Tuesday, December 21, 2021

ఈనాడు - సంపాదకీయం ప్రాణభయానికి పగ్గాలు రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 01 - 05 - 2011 )

ఈనాడు - సంపాదకీయం 


ప్రాణభయానికి పగ్గాలు 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 01 - 05 - 2011 ) 


దుఃఖాలలో  కెల్లా  మరణం భయంకరమైంది. 'మరణమను లేతనుడి చెవింబడినయంత/ దలిరు గాలికి శుష్క పత్రమువోలె' గడగడ వణకడం- మానవ బలహీనత. 'మనుజుడై పుట్టి మనుజుని సేవించి/ అనుదినమును దుఃఖమందనేలా? ' అని అన్నమాచార్యుల వంటి మహానుభావులు ఎందరు ఎన్ని వందలసార్లు వేదాంతాలు వల్లించినా ప్రాణంమీది తీపి  అంత తొందరగా పోయేది కాదు. నది, సముద్రం కడకు ఒకటే అయినట్లు కాలప్రవాహానికి జీవితం, మృత్యువు రెండు పాయలు. చనిపోవడం అంటే ఉచ్ఛ్వాస  నిశ్వాసాలు, కాల పంజరం నుంచి శాశ్వతమైన ముక్తి పొందడం- అంటాడు ఖలీల్ జిబ్రాన్. ఎవ రెన్ని సుద్దులు చెప్పినా గడిచిపోయే ప్రతిక్షణం కాలవాతావరణ కేంద్రం మరణమనే తుఫానుకు హెచ్చరికగా ఎగరేసే ప్రమాద కేతనం సంఖ్యను పెంచుతూనే ఉంటుందన్నది మనిషి దిగులు. రేయింబవళ్లు చీకటి వెలుగులు, ఇంటాబైటా, ఏ జీవీ, ఏ యుద్ధం, ఏ ఆయుధం తన మరణ కారణం కారాదని హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడిని  వరం కోరింది ఈ మృత్యుభీతితోనే.  ఆ మరణభయంతోనే మార్కండేయుడు మారేడు దేవుడి శరణుజొచ్చాడు. మహాసాథ్వి సావిత్రి సాక్షాత్ సమవర్తినే బురిడీ కొట్టించింది. భర్త ఆయుష్ చంద్రికలను మృత్యుకేతువు మింగేసిందని  దేవతల చిరాయువు కోసం కచుడు పడిన ఆరాటమే మృతసంజీవనీ విద్య కధ. అమరత్వ సిద్ధికి జాతివైరం కూడా మరచి సురాసురులు క్షీరసాగర మధనానికి పూనుకొన్నారు. దేవదానవులదాకా ఎందుకు- ఎంగిలి మెతుకులు ఏరుకుని తినే కాకులూ తమలో ఒకటి పడిపోతే కావు కావుమని గగ్గోలు పెడతాయి. జీవరాశులన్నింటిలోకీ తనది అత్యున్నతమైన జన్మ అని నమ్మే మనిషిని జీవితం మిథ్య అనుకొమ్మంటే అంగీకరిస్తాడా? పోయినవాడూ తిరిగి ప్రాణాలతో వస్తాడేమోనన్న ఆశతో గ్రీకులు మూడురోజులు, రోమన్లు ఏడురోజులు శవజాగారం చేసేవారు. పార్థివదేహం ప్రాణం పోసుకుంటుందేమోనన్న చివరి ఆశతో దింపుడు కళ్ళెం  పేరిట మహాప్రస్థానం వేళా మృతుడిని ఆత్మీయులు ముమ్మార్లు పేరుతో పిలిచే ఆచారం మనది. 'కన్ను తెరిస్తే జననం/ కన్ను మూస్తే మరణం/ రెప్పపాటే కదా ఈ పయనం' - అని తెలిసినా ఈ ప్రయాణం నిరంతరాయంగా అలా కొనసాగుతూనే ఉండాలని కోరుకోవడమే జీవనపోరాటం. ఆ ఆరాటమే మృత్యుంజయత్వంపైకి మనిషి దృష్టిని మళ్ళించింది.


ఆరాటం ఆలోచనాపరుణ్ని విశ్రాంతిగా ఉండనీయదు. ఖాళీ గిన్నెను ముందేసుకుని డీలా పడేవాడే అయితే, పొయ్యిమీది గిన్నె మూతను కదిలించిన శక్తితో మనిషి ఆవిరి యంత్రాన్ని ఆవిష్కరించగలిగేవాడు కాదు. సుఖంకోసం వెంపర్లాటే లేకపోతే ఇంకా పక్షి ఈక లను చెట్టు మానులనుంచి స్రవించే ద్రవంలోనే ముంచి తాళపత్రాల మీద గిలుకుతుండేవాడు. ఆరుద్ర ఒక చిత్రంలో చెప్పినట్లు- మాన వుడు శక్తియుతుడు, యుక్తిపరుడు. దివిజ గంగను భువికి  దింపిన భగీరథుడు. సృష్టికి ప్రతిసృష్టి చేయగల విశ్వామిత్రుడు. 'ఎంత లెక్క తిరిగినా నేమి లేదురా/ చింత చేసి చూడకున్న వింతలేదురా' అంటూ వీరబ్రహ్మేంద్రస్వామి తత్వాలు పాడారు. నిజం. ఆ కాల జ్ఞాని ప్రబోధించినట్లు- మూల మూలలా శోధిస్తేనే ముక్తి ఆ మూల నున్న జ్యోతిని ముట్టిస్తేనే బతుకులో వెలుగు.  అది తన ప్రాణజ్యోతి  అయినప్పుడు అది అఖండంగా కాంతులీనుతుండాలని మనిషి కోరుకోవడం అత్యాశ కాదుగదా! శరీరం శిథిలమైపోయింది. జుట్టు నెరిసిపోయింది. పళ్లన్నీ ఊడిపోయి నోరు బోసిపోయింది. వృద్ధుడై కర్ర సాయంతో నడుస్తున్నాడు. అయినా జీవితేచ్ఛ మనిషి శరీరాన్ని విడవడం లేదు' అని సంస్కృతంలో ఒక శ్లోకముంది. శాస్త్రవేత్తలూ తమ వంతు కర్తవ్యంగా చావు  పుట్టుకల గుట్టుమట్లను ఇప్పుడు శాస్త్రీయంగా బట్టబయలు చేసే కృషిలో తలమునకలుగా ఉన్నారు.


ఆజన్మ బ్రహ్మచారి నారదుడు ఒకసారి జన్మ రహస్యాన్ని గురించి 'ప్రారంభాది వివేకమెవ్వ డొసగుం! ప్రారంభ సంపత్తి కాధారం బెయ్యది! / యేమిహేతువు? ' అని అడిగాడట. మనిషి   దేవాంతకుడు   కదా! అందుకే 'సర్వానుసం/ధానారంభ విచక్షణత్వమ' నే      జీవరహస్యం అంతుచూసి కాలాంతకుడిగా మారాలని కంకణం కట్టుకున్నాడు. జన్యువుల కోడ్ తిరగరాయడం ద్వారా జరామరణాలను నియంత్రిం చవచ్చన్నది ఆధునిక విధాత  సిద్ధాంతం. ఇటీవలి టైమ్స్ పత్రిక ముఖచిత్ర కథనం ప్రకారం- కంప్యూటర్ పరిజ్ఞానం, బయోటెక్నాలజీ లను జోడించడం ద్వారా జీవి ఆయురారోగ్యాలను కోరుకున్న విధంగా పొడిగించుకోవడం సాధ్యమే. సింగ్యులారిటీ విభాగంలో ప్రసిద్ధులైన అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త రేమండ్ కర్జల్, బ్రిటిష్ బయాలజిస్ట్ అట్రే డి గ్రే మరో రెండు దశాబ్దాల నాటికి మానవ మేధను మించిన సూపర్ కంప్యూటర్లు రంగప్రవేశం చేస్తాయంటున్నారు. వాటి సాయంతో మానసిక చైతన్యాన్ని చిప్స్ రూపంలోకి మార్చుకోవచ్చని చెబుతున్నారు. నానోటెక్నాలజీ సాయంతో ఈ చిప్సు ను  మనిషి మెదడుకు అనుసంధానిస్తే శరీరంలో అంతర్గతంగా ఏర్పడే రుగ్మతల మూలాలను ఆదిలోనే పసిగట్టి సరిచేసుకోవచ్చని ఆ శాస్త్రవేత్తల భావన. పరిశోధనలు ఫలిస్తే మనిషి మృత్యువును జయించడానికి మరో మూడు దశాబ్దాలకు మించి సమయం పట్టకపోవచ్చని ఆశ. 'అన్నా! చావనని నమ్మకం నాకు కలిగింది/ చావు లేదు నా' కని కవి తిలక్ లాగా జనం ఎలుగెత్తి చాటే రోజులు నిజంగానే రాబోతున్నాయేమో! తేనెలేని తేనెపట్టు లాగా మనిషి మారకుండా ఉంటే చాలు. చావులేని ఆ లోకం నిజంగానే అప్పుడు నేలమీదకు దిగివచ్చిన నాకంలాగా వెలిగిపోదూ!


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 01 - 05 - 2011 ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...