ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం
మరింత దిగువకు
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురణ తేదీ - 05 -01-2011 )
రైళ్ళలోనే కాదు నీళ్ళలో కూడా మనకు అన్యాయమే జరిగింది. అడగందే అమ్మ యినా పెట్టదంటారు.అరిచి గీపెట్టినా గీకి కూడా పెట్టలేదు...మ
'ఆ నీటి ట్రైబ్యునల్ గురించేనా నీ ఘోష ? నిజమే మామా! కొత్త సంవత్సరం మనకు మొద ట్లోనే రెండు నామాలు పెట్టేసింది. ఒకటి కన్నడంవాళ్ళు పెట్టింది. ఇంకోటి మనకు మనం పెట్టుకున్నది.
మన గొడవల్లో మనం ఉంటే- పట్టుకుపోయేవాళ్ళు నీళ్లు పట్టుకుపోతున్నారు. కొట్టుకుపోయేవాళ్ళు ప్రాజె క్తులు కొట్టుకుపోతున్నారు. పదవులు, ప్రధాన శాఖల కోసం ఆరాటమే తప్పించి , సాగుకింద నీరు అదనులో అన్న దాతకు అందించాలన్న ధ్యాసే లేకుండాపోయిందీ పాలకులకు. అలమట్టి చివరికి మనకాలవల్లో వట్టిమట్టే మిగిల్చే టట్లుంది.
ట్రైబ్యునల్ని ఎందుకంటావులే. దేవుడే మనరాష్ట్రాన్ని దిగువన ఏర్పాటుచేసి అన్యాయం చేశాడు. ఎగువ రాష్ట్రాల మోచేతి నీళ్ళు తాగాలని రాసి పెట్టాడు. నారుపోసి నవాడు నీరుపోస్తాడన్న గ్యారంటీ లేకుండా చేశాడు.
మన మిగులు జలాలను వదులు కోవాలని ఆ పరమాత్ముడేమన్నా పురమాయించాడా? పక్క రాష్ట్రాల వాళ్ళు ఎగువన ఎడా పెడా డ్యాములు కట్టిపారేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నది మనమేగదా! పోనీ ట్రైబ్యునల్ ముందైనా బల మైన వాదనలు వినిపించామా? ఇప్పుడిలా ఊరికే దగా దగా అంటా లబలబలాడితే ఉపయోగముంటుందా ? మన తాగునీటి అవసరాల కోసం తయారు చేసుకున్న నివేదికల పైనా వేళకు ట్రైబ్యునల్ ముందుంచామా? లాయర్ల ఎంపికనుంచీ, అంచనాలు తయారుదాకా అన్నింటిలోనూ లాలూచీలే ! ఆషామాషీ వాదనలతో మన నీళ్ళకు నీళ్లొదులుకున్నది మనమే.
నిజమే మామా... బీరు మీదున్న శ్రద్ధ మనవాళ్ళకు నీరు మీద లేదు! అలమట్టి ఆ నిజాం కాలంనాటిదని కన్నడం వాళ్లు దబాయిస్తున్నా మనకు చీమ కుట్టినట్లయి లేదు. ఇక ఇంటికొచ్చినవాళ్ళకు కాళ్ళు కడుక్కోమని ఇన్ని నీళ్ళిద్దామన్నా ఒకటికి మూడుసార్లు ఆలోచించుకునే రోజులొచ్చేస్తున్నాయి.
నువ్వలా గుర్తు చేయొద్దు అల్లుడూ...
భయంగా ఉంది. ఈ లెక్కన నీళ్లు లేకుండా స్నానాలు చేస్తే కొత్త విధానమేమన్నా కనిపెట్టాలేమో ! దాహం తీరేందుకు నీటికి ప్రత్యామ్నాయం ఏదన్నా పరిశోధించాలేమో!
ఇదీ ఒకందుకు మంచిదేకదా మావయ్యా ! నీటి కటక మూలాన్ కరెంటు కోతలు ఎక్కువైపోతే చీకటిపడక ముందే జనాలు కొంపలకు చేరుకుంటారు. క్లబ్బులు, పబ్బులు, సినిమాల గోల తగ్గుముఖం పడుతుంది. చీకట్లో కూడా పనులు చక్కబెట్టుకునే విద్య 'శబ్దభేది'అని ఒకటుంది . మన శాస్త్రాల్లో దాన్ని మళ్లీ పాఠ్యప్రణాళి కల్లో పెట్టి పిల్లకాయలచేత సాధన చేయించే సువర్ణావకాశం వచ్చింది . డబ్బును నీళ్ళలాగా వృథా చేయడం ఇక తగ్గుముఖం పడుతుంది . నీళ్లను డబ్బులాగా పొదుపుగా వాడుకోవాలని ప్రచారాలు మొదలవుతాయి గదా! .
'ఇంద్రజాలికులు వాటరాఫ్ ఇండియా అని ఓ వినోదం చేస్తారు. అబ్రకదబ్ర అనగానే చెంబులోనుంచి అదేపనిగా నీరు ధారగా పడిపోతుంటుంది. అలాంటి మాయా వినో దానికేమన్నా మనవాళ్ళు మళ్ళా ఓ ప్రత్యేక విద్యాలయం ప్రారంభిస్తారేమో చూడాలి.
'మరి... కట్టి కట్టని ఈ భారీ ఆనకట్టలన్నీ ఏమవుతాయి?
ఏం చేసుకొంటున్నాం? కులీకుతుబ్షాహి సమాధుల్లాగా చక్కగా తీర్చిదిద్దిపెడితే విదేశీ యాత్రికుల నుంచైనా నాలుగు డాలర్లు రాలతాయి గదా!
ఏమైనా సర్కారు మందబుద్ధికి మనకిక ఏటేటా వరదల బెడదన్నా తప్పుతుందేమో! అంతెత్తు ఆనకట్టలు కట్టినాక దిగువకు ఒక్కబొట్టు నీటి చుక్కయినా దిగుతుందా? వేసవి వచ్చిందాకా చూసిచూసి కరవు మండలాలు ప్రకటిం చుకోవాల్సిన గత్తర ఇక ఉండదు. ఏటికి ఏటా నీటి కటకట అయినప్పుడు ప్రత్యేకంగా ఇవీ కరవు ప్రాంతాలని ప్రకటించటాలెందుకటా ?
ఇంకో అర్ధశతాబ్దందాకా ఇదే పరిస్థితి అంటున్నారు పెద్దలు. కరెంటుకోసం మరాఠీలకు, తాగునీటికోసం తమిళనాడుకు దయ తలిచినంత కూడా మనకు నీరు విదలకపోవడమే దురదృష్టం . ట్రై బ్యునల్ చూపించింది మొండిచేయి .
ట్రైబ్యునల్ మరీ అంత నిర్దయగా లేదులే మామా ! తొందర్లోనే వర్కింగు టేబిలూ తయారు చేయి స్తానని అంటున్నది గదా!
'ఎందుకూ మన నిద్ర ఎక్కువ సర్కారు తల కింద పెట్టుకుని గురకపెట్టు కొనేటందుకా?
నువ్వు మరీ చెబుతావు. అన్నీ నష్టాలన్నా నేనూ నమ్మును. ఆద నంగా దాదాపు రెండు వందల శతకోటి ఘనపుటడుగుల నీటిని అధికారికంగా రాబట్టినా, సర్కారు ఆ సంగతి బైట పెట్టదేమిటి? కేంద్ర జలసంఘం అనుమతులు ఇన్ చిడెకలో వస్తాయంటే నమ్మనా? అరె! ఎందుకా నవ్వు మామా?
నీ అమాయకత్వం చూస్తే నవ్వు రాక ఏడుపొ
స్తుందా అల్లుడూ ? ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తే ప్రభుత్వానికి గొప్ప సన్మానం చేస్తామని ప్రధాన ప్రతిపక్షం బెదిరించిన సంగతి మరిచిపోయావా? ప్రజాస్వామ్యంలో ఏ సర్కారు అయినా ప్రతిపక్షాలవారి సన్మానాన్ని సహిస్తుందా? ఇంక అనుమతులు అంటావా! ఏ యజ్ఞానికైనా కావాల్సింది అందరికీ సరిపడా నిధులు కాని- వట్టొట్టి అనుమతులెందుకు?
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురణ తేదీ - 05 -01-2011 )
No comments:
Post a Comment