Sunday, December 12, 2021

నాన్నగారూ! నన్ను క్షమించండి!- కథానిక -కర్లపాలెం హనుమంతరావు (నవ్య వారపత్రిక ప్రచురితం )

 


గోపాలకృష్ణయ్యగారు వణికే చేతుల్తో ఆ కాగితం మడతలు విప్పారు. అక్షరాలు అలుక్కుపోయినట్లున్నాయి. కూడబలుక్కుని చదువుకోడం మొదలుపెట్టారు గొణుక్కుంటున్నట్లు.

 

‘ప్రియమైన నాన్నగారికి,

నమస్కారం. నేనిలాంటి ఉత్తరం రాయాల్సొస్తొందని కలలో కూడా అనుకోలేదు. కానీ.. రాస్తున్నాను. లోకంలో ఏ కొడుకూ తండ్రికి రాయకూడని విధంగా రాస్తున్నాను. నన్ను క్షమించండి!

నన్ను కని అమ్మ కన్ను మూసినప్పటి నుంచి నాకన్నీ మీరే అయి పెంచారు. తాతయ్య మీకు మరో పెళ్లి చేస్తానని పంతంపట్టినా, సవతి తల్లొస్తే నన్నెక్కడ సరిగ్గా చూసుకోదోనని మరో పెళ్ళికి మొరాయించిన మంచి నాన్న మీరు. అమ్మ బతికున్నా  మీ అంత బాగా చూసుకునేదో లేదో తెలీదు.

పదేళ్ళు  వంటి మీదకు వచ్చినా మీరే నాకు వళ్లు రుద్ది స్నానం చేయించేవారు. నా కిష్టమైనవన్నీ చేసి దగ్గరుండి కడుపు నిండా తినిపించేవారు. మంచి బట్టలు వేసి, శుభ్రంగా తయారుచేసి బడిదాకా వచ్చి దిగబెట్టేవారు. గేటు  దగ్గర నిలబడి లోపలికి పోనని నేను మారాం చేస్తే, 'బాగా చదువుకోవాలి. పెద్ద ఇంజనీరవాలి. అప్పుడే మంచి పెళ్లామొచ్చేది. మనింట్లో అమ్మ లేదు కదా! అప్పుడు నీ పెళ్లామే నాకూ, తాతయ్యకూ అమ్మ అవుతుందంటూ..' ఏవేవో తమాషా కబుర్లు చెప్పి లోపలికి పంపించేవారు.

క్లాసులో ఫస్ట్ ర్యాంకు వచ్చి స్కూల్ ఫంక్షన్ లో నేను ప్రైజ్ తీసుకోడానికి స్టేజ్ మీదకు వెళుతుంటే చిన్నపిల్లవాడిలా సంబరపడిపోయేవారు. మీకు కష్టం కలిగించే పని ఎప్పుడూ చేయనని ఒట్టేసుకున్నాను అప్పట్లో. ఆ ఒట్టు తీసి ఇప్పుడు గట్టు మీద పెట్టేస్తున్నాను నాన్నగారూ! నన్ను క్షమించండి!

సెవెన్త్ గ్రేడులో జిల్లా ఫస్టొచ్చినప్పుడు మీరు కొనిచ్చిన 'ప్రసాద్' మార్క్ పెన్నుఇంకా నా దగ్గరే భద్రంగా ఉంది. దానితోనే రాస్తున్నాను ఈ ఉత్తరాన్నిప్పుడు. మధ్యలో కొన్ని రోజులు శ్రావణి అడిగిందని ఇచ్చా. కానీ, తను మళ్లా తిరిగిచ్చేసిందిలేండి! శ్రావణి ఎవరనుకుంటున్నారు కదూ! అక్కడికే వస్తున్నా! ఆ సంగతి చెప్పడానికే ఈ ఉత్తరమిప్పుడు నాన్నగారూ!

తను టెన్త్ లో నా క్లాస్ మేట్. ఇంటర్ లో పోటీ. మా గ్రూప్ లో ఫస్ట్ ర్యాంక్ కోసం ఇద్దరం కొట్టుకు చచ్చేవాళ్లం. నేను ఎం.పి.సి తీసుకుని ఐ. ఐ. టి చెయ్యాలని మీ కోరిక. మొదటి సారి మీ మాట కాదన్నాను. బైపిసి కెళతానని మారాం చేశాను. శ్రావణి బైపిసి కెళ్ళింది. అందుకూ ఆ గోల. అప్పుడు మీకు చెప్పలేదు.

ఎమ్.సెట్ చేసే రోజుల్లో ‘గవర్నమెంట్ సీటంటే ఏదో తంటాలు పడతా. కానీ, ప్రయివేట్ కాలేజీ అంటే మాత్రం నేను పడలేనురా!' అని రోజుకోసారి హెచ్చరించేవారు మీరు. 'మంచి రేంకు తెచ్చుకుంటా'నని ప్రామిస్ చేశాను. మంచి రేంకే వచ్చినా కాకినాడ కాలేజీలో డొనేషన్ కట్టయినా చేరాల్సిందేనని మొండికేశాను. ఎందుకో తెలుసా నాన్నగారూ? శ్రావణి కొచ్చిన రేంకుకు అందులో మాత్రమే సీటొచ్చింది మరి. ఎక్కడ క్లాసు పీకుతారొనని ఆ సంగతీ మీకు చెప్పలేదు.'

పక్కగదిలో అలికిడయితే ఓపికచేసుకుని  లేచి వెళ్లి చూసొచ్చారు గోపాలకృష్ణయ్యగారు. మళ్లా ఉత్తరం చదువుకోడం మొదలుపెట్టారు.

 

'.. సాదర ఖర్చులకని డబ్బవసరమయితే హాస్టల్ ఛార్జీలు పెంచారనీ, బుక్సనీ, పరీక్ష ఫీజులనీ ఏదో ఓ వంకతో డబ్బులు పంపమని డిమాండ్ చేస్తుంటే.. ఒక్కసారైనా మీరు 'ఎందుకురా ఇంత డబ్బు?' అని ఆరా తీయలేదు. ఎంత తంటాలు పడేవారో! టంచన్ గా టి.ఎం.ఓ వచ్చేది! అంత పిచ్చిప్రేమ మీకు నా మీద. శ్రావణి మైకంలో పడి కొట్టుకుపోయే నాకు అవేమీ పట్టేవికాదు అప్పట్లో.

 

ఆమె ఫాదర్ ఇన్-కంటాక్సులో ఓ పెద్ద ఆఫీసర్. అందుకు తగ్గట్లే ఉండేవి ఆమె సరదాలు. తన ముందు తేలిపోకూడదని నేనూ తలకు మించిన భారం మోసేవాడిని. శ్రావణి ప్రేమ కోసం నేను పడని పాట్లు లేవు నాన్నగారూ! అందులో సగమైనా స్టడీస్ మీద చూపించుంటే ఫస్ట్ ఇయర్ అలా పోయేదే కాదు. శ్రావణి ఒకేడు ముందుకు పోయిందని నేనేడుస్తుంటే.. అదంతా పరీక్ష పోయినందుకని ఓదార్చారు మీరు. అప్పుడైనా చెప్పలేదు అసలు సంగతి.

శ్రావణి ఒన్ ఇయర్ సీనియర్ అయిపోయినా మా మధ్య స్నెహం చెదరలేదు సరికదా.. ప్రేమగా మారింది. మా ఎఫైర్ గురించి లోకమంతా కోడై కూస్తున్నా మీ చెవి దాకా రానేలేదు. వచ్చినా 'ఛఁ! మా శీను అలాంటి వాడు కాద’ని కొట్టిపారేసేవాళ్లే మీరు. మీ పిచ్చి ప్రేమ సంగతి నాకు తెలుసు కదా! దానికి ఆకాశమే హద్దు'

గ్రాడ్యుయేషన్ అయి పి.జిలో చేరగానే శ్రావణిని తెచ్చి మీకూ తాతయ్యకూ చూపించి 'ఇదిగో 'నాన్నగారూ! మీ అమ్మ!' అని సర్ప్రైజ్ చెయ్యాలని నా పిచ్చి ఆలోచన.

అన్నీ మనమనుకున్నట్లే అయిపోతే మధ్యలో దేవుడెందుకూ? శ్రావణి హౌస్ సర్జన్ లో ఉండగానే వాళ్లింట్లో పెళ్లి యావ ప్రారంభమయింది. తను వాళ్ల డాడీకి నా గురించి చెప్పింది. నన్ను తీసుకుని వెళ్లి పరిచయం చేసింది. శ్రావణివాళ్ల డాడీ మా డాడీలాగా కాదు నాన్నగారూ! చాలా ప్రాక్టికల్. "ప్రేమ అనేది ఒక అమ్మాయి.. అబ్బాయి మధ్య వ్యవహారం. అది పెళ్లి దాకా రావాలంటే రెండు కుటుంబాల మద్దతు అవసరం శ్రీనివాస్! నా దురదృష్టం కొద్దీ శ్రావణి మా బాస్ కొడుకు కంట్లో పడింది. ‘నో’ అంటే నా కెరీరుక్కూడా 'రిస్క్'. ఈమెకు కాక ఇంకో ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలి నేను. నా పొజిషన్ లో నువ్వుంటే ఏం చేస్తావో చెప్పు.. నేనూ అదే చేస్తాను' అన్నాడు ఆయన. నేనేమీ చెప్పక ముందే తను చేయాల్సిందేదో చేసేశాడు. బాస్ కొడుకుతో నిశ్చితార్థం సంగతి తెలిసి అడుగుదామని వెళితే ఆ ఇంట్లో అందరూ 'ఔటాఫ్ రీచ్'! పెళ్లయిన మర్నాడు రాత్రి శ్రావణి ఫోన్ చేసి 'సారీ! శీనూ! పెద్దవాళ్ల మాట కాదనలేకపోయాను' అని ఒక ముక్క చెప్పి లైన్ కట్ చేసేసింది.

శ్రావణి కోసం నేను తొమ్మిదేళ్ల బట్టీ వందల కొద్దీ అబద్ధాలు చెబుతూ వచ్చాను. ఆర్థికంగా మిమ్ములను ఎన్నో ఇబ్బందులు పెట్టాను. ఇంకొక్కసారి.. చివరిసారి..  ఇబ్బంది పెట్టక తప్పడం లేదు నాన్నగారూ! నన్ను క్షమించండి!

 

నా చిన్నతనంలో మన పెరట్లోని జామకాయల కోసం చెట్టెక్కినప్పటి సంగతి గుర్తుకొస్తోంది. చెట్టైతే ఎక్కాను గానీ.. దిగడం రాక ఏడుస్తున్నాను. మీ రొచ్చి 'దూకు! నేను పట్టుకుంటా!' అని భరోసా ఇచ్చారు. మీ మీది నమ్మకంతో దూకేశాను. మీరు పట్టుకోలేకపోయారు. మోకాలు చిప్పలు పగిలి ఏడుస్తుంటే కట్టు కట్టించి 'నీకు నువ్వే దిగడం వచ్చు అన్న ధీమా వచ్చిందాకా ఎక్కకూడదురా శీనూ!' అన్నారు. ఇరవై ఏళ్ల తరువాత సరిగ్గా మళ్లా అదే పొరపాటు చేశాను నాన్నగారూ!

వంటికి తగిలిన దెబ్బయితే మందు వేసుకుని మానిందాకా ఓ మూల ముసుగేసుకు పడుకోవచ్చు. ఇది మనసుకు తగిలిన గాయమే! తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది నాన్నగారూ! చిన్నప్పుడు మీరు నన్ను పట్టుకోకుండా వదిలేశారు కదా! నేనిప్పుడు మిమ్మల్ని వదిలేస్తున్నాను. చెల్లుకు చెల్లనుకోండి.. క్షమించండి నాన్నగారూ!

 

ఇన్నేళ్లు దాచిపెట్టి ఇదంతా ఇప్పుడే ఎందుకు చెబుతున్నావని మీరు అడగవచ్చు. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకెప్పుడూ చెప్పే ఛాన్స్ నాకు లేదు నాన్నగారూ! నేనేమీ చెప్పకుండా సైలెంటుగా వెళ్లిపోతే నా ఓటమికి కూడా మిమ్ములను మీరు బాధ్యులను చేసుకుని కుమిలిపోతారు. మీ పెంపకంలోని లోపం అనుకుంటారు. అది తప్పు. 'లోకంలోని ఏ తండ్రీ.. ఆ మాటకొస్తే.. ఏ తల్లీ.. తన బిడ్డను ప్రేమించలేనంత గొప్పగా మీరు నన్ను ప్రేమించారు. ఇది చెప్పడానికే ఈ చివరి ఉత్తరం ఇప్పుడు రాస్తున్నది. ఈసారి జన్మలో మళ్లీ మీకే కొడుకుగా పుట్టి నా తప్పుల్ని సరిదిద్దుకొంటా! గాడ్ ప్రామిస్! ఉంటా! .. టాటా! తాతయ్యకూ నా నమస్కారాలు, క్షమాపణలు తెలియచేయండి!'

ఇట్లు

ప్రేమతో

శ్రీనివాస్

 

పోలీసువారికి సూచనః నేను కృష్టలో స్నానానికని పోతున్నాను. తీరానికి తిరిగొచ్చేది నా నిర్జీవమైన శరీరమే! అనవసరంగా ఎవరినీ విసిగించవద్దని మనవి!

శ్రీనివాస్

---

నలిగి మాసిపోయి మడతలు దగ్గర పట్టుకుంటే చిరిగిపోయేటంతలా చీకిపోయిన ఆ పాత ఉత్తరాన్ని మళ్లా భద్రంగా మడతలు పెట్టి టేబుల్ సొరుగులో దాచి లేచారు గోపాలకృష్ణయ్యగారు నిట్టూరుస్తూ.

ఏడవడానికి ఆయన కళ్లలో నీళ్ళు లేవు. తొంభై ఏళ్లు దాటిన పండు ముదుసలి ఆయన ఇప్పుడు.

గోడ మీద ఉన్న దందేసిన ఫొటోలో నుండీ శ్రీనివాస్ చిరునవ్వుతో చూస్తున్నాడు.

'నీకేంరా నాయనా! నవ్వుతాలుగానే ఉంటుందిప్పుడు. ఏడాది కిందట నువ్వు క్రిష్ణాలో పడ్డావు. మీ నాయన కోమాలో పడ్డాడు. నీ ఉత్తరం చదువుకొనేందుకు వాడెప్పుడు స్పృహలో కొస్తాడో తెలీదు. నువ్వంటే జన్మనిచ్చిన తండ్రిని పున్నామ నరకానికి వదిలేసి పోయావు కానీ, జన్మనిచ్చిన పుణ్యానికి నేను నా కొడుకుని అట్లా అర్థాంతరంగా వదిలిపోలేను కదా! కొడుకుతో సేవలు చేయించుకొనే వయసులో కొడుకుకు సేవలు చేయమని భగవంతుడే నా నొసటన రాసి పెట్టాడు. భగవంతుడు కాదు నాయనా.. నువ్వే రాసి పెట్టి పోయావురా మనవడా!' అని గొణుక్కుంటూ కోమాలో పడివున్న కొడుకు మూలుగులు విని చూసేందుకు పక్కగదిలోకి వెళ్లారు గోపాలకృష్ణయ్యగారు.

-కర్లపాలెం హనుమంతరావు

(నవ్య వారపత్రికలో ప్రచురితం)

.

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...