భక్తి -
భుక్తి ( సరాదాకే )
- కర్లపాలెం
హనుమంతరావు
ఎవరు మాతా
నువ్వూ?
నన్నే మరిచి
పోయావా నేతా ! భరతమాతనురా ధూర్తా!
పరగడుపునే
ఏంటీ ఈ రాక?
పత్రికల్లో చూశాను
తమ నిర్వాకం! రాక తప్పలా! ఈ మధ్య ఓ
జస్టిస్ గారెవరో సభలో ప్రసంగం చేస్తూ, జాతీయ
గీతం నట్లు లేకుండా పాడేవాళ్ళు చేతులెత్తమని అడిగితే ఒక్క చెయ్యైనా పైకి లేవలేదంట! సిగ్గేయడం లేదుట్రా సన్నాసీ?
వేలాది వేలంపాటలు
తల్లీ! మజ్జెలో నీపాటల గోలేంటి కూ
మళ్లీ! సారొస్తారొస్తారొస్తార్లాంటి ట్యూన్లంటే ఏదో రింగుటోన్లు మాదిరివి
డౌన్లోడ్ చేసుకోవచ్చు! తంటాలు పడి ఆనక హమ్ చేసుకోవచ్చు! సారే జహాసే అచ్ఛా..
ఏంటమ్మా ఇంకా చాదస్తంగా!
పంద్రాగస్టు , జనవరి ఛబ్బీసుక్కూడా
వినిపించడం లేదిప్పుడు!
చిన్నప్పుడు బళ్లో వందేమాతరం అంటూ అంతలా గొంతేసుకు గావు గావు మని పాడేవాడివిగా!! ఇప్పుడే దూలం గొంతులో గుచ్చుకొందో?
పెద్దమనుషులవై
పోయాం తల్లీ ఇప్పుడు! పద్దస్తమానం పాచిపళ్ల దాసరయ్యలా అదే సొదంటే! డ్యామిట్ ..
ముందడ్డం తిరిగేదిక్కడ మా కథే మామ్! ఎన్నికలొకేపు
తరుముకొస్తూనే ఉండె ఎప్పటి కప్పుడు! ఎవరి విజయగాధలు వాళ్లు మొత్తుకోడానికే
ఎక్కడి టైమూ చాల్చాచావడంలా! 'గాహే తవ
జయ గాధా ' అంటూ
ఇప్పుడు కళ్లు మూసుకు ఫ్రీజయిపోయి నీ విజయగాధలు వినిపిస్తూ నిలబడాలా? సిల్లీ!
'ఫుల్లకు సుమిత ద్రుమ దళ శోభినీం ' నా ..
అదేందో పాడు భాష! ఫుల్లుగా మందు కొట్టినా నోరు తిరగి చావని హోష!
అక్కడికీ ఒలంపిక్కు ఆటలనో, డైలీ రేడియో పెట్టంగాననో
వినిపిస్తానే ఉన్నాంగదా తల్లీ! అయినా మా టంగులక్కు ఈ ట్విస్టింగ్ టెస్టులేంటి
తల్లీ ? 'జయహే జయహే జియహే' అంటూ అన్నిసార్లు చెవి గోసిన మేగకు
మల్లే అరవడానికి తమరిదేవఁన్నా పార్టీ
టిక్కెట్టిప్పించేటంత గొప్ప చరిత్రా? 'పంజాబు
సింధు గుజరాట మరాఠాట! .. ఆ రాసిందెవరో
గానీ ..
అదీ తెలీదురా
నేతా! ఠాగోరు
ఠాగోరో ..
గొంగూరో ! చాకలి పద్దంత పొడుగు జాబితా! సింగిల్ టేకులో ఓకే చేసెయ్యడానికి
ఎన్టీఆర్లమా, మోహన్ బాబ్బాబులమా తల్లీ! ఐనా
పాటల కోసమే తీసిన సినిమాలున్నాయ్!
పాటల్తోనే లాగించే మ్యూజిక్ ఛానెళ్లున్నాయ్!
చానాళ్ల నుంచి వినిపించే ఎఫ్ఫె మ్ రేడియోల
రొదిహ చెప్పనే అక్కర్లే! నీ సాంగుల కోసం
అన్నేసి ఫెసిలిటీసుండంగా.. ఏదో ప్రజాసేవతో పూటగడుపుకునే
గ్రంథసాంగులం.. మేమే దొరికామా తల్లీ.. శాడిజం కాకపోతే!
ప్రజాస్వామ్యం తల్లీ ఇప్పటి రోజులు. జనాలే మాకు మా రాజులు. యధారాజా తధా ప్రజా!
మీ రాజులు
వందేమాతరమన్నా పాడలేరనా నీ అభియోగం భడవా?
నువ్వే అడిగి
చూడు.. ఆన్సరేమొస్తుందో విను! స్టన్నవకపోతే
.. కొట్టు.. ఇదిగో కాల్జోడు! వందకు ఏ
మాత్రం గిడుతుందో నుందు లెక్కచెప్పమంటున్నార్తల్లో
తెలివి మీరిన జనమిప్పుడు! నువ్ సినిమాలు చూడవు
కామోసు! ఇది వర్లో మూవీ చివర్లో తెర మీద మువ్వన్నెల
జెండా .. దాంతో జాతీయగీతం పాడ్దం, ఎగరడం గట్రాలుండేవి గదా! ఇప్పడట్లాంటి గట్రాలు గిట్లాలకు టైమ్లేదెవ్వరికీ.
జయహే జయహే జయహే.. అనొస్తుంది కదా ఆఖర్లో! ఆ మూడో '.. హే' వింటానికి హాల్లో మిగిలుండేది చీపురు కట్టల్తో బరబరా ఊడ్చుకునే బ్రదర్స్
అండ్ సిస్టర్సే! రెహమాన్ కొత్త వరస జయహేలక్కూడా
అదే గతి! 'పొగడరా
నీ తల్లి భూమి భారతిని' అంటూ తమరే ఉద్దేశంతో తరిమి తరిమి రాయించుకున్నారో
గాని తల్లో..
కవుల్ని, కనీసం అట్లాంటి పొగడ్తలకైనా సరే ముందిప్పుడు అర్జంటుగా ఏ పరాయిగడ్డ మీదకో ఎగిరెళ్ళిపోవాలని యమ తొందర్లో ఉంది యువతరమంతా. 'విశాలదేశం మనది .. హిమాలయాలకు నిలయమిది.. విశాల హృదయంతో మెలగాలీ ' ఏందమా
అదీ?.. నవ్వొస్తుంది
మరీ అన్ని విశాలాలు వినిపిస్తా ఉంటే పాటలో. విత్ రిగార్డ్స్
మా ఆస్థాన కవి దాశరథిగారికి.. నేనో మాట చెప్పెయ్యాలా నీకు? విదేశాలోళ్ల
విశాల దుకాణాలకీ,
అణు విద్యుత్ కేంద్ర సువిశాల నిర్మాణాలకీ సరిపోతాయేమో తల్లో ఆ విశాల,
విశాల పదాలన్నీ ఇప్పుడిక్కడ. నువ్విప్పుడిలా ఆ జడ్జి గారి మాట పట్టుకొనొచ్చి అర్థాంతరంగా మా మీదిన్ని అభాండాలు వేసేయడం, దేశభక్తి
మీదుండే మా ఆలాపన ఆసక్తిని శంకించెయ్యడం ఇదేం బాలే భరత మాతా! మంది మంద స్వామ్యం అని నీకు తెలీదా? ముందు నువ్వు నిల్దీయాల్సింది
మమ్మల్నా? మమ్మల్నిట్లా నేతల్ని చేసి నెత్తికెక్కించేసుకున్న
గొర్రెల మందల్నా?
భరత మాతకు
అప్పటిగ్గాని తొందరపాటులో తను చేసిన తప్పు
తెలిసింది కాదు. తప్పు సరిదిద్దుకునేందుకు
ముందుకు కదిలిందా దేశమాత.
***
'ఏందీ! మా తెలుగు తల్లికి
మల్లెపూదండా? బావుంది తల్లో సంబడం! మల్లెపూలు మూర ఎంత మండుతుందో తెలుస్తుందా నీకు ?
' ఒక ఇల్లాలి మూతి మూడు
వంకర్లు తిప్పింది 'తెలుగు తల్లి’ పాట పాడి వినిపించమని
తెలుగు తల్లి అడిగిన పాపానికి.
'సడిపాయ! మామూలు తల్లులకే అతీ గతీ
లేదిక్కడ బిడ్డా! కాలు మడమ కాస్త జారినా చాలు, నేరుగా కాట్లోకి తీసుకెళ్లి కుదేసేస్తోంది తల్లో ఇప్పటి సంచు! నీ పాట్లోని మంగళారతులు
ఏట్లో కలవ! ముందు మా పాట్లు చూసే దేవుడెక్కడా అని అల్లాడి చస్తున్నామీడ’ ఓ ముసలమ్మ కళ్లల్లో నీళ్లు
తెలుగుతల్లి పాటేమైనా పాడమన్న పుణ్యానికి!
పాటలోని'కడుపులో బాంగారు' అనే ముక్క పట్టుకుని 'ఇప్పుడా
బంగారాలు .. సింగారాలు ఎందుకమ్మా తల్లీ ? కంచంలోకి చారు
నీళ్లయినా రేపు దొరుకుతాయోలేదోనని కంగారు
పడి ఛస్తుంటేనూ' అంటూ ఓ మధ్య తరగతి సంసారి ఘోష పెట్టేశాడు.
ఎవరికమ్మా
కావాల్సిందిప్పుడా కరుణలు.. శ్రీలు పొంగిన జీవగడ్డలో వరదనీరు పొంగి పొర్లుతున్నప్పుడు!
నీ పాటలోని ఆ 'కనుచూపు'లో కనీసం రుణం
మాఫీ కైనా హామీ దొరికితే అదే పదేలు?' అంటూ అన్నదాత ఆక్రోశం.
' మురిపాలు ముత్యాలు - అమరావతీ శిల్పాలు' ? హుఁ! భలే
కల్పించారు తల్లీ నీ తెలుగు తల్లి పాటలో! కవులూ, కళాకారులకే
ఆ ముద్దులూ .. మురిపాలు; కవనాలు కల్పనలు! పాడుకాలంలో వచ్చి
మమ్మల్నిలా పాడమని అడుగుతున్నవే.. నువ్వు నిజంగామా తెలుగు తల్లివేనా!' అంటూ
ఓ కళాకారుడి ఆక్రందన!
పోయారు కనక
బతికిపోయారు గానీ.. జీవించి గనకే ఉండుంటే
త్యాగయ్య గొంతులోనైనా సరే ఆనాటి నాదాలు తారాడటం
డౌటే !’ అంటూ మరో కళాకారుడి వెటకారాలు!
తన రాంగ్
టైమింగ్ అప్పటిగ్గానీ తెలిసి వచ్చింది కాదు తెలుగుతల్లికి. జనాలు భుక్తి కోసం అల్లాడే సమయంలో దేశభక్తిని గూర్చి
చర్చకు పెట్టడం ఎంత పెద్ద తప్పిదం!
'చెక్కెరే చేదెక్కిపోయిన కర్కశ కాలంలో తిక్కయ్య కలంలోని తియ్యందనాలు
ఆశించడం అత్యాశ అవుతుందేమోనన్న శంక అప్పుడు మొదలయింది తెలుగుతల్లికి| నాటి రుద్రమ్మంత భుజశక్తి నేటి దుర్గమ్మ కలిగి వున్నప్పటికీ ఇంత సంసార భారం మోసేందుకు సిద్ధంగా లేదన్న సత్యమూ
అప్పుడామె తలకెక్కింది. మల్లమ్మ తరహా పతిభక్తి గుండె నిండా పండి
ఉన్నంత మాత్రాన, ఇల్లు గడిచే
భుక్తి కై అల్లాడకుండా ఉండగలదా నిజమైన ఏ ఇల్లాలు అయినా? ఇంత
సింపిల్ లాజిక్ తాను మిస్సయినందుకు తెలుగుతల్లికి సిగ్గనపించింది.
'పాలు పారిన భాగ్య సీమయి వరదలీనినది యీ
భరత ఖండం.. భక్తి పాడరా తమ్ముడా!!’ అంటూ బిడ్డల మీదంతలా వత్తిళ్లు తెచ్చి
పాడించుకున్నంత మాత్రాన వచ్చిపడే సంతృప్తిలో
అర్థమేముంటుంది? 'బోలో
భరత్ మాతా కీ జై ! ' అంటూ నినాదాలివ్వమంటే బోళా శంకరయ్యలు
కూడా తిరగబడే రోజులిప్పుడు మరి! జనంలోని
అసంతృప్తి స్వరం గుర్తించడంలోని తాత్సారం ఇప్పుడు అర్థమయింది తెలుగు తల్లికి.
ఇన్ని
అనర్థాలకు అసలు మూలకారణమెవరు? ముందు జనం
తెలుసుకోవలసిన అవసరం వుంది! తిరంగీ జండాను సైతం తిరగేసి ఎగరేసే తింగరయ్యల
అసలు రంగు బైటకు తేలినప్పుడే మూడు రంగుల
జండా మునుపటంత సగర్వంగా ఎగరగలిగేది! 'సుహాసినీం సుమధుర
భాషిణీం సుఖదాం వరదాం మాతరం ' అంటూ చెవులు రింగుమనే దాకా 'నీ అటలే ఆడుతాం .. నీ పాటలే పాడుతాం ! ' అంటూ
జనగణాలు జిందాబాదులు కొట్టుకుంటూ జాతీయగీతాలు ఏవైనా సరే ఆలపించాలంటే ముందు జనం కడుపు నిండవలసి ఉంది.
భుక్తి కడుపు
నిండా దొరికినప్పుడే భక్తి .. దేహం మీద
లాగే దేశం మీద అయినా! '
తత్వ తెలిసివచ్చి దేశమాత వచ్చిన దారి పట్టింది.
జనం మత్తు వదిలి
మేల్కొనే మంచి పథకం వెదకడం ఇప్పుడు మొదలయింది దేశమాత మేధస్సులో!
చూద్దాం!
ముందు ముందు దేశంలో మంచి మార్పులు
తొంగిచూడబోతున్నాయని ఆశిద్దాం!
- కర్లపాలెం
హనుమంతరావు
04 - 04-
2021
No comments:
Post a Comment