ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం
ఓటరుకు పొంగలి
- రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 14 -01 - 2009 )
మన సంక్రాంతికి, ప్రజాస్వామ్యా నికీ బోలెడన్ని సామ్యాలు.
పండ గల్లో సంక్రాంతి పెద్ద పండుగ. పర్వాలలో ఎన్నికలది పెద్దపర్వం.
రెండూ ఒక్కరోజులో వచ్చిపోయేవి కాదు. సంక్రాంతికి నెల పడతారు. ఎలక్షన్లకు ఏడాది ముందునుంచే హడావుడి పడతారు.
పడిన కష్టానికి పంట చేతికి వచ్చేది... గాదెలు నిండేదీ ఈ పండగలప్పుడే కదా! తుఫానుకు ముందే వాతా వరణంలో తేడా పొడగట్టినట్లు- ఈ రెండు పండ గలకు చాలాముందునుంచే సందడి మొదలవు తుంది.
ఈసారి పర్వాలు రెండూ కూడబలుక్కు న్నట్లు వెంటవెంట రావటమే విశేషం.
పండుగ రోజుల్లో పేడ కుప్పలకు గొబ్బి గౌరవం దక్కి నట్లే- ఎన్నికల కాలంలో పేరిగాడికి అవమానం కన్నా రాజపూజ్యం అధికం.
గొబ్బిచుట్టూ చేరి జనం భజనలు చేసినట్లు అన్ని పార్టీలు తెల్లకార్డువాడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేది ఒక్క ఎలక్షన్ సీజన్లోనే కదా!
అత్తా రింట్లో కొత్తల్లుడిలాగా ఓటరు వెలి గిపోయేది ఈ నాలుగు రోజులే. వాడి మాడుకు తలంటే తతంగం దగ్గ ర్నుంచీ నెత్తిన భోగిపళ్లు పోసే కార్యక్రమందాకా రాజకీయపార్టీలు పోటీలు అనీ ఇన్నీ కావు .
ముగ్గులపో టీని మించి ఉంటుంది హేమాహే మీల హామీలపోటీ. మల్లయ్యను ఎలాగైనా తమ ముగ్గులోకే లాగాలని అన్ని వర్గాలు రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్దేస్తుంటాయి.
ముగ్గేసుకుంటూ ఊళ్లూపూళ్లూ తిరిగొచ్చే అమ్మలనూ, అక్కలనూ, చెల్లెళ్లనూ చూసే నేతలు పాదయాత్రలు చేసి అధిపతులు అయ్యారని అనుమానం. రథంముగ్గు స్ఫూర్తితోనే రథయాత్రలు చేసుకుంటూ చంద్రబాబు అలా ముందుకుపోయి సర్కారు రథానికి సారథిగా మారడమే ఇందుకుదాహరణ.
ఆడపిల్లలు ముగ్గులేస్తున్నంత చులాగ్గా నేతలు కొందరు పిల్లిమొగ్గలే సీజన్ ఇదే.
రాబోయే ఎన్నికల్లో ఏ ముగ్గువైపు ఓటరు మొగ్గు చూపుతాడో!
ధనుర్మాసం సందర్భమా అని పులి హోర, బొబ్బట్లు, పానకం, పరమాన్నం, చక్కెర పొంగలి దేవుడి ప్రసాదం తేరగా దొరుకుతుంది. ఈ ఎన్నికల నాలుగు రోజులూ రెండు రూపాయాలకు కిలో బియ్యం, పది రూపాయలకే కందిపప్పూ, ఉప్పూ, కారం, ఉల్లీ, నూనె... సర్కారువారి ప్రసాదంలాగా లక్కీగా దక్కుతాయి.
సంక్రాంతంటే బొమ్మల కొలువు. ఎన్నికలంటే కొలువు తీరబోయ్ బొమ్మలు.
రాశులు చూసుకుని సూర్యుడు అయనాలు మారేది ఈ ధనుర్మాసంలోనే. వాటం చూసుకుని లీడర్లు గోడలు దూకేదీ ఈ సీట్ల పంపకాల రోజుల్లోనే .
పితృపార్టీలకు తర్పణాలొదిలేందుకు తిలోద కాలు పట్టుకు తిరిగే అసంతృప్తులకు ఎలక్షణాయనమే సలక్షణమైన సమయం.
పండుగ ఎన్నికల ముందొచ్చినందువల్ల పోటీదారు
డికి సున్నం లాభం. శుభ్రంగా వెల్లవేసుకుని వున్న గోడల మీద శుద్ధంగా ఏ రాత్రి చీకట్ల చాటుగానా 'పవిత్రమైన ఓటు వేయండి' అంటూ చవగ్గా రాసుకుపోవచ్చు. ఇంటావిడ తెల్లారి ' వేయండి . చివరి అక్షరం మీదో పిడక కొడితే మాత్రం అదో అశుభసూచకం.
రాబోయే ఎన్నికల్లో కాబోయే ఎమ్మెల్యేలు, ఎంపీలూ గడపగడపకీ హరిదాసులకు మల్లే చిడతలు ఆడించుకుంటూ తిరుగుతుంటారు . ఎవరు ఎవరెవరికి దాసో సరిగా పోలిక పట్టకపోతే అక్షయపాత్రలో వేసిన భిక్షలాగా పవిత్రమైన ఓటు సైతం 'శ్రీమద్రమారమణగోవిందో హరీ!'
'అయ్యగారికి దండం... అమ్మగారికీ దండం అంటూ సన్నాయి నొక్కులు నొక్కు కొంటూ గుమ్మాల ముందుకు వచ్చేవాడు అసలు గంగిరెద్దులవాడో! అయిదేళ్ల కిందట అమూల్యమైన ఓటు వాడ లాక్కెళ్లినవాడో.. తేడా తెలుసుకోవాలి. లేకుంటే నిలదీసేందుకు మరో ఐదేళ్ల ఎన్నికం పండక్కి గానీ అవకాశం రాదు.
'అంబ పలకు... జగదంబ పలుకు' అంటూ డుబుడుక్కు లాడించుకుంటూ వస్తాడు బుడబుక్కలవాడు. ఇదివరకు కూడా ఇల్లాగే వసపిట్టలాగా వాగి మసిపూసి మారేడు చేసినవాడేమో సరి చూసుకోవాలి.
కాశీ బ్రాహ్మణుడి కావడిలోని దశావతారాలకన్నా ఘనంగా వేషాలేసేవాడు, కాటికాపరికన్నా చిత్ర విచి త్రంగా కనికట్టు చేసేవాడు కచ్చితంగా మన నియో జకవర్గం ప్రజాప్రతినిధి కాకుండా చూడాలి కదా!
పండగంటే కోళ్ల పందేలు. బెట్లూ పైబెట్లూ అంటూ రాబట్టుకొనేదంతా పైనున్న వాళ్లు . కాళ్లూ తలలూ పోగొట్టుకునేది కోళ్లు మాలం కిందుండే కార్యకర్తలు. ఓడినా గెలిచినా కోడి, కనుమనాడు కైమా కొట్టు నుంచి పలావులోకి కూర కావటం ఖాయం.
కాడి లాగే ఎద్దులాగా కార్యకర్త ఖర్మ కూడాఏ పండగకైనా ఇదే.
కాకపోతే పశువుల పండగ నాడు వాటి మొఖానికింత పసుపూ కుంకుమ ఉండ... మె డపట్టకుండా దండ! 'ఓడేది వీడూ... గెలిచేది వాడూ' అంటూ గాలిపటాలెగరేసి పిల్లకాయల మాదిరి సందడి చేసేది మాత్రం పత్రికలు, ఛానెళ్లు.
మీడియా హడావుడే లేకుంటే ఊళ్లో పెళ్లయినా వెలతెలాపోవాల్సిందే! ఛానెళ్లునోళ్లు మూసేసుకుంటే పండుగైనా - పోలింగుఅయా కళ తప్పి పోవాల్సిందే.
కొత్త సంవత్సరం ఒత్తిడిలో 'హ్యాపీ న్యూఇయర్' చెప్పటం మరిచిపోయుంటే సంక్రాంతికి ఆ వాయనం ఇచ్చిపుచ్చుకోవటం ఆనవాయితీ.
ఈసారి పొంగళ్ల పండుగ వెంబడి 'పోలింగు పండుగా అనుసరిస్తోంది . కాబట్టి రెండు పండుగలకీ కలిపి మన తెలుగువాడికి ఉమ్మడి శుభాకాంక్షలు.
అమెరికా ఆర్థిక మాంద్యం నుంచి గాడిలో పడాలి. తెలుగు సినిమాలు బాగుపడాలి. యాంకర్ల తెలుగు తేటపడాలి. టీవీల రెండు సీరియల్సయినా ఈ సీజనుకు మాదిగితే అదే పెద్ద పండుగ. రైల్ల వేళకి నడవాలి . బాంబు బెదిరింపలు. బాంబుదాడులు ఉండకూడదు . యాసిడ్ దాడులసలే వద్దు . ధరలు తగ్గాలి.
మళ్లీ ఎన్నికలు అయిదేళ్ల దాకా రాకూడదు... విష్ మీ హ్యాపీ ఎన్నికల సంక్రాంతి!
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 14 -01 - 2009 )
No comments:
Post a Comment