికి వూరు, మధుర, పుదుక్కోటలందు విస్తరిల్లిన ఈనాటి వాఙ్మయ మంతా కేవలళ్ళంగారపరమైనది. స్వయము కవియై, సర్వవిధాల కృష్ణరాయలకు దీటైన రఘునాథరాయల అనంతరమందు నాయక రాజులలోను,. వారిపిమ్మట రాజ్యమేలి మహారాష్ట్ర ప్రభువులలోను భోగపరాయణత


 విసరిలినది. ఆంధ్రజాతి జవసత్యాలు ఉడిగి, పౌరుష ప్రతాపము ల సంగతములు కాగా, మిగిలిన కామపరతనుండి ప్రభవించిన ఆనాటి కావ్యాలు సంయమం కోలుపోయి పరకీయాశృంగారానికి పట్టముగట్ట నారంభించినవి. ఈ 150 ఏండ్లలో పొడమిన సాహిత్యంలో విజయవిలాసంవంటి ఒకటి రెండు కావ్యాలు పూర్వకావ్య గౌరవాన్ని కొంత అందుకొన్నవి. యక్షగానము జై కటి ఈ కాలమందే వరి లినది. నాయక రాజులలో పెక్కురు, మహారాష్ట్రప్రతాపసింహాదులు, నాయక రాజుల సామంతులు, దండ నాధులు గూడ కావ్యములు రచించుటొకటి, పెక్కురు విదుషీమణులు కవయిత్రు లగుట యొకటియు ఈశాలమందలి విశేషాలు, గేయకవితకు ద్వితీయాచార్యు డగు క్షేత్రయ్యయు, దాక్షిణాత్యకృంగార కావ్యభూషణమైన రాధికాసాంత్వనం రచించిన ముద్దుపళనియు, ఆనాటివారే.


కోకొల్లలుగా బయలు దేరిన యక్షగానాలు, శృంగారపదాలు అభిన యిస్తూ రాజసభలలో నాట్యం చేసే వేశ్యల పదమంజీరధ్వనులే అప్పటి కావ్యా లలో ధ్వనించుచుండును. రాజాస్థానాలలో తెరపిలేకుండా సాగే కామ దేవతారాధనమే నాగరులకు అనుకార్యమై, త్యాగ భోగ రాయుళ్ళయిన నాయక రాజులే శృంగార కావ్య నాయకు లైనారా అనిపిస్తుంది. సకలేంద్రియసంతర్పణం చేసే కామపురుషార్థమహాఫలంకోసం రనికనరనారీలోకం నూటయేబదియేండు 3 ఇలా సాహిత్య సముద్రమథనం చేయగా చేయగా తుదకు రామనామామృత భాండం చేబూని వాగ్గేయకార సార్వభౌముడైన త్యాగరాజస్వామి అవతరిం చెను.


3. క్రీ. శ. 1850—1955


19వ శతాబ్ది పూర్వార్ధంలో రెండుమూడర్థాల కావ్యాలు, శ్లేష చిత్ర బంధ కవిత్వాలూ బయలు దేరినవి. హాస్యనీతిశతకాలవంటివితప్ప స్వతంత్ర కావ్యములు పొడమలేదు. దేశం క్రమంగా ఆంగ్లేయాక్రాంతమై, క్రిస్టియనుమత ప్రచారము, ఆంగ్లవిద్యాభ్యాసం ప్రబలినవి. వీనికి దోడు భౌతికదర్శనముల ప్రభావం వల్ల విద్యావంతులు ప్రత్యక్ష ప్రమాణబుద్ధులు కావొడగిరి. భారతీయధర్మము, సంప్రదాయాలు, ఆచారాలు పునర్విచారణకు పాత్రములై, స్వస్థాన వేష భాషాభి మానం సడలుటతో, సంఘసంస్కారోద్యమాలు సాగినవి. సముష్టి చిర కాలంగా తనచుట్టు నిర్మించుకొన్న ప్రాకారాలు శిథిలము లగుటయు, వానినుండి విడివడజూచే వ్యష్టి తనకే మం తాను విచారించుకోజొచ్చింది. భారతీయ ధర్మాన్ని నవీన కాలానుగుణంగా సంస్కరించుట కి ట్లొకవంక యత్నం జరుగు చుండగా, మరొకనంక ఆంగ్లప్రభుత్వ బంధనంనుండి విడివడాల చేకోర్కె బలీయ మయ్యెను. అంతట భారతీయపూర్వేతిహాసాన్ని, ధర్మ ప్రపంచాన్ని మథించి, స్వస్వరూపసాక్షాత్కారం పొందవలెననే కాండా, అభిజనాభిమానము ప్రబలమయ్యెను. ఆంగ్లభాషాకళాశాలల్లో ఆంగ్లేయసాహిత్యాన్ని అవ గాహిస్తున్న పడుచువాండ్రు ఈ రెండు ఉద్యమాల చే ప్రేరితులై అందరమైన


నివేదనం


ix


అద్భుతర సదర్శనానికి, మద్రమై, బంధనాగారపదృశమై కనిపించే బాహ్య లోకానికి పొత్తుకుదరక, తమవేదనలను చెప్పికొనుటకై మాటలను, మార్గములను


ఇంతలో తిరుపతి వేంకటకవులు ఈ కాలపువారి కష్టసుఖాలను చెప్పికొనుట కనువైన సులభసుందర శైలిచే కావ్యరచనం చేయనారంభించిరి. గురుజాడ అప్పారావు మానవధర్మాన్ని, దేశభక్తిని ముత్యాలసరమనే ఛందముచే గానము ఇట్లు దేశకాలానుగుణమైన కావ్య శైలియు, ఛందము దొరకి సంతట 20వ శతాబ్ది ప్రథమపాదమున తరుణవయస్కులు, గొంతులు విడివడినప్లై, ఆత్మనాయకములగు మధురకవితలను చెప్ప మొదలిడిరి.


పాశ్చాత్య సాహిత్య ప్రపంచమును, రవీంద్రనాథగీతావళిని ఆరగ్రోలిన సంస్కారపుష్టిచే ఆరంభమైన ఈ మధురకవితలందు అలనాటి రాయల సాహిత్యంలో లభించే అద్భుతమైనరసదర్శనం మల్లా లభించింది. అయితే ఆనాటి దర్శనం భోగభాగ్యములచే తులదూగే జీవనపొష్కల్యమునుండి లభింపగా, ఈనాటిది ప్రతికూల పవనహతినుండి ఆత్మజ్యోతిని కాపాడుకొనుటకై వాయు మండలో పరిపథాన కెగిరి, ఆచట నిర్మించుకొన్న ఏకాంతజీవనంనుంచి పుట్టింది. ఆచట కవి నిజానుభవాలకు రూపాంతరం కల్పింపగా, ఇచట కవి మనోరథాలకు రూపకల్పన జరిగింది. కాగా, అందు సంయోగ సుఖము, ఇచట తరచు విరహ పరిదేవనమాధురియు లభించినవి. మేఘదూతలోని యక్షులవంటి ఈ కవుల కా అలకానగరసుందరి దవుదువ్వులనే ఉండిపోయింది. పార్థివగంధస్పర్శ లేని ఆసుందరి ఆరాధ్య దేవతయై, పూజాపీఠ మలంకరించింది. ఆదేవిని ప్రసన్న నొనర్చుకొనుటకై వీరు పాడిన మధురకవితలలో అద్భుతమైన భావస్ఫూర్తీ, రమణీయారాలు కోకొల్లలుగా మనకు లభిస్తవి.


ఆక్మనాయకములైన మధురకవిత లోకవంక ఇట్లు చెల్లుచుండ రెండవ వంక పూర్వేతిహాసములను రసమయంగా ప్రత్యక్షం చేసే వీరకథాకావ్యాలు, పర దాస్యబంధనాన్ని సహించని దేశభక్తి గేయాలు వెలువడజొచ్చెను. స్వస్థాన స్వధర్మాభిమానములనుండి ఆవిర్భవించిన ఈజాతికావ్యములు గూడ గుణ గౌరవ ముచే పొగడ్త కెక్కినవి.


ఇవి యిటులుండ ఇంకొక తెగ కవీశ్వరులు పామరజనజీవనమాధుర్యాన్ని పదకవితలందు అందీయసాగిరి. లోకానికి అన్న పత్రం పెట్టే కర్షకభాగ్యశాలిని, సంఘానికి సుఖభోగ పరికరాలను సమకూర్చియిచ్చే మంటిపుట్టువుల వితరణాన్ని కీ ర్తించుతూ వీరు ఈశ్వరాంశను మానవత్వమందు ప్రతిష్ఠ గావింపజొచ్చిరి.


ఈ వివిధ కావ్యసృష్టి యిలా జరుగుచుండగానే గాంధీజీ భారతరాజకీయ రంగాన ప్రధానభూమిక వహించడం, స్వాతంత్య్రచ్ఛ జనసామాన్యానికి గూడా ప్రాకడం, భాషారాష్ట్రములకొరకు ఆందోళన చెందడం, స్వతంత్రభారతంలో సంఘస్వరూప మెలాఉండాలి అనే వాదోపవాదాలు చెలరేగడం, ద్వీపాంత 


రాలనుండి ఆ సేకనూతనోద్యమమారుతాలు దేశంలో వీచడం వీని యన్నిటి భావుకులు చి తవీధులందు క్రొ ఆలోచనలు పొడమినవి. దీనితో కాల్పనిక మైద రసభావసృష్టి వెనుకబడి, దేశకాలాల యథాస్వరూపాన్ని చిత్రిస్తూ, నవసంఘ స్వరూపానికి రూపరేఖలు దిదేరచనలు బయలుదేరినవి. పరపీడనాన్ని, పరోప జీవనాన్ని శపించడం, కష్టజీవులందు అభిమానాన్ని ఉద్దీపింపజేసి ఆశాజ్యోతి వెలిగించడం __ఈ కాలపు కావ్యములకు సామాన్యలక్షణా లని చెప్పవచ్చు.


భావస్రవంతి పలుపోకల పోతున్న ఈ నవీనకాలంలో తొల్లి ఎన్నతు లేనంత వైవిధ్యము, గుణబాహుళ్యం కావ్యసృష్టియందు కనిపిస్తున్నవి. భావాను గుణములైన నూతవచ్ఛందాలను కవులు వాడుతున్నారు. కొందరు వృత్తగంధి వచనరచన చేస్తున్నారు. సంస్కృతపురాణేతిహాసాలకు మళ్ళా కొందరు కేవలానువాదాలు చేస్తుంటే, కొందరు వానిని స్వోపజ్ఞంగా క్రొత్త వెలయిను న్నారు. జానపద గేయాలు, వీరకథాగేయాలు ఎక్కువగా ప్రజాదరం పొందు తున్నవి. దేశకాలాలను వ్యాఖ్యానించుటకు కొందరు శతకపద్ధతి నవలంబిస్తు న్నారు.


ఏకాలమందైనా క్రొత్తదారి త్రొక్కేవా రొకరిద్దరే ఉంటారు. తక్తిన వారొక అడుగు అటూ యిటూగా ఆధారినే పోతూ, కొంత విలక్షణతను గూడ చూపెట్టుతారు. కొందరిరచనలు ఉపజ్ఞామహితములు కాకున్నా, తత్కాల పరిస్థితులకు, ఉద్యమాలకు ప్రతిబింబాలుగా ఉంటవి. ఇలా వేయేండ్లనుంచి ఎప్పటికప్పుడు నవనవంగా వర్ధిల్లుతున్న ఆంధ్రసాహిత్యమందలి కావ్యభేదాలను, రీతులను ఇందు ప్రదర్శించుటకు యత్నించితిని. ఆంధ్రసాహిత్యంలో కేవలం మేలేర్చి కూర్చేయత్నం కాకపోవడంవల్ల, ఆంధ్రరసజ్ఞలోకానికి పరమాదర పాత్రములైన కొన్నికొన్ని రచనల నిందు చేర్చలేకపోతిని. రుచిభేదంవల్ల, పరిశీలనాలోపంవల్ల, స్థలసంకోచంవల్లకూడా ఈ కూర్పు కొంత అసమగ్రతకు పాల్పడిఉంటుంది.


నా యీలోపములను సహృదయులు మన్నింపవేడెదను. ఇతర భాషా ప్రాంతములందలి సోదరభారతీయులకు ఆంధ్ర సాహిత్య సంపద నంతటిని, శృంగ గ్రాహికగా కాకున్నా, స్థూలారుంధతీన్యాయంగానైనా ఈ గ్రథవం చూపెట్ట గలదేని కృతార్థుడ నగుదును.


- కాటూరి వేంకటేశ్వరరావు

( తెలుగు కావ్యమాల - నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు

వ్యాసం పాడ 'నా' తెలుగుపాట - యూ . ఎ. నరసింహమూర్తి ( నేటి తెలుగు - నుంచి ) సేకరణ : - కర్లపాలెం హనుమంతరావు

 


వ్యాసం

పాడ 'నాతెలుగుపాట

యూ . నరసింహమూర్తి

నేటి తెలుగు - నుంచి ) 

సేకరణ : - కర్లపాలెం హనుమంతరావు



వ్యాసం 

పాడ 'నా' తెలుగుపాట

- యూ . ఎ. నరసింహమూర్తి 

( నేటి తెలుగు - నుంచి ) 

సేకరణ : - కర్లపాలెం హనుమంతరావు 


' గంగ తల నుండి కావేరి కాళ్లదాక వెలిగె   దిఓ్మోహనమ్ముగా తెలుగు కీర్తి' అంటూ కించి గానం చేశాడు రాయప్రోలు. సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తరించే నాటికి కీర్తి ఖండఖండాంతరాలకు వ్యాప్తమౌతున్నట్లు కీర్తించే అవకాశం కళాకారులకు ఉచింది. కళాకారులతో గొప్ప చిక్కుంది. వాళ్లకు నచ్చితే ఆకాశానికెత్తేస్తారు. నచ్చకపోతే పాతాళానికి అణచేస్తారు. విజయవాడలో రేడియో స్టేషను ప్రారంభిస్తే గాని పాడనని భీష్మించుకుని కూర్చున్నాడు గురువు. ఒకానొక ప్రభుత్వం తెలుగుదేశంలో అంతరించేదాకా తెలుగునాట గొంతువిప్పనని ప్రతిజ్ఞ చేశాడొక శిష్యుడు.  ఎంతో తపస్సు చేస్తేగాని తెలుగుదేశంలో పుట్టడం, తెలుగుభాష మాట్లాడటం అనే వరం సిద్ధించదని పూర్వం అప్పయ్యయ్య దీక్షితులన్నమాట. ఆ తెలుగు జిల్లాలలో  పుట్టడమే మహా పాపఖర్మం అనేక విధాల' అన్నాడు గుడిపాటి వేంకటచలం. ' ఆ తెలుగుగాలి మురికిని కొంతన్నా కడిగేస్తుంది అరుణాచలం' అని కూడా అన్నాడాయన. అయినా ఆయన తెలుగుభాషను మాత్రం లలేదు. దాని సొగసుల్ని కాదనలేదు.


' మనవాళ్లుట్టి వెధవవాయ్ లోయ్' అన్న గిరీశం మాటలో గురజాడ గొంతుకూడా కలిసే ఉంది. అది మన పాత సంస్కారాన్ని గురించి విసిరిన విసురులా కనిపిస్తుంది. పూర్వుల తెలుగుతనాన్ని కాపాడుకోలేక పోయామన్న చింత చాలా మందికుంది. తెలుగువారిలో తెలుగుతనం చచ్చిపోయి ఎన్నో ఏండ్లయిపోయింది, అది ఎప్పుడో ఉండేది కూడా.  మన తెలుగుపిల్లలెరుగరు. ' కలిమికి ఆంగ్లము - తెలివికి సంస్కృతము బా   జా జాతీయతకు హిందీ, 'నీ తెలుగెవ్వరి పాలు చేసి తిరిగెదవాంధ్రా!' అని నేను దశాబ్దాల కిందటే ప్రశ్నించాను' అని వేలూరి శివరామశాస్త్రి వాపోయారు.  ఆ యన వచనంలో చెప్తే విశ్వనాథవారు  ' అచ్చ సంస్కృతి తెలియని యాంధ్రజాతి - యాధునిక మిది పలుత్రోవలై వించు' అంటూ పద్యంలో పరామర్శించారు. తెలుగువారి ప్రాచీన వైభవాన్ని ఘనంగా కీర్తించిన  విశ్వనాథ  ' వాల్మీకి రెండు విధములుగ నదృష్టవంతుడు. ఒకటి ఆంధ్రదేశమున పుట్టకపోవుట ; రెండు - అప్పటికింకను ఆంగ్లేయులు మనదేశమున నడుగుపెట్టకపోవుట' అంటూ తెలుగుదేశంలో పుట్టడమే నేరమన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. ' ఏ ప్రాచీన నిక్షేపమైనా చేజారిపోయిన తరువాత బిక్కమొగం పెట్టేవాడు తెలుగువాడు' అంటూ ఇటీవలి మధురాంతకం రాజారాం కూడా అనడం ఆలోచించదగ్గది.


అన్నింటిలోను మనం గొప్పవాళ్లమేనని గప్పాలు కొట్టినరోజులు కొన్ని ఉన్నాయి. అందుకు భిన్నంగా ' సర్వ విషయాలలోను  మన వాళ్లు తీసికట్టే తమలోతాము గోతులు తవ్వుకోవడంలో తప్పించి| అంటారు శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి.  తెలుగుతనాన్ని అత్యంతగా ప్రేమించిన ఆ మహనీయుడు 'వేషం విషయమై మన తెలుగువారికిప్పుడు శ్రద్ధాలేదు. సంప్రదాయ గౌరవమూలేదు. అనుకరణ పరాయణత్వం తప్ప' అని తెలుగు వేషభాషలు అంతరించిపోతున్నందుకు చింతించారు. ఆఖరికి తెలుగు వాళ్లకు హోటళ్లు నడపడం కూడా చేతకాదని ఆయన అభిప్రాయం. ' రావలసిన వాళ్లను ఆకర్షించకపోవడమే గాదు, వచ్చినవాళ్లనైనా ఆదరించలేడు తెలుగు యజమాని' అంటూ తెగబడి చెప్పాడాయన. ఆంధ్రదేశంలో పుట్టడం వలన చాలా నష్టం ఉందని అభిప్రాయపడిన వాళ్లలో ఆయనా ఉన్నాడు. ' వారు ఆంధ్రులు కాక మరే జాతివారయినా అయివుంటే బతికి వుండినప్పుడూ, పరమపదించాక గూడా వారినాజాతీయులు బహువిధాల పూజించుకుని వుందురు' అంటూ వేటూరి ప్రభాకరశాస్త్రి గురించి ఆయన గ్రహించకపోలేదు. ' ఈ తెలుగు సినిమాలకు - బ్రాఁతిగఁ గొనిపోకు పిల్లవానిని వీడున్ బూతులను నేర్చుకొనియెను - చేతో మర్యాదలేని చీదరమాటల్' అంటూ విశ్వనాథ వారెప్పుడో చెప్పారు. పాతికేళ్ల కాలంలో తెలుగు సినిమాలలోని  సమస్త విషయాలు ఎంత బరితెగించి పోయాయో ఆయనగాని చూసివుంటే ఇంకా ఇంకా ఏమనేవారో! ' ఆంధ్రులకు దేశాభిమానం లేదు. భాషాభిమానం అంతకన్నా లేదు' అన్నాడు ఆత్రేయ. ' తెలుగావకాయ ఘాటెక్కింది - తెలుగు గోంగూర పులుపెక్కింది' అంటూ 1939లో కాటూరి వారొక హాస్యరచన చేశారు. ఆయన చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి పదవీ విరమణ సందర్భంలో "ఆంధ్రదేశస్థ సర్వాంగ్లభాషా కళాశాలలకున్ కనులు చల్లబడెనే' అంటూ పద్యాలు రాశారు. చెళ్లపిళ్ల వంటివాడు ఒక హైస్కూలులో తెలుగు పండితుడుగా పదవీ విరమణ చేయవలసిన దుర్గతి ఆంధ్రదేశంలో ఉందన్నది ఆయన విచారం. తెలుగువారి పత్రికాపోషణ మీద కూడా విలువైన అభిప్రాయాలున్నాయి. ' ప్రబుద్ధాంధ్ర సంపాదకుడు నెలకు ఇరవై రోజుల చొప్పున ప్రెస్సు బిల్లూ, పేపరు బిల్లూ పూర్తిగా చెల్లించలేకపోతూ ఉండడం దేశీయుల గాఢనిద్రకు నిదర్శనం' అని సాక్షాత్తు గిడుగువారే అన్నారు. అది ఆసరాగా చేసుకుని శ్రీపాదవారు ' తెలుగువాడిప్పుడు భావదాస్యంలో మగ్గిపోయి ఆత్మగౌరవం యెరక్కుండావున్నాడు. పామునోట్లో కప్ప కబళించే

దోమలా  ఉన్నాడు" అంటూ వాపోయారు.


ఇంకా ప్రసిద్ధులెందరో వ్యతిరేకాభిప్రాయాలు వెల్లడిచేసినవారున్నారు. అందులో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల, కొన్ని ఛాందసత్వంవల్ల, కొన్ని మార్పును అంగీకరించలేక పోవడం వల్ల, కొన్ని అవగాహన లోపంవల్ల వెల్లడైన భావాలు కావచ్చు. కాని అన్నీ అలాంటివి కావు. ఆంధ్రులు ఆరంభశూరులు, అనుకరణప్రియులు, అనేకత్వ లక్షణం కలవారు అనే విమర్శ పూర్వం నుంచీ ఉంది.


గోదావరి గట్టున కూర్చొని తెలుగుభారతం రాయడానికి నన్నయ్య ఎన్నో సంస్కృత సభల్లో సాముగరిడీలు చేయలసి వచ్చింది. పాల్కురికి సోమనాథుడు "తెలుగు మాటలనంగవలదు' అని బతిమలాడవలసి వచ్చింది, శ్రీనాథుడు తన భాషను సమర్థించుకోవలసి వచ్చింది. తెలుగువేషం మార్చుకోవలసి వచ్చినందుకు శ్రీనాథుడెంతో బాధపడ్డాడు. కాని మరాఠీవారి పాలనలో, మహమ్మదీయుల ఏలుబడిలో మన పేరు ఊరు, వేషం - భాష మార్చుకోవడం ఒక సంస్కారంగా మారింది. ఇంగ్లీషు వాళ్లు వచ్చిన తరవాత వైఖరిని గూర్చి చెప్పుకోవడం గొంగళిలో తింటూ వెంట్రుకలేరుకోవడమే కాగలదు. ఎప్పుడూ ఒక పరాధీనత మనకు, మన భాషకు, మన సంస్కృతికి తప్పడంలేదు. పరాధీనతను పల్లెత్తకుండా అంగీకరించేవారు ఎందరో ఉంటారు. స్వేచ్ఛాప్రియులు కొందరే ఉంటారు. అందులో ఆంధ్రదేశం తనను వెలివేసిందన్న బాధతో ఆంధ్రదేశాన్నే వెలివేసిన మహారచయిత ఒకడు. పరాధీనత అనే భావాన్నే భరించలేక స్వేచ్ఛకోసం మాతృ దేశాభిమానంతో ఆంధ్రదేశంలో అడుగుపెట్టిన అగ్గిపిడుగింకొకడు.


' కొన్ని గడియలకు  ఓఢ్రరాష్ట్రీయచ్ఛాయ అలుముకుంటుందనగా నేను పర్లాకిమిడి విడిచిపెట్టి మద్రాసు ప్రెసిడెన్సీలోకి వచ్చేస్తాను. పర్లాకిమిడిలో రైలెక్కుతాను. పాతపట్నం వెళ్లి ఏటిలో స్నానంచేసి... పర్లాకిమిడి మళ్లీ మద్రాసు ప్రెసిడెన్సీలో చేరితే తప్ప బతికి వుండగా నేనా ఊళ్లో అడుగుపెట్టనని కంకణం కట్టుకుని రైలెక్కుతాను' అన్నారు గిడుగువారు. మూడు లక్షలమంది ఆంధ్రులకు అన్యాయం జరిగే సందర్భంలో ఆయన ఈ మాట అనవలసి వచ్చింది. అందులో ఆయన స్వార్థమేమీలేదు. ఛాందసం లేదు. అవగాహన లోపంలేదు. అచ్చమైన తెలుగుతనం మూర్తీభవించిన మహదావేశం అందులో ఇమిడి ఉంది. ఆ మహావేశమర్థించి ఆంధ్రులార? చల్లుడక్షతలు నేడు' అన్న రాయప్రోలు మాటను ఇలాంటి సందర్భాలలో పునశ్చరణ చేసుకోవలసి వస్తుంది. కళాకారులు కాలాన్ని కట్టిపడేస్తారు. వాళ్లను కించపరిస్తే ఆమచ్చ కలకాలం మిగిలిపోతుంది. వాళ్లు నాణేన్ని పైకెగరేసి బొమ్మంటే బొమ్మే పడుతుంది. బొరుసంటే బొరుసే పడుతుంది. వారి ఉదాత్త హృదయాంతరాలలో మారుమోగినప్పుడు మాత్రమే తెలుగుపాట రక్తికట్టగలదు.


- యూ . ఎ. నరసింహమూర్తి 

( నేటి తెలుగు - నుంచి ) 

సేకరణ : - కర్లపాలెం హనుమంతరావు 

                    10 - 12-2021 

                     బోథెల్ ; యూ . ఎస్ . ఎ 


Thursday, December 9, 2021

ఆంధ్రము - తెలుగు - కోరాడ రామకృష్ణయ్య -కర్లపాలెం హనుమంతరావు

 ఆంధ్రము - తెలుగు 

కర్లపాలెం హనుమంతరావు 

మనిషి, జాతి, దేశం - వీటి గుర్తింపుకు సాంకేతికంగా ఒక ప్రత్యేకమైన పేరు ఏదైనా ఉండటం తప్పని సరి . చిత్రాంగా తెలుగువారి భాషకు రెండు పేర్లు ఆంధ్రము , తెలుగు! ( తమిళులదీ ఇదే వరస : తమిళం - అరవము .. అట్లాగే మరికొన్ని భాషలకూ ఉన్నప్పటికి వాటి చర్చ ఈ వ్యాస పరిధికి బైట. కనుక ఆంధ్రము - తెలుగు వరకే మనం పరిమితమవుదాం . ఈ చర్చ వల్ల భాషా సాహిత్యాలు, సంఘం ప్రాచీన పరిస్థితులు, ప్రాచీనా భాష పరిణామ క్రమం మీద కొద్దిపాటి అవగాహన వస్తుంది. అదీ ఈ వ్యాసం ఉద్దేశం కూడా.  


భాష అంటే మనిషి తన మనసులోని భాషను సంఘంలోని సాటి మనిషితో పంచుకునే  ప్రక్రియ సాధనం.  మనుషులకు సంబంధించిన జాతి, రాళ్లు  నివసించే ప్రాంతానికి దగ్గరగా పలికే పేర్లు ఆయా భాషలకు ఉండటం సహజం. ఉదాహరణకు అంగిలులకు దేశం ఇంగ్లాండ్, భాష ఇంగ్లీషు; అట్లాగే మన ఓడ్రులకు ఒరిస్సా, ఒరియా ) . అయి అఱువాళర్ అనేది ఒక తెగ పేరు. వాళ్ల  భాష పేరు ' అఱు ' వము. కానీ అరవల ప్రాచీన వాజ్ఞ్మయంలో ఆ పేరు కాకుండా ' తమిళం ' అనే పేరు మాత్రమే కనపడుతుంది. ఈ వింతాకు కారణం ఉత్తర దిక్కున ఉండే మన తెలుగువాళ్లే అంటారు ప్రసిద్ధ భాషా పరిశోధకులు కోరాడ రామకృష్ణయ్యగారు. తమిళం - అరవం లాగే ఆంధ్రం- తెలుగు కూడా ఆయా జాతి పేరుకు బట్టి ప్రాంతాన్ని బట్టి ఏర్పడినవే. రెండు వేరు వేరు జాతులు అయివుండి వేరు లేరు భాషలు ఉపయోగిస్తూ కాలక్రమేణా రెండు జాతుల వాళ్లూ దక్షిణాపథంలో ఒకే ప్రాంతంలో స్థిర పడి పోవడం వల్ల ఒకే భాషగా కలగలసిపోయి రెండు పేర్లతో పిలవబడుతున్నదా? ఈ అనుమానం చాలాకాలం బట్టి పరిశోధకులను వేధిస్తూనేవుంది. 

ఐతరేయ బ్రాహ్మణంలో ఓ కథ ఉంది. ఆర్యాంధ్ర జాతికి చెందిన వాళ్లు ఆర్య సంఘం నుంచి బహిష్కరించబడి పుండ్ర, పుళింద, మూతిబ లాంటి జాతులలో కలసి వింధ్యకు దక్షిణం దిక్కులో స్థిర పడ్డారని దాని సారం. వీళ్లే క్రమంగా క్రమంగా దక్షిణా పథానికి విస్తరించి కృష్ణా గోదావరి ప్రాంతాల ఆదిమవాసులు తెలుగు వారితో కలసిపోయారని విశ్వాసం . కృష్ణాతీరంలో రాజ్యాన్ని స్థాపించుకుని పాలన కూడా చేసినట్లు ఒక నమ్మకం. క్రీస్తు పూర్వం 3 వ శతాబ్ది నాటికే మగధ రాజ్యం తరువాత అంతటి మహరాజ్యంగా మెజస్తనీస్ మెచ్చుకున్నది ఈ ప్రాంతాన్నే . కృష్ణానదీప్రాంతంలోని ' కుబీరకుడు ' అనే రాజును గురించి 

భట్టిప్రోలు శాసనం కూడా ప్రస్తావించింది. ఆ శాసనం అశోకుడి కాలానికి కొద్దిగా ఇటువైపుదని పరిశోధకుల అభిప్రాయం. పశ్చిమ దిగ్భాగంలో ఉన్న మగధను కూడా జాయించి ఆంధ్రులు హైందవ మహాసామ్రాజ్యాన్ని స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే. ఉత్తర దేశంలోని ఆర్యాంధ్రులు దక్షిణంలోని గోదావరీ కృష్ణాప్రాంతవాసులు తెలుగు వారితో  కలసిపోయి    సామ్రాజ్యపాలకులుగా పశ్చిమదిక్కు కు కూడా ఆక్రమించి మొత్తానికి పాలకులు అయినందున తెలుగు మాట్లాడే ప్రాంతం కూడా ఆంధ్రప్రాంతం అయిందని, ఇక్కడి ప్రజలు ఆంధ్రులు, రాల్లు మాట్లాడే తెలుగు భాష ఆంధ్రం కూడా అయిందని   తాత్పర్యం . 


ఆర్యాంధ్రులు రాక ముందు కృష్ణా ప్రాంతం నిర్జనంగా ఏమీలేదు. తూర్పుదిక్కు నుంచి దక్షిణానికి సముద్ర మార్గంలో వెళ్లే బౌద్ధ యాత్రికులకు అమరావతి  స్థావరంగా ఉన్న నాగజాతి వాళ్లు ఆతిథ్యం ఇస్తుండేవాళ్లు . నాగజాతి అనే ఒక జాతి ఉన్నట్లు అమరావతీ స్తూపం మీద చెక్కిన చిత్రకథల ద్వారా నిర్ధారణ కూడా చేసుకోవచ్చు .  ఇంత జరిగినా ' తెలుగు' వాళ్ల ప్రస్తావన ఎక్కడా లేకపోవడానికి పరిశోధకులు ఊహించేదే నిజమయితే అక్కడి తెలుగువాళ్లు ఆ సరికే బర్మా వైపుకు ' తెలుంగులు' పేరుతో వలసపోగా .. మిగిలిపోయినవాళ్లు ఏ ' తెలగాణ్య బ్రాహ్మణులు, తెలగాలు'  గానో వ్యవహరింపబడ్డారు. క్రీ.శ 2వ శతాబ్దినాటి యవన యాత్రికుడు టాలమీ పేర్కొన్న ' ట్రిలింగాన్ ' ' ట్రిగ్లిఫాన్ ' ఈ తెలుగు ప్రాంతమే అయివుండవచ్చు.  ప్రాభవం బలంగా  ఉన్న చోట బలహీనులు ఉనికి కొల్పోవడం చరిత్ర గమనంలో మనం చూస్తున్న పరిణామమే, ఇక్కడ ఆంధ్రుల ప్రాభావంలో  ఆదిమ తెలుగు జాతికీ  అదే గతి పట్టివుండవచ్చు.   త్రిలింగము అనే కథ తరువాతి కాలంలో పౌరాణిక పరంగా కల్పన చేసి ఉండవచ్చు. 


చిట్టచివరగా ఒక మాట. తైలంగులు, తెలగాలు, తెలంగానా వంటి శబ్దాలను బట్టి ' తెలుగు ' అనేదే మూల రూపం అయివుండవచ్చు . కానీ అప్పటి సంస్కృత పండితులు ఈ దేశీయ పదాన్ని సంస్కృతీకరించే శ్రద్ధతో స్వభాషానురూపమైన రూపం, వ్యుత్పత్తి తయారు చేసారనడంలో సందేహంలేదు. ఆ తరహారూపాన్నే టాలమీ తీసుకున్నందువల్లనే  తెలుగును  ' ' ట్రిలింగాన్' ' ట్రిగ్లిఫాన్ ' అని ప్రస్తావించి ఉండవచ్చు. 


నోట్ : సంస్కృతీకరణ - ప్రక్రియను గురించి కుమారిలభట్టు ' తంత్ర వార్తికం ' అనే గ్రంథంలో చాల విపులంగా వివరిస్తాడు. కృష్ణానదికి ప్రాచీన రూపం మైసోలాన్. ఆ పరీవాహక ప్రాంతమంతా 'మైసోలియా' . ( అదే ఇప్పటి మచిలీపట్టణం). మై - అంటే ద్రావిడ భాషలలో ' నలుపు ' అని అర్థం. దీనిని సంస్కృతీకరించినందు వల్లనే నది ' కృష్ణ ' అయింది. దీనికీ ఓ ప్రాచూ నామం ఉంది. . ' కృష్ణ బేణ్ణా ' . కాలక్రమేణా అదే కృష్ణవేణి అయింది. ఇట్లా సంస్కృతీకరణను గురించి ఎన్నయినా ఉదాహరణలు ఇవ్వచ్చు. కానీ, ఇది సముయమూ కాదు. స్థలమూ పరిమితం, 

( వ్యాసానికి ఆధారం: కీ.శే. కోరాడ రామకృష్ణయ్యగారి ' ఆంధ్రము - తెలుగు ' - ( దక్షిణ దేశా భాషా సారస్వతములు - దేశి ) 


- కర్లపాలెం హనుమంతరావు 

03 - 10-2021 


బోథెల్ ; యూఎస్.ఎ 




మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...