Sunday, December 12, 2021

కథానిక వేలం పాట రచనః కర్లపాలెం హనుమంతరావు

 









కథానిక

వేలం పాట

రచనః కర్లపాలెం హనుమంతరావు

 

'యువర్ అటెంక్షన్ ప్లీజ్!'

జబర్దస్తీగా వినిపిస్తున్న ఆ గొంతుతో అప్పటివరకూ రకరకాల కబుర్లతో గందరగోళంగా ఉన్న సెకండ్ క్లాసు బోగీ కొద్దిగా సద్దుమణిగింది.

'లేడీస్ అండ్ జంటిల్మెన్!.. భాయియో ఔర్ బెహనో!.. అయ్యలారా అమ్మలారా!...'

మూడు భాషల్లోనూ ముచ్చటగా సంబోధిస్తున్న  మూడు పదులు నిండని ఆ యువకుడు చూపులకూ ముచ్చటగా ఉన్నాడు.

అప్పుడే ఐరన్ చేసి వేసుకున్నట్లున్న కాస్ట్లీ డ్రెస్, చెదరని హిప్పీ క్రాఫు, చిరుగడ్డం. చిరునవ్వుతో  పాఠంలా గడగడా చెప్పుకుపోతున్న అతని మాటల్ని ఎంత వద్దనుకున్నా వినకుండా ఉండలేక పోయాను.

'.. ఇది మా కంపెనీ ప్రచారంకోసం .. సేల్స్ ప్రమోషన్ కోసం పెట్టిన పథకం. ఇక్కడున్న ఈ డ్రెస్ మెటీరియల్లో ఒక్కో ఐటమ్ నే పాటకు పెడతాను. టెరీకాట్.. పాలిస్టర్..  ఊలెన్.. జపాన్.. అమెరికన్.. స్విట్జర్లాండ్.. ఎక్స్ పోర్టెడ్ బ్రాండ్స్.. ప్యాంటు పీసులు.. షర్టు పీసులు.. సూట్ మెటీరియల్.. మీటరు.. మీటరున్నర.. టూ మీటర్స్.. టూ అండ్ హాఫ్ మీటర్స్..  ఇప్పుడు ఆక్షన్లో పాడుకున్న అదృష్టవంతులకు దక్కుతాయి. ఇందులో మోసం.. దగా..  మాయా.. మిస్టరీ.. ఏవీ లేవు సార్! కంపెనీ ప్రచారంకోసం చేపట్టిన సేల్సు ప్రమోషన్ స్కీములు మాత్రమే ఇవన్నీ. అతి తక్కువ ధరలో అతిమన్నికైన బట్టలను వేలంపాటలో పాడి సొంతం చేసుకోవచ్చు. ఇందులో బలవంతం ఏమీ లేదు. మోసం అసలే లేదు. ఆక్షన్లో ఎవరైనా పాల్గోవచ్చు. ఐతే రెడీక్యాష్ ఉండాలి. అదొక్కటె కండిషన్. పాడినవారందరికీ కంపెనీ తరుఫున ఏదో ఒక గిఫ్టు. బాల్ పెన్.. దువ్వెన.. సెంట్ బాటిలు.. సెల్ ఫోన్ కవరు.. నెయిల్ కట్టరు.. కంపెనీ కాంప్లిమెంటరీకింద ఉచితంగా ఇవ్వబడుతుంది…'

ఉచితం అనే మాట చెవినబడేసరికి చాలామంది దృష్టి ఇటు మళ్ళింది.

అనుమానం వదలని ఓ నడివయసాయన 'గుడ్డలు మంచివేనా?' అని సందేహం వెలిబుచ్చాడు.

'బాబాయిగారు మంచి ప్రశ్న వేసారు. మంచిరకం బట్టల్ని ఇలా ఊరూ వాడా తిప్పుకుంటూ అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని మీలోనూ చాలామందికి అనుమానాలుండొచ్చు. లేడీస్ అండ్ జెంటిల్మెన్! ఇది లిపారియా మిల్సువారి తయారీ సరుకు. కేవలం ప్రచారంకోసం కమీషను పద్ధతిమీద ఇలా మేము అమ్ముతుంటాం. అంతేగానీ సరుకు నాసిరకం అయికాదు. ఒక్క సారి మీరే మీ కళ్ళతో చూడండి. కంపెనీ లేబుల్సుని పరీక్షించుకోండి. బజారులో దొరికే రేట్లతో కంపేరు కూడా చేసుకోవచ్చు…'

అంటూ ఆ వేలంపాట కుర్రాడు లైట్ బ్లూ కలర్ టెరీన్ షర్టు పీసు మడతలు విప్పి ప్రశ్న అడిగిన నడివయసు పెద్దాయన ఒళ్లో పరిచాడు.

పక్కనున్న జనం దాన్ని పరీక్షించడం మొదలుపెట్టారు. వేలంపాట కుర్రాడు పాట మొదలు పెట్టాడు.

'బాబాయిగారి వళ్ళో ఉన్న ఈ లైట్ బ్లూ కలర్ టెరీన్ షర్టు పీసు.. రెండు మీటర్లు.. కంపెనీవారి పాట యాభై రూపాయలు.. పచాస్ రూపయా.. ఫిఫ్టీ రూపీస్  ఓన్లీ..'

' ఫిఫ్టి ఫైవ్..' అన్నాడు విండో పక్కన కూర్చొన్నబట్టతల పెద్దమనిషి.

ఎటువైపునుంచి బదులు రాలేదు.

' ఫిఫ్టీ ఫైవ్.. యాభై ఐదు.. పచ్ పన్.. అమెరికన్ ఎక్స్ పోర్టెడ్.. టెరీన్.. షర్టు పీసు.. టూ మీటర్సు.. ఫర్.. ఫిఫ్టీ ఫైవ్ ఓన్లీ. ఇదే బట్ట  చీరాల గాంధీ క్లాత్ మార్కెట్లో టూ హండ్రెడ్ పెట్టినా దొరకదండి బాబులూ! అదృష్టవంతులు అవకాశం జార విడుచుకోవద్దు. పాటలో పాల్గొంటే పోయేదేమీ లేదు. వస్తే మంచి సరుకు. రాకపోయినా కంపెనీవారి కాంప్లిమెంటు.. దువ్వెన'

' ఫిఫ్టీ ఫైవ్.. ఒకటో సారి. ఫిఫ్టీ ఫైవ్.. రెండోసారి…'

బోగీలో అదే నిశ్శబ్దం!

'యభై ఐదుకి గిట్టుబాటు కాదు కాబట్టి కొట్టి పారేస్తున్నాం. పాడినందుకు  పాతిక రూపాయలు ఖరీదు చేసే దువ్వెన తాతగారికి కంపెనీ తరుఫునుంచి  కానుకగా ఇస్తున్నాం' అంటూ బట్టను వెనక్కి తీసుకుని ఒక దువ్వెన విండో పక్కనున్న బట్టతల పెద్దమనిషిమీదకు విసిరేసాడా  వేలంపాట కుర్రాడు.

బట్టతల మనిషి చేతికి నిజంగానే ఉచితంగా దువ్వెన వచ్చేసరికి కంపార్టుమెంటులో చాలామందికి హుషారు పెరిగినట్లుంది.  'జపాను బ్రాండు టెరీ కాటన్ షర్టింగు.. టూ అండ్ హాఫ్ మీటర్సు గులాబీ రంగు పీసు .. కంపెనీవారి పాట అరవై రూపాయలు. సిక్స్టీ రూపీస్.. సాఠ్ రుపయ్యే.. కేవలం అరవై రూపాయలు మాత్రమే..' అంటూ బట్టను గాలిలో ఎగరేసి ఎదురుగా ఉన్న కుర్రాడి భుజంమీద వేసాడో లేదో.. పరిశీలించడానికి పదిమందిదాకా అతగాడి చుట్టూ గుమికూడారు.

'ఓపెన్ మార్కెట్లో ఈ షర్టు పీసుడొందలకు తక్కువ గిట్టుబాటుకాదండీ సార్! కంపెనీవారి పాట సిక్స్టీ ఓన్లీ. అదృష్టవంతులు ఈ సారైనా అవకాశం జారవిడుచుకోవద్దు. పాడిన వాళ్ళందరికీ బాల్ పెన్ ఉచితం. సిక్స్టీ రూపీస్.. ఒకటో సారి.. సిక్స్టీ రూపీస్..'

పాట ఈ సారీ మందగొడిగా సాగినా పది నిమిషాల తరువాత యెనభై రూపాయలకో షావుకారుకు అనుకూలంగా కొట్టి వేయబడింది. పాడిన నలుగురు మనుషులకూ తలా ఓ బాల్ పెన్నుఉచితంగా దక్కింది.

'మాష్టారూ! ఈ రకం వ్యాపారంలో మాయేమీ లేదంటారా?' అని అడిగాడు అప్పటిదాకా  హిందూ పేపరు మొహానికి అడ్డం పెట్టుకుని తనకేమీ పట్టనట్లు కూర్చోనున్న నా పక్క పాసింజరు. 

అతనేమో సూటూ బూటలటులో చూపులకే  దర్జాగా దొరబాబులా ఉన్నాడు. అంతమంది మధ్యలో నన్నే ఎన్నిక చేసినట్లు అడగడంతో కాస్తంత గర్వంగా అనిపించిన మాట వాస్తవం. 

'ఏ మాయా మర్మం లేకుండా ఎందుకుంటుందండీ? ఏదో మతలబు లేకపోతే ఇంతింత ఖరీదుచేసే సరుకు ఇంత కారుచవుకగా ఎలా గిడుతుందండీ? కంపెనీ ప్రచారం.. సేల్స్ ప్రమోషన్.. అంతా ట్రాష్!' అన్నాను.

'అసలు సరుకెంత నాణ్యమో ఇంటికెళ్ళి దర్జీవాడికి చూపిస్తేగాని బండారం బైటపడదు!' అనేసాడు నాకిటువైపుగా కూర్చోనున్న మరో ప్రయాణీకుడు.

'నో.. సార్! నేనూ మీకులాగే అనుకునేవాడిని మొదట్లో! ఈ కోటు ఉంది చూసారూ! ఇలాగే ఇదివరకు బెనారస్ వెళ్ళినప్పుడు బండిలో వేలంపాటలో పాడి గెల్చిన బట్టతో కుట్టించిందే. నలభై రూపాయలకనుకుంటా  పాడింది. నాలుగేళ్ళయింది .. సరిగ్గా గుర్తు లేదు' అంటూ కౌంటరు ఆర్గ్యుమెంటుకు దిగాడిందాకటి సూటు మనిషి. అతగాడంత గట్టిగా బల్లగుద్దినట్లు తన ప్రత్యక్షానుభవం చెబుతుంటే   కాదనటానికి ఇంకెవరి దగ్గర మాత్రం మాటలేం మిగిలుంటాయి!'

'ఇహ బట్టల నాణ్యతంటారా! మాదిక్కడి తెనాలి దగ్గర రేపల్లే. ఏళ్ళ తరబడి చేసున్నామీ క్లాత్ బిజినెస్! ఆ  విండో బాబాయిగారి దగ్గరున్న క్లాతు ఎంతలేదన్నా మీటరు నూటేభైకి తక్కువుండదు ఓపెన్ మార్కెట్లో'. మరి ఇట్లా వేలంపాటలో అంత కారు చవగ్గా ఇచ్చేయడంలో మతలబేంటో మాత్రం అంతుబట్టటం లేదు.'

ఈ సారి పాటలో ఆ సూటు పెద్దమనిషే స్వయంగా  చైనా మోడల్ సిల్కు క్లాత్ గ్రే కలర్ ది పాటను నూటపాతికదాకా పెంచి మరీ సొంతం చేసుకున్నాడు. వస్తువు తీసుకునే సమయంలో అతగాడు వేలంపాట కుర్రాడితో ఆడుకున్న వైనం చూసిన తరువాత ఇంకెవ్వరికీ  ఏ ఐటమ్స్ మీదగాని.. వాటి రేట్ల విషయంలోగాని  అనుమానాలుం డక్కర్లేదనిపించింది.  

'సార్! మీలాంటోళ్ళు వెయ్యికి ఒక్కరున్నా చాలు.. మా వ్యాపారం చంకనాకి పోవాల్సిందే! కంపెనీ సరుకు. పరువుతో ముడిపడింది. ఒకసారి దిగింతరువాత  వెనక్కి తగ్గడం కుదరదు కనక సరిపోయింది. అదే నా పర్సనల్ బిజినెస్సయితేనా! అమ్మో!  సరుకు మొత్తం ఎత్తుకుని ఎప్పుడో ఉడాయించుండే వాణ్ణి' అంటూ  మొత్తుకుంటూనే  తన సామాను సర్దుకోసాగాడు. 

 జాండ్రపేటలో ఆగటానికి కాబోలు బండి బాగా స్లో అవుతుండంగా  అడిగాడా సూటువాలా 'నీకీ వ్యాపారంలో ఏ మాత్రం కమీషను గిడుతుందోయ్?' అ

'గిట్టడం కాదండీ! చెప్పాగా! ఇది కమీషను వ్యాపారం. లిపారియా మిల్సు వాళ్ళకి ఏజెంట్లం మేం. సేల్స్ ప్రమోషను చేసే దాన్ని బట్టి ఉంటుందీ గిట్టుబాటెంతనేదీ' అని వేలంపాట కుర్రాడి సమాధానం.

'కమీషనెంతో?'

'ట్వంటీ టు ట్వంటీ ఫైవు మధ్యలో ఉంటుందండీ! సరుకును బట్టి రేటు'

'బాగా గిడుతుందా?'

'జనరల్ గా బాగానే ఉంటుందండీ! ఒక్కో చోటే.. ఇదిగో..ఇలా డల్ గా ఏడుస్తుంటుంది ..' అంటూ సరుకును ఎత్తుకోబోతున్న కుర్రాడిని నా ఎదురుగా కూర్చున్న ఆడమనిషి  ఆపేసింది 'డల్ గా ఉందంటావు. తట్ట పట్టుకుని వెళ్లి పోతావు. ఈ సారు చెప్పింతరువాత నాకు నమ్మకం కుదిరింది. ఆ పాలిస్టర్ బట్ట పాటకు పెట్టబ్బాయ్!.. మా పిలగాడికి ఎప్పట్నుంచో తీసుకుందామనుకుంటున్నా" అని మొదలు పెట్టింది. 

మిగతా ప్యాసింజరర్సూ ఆమెకి వంత పాడడంతో వేలంపాట కుర్రాడికి మళ్ళీ తట్ట కిందకు దింపక తప్పింది కాదు. కానీ ఈ సారి సీను పూర్తిగా రివర్సుగా ఉంది.  ఆడమనిషి కోరుకున్న పాలిష్టరు పీసు రెండొందలకు పాడినా ఆమె సొంతం కాలేదు. పై బెర్తుమీద పడుకోనున్న కుర్రాడెవడో ఇంకో పది రూపాయల్ పై పాట పాడి సొంతం చేసుకున్నాడు.

మొదట్నుంచీ తనకేమీ పట్టనట్లు ఓ మూల పుస్తకం చదువుకంటూ కూర్చోనున్న పాపక్కూడా కిక్కొచ్చినట్లంది.. వాయిల్ క్లాత్ కోసం పోటీపడి మరీ నూటేభైకి దక్కించుకుంది.

కంపార్టుమెంట్లో మూడో వంతు మంది ఏదో ఒక ఐటమ్ చిన్నదో పొన్నదో వేలంపాటలో దక్కించుకున్న వాళ్లే. మిగిలిన వాళ్ల చేతులో కంపెనీ తాలూకు  కాంప్లిమెంటరీలు!

ఎన్నడూ లేనిది నేనే మూడు కాంప్లెమంటరీ గిఫ్టులు.. మా పిల్లదానికని ఓ మంచిరకం ఓణీ బట్ట తీసుకంటేనూ!

వేలంపాటలో సాధించిన వస్తువులు క్యారీబ్యాగులో సర్దుకంటుండంగా బండి చినగంజాం ఫ్లాట్ ఫారంమీదకొచ్చి ఆగింది.  చిన్ననాటి మిత్రుడు మౌళి అనుకోకుండా కనిపించడంతో వాడితో బాతాఖానీలో పడి బెల్ ఎప్పుడు మోగిందో కూడా గమనించలేదు. కదిలే బండిలో హడావుడిగా ఎక్కాల్సి రావడంటో ఎక్కిన బోగీ కూడా ఏదో పట్టించుకోలేదు.

అది ఇందాకటి కంపార్టుమెంటు కాదు. కానీ ఎలాగో ఓ మూల సీటైతే దక్కించుకోగలిగాను.

బండి స్పీడందుకుంది. అమ్మనబ్రోలు  స్టేషను దాటేసరికి కబుర్లలో ఉన్న కంపార్టుమెంటు ఖంగుమంటున్న గొంతుకి ఉలిక్కిపడి అటెంక్షనులోకొచ్చేసింది.

 

'యువర్ అటెన్షన్ ప్లీజ్!..'

'లేడీస్ అండ్ జంటిల్మెన్!.. భాయియో ఔర్ బెహనో!.. అయ్యలారా అమ్మలారా!...'

మరో సారి వేలంపాట! 

ఈసారి వేలంపాట జరుపుతున్నది మూడుపదులు నిండిన ఆ ముచ్చటైన యువకుడు కాదు. పక్క బోగీలో నా పక్కన కూర్చొని బట్టల నాణ్యతను గురించి లెక్చర్లు దంచి అందరిచేత సరుకుని కొనిపించిన 'ది హిందు' న్యూస్ పేపర్ సూటు జెంటిల్మన్! 

అదే హిందూ పేపరు చాటున మొహం దాచుకుని పాట డల్ గా ఉంటే లెక్చర్లు దంచడానికి ఆ మూడు పదుల ముచ్చటైన కుర్రాడు ఇక్కడే ఎక్కడో సుటూ బూటులో నక్కే ఉంటాడు. 

ఆగిపోయిన వేలంపాటకు ఓ ఊపివ్వడానికి పిల్లాడికి పాలిష్టరు బిట్టు కొనాలనుకునే మహాతల్లీ 

ఇక్కడే తన వంతు అభినయం కోసం ఎదురు చూస్తూండాలి నా అనుమానం నిజమైతే!

-కర్లపాలెం హనుమంతరావు


(ఆంధ్రభూమి వార పత్రిక- 02, ఏప్రియల్, 2015 సంచికలో ప్రచురితం)








 

 


ఏది స్వప్నం, ఏది సత్యం? కంటి రెప్పల కింద దాగిన మంత్రనగరి మాయా మర్మం మరి ఏదీ ? - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదకీయం - 06 - 11 - 2011 )

 


ఏది స్వప్నం, ఏది సత్యం?

కంటి రెప్పల కింద దాగిన మంత్రనగరి మాయా మర్మం మరి ఏదీ ? 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 06 - 11 - 2011 ) 


స్వప్నం- మానవాళికి ఓ అందమైన వరం. స్వప్నావస్థ సంఘటనల ఆధారంగా భవిష్యత్తును సూచించే స్వప్నశాస్త్రం వైదిక జ్యోతిష-సంహితలో ఉంది. ఆధ్యాత్మిక దృష్టితో  చూస్తే, స్వప్నం చాలాసార్లు దివ్యసందేశాలను అందచేసే  భవ్యవాణిలా తోస్తుంది. అశోకవనంలో సీతమ్మవారి కాపరి వృద్ధ త్రిజట శ్రీరామ విజయాన్ని ముందుగానే కలలో తిలకించింది- అంటాడు కవి వాల్మీకి. 'స్వప్నాలు వాస్తవాలైతే... వాస్తవాలూ స్వప్నాలంత ఉన్నతంగా ఉంటాయి' అనేది  మాజీ రాష్ట్రపతి రాధాకృష్ణన్ తాత్విక చింతన . నండూరివారి నాయుడుబావ భావించినట్లు 'యెలుతురంతా మేసి యేరు వేసే నెమరే కల'- కూడా కావచ్చునేమో భావ కల్పనా ప్రపంచంలో! మనసైన మనిషి కలలోకి వచ్చి కతలు సెబుతుంటే వులికులికి పడుకుంట 'వూఁ' కొట్టుకోవడం కలకు ఒక ఉత్తేజకరమైన అనుభవంజాత చేసినట్లులేదూ! 'కలలంచున్ శకునంబు లంచు... నిమిషార్థ జీవనములందు బ్రీతిపుట్టించి నా/సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా!' అంటూ ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వరుడంతటివాణ్ని దూసిపెట్టింది, ఇంతవరకు ఎవరికీ ఎంతకూ అంతుపట్టని ఈ వింత కలల ప్రపంచాన్ని ప్రసాదించినందుకే ! సాక్షాత్తు శ్రీరామచంద్రుడే కలలో ప్రత్యక్షమై ఆస్థాన కవయిత్రి మధురవాణిని సూచించేదాకా తన తెలుగు రామాయణాన్ని సంస్కృతీకరించగల సమర్థులు రఘునాథ నాయకుడికి తట్టనే లేదంటే మరేమిటర్థం?! పరమాత్ముడు ఇరు దేవేరులతో కలలో కనిపించి ఎన్నడూ పేరైనా విని ఎరుగని  'నన్నయ్య ఫక్కీ' కావ్యాన్ని తెనిగించే పని కాకునూరి అప్పకవికి అప్పగించడమేమిటి?! అరవ ఆండాళ్ ప్రేమగాథను తుళువు ప్రభువు రాయల చేత తెలుగులో రాయించడానికి శ్రీకాకుళాంధ్ర మహా విష్ణువు ఎంచుకున్నదీ స్వప్న  మార్గమే. విశ్వ సంస్కృతులన్నింటిలో అనాదిగా 'స్వప్న సంసోషణ' ఓ పుణ్యాచారంగా ఊరికే కొనసాగుతూ రాదుగదా!కలలకేదో  విశ్వసనీయ శాస్త్రార్ధం ఉండే ఉండాలిగా! ఏమిటది? 


అందరూ నిదురించే వేళా  ఇల్లు విడిచి వెన్నెల మైదానంలో కురిసే అమృతాన్ని దోసిళ్లతో తాగి రావాలంటే కవి తిలక్ తరహాలో కలల పట్టుకుచ్చులూగే కిరీటం ధరించాలా? మనిషి అంటే మనసు కట్టిన  చర్మపు తొడుగే కదా! ఆ మనసులో అసంకల్పితంగా సాగే భావోద్వేగాలు, అనుభవాల ఐంద్రియ సంవేదనల స్పష్టాస్పష్ట ప్రతిబింబాలే స్వప్నాలని మనోవైజ్ఞానికులు గత  శతాబ్దిలో ఓ  సిద్ధాంతంలేవదీశారు. విడని వాసన పదాలు విరులుగా పరిమళించడమే కలలుచేసే కనికట్టు అంటూ భావకవులు తమ ధోరణిలో బాణీలల్లారు. నిద్రావస్థ అర్ధస్పృహలో మనసు దర్శించే స్వప్నాలకు అర్థాలు విశ్లేషించడం నిజంగా సంక్లిష్ట కళేఅన్నది శాస్త్రజ్ఞుల భావన. మనసు కొలనులో అన్నివేళలా మంచి కుసుమాలే వికసించాలనీ లేదు. వరాహం మీద దిగంబరంగా రోదిస్తూ దక్షిణం దిక్కుగా భర్త నిష్క్రమించడాన్ని దుస్స్వప్నంగా భావించి రామాయణంలో మండోదరి తల్లడిల్లి పోవడం మనకు తెలుసు . దుస్స్వప్న నివారణకు పంచకన్యాది దేవతాస్తోత్రాలను అగ్నిపురాణం సూచిస్తుందేనాడో. సర్పం, ఎనుము, ఆముదం, అగ్ని, అస్తికలు, మురుగునీరు, కారాగారం, వాహనప్రమాదం వంటి స్వప్న దర్శనాలు అశుభ సూచికలని స్వప్నశాస్త్రమో  సిద్ధాంతం చేసింది. పీడకలల వల్ల నిద్రాభంగమైనా పడక దిగకుండా జలసేవనం చేసి నిద్రను కొనసాగించాలని పుష్కరుడు పరశురాముడికి అగ్నిపురాణంలో బోధిస్తాడు. గ్రీకులకు ఏకంగా 'మర్ఫీ' అనే ఒక స్వప్నదేవతే ఉంది. తండ్రి ప్రసాదించిన కలల తొడుగు (డ్రీమ్‌కోట్) ధరించిన జోసెఫ్, ఈజిప్టు రాజుకు రోజూ వచ్చే కలలకు అర్థాలు చెప్పగలుగుతాడు. బైబిల్‌లో బాగా ప్రాచుర్యమైన ఈ స్నప్న వృత్తాంతం ఆధారంగా తయారైన చిత్రం, నాటకం నేటికీ  ఖండఖండాతరాలలో  ఇప్పటికీ అఖండ  ఆదరణీయ కళాఖండo. స్వప్న విచారణలను గురించి ప్రచారంలో ఉన్నదంతా అధికభాగం వట్టి ఊహాగానం అనేది హేతువాదుల వాదం. కలల చరిత్ర నిండా పరచుకుని ఉన్నది అనిర్ధారిత ఊహాజనిత కాల్పనిక భావనల పరంపరే  అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

విజ్ఞానశాస్త్రం ఎంత కట్టుకథలుగా కొట్టిపారేసినా కొన్ని సత్యావిష్కరణలకు స్వప్నాలే ప్రేరణలు కావడం ఓ విచిత్రం. ఐన్‌స్టీన్‌కి సాపేక్ష సిద్ధాంతం ఓ కొండవాలు ప్రయాణంలో పట్టిన కునుకులో తట్టిన రహస్యం. రాబర్ట్ లూయీ 'డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్', ఎడ్గార్ పోల్ ఎన్నో కథానికలకు స్వప్నాలే ప్రేరణలని వాటి కర్తలే స్వయంగా చెప్పుకొన్నారు. దుర్మరణానికి ముందే అబ్రహాం లింకన్ ఆ దారుణాన్ని దుస్స్వప్నంలో దర్శించినట్లు ఓ  కథనం ప్రచారంలో ఉంది. ఏది స్వప్నం, ఏది సత్యం? ఎన్నడూ చూడని సన్నివేశాలు రంగుల కలలుగా అంధులకూ అనుభవం కావడం వెనక మర్మమేమిటి? గుండెకొండల మూలల్లో ఎన్నడో పారేసుకున్న స్మృతుల మూటను అర్ధనిద్రలో మనసు భుజాన వేసుకొని చూపించడానికి రావడమేనా 'కల' అంటే? పగటి కలలు నిజంగానే  పరమ అసత్యాలా? సావిత్రి సత్యవంతుణ్ని పరిణయానికి ముందే స్వప్నంలో సందర్శించి ప్రేమించింది- అంటే సందేహపడకుండా ఉండాలా? ... వద్దా? శిరస్సు పెద్ద ఆకారంలో కలలో కనిపిస్తే నిజంగా శుభకరమేనా? స్వప్నాల సత్యసంధతమీద మొదటినుంచీ మనిషికున్న సందేహాలు సవాలక్ష ! తాళ్ళపాక అన్నమాచార్యులవారికి పదహారో ఏట తిరువేంగడ నాథుడు కలలో కనిపించి రోజుకో సంకీర్తన రాయమని పురమాయించాడని... ఆ కల వచ్చిన వైనాన్ని తేదీతోసహా తాళపత్రాల్లో సైతం నమోదు చేశారు గదా! కలలన్నీ కల్లలేనని మరి నమ్మడం ఎలా?! స్వప్నశాస్త్రం (ఓనెరాలజీ) ఈ తరహా కలల చిక్కుముడులను విప్పే పనిలో పడిందిట ఇప్పుడు . జర్మనీ మాక్స్ ప్లాంక్ మనస్తత్వవేత్తలు ఒక ప్రత్యేక అయస్కాంత యంత్ర సాయంతో కలకనే మనిషి మెదడు వివిధ భాగాల్లో జరిగే రసాయనిక మార్పులను అధ్యయనం చేస్తున్నారు. కలల గుట్టు విప్పే రోజులు సమీపంలోనే ఉన్నాయని, మనిషి మానసిక రోగచికిత్సకు ఈ పరిశోధనలు ఓ మైలురాయి కానున్నాయని శాస్త్రవేత్తల బృందనాయకుడు చెబుతున్నారు. కంటిరెప్పల వెనక నుంచీ ఉబికి వచ్చే ఈ మంత్రనగరి మాయామర్మం మనిషి ప్రగతికి మరో అంచెగా మారనుండటం మంచి పరిణామమేగా!

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయం - 06 - 11 - 2011 ) 

దాతలే విధాతలు -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు, సంపాదకీయం , 11 -10 -2009)

 


 

 


కల్పాంతాన ప్రళయం సంభవించి సర్వం జలమయమయి ద్వాదశ సూర్యులూ కొత్త చంద్రులూ ఉదయించడాన్ని మత్స్యపురాణం మహాద్భుతంగా వర్ణించింది. యోగనిద్ర నుంచి లేచిన పరబ్రహ్మ పునఃసృష్టి కోసం  జలమధనం చేసి రెండు బుడగలను సృష్టిస్తే అందులో ఒకటి ఆకాశం, రెండోది భూమి అయింది! ఎన్ని అవాంతరాలొచ్చి  పడినా సృష్టి క్రమం ఆగదనే ఆశావాదం వరకు ఈ కథ నీతిపాఠం గ్రహణీయం. వేళకు వర్షాలు పడి పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ఏటా గోపాలురు ఇంద్రపూజ చేసేవారు మహా భాగవత కథాక్రమానుసారం. ఆ యేడు కృష్ణయ్య మాట విని గోవర్ధనగిరిని కొలిచినందుకు దేవరాజు ఆగ్రహించి వ్రేపల్లె పైన విపరీతమైన వానలు కురిపించాడు. అప్పుడూ ఇప్పుడు మొన్న మన రాష్ట్రంలోని ఆరుజిల్లాల జనం 'నిడు జడిదాకి యెందు జననేరక యాకట గ్రుస్సి'నట్లు అల్లాడారని ఎర్రన హరివంశంలో వర్ణిస్తాడు. 'యింతలోన జగముల్‌ పోజేసెనో, ధాతయెయ్యది, దిక్కెక్కడ, సొత్తు యెవ్విధమునం బ్రాణంబు రక్షించుకోలొదవున్‌... దైవమ!' అంటూ సర్వం కోల్పోయి నిర్వాసితులైన ఆబాలగోపాలాన్ని ఆ బాలగోపాలుడు గిరినెత్తి ఉద్ధరించినట్లు- ఇప్పుడూ మంచిగంధం వంటి మనసున్న మారాజులు ఆదుకునేందుకు ముందుకు దూసుకొస్తున్నారు. హర్షణీయమే, కానీ అది కాదు ఇప్పటి అసలు సమస్య. 'అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త దురితోపశమనం, పావనం, శుభకరమ్‌' అని మనం కొలిచే గంగమ్మ ఇంతగా గంగవెర్రులెత్తడానికి వెనకున్న అసలు కారణం ఏమిటనేదే సందేహం. అత్త ఏదో నింద వేసిందని అలిగి 'వనములను దాటి/ వెన్నెల బయలుదాటి/ తోగులను దాటి/ దుర్గమాద్రులను దాటి/ పులుల యడుగుల నడుగుల కలుపుకొనుచు పథాంతరాల మీదికి వరదలుగా పారింద'ని చెప్పుకొని సర్దుకుపోవటానికి ఇదేమీ విశ్వనాథవారి 'కిన్నెరసాని' కథాకాలక్షేపమేమీ కాదు కదా! నిక్షేపంలా సాగవవలసిన మానవ జీవన మహాకావ్యం కదా!

 

వరద అంటే వారం వర్జ్యం చూసుకుని వచ్చి పలకరించి పోయే చుట్టం కాదు. కరకట్ట తెగిందంటే బడినీ, గుడినీ,  గొడ్డూ గోదనూ, గడ్డివాములనూ, గాదె కింద దాచిన తిండి గింజనూ, బావి మడుగులో జల ఊటనూ, పడుకునే మంచాలనూ, తిని కడుగుకునే  కంచాలనూ, ఏమరుపాటుతో ఉంటే చంటిపాపలతో సహా, మూడు కాళ్ళ ముసలి తాతాఅవ్వలను సైతం  పాపభీతి లేకుండా ముంచేసుకుపోయే ఉద్ధృతం. బందిపోటుకు మించి నీటిపోటు మనలను  మనింటి పైకప్పుల మీదకే  గెంటేసే ఉత్పాతం. సొంతవూరి పొలిమేరల నుంచే మనలను నిరంకుంశంగా తరిమేసే నియంత వరద. కంటి ముందే ఇంటిగోడలు నీటిలో పడి కరిగిపోతుంటే, ఒంటి రక్తం చెమటగా మార్చి పెంచిన పంట చేను ఏడడుగుల నీటి అడుగున ఎక్కడుందో జాడ తెలియని దుర్భర దుస్థితి భయానకం!   'చుట్టూతా ఉప్పు సముద్రం.. మనస్సులోనూ దుఃఖసముద్రం.. జీవనాన్నే మింగేసే జీవనది.. అక్కడెక్కడో ఆనకట్టలు పగిలాయో లేదో గానీ ముందిక్కడ మనిషి గుండె ముక్కలైంది' అంటాడు ఓ ఆధునిక కవి. ఆ ఆవేదన వంద శాతం వాస్తవం. చంటిబిడ్డతో ఇంటి పైకప్పు మీదికెక్కి కూర్చున్న ఇంటి ఇల్లాలు, మిట్టమీద కట్టుబట్టలతో నిలువు గుడ్లు వేసుకుని నిలబడ్డ సంసారి, నడిరేవులో తిరగబడ్డ పడవ కొయ్యను పట్టుకు వేలాడే గంగపుత్రుడు, ప్రకృతి పిశాచి నిలువుదోపిడికి నిలువుటద్దంగా నిలబడిన ఆ వ్యధార్తుల అందరి గుండెల్లోనూ ఇప్పుడు వినిపించేవి ఒకే తరహా ఉప్పెన మరణ మృదంగం మోగించే చప్పుడులు. ఈ సర్వనాశనానికి అసలైన కారణం ఒక్కటే! చెకొవ్‌ చెప్పినట్లు 'విచక్షణా, సృజనా ఉండీ మనిషి ప్రకృతిని వికృతం చేయబూనిన వికార మనస్తత్వమే'! విపత్తు దాపురించిన తరువాతయినా కనీస మానవతా ధర్మంగా  ఇప్పుడు ఔదార్యం పోటెత్తాలి. లోకంలో మనుషులు రకరకాలుగా ఉంటారంటారు. రెండు చేతులతో దోచుకుని దాచుకునేవారు,  అట్లే దాచుకున్నదాన్ని రెండు చేతులా దోచిపెట్టేవారూ. దాచింది దోచిపెట్టేవారి అవసరమే ఇప్పుడెక్కువ బాధిత హృదయాలకు రవంతైనా ఊతం!

 

దాన కర్మ అమరత్వ సిద్ధికి సొపానం అనేది రుగ్వేద వాదం. దీర్ఘాయుష్షు కోసం మైకేల్‌ జాక్సన్‌ కు మల్లే ప్రత్యేకంగా ప్రాణవాయువు గది కట్టించనక్కర్లేదు. కుబేరుడు బిల్‌గేట్స్‌ మాదిరి బిలియస్న్ ధారపోసి బీదా బిక్కీని సేవించుకునే  స్తోమతు అందరికీ ఉండబోదు. దిక్కూ మొక్కూ లేని దీనత్వంలో పడినవాడి  డొక్క నిండుగా ఒక్క పూటకు సరిపడే తిండి అందించినా  చాలు- భోక్త కడుపు నిండిన త్రేనుపే 'దీర్ఘాయుష్మాన్‌ భవ!' అనే దీవెనకు సమానం. వంద ఉంటే పది, పది ఉంటే ఒక రూపాయి! అదీ లేని నిస్సహాయ పరిస్థితిలో అయినా సరే, ఆదరంగా రవ్వంత చిరునవ్వు .. సానుభూతి నిండిన ఏ చర్యయినా బాధల్లో ఉన్నజీవికి పెద్ద ఒదార్పే! సమయానికి అవసరమనిపించే, తాహతకు అనుకూలించే చేయూత చాలు! ఇచ్చుటలో ఉన్న ఆ హాయి ఎంతటి వెచ్చదనం ఇస్తుందో తెలిసొచ్చి తృప్తినిస్తుంది.   ప్రేమ  దేశ కాలాలకు అతీతంగా  తీయగా మగ్గిన పండు. ప్రయత్నిస్తే ఎవరికయినా సులువుగా అందుబాటుకు రావచ్చు. ఎంతమందికైనా పంచవచ్చు. 'పంచేకొద్దీ పెరిగేదీ, పంచదారకన్నా మధురమైనదీ- అవసరానికెవరినైనా ఆదుకోవాలనుకునే ఉదారత అనే సద్భావనే' అంటారు మదర్‌ థెరెసా. ఎవరికీ ఏమీ కాకుండా పెరిగి వెళ్లిపోవటంకన్నా పెనువిషాదం మనిషి జీవితంలో మరేదీ ఉండదు కదా! దానంవల్ల ఎవడూ దరిద్రుడు కాడు. పర్సు ఖాళీ అయినకొద్దీ మనసు ఆనందంతో నిడిపోతుంది. నీటిని దాచుకునే సముద్రం కన్నా దానం చేసే మేఘాలే ఎప్పుడూ ఎత్తులో ఉండేది. దానగుణం అణువణువునా పుచే వృక్షం పండ్లు ఇవ్వలేని వేసవిలోనూ నీడనయినా ఇచ్చి తృప్తిపడుతుంది. స్వయం ప్రకాశితం కాకపోయినా  సూర్యకిరణాలను వెన్నెలలాగే పంచేది కనకనే చంద్రుడిని అందరూ ప్రేమగా చందమామా అని పిలుచుకునేది. అడవిలో, యుద్ధంలో, నిద్రలో, నీటిలో, నిప్పు పైన, ఒంటరిగా ఉన్న వేళ, ఒంటిపై స్పృహలేనప్పుడు కూడా చేసుకున్న పుణ్యమే జీవిని రక్షిస్తుందని అదర్వణవేదం హితవు చెబుతుంది. పరోపకారానికి మించిన పుణ్యం లేదంటుంది పంచతంత్రం కూడా. ఈ చేత్తో సంపాదించి ఆ చేత్తో ఇవ్వడానికేగా దేవుడు మనకు రెండు చేతులు ఇచ్చింది! ఆలోచించండి!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు, సంపాదకీయం , 11 -10 -2009)

కని పెంచే విధాతలు - ఈనాడు సంపాదకీయం -కర్లపాలెం హనుమంతరావు

 


జన్మదాతలను దైవపీఠంపై ప్రతిష్ఠించిన మహోన్నత సంస్కృతి మనది. తమకు దేహాన్నిచ్చి, రూపం దిద్ది, ప్రాణం పోసి, చలనం కలిగించిన తల్లిదండ్రులను 'మాతృదేవోభవ.. పితృదేవోభవ' అన్న మూలమంత్రంతో అర్చించే మహత్తర సంప్రదాయానికి వారసులు ఈ గడ్డ బిడ్డలు! పిల్లలు అమ్మానాన్నల అనురాగ ఫలాలు. ఆశాదీపాలు. కంటివెలుగులు. శిశుదశలో 'అంగరక్ష, ఆదిరక్ష, దీపరక్ష, చిన్ని నా బుజ్జాయికి శ్రీరామరక్ష'- అంటూ కన్నతల్లి నోట జాలువారిన జోలపాట.. చిరుత ప్రాయాననే కాదు, జీవనయాన పర్యంతమూ వ్యక్తిని ఆశీర్వదించే ఆరవ వేదం. నాన్నారు అదిలించే వేళ, ధీమాగా దాక్కోవడానికి అమ్మ అందించే చీర కొంగుచాటు పాపడికి చిలిపి రక్ష! అమ్మ గసిరే సమయాన, లెక్కలేనితనంతో లేడిపిల్లలా చెంగున వచ్చి వాలే గుడిగా మలచిన నాన్నారి ఒడి చిన్నారికి గడుసు రక్ష! పరాయి పిల్లల కంటే తమ కలల పంటలే జనం మెచ్చు బిడ్డలవాలని ప్రతి తల్లీ తండ్రీ గర్వించడం లోకంలో సహజం. 'వీధినెందరు వున్న విసరదే గాలి- రచ్చనెందరు వున్న రాదమ్మ వాన/ చిన్న నా అబ్బాయి వీధి నిలుచుంటె- మొగిలిపువ్వుల గాలి, ముత్యాల వాన' అని మురిసిపోయే అమ్మ గళంతో అబ్బాయి తండ్రీ శ్రుతి కలపడం తెలుగింట వినిపించు ముద్దూ మురిపాలు. బుగ్గలు సొట్టపడేలా తమ అమ్మణ్ని 'కిలకిలా నవ్వితే కలువల్లు పూసె- కలువరేకులేమొ కలికి చూపుల్లు' అనీ అయ్యా అమ్మా పరవశించడాలు తెలుగు లోగిళ్లలొ కనిపించు ముచ్చట కలాపాలు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని మణిమాణిక్యాలతో అభిషేకించ లేకపోతేనేమీ.. వాటి కాంతులు చిన్నబోయే మిలమిలల మల్లెపువ్వుల్లకు మల్లే  చూసుకుంటారు. పసి బిడ్డలకు వారు పట్టు పరుపులు సమకూర్చలేకపోతేనేమి, వాటి మెత్తందనాలు దిగదుడుపు అనిపించు తమ రెక్కలను తెరచి వారికి పక్కలుగా పరుచగలరు. పసికూనగా ఇంట చిన్నారి బుడిబుడి అడుగులు వేసే వేళ, ఆసరాగా చేతులను చాచి తూలకుండా కాచే  అమ్మానాన్నలది అనిర్వచనీయమైన ఆనందం. ఎదిగి వచ్చే వరకు, పిల్లల వడివడి నడకలకు ఆలంబనగా భుజాలు దండెలుగా  మదుపు పెట్టేది అమ్మానాన్నలు కాక మరింకెవ్వరీ లోకంలో?

 

పొత్తిళ్లనాడే కాదు, పొట్లకాయంత పొడుగు సాగినా సొంత సంతానం కన్నవారి కళ్లకు పసికందుకాయలే. పెరిగి పెద్దయి పెళ్లిళ్త్లె మనవల్ని మనవరాళ్లను తమకు కానుక చేసిన వయసులోనూ తమ బిడ్డలు తల్లిదండ్రులకు చిన్నపిల్లలే. అందుకే- పెద్దవాళ్లయ్యాకా వాళ్లు కట్టెదుటే కనబడుతుంటే వారికో తృప్తి. కార్యార్థులై వెళ్లిన పిల్లలు గూటికి తిరిగి వచ్చిన క్షణాన వారికో సంతుష్టి. అలా రానివేళ వారి మదిని తొలుస్తూ ఏదో వెలితి. తాను ఒక్క నిమిషం కనబడకపోతేనే, ఊరంతా వెదికే తండ్రి, ఏ వేళా తనను ఇల్లు కదలనీయకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లి- హిమాలయాల్లో చిక్కుబడిన తన జాడ తెలియక ఎంత దిగులు పడుతున్నారోనని ప్రవరుడు తల్లడిల్లుతాడు. ఇంటికి వెళ్లే దారి చూపమని వరూథినిని అభ్యర్థిస్తూ- 'జననీజనకుల్‌ కడువృద్ధులు/ ఆకటన్‌ సోలుచునెదురు సూచుచునుండెదరు' అని మొరపెట్టుకుంటాడు 'మనుచరిత్ర' కావ్యంలో. ప్రవరుడి తల్లిదండ్రుల ఆ ఆర్తి- బిడ్డల క్షేమాన్నే అనుక్షణం కాంక్షించే ప్రతి అమ్మ, అయ్య తపనలోనూ సాక్షాత్కరిస్తుంది. ఏ బిడ్డలకైనా అంతలా తపించేవారి కడుపుపంటగా పుట్టడంకంటే మరో భాగ్యం ఉంటుందా? మనిషి చేసే పుణ్యాల జాబితా ఎంత పొడవున్నా, ఆత్రేయలా- 'భువిని మా అమ్మ కడుపున పుట్టుటొకటె/నేను చేసిన పుణ్యము నేటివరకు' అని పలవరించడంకన్నా మహాపుణ్యం మరొకటి ఉంటుందా? 'సకల దురితహరము, సర్వసంపత్కరము/మాతృ పాదపద్మ మకరంద మాధుర్య సేవనమ్ము, దివ్యజీవనమ్ము' అన్నది మనసు కవి సూక్తి.

 

అలసిన రెక్కలతో జీవిత చరమాంకంలో ఉన్న అమ్మానాన్నల్ని కడుపున దాచుకుని కాపాడుకుంటున్న బిడ్డలున్నట్లే- ఆఖరి మజిలీలో విశ్రమించి 'అటు'వైపు ఒత్తిగిలే రోజుల్ని లెక్కపెట్టుకొంటున్న కన్నవారిని కాలదన్నుతున్న సుపుత్రులూ ఉన్నారు! బాల్యంలో తమ ఆకలి ఎరిగి, ఆయుష్యవర్ధనంలాంటి అన్నప్రసాదమిడిన అమ్మకు, అయ్యకు పచ్చడి మెతుకులైౖనా ప్రేమానురాగాలతో పెడుతున్న పిల్లలున్నట్లే- ఆస్తులతోపాటు అమ్మానాన్నల్నీ పంచుకుని వారి కడుపుకింత రాల్చడంతోనే తమ బాధ్యత తీరిపోయినట్లుగా చేతులు దులిపేసుకుంటున్న 'పుత్రరత్నాలూ' ఉన్నారు! ఓ కవయిత్రి అన్నట్లు 'కడుపున కన్నవాళ్లు కసురుకున్నందుకు/ పేగుచించుకు పుట్టినవాళ్లు ప్రేమభిక్ష రాల్చనందుకు/ ఎదిగిన బిడ్డల మధ్య ఏకాకి అయినందుకు...' ఎందరో అమ్మా నాన్నలు దిగులుచెందుతూ, దీనులవుతూ కుమిలిపోతున్న దుర్భర దృశ్యాలెన్నో ఈ సమాజంలో! గర్భస్థ శిశువులుగా ఉన్నప్పుడు తాము కాలదన్నినా ప్రాణరక్తాన్ని పణంగా పెట్టి తమకు జన్మనిచ్చిన తల్లి ముదుసలి అయినవేళ- కడుపులో పెట్టుకొని కాపాడాల్సిన తనయులే ఆమెను బతికి ఉండగానే కాటికి చేర్చారు ఆమధ్య! మొన్నటికి మొన్న- వేరుపడిన ఇద్దరు కొడుకులూ తనను నిరాదరించడాన్ని ఓ నాన్న మనసు తట్టుకోలేకపోయింది. 'మీరైనా కలిసిమెలిసి ఉండండర్రా' అన్న తన మొరను- ఎదిగిన బిడ్డలు తూష్ణీకరించారన్న వేదనతో ఆ తండ్రి తన మంచాన్నే చితిగా పేర్చుకున్నాడు. తనకు తానే నిప్పంటించుకొని సజీవంగా దహనమయ్యాడు. ఇటువంటి సంఘటనలను తలచుకుంటుంటే- కుటుంబ అనుబంధాల్ని, పేగుబంధాల్ని, రక్తపాశాల్ని ఆర్థిక అంశాలే శాసిస్తూ- తల్లిదండ్రులు, బిడ్డల నడుమ చెక్కుచెదరకుండా ఉండాల్సిన సంబంధాలకు, ప్రేమలకు మరణశాసనం రాస్తున్న రోజులు దాపురించాయేమోననిపిస్తుంది. గుండెల్ని కలుక్కుమనిపిస్తుంది. తడి ఆరని గుండెల్లో ఎంత విషాద వృష్టి!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు, సంపాదకీయం, 09 -05 -2010)

______________________________

సర్వేజీవా సుఖినోభవంతు - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు సంపాదకీయం - 14 -08-2011 )

 సర్వేజీవా సుఖినోభవంతు

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు సంపాదకీయం - 14 -08-2011 ) 


జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం- ఇన్ని దశలు దాటి రాకముందు జంతువే మనిషి మూలరూపం. విశ్వ సంస్కృతులు జంతు తతులను విభిన్న కాలాల్లో వేర్వేరు దృక్పథాలతో చూసినా, భారతీయతది మాత్రం సృష్టి ప్రారంభంనుంచి ఒకే విధానం... దైవభావం. ఆదిదేవుడు పశుపతి. స్థితిమూర్తి శేషశయనుడు. సృష్టికర్త హంసవాహనుడు. సోమకాసురుని వాడి రెక్కలచే చీల్చి చెండాడి వేదరాశిని కాచింది మత్స్యరూపమైతే, క్షీరసాగర మథనంలో మందరగిరి కిందకు జారిపోయిన వేళ మూపు నడ్డుపెట్టి సురాసుర కార్యానికి సాయంపట్టింది కూర్మమూర్తి. ముక్కుతిమ్మన పారిజాతాపహరణంలో వర్ణించినట్లు 'అజాండ కర్పరము బీటలు వారగ మేను పెంచి మహీ మహిళా లలామను గొమ్ము కొన దగిల్చి' నీటినుంచి యెత్తినది వరాహ మూర్తి. హరి వైరంతో అరాచకం చేసే హిరణ్యకశిపుని వధాయజ్ఞం నిర్విఘ్న నిర్వహణకు హరి ఎత్తింది అర నరావతారం. 'కుటిల నఖాగ్ర కుంచికల'తో ధర్మకార్యం పూర్తిచేసింది మిగతా సగం మృగావతారం! భగవంతుడెత్తిన ఆ నృసింహావతారమే నరుడికీ మృగానికీ మధ్యగల బలమైన బంధానికి తిరుగులేని ఉదాహరణ. సీతాన్వేషణలో ఉన్న రాముడికి ప్రథమంగా సమాచారం అందించింది జటాయువు. స్నేహహస్తం చాచిన సుగ్రీవుడు, బంటుభావంతో సేవించిన ఆంజనేయుడు, సేతునిర్మాణం చేయించిన నీలుడు- చివరికి అల్పజీవి అయినా అనల్ప భక్తితో సాయానికొచ్చిన ఉడుత... అంతా జంతుసంతతే. విజ్ఞత, గ్రహణ శీలత, సున్నితత్వం, దయ, ఓర్పు, ధైర్యం, దూరదృష్టి, సహానుభూతి వంటి సద్గుణ సంపదలే దైవీయ భావనలనుకుంటే- పశుపక్షి కీటక సముదాయాలను మించిన దేవతామూర్తులు నేలా నింగీ నీటా మనిషికి మరేవీ తారసపడవు.


జంతుజాలాల్లోని ఈ విశిష్టతలవల్లే భారతీయులు చెట్టుమీది పిట్టనీ, పుట్టలోని పామునీ దేవతా స్వరూపాలుగా సంభావించి కొలిచేది. ఆవును సాక్షాత్ గోమాత స్వరూపంగా కరుణశ్రీ వంటి కవులు భావించి కీర్తించింది ఈ దైవీయ భావనతోనే. జాంబ పురాణం ప్రకారం అనంత కాలాల కిందటే జన్మించిన మూలపురుషుడు జాంబవంతుడు. కన్నబిడ్డ డొక్కలను కొలిమిగా, చర్మాన్ని తిత్తిగా, హస్తాలను పట్టుతెరలుగా, బొటనవేళ్లను ఉలులుగా మలచి విశ్వకర్మకే పరికరాలను సమకూర్చిన నిపుణుడు ఆయన. భూదేవికి వరాహపురాణం వినిపించిన మేధావి ఆదివరాహమూర్తి. సామవేదాన్ని గానంగా వినిపించిన మహాముని శుకుడు. భోజరాజీయంలోని గోవు అభిజ్ఞాన శాకుంతలంలోని కణ్వమహర్షితో సమానమైన ప్రతిభా విశేషాలతో తన చిన్నిదూడకు సుద్దులు చెబుతుంది. రఘునాథ నాయకుడి 'నలచరిత్ర' హంస కథానాయకుడి చేతజిక్కినప్పుడు చెప్పే 'సంసార ధర్మాలు' పండితుల పలుకులకు తీసిపోనివి. నలదమయంతుల మధ్య రాయబారం నడిపి వారి ప్రేమను పండించిన పెళ్ళిపెద్ద అది. శృంగారం మదన శివాలు తొక్కి నాయిక పరకీయగ మారే ప్రమాదాన్ని గ్రహించి రాత్రికో మడతపేచీ కథ చొప్పున చెప్పుకొస్తూ మగడు ఇల్లు చేరినదాకా ఇంటి పరువును, ఇంతి పరువును గుట్టుగా కాపాడిన చతుర, కదిరీపతి 'శుకసప్తతి' చిలుక. రాబర్ట్ బ్రూస్ వంటి మహారాజుకే పాఠాలు చెప్పిన సాలెపురుగులోని యంత్రరహిత నూలు నిర్మాణ కౌశలం అద్భుతం. 'ఈశ్వరశక్తి నీ కడుపులోనే లీలమై యుండునో' అంటూ జాషువా వంటి మహాకవుల మన్ననలందుకున్న జంతుజాలాల విశేషాలు ఎంత చెప్పుకొన్నా సశేషాలే!


మనిషి తన తోటి మనిషిని చిన్నబుచ్చడానికి జంతువులతో పోల్చడం ఎంతవరకు సమంజసం? 'బూడిద బుంగవై యొడలు పొడిమి దప్పి మొగంబు వెల్లనై/ వాడల వాడలం దిరిగి వచ్చెడు వారలు చొచ్చొచోయనన్/ గోడల గొందులందొదిగి కూయుచు నుండెడు' వారిని శ్రీనాథుడంతటి మహా పండితుడు గాడిదలని తూలనాడటం తగునా? పిల్లిమీద, ఎలుకమీద పెట్టి తిట్టే అన్యాపదేశాలు సాహిత్యంలో అలంకారాలు- అన్నంత వరకైతే సరిపుచ్చుకోవచ్చు. కానీ, చిన్నజీవులపట్ల పెద్దమనసు కలిగి ఉండటం బుద్ధిమంతుల లక్షణం. తీయని పదాల రామా రామా యటంచు/ తీయ తీయగా రాగాలు తీయుచున్న/ కమ్మకైతల క్రొమ్మావి కొమ్మమీది' ఆదికవి వాల్మీకిని మనం 'కోకిలస్వామి'గా కొలుచుకుంటున్నాం. కర్ణాటక రాజ్యాధిపతులు ఒకప్పుడు 'ధరణీ వరాహ'మనే బిరుదును గొప్ప గౌరవంగా ధరించేవారు. నృత్య విశేషాలను మయూర భంగిమలతోను, చురుకు వేగాన్ని అశ్వతేజంతోను, సునిశితమైన వినికిడిని పాము చెవులతోను, సూక్ష్మదృష్టిని విహంగవీక్షణంతోను సరిపోల్చుకొని సంబరపడే మనిషి సాటి జీవాన్ని అల్పదృష్టితో చూడటం సృష్టిదోషం. విష్ణుశర్మ పంచతంత్రంలో జంతుపాత్రలు అందించే నీతిచంద్రికలు మనిషి మనసులో ముసిరి ఉన్న చీకట్లను పారదోలేవి. విశ్వాసానికి శ్వపతి(కుక్క), శుచి-శుభ్రతలకు మార్జాలం, బృందస్ఫూర్తికి పిపీలక సందోహం, ఐక్యతకు కాకిమూక, సమానత్వ భావనకు వానరజాతి... మనసు తెరచుకుని ఉండాలేగానీ క్రిమికీటకాలనుంచి పశుపక్ష్యాదులదాకా సర్వజీవావళి మనిషి పాలిట పరమ గురువులే. సాధు హృదయంతో చేరదీయడమొక్కటే మనం చేయవలసిన సత్కార్యం. మైమీ విశ్వవిద్యాలయం, సెయింట్ లూయీ విశ్వవిద్యాలయం జంతువులను పెంచి పోషించేవారిమీద చేసిన ప్రయోగాల ఫలితం ప్రకారం- అది మానవ జాతికే ప్రయోజనకరం. పెంపుడు జంతువుల యజమానుల్లో ఆత్మవిశ్వాసం, ఆరోగ్యవంతమైన శరీరం, కలుపుగోలుతనం, సామాజిక స్పృహ, నిర్భయత్వం- జంతుజాలాలకు దూరంగా ఉండేవారిలోకన్నా ఇరవైశాతం అధికంగా ఉంటాయని పరిశోధన బృంద నాయకుడు అలెన్ ఆర్ మెక్కానిల్ చెబుతున్నారు. ఆసుపత్రులకు దూరంగా ఉండాలంటే సాటి జీవాలకు చేరువ కావడమే దగ్గరి దారి!

- కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు సంపాదకీయం- 14 - 08 - 2011 )

ఎన్నికల వేళా కుంభమేళా - వ్యాసం

 

ఎన్నికల వేళా  కుంభమేళా -  వ్యాసం

-కర్లపాలెం హనుమంతరావు

మహమ్మారి కరోనాతో మొన్నటి దాకా మనం  పట్టుదలతో చేస్తూ వచ్చిన యుద్ధం కాస్తా కుంభమేళా మునకలతో, బెంగాల్ తాలూకు ఎన్నికలతో పుటిక్కుమని గంగలో కొట్టుకుపోయింది.

ఎంతో సంయమనంతో నియమ నిబంధనలన్నీ పాటించి అణిచివుంచాం అనుకున్న కరోనా వైరస్ కాస్తా కుంభమేళా లాంటి   భారీ ధార్మిక కార్మక్రమం సందు చూసుకుని మరింత విజృంభించేసింది. ముహూర్తం కన్నా ముందే వచ్చిపడ్డ కుంభమేళా సందర్భంగా.. ఏ శాస్త్రం లేదు.. చట్టుబండలూ లేదు.. వైద్యుల జాగ్రత్తలతో సహా సర్వానికి ‘పచ్చి’ కొట్టేసి.. రెచ్చిపోతోంది కరోనా వైరస్! 

తొందర పడి కోయిల ముందే కూసిన చందంగా అరకొర దశల్లోనే మనకు మనమే విశ్వవిజేతలమంటూ  బోరవిరుచుకొన్నాంగా! విస్తుపోవడమే చివరికిప్పుడు మిగిలిపోయింది! ఛాతీ వెడల్పు ప్రభుత్వాలిచ్చిన బేఫర్వా ప్రకటనలతో జనం మదిలో  భయమనేదే లేకుండాపోబట్టే.. ప్రస్తుత దారుణ పరిస్థితి

పాత పోరాట అనుభవాలేవీ ఇప్పుడు పైసాకు పనికిరాకుండా పోయాయి. అదనంగా ప్రాణవాయువు కరువొకటి వంటింట్లో పొగలాగా! ఊహించని రేంజిలో కశ్మీరం నుంచి.. కన్యాకుమారం వరకు అంతటా  ఉక్కిరి బిక్కిరి! ఇంత విశాలదేశం ఒక్కసారిగా నేతాలేమి అనుభవంతో అల్లాడడం ఇదే మొదటిసారి. నేతాలేమి దశలో మరి నేతలు ఏమి చేస్తున్నారయ్యా అని పరిశీలిస్తే..   ప్రపంచం విస్తుపోయే కొత్త విషయాలు చాలా బైటపడుతున్నాయ్! ఇట్లాంటి నేతలను ఎన్నుకోదానికి కోట్లు కోట్లు ప్రజాధనం పోసి మనం బోలెడంత సమయం వృథా చేసుకుంటున్నది! అన్న పశ్చాత్తాపం కలక్కపోతే  ఈ ప్రజాస్వామిక దేశాన్ని ఇహ ఏ దేవుడూ కాపాడలేడు!

పడమటి బంగాళం మీదకు పదే పదే ఎన్నికల దాడులకు ఇదా వేళ? సామాజిక దూరం అక్కర మరింత ఎక్కువైన తరుణంలో సామూహిక జన సందోహంతో ఎన్నికల జాతర్లా? నిజానికి ఇప్పుడు బంగాళంలో  జరిపించింది అర్థ కుంభమేళా! మత పార్టీ రాష్ట్ర ఎన్నికల కక్కుర్తికి అదే మహా కుంభమేళలా మారికూర్చుంది!

 

మతం పట్ల ఏ దేశంలో అయినా మామూలు మనిషికుండే మంకుపట్టు మామూలుగా ఉండదు.  ధార్మిక భావోద్వేగాలు రెచ్చగొడితే దాని ధాటికి ఏ శాస్త్రీయ సత్యమూ దీటుగా నిలబడ్డం ఉండదు. మూక మనస్తత్వం మీద మాస్టర్స్ డిగ్రీ చేసిన ఒకానొక మితవాద రాజకీయ పక్షానిదే ప్రస్తుతం జరుగుతున్న హతకాండ పాపమంతా!

చలనచిత్ర సంచలన దర్శకుడు రామ్ గోపాల వర్మ నర్మగర్భ వ్యాఖ్య ఈ సందర్భానికి చక్కగా సరిపోతుంది. 17 లక్షల మంది కోవిడ్ బాధితులకు టీకా ఇప్పించేందుకు ముంబయ్ కి పట్టిన సమయం ఆరు వారాలయితే.. 35 లక్షల మంది  ధార్మిక భక్తులను గంగలో ముంచడాంకి బెంగాలుకు పట్టిన సమయం కేవలం 24 గంటలు.  మరో జన్మ ముందు ప్రస్తుతమున్న జన్మ అప్రస్తుమనుకునే  భక్తులు దండిగా ఉండే దేశం కాబట్టే ఎన్నికల వేళ ఎప్పుడొచ్చినా ఏ  కుంభమేళాలో భారీగా జరిగే దృశ్యాలు కనిపించడం!  దేశం దిశ ఏటు తిరిగిందో గమనిస్తే నిజంగా వణుకుపుడుతుంది.

పబ్లిక్ కన్నా వైరస్సే వైజర్! వ్యవస్థ లోపాలేమిటో దానికి బాగా తెలుసు! అందుకే ఐదేళ్ల కోసారి వచ్చేవే అయినా ఎన్నికల తంతుకు తన వంతు టచప్ లా ఇచ్చింది.. ప్రపంచం విస్తుపోయేలా చేసింది!

ఎన్నికలు మంకు  కుస్తీలు పట్టే గోదాలాయ! ఆ కుస్తీలలో  మోదీని మించిన వస్తాదు లేనుకునే మూఢులకు  కరోనా భూతం ఇప్పటికైనా కళ్లు తెరిపించినట్లేనా?

కరోనా మహమ్మారేమీ బెంగాల్ సి.యం మమతా బెనర్జీ కాదు. అవినీతి కేసులకు అదిరిపోడానికి కోవిడేమీ ప్రతిపక్షంలో లేదు.  లాలూచీ రాజకీయాలకు లొంగిపోడానికి వైరస్సులకేమీ అధికార కాంక్షలేదు. చీల్చి బలహీనపరచాలన్నా కరోనా కంటికెన్నడూ కనిపించేది కాదు.  అబద్ధాలను మాత్రమే  నిజమని నమ్మే  ఓటరు అమాయకత్వానికి వైరస్సులో చోటు  లేదు. జనం సొమ్ముతో ఎంత స్థాయి పెంచుకున్నా ఏ కరోనా కణమూ పట్టించుకోదు. గాలి మాటలు తరహా ఎన్ని  ఆరితేరిన వ్యూహాలతో కాలు దువ్వినా వెనక్కు తగ్గక పోగా.. అందుకే రెండో దశంటూ రెట్టించిన కొత్త ఎత్తుగడలతో చివరకు మహా వస్తాదు మోదీని ఎత్తికుదేసింది కరోనా వైరస్!  

ప్రజాస్వామిక దేశం మనది. అధికారం అప్పగించే బాధ్యత  జన సమూహానిది. అందుకు కావలసింది మంచీ చెడూ తర్కించుకునే బుద్ధి.  ఆకర్షణ తంత్ర్రాలకు లోబడితే సాధించుకున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు హుళక్కి అయినట్లే!  భవిష్యత్తు మీద ప్రధానంగా దృష్టి పెట్టి  తాత్కాలిక స్వార్థప్రయోజనాలను పక్కన పెట్టి సమర్థుడైన నేతకు   దక్షిణ తాంబూలాలివ్వాల్సిన అరుదైన అవకాశం ఎన్నికలొచ్చినప్పుడే సామాన్యుడికైనా దక్కేది. బంగారంలాంటి ఆ అవకాశాన్నొదిలేసుకుని ఏవేవో ప్రలోభాలకు లోనయిపోయి పొరపాటు చేసినప్పుడే  ‘తాంబూలాలిచ్చేసాం.. తన్నుకు చావండ’నే సీను  నేతల చేతుల్లోకెళ్ళేది.  ఇన్ని దశాబ్దాల అనుభవం ఉన్నా తొలిగిపోని ఓటరు తెలివితక్కువతనమే ఆశ్చర్యం కలిగించేది.

1947 నాటి దేశ స్వాతంత్ర్య సముపార్జన కాలంలో పశ్చిమ బెంగాల్లో భీకరమైన మతకల్లోలాలు చెలరేగిన సంగతి ఇప్పటి తరానికి అంతగా తెలీని విషయం. అంత విపత్కర పరిస్థితుల నుంచీ గట్టెక్కి దేశ ప్రధాన జీవన స్రవంతిలో మమేకమైన చరిత్ర  బెంగాలీయులది. 71 నాటి బంగ్లాదేశ యుద్ధంలో కూడా  పొరుగు పాకిస్తాన్ లో జరిగిన మతకల్లోలాలకు బెదిరి పారిపోయి వచ్చిన  కోటి మందిని అక్కున చేర్చుకున్న గొప్ప మత సామరస్యం బెంగాలుది! మత ప్రాతిపదికన ఇప్పుడిట్లా  నిట్టనిలువునా చీలడం చూస్తుంటే నిజమైన ప్రజాస్వామికి బెంగేయకుండా ఉంటుందా!

ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకా.. మెజారిటీ మిషన అట్టడుగు వ్యక్తిని మరంత అణగదొక్కేటందుకా  ఎన్నికలు? కల్లో అయినా ఊహించి ఉండరేమో అనిపిస్తోందిప్పుడు మన  రాజ్యాంగ నిర్మాతలు కులాతీత మతాతీత వ్యవస్థపై జరుగుతున్న   ఈ స్థాయి దాడులు!

ఎన్నికలమేళా కోసమే కుంభమేళాలు జరిగిపోతున్నా కిమ్మన్నాస్తిగా ఉండిపోవడం కామనై పోయింది ఎన్నికల కమీషనుకు!  కరోనా వైరస్సేమీ  ఎన్నికల కమీషన్లా పరాధీనంలో లేదు. ఆ సంగతి అందరం మర్చిపోబట్టే ఇవాళ ఇట్లా .. ఎవరికి ఎట్లా అదుపు చెయ్యాలో తెలీనంత ఉధృతంగా రెండో దశలో మహమ్మారి ఆగడాలు!

ఎవరో అన్నట్లు.. వేలాది ముఖాలు గంగానది మురికి నీళ్లల్లో, ముఖం తొడుగూ గట్రాలేవీ లేని లక్షలాది ముఖాలు రద్దీ రాస్తాల మీద.. ఇప్పుడు ఇండియాలో కనిపించే దృశ్యాలు!  ప్రపంచాన్ని వణికించేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ కరాళ నృత్యం కాలంలో లోకం లోకువ కట్టిందంటే కట్టదా మరి! ఇంత ఆపత్కాల సమయంలో కూడా నమ్మి ఓటిచ్చిన ఓటరు సంక్షేమం పట్టకుండా ఒక దేశ ప్రధాని ఏకంగా రాష్ట్రంలో ఎన్నికలు పెట్టించుకుని ‘మీకు మాత్రమే టీకాలు ఫ్రీ’ అంటూ ప్రచారం చేసుకుంటూ తిరగడాన్ని ఎవరైనా ఎందుకు హేళన చేయరు?

ఎందుకు హేళన చేయకూడదు? లోకం నవ్వుతున్నదని కాదు కానీ, నడుస్తున్న పాలనలోనే  లోపమేదో జొరబడిందని ఇప్పటికైనా సాధారణ పౌరుడిగా మన గ్రహింపుకు రావాలి కదా!  జరిగిన పొరపాటు ఎక్కడో తెలిస్తే సరిదిద్దుకునే సంగతి ఆనక!

-కర్లపాలెం హనుమంతరావు

26 -04 -2021

 

 

నమస్కారం! కర్లపాలెం హనుమంత రావు- ఈనాడు ప్రచురితం

 

'నమస్తే'లోనే ఉంది సమస్తం.

నమస్తే అంటే న మస్తే..  తల లేని తంతు అని  వెటకారం కొంతమందికి. బతకడం చేత రాక చేతుల్ని తిట్టిపోయడమే అదంతా. జాలి పడాలి ఆ సంతుని చూసి .. అంతే!

తెల్లారగట్టే వచ్చి తలగడ దగ్గర ఎంత పడిగాపులు పడ్డా దుర్యోధనుడికి రవంత కార్యలాభం కలగింది కాదు భారతంలో. అదే  ఆలస్యంగా వచ్చీ రాగానే సమస్కార రాగాలతో ఇచ్చకాలు పోయిన అర్జునుడికో! ఊహించని మోతాదులో కృష్ణానుగ్రహ లాభం. నిండు సభామధ్యంలో ఇలా దండకం  అందుకోగానే  ఆయనగారి అర్థాంగిగారికీ  పరమాత్ముడి అండ దొరికింది. దండాలా మజాకా!

రామాయణంలో మాత్రం! ఎత్తిన రెండు చేతులూ దించకుండా జీవితాంతం ఒక పట్టున అలా అంజలితో నెట్టుకొచ్చాడు కాబట్టే కోతి జాతిలో పుట్టినా ముక్కోటి దేవతలకైనా  దక్కని అపురూప గౌరవం ఆంజనేయుడికి దక్కింది..  చూశారా! ఉన్న ఒక్క తొండంతోనే  చేతనైనంత వరకూ దాసోహపడిపోయి  ఆపదల నుంచి గట్టెక్కింది  గడుసుపిండం గజేంద్రం.

ఆ చాయలో పోయే ఒకానొకప్పుడు మన పక్క రాష్ట్రం పన్నీరు సెల్వం సారూ అమ్మవారి అనుగ్రహం సొమ్ముచేసుకున్నారు. ఆమెగారు సర్కారువారి సత్కార గృహానికి వేంచేసినప్పుడల్లా పన్నీరుగారే ముఖ్యమంత్రి పీఠానికి కుక్కకాపలా గదా! ఆ అధికారలాభానికి   ప్రణామతంత్రం  ప్రధాన కారణం కాదంటే అవుననగలమా!

స్వామివారు కంటబడగానే స్వాభిమానలేవీ పెట్టుకోకుండా 'నమో.. నమః' అంటూ సాష్టాంగ నమస్కారాలు ఆచరించకపోతే ఆనక ఇదిగో ఇప్పుడు చంద్రబాబుకు మల్లే ఘొల్లుమనాలి. యడ్యూరప్ప కథే నమస్కార పురాణాలకు గొప్ప  ఉదాహరణ

పది తలకాయలున్నాయి.. ఏం లాభం? ఉన్న రెండు చేతుల్నీ వేళకి సద్వినియోగం చేసుకోవడం రాక   అంత లావు రావణాసురుడూ   రాముడి ముందు  కూలిపోయాడు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుళ్ళ పతనానికి  ముఖ్య కారణమూ  ఈ దాసోహ రాజకీయాలు  వంటబట్టక పోవడమే సుమారాక్షసులకు  తెలీని నమస్కార రాజకీయం మన రాజకీయ నాయకులు కాచివడబోసారీ కలికాలంలో.

కడుపులో ఎంత కంటు ఐనా ఉండనీయండి.. బైట ఓదార్పుయాత్ర కంటూ బైలుదేరాక   దేవుడిచ్చిన రెండు చేతులూ  అలా గోజుతో అతికించినట్లు కరిపించుకునే ఉన్నాడు మన జగన్ బాబు.  జైలుకెళుతూ వస్తూ కూడా మన  అయన గారి బృందం పడే ఆ పాట్లు  చూస్తూ  ఇంకా  అంజలి మాహాత్మ్యంమీద అం  అపనమ్మకం తగునా?

షడ్రషోపచారాల్లో ముఖ్యమైనది తైత్తరీయం సైతం ప్రస్తావించిందీ  నమస్కార తంత్రం. అయితే దండాలన్నీ ఒకేలా ఉండవు. చంద్రబాబుగారిది  భిన్నమైన శైలి. చేతులకు బదులు వేళ్లను వడుపుగా వాడటం ఆ మాజీ సి.యం వదిలిపెట్టని నియమం. మారిన రాజకీయాలలో ఓటరేం చేస్తాడు.. పాపం! ఎన్నికైన నేత వేళ్ళకు బదులు  గోళ్ళు  చూపించినా అదే  గోల్డెన్ హ్యాండుగా భావించి సర్దుకుపోవడం తప్పించి. 

నేతలకీ నమస్కారాలకీ అసలంత లింకెందుకో తెలుసాహామీలు, వాగ్దానాలకున్న కాలపరిమితి బెడద నమస్కారానికి  లేదు. నగదు బదిలీ.. రుణమాఫీలకంటే   మూటా ముల్లెలతో పని. నవ్వుతూ నమస్కార్ అనేందుకు ఏ శిస్తు వసూళ్లు లేవు.  ఎన్నికల సంఘం  అదుపూ.. అజమాయిషీ ల్లేకుండా హాయిగా పిక్కల్లో   ఓపికున్నంత వరకు వాడి వదిలేసే సౌకర్యం ఈ చే  జోడింపులో ఉన్నంతగా మరే ప్రజాకర్షక పథకంలోనూ లేదు.

 

ఎన్నికలు ఎప్పుడొచ్చి పడినా మోదీకి కలిసొచే అంశాల్లో ముఖ్యమైనది ఆయన గారి హ్రస్వ నామధేయం పేరులోనే 'నమో' ఉన్న నేత కదా ఆయన! ఓ వంక చెడ తిట్టి పోస్తూనే మరో వంక నుంచి 'నమో..నమో' అంటూ  మోదీ నామస్మరణ చేయక తప్పని సంకట స్థితి.. మమతా బెనర్జీ వంటి ఎంతటి ఎనర్జీ నేతకైనా!  

పబ్లిగ్గా పడ తిట్టిపోసుకున్న అసలు శాల్తీ  కంటబడ్డప్పుడు సంకోచమేంఈ లేకుడా  ఓ 'నమస్తే' ముద్ర.. కల్తీది అయినా ప్రయోగిస్తే చాలు..  సగం చిక్కులు వాటంతటవే తొలగు! ప్రధాని మోదీ ప్రధమ పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో సార్క్ దేశాధిపతులంతా మూకుమ్మడిగా  కలసి వచ్చిసాధించిందేమిటీ?  ఎవరి బాణీలో వాళ్ళో  నమస్కార బాణం సంధించుకోవడం. ఆ తరువాతనే కదా సంధి రాజకీయాలు రసకందాయంలో పడటం!

జపాను పో.. చైనా పో.. అమెరికాతో సహా పోలండ్ వరకు ఏ గడ్డ పై  కాలు పడ్డా .. చేతుల్ని మాత్రమే  నమ్ముకున్నాడు కనకనే మన ప్రధానికిప్పుడు అంత  హవా.మస్కా మార్కు ట్రంపయినా  తప్పించుకోలేని ప్రయోగం నమస్కారానిది. నమో..  ప్రభంజనం  కళ్లారా  చూస్తూ ప్రణామ ప్రయోజనాలపై అనుమానాలు వదలకుంటే.. మిత్రమా తమకో నమస్కారం!

ఆరోగ్యాన్నిచ్చి, అన్ని పనులూ ఇంచక్కా చక్కపెడతాడనే కదా ప్రత్యక్ష నారాయణుడుగా సూర్యభగవానుణ్ణి భావించి 'ఓం..హాం..మిత్రాయ' అంటూ రెండు పూటలా సూర్యనమస్కారాలు ఆచరించేదీ! అర్హతలతో నిమిత్తం లేకుండా  అందలం ఎక్కించి పదిమందిలో మంచి గుర్తింపు తెచ్చే  ప్రణామయోగానికి 'లోకబాంధవ' యోగం కల్పిస్తే తప్పేమిటి? 


అదృష్టం. అరబ్బులాగానో  పుట్టాం కాదు.   ఖర్మ కాలి ఏ ఒసామా లాడెనో  ఎదురైవుంటే బుగ్గకు బుగ్గ రాసుకోవాలి. 'దేవుడా! నన్నీ 'నమస్తే'ల ఖండంలో పుట్టించినందుకు నీకఖండ కోటి నమస్కారాలు! 

నమస్కారమంటే తుస్కారం వద్దు.

ఎవరి బాణీలో వాళ్లని  నమస్కారాలు పెట్టుకోనీయండి.  ప్రజాహితంగా పని చేయకుంటే పెట్టటానికి మన చేతిలోనూ వాటంగా ఉంచుకుందాం  పెద్ద నమస్కారం!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సంపాదకీయపుట ప్రచురణ)

సుపరిపాలన ( ఈనాడు ఓనాటి సంపాదకీయం ) - కర్లపాలెం హనుమంతరావు

 సుపరిపాలన

( ఈనాడు ఓనాటి సంపాదకీయం ) 

- కర్లపాలెం హనుమంతరావు 


 

'దేశమంటే మట్టి కాదోయి.. దేశమంటే మనులోయి'అన్నారు మహాకవి గురజాడ. మట్టో.. మనిషో.. పేరులో ఏముంది? పాలన కదా ప్రధానం! తల్లి లాలనను పోలి ఉండాలి ఆ  విధానం. 'కృత మెరిగిన పతియె జగజ్జనుల నెల్ల బరిపాలించున్' అని నన్నయగారి భారత కథనం! 'వైయక్తిక భోగదృష్తి కాదు.. ప్రజోపయోగ దృష్తి సుపరిపాలకుల కెంతో అవసరం' అని చాణక్యుని సూక్తి.కాదంబరిలో బాణకవి శుకవాసుడి ద్వారా చెప్పించిందీ ఈ రాజనీతే. 'రాచపుటక, నూత్న యవ్వనం, దేహసౌందర్యం, మితి ఎరుగని అధికారం.. విడివిడిగానే వినాశ హేతువులు కాగా.. అన్నీ ఒకే చోట జత కూడితే కలిగే కీడో?'  పట్టాభిషేక వేళ కొడుకు చంద్రాపీడుడికి ఆ తండ్రి చేసే హెచ్చరికలు గద్దెనెక్కే వారందరూ కంఠోపాఠం చేయదగ్గ సుపాలనా మార్గ సూచిక . అందరూ స్వర్ణయుగంనాటి గుప్తులు కాలేక పోవచ్చు. అందివచ్చిన అధికార దండాన్ని ప్రభువు ప్రాజాభిమతానికి మాత్రమే మీదు కట్టాలన్న కామన అత్యాశ అయితే కాదుగా!'భృత్యులొప్పని పని చేసిన విభులు' ఏ విధంగా 'బంధుర చారు యశంబు బేరు బెంపు పోయి' దుర్యశము పొందుతారో పోతన భాగవతం కథగా చెబుతుంది. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో సుపారిపాలన ఎలా సాగిందో  నిరూపించే ఘట్టం ఒకటుంది. అప్పటికి అమల్లో ఉన్న చట్టం ప్రకారం నిస్సంతుగా దేహాంతుడైన పౌరుడి యావదాస్తులు రాజు పరమవాల్సినప్పటికీ  దురాశ పడడు దుష్యంత మహారాజు. సముద్ర ప్రయాణంలో ప్రాణాలు పోగుట్టుకున్న ఓ వ్యాపారి సమస్త ఆస్తులు  వెదికి మరీ అతగాడి గర్భస్థ శిశువుకు ధారపోస్తాడు. శకుంతలా స్మృతి వియోగ విషాద అస్థిమిత  వేళలో కూడా ప్రజాక్షేమం తప్ప ఊహించలేని మతి ఆ చక్రవర్త్దిది.     'ఆప్తులను పోగొట్టుకున్న పౌరులందరికి ఆ పాత్రలో ఆదుకునేందుకే తనకు రాజ్యం ఉందనే' దుష్యంతుణ్ణి మించిన సుపరిపాలకుడు ఉంటాడా?  దండికవి శ్లాఘించినట్లు'సమక్షంలో ఉన్నా లేకున్నా వాజ్ఞ్మయ దర్పణంలో సదా ప్రతిఫలించేది ఇలాంటి ధర్మప్రభువుల కీర్తి చంద్రికలే.' 

 

'పరనారీ సోదరుడై/పరధనముల కాసపడక పరులకు హితుడై/పరులు దను బొగడ నెగడక/పరు లలిగిన నలుగ నతడు' పరముడని సుమతీ శతకకారుడి నిర్వ చనం. ఆ పరముడు పాలకుడైతే పాలితులు  లాలితు లెలా అవుతారో తెలిపేందుకే వాల్మీకి రామాయణం మిషతో పదహారు కళల పరమ పురుషోత్తమ్ముణ్ని పనిగట్టుకుని చిత్రించింది. శత సహస్ర నామాలలో 'భద్రుడు'రామచంద్రుడికి అత్యంత అర్థవంతమైన బిరుదు. దాసులకు దాసానుదాసుడా ప్రభువని రామదాసు చరితంవల్ల విదిత మవడం లేదా! సేతుబంధన యాగానికి చేతనైన సమిధలందించిన ఉడుతను అల్పజీవమని కూడా చులకన చూపకుండా   చేరదీసిన మేరునగ ధీరుడా రామచంద్ర ప్రభుడు. వాత్సల్య తంత్రం అంత గాఢంగా వంటబట్టించుకున్న నేత కాబట్టే నేటికీ  రాజుగా గాక ఓ  తండ్రిగా ప్రజాకోటి గుండెల్లో కోట కట్టించుకుని పూజ్య పీఠం పైన కొలువైవున్నది  .'ఉత్తమశ్లోకుడై ప్రజాయత్తచిత్తు / డైన వాడు రాజైనచో నఖిల ప్రజలు/ సిరియు సంపదయు గల్గి చెలగు చుంద్రు/ కానినాడెల్ల జగమును గాలిపోవు' అని కదా శ్రీపాద వారి మధురవిజయం బోధ''   .'రాజధర్మంబు కంటెం బాపకర్మంబు లేదు పొమ్మ'న్న పాండవాగ్రజుడి నిర్వేదమే నిజమైనదైతే ఆ దుష్కర్మలమీద ఆధిపత్యానికేనా ఇన్నిన్ని ప్రపంచ కురుక్షేత్రాలు జరుగడం ప్రస్తుతం ! ? 'క్రూరుడు, లోభి, గొందీడు, శఠుడు, ఉగ్రుడు, ఖలుడు, జడుడు, కృతఘ్నుడు, సత్యహీనుడు, కారుణ్య వర్జితుడు, కలుషాత్ములతో కొలువు దీరిన భూవిభుడి పాలనలో ప్రజల శాంతిభద్రతలు చెడును'  అన్న  సోమన ద్విపద భారతం శాంతి పర్వ చెవులకు సోకాలి కదా !   అమాయక ప్రజావళికి కవచాలుగా ప్రజావాదుల ఆయుధాలు సదా సిద్ధమయే ఉంటాయి ; నిజమే   కానీ.. ఆ ఘర్షణలకు అసలు అవకాశమే లేని ప్రజాకర్షక పాలనకే ముందుగా శాంతి కాముకులు మొగ్గు చూపేది. 'పౌరాభిప్రాయమనే తృణబాహుళ్యంతో  మృగరాజంవంటి  శాసన్నాన్నైనా సునాయసంగా నిలవరించ వచ్చ'న్నది  హర్షవర్ధనుడి  ప్రజాపాలనను హర్షిస్తూ బౌద్ధ యాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ చేసిన పరిశీలనలోని ఒక సూక్తి..

సర్వం సహాధికారాలు ఆయాచితంగా వచ్చిపడ్డా రాజ్యపాలన అంటే ప్రజాదైవాన్ని అర్చించుకునే పూజాద్రవ్యంగా భావించిన హర్షవర్ధనుడి వంటి మహారాజులు ఎందలికో  ఈ భరత వర్షంలో. హిందూ ముసల్మానులన్న తేడా లేదు.  ఈ పుణ్యభూమి పై 

కామాతురుడు రావణాసురుడు ఉన్న చోటనే      ధర్మాభిమాని విభీషణుడు పుట్టుకొస్తాడు. గుడ్డిప్రేమతో చెడ్డబిడ్డలను  అడ్డగించని ధృతరాష్ట్రులకు సుద్ది చెప్పే విదురు లెప్పుడూ చెవుల దగ్గరే   ఏ   సోదరుల రూపేణా హితవు చెబుతుంటారు . నిష్కారణంగా ధర్మద్వేషం పెంచుకుంటే కన్నపేగే ఏ  విరోధుల  రూపంలోనో  ఎదురు  తన్నే శక్తులుగా  ఎదిగి రావచ్చు. వేల యేళ్ళ కిందటే ఈ వేదభూమి పై   క్రూర వేమరాజుకు రుషిగణాల ఆధ్వర్యంలో పేదప్రజ ఎదురు తిరిగింది. వామదేవుడి దుష్టపాలనకు భీష్మసేనుడు విరుద్ధంగా నిలబడింది   . 'యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత/ అభ్యుత్ఠాన మధర్మస్య తదానాత్మాzzనం సృజమామ్యహమ్' అన్న జగద్గురువు హామీ మేరకే జరుగుతుంది లోకతంత్రం  సర్వం   ! క్రాంవెల్ ప్రజ్వలన, అమెరికన్ల తిరుగుబాటు, ఫ్రెంచి వారి విప్లవం, రష్యనుల చైతన్యం, చైనీయుల లాంగ్-మార్చ్.. దేశం ఏదైతేనేమి.. రాజ్యం కంటకమైతే  జనం చోద్యం చుస్తూ కుర్చో రన్నదే చరిత్ర చెవినులిమి చెప్పే పాఠం. ఎందాకనో    ఎందుకు? వందేళ్ళ కిందటి మన 'వందేమాతరం' చాలదూ కుపరిపాలన ఆట్టే కాలం చెల్లుబాటు కాదని సందేశం అందించేందుకు! 'చోరులచే చెడకుండం /గ్రూరులచే జావకుండ గువలయ జనులున్/జారులచే బడకుండ ధ/రారమణుడు నేర్పు గలిగి రక్షింప దగున్' అన్న  బ్రహ్మరాజశాస్త్రం నుంచి.. బార్హస్పత్య రాజశాస్త్రం దాకా.. రామాయణమైనా.. అంబేద్కర్ రాజ్యాంగమైనా చెప్పుకొచ్చేది ఇదే  ప్రాధమిక  సుపరిపాలనా సూక్తి. సుదూర దేశంనుంచి పాలించ వలసిన అగత్యం వల్ల తెల్లదొర లేనాడో అల్లిపోయిన  కల్లిబొల్లి దళ్లకు అర్థ శతాబ్ది పైబడినా 

మన సర్వ సత్తాక ప్రభుత్వాల మెదళ్ళుఇంకా నకళ్లేనా? ! 'రాజ విరహితమైన / పుడమి జనులకు నింకిన మడువులోని/జలచరంబులు పడు పాట్లు సంభవిల్లు' అని భీష్మనీతి. 'ఎఱుక లేని దొరల నెన్నాళ్ళు కొలిచిన/బ్రతుకు లేదు వట్టి భ్రాంతి గాని' అన్న తెలివిడి మామూలు పౌరుడి బుద్ధికేర్పడితే చాలు. ఆ  తెల్లారే .. మొండి వృక్షం మీద పక్షులు వాలడం మానేసినట్లు.. గొడ్డుమోతు ప్రభుత్వానికి చెల్లు చీటీ రాసేయడం ఖాయం.  జన చైతన్య మహా  చరిత్ర పదే పదే చెప్పుకొచ్చే మహిమలు  'విననే వినం.. విన్నా పెడచెవిన  పెడతాం' అంటే శాశ్వతంగా నష్టపోయేది దుష్టపాలన పట్ల అంతులేని విశ్వాసం కలిగిన నియంత పాలకులే ! 

- కర్లపాలెం హనుమంతరావ

అట్ల పిండి - గుడిపాటి వెంకట చలంగారి హాస్య కథ - సేకరణః కర్లపాలెం హనుమంతరావు

 



(జెరుమీ' ననుసరించి) 

నా చిన్నతనంలో మాకు ఒక నాయనమ్మ వుండేది. ఆమె పేరు వెర్రి బామ్మ. కాని అట్లు బహు ప్రశ స్తంగా వొండేది. ఆవిడ చేస్తే ఇంత వరకు ఒక సారిగా, పాతికట్లకంటే, తక్కువ తిన్న వాడు లేడ' . మాలో ఆమెని, అందుక నే, ఆట్ల బామ్మ, అనేవాళ్లం. ఎల్లా చేసేదో, ఆపిండిలో “ఏంకలి పేదో' ఎనరికీ తెలియదు. ఒక సారి నేను మా చెల్లెలుగారి ఊరు నెళ్లుతున్నా. మా చెల్లెలు గర్భిణీ , "ఉండి అమ్మ అట్లు తినాలని వుందని ఉత్తరాలు రాస్తోంది. బామ్మ ఏం చేసిందం టే, పిండి కలిపి, ఒక పెద్ద సత్తెప్పాలలో వేసి, సిబ్బిబోర్లించి, గుడ్డ నా సినకట్టి, నన్ను ముందు తీసు కెళ్లీ మంది, మనకు తను బయలు దేరివ స్తానంది. చేబోల్లో మధ్య ఒక రోజు దిగాను. మర్నాడు తెల్ల వారి రైలుకొచ్చి, మూటా గిన్నె పెట్టుకుని, ప్లాటు ఫారం మీదనుంచున్నా. దగ్గర వున్న వాళ్లందరూ మూటలూ ట్రంకులూ మోసుకుని దూరంగా పోతున్నారు. కారణం తెలియక, ఎందుకన్నా మంచిది పోని అగా, నామూటా, గిన్నా తీసు కుసి, నేనూ 'వాళ్ల వెనకాల వెళ్ళి నుంచున్నా. వాళ్ళు నా కేసికోపంతో చూసి వెనక వొదిలిన చోటి కే వెళ్లి మళ్లీ నుచున్నారు. ఆలోచించా, ఎందు కొనన్ని ట్లా ఏడిపిస్తున్నా రని. ఒక వేళ ఈ అట్ల పిండి వాసనేమో. కాని మాయింట్లో వాళ్ళందరికి చాలా అలవాటే. అదిగాక ఆవాసన తగి లేటప్పటికి సంతోషంకూడానూ. ఈ కాస్త భాగ్యానికే ఇంత అడావిడా; ఎంతసుకుమారం అబ్బా అనుకున్నా. 


రైలంతా కిక్కిరిసివుంది. నేనెక్కిన పెట్టిలో ఆవూరివాళ్ళెవరూ ఎక్క లేదు. వాళ్ళు కని పెట్టెవున్నారు, నే నెక్కడయెక్కు. తానో చూ స్తో నే నెక్కి నచోట ఇదివర కే పదిమంది వున్నారు, చోటు లేద న్నారు. 


కాని నాతప్పాలముందుతోసి, 'వెనకాల 'నేనూ ఎక్కాను. తప్పాల పైన బల్ల మీద పెట్టి, ఇద్దరు లావాటి వాళ్ళు మధ్యయిరికి, చాలా వుక్కగా వుందండీ యీవాళ అన్నాను. రెండునిమషాలయింది ఒక ముసలాయన ఇటు అటు కదలడం మొదలు పెట్టాడు. "చాలా ఉక్కగా వుందండీ యిక్కడ" అని పెద్దటంకోటి మోసుకొని బయటికి బయి లు దేరాము. ఇంకోచోట అసలు ఒక రిమీద ఒకరునుంచున్నారండి" అన్నా ఆగ లా. రెండోలా వాటాయనకూడా లేచి వెనకాల వెళ్ళాడు. ఒక గ్ని వొదిలి ఒకరు ఉండ లేరుగాబోలు అనుకొని, హాయిగా సద్దు కున్నాము. ఇంతలో తక్కినవాళ్ళందరూ హూ, హూ" అని ముక్కులో అనడం మొదలు పెట్టారు. ఒకాయనమీద తెల్లనిబొట్టు పడ్డది, పైకి చూస్తే తప్పాల్లో పిండి కారుతోంది. బండి అంతా పరిమళం. అశాత్తుగా ఒక మాటైనా ఆడకుండా, నలుగురు లేచి బస్తాలు', టం కుబు, దింపుకుని, బయిటికి నడిచారు. మిగిలిన వాళ్లం హాయిగా కాళ్ళుజాచుకున్నాం. మిగిలిన వాళ్లల్లో ఒక బ్రాహ్మడు, శవాలుమో శే వాడిలాగున్నాడు, కుళ్ళిన పసిపిల్లశవంవాసన” అన్నాడు. ఆమాట తో అదిరిపడి, ఇంకా ముగ్గురు లేచి, ఒకళ్ళ కాళ్ళకి ఒకళ్ళు అడ్డుపడు తో, బండిలో నుంచి కిందికి దొర్లారు. రైలు కదుల్తోంది. ఆఖరికి ఆ బండికల్లా నేనూ పచ్చకోటాయినా మిగిలాము. “ఏమిటండీ ఈ కొంచానికి యింత అడావిడీ చేస్తారు. వీళ్ళు? అంతా వేషం!” అన్నాడు. ఆయనికి చాలా జలుబు చేసింది కాని రైలు బయలు దేరిన కాసేపటికల్లా, ఒక్కసారి గాలిరివ్వునకొట్టేప్పటికి, చాలా బాధపడడం మొద లు పెట్టాడు. ఆ జలుబూ గిలుబూ వొదిలిపోయింది. తరవాత స్టేషను లో కాఫీ తాగొస్తానని దిగి ఇంకో బండిలో ఎక్కేశాడు. చాలా నీచ మయిన పని చేశాడనుకున్నా. 


తరవాత, బండీ అంతానా దే. ప్రతి స్టేషనులో మనుషుల్ని హా యిగా వొక్కణ్ణి ఇటూ అటూ చూస్తే నిశ్చింతగా కూచున్న నన్నూ నాబండినీ చూసి, కళ్లుకుట్టి, ఒ రేయ్ శంకరయ్యా! కాళీ బండిరా. ఇట్లారా, అని టంకులూ, సంచులూ మోసుకొచ్చి; తలుపు తెరచి మెట్లెక్కి; ముక్కుతో ఇటూ అటూ వూది, బండి కేసీ నా మొహం కేసీ, చూసి: అమాంతం వెనకాల వాళ్ల మీద విరుచుకు పడేదీ. అందరూ అంతే, ప్రతి స్టేషను దగ్గిరా, అంతే. ఏమెరగనట్టు, అటు కేసి మొహం తిప్పేసి కూచున్నా. రయిలు కదలుతున్నా, అట్టే వుండి పోయినారుగాని, నాబండిలోమాత్రం ఎక్కలేదు. 


గిన్నె దించుకొని, హాయిగా, గోదావరి స్టేషనులో దిగాను. కూలీ మాయింటిదాకా ఒక అణాకి గిన్నె మోసుకొస్తానన్నాడు. గిన్నె నెత్తి మీద పెట్టాను. దించాడు. రానండి” అని, వెళ్లిపోయా షు. ఇదంతా చూస్తున్న ఇంకోడు ఆలోచించి, రెండణాల కొస్తానన్నాడు. గిన్నె నెత్తిని పెట్టుకున్నాడు. కష్టంతో బళ్ల దాకా నడిచాడు. దింపాడు. “నాచాత కాదండి బాబూ” అని వెళ్లాడు. పావలా యిస్తానని కేకేశా. మాట్లాడకుండా నెత్తిమీద గడ్డ తీసుకొని, వాసన చూసు కుంటూ, పోతున్నాడు. . 


ఆఖరికి అర్ధరూపాయికి బండిమాట్లాడు కోన్నాను, వాడు మాతం వొదల దలచుకోలా, అసలు గెడణాలు మమూలు, మా చెల్లెలగారింటికి ఒక నిముషం తరువాత బాబూ కేవు చాలదు. ముప్పావలా యిప్పించాలి'' అన్నాడు. కొంచెం దూరం తలాడు. 1.ఒక రూపాయి యిచ్చినాకష్టం చాలదు” అని ఆ పొడు. ఏ కష్టం? అది అతనికే తెలియాలి. ఎంతకష్టగా లేకపోతే. అంత సశ్యం - పీలుస్తాడు? సరేనన్నా, ఏం చెయ్యను. అంతకంటే, మళ్లిరూపాయి న్నర కావాలి అనపోతున్నాడు. ఇంతలో గోదావరిమీద నించి గాలి విసరింది. ఎద్దు వేపు, ఎద్దు పరుగు మొదలు పెట్టి , గుగం పసి కిరాదు. వెనక నుంచి ఏం వస్తుందను కొన్నదో. ఏమిటో బండి ఎవరి మీదనించన్నా పోతుందనుకొన్నా, కాని బండీ రాకముందే, గాలి తగల గానే ఎక్కడున్న వాళ్లు అక్కడే ఇళ్లల్లోనికి, దుకాణాల్లోకి, పక్క.. సందుల్లోకి తప్పుకున్నారు. ఇంటి దగ్గర బండి ఆగి తేనా? నలుగురు  ఎద్దుని పట్టుకున్నారు. ముక్కు లవత లికి తిప్పేసి అప్పటి కే ఆగకపోయ్వే దే? బండివాడు దూకి ఎగ్గుముక్కు కి గుడ్డకప్పేసి, సశ్యం వాసన చూపించక పో తే ఇంటిలో పనికి వెళ్లాను. - గిన్నా నేనూ, చెల్లెలూ పిల లూ పరిగెత్తుకుంటూ వొచ్చారు. అన్నయా" అనీ, మామ య్యొచ్చాడు, మామయొచ్చాడ, నీ గదిలోకి. గుమ్మం దగ్గిర అందరూ తటాలున ఆగారు, కష్టంమీద మా చెల్లెలుమాతం మొహంమీద పమిట కొంగు కప్పుకొనివచ్చి, యేడుస్తో సన్ను కావలించుకొని, ( అన్నయ్యా! యెందుకు దాస్తావు? చెప్పునాతో ". యేం ఘోరం జరి గిందో,, అంది. ఏం లేదమ్మా బొమ్మయిచ్చిన అల్లు-డి,, అన్నాను. 


బామ్మ రాత్రిక్కూ ఔరా లేదు. మూడు రోజులు చూశాం రా లేదు. ఏకదిపితే ఏ నువుతుందో అని ఆగిన్నెనీ ఆట్లా నేవుంచా.. ఆతలుపు సూత్రం గొళ్లెం వేసి, 'TVళం వేసి, శీలు చేసి, చిల్లుల్లో గుడ్డ పేలిశలూ అవీ కు క్కొ ము. ఎవరం 3 వేపుపో లేదు. నేను స్నా ను చేసి, సబ్బుతో కడుక్కు.. న్నా ; కాని ఇంకా బజార్లలో సాగాలితగలగానే మనుషులు, కలెక్టరు మోటారు ముందు.. తప్పుకు సేట్టు, తప్పుట, మాన లేదు. ఇండు రోజులు : డి మా చెల్లెలు, లుట్లఆశ వదలుకొని ఇక వూరుకో లేక ( ఈ పిండి బొమ్మ యే" చెయ్యముంది?” అని అడిగింది. 


"నేనొచ్చిందాకా, ముట్టుకోకుండా, అట్లా నే వుంచేమ ద” న్నాను. చెప్పుడ మెందుకు? దాన్నెవరు కదిలిస్తారంది. మూడు రోజులూ అయింది. పిల్లలు కొంచెం నలతగా కనపడ్డారు. ఆదుకోరు. అక్కడ క్కడ దిగులుగా చతికిలబడతారు, చంటిపిల్ల కారణం లేకుండా మారాంపట్టి యేడుపు.బామ్మకి ఉత్తరాలు రాశాం; రిప్లయి ప్రీపెయిడు "టెలిగ్రాములిచ్చాం ! 

జవాబుగా లేదు. నాలుగో రోజున నూ చెల్లెల : ది 44ఒక రూపాయి ఇచ్చి, దీన్నీ అపతలపా గేయిస్తే బొమ్మ కోప్పడు తుందా? 13, తప్పకండా కోప్పడుతుంది. ఎన్నడూ ఇంక అట్లు చే య్యదు. నవ్వదు. మాట్లాడదు. మని మొహం చూడదు. అయినా 


బ రూపాయికి ఎవడు పారేస్తాడు? వొట్టిపీనిక్కి.. పప్ రూపాయిలు తీసు కుంటాడే”, అన్నా ను. 


వాసన ఇల్లంతా వ్యాపించింది. పెద్దమ్మాయికి విరోచనాలు; అబ్బాయికి జ్వరం; చిన్న పిల్లకి పొంగు; మా చెల్లెలికి ఆరో నెలనే నెప్పులు. ఏం చెయ్యం ? ఎవరితో చెప్పకండా ఇల్లు తాళం వేసి, సత్యానికి పోయాము. 


ఇన్నాళ్ళు మా బావ వూళ్ళో లేను. మేముసతాని కెళ్లిన మర్నాడు వూళ్ళోదిగి ఇల్లు తాళం వేసుం టే మమ్మల్ని వెతుక్కుంటూ వొచ్చాను. అతని వెనకాల పెద్దగుంపు. చుట్టుపక్కల వాళ్ళ-దరూ “ఇల్లు తెరుస్తారా లేదా?లో పలనూరుకూనీల న్నా జరిగాయి. మరియాదస్తు లనుకున్నా ము. సత్యానిగొస్తే దాగుతుందా!,, అని ఒక బే అరుపులు, మునిసిపాలిటీ వారు ఇల్లుతగల పెట్టటానికి సిద్ధంగా ఉన్నారు. ఏ చెయ్యం? జబ్బు పిల్ల ల్నే సుకొని వెన కాలి కెళ్లాము." 


అగ్గ రాతి నేను మా బావా మూతులకి గుడ్డలుకట్టుకుని, ఒక సెటుబుడ్డి మీదగుమ్మరించుకుని ఆతప్పాల బుజాలమీద మోసు కుంటూ, గోదావరి వేపు బయలు దేరాం. సిద్దర్లో మనుషులు కలవరిం చారు, కేకలు పెట్టారు. తొందరగా వెళ్లి, శాషయ్య మెట్టదగ్గిర నావ తీసుకుని నీళ్ల మధ్య కుపోయి గిన్నె పాళం " గోదావరిలో పడేశాం. నీళ్ల ల్లో పిండి పారపోసి గిన్నె తెచ్చుకోవాలని బుద్ధి పుట్టింది. కాని మూత తీస్తే, లోపలినించి ఏమొస్తుందో, ఏదన్నా విషజంతువు బయలు దేరు తుందేమో అని భయమేసింది. "రెండు రోజుల్లో శేషయ్య మెట్ట గుమ్మెత్తి పోయింది, ఒక్కరూ నీళ్ళుముంచుకోరు. ఏదో చాలా వుపదవం రాబోతుదని వూళ్ళోపు కారు. రైలుబ్రిడ్జి మీద, రూల్సుకి వ్యతి ప్రేకం గా, ముప్పైమైళ్ళ వేగంతో “పోతూంది. "పెద్ద పెద్దచాపలు చచ్చి తేలు తున్నాయి. కాని ఒక్కరూ వాటి నిముట్టుకోరు. గోదావరి దా టే పిట్ట 


లు గిరగిర తిరిగి నీళ్లల్లో పడుతున్నాయి. చివరికి పడవలూ వలలూ వేసు కుని, 


గోదావరి కెలికి, గిన్నె సిపట్టి బయిటికితీశారు. యెట్టాక నుక్కున్నా 






సాహితి 


గో, ఏమో, హాయిగా నిదపోతున్న ఇంటిల్లిపాదికి ,అర్ద రాతి హటాత్తుగా మెళుకువవొచ్చింది. వూపిరిపీల వడం అసాధ్యమై తంటా లుపడ్డాం. వెంటనే లేచి లాంతర్లు వెలిగించి ఆవుపదవం ఏమిటని వెడితే, అరుగుమీద ఆగిన్నె వుంది. వెంటనే ఆగిన్నెని తీసి కెళ్ళి వూరిబయిట దూరంగా స్మశానంలో, నిలువులో తున గుంటతీసి పాతి పెట్టించాము. మర్నాటికి కలెక్టరుకీ చైర్మనికీ పెద్దమాన్ స్టరు అర్జీలు వెళ్ళాయి. వాసనకి దెయ్యాలన్నీ లేచి స్మశానంలోంచి వూళ్ళోకి బయలు దేరాయట. మునిసిపాలిటీ వారు మమ్మల్ని బలవంతం చేసి, ప్రా సిక్యూషన్ చేస్తామని బెదిరించి, ఆ గిన్నె తవ్వించారు. చివరికి ఒక మంచి సంగతి ఆలోచించాము అనంతపురంలో 'మేము ఒకరికి అయిదు వేలు బాకీ, ఆయన పేర దీన్ని బంగీ కట్టి పోస్టాఫీసుకు తీసి కెళ్ళాము. యిరవయి రూపాయిలు లంచమిస్తే నేగాని ఆగుమాస్తా బంగీ తీసుకోలా. ఆరోజు మధ్యాహ్నం నుంచి పోస్టాఫీసుకీ పక్కనున్న మునిసిపల్ ఆఫీసుక 


సెలవు, ఆసాయంతం రైలు గోదావరి స్టేషన్కి అరమైలుముందే ఆగింది మరతిప్పి నా యిజన్ కదల లేదు. చివరికి యేం చేశారో తెలియదు. వారాపతికల్లో మాత్రం యెన్నడూ లేనిది అనంత పురంలో ప్లేగు 


మొదలు పెట్టిందని చదివాము. ఆయన ఇంతవరకూ అప్పుకోసు అడ గలేదు. ఆయనకి ఆరుగురుకొడుకులూ పదిమందిమనతులూవున్నారు. 


వాళ్ళెవరూ ఇంతవరకు మాకువు త్తరం రాయ లేదు. 

***


గ్రహం ప్రమాదంలో లేదు; ఉన్నది మనమే ! - సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

 గ్రహం ప్రమాదంలో లేదు. ప్రమాదంలో ఉన్నవి  మానవ జీవితాలే ! 

సోర్స్ : అన్ నోన్ 

- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 


భూమి ప్రమాదంలో ఉందని చాలా మంది పర్యావరణ నిపుణులు ప్రజలకి భోదిస్తూ ఉంటారు. ప్రమాదంలో ఉన్నది ఈ గ్రహం కాదు.. మనమే!  


మననుషుల  మనస్సులు అరలు అరలుగా  కుచించుకుపోయాయి . చెట్లు విషయమే చూడండి. అది మన ఆత్మబంధువు. అవి ప్రసాదించే స్వచ్ఛమైన  ప్రాణవాయువుని మనం లోపలికి తీసుకుంటాం. మనం వదిలే కాలుష్య   బొగ్గుపులుసు వాయువుని అది  తన   లోపలికి తీసుకుంటుంది!మన ఊపిరితిత్తులలోని ఒక భాగమైన చెట్టుని వంటకోసం విరిచి పొయ్యిలో పెట్టేందుకు   సంకోచించం! 


ఇక .. మనది మాత్రమే అనుకునే ఈ శరీరం మనది ఒక్కళ్లదే కాదు. ఇదీ ఈభూగ్రహంలోని ఒక చిన్న ముక్క. ఆధ్యాత్మికత అంటే పైకి చూడ్డమో.. కిందకు చూడ్డమో మనకు అలవాటు. లోపలికి చూసుకోవాలని తెలుసుకోలేము. అంతర్ముఖత్వం సాధన చేసే వారికి అనుకున్నదంతా తన లోపలే లభిస్తుంది. 


ఆధునిక శాస్త్రవిజ్ఞానమూ విశ్వంలోఉన్న అణుబంధమే.  దేహంలోనూ ఓ బ్లూ ప్రింట్ మాదిరిగా ఉంటుందని చెబుతున్నది కదా! ఆ అవగాహనను పెంచుకొని  ప్రపంచాన్ని తనలో చూసుకోవడం  ఆధ్యాత్మికం అయితే .. ప్రపంచంలో తనని చూసుకోవడం విశ్వభావన అవుతుంది. 


ఈ గ్రహం మన మనుషులొక్కళ్లదే కాదు. మనిషికీ స్వార్థ బుద్ధి ఎందుకు పుట్టినట్లోతెలీదు. తననిదేవుడికి ప్రతినిధిగా భావించుకోడం అహంభావం కాక మరేమిటి? సాలెపురుగు కూడా తాను దేవుడికి ప్రతినిధి అనుకుంటుందేమో! ఈ గ్రహం మీది ప్రతి జీవికీ మనకు లాగే తమ జీవితమే ఉత్తమమైనదని ఎందుకు అనిపించకూడదూ! 


శారీరకంగా చిన్నవైనంత   మాత్రాన,  భౌతికంగా  కదలలేని స్థితిలో  ఉన్నంత మాత్రాన వాటి ప్రాధాన్యతను మనకోణంలో నుంచి తక్కువ చేసి చూపించలేం  కదా! అట్లా చూపిస్తే  ముందు మనకే మానవత్వం లేనట్లు లెక్క. వాస్తవానికి ఈ భూగ్రహానికి ఎటువంటి ప్రమాదం లేదు. మానవ జీవితాలకే ఉన్న ప్రమాదం ,అంతా!  


మానవత్వం పెంపొందితే గాని, ఈ పర్యావరణానికి సంబంధించిన ప్రాజెక్టులు జరుగుతాయని నేననుకొను. గవర్నమెంట్ ఎన్నో సిద్ధాంతాలను చేయవచ్చు. కానీ, వారు వీటిని ప్రజాస్వామ్య పద్ధతిలోనే అమలు పరచాలి. ఏదో ఒక నిరంతర ప్రచార  వ్వూహం ద్వారాగానీ, ప్రజలలో తగిన ఎరుకను తీసుకురావడంద్వారాగానీ చేయాలి. 


ప్రభుత్వాలలో ఉన్న వ్యక్తులు ఈ ఆలోచనలను బయటికి తెచ్చే విధానాలను వెతకాలి. ఒక సమయంలో భారతదేశంలో కుటుంబ నియంత్రణ గురించిన ప్రచారం జరిగింది. ఇప్పుడటువంటి ప్రచారం ఎక్కడా కనిపించడం లేదు. కానీ మనకేమీ పరిష్కారం దొరకలేదు కదా! మానవ జనాభాని అదుపులో పెట్టుకోకుండా, పర్యావరణం, భూమి, నీరు – వీటన్నిటి గురించి మాట్లాడటం అన్నది కేవలం శాస్త్ర పరిజ్ఞానం వల్ల ప్రజలు హైపర్-ఏక్టివ్ అవ్వడం వల్ల జరిగింది మాత్రమే! 


మీరు మానవ కార్యకలాపాలను నియంత్రించలేరు, మీరు మానవ జనాభాను మాత్రమే నియంత్రించగలరు. మానవాళి చేసే కార్యకలాపాలను మనం ఆపలేము. ఎందుకంటే ఇది వారి ఆశయాలను నియంత్రించడం అవుతుంది. ఈ రోజుల్లో మన ఆశయాలు ఏమిటంటే, ప్రతీవారూ కూడా అక్షరాస్యులు అవ్వాలనీ, వారికి ఎంతో పెద్ద కలలూ, లక్ష్యాలూ ఉండాలనీ! 


ఇప్పుడు ఉన్న జనాభా స్థాయితో.. వీటిని సాధించడం అన్నది ఎంతో కష్టం. మనం ఎరుకతో దీనిని నియంత్రించాలి. మనం ఎరుకతో దీనిని ఎక్కడ ఆపాలనుకుంటున్నామో నిర్ధారించుకోవాలి. ఇది చెయ్యడం అసాధ్యం అని నేను అనుకోను.


మనకి ఎటువంటి వనరులైతే ఉన్నాయో వాటికి సరిపోయే విధంగా మనం జనాభాను సమతుల్యం చేసుకోవాలి. మనం చేయగలిగినది ఇదే. అన్నిటికంటే సులువైన పని ఇదే. ఇది ప్రతి మానవుడూ  చేయగలదు. వారికి అవసరమైన విద్య, ఎరుక జీవితంలోకి తీసుకుని వస్తే ఇది జరుగుతుంది. 


అప్పుడు, మనం చెట్లని నాటనక్కర్లేదు. మనం ఈ భూమి నుంచి దూరంగా ఉంటే, చెట్లు వాటికవే పెరుగుతాయి. మీరు వాటిని ఆపలేరు. ఇది ప్రతీ మానవుడూ  అర్థం చేసుకోవాల్సిన విషయం. 


భూమి ప్రమాదంలో ఉందని ప్రజలు అంచనాలు వేస్తున్నారు. ఈ గ్రహం ఎటువంటి ప్రమాదంలోనూ లేదు. మానవ జీవితాలే ప్రమాదంలో ఉన్నాయి. మనం ఈ విషయాన్ని అర్థం చేసుకొని, దీనికి, ఏది అవసరమో అది 

సోర్స్ : అన్ నోన్ 

- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

09 - 10 - 2021 

బోథెల్ : యా . ఎస్.ఎ 

ఈనాడు - సంపాదకీయం కల'వర'మాయే మదిలో... రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 26 -02 -2012 )

ఈనాడు - సంపాదకీయం

 

కల'వర'మాయే మదిలో...

రచనకర్లపాలెం హనుమంతరావు

ఈనాడు - ప్రచురితం - 26 -02 -2012 ) 


ఈనాడు - సంపాదకీయం 


కల'వర'మాయే మదిలో...

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 26 -02 -2012 ) 


బ్రహ్మాండ పురాణ ప్రకారం చేతన స్థితికి మూడు అవస్థలు. మెల కువ, స్వప్నస్థితి, సుషుప్తి(గాఢనిద్ర). స్వప్నం అంటే నిద్ర, ఆ నిద్రావస్థలో కలిగే దృశ్యానుభవం కూడా కలను నిద్రావస్థలోని అసంకల్పిత భావోద్వేగాల దృశ్యమాలికగా నిర్వచించినా- నిజానికి చేతనావస్థలోని అనుభవాలకు, ఆలోచనలకు అంతఃచేతన ప్రతిస్పందన.  సంతానంకోసం తపించబట్టే ఆర్యాంబకు పరమశివుడు స్వప్నంలో సాక్షాత్కరించి శంకరుని వంటి సత్పుత్రుణ్ని ప్రసాదిస్తా నని చెప్పినట్లనిపించి ఉండవచ్చు.  శివాజీ పుట్టుకకు ముందు జిజియామాతకు ఒక దివ్యస్వప్న సందేశమందినట్లు అనిపించడమూ ఆమె దైవభక్తి ప్రభావ ప్రేరితమే కావచ్చు.  తిక్కనకొచ్చిన- హరిహ రనాథుని భారత రచన కొనసాగించమన్న పురమాయింపు కలకు ఆ సోమయాజి నన్నయ భారతాంధ్రీకరణ అర్ధాంతరంగా ఆగిపో యిందన్న ఆవేదనే ప్రేరణేమో! భక్తాగ్రేసరుడైన పోతన గోదావరి గ్రహణ స్నానమాచరించి మానసిక శుచ్యావస్థలో ఉన్నప్పుడే దివా స్వప్నంలో శ్రీరామచంద్రమూర్తి ప్రత్యక్షమై తెలుగు భాగవత రచన ఆలోచనా బీజం నాటినట్లు చదువుకున్నాం. భాసుడి 'స్వప్న వాసవదత్త' నాటకంలో శయనావస్థలో ఉన్న కథానాయకుడు ప్రియురాలి ఆగమనం  కలగంటాడు. కథాక్రమం ప్రకారం ఆ సమయానికి ఆమె  అతని దృష్టిలో విగతజీవి. వాస్తవానికి సజీవంగానే ఉన్న వాసవదత్త నిజంగానే స్వప్న సమయంలో కథానాయకుడి వద్దకొచ్చి హస్తగ్రహణం చేస్తుంది. రామాయణంలో త్రిజట- అరుణవస్త్రాలు ధరించిన రావణుడు గార్దభమునెక్కి  దక్షిణ దిక్కుగా నిష్క్రమించినట్లు కలగంటుంది. వాస్తవావాస్తవాలు చర్చ అటుంచి ఆయా కలలు కనడానికి వారి అప్పటి మానసిక స్థితే పరోక్ష కారణం కావచ్చని ఇప్పటి మనోశాస్త్రవేత్తల అభిప్రాయం.


కలలో చూసిన ఓ సుందరాంగుడిమీద యామినీ పూర్ణతిలక మరులుగొన్న కథ పండిపెద్ది కృష్ణస్వామి ప్రణీత బిల్హణీయం. 'ఒక కలగంటి, గంటి ఘను నొక్కనిని, జక్కెరవింటి వాని పో/లిక దన రారు వాని... /యిటవచ్చి నా సరస జాణతనమ్మున నుండె' అంటూ తత్తరపడి మేల్కొన్న ఆ సుకుమారిని శుకవాణి ఈ కల ' మంచిదమ్మ! మదినిందుకు సంశయమెందుకమ్మ! యా/శ్రీకరగాత్రు దర్శనము చేకురునమ్మ!' అని ఊరడిస్తుంది. జ్యోతిష శాస్త్రంలోని సంహిత - స్వప్నావస్థలో మనం దర్శించే విషయాల ఆధారంగా శుభాశుభాలను విశదపరచే విభాగం. హిమాంశుని పట్టపుదేవి మహామాయ ' ప్రియానురాగ సుమమాలల హాయిగ తీయతీయగా/ నూయల లూగు' వేళ పరమ ప్రమోద సంధాయకమైన కలకంటుంది. కళ్లు మిరుమిట్లు గొల్పే ఒక చక్కని చుక్క చిక్కని నీలి నింగితెరను చీల్చుకుంటూ దక్షిణ దిక్కునుంచి ఆమె గర్భంలోకి ప్రవేశించినట్లనిపించడమే ఆ స్వప్నం. చల్లనివేళ వచ్చిన ఆ కల 'సుతోదయ ఫల సూచకం' అంటారు ఆస్థాన జ్యోతిష పండితులు. పోతన భాగవతంలో కంసుడు- నగర ప్రవేశం చేసిన బలరామ కృష్ణులు ధనుర్యాగానికని సిద్ధం చేస్తున్న పెను ధనస్సును విరిచేశారన్న వార్త విన్న రాత్రంతా కలత నిద్రలో విషాపానం చేసినట్లు, దిసమొలలతో తిరుగాడినట్లు పీడకలలు కంటూ బాధపడతాడు. 'నిద్రావస్థలో మనిషి దర్శించే స్వప్పాలు సంచిత ప్రారబ్దాల సంకేతాలు అన్న విశ్వాసం జూలియస్ సీజరు పాలన కాలంలో సైతం ఉన్నదే. షేక్స్పియర్ నాటకంలో కేల్పూర్నియా- భర్త సీజరు దారుణ దుర్మరణ దృశ్యాన్ని ముందు రాత్రి నిద్రలో చూసి కలత చెందుతుంది. ఫ్లెమింగ్ పెన్సులిన్ ఆవిష్కరణకు కలలో చూసిన పాము మెలికలే ప్రేరణ. స్వప్నాల అంతరార్థం ఇంతవరకు శాస్త్ర విజ్ఞానానికి సంపూర్ణంగా అంతుపట్టని బ్రహ్మపదార్థంగానే  ఉంది.


కల మనిషికి నిద్రాదేవత అయాచితంగా ఇచ్చిన వరం. తీరిక, ఓపిక లేనివారి తీరని కోరికలను తీర్చే దివ్యౌషధమది. చిన్నా పెద్దా, ఆడా మగా, కుచేలుడు కుబేరుడు, మేధావి సామా న్యుడు... సామర్థ్యంతో నిమిత్తం లేకుండా ఎవరైనా స్వప్న స్వర్గసీ మల్లో ఉచితంగా విహారం చేసి ముచ్చట తీర్చుకోవచ్చు. అరనిమిషమైనా నిటారుగా నిలబడలేని దుర్బలుడైనా చాణూర ముష్టికులను కలలగోదాలో ఇట్టే మట్టి కరిపించవచ్చు . పైసా ఖర్చు లేకుండా పంచభక్ష్య పరమాన్నాల పసందైన విందు భోజనాలు ఆరగించాలన్నా, విశ్వసుందరుల సమక్షంలో తనివితీరా సమయం గడపాలని ఉన్నా - కలల ప్రపంచాన్ని మించినది మరొకటి లేదు. పాను గంటివారి సాక్షిలో- జంఘాలుడికి స్వప్నంలో పశువుల సంత ప్రత్యక్షమవుతుంది. మానవ సంఘంలోని పటాటోపంమీది అధిక్షేపాన్ని ఆ కవి కల మిషమీద ప్రకటించిన తీరది. 'స్వప్నమనగా జీవ సంకటంబు' అని వేమనవంటి వేదాంతులు ఎందుకన్నారో! నిజా నికి 'కలలే హృదయావేదనలు, అనుభూతుల ఒత్తిడిని తగ్గించే మనసు కవాటాలు' అంటున్నారు నేటి మనోవైజ్ఞానికులు. 'కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది/ కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది' అని మనసు కవి ఆత్రేయ చిత్రగీతంలో వాస్తవం కద్దు. ఆధ్యా త్మికంగా స్వప్నాలు చాలామందికి దివ్య సందేశాలు. జీవశాస్త్రప రంగా- అవి, నిద్రావస్థలోని నాడీచలన ప్రతిస్పందన ఫలాలు. మనోవైజ్ఞానిక సూత్రం ప్రకారం- చేతన అంతఃచేతనలమధ్య మనసు చేసే ప్రయాణ దృశ్యాలు. మెలన్ విశ్వవిద్యాలయ మనో వైజ్ఞానికుల బృందం కలలను తీరని కోరికల దృశ్య ప్రతిరూపా లుగా అభివర్ణించింది. పగలంతా జరిగిన సంఘటనలను మెదడు నమోదు చేసుకొని రాత్రంతా తీరికాగా  కలలలో  విశ్లేషించుకొంటుందని తాజా అధ్యయనాలు  తేల్చిన  సత్యం. మానసిక బడలిక నుంచి తేలికగా  బయటపడేందుకు  శరీరం స్వయంగా చేసుకొనే కాయకల్ప చికిత్స - కల. ఎన్ని ఒత్తిళ్లున్నా కనీసం ఆరుగంటలపాటు నిద్రపో వడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు సరికొత్తగా వైద్యులు. కేవలం కళ్లు మూసుకుంటే చాలదు. కమ్మని కలలు కంటేనే ఒంటికి ఆరోగ్యం.. మనసుకూ ఆహ్లాదం!


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 26 -02 -2012 ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...