Sunday, December 12, 2021

కని పెంచే విధాతలు - ఈనాడు సంపాదకీయం -కర్లపాలెం హనుమంతరావు

 


జన్మదాతలను దైవపీఠంపై ప్రతిష్ఠించిన మహోన్నత సంస్కృతి మనది. తమకు దేహాన్నిచ్చి, రూపం దిద్ది, ప్రాణం పోసి, చలనం కలిగించిన తల్లిదండ్రులను 'మాతృదేవోభవ.. పితృదేవోభవ' అన్న మూలమంత్రంతో అర్చించే మహత్తర సంప్రదాయానికి వారసులు ఈ గడ్డ బిడ్డలు! పిల్లలు అమ్మానాన్నల అనురాగ ఫలాలు. ఆశాదీపాలు. కంటివెలుగులు. శిశుదశలో 'అంగరక్ష, ఆదిరక్ష, దీపరక్ష, చిన్ని నా బుజ్జాయికి శ్రీరామరక్ష'- అంటూ కన్నతల్లి నోట జాలువారిన జోలపాట.. చిరుత ప్రాయాననే కాదు, జీవనయాన పర్యంతమూ వ్యక్తిని ఆశీర్వదించే ఆరవ వేదం. నాన్నారు అదిలించే వేళ, ధీమాగా దాక్కోవడానికి అమ్మ అందించే చీర కొంగుచాటు పాపడికి చిలిపి రక్ష! అమ్మ గసిరే సమయాన, లెక్కలేనితనంతో లేడిపిల్లలా చెంగున వచ్చి వాలే గుడిగా మలచిన నాన్నారి ఒడి చిన్నారికి గడుసు రక్ష! పరాయి పిల్లల కంటే తమ కలల పంటలే జనం మెచ్చు బిడ్డలవాలని ప్రతి తల్లీ తండ్రీ గర్వించడం లోకంలో సహజం. 'వీధినెందరు వున్న విసరదే గాలి- రచ్చనెందరు వున్న రాదమ్మ వాన/ చిన్న నా అబ్బాయి వీధి నిలుచుంటె- మొగిలిపువ్వుల గాలి, ముత్యాల వాన' అని మురిసిపోయే అమ్మ గళంతో అబ్బాయి తండ్రీ శ్రుతి కలపడం తెలుగింట వినిపించు ముద్దూ మురిపాలు. బుగ్గలు సొట్టపడేలా తమ అమ్మణ్ని 'కిలకిలా నవ్వితే కలువల్లు పూసె- కలువరేకులేమొ కలికి చూపుల్లు' అనీ అయ్యా అమ్మా పరవశించడాలు తెలుగు లోగిళ్లలొ కనిపించు ముచ్చట కలాపాలు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని మణిమాణిక్యాలతో అభిషేకించ లేకపోతేనేమీ.. వాటి కాంతులు చిన్నబోయే మిలమిలల మల్లెపువ్వుల్లకు మల్లే  చూసుకుంటారు. పసి బిడ్డలకు వారు పట్టు పరుపులు సమకూర్చలేకపోతేనేమి, వాటి మెత్తందనాలు దిగదుడుపు అనిపించు తమ రెక్కలను తెరచి వారికి పక్కలుగా పరుచగలరు. పసికూనగా ఇంట చిన్నారి బుడిబుడి అడుగులు వేసే వేళ, ఆసరాగా చేతులను చాచి తూలకుండా కాచే  అమ్మానాన్నలది అనిర్వచనీయమైన ఆనందం. ఎదిగి వచ్చే వరకు, పిల్లల వడివడి నడకలకు ఆలంబనగా భుజాలు దండెలుగా  మదుపు పెట్టేది అమ్మానాన్నలు కాక మరింకెవ్వరీ లోకంలో?

 

పొత్తిళ్లనాడే కాదు, పొట్లకాయంత పొడుగు సాగినా సొంత సంతానం కన్నవారి కళ్లకు పసికందుకాయలే. పెరిగి పెద్దయి పెళ్లిళ్త్లె మనవల్ని మనవరాళ్లను తమకు కానుక చేసిన వయసులోనూ తమ బిడ్డలు తల్లిదండ్రులకు చిన్నపిల్లలే. అందుకే- పెద్దవాళ్లయ్యాకా వాళ్లు కట్టెదుటే కనబడుతుంటే వారికో తృప్తి. కార్యార్థులై వెళ్లిన పిల్లలు గూటికి తిరిగి వచ్చిన క్షణాన వారికో సంతుష్టి. అలా రానివేళ వారి మదిని తొలుస్తూ ఏదో వెలితి. తాను ఒక్క నిమిషం కనబడకపోతేనే, ఊరంతా వెదికే తండ్రి, ఏ వేళా తనను ఇల్లు కదలనీయకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లి- హిమాలయాల్లో చిక్కుబడిన తన జాడ తెలియక ఎంత దిగులు పడుతున్నారోనని ప్రవరుడు తల్లడిల్లుతాడు. ఇంటికి వెళ్లే దారి చూపమని వరూథినిని అభ్యర్థిస్తూ- 'జననీజనకుల్‌ కడువృద్ధులు/ ఆకటన్‌ సోలుచునెదురు సూచుచునుండెదరు' అని మొరపెట్టుకుంటాడు 'మనుచరిత్ర' కావ్యంలో. ప్రవరుడి తల్లిదండ్రుల ఆ ఆర్తి- బిడ్డల క్షేమాన్నే అనుక్షణం కాంక్షించే ప్రతి అమ్మ, అయ్య తపనలోనూ సాక్షాత్కరిస్తుంది. ఏ బిడ్డలకైనా అంతలా తపించేవారి కడుపుపంటగా పుట్టడంకంటే మరో భాగ్యం ఉంటుందా? మనిషి చేసే పుణ్యాల జాబితా ఎంత పొడవున్నా, ఆత్రేయలా- 'భువిని మా అమ్మ కడుపున పుట్టుటొకటె/నేను చేసిన పుణ్యము నేటివరకు' అని పలవరించడంకన్నా మహాపుణ్యం మరొకటి ఉంటుందా? 'సకల దురితహరము, సర్వసంపత్కరము/మాతృ పాదపద్మ మకరంద మాధుర్య సేవనమ్ము, దివ్యజీవనమ్ము' అన్నది మనసు కవి సూక్తి.

 

అలసిన రెక్కలతో జీవిత చరమాంకంలో ఉన్న అమ్మానాన్నల్ని కడుపున దాచుకుని కాపాడుకుంటున్న బిడ్డలున్నట్లే- ఆఖరి మజిలీలో విశ్రమించి 'అటు'వైపు ఒత్తిగిలే రోజుల్ని లెక్కపెట్టుకొంటున్న కన్నవారిని కాలదన్నుతున్న సుపుత్రులూ ఉన్నారు! బాల్యంలో తమ ఆకలి ఎరిగి, ఆయుష్యవర్ధనంలాంటి అన్నప్రసాదమిడిన అమ్మకు, అయ్యకు పచ్చడి మెతుకులైౖనా ప్రేమానురాగాలతో పెడుతున్న పిల్లలున్నట్లే- ఆస్తులతోపాటు అమ్మానాన్నల్నీ పంచుకుని వారి కడుపుకింత రాల్చడంతోనే తమ బాధ్యత తీరిపోయినట్లుగా చేతులు దులిపేసుకుంటున్న 'పుత్రరత్నాలూ' ఉన్నారు! ఓ కవయిత్రి అన్నట్లు 'కడుపున కన్నవాళ్లు కసురుకున్నందుకు/ పేగుచించుకు పుట్టినవాళ్లు ప్రేమభిక్ష రాల్చనందుకు/ ఎదిగిన బిడ్డల మధ్య ఏకాకి అయినందుకు...' ఎందరో అమ్మా నాన్నలు దిగులుచెందుతూ, దీనులవుతూ కుమిలిపోతున్న దుర్భర దృశ్యాలెన్నో ఈ సమాజంలో! గర్భస్థ శిశువులుగా ఉన్నప్పుడు తాము కాలదన్నినా ప్రాణరక్తాన్ని పణంగా పెట్టి తమకు జన్మనిచ్చిన తల్లి ముదుసలి అయినవేళ- కడుపులో పెట్టుకొని కాపాడాల్సిన తనయులే ఆమెను బతికి ఉండగానే కాటికి చేర్చారు ఆమధ్య! మొన్నటికి మొన్న- వేరుపడిన ఇద్దరు కొడుకులూ తనను నిరాదరించడాన్ని ఓ నాన్న మనసు తట్టుకోలేకపోయింది. 'మీరైనా కలిసిమెలిసి ఉండండర్రా' అన్న తన మొరను- ఎదిగిన బిడ్డలు తూష్ణీకరించారన్న వేదనతో ఆ తండ్రి తన మంచాన్నే చితిగా పేర్చుకున్నాడు. తనకు తానే నిప్పంటించుకొని సజీవంగా దహనమయ్యాడు. ఇటువంటి సంఘటనలను తలచుకుంటుంటే- కుటుంబ అనుబంధాల్ని, పేగుబంధాల్ని, రక్తపాశాల్ని ఆర్థిక అంశాలే శాసిస్తూ- తల్లిదండ్రులు, బిడ్డల నడుమ చెక్కుచెదరకుండా ఉండాల్సిన సంబంధాలకు, ప్రేమలకు మరణశాసనం రాస్తున్న రోజులు దాపురించాయేమోననిపిస్తుంది. గుండెల్ని కలుక్కుమనిపిస్తుంది. తడి ఆరని గుండెల్లో ఎంత విషాద వృష్టి!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు, సంపాదకీయం, 09 -05 -2010)

______________________________

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...