ఏది స్వప్నం, ఏది సత్యం?
కంటి రెప్పల కింద దాగిన మంత్రనగరి మాయా మర్మం మరి ఏదీ ?
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సంపాదకీయం - 06 - 11 - 2011 )
స్వప్నం- మానవాళికి ఓ అందమైన వరం. స్వప్నావస్థ సంఘటనల ఆధారంగా భవిష్యత్తును సూచించే స్వప్నశాస్త్రం వైదిక జ్యోతిష-సంహితలో ఉంది. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే, స్వప్నం చాలాసార్లు దివ్యసందేశాలను అందచేసే భవ్యవాణిలా తోస్తుంది. అశోకవనంలో సీతమ్మవారి కాపరి వృద్ధ త్రిజట శ్రీరామ విజయాన్ని ముందుగానే కలలో తిలకించింది- అంటాడు కవి వాల్మీకి. 'స్వప్నాలు వాస్తవాలైతే... వాస్తవాలూ స్వప్నాలంత ఉన్నతంగా ఉంటాయి' అనేది మాజీ రాష్ట్రపతి రాధాకృష్ణన్ తాత్విక చింతన . నండూరివారి నాయుడుబావ భావించినట్లు 'యెలుతురంతా మేసి యేరు వేసే నెమరే కల'- కూడా కావచ్చునేమో భావ కల్పనా ప్రపంచంలో! మనసైన మనిషి కలలోకి వచ్చి కతలు సెబుతుంటే వులికులికి పడుకుంట 'వూఁ' కొట్టుకోవడం కలకు ఒక ఉత్తేజకరమైన అనుభవంజాత చేసినట్లులేదూ! 'కలలంచున్ శకునంబు లంచు... నిమిషార్థ జీవనములందు బ్రీతిపుట్టించి నా/సిలుగుల్ ప్రాణులకెన్ని చేసితివయా!' అంటూ ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వరుడంతటివాణ్ని దూసిపెట్టింది, ఇంతవరకు ఎవరికీ ఎంతకూ అంతుపట్టని ఈ వింత కలల ప్రపంచాన్ని ప్రసాదించినందుకే ! సాక్షాత్తు శ్రీరామచంద్రుడే కలలో ప్రత్యక్షమై ఆస్థాన కవయిత్రి మధురవాణిని సూచించేదాకా తన తెలుగు రామాయణాన్ని సంస్కృతీకరించగల సమర్థులు రఘునాథ నాయకుడికి తట్టనే లేదంటే మరేమిటర్థం?! పరమాత్ముడు ఇరు దేవేరులతో కలలో కనిపించి ఎన్నడూ పేరైనా విని ఎరుగని 'నన్నయ్య ఫక్కీ' కావ్యాన్ని తెనిగించే పని కాకునూరి అప్పకవికి అప్పగించడమేమిటి?! అరవ ఆండాళ్ ప్రేమగాథను తుళువు ప్రభువు రాయల చేత తెలుగులో రాయించడానికి శ్రీకాకుళాంధ్ర మహా విష్ణువు ఎంచుకున్నదీ స్వప్న మార్గమే. విశ్వ సంస్కృతులన్నింటిలో అనాదిగా 'స్వప్న సంసోషణ' ఓ పుణ్యాచారంగా ఊరికే కొనసాగుతూ రాదుగదా!కలలకేదో విశ్వసనీయ శాస్త్రార్ధం ఉండే ఉండాలిగా! ఏమిటది?
అందరూ నిదురించే వేళా ఇల్లు విడిచి వెన్నెల మైదానంలో కురిసే అమృతాన్ని దోసిళ్లతో తాగి రావాలంటే కవి తిలక్ తరహాలో కలల పట్టుకుచ్చులూగే కిరీటం ధరించాలా? మనిషి అంటే మనసు కట్టిన చర్మపు తొడుగే కదా! ఆ మనసులో అసంకల్పితంగా సాగే భావోద్వేగాలు, అనుభవాల ఐంద్రియ సంవేదనల స్పష్టాస్పష్ట ప్రతిబింబాలే స్వప్నాలని మనోవైజ్ఞానికులు గత శతాబ్దిలో ఓ సిద్ధాంతంలేవదీశారు. విడని వాసన పదాలు విరులుగా పరిమళించడమే కలలుచేసే కనికట్టు అంటూ భావకవులు తమ ధోరణిలో బాణీలల్లారు. నిద్రావస్థ అర్ధస్పృహలో మనసు దర్శించే స్వప్నాలకు అర్థాలు విశ్లేషించడం నిజంగా సంక్లిష్ట కళేఅన్నది శాస్త్రజ్ఞుల భావన. మనసు కొలనులో అన్నివేళలా మంచి కుసుమాలే వికసించాలనీ లేదు. వరాహం మీద దిగంబరంగా రోదిస్తూ దక్షిణం దిక్కుగా భర్త నిష్క్రమించడాన్ని దుస్స్వప్నంగా భావించి రామాయణంలో మండోదరి తల్లడిల్లి పోవడం మనకు తెలుసు . దుస్స్వప్న నివారణకు పంచకన్యాది దేవతాస్తోత్రాలను అగ్నిపురాణం సూచిస్తుందేనాడో. సర్పం, ఎనుము, ఆముదం, అగ్ని, అస్తికలు, మురుగునీరు, కారాగారం, వాహనప్రమాదం వంటి స్వప్న దర్శనాలు అశుభ సూచికలని స్వప్నశాస్త్రమో సిద్ధాంతం చేసింది. పీడకలల వల్ల నిద్రాభంగమైనా పడక దిగకుండా జలసేవనం చేసి నిద్రను కొనసాగించాలని పుష్కరుడు పరశురాముడికి అగ్నిపురాణంలో బోధిస్తాడు. గ్రీకులకు ఏకంగా 'మర్ఫీ' అనే ఒక స్వప్నదేవతే ఉంది. తండ్రి ప్రసాదించిన కలల తొడుగు (డ్రీమ్‌కోట్) ధరించిన జోసెఫ్, ఈజిప్టు రాజుకు రోజూ వచ్చే కలలకు అర్థాలు చెప్పగలుగుతాడు. బైబిల్‌లో బాగా ప్రాచుర్యమైన ఈ స్నప్న వృత్తాంతం ఆధారంగా తయారైన చిత్రం, నాటకం నేటికీ ఖండఖండాతరాలలో ఇప్పటికీ అఖండ ఆదరణీయ కళాఖండo. స్వప్న విచారణలను గురించి ప్రచారంలో ఉన్నదంతా అధికభాగం వట్టి ఊహాగానం అనేది హేతువాదుల వాదం. కలల చరిత్ర నిండా పరచుకుని ఉన్నది అనిర్ధారిత ఊహాజనిత కాల్పనిక భావనల పరంపరే అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
విజ్ఞానశాస్త్రం ఎంత కట్టుకథలుగా కొట్టిపారేసినా కొన్ని సత్యావిష్కరణలకు స్వప్నాలే ప్రేరణలు కావడం ఓ విచిత్రం. ఐన్‌స్టీన్‌కి సాపేక్ష సిద్ధాంతం ఓ కొండవాలు ప్రయాణంలో పట్టిన కునుకులో తట్టిన రహస్యం. రాబర్ట్ లూయీ 'డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్', ఎడ్గార్ పోల్ ఎన్నో కథానికలకు స్వప్నాలే ప్రేరణలని వాటి కర్తలే స్వయంగా చెప్పుకొన్నారు. దుర్మరణానికి ముందే అబ్రహాం లింకన్ ఆ దారుణాన్ని దుస్స్వప్నంలో దర్శించినట్లు ఓ కథనం ప్రచారంలో ఉంది. ఏది స్వప్నం, ఏది సత్యం? ఎన్నడూ చూడని సన్నివేశాలు రంగుల కలలుగా అంధులకూ అనుభవం కావడం వెనక మర్మమేమిటి? గుండెకొండల మూలల్లో ఎన్నడో పారేసుకున్న స్మృతుల మూటను అర్ధనిద్రలో మనసు భుజాన వేసుకొని చూపించడానికి రావడమేనా 'కల' అంటే? పగటి కలలు నిజంగానే పరమ అసత్యాలా? సావిత్రి సత్యవంతుణ్ని పరిణయానికి ముందే స్వప్నంలో సందర్శించి ప్రేమించింది- అంటే సందేహపడకుండా ఉండాలా? ... వద్దా? శిరస్సు పెద్ద ఆకారంలో కలలో కనిపిస్తే నిజంగా శుభకరమేనా? స్వప్నాల సత్యసంధతమీద మొదటినుంచీ మనిషికున్న సందేహాలు సవాలక్ష ! తాళ్ళపాక అన్నమాచార్యులవారికి పదహారో ఏట తిరువేంగడ నాథుడు కలలో కనిపించి రోజుకో సంకీర్తన రాయమని పురమాయించాడని... ఆ కల వచ్చిన వైనాన్ని తేదీతోసహా తాళపత్రాల్లో సైతం నమోదు చేశారు గదా! కలలన్నీ కల్లలేనని మరి నమ్మడం ఎలా?! స్వప్నశాస్త్రం (ఓనెరాలజీ) ఈ తరహా కలల చిక్కుముడులను విప్పే పనిలో పడిందిట ఇప్పుడు . జర్మనీ మాక్స్ ప్లాంక్ మనస్తత్వవేత్తలు ఒక ప్రత్యేక అయస్కాంత యంత్ర సాయంతో కలకనే మనిషి మెదడు వివిధ భాగాల్లో జరిగే రసాయనిక మార్పులను అధ్యయనం చేస్తున్నారు. కలల గుట్టు విప్పే రోజులు సమీపంలోనే ఉన్నాయని, మనిషి మానసిక రోగచికిత్సకు ఈ పరిశోధనలు ఓ మైలురాయి కానున్నాయని శాస్త్రవేత్తల బృందనాయకుడు చెబుతున్నారు. కంటిరెప్పల వెనక నుంచీ ఉబికి వచ్చే ఈ మంత్రనగరి మాయామర్మం మనిషి ప్రగతికి మరో అంచెగా మారనుండటం మంచి పరిణామమేగా!
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సంపాదకీయం - 06 - 11 - 2011 )
No comments:
Post a Comment