ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం
ఓటేసి చెబుతాను
రచన-కర్లపాలెం హమమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 26 - 04 - 2009 )
గదిలో ఎవరూ లేరు... కవి, కాగితమూ కలమూ తప్ప.. '
' మన స్వాతంత్య్రం గొంగళి వయస్సు అరవై రెండేళ్లు. శిశువుకు దక్కని స్తన్యంలాగా ప్రవహిస్తున్నాయి నీళ్లు. బద్దలైన గుండెల్లాగా బీటలు వేశాయి పొలాలు. ఎన్నికలొస్తే చాలు ఎన్నెన్ని కొత్త కొత్త నినాదాలు ! ఉపన్యాసాలూ .. ఉపవాసాలూ .. కండువాలూ .. కేకలూ! అంతా గజీతగాళ్లే ! అయినా అరగజం పురోగమనం లేదు' ... కవి రాసుకుపోతున్నాడు కసి కసిగా .
నవ్వు ..
ఆ అలికిడికి కలం ఆగింది . తలెత్తి చూశాడు కవి. ఎదురుగా అద్దంలో కవి ప్రతిబింబం.
'ఎవరు నువ్వు? ' అడిగాడు కవి
'పాత సినిమాలలో కథానాయకపాత్ర బాధపడుతుంటే బైటకొచ్చి నిలబడుతుందే, అలాంటి నీ అంతరాత్మను' అని ఇప్పటి సీఎంలాగా చప్పుడు లేని నవ్వు మళ్లీ నవ్వింది అంతరాత్మ.
'నాతో నీకేంపని? నేను రమ్మని పిలవలేదే! నా మానాన 'నన్ను రాసుకోనీయ్! ' గసిరాడు కవి విసుగ్గా.
' నువ్వు పిలిస్తేనే రావటానికి నువ్వేమన్నా నా ఢిల్లీ హైకమాండువా? నువ్విలా వూరికే లోలోపల ఉడు క్కుంటుంటే ఆ ఉక్కపోతకు తట్టుకోలేక బైటికొచ్చాను. ఒక్కముక్క చెబుతాను. విను!'
' చెప్పింది వినకపోతే చెప్పులు విసిరే కాలం కదా! చెప్పు! '
' కవి అంటే ఎవరు? కట్టేసి వినిపించేవాడా?'
' కాదు. కష్టజీవికి ముందూ వెనకా ఉండేవాడని అన్నాడు యుగకవి శ్రీశ్రీ'
' కదా! కదిలేది కదిలించేది . . మారేది మార్పించేది.. పెను నిద్దర వదిలించేది.. మునుముందుకు సాగించేది.. పరిపూర్ణపు బ్రతుకిచ్చేది.. కావాలోయ్ నవకవనానికి | అని అన్నది కూడా ఆయనేకదా మరి ? నవీన విశ్వవిద్యాలయాల్లో పురాణ పఠనం మాదిరి నీ ఈ రాతలేమిటి? అన్యాపదేశంగానో, అర్ధాంతరన్యాసంగానో నీ సొంత కోపాలేవిటో పెట్టుకుని రాజకీయనేతల్లాగా ఎవరెవరినో ఇందులో ఇరికించాలనుకోవడం భావ్యమా? బొమ్మలాంతరు పేరు విన్నాదా? '
' గ్యాస్ స్టౌ తెలుసు గానీ- ఈ బొమ్మలాంతరు తెలీదు.'
'గ్యాస్ ని మరిచిపోరు గదా మీ కవులు ? పేకాటలో ముందు పంచిన ఓకుల్లో పొడిముక్కలు. . తప్ప ఒక్క బొమ్మయినా లేక పోతే ' బొమ్మ లాంతరు' అంటారు. ఆ ముక్కలు చెల్లవు. మళ్ళీ ఆడాలి. అట్లాగే ఎన్ని కల్లో గెలిచినవాళ్ళు అంతా పొడిముక్కల్లాంటి వాళ్ళే అయితే, మళ్లీ బొమ్మల కోసం ఆడేందుకు అయిదేళ్ళకోసారి అవకాశం వస్తుంది గదా! మరిదేనికోసమీ అలజడి, ఆందోళన కళారవీ.. పవీ.. కవీ! '
కవి నిశబ్దంతో వక్త అంతరాత్మ ముదిరి ప్రవక్తగా మారింది .
' నీ చిన్నతనం గుర్తుందా? మీ దొడ్డమ్మ పొంగరాలు పోస్తూ ఉంటే నువ్వు ఆమె దగ్గర కూర్చుని తినేందుకు ధ్యానం చేస్తూ ఉండేవాడివి. కొన్ని చెడిపోయేవి. కొన్ని రుచిగా ఉండేవి. ఎప్పు డోగాని అసలైన పొంగరం కుదిరేది కాదు . సిసలైన నాయకుడు రావటం కూడా అసలైన పొంగరం కుదరడం లాంటిదే. మంచి పొంగరం రాలేదని నువ్వు పొయ్యి దగ్గర నుంచీ లేచిపోయావా? లేదు కదా? అట్లాగే మంచి నాయకుడు వచ్చిన దాకా ఓపికగా ఉండాలా .. వద్దా ? కెరటాలు ఆగినదాకా సముద్రంలో స్నానం చేయనంటే నష్టం ఎవరికి? ఈత నేర్చుకోవటానికి దుస్సాహసమొకటే మార్గం . చెట్టును చూడు .. నిశ్చలంగా ఉన్నట్లే ఉంటుంది. వేళ్ళతో బండరాళ్ళను బద్దలు చేసుకుని పెరుగుతుంది. మనిషీ చెట్టు మల్లేనే ఉండాలి. బండలాగా పడి ఉండద్దని నీలాంటివాడు చెప్పొద్దా?'
కవికి మండింది . ఎదురు దాడికి దిగాడు.
'లోపల కూర్చుని నా లోపాలు చూపటంకాదు. బైటికి వెళ్ళి చూడు! విలువలను ఎలా పాతరేస్తున్నారో తెలుస్తుంది.'
' మంచిదేగా! వానపడితే బోలెడంత పంట! '
' ఎన్నికలు జనాలకు టైఫాయిడ్ జ్వరంలాగా పట్టు కొన్నాయి'
' శుభం ! జ్వరం తగ్గితే కొత్త శక్తి వస్తుంది. ఇది సంధి కాలం అని సరిపెట్టుకోరాదా మేధావీ ! '
'అంటే పార్టీలు అధికారం కోసం సంధి చేసుకొనే కాలమనా!
'అదే. ఆ వెటకారమే వద్దనేది! సమాజం దారులు మారే కూడలి దగ్గర నిలబడిందని నా అర్ధం ! దిక్కూ మొక్కూలేని వాడు కూడా దిగ్గజాల్లాంటి వాళ్ళకు దిక్కయి వాళ్లకు మొక్కే కాలం ఇది కవీ! అతి సామాన్యుడిలో కూడా కదలిక వచ్చే సమయం సుమా!'
'ఔను నిజం ! నీవన్నది నిజం .. నిజం ! అన్ని సభలకూ ఆ సామాన్యుడినే కదా కదిలిస్తున్నది !
కవి ఆలోచనలో పడ్డాడు.
అదనుచూసి అంతరాత్మ చెలరేగిపోయిందీ సారి మరింతగా.
కాలం అమూల్యమైన ఆస్తి. వినియోగానికి మనిషికి అమమతి పరిమితమే . దిగాలుపడుతూ కూర్చుంటే తరవాతి తరాల తలరాత కూడా మారదు. ఓటు వేయటం రెండో ఎక్క మంత తేలికే కానీ, మంచివాడిని ఎంచుకొని వేయటం రెండో ప్రపంచయుద్ధమంత కష్టం. సెలవురోజైనా ' రజనీ' సినిమా విడుదలవుతున్నా, ఎన్ని పనులున్నా ఎన్నికల రోజున ఓ గంట క్యూలో నిలబడి ఓటు వేయి ! ' అని రాయి! అదీ కవిగా నీధర్మం! కవీ ఈ విసుర్లు విసరటం ఇక మానేయి' అంది అంతరాత్మ.
కవి కాగితం చించి కొత్త కాగితం అందుకొన్నాడు. పౌరుడిగా నా బాధ్యత నెరవేరుస్తానని ఒట్టేసి చెప్పను . ఓటేసి చెబుతాను' అన్నాడు.
అంతరాత్మ సంతోషంగా స్వస్థలం కవి గుండెల్లోకి వెళ్లి పోయింది.
ప్రజాస్వామ్యం కథ కొత్త దిశకు మళ్లనున్నది.
రచన-కర్లపాలెం హమమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 26 - 04 - 2009 )
No comments:
Post a Comment