Monday, December 20, 2021

ఈనాడు - సంపాదకీయం ఏది స్వర్గం, ఏది నరకం రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 20 -05 - 2011 )

 






ఈనాడు - సంపాదకీయం 


ఏది స్వర్గం, ఏది నరకం 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 20 -05 - 2011 ) 




ఏ రహస్య సృష్టి సానువులనుంచో జాలువారే కాంతి జలపాతం ఈ జీవితం.. జనించేదెవరి వలస చలించేదెందు కొరకు, లయించేది ఏ దిశకు అన్నీ ధర్మసందేహాలే. అసలు కిటుకు కమలాసుడికైనా తెలుసో లేదో! మానవుడు బుద్ధిజీవి. రాశి చక్రగతులలో/ రాత్రిందిన పరిణామాలలో/ బ్రహ్మాండ గోళ పరిభ్రమణాలలో/ కల్పంతాలకు పూర్వం కదలిక పొందిన పరమాణువుకా ప్రేరణకేది మూలకారణమో అంతు తేలేదాకా ప్రయాణం మానడు. అదే చిత్రం. గ్రహరాశుల నధి గమించి/ గగనాంతర రోదసిలో! గంధర్వ గోళగతులు దాటిన మనిషి ఓ వంక నెలవంకనంటివస్తాడు. మరోవంక, మరణానంతరం జీవితం ప్రశాంతంగా సాగేటందుకు చుక్కలకు ఆవలి దిక్కున ఎక్కడో చక్కని లోకాలు చక్కర్లు కొడుతున్నాయని బలంగా నమ్ము తుంటాడు. అదింకో విచిత్రం మార్గాలు, రూపాలు వేరువేరైనా స్వర్గాలు, నరకాలు అన్న భావనలు అన్ని మతాలకూ ఒకేలా ఉండటం అన్నింటికన్నా చిత్ర విచిత్రం! పుణ్యం చేసుకున్నవారు మరణానంతరం దైవదూతలుగా తేలియాడే ప్రేమారామమని యూదులు స్వర్గధామాన్ని అభివర్ణిస్తారు. 'అమృతం కురిసిన రాత్రి'లో బాలగంగాధర్ తిలక్ వెన్నెల మైదానంలోకి వెళ్ళి నిలబడినప్పుడు పాదాల తారామంజీరాలు ఘల్లు ఘల్లుమని మోగించుకుంటూ వయ్యారంగా ఆకాశమార్గాన పరుగులెత్తుతూ పరవశం కలిగించింది బహుశా అటువంటి  దేవతా ప్రేమమూర్తులేనేమో!


అమరలోకాలకు నిచ్చెనలు వేసిన కవులకు , భావుకులకు విశ్వసా హిత్యంలో కొదవ లేదు. కాళిదాసు నుంచి  మిల్టన్ దాకా, కృష్ణశాస్త్రి నుంచి  కవి తిలక్ వరకు  దివిసీమ  అందాలను గురించి పలవరించనిదెవరు? మనుచరిత్రలో అల్లసాని పెద్దన అరుణాస్పదపురం పేరును అడ్డుపెట్టుకుని చేసిన వర్ణనంతా ఆ రంగుల ప్రపంచం  గురించే.  అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ' అంటూ అమరపురి వైభోగాలను కలవరంచిన తీరుకు మునిముచ్చుకైనా కలవరం కలగక మానదు. కళాపూర్ణోదయంలో మణికంధరుడనే  గంధర్వుడు ఈ కిందిలోకపు అందాలను చూసి మనసు పారేసుకుంటాడు. మరి మామూలు మానవుడి మరులు ఆ సురలోక సౌఖ్యాలనుంచి ఓ పట్టాన మరలి రాగలవా? ' దిగిరాను దిగిరాను దివినుంచి భువికి' అని భావకవి ఊరికే మారాం చేస్తారా?! వరూధిని వంటి వయ్యారి వగలాడుల  సాముగారీడీలట  పద్మసంభవ, వైకుంఠ, భర్గసభలు. ఆ కొలువు కావాలని కోరిక లేకపోవడానికి మనసును ప్రవరాఖ్యుడు ఆవరించాలి. అదంత సాధారణమైన సాధనేనా? కాళిదాసు కల్పనలోని ఆ మేరుపర్వతంమీది కల్ప వృక్షచ్ఛాయలలో  పచ్చల పట్టు పరుపులపైన అచ్చరల  వెచ్చని ఒడి.. అమరగానం... అమృతపానం... అవో... ఏ మర్త్యయప్రాణిని ఝల్లుమనిపించవు? ఏడు ఊర్ధ్వ  లోకాలనే కాదు.. ఏడు అధో లోకాలనూ సృష్టించి పెట్టారు. పాపాల పాలును యాతనా దేహంగా మార్చి వైతరణిని తరించిన పిదప ఇరవై ఆరు రకాల నరకాల వెంట పాపిని తిప్పి పిప్పిచేసే  వైనాన్ని వైనతేయ పురాణం వర్ణిస్తుంది. 'నరకలోకపు జాగిలమ్ములు గొలుసు త్రెంచుకు' ఉరికి పడితే గుండె జారని ధీరుడెవ్వడు?  కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి బోధించినట్లు అరిషడ్వర్గాల వైరివర్గంలో చేరిపోవడమొకటే చివరి దరి . ' దైవమూ-దయ్యమూ, పాపమూ పుణ్యమూ, స్వర్గమూ-నర కమూ, మందభాగ్యులను ఓ మందగా మార్చేటందుకు కామందువర్గం కనిపెట్టుకున్న మత్తుమందు' అంటాడు కవి ఎమ్మాగోల్డ్. మన హేతు కవిరాజు సూత పురాణం కూడా 'మతిమాలిన కవిచంద్రులు/ గతిమా లిన వారలగుచు గడుకక యెవరో/ బతిమాలిన నల్లిన' కట్టుకథలివి అని కొట్టిపారేస్తుంది.


స్వర్గం, నరకం- మానవ మనోమందిరంలోని రెండు ఊహా లోకాలు అయితే కావచ్చు.. మరి మహనీయుల ఆ కమనీయ కల్పనల వెనకున్న తపనో?। మానవుడనే శిలను మాధవుడనే శిల్పంగా తొలిచి భువిని భువర్లోకంగా మలచాలనుకోవడం మహదాశయం కాదా? మహాభారతంలో స్వర్గారోహణం వేళ ధర్మజునితో యమధర్మ రాజు అన్నట్లు స్వర్గ నరకాలు వేరువేరుగా లేవు. తన సంతోషమె స్వర్గం, తన దుఃఖమె నరకమనే గదా సుమతీ శతక కర్త సుభాషితం! 'తృప్తిచెందని నరుని సప్త ద్వీపంబులైన చక్కంజేయునే! అక్షరంబులు నాలుగు కుక్షిలో వేసి  అ క్షరంబేదో తెలుసుకో మనసా' అని హెచ్చరించారు వేదాంతులు. నిగమంబులు వేయి చదివినా జీవిత సారం ఒంటబట్టనివాడికి ఏ ముక్తిమార్గమూ సుగమం కాదు. జీవితాన్ని చెదలపుట్టలో చీకిన ఆకులు తిని బతికే మకిలి పురుగులాగా చీదరించుకొనే వాదం ఎంత అసంబద్ధమో... విడివిడి భాగాల కలివిడితో తయారైన ఓ భౌతిక యంత్రంతో పోల్చి చూడటమూ అంతే అహేతుకం. శాస్త్ర నిఘంటువు నిర్వచనానికి అందనిదంతా అసత్యమన్న వాదనా సత్యదూరమే. క్రాంతి దర్శకులు వెలుగు చూపరు. వారు చూపిన దారిని పట్టుకుని జీవితాన్ని వెలిగించుకోవలసింది మనం. ఆ తెలివిడే జ్ఞానం. ప్రేమను మూలధనంగా పెట్టి జీవితాన్ని వ్యాపారంగా మలుపుకోవాలనుకునే బేహారులకు- లాభం  స్వర్గం, నష్టం నరకం. విజయం స్వర్గం, అపజయం నరకం. దుఃఖం నరకం, సుఖం స్వర్గం. ఠాగూర్ గీతాంజలి ప్రార్థన ప్రకారమైతే- ఎక్కడ జ్ఞానం నిత్యం వెల్లివిరుస్తుంటుందో అదే శాశ్వత స్వర్గం.  ' కాలసంక్షిప్త చరిత్ర'  గ్రంథకర్త, అయిదు దశాబ్దాల బట్టి చావుబతుకుల సరిహద్దుల వద్ద తచ్చాడుతూనే మానవ చరిత్ర పురోగతికి అసమానమైన సేవలందిస్తున్న శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ' స్వర్గం మిథ్య' అని చేసిన తాజా వాదాన్ని ఈ నేపథ్యంలోనే అర్ధం చేసుకోవాలి. మానవజాతి అభివృద్ధి కోసం  తపించే వారెవరికైనా అడుగడుగునా గుడే కనిపిస్తుంది . అందులో వెలిగే దీపం భావవాదులకు దైవం అయితే... భౌతిక వాదులకు జ్ఞానం. చూపులు వేరైనా చూస్తున్నది ఒకటే. అదే దైవజ్ఞానం, జ్ఞానదైవం. తేడా లేదు- రెండూ ఒకటే.


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 20 -05 - 2011 ) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...