కవిత
ఐ హేట్ యూ!
- కర్లపాలెం హనుమంతరావు
ఓనమాలు నాతోబాటు దిద్దిన ఓ నా బాల్యమిత్రమా!
అంకెలు అక్షరాలతో నువు చేసిన చెమ్కీ హారం
నా స్మృతుల మెడలో ఇంకా వేళాడుతూనే ఉంది.
పులీ మేకల్ని గడుల్లో దాచేసి దాగుడుమూతలు ఆడుకున్నాం
అయ్యోరి పేంబెత్తం, అంబాలీసులేవీ పట్టని
ఆ ఆటపాటలు గుర్తుకొస్తే
బడెనకాల పల్లందొరువులో
పొర్లుగింతలు పెట్టినట్లే ఉంది ఇప్పటికీ.
చవితిపండక్కి అణా ఇచ్చి అయ్యవారిచేత
నీకు 'ఓ బొజ్జ గణపయ్య' పద్యం ఇప్పించాను.. గుర్తుందా!
పూజ మూడురోజుల్దాకా నిన్ను ముట్టద్దంటే
ఎంత దిగులయిందో ఆ రోజుల్లో !
పరీక్షల రోజుల్లో పసుపు పారాణితో
అమ్మ నిన్న ముస్తాబు చేస్తుంటే
అబ్బ! ఎంత ముద్దొచ్చే దానివో !
చిట్టి చిలకమ్మా.. లాంటి పాటలన్నెటినో
నా నోట బట్టీ పట్టించిన నా మట్టిగ్రంథానివి నువ్వు!
పాతరాతల్ని చెరిపేయడానికి
నోటి ఉమ్మంతా నీకు పులిమేసి
ఆరిపోతే అరిసెముక్క
తాయిలం పెడతానని ఆశ పెట్టేవాణ్ని..పాపం!
ఆశకురుపులేవీ నాకు లేవలేదంటే
అదంతా నీకు నా మీద ఉన్న ప్రేమే సుమా!
కారునలుపైతేనేమి..
నా కంటికి అమ్మ తరువాత అమ్మంత
అందమైనదానివి.
నిన్ను నా గుండెలకు అదుముకుని ఉంటే
నేనొక జగదేకవీరుణ్ని.
నా అంతరంగ చిత్రానికి
పికాసో రంగుల
వింతనకలువి కదా నువ్వు!
బలపాలచేత్తో నా బతుకుని
చదువులగుడి ఎక్కించిన మొదటి మెట్టువి.
లెక్కలు నేను తప్పుచేస్తే
నా వీపుదెబ్బలు తిన్న
నిజమైన నా దోస్తువి. .
ఇచ్చిపుచ్చుకునే ఈ లోకం
చెత్త లెక్కాపత్రాలన్నీ
ఆటగా ఎట్లా తీసుకోవాలో
ఓర్పుగా నేర్పిన మా ముత్తాతవి.
నా ఆటలే నీవి.. నీ పాటలే నావిగా
బతికాం ఇద్దరం.. బలేగా!
గుర్తుందా!
ఆ బంగారులోకంలో మనం
బొంగరాలకుమల్లే గిరుగిర్రున తిరిగిన
తీయటి క్షణాలు!
నా సమస్త బాల్యప్రపంచానికి
నిలువుటద్దం నువ్వే సుమా!
నా చిలిపి తలపులన్నింటికి
ఓరగా తెరిచిన
కిటికీతలుపువి నువ్వే మిత్రమా!
నీకు ఇవాళ ఏమయిందీ?!
ఎందుకు నీ గొంతుకు ఇలా గడియ పడిందీ ?!
తీపి తెలుగు పలుకులు
చప్పరించిన పాపానికి
పాలుగారే పసిపాపల
మెడంకు వేళ్లాడతావా..
ఎవరు మార్చారిలా
నిన్నో గుదిబండవా !
"ఐ నెవ్వర్ స్పీక్ ఇన్ తెలుగు"
ఇదా.. పసిబిడ్డల నోట
నువు చేయించే ప్రమాణం
ఓహో! దొరల కొలువు కాబోలు!
కాబట్టే పుట్టింది నీకీ తెగులు ..
యూ టూ స్లేట్..!
ఐ హేట్ యూ!
***
(కాన్వెంట్ల పేరుతో నడిపే బందెలదొడ్ల బళ్ళల్లో తెలుగు మాట్లాడిన నేరానికి మెడలో పలకలతో జేబు దొంగల్లా బడి బైటనిలబడ్డ ఇద్దరు పసిబిడ్డల చాయాచిత్రాలు చూసినప్పుడు కలిగిన ఆవేదన నుంచి..)
No comments:
Post a Comment