Monday, August 24, 2015

ఒంటరులం కాలేం!- కవిత



1
అనుకుంటాం కానీ
ఎవరమూ
ఎన్నటికీ  ఒంటరులం కాము

2
పూల మీద నడుస్తున్నా
పాదం కందకుండా కింద
అమ్మ అరచేయి అడ్డు పెడుతుంది.

ఉట్టికెగిరేటప్పుడు
రెక్క తెగి-  నేలబడకుండా
నాన్న నీడ పహరా కాస్తుంది.

4
తోబుట్టువులనే తోటి చేపలతో
బతుకు తొట్టి
ఈత కొలనులా
ఎప్పటికీ సందడే!


5
నీ రాలి పడే నవ్వులకు
ఒడిపట్టి
వెంటబడే లోకమో!

6
కన్నీరైనా  ఒంటరిగా వదలుతుందా
చెక్కిలి తడపకుండా!
తుడెచే చెలిమిహస్తం
చెంత ఉండనే ఉంది

7
చీకటిలో.. చింతలలో
వేకువలో.. వేడుకలో
అర్థభాగం
అద్దంముక్కలా
పక్కలోనో.. పక్కనో!

8
అమావాస్య నాటి
వెన్నెల ఊహలా
కన్నపిల్లల గోల!

9
చావుతో అంతా ఐపొయిందనుకోడం
శుభం కార్డు పడితే
మరో ఆట లేదనుకోడం
భ్రమ!

10
అనుకుంటాం కానీ ఎవరమూ
ఎన్నటికీ  ఒంటరులం కాము
కాలేం మిత్రమా!
***

-కర్లపాలెం హనుమంతరావు

తెలుగుతక్కువతనం- ఓ సరదా గల్పిక

రాళ్ళులేని బియ్యమైనా చౌకధరల దుకాణాల్లో దొరకటం తేలికేమోకానీ.. దొరలభాష దొర్లని తెలుగుపలుకులు వినటం దుర్లభంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల  శాసనసభల్లోనూ ఇదే దుస్థితి. 'అమ్మా' అని అమ్మభాషలో పిలిస్తే అమ్మయినా 'ఓయ్' అని పలికే పరిస్థితి లేదు ప్రస్తుతం. తెలుగు బోధించే ఉపాధ్యాయులకు సైతం తెలుగులో సంతకం చేయటం నామోషీ. రాజకీయ నినాదాలకు మినహా తెలుగు ఇప్పుడు ఆకాశవాణి సంస్కృత వార్తల్లాగా ఎవరికీ పట్టని గోడుగా మారింది ! ఎందుకిలా? !

సున్నా కనుక్కున్నది భారతీయుడే అయినా అరసున్నాని కనిపెట్టి మరీ  వాడుకున్నదిమాత్రం మన తెలుగువాడే !  మన 'అజంత భాష' తెలుగును బ్రౌనుదొర  ఎంతగా ప్రేమించాడు! తెలుగువాడికే ఎందుకో మొదటినుంచి పరాయితనం మీదంత పరమ మోజు!
ఆంధ్రులకోసం భారతాన్ని తెనుగిస్తున్నానన్న నన్నయ భట్టారకుడు ఆరంభంలోనే సంస్కృత శ్లోకంతో శ్రీకారం చుట్టాడు! ఆంధ్ర కేసరి, ఆంధ్రాస్కాటు, ఆంధ్ర హేస్, ఆంధ్రా దేవానందంటూ అస్తమానం పరాయితనంతోనే గుర్తింపు పొందాలన్న తాపత్రయమేందో తెలుగువాడికి.. ఖర్మ కాకపోతే!   
'ఆంధ్రత్వం తపస్సిద్ధి పుణ్యం' అన్నాడు అరవ పండితుడు అప్పయ్య దీక్షితులు. 'సుందర తెనుంగు' గా  తెలుగుకి  హారతి  పట్టాడు
తమిళ  భారతి. 'కన్నడం వచ్చుగదా! ఆముక్తమాల్యదను తెలుగులోనే రాయాలని ఎందుకనిపించిందయ్యా రాయలా!' అని అడిగితే 'నేను తెలుగు రాజును. నాది తెలుగు భాష. దేశ భాషలందు తెలుగు లెస్స కనక' అంటూ పలుకారణాలు వినిపించిన రాయలు పిచ్చివాడా?! అచ్చులతో అంతమయ్యే అపురూప పదసంపద తెలుగు సొంతం. డాంటే వంటి ఉద్దండపిండాలకేమో ఇది  'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'! తాటాకుపాలెం చంటాడికేమో ఇది 'వేస్టు'! ఆంగ్లంలో వర్ణక్రమాలు తప్పుల్లేకుండా చెప్పి కప్పులు కొట్టుకొచ్చే తెలుగుపిల్లలుకూడా  తెలుగుపత్రిక పుటలోని ఒక్క పేరాని  తప్పుల్లేకుండా గడగడా చదవమంటే మాత్రం  తడబడిపోతారు!

అమ్మఒడే బడి అంటారు. ఆ అమ్మకే  కమ్మని తెలుగు నూరారా పలకటం నామర్దా మారిపోయిన దుర్దశ ప్రస్తుతం  నడుస్తున్నది. 
'మా తెలుగుతల్లికి మెల్లెపూదండ' అంటూ పిల్లలకు  పాటలు నేర్పేందుకే గురువూ దొరకడం లేదు.  మన గుర్తు పూర్ణకుంభం,  మన పిట్ట పాలపిట్ట, మన ఆట క్రికెట్టు కాదు.. కబడ్డీ’ అని కన్నతండ్రికి తెలిస్తేనే కదా చిన్నబిడ్డకు నూరిపోసేది! ‘గొడుగు’ అంటే ఎండా కాలంలో వాడేదని .. ‘గిడుగు’ అంటే వానాకాలంలోవాడేదని గురువుకు తేడా తెలిసుంటేనే గదా శిష్యుడికి నేర్పగలిగేది! 'తెలుగు పలకటమే నేరమనే బడులకు భారీరుసుములు కట్టి మరీ ఎగబడే మన తల్లిదండ్రుల వేలంవెర్రిని ఏమని పిలుచుకోవాలి! నాణేలమీద ఆనాటి  కాలంలో  ఆంగ్లం, హిందీ, బెంగాలీ భాషలతోపాటు 'ఒక అణా' అని ఒక్కతెలుగులోనే రాసేవారు. నాలుగు వందల పదాల సాయంతోనే తెలుగింటి ఆచార వ్యవహారాలన్నింటిని స్పష్టంగా చెప్పుకోవచ్చని తాపీ ధర్మారావు గారు  ఏనాడో చెప్పుకొచ్చారు. ఆలకించే నాథుడేడీ!

గోరింటాకును ఆంగ్లంలో ఏమంటాం? గోరుముద్దలకు కాకియెంగిగిలికి ఆంగ్లంలో సమానార్థక పదాలున్నాయా? 'బుజ్జివెధవ'నే పిలుపులోని  మధురిమ చెడకుండా  మనం అస్తమానం నెత్తికెక్కించుకొని ఊరేగే  ఏ భాషలోకైనా  తర్జుమా చేసి చూపమనండి! మంగళంపల్లి బాలమురళైనా మంగళ హారతిని శుద్ద ఆంగ్లంలో పాడి తలూపించగలరా?

'విద్యనిగూడ విత్త'మని ఏనుగు లక్ష్మణకవి ఏ ముహూర్తంలో అన్నాడో గానీ- నేడు మనం విద్యనికూడా కేవలం విదేశీ విమానమెక్కే  నిచ్చెనగా మాత్రమే చూస్తున్నాం. తెలుగుగడ్డమీద ఒకబిడ్డ పుడితే భావి అమెరికాపౌరుడొకడు పెరిగినట్లే భావిస్తున్నాం!
ఓనమాల వర్ణమాలకు ఏనాడో పంగనామాలు పెట్టేసుకొన్నాం. ఏ మారుమూల చిన్నబడిలో చూసినా ఏబిసిడీలే మారుమోతే!  సరైన పరిజ్ఞానం,  శిక్షణలేని ఉపాధ్యాయులు ఆంగ్లపాఠాలను   తెలుగులిపిలో రాసి వినిపిస్తున్నారని వింటుంటే- గురజాడ మార్కు గిరీశం 'మనవాళ్ళుట్టి వెధవాయిలోయ్' అన్న మాటే  అక్షరాఆ  నిజమనిపించడంలా!

తెలుగు ప్రాచీనభాషగా గుర్తింపుపొందినందుకు సంతోషమే! కానీ.. దాన్ని మరింత సరళం, అధునికం చేసి..  నేటి అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దకపోతే ముందుతరాలతో నిందపడేది మన తరమే! చిన్నతనంలోమాతృభాషలో విద్య నేర్పనందుకు ఔరంగజేబు చేత గురువు ముల్లాసాహెబు పడ్డ నిందవంటిదే ఆ నింద. ఆ నిందాభయమైనా నిద్రాణమైవున్న  ఆత్మగౌరవాన్ని తట్టిలేపి తెలుగుతక్కువదన్నాన్ని తరిమిగొడితే బాగుణ్ణు!
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు సంపాదక పుటలో ప్రచురితం)

***

Sunday, August 23, 2015

భగవంతుడి వాణి- కవిత

కడుపు కోతకు ఆడపడుచును కాను
కాయకష్టం దోపిడీకి బడుగుజీవిని కాను
పడుపుకూటికి  ఆటవెలదిని కాను
పలక మోతకు బడిబుడతడిని కాను
బండబూతులకు  సబ్బండను కాను
చీదరింపులకు  శిఖండిని కాను
జాలిచూపులకు బికారిని కాను
వెక్కిరింతల కష్టానికి వికారిని కాను
చీత్కారింపుల సత్కారానికి ముంగాళ్ల ముసలిని కాను
ఆకలిశోకానికి ఆగర్భ దరిద్రుడినసలే కాను
అరణ్యరోదనకు అగ్రకులం దౌర్భాగ్యుణ్ని కాను
దమ్మిడీకి కొరగాని నిరుద్యోగిని కాను
అన్నివిధాలా అన్యాయమైన అన్నదాతను  కాను
మనుషుల అమానుషానికి బలైన గొడ్డూ గోదను కాను
రాళ్ళదెబ్బలు తినే పండ్లచెట్టునైనా కాను
మామూలు మనిషిని!

వ్యథార్థ జీవుల కష్టాలకు
కరిగి నీరవడమే కానీ
'ఛూ'మంత్రమేసే  శక్తిమంతుణ్ణి కాను
భగవంతుణ్ణి కాను!


భగవంతుడి వాణిః
 ఏవీ కాకపోతేనేమి మానవా!
అన్నీ అనుభవించే మంచి మనసున్న కవివి కావా!
నా మనసును మనుషుల మధ్య  చాటింపు వేయి .. చాలదా!
వద్దు దేవుడుగా పుట్టలేదన్న కలవరం
నా హృదయద్వారం దగ్గరుండటమే నీకు నేనిచ్చిన  వరం
దేవుడికీ.. దీనుడికీ  మధ్య నువ్వొక వారధివి
వ్యథార్థుల
 స్వరంగా మారితే

నీ అక్షరంతో సహా నువ్వే చిరంజీవివి!

-కర్లపాలెం హనుమంతరావు

ఏది ఉత్తమ కథానిక- సాహిత్య విమర్శ

ఆధునిక సాహిత్యంలో ఆబాలగోపాలాన్ని అమితంగా ఆకర్షిస్తున్న ప్రక్రియ 'కథానిక'. ప్రచురించే పత్రికల సంఖ్య గణనీయంగా పెరగడం, సర్క్యులేషనుకి ప్రధాన ఆకర్షణగా మారడం, పాఠకుల  రసానందానికి స్వల్పవ్యవథి సరిపోవడం.. కథానికల ప్రాథాన్యత పెరగడానికి గల అనేక కారణాలలో కొన్ని ముఖ్యమైనవి. లోతైన సాహిత్యాభినివేశంతో నిమిత్తం లేదు.  కేవలం తీవ్ర ఆవేశం, గాఢపరిశీలనాసక్తి ఉంటే చాలు..  సాహిత్యరంగ ప్రవేశం చేయడం కథానికద్వారా సులభం.
అక్షరాస్యులంతా కావ్యాలు, ప్రబంధాలే కోరుకోరు. సులభంగా అర్థమవుతూ, సత్వర మనసిక ఆనందానుభూతులకు దోహదం చేసే సాహిత్యానికే అత్యధికుల ఓటు. 
వారానికి కనీసం రెండు, మూడు ప్రచురణ అవుతున్నా వెలుగు చూడని కథానికలు పత్రికల  కార్యాలయాల్లో పేరుకుపోతూనే ఉన్నాయి! కథానికలకు ఆ స్థాయిలో పాఠకాభిమానం, రచయితల ఆదరణ ఉందీ కాలంలో. ఒక్క రాశిలోనే కాకుండా వాశిలోనూ తెలుగు కథానిక ఎన్నోరకాలుగానో వన్నెచిన్నలు పోవడం  ఆనందించదగ్గ పరిణామమే!
రోజువారీ జీవితంలోని తొడతొక్కిళ్ళనుంచి తాత్కాలికంగానైనా ఉపశమనం కలిగించే వినోదప్రక్రియలు పుంఖానుపుంఖంగా పుట్టుకొస్తున్న ప్రస్తుత వ్యాపార వాతావరణంలోనూ కథానికకు అపూర్వ ఆదరణ లభిస్తుండడం ఆశ్చర్యం కలిగించే అంశమే! వాస్తవజీవితంలోని అనుభవాలను, అనుభూతులను విపులంగా విస్తారంగా చర్చించే వీలున్న 'నవల' ఓ వంక అంతే దూకుడుతో ముందుకుపోతున్నా.. ఉన్నంతలో సంక్షిప్తంగా సమగ్రతకు లోటు రాకుండా విషయ విశ్లేషణ చేసే 'కథానిక' వైపుకూ పాఠకుడు మొగ్గు చూపడానికి మరేమైనా ప్రత్యేక కారణాలున్నాయా?
కథానిక ప్రధానంగా ప్రజాసాహిత్యం. రచయుతదీ పాఠకుడిదీ ఒకే మేథోస్థాయి కావడం కథానికకు కలిసొచ్చే అంశం. కవిత్వంలోలాగా నియమ నిబంధనలేవీ  కథానిక నడకకు అడ్డం పడవు. చదివేకథ తనదో.. తన చుట్టూగల సమాజానిదో అనే భావం కథానిక కలిగించినంత బలంగా సాహిత్యంలోని మరే ఇతర ప్రక్రియా  కలిగించలేదు. ఎంత కల్పన అయినా కథ సామాజిక  సరిహద్దులు అతిక్రమించలేదు. సాగతీతలకు, ముక్కు చుట్టూ తిప్పి చూపించడాలకు, విశ్లేషణల మిషతో సుదీర్ఘచర్చలు సాగించడానికి   అవకాశం లేని స్థల, కాల పరిమితులు 'కథానిక'కు కలసివచ్చే బలమైన అంశాలు.
అశ్వహృదయం అవపోసన పట్టిన యోధుడికి పంచకళ్యాణి స్వారీ అంత  స్వారస్యంగా   ఉంటుంది మంచికథతో  ప్రయాణమంటే.
స్వల్పవ్యవధానంలోనే కల్పాంతజీవితాన్ని  ఆవిష్కరించే గొప్పశిల్పకథలకు మన తెలుగు గొడ్డుపోలేదు.  అందుబాటులో ఉన్న పరికరాలతోనే మనసులను అందలాల్లో ఊరేగించే అందమైన కథలకూ మనదగ్గర కరువు లేదు. కొండను అద్దంలో చూపించడమే కథానిక ఉత్కృష్ట లక్షణం  అనుకుంటే .. అ కళలో విశ్వస్థాయికి దీటుగా కలంనడిపిన తెలుగు కథకుల జాబితా అప్పటిలా  ఇప్పుడూ సశేషమే!
కథానికకు ఇంత ప్రత్యేకమైన స్థానం సాహిత్యంలో ఎందుకున్నట్లు? కుదింపు, మదింపు లక్షణాలవల్ల ఎన్నుకున్న అంశంమీదే ఏకాగ్రత నిలబడుతుంది. వేళకు ప్రయాణీకుణ్ణి రైలుకు అందించే జట్కాబండిగత్తర కథానికలోని ప్రతి అక్షరంలోనూ ప్రత్యక్షమవుతుంటుంది. వట్టి వేగమేకాదు.. ఒడుదుడుకులేవీ లేకుంటేనే ఆ  ప్రయాణం ప్రాణానికి సుఖం. గోలీ పేలీ పేలకముందే పరుగందుకునే పందెం ఆటగాడి చురుకుతనం కథానిక ప్రతి పదం పుణికిపుచ్చుకోవాలి. ఎత్తుగడ, నడక, ముగింపులో చదరంగంతో పోలిక కథానికది. ఆసాంతం చదివిన పాఠకుడి మానాసికప్రపంచం కొలతల్లో సగుణాత్మకమైన మార్పు సాధించగలిగినప్పుడే కథానికకు సార్థకత చేకూరినట్లు.   మంచికథానిక మెదడుకు కళ్ళు మొలిపించాలి. మనసుకు కన్నీళ్ళు తెప్పించాలి.  సాధారణ జంతుజాలంతోనే వింత వింత విన్యాసాలు చేయించే సర్కస్ ప్రదర్శనలాంటిది కథానిక రచన. మామూలు పదాలే విచిత్ర భావాలుగా  కూడబలుక్కుని పాఠకుడి మానసంమీద చేసే రసదాడి కథానిక.
ఎడ్గార్ ఎలెన్ పో దృష్టిలో కథంటే- స్వీయభావనలను పాఠకుడి మదిలో ముద్రించేందుకు రచయిత ఎన్నుకునే సహజసంఘటనల సంక్షిప్త కల్పిత సన్నివేశ మాలిక. ఫ్రెంచి కథారచయిత గైడీ మొపాసాకు కథంటే- నీరవ మానవ జీవన అగాథల్లోకి దూకి అక్కడ జరిగే యుద్ధాలను ఉత్కంఠభరితంగా చిత్రించడం. మొపాసా దృష్తిలో కథానిక అంటే సమాజమనే అంశంమీద రాసుకున్న షార్తుహ్యాండ్ నోట్సు. సత్యాన్ని సూటిగా చెప్పడం మించిన మంచికథావిధానం మరొకటి లేదంటాడు రష్యన్ రచయిత చెకోవ్. అనుభవానికి రాని సంఘటనలకు దూరం పాటించడం చెకోవ్ నిజాయితీకి నిదర్శనం.  ముగింపు, బిగింపులమీదకన్నా జీవితంలోని కొత్తకోణాలని అనూహ్యరీతిలో ఆవిష్కరించడంలోనే చెకోవ్ కి ఆసక్తి జాస్తి. 'అప్రస్తుతమైనది ఏదీ కథలో ప్రస్తావించరాదు' అనే  ప్రసిధ్ధ సూక్తి చెకోవ్ దే! సహజ సుందర సరళ ప్రాకృతిక వర్ణనలు కథానిక ‘కళ’నెలా పెంచుతాయో నిరూపించిన కథకుడు చెకోవ్. మొదలూ చివరా ముందే రాసి మధ్యభాగమంతా వంతెనలా నిర్మించడమే మంచికథ శిల్పరహస్యమని  చెకోవ్ భావిస్తాడు. మామూలు మనుషుల మామూలు జీవితాలనుంచి యధాతథంగా ఎత్తిరాసినట్లుండే సంఘటనలు సైతం చెకోవ్ మేధోకొలిమిలో పడి నిప్పులు విరజిమ్ముతుంటాయి. చెకోవ్ ఒక్కో కథానిక ఎంతమంది కొత్తరచయితలను సృష్టించిందో లెక్కతేల్చడం కష్టం. మొపాసా చెకోవ్ కిమ్ ఆదర్శం అంటారు.  
మొపాసా మరో అభిమాని సోమర్ సెట్ మామ్. అనుకోని సంఘటనలు అతని కథావస్తువులు. నాటకీయత పాలు జాస్తి. వినోదమే ప్రధాన ఎజెండా. ఒక్క తత్వానికే కట్టుబడని మనస్తత్వం. మానవనైజం చుట్టూతానే మామ్ కథలు ప్రదక్షిణం చేస్తుంటాయి. సంప్రదాయంమీద తిరుగుబాటంటే  మొపాసాకమహాఇష్టం. 'మనిషంటే మంచి చెడుగుల సమ్మిశ్రితం. సమస్యకు పరిష్కారం చూపించడం  రచయిత బాధ్యత కాదు. ఉపదేశాలు ప్రవక్తల పని. సాహిత్యేతర ప్రయోజనలకోసం రాయడమంటే రచనను దుర్వినియోగం చేయడమే!' ఇవీ స్థూలంగా కథానికమీద మామ్ అభిప్రాయాలు. మన బుచ్చిబాబు 'ఉత్తమ పురుష' కథావిధానంమీద మామ్ ప్రభావమే ఉందని  విమర్శకులు అభిప్రాయ పడుతుంటారు.
పడమటిదేశాల్లో కథానిక ప్రక్రియమీద అమోఘమైన ప్రయోగాలు జరిగాయి. జరుగుతున్నాయి. సన్నివేశ చమత్కారం ప్రధానంగా 'పో' కథలు రాస్తే.. హెన్రీ జేమ్స్, హాథరన్ ఆంతరంగిక జగత్తుమీద ధ్యాస ఎక్కువ పెట్టి కథలు రాశారు. దేశీయ వాతావరణంమీద దృష్టి చెదరకుండా బ్రెట్ హార్టే కథలు రాస్తే.. భాషలో బిగువు చూపిస్తూనే నిరలంకార శైలిలో మంచికథలు సృష్టించిన మహానుభావుడు క్రేన్.  ఓ. హెన్రీ కథలు కొసమెరుపుకి పెట్టింది పేరు.

దేశాలమధ్య సాంస్కృతిక హద్దులు చెదిరిపోయిన నేటి నేపథ్యంలో.. కళాకారులు విశ్వవ్యాప్తంగా పరస్పరం ప్రభావితమయే వేగమూ అమితంగా పెరుగుతున్నది. తెలుగు కథానికకూ ఈ సూత్రం మినహాయింపు కాదు. పాలగుమ్మి, చలం, విశ్వనాథ,  బుచ్చిబాబు, కొకు, రావిశాస్త్రి, మధురాంతకం, చాగంటి, కాళీపట్నంవంటి కథావశిష్టులు ఒక తరాన్ని ఊపేస్తే.. ఖదీర్ బాబు, పతంజలి,  వేంపల్లి, తుమ్మేటి, సలీం, పెద్దింటి అశోక్ కుమార్ వంటివారు ఇప్పటి తరాన్ని    మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు.
(ఏ తరంలోనైనా జాతిని ప్రభావితం చేసే సాహిత్యవేత్తల జాబితా సహజంగానే చాలా పెద్దదిగా ఉంటుంది. అందరి పేర్లు సోదహరణంగా ఉటంకించే  సమయం, సంధర్భం, స్థలం, కాలం, సావకాశం లేనికారణానే స్థాలీపులాక న్యాయంగా ఏ కొద్దిమందినో  స్మరించుకోవడం జరిగింది తప్ప.. మిగతా గొప్ప కథారచయితలను తక్కువచేసి చూపడంగా దయచేసి సహృదయ రచయితలు అపార్థం చేసుకోరాదని  మనవి)
కథలు ఎలా రాయాలి? అన్న విషయంలో  భిన్నాభిప్రాయాలెన్నైనా ఉండవచ్చుగానీ, 'ఎందుకు రాయాలీ?' అన్న విషయంలో మాత్రం ప్రజాపక్షం వహించే సాహిత్యవేత్తలందరిది ఒకే అభిప్రాయం.
చలం, కొడవటిగంటిలకు వాస్తవికతే కథకు ప్రధానం. గ్రీకుల కళాదృష్టికి దగ్గరి అభిప్రాయం ఇది. భారతీయుల కళాదృష్టికి కాస్తంత విభిన్నమైనది ఈ ధోరణి. అగోచరాన్ని ఆవిష్కరించడమే నిజమైన కళాప్రయోజనంగా భావించడం భారతీయుల కళాతత్వం. భూసారాన్ని గ్రహించి భూమినే అంటిపెట్టుకుని ఉన్నా చిటారుకొమ్మను చేరి పరిసరాలను పరిమళభరితం చేస్తేనే కదా  ఏ కుసుమాలకైనా బతుకు సార్థకం! కళకూడా కసుమ సమానమే మరి  భారతీయులకు భావనలో!
వినోదమే ప్రధానమనుకునే కథలు ఆట్టేకాలం నిలబడడం కష్టమే! రసానందానికి సంస్కారమూ జతకూడినప్పుడే 'కథ' కాలానికి ఎదురొడ్డి నిలబడగలిగేది. తొలినుంచీ తూర్పు వివిధ సంస్కృతులకు సంగమస్థానంగా వెలుగొందుతూ వస్తున్నది.  పాశ్చాత్యులకు లేని సమన్వయ దృష్టి అందుకే  ప్రాచ్యసాహిత్యానికి  అవసరమయింది. భారతీయసాహిత్యం ప్రారంభంనుంచి వైవిధ్యానికి ప్రతిబింబప్రాయంగానే ప్రకాసిస్తూ వస్తున్నది.  తెలుగు సాహిత్యంలో కథానిక హాలుని కాలంనుంచి  ఈ బహుముఖత్వాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నది.
మంచికి, అందానికీ మధ్య విరోదమేమీ లేదు కదా! తుక్కును బంగారంగా మార్చే విద్య వాస్తవికంగా ఉందో లేదో గానీ.. సాహిత్యప్రపంచానికి సంబంధించినంత వరకు ఆ రసవిద్య కచ్చితంగా ఉంది. కథలకు ఉండవలసిన ప్రధాన లక్షణం ఈ రసవిద్యలో నైపుణ్యం ప్రదర్శించడమే!

రసానందమా? సమాజ శ్రేయస్సా? కథకుండవలసిన అంతిమ లక్ష్యం ఏది? అన్న వాదనే సహేతుకమైనది కాదు. కథానిక (ఆ మాటకొస్తే ఏ ఇతర సాహిత్య ప్రక్రియ అయినా సరే) నాలుగురాస్తాల కూడలి మధ్యలో నిలబడిన 'సైన్ బోర్డు' లాంటిది. ఫలకంమీది అక్షరాలు కొట్టొచ్చినట్లు ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటేనే బాటసారులను దృష్టిని ఆకట్టుకునేది. ఫలకం ప్రయోజనం సిద్దించేది. ఫలకం అందంగా ఉందికదా అని.. పెకిలించుకొని తెచ్చి ఇంటిపెరట్లో నాటుకుంటానంటే?!
రసానందానికి సామాజిక హితానికి మధ్య వేసిన అందమైన బంధమే కథానిక( ఆ మాటకొస్తే  మరే ఇతర సాహిత్య రూపమయినా). సానలు తీరిన వజ్రం ఒక్కో కోణంనుంచి ఒక్కో రంగును వెదజల్లినట్లు చిత్రిక పట్టిన కథ ఒక్కో చదువరికి ఒక్కో విధమైన అనుభవాన్ని అందిస్తుంది.
ఏతావాతా తేలేదేమంటే.. తాత్విక దర్శనం, నైతికావేశం, సొందర్యదృష్టినుంచి మళ్ళకుండా, దైనందిక జీవితమో, పరిసరాల పరిశీలనమో, ఔన్నత్యంకోసం చేసే పోరాటమో.. ప్రత్యక్ష, పరోక్ష అనుభవాలనుంచి  నిజాయితీగా గ్రహించిన కథావస్తువును.. సంక్షిప్తీకరించో, యధాతధంగాకానీ, చిలవలు పలవులుగా పెంచో.. సరళంగా, సరసంగా, సహజంగా, సుందరంగా.. సమగ్రతకు లోటు లేకుండా.. సూటిగా, తేటగా, చమత్కారంగా ఎత్తుగడ, మధ్యనడక, ముగింపులు చెడకుండా ఎక్కడా ఉత్కంఠ సడలకుండా పాఠకులచేత చదివించి.. చివరికి కలకాలం నిలిచే రసానందం అందించగలిగితే.. అదే ఉత్తమ కథానిక!
-కర్లపాలెం హనుమంతరావు






డిపాజిట్- క్రైం కథల పొటీలో సాధారణ ప్రచురణ

ఒంటిగంట కావస్తోంది. సోమవారాల్లో సాధారణంగా బ్యాంకుల్లో రద్దీగా ఉంటుంది. పేరుకి కో-ఆపరేటివ్ బ్యాంకే అయినా మంచి బిజినెస్ సెంటర్లో ఉండటం వల్ల దానికీ కష్టమర్సు తాకిడీ ఎక్కువగానే ఉంది.
లంచ్ బ్రేకుకి ఇంకో గంట టైముందనగా అయ్యర్ మెల్లగా మేనేజరు ఛాంబర్లోకి వచ్చి కూర్చున్నాడు. బ్రీఫ్ కేసులోనుంచి ఒక డిపాజిట్ బాండు బైటికి తీసి మేనేజరుగారి ముందుంచి అన్నాడు 'సార్! ఈ బాండివాళ మెచూరవుతుంది. కాస్త తొందరగా ఇప్పించరా! రెండుగంటల బండికి చెన్నై చేరాలి. ఇవాళ ఈవెనింగు నా భార్యకి ఆపరేషన్. మనీ అర్జంట్ ప్లీజ్'
మేనేజరుగారు ఆ బాండు అందుకొని చూసి' మీరేనా అయ్యర్?' అని అడిగారు.
'అవును సార్!' అంటూ ఐడి తీసి చూపించాడు అయ్యర్.
బాండు వెనక డిశ్చార్చ్ సంతకం తీసుకొని కంప్యూటర్ మీద వెరిఫై చేసుకొని సంతృప్తి చెందిన తరువాత 'ఓకె! ఒక్క హాఫెనవర్ వెయిట్ చేయండి!క్యాషియర్ లంచికి వెళ్ళినట్లున్నాడు. రాగానే ఎరేంజ్ చేస్తాను' అంటూ బాండుతో సహా హాలులోకి వెళ్ళిపోయాడు.
అద్దాలలోనుంచి ఆయన ఎవరో ఆఫీసరుతో ఐడి చూపించి మాట్లాడుతూండటం.. ఆ ఆఫీసరు మధ్య మధ్యలో తలతిప్పు ఇటు చూస్తూ ఉండటం కనిపిస్తూనే ఉంది.
మెనేజరుగారు ఎటో వెళ్ళిపోయాడు.. బహుశా లంచికేమో! ఇంకో ముప్పావుగంటకు అటెండరు వచ్చి ' సార్! క్యాష్ రడీగా ఉంద్సి. అటొచ్చి తీసుకోండి!' అన్నాడు.
అయ్యర్ బ్రీఫ్ కేసుతోసహా వెళ్ళి క్యాష్ కౌంటరుముందు నిలబడ్డాడు. లంచ్ అవర్ జస్ట్ అప్పుడే అయిపోవడంవల్లనేమో హాల్లోనూ బైటా జనమాట్టేలేరు.
ముందే అరేంజి చేసినట్లున్నాడు.. వందనోట్లు రెండు బండిల్సు, చిల్లర పన్నెండువేలు కౌంటరుమీద పరచి చూపించాడు క్యాషియర్. 'సారీ సర్! మండేగదా! హెవీ పేమెంట్స్ వచ్చాయి. పెద్ద డినామినేషన్ అరేంజి చెయ్యలేకపోయాను' అని నొచ్చుకొన్నాడు కూడా.
బండిల్ అంటే పది ప్యాకెట్ల కట్ట. మొత్తం ఇరవై ప్యాకెట్లు. పదులు పది ప్యాకెట్లమీద రెండూ! 'చిన్న సూటుకేసులో సర్దుకోవడం కుదరక సతమతమవుతున్న అయ్యర్ని చూసి  అన్నాడు అప్పుడే వచ్చిన మేనేజరు 'బాలప్పా! ఊరికే అలా చూస్తూ కూర్చోకపోతే మనదగ్గరేమన్నా మంచి సంచి ఉంటే చూసి ఇవ్వరాదా!'
బాలప్ప లోపలికి పోయి  బాక్సొకటి కాస్త పెద్దదిగ ఉన్నది తెచ్చి డబ్బు అందులో సర్దుతుంటే అయ్యరు మేనేజరుగారికి  'థేంక్స్' చెప్పాడు.
'ఇట్సాల్ రైట్! ఇందులో నేను చేసింది మాత్రం ఏముందండీ! ఎవరి మనీ వారికి సేఫుగా అందేట్లు చూడ్డమేగా యాజే మేనేజరు.. నా ప్రైమరీ డ్యూటీ!ఆల్రెడీ టూవో క్లాకయింది. ఈ టైములో ఆటోలు దొరకడంకూడా కష్టమేనే! బాలప్పా! బైట మన రెడ్డిఆటో స్టాండులో ఉందేమో చూడు! సార్ ని స్టేషనులో దిగబెట్టి రమ్మను' అంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు మేనేజరుగారు.
అయ్యర్ బైటికి వచ్చాడు, బాలప్ప అప్పటికే చెప్పి పెట్టినట్లున్నాడు .. అతను చూపించిన ఆటోలోకి ఎక్కి కూర్చున్నాడు. బాలప్ప అందించిన బ్యాగు అందుకోవడమే ఆలస్యం.. ఆటో బాణంలా ముందుకు దూసుకుపోయింది.
ఆటో వేగంకన్నా ఎక్కువ వేగంగా అయ్యరు గుండెలు కొట్టుకొంటున్నాయి 'ఒకటా! రెండా! రెండు లక్షల చిల్లర! ఇంత ఈజీగా పనయిపోతుందనుకోలేదు. ఒక్కోసారంతే! ఇట్టే అయిపోతాయనుకొన్న పనులు ఏళ్లూ పూళ్ళూ గడిచిపోతున్నా ఒహ పట్టాన తెగవు. అసలు తెమలనే తెమలనుకొనేవి.. ఎవరో తరుముతున్నట్లు.. ఇదిగో.. ఇలా.. చక చకా జరిగిపోతుంటాయి! లేచిన వేళా విశేషం! ఎన్నేళ్ళు కష్టబడితే ఇంత డబ్బొచ్చి వళ్లోపడుతుంది!' వళ్లోని డబ్బుసంచీని మరింత ఆబగా దగ్గరికి తీసుకొన్నాడు అయ్యరు.
అప్పుడు చూసాడు బ్యాగుమీది ఆ ఆమ్మాయి బొమ్మను. ఎక్కడో చూసినట్లుంది ఆ  పాప ఫొటో!
'ఆఁ! గుర్తొచ్చింది. గోవిందరెడ్డి కూతురు ఫొటో కదూ అది! రెడ్డికి ఆ పాపంటే ప్రాణం. లాఢికొచ్చినప్పుడు చాలా అల్లరి చేస్తుండేది. లాడ్జికికూడా కూతురుపేరే పెట్టుకొన్నాదు రెడ్డి. 'మంగతాయారు లాడ్జి'.అలివేలు మంగ అనుకొంటా ఆ పాప పేరు!తను ఈ బ్యాగులోనే తను అప్పుడు.. లాడ్జి డబ్బులు బ్యాంకుకి తెచ్చి డిపాజిట్ చేసింది. అప్పటి బ్యాగింకా బ్యాంకులోనే భద్రంగా ఉందా! నిజానికి ఈ సొమ్ము న్యాయంగా దక్కాల్సింది సాంబశివుడికి. చచ్చి ఏ లోకాన ఉన్నాడో.. పుణ్యాత్ముడు!'
అయ్యరు ఆలోచనలు ఒక్కసారి పదేళ్ళు వెనక్కి వెళ్ళాయి.
మంగతాయారు లాడ్జిలోఆ రోజు రాత్రి అట్టహాసంగా దిగిన చెన్నయ్ చేట్టియార్ తెల్లారేసరికల్లా బెడ్ మీద శవంగా మారిపోయాడు. తెల్లావారు ఝామున బెడ్-కాఫీ ఇవ్వడానికని వెళ్ళిన తనే అందరికన్నా ముందా విషయం కనిపెట్టింది. క్యాష్ కౌంటర్లో పడి నిద్రపోతున్న సాంబశివుడిని లేపి తీసుకువచ్చి చూపించిందీ తనే! తరువాత పోలీసులు రావడం.. సాంబశివుడిని గుచ్చి గుచ్చి ప్రశ్నించడం.. తను అక్కడక్కడే తచ్చర్లాడుతూ అంతా గమనిస్తూనే ఉన్నాడు. అంత గందరగోళంలో కూడా సాంబశివుడు తనపేరు బైటపెట్టలేదు! ఎందుకో ఆ మధ్యాహ్నం పూట తెలిసింది.
లంచ్ సప్లైకని వెళ్ళిన తనను బాత్రూంలోకి ఈడ్చుకెళ్ళి ఈ బ్యాగే చేతిలో పెట్టి చెప్పాడు 'ఇందులో యాభైవేలున్నాయ్! ఇప్పుడే పోయి పండ్లబజారులో ఉన్న కో=ఆపరేటివ్ బ్యాంకులో డిపాజిట్ చెయ్యి.. నీ పేరున! ఈ హడావుడంతా తగ్గిన తరువాత నిదానంగా ఆలోచిద్దాం ఏం చెయ్యాలో!'
ఆ సాయంత్రమే గోవిందురెడ్డిని పోలీసులు పట్టుకుపోయారు. సాంబశివుడు గాయబ్! భయమేసి తనూ చెన్నయ్ పారిపోయాడు.
కేసునుంచి బైటపడటానికి రెడ్డి చాలా కష్టపడ్డాడని విన్నాడు తను. ఏడేళ్ల కిందట సాంబశివుడూ ఏదో రోగమొచ్చి పోవడంతో ఈ డిపాజిట్ విషయం అతగాడితోనే సమాధి అయిపోయింది.
మధ్యలో రెండు మూడుసార్లు వచ్చినా బాండును గడువుకన్నా ముందే సొమ్ముచేసుకొనేందుకు ధైర్యం చాలలేదు.
ఇవాళా బ్యాంకులో ఉన్నంతసేపూ ప్రాణాలు పింజం పింజం అంటూనే ఉన్నాయి. ఆ ఏడుకొండలవాడి దయవల్ల ఏ ఇబ్బందీ లేకుండానే పెద్దమొత్తం చేతికొచ్చింది. ఈ చిల్లర పన్నెండు వేలూ ముందు తిరుపతి వెళ్ళి హుండీలో వేస్తేగానీ మనశ్శాంతి లేదు.
ఆటో ఠకాల్మని ఆగిపోయింది. డైవర్ సెల్లో మాట్లాడ్డానికి అపినట్లున్నాడు.
మళ్లా స్టార్ట్ చేయబోతే ఒక పట్టాన స్టార్టు కాలేదు.
డ్రైవర్ బండిని ఓ వారకు లాక్కెళ్ళి ఆపి 'ఆయిల్ అయిపోయినట్లుంది. ఇక్కడే పెట్రోలు బంక్.. చిటికెలో వచ్చేస్తాను సార్!' అంటూ ఓ బాటిల్ పట్టుకొని మాయమైపోయాడు.
తిరిగి వస్తూ ఓ పోలీసాయన్ని వెంటబెట్టుకొని వచ్చాడు! ఆ కానిస్టేబుల్ కూడా ఎక్కంగానే బండి స్టార్టయిపోయింది ఏ ఆయిల్ పోయకుండానే! ఆటో రైలుస్టేషనుముందుగాక పోలీసుస్టేషనుముందు ఆగడంతో సీను అర్థమైపోయింది అయ్యరుకు. పారిపోవడానిక్కూడా లేదు. క్యాషుబ్యాగే కాదు.. చెయ్యికూడా కానిస్టేబుల్ అధీనంలో ఉందిప్పుడు. మారుమాట్లాడకుండా కానిస్టేబులుతోపాటు పోలీసుస్టేషనులోకొచ్చాడు అయ్యరు. బ్యాంకు మేనేజరుగారూ అక్కడే ఉన్నారు!
'నిన్నెందుకు అరెస్టు చేసామో తెలుసా? పదేళ్ళ కిందట మంగతాయారు లాడ్జిలో చెన్నై చెట్టియారుకి కాఫీలో విషం కలిపి చంపినందుకు!' అన్నాడు సి.ఐ తాపీగా.
'నో! అబద్ధం!' పెద్దగా అరిచాడు అయ్యరు.
తననింకా బ్యాంకులో దొంగతనంగా డబ్బు దాచినందుకు అరెస్టు చేసారు అనుకొంటున్నాడు ఇంతదాకా!
'మర్డరు కేసా?! యావజ్జీవమో.. ఉరిశిక్షో!' పెళ్లాంబిడ్డలు గుర్తుకొచ్చారు .'చెట్టియార్ చావుకీ నాకూ ఏ సంబంధమూ లేదు సార్!' బావురుమన్నాడు అయ్యరు.
'ఏ సంబంధమూ లేకపోతే ఎందుకలా పారిపోయావ్ బే!' అని ఠప్పుమని దవడమీద లాగి కొట్టాడు సి.ఐ. 'ఇంత డబ్బు నీకెక్కడిదిరా? ఏం పాడుపని చేస్తే ఇంతొచ్చింది? దీనికోసమే నువ్వు చెట్టియారును చంపావని పోయేముందు సాంబశివుడు వాజ్ఞ్మూలం  ఇచ్చాడురా పుండాకోర్!'
ఠపాఠపా పడుతున్న లాఠీ దెబ్బలకు అయ్యరుకళ్ళు బైర్లు కమ్మాయి. పోలీసు దెబ్బలెలా ఉంటాయో మొదటిసారి తెలిసొచ్చింది అయ్యరుకి. 'అట్లా ఎందుకన్నాడో నాకు తెలియదు సార్! సత్య ప్రమాణకంగా చెబుతున్నా!  చెట్టియారు చావుకి, నాకూ ఎట్లాంటి లింకూ లేదు సామీ! నా బిడ్డాలమీద ఒట్టేసి చెప్పమన్నా చెబుతా! కావాలంటే ఈ డబ్బంతా మీరే తీసేసుకోండి! ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలేయండి!'
' అట్లా అని రాసిస్తావు బే!' ఆనడిగాడు సి. ఐ సీరియస్ గా!
తలూపాడు అయ్యరు.
ఐదునిమిషాల్లో బ్యాంకుమేనేజరు తయారుచేసిన స్టేటుమెంటుమీద కళ్ళుమూసుకొని సంతకం పెట్టేశాడు అయ్యరు.
అయ్యరును బైటికి తీసుకుని వచ్చి ఆటోలో కుదేసిపోయాడు కానిస్టేబుల్.
దారిలో అన్నాడు ఆటో డ్రైవర్ 'అయ్యరంకుల్! నన్ను గుర్తు పట్టారా? నేను.. సాంబశివుడి కొడుకు.. శ్రీనివాసుని. గోవిందరెడ్డి కూతురు మంగతాయారుతో ఆడుకోవడానికి లాడ్జికొస్తుండేవాణ్ణి. మాఅయ్యా, నువ్వూ చేసిన పాడుపని నాకు తెలుసు. అయ్యే చెప్పాడు పోయ్ ముందు. మీరిద్దరూ చేసిన పనికి గోవిందురెడ్డి జైలుపాలయ్యాడు. కేసునుంచీ బైటపడటానికి బోలెడంత డబ్బు ఖర్చు చేసాడు. పరువుపోయిన అవమానంతో ఎక్కువ కాలం బతకలా!' అంటూ ఓ పాతకాలం ఇంటిముందు ఆటో ఆపాడు. 'రెడ్డికూతురు మంగతాయారు ఇప్పుడుంటున్నది ఈ అనాథ శరణాలయంలోనే! దానికి పోయిన తండ్రిని ఎలాగూ తిరిగి ఇప్పించలేం. పోగొట్టుకొన్న సొమ్ములోనైనా ఏదో కొంతమొత్తం తిరిగిప్పిచ్చాలని నేనే ఈ పథకం పన్నింది. ఈ డబ్బుతో  ఏదన్నా మంచికాలేజీలో చేరి చదువుకుంటే దాని బతుకు ఓ గాడిన పడుతుందని నా ఆశ. ఇవాళ ఈ డిపాజిట్ మెచూరవుతుందని తెలుసు.
బ్యాంకుసారు.. సి.ఐ.సారు కో-ఆపరేషన్ ఇవ్వబట్టి ఇప్పుడీ ఆపరేషన్ సక్సెసయింది. దిగంకుల్! నీ చేత్తోనే మన తాయారుకి ఆ డబ్బిచ్చేస్తే బాగుంటుది' అంటూ సి.ఐ సారిచ్చిన బ్యాంకు క్యాష్ బాక్సుతో ఆటో దిగాడు శ్రీనివాస్.
-కర్లపాలెం హనుమంతరావు
( చిత్ర- సకుటుంబసచిత్ర  మాసపత్రిక- నిర్వహించిన క్రైం కథల పోటీలో సాధారణ ప్రచురణకి అంగీకరించి జూన్, 2011 సంచికలో ప్రచురించినది)





Friday, August 21, 2015

ప్రజాప్రతినిధులు- జీతభత్యాలు- ఓ సరదా గల్పిక

'ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మనది. నూటపాతిక కోట్ల మంది జనాభాకి ముష్టి ఏడొందల తొంభై మూడుమంది మాత్రమేనా ప్రజాప్రతినిథులు! స్థాయిలో మాకన్నా ఎంతో దిగువనున్న వాళ్లకేమో   లక్షల్లో జీతాలా! మాకు మాత్రం  భిక్షాపాత్రలో ముష్టి వేసినట్లు   తొంభైవేలా?! ప్రొటోకాలు పరువైనా  నిలబడాలా వద్దా?   లెక్కకైనా వేతనంలో కనీసం  ఒక్కరూపాయైనా  ఎక్కువ మాకు  దక్కాలి గదా! ఎవరు బాబూ నువ్వు? ఎందుకా పడీ పడీ నవ్వు?'
'నీ అంతరాత్మనులే మహానుభావా! గుర్తుపట్టలా? ఎన్నికల సంఘంవాళ్లకి నువు సమర్పించిన తప్పుడు వివరాల ప్రకారం చూసుకొన్నా నీ ఇప్పటీ ఓ గంట ఆదాయం.. తెల్లకార్డువాడి ఏడాది సంపాదనకన్నా ఎన్నోరెట్లు ఎక్కువగదా! ఉచిత బంగళా.. ఫ్రీ ఫోన్ కాల్సు.. సకుటుంబ సపరివారంగా చక్కర్లు కొటేందుకు దేశీయంగా ఉచిత  ప్రయాణ సౌకర్యాలు.. ఖర్చుచేసినా చెయ్యకున్నా పెట్రోలు, గ్యాసులమీద భారీ రాయితీలు, నియోజక వర్గాల్లో తిరిగినా తిరగకున్నా సాదర ఖర్చులకింద వేలాది రూపాయలు.. నొక్కుతున్నావుకదా! ఇంకా ఈ వేతనాలు చాలడంలేదన్న సన్నాయి నొక్కులేమిటంట? నవ్వు రాదా మహాశయా! నీ విమానాలు, ఏసీ రైళ్ళ ప్రయాణాలు వగైరాలన్నింటికీ అయ్యే ఖర్చు బొక్కసానికి ఏటా డెబ్బైనాలుగు లక్షల పైచిలుకు బొక్కపెదుతోందని లెక్కలు  చెబుతున్నాయిగదా! అయినా నువ్విప్పుడు మళ్ళీ క్యాంటీను భోజనం ఖరీదుగా ఉందని యాగీకి దిగుతున్నావ్! ఇంకా ఏవేవో సౌకర్యాలు సమకూరడంలేదని  సణుగుతున్నావ్! ఈ కరవు, ఆర్థికమాంద్యం గడ్డురోజుల్లోకూడా నీకు జీతమెందుకు పెంచాలో ఒక్క సజావుకారణం ఉంటే  సెలవివ్వు.. నవ్వడం మానేస్తా!'
'ఒక్కటి కాదు. ఓ కోటి చెబుతాను.. ఒక్కోటీ ఓపిగ్గా వినాలేగాని! ఈ వృత్తిలోకి రాకముందు నేనెంత గడించేవాణ్ణో నీకూ తెలుసు. మామూళ్ళు, సెటిల్మెంటులు, రింగుల్లాంటివి ఇప్పుడు బాహాటంగా చెయ్యడానికి ఎలా వీలుంటుంది చెప్పు! పనోళ్ళకి సిమెంటు ఫ్యాక్టరీలున్నా పట్టించుకోరుగాని.. మేం ఇసుక తక్కెళ్ళ జోలికెళ్ళినా గగ్గోలు పెడతారు దిక్కుమాలిన జనం.. విడ్డూరంగా! అందుకే ప్రభుత్వ వైద్యులకు మల్లే మాకూ 'నాన్ ప్రాక్టీసింగు అలవెన్సు'ఇవ్వాలంటున్నాం! తప్పా?
'హా.. హా.. హా'
ఆ నవ్వే వద్దు! మంగళరిగి చేంతాడంతందని  మా ఆదాయప్పట్టికను తప్పుపడుతున్నావ్ గానీ.. హనుమంతుడి తోకమాదిరి సాగే మా ఖర్చుల చిట్టా మాత్రం  నీకు పట్టదు! సర్కారువాళ్ళిచ్చే ముష్టి ముగ్గురు సెక్యూరిటీ
మాకేమూలకు! కాలు బైటపెడినప్పుడల్లా ఎంత హంగూ.. ఆర్భాటం ప్రదర్శించాలీ! పెట్రోలు, డీజెలు రేట్లు ఎట్లా పెట్రేగిపోతున్నాయో.. అంతరాత్మగాడివి నీకే తెలుస్తుంది! మా  ప్రైవేటు ఆర్మీకేమన్నా తలా ఓ రెడ్ ఫెరారీ డిమాండు చేస్తున్నామా? బుల్లెటు ప్రూఫ్ కార్లు, బుల్లెట్లు, బాంబులకయ్యే ఖర్చు ఎంతని సొంతంగా పెట్టుకోగలం.. కరువుకాలంలో!  అన్నీ బైటకు చెప్పుకొనే ఖర్చులుకూడా కావాయ! ఎన్నికల్లో ఎన్నెన్నిరకాల వత్తిళ్ళొస్తాయో నీకూ తెలుసని నాకు తెలుసు.'
'నిజమే! ఇదివరకు మాదిరి ఏదన్నా సర్కారు భూముల్లో జెండాలు పాతుకొందామనుకొన్నా.. పాపం.. వాటికీ ఉల్లిగడ్డలకుమల్లే కరువొచ్చి పడిందాయ! దేవుడి సొమ్మూ దేవుడికే అంతుచిక్కకుండా అంతర్దానమవుతుందాయ!  ఇంక మీకు మాత్రం మిగులుతున్నదేముందిలే తమ్ముడూ బూడిద మినహా!'
'వెటకారమా! ప్రభుత్వాలన్నా స్థిరంగా ఉండుంటే మాకిన్ని పాట్లుండేవా చెప్పన్నా!  ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడే భూసేకరణ సవరణో.. చటుక్కున చట్టమై కూర్చుందనుకో.. ఇహ మా పని చుట్టలు పీల్చుకుంటూ రచ్చబండమీద చతికలబడ్డమేగా! కాల్ సెంటరు పనోళ్లకన్నా మెలుకువగా  కళ్లలో వత్తులేసుకొని కూర్చోకపోతే మా పని 'శ్రీమద్రమారమణ గోవిందో హారి' ఐపోదా! కొన్ని నష్టాలకు సరిపడా పరిహారంగానైనా మాకు జీతభత్యాల్లో సర్దుబాటు చేయమనడం అన్యాయవా! లాభదాయక పదవుల్లో ఉండరాదని మాకు మాత్రమే ఓ  గుదిబండ మెడలో వేలాడుతుంటుందని తెలుసుగా! ఆ వారా నష్టపరిహారం లెక్క  చూసుకున్నా ఇప్పుడు మేమడిగే పదిలక్షలకు ఐదురెట్లు ఎక్కువ ఇచ్చినాఅ తక్కువే!  ప్రజాప్రతినిధులన్న కక్ష మానేసి పక్షపాతం లేకుండా ఆలోచించమని మనవి చేసుకొంటున్నాం! అదీ  నీకు మహా ఎగతాళి ఐపోయింది!'
'సారీ తమ్ముడూ! నువ్వింత వివరంగా విడమరిచి చెప్పినప్పుడైనా   నా మైండ్ సెట్ మారకపోతే  తప్పే!ఒప్పుకుంటున్నా!  న్యాయంగా ఆలోచిస్తే నెలకు పాతిక లక్షలు జీతంగా ఇచ్చినా మీ నష్టానికి సరిపడ్డ పరిహారం కాదనే అనిపిస్తున్నదిప్పుడు!'
' థేంక్స్ అంతరాత్మా!'
'కానైతే నాదో చిన్న సలహా కూడా ఉందిమిత్రమా! పనికి తగ్గ జీతభత్యాలుండాలని కోరుకోవడంలో తప్పు లేదు. అరవై ఏళ్లకిందట ఏటా అరవై బిల్లులు పాసు చేసేవాళ్ళు మీ ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ప్రశాంతంగా కూర్చుని. ఇప్పుడో? పాతిక పాసు అవడానికే ఆపసోపాలు పడుతున్నారు! చాలా బిల్లులు చర్చలకు నోచుకోకుండానే చట్టాలు ఐపోతున్నాయిప్పుడు ఇహ చట్టసభల్లో తమరి హాజరు చిన్నబళ్లో పంతుళ్ల హాజరీకన్నా అన్యాయంగా ఉంది హుజూర్!'
'ఐతే ఏమంటావ్?!'
'అకౌంటబిలిటీనిబట్టి అకౌంటింగు ఉండాలంటాను'
'మరి..'
'గంటకు ఇంతని హాజరుభత్యం నిర్ణయించాలి. హాజరుపట్టీ ప్రకారమే జీతాల చెల్లింపులుండాలి. వాకౌట్ చేసిన రోజున జీతం మొత్తం కట్! సభాపతి అనుమతి లేకుండా మాట్లాడే ప్రతి పదానికి ఇంతని కత్తిరించడం తప్పనిసరి చేయాలి. మార్షల్సు బలవంతంగా బైటికి మోసుకుపోయిన సందర్భంలో బరువుకి ఇంతని అపరాధరుసుం అదనంగా మీ జీతాలనుంచే వసూలు చేయాలి. ఫలహార శాలల్లో ఇచ్చే రాయితీలను రూపాయి పైసల్లోకి మార్చి మీ జీతాలనుంచే  తిరిగి రాబట్టాలి. రాజకీయాల్లోకి రాకముందు.. వచ్చిన తరువాత.. కనిపించే ఆదాయాల్లోని  తేడానుబట్టి  ఇంత శాతమని శిస్తుగా వసూలు చేసి ఏ ప్రధాని సంక్షెమ నిధికో జమచేసేందుకు 'సై' అంటే నెలకు పదిలక్షలేం ఖర్మ.. పాతికలక్షలమీదొక్క రూపాయి ఎక్కువిచ్చినా అధర్మం అనిపించదు'
'ఖర్మ! ఆ లెక్కన మాకిక నికరంగా మిగిలేదేముంటుంది అంతరాత్మా.. ఆ ఒక్క రూపాయి తప్ప!'
-కర్లపాలెం హనుమంతరావు
***
(ఈనాడు సంపాదకపుటలో 'శ్రమకు తగని ఫలం' పేరుతో ప్రచురితం)



'


(

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...