ఈనాడు - సంపాదకీయం
కల'వర'మాయే మదిలో...
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 26 -02 -2012 )
ఈనాడు - సంపాదకీయం
కల'వర'మాయే మదిలో...
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 26 -02 -2012 )
బ్రహ్మాండ పురాణ ప్రకారం చేతన స్థితికి మూడు అవస్థలు. మెల కువ, స్వప్నస్థితి, సుషుప్తి(గాఢనిద్ర). స్వప్నం అంటే నిద్ర, ఆ నిద్రావస్థలో కలిగే దృశ్యానుభవం కూడా కలను నిద్రావస్థలోని అసంకల్పిత భావోద్వేగాల దృశ్యమాలికగా నిర్వచించినా- నిజానికి చేతనావస్థలోని అనుభవాలకు, ఆలోచనలకు అంతఃచేతన ప్రతిస్పందన. సంతానంకోసం తపించబట్టే ఆర్యాంబకు పరమశివుడు స్వప్నంలో సాక్షాత్కరించి శంకరుని వంటి సత్పుత్రుణ్ని ప్రసాదిస్తా నని చెప్పినట్లనిపించి ఉండవచ్చు. శివాజీ పుట్టుకకు ముందు జిజియామాతకు ఒక దివ్యస్వప్న సందేశమందినట్లు అనిపించడమూ ఆమె దైవభక్తి ప్రభావ ప్రేరితమే కావచ్చు. తిక్కనకొచ్చిన- హరిహ రనాథుని భారత రచన కొనసాగించమన్న పురమాయింపు కలకు ఆ సోమయాజి నన్నయ భారతాంధ్రీకరణ అర్ధాంతరంగా ఆగిపో యిందన్న ఆవేదనే ప్రేరణేమో! భక్తాగ్రేసరుడైన పోతన గోదావరి గ్రహణ స్నానమాచరించి మానసిక శుచ్యావస్థలో ఉన్నప్పుడే దివా స్వప్నంలో శ్రీరామచంద్రమూర్తి ప్రత్యక్షమై తెలుగు భాగవత రచన ఆలోచనా బీజం నాటినట్లు చదువుకున్నాం. భాసుడి 'స్వప్న వాసవదత్త' నాటకంలో శయనావస్థలో ఉన్న కథానాయకుడు ప్రియురాలి ఆగమనం కలగంటాడు. కథాక్రమం ప్రకారం ఆ సమయానికి ఆమె అతని దృష్టిలో విగతజీవి. వాస్తవానికి సజీవంగానే ఉన్న వాసవదత్త నిజంగానే స్వప్న సమయంలో కథానాయకుడి వద్దకొచ్చి హస్తగ్రహణం చేస్తుంది. రామాయణంలో త్రిజట- అరుణవస్త్రాలు ధరించిన రావణుడు గార్దభమునెక్కి దక్షిణ దిక్కుగా నిష్క్రమించినట్లు కలగంటుంది. వాస్తవావాస్తవాలు చర్చ అటుంచి ఆయా కలలు కనడానికి వారి అప్పటి మానసిక స్థితే పరోక్ష కారణం కావచ్చని ఇప్పటి మనోశాస్త్రవేత్తల అభిప్రాయం.
కలలో చూసిన ఓ సుందరాంగుడిమీద యామినీ పూర్ణతిలక మరులుగొన్న కథ పండిపెద్ది కృష్ణస్వామి ప్రణీత బిల్హణీయం. 'ఒక కలగంటి, గంటి ఘను నొక్కనిని, జక్కెరవింటి వాని పో/లిక దన రారు వాని... /యిటవచ్చి నా సరస జాణతనమ్మున నుండె' అంటూ తత్తరపడి మేల్కొన్న ఆ సుకుమారిని శుకవాణి ఈ కల ' మంచిదమ్మ! మదినిందుకు సంశయమెందుకమ్మ! యా/శ్రీకరగాత్రు దర్శనము చేకురునమ్మ!' అని ఊరడిస్తుంది. జ్యోతిష శాస్త్రంలోని సంహిత - స్వప్నావస్థలో మనం దర్శించే విషయాల ఆధారంగా శుభాశుభాలను విశదపరచే విభాగం. హిమాంశుని పట్టపుదేవి మహామాయ ' ప్రియానురాగ సుమమాలల హాయిగ తీయతీయగా/ నూయల లూగు' వేళ పరమ ప్రమోద సంధాయకమైన కలకంటుంది. కళ్లు మిరుమిట్లు గొల్పే ఒక చక్కని చుక్క చిక్కని నీలి నింగితెరను చీల్చుకుంటూ దక్షిణ దిక్కునుంచి ఆమె గర్భంలోకి ప్రవేశించినట్లనిపించడమే ఆ స్వప్నం. చల్లనివేళ వచ్చిన ఆ కల 'సుతోదయ ఫల సూచకం' అంటారు ఆస్థాన జ్యోతిష పండితులు. పోతన భాగవతంలో కంసుడు- నగర ప్రవేశం చేసిన బలరామ కృష్ణులు ధనుర్యాగానికని సిద్ధం చేస్తున్న పెను ధనస్సును విరిచేశారన్న వార్త విన్న రాత్రంతా కలత నిద్రలో విషాపానం చేసినట్లు, దిసమొలలతో తిరుగాడినట్లు పీడకలలు కంటూ బాధపడతాడు. 'నిద్రావస్థలో మనిషి దర్శించే స్వప్పాలు సంచిత ప్రారబ్దాల సంకేతాలు అన్న విశ్వాసం జూలియస్ సీజరు పాలన కాలంలో సైతం ఉన్నదే. షేక్స్పియర్ నాటకంలో కేల్పూర్నియా- భర్త సీజరు దారుణ దుర్మరణ దృశ్యాన్ని ముందు రాత్రి నిద్రలో చూసి కలత చెందుతుంది. ఫ్లెమింగ్ పెన్సులిన్ ఆవిష్కరణకు కలలో చూసిన పాము మెలికలే ప్రేరణ. స్వప్నాల అంతరార్థం ఇంతవరకు శాస్త్ర విజ్ఞానానికి సంపూర్ణంగా అంతుపట్టని బ్రహ్మపదార్థంగానే ఉంది.
కల మనిషికి నిద్రాదేవత అయాచితంగా ఇచ్చిన వరం. తీరిక, ఓపిక లేనివారి తీరని కోరికలను తీర్చే దివ్యౌషధమది. చిన్నా పెద్దా, ఆడా మగా, కుచేలుడు కుబేరుడు, మేధావి సామా న్యుడు... సామర్థ్యంతో నిమిత్తం లేకుండా ఎవరైనా స్వప్న స్వర్గసీ మల్లో ఉచితంగా విహారం చేసి ముచ్చట తీర్చుకోవచ్చు. అరనిమిషమైనా నిటారుగా నిలబడలేని దుర్బలుడైనా చాణూర ముష్టికులను కలలగోదాలో ఇట్టే మట్టి కరిపించవచ్చు . పైసా ఖర్చు లేకుండా పంచభక్ష్య పరమాన్నాల పసందైన విందు భోజనాలు ఆరగించాలన్నా, విశ్వసుందరుల సమక్షంలో తనివితీరా సమయం గడపాలని ఉన్నా - కలల ప్రపంచాన్ని మించినది మరొకటి లేదు. పాను గంటివారి సాక్షిలో- జంఘాలుడికి స్వప్నంలో పశువుల సంత ప్రత్యక్షమవుతుంది. మానవ సంఘంలోని పటాటోపంమీది అధిక్షేపాన్ని ఆ కవి కల మిషమీద ప్రకటించిన తీరది. 'స్వప్నమనగా జీవ సంకటంబు' అని వేమనవంటి వేదాంతులు ఎందుకన్నారో! నిజా నికి 'కలలే హృదయావేదనలు, అనుభూతుల ఒత్తిడిని తగ్గించే మనసు కవాటాలు' అంటున్నారు నేటి మనోవైజ్ఞానికులు. 'కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది/ కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది' అని మనసు కవి ఆత్రేయ చిత్రగీతంలో వాస్తవం కద్దు. ఆధ్యా త్మికంగా స్వప్నాలు చాలామందికి దివ్య సందేశాలు. జీవశాస్త్రప రంగా- అవి, నిద్రావస్థలోని నాడీచలన ప్రతిస్పందన ఫలాలు. మనోవైజ్ఞానిక సూత్రం ప్రకారం- చేతన అంతఃచేతనలమధ్య మనసు చేసే ప్రయాణ దృశ్యాలు. మెలన్ విశ్వవిద్యాలయ మనో వైజ్ఞానికుల బృందం కలలను తీరని కోరికల దృశ్య ప్రతిరూపా లుగా అభివర్ణించింది. పగలంతా జరిగిన సంఘటనలను మెదడు నమోదు చేసుకొని రాత్రంతా తీరికాగా కలలలో విశ్లేషించుకొంటుందని తాజా అధ్యయనాలు తేల్చిన సత్యం. మానసిక బడలిక నుంచి తేలికగా బయటపడేందుకు శరీరం స్వయంగా చేసుకొనే కాయకల్ప చికిత్స - కల. ఎన్ని ఒత్తిళ్లున్నా కనీసం ఆరుగంటలపాటు నిద్రపో వడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు సరికొత్తగా వైద్యులు. కేవలం కళ్లు మూసుకుంటే చాలదు. కమ్మని కలలు కంటేనే ఒంటికి ఆరోగ్యం.. మనసుకూ ఆహ్లాదం!
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 26 -02 -2012 )
No comments:
Post a Comment