Sunday, December 12, 2021

దాతలే విధాతలు -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు, సంపాదకీయం , 11 -10 -2009)

 


 

 


కల్పాంతాన ప్రళయం సంభవించి సర్వం జలమయమయి ద్వాదశ సూర్యులూ కొత్త చంద్రులూ ఉదయించడాన్ని మత్స్యపురాణం మహాద్భుతంగా వర్ణించింది. యోగనిద్ర నుంచి లేచిన పరబ్రహ్మ పునఃసృష్టి కోసం  జలమధనం చేసి రెండు బుడగలను సృష్టిస్తే అందులో ఒకటి ఆకాశం, రెండోది భూమి అయింది! ఎన్ని అవాంతరాలొచ్చి  పడినా సృష్టి క్రమం ఆగదనే ఆశావాదం వరకు ఈ కథ నీతిపాఠం గ్రహణీయం. వేళకు వర్షాలు పడి పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ఏటా గోపాలురు ఇంద్రపూజ చేసేవారు మహా భాగవత కథాక్రమానుసారం. ఆ యేడు కృష్ణయ్య మాట విని గోవర్ధనగిరిని కొలిచినందుకు దేవరాజు ఆగ్రహించి వ్రేపల్లె పైన విపరీతమైన వానలు కురిపించాడు. అప్పుడూ ఇప్పుడు మొన్న మన రాష్ట్రంలోని ఆరుజిల్లాల జనం 'నిడు జడిదాకి యెందు జననేరక యాకట గ్రుస్సి'నట్లు అల్లాడారని ఎర్రన హరివంశంలో వర్ణిస్తాడు. 'యింతలోన జగముల్‌ పోజేసెనో, ధాతయెయ్యది, దిక్కెక్కడ, సొత్తు యెవ్విధమునం బ్రాణంబు రక్షించుకోలొదవున్‌... దైవమ!' అంటూ సర్వం కోల్పోయి నిర్వాసితులైన ఆబాలగోపాలాన్ని ఆ బాలగోపాలుడు గిరినెత్తి ఉద్ధరించినట్లు- ఇప్పుడూ మంచిగంధం వంటి మనసున్న మారాజులు ఆదుకునేందుకు ముందుకు దూసుకొస్తున్నారు. హర్షణీయమే, కానీ అది కాదు ఇప్పటి అసలు సమస్య. 'అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త దురితోపశమనం, పావనం, శుభకరమ్‌' అని మనం కొలిచే గంగమ్మ ఇంతగా గంగవెర్రులెత్తడానికి వెనకున్న అసలు కారణం ఏమిటనేదే సందేహం. అత్త ఏదో నింద వేసిందని అలిగి 'వనములను దాటి/ వెన్నెల బయలుదాటి/ తోగులను దాటి/ దుర్గమాద్రులను దాటి/ పులుల యడుగుల నడుగుల కలుపుకొనుచు పథాంతరాల మీదికి వరదలుగా పారింద'ని చెప్పుకొని సర్దుకుపోవటానికి ఇదేమీ విశ్వనాథవారి 'కిన్నెరసాని' కథాకాలక్షేపమేమీ కాదు కదా! నిక్షేపంలా సాగవవలసిన మానవ జీవన మహాకావ్యం కదా!

 

వరద అంటే వారం వర్జ్యం చూసుకుని వచ్చి పలకరించి పోయే చుట్టం కాదు. కరకట్ట తెగిందంటే బడినీ, గుడినీ,  గొడ్డూ గోదనూ, గడ్డివాములనూ, గాదె కింద దాచిన తిండి గింజనూ, బావి మడుగులో జల ఊటనూ, పడుకునే మంచాలనూ, తిని కడుగుకునే  కంచాలనూ, ఏమరుపాటుతో ఉంటే చంటిపాపలతో సహా, మూడు కాళ్ళ ముసలి తాతాఅవ్వలను సైతం  పాపభీతి లేకుండా ముంచేసుకుపోయే ఉద్ధృతం. బందిపోటుకు మించి నీటిపోటు మనలను  మనింటి పైకప్పుల మీదకే  గెంటేసే ఉత్పాతం. సొంతవూరి పొలిమేరల నుంచే మనలను నిరంకుంశంగా తరిమేసే నియంత వరద. కంటి ముందే ఇంటిగోడలు నీటిలో పడి కరిగిపోతుంటే, ఒంటి రక్తం చెమటగా మార్చి పెంచిన పంట చేను ఏడడుగుల నీటి అడుగున ఎక్కడుందో జాడ తెలియని దుర్భర దుస్థితి భయానకం!   'చుట్టూతా ఉప్పు సముద్రం.. మనస్సులోనూ దుఃఖసముద్రం.. జీవనాన్నే మింగేసే జీవనది.. అక్కడెక్కడో ఆనకట్టలు పగిలాయో లేదో గానీ ముందిక్కడ మనిషి గుండె ముక్కలైంది' అంటాడు ఓ ఆధునిక కవి. ఆ ఆవేదన వంద శాతం వాస్తవం. చంటిబిడ్డతో ఇంటి పైకప్పు మీదికెక్కి కూర్చున్న ఇంటి ఇల్లాలు, మిట్టమీద కట్టుబట్టలతో నిలువు గుడ్లు వేసుకుని నిలబడ్డ సంసారి, నడిరేవులో తిరగబడ్డ పడవ కొయ్యను పట్టుకు వేలాడే గంగపుత్రుడు, ప్రకృతి పిశాచి నిలువుదోపిడికి నిలువుటద్దంగా నిలబడిన ఆ వ్యధార్తుల అందరి గుండెల్లోనూ ఇప్పుడు వినిపించేవి ఒకే తరహా ఉప్పెన మరణ మృదంగం మోగించే చప్పుడులు. ఈ సర్వనాశనానికి అసలైన కారణం ఒక్కటే! చెకొవ్‌ చెప్పినట్లు 'విచక్షణా, సృజనా ఉండీ మనిషి ప్రకృతిని వికృతం చేయబూనిన వికార మనస్తత్వమే'! విపత్తు దాపురించిన తరువాతయినా కనీస మానవతా ధర్మంగా  ఇప్పుడు ఔదార్యం పోటెత్తాలి. లోకంలో మనుషులు రకరకాలుగా ఉంటారంటారు. రెండు చేతులతో దోచుకుని దాచుకునేవారు,  అట్లే దాచుకున్నదాన్ని రెండు చేతులా దోచిపెట్టేవారూ. దాచింది దోచిపెట్టేవారి అవసరమే ఇప్పుడెక్కువ బాధిత హృదయాలకు రవంతైనా ఊతం!

 

దాన కర్మ అమరత్వ సిద్ధికి సొపానం అనేది రుగ్వేద వాదం. దీర్ఘాయుష్షు కోసం మైకేల్‌ జాక్సన్‌ కు మల్లే ప్రత్యేకంగా ప్రాణవాయువు గది కట్టించనక్కర్లేదు. కుబేరుడు బిల్‌గేట్స్‌ మాదిరి బిలియస్న్ ధారపోసి బీదా బిక్కీని సేవించుకునే  స్తోమతు అందరికీ ఉండబోదు. దిక్కూ మొక్కూ లేని దీనత్వంలో పడినవాడి  డొక్క నిండుగా ఒక్క పూటకు సరిపడే తిండి అందించినా  చాలు- భోక్త కడుపు నిండిన త్రేనుపే 'దీర్ఘాయుష్మాన్‌ భవ!' అనే దీవెనకు సమానం. వంద ఉంటే పది, పది ఉంటే ఒక రూపాయి! అదీ లేని నిస్సహాయ పరిస్థితిలో అయినా సరే, ఆదరంగా రవ్వంత చిరునవ్వు .. సానుభూతి నిండిన ఏ చర్యయినా బాధల్లో ఉన్నజీవికి పెద్ద ఒదార్పే! సమయానికి అవసరమనిపించే, తాహతకు అనుకూలించే చేయూత చాలు! ఇచ్చుటలో ఉన్న ఆ హాయి ఎంతటి వెచ్చదనం ఇస్తుందో తెలిసొచ్చి తృప్తినిస్తుంది.   ప్రేమ  దేశ కాలాలకు అతీతంగా  తీయగా మగ్గిన పండు. ప్రయత్నిస్తే ఎవరికయినా సులువుగా అందుబాటుకు రావచ్చు. ఎంతమందికైనా పంచవచ్చు. 'పంచేకొద్దీ పెరిగేదీ, పంచదారకన్నా మధురమైనదీ- అవసరానికెవరినైనా ఆదుకోవాలనుకునే ఉదారత అనే సద్భావనే' అంటారు మదర్‌ థెరెసా. ఎవరికీ ఏమీ కాకుండా పెరిగి వెళ్లిపోవటంకన్నా పెనువిషాదం మనిషి జీవితంలో మరేదీ ఉండదు కదా! దానంవల్ల ఎవడూ దరిద్రుడు కాడు. పర్సు ఖాళీ అయినకొద్దీ మనసు ఆనందంతో నిడిపోతుంది. నీటిని దాచుకునే సముద్రం కన్నా దానం చేసే మేఘాలే ఎప్పుడూ ఎత్తులో ఉండేది. దానగుణం అణువణువునా పుచే వృక్షం పండ్లు ఇవ్వలేని వేసవిలోనూ నీడనయినా ఇచ్చి తృప్తిపడుతుంది. స్వయం ప్రకాశితం కాకపోయినా  సూర్యకిరణాలను వెన్నెలలాగే పంచేది కనకనే చంద్రుడిని అందరూ ప్రేమగా చందమామా అని పిలుచుకునేది. అడవిలో, యుద్ధంలో, నిద్రలో, నీటిలో, నిప్పు పైన, ఒంటరిగా ఉన్న వేళ, ఒంటిపై స్పృహలేనప్పుడు కూడా చేసుకున్న పుణ్యమే జీవిని రక్షిస్తుందని అదర్వణవేదం హితవు చెబుతుంది. పరోపకారానికి మించిన పుణ్యం లేదంటుంది పంచతంత్రం కూడా. ఈ చేత్తో సంపాదించి ఆ చేత్తో ఇవ్వడానికేగా దేవుడు మనకు రెండు చేతులు ఇచ్చింది! ఆలోచించండి!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు, సంపాదకీయం , 11 -10 -2009)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...