Sunday, December 12, 2021

దేవుడే రక్షించాలి!సరదా కథ -- కర్లపాలెం హనుమంతరావు

 


కోటీ బస్టాండులో బస్సు దిగిపోయారు విష్ణుమూర్తి దంపతులు.

’గజేంద్రమోక్షంలో ఆ ఏనుగు పాపం వెయ్యేసి ఏళ్లు ఎట్లా పడిందోగానీ పాట్లు ఆ  మడుగులో మొసలితో.. ఒక్క అరగంట మనమీ  బస్సులో ప్రయాణం చేసేసరికి గురుడు గుర్తుకొచ్చాడు దేవీ!’ 

‘శంఖుచక్రాలు, గదా కిరీటాలు వెంట తెచ్చుకొమ్మంటే వింటిరి కాదు! కమ్మంగా గరుడు వాహనం చేతికింద పెట్టుకుని.. ఈ డొక్కు గరుడాలో యాత్రలేంటంట! రామావతారంనాటి  కష్టాలు గుర్తుకొచ్చాయి స్వామీ! ఆ రావణాసురుడి పుష్పకవిమానమే  నయం’

‘భక్తులు ఈ మధ్య ప్రద్దానికీ పెద్దగగ్గోలు పెట్టేస్తున్నారు! నిజంగానే ఇబ్బందులు అంత భయంకరంగా ఉంటున్నాయా? అసహనం అతిగా పెరిగి మన సహనాన్ని పరీక్షిస్తున్నారా?’ ఆవటా అని పరీక్షించుకోడానిక్కదా  మనమీ భూలోక పర్యటన పెట్టుకుంది! శంఖుచక్రాలు,  కిరీటాలు గట్రా పటాటోపాలుంటే జనం పట్టించుకుంటారా! పెద్ద పండుగ అయిపోయినా  పగటివేషగాళ్ళింకా ఊళ్ళోనే తిరుగుతున్నారని ఎగతాళి చేయరూ! జనం మధ్యలో జనం మనుషులు మాదిరి తిరిగితేనే కదా  మనకూ నిజమైన జనం కష్టనష్టాలేవిటో తెలిసొచ్చేది!  రామావతారంనాటి ట్రిక్కు. పద.. పోదాం! పెళ్ళినడకలొద్దు!’  

‘బాగుంది సంబడం!  సమయమంతా  బస్సు వెయిటింగులోనే గడిచిపోయింది. నన్నంటారేం మధ్యలో! చీకటి పడేలోగా  మనలోకానికి వెళ్ళిపోవాలి బాబూ! పొద్దుగూకితే ఇక్కడ ఆడవాళ్లకి బొత్తిగా రక్షణ లేదని బెదరగొట్టాడు నారదుడు!’  

ఆదిలక్ష్మి మొత్తుకోళ్ళు పూర్తవనే లేదు ‘పట్టుకోండి! పట్టుకోండి! దొంగవెధవెవడో నా బంగారు గొలుసు ఎత్తుకెళుతున్నాడు! దేవుడా! దేవుడా! ఎక్కడున్నావయ్యా! కాపాడటానికింకా  రావేమయ్యా’ అంటూ ఆర్తనాదాలు!

‘తమరిహ   కార్యరంగంలోగ్గానీ దూక్కపోతే  నా చెవులు ఇక్కడే బద్దలయేట్లున్నాయి!  ముందా భక్తురాలి మొరేంటో ఆలకించండి  మహాప్రభో!’ ‘చెవులు రెండూ  గట్టిగా మూసేసుకుంది మహాలక్ష్మి. 

దొంగవెంటబడక తప్పలేదు పరంధాముడుకి!

అలనాడు మాయలేడి వెంటబడ్డం కన్నా మహా కష్టంగా ఉందీ తుంటరి వెంట తరుములాట. త్రేతాయుగంనాటి ఆ సంఘటన జరిగింది కాకులు దూరని కారడవుల్లో! చీమలు దూరని ఆ చిట్టడవులెక్కడ! చీటికి మాటికి  వాహనాలు, గోతులు, గుంతలు, మురిక్కాలవలు, హోర్డింగులు, చిన్నదుకాణాలు,  పోస్టర్లు మేసే దున్నపోతులు..  అడుగడుక్కీ అడ్డొఛ్చే ఈ  సిటీ రోడ్లెక్కడ! 

ఎవరో గల్లీలీడరు తాలూకు ఎన్నికల ర్యాలీ అడ్డుతగలటంతో  దొంగ దేవుడికి దొరికిపోయాడు. ‘అన్నా.. అన్నా! నన్నొదిలేయన్నా! కావాలంటే నీ వాటా నీకు తెంపిచ్చేస్తానన్నా!‘ హఠాత్తుగా కాళ్ళు రెండూ పట్టేసుకొన్నాడు దొంగ.  బిత్తరపోయాడు భగవంతుడు! 

‘అన్నా ఎవడ్రా నీకు! నన్నెవరనుకున్నావురా చోరాధమా!’

‘మన  హెడ్డు పోలీసెంకటసామివే కదన్నా!’ 

‘పోలీసును కదురా పోకిరి మానవాధమా! భగవంతుణ్ణి!’

‘అంటే దేవుడివా! మరీ మంచిదన్నా! ఎప్పట్లా నీ ముడుపు నీవు పుచ్చేసుకొని నన్ను విడిచి పుచ్చేయరాదే! నాకేం! జైలుకెళ్లైనా జబర్దస్తుగా బతికేయగలను! కరువు రోజులు! నా పెళ్లాం పిల్లలే నీ ఎదాన పడి ఆకలి చావులు చస్తారు! ఆలోచించుకో సామీ!’

‘కష్టాలు ఎవరికైనా ఒక్కటేగా! సంసార పోషణకని ఈ జీవి

 దొంగతనానికి పూనుకుంటే అది  శిక్షించదగ్గ పాపమవుతుందా!’ 

దేవుడు ధర్మసంకటంలో పడిపోయాడు.

సందుచూసుకొని దొంగ సగంబంగారంతో సహా సందులోకి  ఉడాయించేసాడు!

సగంబంగారమే చూసి ఆడమనిషి వీరంగాలు మొదలపెట్టింది ‘దొంగలు.. దొరలు కుమ్మక్కవడమంటే ఇదే! సగంబంగారం నొక్కేసి పెద్ద ఆపద్భాంధవుడిలా ఆ పోజేమిటయ్యా పెద్దమనిషీ!’ అంటూ పెడబొబ్బలు! అంతకంతకూ  జనం మూగిపోతున్నారు! 

 మొగుణ్ణి రక్షించుకోవాల్సిన పతివ్రతా ధర్మం  హఠాత్తుగా గుర్తుకొచ్చింది  లక్ష్మీదేవికి. వంటిమీది బంగారు గొలుసొకటి ఆడమనిషి మీదకు విసిరి  దేవుడి రెక్క పుచ్చుకొని  చక్కా ఉడాయించింది.. పక్కనే ఉన్న బస్తీలోకి.


‘ఈ ఆపద్భాంచవుల వేషాలు ఇప్పుడంత అవసరమా అనాథరక్షకా! దొరలెవరో.. దొంగలెవరో పోల్చుకోడమే కష్టంగా ఉంది. దొంగలూ ‘లా’ పాయింట్లు లాగేస్తుంటే ఏ నేరానికని తమరు దుశ్టశిక్షణకు పూనుకోగలరు?  వచ్చిన దారినే  పోదాం పదండి! మన పాలసముద్రంమీద నేను మీ కాళ్లు వత్తుతూ కూర్చుంటాను. మీరు కమ్మంగా కళ్లు మూతలేసుకొని పడుకుందురుగాని స్వామీ!’

‘మనమేమీ రాజకీయ నాయకులం కాదు.. అవసరాన్ని బట్టి జెండా, ఎజెండా మార్చుకోడం కుదరదు! భూలోకస్వర్గం సృష్టిస్తామని అభయహస్తమిచ్చి   తీరా ఇప్పుడేవో చిన్న అడ్డంకులొచ్చిపడ్డాయని.. చేతులెత్తేయడం ధర్మం కాదు !  సర్వాంతర్యాములం! దుష్టశిక్షణ.. శిష్టరక్షణ మన పర్మినెంటు  మ్యానిఫెస్టో! ఇంకో రెండు మూడు కేసులన్నా చూడకుండా వెనక్కి వెళ్ళిపోతే అమరలోకంలో మన పరువేం కాను!’ మొండిగా ముందుకే కదిలాడు ముకుందుడు!

‘నీళ్లకుళాయిల దగ్గర ఆడంగులు జుట్టు జుట్టు పట్టుకుని సినీపరిభాషలో ముచ్చట్లాడుకోవడం దేవుడు కంటబడింది. విడదీసేందుకు అడ్డు వెళ్ళిన ఆదిలక్ష్మికీ నడ్డిమీదా వడ్డింపులు తప్పలేదు.  ‘నీళ్లింకా రాకముందే  ఈ జగడాలెందుకు తల్లుల్లారా!’  జగన్నాథుడి ఆందోళన. 

‘అవెప్పుడొచ్చి చచ్చేనయ్యా! పోయినసారిట్లాగే ఎన్నికలప్పడు ఒక్క చెంబెడు పడ్డట్లు గుర్తు. మళ్లీ ఎన్నికలొచ్చాయి కాబట్టి ఇంకో చెంబో అరచెంబో వస్తాయని ఆశ! వాటి కోసమే మా మంతనాలు’ అందో మహాతల్లి చర్చల సందర్భంగా ఊడిన జుట్టుముడి సవరించుకొంటూ!

భగవానుడు చిరునవ్వుతో కుళాయి ట్యాపుమీద ఇలా తట్టాడో లేదో..  బొళ బొళా  ఇనుపగొట్టంగుండా గంగ ప్రవాహంగా కిందకురికింది. ఆడంగులెవరి మొహాల్లోనూ ఇసుమంతైనా ఆశ్చర్యం లేదు! ఒక నడివయసు సుందరి మాత్రం  అతితెలివి ప్రదర్శించింది, ‘బాగుంది బాబూ మేజిక్కు! ఏ పార్టీ తరుఫున తమ్ముడూ తమరీ గమ్మత్తు ప్రచారం?’

‘ఏ పార్టీ అయితేనేంలేవే అక్కా! వీళ్ల ఎత్తుభారం ట్రిక్కులు ఎవతెకు తెలీవనీ! పోయినసారిట్లాగే ఎన్నికలప్పుడే   రోజుకో పగటేషం ఏసుకొచ్చి  మాయచేసి చచ్చారు! ఏవయంది చివరికి!  గెలిచి గద్దెనెక్కేక దేవుళ్లల్లే  నీలుక్కుపోయారు! ప్రతీసారీ మోసపోయేందుకు మేమేమంత ఎతిమతంగా  కనపడుతున్నామా ఏందయ్యా! అందుకోయే అప్పా.. ఆ బిందెతో ఒక్కటిచ్చుకుంటే ముఖం లొత్తపడిపోవాల!’ కొంగుబిగించిన కోమలాంగికి కోరస్ అందిస్తూ మిగతా ఆడంగులూ  పూర్తిగా కార్యాచరణకు పూనుకోకముందే భర్త పరువు  కాపాడుకోవాల్సిన బాధ్యత మరోసారి మహాలక్ష్మి నెత్తిన పడింది. 

స్వామిచెయ్యి పుచ్చుకొని  రైతుబజారులోకి పరుగెత్తింది.

రైతుబజారులో కూరగాయలేమీ రాశులు రాశులుగా పోసి లేవు. రకానికి ఒక్కటి.. సంక్రాంతి  బొమ్మలకొలువులో మాదిరి.. ఏ  దుకాణంలో   చూసినా ఒహటే దృశ్యం! నోరెళ్లబెట్టి చూస్తున్నారు  విష్ణుదంపతులిద్దరూ! ఓ బక్కపల్చటి జీవి భుజంమీది బస్తాలోనుంచి  కరెన్సీ కట్టొకటి తీసి దుకాణం మనిషిమీదకు విసిరేసాడు. కొత్తిమేర కట్టొకటి అందుకొని ముక్కుదగ్గర పెట్టుకొని.. ఓహో.. ఒహటే మురిసిపోవడం! 

మూడు నిమిషాలైనా కాలేదు.. కట్ట  క్రూరంగా వెనక్కు లాగేసుకుని ‘బోడి వెయ్యి రూపాయలకెంత సేపయ్యా  వాసన్లు చూసేది! ఇట్లాగయితే ఇహ మేం వ్యాపారం చేసి తట్టుకొన్నట్లే! నడు.. నడు..పక్కకు!’ అంటూ  డబ్బుకట్ట పట్టుకు నిలబడ్డ మరో ఆడమనిషితో బేరంలో పడిపోయాడు దుకాణంమనిషి.

‘భగవంతుడి బుర్ర గిర్రున తిరిగింది. బక్కభక్తుణ్ణి పట్టుకుని విషయం కక్కిస్తేగాని కష్టం గట్టెక్కించే తోవ తోచే అవకాశం లేదు.

‘కాయగూరలు పండించే భూములన్నీ కాంక్రీటు అడవుల్లా మారి యుగాలయ్యాయయ్యా అమాయక దేవుడా! కొత్తగా కూరలు పండించే అవకాశం బొత్తిగా లేదెక్కడా ఇప్పుడు!  సింథటిక్ టైప్ కాయగూరలు స్వామీ ఇవన్నీ! మీ సృష్టి కర్తలకేమీ అర్థంకావులే ఇవి!  రకానికొకటి చొప్పున చైనానుంచి బోలెడంత పోసి తెప్పిస్తారీ దుకాణదారులు. నెల మొదటితారీఖుకదా ఇవాళ!  జీతాలు వచ్చే నా బోటి అదృష్టవంతులం కొందరం ఉన్నంతలో ఇట్లా డబ్బుపోసి కాస్సేపు వాసన్లు  చూసి తరించి పోతుంటాం! సుష్టుగా భోజనం చేసినట్లు అదో తుత్తి!’ బక్కజీవి వివరణ. లక్ష్మమ్మకు తిక్కరేగింది. ’నువ్వొక్కడివే వచ్చి ఇట్లా వాసన్లు చూసుకొని మురిసిపోతే సరిపోతుందా పెద్దమనిషీ! ఇంట్లో పెళ్లాం బిడ్డల సంగతేమీ ఆలోచించద్దా!’

‘హుఁ! పెళ్లామూ.. పిల్లలూ కూడానా తల్లీ ఈ కరువు రోజుల్లో!’నుదురు బాదుకుంటున్న బక్కజీవిని చూసి భగవంతుడి కడుపు నిజంగానే తరుక్కుపోయింది.

 నిజమైన కష్టనష్టాలు ఎలా ఉంటాయో కళ్లక్కట్టినట్లు కనపడుతున్నాయిప్పుడు.

‘ఇన్నేసి సొంట్లు పడుతూ ఈ భూలోకాన్నె అంటిపెట్టుకుని ఉండకపోతే..  కమ్మంగా మోక్షం ప్రసాదిస్తాను. స్వర్గం వచ్చెయ్యరాదా బక్కభక్తా!’

‘అదీ సంగతి! ఇప్పుడర్థమయిందయ్యా మీ ఇద్దరి కత! ఏ పార్టీ తరుఫునంకుల్ ఈ నయా ప్రచారం? ఎన్నికలదాకానేగా  ఈ అమిత ఔదార్యం!  ఎన్ని ఎన్నికల సిరాచుక్కలు చూసింది  స్వామీ ఈ చూపుడువేలు!  పదివేలు పోస్తేనన్నా  ముక్కు దగ్గరకు కొత్తిమేరకట్టొస్తోందిప్పుడు.  మీ హామీలన్నీనిజమేనని నమ్మి మా ఓట్లన్నీ  మీకేసేస్తే! ఏ  మాయదారి పార్టీనో మీది నాకు తెలియదుగానీ.. మోక్షంవంకతో మీ కాపుసారా అమృతమని చెప్పి  అమ్ముకుందామనేగా మెగా ప్రణాళిక! మీ పుణ్యముంటుంది..  బాబ్బాబూ! నన్నిలా వదిలేయండి!’ అంటూ మరో కూరగాయల దుకాణంలోకి దూరిపోయాడా బక్కమనిషి.. ఏ ఉల్లిపొరో వాసన చూసేందుకు!

***

పొద్దున కోఠీలో దిగింది మీరిద్దరేనా మహాశయా! దేవుళ్లకైతే మాత్రం ఎన్నికల కోడ్లు ఉండవా!  పరమ అమాయకులయ్యా మా ఓటరు ప్రజానీకం! మోక్షం సాకుతో ఎవరివైపు తిప్పాలని మీ పథకాలు?కోడ్ ఉల్లంఘన  కేసు బుక్కయితే బెయిలుకూడా దొరకదు కలియుగం గడిచినా.. తెలుసా!’ చిందులు తొక్కుతున్నాడు ఎదురుగా నిలబడ్డ పెద్దమనిషి.

 ‘ రాంగ్ టైంలో వచ్చినట్లున్నాం బాబూ మేమీ భూలోకానికి! ఎంత దుష్టశిక్షణ.. శిష్టరక్షణకయినా.. ఓ  సమయం సందర్భం ఉంటుందన్న ఇంగితం ఇప్పుడే మాకు వంటబట్టింది! ఏ కోడూ.. ఓడూ అడ్డులేనప్పుడే వచ్చి కాపాడుకొంటాంలే మా భక్తజనావళిని! మమ్మొదిలేయండి మొదటిసారి తప్పుకి!’  శ్రీవారి చెయ్యిపట్టుకొని ముందుకు కదలబోయింది శ్రీలక్ష్మీదేవి.

‘వచ్చినవాళ్లు ఎలాగూ వచ్చారు. మా పార్టీ అభ్యర్థికో పది ఓట్లు తరుగుపడేట్లున్నాయి. ఇద్దరూ కలిసి ఎనిమిది చేతుల్తో  ముద్దర్లు గుద్దేసి పోండి స్వాములూ! మీ కష్టం ఊరికే ఉంచుకోంలే! మీ కొండ చిరునామా ఏదో  చెబితే గెలిచినాక వచ్చే నిధుల్లో సగం మీ హుండీలోనే సమర్పించుకుంటా!’ అన్నాడు ఎన్నికల్లో నిలబడ్డ ఆ అభ్యర్థి!

దేవుళ్ళిద్దరూ శిలాప్రతిమల్లా చూస్తుండిపోయారు!

హా! ప్రజాస్వామ్యమా! దేవుడే ఇహ నిన్నురక్షించాలి సుమా!

 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం ) 

చిదంబర రహస్యం – కథానిక -కర్లపాలెం హనుమంతరావు ( ఆంధ్రభూమి డిసెంబర్,4 2008 ప్రచురితం)

 


'నిజం చెప్పండి! డాక్టర్ల దగ్గర రోగంలానే, డిటెక్టివ్ల దగ్గర నిజం దాస్తే నష్టం.' అన్నాడు ప్రైవేట్ డిటెక్టివ్ చిదంబరం ధర్మతేజ  తటపటాయింపు తగ్గించే నిమిత్తం స్టేట్ ఎక్స్ప్రెస్ టిన్ అతని ముందుకు తోసి..  తానోటి వెలిగించి.

'నో.. థేంక్స్!' అంటూ నోరు విప్పాడప్పుడు ధర్మతేజ.

చెబుతోన్నంత సేపూ అతగాని మొహం కందగడ్డే. ఆఖర్లో అన్నాడూ 'ఇలా చెప్పడం గుండెలు కోసినట్లుంది. అంతగా ప్రేమిస్తున్నా ఆమెని. అందుకే ముందు నిజమో కాదో తేలాలి'

'నిజమని తేల్తే?'

'చంపుకోడవేఁ. ముందు తననీ.. ఆనక నన్ను నేను' అన్నాడు ఠకీమని. వెంటనే  తమాయించుకుని 'మీ ఫీజెంతో చెప్పండి ముందు!'  అనడిగాడు టాపిక మారుస్తూ.

'ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడివ్వండి! బేలెన్స్ టూ పాయింట్ ఫైవ్  లేక్స్ .. ఒన్స్ కేస్ ఈజ్ క్లోజ్డ్'

సైన్ చేసిన చెక్ అందిస్తూ 'మళ్లీ ఎప్పుడు కనిపించాలి'  

లేచి నిలబడుతూ అడిగాడు ధర్మతేజ..

'డే ఆఫ్టర్ టుమారో! ఈవెనింగ్.. ఎగ్జాట్లీ.. బై సిక్స్ వో క్లాక్.  మా ఇంట్లో కలుద్దాం. 'బిఫోర్ దట్.. ' అంటూ ధర్మతేజతో కలసి బైటికి నడిచాడు చిదంబరం.

'యూవార్ వెల్కం. బట్.. తనకివేమీ తెలీకూడదు' విజిటింగ్ కార్డిచ్చి ముందుకు కదిలిపోయాడు ధర్మతేజ.

 

హైదరాబాద్ అమీర్ పేట్ లో 'ఫ్లై డాడీ' ఎయిర్ లైన్స్  ఏజెన్సీ యజమాని ధర్మతేజ. వెరీ బిజీ అండ్ సక్సెస్ ఫుల్ బిజినెస్ పర్శన్. భార్య శకుంతలంటే ఏడో ప్రాణం. ఆరో ప్రాణం వాళ్ళిద్దరి మూడేళ్ల పాప.

హద్దులు మీరిన పొసెసివ్ నెస్ అనుమానాలకు తావిస్తుందంటాడు ఫ్రాయిడ్. మూవీ-యాక్టింగ్ కోర్సులో ట్రయినింగయ్యేందుకని వచ్చిన బాబాయి కొడుకు భరత్ వైపుకు భార్య చూపు మళ్లినట్లు ధర్మతేజ అనుమానం.

బెడ్ రూంలో దిండు కింద అతగాడి అండర్-వేర్ కనిపించినప్పట్నుంచి ఆ మధన. బైటపడి అడిగేందుకు సంస్కారం అడ్డు! కడుపులో దాచుకునేందుకు ప్రేమ ఒప్పదు.

'అనుమానం అంటూ మొదలయ్యాక జరిగేవన్నీఅది బలపడేలానే  ఉంటాయిలే.. సహజం. 'ఇలాంటి సంకటాలొచ్చినప్పుడే మనకు నిజాలు తేలాలంటే నిఖార్సైన  డిటెక్టివ్  అవసరం' అంటూ కథంతా విన్న క్లోజ్ కాలేజ్‍మేట్ శశిధర్ మిత్రుడికి చిదంబరాన్ని సూచించాడు.

---

కేస్ విషయాలన్నీ డిక్టేటేషన్లో నోట్సుగా రాసుకుంటూ పి.ఏ మిస్ రోజా అడిగింది 'బాస్.. మీరీ మిస్టరీని ఎట్లా ఛేదించబోతున్నట్లో?'

'మామూలే! ఉందిగా మన 'మిషన్ ఫ్రాంక్' తంత్రం!' అన్నాడు చిదంబరం చిర్నవ్వులు చిందిస్తూ.

'మనమీ తంత్రం మీద మరీ ఎక్కువ డిపెండవుతున్నామని నా  అనుమానం బాస్! మొన్నంటిదంటే అదో అనెడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ కపుల్ కేస్..'

‘ముందు నీ డౌట్ క్లియర్ చెయ్యడం ముఖ్యం!’ అంటూ రోజా  గ్లాసెస్  అందుకుని  స్పైక్స్ మీద  సమ్‌-థింగ్ నాన్-స్టికీ ఆయింట్ మెంట్ లాంటిదేదో పూసి  పెట్టుకోమని తిరిగిచ్చేశాడు చిదంబరం.

జోడు పెట్టుకున్న రోజాకు కొద్ది క్షణాల్లోనే కళ్ళు రెండూ తేలిపోతున్నట్లో ఫీలింగ్ మొదలయింది!

చిదంబరం జస్ట్ ఓ మూడే మూడు ప్రశ్నలు   వేసి జోడు తీసేయించాడామె చేత.

'స్పైక్సు క్లీన్ చేసుకో ఆనక!' అంటూ రోజా చెప్పగా తాను విన్నది రిపీట్ చేసి 'యామై రైట్?' అనడిగాడు మిస్టీరికల్ గా నవ్వుతూ చిదంబరం.

రోజా సిగ్గుపడి తల తిప్పుకుంది.

---

నెక్స్ట్ డే సండే! ఈవెనింగ్  చిదంబరం ఇంటికి ధర్మతేజ దంపతులు, భరత్ తో సహా కలసి వచ్చారు. మిస్ రోజా ఆ సమయంలో అక్కడే ఉంది ఏదో టైపింగ్ వర్క్ ఎడిట్ చేసుకుంటో.

చిదంబరం బ్యాచిలరే ఇంకా. 

పార్టీ మధ్యలో చిదంబరం ధర్మతేజనో సైడుకు తీసుకెళ్లాడు.  'మిషన్ ఫ్రాంక్' ఆపరేషన్  గురించి వివరిస్తుంటే ధర్మతేజకు ఇదంతా 'ట్రాష్' అనిపించింది. ఆ మాటే అన్నాడు కూడా.

'మీ నమ్మకం కోసం మీ మీదే ప్రయోగించి చూపిస్తానోసారి.. ఇఫ్ యూ పర్మిట్ మీ!' అన్నాడు చిదంబరం.

ధర్మతేజ తలాడించాడంతో. 'మిషన్ ఫ్రాంక్' ఆపరేషన్ యథావిధిగా రోజా మీదకు మల్లేనే ఓ ఐదు నిమిషాలు ఆపరేట్ చేసి అనంతరం  చిదంబరం చిలిపిగా  'సార్! తమరూ తక్కువేం తినలేదుగా మరి..!' అంటూ  ధర్మతేజ ముఖతః తాను విన్న సమాచారం కొంత తిరిగి వినిపించాడు.

ఖంగు తిన్నా.. వెంటనే తెప్పరిల్లి అన్నాడు ధర్మతేజ డిఫెన్సివ్ గా 'దెన్ ఐ వజ్ ఇన్  యన్ ఎడొల్సెంట్ స్టేజ్..! శకుంతల పరిచయం తరువాత నా సర్వస్వం తనే!  పాప మీద ఒట్టు'

'ఓకే సార్! వై షుడై హేవ్ ఎనీ బిజినెస్ విత్ ఆల్ దీజ్ యువర్ థింగ్స్! ఇదైనా  జస్ట్ ..మీకు ఈ  మిషన్ ఫ్రాంక్ ఆపరేషన్ మీదున్న  అపోహలన్నీ తొలగిద్దామనే!' అన్నాడు చిదంబరం తన బిజినెస్ మార్క్ చిర్నవ్వులు చిందిస్తూ.

'ఇప్పుడైనా మీకు నమ్మకం కుదిరిందనుకుంటా?' అని అతగాడు అడిగినప్పుడు తలాడించక తప్పలేదు ధర్మతేజకు.

'గుడ్! ఇదే ట్రిక్ ఇప్పుడు మీ భరత్ మీదా ప్రయోగిద్దాం! అతగాడి నోటి నుంచి వచ్చే మాటలే నా ఇన్వెస్టిగేషన్ అఫిషియల్ రిపోర్ట్ సర్! ఈ మేటర్ వివరించడం కోసమే మిమ్మల్నీ పై అంతస్తు దాకా  తీసుకొచ్చింది' అంటూ ధర్మతేజతో సహా కిందికి దిగి వచ్చేశాడు చిదంబరం.

ముందు అనుకున్న ప్లాన్ ప్రకారమే శకుంతలనీ, పాపనీ ఇల్లు చూపించే నిమిత్తం లోపలికి తీసుకెళ్లివుంది మిస్ రోజా. భరత్ ఒక్కడే  టీ.వీ చూస్తున్నాడు. అప్పుడే లోపలికొచ్చిన చిదంబరాన్ని, ధర్మతేజను చూసి తన కళ్లజోడు టీ పాయ్ మీద పెట్టి వాష్-రూం లోకి వెళ్లాడు 'జస్ట్ టూ మినిట్స్ ప్లీజ్' అంటూ భరత్.

భరత్ తిరిగొచ్చే లోగా ఆపరేషన్ ఫ్రాంక్ సీన్ కు సెటప్పంతా  సిద్ధం చేసుంచాడు చిదంబరం.

 తిరిగొచ్చి జోడు తగిలించుకున్న భరత్ ఒక్కరనిముషంలోనే విచిత్రంగా బిహేవ్ చెయ్యడంతో ధర్మతేజకు నమ్మకం కుదిరింది. 'ఇతగాని మైండ్  ఇప్పుడు పూర్తిగా మన అధీనంలోనే ఉంది మిష్టర్ ధర్మతేజా!  డైరెక్టుగా మీ మనసులోని శంకలన్నిటినీ మిరే అడిగి తీర్చుకోండి' అన్నాడు చిదంబరం.

ధర్మతేజను వేధించే సందేహానికి  భరత్ ఇచ్చిన సంజాయిషీ   'శకుంతల నాకు సిస్టర్తో సమానం. తనక్కూడా నాలానే  మూవీలంటే మహా పిచ్చి. బ్రదర్ కేమో అవంటే అస్సలు పడదు.  సినిమా కబుర్ల కోసమని పాపం  నాతో భేటీలకు తపించేది వదినమ్మ. అంతకు మించి.. పాపం.. సిస్టరిన్లాకి మనసులో ఎవరి మీదెలాంటి  పర్శనల్ ఇంట్రెస్టూ లేదు. అట్లా ఆలోచించడమే మహా పాతకం!'

'అద్సరేరా! మరా  బెడ్ రూంలో పిల్లో కింద నీ డర్టీ ఇన్-సైడ్ థింగ్? దాని  మేటరేంటి బేఁ? ముందది తేల్చి చావు!' 

కంట్రోల్ తప్పుతున్న ధర్మతేజను చిదంబరం  నిలవరించే ప్రయత్నం చేస్తున్నా.. భరత్ లో మాత్రం ఏ వికారం లేదు.  అంతే ప్రశాంతంగా జవాబులివ్వడం చూస్తే 'మిషన్ ఫ్రాంక్' పనిచేసే తీరుకు రివ్యూస్ లో ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వక తప్పదెవరైనా.

ఆఖరు ప్రశ్నగా ధర్మతేజను ఇన్నాళ్లు సలిపేస్తోన్న    దిక్కుమాలిన సందేహానికీ భరత్ ఎంతో కూల్ గా ఇచ్చిన  సమాదానం

 'పడగ్గదిలో మేం పిచ్చాపాటీలో ఉండంగా బొద్దింకోటి హఠాత్తుగా నా స్మాల్ నిక్కర్లోకి దూరిందన్నయ్యా! చిన్నప్పట్నుంచి నాకు బొద్దింకలంటే చచ్చే భయం. నా చిందులు అవీ చూళ్ళేక పాపం వదినమ్మే చొరవ చేసి నిక్కర్లన్నీ కిందకి లాగేసింది. ఇంతలోనే ఇంట్లోకి  మీ సడెన్ ఎంట్రీ.  ఆ కంగార్లో ఏది పికప్ చేసుకున్నానో, ఏది అక్కడ వదిలేశానో ఐడియా లేదు.   అందులో ఏదో ఒకటి మీ పిల్లో కిందకు వెళ్లిందనుకుంటా! అన్నెససరీ డౌట్సన్నింటికీ  అది కారణం అవుతుందేమోనన్న వదినమ్మ భయం వల్లే ఇప్పుడీ  అల్లరంతా!  అన్నం పెట్టి ఆశ్రయమిచ్చే అన్నపూర్ణమ్మ వదిన. ఎవరా దృష్టితో చూసినా రౌరవాది నరకాలు పట్టిపోక తప్పదు!' అంటూ కుమిలిపోయే భరత్ ను చివరికి ధర్మతేజే దగ్గరకు తిసుకుని అనునయించాల్సిన  పరిస్థితి వచ్చిపడింది. 

'మిషన్ ఫ్రాంక్' ఇన్ఫ్లుయెన్స్ మనిషి మైండ్ మీదుండేది జస్ట్ ఫస్ట్ ఫైవ్ మినిట్సేనని చిదంబరం ముందుగానే   చెప్పుండడం వల్ల  భరత్ ఆ బేడ్ మూడ్ నుంచి   బైటికి రావడం ధర్మతేజలో మళ్లీ ఏ డౌట్సుకూ కారణం కాలేదు. అతని అన్ని డౌట్సూ పర్మినెంట్ గా క్లియరవడంతో శకుంతల, పాప రోజాతో తిరిగొచ్చేసరికి వాతావరణం సాధారణ స్థితికొచ్చేసింది. అందరూ నవ్వుతూ పార్టీ పూర్తిచేసుకుని ఆనందంగా  ఇళ్లకు వెళ్లే వేళకు సమయం రాత్రి పన్నెండు దాటింది.

---

నెక్ట్స్ డే శకుంతల దర్మతేజ ఆఫీసుకొచ్చి చేతులు పెట్టుకుని కన్నీళ్లుపెట్టుకుంది 'నా కాపురం నిలబెట్టారన్నయ్యా! మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది' అంటూ.

'మీరు  రుణపడి వుండాల్సింది నాకు కాదు మ్యాడమ్! మీ మూడేళ్ల  పాపకు. బంగారు బొమ్మలా ఉన్న  ఆ చిన్నారి తల్లికి అమ్మానాన్నా లేకుండా చేసేందుకు నా మనసొప్పింది కాదు. ఎట్లాగూ అన్నయ్యా అన్నారు కాబట్టి, సోదర భావంతో ఓ చిన్ని సలహా! మీరన్నట్లు ధర్మతేజ మ్యారేజ్ కి ముందు ఏమైనా చెస్తే చేసుండచ్చేమో! ఒన్స్ హి సా యూ.. హి హాజ్ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ యూ ఓన్లీ! ఆ వైపు నుంచి కూడా నేను ఇన్వెస్టిగేట్ చేసి చెబుతున్న మాట తల్లీ ఇది! హి ఈజ్ లవింగ్ యూ మోర్ దేన్ హి హిమ్ సెల్ఫ్! పగలు, ప్రతీకారాలు బయటి లోకానికి. పగలూ రాత్రి ఒకే చూరు కింద ఒకరికి ఒకరుగా బతికే భార్యాభర్తలకు కాదు. దయచేసి ఇహ ముందైనా కన్నబిడ్డ కోసం  కట్టుకున్న భార్యాభర్తలు మీరు   కట్టు నుంచి విడిపోకండి! ధర్మతేజకైనా ఇదే చెబుదును కానీ.. ఆ అవసరం లేదిప్పుడు.  అమ్మానాన్నల కలహాలతో కన్నపిల్లల జీవితాలు ఎంతలా కల్లోలమవుతాయో అనుభవించిన ఓ అనాధబాలుడిగా మీకు ఇదే నేనిచ్చే  సలహా' అన్నాడు డిటెక్టివ్ చిదంబరం.

---    

మర్నాడు ధర్మతేజ ఇచ్చిన బేలెన్స్ ఎమౌంట్ చిదంబరం బ్యాంక్ ఎకౌంటులో జమ చేస్తూ రోజా అడిగింది 'బాస్! నాకింకా నమ్మబుద్ధవడంలేదు! నిజంగా ఇదంతా   'మిషన్ ఫ్రాంక్' తాలుకూ మిరకలేనంటారా? ఏళ్ల బట్టి మనుషులు గుండెల్లో అదిమిపట్టుంచుకున్న నిజాలను వెలికి తీసే స్ప్రేలు ఉన్నాయంటారా?'

'లేవు  రోజా! ఉండే అవకాశాలు కూడా లేవు' చిద్విలాసంగా నవ్వాడు  చిదంబరం.

నోరెళ్లబెట్టింది మిస్ రోజా. 'మరి నా నుంచి, మిస్టర్ భరత్ నుంచి ఫ్యాక్ట్స్ అలా ఎలా  రాబట్టారు బాస్?'

'ధర్మతేజ నుంచి కూడా రాబట్టాను మేడమ్ రోజాగారూ! మీ దాకా ఆ సంగతి ఇంకా రానీయలేదంతే! నిన్న మనాఫీసులో నువ్వు బైటపెట్టినట్లు నేను చెప్పిన విషయాలేవీ నిజానికి  నువ్వు నిజంగా బైటపెట్టినవి కాదు. కేసు తీసుకున్న వెంటనే నేనొక్కణ్ణే వెళ్ళి ముందు మిసెస్ ధర్మతేజను వంటరిగా కలసి  గట్టిగా నిలదీసిన విషయం ఎవరికీ తెలీదు. ఆమె కన్ఫెషవుతూ కారణంగా చెప్పుకొచ్చిన ధర్మతేజ ప్రీ మేరీడ్ లైఫ్ లోని రిలేషన్స్ గ్రంథంలో ఓ ఛాప్టర్  తమది కూడా ఉంది మ్యాడమ్ గారూ! ఆ  సమాచారమే నీ విషయంలో, ధర్మతేజ విషయంలో నాకు కలిసొచ్చిన పాయింట్స్! ఇక .. భరత్ ధర్మతేజ ముందు చదివిందీ జస్ట్ ఓ స్టేట్ మెంట్ మాత్రమే.  నా కౌన్సిలింగ్ తరువాత తప్పు తెలుసుకున్న భరత్ అది  సరిదిద్దుకొనే క్రమంలో  నేను ప్రిపేర్ చేసిచ్చిన స్క్రిప్ట్ అది ' చిద్విలాసంగా నవ్వుతూ అన్నాడు చిదంబరం.

'ఐ యామ్ సారీ' అని మిస్ రోజా తలొంచుకొన్నప్పుడు 'ఇట్సాల్ రైట్ మిస్ రోజాగారూ! నౌ యూ ఆర్ ఏ వెరీ గుడ్ గర్ల్. మాకా నమ్మకం పూర్తిగా ఉంది. దట్స్ వై ఈ లైక్ యూ సో మచ్ !' అంటూ రోజా చేయి తన చేతిల్లోకి తీసుకుని సున్నితంగా ఓ స్వీట్ కిస్ ఇస్తూ చిలిపిగా నవ్వేశాడు డిటెక్టివ్ చిదంబరం.

-కర్లపాలెం హనుమంతరావు

(ఆంధ్రభూమి వారపత్రిక డిసెంబర్, 4 2008 లో ప్రచురితం)


నాన్నగారూ! నన్ను క్షమించండి!- కథానిక -కర్లపాలెం హనుమంతరావు (నవ్య వారపత్రిక ప్రచురితం )

 


గోపాలకృష్ణయ్యగారు వణికే చేతుల్తో ఆ కాగితం మడతలు విప్పారు. అక్షరాలు అలుక్కుపోయినట్లున్నాయి. కూడబలుక్కుని చదువుకోడం మొదలుపెట్టారు గొణుక్కుంటున్నట్లు.

 

‘ప్రియమైన నాన్నగారికి,

నమస్కారం. నేనిలాంటి ఉత్తరం రాయాల్సొస్తొందని కలలో కూడా అనుకోలేదు. కానీ.. రాస్తున్నాను. లోకంలో ఏ కొడుకూ తండ్రికి రాయకూడని విధంగా రాస్తున్నాను. నన్ను క్షమించండి!

నన్ను కని అమ్మ కన్ను మూసినప్పటి నుంచి నాకన్నీ మీరే అయి పెంచారు. తాతయ్య మీకు మరో పెళ్లి చేస్తానని పంతంపట్టినా, సవతి తల్లొస్తే నన్నెక్కడ సరిగ్గా చూసుకోదోనని మరో పెళ్ళికి మొరాయించిన మంచి నాన్న మీరు. అమ్మ బతికున్నా  మీ అంత బాగా చూసుకునేదో లేదో తెలీదు.

పదేళ్ళు  వంటి మీదకు వచ్చినా మీరే నాకు వళ్లు రుద్ది స్నానం చేయించేవారు. నా కిష్టమైనవన్నీ చేసి దగ్గరుండి కడుపు నిండా తినిపించేవారు. మంచి బట్టలు వేసి, శుభ్రంగా తయారుచేసి బడిదాకా వచ్చి దిగబెట్టేవారు. గేటు  దగ్గర నిలబడి లోపలికి పోనని నేను మారాం చేస్తే, 'బాగా చదువుకోవాలి. పెద్ద ఇంజనీరవాలి. అప్పుడే మంచి పెళ్లామొచ్చేది. మనింట్లో అమ్మ లేదు కదా! అప్పుడు నీ పెళ్లామే నాకూ, తాతయ్యకూ అమ్మ అవుతుందంటూ..' ఏవేవో తమాషా కబుర్లు చెప్పి లోపలికి పంపించేవారు.

క్లాసులో ఫస్ట్ ర్యాంకు వచ్చి స్కూల్ ఫంక్షన్ లో నేను ప్రైజ్ తీసుకోడానికి స్టేజ్ మీదకు వెళుతుంటే చిన్నపిల్లవాడిలా సంబరపడిపోయేవారు. మీకు కష్టం కలిగించే పని ఎప్పుడూ చేయనని ఒట్టేసుకున్నాను అప్పట్లో. ఆ ఒట్టు తీసి ఇప్పుడు గట్టు మీద పెట్టేస్తున్నాను నాన్నగారూ! నన్ను క్షమించండి!

సెవెన్త్ గ్రేడులో జిల్లా ఫస్టొచ్చినప్పుడు మీరు కొనిచ్చిన 'ప్రసాద్' మార్క్ పెన్నుఇంకా నా దగ్గరే భద్రంగా ఉంది. దానితోనే రాస్తున్నాను ఈ ఉత్తరాన్నిప్పుడు. మధ్యలో కొన్ని రోజులు శ్రావణి అడిగిందని ఇచ్చా. కానీ, తను మళ్లా తిరిగిచ్చేసిందిలేండి! శ్రావణి ఎవరనుకుంటున్నారు కదూ! అక్కడికే వస్తున్నా! ఆ సంగతి చెప్పడానికే ఈ ఉత్తరమిప్పుడు నాన్నగారూ!

తను టెన్త్ లో నా క్లాస్ మేట్. ఇంటర్ లో పోటీ. మా గ్రూప్ లో ఫస్ట్ ర్యాంక్ కోసం ఇద్దరం కొట్టుకు చచ్చేవాళ్లం. నేను ఎం.పి.సి తీసుకుని ఐ. ఐ. టి చెయ్యాలని మీ కోరిక. మొదటి సారి మీ మాట కాదన్నాను. బైపిసి కెళతానని మారాం చేశాను. శ్రావణి బైపిసి కెళ్ళింది. అందుకూ ఆ గోల. అప్పుడు మీకు చెప్పలేదు.

ఎమ్.సెట్ చేసే రోజుల్లో ‘గవర్నమెంట్ సీటంటే ఏదో తంటాలు పడతా. కానీ, ప్రయివేట్ కాలేజీ అంటే మాత్రం నేను పడలేనురా!' అని రోజుకోసారి హెచ్చరించేవారు మీరు. 'మంచి రేంకు తెచ్చుకుంటా'నని ప్రామిస్ చేశాను. మంచి రేంకే వచ్చినా కాకినాడ కాలేజీలో డొనేషన్ కట్టయినా చేరాల్సిందేనని మొండికేశాను. ఎందుకో తెలుసా నాన్నగారూ? శ్రావణి కొచ్చిన రేంకుకు అందులో మాత్రమే సీటొచ్చింది మరి. ఎక్కడ క్లాసు పీకుతారొనని ఆ సంగతీ మీకు చెప్పలేదు.'

పక్కగదిలో అలికిడయితే ఓపికచేసుకుని  లేచి వెళ్లి చూసొచ్చారు గోపాలకృష్ణయ్యగారు. మళ్లా ఉత్తరం చదువుకోడం మొదలుపెట్టారు.

 

'.. సాదర ఖర్చులకని డబ్బవసరమయితే హాస్టల్ ఛార్జీలు పెంచారనీ, బుక్సనీ, పరీక్ష ఫీజులనీ ఏదో ఓ వంకతో డబ్బులు పంపమని డిమాండ్ చేస్తుంటే.. ఒక్కసారైనా మీరు 'ఎందుకురా ఇంత డబ్బు?' అని ఆరా తీయలేదు. ఎంత తంటాలు పడేవారో! టంచన్ గా టి.ఎం.ఓ వచ్చేది! అంత పిచ్చిప్రేమ మీకు నా మీద. శ్రావణి మైకంలో పడి కొట్టుకుపోయే నాకు అవేమీ పట్టేవికాదు అప్పట్లో.

 

ఆమె ఫాదర్ ఇన్-కంటాక్సులో ఓ పెద్ద ఆఫీసర్. అందుకు తగ్గట్లే ఉండేవి ఆమె సరదాలు. తన ముందు తేలిపోకూడదని నేనూ తలకు మించిన భారం మోసేవాడిని. శ్రావణి ప్రేమ కోసం నేను పడని పాట్లు లేవు నాన్నగారూ! అందులో సగమైనా స్టడీస్ మీద చూపించుంటే ఫస్ట్ ఇయర్ అలా పోయేదే కాదు. శ్రావణి ఒకేడు ముందుకు పోయిందని నేనేడుస్తుంటే.. అదంతా పరీక్ష పోయినందుకని ఓదార్చారు మీరు. అప్పుడైనా చెప్పలేదు అసలు సంగతి.

శ్రావణి ఒన్ ఇయర్ సీనియర్ అయిపోయినా మా మధ్య స్నెహం చెదరలేదు సరికదా.. ప్రేమగా మారింది. మా ఎఫైర్ గురించి లోకమంతా కోడై కూస్తున్నా మీ చెవి దాకా రానేలేదు. వచ్చినా 'ఛఁ! మా శీను అలాంటి వాడు కాద’ని కొట్టిపారేసేవాళ్లే మీరు. మీ పిచ్చి ప్రేమ సంగతి నాకు తెలుసు కదా! దానికి ఆకాశమే హద్దు'

గ్రాడ్యుయేషన్ అయి పి.జిలో చేరగానే శ్రావణిని తెచ్చి మీకూ తాతయ్యకూ చూపించి 'ఇదిగో 'నాన్నగారూ! మీ అమ్మ!' అని సర్ప్రైజ్ చెయ్యాలని నా పిచ్చి ఆలోచన.

అన్నీ మనమనుకున్నట్లే అయిపోతే మధ్యలో దేవుడెందుకూ? శ్రావణి హౌస్ సర్జన్ లో ఉండగానే వాళ్లింట్లో పెళ్లి యావ ప్రారంభమయింది. తను వాళ్ల డాడీకి నా గురించి చెప్పింది. నన్ను తీసుకుని వెళ్లి పరిచయం చేసింది. శ్రావణివాళ్ల డాడీ మా డాడీలాగా కాదు నాన్నగారూ! చాలా ప్రాక్టికల్. "ప్రేమ అనేది ఒక అమ్మాయి.. అబ్బాయి మధ్య వ్యవహారం. అది పెళ్లి దాకా రావాలంటే రెండు కుటుంబాల మద్దతు అవసరం శ్రీనివాస్! నా దురదృష్టం కొద్దీ శ్రావణి మా బాస్ కొడుకు కంట్లో పడింది. ‘నో’ అంటే నా కెరీరుక్కూడా 'రిస్క్'. ఈమెకు కాక ఇంకో ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలి నేను. నా పొజిషన్ లో నువ్వుంటే ఏం చేస్తావో చెప్పు.. నేనూ అదే చేస్తాను' అన్నాడు ఆయన. నేనేమీ చెప్పక ముందే తను చేయాల్సిందేదో చేసేశాడు. బాస్ కొడుకుతో నిశ్చితార్థం సంగతి తెలిసి అడుగుదామని వెళితే ఆ ఇంట్లో అందరూ 'ఔటాఫ్ రీచ్'! పెళ్లయిన మర్నాడు రాత్రి శ్రావణి ఫోన్ చేసి 'సారీ! శీనూ! పెద్దవాళ్ల మాట కాదనలేకపోయాను' అని ఒక ముక్క చెప్పి లైన్ కట్ చేసేసింది.

శ్రావణి కోసం నేను తొమ్మిదేళ్ల బట్టీ వందల కొద్దీ అబద్ధాలు చెబుతూ వచ్చాను. ఆర్థికంగా మిమ్ములను ఎన్నో ఇబ్బందులు పెట్టాను. ఇంకొక్కసారి.. చివరిసారి..  ఇబ్బంది పెట్టక తప్పడం లేదు నాన్నగారూ! నన్ను క్షమించండి!

 

నా చిన్నతనంలో మన పెరట్లోని జామకాయల కోసం చెట్టెక్కినప్పటి సంగతి గుర్తుకొస్తోంది. చెట్టైతే ఎక్కాను గానీ.. దిగడం రాక ఏడుస్తున్నాను. మీ రొచ్చి 'దూకు! నేను పట్టుకుంటా!' అని భరోసా ఇచ్చారు. మీ మీది నమ్మకంతో దూకేశాను. మీరు పట్టుకోలేకపోయారు. మోకాలు చిప్పలు పగిలి ఏడుస్తుంటే కట్టు కట్టించి 'నీకు నువ్వే దిగడం వచ్చు అన్న ధీమా వచ్చిందాకా ఎక్కకూడదురా శీనూ!' అన్నారు. ఇరవై ఏళ్ల తరువాత సరిగ్గా మళ్లా అదే పొరపాటు చేశాను నాన్నగారూ!

వంటికి తగిలిన దెబ్బయితే మందు వేసుకుని మానిందాకా ఓ మూల ముసుగేసుకు పడుకోవచ్చు. ఇది మనసుకు తగిలిన గాయమే! తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది నాన్నగారూ! చిన్నప్పుడు మీరు నన్ను పట్టుకోకుండా వదిలేశారు కదా! నేనిప్పుడు మిమ్మల్ని వదిలేస్తున్నాను. చెల్లుకు చెల్లనుకోండి.. క్షమించండి నాన్నగారూ!

 

ఇన్నేళ్లు దాచిపెట్టి ఇదంతా ఇప్పుడే ఎందుకు చెబుతున్నావని మీరు అడగవచ్చు. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకెప్పుడూ చెప్పే ఛాన్స్ నాకు లేదు నాన్నగారూ! నేనేమీ చెప్పకుండా సైలెంటుగా వెళ్లిపోతే నా ఓటమికి కూడా మిమ్ములను మీరు బాధ్యులను చేసుకుని కుమిలిపోతారు. మీ పెంపకంలోని లోపం అనుకుంటారు. అది తప్పు. 'లోకంలోని ఏ తండ్రీ.. ఆ మాటకొస్తే.. ఏ తల్లీ.. తన బిడ్డను ప్రేమించలేనంత గొప్పగా మీరు నన్ను ప్రేమించారు. ఇది చెప్పడానికే ఈ చివరి ఉత్తరం ఇప్పుడు రాస్తున్నది. ఈసారి జన్మలో మళ్లీ మీకే కొడుకుగా పుట్టి నా తప్పుల్ని సరిదిద్దుకొంటా! గాడ్ ప్రామిస్! ఉంటా! .. టాటా! తాతయ్యకూ నా నమస్కారాలు, క్షమాపణలు తెలియచేయండి!'

ఇట్లు

ప్రేమతో

శ్రీనివాస్

 

పోలీసువారికి సూచనః నేను కృష్టలో స్నానానికని పోతున్నాను. తీరానికి తిరిగొచ్చేది నా నిర్జీవమైన శరీరమే! అనవసరంగా ఎవరినీ విసిగించవద్దని మనవి!

శ్రీనివాస్

---

నలిగి మాసిపోయి మడతలు దగ్గర పట్టుకుంటే చిరిగిపోయేటంతలా చీకిపోయిన ఆ పాత ఉత్తరాన్ని మళ్లా భద్రంగా మడతలు పెట్టి టేబుల్ సొరుగులో దాచి లేచారు గోపాలకృష్ణయ్యగారు నిట్టూరుస్తూ.

ఏడవడానికి ఆయన కళ్లలో నీళ్ళు లేవు. తొంభై ఏళ్లు దాటిన పండు ముదుసలి ఆయన ఇప్పుడు.

గోడ మీద ఉన్న దందేసిన ఫొటోలో నుండీ శ్రీనివాస్ చిరునవ్వుతో చూస్తున్నాడు.

'నీకేంరా నాయనా! నవ్వుతాలుగానే ఉంటుందిప్పుడు. ఏడాది కిందట నువ్వు క్రిష్ణాలో పడ్డావు. మీ నాయన కోమాలో పడ్డాడు. నీ ఉత్తరం చదువుకొనేందుకు వాడెప్పుడు స్పృహలో కొస్తాడో తెలీదు. నువ్వంటే జన్మనిచ్చిన తండ్రిని పున్నామ నరకానికి వదిలేసి పోయావు కానీ, జన్మనిచ్చిన పుణ్యానికి నేను నా కొడుకుని అట్లా అర్థాంతరంగా వదిలిపోలేను కదా! కొడుకుతో సేవలు చేయించుకొనే వయసులో కొడుకుకు సేవలు చేయమని భగవంతుడే నా నొసటన రాసి పెట్టాడు. భగవంతుడు కాదు నాయనా.. నువ్వే రాసి పెట్టి పోయావురా మనవడా!' అని గొణుక్కుంటూ కోమాలో పడివున్న కొడుకు మూలుగులు విని చూసేందుకు పక్కగదిలోకి వెళ్లారు గోపాలకృష్ణయ్యగారు.

-కర్లపాలెం హనుమంతరావు

(నవ్య వారపత్రికలో ప్రచురితం)

.

చదువులయ్య చలవదినం -కర్లపాలెం హనుమంతరావు (ఒకనాటి ఈనాడు సంపాదకీయం)

 చదువులయ్య చలవదినం

-కర్లపాలెం హనుమంతరావు
(ఒకనాటి ఈనాడు సంపాదకీయం)
సమీపంలో ఉన్నప్పుడే తల్లి పోషించగలిగేది. సాన్నిహిత్యంలోనే తండ్రైనా హితాహితాలు బోధించగలిగేది. మధురవాక్కులతో సాంత్వన కలిగించేందుకు స్వీయకాంతకైనా సామీప్యం అవసరం. ఎంత మంచిమిత్రునికైనా 'చింతాలత చ్చేదన' సమక్షంలో ఉన్నక్షణాలలోనే కదా సాధ్యం! భోజరాజప్రబంధంలో చెప్పినట్లు 'కల్పలతాఖ్య అయిన విద్య ఒక్కటే ప్రత్యక్ష.. పరోక్షాలలో సర్వవిధాలా అదుకునే నిధి'. చర్చక్షువును మించిన ఆ మనోనేత్రం- విద్యనందించే ఉపాధ్యాయుడు. భారతీయ సంస్కృతి ఒజ్జను ప్రత్యక్షదైవంగా సంభావించింది. 'నాస్తి మాతృసమో గురుః' అని పంచమవేదం సైతం గురువును తల్లితో సమానంగా గౌరవించింది. 'తమ కటాక్షము బల్లిదపు కుంచెకోల యావైకుంఠనగర కవాటములకు' అంటూ ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రాప్రగడయ్య చేసిన గురుస్తుతి లోకంలోని అయ్యవార్లందరికీ వర్తించే ప్రస్తుతి. ఎందరో విద్వాంసుల ముందర శ్రీ గురుబ్రహ్మగా వందనాలు అందుకున్న చెళ్లపిళ్ళవారూ 'కథలు-గాథలు' గ్రంథంలో తమకు విద్యనందించిన జ్ఞానసింధువులందరిని 'గురుపరంపర' పేర పేరుపేరునా సంస్మరించుకున్న వైనం మననీయం. రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు, బలరామకృష్ణులకు సాందీపుడు, కురుపాండవులకు ద్రోణాచార్యులు.. మౌర్యపుత్రుడికి విష్ణుగుప్తుడు, అలెగ్జాండరుకి అరిస్టాటిల్, ఆ అరిస్టాటిలుకు ప్లేటో ఆచార్యవర్యులు. గురుపాత్రలేని శిష్యుల చరిత్ర ప్రపంచం మొత్తం గాలించినా ఏ మొత్తలోనూ కనిపించదు. గురుప్రమేయం గిట్టని నవక్రీతుడు జపతపాలతో సాధించిన నడమంత్రపు విద్య సైకతనిర్మాణ సమయాన వట్టిపోయిన కథ భారతంలో ఉండనే ఉంది. 'విద్యాయుక్త వివేకసారథికి అమర్చబడి సిద్ధంగా ఉన్న అశ్వరాజం గురుహృదయం' అని కదా కఠోపనిషత్ వాక్కు!
సాహిత్యం, శాస్త్రం, కళ.. దేశీయవిద్యలన్నింటిలో సర్వకళాపారంగతులు ఒకనాటి మన గురువులు. గురుశుశ్రూష.. బ్రహ్మచర్యనిష్ఠ.. కౌమారదశ నిండే వరకు జ్ఞానార్జనలు మాత్రమే శిష్యుల వ్యాపకాలుగా సాగిన ఉత్తమ గురుకులవ్యవస్థ ఆ నాటిది. ఇప్పటి విడ్డూరపు చదువులు కావారోజులవి. 'బెంచీ లక్కఱలేదు గేమ్సు మొదలౌ ఫీజుల్ వినన్ రాదు పొ/మ్మంచున్ నిర్ధను ద్రోచిపుచ్చరు గురుల్/ప్యాసైననే లాభమిం/చంచున్ నేమము లేదు మీచదువు నందు' అంటో ప్రాచీన గురుశిష్య పద్ధతులను ప్రస్తుతించారు తిరుపతి వేంకట కవులు. ఆధునీకరణ మిషతో మనం కోలుపోతున్న మానవీయ విలువలేమిటో తెలుసుకోవటానికి ఆ పద్యాలు చాలు. ముఖ్యంగా ఉత్తమజాతి ఉపాధ్యాయవర్గం. 'శుచి యౌవేషము శుద్ధమౌ మతము సంశుద్ధంబు దేహంబ ని/ర్వచనీయం బగు పాండితీగరిమ ద్రవ్యంబంద నాసక్తి పూ/ ర్వచరిత్రంబులయందు భక్తియును చాత్రశ్రేణిపై రక్తి గ/ల్గు'.. అన్నారు గురువుకు ఆహార్య విషయంగా కూడా ఉండవలసిన శ్రద్ధాదులను గురించి హెచ్చరిస్తూ ప్రాచీనులు. చతుర్వేదులైన ఆ అచార్యదేవుళ్ళను ఇప్పుడు తలుచుకున్నా రెండు చేతులూ ఎత్తి నిండుమనసుతో నమస్కరించ బుద్దవుతుంది. వదాన్యులైన ధనవంతుల ఆదరాభిమానాలతో వికాసమానంగా నడిచిన ఒకనాటి ఆ విజ్ఞానకేంద్రాల నడత ఎక్కడ? విద్య వంకతో వంకరటింకర పోకడలు పోతోన్న నేటి వ్యాపారకేంద్రాల వంకర నడకలెక్కడ! పాలకుండకి కల్లుకుండకి మధ్య పోలికా! ఆచార్య మామిడిపూడి వేంకట రంగయ్యగారు ఓ సందర్భంలో అంటారూ 'ఇప్పుడు నడుస్తున్న బళ్ళన్నీ వట్టి 'కడుపుకూటి' చావళ్ళు'. అని. మల్లంపల్లి సోమశేఖరశర్మ 'మన ప్రాచీన విద్యాసంస్థలు' అనే వ్యాసంలో వర్ణించిన ఆ పురావిద్యావైభోగమంతా ప్రస్తుతం కేవలం సంస్మరణకు మాత్రమే మిగిలుండిపోయిన సుసాంప్రదాయ విచారధార. విచారకరం. విషాదకరం కూడా.
విద్యాసంస్కరణల ఆవశ్యకత మీద అందరిదీ ఒకే అభిప్రాయం. విధానాల వద్దే వైరుధ్యమంతా. విద్యాలయానికి పునాది ఉపాధ్యాయుడు. శిఖరం విద్యార్థి. ఆ ముఖ్యులిద్దరిని విశ్వాసంలోకి తీసుకోని ఏ సంస్కరణ అయినా నీరులేని నూతిలో వేసే చేద బాపతే. జ్ఞానక్షేత్రంలోని విద్యార్థి బీజం ఆయురారోగ్యాభివృద్ధికి ఆచార్యవర్యుడేగదా బాహిర్ప్రాణం! నియతి, పాండిత్యం, బోధనాశక్తి- ఏ అయ్యవారికైనా ఉండవలసిన మొదటి మూడు ముఖ్యలక్షణాలన్నదీ అందుకే. నీతి అందరికీ అవసరమే. గురువులకి మరీ అవసరం. వృత్తి చేతే కాదు ప్రవృత్తి రీత్యా ఒజ్జ రుషితుల్యుడైతేనే విద్యార్థివర్గం నుంచి మన్నన దక్కేది. జూదం, వ్యసనాలు, రాజకీయ జోక్యాలు, లాలస, లైంగిక నిర్వాకాలు దైవసమానులైన ఉపాధ్యాయుల నుంచీ సమాజం అసలు సహించదు. కేవలం పోటీపరీక్షలు దాటుకొచ్చిన సజ్జంతా ఒజ్జలవర్గంలో దూరటమే నేటి విద్యావ్యవస్థ మౌలిక దురవస్థ. ఐదారేళ్ళ దీక్షతో గానీ ఒక వైద్యుడు పుట్టుకు రాడు. నాలుగైదేళ్ళ నైపుణ్యంతోగానీ ఒక నిర్మాణ నిపుణుడు తయారు కాడు. దేహంకన్నా.. భవనంకన్నా చవకైనదనా ఒక పసివాడి భవితవ్యం! రెండేళ్ళ మొక్కుబడి శిక్షణతో బడిపంతులు ముద్రవేసి భావిపౌరుల జీవనశకటాలకు చోదకులుగా తోలెయ్యడం! సంస్కృతీ సంప్రదాయలపైన అభిమానం, స్వజాతి సంక్షేమం మీద ఆదరం, బతుకుపట్ల.. భావిమీద సానుకూల దృక్పథం, మంచిచెడులను ఎంచి తూచి, మేలువైపుకే మొగ్గు చూపించే బుద్ధి.. కరవైన గురువులు మకిలినీటి దొరువులు. సంఘానికి వారు చేసే చెరుపు అణువిచ్చిత్తికి మించి ఎన్నో రెట్లు ప్రమాదకరం. చిలకమర్తివారు ప్రహసన గణపతి ద్వారా చేసే హెచ్చరిక ఇదే. పెడచెవిన పెడితే పెనుగాడి పొయ్యిలో పడి మాడేది మన బిడ్డల భవితవ్యమే. పాశ్చాత్యులు ఇక్ష్వాకులనాడే విసర్జించిన విఫల పథకాల చూరులు పట్టుకునేనా ఇంకా ఈ అధునాతన శతాబ్దంలోనూ మన గబ్బిల విన్యాసాలు! గురువంటే కన్యాశుల్కం మార్కు సిగారు గీరీశాలు కాదు. శిష్యులతో చిడప్పొక్కులు గోకించుకునే కరటకశాస్త్రులూ కాదు. గుర్రానికి కళ్ళెం. భాద్రపదానికి ముందొచ్చే శ్రావణం. మైత్రావరుణులబంధం గురుశిష్య సంబంధం. బతకలేక బడిపంతులు ..కాదు. బడిపంతులు లేక బతుకులేదు. ఏటా వచ్చేది ఉపాధ్యాయదినం. ఏదో మొక్కుబడి ముక్కు చివరి స్తుతులు చాలవు. ఏడాది పొడుగూతా సాగేవీ చదువు సాములు. చదువులయ్య పాత్ర చల్లంగా సాగే కార్యాచరణ సత్వరమే అరంభించటం సమాజానికి క్షేమకరం.
-కర్లపాలెం హనుమంతరావు
(ఒక నాటి ఈనాడు సంపాదకీయం)

-మార్మిక గాథలు - గాథాసప్తశతి కవితలు - తెలుగు అమవాదం : దీవి సుబ్బారావు అమవాదం: దీవి సుబ్బారావు - సేకరణ : కర్లపాలెం హనుమంతరావు ( ఆంధ్రజ్యోతి - వివిధ - సౌజన్యంతో )

 సేకరణ : 

మార్మిక గాథలు - గాథాసప్తశతి కవితలు 

- తెలుగు అమవాదం : దీవి సుబ్బారావు 


గాథాసప్తశతి పేరు వినే ఉంటారు. స్తప్తశతి అంటే ఏడు వందలు. హాలుడు అనే మహారాజు పాకృత భాషలో అప్పటికి జనసందోహంలో ప్రచులితంగా ఉన్న అనేకానేక  గాథలను సేకరించాడు. వాటిలో సుమారు ఏడువందలు తనకు ఒదిగిన పరిభాషలో ఒక క్రమం ఏల్పాటు  చేసుకుని మార్మికత"  పండులో రుచిలాగా..  కూర్చి చేసిన సంకలనం గాథాసప్తశతి. పామర జనం నోటిలో  నానే పలుకుబళ్లు శిష్ట సాహిత్య ప్రక్రియలో వదగలేవన్న పండితుల  విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నట్లు చేసిన  ఈ చిట్టి కవితల నుంచి ఆనందవర్ధనుడు, ముమ్ముటుడు వంటి ప్రఖ్యాత ఆలంకారికులు ఉదాహరణలుగా తీసుకున్న సందర్భాలు  కద్దు. 

అన్నట్లు, హాలుడు క్రీ.శ 1 వ శతాబ్దికి చెందిన శాతవాహనవంశానికి చెందిన రాజు . తెలుగువాడు. నేటి తెలంగాణా కరీంనగర్ జిల్లాకు చెందిన ' కోటి లింగాల' ను రాజధానిగా చేసుకుని శాతవాహనులు పాలించినట్లు చరిత్రకారులు నిర్ధారిస్తున్నారు. 

ఆ గాథాసప్తశతి నుంచి శ్రీ దీవి సుబ్బారావు గారు అక్టోబర్ 22, 2012 నాటి ఆంధ్రజ్యోతి దిన పత్రిక సోమవారపు సాహిత్యపుటలో ప్రచురించిన కొన్ని కవితలను  రుచికోసం శాస్త్రార్థం మీ ముందు ఉంచుతున్నాను : 

- కర్లపాలెం హనుమంతరావు 


ఒక పేదింటి ఇల్లాలి కటిక దారిద్ర్యాన్ని కవి ఇంత  కరుణారసాత్మకంగా నాలుగే  నాలుగు పాదాల్లో వర్ణిస్తున్నాడు; 


ఇంటిచూరు నుండి కారే వాననీరు 

కొడుకు మీద పడకుండా తల అడ్డుపెట్టింది/  కానీ 

తన కన్నీరే వాడిని తడుపుతొందని 

ఆ తల్లికి తెలియడం లేదు. 

( ప్రకృతి పొంగను నిరోధించగలిగినా అంతరంగ ప్రకృతిని అడ్డుకోవడం మనిషికి ఎంతటి అసాధ్యమో తెలియచేసే చిట్టి గాధ ఇది. ఇక్కడ తల్లిని మనిషికి ప్రతినిధిగా ఎంచుకోవడంలోనే కర్త ప్రతిభంతా కంటికి కడుతుంది. 


ఆనాటి కాలంలో సమాజంలో వివాహేతర సంబంధాలు విపరీతమైన మోతాదులో ఉండి వుండవచ్చు. సప్తశతిలో చాలా గాధలు ఈ వైపరీత్యాన్ని చమత్కారపూర్వితమైన మార్మికతతో వెలువరించడం గమనించవచ్చు. ఉదాహరణగా రెండు: 


అండిపెట్టి కుక్కకు 

ఆమె ఎలా తర్ఫీదు ఇచ్చిందో చూడు 

మొగుడు వస్తే మెరుగుతుంది 

మిండడొస్తే తోకాడిస్తుంది 


ఆమె చాపల్యాన్ని ఓ కుక్క ద్వారా ప్రదర్శించే మార్మికత ఈ గాధలోని విశిష్టత. 


మరొకటి: 

తొలికోడి కూతకు బెదిరి  

పక్క మీద నుంచి లేచిన వన్నె కాడా

ఇది నీ సొంత ఇల్లు, సొంత భార్య 

భయపడకుండా కౌగలించుకుని పడుకో 


సంసార సంబంధమైన చిటపటలు, అసూయాద్వేషాలు ఇప్పటికి మల్లేనే అప్పుడూ ఉన్నాయి.  ఆ గాధలకు కవితారూపాలు కల్పిస్తూ కనిపించే వాటిలో మచ్చుక్కి  మరో రెండు:


నన్నెప్పుడూ పైకి రమ్మని 

సురతము జరిపే సొగసుకాడా 

పిల్లలు కలుగలేదని 

నామీద నేరం మోపుతావెందుకు? 

బోర్లించిన కుండలో 

చుక్క నీరైనా నిలుస్తుందా ?

    నేడు ఏ డాక్టర్ సమరం చెబితేనో గాని అవగాహనకు రాని సెక్స్ సమస్యకు మూలం నాడు ఓ సామాన్యమైన  గృహిణికే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ సమస్యకూ ఉన్న కారణాన్ని బోర్లించిన కుండతో పోల్చడం మన వేమన పద్యం శైలిని మరపిస్తుంది కదూ! 


ఇళ్లలోని సవతుల మధ్య సహజంగా ఉండే ఈర్ష్యా సూయలు  ఇక్కడ కవి ఎంత మార్మిక భావనతో వెలిబుచ్చుతున్నాడో చూడండి: 

ఆమె పెదాల  ఎరుపుదనం 

క్రితం రాత్రి 

ప్రియుడు ముద్దులలో చెరిపివేసినా 

మర్నాడు పొద్దున

సవతుల కళ్లల్లో ప్రత్యక్షమయింది 


కొంత మంది స్త్రీలు  తప్పు దారిలో నడిచారు గదా అని స్త్రీలందరినీ ఆ గాటకే కట్టివేయడం సబబు కాదు.  ఒక ఇంటి ఇల్లాలు తనకు భర్త మీద ఉండే అపరిమితమైన ప్రేమను ఈ చిట్టిగాధ ఎంత గాఢంగా వివరిస్తుందో చూడండి! 


ఊరు విడిచి వెళ్లిన భర్త 

తిరిగి వచ్చే రోజు  రాసిపెట్టింది ఆమె గోడమీద 

ఇంటి పైకప్పు చిల్లులో నుంచి 

వర్షపునీరు దిగి చెదిరిపోకుండా 

చేతులడ్డం పెట్టి కాపాడుతోంది 


మరొకటి ఇట్లాంటిదే! 


అత్తా! మలయ మారుతం వీచే పనిలేదు 

మామిడి కొమ్మలు చివురు తోడిగే పనిలేదు 

నావోడు వస్తున్నాడంటేనే 

వసంతకాలం వచ్చేసినట్లు 


ఒక ముగ్ధ తన ప్రేమ భావనతో  గాధను  ఇంత కవితాత్మకంగా మార్చేస్తుంది . నాయుడుబావను ఊహించుకుంటూ ఎంకి ప్రేమ కొద్దీ పడే భ్రాంతిలా తోచే ఈ లోతైన ప్రేమ కవితను చూడండి! 


ఎటు చూస్తే అటు 

కళ్లెదుట కనిపిస్తుంటావు 

దిక్కలన్నిటికీ నీ చిత్రపటాలు 

వేలాడగట్టినారా ఏమిటి? 


ఇక చివరగా : 

ఒక ఊరునో , సమూహాన్నో కాపాడే బాధ్యతనెత్తిమీద వేసుకున్న వీరుడి గాధ ఇది. అతని వీరోచిత రక్షణ కారణంగా ఊరంతా నిశ్చింతగా నిద్రపోతుందిటి గానీ , ప్రియాతి ప్రియమైన తన భర్తకు ఆ ధర్మకార్య నిర్వహణలో ఎట్లాంటి ముప్పు  సంభవిస్తుందో అని ఇంటి ఇల్లాలు పడే ఆందోళనా మామూలుగా ఉండదు. ఈనాటి వీరజవానుల ఇళ్లలోని పరిస్థితులు కూడా అలాంటివే. 


కత్తి గాట్లతో 

ఎగుడు దిగుడుగా ఉన్న  

వీరుడి ఎదురు రొమ్ము మీద 

భార్య సమంగా నిద్రపోలేదు గానీ, 

ఊరు మొత్తం 

హాయిగా కునుకు తీస్తుంది. 


- తెలుగు అమవాదం: దీవి సుబ్బారావు

 - సేకరణ : కర్లపాలెం హనుమంతరావు   

( ఆంధ్రజ్యోతి - వివిధ - సౌజన్యంతో ) 


 19 -09-2021 

  బోథెల్ ; యూ. ఎస్.ఎ






 


 


క్తి - భుక్తి ( సరాదాకే ) - కర్లపాలెం హనుమంతరావు

 

భక్తి - భుక్తి ( సరాదాకే )

- కర్లపాలెం హనుమంతరావు

 

ఎవరు మాతా నువ్వూ?

నన్నే మరిచి పోయావా నేతా ! భరతమాతనురా ధూర్తా!

పరగడుపునే ఏంటీ ఈ రాక? 

పత్రికల్లో చూశాను తమ నిర్వాకం! రాక తప్పలా!  ఈ మధ్య ఓ జస్టిస్ గారెవరో  సభలో ప్రసంగం చేస్తూ, జాతీయ గీతం నట్లు లేకుండా పాడేవాళ్ళు చేతులెత్తమని అడిగితే ఒక్క చెయ్యైనా  పైకి లేవలేదంట! సిగ్గేయడం లేదుట్రా సన్నాసీ?

వేలాది వేలంపాటలు తల్లీ!   మజ్జెలో నీపాటల గోలేంటి కూ మళ్లీ!  సారొస్తారొస్తారొస్తార్లాంటి  ట్యూన్లంటే ఏదో రింగుటోన్లు  మాదిరివి  డౌన్లోడ్ చేసుకోవచ్చు! తంటాలు పడి ఆనక హమ్ చేసుకోవచ్చు! సారే జహాసే  అచ్ఛా..  ఏంటమ్మా ఇంకా చాదస్తంగా!  పంద్రాగస్టు , జనవరి ఛబ్బీసుక్కూడా వినిపించడం లేదిప్పుడు!

 

చిన్నప్పుడు  బళ్లో వందేమాతరం అంటూ అంతలా  గొంతేసుకు గావు గావు మని  పాడేవాడివిగా!! ఇప్పుడే దూలం గొంతులో గుచ్చుకొందో?

 

పెద్దమనుషులవై పోయాం  తల్లీ  ఇప్పుడు! పద్దస్తమానం  పాచిపళ్ల దాసరయ్యలా అదే సొదంటే! డ్యామిట్ .. ముందడ్డం తిరిగేదిక్కడ మా కథే మామ్! ఎన్నికలొకేపు  తరుముకొస్తూనే ఉండె ఎప్పటి కప్పుడు! ఎవరి విజయగాధలు వాళ్లు మొత్తుకోడానికే ఎక్కడి టైమూ చాల్చాచావడంలా! 'గాహే తవ జయ  గాధా ' అంటూ ఇప్పుడు  కళ్లు మూసుకు ఫ్రీజయిపోయి  నీ విజయగాధలు వినిపిస్తూ నిలబడాలా? సిల్లీ! 'ఫుల్లకు సుమిత ద్రుమ దళ శోభినీం ' నా .. అదేందో పాడు  భాష!  ఫుల్లుగా మందు కొట్టినా నోరు తిరగి చావని హోష! అక్కడికీ ఒలంపిక్కు  ఆటలనో, డైలీ  రేడియో పెట్టంగాననో వినిపిస్తానే ఉన్నాంగదా తల్లీ! అయినా మా టంగులక్కు ఈ ట్విస్టింగ్ టెస్టులేంటి తల్లీ ?  'జయహే జయహే జియహే' అంటూ అన్నిసార్లు చెవి గోసిన మేగకు మల్లే అరవడానికి  తమరిదేవఁన్నా పార్టీ టిక్కెట్టిప్పించేటంత గొప్ప  చరిత్రా?  'పంజాబు సింధు గుజరాట మరాఠాట! ..  ఆ రాసిందెవరో గానీ ..

అదీ తెలీదురా నేతా! ఠాగోరు

ఠాగోరో .. గొంగూరో ! చాకలి పద్దంత పొడుగు జాబితా! సింగిల్ టేకులో ఓకే చేసెయ్యడానికి ఎన్టీఆర్లమా, మోహన్ బాబ్బాబులమా తల్లీ! ఐనా  పాటల కోసమే తీసిన  సినిమాలున్నాయ్! పాటల్తోనే లాగించే  మ్యూజిక్ ఛానెళ్లున్నాయ్! చానాళ్ల నుంచి  వినిపించే ఎఫ్ఫె మ్ రేడియోల రొదిహ చెప్పనే అక్కర్లే! నీ సాంగుల కోసం  అన్నేసి   ఫెసిలిటీసుండంగా.. ఏదో ప్రజాసేవతో  పూటగడుపుకునే   గ్రంథసాంగులం.. మేమే దొరికామా  తల్లీ.. శాడిజం కాకపోతే! ప్రజాస్వామ్యం తల్లీ ఇప్పటి రోజులు. జనాలే మాకు మా రాజులు. యధారాజా తధా ప్రజా!

మీ రాజులు వందేమాతరమన్నా పాడలేరనా నీ అభియోగం భడవా? 

నువ్వే అడిగి చూడు.. ఆన్సరేమొస్తుందో విను! స్టన్నవకపోతే .. కొట్టు.. ఇదిగో కాల్జోడు! వందకు   ఏ మాత్రం గిడుతుందో నుందు  లెక్కచెప్పమంటున్నార్తల్లో తెలివి మీరిన జనమిప్పుడు!  నువ్ సినిమాలు చూడవు కామోసు! ఇది వర్లో మూవీ చివర్లో  తెర మీద మువ్వన్నెల జెండా .. దాంతో జాతీయగీతం పాడ్దం, ఎగరడం గట్రాలుండేవి గదా!  ఇప్పడట్లాంటి గట్రాలు గిట్లాలకు టైమ్లేదెవ్వరికీ. జయహే జయహే జయహే.. అనొస్తుంది కదా ఆఖర్లో! ఆ  మూడో '.. హే' వింటానికి హాల్లో మిగిలుండేది చీపురు కట్టల్తో బరబరా ఊడ్చుకునే బ్రదర్స్ అండ్ సిస్టర్సే! రెహమాన్ కొత్త వరస  జయహేలక్కూడా అదే గతి!    'పొగడరా నీ తల్లి భూమి భారతిని' అంటూ తమరే  ఉద్దేశంతో తరిమి తరిమి రాయించుకున్నారో గాని  తల్లో.. కవుల్ని, కనీసం  అట్లాంటి   పొగడ్తలకైనా సరే  ముందిప్పుడు అర్జంటుగా  ఏ పరాయిగడ్డ మీదకో ఎగిరెళ్ళిపోవాలని  యమ తొందర్లో ఉంది  యువతరమంతా.   'విశాలదేశం మనది .. హిమాలయాలకు నిలయమిది..  విశాల హృదయంతో మెలగాలీ ' ఏందమా అదీ?..  నవ్వొస్తుంది మరీ అన్ని విశాలాలు వినిపిస్తా ఉంటే పాటలో.   విత్ రిగార్డ్స్ మా ఆస్థాన కవి  దాశరథిగారికి.. నేనో మాట చెప్పెయ్యాలా  నీకు?  విదేశాలోళ్ల విశాల దుకాణాలకీ,  అణు విద్యుత్ కేంద్ర సువిశాల నిర్మాణాలకీ సరిపోతాయేమో తల్లో ఆ విశాల, విశాల పదాలన్నీ ఇప్పుడిక్కడ.  నువ్విప్పుడిలా ఆ జడ్జి గారి మాట పట్టుకొనొచ్చి  అర్థాంతరంగా మా మీదిన్ని అభాండాలు వేసేయడం, దేశభక్తి  మీదుండే మా  ఆలాపన ఆసక్తిని శంకించెయ్యడం  ఇదేం బాలే భరత మాతా! మంది  మంద స్వామ్యం అని నీకు  తెలీదా? ముందు నువ్వు నిల్దీయాల్సింది మమ్మల్నా? మమ్మల్నిట్లా నేతల్ని చేసి నెత్తికెక్కించేసుకున్న గొర్రెల మందల్నా?

 

భరత మాతకు అప్పటిగ్గాని  తొందరపాటులో తను చేసిన తప్పు తెలిసింది కాదు. తప్పు సరిదిద్దుకునేందుకు ముందుకు కదిలిందా దేశమాత.

 ***

'ఏందీ!  మా తెలుగు తల్లికి మల్లెపూదండా? బావుంది తల్లో సంబడం!  మల్లెపూలు మూర ఎంత మండుతుందో తెలుస్తుందా నీకు ? ' ఒక ఇల్లాలి మూతి  మూడు వంకర్లు తిప్పింది 'తెలుగు తల్లి’ పాట పాడి వినిపించమని తెలుగు తల్లి అడిగిన పాపానికి.

 

'సడిపాయ!  మామూలు తల్లులకే అతీ గతీ లేదిక్కడ బిడ్డా! కాలు మడమ కాస్త జారినా చాలు, నేరుగా  కాట్లోకి తీసుకెళ్లి కుదేసేస్తోంది  తల్లో ఇప్పటి సంచు! నీ పాట్లోని   మంగళారతులు ఏట్లో కలవ! ముందు మా పాట్లు చూసే దేవుడెక్కడా అని అల్లాడి  చస్తున్నామీడ’ ఓ ముసలమ్మ కళ్లల్లో నీళ్లు తెలుగుతల్లి పాటేమైనా పాడమన్న పుణ్యానికి!

పాటలోని'కడుపులో బాంగారు'  అనే ముక్క పట్టుకుని 'ఇప్పుడా బంగారాలు .. సింగారాలు ఎందుకమ్మా తల్లీ ? కంచంలోకి చారు నీళ్లయినా రేపు దొరుకుతాయోలేదోనని  కంగారు పడి ఛస్తుంటేనూ' అంటూ ఓ మధ్య తరగతి సంసారి ఘోష పెట్టేశాడు.

 

ఎవరికమ్మా కావాల్సిందిప్పుడా కరుణలు.. శ్రీలు పొంగిన జీవగడ్డలో వరదనీరు పొంగి పొర్లుతున్నప్పుడు! నీ పాటలోని ఆ  'కనుచూపు'లో కనీసం రుణం మాఫీ కైనా హామీ దొరికితే అదే పదేలు?' అంటూ అన్నదాత ఆక్రోశం.

 

' మురిపాలు ముత్యాలు - అమరావతీ శిల్పాలు' ? హుఁ!  భలే  కల్పించారు తల్లీ నీ తెలుగు తల్లి పాటలో! కవులూ, కళాకారులకే ఆ ముద్దులూ .. మురిపాలు; కవనాలు కల్పనలు! పాడుకాలంలో వచ్చి మమ్మల్నిలా పాడమని అడుగుతున్నవే.. నువ్వు నిజంగామా తెలుగు తల్లివేనా!' అంటూ ఓ కళాకారుడి ఆక్రందన!  

 

పోయారు కనక బతికిపోయారు గానీ.. జీవించి గనకే  ఉండుంటే త్యాగయ్య గొంతులోనైనా సరే ఆనాటి  నాదాలు తారాడటం డౌటే !’ అంటూ మరో కళాకారుడి వెటకారాలు!

 

తన రాంగ్ టైమింగ్ అప్పటిగ్గానీ తెలిసి వచ్చింది కాదు తెలుగుతల్లికి.  జనాలు భుక్తి కోసం అల్లాడే సమయంలో దేశభక్తిని గూర్చి చర్చకు పెట్టడం ఎంత పెద్ద తప్పిదం!

 

'చెక్కెరే చేదెక్కిపోయిన కర్కశ కాలంలో తిక్కయ్య కలంలోని తియ్యందనాలు ఆశించడం అత్యాశ అవుతుందేమోనన్న శంక అప్పుడు మొదలయింది తెలుగుతల్లికి| నాటి రుద్రమ్మంత భుజశక్తి నేటి దుర్గమ్మ కలిగి వున్నప్పటికీ  ఇంత సంసార భారం మోసేందుకు సిద్ధంగా లేదన్న సత్యమూ అప్పుడామె తలకెక్కింది.   మల్లమ్మ తరహా పతిభక్తి గుండె  నిండా పండి  ఉన్నంత మాత్రాన,   ఇల్లు గడిచే భుక్తి కై అల్లాడకుండా ఉండగలదా నిజమైన ఏ ఇల్లాలు అయినా? ఇంత సింపిల్ లాజిక్ తాను మిస్సయినందుకు తెలుగుతల్లికి సిగ్గనపించింది.  

 

'పాలు పారిన భాగ్య సీమయి వరదలీనినది యీ  భరత ఖండం.. భక్తి పాడరా తమ్ముడా!!’ అంటూ బిడ్డల మీదంతలా వత్తిళ్లు తెచ్చి పాడించుకున్నంత మాత్రాన వచ్చిపడే  సంతృప్తిలో అర్థమేముంటుంది?    'బోలో భరత్ మాతా కీ జై ! ' అంటూ నినాదాలివ్వమంటే బోళా శంకరయ్యలు కూడా తిరగబడే రోజులిప్పుడు మరి! జనంలోని  అసంతృప్తి స్వరం గుర్తించడంలోని తాత్సారం ఇప్పుడు  అర్థమయింది తెలుగు తల్లికి.

 

ఇన్ని అనర్థాలకు అసలు మూలకారణమెవరు?  ముందు జనం  తెలుసుకోవలసిన అవసరం వుంది! తిరంగీ జండాను సైతం తిరగేసి ఎగరేసే తింగరయ్యల అసలు  రంగు బైటకు తేలినప్పుడే మూడు రంగుల జండా మునుపటంత సగర్వంగా ఎగరగలిగేది! 'సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం ' అంటూ చెవులు రింగుమనే దాకా 'నీ అటలే ఆడుతాం .. నీ పాటలే పాడుతాం ! ' అంటూ జనగణాలు జిందాబాదులు కొట్టుకుంటూ జాతీయగీతాలు ఏవైనా సరే ఆలపించాలంటే   ముందు జనం కడుపు నిండవలసి ఉంది.   

భుక్తి కడుపు నిండా దొరికినప్పుడే  భక్తి .. దేహం మీద లాగే  దేశం మీద అయినా! '

తత్వ  తెలిసివచ్చి దేశమాత వచ్చిన దారి పట్టింది.

జనం మత్తు వదిలి మేల్కొనే మంచి పథకం వెదకడం ఇప్పుడు మొదలయింది దేశమాత మేధస్సులో!

చూద్దాం! ముందు ముందు దేశంలో  మంచి మార్పులు తొంగిచూడబోతున్నాయని ఆశిద్దాం!

- కర్లపాలెం హనుమంతరావు

04 - 04- 2021

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...