Tuesday, December 21, 2021

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం శాఖాహారులు - రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 10 - 05 - 2010 )


 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

శాఖాహారులు 


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 10 - 05 - 2010 ) 


పరమ భక్తులకు తప్ప దేవుళ్లు అందరికీ కనబడరు. ఆదాయానికి మించిన ఆస్తులున్నవాళ్లదీ అదే బాపతు.  ఏ ఏసీబీ దాడులో జరిగేదాకా మన మధ్యనే మహరాజుల్లా తిరుగుతున్నా వీళ్లు  మామూలు మనుషులకు కనపడరు. 


మీ ఉద్యోగానికేమండీ బాబూ మూడు పూవులూ... ఆరు కాయలూ అని యాష్టపడతారుగానీ, వట్టి పూలు ఏం చేసుకొంటాం? 


కట్టుకున్న భార్యే కాసులు వాసన చూడనిదే- తలుపు గడియ తీయని రోజులివి. నల్లపూసల నాంతాడు. ఒకటి మెళ్ళోవేసి పంపిస్తే పిల్లను కళ్ళకు అడ్డుకుని తీసుకెళ్ళే అల్లుళ్ళున్న కాలమా ఇది! కాలం అలా కాలిపోయింది. 


నాలుగు రాళ్ళు వెనకేయకపోతే మోయడా నికైనా ఓ నలుగురు ముందుకురాని కాలమిది. పచ్చనోట్లు పది ఉంటేనేగదా ఎవరి బతుకైనా ఈ రోజుల్లో పచ్చగా ఉండేది!


ఈ చరాచర సృష్టిలో సంపాదించే స్థిర చరాస్తులే మనిషికి కడదాకా మిగిలిపోయే స్మృతి చిహ్నాలు. తాజ్ మహాల్  కట్టించిన షాజహాన్ పేరును ఇప్పటికీ చెప్పుకొం టున్నాం. తరువాత తరాలవారికి ఏవో నాలుగైదు వందల కోట్ల విలువైన ప్లాట్లు, ఫ్లాట్లు వంటివి నాలుగు పాట్లు పడి సంపాదించి పెట్టినందుకే ఇంత అల్లరి తగునా? 


ధనవంతుడి తరవాతే గదా భగవంతుడైనా! రామకోటి నోటు బుక్కు.. రూపాయల నోట్ల కట్ట పక్కపక్కనే పెట్టి ఒక్కటే తీసుకోమంటే కోటికి ఒక్కడైనా రామకోటి కోరుకుంటాడా? 


పళ్ళెంలో రూపాయి బిళ్ళ చూస్తేనేగానీ గుళ్లో పూజారయినా  మనసారా శఠగోపం పెట్టడం లేదే! ఏదో సందు దొరికినప్పుడు చాయ్ పానీకోసమని ఓ నాలుగైదువందల కట్టలు నొక్కితేనే తప్పని గగ్గోలు పెడితే ఎలా? 


ఊరకే వచ్చిందా ఈ సర్కారు ఉద్యోగమైనా? ఎన్నెన్ని దక్షిణలు, ప్రదక్షిణాలు ! 


పోనీ... పనికి ఆహార పథకమేమన్నా ప్రభుత్వాలకు కొత్తా! పాపం సర్కారైనా అంతంత మందికి ఆహారమెలా సరఫరా చేస్తుందని? ఆ ఉపాధి పథకమేదో స్వయంగా కల్పించుకుని తంటాలు పడుతుంటే దానికి ఇన్నిన్ని రాద్ధాంతాలా?


'చేదుకోవయ్యా!  మమ్మేలుకోవయ్యా! ' అంటూ పనిమీద వచ్చినవాళ్లే బల్లల కింద డబ్బు సంచులు పెట్టి బలవంతపెడుతుంటే చేదుకోకుండా చేతులు ఊపుకొంటూ కూర్చోవడం చేతగానితనం అనిపించు కోదూ! అయినా డబ్బెవరికి చేదు? చిత్తశుద్ధని చేతులు ముడుచుకు కూర్చుంటే బుద్ధిలేని మగడని తాళి కట్టించుకున్న భార్య కూడా ఎగతాళికి దిగుతుంది. 


ఏదొచ్చినా  సరే శుద్ధినీళ్లిన్ని చల్లి జేబులో  వేసుకొస్తేనే గదా- 'మా ఆయ 'బంగారం' అని భార్యామణైన మురిసిపోయేది! 


తినమరిగినవాడికి నోరు తిరగని మాట నిజాయతీ . నిబద్ధత బద్ధకస్తుల నిఘంటువు పదం. శాఖాహారులకే తప్ప శాకాహారులకు సరిపడని వ్యహారాలివి. 


జీతగాళ్లందరూ మేతగాళ్ల కాలేదు. అన్ని నోటు పుటప్పు'లకు టపుటప్పుమని నోట్ల కట్టలు రాలిపడవు. భరతఖండంబు పాడియావని ముందు కని పెట్టింది తెల్లవాడే అయినా, పాలు పితికే కళలో రాటుదేలింది మాత్రం .. ఎందుకులేండి నా నోటితో చెప్పడం బాగుండదు!


కొన్ని కొలువులంటే- అల్లాఉద్దీన్ అద్భుత దీపాలు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం చాతగానివాళ్ళు ఇంకా ఈ దేశంలో నూటికి ముప్ఫై అయి దుమంది ఉన్నారని అవినీతి నిరోధక్  శాఖ అనడం నిజంగా బాధ కలిగిస్తోంది. ఎలాగూ ఏసీబీ దాడులు సాగుతు న్నాయి గదా! నీతిపరుల జాబితా నిగ్గు తేల్చి వారి స్థానంలో 'మామూలు'  వాళ్లకు అవకాశం కల్పిస్తేతప్ప అంతర్జాతీయంగా మన పరువు నిలబడేటట్లు లేదు. 


స్వతంత్రమొచ్చి ఇన్ని దశాబ్దాలు దాటినా, ఇంకా ఏమిటండీ అవినీతి దేశాలు జాబితాలో మన ర్యాంకు మధ్యలో ఉండటం ! ఎక్కడైనా బావా అనుగానీ... ఆఫీసులో 'బావా అనొద్దు'  అనే నిబద్ధతున్న దేవుళ్ళే దండిగా కావాలిప్పుడు! 


అవినీతి లేనిదెక్కడ?' అని సన్నాయి నొక్కులు నొక్కగానే సరిపోదు. అది సత్యమే అనే విధంగా మనం ఎప్పటికప్పుడు చర్యలూ తీసుకుంటూ ఉండాలి గదా!


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 10 - 05 - 2010 ) 





No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...