Saturday, August 8, 2015

అడుగో ఆంజనేయుడు.. జాంబవంతుడెక్కడ?- రచన కథాపీఠం పురస్కారం


ఒక ప్రముఖ చినపిల్లల మాసపత్రికవాళ్ళు ఆ సంవత్సరం బాలల దినోత్సవం సందర్భంగా గేయకథల పోటీ నిర్వహిస్తున్నార్రు.సెలెక్షన్ కమిటీలో నేనూ ఒక మెంబర్ని.
దాదాపు మూడువందల ఎంట్రీలు వచ్చాయి. మొదటి వడపోతలో ఒక వందదాకా పోయినా.. ఇంకా రెండువందలవరకు మిగిలాయి.
పిల్లలకోసం ఇంతమంది రాసేవాళ్ళు ఉన్నారంటే సంతోషం కలిగింది. రచనలు పంపించినవాళ్ళలో లబ్దప్రతిష్ఠులూ ఉండటం ఆనందం కలిగించింది. అన్నింటికంటే వింతగొలిపే విషయమేమిటంటే.. కొత్తగా రాస్తున్నవాళ్లలో కొంతమంది ఎంతో చురుకుగా రాసారు! నిజానికి ప్రముఖుల రచనలకన్నా అవి ఎందులోనూ తీసిపోవు. కొన్నయితే మిగిలిన వాటికన్నా  బాగున్నాయి. సెలక్షను చాలా కష్టమయింది. మొత్తంమీద అందరం కలసి కూర్చుని అన్ని కోణాల్లోనూ పరిశీలించి  ఫైనల్ గా ఒక పది రచనలు ఎంపిక చేసాం. వాటిలో ఒకటి, రెండు, మూడు బహుమతుల ఎన్నికను సంపాదకులకే వదిలేసాం. మిగిలిన వాటిని మాత్రం సాధారణ ప్రచురణకి తీసుకోవచ్చని సలహా ఇచ్చాం. అట్లాంటి సాధారణ ప్రచురణకు ఎన్నికైనదే 'ఛుక్ ఛుక్ రైలు'. గేయ రచయిత సి. ఆంహనేయులు, దేశాయిపేట.
దేశాయిపేట మా ఊరికి దగ్గర్లోనే ఉంటంది. మా ఊర్లో హైస్కూలున్నా దేశాయిపేటలో చదువు బాగుంటుందని మా నాన్న ఎస్సెల్సీలో  నన్ను అక్కడ చేర్చాడు. నాకెప్పుడూ ఫస్టు ర్యాంకే వస్తుండేది. క్లాసులో కృష్ణగాడికి రెండో ర్యాంకు. వాడి అన్నయ్యే ఆంజనేయులు.
ఆంజనేయుల్ని చూస్తే మాకు ఎడ్మైరింగుగా ఉండేది. ఆయన ప్రతిభ అలాంటిది. మాకు కొరుకుడు పడని లెక్కల్ని సులభ పద్ధతిలో ఎలా చెయ్యాలో చెప్పేవాడు. సోషల్ సబ్జెక్టులో సంవత్సరాలు, యుద్ధాలు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. అదే పనిగా బట్టీ పడుతుంటే.. అలా చేయడం తప్పనీ.. గుర్తు పెట్టుకోవడానికి ఉపాయాలున్నాయని చెప్పి చూపించేవాడు. ఇప్పుడు మా పిల్లలు 'రిటెన్షన్ ఆఫ్ మెమరీ పవర్' అనే టెక్నిక్కు ఆన్ లైన్లో కోచింగ్ తీసుకొంటున్నారు. అందులో చెప్పిన సూత్రాల్లో కొన్ని నలభై ఏళ్లకిందట ఆంజనేయులు చెప్పినవే! అతనేమీ కోర్సులు చదువుకోలేదు. వాళ్ల నాన్న ఒక మామూలు బడిపంతులు, వాళ్లకంత స్తోమతూ లేదు.
కృష్ణగాడితో కంబైన్డు స్టడీసుకని నేను వాళ్ళింటికి వెళుతుండేవాణ్ని. ఆంజనేయులుకి ఇంకా చాలా విద్యలొచ్చు. పేపర్లను కత్తిరించి బొమ్మలు తయారుచేసెవాడు. రంగుపెన్సిళ్లతో బ్రహ్మాండంగా బొమ్మలేసేవాడు. ఎప్పుడూ ఏదో ఓ కొత్తపని చేయడంలో నిమగ్నమై ఉండేవాడు. చేయడానికేమీ లేదనుకొన్న రోజున పేపరూ, పెన్నూ పట్టుకుని కూర్చునేవాడు. కథలు రాసేవాడు. కవితలల్లి వినిపించేవాడు. మా స్కూలు యానివర్సిరీకీ మా కోసం ఒక హాస్యనాటిక రాసి తనే డైరెక్టు చేసి మెప్పించాడు. గ్రీన్ రూంలో మాకు మేకప్ చేసిందికూడా ఆంజనేయులే. ఆ మేకప్ సామాను స్వయంగా తయారు చేసుకొన్నాడు.
 మాఅన్నయ్య అమెరికాలో పుట్టివుంటే చాలా గొప్పవాడయివుండేవాడు' అంటుండేవాడు కృష్ణ ఎప్పుడూ.
అమెరికా సంగతేమోగాని.. ఆంజనేయులు నిజంగా గొప్పవాడే. పెద్దయిన తరువాత అతను చాలా మంచిపేరు తెచ్చుకొంటాడు అనుకొనేవాళ్లం. కానీ అతనికి చపలత్వం ఉండేది. ఏ పనీ స్థిరంగా చేసేవాడు కాదు. చదువుకోవాల్సిన వయసులో ఆడుకొనేవాడు. ఆటలాడుకోవాల్సిన సమయంలో కవిత్వం రాస్తుండేవాడు. ఊళ్ళో వాళ్లెంత మెచ్చుకొంటున్నా ఇంట్లోవాళ్లచేత తిట్లు తింటుండేవాడందుకే. కృష్ణకున్న స్థిమితంలో పాతికోవంతు  ఆంజనేయులుకున్నా నిజంగా చాలా మంచిపేరు తెచ్చుకొనుండేవాడే.

నేను డిగ్రీ చదువులకని మా తాతగారి ఊరికెళ్ళిపోయిన తరువాత ఆంజనేయులు సంగతేమయిందో పట్టించుకోలేదు.

నేను విజయవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నరోజుల్లో ఓ రోజు ఆంజనేయులు నన్ను వెదుక్కొంటూ వచ్చాడు. వయసు అతనిలో ఆట్టె మార్పు తీసుకురాలేదు. కూర్చున్న పదినిమిషాల్లో వంద విషయాలను గురించి మాట్లాడాడు. మనది వాస్తవంగా లౌకిక ప్రజాస్వామ్యమేనా? అన్న అంశంనుంచి.. పారలల్ సినిమావరకు.. అన్ని అంశాలమీద అడక్కుండానే  సుబ్బారావు. చనువున్నవాళ్లు సుబ్బు అంటారు. ఆంజనేయులికి హిపోక్రసీ అన్నది తెలీదు. అదే అతనిలో నాకు నచ్చే గుణం.
అతను ఇచ్చిన కథ ఎడిటరుగారికి నచ్చింది.
ప్రచురించబడిన తరువాత నేనే అతనికి స్వయంగా కబురు చేసాను. ముందు ముందు ఇంకా మంచి కథలు రాస్తుండమని సలహాకూడా ఇచ్చాను.
రెండు నెలల తరువాత ఒక నవల పంపించాడు. బాగుంది. కొద్దిమార్పులతో ప్రచురించడానికి అంగీకారమయింది.
క్రమంగా ఆంజనేయులు రచయితగా మిగతా పత్రికల్లోకూడా కనిపించడం మొదలుపెట్టాడు.
రేడియోలో అతను రాసిన నవలలు రావడం మొదలుపెట్టాయి.
కవి సమ్మేళనాల్లో అక్కడక్కడా కనపడుతుండేవాడు.
ఒక నాటకపరిషత్తులో పోటీ నాటకాలు ప్రదర్శిస్తున్నారు. 'రివ్యూ'కోసం పత్రిక తరుఫున నేనే హాజరవుతున్నాను. రెండో రోజున భుజాన వేళ్లాడే సంచీతో  ప్రత్యక్షమయ్యాడు ఆంజనేయులు. నరసరావుపేటనుంచి నాటకం తయారు చేసుకొచ్చాట్ట! అక్కడికి దగ్గర్లోనే ఒక స్కూల్లో టీచరుగా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చాడు. నాటకం బాగా పండింది. ఆంజనేయులు మూగవాడిపాత్రలో అద్భుతంగా నటించాడు. దర్శకత్వం అతనిదే. రచన సంగతి  సరేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డు ఆ సంవత్సరం ఆంజనేయులికి దక్కింది. 'అందుకేనన్న మాట ఈ మధ్య పత్రికల్లో ఎక్కువగా కనిపించడం లేదు' అన్నాను అతన్ని అభినందిస్తూ.
చిన్నగా నవ్వాడు ఆంజనేయులు 'సుబ్బూ! ఒకసారి నువ్వు మా ఊరు రావాలి!' అన్నాడు.
'ఏమిటీ విశేషం?'
'అఖిల భారత స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నాం. నువ్వూ ఒక జడ్జిగా ఉంటే బాగుంటుంది'
'అమ్మో! పాటలగురుంచి నాకు ఏబిసిడిలు కూడా తెలీవన్నా!' అన్నాను. 
మేమందరం ఆంజనేయుల్ని 'అన్నా' అనే పిల్చేవాళ్లం కృష్ణతోపాటే.
'అలాంటివాళ్ళే నిజమైన న్యాయనిర్ణేతలవుతారు. నీకెందుకు.. నువ్వు రా!' అంటూ అడ్రసూ డేటూ ఇచ్చి వెళ్ళిపోయాడు.
ఆంజనేయులు నిజంగానే పాటల పోటీని భారీ ఎత్తున నిర్వహించాడు. అది చిన్న ఊరే అయినా ఆంజనేయులు  టీచరుగా వెళ్ళినతరువాత ఊరు పరిస్థితుల్లో చాలా మార్పులు తెచ్చాడని చెప్పారు అక్కడి జనం. ముఖ్యంగా కుర్రకారులో అతనికి మంచి ఫాలోయింగుంది. పెద్దవాళ్లలో గౌరవమూ ఉంది. పిల్లకాయల పోరంబోకు తిరుగుళ్ళు తగ్గాయి అన్నారు పెద్దవాళ్ళు. ఊరిపెద్దల సహకారం లేనిదే అంత పెద్ద కార్యక్రమం చెయ్యడం బైటివాళ్లకు సాధ్యం కాదు. మొత్తానికి నేను ఆ ఊళ్లో ఆంజనేయులు మరో అవతారం చూడగలిగాను. అప్పటిదాకా చూడని అవతారం.. సోషల్ వర్కర్ అవతారం!
ఊళ్లో ఉచితవైద్యం చేస్తున్నాడు. అందుకోసం పుస్తకాలు తెప్పించుకొని చదువుతున్నాడు. 'రిజిస్ట్రేషన్ లేకుండా వైద్యం చేయడం నేరంకదా!' అనడిగితే కలకత్తా బ్రాండ్ 'ఆర్ ఎం పి' సర్టిఫికేట్ చూపించాడు. మొత్తానికి అతని ఆశయం సేవే. లాభార్జన కాదు. చిన్న చిన్న రోగాలకే వైద్యం చేస్తున్నది.. ఉచితంగా. 'కొద్దిగా కాంప్లికేటేడ్ గా ఉన్నా పట్నం పొమ్మంటా' అన్నాడు ఆంజనేయులు.
ఊళ్ళో ఓ చిన్న గ్రంథాలయంకూడా పెట్టించాడు. అన్నింటికన్నా ముఖ్యమైనది ఊరిసమస్యలని పరిష్కరించే విధానం. బోరింగుల్లోకి నీరు రాకపోయినా, వీధిదీపాలు వెలక్కపోయినా, వినాయక చవితి, శ్రీరామనవమిలాంటి పండుగలకి ఉత్సవాలు ఏర్పాటు చేయాలన్నా, పంచాయితీ బోర్డు వరండాలో కూర్చుని పబ్లిగ్గా  అందరిముందు చర్చించుకొనే అలవాటు చేయించాడు. ఆంజనేయులు ఒక్క టీచరే కాదు.. ఊరి పెద్దల్లో ఒకడూ, ముఖ్యుడూ అయికూర్చున్నాడు.

'ఇన్నిపనులు చెయ్యటానికి నీకు టైమెక్కడిదన్నా?' అనడిగాను ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు.
'ఇల్లు పట్టకుండా తిరుగుతుంటారు. నువ్వైనా చెప్పు బాబూ! ఆరోగ్యం సంగతి చూసుకోవద్దూ!' అంది ఆంజనేయులు భార్య,
ఆమె కంప్లయింటు సమంజసమైందే అనిపించింది. కానీ నేను ఆంజనేయులుకి చెప్పేటంతటివాడినా!
'ఇప్పుడంటే ఫరవాలేదు. ఇంట్లోకి ఒక బిడ్డ వచ్చినతరువాత కూడా తిరుగుతానంటే ఎట్లా?' అందామె.
'అప్పటి సంగతి చూద్దాంలేవే!' అని నవ్వి ఊరుకొన్నాడు ఆంజనేయులు.
అప్పటికి ఆంజనేయులు భార్య గర్భంతో ఉంది. అదీ ఆవిడ భయం.
ఆంజనేయులు ఇంట్లో లేనప్పుడు అందామె 'నువ్వూ మా కృష్ణలాంటివాడివే బాబూ! నీకు కాకపోతే మరెవరికి చెప్పుకోవాలి నేను! వినేందుకు ఎవరున్నారు గనక! నన్ను చేసుకొన్నారని ఆయన్ని వాళ్లవాళ్ళు వెలేసినంత పని చేసారు. ఎవరూ ఇటువైపు రారు. మా వాళ్లు మరీ మొరటువాళ్ళూ' అని కన్నీళ్లు పెట్టుకొందావిడ.
ఆంజనేయులు ఇంతకుముందు పనిచేసిన ఊళ్ళోనే ఈ పెళ్ళి చేసుకొన్నాడు. కులాతర వివాహం. ఎవరు వారించినా వినకుండా చేసుకొన్నాట్ట! ఆయన బ్రాహ్మడు. ఈవిడది షెడ్యూల్డ్ కులం. ఇరువైపుల పెద్దలకూ ఈ వివాహం ఇష్టంలేకపోయింది. ఆ ఊళ్లోవాళ్ల బాధపడలేకే ఇక్కడికి బదిలీ చేయించుకొన్నాడు ఆంజనేయులు.
ఆంజనేయులు కులాంతర వివాహాలను గురించి కొన్ని కథలు రాసాడు. తను రాసిందె  ఆచరించి చూపించాడు. రియల్లీ గ్రేట్! ఆంజనేయులు ఎంతో వృద్ధిలోకి రావాలని కోరుకొన్నాను ఆ క్షణంలో.
 
తరువాత నేను ఉద్యోగం మారి ఢిల్లీ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడే దాదాపు మూడు దశాబ్దాలు ఉండిపోయాను. పెల్లలు అక్కడే పెరిగి పెద్దవాళ్లయారు. మధ్య మధ్యలో ఆంధ్రావైపు వస్తున్నప్పుడు ఆంజనేయుల్ని గురించి వాకబు చేస్తుండేవాణ్ణి. ఉద్యోగాల రీత్యా అతనెక్కడెక్కడో ఉంటుండేవాడు. ప్రతిసారి ఏదో కొత్త ఆడ్రసు చెప్పేవాళ్ళు.
ఒకసారతన్ని మాచర్లలో పట్టుకోగలిగాను. మనిషిలో చాలా మార్పు వచ్చింది. ఇద్దరు పిల్లలు. పెద్దది పాప. సెకండ్ క్లాసు. రెండో వాడు యూ.కె.జి. చాలా చురుకుగా ఉన్నారిద్ద్దరూ. అచ్చు తండ్రి చురుకుతనమే. కదిలిస్తే చాలు ఇంగ్లీషులో రైమ్సు.. తెలుగులో పద్యాలు గడ గడ చదివేస్తున్నారు. పిల్లలిద్దర్నీ డ్యాన్సు స్కూల్లో చేర్పించారు.
'మైత్రికి పెయింటింగ్ కాంపిటీషన్లో టౌన్ మొత్తానికీ ఫస్టొచ్చింది.  ఇదిగో ప్రైజ్. చిన్నాడుకూడా చిచ్చర పిడుగే. వీడికీ సీతారామరాజు ఫ్యాన్సీడ్రెస్ కాంపిటీషన్లో ప్రయిజొచ్చింది. సంగీతంకూడా నేర్పించాలని ఉంది. క్లాసులో ఇద్దరూ ఫస్టే!' అన్నాడాంజనేయులు.  అక్కడున్నంత సేపూ మొగుడూ పెళ్ళాలు తమ పిల్లల్ని గురించే మాట్లాడారు.
'నువ్వేమన్నా వేరే ఏక్టివిటీస్ చేస్తున్నావా అన్నా?' అనడిగాను.
లోపలికి వెళ్లి ఓక ఫోటో ఆల్బమ్, రెండు పుస్తకాలు పట్టుకొచ్చాడు. అల్బంనిండా వాళ్ళ పిల్లల ఫోటోలే. రకరకాల భంగిమల్లో.. రకరకాల చోట్ల తీసినవి.
'వీళ్ళకోసం ఫొటోగ్రఫీ నేర్చుకొంటున్నాను. ఈ ఫోటోలన్నీ నేను తీసినవే. బాగున్నాయా?' అనడిగాడు.
నిజంగా ఫోటోలు బాగా వచ్చాయి. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ తీసిన స్థాయికి ఏమాతం తగ్గవు అవి. ఆంజనెయులు చెయ్యి ఎందులో పడినా అంతే! బంగారం! అందులోనుంచి మచివి రెండు ఏరి ఇచ్చాడు. 'నీకు తెలిసిన పత్రికల్లో వీలుంటే వేయించు' అన్నాడు.'పాటలు రాశాను కొన్ని. 
బాలల గేయాలు.. గేయ కథలు ఉన్నాయనుకో! మా పిల్లలకు అర్థమయ్యే భాషలో వాళ్ళకి నోరుతిరిగే రీతిలో బాణీలు కట్టి రాసినవి. మైత్రీ! ఒక పాట పాడమ్మా! 'ఛుక్ ఛుక్ రైలు వస్తోంది..' అంటూ అందించాడు. వెంటనే ఆ పాప ఆ పాట అందుకొని దాదాపు ఐదారునిమిషాలు ఆపకుండా పాడుతూ పోయింది. మధ్య మధ్యలో చిన్నపిల్లవాడు అక్కకు తోడుగా వంత కలపడం..!
'వీళ్ళు పాడే పాటలన్నీ నేను రాసినవే. వీళ్లకోసమే రాసాను. వీటిని కేసెట్టుల్లోకి ఎక్కించాను. ఇందులో ఏమన్నా పనికొస్తయేమో!' అంటూ కేసెట్టూ.. పుస్తకమూ అందించాడు. మొత్తానికి అక్కడ కూర్చున్న రెండుగంటలూ ఆంజనేయులు తన పిల్లల్నిగురించి తప్ప వేరే విషయాల జోలికి పోలేదు. మధ్యలో ఎప్పుడన్నా పొరపాటున వేరే టాపిక్ లోకి వెళితే ఆయన భార్య వెంటనే   సవరించేది. వాళ్ల ప్రపంచమంతా ప్రస్తుతం ఆ ఇద్దరి పిల్లలతోనే నిండిపోయిందని తెలుస్తూనే ఉంది.
'తమ పిల్లలకు అందుబాటులో లేనిదేదీ ఊహించే స్థితిలో లేడు ఆంజనేయులు' అనిపించిందా  క్షణంలో.
నాకు పరిచయమున్న పత్రికకు అతనిచ్చిన ఫొటోలు, గేయాలు పంపించాను. రెండు ప్రచురించారు. మంచి స్పందనా వచ్చిందని చెప్పారు.
'పిల్లల శీర్షికలకన్నా రెగ్యులర్ గా కాంట్రిబ్యూట్ చేయ'మని ఎంకరేజింగ్ గా సలహా ఇస్తూ ఆంజనేయులకి ఉత్తరం రాసాను.
కొన్నేళ్ళు ఆంజనేయులు రెగ్యులర్ గా రచనలు పంపించాడుట. 'మంచి క్వాలిటీ ఉంటుంది. ప్యూర్ ఒరిజినల్స్' అని మెచ్చుకొన్నారు ఎడిటరుగారు నేనొకసారి ఆయన్ని కలిసినప్పుడు. '.. కానీ ఈ మధ్య ఏవో కామిక్సు పంపిస్తున్నాడు. అవి అంత ఒరిజినల్ గా లేవు. అయినా ఫరవాలేదనుకొని కొన్ని ప్రచురిస్తున్నాం' అన్నాడాయన. అంటే ఆంజనేయులు పిల్లలు హైస్కూలు చదువులకు వచ్చారన్నమాట..' అనుకొన్నాను, 'ఇంకొద్దికాలంపోతె ఇవీ రాయడు చూడండి! సస్పెన్సు.. క్రైం థిల్లర్ టైపు నవలలొస్తాయి' అన్నాను ఆ ఎడిటరు మిత్రునితో.
మరో ఐదేళ్ళ తరువాత ఆ మిత్రుడు ఓ పెళ్ళిఫంక్షనులో కలిసాడు. ఆ మాటా ఈ మాటా అయిన తరువాత టాపిక్ నవలలమీదకు మళ్ళింది.
'అన్నట్లు.. మర్చిపోయా!.. మన ఆంజనేయులు ఈ మధ్య ఒక క్రైం థిల్లర్ పట్టుకొచ్చాడు. అగాథ క్రిస్టీకి నకలుగా ఉందది. అతని దగ్గర్నుంచి రావాల్సిన నవల కాదది. వేస్తే పత్రికకూ, అతనిక్కూడా  పేరు పోతుంది. చూస్తాలే.. అని పక్కన పెట్టేసాను' అన్నాడు.
ఈ మలుపు నేనూహించిందే అయినా.. ప్రాణం ఉసూరుమంది. ఆంజనేయుల్లో ఎంత టేలెంటుంది! ఎంత వెర్సటాలిటీ ఉంది!  ఏమయిందా ప్రతిభంతా?!
తరువాతా కొంతకాలానికి ఆంధ్రా వైపొచ్చానుగాని.. పని వత్తిడివల్ల అతన్ని కలుసుకోవడానికి కుదరలేదు. 
తరువాత ఎప్పుడో అనుకోకుండా ఓ పెళ్ళిలో కృష్ణ కలిసాడు. చాలా ఏళ్ల తరువాత కలుసుకొన్నాం.. గంటలకొద్దీ మాట్లాడుకున్నా కబుర్లు తరగడం లేదు.
'ఇట్లా కాదు.. ఒకసారి మా ఇంటికి భోజనానికి రారా!' అని బలవంతాన ఇంటికి తీసుకువచ్చాను మర్నాడు. రాత్రి భోజనాలయిన తరువాత ఇద్దరం డాబామీద  కూర్చొని కబుర్లలో పడ్డాం. టాపిక్ అటు తిరిగి ఇటు తిరిగి ఆంజనేయులుదగ్గరికొచ్చి ఆగింది.
నేనే అన్నాను 'మీ అన్నయ్య నిజంగా ఎంత టేలెంటు ఉన్నవాడూ! సిన్సియర్! కులాంతర వివాహం చేసుకొన్నాడని మీరంతా ఆయన్ని దూరం పెట్టడం ఏం బాలేదురా! ఇంట్లో వాళ్లంతా వేలేస్తే ఆ లోటు పూడ్చుకోడానికి ఆ రోజుల్లో అతను చేసిన సోషల్ సర్వీసు అపూర్వం.  అట్లాంటివాడు పిల్లలు పుట్టేసరికి అప్పటివరకూ తాను సేవించిన సొసైటీనికూడా పూర్తిగా మర్చిపోయి .. ఆ పిల్లలలోకంలోకి వెళ్ళిపోయాడు!..  ఎంత విచిత్రమైన మనిషో!' 
కృష్ణ అందుకొని మిగతా భాగం పూర్తిచేసాడు '.. అన్నయ్యంటే ఇంట్లో అందరికీ అభిమానంగానే ఉండేది. వేరే కులం పిల్లని చేసుకొన్నాడని ఇంట్లో వెలేయకపోతే చెల్లెళ్లకు పెళ్ళిళ్ళవడం కష్టమయేదిరా! పోనీ అక్కడన్నా స్థిరంగా ఉన్నాడా అంటే..  అదీ లేదు. నువ్వు చెప్పిందీ నిజమే! పిల్లలే లోకంగా మసిలేవాడు. వాళ్లమీదే ఆశలన్నీ పెట్టుకొన్నాడు. వాళ్ళకోసమే తను ఇంతకాలంగా ప్రేమించి పెంచుకొన్న కెరియర్నికూడా కాదని కాలదన్నుకొన్నాడు. కానీ.. చివరికేమైందీ!..'
'ఏమైందీ?!' నా మనసేదో కీడు శంకింస్తోంది.
'కూతురు  అమెరికా పోయి తనలాగే వేరే దేశంవాడిని పెళ్ళి చేసుకొంది. తండ్రితో సంబధాల్లేవు. కొడుకిక్కడే ఉన్నాడుగానీ.. అబ్బపొడ గిట్టదు. తాను కోరుకొన్న కోర్సులో  చేర్పించలేదని అలిగి ఇంట్లోనుంచి వెళ్ళిపోతే వెదికి తెచ్చుకొన్నాడా ఉద్ధారకుణ్ణి. ఉన్నదంతా ఊడ్చి వాడి చదువులకు సమర్పించుకొన్నాడు. చివర్రోజుల్లో బికారిగా మారాడు. వదిన చచ్చిపోయింది. కొడుకూ కోడలే ఆధారం వాడికి ఇప్పుడు. వాళ్ళు చీదరించుకొంటున్నా పడుండక తప్పని దౌర్భాగ్యం' కృష్ణ కళ్ళల్లో నీళ్ళు.
'మరి ఈ మధ్య ఏదో గేయం చూసానే! ఏదో పత్రిక్కి పోటీకి పంపించిందీ?!' అనడిగాను ఆశ్చర్యంగా.
'పంపే ఉంటాడులే! కొడుకూ, కోడలూ ఉద్యోగాలకు వెళుతున్నారుగదా! పసిపిల్లల్ని వీడిమీద పడేసి పోతున్నారు. ఆ పసివాళ్లకోసం  పాటలూ.. గట్రా ఏవన్నా  కడుతున్నాడేమో మళ్ళీ! అదేగా వాడి బలం.. బలహీనతా!' అన్నాడు కృష్ణ  నిర్వేదంగా!
'శాపవశాన తన శక్తి తనకు తెలీని హనుమంతునివంటి వాడు ఆంజనేయులు. జాంబవంతుడికా శాపం తెలుసు. కనకనే రామాయణ ధర్మకార్యానికి అతన్ని యుక్తియుక్తంగా ఉపయోగించుకొన్నాడు. అసమాన ప్రతిభా సామర్థ్యాలున్న ఆంజనేయుల్లాంటి వాళ్లను సద్వినియోగించుకొనే జాంబవంతులు సమాజంలో, వ్యవస్థలో క్రమంగా  తరిగి పోతున్నారు. అదే ఈ కాలం  పెను విషాదం.' అనిపించింది నాకు.
-కర్లపాలెం హనుమంతరావు
***
                   
(రచన మాస పత్రిక  2003- ఫిబ్రవరి- 'కథాపీఠం' పురస్కారం)
మరియు
తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘము- తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్, న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ వారు శీ తారణ ఉగాది ఉత్సవాల సందర్భంగా ప్రచురించిన  'తెలుగు వెలుగు' సావనీరు లో ప్రచురితం)





Wednesday, August 5, 2015

బతకనేర్చిన వాడు- చిన్నకథ

రాంబాబు నావలో బొబ్బర్లంక చేరాడు. అల్లుడుగారిని రిసీవ్ చేసుకోడానికి వెంకయ్యగారే స్వయంగా ఒడ్డుమీద వేచివున్నారు. వెంకయ్యగారు ప్రస్తుతం ఆ పరగాణామొత్తానికి ఎన్నికైన ప్రజాప్రతినిధి.

సామానంతా దిగింతరువాత అందరితోపాటే నావయజమాని రామలింగానికి రవాణాచార్జీలు చెల్లించబోయాడు రాంబాబు. రామలింగం చాలా నొచ్చుకొన్నాడు
'వెంకయ్యగారి అల్లుడంటే ఊరంతటికీ అల్లుడేనండీ బాబూ! అల్లుళ్లదగ్గర డబ్బులు దండుకొనే అథమస్థాయికి చేరలేదండీ ఈ రామలింగం ఇంకా!' అంటూ ఏవేవో నిష్ఠురాలాడాడు.
వెంకయ్యగారు రొయ్యమీసాలు మెలేసుకొంటూ అంతా ప్రసన్నంగా విన్నారు.
మామగారికా ఇలాకాలో ఎంత మందాన మర్యాద మన్ననలు అందుతున్నాయో స్వయంగా చూసిన అల్లుడురాంబాబు ఆనందంతో తబ్బుబ్బయిపోయాడు.
పెద్దపండుగ మూడురోజులు అదే పద్ధతిలో బ్రహ్మాండంగా గడిచిపోయింది రాంబాబుకు అత్తారూర్లో.
భార్యాపిల్లలు మరో వారం రోజులుండి వస్తామన్నారు.  ఏడాదికి సరిపడా ఊరగాయ పచ్చళ్ళు, పండుగకట్నంగా మామాగారిఛ్చిన టీవీ సెట్టులాంటి భారీసామానుతో ఒంటరిగానే తిరుగు ముఖం పట్టాడు రాంబాబు. వెంకయ్యగారే స్వయంగా లాంచిదాకా వచ్చి వీడ్కోలు పలికారు.
నావ అవతలి ఒడ్డు చేరుకోగానే ప్రయాణీకులంతా రామలింగానికి చార్జీలు చెల్లించి సామాను దింపుకొని పోతున్నారు. వెంట తెచ్చుకొన్న సామాను దింపించుకొని పోయేందుకు రామలింగంకోసం ఎదురుచూస్తూ నిలబడున్నాడు రాంబాబు.
రామలింగం ఇటువైపు రావడంలేదు సరికదా.. రెండుమూడుసార్లు పిలిచినా విననట్లే ఎటో వెళ్ళిపోతున్నాడు! రాంబాబుకి పరిస్థితి పూర్తిగా అర్థమయింది. మామగారు ఎదురుగా లేరు కదా! ఈ ఓడమల్లయ్య ఇప్పుడు నిజసరూపం చూపిస్తున్నాడన్నమాట!
చేసేదేముంది! రాంబాబూ అందరికిమల్లేనే రవాణా చార్జీలు రామలింగం చేతిలో పోసి 'ఇహనైనా నా సామాను వడ్డున పెట్టిస్తారా?' అనడిగాడు సాధ్యమైనంత వెటకారం జోడిస్తూ!’
రామలింగం అదేమీ పట్టించుకోకుండా వెకిలిగా నవ్వుతూ 'అల్లుడుగారు వచ్చినప్పటి  చార్జీలుకూడా ఇప్పిస్తే .. ఇదిగో ఇప్పుడే సామాను వడ్డుమీదకు పట్టిస్తా..' అనేసాడు.
అవాక్కయిపోవడం రాంబాబు వంతయింది.
దక్కిస్తూ పాత చార్జీలుకూడా పైసలుతో సహా రామలింగానికి సమర్పించుకొని సామాను వడ్డుకు పట్టించుకొన్నాడు బతుకుజీవుడా అనుకొంటో!
'బతకనేర్చినవాడురా బాబూ!' అని గొణుక్కునే రాంబాబు దగ్గరికొచ్చి 'హి.. హి..హి' అన్నాడు రామలింగం 'తెలుసు బాబూ! తవరు నన్ను 'బతకనేర్చిన వాడురా బాబూ!' అని తిట్టుకొంటున్నారని తెలుసు. మరేం చెయ్యమన్నారు  చెప్పండల్లుడుగారూ! ఇదంతా మీ మాంగారిదగ్గర్నుంచి వంటబట్టించుకొన్న విద్యేనండీ బాబూ! ఎన్నికలముందు ఇంటిగుమ్మందాకా వచ్చి మరీ ఓటుకు  ఓ ఐదొందలనోటు చొప్పున  లెక్కెట్టి  ఇచ్చిపోయారండీ ధర్మప్రభువులు! అందరం ఓట్లేసినాం. ఎన్నికల్లో గెల్చినారు సారు. మేం ఎన్నుకొన్న ప్రజాప్రతినిధేకదా.. ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినారు కదా అని.. మా పేదోళ్లందరికీ తలా ఓ నాటుపడవైనా ఇప్పించమని ఆడగాడానికని వెళ్ళాం బాబూ! ఏం చేసారో తెలుసా మీ మాంగారు? నావలు కొనుక్కోడానికి బ్యాంకోళ్ళు ఇచ్చే అప్పుకు సిఫార్సు చేయడానికి మడిసికి ఐదువేలు చొప్పున లెక్కెటి మరీ  వసూలు చేసేసారండీ! పెద్దోళ్లకేనా మరి బతకనేర్చిన విద్యలన్నీ? పేదోళ్ళకు మాత్రం కావద్దా? మేం నేర్చుకొంటేనే తప్పయిపోతుందాండీ? ఏం చోద్యం సాగుతోందండీ లోకంలో!’ అంటూ నావను నెట్టుకొంటో వెళ్ళిపోయాడు రామలింగం.
-రచనః కర్లపాలెం హనుమంతరావు
***



Monday, August 3, 2015

వరపరీక్ష- కథ


కథ 
వరపరీక్ష 
- కర్లపాలెం హనుమంతరావు 
( విపుల మాసపత్రికలో ప్రచురితం ) 

దమయంతి-పేరు ఎంత అందంగా ఉంటుందో.. మనిషీ అంతే అందంగా ఉంటుంది. బీఫార్మసీ చదువుకొంది. ఎమ్ ఫార్మసీ కూడా చేయాలనుకొందికానీ.. 'కోర్సు పూర్తయ్యేదాకా వెయిట్ చేయలేను. నా రిటైర్మెంటు అయేలోపు నిన్నో అయ్యచేతిలో పెడితేనే నాకు మనశ్శాంతి' అన్నాడు తండ్రి విశాఖరావు. తండ్రిమాటే ఆ యింట్లో చివరిమాట. ఆ సంగతి చిన్నతనంనుంచి దయయంతికి తెలుసు కనకనే ఎదురు చెప్పలేదు.

పెళ్ళిచూపులకు వస్తున్న ఆరో పెళ్ళికొడుకు సుబ్బారావు. హైదరాబాదులో ఏదో సాఫ్టువేరు ఉద్యోగం. తల్లినీ, మేనమామను తీసుకొని చూడ్డానికి వచ్చాడా ఆదివారం.

ఫార్మాలిటీసన్నీ పూర్తయ్యాక దమయంతి వచ్చి కూర్చుంది. ఈ కాలంలో ఎవరూ
'ఒకసారి లేచి నిలబడు!.. పాటలు పాడటం వచ్చా?.. వంట బాగా చేస్తావా?' లాంటి మరీ పాతకాలం ప్రశ్నలు అడక్కపోయినా.. పిల్లను నఖశిఖపర్యంతం శల్యపరీక్ష చేయడం మాత్రం ఏదో ఒక విధంగా సాగుతూనే ఉంది. సంప్రదాయాలను మధ్యతరగతి జీవులు అంత తొందరగా వదిలించుకొంటాయా?!

అటూ ఇటూ కాస్సేపు మాటా మంతీ అయిన తరువాత 'వెళ్ళి కబురు చేస్తాం.. ఏ సంగతీను' అంటూ లేచారు మగపెళ్ళివారు.

అప్పుడు చెప్పింది దమయంతి తన మనసులోని మాట తల్లిదండ్రులతో. 

'బాగుండదేమోనే!' అని ఒక వంక తల్లి గునుస్తున్నా.. 'వాళ్లకి అభ్యంతరం లేకపోతే మనకు మాత్రం  అభ్యంతరం ఎందుకుండాలి? చూద్దాం..' అంటూ విషయం పెళ్ళికొడుకు మేనమామ చెవిలో వేసాడు తండ్రి విశాఖరావు.
'పెద్దవాళ్లం మనం ఎన్ని మాట్లాడుకొన్నా.. పిల్లల మనసుల్లో ఏవేవో ఆలోచనలు ఉంటాయి. కాలం అలా ఉంది. కానివ్వండి! మరో పది నిమిషాలు కూర్చుంటాం' అన్నాడు ఆ మేనమామ.

మేడమీద దమయంతి గదిలోనే సమావేశం ఏర్పాటయింది. పెద్దవాళ్లముందు బిడియంగా కూర్చున్న దమయంతి సుబ్బారావుముందు కాస్త స్వేచ్ఛగానే  మాట్లాడింది. 'మీ మామయ్యగారికి ఆడపిల్లలు లేరా?'
సుబ్బారావుకి అర్థమయింది. 'ఉన్నారు. మేనరికాలు చేసుకోవడం నాకే ఇష్టం లేదు.' అన్నాడు సుబ్బారావు.
అభినందనపూర్వకంగా చూసింది దమయంతి. 'కాలేజీలోగానీ.. ఆఫీసులోగానీ.. క్లోజ్ ఫ్రెండ్స్?'
'యూ మీన్.. గార్ల్ ఫ్రెండ్స్? ఉన్నారు. కానీ ఫ్రెండ్షిప్ వరకే పరిమితం. లిమిట్లో ఉండటం అమ్మ నేర్పింది. అమ్మకు కష్టం కలిగించే పని చేయడం నాకిష్టం ఉండదు మేడమ్!' అన్నాడు సుబ్బారావు కాస్త దృఢంగా.

'మా అమ్మ నన్ను కార్తికమాసంలో చన్నీళ్ల స్నానంచేసి గుడిచుట్టూ పొర్లుదండాలు పెట్టమని పోరుతుంటుందండీ! దణ్నాలు పెట్టుకోవడం వరకూ ఓకేనేగానీ.. మరీ అలా తడిబట్టలతో పబ్లిగ్గా పొర్లుదణ్ణాలంటే.. నో వే.. అమ్మకాదుగదా.. బ్రహ్మదేవుడొచ్చి చెప్పినా నేను చేయలేను సార్!' అంది దమయంతి.

సుబ్బారావుకి అందులో తప్పు పట్టాల్సిందేమీ కనిపించలేదు.
'మనకు నష్టం.. కష్టం కలిగించేటట్లుంటే.. ఎవరు చెప్పినా వినాల్సిన పనేం లేదులేండి. మా అమ్మకు జనరల్ బుక్స్ చదవడం ఇష్టం ఉండదు. ఆ బుక్స్ చదివితేనేగదా మన మనసులు విశాలమయేది? అలాగని  ఆమెకు నచ్చచెప్పే వయసా నాది? టెక్స్టుబుక్కులో చందమామ దాచిపెట్టి చదువుతుండేవాణ్ణి చిన్నతనంలో. పెద్దాళ్లని హర్టు చేయకుండా ఉంటే  చాలన్నది ఒక్కటే నా ఉద్దేశం' అన్నాడు సుబ్బారావు.

కొద్దిగా ఉడుక్కున్నట్లుంది అతని మొహం. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటేతప్ప కొత్తవాళ్లదగ్గర ఎవరూ అలా బైటపటరు. దమయంతికి ముచ్చటనిపించింది.

తలుపుదగ్గర అలికిడికి అటు తిరిగి చూసారిద్దరూ. తల్లి కాఫీకప్పులతో గుమ్మందగ్గర నిలబడి ఉంది. అందుకోవడానికి గుమ్మందగ్గరికి వెళ్ళిన కూతురితో 'ఇంకెంత సేపే? వాళ్ళు ఎదురు చూస్తున్నారు. బాగుండదు. కాఫీలు తాగి కిందకు 
వచ్చేయండి!' అని హచ్చరించి పోయింది తల్లి.

విన్నట్లున్నాడు .. లేచి నిలబడ్డాడు సుబ్బారావు. 'కాఫీలు కింద తాగుదాం.. పదండి!' అన్నాడు కప్పు అందుకొంటూ.

'ఒన్ మినిట్' అంటూ దమయంతి బీరువా తలుపుతీసి ఓ కవరు బయటకు తీసి సుబ్బారావు చేతిలో పెట్టి అంది 'కాస్త దీన్ని మీరు హైద్రాబాదులో పోస్టు చేస్తారా? ఇక్కడ చేయద్దు! మర్చిపోకుండా రేపే చేయండి.. ప్లీజ్!'

'వై నాట్?' అని కవరందుకొన్నాడు సుబ్బారావు. కవరుమీద 'ఎ.నాగరాజు, 6342/ఎ, అరండల్ పేట, గుంటూరు-20' అని ఉంది. ఫ్రమ్ అడ్రస్ లేదు!

 'ఎవరీ నాగరాజు? కవరింతగా బరువుగా ఉందేంటీ? ఏముంది ఇందులో? ఫ్రం అడ్రసు లేదెందుకు? గుంటూరు చిరునామా ఉన్నా గుంటూరులో పోస్టు చేయద్దా? ముక్కూ మొగం తెలీని తనకు ఈ కవరు పోస్టుచేసే పని అప్పచెప్పడంలో ఆంతర్యమేమన్నా ఉందా?  అడిగితే బాగుంటుందా? బాగుండదా? అన్నీ సందేహాలే సుబ్బారావు మనసులో.

హైదరాబాదు వచ్చిన రోజునే ఆ కవర్ ని  పోస్టు చేసాడు యథాతథంగా సుబ్బారావు.

దమయంతి సంబంధం తల్లికీ నచ్చడంతో సుబ్బారావుకి ప్రాణం లేచివచ్చింది.
'పిల్లవాళ్లది మంచి కుటుంబం. తండ్రి చేసే యూనివర్శిటీలో విచారాణ చేయించాను. ఏ సమస్యలూ లేవు. అక్కమాత్రం మొదటి కాన్పు కష్టమై చనిపోయిందట. ఆ అమ్మాయి చదువుకొన్న కాలేజీలో కూడా బుద్ధిమంతురాలేనని చెప్పారు. మనం ముందుకు పోవచ్చు' అని మేనమామ నివేదిక అందించిన తరువాత 'ముహుర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం.. చెప్పండం'టూ కబురు చేసింది సుబ్బారావు తల్లి.

ఆ మాఘమాసంలోనే సుబ్బారావు ఒకింటివాడు అయిపోయాడు. 

మొదటి నిద్రలకని అత్తవారింటికి వెళ్ళిన రోజు సాయంత్రంపూట దమయంతి సుబ్బారావుని దగ్గర్లో ఉన్న రామాలయానికి తీసుకువెళ్ళింది.

అర్చనచేసే పూజారి చిన్నవయసువాడు. దమయంతిని చూసి ఇంతకుముందే పరిచయం ఉన్నవాడికి మల్లే చిరునవ్వుతో పలకరించాడు.

'తరచూ ఈ గుడికి వస్తుంటావనుకొంటా!' అనడిగాడు పూజాదికాలు అయిపోయి  ఆలయం మంటపంలో కూర్చున్న తరువాత సుబ్బారావు.

'ఈ పూజారబ్బాయి మా అక్క ఇంటర్ క్లాస్-మేట్. ఫ్లూట్ బాగా వాయిస్తాడు. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అక్కకు చదువు పిచ్చి. సబ్జెక్టుల్లో డౌట్ ఉన్నప్పుడల్లా క్లియర్ చేసుకొనేందుకు గుడికి వస్తుండేది. నేనూ తోకలాగా తనవెంటబడదాన్ని.   అదీ నా పరిచయం నాగరాజుతో' అంది దమయంతి నవ్వుతూ.

నాగరాజు పేరు వినంగానే పెళ్ళిచూపులప్పుడు దమయంతి తనకు అందించిన కవరు గుర్తుకొచ్చించి సుబ్బారావుకు. 'ఆ నాగరాజేనా ఈ నాగరాజు?' అనడిగాడు కవరు సంగరి గుర్తుచేసి.

'బాగానే గుర్తుందే మీకూ?!' అంది దమయంతి అదోరకంగా తమాషాగా నవ్వుతూ.

'ఎట్లా మర్చిపోతాను తల్లీ! అవునూ.. రెండు వీధుల దూరంలో ఉన్న ఈ నాగరాజుకి హైదరాబాదునుంచి ఉత్తరం పోస్టు చేయమనడమేమిటి?! అర్థంకాక చచ్చాను అప్పట్లో! ఇప్పటికైనా ఆ మిస్టరీ విప్పుతారా రాణీగారూ!' అన్నాడు సుబ్బారావు తనూ హాస్యరసం కొద్దిగా గొంతులో రంగరించి.

'అంతగా అర్థంగాక ఇబ్బంది పడేబదులు.. కొద్దిగా కవరు ఓపెన్ చేసి చూసేస్తే మిస్టరీ మొత్తం విడిపోయేదిగా మాస్టారూ!' అంది దమయంతి అంతే సరదాగా.

'చ.. చ! మా అమ్మ నాకు అట్లాంటి దొంగబుద్ధులు నేర్పలేదు' అన్నాడు సుబ్బారావు బుంగమూతి పెట్టి.

సుబ్బారావును ఆ ఫోజులో చూసినప్పుడల్లా దమయంతికి భలే సరదాగా ఉంటుంది. ఇంకా తమాషా చేయాలనిపిస్తుంది.
'అమ్మకొంగుచాటు అబ్బాయిగారూ! కవరు ఓపెన్ చేసి చూడకపోతే కాబోయే భార్య రహస్యాలు తెలిసేదెలా?'

'అవంత రహస్యాలే అయితే ఆ కాబోయే శ్రీమతిగారు ఆ కవరు నా చేతికి ఎందుకిస్తార్లెండి! మా శ్రీమతిగారికి ఆ మాత్రం మతిలేదని అప్పుడూ అనిపించలేదు. ఇప్పుడూ అనిపించడం లేదుగానీ .. అసలు విషయం చెప్పేయచ్చుగా చచ్చు తెలుగుసినిమాలా సాగదీసి చంపకపోతే!' అన్నాడు సుబ్బారావు.

 'అది చెప్పడానికేనండీ బాబూ ఈ పూట గుడివంకతో మిమ్మల్నిక్కడిదాకా తీసుకువచ్చింది.' అంటూ హ్యాండుబ్యాగులోనుంచి ఓ కవరు తీసి సుబ్బారావు చేతిలో ఉంచింది దమయంతి.

అదారోజు హైదరాబాదులో తను పోస్టు చేసిన కవరే! కవరుమీద ఆబిడ్స్ జి.పి.ఓ మొహర్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈమె చేతికి ఎలా వచ్చింది?!

'నాగరాజే నాకు తిరిగి ఇచ్చాడు. ఒకసారి ఓపెన్ చేసి చూడండి! అందుకే మీకిచ్చింది.'అంది దమయంతి.

'నో.. నో! అదంతా ఏం వద్దుగానీ.. ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు దమయంతీ! చాలు' అన్నాదు సుబ్బారావు.

దమయంతి కాస్త సుదీర్ఘంగానే సమాదానం ఇచ్చింది.

'అందరూ అనుకుంటున్నట్లు మా అక్క కాన్పు కష్టమై చనిపోలేదు. మా బావ చంపేసాడు దాన్ని అనుమానంతో. అక్కకూ నాగరాజుకూ  లింకుందని ఎవడో పనికిమాలిన కుంక ఆకాశరామన్న ఉత్తరం అఘోరిస్తే దాన్ని పట్టుకొని రోజూ అక్కని వేపుకు తిన్నాడు ఆ దుర్మార్గుడు.  ఇదొక రోజు ఏడుస్తూ ఇంటికొస్తే అమ్మానాన్నానే నచ్చచెప్పి వెనక్కి పంపించారు. దీనికి నెల తప్పినప్పటినుంచి వాడి సాడిజం మరీ పెరిగిపోయిందిట. పెళ్ళినాటికి ఇదింకా ఇంటర్లో అన్ని పేపర్లూ క్లియర్ చెయ్యలేదు. సబ్జెక్టుల్లో డౌట్లు తీర్చుకోవాటానికని గుడికి నాగరాజు దగ్గరకు వస్తుండేది. నిజం నిర్థారించుకోకుండా.. ఈ గుడి మండపంలో కూర్చుని సబ్జెక్టు డిస్కస్ చేసుకొనే టైంలో చాటుగా వచ్చి ఇద్దరిమీదా యాసిడ్ పోసి పారిపోయాడు బావ. అప్పటికిది నిండుగర్భిణీ.తొంభై శాతం వళ్ళు కాలి వారంరోజులు ఆసుపత్రిలో అల్లాడి కన్నుమూసింది. నాకు ఎక్కడ పెళ్ళికాదోనన్న భయంతో దాన్ని డెలివరీ టైం యాక్సిడెంటుగా మార్పించారు అమ్మానాన్న.' దమయంతికి ఏడుపును కంట్రోలు చేసుకోవడం కష్టంగా ఉంది.

'కూల్ డౌన్ .. దమయంతీ.. కూల్ డౌన్!' అన్నాడు సుబ్బారావు.

ఎప్పుడొచ్చి కూర్చున్నాడో నాగరాజు మిగతా కథ పూర్తిచేసాడు.

'అప్పట్నుంచీ దమయంతికి పెళ్ళంటే భయం. మగాళ్లంటే మంట. అసలు పెళ్లే వద్దని పటుపట్టుకు కూర్చుంటే తనని ఒప్పించడానికి మేం పడ్డతిప్పలు అన్నీ ఇన్నీ కావు సుబ్బారావుగారూ! ఈ కవరు ఐడియా నాదే! పెళ్ళిచూపులకని వచ్చినవాళ్ల చేతిలో  నా పేరు ఉన్న కవరొకటి పెట్టి పోస్టు చేయమని చెబుతుండేది.. ఇంట్లోవాళ్లకి తెలియకుండా. ఇప్పటిదాకా ఐదు సంబంధాలు వచ్చాయి.అందులో ఇద్దరు పెళ్ళికొడుకులు అసలు కవర్లే పోస్టు చేయలేదు. దమయంతిని  వాళ్ళే వద్దనుకొన్నారు. ఒకడు ఓపెన్ చేసి చూసి మళ్ళీ అంటించి పోస్టు చేసాడు. అంటే అనుమానం ఉన్నట్లేగదా! వాడిని ఈమె వద్దనుకొంది. ఇంకోడైతే ఓపెన్ చేసి చూడ్డమేకాదు.. పెద్ద అల్లరే చేసాడు. వాడిని అందరం వద్దనుకొన్నాం.

'ఈయనే ఏం చేయకుండా.. ఏం చూడకుండా బుద్దిగా కవరు పోస్టు చేసింది'అంది దుఃఖంనుంచి తేరుకొని  చిన్నగా మందహాసం చేస్తూ దమయంతి.

'అలాంటి బుద్ధిమంతుణ్ణేగా నువ్వు కావాలని కోరుకొన్నదీ!' అన్నాడు నాగరాజుకుడా చిన్నగా నవ్వుతూ.

'మావారు మరీ అంత బుద్ధిమంతులేంకాదులే నాగరాజూ! కవరు ఓపెన్ చేసి చూడకపోతేనేం.. అందులో ఏముందోనని మధన పడ్డారా లేదా!'అంది దమయంతి నిందాపూర్వకంగా.

బిక్కమొగమేసాడు సుబ్బారావు. ఫక్కుమని నవ్వొచ్చింది దమయంతికి.
భర్తవంక సీరియస్ గా చూస్తూ 'సార్! కవరిప్పుడు మీ చేతుల్లోనే ఉందిగా! ఓపెన్ చేయండి! ఏమనుకోనులే' అంది.

సుబ్బరాజు కవరు ఓపెన్ చేయకుండానే పరపరా చింపి నాగరాజు చేతిలో పెట్టి దమయంతి చెయ్యిపట్టుకొని బైటికొచ్చేసాడు.

'మీ లాంటి సహచరుడు దొరకడం నిజంగా నా అదృష్టం. మనసులు విప్పి మాట్లాడుకోవాల్సిన మొదటి రాత్రి ఇది. మీ మనసులో ఆ కాస్త మధనకూడా ఉండకూదదనే మిమ్మల్నిలా  రామాలయానికి తీసుకువచ్చి జరిగిందంతా చెప్పింది. సీతమ్మతల్లిని అంతలా క్షోభ పెటిన రాములవారంటే నిజానికి నాకంత భక్తికూడా లేదు ' అంది దమయంతి  ఆ రాత్రి భర్త ఎదమీద సేదతీరే సమయంలో.

'తప్పు కళ్ళు పోతాయి. రాముడు ఇంకా చాలా  వేరే కారణాలవల్ల దేముడు' అన్నాడు సుబ్బారావు భార్యను మరింత దగ్గరికి తీసుకొంటూ.

'ఏమో ! నాకు మాత్రం మీరే దేముడు' అని కళ్ళు మూసేసుకొంది దమయంతి.
***
-కర్లపాలెం హనుమంతరావు
(విపుల మాసపత్రికలో ప్రచురితం)


Friday, July 31, 2015

దిష్టిబొమ్మల వ్యాపారం- సరదా గల్పిక

ఉడయవర్లు పదిహేనేళ్ల కిందట అందరు కుర్రాళ్లకు మల్లేనే రెండు కంప్యూటర్ భాషలు టకటక నేర్చేసుకొని అమెరికా ఎగిరెళ్ళినవాడే! రోజులు బావోలేక రెండేళ్ల కిందటే ఇండియా తిరిగొచ్చేసాడు. ఇక్కడు పరిస్థితులు అప్పట్లో అంతకన్నా అర్థ్వానంగా ఏడ్చాయ్! స్వఛ్చందపదవీవిరమణ వంకతో చాలా కంపెనీలు బలవంతంగా ఉద్యోగుల్ని పీకేస్తున్నాయి. కొత్తగా వచ్చే కొద్ది ఉద్యోగాల్లో పెద్దతలల రద్దీనే ఎక్కువగా ఉంది. బాగా నడిచే బ్యాంకులూ ఉన్నట్లుండి బోర్డులు తిప్పేయడటంవల్ల అందులో పనిచేసే ఉద్యోగులూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి. వరస కరువులవల్ల పల్లెల్లో పనులక్కరువు. వృత్తిపని చేసుకొందామన్నా పెద్ద కంపెనీల వత్తిడి పెద్ద అవరోధంగా మారింది. బహుళజాతి కంపెనీల బహుకృతవేషాలముందు బక్కజాతి మనిషుల కళ ఎక్కడెక్కి వస్తుంది?! ఉన్న కాసిని ఉద్యోగాలీ సర్కార్లు ఔట్ సోర్సింగులకే సంతర్పణ చేస్తున్నదని తిట్టుకుంటూ కూర్చోలేదు ఉడయవర్లు. బిల్ గేట్ సు పీల్చి వదిలిని గాలిని మూడేళ్ళు పీల్చి వచ్చిన మల్లుడు ఉడయవర్లు. బ్యాంకులోనుకి దరఖాస్తు చేసాడు. ప్రోజెక్టు రిపోర్టు చూసి డైరక్టర్లకు మతిపోయింది. రోజుకు రెండుకోట్ల టర్నోవరు! పదిరోజుల్లో బ్రేక్ ఈవెన్. వరల్డ్ వైడ్ మార్కెటింగు! పోటీతంటాలేని వ్యాపారం! ‘వెయ్యిశాతం లాభం గ్యారంటీ!’ అంటున్నాడు ఉడయవర్లు! వినడానికి గిరీశం దంచే లెక్చర్లాగే ఉన్నా.. ఎకనామిక్సన్నీ మినిమమ్ రిస్కే చూపిస్తున్నాయి! ‘ఎండుగడ్డీ.. పాతగుడ్డలూ.. కర్రముక్కల్తో ఇదంతా సాధ్యమా!’ గుడ్లు తిప్పుతూ అడిగాడు బోర్డాఫ్ డైరక్టర్సు హెడ్డు. ‘ఇప్పటికే ఈ బిజినెస్ లో బిజీగా ఉన్నాను సార్! మిమ్మల్నేమీ మోసం చేసేందుకు రాలేదు. ఇరాక్ నుంచి ఆర్డర్సొచ్చి ఉన్నాయ్. చూడండి! అమెరికాకీ మన సరుకే కావాలి!అదీ అర్జంటుగా! బ్రిటన్నుంచి బొలీవియా వరకూ అందరికీ తొందరే! వెంట వెంటనే కావాలని వత్తిడి ఎక్కువైనందువల్లనే పెట్టుబడికోసం మిమ్మల్నాశ్రయించాల్సి వచ్చిందిగానీ.. విదేశీమారకద్రవ్యం వరదలా వచ్చిపడే మా ప్రాజెక్టుల్లో మేజర్ వాటాకోసం పెద్ద కంపెనీలే పోట్లాడుకొంటున్నాయ్! చెమట నాది.. సెంటు వాళ్లదవుతుందని నేనే సందేహిస్తున్నా’ అన్నాడు ఉడయవర్లు. ఉక్కిరి బిక్కిరయిపోయారు బ్యాంకు డైరక్టర్లందరూ! ఒక బొజ్జాయనకు మాత్రం ఇంకా అనుమానం పీకుతూనే ఉంది ‘అయితే మాత్రం చెత్తగడ్డికీ.. పాత గుడ్డపేలికలకీ .. పాతిక కోట్లా?!’ ‘పోనీ.. కుండపెంకులక్కూడా కలిపి ఇప్పించండి సార్!.. అవీ కావాల్సినవే దిష్తిబొమ్మల తయారీకి!’ ‘ఓ సారి ఓటికుండల ప్రదర్శన చేబడితే కోటి కుండపెంకులకుప్ప పోగవుతుంది. వాటినీ కొనాలా?!’ ఉద్యోగస్తుల తరుఫున బోర్డులో కూర్చున్న సభ్యుడు ఆయన. ‘పెంకులు ఏరడానికైనా మ్యాన్ పవర్ కావాలిగా సార్! ఎంత హైటెక్కైనా కంప్యూటర్లెళ్ళి పెంకులు ఏరలేవుగా! పోనీ.. పెయింట్ డబ్బాలకైనా డబ్బివ్వండి! బొగ్గు ముక్కలకిచ్చినా ఫర్వా నై!’ ‘ దిష్టిబొమ్మక్కట్టిన కర్రెలాగూ కాలుతుందిగా! బైప్రొడక్టుగా బొగ్గదే బోలెడంత దొరుకుతుందిలేవయా!’ ఉడయవర్లుకు విషయం అర్థమయింది. ఒంటివేలు చూపించి బైటికొచ్చాడు. డైరెక్టుగా మేనేజింగు డైరెక్టురుకే ఫోన్! శౌచాలయంలోనుంచే వ్యవహారాలన్నీ చక్కబడ్డాయి. ‘డిపాజిటర్ల డబ్బులయ్యా ఇవి. కమీషన్లు పుచ్చుకొని లోన్లిచ్చే బాడీ కాదు మనది.’ అంటూ రుసరుసలాడుటూ బైటికెళ్ళిపోయాడు ఉద్యోగస్తుల తరుఫు సభ్యుడు. అప్పుడు లోపలికొచ్చాడు ఉడయవర్లు. ‘కొత్త రకం ప్రాజెక్టు. కొద్దిగా రిస్కు తీసుకొని ఇస్తున్నాం లోను. మాకు మాటరాకుండా చూసుకునే పూచీ నీదే!’ అంటూ పాతిక కోట్ల అప్పుకు సమ్మతి తెలిపింది మిగతా బాడీ! *** ‘ఇంకో పాతిక కోట్లైనా ఇచ్చేదేగానీ.. ఈ లోపలే బ్యాంకు చతికిలబడింది.’ అన్నాడు ఉడయవర్లు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన విలేకరితో కులాసాగా. ‘దిష్టిబొమ్మలు తయారుచేసే ఫ్యాక్టరీ పెట్టాలన్న ఆలోచన మీకు ఎలా తట్టింది సార్ మొదట్లో?’ అనడిగాడు విలేకరి. ‘అమెరికానుంచి తిరిగొచ్చిన రోజున విమానాశ్రయంలో పిల్లలు క్రికెట్ ఆటగాళ్ళ దిష్టిబొమ్మలు తగలబెట్టడం చూసాను. రామలీలా మైదానంలో ఎప్పుడో దసరాకోసారి జరిగే సరదా ఈ దేశంలో ప్రతీరోజూ ఏదో ఓ మూల జరుగుతూనే ఉంటుందని వార్తలు చూసేవాళ్ళెవరికైనా తేలిగ్గా అర్థమవుతుంది. పాడెలు కట్టడం, కుండలు పగలగొట్టడం, జెండాలు తగలెట్టడం పాతకాలంనాటి మూటు నిరసనలు దిష్టిబొమ్మలు తగలెట్టడం లేటెస్టు ట్రెండు! అప్పట్లో గోద్రా గోల.. అయోధ్య అల్లర్లు.. ఎన్నికల కొట్లాటలు.. ఉద్యోగుల నిరసనలు.. విద్యార్థుల ఉద్రేకాలు.. పార్టీల ప్రొటెస్టులు.. కస్టడీ లాకప్ డెత్తులు,. ఎన్ కౌంటర్లకు కౌంటర్ ర్యాలీలు, ఉగ్రవాదులమీద ఆగ్రహాలు, మహిళామణుల ఆందోళనలు, మతమార్పిడి ఉద్రిక్తతలు, ప్రత్యేకరాష్ట్ర ఉద్యమాలు, అస్తిత్వ పోరాటాలు, అతివాదులు దాడుల నేపథ్యంలో ప్రతిదాడుల హడావుళ్ళు.. ఎక్కడ ఏ ఉపద్రవం జరిగినా ఇక్కడ దిష్టిబొమ్మల తగలెడితేనే తంతంగం పూర్తయినట్లు లెక్క. మాది కొండపల్లి. బొమ్మలు చేసి అమ్మేవృత్తి అనుభవం ఉంది. ముందు కొద్ది పెట్టుబడితో పని మొదలుపెట్టా. ఇంతలో ఇరాక్ వార్ వచ్చిపడింది. వరల్డు వైడుగా దిష్టిబొమ్మలకు డిమాండు పెరిగింది. బుష్ దిష్టిబొమ్మలకున్నంత గిరాకీ అప్పట్లో మరి దేనికీ ఉండేది కాదు. తొగాడియా బొమ్మలక్కూడా తెగ గిరాకీగానే ఉండేదిక్కడ. మధ్య మధ్యలో ముష్రాఫ్.. షరీఫు సరేసరి! సమయ సందర్భాల్నిబట్టి లోకల్ లీడర్లకూ ఆర్డర్లొస్తుంటాయ్! ఈ మధ్య ప్రభుత్వాలుకూడా దిష్టిబొమ్మలు తగలేయిసున్నాయ్ .. చూస్తున్నారుగా!’ ‘ఆర్డర్లన్నీ మీకే ఎందుకొస్తున్నట్లు?!’ ‘మా దిష్టిబొమ్మలకు ఆకారాలేగాని.. పోలికలు ఉండవు. సందర్బాన్నిబట్టి అదే మోదీ.. అదే సొనియా! అదే చంద్రబాబు.. అదే జగన్ బాబు! ఒక దిష్టిబొమ్మకొంటే నల్లజండా ఉచితం. పాడెలు డిస్కౌంట్లులో కట్టి ఇస్తాం. వీలును బట్టి వాటినే వాలుకుర్చీలు.. వీలుకుర్చిలుగాకూడా మార్చుకోవచ్చు. ఆటల్లో ఓడితే పడుకోబెట్టి తగలేయడానికి, గెలిస్తే కూర్చోబెట్టి ఊరేగించడానికి ఒకే బొమ్మ ఉపయోగించుకోవచ్చు. కాలం మారుతోంది సార్! మన ఆలోచనల్లోకూడా మార్పు రావాలి.
అప్పుడే విజయం. మా నాయన కొండపల్లి బొమ్మలు మాకు రెండుపూటలా తిండి పెట్టలేకపోయాయి. దిష్టిబొమ్మలు చేస్తూ నేనిప్పుడు కోట్లాదిమందికి తిండి పెడుతున్నాను.’ ‘అది సరే! మీకు లోనిచ్చిన బ్యాంకు మునిగింది కదా! పాతరుణం తీర్చి పనిచేసే ఉద్యోగులకు, నమ్మి మదుపు చేసిన కాతాదారులకూ మీ వంతు సహకారం అందిచవచ్చుకదా?’ ‘దిష్టిబొమ్మలు చవకగా ఇచ్చి నా వంతు సహకారం అందిస్తూనే ఉన్నానండీ! బ్యాంకు డైరక్టర్లో ఒకాయనకు అనాథశరణాలయం ఉంది. అది సేకరించే పాతగుడ్డలను కొనే షరతుమీద నాకు రుణమిచ్చారు. కుండపెంకులు కావాల్సి వచ్చినప్పుడల్లా ఖాళీ కుండల ప్రదర్శన ఏర్పాటు చేసే శ్రామికనేత డైరక్టరు ఇంకొకరు. వాళ్లవంతు లాభాల్లో కొంతైనా కడితే మిగతా కంతులు నేను కట్టడానికి సిద్ధం. రుణం సొమ్ము నాకు బిర్యానీలో ఎముకముక్క. ‘బ్యాంకు మూసివేతకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. నాలుగురోజులీ నిరసనలు ఇలాగే కొనసాగితే నాలుగు దిష్టిబొమ్మలు అదనంగా అమ్ముకోవచ్చన్న దురాలోచన మీదని మీమీద అభియోగం?’ ‘దురాలోచనా లేదు. దూరాలోచనా లేదు. లోను పూర్తిగా కడితే మా ఉద్యోగులు సమ్మె కడతారు.ముందు వాళ్ల జీతాలు పెంచాలని ఆందోళన చేస్తారు. ఆనక నా దిష్టిబొమ్మలు తగలెడతారు. ఆ నష్టం ఎవరచ్చుకొంటారన్నా’ అన్నాడు ఉడయవర్లు చల్లంగా నవ్వుతూ. -కర్లపాలెం హనుమంతరావు 
**** (*) ****

(వాకిలి- అంతర్జాల మాస పత్రిక- 'లాఫింగ్ గ్యాస్'-ఆగష్టు 2015లో ప్రచురితం)


Wednesday, July 29, 2015

ఐ హేట్ యూ!- కవిత

కవిత 
ఐ హేట్ యూ! 
- కర్లపాలెం హనుమంతరావు 

ఓనమాలు నాతోబాటు దిద్దిన ఓ నా బాల్యమిత్రమా!
అంకెలు అక్షరాలతో నువు చేసిన చెమ్కీ హారం
నా స్మృతుల మెడలో ఇంకా వేళాడుతూనే ఉంది.

పులీ మేకల్ని గడుల్లో దాచేసి దాగుడుమూతలు ఆడుకున్నాం
అయ్యోరి పేంబెత్తం, అంబాలీసులేవీ పట్టని 
ఆ ఆటపాటలు గుర్తుకొస్తే
బడెనకాల పల్లందొరువులో 
పొర్లుగింతలు పెట్టినట్లే ఉంది  ఇప్పటికీ.

చవితిపండక్కి అణా ఇచ్చి అయ్యవారిచేత
నీకు 'ఓ బొజ్జ గణపయ్య' పద్యం ఇప్పించాను.. గుర్తుందా!
పూజ మూడురోజుల్దాకా నిన్ను ముట్టద్దంటే 
ఎంత దిగులయిందో ఆ రోజుల్లో !

పరీక్షల రోజుల్లో పసుపు పారాణితో 
అమ్మ నిన్న  ముస్తాబు చేస్తుంటే 
అబ్బ! ఎంత ముద్దొచ్చే దానివో !

చిట్టి చిలకమ్మా.. లాంటి పాటలన్నెటినో  
నా నోట బట్టీ పట్టించిన నా మట్టిగ్రంథానివి నువ్వు!
పాతరాతల్ని చెరిపేయడానికి 
నోటి ఉమ్మంతా నీకు పులిమేసి
ఆరిపోతే అరిసెముక్క 
తాయిలం పెడతానని ఆశ  పెట్టేవాణ్ని..పాపం!
ఆశకురుపులేవీ నాకు లేవలేదంటే 
అదంతా నీకు నా మీద ఉన్న ప్రేమే  సుమా!

కారునలుపైతేనేమి.. 
నా కంటికి అమ్మ తరువాత అమ్మంత 
అందమైనదానివి.
నిన్ను నా గుండెలకు అదుముకుని ఉంటే  
నేనొక జగదేకవీరుణ్ని.
నా అంతరంగ చిత్రానికి 
పికాసో రంగుల 
వింతనకలువి కదా నువ్వు!

బలపాలచేత్తో నా బతుకుని 
చదువులగుడి ఎక్కించిన మొదటి మెట్టువి.

లెక్కలు నేను  తప్పుచేస్తే 
నా వీపుదెబ్బలు తిన్న  
నిజమైన నా దోస్తువి. .

ఇచ్చిపుచ్చుకునే ఈ లోకం 
చెత్త లెక్కాపత్రాలన్నీ
ఆటగా ఎట్లా తీసుకోవాలో 
ఓర్పుగా నేర్పిన మా ముత్తాతవి.

నా ఆటలే నీవి.. నీ పాటలే నావిగా 
బతికాం ఇద్దరం.. బలేగా! 

గుర్తుందా! 
ఆ బంగారులోకంలో మనం 
బొంగరాలకుమల్లే గిరుగిర్రున తిరిగిన 
తీయటి క్షణాలు!

నా సమస్త  బాల్యప్రపంచానికి 
నిలువుటద్దం నువ్వే సుమా!
నా చిలిపి తలపులన్నింటికి 
ఓరగా తెరిచిన 
 కిటికీతలుపువి నువ్వే మిత్రమా!

నీకు ఇవాళ ఏమయిందీ?!
ఎందుకు నీ గొంతుకు    ఇలా గడియ పడిందీ  ?!

తీపి తెలుగు పలుకులు 
చప్పరించిన పాపానికి
పాలుగారే పసిపాపల 
మెడంకు  వేళ్లాడతావా.. 
ఎవరు మార్చారిలా 
నిన్నో  గుదిబండవా !

"ఐ నెవ్వర్ స్పీక్ ఇన్ తెలుగు"
ఇదా.. పసిబిడ్డల నోట 
 నువు   చేయించే ప్రమాణం

ఓహో! దొరల కొలువు కాబోలు!
కాబట్టే పుట్టింది నీకీ తెగులు .. 

యూ టూ స్లేట్..!
ఐ హేట్ యూ!
***
(కాన్వెంట్ల పేరుతో నడిపే బందెలదొడ్ల బళ్ళల్లో తెలుగు మాట్లాడిన నేరానికి మెడలో పలకలతో జేబు దొంగల్లా బడి బైటనిలబడ్డ  ఇద్దరు పసిబిడ్డల  చాయాచిత్రాలు చూసినప్పుడు కలిగిన ఆవేదన నుంచి..)



Tuesday, July 28, 2015

పునాది రాళ్ల ప్రార్థన-- వ్యంగ్య కథానిక

క్రీ. శ. 3015
హాట్ జూపిటర్నుంచి అరగంట కిందట బైలుదేరిన సూపర్ సానిక్ రాంజెట్ 'గోయిండా'(గోవిందాకి.. గో ఇండియాకి సరిసమానమైన పదం) భూ కక్ష్యలోకి ప్రవేశించి అదేపనిగా గిరిటీలు కొడుతోంది. చిన్నపిల్లలు ఆడుకొనే టాయ్ ఏరోప్లేన్ రీమోట్ కంట్రోలురుతో తిరుగుతున్నట్లంది ఆ దృశ్యం.
గోయిండానుంచి చూస్తుంటే భూమండలం మొత్తం ఒక మండే పెద్దబంతిలాగా ఉంది.
స్పేస్ సెంటర్నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రాంజెట్ లోని యువశాస్త్రవేత్తలిద్దరూ మాస్కులని మరోసారి సర్దుకొని స్క్రామ్ జెట్ సాయంతో సూటిగా భూమివైపుకు దూసుకు రావడం మొదలుపెట్టారు.
పొట్టిగా,  బూడిదగుమ్మడికాయంత బొద్దుగా  రేలంగిలాగా ఉన్నవాడిపేరు మొగానో. పొడుగ్గా,  పొట్లకాయంత సన్నగా రమణారెడ్డిలాగా ఉన్నవాడిపేరు  తనాకో. వాళ్ళిద్దరు ఇంటర్ యూనివర్సల్ స్పేస్ యూనివర్శిటీలో రీసెర్చి స్టూడెంట్లు.
స్క్రాంజెట్ ని రాంజెట్ ని రీమోట్ ద్వారా కంట్రోలుచేస్తూ హాట్ జూపిటర్ స్పేస్  సెంటర్లో కూర్చొని 'ఆపరేష్ డిస్కవర్ ఇండియా' సూపర్వైజ్ చేస్తున్నాయన పేరు కబిల్. అతగాడు ఆ ప్రాజెక్టుకి గైడు కూడా. సినిమాల్లో ప్రకాష్ రాజ్ లాగా ఉంటాడు.
కబిల్ ముత్తాతలు కొన్నివేల ఏళ్లకిందట భూమ్మీద నివసించినవారు. ఐదువందల ఏళ్లకిందట భూమ్మీద జనాభా పట్టనంతగా ఎక్కువైపోయి వనరులు హరించుకుపోయి జీవనం మనుగడకే ముప్పు ముంచుకొచ్చినవేళ  గగనాంతర రోదసిలోని వేరే గ్రహాలకి  వలసపోయింది మెజారిటీ మానవజాతి. కబిల్ ముత్తాతలు సూర్యకుటుంబంలోని గురుగ్రహానికి చెందినవారే!
ప్రకృతి వికృతిగామారిన దారుణ దుష్పరిణామాల కారణంగా మిగిలిన జీవజాతులన్నీ క్రమక్రమంగా నశించిపోయాయి. ప్రస్తుతం భూమి ఒక మరుభూమిని తలపిస్తోంది.  అడవులు అదృశ్యమయ్యాయి. నీరు పాతాళంలోకి ఇంకిపోయింది. ఆక్సిజన్ కరువై  పూర్తిగా బొగ్గుపులుసు వాయువుతో నిండిపోయిన భూమ్మీదకు మొగానో, తనాకో ఎందుకొస్తున్నట్లు?!
తమ సౌరవ్యవస్థను బోలిన మరెన్నో గ్రహకుటుంబాలను వెదికి పట్టుకొని, పరిశోధించి దీసిస్ సమర్పించడం 'ఆపరేషన్ డిస్కరీ ఇండియా' లక్ష్యం. ప్రాజెక్టులో భాగంగా కబిల్ గైడెన్సులో  రోదసీలో ప్రయాణిస్తూ ఇప్పటికే ఎన్నో పాలపుంతలను, నక్షత్రాలను, గ్రహాలను పరిశీలించారు. గెలాక్సీలనన్నింటినీ గాలించేసె చివరి అంచెగా భూమ్మీదకు దిగుతున్నారు ఇప్పుడు.
భూతలంమీద వాతావరణంమాత్రం భయానకంగా ఉంది. సెగలు కక్కే వడగాలులు ఎడాపెడా కొడుతున్నాయి. కనుచూపుమేరంతా సహారానుమించిన ఎడారి దిబ్బలే!
ఓజోన్ పొర చిరిగిపోయి సూర్యరశ్మి భూతలాన్ని నేరుగా "జీవజాతులన్నీ ఏనాడో నశించాయి.
ఇంత జీర్ణావస్థలో ఉన్న భూమ్మీదకు బాసు ఎందుకు దిగమంటున్నాడు యువశాస్త్రవేత్తలిద్దరికీ అంతుబట్టడంలేదు.
స్క్రామ్ జెట్ నేలమీదకు లాండయిన తరువాత విద్యార్థులిద్దరికీ గైడ్ కబిల్ కమాండ్స్ స్పేస్  విండోనుండి వినబడుతున్నాయి.
'కంగ్రాట్ స్! వేలాది ఏళ్లకిందట రోదసీమండలం మొత్తంలో మహానాగరికతలు వెల్లివిరిసిన పుణ్యభూమిమీద మీరు ఇప్పుడు అడుగు పెట్టారు.' కబిల్ హృదయంలో మాతృగ్రహంమీద భక్తి ఎంతలా పొంగిపొర్లుతున్నదో అతని గొంతులోని ఉద్వేగాన్నిబట్టే శిష్యులిద్దరికీ అర్థమయింది.

కబిల్ గొంతు గంభీరంగా వినపడుతోంది. 'ఆ రోజుల్లో అమెరికా అగ్రరాజ్యంగా ఉండేది. అన్ని రంగాల్లో అదే ముందుండేది. తమ దర్పానికి దర్పణంగా వాళ్ళు నిర్మించుకొన్న 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ'ని  ఫొటో తీయండి!'
కెమారాని బాస్ చెప్పిన వైపుకి ఫోకస్ చేసి చూసాడు తనాకో. అక్కడ మట్టిదిబ్బలు తప్ప ఏవీ కనిపించలేదు!
'అల్ ఖైదా వాళ్ళు ఆ అమెరికానెప్పుడో కైమాకింద కొట్టి పారేసారు. దాని నామరూపాలుకూడా మీకిప్పుడు కనిపించవు' అన్నారెవరో! ఆ గొంతు వినిపించినవైపు చూస్తే అక్కడెవరూ కనిపించలేదు! అదే విషయం తిరిగి బాసుకి చేరవేసారు శిష్యబృందం.
'పోనీ సోవియట్ సోషలిస్తు రిపబ్లిక్ పేరుతో ఒకవెలుగు వెలిగి చివరకు  రష్యాలాగా మిగిలిపోయిన దేశాలగుంపువైపుకి మీ కెమేరా తిప్పండి! అట్టడుగు మానవుడి స్వేచ్చా స్వాతంత్ర్యాలకి నిర్మాణరూపం రెడ్ స్క్వేర్. షూటిట్!' కబిల్ గాట్టి కమాండ్!
కెమేరా పొజిషన్ మారింది. అదే దృశ్యం! మటిదిబ్బలే మట్టిదిబ్బలు! 'వాళ్ల ప్రభుత్వాలను వాళ్లే కూల్చుకొన్నారు. ముక్కలు చెక్కలయినా చివరికీ ఒక ముక్కా మిగల్లేదు!' అంది ఇందాకటి గొంతే, శాల్తీ మాత్రం యథాప్రకారం కనిపించలేదు.
శిష్యులద్వారా సమాచారం విన్న కబిల్ అన్నాడీసారి 'లండబ్ టెన్ డౌన్ లో ఉద్దండ పిండాలుండేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ల పాలనలో ప్రపంచం మొత్తంలో సూర్యుడు అస్తమించేందుకు అంగుళం  చోటైనా ఉండేది కాదంటారు. ఆ మహాసామ్రాజ్యపు మహారాజులు, రాణులు నివాసమున్న వీధిని మీ కెమేరాల్లో బంధించండి!'
తనాకో కెమేరా అటు తిరక్కముందే అందుకొంది ఇందాకటి గొంతు 'నో యూజ్! ఆ సూర్యుడస్తమించని మహాసామ్రాజ్యం తరువత్తరువాత అమెరికా సింహానికి తోకమాదిరిగా తయారైంది. అల్ ఖైదా దెబ్బకీ  అమెరికాతో పాటే మాడి మసయింది!'
ఓన్లీ వాయిస్ ఓవర్! నో పర్సన్ ఎట్ సైట్!
నుదుట దిద్దుకొనేటంత చిన్నదైనా అమెరికాన సైతం గడగడలాడించిన దేశం  జపాను. వారి నాగరికత చాలా ప్రాచీనమైనది. అయినా నాటి మానవుడు సాంకేతికంగా ఎంతటి ఉన్నత శిఖరాలను అందుకొన్నాడో జపానువారిని చూసి తెలుసుకోవచ్చు. వాళ్ల విసనకర్ర ఈక కనబడినా చాలు ఒక్క స్నాపు తీసుకోండి!' అన్నాడు కబిల్ నిరాశను గొంతులో కనిపించనీయకుండా!
'అణుధార్మిక విధ్వసంతో దానికదే బూడిదయింది!' అంది ఆకాశవాణి ముక్తుసరిగా ఒక్క ముక్కలో.
'ప్రపంచానికి ఫ్యాషన్ ఎలాఉంటుందో నేర్పించిన ఫ్రాన్స్!' కబిల్ గొంతు.
'ఎయిడ్స్ మహమ్మారి ఎప్పుడో ఆ శృంగారదేశాన్ని కబళించేసింది' ఆకాశవాణి గొంతు.
'క్యూబా..' కబిల్ గొంతులో వణుకు.
'ప్లేగు వ్యాధికి ఫినిష్' అశరీరవాణి తాపీగొంతు. 
'ఆఫ్ఘనిస్తాన్.. పాకిస్తాన్.. కజికస్తాన్..' కబిల్ దేశాలపేర్లు గడగడా చదువుకుపోతున్నాడు.
'అవన్నీ తాలిబాన్లకి స్థావరాలుగా మారిన తరువాత చరిత్రలో స్థానంలేకుండా పోయాయి. ఆఫ్రికా అడవుల్ని  కార్చిచ్చు, ఆస్ట్రేలియా ఖండాన్ని ఎల్లో ఫీవరు.. ఒక్కముక్కలో మీకు అర్థమయేటట్లు చెప్పాలంటే తుఫాన్లూ, భూకంపాలూ, సునామీలూ, కరువులూ, వరదలూ, యుద్ధాలూ, రోగాలూ.. అన్నీ అన్నింటినీ నామరూపాల్లేకుండా సర్వనాశం చేసేసాయి. అడుగూ బొడుగూ ఏమన్నా మిగిలున్నా రాజకీయాలు వాటిని నాకేసాయి. చివరికి మిగిలింది ..ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారే.. ఈ మట్టిదిబ్బలే!' అశరీరవాణి ఆపకుండాచేసే ఆ అనవసర ప్రసంగానికి యువశాస్త్రవేత్తలిద్దరికి  తెగ వళ్ళు మండిపోయింది.
గురువుగారికి ఇష్టమైనదేమన్నా పట్టుకుపోదామనుకుంటే మధ్యలో వీడెవడు? పిలవా పెట్టాకుండా కల్పించుకొని  ఏదడిగినా 'బూడిదయింది.. మసయింది.. మన్నుకొట్టుకుపోయింది.. నాశనమయింది.. నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది.. మురిగిపోయింది.. మునిగిపోయింది' అంటూ అపశకునాలు తప్ప వల్లించడం లేదు! రెండు వాయిద్దామంటే వాయిస్సేగాని శాల్తీ ఎదురుగా కనిపించి చావడంలేదు!
తమకు డాక్టరేట్ రాకుండా తోటి విద్యార్థులు చేస్తున్న కుట్ర కాదుగదా ఇది!
కడుపులోని మంటను కడుపులోనే ఉంచుకొంటే ఏం ప్రయోజనం?  కనబడ్డా కనబడకపోయినా ముందు కడిగిపారేస్తే సరి!
'ఇందాకట్నుంచీ చూస్తున్నాం. ఏది చూద్దామన్నా లేదు పొమ్మంటావు! ప్రకృతిభీభత్సానికి సర్వం బూదిద అయిపోతే తమరెలా మిగిలున్నారు  మహాశయా?' తనాకో ఇక తమాయించుకోలేక పెద్దగొంతుతో అరిచాడు
'ఇంతకీ నువ్వెవరివి? మొనగాడివైతే మా ముందుకురా!' సవాలు విసిరాడు మొగానో తన వంతు వంతగా.
బిగ్గరగా నవ్వు వినిపించింది. ఆ నవ్వుకు భూమి కంపించింది. 'మీరు నిలబడ్డ చోటులోనే భూమి అడుగున ఉన్నాను.  పిల్లల్లారా!'
మొగానో గబగబా గొయ్యితీయడం మొదలు పెట్టాడు. రెండు అడుగులుకూడా తవ్వకుండానే బైటపడిందా గొంతు తాలూకు  వింత ఆకారం.
నిట్టనిలువుగా ఉంది. ధగధగా మెరిసిపోతోంది. వంటిమీదంతా ఏవో గాట్లు.. పైనుంచీ కిందదాకా!
ఇలాంటి ఆకారాన్ని ఆ గ్రహాంతరవాసులు రోదసీమండలంలో ఇంతవరకు ఎక్కడా చూసింది లేదు. ప్రళయమొచ్చి భూమ్మీదున్న సర్వజీవజాలం దుంపనాశనమయినా.. చెక్కు చెదరకుండా.. నిట్టనిలువుగా.. తాజాగా.. తళతళలాడుతూ కనిపిస్తున్న ఆ ఆకారాన్ని చూడంగానే .. నిజం చెప్పద్దూ.. యువశాస్త్రవేత్తలిద్దరికీ ఒకింత గౌరవంకూడా కలిగింది. సాధ్యమైనంత వినయంగా  మనసులోని మాటను బైటపెట్టాడు తనాకో 'ఇంతకీ తమరెవరో సెలవిచ్చారు కారు సార్?'
ఆ ఆకారం చెప్పటం మొదలు పెట్టింది. 'పునాదిరాయి అంటారు నన్ను. వేల ఏళ్లకిందట ఇక్కడ ప్రజాస్వామ్యమనే పాలనావిధానం  ఒకటి వర్ధిల్లింది. ప్రజలే రాజులు. ప్రజలకొరకు, ప్రజలవలన, ప్రజలచేత నడిచే పరిపాలన అది. మరీ లోతుగా వెళ్ళొద్దు! మీరొచ్చిన పని మర్చిపోయి తరిగి వెళ్లడానికి తిప్పలు పడతారు. అంత తికమకగా ఉంటుందా రాజకీయ వ్యవహారం! ప్రజాస్వామ్యమంటే ప్రజలు ఎన్నుకున్న నాయకులు.   వాళ్ళు పాలించే ప్రజలు. ఈ మాత్రం అర్థం చేసుకోండి! ప్రస్తుతానికి  చాలు.!'
'ఇహ నేనెవరో చెబుతాను. వినండి! ఎన్నికల్లో నిలబడి గెలవడానికి నాయకులు ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేస్తారు. ప్రాజెక్టులు కట్టిస్తామని, పాఠశాలలు పెట్టిస్తామని, ఫ్యాక్టరీలు నిర్మిస్తామని.. వగైరా.. వగైరా! వాళ్ళు వాగ్దానాలు చేసినంతమాత్రాన జనం నమ్మాలని ఏముంది? నమ్మనివాళ్లని నమ్మించడానికి నాయకులు 'ఇదిగో.. ఇవాళే.. ఇక్కడే.. మీకు భవిష్యత్తులో కట్టబోయే  భారీ నిర్మాణానికి నాందీగా.. పునాదిలో ఓ రాయి వేసేస్తున్నాం!" అంటూ బ్రహ్మాండంగా  ఊరేగింపూ..  గట్రాచేసి  ఆర్భాటంగా మమ్మల్ని పాతేస్తారన్నమాట. మమ్మల్ని చూసి నమ్మి జనం ఓట్లేస్తే.. గెలిచేసి.. గద్దెనెక్కి..  వాళ్ళు చేయాలనుకొన్న పనులన్నీ మళ్లీ ఎన్నికలొచ్చేసే లోపల సుబ్బరంగా చేసేసుకొంటారన్నమాట'.
'ఒక్క నిమిషం పునాదిరాయీ! చిన్నసందేహం! మరి వాగ్దానం చేసినట్లు నాయకులు ఎన్నికలు పూర్తయిన తరువాత నిర్మాణాలన్నీ చేసేస్తారుకదా! అయినా మీరింకా ఈ గోతుల్లో శిలావిగ్రహాల్లా పడి అల్లాడుతున్నారేంది?!'
పకపకా నవ్వింది పునాదిరాయి. 'మరదే ప్రజాస్వామ్యమంటే! సరే! ఇందాకట్నుంచీ ఏదీ కనిపించడంలేదని తెగ అల్లాడుతున్నారుగా! అమెరికా, రష్యా, చైనా, జపానంటూ ఎన్నడో అంతరించిపోయిన దేశాలను గురించి దేవులాడుకొంటున్నారుగా! వృథాగా వాటికోసం సమయం పాడుచేసుకోకుండా.. నన్నూ నా సోదరులనూ ఫోటో తీసుకుపోండి! అంతదూరంనుంచి వచ్చినందుకు ఆ మాత్రమైనా దక్కిందని సంతోషించండి!'
'నువ్వేగాక నీకు సోదరులుకూడా ఉన్నారా ఇంకా?! వాళ్ళూ నీకులాగే సజీవంగానే ఉన్నారా?!' నోరెళ్లబెట్టడం తనాకో వంతయింది.
'ఎందుకు లేరబ్బాయ్? వందలొందలు! మీ కెమేరాల మెమరీ కార్డు చాలదు! ఆన్ చేసుకోండి! వరసగా పరిచయం చేస్తాను. ఫ్లాష్ వేసుకోండి! అదిగో అది బ్రాహ్మణి సిమెంటు ఫ్యాక్టరీ పునాదిరాయి. ఇప్పుడు రద్దయిపోయిందనుకోండి!  పోలవరం అనే భారీ నీటిప్రాజెక్టుకి వేసిన పునాదిరాయి! అదిగో ఆ మూల ఉన్నది! ఇదిగో.. ఇవాళో.. రేపో.. అంటో యుగాలబట్టీ కథ నడుపుతున్నారు! ఇది  హంద్రీ నీవా సుజల స్రవంతి పునాదిరాయి. ఇది సిద్దిపేట స్పోర్ట్ స్ స్టేడియం పునాది రాయి. రెండు తెలుగురాష్ట్రాలు కలసి ఉన్నప్పుడు వేసిన పునాది రాళ్లిలాగా ఇంకా చాలా ఉన్నాయి.  అదిగో ఆ మూల వున్నదే .. అది హైదరాబాదనే అప్పటి తెలుగురాష్ట్ర రాజధానిలో ట్రాఫిక్ సమస్యల నివారణకని ప్రారంభించిన మెట్రోరైలు ప్రాజెక్టు పునాదిరాయి. స్థలంమారి ఆ ప్రాజెక్టు ఇప్పుడు మరో దిశలో సాగుతున్నది. అయినా దీనికి ముక్తి కల్పించే దిక్కు కనిపించడం లేదు.  ఇది బడాయిగడ్డా లోకాజ్ వంతెన తాలూకు పునాదిరాయి. ఇదిగో..  ఇది పుణ్యవరంలో వంతెన  నిర్మాణానికని వేసిన రాయి. ఇది పటాన్ చెరువులో వెయ్యి పడకల ఆసుపత్రికని అప్పటి ముఖ్యమంత్రి వేసిన శిలాఫలకం! ఇలా మీరు ఎక్కడ చూసినా చక్కని పునాదిరాళ్ళు అనాదిగా అనాథల్లా పడివుండటాన్ని గమనించవచ్చు!  ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రగతి లేదు. మా గతి మారలేదు, మా ఫొటోలు తీసుకొని మామీదగాని మీరు థీసిస్ సమర్పిస్తే  పట్టా గ్యారంటీ! ఆ విధంగానైనా మేము ఉపయోగపడ్డామని సంతోషిస్తాం.' పునాదిరాయి నిట్టూర్పు.
అందంగా తళతళలాడే ఆ పునాది రాళ్లన్నింటినీ కెమేరాలో బంధించి తృప్తిగా తిరుగుముఖం పట్టారు యువశాస్త్రవేత్తలిద్దరూ!
స్క్రామ్ జెట్ ఇంజను స్టార్టుచేస్తూ మొగానో పునాదిరాయితో కృతజ్ఞతా పూర్వకంగా అన్నాడు 'మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం!'
'ఈ జన్మలోనే సుబ్బరంగా  తీర్చుకోవచ్చబ్బాయిలూ! మమ్మల్నిలా నిలువునా పాతేసినా పెద్దమనుషులు మీకు  వెళ్లేదారిలో ఏ నరకంలోనో.. పాతాళంలోనో  తప్పకుండా తగులుతారు.  పెద్దమనసు చేసుకొని ఒక్కసారివచ్చి మాలో కనీసం కొందరికైనా విముక్తి కలిగించి పుణ్యంకట్టుకోమని మా మాటగా విన్నవించండి.. చాలు!'  అని కన్నీరు పెట్టుకొంది అ పునాదిరాళ్ళ సంఘం ప్రధాన కార్యదర్శి.***
-కర్లపాలెం హనుమంతరావు
చిత్రాల సౌజన్యంః కర్లపాలెం నిరంజన్
(సారంగ- అంతర్జాల పత్రిక జూన్ సంచిక 24-07-2015లో ప్రచురితం)








మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...