Sunday, December 12, 2021

సృష్టిలో - రాచకొండ – కధ - పై నా స్పందన - కర్లపాలెం హనుమంతరావు

స్పందన: నా స్పందన చదివే దయచేసి రచయిత రావిశాస్త్రిగారి 'కథ'  చదవమని ప్రార్థన🙏🙏

                                       ❤️❤️❤️'


 జీవితం చాలా చిత్రమైన వ్యవహారం. బతికి తీరాల్సిందేనన్న ఇచ్ఛ పెట్టి, అట్లా బతికేందుకు మళ్లీ అడుగడుగునా అడ్డంకులు  కల్పించడం .. ఇదేదో ప్రకృతి-  జీవిని  ఆటపట్టించాలని  చేసే చిలిపి చేష్టలా అనిపిస్తుంది. 

బతకడమంటే  వూరకుక్కలా ఊరకే  బతకేయడం  కాదుగా! కులాసాగా గడవాలి కాలం . ఈసురోమని ఏడుస్తూ రోజులు ఈడిస్తే  ఆ బతుకు  'బతకడం'  ఎట్లా అవుతుంది! దాని కన్నా చావు హాయి. అట్లాంటి దిలాసా జీవితం గడపాలంటే    కంటికి నిండుగా  నిద్దుర పోవాలి. వంటికి పట్టే తిమ్మిరి తీరడమూ అవసరమే ఒక ఈడు వచ్చి పోయేదాకా . తతిమ్మా సంగతులన్నీ ఆనక .. ముందైతే కడుపారా ఎప్పటికప్పుడు ఆహారం దొరకాలి. ఆహారం దొరకుబుచ్చుకోవాలనే    కోరిక నిలబడాలి. 


కోరిక  ఆకలి ప్రేరకం. ఆ ఆకలి చుట్టూతానే  జీవులు పడే నానాయాతనలూ! ఆకలి పెట్టే రకరకాల  తికమకల  కతే రావిశాస్త్రిగారు జాస్మిన్ అనే దొంగ పేరుతో సృష్టించిన ఈ 'సృష్టిలో ' ని  దొంగ తిండ్ల కథా - కమామిషూ! 

ఆకలి ఉంటేనే జీవం ఉన్నట్లు లెక్క౦టారు . అది వేళకు తీరడమే   జీవితం సజావుగా సాగుతున్నట్లని  కూడా  చెబుతుంటారు . నిజమే! ఆకలి చుట్టూతానే చీమ  జీవితం నుంచి  సింహం బతుకు వరకు పరిభ్రమించడం .. లోకంలో  నూకలు చెల్లే దాకా.ఆకలి తీరేందుకు అవసరమయ్యే ఆహారం ప్రకృతి వేరే ఎక్కడి  నుంచో తెచ్చిపడేయదుగా  జీవులకు! మీలో మీరే ఒకళ్లనొకళ్లు ఆరగించుకోమని  చేతులు దులుపుకుని చక్కా  తమాషా చూడటం దాని జబ్బు . అదిగో .. ఆ ఒకళ్ల నొకళ్ళు  స్వాహా చేసుకొనేందుకు నడిచే నాటకం పేరే ' స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్' . జీవన పోరాటం - అచ్చు తెలుగులో చెప్పాలంటే " బతకడానికి కొట్టుకు చావడం "! 

ఈ బతికేందుకు కొట్టుకు చచ్చేటప్పుడు జీవులు వేసుకొనే  ఎత్తులు ప్రైయెత్తులు .. యుక్తులు.. కుయుక్తులు చూడాలీ ! ఏ యానిమల్ కింగ్‌డమ్ లాంటి  ఛానెల్లో బైటి నుంచి చూడ్డానికైతే భలే గమ్మత్తుగా కూడా ఉంటాయి. అంత గమ్మత్తు మత్తు  ఉంటుంది  కాబట్టే అవి కథావస్తువులు అవడానికి అన్ని విధాలా  అర్హత పొందినట్లు సిద్ధాంతకర్తల   లెక్క ! 

సామాజిక స్పృహ అంటే ఈ తరహా విశేషాల పట్ల తార్కిక అవగాహన కలిగివుండటమేనంటారు. సామాజిక చైతన్యం దాని పై మెట్టు  మాట. ఎదుటి జీవి దెబ్బనుంచి తప్పుకుంటూ, ఆ ఎదుటి జీవిని  దెబ్బకొట్టడమనే లాఘవం పేరే జీవించే కళ అనుకుంటే   .. ఆ కళ .. కళ కోసమేనని కొందరు ; కాదు.. కాదు, అది జనం కోసరంరా  బాబూ !  అని ఇంకొందరు ఎడతెరిపి   ఎరక్కుండా మాటా మాటా అనుకోడం పద్దాకా చూసే పితలాటకమే! ఏ పితలాటకమయినా  ఈ ఆకలి నాటకం పాయింటు దగ్గరి కొచ్చేసరికి  అమాంతం  గప్ చిప్ .. కళకయినా, జీవికకయినా ముందు ముద్ద అవసరం కాబట్టి .


తాత్విక చింతన తరహా మంత్రతంత్రాలతో   చింతలూ చింతకాయలూ  రెండూ రాలగొట్టే    తరహా కథలు రాసే ప్రయోగం కొత్త పద్ధతిలో    కొనసాగిస్తూనే .. ఆ  వంకన మధ్య మధ్యన తన వంతు మార్కు సొంత వేదాంతంతో  ..   కథలు కాని వాటిని కూడా కథలుగ చేసి గిలిగింతలు   పెట్టడం   ఓం ప్రధమంగా ఆధునిక  తెలుగు కథానికకు  నేర్పించిన చమత్కారి   రావిశాస్త్రి . 


బతకడానికి ఒకరినొకరు చంపుకునేందుకు వేసుకునే ఎత్తులు, ముఖాముఖి  తటస్తపడితే   తప్పక దూసుకునే కత్తులు .. గట్రా ఆయా జీవులు మనసుపడి  మరీ ఏమీ చేసుకోవడం లేదనేది శాస్త్రి గారి  థియరీ.  భగవత్సుష్టికి అవసరం గనక   వైరాగ్య౦తో   మాత్రమే  ఈ హింసాకాండ కొనసాగుతున్నదని  శాస్త్రిగారు  ఎన్నో   కథల్లో చెప్పినట్లు    ఇందులోనూ చెప్పుకొస్తారు. బతకడం, తమ మీద ఆధారపడ్డవాళ్లని బతికించడం కోసమే ధ్యేయంగా  మొక్కుబడి యుద్ధాలు  జరుగుతున్నట్లు ఆయన ఉద్దేశం! 


తిండి  వేటకు బయలుదేరేముందు బొరియలోంచి బైటికొచ్చిన నక్కతల్లి చేత  బిక్కు బిక్కు మంటూ చూసే తన బుజ్జి మూడు పిల్లలకు లోకంలో బతకాల్సిన అగత్యం  గురించి , బాధ్యత, తీరుతెన్నులను   గురించి  చెప్పినప్పుడు కరుణరసం ఉప్పతిల్లడానికి కారణం హింసకు బైలుదేరిన ఆ జీవిలో    సంసార బాధ్యతే తప్పించి క్రౌర్యం ఏ కోశానా లేకపోవడమే!   'అయ్యో! పిచ్చి పిల్లల్లారా! బెంగ పెట్టుకోకండర్రా! అలా వెళ్లి ఇప్పుడే వచ్చేస్తాను. వెళ్లకపోతే ఎలా కుదురుతుందో చెప్పండి! వెళ్లి బువ్వ తెచ్చుకోవాలా? మీరు చిన్న పిల్లలు, మీకేం తెలీదు. కష్టపడకపోతే కూడు దొరకదమ్మా! నేను కష్టపడితేనే నాకు బతుకు, మీకు బతుకు. మీరూ పెద్దవాళ్లయి, కాళ్లకి పరుగొచ్చి, పళ్లకు పదునొస్తే, మీరూ లోకం మీద పడి బతికేయచ్చు కాని , అందాకా నా కోసం మీ కోసం కూడా నేను తిరక్క తప్పదు.' అంటూ తన  పక్షంగా జీవించాల్సిన అవసరాన్ని  ' గీత ' లా   బోధిస్తుందీ కథలో తల్లినక్క . భారతంలోని బకాసురుడిని అడిగినా ఇదే పద్ధతిలో  మరింకేదో గీత   వినిపిస్తాడు .. సందేహం లేదు. ఆకలి   అంబానీనైనా  . . పనిలేని సోంబేరినైనా    ఒకే విధంగా   వేధిస్తుంది . మనీ లేదు, అసలు మానవ  జన్మే కాదు, పాపం.. బలహీనమై శాల్తీ , బతకడం బొత్తిగా చేతరాని కుంక ' అని జాలేమీ చూపించదు గదా! ఆకలి లేకపోతే ఆరాటమే ఉండదు. ఆరాటం లేకపోతే జీవించాలనే ఇచ్ఛ  పుట్టదు. బతుకు మీద  ఉండే పిచ్చ తీపి వల్లనే .. ప్రమాదం అంచున ఉన్నప్పుడు శత్రువు ఎంత బలం, బలగం కలిగి భీకరంగా   భీభత్సం చేస్తున్నప్పటికీ ..   ఆఖరి నిశ్వాస దాకా చంపే  తీరాలన్న మొండిధైర్యమే ఎంత బక్క జీవినైనా  ముందుకు తోసేది . అధైర్యపడుతూ ఓ మూలన ముడుచుక్కూర్చుంటే బలహీనమైన  జాతులు  తరిగిపోయి బలవంతుల వర్గం  సైజులో  ముదిరి జీవసమతౌల్యం దెబ్బతినేస్తుంది  కదా! ప్రకృతికి  అంతకు మించిన  ముసలం మరింకేముంది! ఎవరికోసమో కాకుండా  తన ఉనికి కోసమైనా జీవులకు కడుపులు పెట్టి, వాటిలో ఆకలి చిచ్చు పెట్టి,     ఎప్పటికప్పుడు దాన్ని ఆర్పుకు చావండి .. లేదంటే చావండి ! '  అంటూ ప్రకృతికి ఏదో  ఓ తమాషా చేయకతప్పదు! 


సృష్టిలోని జీవుల అదుపుకు ప్రకృతికి  తోచిన ఇన్ - బిల్ట్ మెకానిజం ఈ ' బతకటానికి   కొట్టుకు చచ్చే' ట్రిక్కు ఒక్కటే   ! ఈ ఆటలోని  'చావుకు  దారి తీసే  ఆహారం వేట'  పార్ట్ ను ప్రత్యేకంగా విడదీసి రావిశాస్త్రి గారు ఇక్కడి ' సృష్టిలో '   కథలో   కిక్కిచ్చేలా   చెప్పుకొచ్చారు.. ఎప్పట్లానే  తన వంతు చురకలూ  నడి మధ్యన  వడ్డిస్తో  ! కథ చివర్లో  బ్రాకెట్ లో కనిపించేవి ఈ బాపతు జౌట్ ఆఫ్  బాక్స్  చురకలే అందుకు ఉదాహరణ !  


 "కోడి పెట్టల్ని వీరన్న ఎత్తుకుపోయేడు. వాటిలో రెండింటిని వీరన్న ఇంటి నుంచి దొంగనక్క కరుచుకుపోయింది. నూకునాయుడి పది సెంట్లనూ  వీరినాయుడు  తన పదెకరాలల్లో కలిపేసుకున్నాడు.  అందు గురించి నూకునాయుడు దావా తీగా ప్లీడరు గుమాస్తా అతని డబ్బంతా ఎగేసేడు. ప్రతివాదైన వీరినాయుడు దగ్గర పెద్ద ప్లీడరుగారు అయిదువందలు (పది సెంట్ల భూమి ఖరీదే అంత) ఒడికేసేరు. వీరినాయుడి బంజరు భూమిని వీర్రాజుగారు ఆక్రమించేసేరు. ఆక్రమించుకున్న ఆస్తులన్నీ వారు తమ చిన్నభార్యవారి పేర్న పెట్టి ఉంచేరు. వాటి వల్ల వచ్చే రాబడంతా ఆవిడ తన తమ్ముడి ఇంటికి నడిపించేసింది . ఆ తమ్ముడు ఆ సొమ్మంతా తన ఉంపుడుకత్తెకి ఇచ్చేసేడు. ఆ ఉంపుడుకత్తె ఆ డబ్బంతా తనకు నచ్చినవాడికి ఇచ్చేసింది. ఆ నచ్చినవాడు సినిమా చిత్రం కోసం మెడ్రాస్ వెళ్తే తారలూ, డైరక్టర్లూ కొంత డబ్బు తినేసేరు; మిగతాది ఓ నాటుకోటి చెట్టియారు లాక్కున్నాడు.  ఊరివారి డబ్బునీ కార్మికుల కష్టాన్నీ దోచుకున్న చెట్టియార్ గారి చేత ఈ మార్వాడి దివాలా తీయించేడు. మార్వాడీగార్ని ఓ తాబీతరావారు తమ ధృతరాష్ట్రపు  కౌగిట్లో కలుపుకున్నారు. తాబీతర్లావారిని ఓ ఇంగ్లీషు కంపెనీ రాజ్యంవారు లాగుదామని చూస్తున్నారు. వీరందర్నీ ఓ అమెరికన్ సిండికేట్ సామ్రాజ్యంవారు చెరచడానికి వారి రెక్కలు పట్టుకొని గిజగిజలాడిస్తున్నారు. సిండికేట్ వారి కాలి కింద ఇసకని కొందరు జపనేయులు దొలుస్తున్నారు. వారి సీటు కింద వేరొకరు గోతులు తవ్వుతున్నారు. వార్ని మరొకరు, మరొకర్ని  ఇంకొకరు,  ఇంకొకణ్ని వేరొకడు, వేరొకణ్ని వీడు, వీణ్ని వాడు, వాణ్ని వీడు, వీణ్ని  ఇది, దీన్ని వాడు, వాణ్ని మరొకడు మరొకణ్ని వేరొ...) " ఇట్లా సాగిన దోపిడీ ధారావాహికలోని  మొదటి రెండు మూడు వాక్యాల తాలూకు ఎపిసోడే   .. వీరినాయుడి కోడిపెట్టలు మూడింటిని వీరన్న దొంగిలించడం .. వాటిలో రెండింటిని కొట్టుకుపోయిన నక్క మూడో దానికోసం  మళ్లీ రావడం.  


ఈ తిండ్లు, దొంగ తిండ్ల వ్యవహారం  చుట్టూతా  మనిషి ( వీరన్న)  పగ, జంతువు ( తల్లినక్క) జీవన పోరాటం,  పక్షి ( కోడిపెట్ట)  అంతరంగ మథనాలు ;  జీవితం , దాని  మంచి చెడ్డలు, జీవించక తప్పని దౌర్భాగ్య స్థితిగతులు, అందుకు అడ్డొచ్చే గడ్డు పరిస్థితులు , అందుక్కారణంగా ఊహించబడ్డ దేవుడి దౌష్ట్య౦ పై నిరసనలు ; ఇవే గాపు; చావు .. దాని బహుముఖ   వికృత ముఖాల  దిగ్భ్రాంతికర ప్రదర్శనల సమాహారం ఈ 'సృష్టిలో' కథా సృష్టి . నిస్సందేహంగా  రావిశాస్త్రిగారి అనేకానేక ఇతర రచనల తరహాలోనే ఉత్తమ జాతికి చెందే  కథానిక! 


బలమైన జీవి, తెలివైన జీవి   అయితే  ఇబ్బంది  ఉండదు .. ఆహార లభ్యతలో సౌలభ్యత ఎలాగూ తప్పదు.  ఆ రెండింటి  కొరవతో  జన్మ తగలప్పుడే  బతకాలంటే జీవికి చచ్చే చావు.  అట్లాంటి దౌర్భాగ్య  జీవుల పక్షం  నుంచి కూడా సాపేక్షికంగా ఆలోచిస్తే పంచతంత్రం  మించి ' పంచ్'  లు ఉండే కథలు చెప్పొచ్చన్న గొప్ప ధీమా మొదటగా తెలుగులో కల్పించింది రావిశాస్త్రేగారే. 


అధర్మాన్ని పడగొట్టి, ధర్మాన్ని నిలబెట్టే రచనలు ఎప్పుడూ  వచ్చేవే. రావాలి కూడా!  రామాయణం చదివే నాస్తికుడికైనా రావణుడే చావాలని ఉంటుంది. వాల్మీకిరుషి ఏకపక్షంగా రాముడి వైపుండటమే అందుక్కారణం. కానీ, ఎంత నికృష్ట పాత్రకైనా  పుట్టుకతోనే నీచత్వం అంటగట్టడం రచయిత పక్షపాత బుద్ధికి నిదర్శనమవుతుంది.  వెలుగు నుంచి చీకటి దిశగా ప్రస్థానించే ప్రయత్నం  అనేకానేక  కారణాల వల్ల సఫలమయి ఉండకపోవచ్చు; అసలు ఆరంభమే  అయివుండకపోవచ్చు కూడా . అయినా సరే ..ఆ దిశగా  అసలు ఏ  ప్రయాసా   కలుషాత్ముడి వైపు  నుంచి   సాగనే లేదనిపించే  రాతలను     నమ్మలేం.  కాపురుషుడి ప్రవృత్తిలోని   సానుకూల గుణo కోణం రచనకు అదనపు ఉదాత్తత ఓ అలంకరణం.

  

ఓ సానుభూతి వచనం  రచయిత వేసినప్పుడే గదా పాఠకుడి  దృష్టి దుష్టత్వం  నుంచైనా ఎంతో  కొంత నీతిసారం వడుగట్టుకుని లాభపడేందుకు వీలుడేది! బళ్లారి రాఘవాచారిగారు స్టేజి నాటకాల ప్రదర్శన సందర్భంలో దుష్టపాత్రల స్వభావంలో నుంచి కూడా ఓ వెలుగు కోణం రాబట్టే ప్రయోగాలు చేస్తుండేవారంటారు.  మంచే కాదు 'చెడు'  తాలూకు లోతులనీ నిరపేక్షంగా   తర్కించవలసిన బాధ్యత  మంచి రచయిత మీద తప్పకుండా ఉంటుంది. రావిశాస్త్రిగారి  కథల్లో.. దుర్మార్గంగా ప్రవర్తించే పాత్రల్లో  కూడా సందర్భం వచ్చినప్పుడల్లా   రగిలే  అంతర్జ్వాల  ఒకటి దర్శనమివ్వడం సాధారణ ధర్మంగా కనిపిస్తుంది. అందుకు ఈ కథలోని వీరన్న పాత్ర వ్యవహారమే  ఒక ఉదాహరణ. ఎంతో సాహసించి, ఎంతో శ్రమపడి మూడు రోజుల కిందట మూడు కోడిపెట్టల్ని  దొంగిలించాడు ఈ  'వీరన్న' . టౌనుకు పోయి అమ్మి సొమ్ము చేసుకుందామనుకునే లోపలే ఇంకేదో పోలీసుకేసు  లంపటంలో ఇరకడం  వల్ల  కుదిరింది కాదు . మూడోనాడు ఇంటికొచ్చి రెండుపెట్టలని నక్క ఎత్తుకు పోయిందని చెప్పిన పెళ్లాం వరాలమ్మమాటలను  నమ్మక రెండు దంచాడు ముందు . ఆనక పిల్లలు చెప్పిన మీదట నమ్మి మూడో పెట్ట కోసం వచ్చే నక్కకు 'దేవుణ్ణి చూపిస్తాన'ని  శపథం పట్టి  పులికోపంతో రగులుతూ పొంచి ఉన్నాడు.  ఆ సమయంలోనే  వీరన్నలో   అంతర్మథన  ఆరంభమయింది. కష్టపడి సాధించిన కోడిపెట్ట పోయినందుకు   వీరన్నకు నక్క మీద కోపంఉండనే ఉంది. రెండో పెట్టనూ అదే నక్క పొట్టన పెట్టుకున్నందుకు ఆ కోపం రెండితలయిందంటాడు రచయిత. ఆ అనడంతో ఆగిపోతే ఆయన  రావిశాస్త్రి కారు .  'తన చేత వరాలమ్మను పొరపాటున కొట్టించినందుకు ఆ నక్క మీద అతనికి మూడొంతుల కోపం వచ్చింది' అని కూడా  అనేశారు;  కనకనే ఆయన రావిశాస్త్రిగారు అయారు  . కొట్టినా సరే.. భార్య మీద ఆ భర్తకు ఎంత ప్రేమ ఉందో ఈ ప్రకటన తెలియచేస్తుంది. అదే సందర్భంలో మానవీయ కోణాన్ని  అద్భుతంగా ఆవిష్కరించే  మరో ఇట్లాంటి ఉదంతాన్ని ఉదహరించడం రావిశాస్త్రిగారిలోని ఉత్తమ కథకుణ్ణి పటం కట్టి చూపిస్తుంది . సొట్టబుర్రోడు అనే ఓ కేడీ చేసిన నేరానికి గున్నమ్మ కొడుకుని కొట్లో వేసిన ఎస్సై అది పొరపాటు అని తెలిసొచ్చిన తరువాత ఊరకే  ఉండలేక పోయాడు. ఆ సొట్టబుర్రోణ్ణి వెదికి  పట్టుకొచ్చి మరీ  మూడు రోజులు కొట్లోపెట్టి కుళ్లపొడిచాడు. కర్కోటకుడుగా  కనిపించినా  సరే .. ఎస్పై  లోని   మనిషి అపరాధభావన నుంచి తప్పించుకోలేకపోయాడని  చెప్పకనే చెప్పే ఈ తరహా మానవీయ దృకృథమే ఎంత హింసాత్మక కథనానికైనా ఉదాత్తత చేకూర్చేది. గుర్తుంచుకోదగ్గ కథలకు ఉండే ఎన్నో సు  సులక్షణాలు  ఇట్లాగే 'సృష్టిలో ' కథలో కోకొల్లలు; స్థలా భావం వల్ల అన్నింటినీ గూర్చి  చర్చించుకునే వీలు ఉండటంలేదు .. అంతే! 


ఆకలితో నకనకలాడే నక్క లాంటి ఓ బక్కజీవి  బుర్రలోని  ఆలోచనా  పరంపరను సృష్టిక్రమం వైపుకు బదులు కంటిక్కనిపించని కరుణామయుడి వైపుకు మళ్లించి కేదారగౌళ రాగంలో తిట్టాలన్నంత కోపం తెప్పిస్తాడు రచయిత ఒక సందర్భంలో  . సుఖాలు, సౌకర్యాలు వరాలుగా ప్రసాదించమని దృష్టిగోచరం  కాని  ఏ శక్తిముందు సాగిలపడతామో .. కష్టాల మీద కష్టాలు వచ్చి పడిపోతున్నప్పుడు ఒత్తిడిని తట్టుకోలేక భగవంతుడిగా భావించే అదే అదృశ్య శక్తికి బాధ్యతా అంటగట్టి   పడతిట్టడం పరమ భాగవతోత్తమ జాతికి చెందిన కంచెర్ల గోపన్నలో కూడా చూస్తాం!  అందుకే, ఒక మామూలు బక్క నక్క   ఉక్రోషం .. నక్కగా తనను పుట్టించాడని నమ్మే సృష్టికర్త మీదకు మళ్లినట్లు చూపించడం అభూత కల్పన అనిపించదు. సరికదా అధివాస్తవికత అని కూడా అనిపించదు; అంతా వాస్తవిక జీవితంలోని విషాదపార్శ్వాన్ని  తడుముతున్న ట్లే  గుండెను కెలుకుతుంది. 


ఇంకొన్ని గంటల్లో మరో జీవికి అన్నం కాబోయే ఓ కోడిపెట్ట తన   గూడుకింద చేరి చేసుకొనే అంతశ్శోధనలో  కనిపించేది కూడా  తిట్లకు గురయే ఆ అదృశ్య భగవానుడే! నడిరాత్రి   వేళ. . భయం ఆవరించిన బ్రతుకుతో  ఆ కోడిపెట్ట. . ఇష్టంలేని స్థలం మార్పు వల్ల కలిగిన బెంగ కారణంగా    కళ్లు మూతలు పడక ఎంతకూ అర్ధంకాని  లోకం తంతును, కోడిగా బతకడంలోని సార్థకతను  గురించి వేదాంత ధోరణిలో ఆలోచించడం మనకు  ఆశ్చర్యం కలిగిస్తాయి. క్విన్ టన్టెరన్ టోన్ అనే హాలివుడ్ దర్శకుడు రక్తాలు కారే యుద్ధ సన్నివేశాలకు నేపథ్య౦లో    మతిపొగొట్టే  సుతిమెత్తని వయోలిన్ రాగాలు  వినిపించే శైలి రావిశాస్త్రి గారిది. తాను చేసే నిత్యహింస త్యాగం గురించి, తాననుక్షణం అనుభవించే  హింసాభయం  నుంచి విముక్తి గురించి  బోధివృక్షం కింది   సిద్ధార్థునికి దీటుగా  ఓ తుచ్ఛ కోడిపెట్ట చేసే తాత్విక చింతనల్లాంటి చిత్రాలు రావిశాస్త్రిగారి కథల్లో అడుగడుగునా తగులుతుంటాయి!  కథలు కాని వ్యవహారాలను కూడా  ఇట్లా కథలుగా .. అదీ మంచి కథలుగా   ఎటా మలచవచ్చో రావిశాస్త్రిగారి కథలు గురువుల్లా బోధించడం విశేషం.   బుద్ధిలో  విశిష్టుడైన    పాఠకుణ్ణి కూడా ఒక మామూలు కోడిపెట్ట తాత్వికచింతనలోకి నెట్టేసే  గొప్ప టెక్నిక్ శాస్త్రి గారిది. చదివించి, కదిలించి, ఆనక పాఠకుడిలో   ఆలోచనలు  రగిలించడం   ఉత్తమ శ్రేణి కథల లక్షణాలలో ఒకటన్న  పాశ్చాత్య లక్షణకారుల సిద్ధాంతం ఆమోదనీయమే   అయితే శాస్త్రిగారి అన్ని కథల్లా ఈ కథ కూడా నిస్సందేహంగా ఉత్తమ శ్రేణి కిందకే రావాలి  మరి.

అన్నిటికి  మించి ఈ  కథలో రచయిత గడుసుగా దాచిన మరో విశేషం. . మరణం తాలూకు  బహుముఖాల ముసుగులు  తొలగించే ప్రయాస.     గంప కింద ముడుచుక్కూర్చుని తాత్విక చింతనలో పడ్డ     కోడిపెట్టలాగానే   చల్లని చావు పిలుపు చప్పుడును మనమూ ఆలకించి అదిరిపడతాం. అదే  పెట్ట బతుకు చివరి మలుపుగా కూడా భావించేస్తాం  .  పీక నులుముడు బాధను ఎదుర్కొనేందుకు సిద్ధమై రెక్కల్లో నుంచి మెడను పాములా పైకి లేపి   భగవంతుడి మీది పగతో ఎర్ర బడ్డ  కళ్లను ఇటూ అటూ తిప్పి చూసినప్పుడు కోడిపెట్ట చావును అలకించేందుకు    మన మనసూ  ఆవేదనతో సిద్ధంగా ఉంటుందా ! ఊహించినకోడి  పెట్ట చావుకు బదులుగా ఊహించని నక్క చావును   మెరుపులా  మన మనసు మీది కొట్టి మతి పోగొట్టేస్తాడు గడుసు రచయిత ! 


కోళ్లగూటిని మూతితో, కాళ్లతో పై కెత్తి పెట్టను కరచుకుపోయే చివరి ప్రాక్షన్ ఆఫ్ సెకనులో  ఆ నక్క  మీద పచ్చని బాణాకర్ర  కత్తిలా మెరవడం, వరస మెరుపులతో  నక్కచావు రూపంలో మృత్యువు మరో కోణంలో మన కళ్లకు భీభత్సంగా కొట్టేస్తుంది! ఎంతటి  కఠినాత్ముడి గుండెనైనా బరువెక్కించే ఆ బాధాకర   క్షణాలలో ఒక క్షణమైనా చదువరని నిలువనీయడు రచయిత.. విచిత్రంగా!   అసందర్భంగా అందాల చందమామ, డాబా మీది వెన్నెలలో ప్రియురాలి సిల్కు చీర రెపరెపల చల్లగాలి, మొనలు దేలిన జోడు గుండెలతో మతిపోగొట్టే అవేవో వాటితో   పోలికలు, జీబుగా పెరిగిన తుమ్మ మొక్కలను  నీలి ముసుగుల మేల్వంశపు అభిసారికలతో ఉపమానాలు! పడుచు భార్యలు సరసాలకు పోతే మణుకులు పడిపోయినమొగుళ్లులా  చీకట్లో  బండరాళ్లు పడి ఉంటాయనడానికి నక్క అంత  నిర్దాక్షిణ్యమైన చావు  చచ్చిన దుర్ముహూర్తమే దొరికిందా రచయిత మహాశయుడికి  ! ? తన కథ చదివే పాఠకుడి పట్ల ఇంతలా వేళాకోళమవసరమా? అని రచయితను తిట్టిపోయాలనిపించాలి నిజానికి!తమాషాగా అట్లా  తిట్టుకునే  వ్యవధానం కూడా ఇవ్వకుండా అంతకు మించిన మరో   విషాద ఘట్టం  అందుకునేస్తాడా మహానుభావుడు!  నక్కపిల్లల కథ ముక్తాయింపుగా ఎత్తుకుంటాడు మహా గడుసుగా!  


కనిపించని తల్లి కోసం బెంగటిల్లి తడిగా, భయంగా, ఆకలిగా ఉన్న బుజ్జిపిల్లలకు వెన్నెల  తడిలోని రుచి, చల్లని గాలిలోని హాయి ఆకలి తీర్చడం లేదని చెప్పి జాలి కలిగిస్తాడు.అనాథపసికందుల మీద . తీరని ఆకలితో ఎంతకూ కనిపించని తల్లి జాడ కోసంగాను కష్టమొస్తే ముందు దేవుడిని ప్రార్ధించాలన్న కనీసం ఇంగితం కూడా బలపడని   కారణంగా తల్లి కోసం మాత్రమే యేడిచి యేడిచి అలిసిపోతాయా  పసికూనలు అని అనడంతో మన మనసంతా చేదయిపోతుంది   ! ఎంత ఏడ్చినా కడుపు నిండదు కాబట్టి మూడు కూనల్లో ఒకటి మొండి ధైర్యం చేసి  బొరియలో నుంచి కొంచెం పైకి ఎగబాకి, ముందు కాళ్లను బొరియ అంచున పెట్టి, ఆకలి తీర్చే ఏకైక జీవి తల్లి కోసరంగా కనిపించినంత మేరా భూలోకమంతా  పరికించి చూసి. . చూసి .. అలా చూస్తూనే ఉండిపోయిందంటాడు రచయిత .  ఏ అకలి తన చేత అపాయకరమైన ఆ దుస్సాహసం చేయించిందో అదే ఆకలి మరో జీవి .. కొండచిలువ నోట్లో నుంచి కడుపులోకి మెల్లగా లాగేసుకుందని చల్లగా రచయిత ముక్తాయించడం ఎంత విషాదం?!  .  ఎందుకు పుట్టినట్లోనంటూ మనసులో   అంతర్మధనం ఇంకా మొదలు పెట్టక  ముందే మిగతా నక్కపిల్లలు కూడా అదే దారిలో  కొండచిలువ నోరు అనే మృత్యు గహ్వరం ద్వారా సృష్టిలో  లయించుకు పోయినట్లు రచయిత ముక్తాయింపు! రక్తం కక్కి స్పృహ  తప్పిన నక్క కొనవూపిరి కొనసాగింపు స్మృతిలోకంలో ఊపిరి ఆగి కదలిక నిలబడే తుది శ్వాస  వరకూ మనోనేత్రం  అవనికపై  కదలాడిన చిత్రాలను రచయిత కవిగా మారిపోయి చిత్రించిన విధానం శాస్త్రిగారి కథలలో కామన్ గా కథను హృదయంగమంగ మార్చేస్తూ   కథాశాస్త లక్షణాలకు ఎక్కడా అందదు!  ఎండల్లో నల్లకొండనీడ , వెన్నెల్లో పైరు పచ్చగాలి, పొలాల్లో చెరకు తీపితోట , అంతకంటె ముందు అంత కంటె తల్లిపాలతీపి, మొత్తని తల్లి మూతి ముద్దు, ఆనాటి అమ్మ వెనక పరుగు, ఓనాడు మొదటి సారిగా రుచి చూసిన మొదటి కోడి ఉప్పటినెత్తురు, తియ్యటి మాంసం, మేకల్ని వేటాడిన రోజులు, తన తొలి ప్రియుడి వాడి కోరచూపులు, ప్రేమతో వాని మొత్తటి కరుపులు, కసితో అతడి వేడి కౌగలింతలు ( నక్కలు కౌగలించుకుంటాయా ?   అన్న అనుమానం కూడా రానీయడీ కవి కాని కవిరచయిత ! ), తన కడుపులో మొత్తటి శిశువుల బరువులు, తన  ప్రసవం, తన వేదన , తన పిల్లల అరుపులు వినిపించగానే తన చెవుల్లో పులకరించిన స్వర్గమే తన  గుండెలలో నుంచి పాల ధారగా ప్రవహించిన వైనం, పిల్లలతో తన ఆటలు, వాటి కోసం తాను పడ్డ యాతనలు, దుర్మార్గులతో తన పోట్లాటలు ( నక్క దుర్మార్గమైనదని మన నిర్ధారణ అయితే- ( టక్కరిగా భావించే నక్క  జాతికీ దుర్మార్గులు కొందరు తప్పలేదన్న మాట! ఎవరో ? బహుశా మన మనుషులమే అయివుండనోపు! లేకపోతే మొదటిసారి  మనిషిని చూసినప్పుడు రచయిత చెప్పినట్లు దానికి ' జుగుప్స  ' ఎందుకు కలుగడం ? ! తమ జాతి వారే అయినప్పటికీ మనుషులకు లొంగిపోయిన కుక్కలలో తన కాట్లాటలు, పూల వాసనలు, పాముల పడగలు , వానా జల్లులు , పందుల వికృతాలు, చల్లని గాలులు, నల్లని   మబ్బుల రంగుల విల్లులు , వెండిమబ్బుల వెలుగులు, ఆకలితో తన పరుగులు ( మళ్లీ ఆకలి ! ), అలసటతో తన పడకలు, ( ఈతి బాధలు వదలడం లేదు! ), అనుక్షణం ఆనందాలు, అనునిత్యం భయాలు, ఆకలి కోసం తను చేసిన హింసాకృత్యాలు  , ఎల్లప్పుడూ రక్తపాతాలు, ఓహో .. అరె.. ఏమిటిది? ఎందుకిది? ఎక్కడిది ? నన్నెందుకు  పుట్టించావు? ఎందుకిలా చంపుతున్నావు? ఎన్నెన్ని ఆశలు కల్పించావు? ఎన్నెన్ని పాపాలు చేయించావు? ఎన్నెన్ని హింసలు పెట్టావు? పెట్టించావు? ఎన్ని హింసలు ఎన్ని హింసలు! నాకెందుకీ పుట్టుక? ఎందుకీ చావు ? ఏమవుతారు దిక్కుమాలిన నా పిల్లలు? ఏ హింసలు.. ఏ హింసలు.. చావు పుట్టుకల అర్థరాహిత్యాన్ని గూర్బి   లక్షసార్లు నిలదీస్తే ఆ బాధ్యుడెవడో సమాధానం  చెప్పకోలేక గుడ్లుతేలవేయడంలాంటి ఆలోచన లేమన్నా  ఊహకొచ్చాయో  ఏమో..బాధతో  చచ్చి పోతూ కూడా నవ్వబోయి నవ్వు సగంలో ఉన్నప్పుడు చివరి శ్వాస కూడా పూర్తిగా  పోయిందేమో .. మిగిలిన అరనవ్వు అట్లాగే చచ్చిపోయిన నక్క పెదాల మీద ముద్రలాపడి మహా ముచ్చటగా వుంది నక్క ముఖం. తనయుల పాపాలకు తండ్రులు అనుభావించాలన్న సూత్రమే నిజమైతే .. తాను చేసిన పాపాలన్నింటికీ ఆ దేవుడే శిక్షలు అనుభవించాలన్న ఆలోచనా వచ్చి చచ్చిపోయ నక్క మొకంలో ఆ చిరునవ్వు మెరిసి  ఉండాలి.  నక్కలో అర్థాంతరంగా ఆగిపోయిన అంతర్మధనం  చదివే పాఠకుడిలో మొదలవడానికి రచయిత కవిత్వ౦ బాట పట్టి  యమ జిమ్మిక్కులన్నీ చేయడం చూడొచ్చు మనమిక్కడ. 

దిక్కులేని చావు చచ్చి జాతి పుట్టించిన నక్క  .. అవతల దాని పిల్లలూ కంతిరి లోకం ముఖమింకా కన్రెప్పలెత్తి చూడనైనా చూడక మునుపే మెత్తంగా చావు కంతలోకెళ్లి కనుమరుగవడం చేత - మరింత జాలి పుట్టించే నక్క చావు వీరన్న పెళ్లాం బిడ్డల మొహాల్లో మాత్రం సూర్యకాంతిలో మామిడి మొక్కలంత ప్రకాశం కలిగించాయ్! వీరన్న  కైతే  నక్కబారిన కాకుండా కోడి తన బారిన పడ్డందుకు చచ్చే ఆనందంగా ఉంది. ఆనందంతో అతగాడా ఎర్రరంగు పులిమిన తెల్లకోడిని గుండెలకు అదుముకున్నప్పుడు ఆ చావు స్పర్మకు కోడి భగభగ ఎండలో వడవడ వణికింది ! కోడి ఓనరు వీరినాయుడును వెంట బెట్టుకొనొబ్బిన పోలీసోడుతో కలిసి తన్నెత్తుకొచ్చిన దొంగ వీరన్న పోతున్నప్పుడు రాత్రల్లా నిద్ర లేని  కోడిపెట్ట ' కొత్త పరిణామం అర్ధంకాక, భగవంతుడి సృష్టిని అర్థం చేసుకునే ప్రయత్నమే పాపం' అని తీర్మానానికొబ్బి కళ్లుమూతలేసుకుని పడుకునేసింది.

ముక్తాయింపుగా శాస్త్రి గారు, రేపు ఎక్కడో ఒకప్పుడు ఎవరింట్లోనో ఒకరింట్లో చచ్చి చెడి పలావు అయిపోతుందని తేల్చేస్తాడు రచయిత. 

- కర్లపాలెం హనుమంతరావు 


20-08-2021 


బోథెల్, యూ. ఎస్. ఎ 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...