Sunday, December 12, 2021

చీకటి చీకాకులు- సరదాకే రచనః కర్లపాలెం హనుమంతరావు


 

''జీవితం ఏమిటీ? వెలుతురూ.. చీకటీ! హుఁ.. హుఁ.. హుఁ!.. వెలుతురంతా చీకటైతే.. అందులోనే సుఖము ఉన్నదీ!'

'చీకటీ.. చీకటీ అంటూ ఆ శోకన్నాలేవిట్రా?.. లేచి స్విచ్చి వేసుకుంటే వెలుతురు రాదా!'

'స్విచ్చి వేసే ఉంది బాబాయ్! వెలుతురే లేదు'

'అదేంటీ? కరెంటు బిల్లు కట్టడం మర్చిపోయావా?  కట్టలేకపోయావా?'

'కట్టలేకపోవడానికి అదేమన్నా కోట్లలో వచ్చిందా ఏమిటీ? వట్టి సర్ ఛార్జీనే కదా! కట్టినా కట్టకున్నా కరెంటు 'కట్' తప్పదు కదా! మా కాంప్లెక్సులో వెలుతురు మొహం చూసి ఎన్నిరోజులయిందో తెలుసా? కొత్త ఇల్లు కదా.. అని బోలెడంత పోసి ఝిగేల్ ఝిగేల్ మనే ఛాండ్లియర్సుకూడా పెట్టించింది మా శ్రీమతి. విగ్రహం పుష్టి .. నైవేద్యం నష్టి సామెతగా ఉంది మా అపార్టుమెంటు పరిస్థితి. ఎల్ కే జీ చదివే మా సుపుత్రుడు నిన్నేం అడిగాడో తెలుసా? ఎ ఫర్ ఏపిల్, బి ఫర్ బ్యాట్.. అని చదివేస్తూ  ఈ ఫర్ ఎలక్ట్రిసిటీ అని రాగానే ఈ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి డాడీ? అని ఆడిగాడు బాబాయ్! 

'అదేదో హైటెక్ సిటీ అనుకుంటున్నాడు కాబోలు పాపం పసివెధవ' 

'అదే మరి! పోనీ ఇదీ అని చూపిద్దామంటే.. ఇల్లు కట్టినప్పట్నుంచీ ఒక్క పూటైనా వచ్చి చస్తే కదా!'

'అందరి సంబడం అలాగే ఉందిలేరా బాబూ! మా అపార్టుమెంట్లలో ఐతే పూర్తిగా 'లిఫ్టు' అనేదే తీసేసారు. ఎవరికి వాళ్లం సొంతంగా బక్కెట్లు ఏర్పాటు చేసుకున్నాం. ఓపిక ఉన్నవాళ్ళు ఎలాగో మెట్లమీదనుంచే డేక్కొస్తున్నారనుకో!  కంప్లైట్ చేద్దామని కరెంటాఫీసుకు పోతే అక్కడా వాళ్ళు చీకట్లో తడుముకుంటున్నార్రా బాబూ!'

'చీకట్లో ఇట్లాంటి చిత్రాలు చాలానే జరుగుతున్నాయ్ బాబాయ్! మొన్న గుళ్లో అదేడో సామూహిక వివాహాలు జరిపించారు చూసావా!వందమంది వధూవరులు ఒక్కటవ్వాలని వచ్చారు పాపం. పట్టపగలే కటిక చీకటి! ఏ పెళ్ళికొడుకు ఏ పెళ్ళికూతురు మెళ్ళో తాళి కడుతున్నాడో.. అంతుబట్టక పాపం నిర్వాహకులు ఎంతలా తల్లడిల్లిపోయారో తెలుసా? కరెంటు వాళ్ల నిర్వాకంమీద కంప్లైట్ చేద్దామని పోలీస్ స్టేషనుకు పోతే'

'అర్థమైందిలే! అక్కడా చీకట్లో ఎవరూ కనిపించలేదనేగా చెప్పబోతున్నావ్? సందు దొఇకింది కదా అని.. సర్కారంటే గిట్టని నీలాంటి వాళ్ళంతా ఇట్లాంటి కట్టుకతలు పుట్టిస్తున్నారుగానీ.. నీళ్ళు పుష్కలంగా ఉంటే గవర్నమెంటు మాత్రం కరెంటెందుకివ్వదురా?' ఇదివరకటి ప్రభుత్వాలకు ఈ కరెంటు కొట్టిన షాకు ఇప్పటి సర్కారులకు మాత్రం తెలవదనా? పవర్ లేదు పవర్ లేదు అని దొరల పరువుతీయాలని చూస్తున్నారుగానీ.. ఫారడే మహాశయుడు కరెంటు కనిపెట్టకముందుమాత్రం లోకం చల్లంగా సాగిపోలేదా? మన మూరగండడ రాయడు శ్రీక్రుష్ణదేవరాయలు కాగడాల వెలుతురులోనే సువర్ణపాలన సాగించాడు తెలుసా? మా చిన్నతనంలో ఈ కరెంటుగోల ఎక్కడిదీ? మా చదువులన్నీ ఆముదం దీపాల కిందనే  తెల్లారిపోయాయి. విసనకర్రలు, పాత పేపర్లు ఉన్నంతకాలం పంఖాల అవసరం ఏమంత ఉంటుందిరా? కోతల పుణ్యమా అని కరెంటుషాకుల దుర్మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. రాత్రిళ్ళూ నిశ్చింతగా బట్టలు ఆరేసుకుంటున్నాం కరెంటు తీగలమీద.'

'అట్లా ఆరేసుకోబట్టే రాత్రిళ్ళు దొంగతనాలు ఎక్కువైపోయాయీ మధ్య మళ్లీ! ఇప్పటివరకు శివార్లవరకే చోరుల సామ్రాజ్యం పరిమితం. ఇప్పుడు నగరం నడిబొడ్డుక్కూడా వాళ్ల హస్తలాఘవం విస్తరిస్తోంది. దొంగలు, దోరవయసులో ఉన్నవాళ్ళూ కరెంటుకోతలకు పండగలు చేసుకుంటున్నారు. సరససల్లాపాలకు  ఎక్కడో  దూరంగా ఉన్న పార్కుల చాటుకోసం  పాకులాడేవాళ్ళు  కోడెవయసుగాళ్ళు. ఇప్పుడంత శ్రమ పడటంలేదు. సర్కారువారి పుణ్యమా అని నగరం నడిబొడ్డులే కోడెకారుకు పడకగదులై పోతున్నాయ్ బాబాయ్!'

'సర్వే జనా సుఖినోభవన్తు- అనే గదరా ఏ ప్రభువైనా కోరుకొనేది! జనభాలో సగమైనా ఎలాగోలా సుఖపడుతున్నారని సంతోషపడక అలా కుళ్ళుకోవడమేం సబబుగా లేదబ్బీ!ఏం? దొంగలుమాత్రం సుఖంగా బతకద్దా? పని చేసినా చేయకున్నా పగలంతా పెళ్ళివారిల్లులా ఫెళ్ళున వెలిగిపోవాలంటావ్ ప్రభుత్వాఫీసులు? దొంగవెధవలకూ వాళ్ల వృత్తి క్షేమంగా చేసుకునే సావకాశం వద్దంటావ్?! పెద్దవాణ్ణి. అనుభవంతో చెబుతున్నా..విను! చీకటి పడకముందే పిల్లకాయలకి రెండుముద్దలు తినిపించి పక్కలెక్కించెయ్! ఇంచక్కా మీ అమ్మగారు చెప్పే చందమామ కథలన్నీ వింటూ పడుకుంటారు. చక్కటి పాటలూ నేర్చుకుంటారు. పాడు టీవీ నోరు మూతపడీంతరువాత పెద్దవాళ్ళకుమాత్రం ఇంకేం పొద్దుపోతుందీ? తెల్లార్లూ కాలక్షేపంకోసం చిన్నతనంలో నేర్చుకున్న ఆంజనేయ దండకాలూ, అష్టోత్తరాలూ మళ్లీ మళ్ళీ నెమరేసుకుంటారు. బోలెడంత పుణ్యం సంపాదించుకొంటారు. '

'చీకటిమూలకంగా కుటుంబ నియంత్రణ పథకాలు మళ్లీ మొదటికొస్తున్నాయ్ బాబాయ్!'

మరేం ఫర్లేదు. ఏడాదికి మూడొందలరవైయ్యైదు రోజులు  పసుపు కుంకుమలని.. సీమంతంనోములని.. ప్రసవవేదమని, బాలింతలాలింతలని.. ఏవేవో పేర్లతో సర్కార్లు సొంతమనుషులకుమించి ఆదుకుంటూనే ఉన్నవాయె! శబ్దవేధి అని మనకో వేదకాలంనాటి విద్య ఉంది. కటిక చీకట్లో కూడా కంటి సాయం లేకుండా  శబ్దాలను బట్టి వస్తువులజాడను పసిగట్టే గొప్పకళ అది.ఎందుకూ కొరగాని ఇంజనీరింగు చదువులమీద పడి ఆనక  బాధపడే బదులు.. శబ్దవేధిని ఓ కోర్సులా పౌరులందరూ నిర్బంధంగా అభ్యసిస్తే సరి.. ఈ చీకటి పాట్లు, చీకట్లో పాటలు తప్పుతాయి! వేలెడంత లేని బుడతడు కూడా రెండ్రెండ్లెంతరా అని అడిగితే ఠక్కుమని సెల్ తీస్తున్నాడు! కరెంటే లేనప్పుడు ఇంక  చార్జింగేముంటుంది? సెల్లేముంటుంది? ఎందుకైనా మంచిది.. మళ్ళీ పిల్లాడికి నోటిలెక్కలు గట్రా ఇప్పట్నుంచే  గట్టిగా నేర్పించు! మోటార్లమీద ఆధారపడి ఇబ్బందులు పడేబదులు.. పాతకాలంనాటి ఏతాములు మళ్లా బైటికి తీస్తే వ్యవసాయం నిరాటంకంగా సాగిపోదా? బియ్యంమిల్లులు ఆడకపోతేనేం? అత్తాకోడళ్ళు  దంపుడు పాటలు పాడుకొంటూ ఇచక్కా ధాన్యం దంచుకుంటే పోదా?'

' ఎందాకా ఇలా చీకట్లో దంచుకోడాలు బాబాయ్?'

'చెత్తనుంచి కూడా కరెంటు తీయచ్చని అంటున్నారు గదరా ఈ మధ్య? నీళ్ళక్కరువుగానీ, మనదేశంలో చెత్తాచెదారానికి కొదవేముంది? ఆ సాంకేతిక నైపుణ్యం అభివృద్దయ్యేదాకా పోనీ ఓ పని చేయచ్చు! బియ్యంలో రాళ్ళు తింటే పెళ్ళినాడు జడివానలు కురుస్తాయనిగదా పెద్దలు చెబుతారు! పెళ్ళికావాల్సిన కుర్రకారునంతా సేకరించి  కిలోరూపాయిబియ్యం ఓ రెండు కిలోలు బలవంతంగానైనా బొక్కించి పెళ్ళిపీటలమీద కుదేస్తే సరి.. వానలే వానలు. నీళ్ళే నీళ్ళు. కరెంటే కరంటు!.ఇక నీ సెటైర్లుండవు!'

***


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...