ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక
' ఆత్మ' కథ
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 18- 12- 2010 )
ప్రతిదానికి, ప్రతివాడూ ప్రతివాడినీ ఆక్షేపించాడు ఎక్కువయి
పోయిందీ మధ్య మన రాజకీ యాల్లో.
ఆ మాటకొస్తే రామాయణంలో కూడా రాముణ్ని అందరూ దేవు డని కొలిచిందీ లేదు. శంభూకుడు, మంధర, కన్నతల్లికన్నా మిన్నగా చూసుకున్న కైకేయి, కాకి, రజకుడు- రాముణ్ని ఈసడించిన సందర్భాలున్నాయి.
మందిసొమ్ముతో మందిరాన్ని కట్టించి, కారాగారంపాలైన కంచెర్ల గోపన్న- 'ఎవ డబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా!' అంటూ నిలదీశాడు.
ఆత్మను కూడా ఆ శ్రీరాములవారిలా భావించే సంప్రదాయం మనది. అంతలావు రాములవారే అంతలేసి నిందలుపడగా లేనిది... అంతరాత్మకు మాత్రం మినహాయింపు ఎందుకు ఉంటుందీ! అందులోనూ రాజకీయరంగంలో!
అసలు ఆత్మలకు అంతలేసి రాజకీయాలు అవసరమా అనే ప్రశ్న ఉండనే ఉంది. ఇందిరమ్మే ఆ రోజుల్లో వి.వి.గిరిని రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిపించడానికి 'అంతరాత్మ'ను తట్టిలేపుకొచ్చింది.
ఆత్మగౌరవానికి భంగం వాటిల్లిందని అనుకున్నప్పుడల్లా నేతలు ఉద్యమాలు చేశారు. ఓదార్పు యాత్రల పేరుతో ఊరేగింపులూ చేస్తున్నారు.
కొంతమంది మంత్రులైతే ప్రమాణ స్వీకారం సందర్భంలో దేవుణ్ని, రాజ్యాంగాన్నీ తోసిరాజని ' అంతరాత్మ' సాక్షిగా ప్రమాణాలు చేస్తుంటారు. అంటే అర్ధమేమిటి? అంత రాత్మ రాజ్యాంగేతర శక్తేనని బహిరంగంగానే ప్రకటించటమేగదా! దేవుడికన్నా అంతరాత్మే గొప్పదని అర్థంకదా? ఒకవిధంగా ఆ రెండు ముక్కలూ నిజమేనేమో!
దేవుడు అన్నీ చూస్తుంటాడు. వింటుంటాడు. కానీ పెదవి మాత్రం విప్పుడు. కాబట్టి వికీలీక్సుకిలాగా భయపడాల్సిన పని ఉండదు. వీలున్నప్పుడు విరాళాలు ప్రకటించుకుంటే చాలు.. వ్యవహారం సరళమైపోతుంది.
అంతరాత్మతో వ్యవహారం అల్లా చెల్లదు . గమ్మున ఊరుకోదు, గోల పెడుతోందని దానిచేత గోడ కుర్చీ వేయించలేం. అంతరాత్మ క్షోభ పడలేకే అంతలావు ధర్మరాజూ 'అశ్వత్థామ హతః కుంజరః' అంటూ అబద్ధంలాంటి నిజం చెప్పాల్సి వచ్చింది. ఇక దాని గోల తట్టుకోవడం మామూలు మనుషులు తరమయ్యే పనేనా?
ఆత్కక్షోభను తట్టుకోలేకే కొంతమంది టికెట్టిచ్చి గెలిపించిన పార్టీకి 'రాం రాం' చెప్పేసి, పనులు చేసి పెట్టే పక్షంలోకి టైం చూసి ఠక్కుమని గెంతేస్తుంటారు. సంతకాలు లేని రాజీనామాలు సభాపతులకు పంపుతుంటారు.
తప్పుడు పనులు చేస్తున్నప్పుడు చప్పుడు కాకుండా చూస్తూ కూర్చునుండే అంతరాత్మ- ఆ దొంగతనాలు గట్రా ఏ స్ట్రింగ్ ఆపరేషన్లో ఆపరేషన్లోనో బయటపడగానే క్షోభిం చడం మొదలు పెడుతుంది. నాన్ బెయిలబుల్ వారంట్లు రాకుండా నానాతంటాలు పడుతుం టుంది. దొంగ గుండె నొప్పులు చెప్పి ఆసుపత్రి పడకలమీద వేడి తగ్గిందాకా ముసుగుతన్ని పడుకోవాలని చూస్తుంది.
ఆత్మలూ దేహాలూ ఒకటిగా మసిలి వ్యవహారాలు ఎన్ని సాగించినా, కాలం చెడి దేహం దూరమైతే- పాడు 'ఆత్మ పడే క్షోభ ఆ పరమాత్ముడికైనా అర్ధం కాదు!
ఆత్మ కాలదు, చిరగదు, నల గదు, తడవదు, మాయదు .. అంటూ గీతలో పరమా త్ముడు ఎంతగా ప్రబోధించినా... ఆత్మకూ ' కాలే' సందర్భాలు కొన్ని ఉంటాయి. గిట్టనివాళ్లు తిట్టిపో స్తున్నప్పుడు అలిగి ఆ ఆరోపణలు అబద్ధమని తేలేంతవరకు తిరిగి దేశంలోకి కాలు పెట్టనని శపథాలు చేస్తాయి. అయినా, ఆత్మలకు కాళ్లుంటాయా అని అడగద్దు .
రావణ వధ అనంతరం పట్టాభిషిక్తుడైన రాములవారు భక్తజనులకు వరప్రదానాలు చేయాలనుకుని సతీసమేతంగా కొలువయ్యారట. భక్తులను క్రమబద్దీకరించే బాధ్యత హనుమంతులవారికి అప్పగించారు. వరాలు కోరడానికి జనా లెవరూ రాములవారిదాకా రావటంలేదు! ఒకటీఆరా వచ్చినా, వట్టి నమస్కారాలు పెట్టేసిపోతున్నారు! విషయం విచారించమని లక్ష్మణస్వామిని పురమాయించారు సీతమ్మవారు. మరిది చెప్పిన మాటలు వినగానే ఆమెకు కోపమొచ్చింది. అడిగిన వారందరికీ హనుమంతుడే వరాలిచ్చి అటునుంచి అటే పంపేస్తున్నాడట' ఆవాటా అంటూ . శపించ బోయిన భార్యను వారించి, ఆనక ఆంతరంగికంగా అసలు రహస్యం బైటపెట్టారు శ్రీవారు. 'వచ్చిన వారు కోరదగినవి, కోరదగనివీ అడుగుతుంటారు. ప్రసాదిస్తే ఒక ఇబ్బంది. ప్రసాదించకపోతే మరో ఇబ్బంది. అందుకే, ఆ పాపపుణ్యాల భారం నేనే హనుమ మీదకు వదిలేశాను. హనుమ నేను వేరువేరు కాదు. నేను దేహమైతే... అతడు నా ఆత్మ' అని సెలవిచ్చారు. ఈ పురాణం ఎంతవరకు పుక్కిటిదో చెప్పలేంగానీ, ఈ మధ్యదాకా మనమధ్య ఒక 'మహానేత, ఆయన అనుంగు దూత రామ హనుమల మాదిరిగా మసిలిన మాట మాత్రం నిజమే కదా!
ఇప్పుడా రాంబంటునే 'గుండెలుతీసిన బంటు' అంటున్నారు. వెంటనే ఉద్వాసన పలకవలసిందే' నంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఇది సాధ్యమా!
అప్పాజీలేని రాయల రాజ్యం ఉంటుందా? చాణక్యులవారిని చంద్ర గుప్తుడు- ఛీ ... పొమ్మని చీదరించుకోగలడా?
ఆత్మ అంటే శరీరానికి సలహాదారే కదా! దేహం తిరిగిన దారులన్నీ అంతరాత్మకు కొట్టిన పిండైనప్పుడు- ఆ అంతరాత్మను అంత తేలికగా వదిలించుకోవడం వీలయ్యే పనేనా? తల్లిపేగుతో బంధం పుట్టినప్పుడే తెగుతుందిగానీ, అంతరాత్మతో సంబంధం పుడకల తరవాత కూడా పోయేది కాదు.
అన్ని తలలున్న రావణా సురుడు సలహాలు చెప్పే తమ్ముణ్ని దూరం చేసుకున్నందుకు ఏ దుర్గతి పాలయ్యాడో తెలిసి, ఏ కొత్త ప్రభుత్వమూ పాత సలహాదారుల్ని అంత తొంద రగా వదిలించుకోదు. వదిలించుకోలేదు.
ఇన్ని చెబుతున్నారు... జీతంబత్తెం లేకపోయినా పక్కన చేరి ఊరికే సలహాలిస్తోందని ఎవరైనా జీతం మొత్తం నొక్కేస్తున్న జీవిత భాగస్వామికి విడాకులి స్తున్నారా? ఇదీ అంతే!
కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 18- 12- 2010 )
No comments:
Post a Comment