Sunday, December 12, 2021

గుండు జాడీ - సరదా కథానిక (తర్కం లేదు) -కర్లపాలెం హనుమంతరావు

 

'ఆవగాయ అయిపోయింది. మీ అల్లుడిగారికి ముద్ద దిగడం లేదు. అర్జంటుగా ఓ చిన్నగుండు జాడీడైనా పమ్మిం'చమని మా తోడల్లుడుగారి మూడో కూతురు ఉత్తరం రాసింది.

 

ఆ పిల్ల మొగుడు వినాయకరావుకు అదేదో బ్యాంకులో ఉద్యోగం. ఈ మజ్జెనే బెజవాడ బదిలీ అయింది.

కృష్ణలో మునగాలనీ, కనక దుర్గమ్మను చూడాలనే వాంఛితం వల్ల నేనే బండెక్కా జాడీ పట్టుకుని.

 

తెనాలి దగ్గర ఓ ఎర్ర టోపీ పెట్టెలో కొచ్చింది. 'పేలుడు సామాను బండిలో ఉండకూడద'ని పేచీ పెట్టుక్కూర్చుంది సీటు కిందున్న జాడీ చూసి. అది పేలే పదార్థం కాదని నచ్చచెప్పడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది.

 

లంఖణాల బండి ముక్కుతూ మూలుగుతు బెజవాడ చేరేసరికి చిరుచీకట్లు ముసురుకుంటున్నాయి.

అదెక్కడి ఫ్లాట్ ఫారం! పెళ్లిపందిరిలా వెలిగిపోతో ఉంది. ఏవిఁ జనాలూ! ఎంత హడావుడీ! మా వూరి సంతే అనుకుంటే అంతకు పాతిక రెట్లు ఎక్కువగా ఉందీ వింత! ఈ సందోహంలో మావాణ్ణి ఎట్లా పసిగట్టడం? అసలా శాల్తీని గుర్తుపట్టడమే కష్టం. పదేళ్ల కిందట పెళ్ళిపందిరి పెట్రోమాక్సు లైట్ల వెల్తుర్లో చూడ్డవేఁ. ఇంకా అట్లాగే ఈకలు పీకిన కోడిలా ఉంటాడా?

 

అయోమయంగా జాడీ పట్టుకుని నడి ప్లాట్ ఫామ్మీద తచ్చాట్టం మొదలుపెట్టాను. ఓ కాఖీవాలా..  రైల్వేపోలీసనుకుంటా.. కర్రకొట్టుకుంటూ వచ్చాడు.

'అగ్గిపెట్టుందా?'

ఇచ్చా.

'సిగిరెట్టూ?'

నాకు చుట్టలు పీకడం అలవాటు. 'లేద'న్నాను. అంతే, ఆరాలు మొదలు!

'సిగిరెట్టు లేకుండా వట్టి అగ్గిపెట్టెందుకుందీ? ఎక్కడ అగ్గిపెట్టబోతున్నావ్? నీ వాలకం అనుమానంగా ఉంది. నీ చేతిలో అదేంటీ? టైం బాంబా?'

'బాంబు కాదండీ! ఆవగాయ జాడీ!'

'ఆవగాయా? వో క్యా హైఁ! ఖోల్దో!'

ఏందో పోలీసోడి గోల!

 

జాడీక్కట్టిన వాసెన విప్పి చూపించక తప్పింది కాదు.

లోపలికి తొంగి చూసి ఉలిక్కిపడ్డాడు.

'అమ్మో! రక్తం.. రక్తం!.. ఖూన్.. భూన్!' అరుపులు

'తెలుగు వాడై ఉండడు. ఆవగాయంటే అర్థమవడంలేదు ఆ ఉత్తరాది శుంఠకు.

'కూను కాదండీ! నూనె!' నమ్మించడానికి జాడీలో వేలు ముంచి ఆ పోలీసోడి నాలిక మీదింత రుద్దా.

అంతేఁ! ఎగిరి గంతేశాడు.

'పేలింది. గూబ్బేలింది' అంటు చెవులు రెండూ పట్టుక్కూర్చున్నాడు.

నష్టపరిహారం కిందో వంద రూపాయలు అచ్చుకుంటే గాని వాడు నన్ను వదల్లేదు.

 

వినాయకరావిక రాడు. కార్డంది ఉండదు. ఇట్లాంటి ఉపద్రవాలన్నీ ముందే ఊహించబట్టే అతగాడింటి ఆరాలన్నీ వివరంగా రాయించి కాయితం రొంటిన కట్టుకునుంది.

 

స్టేషన్ బైట సగం మెట్ల మీదుండంగానే ఓ కుంకొచ్చి నా జాడీ మీద పడ్డాడు. ఇంకా చాలామంది ఆ బాపతు సరుకే అవకాశం కోసం చుట్టూతా మూగిపోయారు. అంతా కలసి నా చంకలోని జాడీని గుంజేసుకుంటున్నారు.

బూతులు!.. గోల!

'ముందు నేనూ.. పట్టుకుంది. ఇది నాదీ!'

'ముందు నేన్చూశానెహె! జాడీ నాదీ..'

'కాదు నేం జూశాన్రా లం.. కొడకా!'

'ఇలాగిచ్చీసెయ్యండి సార్ .. జాడీని'

నా జాడీని పట్టుకుని ‘నాది.. నాద’ని వాదులాడుకునే వాళ్లను చూసి ముందు నేను బెంబేలెత్తింది నిజవేఁ! బెజవాడ మనుషులు ఎంతకైనా తగుదురని మా బామ్మర్ది చెప్పిన మాటలు గుర్తుకొచ్చి బలం కొద్దీ పరుగెత్తా జాడీతో సహా!

వెనక నుండి ఈలలు.. గోల! బూతు మాటలు కూడా!

 నవ్వుల్తో కలిసి! వాళ్లంతా రిక్షావాళ్లట! తర్వాత తెలిసింది!

 

ఆదుర్దాలో ఎంత దూరం పరుగెత్తుకొచ్చానో నాకే తెలీదు. కుదుపులకు జాడీ మీద మూత కదిలినట్లుంది. వాసెనక్కట్టిన గుడ్డ ఆవనూనెకు  ఎరుపు రంగుకు తిరిగింది. మాడు కూడా కొద్దిగా మంటెత్తుతోంది.

 

ఇహ నడక నా వల్ల కాదు. ఎంత దూరవఁని నడుస్తా మీ దిక్కూ మొక్కూ లేని బస్తీలో! అందునా మా వినాయకరావుండే 'ఆంజనేయ వాగు' ఆనవాలు బొత్తిగా లేకపాయ!

 

దార్న పోయే రిక్షా పిలిచా. వాడు దగ్గర దాకా వచ్చి జాడీని చూసి ఝడుసుకున్నట్లున్నాడు.. అదే పోత.. ఓ మాటాలేదూ..  పలుకూ లేదూ!

 

అతి కష్టం మీద మరో బండిని పట్టుకున్నా! వాడి క్కొంచెం గుండె ధైర్యం జాస్తీవే సుమండీ!

'ఎక్కడికీ?' అనడిగాడు మిర్రి మిర్రి చూస్తూ.

ఫలానా 'వాగు’ లోకి. ఇది కూడా ఉందని జాడీని చూపించా ఎందుకైనా మంచిదని.

వీడూ ఝడుసుకున్నాడు. 'ఏంటదీ? ఎర్రంగా కార్తా ఉంది? మడిసి తలకాయ కాదు గందా?' అనడిగాడు.. నా వంక అదోలా చూస్తూ!

ఈ గుండు జాడీ నా కొంప ముంచేట్లుందివాళ!

'ఏడు రూపాయలివ్వండి!  మూడో కన్నుక్కానకుండా వాగులోకి దింపించేత్తాను. రగతంతో రిసుకు మరి!' అన్నాడు దగ్గరి కొచ్చి గొంతు తగ్గించి.

‘నెత్తురు కాదు..ఆవకాయరా బాబూ! అని అక్కడికీ నెత్తి కొట్టుకుంటూ చెప్పిచూశా. ఊహూఁ!  నమ్మడంలే! అట్లాగని వదలటవూఁ లేదు. ఇట్లాంటి సాహసాలు ఇంతకు ముందు ఇంకెన్ని చేశాడో ధీరుడు! ఇప్పుడు వణకడం నా వంతు కొచ్చింది.

'బెజవాడలో రిక్షా రేట్లు దారుణంగా ఉంటాయి. రిక్షా తొక్కే వాళ్ల వాలకం అంత కన్నా దారుణం. సాధ్యవైఁనంత వరకు పబ్లీకు మధ్యన బస్సుల్లో తిరగడవేఁ మేలు' అని హెచ్చరించివున్నాడొకప్పుడు మా తోడల్లుడు. ఆ ముక్కలు ఇప్పుడు ఠక్కున గుర్తుకొచ్చాయి. రిక్షావాణ్నక్కడే వదిలేసి అప్పుడే వచ్చిన బస్సు దిక్కు పరుగెత్తాను.

 

అది ఇరవై నాలుగో నెంబరు బస్సు.

అమ్మాయి ఉత్తరంలో రాసిన నెంబర్లు కటిక్కిన గుర్తుకు రాడంలే! ఎవర్నైనా అడుక్కోక తప్పేట్లు లేదు. అక్కడే నిలబడి తాపీగా చుట్ట పీక నల్చుకుంటున్న పెద్దమనిషొకతను కనిపించాడు.

'ఈ బస్సెక్కడికి పోతుంది?' ఆడిగా.

'నువ్వేడకి పోవాల్నా?' ఎదురు కొచ్చెను. ఎవుడికీ సూటిగా మాట రాదనుకుంటా ఈ కృష్ణమ్మ నీళ్లకు.

'వాగులోకి'

'ఇది కాటికి పోయేదయ్యా సామీ! అల్లదిగో! ఆడాగి వుందే చూడూ.. నాలుగో నెంబర్దు,, ఆ బస్సెక్కు..  పో! తిన్నంగా వాగులో దింపేత్తది.. బేగి పో' ఉత్తరాంధ్ర సరుకులాగా ఉంది.

బెజవాడ కదా! అని యాసలోళ్లూ గుమిగూడ్తార్లాగుంది. పట్నవాఁ.. మజ్జాకానా!

 

నాలుగో నెంబర్ బస్సు నిద్దట్లో గురకపెడుతూ తాగుబోతోడికి మల్లె ఒహటే..  వూగిపోతావుంది వెనక్కీ.. ముందుకీ!

 

బస్సంతా కోళ్ల గంపలా కిక్కిరిసుంది లోపల. అయిస్కాంతం అంచుల దగ్గర ఇనప తుక్కు పేరుకున్నట్లు రెండు డోర్ల దగ్గరా జనాలు ఒహటే పొర్లిపోతున్నారు.

అయినా మనిషికి మనిషికీ మధ్యన ఇంకా సందుండిపోయిందని మధన పడిపోతున్నాడు బస్సు కుర్రాడు.

'రావాలండీ .. రావాల! మార్కెట్ పంజా కాలేజ్ జండా వాగు చిట్నగర్ లంబాడీ.. రావాలండీ.. రావాలా.. మార్కెట్ పంజా కాలేజ్ జండా.. వా..’

చెవి తెగ్గోసిన మేకకి మల్లే ఒహటే అరుస్తున్న ఆ కుర్రాడి దగ్గరికెళ్లి అడిగా 'వాగులో కెళతందా?'

అంతే! మాటా పలుకూ లేకుండా నా పెడ రెక్కలట్లా పట్టేసుకున్నాడో బస్సులోకి ఈడ్చేసుకున్నాడు భడవా! నా భుజం మీది జాడి పక్క మనిషి నెత్తి మీదకెక్కేసిందా కుర్రాడి గత్తర్లో!

 

రామాయణంలోని పుష్పకవిమానం దారి తప్పొచ్చి బెజవాడ వీధుల్లో తిరుగుతునట్లుంది. ఎంత మందిని కుక్కినా బస్సోడికి తృప్తి కలగడం లేదే!

'.. ఎదరకు జరగండయ్యా బావూఁ.. ఎదరకు జరగండి! ముందుకు పదండి.. ఊఁ ఊఁ.. పదండి ముందుకు .. పదండి ముందుకు..'

మనస్ఫూర్తిగా మనల్నింకా ముందుకు పదమనే వాళ్లింకా దేశంలో మిగిలున్నందుకు మహా ముచ్చటేసింది కానీ.. అదా స్థలం? సందర్భం?

చినుక్కీ చినుక్కీ మధ్య నుంచి గుర్ర్రం తోల్తూ బాణాలేసే పురాణపురుషుడి ఎవరో ఒకాయనున్నాడు కదా! ఆ మహానుభావుడి చాకచక్యం మించి పేసింజర్స్  భుజాల మీద నుంచే పాక్కొస్తూ, బూతులు కూస్తో,  టిక్కెట్లు కోస్తోన్న కండక్టర్ని నిజంగా అభినందించాల్సిందేనండీ! ఇట్లాంటి ఆటలు ఆ ప్రపంచ కప్పు పోటీలల్లో ఎందుకు పెట్టరో! బెజవాడ బస్సోళ్ళు కప్పులు కొట్టేస్తారని కుళ్లేమో!

 

నిద్రలో నడిచేవాళ్లా బైల్దేరిన బస్సుకు ఏం మూడిందో, మూడు నిమిషాల్లో ముక్కుతాడు తెంచుకున్న గుర్రంలా పిచ్చ పరుగందేసుకొంది. మజ్జె మజ్జెలో సకిలింపులు!.. బస్సు కుర్రాళ్ల రంకెలు!

వెనకమాల్నుంచి ఇంకో మదమెక్కిన బస్సుగుర్రం తరుముకొస్తా ఉందట.. ఎవరో రెచ్చగొడతా ఉన్నారు బస్సు డ్రైవర్ని!

అప్పుడు చూశానండీ.. డ్రైవర్ సీటుకు సరిగ్గా నడి నెత్తి మీద పెద్దక్షరాలతో రాసున్న హెచ్చరిక బోర్డు 'దేవుని స్మరింపుము'

ప్రస్తుతం నే చేస్తోన్న పని కూడా అదే!  నేనూ, జాడీ క్షేమంగా వాగులోకి దిగితే అదే పదేలు!

 

గవర్నమెంటాసుపత్రి ముందు అయిష్టంగా ఆగింది బస్సు.

కండక్టరు అరుస్తోన్నాడు 'ఆసుపత్రి కెవరెళతారండీ!;

ఈ బస్సిట్లా ఇంకో పది నిముషాలు గెంతితే అందరం అక్కడికే పోవాల్సి వాళ్లమే!

ప్రస్తుతానికి ఓ భారీ కాయం మాత్రం ఆపసోపాలు పదుతూ సీట్లోంచి లేచింది.

ఆ కాయాన్ని ఆస్పత్రి పాల్జేయడానికి అయిన ఆలస్యం కవరవ్వద్దూ! డ్రైవరంచేత స్టీరింగ్ మీంచి చేతులు పూర్తిగా ఎత్తేశాడు. పెడలు మీది కాళ్ళకూ రెస్టు కాబోలు.. మొత్తానికి బస్సు మెత్తంగా గాలిలో తేలిపోతోందీ సారి. బోడెమ్మ సెంటర్ దగ్గర బ్రేకేయక తప్పింది కాదు.

'బోడెమ్మ ఎవరండీ? బోడెమ్మ ..బోడెమ్మా?' కండక్టర్ రంధి.

'నేనేనండీ!' అంటూ లేచిందో పునిస్త్రీ.

'నువ్వంకాళ్లమ్మంటివి కదమ్మా? 'అంకాళమ్మగుడి స్టాప్' అని కండక్టరుగారి ధ్వని!

'నేను కాదయ్యా అంకాళమ్మ! నా ఈపరాలు. ఇదిగో ఈడనే కునికిపాట్లు పడతా ఉండాది మడిసి. బోడెమ్మ నేనూ!'

ఆ శాల్తీని బస్సులో నుంచి కిందకు తోసేసి బెల్లుకొట్టాడు కండక్టర్.

పీ’రు చెట్టు’ దగ్గర ‘పీరెవరో లేచి రమ్మం’టే  ఓ శాస్త్రులు గారు దిగడానికి తయారయ్యారు. 'గాంధీబొమ్మ' దగ్గర అట్లాగే కండక్టర్ 'గాంధీ.. గాంధీ ఎవరు బాబూ.. గాంధీ' అన్న గావుకేకలకు ఓ తాగుబోతు 'ఆయ్' అంటూ ఇద్దరు పేసింజర్ల చేతి సాయంతో తూలుకుంటూ దిగిపోయాడు.

 

హఠాత్తుగా     బస్సొక్కక్షణం ఆగిపోయింది!  మరుక్షణమే వెనక్కి నడవడం మొదలెట్టింది!! పేసింజర్లందర్నీ ఇందాక ముందుకు పొమ్మని తోసిన కుర్రాడే బస్సు వెనక్కి నడుస్తూంటే ఇప్పుడు ‘రైట్.. రైట్..’ చెప్పేస్తున్నాడు!

'అందరూ దిగాలి. దిగాలి. బస్సింక ముందుకు పోదు' అని అరుపులు లంకించుకున్నాడు కండక్టరు కూడా!

వెనక బస్సుతో పోటీ తట్టుకోడానికి తటాల్మని  ఇట్లా దారి మళ్లించెయ్యడం బెజవాడ బస్సులకు ఎప్పట్నుంచో అలవాటైన ముచ్చటేనంట! 

అదేమని అడిగితే 'ష్ష్! మెడ మీద చెయ్యేసి తోసేస్తారు, బెజవాడ బసులోళ్లు యములోడికైనా జడవరు' అంది అప్పటి దాకా నా గుండు జాడీ మోసిన గుండు శాల్తీ.

అందర్తో సహా నేనూ దడదడా బస్సులోంచి  బైటకు దూకేశా.

ఎత్తు మీంచి దూకడంతో మడమ చిట్లింది. జాడీ కూడా  బీటలిచ్చింది. నెత్తి జుత్తంతా ఆవ జిడ్డుతో ముద్ద ముద్ద! నుదుటి మీంచి జారిన ఆవనూనె మరకల్తో మొహమంతా చారికలు! కాళ్ల నుంచి కళ్ల దాకా.. వళ్లంతా మంటలు మంటలు!

 

చీకట్లో ఎవరూ చూదకుండా మావాడిల్లు కనుక్కోడానికి అష్టకష్టాలు పడాల్సొచ్చింది.

అప్పటికే అర్థరాత్రి దాటింది.

బాడీ, జాడీ వెరసి శరీరమంతా బట్టలతో రక్త సిక్తం. చంకలోని గుండు జాడీ ఖండిత శిరస్సును తలపిస్తోంది.

ఎవరైనా చూస్తే హంతకుణ్నని వెంటబట్టం ఖాయం.

 

చలి వల్ల వణుకు..

ఆకలి వల్ల నీరసం..

ఆవగాయ వల్ల  మంట..

ప్రయాణం వల్ల అలసట..

నిద్ర వల్ల మత్తూ..

వళ్లు తూలిపోతూంటే, కాళ్లు వణికిపోతో ఉంటే, ఆ నడి రేత్రి చీకట్లో ఎట్లాగైతేయేం వినాయకరావిల్లు పట్టుకున్నా!  తలుపులు దబదబా బాదేస్తున్నా.

ఐదు నిముషాలగ్గాన్నీ మెల్లిగా తలుపు తెరుచుకుంది కాదు. అదీ ఓరగా!

'ఎవరూ?' అడిగిందో ఆడగొంతు మెల్లిగా.

'నేనమ్మా! పెదనాన్నను.  ఇదిగో! ఆడిగావుగా! తెచ్చా నీ కోసం!' అంటూ గుండు జాడీని గడప మీదకు దింపా! అంతే..

 'కెవ్వుఁ!' కేక! ఒకసారి కాదు.. వరసగా ఏ పది సార్లో!

ఆ పిల్ల అమాంతం అల్లాగే విరుచుకుపడిపోయింది.

భగవంతుడా! ఇప్పుడేం చేయడం!

పారిపోడమా! ఉండిపోయి దెబ్బలు తిండమా!

తేల్చుకునే లోగానే..  గదిలోంచి  బైటికొచ్చిన వినాయకరావు ఒక్క క్షణం తెల్లబోయాడు. మరుక్షణం మ.. మ్మా..  'మర్డర్! మర్డర్!' అంటో వీధిలోకి పరుగేట్టి వీరంగాలేయడం  మొదలెట్టాడు.

 

అరవడానికి పోగైన వీధి కుక్కలు చీకట్లో ఆవగాయ బద్దల్నే మాంసం ముక్కలనుకున్నాయో.. ఏంటో.. పాడు! ఖర్మ .. ఆవురావురమని మెక్కేస్తున్నాయి.

 

అమ్మాయికని తోడల్లుడు శ్రద్ధగా చేయించిన కొత్తవగాయ మొత్తం  చెత్త వీధి కుక్కలపాలు!

 

అవునూ!.. కుక్కలు ఆవగాయ ముక్కమెక్కుతాయంటారా.. మరీ విడ్డూరం కాపోతే? అని సొడ్డు నా మీద మాత్రం వేసేయకండి మహాప్రభో!

ఇది బెజవాడ!

అప్పుడూ ఇప్పుడూ .. బెజవాడలో జరిగే విచిత్రాలు బ్రహ్మంగారికే అంతుబట్టలేదు! సామాన్యులం ఇహ మీకూ.. నాకూనా?! ఎంతేడుపొచ్చే అనుభవాలు ఎదురై చచ్చినా ఇది ఇట్లా నవ్వుకుంటూ  దులపరించుకు పోవాల్సిందే!

-కర్లపాలెం హనుమంతరావు

***

(ఆంధ్రప్రభ వారపత్రిక సెప్టెంబర్, 1982 (తేదీ ఖచ్చితంగా తెలీదు-  రికార్డులో 16  -09 -1982 అని ఉంది) ' కొండయ్యగారి గుండు జాడీ'శీర్షికతో ప్రచురితం)

 

 

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...