Sunday, December 12, 2021

గుండు జాడీ - సరదా కథానిక (తర్కం లేదు) -కర్లపాలెం హనుమంతరావు

 

'ఆవగాయ అయిపోయింది. మీ అల్లుడిగారికి ముద్ద దిగడం లేదు. అర్జంటుగా ఓ చిన్నగుండు జాడీడైనా పమ్మిం'చమని మా తోడల్లుడుగారి మూడో కూతురు ఉత్తరం రాసింది.

 

ఆ పిల్ల మొగుడు వినాయకరావుకు అదేదో బ్యాంకులో ఉద్యోగం. ఈ మజ్జెనే బెజవాడ బదిలీ అయింది.

కృష్ణలో మునగాలనీ, కనక దుర్గమ్మను చూడాలనే వాంఛితం వల్ల నేనే బండెక్కా జాడీ పట్టుకుని.

 

తెనాలి దగ్గర ఓ ఎర్ర టోపీ పెట్టెలో కొచ్చింది. 'పేలుడు సామాను బండిలో ఉండకూడద'ని పేచీ పెట్టుక్కూర్చుంది సీటు కిందున్న జాడీ చూసి. అది పేలే పదార్థం కాదని నచ్చచెప్పడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది.

 

లంఖణాల బండి ముక్కుతూ మూలుగుతు బెజవాడ చేరేసరికి చిరుచీకట్లు ముసురుకుంటున్నాయి.

అదెక్కడి ఫ్లాట్ ఫారం! పెళ్లిపందిరిలా వెలిగిపోతో ఉంది. ఏవిఁ జనాలూ! ఎంత హడావుడీ! మా వూరి సంతే అనుకుంటే అంతకు పాతిక రెట్లు ఎక్కువగా ఉందీ వింత! ఈ సందోహంలో మావాణ్ణి ఎట్లా పసిగట్టడం? అసలా శాల్తీని గుర్తుపట్టడమే కష్టం. పదేళ్ల కిందట పెళ్ళిపందిరి పెట్రోమాక్సు లైట్ల వెల్తుర్లో చూడ్డవేఁ. ఇంకా అట్లాగే ఈకలు పీకిన కోడిలా ఉంటాడా?

 

అయోమయంగా జాడీ పట్టుకుని నడి ప్లాట్ ఫామ్మీద తచ్చాట్టం మొదలుపెట్టాను. ఓ కాఖీవాలా..  రైల్వేపోలీసనుకుంటా.. కర్రకొట్టుకుంటూ వచ్చాడు.

'అగ్గిపెట్టుందా?'

ఇచ్చా.

'సిగిరెట్టూ?'

నాకు చుట్టలు పీకడం అలవాటు. 'లేద'న్నాను. అంతే, ఆరాలు మొదలు!

'సిగిరెట్టు లేకుండా వట్టి అగ్గిపెట్టెందుకుందీ? ఎక్కడ అగ్గిపెట్టబోతున్నావ్? నీ వాలకం అనుమానంగా ఉంది. నీ చేతిలో అదేంటీ? టైం బాంబా?'

'బాంబు కాదండీ! ఆవగాయ జాడీ!'

'ఆవగాయా? వో క్యా హైఁ! ఖోల్దో!'

ఏందో పోలీసోడి గోల!

 

జాడీక్కట్టిన వాసెన విప్పి చూపించక తప్పింది కాదు.

లోపలికి తొంగి చూసి ఉలిక్కిపడ్డాడు.

'అమ్మో! రక్తం.. రక్తం!.. ఖూన్.. భూన్!' అరుపులు

'తెలుగు వాడై ఉండడు. ఆవగాయంటే అర్థమవడంలేదు ఆ ఉత్తరాది శుంఠకు.

'కూను కాదండీ! నూనె!' నమ్మించడానికి జాడీలో వేలు ముంచి ఆ పోలీసోడి నాలిక మీదింత రుద్దా.

అంతేఁ! ఎగిరి గంతేశాడు.

'పేలింది. గూబ్బేలింది' అంటు చెవులు రెండూ పట్టుక్కూర్చున్నాడు.

నష్టపరిహారం కిందో వంద రూపాయలు అచ్చుకుంటే గాని వాడు నన్ను వదల్లేదు.

 

వినాయకరావిక రాడు. కార్డంది ఉండదు. ఇట్లాంటి ఉపద్రవాలన్నీ ముందే ఊహించబట్టే అతగాడింటి ఆరాలన్నీ వివరంగా రాయించి కాయితం రొంటిన కట్టుకునుంది.

 

స్టేషన్ బైట సగం మెట్ల మీదుండంగానే ఓ కుంకొచ్చి నా జాడీ మీద పడ్డాడు. ఇంకా చాలామంది ఆ బాపతు సరుకే అవకాశం కోసం చుట్టూతా మూగిపోయారు. అంతా కలసి నా చంకలోని జాడీని గుంజేసుకుంటున్నారు.

బూతులు!.. గోల!

'ముందు నేనూ.. పట్టుకుంది. ఇది నాదీ!'

'ముందు నేన్చూశానెహె! జాడీ నాదీ..'

'కాదు నేం జూశాన్రా లం.. కొడకా!'

'ఇలాగిచ్చీసెయ్యండి సార్ .. జాడీని'

నా జాడీని పట్టుకుని ‘నాది.. నాద’ని వాదులాడుకునే వాళ్లను చూసి ముందు నేను బెంబేలెత్తింది నిజవేఁ! బెజవాడ మనుషులు ఎంతకైనా తగుదురని మా బామ్మర్ది చెప్పిన మాటలు గుర్తుకొచ్చి బలం కొద్దీ పరుగెత్తా జాడీతో సహా!

వెనక నుండి ఈలలు.. గోల! బూతు మాటలు కూడా!

 నవ్వుల్తో కలిసి! వాళ్లంతా రిక్షావాళ్లట! తర్వాత తెలిసింది!

 

ఆదుర్దాలో ఎంత దూరం పరుగెత్తుకొచ్చానో నాకే తెలీదు. కుదుపులకు జాడీ మీద మూత కదిలినట్లుంది. వాసెనక్కట్టిన గుడ్డ ఆవనూనెకు  ఎరుపు రంగుకు తిరిగింది. మాడు కూడా కొద్దిగా మంటెత్తుతోంది.

 

ఇహ నడక నా వల్ల కాదు. ఎంత దూరవఁని నడుస్తా మీ దిక్కూ మొక్కూ లేని బస్తీలో! అందునా మా వినాయకరావుండే 'ఆంజనేయ వాగు' ఆనవాలు బొత్తిగా లేకపాయ!

 

దార్న పోయే రిక్షా పిలిచా. వాడు దగ్గర దాకా వచ్చి జాడీని చూసి ఝడుసుకున్నట్లున్నాడు.. అదే పోత.. ఓ మాటాలేదూ..  పలుకూ లేదూ!

 

అతి కష్టం మీద మరో బండిని పట్టుకున్నా! వాడి క్కొంచెం గుండె ధైర్యం జాస్తీవే సుమండీ!

'ఎక్కడికీ?' అనడిగాడు మిర్రి మిర్రి చూస్తూ.

ఫలానా 'వాగు’ లోకి. ఇది కూడా ఉందని జాడీని చూపించా ఎందుకైనా మంచిదని.

వీడూ ఝడుసుకున్నాడు. 'ఏంటదీ? ఎర్రంగా కార్తా ఉంది? మడిసి తలకాయ కాదు గందా?' అనడిగాడు.. నా వంక అదోలా చూస్తూ!

ఈ గుండు జాడీ నా కొంప ముంచేట్లుందివాళ!

'ఏడు రూపాయలివ్వండి!  మూడో కన్నుక్కానకుండా వాగులోకి దింపించేత్తాను. రగతంతో రిసుకు మరి!' అన్నాడు దగ్గరి కొచ్చి గొంతు తగ్గించి.

‘నెత్తురు కాదు..ఆవకాయరా బాబూ! అని అక్కడికీ నెత్తి కొట్టుకుంటూ చెప్పిచూశా. ఊహూఁ!  నమ్మడంలే! అట్లాగని వదలటవూఁ లేదు. ఇట్లాంటి సాహసాలు ఇంతకు ముందు ఇంకెన్ని చేశాడో ధీరుడు! ఇప్పుడు వణకడం నా వంతు కొచ్చింది.

'బెజవాడలో రిక్షా రేట్లు దారుణంగా ఉంటాయి. రిక్షా తొక్కే వాళ్ల వాలకం అంత కన్నా దారుణం. సాధ్యవైఁనంత వరకు పబ్లీకు మధ్యన బస్సుల్లో తిరగడవేఁ మేలు' అని హెచ్చరించివున్నాడొకప్పుడు మా తోడల్లుడు. ఆ ముక్కలు ఇప్పుడు ఠక్కున గుర్తుకొచ్చాయి. రిక్షావాణ్నక్కడే వదిలేసి అప్పుడే వచ్చిన బస్సు దిక్కు పరుగెత్తాను.

 

అది ఇరవై నాలుగో నెంబరు బస్సు.

అమ్మాయి ఉత్తరంలో రాసిన నెంబర్లు కటిక్కిన గుర్తుకు రాడంలే! ఎవర్నైనా అడుక్కోక తప్పేట్లు లేదు. అక్కడే నిలబడి తాపీగా చుట్ట పీక నల్చుకుంటున్న పెద్దమనిషొకతను కనిపించాడు.

'ఈ బస్సెక్కడికి పోతుంది?' ఆడిగా.

'నువ్వేడకి పోవాల్నా?' ఎదురు కొచ్చెను. ఎవుడికీ సూటిగా మాట రాదనుకుంటా ఈ కృష్ణమ్మ నీళ్లకు.

'వాగులోకి'

'ఇది కాటికి పోయేదయ్యా సామీ! అల్లదిగో! ఆడాగి వుందే చూడూ.. నాలుగో నెంబర్దు,, ఆ బస్సెక్కు..  పో! తిన్నంగా వాగులో దింపేత్తది.. బేగి పో' ఉత్తరాంధ్ర సరుకులాగా ఉంది.

బెజవాడ కదా! అని యాసలోళ్లూ గుమిగూడ్తార్లాగుంది. పట్నవాఁ.. మజ్జాకానా!

 

నాలుగో నెంబర్ బస్సు నిద్దట్లో గురకపెడుతూ తాగుబోతోడికి మల్లె ఒహటే..  వూగిపోతావుంది వెనక్కీ.. ముందుకీ!

 

బస్సంతా కోళ్ల గంపలా కిక్కిరిసుంది లోపల. అయిస్కాంతం అంచుల దగ్గర ఇనప తుక్కు పేరుకున్నట్లు రెండు డోర్ల దగ్గరా జనాలు ఒహటే పొర్లిపోతున్నారు.

అయినా మనిషికి మనిషికీ మధ్యన ఇంకా సందుండిపోయిందని మధన పడిపోతున్నాడు బస్సు కుర్రాడు.

'రావాలండీ .. రావాల! మార్కెట్ పంజా కాలేజ్ జండా వాగు చిట్నగర్ లంబాడీ.. రావాలండీ.. రావాలా.. మార్కెట్ పంజా కాలేజ్ జండా.. వా..’

చెవి తెగ్గోసిన మేకకి మల్లే ఒహటే అరుస్తున్న ఆ కుర్రాడి దగ్గరికెళ్లి అడిగా 'వాగులో కెళతందా?'

అంతే! మాటా పలుకూ లేకుండా నా పెడ రెక్కలట్లా పట్టేసుకున్నాడో బస్సులోకి ఈడ్చేసుకున్నాడు భడవా! నా భుజం మీది జాడి పక్క మనిషి నెత్తి మీదకెక్కేసిందా కుర్రాడి గత్తర్లో!

 

రామాయణంలోని పుష్పకవిమానం దారి తప్పొచ్చి బెజవాడ వీధుల్లో తిరుగుతునట్లుంది. ఎంత మందిని కుక్కినా బస్సోడికి తృప్తి కలగడం లేదే!

'.. ఎదరకు జరగండయ్యా బావూఁ.. ఎదరకు జరగండి! ముందుకు పదండి.. ఊఁ ఊఁ.. పదండి ముందుకు .. పదండి ముందుకు..'

మనస్ఫూర్తిగా మనల్నింకా ముందుకు పదమనే వాళ్లింకా దేశంలో మిగిలున్నందుకు మహా ముచ్చటేసింది కానీ.. అదా స్థలం? సందర్భం?

చినుక్కీ చినుక్కీ మధ్య నుంచి గుర్ర్రం తోల్తూ బాణాలేసే పురాణపురుషుడి ఎవరో ఒకాయనున్నాడు కదా! ఆ మహానుభావుడి చాకచక్యం మించి పేసింజర్స్  భుజాల మీద నుంచే పాక్కొస్తూ, బూతులు కూస్తో,  టిక్కెట్లు కోస్తోన్న కండక్టర్ని నిజంగా అభినందించాల్సిందేనండీ! ఇట్లాంటి ఆటలు ఆ ప్రపంచ కప్పు పోటీలల్లో ఎందుకు పెట్టరో! బెజవాడ బస్సోళ్ళు కప్పులు కొట్టేస్తారని కుళ్లేమో!

 

నిద్రలో నడిచేవాళ్లా బైల్దేరిన బస్సుకు ఏం మూడిందో, మూడు నిమిషాల్లో ముక్కుతాడు తెంచుకున్న గుర్రంలా పిచ్చ పరుగందేసుకొంది. మజ్జె మజ్జెలో సకిలింపులు!.. బస్సు కుర్రాళ్ల రంకెలు!

వెనకమాల్నుంచి ఇంకో మదమెక్కిన బస్సుగుర్రం తరుముకొస్తా ఉందట.. ఎవరో రెచ్చగొడతా ఉన్నారు బస్సు డ్రైవర్ని!

అప్పుడు చూశానండీ.. డ్రైవర్ సీటుకు సరిగ్గా నడి నెత్తి మీద పెద్దక్షరాలతో రాసున్న హెచ్చరిక బోర్డు 'దేవుని స్మరింపుము'

ప్రస్తుతం నే చేస్తోన్న పని కూడా అదే!  నేనూ, జాడీ క్షేమంగా వాగులోకి దిగితే అదే పదేలు!

 

గవర్నమెంటాసుపత్రి ముందు అయిష్టంగా ఆగింది బస్సు.

కండక్టరు అరుస్తోన్నాడు 'ఆసుపత్రి కెవరెళతారండీ!;

ఈ బస్సిట్లా ఇంకో పది నిముషాలు గెంతితే అందరం అక్కడికే పోవాల్సి వాళ్లమే!

ప్రస్తుతానికి ఓ భారీ కాయం మాత్రం ఆపసోపాలు పదుతూ సీట్లోంచి లేచింది.

ఆ కాయాన్ని ఆస్పత్రి పాల్జేయడానికి అయిన ఆలస్యం కవరవ్వద్దూ! డ్రైవరంచేత స్టీరింగ్ మీంచి చేతులు పూర్తిగా ఎత్తేశాడు. పెడలు మీది కాళ్ళకూ రెస్టు కాబోలు.. మొత్తానికి బస్సు మెత్తంగా గాలిలో తేలిపోతోందీ సారి. బోడెమ్మ సెంటర్ దగ్గర బ్రేకేయక తప్పింది కాదు.

'బోడెమ్మ ఎవరండీ? బోడెమ్మ ..బోడెమ్మా?' కండక్టర్ రంధి.

'నేనేనండీ!' అంటూ లేచిందో పునిస్త్రీ.

'నువ్వంకాళ్లమ్మంటివి కదమ్మా? 'అంకాళమ్మగుడి స్టాప్' అని కండక్టరుగారి ధ్వని!

'నేను కాదయ్యా అంకాళమ్మ! నా ఈపరాలు. ఇదిగో ఈడనే కునికిపాట్లు పడతా ఉండాది మడిసి. బోడెమ్మ నేనూ!'

ఆ శాల్తీని బస్సులో నుంచి కిందకు తోసేసి బెల్లుకొట్టాడు కండక్టర్.

పీ’రు చెట్టు’ దగ్గర ‘పీరెవరో లేచి రమ్మం’టే  ఓ శాస్త్రులు గారు దిగడానికి తయారయ్యారు. 'గాంధీబొమ్మ' దగ్గర అట్లాగే కండక్టర్ 'గాంధీ.. గాంధీ ఎవరు బాబూ.. గాంధీ' అన్న గావుకేకలకు ఓ తాగుబోతు 'ఆయ్' అంటూ ఇద్దరు పేసింజర్ల చేతి సాయంతో తూలుకుంటూ దిగిపోయాడు.

 

హఠాత్తుగా     బస్సొక్కక్షణం ఆగిపోయింది!  మరుక్షణమే వెనక్కి నడవడం మొదలెట్టింది!! పేసింజర్లందర్నీ ఇందాక ముందుకు పొమ్మని తోసిన కుర్రాడే బస్సు వెనక్కి నడుస్తూంటే ఇప్పుడు ‘రైట్.. రైట్..’ చెప్పేస్తున్నాడు!

'అందరూ దిగాలి. దిగాలి. బస్సింక ముందుకు పోదు' అని అరుపులు లంకించుకున్నాడు కండక్టరు కూడా!

వెనక బస్సుతో పోటీ తట్టుకోడానికి తటాల్మని  ఇట్లా దారి మళ్లించెయ్యడం బెజవాడ బస్సులకు ఎప్పట్నుంచో అలవాటైన ముచ్చటేనంట! 

అదేమని అడిగితే 'ష్ష్! మెడ మీద చెయ్యేసి తోసేస్తారు, బెజవాడ బసులోళ్లు యములోడికైనా జడవరు' అంది అప్పటి దాకా నా గుండు జాడీ మోసిన గుండు శాల్తీ.

అందర్తో సహా నేనూ దడదడా బస్సులోంచి  బైటకు దూకేశా.

ఎత్తు మీంచి దూకడంతో మడమ చిట్లింది. జాడీ కూడా  బీటలిచ్చింది. నెత్తి జుత్తంతా ఆవ జిడ్డుతో ముద్ద ముద్ద! నుదుటి మీంచి జారిన ఆవనూనె మరకల్తో మొహమంతా చారికలు! కాళ్ల నుంచి కళ్ల దాకా.. వళ్లంతా మంటలు మంటలు!

 

చీకట్లో ఎవరూ చూదకుండా మావాడిల్లు కనుక్కోడానికి అష్టకష్టాలు పడాల్సొచ్చింది.

అప్పటికే అర్థరాత్రి దాటింది.

బాడీ, జాడీ వెరసి శరీరమంతా బట్టలతో రక్త సిక్తం. చంకలోని గుండు జాడీ ఖండిత శిరస్సును తలపిస్తోంది.

ఎవరైనా చూస్తే హంతకుణ్నని వెంటబట్టం ఖాయం.

 

చలి వల్ల వణుకు..

ఆకలి వల్ల నీరసం..

ఆవగాయ వల్ల  మంట..

ప్రయాణం వల్ల అలసట..

నిద్ర వల్ల మత్తూ..

వళ్లు తూలిపోతూంటే, కాళ్లు వణికిపోతో ఉంటే, ఆ నడి రేత్రి చీకట్లో ఎట్లాగైతేయేం వినాయకరావిల్లు పట్టుకున్నా!  తలుపులు దబదబా బాదేస్తున్నా.

ఐదు నిముషాలగ్గాన్నీ మెల్లిగా తలుపు తెరుచుకుంది కాదు. అదీ ఓరగా!

'ఎవరూ?' అడిగిందో ఆడగొంతు మెల్లిగా.

'నేనమ్మా! పెదనాన్నను.  ఇదిగో! ఆడిగావుగా! తెచ్చా నీ కోసం!' అంటూ గుండు జాడీని గడప మీదకు దింపా! అంతే..

 'కెవ్వుఁ!' కేక! ఒకసారి కాదు.. వరసగా ఏ పది సార్లో!

ఆ పిల్ల అమాంతం అల్లాగే విరుచుకుపడిపోయింది.

భగవంతుడా! ఇప్పుడేం చేయడం!

పారిపోడమా! ఉండిపోయి దెబ్బలు తిండమా!

తేల్చుకునే లోగానే..  గదిలోంచి  బైటికొచ్చిన వినాయకరావు ఒక్క క్షణం తెల్లబోయాడు. మరుక్షణం మ.. మ్మా..  'మర్డర్! మర్డర్!' అంటో వీధిలోకి పరుగేట్టి వీరంగాలేయడం  మొదలెట్టాడు.

 

అరవడానికి పోగైన వీధి కుక్కలు చీకట్లో ఆవగాయ బద్దల్నే మాంసం ముక్కలనుకున్నాయో.. ఏంటో.. పాడు! ఖర్మ .. ఆవురావురమని మెక్కేస్తున్నాయి.

 

అమ్మాయికని తోడల్లుడు శ్రద్ధగా చేయించిన కొత్తవగాయ మొత్తం  చెత్త వీధి కుక్కలపాలు!

 

అవునూ!.. కుక్కలు ఆవగాయ ముక్కమెక్కుతాయంటారా.. మరీ విడ్డూరం కాపోతే? అని సొడ్డు నా మీద మాత్రం వేసేయకండి మహాప్రభో!

ఇది బెజవాడ!

అప్పుడూ ఇప్పుడూ .. బెజవాడలో జరిగే విచిత్రాలు బ్రహ్మంగారికే అంతుబట్టలేదు! సామాన్యులం ఇహ మీకూ.. నాకూనా?! ఎంతేడుపొచ్చే అనుభవాలు ఎదురై చచ్చినా ఇది ఇట్లా నవ్వుకుంటూ  దులపరించుకు పోవాల్సిందే!

-కర్లపాలెం హనుమంతరావు

***

(ఆంధ్రప్రభ వారపత్రిక సెప్టెంబర్, 1982 (తేదీ ఖచ్చితంగా తెలీదు-  రికార్డులో 16  -09 -1982 అని ఉంది) ' కొండయ్యగారి గుండు జాడీ'శీర్షికతో ప్రచురితం)

 

 

 

 

 

 

 

 

 

 

 

సృష్టిలో - రాచకొండ – కధ - పై నా స్పందన - కర్లపాలెం హనుమంతరావు

స్పందన: నా స్పందన చదివే దయచేసి రచయిత రావిశాస్త్రిగారి 'కథ'  చదవమని ప్రార్థన🙏🙏

                                       ❤️❤️❤️'


 జీవితం చాలా చిత్రమైన వ్యవహారం. బతికి తీరాల్సిందేనన్న ఇచ్ఛ పెట్టి, అట్లా బతికేందుకు మళ్లీ అడుగడుగునా అడ్డంకులు  కల్పించడం .. ఇదేదో ప్రకృతి-  జీవిని  ఆటపట్టించాలని  చేసే చిలిపి చేష్టలా అనిపిస్తుంది. 

బతకడమంటే  వూరకుక్కలా ఊరకే  బతకేయడం  కాదుగా! కులాసాగా గడవాలి కాలం . ఈసురోమని ఏడుస్తూ రోజులు ఈడిస్తే  ఆ బతుకు  'బతకడం'  ఎట్లా అవుతుంది! దాని కన్నా చావు హాయి. అట్లాంటి దిలాసా జీవితం గడపాలంటే    కంటికి నిండుగా  నిద్దుర పోవాలి. వంటికి పట్టే తిమ్మిరి తీరడమూ అవసరమే ఒక ఈడు వచ్చి పోయేదాకా . తతిమ్మా సంగతులన్నీ ఆనక .. ముందైతే కడుపారా ఎప్పటికప్పుడు ఆహారం దొరకాలి. ఆహారం దొరకుబుచ్చుకోవాలనే    కోరిక నిలబడాలి. 


కోరిక  ఆకలి ప్రేరకం. ఆ ఆకలి చుట్టూతానే  జీవులు పడే నానాయాతనలూ! ఆకలి పెట్టే రకరకాల  తికమకల  కతే రావిశాస్త్రిగారు జాస్మిన్ అనే దొంగ పేరుతో సృష్టించిన ఈ 'సృష్టిలో ' ని  దొంగ తిండ్ల కథా - కమామిషూ! 

ఆకలి ఉంటేనే జీవం ఉన్నట్లు లెక్క౦టారు . అది వేళకు తీరడమే   జీవితం సజావుగా సాగుతున్నట్లని  కూడా  చెబుతుంటారు . నిజమే! ఆకలి చుట్టూతానే చీమ  జీవితం నుంచి  సింహం బతుకు వరకు పరిభ్రమించడం .. లోకంలో  నూకలు చెల్లే దాకా.ఆకలి తీరేందుకు అవసరమయ్యే ఆహారం ప్రకృతి వేరే ఎక్కడి  నుంచో తెచ్చిపడేయదుగా  జీవులకు! మీలో మీరే ఒకళ్లనొకళ్లు ఆరగించుకోమని  చేతులు దులుపుకుని చక్కా  తమాషా చూడటం దాని జబ్బు . అదిగో .. ఆ ఒకళ్ల నొకళ్ళు  స్వాహా చేసుకొనేందుకు నడిచే నాటకం పేరే ' స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్' . జీవన పోరాటం - అచ్చు తెలుగులో చెప్పాలంటే " బతకడానికి కొట్టుకు చావడం "! 

ఈ బతికేందుకు కొట్టుకు చచ్చేటప్పుడు జీవులు వేసుకొనే  ఎత్తులు ప్రైయెత్తులు .. యుక్తులు.. కుయుక్తులు చూడాలీ ! ఏ యానిమల్ కింగ్‌డమ్ లాంటి  ఛానెల్లో బైటి నుంచి చూడ్డానికైతే భలే గమ్మత్తుగా కూడా ఉంటాయి. అంత గమ్మత్తు మత్తు  ఉంటుంది  కాబట్టే అవి కథావస్తువులు అవడానికి అన్ని విధాలా  అర్హత పొందినట్లు సిద్ధాంతకర్తల   లెక్క ! 

సామాజిక స్పృహ అంటే ఈ తరహా విశేషాల పట్ల తార్కిక అవగాహన కలిగివుండటమేనంటారు. సామాజిక చైతన్యం దాని పై మెట్టు  మాట. ఎదుటి జీవి దెబ్బనుంచి తప్పుకుంటూ, ఆ ఎదుటి జీవిని  దెబ్బకొట్టడమనే లాఘవం పేరే జీవించే కళ అనుకుంటే   .. ఆ కళ .. కళ కోసమేనని కొందరు ; కాదు.. కాదు, అది జనం కోసరంరా  బాబూ !  అని ఇంకొందరు ఎడతెరిపి   ఎరక్కుండా మాటా మాటా అనుకోడం పద్దాకా చూసే పితలాటకమే! ఏ పితలాటకమయినా  ఈ ఆకలి నాటకం పాయింటు దగ్గరి కొచ్చేసరికి  అమాంతం  గప్ చిప్ .. కళకయినా, జీవికకయినా ముందు ముద్ద అవసరం కాబట్టి .


తాత్విక చింతన తరహా మంత్రతంత్రాలతో   చింతలూ చింతకాయలూ  రెండూ రాలగొట్టే    తరహా కథలు రాసే ప్రయోగం కొత్త పద్ధతిలో    కొనసాగిస్తూనే .. ఆ  వంకన మధ్య మధ్యన తన వంతు మార్కు సొంత వేదాంతంతో  ..   కథలు కాని వాటిని కూడా కథలుగ చేసి గిలిగింతలు   పెట్టడం   ఓం ప్రధమంగా ఆధునిక  తెలుగు కథానికకు  నేర్పించిన చమత్కారి   రావిశాస్త్రి . 


బతకడానికి ఒకరినొకరు చంపుకునేందుకు వేసుకునే ఎత్తులు, ముఖాముఖి  తటస్తపడితే   తప్పక దూసుకునే కత్తులు .. గట్రా ఆయా జీవులు మనసుపడి  మరీ ఏమీ చేసుకోవడం లేదనేది శాస్త్రి గారి  థియరీ.  భగవత్సుష్టికి అవసరం గనక   వైరాగ్య౦తో   మాత్రమే  ఈ హింసాకాండ కొనసాగుతున్నదని  శాస్త్రిగారు  ఎన్నో   కథల్లో చెప్పినట్లు    ఇందులోనూ చెప్పుకొస్తారు. బతకడం, తమ మీద ఆధారపడ్డవాళ్లని బతికించడం కోసమే ధ్యేయంగా  మొక్కుబడి యుద్ధాలు  జరుగుతున్నట్లు ఆయన ఉద్దేశం! 


తిండి  వేటకు బయలుదేరేముందు బొరియలోంచి బైటికొచ్చిన నక్కతల్లి చేత  బిక్కు బిక్కు మంటూ చూసే తన బుజ్జి మూడు పిల్లలకు లోకంలో బతకాల్సిన అగత్యం  గురించి , బాధ్యత, తీరుతెన్నులను   గురించి  చెప్పినప్పుడు కరుణరసం ఉప్పతిల్లడానికి కారణం హింసకు బైలుదేరిన ఆ జీవిలో    సంసార బాధ్యతే తప్పించి క్రౌర్యం ఏ కోశానా లేకపోవడమే!   'అయ్యో! పిచ్చి పిల్లల్లారా! బెంగ పెట్టుకోకండర్రా! అలా వెళ్లి ఇప్పుడే వచ్చేస్తాను. వెళ్లకపోతే ఎలా కుదురుతుందో చెప్పండి! వెళ్లి బువ్వ తెచ్చుకోవాలా? మీరు చిన్న పిల్లలు, మీకేం తెలీదు. కష్టపడకపోతే కూడు దొరకదమ్మా! నేను కష్టపడితేనే నాకు బతుకు, మీకు బతుకు. మీరూ పెద్దవాళ్లయి, కాళ్లకి పరుగొచ్చి, పళ్లకు పదునొస్తే, మీరూ లోకం మీద పడి బతికేయచ్చు కాని , అందాకా నా కోసం మీ కోసం కూడా నేను తిరక్క తప్పదు.' అంటూ తన  పక్షంగా జీవించాల్సిన అవసరాన్ని  ' గీత ' లా   బోధిస్తుందీ కథలో తల్లినక్క . భారతంలోని బకాసురుడిని అడిగినా ఇదే పద్ధతిలో  మరింకేదో గీత   వినిపిస్తాడు .. సందేహం లేదు. ఆకలి   అంబానీనైనా  . . పనిలేని సోంబేరినైనా    ఒకే విధంగా   వేధిస్తుంది . మనీ లేదు, అసలు మానవ  జన్మే కాదు, పాపం.. బలహీనమై శాల్తీ , బతకడం బొత్తిగా చేతరాని కుంక ' అని జాలేమీ చూపించదు గదా! ఆకలి లేకపోతే ఆరాటమే ఉండదు. ఆరాటం లేకపోతే జీవించాలనే ఇచ్ఛ  పుట్టదు. బతుకు మీద  ఉండే పిచ్చ తీపి వల్లనే .. ప్రమాదం అంచున ఉన్నప్పుడు శత్రువు ఎంత బలం, బలగం కలిగి భీకరంగా   భీభత్సం చేస్తున్నప్పటికీ ..   ఆఖరి నిశ్వాస దాకా చంపే  తీరాలన్న మొండిధైర్యమే ఎంత బక్క జీవినైనా  ముందుకు తోసేది . అధైర్యపడుతూ ఓ మూలన ముడుచుక్కూర్చుంటే బలహీనమైన  జాతులు  తరిగిపోయి బలవంతుల వర్గం  సైజులో  ముదిరి జీవసమతౌల్యం దెబ్బతినేస్తుంది  కదా! ప్రకృతికి  అంతకు మించిన  ముసలం మరింకేముంది! ఎవరికోసమో కాకుండా  తన ఉనికి కోసమైనా జీవులకు కడుపులు పెట్టి, వాటిలో ఆకలి చిచ్చు పెట్టి,     ఎప్పటికప్పుడు దాన్ని ఆర్పుకు చావండి .. లేదంటే చావండి ! '  అంటూ ప్రకృతికి ఏదో  ఓ తమాషా చేయకతప్పదు! 


సృష్టిలోని జీవుల అదుపుకు ప్రకృతికి  తోచిన ఇన్ - బిల్ట్ మెకానిజం ఈ ' బతకటానికి   కొట్టుకు చచ్చే' ట్రిక్కు ఒక్కటే   ! ఈ ఆటలోని  'చావుకు  దారి తీసే  ఆహారం వేట'  పార్ట్ ను ప్రత్యేకంగా విడదీసి రావిశాస్త్రి గారు ఇక్కడి ' సృష్టిలో '   కథలో   కిక్కిచ్చేలా   చెప్పుకొచ్చారు.. ఎప్పట్లానే  తన వంతు చురకలూ  నడి మధ్యన  వడ్డిస్తో  ! కథ చివర్లో  బ్రాకెట్ లో కనిపించేవి ఈ బాపతు జౌట్ ఆఫ్  బాక్స్  చురకలే అందుకు ఉదాహరణ !  


 "కోడి పెట్టల్ని వీరన్న ఎత్తుకుపోయేడు. వాటిలో రెండింటిని వీరన్న ఇంటి నుంచి దొంగనక్క కరుచుకుపోయింది. నూకునాయుడి పది సెంట్లనూ  వీరినాయుడు  తన పదెకరాలల్లో కలిపేసుకున్నాడు.  అందు గురించి నూకునాయుడు దావా తీగా ప్లీడరు గుమాస్తా అతని డబ్బంతా ఎగేసేడు. ప్రతివాదైన వీరినాయుడు దగ్గర పెద్ద ప్లీడరుగారు అయిదువందలు (పది సెంట్ల భూమి ఖరీదే అంత) ఒడికేసేరు. వీరినాయుడి బంజరు భూమిని వీర్రాజుగారు ఆక్రమించేసేరు. ఆక్రమించుకున్న ఆస్తులన్నీ వారు తమ చిన్నభార్యవారి పేర్న పెట్టి ఉంచేరు. వాటి వల్ల వచ్చే రాబడంతా ఆవిడ తన తమ్ముడి ఇంటికి నడిపించేసింది . ఆ తమ్ముడు ఆ సొమ్మంతా తన ఉంపుడుకత్తెకి ఇచ్చేసేడు. ఆ ఉంపుడుకత్తె ఆ డబ్బంతా తనకు నచ్చినవాడికి ఇచ్చేసింది. ఆ నచ్చినవాడు సినిమా చిత్రం కోసం మెడ్రాస్ వెళ్తే తారలూ, డైరక్టర్లూ కొంత డబ్బు తినేసేరు; మిగతాది ఓ నాటుకోటి చెట్టియారు లాక్కున్నాడు.  ఊరివారి డబ్బునీ కార్మికుల కష్టాన్నీ దోచుకున్న చెట్టియార్ గారి చేత ఈ మార్వాడి దివాలా తీయించేడు. మార్వాడీగార్ని ఓ తాబీతరావారు తమ ధృతరాష్ట్రపు  కౌగిట్లో కలుపుకున్నారు. తాబీతర్లావారిని ఓ ఇంగ్లీషు కంపెనీ రాజ్యంవారు లాగుదామని చూస్తున్నారు. వీరందర్నీ ఓ అమెరికన్ సిండికేట్ సామ్రాజ్యంవారు చెరచడానికి వారి రెక్కలు పట్టుకొని గిజగిజలాడిస్తున్నారు. సిండికేట్ వారి కాలి కింద ఇసకని కొందరు జపనేయులు దొలుస్తున్నారు. వారి సీటు కింద వేరొకరు గోతులు తవ్వుతున్నారు. వార్ని మరొకరు, మరొకర్ని  ఇంకొకరు,  ఇంకొకణ్ని వేరొకడు, వేరొకణ్ని వీడు, వీణ్ని వాడు, వాణ్ని వీడు, వీణ్ని  ఇది, దీన్ని వాడు, వాణ్ని మరొకడు మరొకణ్ని వేరొ...) " ఇట్లా సాగిన దోపిడీ ధారావాహికలోని  మొదటి రెండు మూడు వాక్యాల తాలూకు ఎపిసోడే   .. వీరినాయుడి కోడిపెట్టలు మూడింటిని వీరన్న దొంగిలించడం .. వాటిలో రెండింటిని కొట్టుకుపోయిన నక్క మూడో దానికోసం  మళ్లీ రావడం.  


ఈ తిండ్లు, దొంగ తిండ్ల వ్యవహారం  చుట్టూతా  మనిషి ( వీరన్న)  పగ, జంతువు ( తల్లినక్క) జీవన పోరాటం,  పక్షి ( కోడిపెట్ట)  అంతరంగ మథనాలు ;  జీవితం , దాని  మంచి చెడ్డలు, జీవించక తప్పని దౌర్భాగ్య స్థితిగతులు, అందుకు అడ్డొచ్చే గడ్డు పరిస్థితులు , అందుక్కారణంగా ఊహించబడ్డ దేవుడి దౌష్ట్య౦ పై నిరసనలు ; ఇవే గాపు; చావు .. దాని బహుముఖ   వికృత ముఖాల  దిగ్భ్రాంతికర ప్రదర్శనల సమాహారం ఈ 'సృష్టిలో' కథా సృష్టి . నిస్సందేహంగా  రావిశాస్త్రిగారి అనేకానేక ఇతర రచనల తరహాలోనే ఉత్తమ జాతికి చెందే  కథానిక! 


బలమైన జీవి, తెలివైన జీవి   అయితే  ఇబ్బంది  ఉండదు .. ఆహార లభ్యతలో సౌలభ్యత ఎలాగూ తప్పదు.  ఆ రెండింటి  కొరవతో  జన్మ తగలప్పుడే  బతకాలంటే జీవికి చచ్చే చావు.  అట్లాంటి దౌర్భాగ్య  జీవుల పక్షం  నుంచి కూడా సాపేక్షికంగా ఆలోచిస్తే పంచతంత్రం  మించి ' పంచ్'  లు ఉండే కథలు చెప్పొచ్చన్న గొప్ప ధీమా మొదటగా తెలుగులో కల్పించింది రావిశాస్త్రేగారే. 


అధర్మాన్ని పడగొట్టి, ధర్మాన్ని నిలబెట్టే రచనలు ఎప్పుడూ  వచ్చేవే. రావాలి కూడా!  రామాయణం చదివే నాస్తికుడికైనా రావణుడే చావాలని ఉంటుంది. వాల్మీకిరుషి ఏకపక్షంగా రాముడి వైపుండటమే అందుక్కారణం. కానీ, ఎంత నికృష్ట పాత్రకైనా  పుట్టుకతోనే నీచత్వం అంటగట్టడం రచయిత పక్షపాత బుద్ధికి నిదర్శనమవుతుంది.  వెలుగు నుంచి చీకటి దిశగా ప్రస్థానించే ప్రయత్నం  అనేకానేక  కారణాల వల్ల సఫలమయి ఉండకపోవచ్చు; అసలు ఆరంభమే  అయివుండకపోవచ్చు కూడా . అయినా సరే ..ఆ దిశగా  అసలు ఏ  ప్రయాసా   కలుషాత్ముడి వైపు  నుంచి   సాగనే లేదనిపించే  రాతలను     నమ్మలేం.  కాపురుషుడి ప్రవృత్తిలోని   సానుకూల గుణo కోణం రచనకు అదనపు ఉదాత్తత ఓ అలంకరణం.

  

ఓ సానుభూతి వచనం  రచయిత వేసినప్పుడే గదా పాఠకుడి  దృష్టి దుష్టత్వం  నుంచైనా ఎంతో  కొంత నీతిసారం వడుగట్టుకుని లాభపడేందుకు వీలుడేది! బళ్లారి రాఘవాచారిగారు స్టేజి నాటకాల ప్రదర్శన సందర్భంలో దుష్టపాత్రల స్వభావంలో నుంచి కూడా ఓ వెలుగు కోణం రాబట్టే ప్రయోగాలు చేస్తుండేవారంటారు.  మంచే కాదు 'చెడు'  తాలూకు లోతులనీ నిరపేక్షంగా   తర్కించవలసిన బాధ్యత  మంచి రచయిత మీద తప్పకుండా ఉంటుంది. రావిశాస్త్రిగారి  కథల్లో.. దుర్మార్గంగా ప్రవర్తించే పాత్రల్లో  కూడా సందర్భం వచ్చినప్పుడల్లా   రగిలే  అంతర్జ్వాల  ఒకటి దర్శనమివ్వడం సాధారణ ధర్మంగా కనిపిస్తుంది. అందుకు ఈ కథలోని వీరన్న పాత్ర వ్యవహారమే  ఒక ఉదాహరణ. ఎంతో సాహసించి, ఎంతో శ్రమపడి మూడు రోజుల కిందట మూడు కోడిపెట్టల్ని  దొంగిలించాడు ఈ  'వీరన్న' . టౌనుకు పోయి అమ్మి సొమ్ము చేసుకుందామనుకునే లోపలే ఇంకేదో పోలీసుకేసు  లంపటంలో ఇరకడం  వల్ల  కుదిరింది కాదు . మూడోనాడు ఇంటికొచ్చి రెండుపెట్టలని నక్క ఎత్తుకు పోయిందని చెప్పిన పెళ్లాం వరాలమ్మమాటలను  నమ్మక రెండు దంచాడు ముందు . ఆనక పిల్లలు చెప్పిన మీదట నమ్మి మూడో పెట్ట కోసం వచ్చే నక్కకు 'దేవుణ్ణి చూపిస్తాన'ని  శపథం పట్టి  పులికోపంతో రగులుతూ పొంచి ఉన్నాడు.  ఆ సమయంలోనే  వీరన్నలో   అంతర్మథన  ఆరంభమయింది. కష్టపడి సాధించిన కోడిపెట్ట పోయినందుకు   వీరన్నకు నక్క మీద కోపంఉండనే ఉంది. రెండో పెట్టనూ అదే నక్క పొట్టన పెట్టుకున్నందుకు ఆ కోపం రెండితలయిందంటాడు రచయిత. ఆ అనడంతో ఆగిపోతే ఆయన  రావిశాస్త్రి కారు .  'తన చేత వరాలమ్మను పొరపాటున కొట్టించినందుకు ఆ నక్క మీద అతనికి మూడొంతుల కోపం వచ్చింది' అని కూడా  అనేశారు;  కనకనే ఆయన రావిశాస్త్రిగారు అయారు  . కొట్టినా సరే.. భార్య మీద ఆ భర్తకు ఎంత ప్రేమ ఉందో ఈ ప్రకటన తెలియచేస్తుంది. అదే సందర్భంలో మానవీయ కోణాన్ని  అద్భుతంగా ఆవిష్కరించే  మరో ఇట్లాంటి ఉదంతాన్ని ఉదహరించడం రావిశాస్త్రిగారిలోని ఉత్తమ కథకుణ్ణి పటం కట్టి చూపిస్తుంది . సొట్టబుర్రోడు అనే ఓ కేడీ చేసిన నేరానికి గున్నమ్మ కొడుకుని కొట్లో వేసిన ఎస్సై అది పొరపాటు అని తెలిసొచ్చిన తరువాత ఊరకే  ఉండలేక పోయాడు. ఆ సొట్టబుర్రోణ్ణి వెదికి  పట్టుకొచ్చి మరీ  మూడు రోజులు కొట్లోపెట్టి కుళ్లపొడిచాడు. కర్కోటకుడుగా  కనిపించినా  సరే .. ఎస్పై  లోని   మనిషి అపరాధభావన నుంచి తప్పించుకోలేకపోయాడని  చెప్పకనే చెప్పే ఈ తరహా మానవీయ దృకృథమే ఎంత హింసాత్మక కథనానికైనా ఉదాత్తత చేకూర్చేది. గుర్తుంచుకోదగ్గ కథలకు ఉండే ఎన్నో సు  సులక్షణాలు  ఇట్లాగే 'సృష్టిలో ' కథలో కోకొల్లలు; స్థలా భావం వల్ల అన్నింటినీ గూర్చి  చర్చించుకునే వీలు ఉండటంలేదు .. అంతే! 


ఆకలితో నకనకలాడే నక్క లాంటి ఓ బక్కజీవి  బుర్రలోని  ఆలోచనా  పరంపరను సృష్టిక్రమం వైపుకు బదులు కంటిక్కనిపించని కరుణామయుడి వైపుకు మళ్లించి కేదారగౌళ రాగంలో తిట్టాలన్నంత కోపం తెప్పిస్తాడు రచయిత ఒక సందర్భంలో  . సుఖాలు, సౌకర్యాలు వరాలుగా ప్రసాదించమని దృష్టిగోచరం  కాని  ఏ శక్తిముందు సాగిలపడతామో .. కష్టాల మీద కష్టాలు వచ్చి పడిపోతున్నప్పుడు ఒత్తిడిని తట్టుకోలేక భగవంతుడిగా భావించే అదే అదృశ్య శక్తికి బాధ్యతా అంటగట్టి   పడతిట్టడం పరమ భాగవతోత్తమ జాతికి చెందిన కంచెర్ల గోపన్నలో కూడా చూస్తాం!  అందుకే, ఒక మామూలు బక్క నక్క   ఉక్రోషం .. నక్కగా తనను పుట్టించాడని నమ్మే సృష్టికర్త మీదకు మళ్లినట్లు చూపించడం అభూత కల్పన అనిపించదు. సరికదా అధివాస్తవికత అని కూడా అనిపించదు; అంతా వాస్తవిక జీవితంలోని విషాదపార్శ్వాన్ని  తడుముతున్న ట్లే  గుండెను కెలుకుతుంది. 


ఇంకొన్ని గంటల్లో మరో జీవికి అన్నం కాబోయే ఓ కోడిపెట్ట తన   గూడుకింద చేరి చేసుకొనే అంతశ్శోధనలో  కనిపించేది కూడా  తిట్లకు గురయే ఆ అదృశ్య భగవానుడే! నడిరాత్రి   వేళ. . భయం ఆవరించిన బ్రతుకుతో  ఆ కోడిపెట్ట. . ఇష్టంలేని స్థలం మార్పు వల్ల కలిగిన బెంగ కారణంగా    కళ్లు మూతలు పడక ఎంతకూ అర్ధంకాని  లోకం తంతును, కోడిగా బతకడంలోని సార్థకతను  గురించి వేదాంత ధోరణిలో ఆలోచించడం మనకు  ఆశ్చర్యం కలిగిస్తాయి. క్విన్ టన్టెరన్ టోన్ అనే హాలివుడ్ దర్శకుడు రక్తాలు కారే యుద్ధ సన్నివేశాలకు నేపథ్య౦లో    మతిపొగొట్టే  సుతిమెత్తని వయోలిన్ రాగాలు  వినిపించే శైలి రావిశాస్త్రి గారిది. తాను చేసే నిత్యహింస త్యాగం గురించి, తాననుక్షణం అనుభవించే  హింసాభయం  నుంచి విముక్తి గురించి  బోధివృక్షం కింది   సిద్ధార్థునికి దీటుగా  ఓ తుచ్ఛ కోడిపెట్ట చేసే తాత్విక చింతనల్లాంటి చిత్రాలు రావిశాస్త్రిగారి కథల్లో అడుగడుగునా తగులుతుంటాయి!  కథలు కాని వ్యవహారాలను కూడా  ఇట్లా కథలుగా .. అదీ మంచి కథలుగా   ఎటా మలచవచ్చో రావిశాస్త్రిగారి కథలు గురువుల్లా బోధించడం విశేషం.   బుద్ధిలో  విశిష్టుడైన    పాఠకుణ్ణి కూడా ఒక మామూలు కోడిపెట్ట తాత్వికచింతనలోకి నెట్టేసే  గొప్ప టెక్నిక్ శాస్త్రి గారిది. చదివించి, కదిలించి, ఆనక పాఠకుడిలో   ఆలోచనలు  రగిలించడం   ఉత్తమ శ్రేణి కథల లక్షణాలలో ఒకటన్న  పాశ్చాత్య లక్షణకారుల సిద్ధాంతం ఆమోదనీయమే   అయితే శాస్త్రిగారి అన్ని కథల్లా ఈ కథ కూడా నిస్సందేహంగా ఉత్తమ శ్రేణి కిందకే రావాలి  మరి.

అన్నిటికి  మించి ఈ  కథలో రచయిత గడుసుగా దాచిన మరో విశేషం. . మరణం తాలూకు  బహుముఖాల ముసుగులు  తొలగించే ప్రయాస.     గంప కింద ముడుచుక్కూర్చుని తాత్విక చింతనలో పడ్డ     కోడిపెట్టలాగానే   చల్లని చావు పిలుపు చప్పుడును మనమూ ఆలకించి అదిరిపడతాం. అదే  పెట్ట బతుకు చివరి మలుపుగా కూడా భావించేస్తాం  .  పీక నులుముడు బాధను ఎదుర్కొనేందుకు సిద్ధమై రెక్కల్లో నుంచి మెడను పాములా పైకి లేపి   భగవంతుడి మీది పగతో ఎర్ర బడ్డ  కళ్లను ఇటూ అటూ తిప్పి చూసినప్పుడు కోడిపెట్ట చావును అలకించేందుకు    మన మనసూ  ఆవేదనతో సిద్ధంగా ఉంటుందా ! ఊహించినకోడి  పెట్ట చావుకు బదులుగా ఊహించని నక్క చావును   మెరుపులా  మన మనసు మీది కొట్టి మతి పోగొట్టేస్తాడు గడుసు రచయిత ! 


కోళ్లగూటిని మూతితో, కాళ్లతో పై కెత్తి పెట్టను కరచుకుపోయే చివరి ప్రాక్షన్ ఆఫ్ సెకనులో  ఆ నక్క  మీద పచ్చని బాణాకర్ర  కత్తిలా మెరవడం, వరస మెరుపులతో  నక్కచావు రూపంలో మృత్యువు మరో కోణంలో మన కళ్లకు భీభత్సంగా కొట్టేస్తుంది! ఎంతటి  కఠినాత్ముడి గుండెనైనా బరువెక్కించే ఆ బాధాకర   క్షణాలలో ఒక క్షణమైనా చదువరని నిలువనీయడు రచయిత.. విచిత్రంగా!   అసందర్భంగా అందాల చందమామ, డాబా మీది వెన్నెలలో ప్రియురాలి సిల్కు చీర రెపరెపల చల్లగాలి, మొనలు దేలిన జోడు గుండెలతో మతిపోగొట్టే అవేవో వాటితో   పోలికలు, జీబుగా పెరిగిన తుమ్మ మొక్కలను  నీలి ముసుగుల మేల్వంశపు అభిసారికలతో ఉపమానాలు! పడుచు భార్యలు సరసాలకు పోతే మణుకులు పడిపోయినమొగుళ్లులా  చీకట్లో  బండరాళ్లు పడి ఉంటాయనడానికి నక్క అంత  నిర్దాక్షిణ్యమైన చావు  చచ్చిన దుర్ముహూర్తమే దొరికిందా రచయిత మహాశయుడికి  ! ? తన కథ చదివే పాఠకుడి పట్ల ఇంతలా వేళాకోళమవసరమా? అని రచయితను తిట్టిపోయాలనిపించాలి నిజానికి!తమాషాగా అట్లా  తిట్టుకునే  వ్యవధానం కూడా ఇవ్వకుండా అంతకు మించిన మరో   విషాద ఘట్టం  అందుకునేస్తాడా మహానుభావుడు!  నక్కపిల్లల కథ ముక్తాయింపుగా ఎత్తుకుంటాడు మహా గడుసుగా!  


కనిపించని తల్లి కోసం బెంగటిల్లి తడిగా, భయంగా, ఆకలిగా ఉన్న బుజ్జిపిల్లలకు వెన్నెల  తడిలోని రుచి, చల్లని గాలిలోని హాయి ఆకలి తీర్చడం లేదని చెప్పి జాలి కలిగిస్తాడు.అనాథపసికందుల మీద . తీరని ఆకలితో ఎంతకూ కనిపించని తల్లి జాడ కోసంగాను కష్టమొస్తే ముందు దేవుడిని ప్రార్ధించాలన్న కనీసం ఇంగితం కూడా బలపడని   కారణంగా తల్లి కోసం మాత్రమే యేడిచి యేడిచి అలిసిపోతాయా  పసికూనలు అని అనడంతో మన మనసంతా చేదయిపోతుంది   ! ఎంత ఏడ్చినా కడుపు నిండదు కాబట్టి మూడు కూనల్లో ఒకటి మొండి ధైర్యం చేసి  బొరియలో నుంచి కొంచెం పైకి ఎగబాకి, ముందు కాళ్లను బొరియ అంచున పెట్టి, ఆకలి తీర్చే ఏకైక జీవి తల్లి కోసరంగా కనిపించినంత మేరా భూలోకమంతా  పరికించి చూసి. . చూసి .. అలా చూస్తూనే ఉండిపోయిందంటాడు రచయిత .  ఏ అకలి తన చేత అపాయకరమైన ఆ దుస్సాహసం చేయించిందో అదే ఆకలి మరో జీవి .. కొండచిలువ నోట్లో నుంచి కడుపులోకి మెల్లగా లాగేసుకుందని చల్లగా రచయిత ముక్తాయించడం ఎంత విషాదం?!  .  ఎందుకు పుట్టినట్లోనంటూ మనసులో   అంతర్మధనం ఇంకా మొదలు పెట్టక  ముందే మిగతా నక్కపిల్లలు కూడా అదే దారిలో  కొండచిలువ నోరు అనే మృత్యు గహ్వరం ద్వారా సృష్టిలో  లయించుకు పోయినట్లు రచయిత ముక్తాయింపు! రక్తం కక్కి స్పృహ  తప్పిన నక్క కొనవూపిరి కొనసాగింపు స్మృతిలోకంలో ఊపిరి ఆగి కదలిక నిలబడే తుది శ్వాస  వరకూ మనోనేత్రం  అవనికపై  కదలాడిన చిత్రాలను రచయిత కవిగా మారిపోయి చిత్రించిన విధానం శాస్త్రిగారి కథలలో కామన్ గా కథను హృదయంగమంగ మార్చేస్తూ   కథాశాస్త లక్షణాలకు ఎక్కడా అందదు!  ఎండల్లో నల్లకొండనీడ , వెన్నెల్లో పైరు పచ్చగాలి, పొలాల్లో చెరకు తీపితోట , అంతకంటె ముందు అంత కంటె తల్లిపాలతీపి, మొత్తని తల్లి మూతి ముద్దు, ఆనాటి అమ్మ వెనక పరుగు, ఓనాడు మొదటి సారిగా రుచి చూసిన మొదటి కోడి ఉప్పటినెత్తురు, తియ్యటి మాంసం, మేకల్ని వేటాడిన రోజులు, తన తొలి ప్రియుడి వాడి కోరచూపులు, ప్రేమతో వాని మొత్తటి కరుపులు, కసితో అతడి వేడి కౌగలింతలు ( నక్కలు కౌగలించుకుంటాయా ?   అన్న అనుమానం కూడా రానీయడీ కవి కాని కవిరచయిత ! ), తన కడుపులో మొత్తటి శిశువుల బరువులు, తన  ప్రసవం, తన వేదన , తన పిల్లల అరుపులు వినిపించగానే తన చెవుల్లో పులకరించిన స్వర్గమే తన  గుండెలలో నుంచి పాల ధారగా ప్రవహించిన వైనం, పిల్లలతో తన ఆటలు, వాటి కోసం తాను పడ్డ యాతనలు, దుర్మార్గులతో తన పోట్లాటలు ( నక్క దుర్మార్గమైనదని మన నిర్ధారణ అయితే- ( టక్కరిగా భావించే నక్క  జాతికీ దుర్మార్గులు కొందరు తప్పలేదన్న మాట! ఎవరో ? బహుశా మన మనుషులమే అయివుండనోపు! లేకపోతే మొదటిసారి  మనిషిని చూసినప్పుడు రచయిత చెప్పినట్లు దానికి ' జుగుప్స  ' ఎందుకు కలుగడం ? ! తమ జాతి వారే అయినప్పటికీ మనుషులకు లొంగిపోయిన కుక్కలలో తన కాట్లాటలు, పూల వాసనలు, పాముల పడగలు , వానా జల్లులు , పందుల వికృతాలు, చల్లని గాలులు, నల్లని   మబ్బుల రంగుల విల్లులు , వెండిమబ్బుల వెలుగులు, ఆకలితో తన పరుగులు ( మళ్లీ ఆకలి ! ), అలసటతో తన పడకలు, ( ఈతి బాధలు వదలడం లేదు! ), అనుక్షణం ఆనందాలు, అనునిత్యం భయాలు, ఆకలి కోసం తను చేసిన హింసాకృత్యాలు  , ఎల్లప్పుడూ రక్తపాతాలు, ఓహో .. అరె.. ఏమిటిది? ఎందుకిది? ఎక్కడిది ? నన్నెందుకు  పుట్టించావు? ఎందుకిలా చంపుతున్నావు? ఎన్నెన్ని ఆశలు కల్పించావు? ఎన్నెన్ని పాపాలు చేయించావు? ఎన్నెన్ని హింసలు పెట్టావు? పెట్టించావు? ఎన్ని హింసలు ఎన్ని హింసలు! నాకెందుకీ పుట్టుక? ఎందుకీ చావు ? ఏమవుతారు దిక్కుమాలిన నా పిల్లలు? ఏ హింసలు.. ఏ హింసలు.. చావు పుట్టుకల అర్థరాహిత్యాన్ని గూర్బి   లక్షసార్లు నిలదీస్తే ఆ బాధ్యుడెవడో సమాధానం  చెప్పకోలేక గుడ్లుతేలవేయడంలాంటి ఆలోచన లేమన్నా  ఊహకొచ్చాయో  ఏమో..బాధతో  చచ్చి పోతూ కూడా నవ్వబోయి నవ్వు సగంలో ఉన్నప్పుడు చివరి శ్వాస కూడా పూర్తిగా  పోయిందేమో .. మిగిలిన అరనవ్వు అట్లాగే చచ్చిపోయిన నక్క పెదాల మీద ముద్రలాపడి మహా ముచ్చటగా వుంది నక్క ముఖం. తనయుల పాపాలకు తండ్రులు అనుభావించాలన్న సూత్రమే నిజమైతే .. తాను చేసిన పాపాలన్నింటికీ ఆ దేవుడే శిక్షలు అనుభవించాలన్న ఆలోచనా వచ్చి చచ్చిపోయ నక్క మొకంలో ఆ చిరునవ్వు మెరిసి  ఉండాలి.  నక్కలో అర్థాంతరంగా ఆగిపోయిన అంతర్మధనం  చదివే పాఠకుడిలో మొదలవడానికి రచయిత కవిత్వ౦ బాట పట్టి  యమ జిమ్మిక్కులన్నీ చేయడం చూడొచ్చు మనమిక్కడ. 

దిక్కులేని చావు చచ్చి జాతి పుట్టించిన నక్క  .. అవతల దాని పిల్లలూ కంతిరి లోకం ముఖమింకా కన్రెప్పలెత్తి చూడనైనా చూడక మునుపే మెత్తంగా చావు కంతలోకెళ్లి కనుమరుగవడం చేత - మరింత జాలి పుట్టించే నక్క చావు వీరన్న పెళ్లాం బిడ్డల మొహాల్లో మాత్రం సూర్యకాంతిలో మామిడి మొక్కలంత ప్రకాశం కలిగించాయ్! వీరన్న  కైతే  నక్కబారిన కాకుండా కోడి తన బారిన పడ్డందుకు చచ్చే ఆనందంగా ఉంది. ఆనందంతో అతగాడా ఎర్రరంగు పులిమిన తెల్లకోడిని గుండెలకు అదుముకున్నప్పుడు ఆ చావు స్పర్మకు కోడి భగభగ ఎండలో వడవడ వణికింది ! కోడి ఓనరు వీరినాయుడును వెంట బెట్టుకొనొబ్బిన పోలీసోడుతో కలిసి తన్నెత్తుకొచ్చిన దొంగ వీరన్న పోతున్నప్పుడు రాత్రల్లా నిద్ర లేని  కోడిపెట్ట ' కొత్త పరిణామం అర్ధంకాక, భగవంతుడి సృష్టిని అర్థం చేసుకునే ప్రయత్నమే పాపం' అని తీర్మానానికొబ్బి కళ్లుమూతలేసుకుని పడుకునేసింది.

ముక్తాయింపుగా శాస్త్రి గారు, రేపు ఎక్కడో ఒకప్పుడు ఎవరింట్లోనో ఒకరింట్లో చచ్చి చెడి పలావు అయిపోతుందని తేల్చేస్తాడు రచయిత. 

- కర్లపాలెం హనుమంతరావు 


20-08-2021 


బోథెల్, యూ. ఎస్. ఎ 


చిన్నపిల్లల కోసం : శాస్త్రం - వ్యవహారం - సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

ఒక ఊరికి నలుగురు ఉద్దండులు వెళ్ళారు - ఆ ఊరి మోతుబరిని  మెప్పించి, పారితోషికాలను పొందాలనే ఆశతో.

తిన్నగా ఆ ఊరి సత్రపు యజమానిదగ్గరకు వెళ్ళి తమకు బస, భోజన సౌకర్యం వగైరా ఇవ్వమని అడిగారు. వారి మాటల్లో స్వోత్కర్షగా మాట్లాడడం, కొంత అహంకారం వంటివి కనిపించాయి ఆ సత్రపు నిర్వాహకుడికి. అంతేగాక, వాళ్ళలో ‘ముఖ్యమైనదేదో’ తక్కువ అనిపించింది కూడా!  అందుకని ఆయన వాళ్ళకు చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు.


“అయ్యా! చిన్న ఇబ్బంది కలిగింది. బసకి ఏమీ ఇబ్బంది లేదుగానీ, మీకు భోజనాలు వండడానికీ, వడ్డించడానికీ సిబ్బంది లేరు. కాబట్టి, కావలసిన డబ్బు ఇస్తాను గానీ మీరే వండుకోవలసి ఉంటుంది.

మీరు తలకొక పని చేసుకుని, ఈ రోజుకి గడిపేయాలి” అన్నాడాయన.

"సరే" అన్నారు వీళ్ళు.


ఆయన ఒప్పజెప్పిన పనులు:


తార్కికుడు (logician) ఊరిలోకి పోయి నేయి తీసుకురావడం. 

వైయాకరణి (grammarian) మజ్జిగ కొనడం. 

జ్యోతిష్యుడు (astrologer) - విస్తరాకులకోసం చెట్టెక్కి, వాటిని కోసుకొచ్చి, తరవాత పుల్లలతో కుట్టడం. 

గాయకుడు (singer) - అన్నం వండడం. 


వీరందరూ అక్కడికి వెళ్ళినది 10 గంటలకు. 

‘2 గంటలయేసరికి మీ భోజనాలన్నీ అయిపోయి, కాస్త విశ్రమించవచ్చు’ అన్నాడతను వాళ్ళతో.


సరేనని వీరందరూ తలొక వైపుకు  బయలుదేరారు.


తార్కికుడు  నెయ్యి కొన్నాడు. సత్రానికొచ్చే దారిలో ఆయనకు ఒక అనుమానం వచ్చింది - ‘చెంబుకు నేయి ఆధారమా? నేతికి చెంబు ఆధారమా?’ అని (ఏది ఆధారం? ఏది ఆధేయం?). బాగా ఆలోచించినా సమాధానం దొరకలేదు! ‘పోనీ ఒంపి చూస్తే సరి!’ అనుకుని చెంబును తలకిందులు  చేశాడు. సమాధానం దొరికిందిగానీ, నేయి నేలపాలైంది.  ఏం చేయాలో తెలియక బిత్తరచూపులు చూస్తూ అక్కడే చతికిలబడ్డాడు! 


ఇక వైయాకరణి - ఎందరో గొల్ల స్త్రీలు మజ్జిగను అమ్ముకుంటూ ఆయనకెదురుగా పోతున్నారు. “చల్ల” అని దంత్య చకారాన్ని ఎవరూ పలకటంలేదు . ప్రతీ స్త్రీ కూడా “సల్ల” అనే భ్రష్టరూపాన్నే పలుకుతోంది! ఆయనకు చాలా కోపం వచ్చింది. ‘ఔరా! ఈ ఊరిలో ఈ అపభ్రంశపు శబ్దాలను వినలేకపోతున్నాను. సరియైన ఉచ్ఛారణ పలికే మనిషి దొరికేవరకూ నేను మజ్జిగను కొనను' అని భీష్మించుకుని ఒకచోట కూర్చుండిపోయాడు!


ఇక జ్యోతిష్యుడి సంగతి:

ఊరి చివర్లో ఉన్న ఒక మోదుగచెట్టునెక్కి, ఆకులను కోసుకుని, కిందకు  దిగబోతోంటే ఒక తొండ కనిపించిందాయనకు. ఏవో లెక్కలు వేసుకుని చూస్తే, అది దుశ్శకునమనీ, అది అక్కడే ఉంటే గనుక మరొక 4 గంటలవరకూ  చెట్టు  దిగడం దోషమని నిర్ణయించుకున్నాడు! ఆ తొండ ఈయనను  చూచి బెదిరిందో, ఏమో - అది అక్కడ, ఈయన పైన ఉండిపోయారు!


ఇక, గాయకసార్వభౌముడి విషయానికొస్తే - ఆయన ఎసట్లో బియ్యం పెట్టాడు. కుండలోని నీళ్ళు మరుగుతున్నాయి. ఆవిరికి మూత పైకీ క్రిందకీ పడిలేస్తోంది. ఈయన తాళం వేయసాగాడు . ఆదితాళం- ఉహూఁ, రూపక- ఉహూఁ, జంప-   ఉహూఁ --- ఏ తాళానికీ రావట్లేదు. అశాస్త్రీయమైన ఆ తాళానికి విసుగొచ్చి, ఆయన ఆ కుండమీద ఒక రాతిని విసిరేశాడు! ఇంకేముంది! అన్నం నేలపాలయింది. మరి ఈయన వంటగదిలోనే!


వీరందరూ ఏవో అవకతవకలు చేస్తారని ముందే ఊహించిన సత్రపు నిర్వాహకుడు. కొందరు మనుషులను పంపి, ఎక్కడెక్కడో చతికిలబడ్డ వారినందరినీ ఒకచోటికి చేర్చాడు.


'నాయనలారా! మీకందరికీ ఎప్పుడో వంటలు చేయించే ఉంచాను, భోజనాలకు లేవండి. 

దయచేసి నా మాటలు రెండు వినండి. మీరు మీ  శాస్త్రాలలో గొప్పవాళ్ళే అయుండచ్చు. కానీ మరొకరిని తక్కువచేసే విధంగా ఉండకూడదు మీ శాస్త్రజ్ఞానం వల్ల కలిగిన అహంభావం . మరొకటేమిటో మీకు చెప్పనక్కరలేదనుకుంటా. శాస్త్రజ్ఞానం ఒక్కటే  చాలదు జీవితంలో. దానితోపాటు కొంత వ్యవహారజ్ఞానం కూడా ఉండకపోతే కష్టమని మీకు మీరే నిరూపించుకున్నారు కదా!' అని వాళ్ళను సున్నితంగానే మందలించాడు.

- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

18 -09- 2021 

( ఎప్పుడో.. ఎక్కడో  విన్న కథ) 

బోథెల్ ; యూ . ఎస్.ఎ 

అన్నప్రసాదం! - కర్లపాలెం హనుమంతరావు - ఈనాడు సంపాదకీయం

అన్నప్రసాదం!
- కర్లపాలెం హనుమంతరావు 

కుబేరుడికైనా కుచేలుడికైనా క్షుద్బాధ ఒక్కటే. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదని పెద్దలన్నదీ అందుకే. లోకంలో బాధలు అనేకమున్నా, కవిహృదయం ఏనాడో తేటతెల్లం చేసినట్లు 'దురంత దుఃఖకర ఆకలిబాధ భరింప అశక్య'మన్నది ప్రత్యక్షర సత్యం. మనిషికే కాదు, సృష్టిలో ప్రతిప్రాణికీ ఆకలిదప్పులూ తిండితిప్పలూ తప్పవు. 'ఆకలి కష్టము మిక్కిలి ఎక్కువ' అని చిలకమర్తి చెప్పినా, 'ఆకొన్న కూడె అమృతము' అంటూ సుమతీ శతకకర్త చాటినా- సారాంశమొకటే, అన్నం ప్రాధాన్యం లెక్కకట్టలేనిది. 'అడవిపక్షుల కెవ్వడాహారమిచ్చెను/మృగజాతికెవ్వడు మేతబెట్టె/వన చరాదులకు భోజనమెవ్వడిప్పించె?' అని కవిగళం గుప్పించే ప్రశ్నలకొచ్చే జవాబుల్లో ఆస్తిక నాస్తిక తేడాలుండొచ్చు. మనిషి ఆకలి తీర్చే నాథుడెవరన్నప్పుడు వచ్చే సమాధానం- సాటి మనిషే! 'తల్లి పెట్టు తియ్య తాయిలములన్నియు తోటి బాలకులకు పంచిపెట్టిన' ఆర్ద్రహృదయుడు బాల గౌతముడు. 'ఉపకారము తలచని కఠినాత్ముడు ఉండి వ్యర్థము, మదిలో/ చపలత వీడక వ్రతములు తపములు జేయుట వ్యర్థము' అన్న హితోక్తి అర్థపరమార్థాలు గ్రహించి వ్యవహరించే మానవుడే మాధవుడన్నది సర్వజన సమ్మతం. అరణ్యవాసకాలంలో ధర్మజుడు తనవెంట ఉన్నవారి భోజనార్థం సూర్యభగవానుణ్ని ప్రార్థించి అక్షయపాత్ర సంపాదించాడు. ఎంత వడ్డించినా ఇంకా నిండుకుండలా ఉన్నందునే, అది ఎందరెందరి ఆకలినో రోజూ తీర్చగలిగేది. అక్షయగుణ సంపన్నత ఆ పాత్రలో ఉందా, లేక ధర్మరాజు ధర్మబుద్ధిలోనే అది ఉందా అన్నదొక్కటే కీలకం. 'ఖ్యాతి చేకూరు, దీనులకు అన్నదానమిడు పుణ్యప్రాణికిన్‌' అని పలికిన ప్రౌఢకవి మల్లన మాటనే బాటగా మలచుకుంటే, మానవజన్మకు అంతకుమించిన సార్థకత వేరొకటి ఉండదు! ఉపకారబుద్ధికి ప్రకృతే ప్రతీక. 'తరువులతి రస భార గురుత గాంచు/ నింగి వ్రేలుచు నమృతమొసంగు మేఘు/ డుద్ధతులు గారు బుధులు సమృద్ధిచేత/ జగతి నుపకర్తలకు నిది సహజగుణము' అన్నట్లు ప్రకృతిమాతే సమర్పణశీలతకు నిదర్శనం. పండ్ల బరువుతో వంగే చెట్ల కొమ్మలకు చేతికి అందుబాటులో ఉండటం తెలుసు. గగనసీమలో షికారుచేసే మేఘాలకు వర్షించటమే తెలుసు. తోటివారికి ఇవ్వటంలోని సంతృప్తి, సంతోషం మనసునిండా ఉన్నప్పుడు మానవుడూ అంతే. పోషక సమృద్ధమైన గంజిని దారిపక్క కాలువపాలు చేయటంలో మానవత లేదు. ఆ వృథాను అరికట్టడంతో పాటు, అన్నమూ జతచేర్చి ఆర్తులకింత అందించటంలోని ధన్యతా అంతా ఇంతా కాదు. జాషువా కవినేత్రం తిలకించిన భారతంలో 'ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు' వారెందరో ఉన్నారు. 'దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్‌ మెతుకు విదల్పని'వారి తత్వమే భాగ్యవిహీనత్వమన్న ఆయన వాదం సంపూర్ణ హేతుబద్ధం. కాస్తంత తిండి దొరక్క అల్లాడిపోయిన దుర్భర అనుభవం నాడు గుణనిధికి ఎదురైంది. చేతికందిన ఆహారం నోటిదాకా చేరని వైనాన్ని తలచుకుని కుమిలిపోయిన దీనదశ అతడిది. 'అన్నం అమృత రూప'మని శ్రుతులు, 'పరమాత్మ స్వరూప'మని స్మృతులు చాటాయి. అన్నపూర్ణగా ఆరాధించి, 'సుఖీభవ'గా ఆశీర్వదించి భారతీయతను వేనోళ్ల కీర్తించిన ఘనచరితా మనకుంది. 'దానమునకు అధికమైన ధర్మము కలదే' అని హరిభట్టు, 'కరమున నిత్యాన్నదానము సురుచిర భూషణము' అంటూ భర్తృహరి ప్రస్తుతించిందీ దానగుణశీలతనే. దానమివ్వనివాడు ధన్యుడు కాడని, కాలేడని స్పష్టీకరించిన సుద్దులూ చాలా ఉన్నాయి మనకు. అన్నీ ఉన్నా ఎన్నో తెలిసినా, ఎక్కడో ఏ మూలనో- ఇవ్వటానికి చేతులురాని వైనం, ఉన్నదాన్ని తెలిసో తెలియకో వృథాచేసే నైజం దాపురించింది. స్థానికమో ప్రాంతీయమో జాతీయమో కాదు... ఈ పెనుజాడ్యం ప్రపంచవ్యాప్తం! 
'వృథా చేయబోకు, జన్మము సదా రాదు నీకు' అని తెలిసినవారున్నా అన్నార్తులకు లభిస్తున్న ఉపశమనం కొంతే. మాటలూ చేతలకు అంతరాలున్నచోట 'కాగితమ్ము లిచట కరిపించువారు శి/క్షింపబడుదు' రని లిఖించి పెద్ద/కాగితమ్ము గోడకంటించె దొరగారు' తరహా వ్యవహార సరళీ ప్రమాదమే. చెప్పింది చేయటం, చేసిందే చెప్పటం సమర్థ శక్తివనరుగా ఉత్తమ ఫలితాలనిస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్న భావన, బాధ్యతాయుత వర్తన ఇళ్లు, భోజనశాలలు, విందులు, ఉత్సవాల్లో వెల్లివిరియాల్సి ఉంది. 'ఎంత తింటావో అంతే వడ్డించుకో... తిన్నంత తిని, మిగిలిందంతా పారేసే అలవాటు మానుకో' అంటూ అవ్వలూ తాతయ్యలూ, అమ్మానాన్నలు చెప్పే మాట ఇప్పుడు ఎంతమందికి చెవికెక్కుతుంది? భోజనవేళ విధివిధానాలు, నియమనిబంధనలు ఉన్నట్టే వృథాను పరిహరించాలన్నదీ ఓ విధానం, నిబంధన. 'కాంతి శాంతి సుఖమ్ము భాగ్యమ్ము నొసగు/ బహువిధారిష్టముల భస్మీపటలమొనర్చు' జీవితమే జీవితం. అది సకల వృథాల నివారణ, సర్వవనరుల సద్వినియోగంతోనే పరిపూర్ణమవుతుంది. విశ్వమంతటా అనునిత్యమూ లక్షల టన్నుల ఆహారపదార్థాలు వృథా అవుతున్నాయి. దేశదేశానా ఒకవంక ఆకలికేకలు మిన్నంటుతుంటే, మరోవైపున వ్యధార్తుల కంట రక్తాశ్రువులు చిందిస్తూ అన్నపానీయాల వృథా విచ్చలవిడిగా సాగుతోంది. తగినన్ని రవాణావసతులు లేక కొంత, గోదాముల్లో అస్తవ్యస్త పరిస్థితుల కారణంగా మరికొంత- దాపురించిన దుస్థితి ఇది. ఎక్కువగా వడ్డించుకొని చివరికి కుప్పతొట్లలో పారేసే పంచభక్ష్య పరమాన్నాల తీరు మరింత బాధాకరం. పొలం నుంచి పళ్లెంలోకి, అక్కడినుంచి నోటికి చేరేలోగా ఎంతెంత వృథా! వీటన్నింటితో కోట్లమంది నిరుపేదల కడుపు నింపవచ్చని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక ఈమధ్యే వెల్లడించింది. ఐరోపా సంఘం ప్రకటించిన 'ఆహార వృథా వ్యతిరేక సంవత్సరం' ముగింపు దశకు చేరుకుంది. నేటికీ దురవస్థ మారటం లేదంటే- 'నరుడి నెత్తిమీద రుద్దిన దరిద్రం/ అది ఎప్పుడో కట్ట తెగే సముద్రం' అన్న కవి హెచ్చరికకు రూపం వస్తున్నట్లేగా!
(ఈనాడు, 15:12:2013 ప్రచురితం  )

సంస్కృతి : బళ్లో పడెయ్యడం అను అక్షరాభ్యాసం కథ -కర్లపాలెం హనుమంతరావు

  



ఇప్పుడంటే బిడ్డ తల్లి కడుపులో ఎదుగుతుండగానే.. కన్నవాళ్లు యమకంగారుగా ఏ కాన్వెంటులో సీటు దొరుకుతుందా అని వేట మొదలుపెడుతున్నారు. అర్థశతాబ్దం కిందట పిల్లల చదువులకు  తల్లిదండ్రులు మరీ ఇంతలా తల్లడిల్లడం కనిపించదు. 


బిడ్డను అయిదేళ్ల వరకు ఇంటా బయటా హాయిగా ఆడుకోనిచ్చేవాళ్లు. నడుముకు నిక్కరు గుండీలు సొంతంగా పెట్టుకునే  అయిదేళ్ళ వరకు ఆగి  ఆ నిక్కరు బిగించే చేతికే  పలకా బలపం ఇచ్చి బళ్లో కుదేసివచ్చేవాళ్లు. సామాన్యులు ఇంత సాధారణంగా జరుపుకునే పిల్లల అక్షరాభ్యాస కార్యక్రమం కలిగినవాళ్ల ఇళ్లల్లో  ఇంకాస్త ఆర్భాటంగా చేయడం రివాజు. డబ్బుండి చేసినా, లేకుండా  చేసినా ఇద్దరు  నిర్వహించేదీ ఒకే కార్యకలాపం. దాని పేరే అక్షరాభ్యాసం. గతంలో మన తెలుగునాట పిల్లలను పాఠశాలలో ఎట్లా వేసేవారో.. ఆ తతంగం, దానికి వెనుక ఉన్న ఆధ్యాత్మిక సంప్రదాయం .. వాటిని  గురించి సూక్ష్మంగా తెలుసుకొనేందుకే ఇక్కడ ఈ వ్యాసం. 

 

ధర్మశాస్త్రాలు బిడ్డకు అక్షరాలు దిద్దబెట్టే ఈ తతంగానికి రకరకాల పేర్లు నిర్దేశించాయి. తెలుగువాళ్ల మూలరుషిగా భావించే విశ్వామిత్రుడు బిడ్డను బళ్లోవేసే తంతును విద్యారంభం అన్నాడు. అదే సంస్కారం, గోపీనాథభట్టు విరచిత ' సంస్కార రత్నమాల ' ప్ర్రకారం- అక్షరారంభం! అక్షర స్వీకరణగా వశిష్టుడు పేర్కొంటే, మార్కెండేయుడు 'అక్షర లేఖనం'అనే పేరు ఖాయం చేశాడు. ఎవరే పేరుతో  పిలుచుకున్నా  పిల్లలకు  అక్షరాలు దిద్దబెట్టే శుభకార్యంలో తంతు  మాత్రం దాదాపు ఒకటే!


తమాషా ఏమిటంటే, వీరమిత్రోదయ, స్మృతిచంద్రిక, సంస్కార రత్నమాల, యాజ్ఞవల్క్య స్మృతికి వ్యాఖ్యానం చెప్పిన అపరార్క వ్యాఖ్య లాంటి అర్వాచీన గ్రంథాలలో ప్రముఖంగా ప్రస్తావనకొచ్చిన అక్షరాభ్యాస సంస్కారం అసలు గృహ్యసూత్రాలలోనే కనిపించకపోవడం! విశ్వామిత్ర, బృహస్పతి వంటి రుషుల పేర్లు ఈ వ్యవహారంలోకి లాగడం కేవలం  దీనికి పురాతన సంప్రదాయవాసన అంటగట్టడానికేనంటూ పి.వి. కాణే వంటి ఆధునికులు విమర్శిస్తున్నారు. 


ఎడ్యుకేషన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా గ్రంథం రాసిన డాక్టర్ అ.స. అత్లేకర్ అభిప్రాయం ప్రకారం భారతీయుల  అక్షర జ్ఞానాన్ని క్రీ.శ. ఏడు, ఎనిమిది శతబ్దాలకు ముందు కాలానికి మించి ముందుకు  తీసుకుపోలేం. 


ఇండియన్ యాన్టిక్వెరీ గ్రంథ కర్త డాక్టర్ బూలర్ లెక్క ప్రకారం అయితే మన దేశస్తులకు వర్ణమాలను గురించి తెలియడం క్రీ.పూ 800 తరువాతే! ఎట్లాంటి పరిస్థితుల్లోనూ  అంతకన్నా ముందైతే కాదు. ప్రాచీన లిపి మాల అనే మరో గ్రంథం ఉంది. దాని కర్త పండిత గౌరీశంకర్ హీరాచంద్ర.  ఈ దేశవాసులకు అక్షరాలు రాసే లేఖనకళ వంటబట్టిందే క్రీ.పూ 16 -12 శతాబ్దాల ప్రాంతంలో అంటారాయన.  అందరికి అందరూ పండితులే. అందరివీ శాస్త్రీయ పరిశోధనలే! కానీ ఏటి కొకరు కాటి కొకరు ! ఇహ రథం ముందుకు కదిలేదెట్లా? అందుకే ఆ గందరగోళాల జోలికి  పోకుండా ఇంచక్కా   మనవైన సంప్రదాయాలు ఈ అక్షరాభ్యాస తతంగాన్ని గూర్చి  ఏ వింతలూ విశేషాలూ  చెబుతున్నాయో.. రవ్వంత తెలుసుకుందాం!


 ఏ విషయం తెలిసినా , ఎంతటి  గొప్పవారైనా ఆరు నెలలు గడిస్తే అంతా మరుపుకొస్తుందని శాస్త్రం. అట్లాంటి మతిమరుపు జాడ్యానికి మందు కింద బ్రహ్మదేవుడు అక్షరమాలను   సృష్టించాడని బృహస్పతి స్మృతి ఉవాచ. 

'                                                                             షాణ్మాసికే తు సంప్రాప్తే భ్రాంతిస్సంజాయతే యతః ।

ధాత్రాక్షరాణి సృష్టాని పత్రా రూఢాన్యతః పురా॥- అనే శ్లోకానికి అర్థం ఇదే! 


కృష్ణయజుర్వేద సంహిత రెండో కాండంలో అంతకు మించిన తమాషా మంత్రం ఇంకోటుంది. 

 'యాప్ర లిఖతే తస్యైఖలతిః' అని ఆ మత్రం. అంటే ఆడవాళ్లు ఈడేరిన తరువాత గాని పలకా బలపం చేతబడితే .. ఆ పాపానికి పరిహారంగా బట్టతల గల బిడ్డ పుడతాడని హెచ్చరిక. ఆడవాళ్లు చదువుకోరాదని చెయ్యి చుట్టి ముక్కు చూపించే పద్ధతి అన్న మాట. ఆ లెక్క నిజమే అయితే,  ఇప్పుడు ఎక్కడ చూసినా అర్థ బోడిగుండు శాల్తీలే దర్శనమీయాలి  న్యాయంగా కదా! ఏదో .. అప్పటి నమ్మకాలు  అప్పటివి అని సరిపెట్టుకునేవాళ్లలో  ఏ పేచీ ఉండదనుకోండి! 


కాలం గురించి ఎన్ని కయ్యాలు జరిగినా, హిందువుల మనోభావాల ప్రకారం, ప్రప్రథమ లేఖకుడు వినాయకుడు. వ్యాసమహర్షి చెప్పుకుపోతుంటే మహా భారతం మొత్తం పూసపోకుండా రాసుకుపోయింది  ఆ మహాదేవుడే  కదా! మరి వ్యాసుడి కాలం సుమారు 5000 ఏళ్ల కిందటిదేనా అని అడిగితే  ఇప్పుడున్న   శాస్త్రవేత్తల్లో సగం మంది అవునన్నట్లే తలలాడిస్తారు.  ఇహ మన  అక్షరజ్ఞాన కాలం  గురించి ఇంతలా  కుస్తీలింకా అవసరమా? 

అని సందేహం. సమాధానం చెప్పే దెవరు? 


చౌలం అంటే ఉపనయనం ముందు జరిగే తంతు . అది ముగించుకున్న తరువాతనే ఈ అక్షరాభ్యాస కార్యక్రమం! అలాగని మరి  సాక్షాత్తూ కౌటిల్యుడంతటి రాజగురువే నియమం విధించాడు. 


రాజకుమారుడు 'వృత్త చౌల కర్మా లిపిం  సంఖ్యానం చ ఉపయంజీత, వృత్తోపనయనస్త్రయీ మాన్వీక్షికీం చ శిష్టేభ్యో నార్యా  మధ్యక్షేభ్యో దండనీతిం, వక్తృ ప్రవక్తభ్యః, బ్రహ్మచర్యం చా షోడశాద్వర్షాత్, అతో గోదానం దారకర్మ చ'-అన్నాడు. 


వడుగు అయిన తరువాత అక్షరాలు నేర్చుకోవడం, గణితం.. ఉపనయనం అయిన తరువాత  వేదాధ్యయనం చేయడం, అన్వీక్షకి, వార్త, దండనీతులు అనే మూడు రాజవిద్యలు పదహారో ఏడు వరకు (అంటే గోదానవ్రతం అయే వరకు)అభ్యసించడం ! అవన్నీ సక్రమంగా పూర్తి చేసుకున్న తరువాతనే పెళ్లి ముచ్చట. 


ఇలాంటి ఏదో నియమం ఉండబట్టే  వాల్మీకి కాలంలో కూడా ఉండబట్టే ఆ గురువు లవకుశులకు ఒక్క వేదం మినహాయించి  సమస్త విద్యలు చౌలం అయిన తరువాతనే  నేర్పించాడని ఉత్తర రామాయణంలో భవభూతి చెప్పిన  మాట. 


'నివృత్త చౌల కర్మణోశ్చ త్రయోస్థయీవర్జ మితరాస్తి స్రోవిద్యాః సావధానేన మనసా పరినిష్ఠాపితాః'

లిపి పరిజ్ఞాతుడైన తరువాతనే  రఘువంశ మహారాజు అజుడు సాహిత్యసముద్రంలోకి ప్రవేశించినట్లు కాళిదాసు రఘువంశంలో అనే మాట. 


చంద్రాపీడ మహారాజు ఆరేళ్లకు విద్యామందిర ప్రవేశం చేసి పదహారేళ్ల వరకు ఎట్లా గడిపాడో, ఎన్ని రకాల కళలు అభ్యసించాడో బాణుడు కాదంబరిలో వివరంగా చెప్పుకొస్తాడు.  


చదువులు నేర్చుకోవడం సరే, ఏ వయస్సు నుంచి నేర్చుకోవాలన్న విషయం మీద కూడా కీచులాటలే మళ్లీ! విశ్వామిత్ర నీతి ప్రకారం ఐదవ ఏట నుంచి విద్యారంగ ప్రవేశం చేయాలి. పండిత భీమసేన్ వర్మ రాసిన 'షోడశ సంస్కార విధి' అనే గ్రంథంలో  పేరు తెలియని ఒక స్మృతికర్త మతాన్ని బట్టి ఐదు నుంచి 

ఏడు సంవత్సరాల వరకు ఎప్పుడైనా నిక్షేపంగా అక్షరాభ్యాస కార్యక్రమం ముగించుకోవచ్చు. ఇదే ఆ రోజుల్లో 'పంచమే సప్తమేవాబ్దే' సిద్ధాంతంగా ప్రసిద్ధి. 


ఉపనయనం ఆర్షధర్మం దృష్టిలో  రెండో జన్మ. ఆ సందర్భంలో విద్యాభ్యాస కార్యక్రమం కూడా శుభంగా ముగించుకోవచ్చని బృహస్పతి అభిభాషణ. 


మార్గశిరమాసం మొదలు జ్యేష్ఠమాసం వరకు మధ్యలో ఎప్పుడైనా అక్షరాలు దిద్దబెట్టవచ్చని    చెబుతూనే ఆషాఢం నుంచి కార్తీకం మధ్య కాలం మొత్తాన్నీ నిషిద్ధ కాలంగా  విశ్వామిత్ర నీతి నిర్దేశించింది.

  

  'అప్రసుస్తే నిద్రాం త్యజతి కార్తిక్యాం తయోః సంపూజ్యతే హరిః' అని విష్ణు దర్మోత్తరం. సూర్యభగవానుడు ఉత్తరాయన పుణ్యకాలంలో ఉన్నప్పుడు చేసే అక్షరాభ్యాసం శుభదాయకమని వశిష్ఠుని వాక్కు.  


అపరార్కుడు, స్మృతిచంద్రిక కర్తలిద్దరూ మార్కండేయ పురాణోక్తులను పేర్కొంటూ ఐదో ఏట కార్తీక శుద్ధ ద్వాదశి నుంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి లోపలే  ఈ కర్యక్రమాన్ని కడతేర్చుకోవాలని హితవు చెప్పారు. కాకపోతే ఒకటే షరతు. పాడ్యమి, షష్ఠి, అష్టమి, పూర్ణిమ, అమావాస్య, రిక్త తిధులైన చవితి, నవమి, చతుర్దశులను వదిలిపెట్టడం క్షేమకరమని హెచ్చరించడం.  


శని మంగళ వారాలు కూడా చదువుల ఆరంభానికి శుభదాయకం కాదన్నది నాటి కాలపు సమాజంలోని గాఢవిశ్వాసాలలో ఒకటి.  రవి, కుంభ రాశులకు చదువుల ప్రారంభానికి కలసిరావు. లగ్నాత్తు ఆష్టమంలో గ్రహాలేమీ లేకుండా చూసుకొని ముహూర్తం నిర్ణయించుకోవాలని పెద్దలు నిర్దేశించేవాళ్లు. ఈ తరహా  జ్యోతిష సంబంధ నియమాలు ఒకటా.. రెండా! పట్టించుకొనేవాళ్లు పట్టించుకొనేవాళ్లు. పట్టింపులేని వాళ్లు పిల్లల చేతిలో  ఓ మార్కాపురం పలకా.. నరసాపురం  బలపం పెట్టి బడికి తోలేసేవాళ్ళు.  


ముహూర్తం చూసుకుని గానీ, అక్షరం నేర్పించని పెద్దల  ఇళ్లల్లో ఎంత మంది చదువు సాములు నేర్చి పండిత ప్రకాండులయ్యారో.. ఆ లెక్కలు  అవీ తీసేవాళ్లు అప్పుడూ లేరు. ఇప్పడు అసలే లేరు. 


ఇహ అక్షరాభ్యాసం జరిపించే  విధానం గురించి కూడా కొద్దిగా తెలుసుకుందాం. ఓం ప్రధమంగా బిడ్డకు తలారా  స్నానం చేయించి , ఆపైన వస్త్ర భూషణాదుల అలంకరణ చేసి , విఘ్నేశ్వరునికి పూజ, సరస్వతీదేవికి అర్చన పూర్తి చేయించేవారు ! అటు పిమ్మట వెదురు చేట నిండానో, వెండి పళ్లెం నిండుగానో సన్నబియ్యం పోసి దానిని రెండే రెండు గీతలతో మూడు భాగాలుగా విభజన చేసి పై భాగంలో 'ఓమ్' .. రెండో భాగంలో 'నమఃశివాయ' .. మూడో గడిలో 'సిద్ధం నమః' అని మూడేసి సార్లు  పురోహితుడు బిడ్డ చేత రాయించి నమస్కారం చేయించేవాడు. విఘ్నేశ్వర, సరస్వతీ శ్లోకాలు బిడ్డుచేత ముద్దుగా చదివించేవాడు. 


ఇక్కడి ఈ ' ఓం నమశ్శివాయ' మంత్రం జైన సంప్రదాయం నుంచి పుట్టుకొచ్చిన తతంగమన్నట్లు కొందరి భావన.  కాదు.. పరమేశ్వరుడికి 'సిద్ధ' అనే నామాంతరం ఉంది. కాబట్టి 'ఓం నమశ్శివాయ సిద్ధం నమః' అనే ప్రార్థన వ్యవహారంలో 'ఓం నమః శివాయ సిద్ధం నమః' గా మారిందనే ప్రతివాదన తెచ్చేవాళ్లూ  కద్దు.  


నృసింహపురాణం ప్రకారం దైపప్రార్థనల అనంతరం గురుపూజ ఒక విధి. గర్గ వచనం ప్రకారం, అజ్యాహుతులతో సరస్వతి, హరి, లక్ష్మి, విఘ్నేశ, సూత్రకారులకు స్వవిద్యను ఉద్దేశించి హోమం చేయడం  మరో విధి. ఇప్పుడీ ఆచారాలకు సమయమేదీ? ఉన్నా శ్రద్ధ ఏదీ? బిడ్డకు మంచి పబ్లిక్ పాఠశాలలో అడ్మిషన్ సాధించడమే వంద యజ్ఞాలు నిర్వహించిన పెట్టు. అంత తలకిందులుగా ఉంది నేటి వ్యాపార చదువుల వ్యవహారం.


ఇస్లాం మతంలో కూడా ఈ విద్యారంభానికి దీటుగా   'బిస్మిల్లాఖాని' అనే శుభకార్యం ఉంది. ముసల్మాన్ సంప్రదాయవాదులూ  ఐదో ఏట, నాలుగో నెల, నాలుగో రోజు బిడ్డ చేత అక్షరాభ్యాసం చేయిస్తారు. 

'ఏసియాటిక్ బెంగాల్ ' అనే  గ్రంథంలో (శాహజహాం) మొగల్ చక్రవర్తి హుమయూన్‌ కు  ఈ తరహా అక్షరాభ్యాసం, తదనంతరం ఉత్సవం జరిపినట్లు  ఒక ప్రస్తావన కనిపిస్తుంది. 


'శూద్ర కమలాకరం' లో సైతం రాజవిద్యలైన ధనుర్విద్య, ఛురికాబంధనాల ప్రస్తావన వచ్చినప్పుడు శుభదినాలలో ప్రారంభించాలనే నియమం కనిపిస్తుంది.  పునర్వసు, పుష్యమి, భరణి, హస్త, స్వాతి, చిత్ర, కృత్తిక, మఘ, రోహిణి, ఉత్తరాత్రయం, శ్రవణ, ధనిష్ఠ, మూల, మృగశిర, పుబ్బ, రేవతి-ఈ నక్షత్రాలలో ధనుర్విద్యారంభం శుభదాయకమని 'ధనుర్విద్యాదీపిక' నిర్దేశిస్తుంది. 


'సర్వాయుధనగామాత్ర..' లాంటి మంత్రాలు కొన్ని మంత్రాలు ఉన్నాయి. వీటితో లక్ష్మీ నారాయణులను పూజించి తొట్టతొలుత ఒక బాణమో, ఛురకత్తో  తూర్పు దిశకు వదలడం  ఆయుధ విద్యలకు సంబంధించిన  కింద లెక్క. 


ఇప్పుడైతే బాణాలు, భురకత్తులు గట్రా  విసరడాలు లేవు కానీ .. వాటి స్థానంలో రాళ్లు విసరటం.. ఏసిడ్ బాటిళ్లు నెత్తిన పొయ్యడాలు వంటి విధ్యంసకర విద్యల ప్రాబల్యమే ఎక్కువగా ఉంది. ఆ విద్యలకు ఏ ఆరంభ ముహూర్తాలు అక్కరలేదు. గురవులతో అయితే అసలు బొత్తిగా అవసరమే లేదు. ప్రతీ ఆకతాయి విద్యార్థి  ఎవరికి వాడే ఏకలవ్యుడు ! 


-కర్లపాలెం హనుమంతరావు

09 -09 -2021

బోథెల్, యూ.ఎస్.ఎ

(మూలఃభారతీయ సంస్కారములు -అక్షరాభ్యాసము)

 

  

 

 

 

 

 

   


దేవుడి కథ -కర్లపాలెం హనుమంతరావు

 దేవుడి కథ

 -కర్లపాలెం హనుమంతరావు

నీతిమార్గాన్ని మాత్రమే నమ్ముకుని జీవించే ధర్మపరుల పోరాటానికి ఆయుధాలు అందించడం, అంతిమంగా దుర్మార్గంపై సత్యవంతులు మాత్రమే  విజేతలుగ నిలిచేలా చూసే బాధ్యత భగవంతుడికి అప్పగించడం  మనిషి చేసిన పనే! తనను తాను ప్రకాశవంతం, ఆనందమయంగా మలుచుకుంటూనే పరిసరాలనూ తదనుగుణంగా ప్రభావితంచేయడం  దేవుడి విశిష్ట లక్షణాలుగా భావన చేసిందీ మానవుడే. ప్రాణుల తాత్కాలిక విశ్రాంతి కోసం రాత్రిని, శాశ్వత విశ్రాంతి కోసం  ప్రళయాన్ని సృష్టించడం భగవంతుడి ఒక్కడి వల్ల మాత్రమే సాధ్యపడే కార్యమని నమ్మాడు మనిషి.   భగవంతుడిని సకల సద్గుణ సంపదల  రాశిగా   భావన చేసి ఆ సమ్మోహన  విశ్వంభర రూపాన్నే ఊహ మేరకు ‘దైవం’గా కల్పన చేసుకుని  భజించి తరించమంటూ  'క్రీడా, విజిగీషా, వ్యవహార, ద్యుతి, స్తుతి, మోద, మద, స్వప్న, కాంతి, గతిషు' అన్న ధాతువులను కలగలిపి  ‘దైవం’ అనే పదాన్ని రాబట్టడంతో దేవుడి కథ మొదలయినట్లయింది. 

ఆయుర్వేదమంత్రం(14 -20) ప్రకారం అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, ఇంద్రుడు ఇత్యాదులందర్నీ  దేవుళ్లుగానే భావించుకోమని బోధించిందది. సంస్కృత వాజ్ఞ్మయాన్ని ఓ పట్టు పట్టిన జర్మన్ పండితుడు మాక్స్ ముల్లర్ మాత్రమే భగవంతుణ్ని అత్యంత   సులువైన శైలిలో 'దేవుడు అంటే వెలుగు. వెలుగు తప్ప మరేదీ కాదు' (Deva meant originally Bright and nothing else) పొమ్మని రెండు ముక్కల్లో తేల్చేసింది. అటూ ఇటూ కాకుండా మధ్యస్థంగా మసలే    శ్రీసాయణాచార్యుడు ‘స్వర్గం’ అనే ఓ లోకాన్ని ఊహించి దాని సింహద్వారం తాళాల గుత్తి ‘దేవుడి’ చేతికి అప్పగించాడు. దేవుడే యజమాని, ఆయనను పొగడ్తలతో ముంచెత్తడమే మనిషిగా పుట్టినందుకు మనం చేయదగ్గ పని’ అన్న భావన సాయణాచార్యుడి జమానా నుంచే బలపడుతూవచ్చిందని  ప్రాచీన వాజ్ఞ్మయ పరిశోధకుల అభిప్రాయం. 

ప్రకృతి శక్తులు, వాటిలోని అంతర్భాగం సూర్య చంద్రులు వంటి గ్రహాల చలవ వల్లనే మనిషి మనుగడ సాధ్యమయింది. ప్రాణి ఉనికి కొనసాగడానికి  తోడ్పడే నేల, నీరు, ఆకాశం, కాంతి, గాలి- వంటి పంచభూతాలనూ స్థూలంగా దేవుళ్లుగా భావించుకోమంటే హేతువాదికైనా ఏ అభ్యంతరం ఉండబోదు. చెట్టూ చేమా, పుట్టా గుట్టా సైతం  దైవసమానమేనని డాక్టర్ దాశరథి రంగచార్యులు పలు సందర్భాలలో బల్లగుద్ది మరీ వాదించేవారు.  మానవజన్మకు మేలు చేకూర్చే ఏ పదార్థంలోనయినా నిస్సందేహంగా  దైవత్వం  ఉన్నట్లే లెక్క! సందిగ్ధమెందుకు?

దేవుని పుట్టుక ఎప్పటిదని ప్రశ్నిస్తే  మనిషి దగ్గర  చెప్పేందుకు సబబైన సమాధానం లేదు.  వేదకాలంలో అతగాడు ప్రకృతి క్రమాన్ని అర్థం చేసుకొనే సామర్థ్యం లేక భయం పుట్టించే శక్తులను దేవుళ్లుగా భావించి పూజాదికాలతో ఉపశమింపచేసే ప్రయత్నాలేవో  తనకు తోచినవి చేసివుండవచ్చు. పురాణకాలం నాటికి ఆ అదృశ్య శక్తుల స్థానంలో అటూ ఇటూగా మనవాకారాలను  బోలే దేవతావిగ్రహాల ప్రతిష్ఠాపనలు  ప్రారంభమవడం.. అదో విచిత్ర గాథ. దేవుళ్లకూ మన  మానవులకు మల్లేనే భావోద్వేగాలు,  సంసార లంపటాలు తగులుకున్నాయి భక్తజనుల భావనల పుణ్యమా అని! ఎంత నిరాకారుడైనా ఒక చట్రంలో ఇమడాలంటే  సృష్టించే మానవ మేధస్సు పరిమితులకు లోబడే  ఆ రూపం ఏర్పడాలి! దైవలోకాల సృష్టి కథలోనూ అదే తమాషా!  ఊహకు హద్దులు అక్కర్లేదు. కనక మానవమాత్రుడిగా తన చేతలకు సాధ్యంకాని అద్భుతాలేవైనా సరే అవలీలగా  సాధించే దివ్యశక్తులు  తాను సృష్టించిన దేవుడికి ప్రసాదించాడు మానవుడు.  రూపం, గుణం, శక్తి ఏదైతేనేమి.. ప్రేరణనిచ్చి సన్మార్గదర్శనం చేయించి మనిషిని మంచి దారికి మళ్లించే ఒక చమత్కారం.. మేలుచేసేదయితే సదా ఆహ్వానించదగ్గదే కదా! ఆ మేరకు హాని కలగనంత  వరకు దేవుడి ఉనికి పట్ల ఎవరికీ ఏ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేనే లేదు! 

భూమ్మీద దేవతలు మన కళ్లకు ఎలాగూ కనబడుతున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు. విద్యాబుద్ధులు గరిపే ఉపాధ్యాయులు భారతీయ సంస్కృతిలో దైవసమానులు. ఆపదలు దాపురించిన వేళ ఆదుకున్నవాళ్లనూ  దేవుళ్లుగా భావించడం భారతీయుల సత్సంప్రదాయం. కరోనా కాలంలో వలస కూలీల కడగండ్లకు కరగి చేతనయినంతలో  ఆర్తులకు సాయమందిస్తున్న మంచిమనుషులు ఎందరినో చూస్తున్నాం.  ఎక్కడో ముంబయ్ బాలీవుడ్ సినిమా నటుడు ఆంధ్రాకు ఈ మూలనున్న  చిత్తూరు ఇలాకా పేద రైతుకు ఓ చిన్న ట్రాక్టర్ కొని ఇస్తేనే ‘దేవుడు’ అని ఆకాశానికి ఎత్తేస్తున్నాం మనమివాళ అన్ని  సామాజిక మాధ్యమాలలో ఎడతెరిపి లేకుండా మనిషికి, మానవ సంఘానికి మేలు చేకూర్చే శక్తినైనా, వ్యక్తినైనా దేవుడిగా భావించడం మానవ ప్రవృత్తిలోనే అంతర్గతంగా ఇమిడివున్న సానుకూల దృక్పథం. అది ఆపితే ఆగేది కాదు. మొహమాట పెట్టినా  పొంగి పోటెత్తి పారేదీ కాదు.  ఎంత లౌకికలోక వ్యవహారమైనా దైవభావానికీ ఓ లెక్కంటూ ఉన్నట్లు వివరంగా చెప్పడమే భారతీయ తత్త్వశాస్త్రాలలోని  విశిష్ఠత.

స్వాతంత్ర్య  సమరం ఉధృతమయిన సమయంలో ప్రముఖమైన స్థానంలో ఉన్నందు వల్లనే గదా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ భరతజాతి మొత్తానికి, ముందు బాపూజీ ఆనక మహాత్మా ఇప్పుడు విగ్రహ రూపంలో దైవంగా మారింది! డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, మహాత్మా ఫూలేల లాగా  దళిత జాతుల ఉద్ధరణకై  జీవితాంతం పాటుబడ్డ  మహనీయులను దేవతామూర్తులుగా భావించడం సర్వసాధారణం ఈ  కర్మభూమిలో. పూజ్యభావంతో ప్రతిష్ఠించిన సుప్రసిద్ధుల విగ్రహాలను గుళ్లలోని దేవుళ్లకు మల్లే పూజించడాన్ని తార్కిక దృష్టితో చూసి కొందరు  తప్పుపడుతుంటారు. భక్తిభావనకు, తర్కానికి ఎప్పుడూ చుక్కెదురే. 'విశ్వాంసో ధర్మ మూలాంహి' అన్నది పెద్దలు అన్న వట్టిమాట కాదు. అనుభవం మీద రాబట్టిన సూక్తులవన్నీ! భక్తి అనే హార్మ్యానికి విశ్వాసమే పునాది. కాబట్టి  ఎట్టి పరిస్థితులలోనూ తర్కంతో ఆ దివ్య  భవనాల మీదకెక్కి ఆవలి పార్వ్యం చూడడం అసంభవం. 

దేవుళ్ల రూపాలు మారడం గమనిస్తున్నాం. దైవారాధనలూ కాలానికి తగ్గట్లు ఆర్భాటంగా మారడం చూస్తున్నాం. మనిషి పిచ్చి గానీ,  ఏ హడావుడీ  దైవిక శక్తుల మౌలిక స్వభావాలలో మార్పు తేలేవు. అగ్నిని దేవతే అనుకో! ఏ రూపంలో అయినా పూజించుకో! అయినా చెయ్యి పెడితే చుర్రుమని కాల్చి తీరుతుంది భావనలో దైవాలకు తరతమ భేదాలు లేకపోవచ్చును గానీ,  భౌతికరూపంలో  పారే గంగమ్మ తల్లికి ఎన్ని విధాల మొక్కినా  ముక్కుల్దాకా  మునిగితే  ప్రాణాలు గుటుక్కున పోవడం ఖాయం. దైవభావనలలో పొడగట్టే  ఏ మార్పయినా  మనిషి స్వభావంలో వచ్చే మార్పులకు మాత్రమే సంకేతమనేది మానసిక శాస్త్రవేత్తల సిద్ధాంతం. ఈ  ఇంగితం లేకనే.. దేవుళ్ల విషయమై నాడూ నేడూ మనిషికి మనిషికి మధ్యన, జాతుల పేరున, దేశాల వంకన, సంస్కృతుల మిషన ఎన్ని తరాలు గడచినా ఆగకుండా ఆధ్యాత్మిక ఘర్షణలు విశ్వమంతటా ప్రస్తుతం నిష్కారణంగా చెలరేగుతున్నాయి.  

కవులూ తమ కావ్యాలకు అవతారికలు  రాసే సందర్భంలో 'ఇష్ట'దేవతాప్రార్థనల వంకన దేవుళ్ల మధ్యన ప్రదర్శించే వలపక్షం విచిత్రం. వైదిక దేవతలు, పౌరాణిక దేవతలు, జానపద దేవతలు, ఆధునిక దేవతలు.. అంటూ  దేవజాతులను సైతం కవులు మనుషులకు  మల్లేనే వివిధ తరగతుల కింద విభజించి చూడడం, ఇష్టులైన దేవుళ్లంటూ  మళ్లా  కొన్ని అవతారాలకు ప్రత్యేక ప్రతిపత్తులు కల్పించడం! మనిషి మానసికంగా ఎదిగాడని టముకేసుకోవడమే  తప్పించి.. ఎంత ఎదిగినా వేపను వదలని చేదులా ఎంతో కొంత  వెర్రితనం  తప్పదా!

'కతివై దేవాః?' దేవుళ్లు ఎందరు? అని యాస్కుడు తనను తాను ప్రశ్నించుకుని 'త్రయం త్రింశోవైదేవాః'-ముఫ్ఫైముగ్గురు అని చెప్పుకున్నాడుట. ఆ నిరుక్తకారుడి లెక్క ప్రకారం, వసువులు ఎనిమిదిమంది, రుద్రులు పదకొండుమంది, ఆదిత్యదేవతలు డజనుమంది, ఇంద్రుడు, ప్రజాపతి– వెరసి ముచ్చటగా ముఫ్ఫైముగ్గురు. జగత్తు నివాసయోగ్యత వీటి చలవే కాబట్టి పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రజాతి వసుదేవతలయారు. దేహానికి ఆత్మ స్వస్తి చెప్పే వేళ ప్రాణులను పీడిస్తాయి కాబట్టి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, జీవాత్మ  రుద్రదేవతలుగా దూషింపబడుతున్నారు. ఏడాది మొత్తం చైత్రాది పన్నెండు మాసాల ద్వారా ఆయుష్షును హరించే సూర్యుడు, వరుణుడు, పూర్ణ, తృష్ణల వంటి పన్నెండు మంది ఆదిత్య దేవతల కోవలో చేరారు. లెక్కకే ముప్పై ముగ్గురు. భూఇ మీది  నిప్పు, మబ్బులోని గాలి.. మెరుపు, ఆకాశంలోని సూర్యుడు మనిషికి ముఖ్యమైన దేవతలని మళ్లీ యాస్కుడే లెక్క కుదించాడు!

రుగ్వేదం మొదటి మంత్రం 'ఓం అగ్నిమీళే’ అగ్నికి సంబంధించిందే! రుగ్వేద సూక్తులలోని నాలుగో వంతు ఇంద్రుడికి ధారాదత్తం. వ్యవసాయాధారిత భారతదేశంలో మేఘాలను ఛేదించి వర్షాలు కురిపించగల సత్తా  వజ్రాయుధపాణి ఇంద్రుడొక్కడి దగ్గరే ఉందని నమ్మకం. వేదపరంగా ఇంద్రుడు ఐశ్వర్యానికి ప్రతీక. పురాణాల దృష్టిలో స్వర్గాధిపతి. వైదికుల భావనలో  దేహంలోని జీవుడు. దేవతల రాజుగా, రాక్షసుల వైరిగా, తాపసుల అడ్డంకిగా ఇంద్రుడివి బహుముఖపాత్రలు. ఆకాశదేవతలలో సూర్యుడు అత్యంత ప్రముఖుడు. సౌర మండలం తాలూకు సమస్త శక్తులకూ ఉత్పత్తి కేంద్రమైన సూర్యదేవుడిని వేదాలు 10 సూక్తాలలో ప్రస్తుతించాయి. సుదూరం నుంచి చూసినా ప్రసన్న ధృక్కులతో దర్శనమిచ్చే దివ్యజన్ముడిగా, సకల లోకాలను క్రమబద్ధంగా ప్రకాశింపచేసే మహాదేవుడిగా, మానుషకార్యాలన్నిటిని యాజ్ఞిక రూపంలో స్వీకరించే ఆకాశపుత్రుడిగా' ప్రస్తుతించాయి. సూర్యుడొక్కడే నరుడికి నిత్యం ప్రత్యక్షమయే నారాయణుడు. సోముడు నుంచి వరుణుడు వరకు దేవతలు  ఇంకెందరో వేదాలలో తమ తమ యోగ్యతలను బట్టి ప్రస్తుతులు అందుకున్నారు. ఆ వివరాల జోలికి ప్రస్తుతం పోలేం.. కారణం స్థలాభావం.

వేదకాలంనాడు సోదిలో కూడా లేని ప్రజాపతి, పశుపతి వంటి దేవుళ్లకు మలివేదకాలానికి దశ తిరిగింది. విష్ణువు, అతని ప్రతిరూపాలైన కృష్ణుడు వంటి దేవతలకు ఆరాధనలు   అధికమయ్యాయి. యజ్ఞయాగాదులంటే తడిసిమోపడయ్యే ఖర్చులు. తలకు మించిన పని ఎత్తుకోవడం కన్నా నమ్మకం కుదిరిన విశ్వాసానికి సంబంధించిన ఓ దేవతాకారాన్ని కల్పించుకుని ఆరాధించడం సామాన్యుడికి సులువైన ముక్తిమార్గంగా తోచింది. తనను బోలిన ఆకారమే దేవుళ్లకూ కల్పించడం, తన ఈతి బాధలను సైతం దేవతలకు చుట్టబెట్టి కథలుగా వాటిని చెప్పుకుని విని తరించడం ఒక ముక్తిమార్గమనే భావన ప్రచారంలోనికి వచ్చినప్పటి నుంచి దేవుళ్ల వైభోగాలు, వారి వారి బంధుబలగాల వ్యవహారాలు ఆరాధనలో ప్రధాన ఆకర్షణీయ భాగాలయ్యాయి. యజ్ఞయాగాదులకు బదులుగా పూజాపునస్కారాలు ప్రారంభమైన పురాణకాలంలో లోకవ్యవహారాన్ని బట్టి ధర్మసంస్థాపన కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త దైవరూపాలు ఉనికిలోనికి రావడం సరికొత్త పరిణామం. 

జైనుడైన అమరసింహుడు తన అమరకోశం స్వర్గవర్గంలో దేవుళ్లకు ఉండే 'అమరా నిర్జరా దేవాస్త్రిదశా విబుధాః సురాః'  వంటి 26 రకాల పేర్లు చెప్పుకొచ్చాడు. జరామరణాలు లేనివాళ్లని, ఎప్పుడూ మూడుపదుల వయసులో కనిపించే యవ్వనవంతులని, మానవవాతీత శక్తులున్న అదితి కూమారులని.. ఇట్లా ప్రతి పదం వ్యుత్పత్తి అర్థం ఆ నామలింగానుశాసనమ్  వివరిస్తుంటే  ఎన్నడూ కనిపించని దేవుడి శక్తియుక్తుల మాటకు మించి ముందు కంటి ముందు తిరిగే మనిషి బుద్ధి నైశిత్యాన్ని  వేనోళ్ల పొగడబుద్ధవుతుంది.  హద్దులెరుగని కల్పన చేయగల మేధోసామర్థ్యం  సృష్టి మొత్తంలో మనిషికి మాత్రమే సాధ్యమన్న  వాదన తిరుగులేనిదనడానికి దేవతల పుట్టుకను గురించి అతగాడు చేసిన కల్పనే  ఓ గొప్ప ఉదాహరణ. 

వాల్మీకి రామాయణం 14వ సర్గలోనూ దేవతల పుట్టుకను గురించిన ప్రస్తావన ఉంది. జటాయువు తన జన్మరహస్యం రామచండ్రుడికి వివరించే సందర్భంలో సృష్టి, దాని క్రమం, దేవతల పుట్టుకల ప్రస్తావనలు వస్తాయి. ఆఖరి ప్రజాపతి కశ్యపుడికి అదితి వల్ల కలిగిన ముప్పైముగ్గురు దేవతల వివిధ రూపాలని వాల్మీకి వివరంగా చెప్పుకొస్తాడు. మలివేదకాలం నుండి ఈ పౌరాణిక దేవతలకే అగ్రతాంబూలం. 

జానపద దేవతలు ఉనికిలోనికి వచ్చినప్పటి బట్టి సమాజంలోని ఒక ప్రధానవర్గం చేసే పూజావిధానాలలో మౌలికమైన మార్పులు చాలా చోటుచేసుకున్నాయి. పౌరాణిక దేవతలది లిఖితసాహిత్య ప్రచారమైతే, జానపద దేవతల ప్రాభవానికి మౌఖిక మాధ్యమం ఆధారం. ఆధునిక కాలంలో గ్రామదేవతలకూ లిఖితసాహిత్యం ద్వారా నీరాజనాలు అందడం సర్వసాధారణమయిపోయింది. అమ్మవారు, పోతురాజుల వంటి గ్రామదేవతల ఆరాధనల్లో జానపదులు తమ అలవాట్లను ఏ దాపరికం లేకుండా పూజావిధానం ద్వారా ప్రదర్శించడం గమనార్హం. వ్యవసాయసంబంధమైన కేటగిరీలో స్త్రీ దేవతలకే అధిక ప్రాధాన్యం. జానపద దేవతలలో  ప్రధానంగా రెండు విభాగాలు.  పార్వతీదేవి తరహా శక్తిమూర్తులకు ప్రతినిధులుగా  గౌరమ్మ(బతుకమ్మ), ఆదిశక్తి వంటి అమ్మవార్లు ఒక తరగతి; ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలు త్యాగం చేసిన ఊరి ఆడపడుచులు రెండో తరగతి గ్రామదేవతలు.  వీరులను దేవుళ్లతో సమానంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచమంతటా  ఉన్నట్లే, భరతఖండంలోనూ ముందు నుంచి ముమ్మరంగానే ఉంది. రాముడు, కృష్ణుడు, పరశురాముడు, సమ్మక్క, సారలమ్మ, శివాజీ.. వంటి సాహసవంతులెందరో దేవతల  స్థాయికి ఎదిగి పూజలందుకోవడం ఇందుకు ఉదాహరణ. ఆధునిక కాలంలో షిర్డీ సాయిబాబా, రాఘవేంద్రస్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వంటి వ్యక్తులు వివిధ కారణాల వల్ల  దేవతలుగా పరిగణింపబడి ఆరాధనలు అందుకుంటున్నారు. 

మతాలను  గురించి ఈ కలికాలంలో మనలో మనమే ఏవేవో కారణాలు కల్పించుకుని  సతమతమవుతున్నామే తప్పించి, వేదకాలంలో ఈ వృథాప్రయాసలేవీ లేని చక్కని స్పష్టత ఉండేది. 'ఇన్ద్రమ్  మిత్రమ్ ‘  అనే  శ్లోకార్థాన్ని  బట్టి బుద్ధిబలం అధికమై ఆకారమే లేని పరమేశ్వరుడిని ఇంద్రుడని, సూర్యుడని, వరుణుడని, వాయువని భిన్నరూపాలలో భావిస్తున్నప్పటికీ వాస్తవానికి ఉన్నది ఒక్కటే దైవం. ఒక్కటే రూపం. ‘ఏకం సత్’ అన్న రుగ్వేద సూత్రం అంతరార్థం అంతుబడితేనే తప్ప ప్రస్తుతం మతం పేరుతో   పెచ్చుమీరే విద్వేషభావనలు శాశ్వతంగా మాసిపోయే  శాంతి మార్గం  మనిషి కంటబడదు. 

కంటికి కనిపించని దేవుళ్ల లెక్క  కన్నా.. కంటి ముందు కదిలే  మనుషులే మనుషులకు దేవుళ్లనే భావన బలపడితే అసలు గొడవే ఉండదు.

- కర్లపాలెం హనుమంతరావు 

- బోథెల్; యూ.ఎస్.ఎ

30 - 08-2021

***

 

 


చీకటి చీకాకులు- సరదాకే రచనః కర్లపాలెం హనుమంతరావు


 

''జీవితం ఏమిటీ? వెలుతురూ.. చీకటీ! హుఁ.. హుఁ.. హుఁ!.. వెలుతురంతా చీకటైతే.. అందులోనే సుఖము ఉన్నదీ!'

'చీకటీ.. చీకటీ అంటూ ఆ శోకన్నాలేవిట్రా?.. లేచి స్విచ్చి వేసుకుంటే వెలుతురు రాదా!'

'స్విచ్చి వేసే ఉంది బాబాయ్! వెలుతురే లేదు'

'అదేంటీ? కరెంటు బిల్లు కట్టడం మర్చిపోయావా?  కట్టలేకపోయావా?'

'కట్టలేకపోవడానికి అదేమన్నా కోట్లలో వచ్చిందా ఏమిటీ? వట్టి సర్ ఛార్జీనే కదా! కట్టినా కట్టకున్నా కరెంటు 'కట్' తప్పదు కదా! మా కాంప్లెక్సులో వెలుతురు మొహం చూసి ఎన్నిరోజులయిందో తెలుసా? కొత్త ఇల్లు కదా.. అని బోలెడంత పోసి ఝిగేల్ ఝిగేల్ మనే ఛాండ్లియర్సుకూడా పెట్టించింది మా శ్రీమతి. విగ్రహం పుష్టి .. నైవేద్యం నష్టి సామెతగా ఉంది మా అపార్టుమెంటు పరిస్థితి. ఎల్ కే జీ చదివే మా సుపుత్రుడు నిన్నేం అడిగాడో తెలుసా? ఎ ఫర్ ఏపిల్, బి ఫర్ బ్యాట్.. అని చదివేస్తూ  ఈ ఫర్ ఎలక్ట్రిసిటీ అని రాగానే ఈ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి డాడీ? అని ఆడిగాడు బాబాయ్! 

'అదేదో హైటెక్ సిటీ అనుకుంటున్నాడు కాబోలు పాపం పసివెధవ' 

'అదే మరి! పోనీ ఇదీ అని చూపిద్దామంటే.. ఇల్లు కట్టినప్పట్నుంచీ ఒక్క పూటైనా వచ్చి చస్తే కదా!'

'అందరి సంబడం అలాగే ఉందిలేరా బాబూ! మా అపార్టుమెంట్లలో ఐతే పూర్తిగా 'లిఫ్టు' అనేదే తీసేసారు. ఎవరికి వాళ్లం సొంతంగా బక్కెట్లు ఏర్పాటు చేసుకున్నాం. ఓపిక ఉన్నవాళ్ళు ఎలాగో మెట్లమీదనుంచే డేక్కొస్తున్నారనుకో!  కంప్లైట్ చేద్దామని కరెంటాఫీసుకు పోతే అక్కడా వాళ్ళు చీకట్లో తడుముకుంటున్నార్రా బాబూ!'

'చీకట్లో ఇట్లాంటి చిత్రాలు చాలానే జరుగుతున్నాయ్ బాబాయ్! మొన్న గుళ్లో అదేడో సామూహిక వివాహాలు జరిపించారు చూసావా!వందమంది వధూవరులు ఒక్కటవ్వాలని వచ్చారు పాపం. పట్టపగలే కటిక చీకటి! ఏ పెళ్ళికొడుకు ఏ పెళ్ళికూతురు మెళ్ళో తాళి కడుతున్నాడో.. అంతుబట్టక పాపం నిర్వాహకులు ఎంతలా తల్లడిల్లిపోయారో తెలుసా? కరెంటు వాళ్ల నిర్వాకంమీద కంప్లైట్ చేద్దామని పోలీస్ స్టేషనుకు పోతే'

'అర్థమైందిలే! అక్కడా చీకట్లో ఎవరూ కనిపించలేదనేగా చెప్పబోతున్నావ్? సందు దొఇకింది కదా అని.. సర్కారంటే గిట్టని నీలాంటి వాళ్ళంతా ఇట్లాంటి కట్టుకతలు పుట్టిస్తున్నారుగానీ.. నీళ్ళు పుష్కలంగా ఉంటే గవర్నమెంటు మాత్రం కరెంటెందుకివ్వదురా?' ఇదివరకటి ప్రభుత్వాలకు ఈ కరెంటు కొట్టిన షాకు ఇప్పటి సర్కారులకు మాత్రం తెలవదనా? పవర్ లేదు పవర్ లేదు అని దొరల పరువుతీయాలని చూస్తున్నారుగానీ.. ఫారడే మహాశయుడు కరెంటు కనిపెట్టకముందుమాత్రం లోకం చల్లంగా సాగిపోలేదా? మన మూరగండడ రాయడు శ్రీక్రుష్ణదేవరాయలు కాగడాల వెలుతురులోనే సువర్ణపాలన సాగించాడు తెలుసా? మా చిన్నతనంలో ఈ కరెంటుగోల ఎక్కడిదీ? మా చదువులన్నీ ఆముదం దీపాల కిందనే  తెల్లారిపోయాయి. విసనకర్రలు, పాత పేపర్లు ఉన్నంతకాలం పంఖాల అవసరం ఏమంత ఉంటుందిరా? కోతల పుణ్యమా అని కరెంటుషాకుల దుర్మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. రాత్రిళ్ళూ నిశ్చింతగా బట్టలు ఆరేసుకుంటున్నాం కరెంటు తీగలమీద.'

'అట్లా ఆరేసుకోబట్టే రాత్రిళ్ళు దొంగతనాలు ఎక్కువైపోయాయీ మధ్య మళ్లీ! ఇప్పటివరకు శివార్లవరకే చోరుల సామ్రాజ్యం పరిమితం. ఇప్పుడు నగరం నడిబొడ్డుక్కూడా వాళ్ల హస్తలాఘవం విస్తరిస్తోంది. దొంగలు, దోరవయసులో ఉన్నవాళ్ళూ కరెంటుకోతలకు పండగలు చేసుకుంటున్నారు. సరససల్లాపాలకు  ఎక్కడో  దూరంగా ఉన్న పార్కుల చాటుకోసం  పాకులాడేవాళ్ళు  కోడెవయసుగాళ్ళు. ఇప్పుడంత శ్రమ పడటంలేదు. సర్కారువారి పుణ్యమా అని నగరం నడిబొడ్డులే కోడెకారుకు పడకగదులై పోతున్నాయ్ బాబాయ్!'

'సర్వే జనా సుఖినోభవన్తు- అనే గదరా ఏ ప్రభువైనా కోరుకొనేది! జనభాలో సగమైనా ఎలాగోలా సుఖపడుతున్నారని సంతోషపడక అలా కుళ్ళుకోవడమేం సబబుగా లేదబ్బీ!ఏం? దొంగలుమాత్రం సుఖంగా బతకద్దా? పని చేసినా చేయకున్నా పగలంతా పెళ్ళివారిల్లులా ఫెళ్ళున వెలిగిపోవాలంటావ్ ప్రభుత్వాఫీసులు? దొంగవెధవలకూ వాళ్ల వృత్తి క్షేమంగా చేసుకునే సావకాశం వద్దంటావ్?! పెద్దవాణ్ణి. అనుభవంతో చెబుతున్నా..విను! చీకటి పడకముందే పిల్లకాయలకి రెండుముద్దలు తినిపించి పక్కలెక్కించెయ్! ఇంచక్కా మీ అమ్మగారు చెప్పే చందమామ కథలన్నీ వింటూ పడుకుంటారు. చక్కటి పాటలూ నేర్చుకుంటారు. పాడు టీవీ నోరు మూతపడీంతరువాత పెద్దవాళ్ళకుమాత్రం ఇంకేం పొద్దుపోతుందీ? తెల్లార్లూ కాలక్షేపంకోసం చిన్నతనంలో నేర్చుకున్న ఆంజనేయ దండకాలూ, అష్టోత్తరాలూ మళ్లీ మళ్ళీ నెమరేసుకుంటారు. బోలెడంత పుణ్యం సంపాదించుకొంటారు. '

'చీకటిమూలకంగా కుటుంబ నియంత్రణ పథకాలు మళ్లీ మొదటికొస్తున్నాయ్ బాబాయ్!'

మరేం ఫర్లేదు. ఏడాదికి మూడొందలరవైయ్యైదు రోజులు  పసుపు కుంకుమలని.. సీమంతంనోములని.. ప్రసవవేదమని, బాలింతలాలింతలని.. ఏవేవో పేర్లతో సర్కార్లు సొంతమనుషులకుమించి ఆదుకుంటూనే ఉన్నవాయె! శబ్దవేధి అని మనకో వేదకాలంనాటి విద్య ఉంది. కటిక చీకట్లో కూడా కంటి సాయం లేకుండా  శబ్దాలను బట్టి వస్తువులజాడను పసిగట్టే గొప్పకళ అది.ఎందుకూ కొరగాని ఇంజనీరింగు చదువులమీద పడి ఆనక  బాధపడే బదులు.. శబ్దవేధిని ఓ కోర్సులా పౌరులందరూ నిర్బంధంగా అభ్యసిస్తే సరి.. ఈ చీకటి పాట్లు, చీకట్లో పాటలు తప్పుతాయి! వేలెడంత లేని బుడతడు కూడా రెండ్రెండ్లెంతరా అని అడిగితే ఠక్కుమని సెల్ తీస్తున్నాడు! కరెంటే లేనప్పుడు ఇంక  చార్జింగేముంటుంది? సెల్లేముంటుంది? ఎందుకైనా మంచిది.. మళ్ళీ పిల్లాడికి నోటిలెక్కలు గట్రా ఇప్పట్నుంచే  గట్టిగా నేర్పించు! మోటార్లమీద ఆధారపడి ఇబ్బందులు పడేబదులు.. పాతకాలంనాటి ఏతాములు మళ్లా బైటికి తీస్తే వ్యవసాయం నిరాటంకంగా సాగిపోదా? బియ్యంమిల్లులు ఆడకపోతేనేం? అత్తాకోడళ్ళు  దంపుడు పాటలు పాడుకొంటూ ఇచక్కా ధాన్యం దంచుకుంటే పోదా?'

' ఎందాకా ఇలా చీకట్లో దంచుకోడాలు బాబాయ్?'

'చెత్తనుంచి కూడా కరెంటు తీయచ్చని అంటున్నారు గదరా ఈ మధ్య? నీళ్ళక్కరువుగానీ, మనదేశంలో చెత్తాచెదారానికి కొదవేముంది? ఆ సాంకేతిక నైపుణ్యం అభివృద్దయ్యేదాకా పోనీ ఓ పని చేయచ్చు! బియ్యంలో రాళ్ళు తింటే పెళ్ళినాడు జడివానలు కురుస్తాయనిగదా పెద్దలు చెబుతారు! పెళ్ళికావాల్సిన కుర్రకారునంతా సేకరించి  కిలోరూపాయిబియ్యం ఓ రెండు కిలోలు బలవంతంగానైనా బొక్కించి పెళ్ళిపీటలమీద కుదేస్తే సరి.. వానలే వానలు. నీళ్ళే నీళ్ళు. కరెంటే కరంటు!.ఇక నీ సెటైర్లుండవు!'

***


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...