Tuesday, December 21, 2021

ఈనాడు - గల్పిక మేరా భారత్ మహాన్ రచన - కర్లపాలెం హనుమంతరావు ఈనాడు - ప్రచురితం - 26-10- 09


 


ఈనాడు - గల్పిక


మేరా భారత్ మహాన్


రచన - కర్లపాలెం హనుమంతరావు 

ఈనాడు - ప్రచురితం - 26-10- 09


ఏంవాయ్  వెంకటేశం, ఏంటలా టీవీకి అతుక్కుని కూర్చున్నావ్? పెరేడ్  వస్తుందా? ప్రెసిడెంట్ గారి స్పీచి వింటు న్నావా? మేడం గారు ఏ శారీ కట్టు కొస్తుందో చూసి మీ అక్కకు కొనిద్దావనే! దిస్... ఐ థింక్.. ఎండాఫా ల్ ఇండియన్ వ్యాల్యూస్.. అనగా మన భారతీయ విలువల అంతిమ దిన మన్న మాట. అంతిమదినం కాదు... గణతంత్ర దినమంటావ్... సరే.. అలాగేకానీయ్!


గంట నుంచి ఆ టీవీ చూస్తున్నావు గదా! ఏదీ, గణతంత్ర దివస్ అంటే ఏంటో వివరంగా చెప్పూ .. చూతం! సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్కా! ఆ ముక్క తెలుగువాడివి... తెలుగులో ఏడవ్వచ్చు గదా! తెలీదా... నోట్ బుక్ .తీసుకో..రాసుకో! కులాతీత మతాతీత సర్వసత్తాక ప్రజాతంత్ర స్వతంత్ర రాజ్యం. ఇది తెలుక్కా దా? తెలివిమీరిపో యావోయ్ మై బోయ్!


సర్సరే .. వదిలేయ్... మన కంట్రీ స్పెసాలిటీస్... అనగా ప్రత్యేకతలేంటో అవన్నా తెలుసా! జనాభాలో చైనా కాక మన తర్వాతే ఇంకెవరైనా! పరెగ్జాంపుల్ ... మీ ఇంట్లోనే చూసుకో... మీ నాయనా, అమ్మా, బుచ్చెమ్మా, నువ్వూ, నీ, చెల్లెలూ, మీ మామ మైరావణుడు... ఆయన శిష్యుడు. వుపరి ఇప్పుడు నేనూ, ఒక్కింట్లోనే సెట్విన్ బస్సునిండే జనం ఉన్నామా... అందుకే థర్డువరల్డులో మనదేశందే తడాఖా ! శ్రీమాన్ ఒబామాగారు కూడా ఎప్పుడో వప్పేసుకున్నారోయ్ బాబ్జీ ! మరో తమాషా చూసావూ... ముఫ్ఫైయ్యొక్క స్టేట్లూ, ఆరువేల కులాలూ, మరో నాలుగొందలపైన ఉపకులాలూ, అందులో సగం మతాలూ, మూడు కోతులూ, ముక్కోటి దేవతలూ, పదహారొందల భాషలూ, ముప్పై మూడు పండగలు, తొమ్మిదొం దల ఆరు పార్టీలు, పార్టీకో రెండు అజెండాలు.. ఇంకో రహస్య అజెండా. . ఆఖరికి ఒక్కో ఓటుకి రెండేసి రాష్ట్రాలూ.... ఒక్కదాంట్లోనైనా మచ్చుక్కి ఏకత్వం లేకపోవటమేనోయ్ మన భిన్నత్వంలోని విచిత్రం! మన దేవుళ్ళక్కూడా మనుషులకు మల్లే మోర్ దేన్  టూ వైవ్స్ ఉండాలాయె! అటు కాశ్మీర్నుంచీ ఇటు కన్యాకుమారి దాకా ఒక్క విష యంలో మాత్రం మనవాళ్ళంతా ఘట్టిగ ఒక్కపట్టు మీద నిలబడుతున్నారోయ్ ! అదేంటంటావూ! ఆఖరికి చెప్తాగానీ... ఇప్పటికైతే మీ మామ పంచాగ ప్పొదిలో దాచిన పొగాకు పొయొకటి పట్రా... ఫో... పొయెట్రీ తన్నుకొచ్చేస్తుంది! 


నౌ బ్యాక్ టు పాయింట్! మన ప్రత్యేకతల గురించి మరో ముక్క చెప్పేదా! గుండుసున్నా కని పెట్టింది మనమేనోయ్ సన్నాసి! ఆ సంగతి సమస్తానికి  తెలియాలనే గదా జెండా మధ్య బండిచక్రంలా పెట్టి మరీ రెపరెపలాడించేస్తున్నాము! చక్రం తిప్పటంలోని చాణక్యమంతా శ్రీకృష్ణుడి నుంచీ లాగేసుకున్నారోయ్ మన లీడర్లు! 


మనరాజ్యాంగంలోని మరో చిత్రం చెప్పనా! ఇంత పెద్ద ఇండియాలో ఇంకేం లేనట్లు కాన్స్టిట్యూషన్ మొత్తం రెండొందలిరవైఐదు పేజీలూ చైనా ఇంకుతో రాయించేసారు మనసార్లు.... ఏ ఇండి యనింకో యూజు చేయచ్చుగదా!... ఊహూ... మనవాళ్ళకి మొదట్నుంచీ పరాయి సొమ్ముమీదే కదా పరమ మోజు! లేకపోతే నైరుతివైపున్న సముద్రానికి అరేబియా పేరు పెట్టుకోటమేంటోయ్! ఆగ్నేయంలో ఈవైపు నీళ్ళకు బే ఆఫ్ బెంగాలని బెంగాలువాళ్ళు పేరు పెట్టేసారు గదా! రేప్పొద్దున బెంగాలోళ్ళు... బంగలాదేశంగాళ్ళూ కొట్టుకు చేస్తారని బెంగగా వుందోయ్ ! ధరలూ, జలయజ్ఞం, అణుబాంబూ, ఆడపిల్లల మీద అఘాయిత్యాలూ, ఆర్థిక మాంద్యం, కల్తీలూ, కరవులూ, అవినీతి, పిల్లల 

ఉద్యోగాలూడిపోవటాలూ, ప్రత్యేక రాష్ట్రాలూ, సత్యం గోలా  ఇన్ని బిలియన్స్ ఆఫ్ బర్నింగ్ ప్రాబ్లమ్సుంటే ... మళ్ళీ కొత్త తకరారులు నెత్తికి తెచ్చుకోటం తెలివైన వాళ్ళు చేసే పనేనా! .. అబ్బే.. ఈ చుట్ట అంటుకోటం లేదోయ్ .. ఇదే పెద్ద బర్నింగ్ ప్రాబ్లం అయిందోయ్ ఇప్పుడు! 


అవునూ.. మధ్యాహ్నం భోజనం సంగతేం చేశావోయ్! అహహ.. నేనంటున్నది మీ ఇంట్లో సంగతి. మన రాజశేఖర్రెడ్డిగారిది కాదు మేన్! పొలిటికల్ ఫ్లోలో  నువ్వలా పిలవటం బిట్ నేచుర లేగానీ.. ప్రెసిడెంటు స్పీచిక్కూడా నువ్విలాగే పాలిటిక్సూ గట్రా అంటగడితే చుట్ట తిరగేసి అంటించాలని అధర్వణ వేదంలోని అయిదో అధ్యాయంలో రాసి ఉంది. తస్మాత్ జాగ్రత్త! 


 ఎలక్షన్ రోజులు గదా.. ఏ జెండా చూసినా నీ పార్టీ ఫ్లాగే అనిపిస్తుందా? 'వందేమాతరం' అన్నా వంద ఏ మాత్రం అని వినిపి స్తుందా? సహజం. జెండా పోలుకి, పోలింగుకీ సౌండులో తప్ప మరిదేని లోనూ పోలికలేదన్న కామన్ సెన్సు కోల్పోతే రాజకీయాల్లో ఇంకెలా రాణి స్తావో బోధపడకుండా వుంది. పాలిటిక్స్ అంటే ఏంటనుకున్నావోయ్? ఆర్టాఫ్  నాట్ డూయింగ్ ఎనీథింగ్... అసలేమీ చేయకుండా అన్నీ చేస్తున్నట్లు బిజీగా వుండే కళ ! అంటే మీ అగ్గిరాముడి దగ్గర ఇంగ్లీషు దంచటమన్న మాట. మనం మీ అక్కయ్యకిచ్చే హామీలన్న మాట. పార్లమెంటులో ప్రత్యక్షంగా నోట్ల కట్టలు చూపెట్టినా అబ్బే... అదేం లేదని తేల్చేసారే. దటీజ్ పాలిటిక్స్ ! 


పండుగపూట ఈ కప్పల తక్కెడ తెరవటమెందుకంటావా! ఓకే. మేరా భారత్ మహాన్... అని ఏఆర్ రెహమాన్ వరసలో పాడు కుందామా! అలాగే కానీయ్... అదిగో... అల్ల దిగో టీవీలో మన ఆంధ్రా శకటం అందరికన్నా ముందొస్తుందే ఈసారీ! అన్నమయ్యను చూస్తున్నా అదేంటో రామలింగరాజే గుర్తొస్తున్నాడు ... సారీ.. మైబోయ్! 


వచ్చేసారికైనా మనం రిపబ్లిక్ డే పండగని ఇంతకన్నా ధైర్యంగా పబ్లిగ్గా జరుపుకోవాలని ఆశిద్దామా....


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 26-10- 09) 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం శాఖాహారులు - రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 10 - 05 - 2010 )


 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

శాఖాహారులు 


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 10 - 05 - 2010 ) 


పరమ భక్తులకు తప్ప దేవుళ్లు అందరికీ కనబడరు. ఆదాయానికి మించిన ఆస్తులున్నవాళ్లదీ అదే బాపతు.  ఏ ఏసీబీ దాడులో జరిగేదాకా మన మధ్యనే మహరాజుల్లా తిరుగుతున్నా వీళ్లు  మామూలు మనుషులకు కనపడరు. 


మీ ఉద్యోగానికేమండీ బాబూ మూడు పూవులూ... ఆరు కాయలూ అని యాష్టపడతారుగానీ, వట్టి పూలు ఏం చేసుకొంటాం? 


కట్టుకున్న భార్యే కాసులు వాసన చూడనిదే- తలుపు గడియ తీయని రోజులివి. నల్లపూసల నాంతాడు. ఒకటి మెళ్ళోవేసి పంపిస్తే పిల్లను కళ్ళకు అడ్డుకుని తీసుకెళ్ళే అల్లుళ్ళున్న కాలమా ఇది! కాలం అలా కాలిపోయింది. 


నాలుగు రాళ్ళు వెనకేయకపోతే మోయడా నికైనా ఓ నలుగురు ముందుకురాని కాలమిది. పచ్చనోట్లు పది ఉంటేనేగదా ఎవరి బతుకైనా ఈ రోజుల్లో పచ్చగా ఉండేది!


ఈ చరాచర సృష్టిలో సంపాదించే స్థిర చరాస్తులే మనిషికి కడదాకా మిగిలిపోయే స్మృతి చిహ్నాలు. తాజ్ మహాల్  కట్టించిన షాజహాన్ పేరును ఇప్పటికీ చెప్పుకొం టున్నాం. తరువాత తరాలవారికి ఏవో నాలుగైదు వందల కోట్ల విలువైన ప్లాట్లు, ఫ్లాట్లు వంటివి నాలుగు పాట్లు పడి సంపాదించి పెట్టినందుకే ఇంత అల్లరి తగునా? 


ధనవంతుడి తరవాతే గదా భగవంతుడైనా! రామకోటి నోటు బుక్కు.. రూపాయల నోట్ల కట్ట పక్కపక్కనే పెట్టి ఒక్కటే తీసుకోమంటే కోటికి ఒక్కడైనా రామకోటి కోరుకుంటాడా? 


పళ్ళెంలో రూపాయి బిళ్ళ చూస్తేనేగానీ గుళ్లో పూజారయినా  మనసారా శఠగోపం పెట్టడం లేదే! ఏదో సందు దొరికినప్పుడు చాయ్ పానీకోసమని ఓ నాలుగైదువందల కట్టలు నొక్కితేనే తప్పని గగ్గోలు పెడితే ఎలా? 


ఊరకే వచ్చిందా ఈ సర్కారు ఉద్యోగమైనా? ఎన్నెన్ని దక్షిణలు, ప్రదక్షిణాలు ! 


పోనీ... పనికి ఆహార పథకమేమన్నా ప్రభుత్వాలకు కొత్తా! పాపం సర్కారైనా అంతంత మందికి ఆహారమెలా సరఫరా చేస్తుందని? ఆ ఉపాధి పథకమేదో స్వయంగా కల్పించుకుని తంటాలు పడుతుంటే దానికి ఇన్నిన్ని రాద్ధాంతాలా?


'చేదుకోవయ్యా!  మమ్మేలుకోవయ్యా! ' అంటూ పనిమీద వచ్చినవాళ్లే బల్లల కింద డబ్బు సంచులు పెట్టి బలవంతపెడుతుంటే చేదుకోకుండా చేతులు ఊపుకొంటూ కూర్చోవడం చేతగానితనం అనిపించు కోదూ! అయినా డబ్బెవరికి చేదు? చిత్తశుద్ధని చేతులు ముడుచుకు కూర్చుంటే బుద్ధిలేని మగడని తాళి కట్టించుకున్న భార్య కూడా ఎగతాళికి దిగుతుంది. 


ఏదొచ్చినా  సరే శుద్ధినీళ్లిన్ని చల్లి జేబులో  వేసుకొస్తేనే గదా- 'మా ఆయ 'బంగారం' అని భార్యామణైన మురిసిపోయేది! 


తినమరిగినవాడికి నోరు తిరగని మాట నిజాయతీ . నిబద్ధత బద్ధకస్తుల నిఘంటువు పదం. శాఖాహారులకే తప్ప శాకాహారులకు సరిపడని వ్యహారాలివి. 


జీతగాళ్లందరూ మేతగాళ్ల కాలేదు. అన్ని నోటు పుటప్పు'లకు టపుటప్పుమని నోట్ల కట్టలు రాలిపడవు. భరతఖండంబు పాడియావని ముందు కని పెట్టింది తెల్లవాడే అయినా, పాలు పితికే కళలో రాటుదేలింది మాత్రం .. ఎందుకులేండి నా నోటితో చెప్పడం బాగుండదు!


కొన్ని కొలువులంటే- అల్లాఉద్దీన్ అద్భుత దీపాలు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం చాతగానివాళ్ళు ఇంకా ఈ దేశంలో నూటికి ముప్ఫై అయి దుమంది ఉన్నారని అవినీతి నిరోధక్  శాఖ అనడం నిజంగా బాధ కలిగిస్తోంది. ఎలాగూ ఏసీబీ దాడులు సాగుతు న్నాయి గదా! నీతిపరుల జాబితా నిగ్గు తేల్చి వారి స్థానంలో 'మామూలు'  వాళ్లకు అవకాశం కల్పిస్తేతప్ప అంతర్జాతీయంగా మన పరువు నిలబడేటట్లు లేదు. 


స్వతంత్రమొచ్చి ఇన్ని దశాబ్దాలు దాటినా, ఇంకా ఏమిటండీ అవినీతి దేశాలు జాబితాలో మన ర్యాంకు మధ్యలో ఉండటం ! ఎక్కడైనా బావా అనుగానీ... ఆఫీసులో 'బావా అనొద్దు'  అనే నిబద్ధతున్న దేవుళ్ళే దండిగా కావాలిప్పుడు! 


అవినీతి లేనిదెక్కడ?' అని సన్నాయి నొక్కులు నొక్కగానే సరిపోదు. అది సత్యమే అనే విధంగా మనం ఎప్పటికప్పుడు చర్యలూ తీసుకుంటూ ఉండాలి గదా!


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 10 - 05 - 2010 ) 





ఈనాడు - చిన్న కథ - హాస్యం - వ్యంగ్యం మీటమీద రాతలు.. రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 07-05-2009 )


 


ఈనాడు - చిన్న కథ - హాస్యం - వ్యంగ్యం 


మీటమీద రాతలు.. 


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 07-05-2009 )


పట్టువదలని ఓటరు విక్రమార్కుడు ఆటకమీది నుంచి పాత పత్రికలని  దించి ఏ పార్టీకెక్కవ ఓట్లు, సీట్లు వస్తాయో లెక్కలు వేస్తూ కూర్చున్నాడు. 


ఓ పత్రికలోని బేతాళుడు ' ఓటరయ్యా!  దేశమంతా ఇంకా ఎన్నికల యాగం జరుగుతూనే ఉంది. అప్పుడే నీకి  లెక్కల యావ ఎందుకు? నీలాంటి ముగ్గురు  పెద్దమనుషులు తమ పార్టీల స్కోరు తెలుసుకునేందుకు పడిన తాపత్రయం గురించి చెబుతా విను' అంటూ ఇలా చెప్పసాగాడు.


రాష్ట్రంలో రెండు దశల ఎన్నికలూ పూర్తయ్యాయి. 


తమ తలరాత ఎలా మారబోతుందోనన్న దిగులుతో నేతలకు నిద్దర కరవైపోయింది. 


ఓపిక బొత్తిగా లేని ఓ ప్రధాన పార్టీ పెద్ద నాయకుడు చీకట్లో ఓటింగు యంత్రందాకా పోయి, స్కోరు తెలుసుకుందామని మీట నొక్కబోయాడు. 


యంత్రంలోనుంచి భూతం అమాంతం బైటికొచ్చి అడ్డం పడింది. 


' ఎన్నికల కోడ్ ఉంది . మే పదహారు దాకా ఆగటం అందరికీ మేలు' అని హితవు చెప్పింది. 


' నన్నెవరూ ఆపలేదు. అపాలనుకున్నవాళ్లు అయిపు లేకుండా పోయారు. ఆపైన నీ ఇష్టం' అని బెదిరింపులకు దిగారు ఆ రాజుగారు. 


భూతం తన భవిష్యత్తునూహించుకుని స్వైన్ ఫ్లూ  వచ్చినట్లు వణికి పోయి అంది ' సరే రాజా ! ఐదు ప్రశ్నలు అడుగుతాను. నిజాయతీగా సమాధానాలు చెబితే ఈ యంత్రం నిజం స్కోరు చెబుతుంది.' 


' అడుక్కో అడిగినన్నీ  చెబుతాను.. అడగనివీ  చెబుతాను. ఐతే మీడియా మాత్రం ఉండకూడదు' అన్నారు రాజుగారు. 


' సరే సార్!  అధికారంలోకి రాగానే మీరు ముందు సంతకం చేసేది  దేనిమీద ? ఉచిత కరెంటు ఫైలుమీదా, బకాయిల మాఫీ పత్రం మీదా? ' 


' రెండింటి మీదా  కాదు.  ప్రమాణ స్వీకార పత్రం మీద' 


' నిజంగానే మీది దేవుని పాలనేనా? ' 


' జగన్ మీద ఒట్టు .  'జగన్' అంటే దేవుడునేగా అర్ధం! '


'భయమంటే ఏమిటో కూడా తెలీదా? ' 


' తెలుసు . కేవిపి  లేకుండా ఒకసారి ఢిల్లీ వెళ్లాను. చాలా భయపడ్డాను' 


చంద్రబాబు, చిరంజీవి, కెసిఆర్ ఎదురుగా ఉన్నారనుకోండి .  రెండుసార్లు


తిట్టమంటే, ఎవరిని వదిలేస్తారు? ' 


' చిరంజీవిని .. కెసిఆర్ ని ' 


గ్రీన్ లైటు వెలిగింది.


' సార్!  మీ సమాధానాలన్నీ మిషనుకి తెగ నచ్చాయి. లోపలికి పోయి మిషన్‌   మీట నొక్కండి. ఈ ఎన్నికల్లో మీ పార్టీకొచ్చే సీట్ల సంఖ్య మీకే తెలు స్తుంది. చీకటి .. జాగ్రత్త' అంది భూతం. 


లోపలికెళ్ళొచ్చిన రాజావారి మొఖం మతాబులాగా వెలిగిపోతోంది.


' కాంగ్రెస్ .. కాంగ్రెస్'  అంటూ పంచ సవరించుకుంటూ ఆ పెద్దమనిషి


అటు వెళ్లాడో లేదో భూతం ఎదుట బాబుగారు ప్రత్యక్షం. 


 అంతా చూస్తూనే వున్నాము. ఈ అన్యాయాన్నెంత మాత్రం సహించే సమస్యే లేదు. నా ఆఖరి చివరి రక్తపు బొట్టు వరకూ... '


'బాబుగారూ అంత పెద్దమాటలెందుకు సార్ ! మిమ్మల్నీ ఓ ఐదు ప్రశ్నల


అడుగుతాను. మనసులోని మాట మాత్రమే చెప్పండి! ' 


వ్యూహాత్మకంగా ముందుకడుగు వేసింది భూతం.


' మేము సిద్ధం. మరి మీడియావారు సిద్ధంగా ఉన్నారా?' 


' వస్తారుగానీ.. ముందీ ప్రశ్నకు జవాబు చెప్పండి!  పులిరాజావారికి  ఎయిడ్సొస్తుందా? ' 


' కచ్చితంగా వస్తుంది. పులివెందుల రాజావారికి రోజుకి కోటి రూపాయల ఎయిడ్ వస్తుందని  మేం రికార్డులతోసహా ప్రూవుచేయటానికి సిద్ధంగా ఉన్నామని మనవి చేసుకుంటున్నాను'


' సార్, సార్! అడిగిందానికి మాత్రమే సమాధానం చెప్పాలి. మీ రెండో ప్రశ్న . 


' రాజశేఖరరెడ్డి'  నారా.... అంటే మీరు, నారాయణ, రాఘవులు, కె. చంద్రశేఖర రావు..  వీళ్లల్లో కామన్‌గా వున్నది ఏది? చిరంజీవిలో లేనిది ఏది? స్పష్టతా? అనుభవమా? రెండూనా? ఇంకేమన్నానా? ' 


' అన్నీ. అన్నింటికన్నా ముఖ్యమైనది ' రా ' అనే అక్షరం .. అని మన .. 


' .. అర్జంటుగా జవాబు చెప్పండి! బాలకృష్ణ మీ పార్టీలోనే ఎందుకు చేరాలి? ' 


' కాంగ్రెసులో చేరితో  వట్టి  కృష్ణ. ప్రజారాజ్యంలో చేరితే మెంటల్ అవుతాడు.  కనక ' 


కలరు టీవీ, తెలంగాణా,  మూడో కూటమి.. ఈ మూడింటినీ ఒక్క వాక్యంలో చెప్పండి! ' 


' కొంచెం ఇష్టం.. చాలా కష్టం'


' ఎవరు అధికారంలోకొచ్చినా ఏమీ చేయలేనిది ఏది?' 


' హైదరాబాదులో ట్రాఫిక్ కంట్రోల్' 


గ్రీన్ రైటు వెలిగింది. 


భూతం నోరు విప్పేలోగానే ' తెలుసు.  ఆ చీకట్లోకి పోయి మిషనెక్కాలి. మీట నొక్కితే మా పార్టీ కొచ్చిన సీట్ల సంఖ్య తెలిసిపో తుంది. అంతేగదా! ' అంటూ లోపలికెళ్ళి క్షణంలో బైటికొచ్చేశాడు బాబుగారు .. రెండు చేతులూ గాల్లోకెత్తి రెండేళ్ళు అపకుండా ఆడించేస్తూ. 


దబ్బుమని శబ్దం. 


భూతం ఎదురుగా మెగాస్టార్. '  సారీ:. ' మార్పు'  కోసం గోడ దూకి వచ్చా . నేరుగా మేటర్లోకొచ్చేద్దాం. కమాన్ ; విసురు నీ మొదటి ప్రశ్న!  ఇరగదీస్తా! '  


భూతం భయాన్ని దాచు కుంటూ అడిగింది.


'మీద బిసి పార్టీనా? ఏసి పార్టీనా? ' 


'మనలో మన మాట. బైట బి. సి .. లోపల ఏ.సి . నెక్స్ట్  క్వశ్చన్? ' 


' సీఎం అయితే ముందు మీరు చేసే ఘనకార్యమేంటి? ' 


'  సింగిల్ టేకులో ప్రమాణస్వీకారం చించేస్తా' 


' వైయస్ పాలన స్వర్ణయుగమా? ' 


' యస్ ఇసకతో కూడా బంగారంలాగా బిజినెస్ చేసేశారు గదా! ' 


' రైలు ఇంజను గుర్తు దేనికి గుర్తు? అది రాకపోతే మీ ఆల్టర్నేటివ్ గుర్తు? 


' రైలు . ఆల్వేస్ లేటుకి. అందుకే లేటుగా వచ్చింది మా పార్టీ . నీ రెండో ప్రశ్నకు జవాబు వీణ ' 


' సమాధానాల్లో స్పష్టత లేదే! ఓకే!  మీ పార్టీలో నెంబరు వన్ మీరా? మీ అరవిందా?' 


'నేనే' అంటూ ముఖం ముసుగు తీసేశాడు అరవింద్. '  సారీ! ప్రచా రంలో మా బావ గొంతు జీరపోయింది. అందుకే నేనొచ్చింది' అంటూ భూతం చెప్పకముండే చీకటి గదిలో కెళ్ళి వచ్చాడు. 


అంత చీకట్లోనూ. అతని ముఖం వెలిగిపోతోంది.


--- 


' ఓటరూ కథ విన్నావు కదా ! రాజావారికీ , చంద్రబాబుకూ,  చిరంజీవికీ .. ముగ్గురికీ ఓటింగ్ మిషన్‌ 160.. 160.. 160 .. చూపించింది . అసెంబ్లీలోని మొత్తం సీట్లు 234. మూడు పార్టీలకూ కలిపి నాలుగొందల ఎనభై ఎలా వచ్చాయి? సమాధానం తెలిసీ చెప్పకపోయావో బియ్యం ధర కిలో ఇంకో ఇరవై రూపాయలు పెరిగినంత ఒట్టు! ' అంది భూతం బెదిరింపుగా,


'ఇందులో తెలీకపోవటానికేముంది? వాళ్ళు చీకట్లో నిద్రమత్తులో ఎక్క నొక్కిన మిషన్ డమ్మీ ఓటింగు యంత్రం . పాల్‌ గారొచ్చినా , జేపీగారొచ్చి ఎక్కి నొక్కినా, బిజెపి ఎక్కి నొక్కినా ..  అది చెప్పే జవాబు ఒక్కటే. నూటఅరవయ్యే!  


' మే పదహారు తరువాత బైటపడేదే ఒరిజినల్ ఓటింగ్ తేల్చే స్కోరు '  అన్నాడు ఓటరు. 


బేతాళుడు  మళ్లీ పాత  పేపర్లో దూరేశాడు! 


- రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 07-05-2009 ) 


ఈనాడు - సంపాదకీయం ప్రాణభయానికి పగ్గాలు రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 01 - 05 - 2011 )

ఈనాడు - సంపాదకీయం 


ప్రాణభయానికి పగ్గాలు 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 01 - 05 - 2011 ) 


దుఃఖాలలో  కెల్లా  మరణం భయంకరమైంది. 'మరణమను లేతనుడి చెవింబడినయంత/ దలిరు గాలికి శుష్క పత్రమువోలె' గడగడ వణకడం- మానవ బలహీనత. 'మనుజుడై పుట్టి మనుజుని సేవించి/ అనుదినమును దుఃఖమందనేలా? ' అని అన్నమాచార్యుల వంటి మహానుభావులు ఎందరు ఎన్ని వందలసార్లు వేదాంతాలు వల్లించినా ప్రాణంమీది తీపి  అంత తొందరగా పోయేది కాదు. నది, సముద్రం కడకు ఒకటే అయినట్లు కాలప్రవాహానికి జీవితం, మృత్యువు రెండు పాయలు. చనిపోవడం అంటే ఉచ్ఛ్వాస  నిశ్వాసాలు, కాల పంజరం నుంచి శాశ్వతమైన ముక్తి పొందడం- అంటాడు ఖలీల్ జిబ్రాన్. ఎవ రెన్ని సుద్దులు చెప్పినా గడిచిపోయే ప్రతిక్షణం కాలవాతావరణ కేంద్రం మరణమనే తుఫానుకు హెచ్చరికగా ఎగరేసే ప్రమాద కేతనం సంఖ్యను పెంచుతూనే ఉంటుందన్నది మనిషి దిగులు. రేయింబవళ్లు చీకటి వెలుగులు, ఇంటాబైటా, ఏ జీవీ, ఏ యుద్ధం, ఏ ఆయుధం తన మరణ కారణం కారాదని హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడిని  వరం కోరింది ఈ మృత్యుభీతితోనే.  ఆ మరణభయంతోనే మార్కండేయుడు మారేడు దేవుడి శరణుజొచ్చాడు. మహాసాథ్వి సావిత్రి సాక్షాత్ సమవర్తినే బురిడీ కొట్టించింది. భర్త ఆయుష్ చంద్రికలను మృత్యుకేతువు మింగేసిందని  దేవతల చిరాయువు కోసం కచుడు పడిన ఆరాటమే మృతసంజీవనీ విద్య కధ. అమరత్వ సిద్ధికి జాతివైరం కూడా మరచి సురాసురులు క్షీరసాగర మధనానికి పూనుకొన్నారు. దేవదానవులదాకా ఎందుకు- ఎంగిలి మెతుకులు ఏరుకుని తినే కాకులూ తమలో ఒకటి పడిపోతే కావు కావుమని గగ్గోలు పెడతాయి. జీవరాశులన్నింటిలోకీ తనది అత్యున్నతమైన జన్మ అని నమ్మే మనిషిని జీవితం మిథ్య అనుకొమ్మంటే అంగీకరిస్తాడా? పోయినవాడూ తిరిగి ప్రాణాలతో వస్తాడేమోనన్న ఆశతో గ్రీకులు మూడురోజులు, రోమన్లు ఏడురోజులు శవజాగారం చేసేవారు. పార్థివదేహం ప్రాణం పోసుకుంటుందేమోనన్న చివరి ఆశతో దింపుడు కళ్ళెం  పేరిట మహాప్రస్థానం వేళా మృతుడిని ఆత్మీయులు ముమ్మార్లు పేరుతో పిలిచే ఆచారం మనది. 'కన్ను తెరిస్తే జననం/ కన్ను మూస్తే మరణం/ రెప్పపాటే కదా ఈ పయనం' - అని తెలిసినా ఈ ప్రయాణం నిరంతరాయంగా అలా కొనసాగుతూనే ఉండాలని కోరుకోవడమే జీవనపోరాటం. ఆ ఆరాటమే మృత్యుంజయత్వంపైకి మనిషి దృష్టిని మళ్ళించింది.


ఆరాటం ఆలోచనాపరుణ్ని విశ్రాంతిగా ఉండనీయదు. ఖాళీ గిన్నెను ముందేసుకుని డీలా పడేవాడే అయితే, పొయ్యిమీది గిన్నె మూతను కదిలించిన శక్తితో మనిషి ఆవిరి యంత్రాన్ని ఆవిష్కరించగలిగేవాడు కాదు. సుఖంకోసం వెంపర్లాటే లేకపోతే ఇంకా పక్షి ఈక లను చెట్టు మానులనుంచి స్రవించే ద్రవంలోనే ముంచి తాళపత్రాల మీద గిలుకుతుండేవాడు. ఆరుద్ర ఒక చిత్రంలో చెప్పినట్లు- మాన వుడు శక్తియుతుడు, యుక్తిపరుడు. దివిజ గంగను భువికి  దింపిన భగీరథుడు. సృష్టికి ప్రతిసృష్టి చేయగల విశ్వామిత్రుడు. 'ఎంత లెక్క తిరిగినా నేమి లేదురా/ చింత చేసి చూడకున్న వింతలేదురా' అంటూ వీరబ్రహ్మేంద్రస్వామి తత్వాలు పాడారు. నిజం. ఆ కాల జ్ఞాని ప్రబోధించినట్లు- మూల మూలలా శోధిస్తేనే ముక్తి ఆ మూల నున్న జ్యోతిని ముట్టిస్తేనే బతుకులో వెలుగు.  అది తన ప్రాణజ్యోతి  అయినప్పుడు అది అఖండంగా కాంతులీనుతుండాలని మనిషి కోరుకోవడం అత్యాశ కాదుగదా! శరీరం శిథిలమైపోయింది. జుట్టు నెరిసిపోయింది. పళ్లన్నీ ఊడిపోయి నోరు బోసిపోయింది. వృద్ధుడై కర్ర సాయంతో నడుస్తున్నాడు. అయినా జీవితేచ్ఛ మనిషి శరీరాన్ని విడవడం లేదు' అని సంస్కృతంలో ఒక శ్లోకముంది. శాస్త్రవేత్తలూ తమ వంతు కర్తవ్యంగా చావు  పుట్టుకల గుట్టుమట్లను ఇప్పుడు శాస్త్రీయంగా బట్టబయలు చేసే కృషిలో తలమునకలుగా ఉన్నారు.


ఆజన్మ బ్రహ్మచారి నారదుడు ఒకసారి జన్మ రహస్యాన్ని గురించి 'ప్రారంభాది వివేకమెవ్వ డొసగుం! ప్రారంభ సంపత్తి కాధారం బెయ్యది! / యేమిహేతువు? ' అని అడిగాడట. మనిషి   దేవాంతకుడు   కదా! అందుకే 'సర్వానుసం/ధానారంభ విచక్షణత్వమ' నే      జీవరహస్యం అంతుచూసి కాలాంతకుడిగా మారాలని కంకణం కట్టుకున్నాడు. జన్యువుల కోడ్ తిరగరాయడం ద్వారా జరామరణాలను నియంత్రిం చవచ్చన్నది ఆధునిక విధాత  సిద్ధాంతం. ఇటీవలి టైమ్స్ పత్రిక ముఖచిత్ర కథనం ప్రకారం- కంప్యూటర్ పరిజ్ఞానం, బయోటెక్నాలజీ లను జోడించడం ద్వారా జీవి ఆయురారోగ్యాలను కోరుకున్న విధంగా పొడిగించుకోవడం సాధ్యమే. సింగ్యులారిటీ విభాగంలో ప్రసిద్ధులైన అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త రేమండ్ కర్జల్, బ్రిటిష్ బయాలజిస్ట్ అట్రే డి గ్రే మరో రెండు దశాబ్దాల నాటికి మానవ మేధను మించిన సూపర్ కంప్యూటర్లు రంగప్రవేశం చేస్తాయంటున్నారు. వాటి సాయంతో మానసిక చైతన్యాన్ని చిప్స్ రూపంలోకి మార్చుకోవచ్చని చెబుతున్నారు. నానోటెక్నాలజీ సాయంతో ఈ చిప్సు ను  మనిషి మెదడుకు అనుసంధానిస్తే శరీరంలో అంతర్గతంగా ఏర్పడే రుగ్మతల మూలాలను ఆదిలోనే పసిగట్టి సరిచేసుకోవచ్చని ఆ శాస్త్రవేత్తల భావన. పరిశోధనలు ఫలిస్తే మనిషి మృత్యువును జయించడానికి మరో మూడు దశాబ్దాలకు మించి సమయం పట్టకపోవచ్చని ఆశ. 'అన్నా! చావనని నమ్మకం నాకు కలిగింది/ చావు లేదు నా' కని కవి తిలక్ లాగా జనం ఎలుగెత్తి చాటే రోజులు నిజంగానే రాబోతున్నాయేమో! తేనెలేని తేనెపట్టు లాగా మనిషి మారకుండా ఉంటే చాలు. చావులేని ఆ లోకం నిజంగానే అప్పుడు నేలమీదకు దిగివచ్చిన నాకంలాగా వెలిగిపోదూ!


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 01 - 05 - 2011 ) 

Monday, December 20, 2021

అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఈనాడు - గల్పిక అమ్మకు వందనం రచన- కర్లపాలెం హనుమంతరావు ( 08 - 05 - 2010 న ఈూడులో ప్రచురితం )


 


అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా 

ఈనాడు - గల్పిక


అమ్మకు వందనం 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( 08 - 05 - 2010 న ఈూడులో ప్రచురితం ) 


ప్రేమకు తొలి చిరునామా అమ్మ! తల్లి ఒడే శిశువుకు మొదటి గుడి .. బడీ . 'మాతృదేవోభవ'  అని తైత్తరీయం సూక్తి,


ఎవ్వనిచే జనించు జగము.... అంటూ సందేహపడిన జీవుడు- పరమేశ్వరుడే ప్రాణాధారానికి మూలకారణమని సమాధానపడినా ఆ వ్యక్తి శక్తిని మాతృమూర్తిలో  సంభావించుకున్నదాకా సంతృప్తి చెందలేకపోయాడు.


ప్రపంచంలోని ఏ దేశంలోనూ... తల్లినీ, దైవాన్నీ వేర్వేరుగా చూడటం లేదు. పరివ్రాజకుడు పరమహంస కాళిని 'మాత' అని తప్ప సంభావించలేదు. గొప్ప తల్లి లేనిదే గొప్ప బిడ్డ ఉండే అవకాశం లేదు. అవతారపురుషుడు శ్రీరామ చంద్రుడిని  ' కౌసల్యా సుప్రజా రాముడ'ని విశ్వామిత్రుని వంటి జ్ఞాని సంబోధించడం వెనక ధర్మమర్మమిదే!


భక్తుల కోసం భగవంతుడు ఎత్తిన అవతారాలు పది. పిల్లలకోసం తల్లి ఎత్తే అవతారాలు కోకొల్లలు. బిడ్డకు అమ్మ నడిచే ఓ భగవద్గీత, బైబిల్, ఖురాన్.  లోకంలోని నవ రత్నాలు, మణిమాణిక్యాల పోగునొకవైపు పేగుబంధాన్ని మరో వైపు ఉంచి ఒక్కదాన్నే ఎంచుకోమంటే ఏ తల్లయినా మొగ్గు చూపేది తన కడుపుపంట వైపే !


ఏటికేడు ప్రపంచ వింతలు మారిపో వచ్చు - కానీ తల్లి ప్రేమ మాత్రం సృష్టి ఉన్నంతవరకూ చెక్కు చెదరకుండా సాగే అద్భుతం. భువనభాండాలను చిన్ని నోట చూపిన కృష్ణమాయ సైతం యశోదమ్మ పుత్ర వాత్సల్యం ముందు తన్మయత్వంలో తేలిపోయింది. త్రిలోక పాలకులను చంటి పాపలుగా మార్చిన అనసూయ అమ్మ కథ సర్వలోక విదితం. తను కన్న బిడ్డనే ' ననుకన్న తండ్రీ! నా పాలి దైవమా!' అని పలవరించేదాకా వామనుడి తల్లి ప్రేమ పొంగులు వారిందంటే వింతేముంది? అగాధాల అడుగులనైనా తడిమి చూడగలమేమోగాని అమ్మ ఆత్మీయానురాగాలకు పరిధులు వెదకడం ఎవరి తరం? మైత్రీధర్మాన్ని బుద్ధ భగవానుడు తల్లిప్రేమతో పోల్చి చెప్పింది ఎల్లలెరగక పారే ఆ వైశాల్యం  వల్లే! తల్లిలేని పాప రెప్పలేని కంటిపాప.  పాల్కురికి సోమనాథుడు బసవపురాణంలో అమ్మలేని ఆదిదే

వుడి దయనీయస్థితిని బెజ్జమహాదేవి ద్వారా కళ్ళకు కట్టించాడు. ' తల్లి గల్గిన పేల తపసిగానిచ్చు / తల్లి కల్గిన ఏల తలజడల్గట్టు? / తల్లియున్న విషంబు ద్రావనేలనిచ్చు/- అంటూ సాంబయ్యనే తన సంతుగా భావించి ఆ పిచ్చి తల్లి తల్లడిల్లిపోయింది. అమ్మ విషయంలో మనిషి దేవుడికన్నా అదృష్ట జాతకుడనే చెప్పాలి. అందుకేనేమో 'అమ్మ ఒక వైపు... దేవతలంతా ఒకవైపు ఉన్నప్పటికి  తాను అమ్మ వైపే మొగ్గుతానని ఓ కవి తన భావోద్వేగాలను చాటుకున్నారు. అమ్మతనంలోని కమ్మదనానికి నిలు వెత్తు ధనాలూ దిగదుడుపే. 'శివరాత్రి యాత్రకై శ్రీశై లమెడుతుంటే/ అమ్మమ్మ మారుపడ అమ్మ ఏడుస్తుం టె/ అదిచూచి నవ్వానురా దైవమా, అనుభవిస్తున్నా నురా!' అని కన్నతల్లి మీద గత శతాబ్దారంభంలోనే ఓ కవి స్మృతిగీతం ఆలపించాడు . 'అరువది యేండ్లు నాదగు శిరోగ్రమునెక్కిన తల్లి కంటికిన్/ జిరతను గాకపోనియది.. విచిత్రము' అంటూ జాషువా వంటి కవికోకిల గళమెత్తి మాతృస్తోత్రం చేశాడంటే ఆ మహాత్మ్య మంతా మాతృత్వా నిదే.  తండ్రి ఆజ్ఞ మేరకు తల్లి తల తెగనరికినా, ఆ తల్లే తిరిగి సజీవంగా రావాలని భార్గవ రాముడంతటి అవతారమూర్తి కోరుకున్నాడు.  మాతృమూర్తిత్వంలో అంత  ఉదాత్తత ఉంది. 


సృష్టిలో అతిపెద్ద ఉద్యోగం అమ్మగిరీ! తరగని పిల్లల ప్రేమానురాగాలే ఆమెకు జీతభత్యాలు. ' పిల్లల్ని పెంచడంకన్నా సర్కస్ కంపెనీ నడపటం సులభం' అంటాడో రచయిత. నవమాసాలు మోసి, రక్త మాంసాలను పంచి పోషించిన బిడ్డ ఈ లోకం నుంచి అర్ధాంతరంగా తప్పుకొంటే తల్లిగుండె ఎంతగా తల్లడిల్లుతుందో చెప్పనలవి కాదు. 'కన్నబిడ్డ ఒంటిమీదేకాదు, ఆత్మమీద కూడా సంపూర్ణాధికారం జన్మదాతదే' అన్నారు శంకరాచార్యులు. సన్యాసం పుచ్చుకునేముందు తల్లి అనుమతి తప్పనిసరి అని చెబుతుంది శాస్త్రం.


ఏ బాధకలిగినా అమ్మను తలచుకుని ఉపశమనం పొందే బిడ్డకు- ఆ తల్లికే బాధ కలి గించే హక్కు ఎక్కడిది ? తన కడుపు నలుసు లోకం కంటిలో నలుసుగా సలుపుతుంటే ఏ తల్లి మనసూ ప్రశాంతంగా ఉండదు. పెరుగు తున్న వ్యాపార సంస్కృతిలో అమ్మడానికీ, కొన డానికి ఈ భూమ్మీద ఇంకా అతీతంగా ఏదైనా ఉన్నదంటే , అది అమ్మ ప్రేమ మాత్రమే ! 


అమ్మ పట్ల క్రమంగా పెరుగుతున్న నిరాదరణ మానవతకే మాయని మచ్చ.  ఇప్పుడు పెరగవలసింది వృద్ధాశ్రమాల సంఖ్య కాదు. వృద్ధులైన తల్లిదం డ్రులమీద బిడ్డల శ్రద్ధ.  పూలు, పున్నములు, సూర్యోదయాలు, ఇంద్రధనుస్సులు- సృష్టిలోని అందమైన వస్తువులన్నీ సముదాయాలుగానే లభ్యమవుతాయి. ఒక్క అమ్మ మాత్రమే మినహాయింపు. 


ప్రేమకు తొలి చిరునామానే కాదు, చిట్టచివరి చిరునామా సైతం అమ్మే! అంతరించిపోయే జాతుల జాబితాలోకి అమ్మ చేరిపోకుండా జాగ్రత్తపడవలసిన అగత్యాన్ని గుర్తించాలి నేటితరం . 


ఏటా జరుపుకునే అంతర్జాతీయ మాతృ దినోత్సవాలైనా  ఆ సత్సంకల్పానికి ప్రేరణ కలిగిస్తే అమ్మ జన్మకు అంతకుమించిన సార్ధక్యం ఏముంటుంది?


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( 08 - 05 - 2010 న ఈూడులో ప్రచురితం ) 

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక ' ఆత్మ' కథ రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 18- 12- 2010 )


 ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక

' ఆత్మ' కథ


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 18- 12- 2010 ) 


ప్రతిదానికి, ప్రతివాడూ ప్రతివాడినీ ఆక్షేపించాడు ఎక్కువయి 

పోయిందీ మధ్య మన రాజకీ యాల్లో. 


 ఆ మాటకొస్తే రామాయణంలో కూడా  రాముణ్ని అందరూ దేవు డని కొలిచిందీ లేదు. శంభూకుడు, మంధర, కన్నతల్లికన్నా మిన్నగా చూసుకున్న కైకేయి, కాకి, రజకుడు- రాముణ్ని ఈసడించిన సందర్భాలున్నాయి. 


మందిసొమ్ముతో మందిరాన్ని కట్టించి, కారాగారంపాలైన కంచెర్ల గోపన్న- 'ఎవ డబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా!' అంటూ నిలదీశాడు. 


ఆత్మను కూడా ఆ శ్రీరాములవారిలా భావించే సంప్రదాయం మనది. అంతలావు రాములవారే అంతలేసి నిందలుపడగా లేనిది... అంతరాత్మకు మాత్రం మినహాయింపు ఎందుకు ఉంటుందీ! అందులోనూ రాజకీయరంగంలో!


అసలు ఆత్మలకు అంతలేసి రాజకీయాలు అవసరమా అనే ప్రశ్న ఉండనే ఉంది. ఇందిరమ్మే ఆ రోజుల్లో వి.వి.గిరిని రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిపించడానికి 'అంతరాత్మ'ను తట్టిలేపుకొచ్చింది. 


ఆత్మగౌరవానికి భంగం వాటిల్లిందని అనుకున్నప్పుడల్లా నేతలు ఉద్యమాలు చేశారు. ఓదార్పు యాత్రల పేరుతో ఊరేగింపులూ చేస్తున్నారు.


కొంతమంది మంత్రులైతే ప్రమాణ స్వీకారం సందర్భంలో దేవుణ్ని, రాజ్యాంగాన్నీ తోసిరాజని ' అంతరాత్మ'  సాక్షిగా ప్రమాణాలు చేస్తుంటారు. అంటే అర్ధమేమిటి? అంత రాత్మ రాజ్యాంగేతర శక్తేనని బహిరంగంగానే ప్రకటించటమేగదా! దేవుడికన్నా అంతరాత్మే గొప్పదని అర్థంకదా? ఒకవిధంగా ఆ రెండు ముక్కలూ నిజమేనేమో!


దేవుడు అన్నీ చూస్తుంటాడు. వింటుంటాడు. కానీ పెదవి మాత్రం విప్పుడు. కాబట్టి వికీలీక్సుకిలాగా భయపడాల్సిన పని ఉండదు. వీలున్నప్పుడు విరాళాలు ప్రకటించుకుంటే చాలు.. వ్యవహారం సరళమైపోతుంది. 


అంతరాత్మతో వ్యవహారం అల్లా చెల్లదు . గమ్మున ఊరుకోదు, గోల పెడుతోందని దానిచేత గోడ కుర్చీ వేయించలేం. అంతరాత్మ క్షోభ పడలేకే అంతలావు ధర్మరాజూ 'అశ్వత్థామ హతః కుంజరః' అంటూ అబద్ధంలాంటి నిజం చెప్పాల్సి వచ్చింది. ఇక దాని గోల తట్టుకోవడం మామూలు మనుషులు తరమయ్యే పనేనా? 


ఆత్కక్షోభను తట్టుకోలేకే కొంతమంది టికెట్టిచ్చి గెలిపించిన పార్టీకి 'రాం రాం' చెప్పేసి, పనులు చేసి పెట్టే పక్షంలోకి టైం చూసి ఠక్కుమని గెంతేస్తుంటారు. సంతకాలు లేని రాజీనామాలు సభాపతులకు పంపుతుంటారు. 


తప్పుడు పనులు చేస్తున్నప్పుడు చప్పుడు కాకుండా చూస్తూ కూర్చునుండే అంతరాత్మ- ఆ దొంగతనాలు గట్రా  ఏ స్ట్రింగ్ ఆపరేషన్లో ఆపరేషన్లోనో బయటపడగానే క్షోభిం చడం మొదలు పెడుతుంది. నాన్ బెయిలబుల్ వారంట్లు రాకుండా నానాతంటాలు పడుతుం టుంది. దొంగ గుండె నొప్పులు చెప్పి ఆసుపత్రి పడకలమీద వేడి తగ్గిందాకా ముసుగుతన్ని పడుకోవాలని చూస్తుంది. 


ఆత్మలూ దేహాలూ ఒకటిగా మసిలి వ్యవహారాలు ఎన్ని సాగించినా, కాలం చెడి దేహం దూరమైతే- పాడు 'ఆత్మ పడే క్షోభ ఆ పరమాత్ముడికైనా అర్ధం కాదు! 


ఆత్మ కాలదు, చిరగదు, నల గదు, తడవదు, మాయదు .. అంటూ గీతలో పరమా త్ముడు ఎంతగా ప్రబోధించినా... ఆత్మకూ ' కాలే' సందర్భాలు కొన్ని ఉంటాయి. గిట్టనివాళ్లు తిట్టిపో స్తున్నప్పుడు అలిగి ఆ ఆరోపణలు అబద్ధమని తేలేంతవరకు తిరిగి దేశంలోకి కాలు పెట్టనని శపథాలు  చేస్తాయి. అయినా, ఆత్మలకు కాళ్లుంటాయా అని అడగద్దు . 


రావణ వధ అనంతరం పట్టాభిషిక్తుడైన రాములవారు భక్తజనులకు వరప్రదానాలు చేయాలనుకుని సతీసమేతంగా కొలువయ్యారట. భక్తులను క్రమబద్దీకరించే బాధ్యత హనుమంతులవారికి అప్పగించారు. వరాలు కోరడానికి జనా లెవరూ రాములవారిదాకా రావటంలేదు! ఒకటీఆరా వచ్చినా, వట్టి నమస్కారాలు పెట్టేసిపోతున్నారు! విషయం విచారించమని లక్ష్మణస్వామిని  పురమాయించారు సీతమ్మవారు. మరిది చెప్పిన మాటలు వినగానే ఆమెకు కోపమొచ్చింది. అడిగిన వారందరికీ హనుమంతుడే వరాలిచ్చి అటునుంచి అటే పంపేస్తున్నాడట' ఆవాటా అంటూ . శపించ బోయిన భార్యను వారించి, ఆనక ఆంతరంగికంగా అసలు రహస్యం బైటపెట్టారు శ్రీవారు. 'వచ్చిన వారు కోరదగినవి, కోరదగనివీ అడుగుతుంటారు. ప్రసాదిస్తే ఒక ఇబ్బంది. ప్రసాదించకపోతే మరో ఇబ్బంది. అందుకే, ఆ పాపపుణ్యాల భారం నేనే హనుమ మీదకు వదిలేశాను. హనుమ నేను వేరువేరు కాదు. నేను దేహమైతే... అతడు నా ఆత్మ' అని సెలవిచ్చారు. ఈ పురాణం ఎంతవరకు పుక్కిటిదో చెప్పలేంగానీ, ఈ మధ్యదాకా మనమధ్య ఒక 'మహానేత, ఆయన అనుంగు దూత రామ హనుమల మాదిరిగా మసిలిన మాట మాత్రం నిజమే కదా! 


ఇప్పుడా రాంబంటునే 'గుండెలుతీసిన బంటు' అంటున్నారు. వెంటనే ఉద్వాసన పలకవలసిందే' నంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఇది సాధ్యమా! 


అప్పాజీలేని రాయల రాజ్యం ఉంటుందా? చాణక్యులవారిని చంద్ర గుప్తుడు- ఛీ ... పొమ్మని చీదరించుకోగలడా?


ఆత్మ అంటే శరీరానికి సలహాదారే కదా! దేహం తిరిగిన దారులన్నీ అంతరాత్మకు కొట్టిన పిండైనప్పుడు- ఆ అంతరాత్మను అంత తేలికగా వదిలించుకోవడం వీలయ్యే పనేనా? తల్లిపేగుతో బంధం పుట్టినప్పుడే తెగుతుందిగానీ, అంతరాత్మతో సంబంధం పుడకల తరవాత కూడా  పోయేది కాదు. 


అన్ని తలలున్న రావణా సురుడు సలహాలు చెప్పే తమ్ముణ్ని దూరం చేసుకున్నందుకు ఏ దుర్గతి పాలయ్యాడో తెలిసి, ఏ కొత్త ప్రభుత్వమూ పాత సలహాదారుల్ని అంత తొంద రగా వదిలించుకోదు. వదిలించుకోలేదు. 


ఇన్ని చెబుతున్నారు... జీతంబత్తెం లేకపోయినా పక్కన చేరి ఊరికే సలహాలిస్తోందని ఎవరైనా జీతం మొత్తం నొక్కేస్తున్న జీవిత భాగస్వామికి విడాకులి స్తున్నారా? ఇదీ అంతే! 


కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 18- 12- 2010 ) 


ఈనాడు హాస్యం - వ్యంగ్యం స్త్రీ సూక్తం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 07-03-2009)


 


ఈనాడు హాస్యం - వ్యంగ్యం 

స్త్రీ సూక్తం 


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 07-03-2009) 


'న స్త్రీ  స్వాతంత్ర్య మర్హతి' అన్నవాణ్ని ఇస్త్రీ చెయ్యాలి అంది మా ఆవిడఇంటి దుస్తులు  ఇస్త్రీ చేస్తూ కసిగా.  


చలంగారి పుస్తకమేదో చదివినట్లుంది. ముందామెను చల్లబరచడం ముఖ్యం.


' మొన్నీమధ్యే కదంటోయ్ మన ఏఆర్ రెహమాన్ ఆస్కారందుకుంటూ ' మా! తుఝే సలామ్' అన్నాడు. మన చిరంజీవి తిరుపతి సభలో తన తల్లిని ఎన్నిసార్లు తలచుకున్నాడూ! మనదేశంలో ఆడాళ్ళకు దక్కే మంచీమర్యాద మరెక్కడా  దొరకదు తెలుసా?' అన్నాను.


'మర్యాదా, మన్నా! పబ్బులో పడి ఆడపిల్లలకు పబ్లిగ్గా బడితెపూజ చేశారే మీ మగాళ్ళూ!  ప్రెస్ క్లబ్బులో ' లజ్జ ' రాసినావిడను తరిమి తరిమి కొట్టలేదూ! ప్రేమించలేదంటే యాసిడ్ పోస్తారూ! పార్కులో తిరిగే పిల్లలకు బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తారూ! పుట్టేది ఆడబిడ్డని తెలిస్తే అబార్షన్లు చేయిస్తారు. అదనంగా కట్నం తేలేదని కిరోసిను పోసి కాల్చే కిరాతకులండీ మీ మగాళ్ళూ!' 


'అదేంటోయ్! ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ... ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతీ- అని రాసినాయన మగాడే కదా! కంటే కూతుర్నే కనాలి... పెళ్ళాం చెబితే వినాలి అని సినిమాలు తీసిన వాళ్ళు ఆడాళ్ళా?  ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవుళ్ళు సంచరిస్తారు అని కదా మన పెద్దాళ్ళు అన్నారూ!'


'ఆ దేవుళ్ళ సంగతే చెప్పాలి... ఒకాయన పెళ్ళాన్ని అడవులకు  తోలేశాడు. ఇంకోదేవుడు ఆడాళ్ళ బట్టలు కాజేశాడు. వేలాది పెళ్ళాలుంటే మగాళ్ళకు గొప్ప అప్పు తీర్చటానికి ఆలిని తాకట్టు పెట్టాడా హరిశ్చంద్రుడు. మగాడికి ముక్కోటి దేవ తలుంటే, ఆడదానికి అదనంగా ప్రాణంమీదకింకో దేవుడు... పతిదేవుడు. ఆడది వాడికి పనికి దాసి... సలహాకి మంత్రి... భోజనానికి తల్లి.. పడకకి రంభ-  అలాపడుండాలని చెప్పిన ఆ పెద్దాళ్లు మగాడు ఆడదానితో ఎలా మసలుకోవాలో మాత్రం చెప్పారు కాదు.' 


' ఎందుకు చెప్పలేదు? '


' తల్లో పూలున్నాయని తలలో గుజ్జులేని ఫూల్నేం కాదు. జడేసుకున్నంత మాత్రాన జడపదార్ధమైపోలేదు నేను. చట్టసభల్లో మీ మగ ఎంపీలు చేసే రభస మాకర్థం  కాదనుకోవద్దు. మా జుట్లు ముడేసుకుంటూ పోతే భూగోళాన్ని మూడుసార్లు చుట్టి రావచ్చు. అయిదొందల పైచిలుకుండే పెద్దసభలో మహిళా ఎంపీలు అయిదు పదులకు మించి లేరు. ఆకాశంలో సగమంటారు. భూమ్మీద అంగుళం చోటివ్వరు. మూడోవంతు రిజర్వేషన్లకోసం మా ఆడాళ్ళు బిల్లు పెట్టమంటే మీ మగ ఎంపీలంతా కలసి ఆడిన ఆట ట్వంటీ20 కన్నా ఉత్కంఠగా సాగింది. ఈ ఇరవైఒకటో శతాబ్దిలో జాకెట్లు చేసుకొనే హక్కుకోసం అడవుల్లో ఆడాళ్ళు గోడుపెడుతున్నారండీ! రాకెట్లో ఆడాళ్ళు చంద్రమండలం దాకా వెళ్లొస్తున్నారని చంకలు గుద్దుకుంటే సరా ! స్త్రీ హింసకు పాల్పడే దేశాలింకా నూటముప్పైదాకా ఉన్నాయని..  అందులో మనది వందోదని లెక్కలు చెబుతున్నాయయ్యా మహానుభావా! '


' ఇంటిపని మానేసి ఇలాంటి కాకిలెక్కలు తీస్తూ కూర్చున్నావా? ' 


' నేనింట్లో ఒకరోజు చేస్తున్న పని మూడు గాడిదలు వారం రోజులు చేసే చాకిరికి సమానం. మీరాఫీసులో ఫేనేసుకుని నిద్దరోతూ చేసే పని ప్రకారం చూస్తే నా జీతం ఈ ఇంటి ఖరీదుకన్నా రెట్టింపు ఉంటుంది. నీళ్ళకోసం, రేషన్ కోసం , పిల్లల బడికోసం, నేను నడిచే దూరానికి రథం ముగ్గేసుకుంటూపోతే ఎవరెస్టు శిఖరం రెండుసార్లు ఎక్కి దిగి రావచ్చు. ' 


' నిజం చెప్పద్దూ... నాకూ ఇంక రోషం ఆగలేదు.' 


' ఇందాకట్నుంచీ వింటున్నా. ఏదేదో అంటున్నావు. ఇందిరాగాంధీని ప్రధాని చేసింది మేమే . మదర్ థెరెసా మా దగ్గరికొచ్చిన తరువాతే సెయింటయింది. అటు అనీబిసెంటు, విజయలక్ష్మీ పండిట్, సరోజినీ నాయుడు నుంచీ ఇటు సోనియాగాంధీ, జయలలిత, మాయావతి దాకా అందరూ ముఖ్యులూ, ముఖ్యమంత్రులూ అయింది మా మగ జమానాలోనే! అరబ్ దేశాల్లో మొన్నటిదాకా ఆడాళ్ళకు ఓటుహక్కు ఉండేది కాదు. మన దగ్గర ఒక మహిళ రాష్ట్రపతి కాగలిగింది'


' రాష్ట్రపతి అనడమెందుకు? రాష్ట్రమాత అనొచ్చుగా?  మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. మాతృభాష అంటుంటారుగానీ మాతృస్వామ్యం అంటే సహించలేరు. ఆడదంటే అంత అబలా! మీ మగాళ్ళు అటూఇటూ వాయించే తబలా?' 


'అలుసైతే రైళ్ళల్లో ప్రత్యేక బోగీలు, బస్సులు, బస్సులో సీట్లు, సినిమా హాలు క్యూలు, టీవీల్లో సీరియళ్ళు ఎక్కడ చూసినా మీకేవేవో ప్రత్యేక రియా ల్టీషోలు ఎందుకు పెట్టిస్తాం?' 


'టాయిలెట్లు, పేరంటాలూ, సామూహిక సీమంతాలు ప్రత్యేకంగా పెట్టిస్తే అభివృద్ధి అయిపోతుందా? ఈనాటికీ కొన్ని గుళ్ళల్లో ఆడవాళ్ళకు ప్రవేశం నిషిద్ధం. నూటికి ఎనభైమంది పంజరంలో పిట్టలే. పెల్లయితే ఆడదానికే ఇంటి పేరు ఎందుకు మారాలి? మేమే ఎందుకు గాజులు తొడుక్కోవాలి? పసుపు కుంకుమలు పంచటం అవమానంగా ఎందుకు మగాళ్ళు భావించాలి? ఆడదంటే అంత అలుసెందుకు?  తొడలుంటే కొట్టుకోవాలా? మీసాలున్నది మెలిపెట్టుకోవటానికేనా? భాష ఉన్నది సభల్లో తిట్టుకోవటానికేనా? పురుష సూక్తం శ్రీసూక్తం ఒకటిగా ఎందుకు లేవు? ఆడపిల్లలకు దేవతల పేర్లు పెడతారుగానీ దేవతల్లాగా చూసుకోరెందుకు?  మీ మగాళ్ళు మగాడిని ప్లస్, ఆడపిల్లని మైనస్ అనడం ఏ సామాజిక సూత్రం ప్రకారం న్యాయం? ఎంత ఒబామా అయినా ఒక ఆడది పెంచితేనేగా అమెరికా అధ్యక్షుడైంది! ప్రేమ పిచ్చిది కనక ప్రేమించే ఆడాళ్ళంతా పిచ్చాళ్ళేనా? ఆడది ప్రాణం పెడితే ప్రాణాలు తీసే యముడితోనైనా పోరాడి గెలుస్తుంది. ప్రాణం విసిగితే కాఫీలో కాస్త విషం కలిపి ప్రాణాలు తీస్తుంది. మగాడు తోడుగా ఉంటే ఆడది నీడగా ఉండటానికి సిద్ధం. ఆడది ఉన్న ఇల్లు చిలకలు వాలిన చెట్టండి. చప్పట్లు కొడితే చిలకలు ఎగిరి పోతాయేమోగానీ చిలకల కొలికి ఎన్ని ఇక్కట్లు వచ్చినా ప్రాణం పెట్టే మొగుడిని విడిచిపోదు' అందావిడ ఆవేశంగా. 


ఓడిపోయాను. 


' ఇంతకీ ఈ ఉపన్యాసమంతా ఎందుకూ?" అనడిగాను.


'రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్వామీ! మనరాష్టంలో సగానికన్నా ఎక్కువ ఆడ ఓట్లు ఉన్నాయి. ఆ సంగతి తెలిసి ఒకాయన పావలా వడ్డీ, అభయహస్తం అంటుంటే, ఇంకో హీరో భూములూ, సబ్సిడీలు అంటున్నాడు. ఇటునుంచి రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి అటునుంచి మద్యం అమ్మి దండుకుంటున్నారు. ఠీవి  అయిన బతుక్కి కావాల్సింది ఉచిత టీవీ కాదు. ఉచితానుచితాలు తెలిసి ఓటు వేసే తెలివి - అని మా ఆడాళ్ళందరికీ తెలియాలని నా కోరిక' 


'వాహ్... వాహ్... మరి ఈ శుభసందర్భాన మా మహారాణిగారు మగమహారాజుగారిని ఏమి చేయమని సెలవు? అనడిగాను నాటక పక్కీగా.. '


' ఇవాళ రేపూ వంట చేయమని ఆజ్ఞ' అనేసింది.


రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 07-03- 2009 ) 

ఈనాడు - సంపాదకీయం ఏది స్వర్గం, ఏది నరకం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 20 -05 - 2011 )

 






ఈనాడు - సంపాదకీయం 


ఏది స్వర్గం, ఏది నరకం 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 20 -05 - 2011 ) 




ఏ రహస్య సృష్టి సానువులనుంచో జాలువారే కాంతి జలపాతం ఈ జీవితం.. జనించేదెవరి వలస చలించేదెందు కొరకు, లయించేది ఏ దిశకు అన్నీ ధర్మసందేహాలే. అసలు కిటుకు కమలాసుడికైనా తెలుసో లేదో! మానవుడు బుద్ధిజీవి. రాశి చక్రగతులలో/ రాత్రిందిన పరిణామాలలో/ బ్రహ్మాండ గోళ పరిభ్రమణాలలో/ కల్పంతాలకు పూర్వం కదలిక పొందిన పరమాణువుకా ప్రేరణకేది మూలకారణమో అంతు తేలేదాకా ప్రయాణం మానడు. అదే చిత్రం. గ్రహరాశుల నధి గమించి/ గగనాంతర రోదసిలో! గంధర్వ గోళగతులు దాటిన మనిషి ఓ వంక నెలవంకనంటివస్తాడు. మరోవంక, మరణానంతరం జీవితం ప్రశాంతంగా సాగేటందుకు చుక్కలకు ఆవలి దిక్కున ఎక్కడో చక్కని లోకాలు చక్కర్లు కొడుతున్నాయని బలంగా నమ్ము తుంటాడు. అదింకో విచిత్రం మార్గాలు, రూపాలు వేరువేరైనా స్వర్గాలు, నరకాలు అన్న భావనలు అన్ని మతాలకూ ఒకేలా ఉండటం అన్నింటికన్నా చిత్ర విచిత్రం! పుణ్యం చేసుకున్నవారు మరణానంతరం దైవదూతలుగా తేలియాడే ప్రేమారామమని యూదులు స్వర్గధామాన్ని అభివర్ణిస్తారు. 'అమృతం కురిసిన రాత్రి'లో బాలగంగాధర్ తిలక్ వెన్నెల మైదానంలోకి వెళ్ళి నిలబడినప్పుడు పాదాల తారామంజీరాలు ఘల్లు ఘల్లుమని మోగించుకుంటూ వయ్యారంగా ఆకాశమార్గాన పరుగులెత్తుతూ పరవశం కలిగించింది బహుశా అటువంటి  దేవతా ప్రేమమూర్తులేనేమో!


అమరలోకాలకు నిచ్చెనలు వేసిన కవులకు , భావుకులకు విశ్వసా హిత్యంలో కొదవ లేదు. కాళిదాసు నుంచి  మిల్టన్ దాకా, కృష్ణశాస్త్రి నుంచి  కవి తిలక్ వరకు  దివిసీమ  అందాలను గురించి పలవరించనిదెవరు? మనుచరిత్రలో అల్లసాని పెద్దన అరుణాస్పదపురం పేరును అడ్డుపెట్టుకుని చేసిన వర్ణనంతా ఆ రంగుల ప్రపంచం  గురించే.  అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ' అంటూ అమరపురి వైభోగాలను కలవరంచిన తీరుకు మునిముచ్చుకైనా కలవరం కలగక మానదు. కళాపూర్ణోదయంలో మణికంధరుడనే  గంధర్వుడు ఈ కిందిలోకపు అందాలను చూసి మనసు పారేసుకుంటాడు. మరి మామూలు మానవుడి మరులు ఆ సురలోక సౌఖ్యాలనుంచి ఓ పట్టాన మరలి రాగలవా? ' దిగిరాను దిగిరాను దివినుంచి భువికి' అని భావకవి ఊరికే మారాం చేస్తారా?! వరూధిని వంటి వయ్యారి వగలాడుల  సాముగారీడీలట  పద్మసంభవ, వైకుంఠ, భర్గసభలు. ఆ కొలువు కావాలని కోరిక లేకపోవడానికి మనసును ప్రవరాఖ్యుడు ఆవరించాలి. అదంత సాధారణమైన సాధనేనా? కాళిదాసు కల్పనలోని ఆ మేరుపర్వతంమీది కల్ప వృక్షచ్ఛాయలలో  పచ్చల పట్టు పరుపులపైన అచ్చరల  వెచ్చని ఒడి.. అమరగానం... అమృతపానం... అవో... ఏ మర్త్యయప్రాణిని ఝల్లుమనిపించవు? ఏడు ఊర్ధ్వ  లోకాలనే కాదు.. ఏడు అధో లోకాలనూ సృష్టించి పెట్టారు. పాపాల పాలును యాతనా దేహంగా మార్చి వైతరణిని తరించిన పిదప ఇరవై ఆరు రకాల నరకాల వెంట పాపిని తిప్పి పిప్పిచేసే  వైనాన్ని వైనతేయ పురాణం వర్ణిస్తుంది. 'నరకలోకపు జాగిలమ్ములు గొలుసు త్రెంచుకు' ఉరికి పడితే గుండె జారని ధీరుడెవ్వడు?  కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి బోధించినట్లు అరిషడ్వర్గాల వైరివర్గంలో చేరిపోవడమొకటే చివరి దరి . ' దైవమూ-దయ్యమూ, పాపమూ పుణ్యమూ, స్వర్గమూ-నర కమూ, మందభాగ్యులను ఓ మందగా మార్చేటందుకు కామందువర్గం కనిపెట్టుకున్న మత్తుమందు' అంటాడు కవి ఎమ్మాగోల్డ్. మన హేతు కవిరాజు సూత పురాణం కూడా 'మతిమాలిన కవిచంద్రులు/ గతిమా లిన వారలగుచు గడుకక యెవరో/ బతిమాలిన నల్లిన' కట్టుకథలివి అని కొట్టిపారేస్తుంది.


స్వర్గం, నరకం- మానవ మనోమందిరంలోని రెండు ఊహా లోకాలు అయితే కావచ్చు.. మరి మహనీయుల ఆ కమనీయ కల్పనల వెనకున్న తపనో?। మానవుడనే శిలను మాధవుడనే శిల్పంగా తొలిచి భువిని భువర్లోకంగా మలచాలనుకోవడం మహదాశయం కాదా? మహాభారతంలో స్వర్గారోహణం వేళ ధర్మజునితో యమధర్మ రాజు అన్నట్లు స్వర్గ నరకాలు వేరువేరుగా లేవు. తన సంతోషమె స్వర్గం, తన దుఃఖమె నరకమనే గదా సుమతీ శతక కర్త సుభాషితం! 'తృప్తిచెందని నరుని సప్త ద్వీపంబులైన చక్కంజేయునే! అక్షరంబులు నాలుగు కుక్షిలో వేసి  అ క్షరంబేదో తెలుసుకో మనసా' అని హెచ్చరించారు వేదాంతులు. నిగమంబులు వేయి చదివినా జీవిత సారం ఒంటబట్టనివాడికి ఏ ముక్తిమార్గమూ సుగమం కాదు. జీవితాన్ని చెదలపుట్టలో చీకిన ఆకులు తిని బతికే మకిలి పురుగులాగా చీదరించుకొనే వాదం ఎంత అసంబద్ధమో... విడివిడి భాగాల కలివిడితో తయారైన ఓ భౌతిక యంత్రంతో పోల్చి చూడటమూ అంతే అహేతుకం. శాస్త్ర నిఘంటువు నిర్వచనానికి అందనిదంతా అసత్యమన్న వాదనా సత్యదూరమే. క్రాంతి దర్శకులు వెలుగు చూపరు. వారు చూపిన దారిని పట్టుకుని జీవితాన్ని వెలిగించుకోవలసింది మనం. ఆ తెలివిడే జ్ఞానం. ప్రేమను మూలధనంగా పెట్టి జీవితాన్ని వ్యాపారంగా మలుపుకోవాలనుకునే బేహారులకు- లాభం  స్వర్గం, నష్టం నరకం. విజయం స్వర్గం, అపజయం నరకం. దుఃఖం నరకం, సుఖం స్వర్గం. ఠాగూర్ గీతాంజలి ప్రార్థన ప్రకారమైతే- ఎక్కడ జ్ఞానం నిత్యం వెల్లివిరుస్తుంటుందో అదే శాశ్వత స్వర్గం.  ' కాలసంక్షిప్త చరిత్ర'  గ్రంథకర్త, అయిదు దశాబ్దాల బట్టి చావుబతుకుల సరిహద్దుల వద్ద తచ్చాడుతూనే మానవ చరిత్ర పురోగతికి అసమానమైన సేవలందిస్తున్న శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ' స్వర్గం మిథ్య' అని చేసిన తాజా వాదాన్ని ఈ నేపథ్యంలోనే అర్ధం చేసుకోవాలి. మానవజాతి అభివృద్ధి కోసం  తపించే వారెవరికైనా అడుగడుగునా గుడే కనిపిస్తుంది . అందులో వెలిగే దీపం భావవాదులకు దైవం అయితే... భౌతిక వాదులకు జ్ఞానం. చూపులు వేరైనా చూస్తున్నది ఒకటే. అదే దైవజ్ఞానం, జ్ఞానదైవం. తేడా లేదు- రెండూ ఒకటే.


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 20 -05 - 2011 ) 


Sunday, December 19, 2021

ఈనాడు - హాస్యం- వ్యంగ్యం - గల్పిక నవ్వాలా .. ఏడ్వాలా రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు ప్రచురితం - 21-07-2011 )


 


ఈనాడు - హాస్యం- వ్యంగ్యం - గల్పిక

నవ్వాలా  .. ఏడ్వాలా


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు ప్రచురితం - 21-07-2011 )  


ఏడవాలో అంతుబట్టకుండా ఉందిరా! ' 


' ఏమయింది బాబాయ్.. అంత బాధ? '


'లేకపోతే ఏమిట్రా ఆదాయ వివరాలు ప్రకటించమంటే ఆ బాబా ట్రస్టువాళ్లు బస్తా

లకొద్దీ పత్రాలు ప్రభుత్వ కార్యాలయ గుమ్మంలో గుమ్మరించిపోతారా! అదే మనమంత్రివర్యులు మాత్రం సీయం అంతటివాడు గడ్డం పుచ్చుకొని బతిమిలాడినా అరఠావు కొకవైపు సగమన్నా సరైన వివరాలు సమర్పించడానికి పస్తాయిస్తున్నారు. మరి నవ్వాలా ఏడవాలా? '


' ఓా! అదా నీ బాధ... ఇంకా ఆ నిత్యానంద స్వాములవారి ప్రకటనలాంటిది చూసి తెగ ఇదైపోతున్నావని పొరపడ్డాన్లే . కరుణానిధి ఇప్పటి కష్టాలన్నింటికీ కారణం, భక్తులకు మోక్షమార్గం చూపించే తమ 'యోగశాస్త్రా' న్ని వీడియోలుగా తీసి వాడవాడలా వేడివేడి మసాలా వడల్లాగా పంచిపెట్టిన పాపమేనంటున్నారు... విన్నావా? మరి దానికి ఏడవాలా నవ్వాలా? ముందది చెప్పు బాబాయ్! ' 


' అక్కడెక్కడో జరిగే గోల మనకేల ? మనదగ్గర రోజూ జరుగుతున్న కామెడీ షో లేమన్నా తక్కువా? నిరసన ప్రకటించిన రోజే విరమణ ముహూర్తమూ ఖరారైపోతోంది. పరామర్శకొచ్చిన సందర్శకుల వినోదార్థం దీక్ష పుచ్చుకున్నవాళ్లే ఓపికలు చేసుకుని మరీ భరత నాట్యాలూ చేసేస్తున్నారు. అందుకు. ఏడవాలా నవ్వాలా- నువ్వే చెప్పు! '


'అధిష్ఠానం  ముందు ఎప్పుడూ వేసే స్టెప్పులేగదా బాబాయ్ అవి ! ప్రాక్టీసు పోకుండా ఏదో తంటాలుపడుతున్నారని సరిపుచ్చుకోవాలిగానీ, నువ్వు మరీ ఇలా అయినదానికి కానిదానికి నవ్వాలా ఏడవాలా అంటూ సందేహ పడుతూ కూర్చుంటే రోజులు గడవడం కష్టం...' 


'అరేయ్, ఆర్టీసీవాడు కిలోమీటరుకు పెంచింది నాలుగు పైసలేనని ఒకవంక చెబుతూ, మరోవంక అయిదు పైసలు బాదేశాడు ఈమధ్య.  దీనికి నవ్వాలో ఏడవాలో ముందదీ తేల్చు'


'కిలో రేషన్ బియ్యంకన్నా కిలో ఉప్పు ప్రియంగా ఉంది బాబాయ్. పార్లమెంటు క్యాంటీన్లో పూర్తి భోజనం ధరకన్నా, కాకా హోటల్లో కప్పు కాఫీ రేటెక్కువట!  రెండు గంటల ఏడుపునకు ఇరవై పెట్టడమే దండగని ఏడు స్తుంటే, సినిమా టికెట్లమీదా అదనంగా అయిదేసి రూపాయలు బాదుతున్నారిప్పుడు.  వేసిన ఏసీ చడీచప్పుడు కాకుండా ఎప్పుడు తీసేస్తారో అంతుపట్టని థియేటర్లకూ అదనంగా ఇచ్చుకోవాల్సిందే. బహిరంగంగా చెప్పి పెట్రోలు కంపెనీలవాళ్ళు అలా పరువు పోగొట్టుకుంటున్నా రుగానీ, జనం జేబులుకొట్టే కళలో ఇంత ఇంద్రజాలం చూపించొచ్చని వారు తెలుసుకోలేకుండా ఉన్నారు. '


' ఆ పాడు సినిమాలకెవరు వెళ్ళమన్నారు. ధరలు పెంచుతున్నారని ఎవరు ఏడవమన్నారు? బయట దొరికే వినోదం తక్కువా? మరీ అంతగా కితకితలు పెట్టినట్లు నవ్వుకోవాలనుకుంటే, గంటపాటు టీవీల్లో వచ్చే వార్తల్లాంటివి వింటే సరిపోదంట్రా!  మొన్న ముంబయిలో మళ్ళా వరస పేలుళ్లు జరిగినప్పుడు, భువనేశ్వర్లో భావి ప్రధాని రాహుల్ ఏమన్నారో విన్నావుగా .. ఉగ్రవాదమేమన్నా హాలీ వుడ్ వాళ్ల యాక్షన్ ఫిల్మా.. సెన్సారు దశలోనే ఆపేయించడానికి ' అనేశాడు. మరి ఆ దొరబాబుగారి తెలివికి ఏడవాల్నా, నవ్వాల్నా? ' 


'ఆయనేదో పాపం రాజకీయాలకు కొత్త తలకాయనుకో బాబాయ్ ! తలలు పండిన పెద్దలూ ఆ చిన్నయ్యగారి సుభాషితాలకు తాన తందాన అంటున్నారు. మరి దానికి ముందేడవాలో, దీనికి తరవాత నవ్వుకోవాలో నువ్వే తేల్చుకో! ' 


' సరే, అదలా వదిలేయ్. మరి రేపు ఉంటాడో ఊడతాడో తెలీని ఆ పాపిష్టి కసబ్ కంచంలో చికెన్ బిర్యానీకని అన్నేసి వేలు తగలేస్తున్న మన సర్కార్లు, వానకు నాని ఎప్పుడు పిల్లలమీద జారిపడతాయో కూడా తెలీని బడి పైకప్పులను కాస్త మరమ్మతు చెయ్యమంటే మీన మేషాలు లెక్కబెడుతున్నాయి. దానికి ఏమంటావ్. ఏడవమంటావా .. నవ్వుకోమంటావా ! "


'బడి పిల్లకాయలంటే మనకు ఎలుకలు, పిల్లులకన్నా కనాకష్టం కదా! లేకపోతే చీమలమీదా దోమలమీదా ప్రయోగాలు చేసినట్లు ఆ కళాశాల పిల్లలమీదా మందు లోళ్లు ప్రయోగాలు చేయడమేంటి? తుగ్లక్ చదువులతో సర్కారులొక వంక ప్రయోగాలు చేస్తుంటే.. మందులోళ్లు ఇలా మాయ చేసేస్తున్నారు. ముందది నవ్వాల్సిన సంఘటనో ఏడవాల్సిన విశేషమో తేల్చుకోమరి'


'మనుషులు పోయి ఎన్నేళ్ళయినా కొంతమందికి ఓదార్పు యాత్రలూ అంత ఘనంగా జరుగుతుంటాయి. మనుషులున్నా కొంతమందికి పుట్టిన రోజు నాడైనా తలచుకొని నమస్కారం పెట్టే దిక్కు ఉండదు. వందనోటు కొడితే గంటలో ఇక్కడ వేరే కులంలో పుట్టినట్లు ధ్రువపత్రాలు పుట్టించుకోవచ్చు. ఆధార్ లాంటి కార్డులకు మాత్రం ఎన్నేళ్ళు గడిచినా పట్టించుకునేవాడుండడు. ఏడవాలా నవ్వాలా? ' 


' సిని మాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ నిదానించి చూడ గలిగితే- బుచ్చెమ్మల్ని మాయచేసే గిరీశాలు బోలెడంతమంది. మామూలు మనిషి బతుక్కీ కన్యాశుల్కం నాటకానికి అట్టే తేడా లేదు. చూడటానికి అంతా కామెడీగానే ఉన్నా- లోతుగా చూస్తే మాత్రం అంతా గుండెలు పిండే విషాదమే'


'గుండె బరువెక్కే మాట చెప్పావుగానీరా అబ్బాయ్. . గుండెధైర్యం వదులుకోరాదనే నీతి ఆ నాటకంలోనే ఉంది. జీవితంలో ఎంత విషాదమున్నా ఊరికే ఏడుస్తూ కూర్చుంటే- మన బతుకే నవ్వులపాలయ్యేది. మనకూ ఓ మధ్యంతర అవకాశం రాకపోదు. మనల్ని ఇలా ఏడిపిస్తున్నవాళ్లను ఏడిపించి పంపించేయగలిగితేనే.. ఎప్పటికైనా మనమూ మనసారా నవ్వుకోగలిగేది. ఏమంటావు?"


'ఏమంటానూ, నీ మాటకూ ఏడవాలో నవ్వాలో తెలీటం లేదంటాను?


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు ప్రచురితం - 21-07-2011 ) 

ఈనాడు - గల్పిక గురువు - లఘువు కాదు ; కారాదు! - రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 05 - 09-2009 )


 


ఈనాడు - గల్పిక 

గురువు - లఘువు కాదు ; కారాదు! 

- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 05 - 09-2009 ) 



'గురువు, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటారు షిర్డీ సాయి బాబా యుద్ధరంగం మధ్య విషాదయోగంలో పడ్డ అర్జునుడికి సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైత బోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు


రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి.  శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది.  అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే.  కాబట్టే జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరువాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది. అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్ధన తరువాత ' స్వస్తినో బృహస్పతి ర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనిషి ఎలాగవుతాడు? అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన. గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు. అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు సమాజంలో గురుస్థానం అంతటి ఘనతరమైనది.  కనుకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చి ఇచ్చే శ్రమ తీసుకున్నది.


గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల తార్కాణం.  ఔరంగజేబు కూడా చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును చక్రవర్తి అయిన తరువాత దారుణంగా అవమానించాడు. క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్ ఏథెన్స్ ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్ లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురుపు కౌటిల్యుడు. కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా.


మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క.  ఇంటివరకూ తల్లే అదిగురువు.  తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు.  కాబట్టే గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే. మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కులు పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులకు  అప్పగిం చాడు . పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు బిడ్డలు విద్యాగంధంలేక అల్లరిచిల్లరగా తిరుగుతూ ఉన్నారని  వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటా నికి సాగనంపింది.


నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవి కావు. వేదాధ్య యనం తరువాత పరీక్షలు. నింబ, సారస మనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం.  సామవేదం  సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లించడం  పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు.  నింబ పరీక్ష మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి.  అది నారస పరీక్ష.  గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది. 


మన పురాణాలు, ఉపని షత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురు ప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు ' ప్రిన్స్ ఆఫ్ వేల్స్' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు. ఒకసారి చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహా ప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందు కయ్యా' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు- అని విన్నవించుకున్నాడుట . రాజు గారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రో జుల్లో గురువుకిచ్చిన విలువ!


దేవతలకూ గురువున్నాడు .. బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు . మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 


 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు.  ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని ఉంది . . భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటే గాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం  పట్టుబడలేదు. బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా శిష్యుడిని వారించే నిమిత్తం అడ్డుపడి కన్నుపోగొట్టుకున్న గొప్ప గురువు శుక్రాచార్యుడు.


గురు శబ్దం  అంత గొప్పది.  కనుకనే  మన మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపేవారు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా? ' అని అడి గితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. 


అటువంటి  గురువుకి నేటి మన సినిమాలలో  పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది. 'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు. గుండ్రాయే.  మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రామే  నిజమైన గురువు .  తాను అనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ కుర్చీలో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.


గురువులు అష్టవిధాలు . అక్షరాభ్యాసం చేయించిన వాడు, గాయత్రి ఉపదేశించినవాడు, వేదాధ్యయనం చేయంచినవాడు, శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు, పురోగతి కోరేవాడు, మతాది సంప్రదాయాలను  నేర్పేవాడు, మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు, మోక్షమార్గాన్ని చూపించే వాడు - అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టిం చుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు. దొంగలపాలు కానిది, దొడ్డ కీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది,  యాచ కలకిచ్చినా రవంత తరగనిది-  గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 05 - 09-2009 ) 

ఉప్పూ - మానవ సంబంధాలు - శ్రీరమణ ( గుత్తొంకాయకూర- మానవసంబంధాలు - నుంచి ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు



ఉప్పూ - మానవ సంబంధాలు


- శ్రీరమణ

 ( గుత్తొంకాయకూర- మానవసంబంధాలు - నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 


" నీ ఉప్పు తిని నీకు అన్యాయం చేస్తానా" అనేది చాలా పాప్యులర్ సామెత. “వాడి ఉప్పు తిని "నీ వాడికే అన్యాయం చేశాడు" అని రోజూ వినిపిస్తూ వుండే సత్యం. అందుకని ఉప్పుతో ముడిపడి బోలెడు మానవ సంబంధాలు వున్నాయి. 


మరీ పిచ్చి కోపం వస్తే "ఉప్పుపాతర వేస్తా!  నా సంగతి సాంతం నీకు తెలియదు" అనడమూ కద్దు. మనిషి జీవనానికి "ఉప్పుతో పదహారు తప్పని అవసరాలు" గా  అప్పటి మనిషి గుర్తించాడు. ఇందులో మళ్లీ ఉప్పు ప్రాధాన్యతను మనం గమనించాలి. 


మనిషి నేల, నింగి, సముద్రం, కొండ, కోన అన్నిటినీ శోధించి తనకు కావల్సినవి నిర్మొహమాటంగా లాగేసుకోవడం అనాది నుంచీ అవలంబిస్తున్నాడు. సముద్రంలో నీళ్లు ఉప్పు ఖనిజాన్ని కషాయాలుగా వున్నాయని తెలిసి, ఉప్పు కూడా వొక రుచే అని గ్రహించాడు. అక్కడ నుంచి సముద్రానికి  ఏతం వేసి ఉప్పును పండించడం మొదలుపెట్టాడు. ఉప్పును తయారు చేయడాన్ని ' ఉప్పు పండించడం'  అంటారు. అంటే దీనిని పంటగా భావించారు. మానవ సంబంధాలు చాలా గట్టివని దీనినిబట్టే అర్థం అవుతోంది. 


" ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు ..." అన్నాడు సుమతీ శతకకారుడు. "ఏటికేతామెత్తి ఎన్ని పుట్లు పండించినా గంజిలో ఉప్పెరుగుమన్నా..." అని శ్రమజీవులు గుండెలు పిండేలాగా పాడారు. "ఉప్పు మెప్పు కోరేటోల్లు తప్ప వొప్పు చేసేటోల్లం" అని మనిషి సహజ లక్షణాన్ని చెబుతూ, అందులో ఉప్పు పాత్రని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఉప్పు కారం తినేవాళ్లకు రోషం భాషం వుంటుందని వొక నమ్మకం.  ఉప్పు లేని పప్పు చప్పుగా చస్తుంది అన్న నిజాన్ని "కట్టుకున్న పెళ్లాంలా" అని పొడిగించాడు.


ఏ వంటకంలో ఎంత ఉప్పు వెయ్యాలో నలుడికి తెలుసు .. భీముడికి తెలుసు. అసలు పాకశాస్త్రం పురుష కళ. క్రమేపీ పురుషుల నుంచి ఆ కమ్మటి కళ చేజారి స్త్రీల హస్తగతం అయింది. అక్కడ నుంచి వారి చేతులు వడ్డించేవి అయినాయి. పైచేయి కూడా అయింది ఆటోమేటిక్ గా. 


వంటకాల తయారీ గురించి రాసేటప్పుడు ఉప్పు దగ్గరకు వచ్చేసరికి “తగినంత”గా అని వొక మాట వాడతారు. అక్కడే వుంది తిరకాసు. మిగిలినవన్నీ కొలతలు, తూకాలు చెప్పి, ఉప్పు విషయంలో తేల్చకుండా తగినంత అనడంలో ఫార్ములా ముడి విప్పకుండా దాటివేయడమే! ఇలాంటి చోట మానవ సంబంధాలు సఫర్ అవుతాయి తప్పదు. శ్రీశ్రీ "ఇతరేతర’ శబ్దం లాంటిదే ఇక్కడ “తగినంత" అన్నమాట. ఇంతటితో యీ ప్రస్తావన ముగించకపోతే "ఉప్పు పత్రి కాకుండా” నన్ను తిట్టే ప్రమాదం వుంది. 


ఉప్పు దిగతుడిస్తే జనదిష్టి పోతుందిట. పూర్వం ఉప్పు కల్లు, కల్లుప్పు అని వ్యవహరించేవారు. కల్లు అంటే రాయి అని అర్థం. "తిరగలి కల్లు" అంటే తిరిగే రాయి అని అర్థం. ఈ శబ్ద చర్చని మరీ తిప్పితే మానవసంబంధాలు పిండి పిండి అయిపోయే అవకాశం వుంది. 


రాత్రి పూట "ఉప్పు" అనకూడదట! "దీపాలు ఆరిపోతాయ్" అని చెప్పేది మా నాయనమ్మ. అందుకని చవి, రుచి, లవణం, బుట్టలోది అని దీపాలు ఆరకుండా ఛాందసులు జాగ్రత్త పడేవారు. ఉప్పు చేతిలో వెయ్యకు గొడవలు వస్తాయని పెద్దవాళ్లు చెప్పేవారు. అంటే మానవ సంబంధాలు చెడిపోతాయనే. దానివెనుక శాస్త్రీయ లక్ష్యం గురించి హేతువాదులు తర్కించుకుని ఏకాభిప్రాయానికి రావాలి. వారి శాస్త్రీయ పరిశోధనలను సామాన్య మూఢులకు అందించి పుణ్యం కట్టుకోవాలి. హేతువాదులు పుణ్యాన్ని, అదృష్టాన్ని నమ్మరు, కాని అనుభవిస్తారు. అసలు కరెంటు దీపాలు వచ్చాక ఉప్పు అన్నా ఉఫ్ అన్నా కొండెక్కే అవకాశం లేదని వాళ్లు వాదిస్తారు. 


ఉప్పు మీద బోలెడు సామెతలున్నాయి. చెమట కన్నీళ్లు ఉప్పగా వుంటాయి. శ్రమ, దుఃఖం యీ రెండూ మానవ సంబంధాలకు సంబంధించిన వస్తు సామగ్రిలో ప్రధానమైనవి. 'అడవిలో ఉసిరికాయ, సముద్రంలో ఉప్పు- కలిస్తే ఊరగాయ" అంటుంటారు. దీని వెనుక మొత్తం భారతీయ తత్వశాస్త్రమంతా యిమిడి వుంది. భార్యాభర్తల సంబంధం వుందనుకోండి. అమ్మాయి అమలాపురంలో పుట్టి పెరుగుతుంది. అబ్బాయి అట్లాంటాలో గ్రీన్ కార్ట్ హోల్డరు. వాళ్లిద్దరికీ పెళ్లి అవుతుంది. జాడీలో పడతారు. యిలాగ వివాహ వ్యవస్థకు ఆపాదించుకోవచ్చు. అలాగే పి.వి. ఆంధ్రాలో పుట్టి, పెరిగి రాంటెక్లో నిలిచి గెలిచి ప్రధాని కావడం వుందనుకోండి. ఇక్కడ పి.వి. వుసిరికాయ. రాంటెక్ వోటర్లు ఉప్పురాళ్లు. ప్రధాని పదవి ఊరగాయ- మిగిలిన యీక్వేషన్లు, కొటేషన్లు మీరు పూరించుకోండి. 


నిజం. ఒక పెళ్ళిలో వియ్యంకుడికి వడ్డించిన వంకాయ కూరలో ఉప్పు ఎక్కువైందని పెద్ద గొడవ అయింది. ఆడపెళ్లి వారు క్షమాపణ చెబితే గాని లాభం లేదనీ, పీటల మీద పెళ్లి ఆగిపోతుందనే దాకా వచ్చింది. చివరకు పెద్ద మనుషులు కల్పించుకుని, మళ్లీ యిన్ని వంకాయ ముక్కలు వుడికించి కూరలో కలిపి, సరిపోయిందనిపించారు. అప్పుడు గాని పెళ్లికొడుకు తండ్రి కుదుట పడలేదు. 


మన ప్రాచీన వేదాలు జాగ్రత్తగా చదివినట్లయితే “ఉప్పు”కి వొక అధిష్టాన దేవత వున్నట్లు స్పష్టం అవుతుంది. ఆవిడ నివాసం సముద్రం. దేవతలు రాక్షసులు మంధరగిరిలో  క్షీరసాగరాన్ని మధించినపుడు ఆమెకు కోపం వచ్చింది. అంతటి చరిత్రాత్మక సన్నివేశం తన వద్ద కాకుండా క్షీరసాగరంలో చేశారని ఖిన్నురాలైంది. "నేనే కనుక పతివ్రతని అయితే నా వొక్క కల్లుతో కడివెడు క్షీరము విరిగిపోవు గాక" అని శపించింది. ఆవిడ నిజంగానే పతివ్రత అవడం వల్ల యిప్పటికీ శాపం అమలులో వుంది. 


ముఖ్యంగా భారతీయులకు, ఉప్పుతో వున్న సంబంధం యింకెవరికీ వుండదు. దండి సత్యాగ్రహం, అదే ఉప్పు సత్యాగ్రహం. ఉప్పుమీద తెల్లదొరలు పన్ను వేశారని ఆగ్రహించాం. ప్రస్తుతం అదే ఉప్పు నల్లదొరల పాలనలో పెట్టుబడిదారులకు రహదారి అయింది. కోట్లాది రూపాయల వ్యాపారం నడుస్తోంది. ఇప్పుడు ఉప్పు రైతులు లేరు సాల్ట్ కింగ్స్ తప్ప. వీటన్నిటి వెనుక వున్న మానవ సంబంధాలను మీరు గుర్తించాలి. 


రక్తపోటు వున్న వాళ్లు ఉప్పు తగ్గించాలంటారు. ఏదైనా లోగుట్టు చెబితే ఉప్పు అందించాడంటారు. కొన్ని పేపర్లూ ఉప్పు అందించమని పాఠకులను కోరుతూ వుంటాయి. కొందరు అందిస్తూనే వుంటారు. బయట పడిందంటే మానవ సంబంధాలు బాగా చెడిపోతాయి. 


బాల్యంలో ఉప్పు అద్దుకుని మామిడి పిందెలు తిన్నాం. పెద్దయ్యాక ఖరీదైన బార్ కు  వెళితే చేతిమీద గంధం రాసినట్టు తడి ఉప్పు రాసి, “యిది తాగుతూ మధ్య మధ్య నాలికతో దానిని రుచి చూడండి" అన్నాడు. ఏమిటిది అంటే “చకిటా” అంటే యిదే అన్నాడు బార్ వాడు. 


కస్తూరిబాకి బి.పి. వుంటే వైద్యుడు ఉప్పు వాడద్దని చెప్పాడట. ఆమె మాత్రం మానెయ్యలేక మామూలుగానే తింటోంది. ఆ సంగతి తెలిసి గాంధీజీ వుప్పు మానేశారు. చప్పిడి తినడం మొదలు పెట్టారు. ఆవిడ లబోదిబోమని వెంఠనే ఉప్పుకి స్వస్తి చెప్పిందిట. ఇవన్నీ ఉప్పుతో మానవ సంబంధాలు కాదూ!


విశ్వనాథ సత్యనారాయణవి విచిత్రమైన అలవాట్లు. సాయంత్రం నలుగురు మిత్రులనో శిష్యులనో వెంట వేసుకుని కూరల మార్కెటుకు  వెళ్లడం వొక ఆటవిడుపు. అక్కడ మసాలా దినుసుకి నిలువుగా కోసిన వొక కొబ్బరి ముక్క రెండు పచ్చి మిరపకాయలు, ఇంటి దగ్గర్నించే గుర్తుగా తెచ్చుకున్న చిటికెడు ఉప్పు నోట్లో వేసి రుబ్బేవారుట. ఆయనకు కొబ్బరి పచ్చడి తిన్నట్లు వుండేది. మరి జిహ్వ అంటే అదీ జిహ్వ!


- శ్రీరమణ ' ( గుత్తొంకాయకూర- మానవసంబంధాలు - నుంచి ) 


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

19-11-2021 ; బోథెల్ : యూ ఎస్ ఎ


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...