ఈనాడు హాస్యం - వ్యంగ్యం
స్త్రీ సూక్తం
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 07-03-2009)
'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి' అన్నవాణ్ని ఇస్త్రీ చెయ్యాలి అంది మా ఆవిడఇంటి దుస్తులు ఇస్త్రీ చేస్తూ కసిగా.
చలంగారి పుస్తకమేదో చదివినట్లుంది. ముందామెను చల్లబరచడం ముఖ్యం.
' మొన్నీమధ్యే కదంటోయ్ మన ఏఆర్ రెహమాన్ ఆస్కారందుకుంటూ ' మా! తుఝే సలామ్' అన్నాడు. మన చిరంజీవి తిరుపతి సభలో తన తల్లిని ఎన్నిసార్లు తలచుకున్నాడూ! మనదేశంలో ఆడాళ్ళకు దక్కే మంచీమర్యాద మరెక్కడా దొరకదు తెలుసా?' అన్నాను.
'మర్యాదా, మన్నా! పబ్బులో పడి ఆడపిల్లలకు పబ్లిగ్గా బడితెపూజ చేశారే మీ మగాళ్ళూ! ప్రెస్ క్లబ్బులో ' లజ్జ ' రాసినావిడను తరిమి తరిమి కొట్టలేదూ! ప్రేమించలేదంటే యాసిడ్ పోస్తారూ! పార్కులో తిరిగే పిల్లలకు బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తారూ! పుట్టేది ఆడబిడ్డని తెలిస్తే అబార్షన్లు చేయిస్తారు. అదనంగా కట్నం తేలేదని కిరోసిను పోసి కాల్చే కిరాతకులండీ మీ మగాళ్ళూ!'
'అదేంటోయ్! ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ... ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతీ- అని రాసినాయన మగాడే కదా! కంటే కూతుర్నే కనాలి... పెళ్ళాం చెబితే వినాలి అని సినిమాలు తీసిన వాళ్ళు ఆడాళ్ళా? ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవుళ్ళు సంచరిస్తారు అని కదా మన పెద్దాళ్ళు అన్నారూ!'
'ఆ దేవుళ్ళ సంగతే చెప్పాలి... ఒకాయన పెళ్ళాన్ని అడవులకు తోలేశాడు. ఇంకోదేవుడు ఆడాళ్ళ బట్టలు కాజేశాడు. వేలాది పెళ్ళాలుంటే మగాళ్ళకు గొప్ప అప్పు తీర్చటానికి ఆలిని తాకట్టు పెట్టాడా హరిశ్చంద్రుడు. మగాడికి ముక్కోటి దేవ తలుంటే, ఆడదానికి అదనంగా ప్రాణంమీదకింకో దేవుడు... పతిదేవుడు. ఆడది వాడికి పనికి దాసి... సలహాకి మంత్రి... భోజనానికి తల్లి.. పడకకి రంభ- అలాపడుండాలని చెప్పిన ఆ పెద్దాళ్లు మగాడు ఆడదానితో ఎలా మసలుకోవాలో మాత్రం చెప్పారు కాదు.'
' ఎందుకు చెప్పలేదు? '
' తల్లో పూలున్నాయని తలలో గుజ్జులేని ఫూల్నేం కాదు. జడేసుకున్నంత మాత్రాన జడపదార్ధమైపోలేదు నేను. చట్టసభల్లో మీ మగ ఎంపీలు చేసే రభస మాకర్థం కాదనుకోవద్దు. మా జుట్లు ముడేసుకుంటూ పోతే భూగోళాన్ని మూడుసార్లు చుట్టి రావచ్చు. అయిదొందల పైచిలుకుండే పెద్దసభలో మహిళా ఎంపీలు అయిదు పదులకు మించి లేరు. ఆకాశంలో సగమంటారు. భూమ్మీద అంగుళం చోటివ్వరు. మూడోవంతు రిజర్వేషన్లకోసం మా ఆడాళ్ళు బిల్లు పెట్టమంటే మీ మగ ఎంపీలంతా కలసి ఆడిన ఆట ట్వంటీ20 కన్నా ఉత్కంఠగా సాగింది. ఈ ఇరవైఒకటో శతాబ్దిలో జాకెట్లు చేసుకొనే హక్కుకోసం అడవుల్లో ఆడాళ్ళు గోడుపెడుతున్నారండీ! రాకెట్లో ఆడాళ్ళు చంద్రమండలం దాకా వెళ్లొస్తున్నారని చంకలు గుద్దుకుంటే సరా ! స్త్రీ హింసకు పాల్పడే దేశాలింకా నూటముప్పైదాకా ఉన్నాయని.. అందులో మనది వందోదని లెక్కలు చెబుతున్నాయయ్యా మహానుభావా! '
' ఇంటిపని మానేసి ఇలాంటి కాకిలెక్కలు తీస్తూ కూర్చున్నావా? '
' నేనింట్లో ఒకరోజు చేస్తున్న పని మూడు గాడిదలు వారం రోజులు చేసే చాకిరికి సమానం. మీరాఫీసులో ఫేనేసుకుని నిద్దరోతూ చేసే పని ప్రకారం చూస్తే నా జీతం ఈ ఇంటి ఖరీదుకన్నా రెట్టింపు ఉంటుంది. నీళ్ళకోసం, రేషన్ కోసం , పిల్లల బడికోసం, నేను నడిచే దూరానికి రథం ముగ్గేసుకుంటూపోతే ఎవరెస్టు శిఖరం రెండుసార్లు ఎక్కి దిగి రావచ్చు. '
' నిజం చెప్పద్దూ... నాకూ ఇంక రోషం ఆగలేదు.'
' ఇందాకట్నుంచీ వింటున్నా. ఏదేదో అంటున్నావు. ఇందిరాగాంధీని ప్రధాని చేసింది మేమే . మదర్ థెరెసా మా దగ్గరికొచ్చిన తరువాతే సెయింటయింది. అటు అనీబిసెంటు, విజయలక్ష్మీ పండిట్, సరోజినీ నాయుడు నుంచీ ఇటు సోనియాగాంధీ, జయలలిత, మాయావతి దాకా అందరూ ముఖ్యులూ, ముఖ్యమంత్రులూ అయింది మా మగ జమానాలోనే! అరబ్ దేశాల్లో మొన్నటిదాకా ఆడాళ్ళకు ఓటుహక్కు ఉండేది కాదు. మన దగ్గర ఒక మహిళ రాష్ట్రపతి కాగలిగింది'
' రాష్ట్రపతి అనడమెందుకు? రాష్ట్రమాత అనొచ్చుగా? మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. మాతృభాష అంటుంటారుగానీ మాతృస్వామ్యం అంటే సహించలేరు. ఆడదంటే అంత అబలా! మీ మగాళ్ళు అటూఇటూ వాయించే తబలా?'
'అలుసైతే రైళ్ళల్లో ప్రత్యేక బోగీలు, బస్సులు, బస్సులో సీట్లు, సినిమా హాలు క్యూలు, టీవీల్లో సీరియళ్ళు ఎక్కడ చూసినా మీకేవేవో ప్రత్యేక రియా ల్టీషోలు ఎందుకు పెట్టిస్తాం?'
'టాయిలెట్లు, పేరంటాలూ, సామూహిక సీమంతాలు ప్రత్యేకంగా పెట్టిస్తే అభివృద్ధి అయిపోతుందా? ఈనాటికీ కొన్ని గుళ్ళల్లో ఆడవాళ్ళకు ప్రవేశం నిషిద్ధం. నూటికి ఎనభైమంది పంజరంలో పిట్టలే. పెల్లయితే ఆడదానికే ఇంటి పేరు ఎందుకు మారాలి? మేమే ఎందుకు గాజులు తొడుక్కోవాలి? పసుపు కుంకుమలు పంచటం అవమానంగా ఎందుకు మగాళ్ళు భావించాలి? ఆడదంటే అంత అలుసెందుకు? తొడలుంటే కొట్టుకోవాలా? మీసాలున్నది మెలిపెట్టుకోవటానికేనా? భాష ఉన్నది సభల్లో తిట్టుకోవటానికేనా? పురుష సూక్తం శ్రీసూక్తం ఒకటిగా ఎందుకు లేవు? ఆడపిల్లలకు దేవతల పేర్లు పెడతారుగానీ దేవతల్లాగా చూసుకోరెందుకు? మీ మగాళ్ళు మగాడిని ప్లస్, ఆడపిల్లని మైనస్ అనడం ఏ సామాజిక సూత్రం ప్రకారం న్యాయం? ఎంత ఒబామా అయినా ఒక ఆడది పెంచితేనేగా అమెరికా అధ్యక్షుడైంది! ప్రేమ పిచ్చిది కనక ప్రేమించే ఆడాళ్ళంతా పిచ్చాళ్ళేనా? ఆడది ప్రాణం పెడితే ప్రాణాలు తీసే యముడితోనైనా పోరాడి గెలుస్తుంది. ప్రాణం విసిగితే కాఫీలో కాస్త విషం కలిపి ప్రాణాలు తీస్తుంది. మగాడు తోడుగా ఉంటే ఆడది నీడగా ఉండటానికి సిద్ధం. ఆడది ఉన్న ఇల్లు చిలకలు వాలిన చెట్టండి. చప్పట్లు కొడితే చిలకలు ఎగిరి పోతాయేమోగానీ చిలకల కొలికి ఎన్ని ఇక్కట్లు వచ్చినా ప్రాణం పెట్టే మొగుడిని విడిచిపోదు' అందావిడ ఆవేశంగా.
ఓడిపోయాను.
' ఇంతకీ ఈ ఉపన్యాసమంతా ఎందుకూ?" అనడిగాను.
'రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్వామీ! మనరాష్టంలో సగానికన్నా ఎక్కువ ఆడ ఓట్లు ఉన్నాయి. ఆ సంగతి తెలిసి ఒకాయన పావలా వడ్డీ, అభయహస్తం అంటుంటే, ఇంకో హీరో భూములూ, సబ్సిడీలు అంటున్నాడు. ఇటునుంచి రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి అటునుంచి మద్యం అమ్మి దండుకుంటున్నారు. ఠీవి అయిన బతుక్కి కావాల్సింది ఉచిత టీవీ కాదు. ఉచితానుచితాలు తెలిసి ఓటు వేసే తెలివి - అని మా ఆడాళ్ళందరికీ తెలియాలని నా కోరిక'
'వాహ్... వాహ్... మరి ఈ శుభసందర్భాన మా మహారాణిగారు మగమహారాజుగారిని ఏమి చేయమని సెలవు? అనడిగాను నాటక పక్కీగా.. '
' ఇవాళ రేపూ వంట చేయమని ఆజ్ఞ' అనేసింది.
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 07-03- 2009 )
No comments:
Post a Comment